సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గురుజాడ వేంకట అప్పారావు
గురుజాడ వేంకట అప్పారావు :
తొలుత వీరి పూర్వులది కృష్ణాజిల్లా, గన్నవరం తాలూకా, గురుజాడ గ్రామము. వీరి ప్రపితామహులు పట్టాభిరామయ్యగారు మచిలీపట్టణమున స్థిరపడిరి.
పట్టాభిరామయ్యగారి జ్యేష్ఠపుత్రులు సీతాపతిగారు, సీతాపతిగారి జ్యేష్ఠపుత్రులు వేంకట రామదాసుగారు, విజయనగర సంస్థానమున మొదట కుమఠాం ఠాణాలోను తరువాత జలంత్రా ఎస్టేట్ లోను అటుతరువాత శృంగవరపుకోటలోను, చివరన విజయనగరమునందు ఖిల్లేదారులుగను ఉద్యోగము చేసి అచటనే స్థిరపడిరి. వీరి సతీమణి కౌసల్యమ్మ ఎలమంచిలి తాలూకా, రాయవరం గ్రామస్థు లగు గొడవర్తి కృష్ణయ్యపంతులు గారి కూతురు. వేంకట రామదాస కౌసల్యాంబల తొలి చూలు మన గురుజాడ వేంకట అప్పారావుగారు. వీరు దుందుభి సంవత్సర భాద్రపద శుద్ధ 13 ఆదివారము (30–11–1861) న జన్మించిరి. జననము, శైశవము, అక్షరాభ్యాసము మాతామహుల ఇంటనే జరిగినది. తరువాత గులివిందాడలో వెలిపల రామమూర్తిపంతులుగారి కడ వీరికి సంస్కృతాంధ్రాంగ్లము లభ్యస్తము లైనవి. అటుతరువాత కొంతకాలము చీపురుపల్లిలో గూడ విద్యాభ్యాసము జరిగినది. 1872 వ సంవత్సరమున వేంకట అప్పారావుగారు విజయనగరం మహారాజావారి ఆంగ్ల కళాశాలకు చెందిన ఉన్నత పాఠశాలలో ప్రవేశించిరి. వీరికి కీ. శే. గిడుగు రామమూర్తిపంతులుగారు సహాధ్యాయులుగ నుండిరి.
మెట్రిక్యులేషన్లో ఉండగనే అప్పారావుగారు ఆంగ్లమున కవిత్వము రచించి ఆనంద గజపతుల నాకర్షించిరి. మహారాజావారి ఆంగ్ల కళాశాలా ప్రధానాధ్యాపకులైన చంద్రశేఖరశాస్త్రిగారి మన్ననలను బొంది వారి ఇంటనే, వారి చెంతనే భాషాసారస్వతములను జీర్ణించుకొనిరి.
చంద్రశేఖరశాస్త్రిగారు అప్పారావుగారిని గూర్చి తమ అభిప్రాయము నిట్లు చాటిరి. "అఖండ మేధాసంపత్తిగల కొద్దిమంది విద్యార్థులలో అప్పారావొకడు. విద్యార్థిగా ఉంటూ గురువుల మన్ననలను పొందిన యువకుడు. నిరంతర సాహిత్య వ్యాసంగము అతని వ్యసనము. సహజ ప్రేరేపణవలన కలిగిన అతని కవితాశక్తి అపారమైనది. సాధనవల్ల అది ప్రకాశవంతమై ఎప్పటికిని మనం మరువ లేని కవుల స్థానమును అప్పారావుకు ప్రసాదిస్తుంది. ఇందుకు సందేహము లేదు. వినయము, సౌశీల్యము, అతని సహజగుణములు. జీవితమున అతను అన్నిటా ఔన్నత్యమును పొందవలెనని నా అభిలాష. అతని ఔన్నత్యమే నాఔన్నత్యము. అతని ఆనందమే నాఆనందము.” పుట్టుకతోడనే పూవు పరిమళించు రీతి పిన్నతనమందే ఇట్టి మన్నన లందుకొన్న మహా పురుషుడు గురుజాడ. మెట్రిక్యులేషన్ పరీక్షలోను, బి.ఎ. పరీక్షలోను (1886) ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యెను.
