Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గిడుగు వేంకట రామమూర్తి

వికీసోర్స్ నుండి

గిడుగు వేంకట రామమూర్తి :

శ్రీ గిడుగు రామమూర్తిగారు నియోగి బ్రాహ్మణులు. వీరి తండ్రిపేరు వీరరాజు. కారణాంతరములచే స్వగ్రామమైన ఇందుపల్లిని విడిచి, వీరు విజయనగర సంస్థానమందు రెవెన్యూ ఇన్‌స్పెక్టరు ఉద్యోగములో ప్రవేశించిరి. 1858 నాటికి వీరు గంజాముజిల్లా ముఖలింగమునకు చేరువగా నున్న పర్వతాలపేటలో ఉద్యోగ వశమున నుండగా 1862 లో రామమూర్తిగారు జన్మించిరి. రామమూర్తి గారికి యధావిధిగా 5 వ ఏట అక్షరాభ్యాసము జరిగినది. ఆ కాలములో ముఖలింగమునకు ప్రక్కగనున్న 'నగరి కటకము’న జయపురపు రాజవంశమునకు చెందిన శ్రీవిక్రమ దేవవర్మ తండ్రిగారు కుటుంబసహితముగా నివసించు చుండెడివారు. రామమూర్తిగారు నాలుగైదేండ్ల బాలుడుగా నున్నప్పుడు శ్రీ విక్రమదేవవర్మ నగరికటకములో జన్మించిరి. వీరిద్దరి తండ్రులు అన్నదమ్ముల వలె మిత్రులుగా నుండుటచే, రామమూర్తి విక్రమదేవవర్మ గార్లును బాల్యమునుండి పరమ మైత్రితో పెరిగిరి. రామమూర్తి గారి పండ్రెండవయేట, వీరరాజుగారికి విశాఖపట్టణము జిల్లాలోని చోడవరమునకు బదిలీ జరిగినది. ఆ నాటికి రామమూర్తిగారి విద్య ఎక్కువగా సాగలేదు. అక్షరాభ్యాసము మొదలు రెండేండ్ల వరకును వీరికి వారణాసి గున్నయ్యగారు గురువులుగ నుండిరి. వీరి శిక్షణతో చదువను, వ్రాయను నేర్చుకొని, వేమన, సుమతీశతకము లందలి కొన్ని పద్యములకు ప్రతిపదార్థ తాత్పర్యములను కంఠస్థము గూడ చేసిరి. అటుపిమ్మట తండ్రి వద్దనే బాలరామాయణ శ్లోకములు కొన్ని వల్లించిరి. వీరు భారత రామాయణ కథలు వినుచుండెడివారు. వీరరాజుగారు పూర్వాచార సంప్రదాయములను పాటించెడి వారగుటచే కుమారునకు పదియవయేట విజయనగరములో ఉపనయన మాచరించి వారిచే 'మాధవభిక్ష' ఎత్తించిరి.


రామమూర్తిగారి 13 వ ఏట వారి తండ్రి స్వర్గస్థులయిరి. 1879లో వీరు మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై 'పర్లాకిమిడి జిల్లా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించిరి. విజయనగరమందు వీరికి మిత్రులుగా నుండిన వారిలో గురుజాడ అప్పారావుగారు ముఖ్యులు. వీరిద్దరును ఒకేసారి మెట్రిక్యులేషన్ పరీక్ష యందు ఉ త్తీర్ణులయినవారే. అప్పారావుగారు సంపన్న కుటుంబములోని వారగుటచే కాలేజీ చదువు సాగించి బి. ఏ. పరీక్షయం దుత్తీర్ణులయిరి. పేదవారగుటచే రామమూర్తిగారు, తన తండ్రి మరణానంతరము కాలేజీ చదువు సాగింపలేకపోయిరి. హైస్కూలు విద్యనయినను. వీరి తల్లి తన యాభరణముల నమ్మి వీరికి చెప్పించవలసి వచ్చినది. అందుచే రామమూర్తిగారు ఉద్యోగములో ప్రవేశించి కుటుంబపోషణము చేయక తప్పలేదు. వీరికి 1880 లో వివాహము జరిగినది. 1885 లో వేంకటసీతాపతియను పేరుగల ప్రథమ పుత్రుడు జన్మించెను. రామమూర్తిగారు ఉద్యోగము చేయుచునే బి. ఏ. పరీక్షలో ఇంగ్లీషు, సంస్కృత భాగము లందు ఉత్తీర్ణులై పిదప 1896లో పూర్తిగా పట్టభద్రులయిరి.

