Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గ్రీసుదేశము (చరిత్రము)

వికీసోర్స్ నుండి

గ్రీసుదేశము (చరిత్రము) :

ప్రాచీనయుగ చరిత్ర : గ్రీసు చరిత్ర నవశిలాయుగమున (క్రీ. పూ. 4000) ప్రారంభమగుచున్నది. ఈ కాలమునాటి నాగరికత 'మైసీన్ ' నాగరికత యని పేరుగాంచినది. దీని

నిర్మాతలు మధ్యధరాజాతులవారు. క్రీ. పూ. 2000-1500 సంవత్సరముల నడుమ ఆర్యజాతులవారు గ్రీసు దేశములోనికి దండెత్తి వచ్చిరి. వీరు 'మైసీను' నగరములను నిర్మూలించి గ్రీసుదేశము నాక్రమించిరి. వీరు ఏథెన్సు, థెన్సరీ, కోరింత్, తెబెస్, బ్యూషియా, స్పార్టా రాజ్యములను ఏర్పాటు కావించిరి. ఈ నూతన జాతివారి నాగరికతకు 'హెల్లెన్' నాగరికత అనికూడ పేరు కలిగినది. అనతికాలములో ఈ గ్రీకులు ఏజియన్ దీవులు, ఆసియా మైనరు, దక్షిణ ఇటలీ, మార్సెయిల్సు (ఫ్రాన్సు) ప్రాంతము, సై ప్రెస్, క్రీటు, ఉత్తరాఫ్రికా అను తావులలో వలస రాజ్యములను ఏర్పాటు కావించుకొనిరి. ఇయోనియను గ్రీకులు (యవనులు) ఆసియా మైనరులో నున్న ఫ్రిజియనుల 'ట్రాయ్' అను నగరమును నిర్మూలించిరి. ఈ 'ట్రాయ్' యుద్ధమును వర్ణించుచు 'హోమరు' అను కవి 'ఇలియడ్' అను మహాకావ్యమును రచించెను.

పౌరరాజ్యములు, రాజకీయములు : భౌతికమగు ఆటంకముల వలనను, సంప్రదాయసిద్ధమగు స్వాతంత్ర్యాభిలాష వలనను, గ్రీసుదేశ మందలి తెగలవారు సమైక్యమై పెద్ద రాజ్యములను నెలకొల్పజాలరైరి. అచ్చట పౌరరాజ్యములును, పౌరరాజ్య కూటములును మాత్రము ఏర్పడెను. ఈ పౌరరాజ్యములలో ప్రభుత్వ నిర్వహణ విధానము మార్పుచెందుచు వచ్చెను. మొట్టమొదట ఈ రాజ్యములలో రాజులు పరిపాలన కావించిరి. రాజునకు సలహా నిచ్చుట కొక సమితి (Council) యు, పౌరు లందరితో కూడిన ఒక మహాసభ (Assembly) యు ఈ రాజ్యములలో నుండెడివి. బానిసలకు, స్త్రీలకు, విదేశీయులకు, పౌరజీవితములో ప్రవేశము లేకుండెను. న్యాయవిచారణకొరకై న్యాయాధిపతుల ప్రత్యేక సమితికూడ ఇచ్చట నెలకొని యుండెను. కాలక్రమమున గ్రీసుదేశమున పరిశ్రమలును, వర్తకమును వృద్ధినొందెను. పౌరు లనేకులు చాల ధనమును గడించిరి. ధనికవర్గమువారు సామాన్య పౌరుల రాజకీయాధికారములను తుదముట్టించి ధనిక స్వామ్యము (Aristocracy) ను స్థాపించిరి. ధనిక స్వామ్య ప్రభుత్వము సాగినప్పుడు సామాన్యప్రజలు పెక్కు బాధలకు లోనైరి. కావున ప్రజాపక్షమునకు చెందిన కొందరు నాయకులు ధనికస్వామ్యమును కూలద్రోసి నిరంకుశ ప్రభుత్వములను నెలకొల్పిరి. ఈ నిరంకుశ పరిపాలకులు ప్రజానురాగమును చూరగొనినవారు. ఇట్టి నిరంకుశ పాలకులలో ఏథెన్సు నగరమున పరిపాలన కావించిన డ్రేకన్ (క్రీ. పూ. 624) అనునాతడు చాల ప్రసిద్ధుడు. ఈతడు పరిపాలనా సౌకర్యముకొరకై పెక్కు శాసనములను కావించెను. అవి చాల కఠినమగు శాసనములు. ఏథెన్సు పట్టణమున అధికారము వహించిన నిరంకుశ పాలకులలో సోలన్ (క్రీ. పూ. 594) అను మహనీయుడు కూడ స్మరింపదగినవాడు. ఇతడు భూమితనఖాలను రద్దుచేసి, భూస్వాములకు ఉండదగిన గరిష్ఠ భూపరిమితిని నిర్ణయించెను. పాటకజనులకు మహాసభలో వోటుహక్కు నిచ్చెను. దారిద్ర్యముచే బానిసలైన ప్రజలకు విముక్తి కలిగించెను. అప్పు తీర్చుటకై దారపుత్రాదులను అమ్ము ఆచారమును నిషేధించెను. అనగా ఆనాడు గ్రీసులో ఎందరో 'హరిశ్చంద్రు " లున్నట్లు తెలియుచున్నది. నిరంకుశులలో కొందరు దుష్టపరిపాలకులు కూడ ఉండిరి. కొరింత్ రాజ్యమున నిరంకుశత్వము సాగించిన పెరియాంజరు అనువాడు అపర దుశ్శాసనుడై పెక్కండ్రు స్త్రీలను అవమానించెను. ఇట్టి ప్రభువు లుండుటచేతనే నిరంకుశత్వము సర్వత్ర నిరసింపబడినది.