పట్టభద్రులు కాకపూర్వమే 1884 వ సంవత్సరమున కొంతకాలము అప్పారావుగారు హైస్కూలులో ఉపాధ్యాయులుగా నుండిరి. అప్పుడాయనకు లభించిన వేతనము నెలకు 25 రూపాయలు మాత్రమే. ఆ యుద్యోగ మిష్టము లేక వీరు 1887 లో డిప్యూటీ క లెక్టరు కచేరీలో గుమాస్తాపని గూడ చేసినారు. కాని, ఆ యుద్యోగము కూడ వారికి సరిపడలేదు. న్యాయవాదిగా రాణించవలె నను వారి కోర్కి ఆర్థికపు చిక్కులవలన సఫలము కాలేదు. ఆయన ఉపజ్ఞను విద్యాలయములు ఉపయోగించుకొనవలెనని ఆనందగజపతి మహారాజావారు ఆ సంవత్సరమే (1887), తమ కళాశాలలో ఆతనిని నాలుగవ ఉపన్యాసకునిగ నెలకు నూరురూపాయల జీతముపై నియమించిరి. ఉపన్యాసకులుగా నుండి అప్పారావుగారు మహా రాజావారికి వార్తాపత్రికలు చదివి వినిపించు ఉద్యోగము కూడ చేయుచుండిరి. అందుకై రాజాగారు వారికి ఏబది రూపాయలు అదనముగా ఇచ్చుచుండిరి. 1891 లో అప్పారావుగారు మూడవ ఉపన్యాసకులుగా ప్రమోషను పొందిరి. వారు ఎఫ్. ఏ., బి.ఏ. తరగతులకు తత్త్వశాస్త్రము, ఆంగ్లము, సంస్కృతసాహిత్య చరిత్రము, అనువాదము, వ్యాకరణము, గ్రీకు, రోమను చరిత్రములను బోధించెడివారు. అనారోగ్యము కారణముగా అప్పారావుగారు ఉపన్యాసక పదవిని విడిచిపెట్టి 1896 లో సంస్థాన శాసన పరిశోధక పదవి నలంకరించిరి. ఆనంద గజపతి మరణానంతరము వారి సోదరి రీవా మహా రాణిగారికి ఆంతరంగిక కార్యదర్శిగా 1898 లో నియుక్తులై, ఆమరణాంతము ఆ యుద్యోగమున నుండియే కావ్య కళాస్రష్టలై వెలుగొందిరి. అప్పారావుగారు 30-11-1915 దివంగతులైనారు.
చిత్రము - 104
కీ. శే. గురుజాడ వేంకట అప్పారావు
దేశభక్తుడుగా, ఉత్తమ కళావేత్తగా, సంస్కారిగా, కవిగా, నాటకరచయితగా, విమర్శకుడుగా, పరిశోధకుడుగా గురుజాడ అప్పారావుగారు చేసిన సేవ అపారము. "దేశమును ప్రేమించుమన్నా" అను దేశభక్తి ప్రబోధక గేయమును 1910 లో రచించి, అప్పారావుగారు మనజాతికి మేలుకొలుపులు పాడినారు. 1887 ప్రాంతము లందే కాంగ్రెసు సభలకు పోయి ఉపన్యాసము లిచ్చిరి. వారు రచించిన ముత్యాలసరములు, పూర్ణమ్మ, కన్యక, కాసులు, లవణరాజు కల, మొదలైన ఖండ కావ్యములు ప్రాతక్రొత్తల మేలుకలయికలును, సంఘసంస్కరణోద్దేశ పూర్వకములునై యున్నవి. గిడుగు రామమూర్తి పంతులుగారి వ్యావహారిక భాషోద్యమమునకు అప్పారావుగారు కుడిభుజమై నిలిచిరి. గిడుగువారి లక్షణములకు అప్పారావుగారి రచనములు లక్ష్యము లయ్యెను.