రామమూర్తిగారు, తమ ఉద్యోగకాలములో మరి రెండు పనులు యధేష్టముగా తెచ్చిపెట్టుకొని వాటిలో నిమగ్నులై రి. పర్లాకిమిడికి ఉత్తరమున నున్న కొండల నుండి ఆదిమవాసులైన సవరలు పర్లాకిమిడిలో కట్టెలు, కొండచీపురు కట్టలు, పసుపు అమ్ముకొనుటకై వచ్చు చుండెడివారు. వారి భాష, ఆచార వ్యవహారములు, జీవిత విధానము రామమూర్తిగారికి విపరీతముగ తోచుటచే, వారి భాష నేర్చుకొనవలె నన్న అభిలాష వారికి తీవ్రమైనది. అప్పటికి వారు ఒరియా భాష చదువను, వ్రాయను నేర్చుకొని యుండిరి. ఆర్యభాషల పరస్పర సంబంధమును, భాషాతత్వమును తెలియజేయు గ్రంథములును, మాక్స్‌ముల్లర్ రచించిన గ్రంథములును, వీరు చదివియుండిరి. ద్రావిడ భాషలనుగూర్చి కాల్డ్ వెల్ వ్రాసిన గ్రంథములనుకూడ వీరు పఠించిరి. అందుచే సవర భాషను నేర్చి, భాషాకుటుంబములలో అది దేనికి చెంది యున్నదో తెలిసికొనవలెనన్న కోరిక రామమూర్తి గారికి కలిగినది. అదికాక సవర భాషను అదివరకెవ్వరును పూర్తిగా నేర్చుకొని యుండకపోవుటచేతను, ఆ భాషకు లిపిలేకుండుట చేతను, ఆభాషలో గ్రంథమేదియు వ్రాయబడక ఉండుటచేతను, తెలుగులిపి ననుసరించి సవరభాషలో గ్రంథములు రచింపవలెనన్న అభిలాష రామమూర్తిగారికి మెండయ్యెను. వారు సవర, ఒరియా, తెలుగు భాషలు తెలిసిన ఒక పైడిజాతి వానిని గురువుగా పెట్టుకొని సవరభాష నభ్యసించిరి. కాని అది స్వచ్ఛమైన సవరభాష కాక, ఒరియా తెలుగు పదములతో కలసియుండెను. అందుచే గురువు అలవరచిన పరిజ్ఞానముతో వీరు వేసవి సెలవులలో సవరలు మెండుగానుండు గుణుపురము మొదలగు ప్రదేశములలో తిరిగి, స్వచ్ఛమైన సవరభాష నభ్యసించిరి; వారి ఆచార వ్యవహారములు, సంప్రదాయములు తెలిసికొనిరి. ఆ సమయములో రామమూర్తిగారు మాళువా (మన్య) జ్వరముతో బాధ పడుచు, తన్నివారణార్థము మిక్కుటముగా 'క్వినైన్' మ్రింగిన ఫలితముగా క్రమముగా వారికి చెవుడు సంక్రమించినది.

ఈ వ్యాసంగముతో పాటు, మరొక కార్యములోగూడ వీరు నిమగ్నులైరి. 1890 లో రామమూర్తిగారు ముఖలింగమునకు వెళ్ళి అచ్చటి అచ్చటి దేవాలయము లందలి శాసనములలో గల ప్రాచీనకాలపు లిపిని అలవరచుకొన ప్రారంభించిరి. ఆ కాలము వరకును ఆ లిపిని నేర్చినవారెవరును ఆ ప్రాంతమందు లేరు. రామమూర్తిగారికి పర్లాకిమిడి రాజావారి కనిష్ఠ సోదరునితో చెలిమి కలిగినది. ఆతని కొక గ్రంథాలయ ముండెను. ప్రాచీనలిపి స్వరూపము తెలియజేయు 'బర్నెల్ ' విరచిత గ్రంథము తన కుపకరింపగలదని రామమూర్తిగారు మనవి చేయగా, ఆ రాజకుమారుడు ఆగ్రంథమును తెప్పించి గ్రంథాలయమం దుంచెను. ఆ గ్రంథసహాయమున ముఖలింగమందలి శిలాశాసనములను స్వయంకృషితో చదువ గల శక్తిని వారు అలవరచుకొనిరి.

1894 లో దీర్ఘాసి శాసనమందలి సీసపద్యమును చదివి, 'ఎపిగ్రాఫియా ఇండికా' అను పత్రికకు వ్యాసము పంపిరి. ఆ సంవత్సరమే ముఖలింగమునకు సంబంధించిన ప్రాచీన చారిత్రకవిషయములనుగూర్చి వ్రాసినవ్యాసము 1895లో మద్రాసు లిటరరీ సొసైటీ పత్రికలో ముద్రితమైనది.