స్పార్టా, ఏథెన్సు రాజ్యములు : క్రీ. పూ. 5 వ శతాబ్దమున ఏథెన్సు నగరమున ప్రజాస్వామ్యము నెలకొని యుండెను. గ్రీకుల పౌరరాజ్యములలో ఏథెన్సు, స్పార్టా రాజ్యములు అగ్రశ్రేణికి చెందినవి. ఏథెన్సుప్రజలు ప్రజాస్వామ్య విధానమును, వ్యక్తి స్వాతంత్ర్యమును మిక్కుటముగ గౌరవించిరి. క్రీ. పూ. 510 వ సంవత్సరమున క్లిస్తనీస్ అను ప్రముఖుడు ఈ నగరమున కొక ప్రజాస్వామ్య విధానమును సిద్ధపరచెను. దాని ప్రకారము పౌరులచే

ఎన్నుకొనబడిన 500 మంది సభ్యులుగల సమితియు, పౌరజనులందరితో గూడిన మహాసభయు, సమస్త రాజ్యాంగ వ్యవహారములను నడిపెడివి. స్పార్టారాజ్యమున ఇర్వురు రాజులు ఒకే కాలమున అధికారము వహించెడివారు. అచ్చటకూడ సమితియు, మహాసభయు ఉండెడివి. కాని స్పార్టనులకు ప్రజాస్వామ్య విధానమున విశ్వాసము లేకుండెను. తమ రాజ్యమందలి స్త్రీపురుషులు శరీర దార్ఢ్యము కలిగి, రాజ్య సంరక్షణమునకై, ధనప్రాణ

చిత్రము - 139

పటము - 1

ప్రాచీనకాలమునాటి గ్రీకుల విస్తృతి (క్రీ. పూ. 700-500)

మానములను అర్పించుటకై సంసిద్ధతవహించి యుండవలెనని స్పార్టనుల ఆశయము. స్పార్టారాజ్య ప్రభుత్వము ఒక సైనిక నియంతృత్వమువంటి దని చెప్పవచ్చును.

భిన్నత్వములో ఏకత్వము : గ్రీకు పౌరరాజ్యములలో ఎట్టి విభేదము లున్నను, తాము ఒకేజాతికి చెందినవార మను భావమును వారందరు కలిగియుండిరి. వారందరును డెల్ఫీలోని అపోలో దేవాలయపు దివ్యవాణి (Oracle) ని విశ్వసించుచుండిరి. హోమరుకవి రచించిన “ఇలియడ్”, “ఒడెస్సీ" అను మహాకావ్యములను చాల మన్నించుచుండిరి. నాలుగు సంవత్సరముల కొక పర్యాయము గ్రీకులందరును ఒలింపియా ఆటలలో సఖ్యతతో పాల్గొనుచుండిరి. పై అంశములు వారిని సంఘటిత పరచెను.