అప్పారావుగారు ఉపన్యాసకులుగా నుండినప్పుడే 1896 లో కన్యాశుల్కమను నాటకమును, సంఘసంస్కర ణోద్యమమును బలపరచుటకును, తెలుగుభాష నాటకరంగమునకు అనుకూలమైనది కాదు, అను అపోహ నెదుర్కొనుటకును తాము వ్రాసినట్లుగా చెప్పుకొన్నారు. గిరీశంపాత్ర అప్పారావుగారి సృష్టి. ఆంధ్రదేశ మా పాత్రము నెన్నటికిని మరువజాలదు. ఇతివృత్త స్వీకరణము తన్నిర్వహణము, హాస్యరసపోషణము, పాత్రోన్మీలనము, ఇత్యాద్యంశముల యందు తెలుగు నాటకములలో కన్యాశుల్కము అత్యుత్తమమైనదని విమర్శకుల అభిప్రాయము. సాంఘిక వాస్తవికత దర్పణమునందువలె యథాతథముగా ప్రతిబింబించిన కళాఖండ మిది. కొండు భట్టీయమనునది కూడ కన్యాశుల్కము వలెనే సామాజికేతివృత్తమును స్వీకరించి, హాస్యరస ప్రధానముగా రచింపబడిన మరియొక సంపూర్ణ నాటకము. ఈ రెండింటికిని పోలిక లనేకములు గలవు. సంపూర్ణమైనచో విషాదాంతముగా పరిణమించి యుండెడి నాటక మిది. అప్పారావుగారు రచించిన మరియొక అసంపూర్ణ నాటకము బిల్హణీయము. ఇది ప్రాచీన శృంగార కథాసంబంధి యైనను పాత్రములు మాత్రము యథార్థ ప్రపంచమునుండి గ్రహింప బడినట్లు పండితుల అభిప్రాయము. అప్పారావుగారి సమకాలికులైన విజయనగరాస్థాన కవిపండితుల ప్రవృత్తులు, ఈర్ష్యాసూయలు బిల్హాణీయమున చిత్రింపబడినవని పరిశోధకులు అభిప్రాయపడిరి. పూర్వ సంస్కృతాంధ్ర బిల్హణీయ కథలకన్న అప్పారావుగారి బిల్హణీయకథ భిన్నమును ఉదాత్తమునునై యున్నది. అప్పారావుగారు ఆంగ్లమున చిత్రాంగి నాటకమును రచించినారు. ఆధునిక కథానికా రచనమున కాద్యు లెవరు?- శ్రీ గురుజాడ వారా? శ్రీ మాడపాటివారా? అనునది పరిశోధింప దగిన విషయము. గురుజాడవారి డైరీలు, లేఖలు, ఇంగ్లీషు కవిత్వము మున్నగు రచనలను విశాలాంధ్ర ప్రచురణాలయమువారు ఇటీవల ఆరు సంపుటములుగా ప్రచురించినారు. తాము పరిశోధించి వ్రాయదలచిన పూసపాటి గజపతుల చరిత్ర, విశాఖ చాళుక్యుల చరిత్ర, కళింగ చరిత్ర మున్నగువాటికి కావలసిన వస్తుజాతమును గురుజాడవారు ప్రోగుచేసిరట ! కాని చరిత్ర రచనము మాత్రము జరగలేదు. ఆధునికాంధ్ర వాఙ్మయాకాశమునకు అరుణోదయముగా భాసిల్లిన శ్రీ గురుజాడ మనజాతికి ప్రాతస్స్మరణీయుడు.
బి. రా.