చిత్రము - 101

గిడుగు వేంకట రామమూర్తి

సవరలనుగురించి వీరు వ్రాసిన మరొక గ్రంథము ననుసరించి 'థర్‌స్టన్' రచించిన “దక్షిణ భారతములోని కులములు, తెగలు" (Castes and Tribes of Southern India) అను గ్రంథసంపుటిలో 'సవరలు' అను శీర్షికక్రింద పెక్కు విషయములు ప్రకటితములైనవి. వజ్రహస్తుని తామ్ర శాసనము మొదలైన తూర్పు గాంగవంశరాజుల దాన శాసనముల కొన్నిటిని వీరు ప్రకటించిరి. ఈ రాజుల రాజధాని ముఖలింగనగరమేకాని కళింగ పట్టణము కాదనియు, ముఖలింగనగరమునకు ప్రక్కనున్న నగరికటకము చతురంగబలములకు నిలయమనియు, కళింగపట్టణము రాజులకు రేవు పట్టణమనియు వీరు రుజువు చేసిరి. 'నగరం' మను పేరు రాజధానికిని, 'పట్టణ' మను పేరు రేవుస్థలమునకును పెట్టుట ప్రాచీన సంప్రదాయమని గూడ వీరు తెలియజేసినారు.

1895 లో పర్లాకిమిడి ఉన్నతపాఠశాల సెకండ్‌గ్రేడ్ కళాశాలగా మారగా, మరుసంవత్సరము రామమూర్తిగారు అందులో చారిత్రకోపాధ్యాయులుగా నియమింపబడిరి. వారు ఆచార్యత్వమును విరమించునంతవరకు (1910) మరి పెక్కు వ్యాసంగములలో నిమగ్నులై యుండిరి. అందు (1) మూడు జిల్లాలకు ఆనాడు విద్యాధికారిగా నుండిన 'యేట్స్' దొర ప్రోత్సహించిన వ్యావహారిక భాషావాదము. (2) ఇంగ్లీషుభాష నేర్చుకొన ప్రారంభించిన విద్యార్థులకు అనువాదపద్ధతికాక, ఇంగ్లీషులోనే 'డై రెక్ట్ ' పద్ధతిలో 'ఫోనెటిక్ ' లిపిలో బోధించుట. (3) పర్లాకిమిడి పరిసరములలోని సవరబాలురకై స్వంత ధనము వెచ్చించి పెట్టిన బడులు సక్రమముగా నడచునట్లు చూచుకొనుట అనునవి మూడును ముఖ్యమైన వ్యాసంగములు. ఈ కార్యములలో వీరి ప్రథమపుత్రుడైన సీతాపతి తన తండ్రికి సహాయుడుగా నుండెడివాడు. వ్యావహారిక భాషావాదమునకు కావలసిన పరికరములను రామమూర్తి గారు సేకరించుచుండెడివారు. వీరు బాల్యము నుండియు తెలుగు ప్రబంధములు, తెలుగు వ్యాకరణములకంటె, సంస్కృతగ్రంథములను ఎక్కువగా పరిశీలించుచుండెడివారు. తెలుగు ప్రబంధములను, తెలుగు వ్యాకరణమును ఎక్కువగా చదివి యుండలేదు. కాని భాషాతత్వమును వీరు లెస్సగా గ్రహించియుండిరి. అంతియేకాక ప్రప్రథమముగ సవరభాషకు వ్యాకరణము నిర్మించుటలో వ్యాకరణ సంప్రదాయములను అలవరచుకొన్నారు. అందుచేత వీరు తెలుగుభాషను స్వయంకృషిచే వేగముగ నేర్వగలిగిరి. యేట్సుదొర ఏర్పరచిన ఉపాధ్యాయ పరిషత్తులో రామమూర్తి గారు ప్రసంగించుచు వ్యావహారిక భాషకును, గ్రాంథిక భాషకును గల తారతమ్యమును విశదీకరించిరి. నన్నయ కాలమునుండి తెలుగుభాష ఎట్లు మారుచు వచ్చినదో, జీవభాషలకు గల ఉత్కృష్టత ఎట్టిదో వీరు నిరూపించిరి. గ్రాంథిక భాషాభిమానులకు వీరి ప్రసంగము వెగటుగా తోచెను.

రామమూర్తిగారు 1910 లో పర్లాకిమిడి కళాశాల ఉద్యోగమునకు రాజీనామా నిచ్చి, విశాఖపట్టణముజిల్లా లోని జయపుర మందలి బోర్డు హైస్కూలునందు ప్రధానోపాధ్యాయ పదవిని స్వీకరించిరి.