గ్రీకు పారసీక యుద్ధములు : క్రీ. పూ. 5 వ శతాబ్దమున పారసీకులకును, గ్రీకులకును మధ్య భయంకరమగు యుద్ధములు సాగెను. డేరియస్, జర్జస్ అను పారసీక చక్రవర్తులు గ్రీసుదేశముపై దండయాత్రలు సాగించిరి. క్రీ. పూ. 490వ సంవత్సరమున ఎథీనియనులు మారథాన్ యుద్ధమున పారసీకులను ఓడించి పారద్రోలిరి. క్రీ. వె. 480 వ సంవత్సరమున పారసీక సేనలు మరియొకసారి గ్రీసుపై దండెత్తెను. ఈ యుద్ధమున స్పార్టారాజ్యము వారు ఏథెన్సుకు సహాయపడిరి. స్పార్టారాజైన లియోనిడస్ అను మహావీరుడు 'ధర్మపోలీ' కనుమవద్ద పారసీకులతో అప్రతిమాన శౌర్యముతో పోరాడి తన సహచరవర్గముతో రణభూమిలో నిహతుడయ్యెను. పారసీకులు ఏథెన్సునగరమునకు చేరి, దానిని ధ్వంస మొనర్చిరి. కాని ఏథెన్సు రాజ్యమువారి నౌకాదళము పారసీక నౌకాదళమును సంపూర్ణముగ ఓడించెను. పారసీకులు పలాయన మొనర్చిరి. ఈ విధముగ ఏథెన్సు రాజ్యమువారు గ్రీకుదేశపు కీర్తి గౌరవములను నిలువబెట్టిరి.

చిత్రము - 140

పటము - 2

గ్రీక్ రాజనీతివేత్త పరిపాలకుడు - పెరిక్లీస్

ఏథెన్సురాజ్యపు స్వర్ణయుగము- పెరిక్లీసు పరిపాలనము : పారసీక యుద్దములలో విజయము సంపాదించిన తరువాత, ఏథెన్సురాజ్యము చాల బలపడెను. వారు సామ్రాజ్య నిర్మాణమునకు పూనుకొనిరి. క్రీ. పూ. 460-429 వరకును రాజనీతిజ్ఞుడును, మహాసమర్థుడు నైన పెరిక్లీసు అను నాతడు ఏథెన్సు రాజ్యమును పాలించెను. ఈతడే ఏథెన్సు నగరముచుట్టును బలమైనకోటను కట్టించెను. పెరిక్లీసు అనేక సంస్కరణలను గావించి, ఉత్తమమగు ప్రజాస్వామ్య పరిపాలనమును నెలకొల్పెను. ఏథెన్సు నివాసులను ఉత్తమపౌరులను గావించుట ఈతని ఆశయము. పెరిక్లీసు కాలమున ఏథెన్సునగరము నందలి ఎథీనీదేవత యొక్క దేవాలయము సర్వాంగ సుందరముగ పునర్నిర్మింపబడెను. ఈతని కాలమున శాస్త్రములును, గ్రీకు సారస్వతమును అత్యద్భుతముగ పెంపొం దెను. పెరిక్లీసుయుగము ఏథెన్సు రాజ్య చరిత్రలో స్వర్ణయుగముగా కొనియాడబడుచున్నది.

పెలో పొనీసియన్ యుద్ధములు - పౌర రాజ్యముల పతనము : పారసీకుల నోడించి, పారద్రోలిన అనతికాలము లోనే గ్రీకు పౌర రాజ్యములలో కలతలు, విభేదములు ప్రారంభమయ్యెను. గ్రీకురాజ్యముల కూటమి యొకటి ఏర్పడెను. దానికి నాయకత్వము నెవరు వహింపవలెనను విషయమున ఏథెన్సు స్పార్టా రాజ్యములకు వైర మేర్పడెను. తత్ఫలితముగ ప్రారంభమైన యుద్ధములే “పెలోపొనీసియన్ యుద్ధములు". ఈ యుద్ధములలో ఏథెన్సు బలము క్షీణించెను. కొంతకాలమువరకు (క్రీ. పూ. 404-377) గ్రీకురాజ్యములకు స్పార్టా నాయకత్వము వహించెను. కాని త్వరలోనే మరల అంతఃకలహములును యుద్ధములును చెలరేగెను. పౌర రాజ్యములన్నియు ఈ పోరాటములవలన క్రీ. పూ. 362 వ సంవత్సరమునాటికి పూర్తిగా దుర్బలములును, తేజోవిహీనములు నయ్యెను.