తెలుగువారికి మాతృభాషలో తగిన కృషి, ప్రోత్సాహము లేకుండెననియు, గ్రాంథికమైన తెలుగు భాషా భ్యసనమువలన ప్రసంగములలోను, ఇతర విషయము లందును స్వేచ్ఛ యుండదనియు, తెలుగుభాష సజీవమైన భాషగా పరిణతి చెందవలెనన్నచో గ్రంథరచనయందు వ్యావహారిక భాష ప్రవేశపెట్టవలెననియు రామమూర్తిగారు తన రచనలలో, ఉపన్యాసములలో ఉద్ఘాటించిరి. ఇది గ్రాంథిక భాషాభిమానుల కసమ్మత మగుటచే, వ్యావహారిక భాషాభిమానులకును, గ్రాంథికభాషాభిమానులకును వాదములు చెలరేగినవి. వ్యావహారికభాషాభిమానులలో రామమూర్తి, ఏట్సుదొర, పి. టి. శ్రీనివాస అయ్యంగారు, గురజాడ అప్పారావు గార్లు ముఖ్యులు. గ్రాంథికవాదులు వీరిని 'దుష్టచతుష్టయము'గను, వీరభిమానించిన భాష 'గ్రామ్యభాష' గను ఎంచి, తెలుగుదేశ మంతటను సభలు నడిపించి, తీవ్రమైన అలజడి కావించి, ప్రభుత్వమునకును, విశ్వవిద్యాలయములకును వేలకొలది సంతకములతో నివేదికలు పంపిరి గ్రాంథిక వాదులకు నాయకత్వము వహించిన వారిలో ముఖ్యులు శ్రీ జయంతి రామయ్య పంతులుగారు. ఇరుపక్షముల మధ్య ఖండన మండనములు ఉచ్ఛస్థాయి నందుకొనెను. ఈ 'దుష్ట చతుష్టయము' లో మిగిలినవారి కంటె రామమూర్తిగారు వ్యావహారిక భాషావాదము నెగ్గితీరవలెనని మిగుల పట్టుదలతో నుండిరి. అందులకై వారు బరంపురము నుండి మద్రాసు, అనంతపురము వరకును గల కళాశాలలకు వెళ్లి తిక్కనకాలము నుండి ఆనాటికానాటికి తెలుగు గ్రంథములందు వ్యావహారిక భాషారూపము లెట్లు ఎక్కువగుచు వచ్చినవో ప్రయోగములు చూపించుచు, కళాశాలాధికారులకు, అధ్యాపకులకు నచ్చచెప్పిరి. ఇంతకును తమవాదము వచన రచనలకే గాని, కావ్యరచనకు కాదనియు ఇది నూతన విప్లవముగా పుట్టినది గాదనియు, చిన్నయసూరికి పూర్వమే వందలకొలది వచన రచనలు వాడుకభాషలో సాగినవనియు, వీరు సప్రమాణముగ రుజువు చేసిరి. విప్లవము తెచ్చిపెట్టినవాడు చిన్నయసూరియే యనియు, చిన్నయసూరి రచించిన వ్యాకరణ సూత్రములను బట్టి చూచినచో, తిక్కన మొదలైన మహాకవుల ప్రయోగములు గ్రామ్యము లనవలసి వచ్చుననియు రామమూర్తిగారు సోదాహరణముగా వాదించిరి. వారి వాదన పెక్కుమంది పండితులకును. విద్యాధికులకును నచ్చినది.

1916 అనంతరము రామమూర్తిగారు 'తెలుగు' అను మాసపత్రికను నెలకొల్పి అందులో వ్యావహారిక భాషావాదమునకు అనుకూలములైన వ్యాసములను, 'పండిత భిషక్కుల భాషా భేషజము' అను వ్యాసమును, "బాలకవి శరణ్య" మనుపేర కవి ప్రయోగములను ప్రదర్శించుచు కొన్ని వ్యాసములను ప్రకటించిరి. 1921 సం. వచ్చుసరికి వారి వాదమును అంగీకరించిన వారు తెలుగుదేశ మంతటను వ్యాపించి యుండిరి. 1925 లో తణుకులో జరిగిన ఆంధ్ర సాహిత్య పరిష ద్వార్షికోత్సవ సందర్భములో చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి మున్నగు కవి పండిత దిగ్గజముల సమక్షములో రామమూర్తిగారు వ్యావహారిక భాషా వాదమును సమర్థించుచు మహోపన్యాసము గావించిరి. వారి వాదమును ఎదిరించుచు ఎవరును సభాముఖమున ప్రసంగింపలేదు. ఈ వాదమునకు అనుకూలమైన తీర్మానము గూడ సభాసమ్మతమైనది.