చిత్రము - 141

పటము - 3

గ్రీక్ చరిత్ర రచయిత హెరోడటస్

గ్రీకుల నాగరికత - సంస్కృతి: ప్రాచీన యుగమునాటి జాతులలో గ్రీకులు అత్యుత్తమమగు నాగరికతను, సంస్కృతిని పెంపొందించుకొనిరి. గ్రీకు సారస్వతము కూడ అత్యున్నతస్థాయినందు కొనెను. భారతీయులకు వాల్మీకివలె, గ్రీకులకు హోమరు ఆదికవి యయ్యెను. ఇతడు రచించిన “ఇలియడ్", “ఒడెస్సీ” అను మహా కావ్యములు జగత్ప్రసిద్ధములు. ఎస్కైలెస్, (క్రీ. పూ. 525–456), సోఫోక్లీసు (క్రీ. పూ. 496-406), యురిపిడిస్ (క్రీ. పూ. 480 - 406) అను గ్రీకుకవులు ఉత్తమమగు నాటకములను రచించి ఖ్యాతిగాంచిరి. చరిత్ర రచనారంగమున కూడ గ్రీకులు చాల కీర్తిని గడించిరి. హెరోడోటస్, థ్యూసిడైడ్స్, జెనోఫన్ అనువారలు గొప్ప గ్రీకుచారిత్రికులై వరలిరి.

గ్రీకులలో విద్యాభ్యాసము: గ్రీకులు తమ బాలకులకును, బాలికలకును చక్కగ విద్య గరపెడివారు. వారి పాఠశాలలలో చదువుట, వ్రాయుట, లెక్కలు, కవిత్వము సంగీతము బోధింపబడుచుండెను. పైథాగరస్, ప్లేటో, అరిస్టాటిల్ మున్నగువారు “అకాడమీలలో” ఉన్నత విద్యలను బోధించెడివారు. గ్రీకు విద్యావిధానములో శరీర వ్యాయామమునకు కూడ ప్రత్యేకస్థాన ముండెను. వ్యక్తిని సంపూర్ణ మానవునిగా జేయుటయే వారిలక్ష్యము.

మతము : వైదికార్యులవలెనే గ్రీకులు ప్రకృతి దేవతలను ఆరాధించుచుండిరి. వారి ప్రధాన దైవమయిన జ్యూస్ మన పురాణములలోని ఇంద్రుని పోలియుండును. తమ దేవతలు ఒలింపస్ కొండపై నివసింతురని గ్రీకులు

భావించెడివారు. వారు తమ దేవతలకొరకై ఆలయము

చిత్రము - 142

పటము - 4

జ్యూన్ - గ్రీక్ ప్రధాన దేవుడు

లనునిర్మించి, అందు విగ్రహములనుప్రతిష్ఠించి, ఏటేటను ఉత్సవములు జరిపెడివారు. వారికి శకునము లందును, జోస్యము నందును నమ్మిక యుండెను. పరలోకముకలదని గ్రీకులువిశ్వసించిరి.

గ్రీకు శిల్పము : గ్రీకులు శిల్పకళను చాల వృద్ధికావించిరి. డిలాస్ లోగల అపోలో దేవాలయమును, ఏథెన్సు నగర సమీపమున గలపార్థినానుదేవాలయమును, వారి శిల్పకళా కౌశల్యమునకు అత్యుత్తమ నిదర్శనములు. పెరిక్లీసునకు సమకాలికుడయిన ఫిడియస్ అను శిల్పి జ్యూస్ - ఎథీనాల విగ్రహములను సహజసౌందర్య ముట్టిపడునట్లు చెక్కెను. క్రీ. పూ. 3 వ శతాబ్దియందు గ్రీకువాస్తు నిపుణులు 105 అడుగుల ఎత్తుగల కంచు విగ్రహమును సిద్ధముచేసిరి. ఆ విగ్రహపు కాళ్ళక్రిందుగా నౌకలు సయితము నిరాటంకముగా రాకపోకలు జరుపుచుండెనట !

శాస్త్ర విజ్ఞానము: ప్రాచీన కాలమునాటి గ్రీకులు స్వతంత్రాలోచనాపరులు. వారు ప్రతి అంశమును గూర్చియు స్వయముగ ఆలోచించి, సత్యమును గ్రహించెడి వారు. కావున వారిలో శాస్త్రవిజ్ఞానము చక్కగా పెంపొందెను. వారిలో ఫైథాగరస్, యూక్లిడ్ అను గొప్ప గణిత శాస్త్రజ్ఞులును, ఆర్కెమిడిస్ అను ప్రకృతి శాస్త్రజ్ఞుడును, తదితర శాస్త్రజ్ఞులనేకులును ఉద్భవించిరి.