దేశమందు దినదిన ప్రవర్థమానముగా వ్యాపించు చుండిన వ్యావహారిక భాషోద్యమమును గ్రాంథిక వాదులు అరికట్టలేకపోయిరి. వందల కొలదిగా గ్రంథములు వాడుక భాషలో రచితములగుచుండెను. వ్యావహారిక భాషను ఆమోదించి, అందులో గ్రంథరచన సాగించుటకై ఏర్పడిన సాహిత్య సమాజము, నవ్యసాహిత్య పరిషత్తు వర్ధిల్లి, వాడుకభాషలో గ్రంథములను తగిన వారిచే రచియింపించినవి.

రామమూర్తిగారు అస్వస్థులై చికిత్సకొరకు మద్రాసు చేరి 1940 జనవరి 20 వ తేదీన స్వర్గస్థులైరి. తన జీవితకాలములో తమ భాషా వాదమును ప్రభుత్వమువారు, విశ్వవిద్యాలయములవారు అంగీకరింపకపోయినను, ప్రజా బాహుళ్య మామోదించినందులకును, రచయితలు, పత్రికాధిపతులు దానిని శిరసావహించి ఆచరణయందు పెట్టు చున్నందులకును రామమూర్తిగారు ఆనందమును ప్రకటించిరి.

రామమూర్తిగారు 1910-12 లో సవరభాషకు సంబంధించిన గ్రంథములను తెలుగు లిపిలో రచించిరి. వీటిని మద్రాసు ప్రభుత్వమువారు ప్రకటించి రామమూర్తిగారికి ' రావుసాహెబ్' బిరుదము నొసంగిరి. అనంతరము 1929-31 లో రామమూర్తిగారు ఇంగ్లీషు-సవర, సవర-ఇంగ్లీషు నిఘంటువులను 'సవరమాన్యుయల్ 'ను ఇంగ్లీషు భాషలో రచింపగా, వాటినిగూడ మద్రాసు దొరతనమువారే ప్రకటించి, రామమూర్తి గారికి 'కైజర్-ఇ-హింద్' బంగారు పతకమును 1934 లో ఇచ్చి గౌరవించిరి.

1934 లో రామమూర్తిగారి సప్తతితమ మహోత్సవము రాజమహేంద్రవరములో నవ్య సాహిత్య పరిషత్తువారు జేగీయమానముగా జరిపినారు. ఆ ఉత్సవము నాటికి నవ్య సాహిత్య పరిషత్తువారు ఈ క్రింది అయిదు గ్రంథములు ప్రకటించి రామమూర్తిగారికి కానుకగా సమర్పించినారు.

1. “వ్యాససంగ్రహము” ఇందులో ఇతరులు రచించిన వ్యాసములుక లవు.

2. రామమూర్తిగారు రచించిన వ్యాసములు-కొన్ని ఇంగ్లీషులో నున్నవి. కొన్ని తెలుగులో నున్నవి. అన్నియు భాషకు సంబంధించినవే.

3. “పండితభిషక్కుల భాషాభేషజము"- రామమూర్తి కృతము.

4. "బాలకవి శరణ్యము"-రామమూ ర్తికృతము.

5. “గద్యచింతామణి" - రామమూర్తిగారు సంప్రతించినది. ఇందులో చిన్నయసూరికి ముందుకాలము నుండియు వాడుక భాషలో రచితములయిన గ్రంథముల నుండి రామమూర్తిగారు ఎత్తిచూపించిన తునుకలుగలవు.

రామమూర్తి గారు ఉదార స్వభావులు. హరిజనోద్యమము పుట్టక పూర్వమే చాలకాలము క్రిందట హరిజనుల వలెనే అంటరానివారుగా ఉండిన సవరల పిల్లలను నలుగురిని వారు తన యింట నుంచుకొని, వారికి విద్య నేర్పించిరి. విధవా వివాహములను, స్త్రీలకు ఉచిత విద్యాలయములను ప్రోత్సహించిరి. యువతీ వివాహములను ప్రోత్సహించు 'శారదా చట్టము'నకు అనుకూలముగ పనిచేసిరి. వీరి శిష్యులు, ప్రశిష్యులు, అభిమానులు ఈనా డాంధ్రదేశమందు పెక్కురు గలరు. వీరికి నలుగురు కొడుకులు - సీతాపతి (ఈ వ్యాస రచయిత) వీర రాజు, రామదాసు, సూర్యనారాయణ అనువారలు కలిగిరి.

గి. వేం. సీ.