తత్త్వశాస్త్రము : గ్రీకులు మానవజీవితపు లక్ష్యములను గూర్చి తీవ్రముగ విమర్శ చేయజొచ్చిరి. తత్ఫలితముగ స్టోయిక్, ఎపిక్యూరియన్ అను తత్త్వశాఖలు వీరిలో తలయెత్తెను. కోర్కెలను జయించి శమదమాది గుణములను అలవరచు కొనుటయే జీవితమునకు పరమ లక్ష్యమని స్టోయిక్కుల భావము. దేహసౌఖ్యమే జీవిత పరమలక్ష్య మని ఎపిక్యూరియనులు భావించిరి. భౌతికవాదులు జీవితమే పరమసత్యమనియు, పునర్జన్మమనునది లేదనియు మరణమే జీవిత చరమావధియనియు బోధించిరి. కాని చార్వాకుల వలెనే ఎపిక్యూరియనులు కూడ సామాజిక వ్యవస్థకు నీతిప్రధానమని చాటిరి. క్రీ. పూ. 5 వ శతాబ్ది నుండి సోఫిస్టులు అను సంచారోపాధ్యాయులు, శాస్త్ర విజ్ఞానమును, తాత్త్విక సిద్ధాంతమును, ప్రజలకు బోధింప సాగిరి. గ్రీకు తత్త్వజ్ఞులలో సర్వ శ్రేష్ఠుడుగా సోక్రటీసు (క్రీ. పూ. 469-399) పరిగణింపబడెను. ఇతడు "ప్రశ్న-

చిత్రము - 143

పటము - 5

గ్రీకుల అపాలో దేవత

చిత్రము - 144

పటము - 6

ఏథెన్స్‌లోని పార్తివాన్ దేవాలయములో ఎతీనా విగ్రహము

సమాధానము" అనుపద్ధతి ననుసరించి గ్రీకు యువకులలో, విజ్ఞానా పేక్షను పెంపొందించెను. సత్యము, న్యాయము, అత్మాభివృద్ధి అనువాటికొరకై పాటుపడవలెనని సోక్రటీస్ జనులకు నిరంతరము బోధించెను. భౌతికములును, నైతికములునగు విలువలకును, వ్యక్తి స్వేచ్ఛా ప్రభుత్వాధికారములకును సమన్వయము కుదుర్చుట ఇతని ఆశయమై యుండెను. కాని నాస్తికత్వమును, అవిశ్వాసమును యువకులలో వ్యాపింప జేయుచున్నాడని భ్రమపడి ఏధెన్సుపౌరులు ఆ మహనీయుని చంపించిరి (క్రీ. పూ. 399). సోక్రటీస్‌యొక్క కృషిని అతని శిష్యుడగు ప్లేటో (క్రీ.పూ. 427-349) కొనసాగించెను. ప్లేటో శిష్యుడు అరిస్టాటిలు అనునతడు. అతడు సర్వతోముఖ ప్రజ్ఞాధురంధరుడును మహాపండితుడునై యుండెను. అరిస్టాటిలు రాజకీయములపై, అలంకార శాస్త్రముపై, భూగోళ ప్రకృతిశాస్త్రములపై గ్రంథములు రచించెను. జగదేకవీరుడగు అలెగ్జాండరు అరిస్టాటిలునకు శిష్యుడై వరలెను.

చిత్రము - 145

పటము - 7

అరిస్టాటిల్

మాసిడోనియా రాజ్యము : గ్రీసు నందలి పౌరరాజ్యములు పతనము చెందిన తరువాత మాసిడోనియా (గ్రీసులో నొక రాష్ట్రము) ప్రాంతపు రాజగు ఫిలిప్ విజృంభించి, గ్రీసు దేశమునంతను ఆక్రమించెను. ఇతని కుమారుడగు అలెగ్జాండరు గొప్ప వీరుడు. ఇతడు ఈజిప్టును జయించెను. పారసీక సామ్రాజ్యమును కూలద్రోసెను, భారతదేశముపై దండెత్తి విజయములు సాధించెను. గ్రీకు సంస్కృతిని ప్రపంచమం దెల్లెడల వ్యాప్తికావింప వలెనను కోర్కెతో అలెగ్జాండరు తాను జయించిన దేశము లన్నిటిలోను నూతన నగరములను నెలకొల్పి చాల కృషి చేసెను. కాని క్రీ. పూ. 323 వ సం. న ఇతడు అకాల మృత్యువు వాతపడుటచే ఇతని కృషి నిష్ఫలమయ్యెను. అలెగ్జాండరు నిర్మించిన సామ్రాజ్యముకూడ త్వరలో నశించెను.

రోమను సామ్రాజ్యములోని గ్రీకులు: అలెగ్జాండరు యొక్క మరణానంతరము ఇతర గ్రీకు రాజ్యములవారు మాసిడోనియా అధికారమును త్రోసి పుచ్చిరి. కాని క్రీ. పూ. 27 వ సంవత్సరమున రోమను చక్రవర్తియగు ఆగస్టసు అను నాతడు గ్రీసుదేశమునెల్ల స్వాధీనపరచుకొని దానిని తన సామ్రాజ్యములో చేర్చుకొనెను. కాని గ్రీకు శిల్ప, సారస్వత విజ్ఞానములకు ముగ్ధులైన విజేతలగు రోమనులు తమకు లభించిన గ్రీకు శిల్పఖండముల నన్నిటిని రోమునగరమునకు పంపివైచిరి. గ్రీసు విద్వాంసులను తమ పాఠశాలలలోను, కార్యాలయములలోను,

నియమించుకొనిరి. గ్రీకు రచనాపద్ధతులను అనుకరించిరి.

చిత్రము - 146

పటము 8

అలెగ్జాండర్ మహానీయుడు (క్రీ. పూ. 356-323)

రోమను సామ్రాజ్యములో గ్రీకు సభ్యత విస్తరించెను . కాని ఆ సామ్రాజ్యమున గ్రీకులు రాజకీయముగ పెక్కు బాధలకు లోనైరి. రోమనులయుగమందే క్రైస్తవ మతము గ్రీసుదేశమున ప్రవేశించెను. కాన్‌స్టంటైన్ అను రోమకచక్రవర్తి (క్రీ. శ. 324-337) ఈ మతమును తన ప్రజలెల్లరును అంగీకరింపదగునని శాసించెను.

మధ్యయుగపు చరిత్ర : కాన్‌స్టంటైన్ చక్రవర్తి బై జాంటియం అను ప్రాచీననగరము నెలకొనిన ప్రదేశమున, 'కాన్‌స్టాంటినోపిలు' అను నగరమును నిర్మించి, దానిని తన రాజధానిగ కావించుకొనెను. ఆతని యనంతరము రోమను సామ్రాజ్యము తూర్పుపశ్చిమ విభాగములుగ విడిపోయెను. తూర్పు సామ్రాజ్యమునకు బైజాంటైన్ సామ్రాజ్యము అను పేరు కలిగెను. గ్రీసుదేశమీ సామ్రాజ్యవిభాగమున చేరెను. ఆనాటికే క్రైస్తవ మతము ఐరోపాఖండమునం దంతటను వ్యాపించెను. కాని మతవిషయములలో తీవ్రమగు అభిప్రాయభేదములు ఉత్పన్నమై, తూర్పు ఐరోపాక్రైస్తవులును, పశ్చిమ ఐరోపాక్రైస్తవులును వేరుపడిరి. తూర్పు క్రైస్తవులు గ్రీకుక్రైస్తవు లనబరగిరి. తూర్పు రోమకసామ్రాజ్యము ప్రాచీన గ్రీకు సభ్యతకు నిలయమయ్యెను. పాశ్చాత్య క్రైస్తవులు గ్రీకు సభ్యతను నిరసనదృష్టితో చూచి దానిని విస్మరించిరి. అనాగరికజాతుల దండయాత్రల వలనను, మహమ్మదీయ మతస్థులతో జరిగిన మతయుద్ధముల (క్రూసేడ్లు) వలనను, బైజాంటియన్ సామ్రాజ్యము క్రమముగ దుర్బలమయ్యెను. క్రీ. శ. 15 వ శతాబ్దమున, అట్టోమాను తురుష్కులు 'డార్డవెల్సు' జలసంధిని దాటి మాసిడోనియా వర్బియా, బల్గేరియా లను ఆక్రమించిరి. తుదకు క్రీ. శ. 1453 వ సంవత్సరమున కాన్‌స్టాంటినోపిలు నగరము నాక్రమించిరి. అట్టోమాను వంశీయుడగు రెండవ మహమ్మదు సుల్తాను తూర్పురోమక సామ్రాజ్యమును తుదముట్టించెను.

ఆధునిక యుగపు చరిత్ర : కాన్‌స్టాంటినోపిలునగరము తురుష్కులవశమయిన తరువాత అచ్చట చిరకాలము నుండి నివసించియున్న క్రైస్తవ (గ్రీకు) పండితులు తమ ప్రాచీనగ్రంథములను తీసికొని, పశ్చిమ ఐరోపా దేశములకు వలసవచ్చిరి. 13 వ శతాబ్ది నుండియే, పాశ్చాత్య క్రైస్తవులు ప్రాచీన గ్రీకు విజ్ఞాన సంస్కృతుల యెడల

అభిమానమును చూపసాగిరి. ఆ ప్రాచీన సంస్కృతితో కలిగిన పునః పరిచయము వలన పశ్చిమ ఐరోపా దేశములలో గొప్ప భావసంచలనము కలిగెను. దీనిని మానసిక వికాసోద్యమ (Renaissance) మని చరిత్రలు వర్ణించు చున్నవి. 15 వ శతాబ్దమున గ్రీకు పండితుల రాకవలన ఈ యుద్యమమునకు చాల బలిమి చేకూరెను. మానసిక వికాసోద్యమముతో, ఐరోపా ఖండమున ఆధునిక యుగము ప్రారంభమగుచున్నది. ప్రాచీన గ్రీకు సంస్కృతిచే ప్రభావితులై పాశ్చాత్య ఐరోపా జాతులవారు

ఫేయాన్ అను గ్రీకు పౌరాణిక వ్యక్తిగాథకు సంబంధించిన చిత్రణము

అయిదవ శతాబ్ది

తమ శిల్ప చిత్రలేఖన కళలను, ప్రకృతి శాస్త్రవిజ్ఞానమును అభివృద్ధిచేసికొనిరి. నూతన సారస్వతమును సృష్టించిరి. భూగోళ శాస్త్రజ్ఞానము ద్వారమున ప్రపంచము యొక్క నిజస్వరూపమును తెలిసికొని, నూతన ఖండములను, ప్రదేశములను, కనుగొనిరి. కాని ఆధునిక ఐరోపా జాతులవారికి, ఆచార్యతుల్యులగు గ్రీకులు మాత్రము మతాంతరులగు మహమ్మదీయుల పాలనకు లోనై పెక్కు కష్టములను అనుభవించిరి. 18 వ శతాబ్ది ప్రారంభము నుండి అట్టోమాను సామ్రాజ్యము క్షీణింపసాగెను. ఆ శతాబ్ది తుది భాగమున ఫ్రెంచి స్వాతంత్ర్య విప్లవము చెలరేగెను. ఈ కారణములచే గ్రీకు దేశమున స్వాతంత్ర్య కాంక్ష హెచ్చెను. వారు తమ పాలకులగు తురుష్కులపై తిరుగుబాట్లు సాగించిరి. తురుష్కులు ఈ తిరుగుబాట్లను మిక్కిలి కాఠిన్యముతో అణచి వైచుటకు యత్నించిరి. కాని ఫలితము లేదయ్యెను. పశ్చిమ ఐరోపాదేశముల నుండి అనేకులు స్వచ్ఛంద సేవకులు గ్రీకుల సహాయమునకై పోసాగిరి. అట్టి స్వచ్ఛంద సేవకులలో అంగ్ల కవిపుంగవుడగు బైరన్‌ప్రభువు ఒకడు. ఇతడు గ్రీకు స్వాతంత్ర్యము కొరకు పోరాడుచు అసువులను బాసెను. ఐనను తురుష్కులు గ్రీసుదేశమునకు స్వాతంత్ర్యము నొసగరైరి. తుదకు బ్రిటను, ఫ్రాన్సు, రష్యాదేశములు ఏకమై తురుష్కులను రణరంగమున నోడించెను. 1829 వ సంవత్సరమున తురుష్క సుల్తాను గత్యంతరములేక గ్రీకుల స్వాతంత్య్రమును గుర్తించెను. 1832 వ సంవత్సరమున గ్రీసుదేశము స్వతంత్ర ప్రతిపత్తిని పొందెను. అచ్చట శాసనబద్ధమగు రాచరిక మేర్పడెను. గ్రీకులు బవేరియా రాకుమారుడైన ఆటోనును రాజుగా ఎన్నుకొనిరి. 1863 లో ఆటో పదచ్యుతుడయ్యెను. అంతట డెన్మార్కు రాకుమారుడగు జార్జి అనునాతడు గ్రీసుదేశమునకు రాజయ్యెను.

రాజ్యవిస్తరణకై యత్నములు: మొదటి జార్జిరాజు కాలమున (1863-1913) తమ రాజ్యమును విస్తృత మొనర్చుటకై గ్రీకులు యత్నించిరి. ఇందువలన తురుష్కులతో గ్రీకులు యుద్ధము చేయవలసినవా రైరి. బల్గేరియా, సర్బియా, మాంటీనీగ్రో, గ్రీసులలో కూడ అంతఃకలహములు సంభవించెను. తుదకు గ్రీకులకు థెస్సరీయును, మాసిడోనియాలో కొంతభాగమును లభించెను.

ప్రపంచయుద్ధములు : 1914 వ సంవత్సరమున, మొదటి ప్రపంచయుద్ధము ప్రారంభమైన తరువాత, కొంతకాలము గ్రీసురాజ్యము తటస్థవిధానము నవలంబించెను. కాని వెనిజిలాస్ అను మంత్రి ప్రోత్సాహమువలన 1917 వ సంవత్సరమున ఆ రాజ్యమువారు మిత్రమండలిలో చేరిరి. ఆంగ్లప్రధాని యగు లాయడ్ జార్జి, వెనిజిలాసునకు ఆప్త మిత్రుడై యుండెను. ఈతని సహాయమున బలహీనమగు తురుష్క రాజ్యమునుండి త్రేసు రాష్ట్రమును సంపాదింప వచ్చునని గ్రీకుప్రధాని ఆశపడెను. కాని తురుష్కుల ప్రతిఘటనమువలన ఈ ఆశయ మీడేరలేదు. 1919-39 నడుమ గ్రీకురాజ్యములో ఆర్థిక పునర్నిర్మాణమునకై వెనిజిలాస్ ప్రభృతులు చాల పాటుపడిరి. కాని రాజకీయ కల్లోలములవలన ఆ కార్యక్రమము చక్కగా సాగలేదు. ఇచ్చట కమ్యూనిస్టు పక్షమువారి ప్రాబల్యము హెచ్చసాగెను. కాని గ్రీకుప్రభుత్వము కమ్యూనిస్టులకు లోబడలేదు. గ్రీసులో సైనిక నియంతృత్వ మేర్పడెను. రెండవ ప్రపంచ యుద్ధమందు గ్రీసురాజ్యము మిత్రమండలి పక్షమును వహించెను. యుద్ధ ప్రారంభదశయందు నాజీ పఠమువారు గ్రీసు నాక్రమించిరి. కాని తుదకు గ్రీకులకే విజయము లభించెను. అచ్చట స్వతంత్రప్రజాస్వామ్య ప్రభుత్వ మేర్పడెను. 1946 వ సంవత్సరమున ప్లెబిసైట్ ద్వారా గ్రీసులో రాచరికము పునరుద్ధరింప బడెను. రెండవ జార్జిరాజు సింహాసన మెక్కెను. ఆతని అనంతర మాతని సోదరుడు పాల్ అనునాతడు రాజయ్యెను (1947).

కమ్యూనిస్టు ఉద్యమము : గ్రీసుదేశమున తమ ప్రాబల్యమును నెలకొల్పవలెనని 1935 నుండియు కమ్యూనిస్టులు యత్నములు చేయుచు వచ్చిరి. 1946 లో వారు గ్రీసు ప్రజాప్రతినిధి ప్రభుత్వముతో గోరిల్లాయుద్ధమునకు కూడ దిగిరి. కాని బ్రిటను అమెరికా సంయుక్తరాష్ట్రముల సహాయముతో 1949 నాటికి గ్రీకుప్రభుత్వము కమ్యూనిస్టు ఉద్యమమును అణచివై చెను. మితవాదపక్షములు అధికారమును వహించెను. అమెరికా సంయుక్తరాష్ట్రముల సహాయముతో, వారు ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమమునకు పూనుకొనిరి. 1955 వ సంవత్సరమునందు నేషనల్ రాడికల్ యూనియనుపక్షమువారు అధికారము వహించిరి. ప్రస్తుత స్థితి : యుద్ధానంతరము గ్రీసురాజ్యమువారి ప్రతిష్ఠ హెచ్చినది. వారు ఐక్యరాజ్యసమితి, ఉత్తర అట్లాంటికు రాజ్యకూటములలో సభ్యులుగ నున్నారు. యుగోస్లావియా, టర్కీలతో గ్రీసుదేశము స్నేహము పాటించుచున్నది.

బి. ఎస్. ఎల్. హ.


గ్రీసుదేశము (భూ) :

గ్రీసుదేశము తూర్పు మధ్యధరామండలములో నున్న ఒక చిన్న రాజ్యము. ఇది 35°-411/2° ఉత్తర అక్షాంశ రేఖల మధ్యను, 19°-281/2° తూర్పు (గ్రీనిచికి) రేఖాంశవృత్తముల మధ్యను కలదు. దక్షిణ యూరపుఖండమునందలి మూడు ద్వీపకల్పములలోను ఇది మిక్కిలి తూర్పున

చిత్రము - 147