Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గాల్టన్ ఫ్రాన్సిస్

వికీసోర్స్ నుండి

గాల్టను ఫ్రాన్సిస్ :

సర్ ఫ్రాన్సిస్ గాల్టను పందొమ్మిదవ శతాబ్దమునకు చెందిన బ్రిటిష్ శాస్త్రజ్ఞులలో అగ్రగణ్యుడు. గాల్టను యొక్క బహుముఖప్రజ్ఞ ఇతడు గావించిన అనేకములైన పరిశోధనములలో ప్రస్ఫుటముగ కనిపించుచున్నది. శాస్త్రదృష్టితో సంకలితమయిన గాల్టనుయొక్క అభిరుచుల ప్రభావము మనస్తత్త్వ శాస్త్రమునందలి పెక్కు నంశములపై ప్రసరించెను. ఆతనియొక్క విజ్ఞానప్రభావము బ్రిటిషు, అమెరికను దేశములందలి మనస్తత్త్వ శాస్త్ర పరిశోధనలపై విశేషముగ అభివ్యక్తమయినది.

గాల్టను 1822 వ సం. ఫిబ్రవరి 16 వ తేదీన బర్మింగుహామునందు జన్మించెను. విద్యాభ్యాసానంతరము ఇతడు ఆఫ్రికాఖండమునందు 1845-55 సం.ల మధ్య కాలమున మానవశాస్త్రము (Anthropology) నందు పరిశోధనము కావించెను. 1853 వ సం. లో “దక్షిణాఫ్రికా పరిశోధనలు" (An Explorer in Tropical South Africa), అను గ్రంథమును, 1855 వ సం. లో "కళా విహారము" (Art Travel) అను గ్రంథమును రచించెను.

పిదప గాల్టను వాతావరణశాస్త్రము (Meteorology) నందు పరిశోధన మొనర్పగడగెను. వాతావరణ పటములను శాస్త్రపద్ధతి ననుసరించి నిర్మించుటయందు గాల్టను మొట్టమొదటివాడని చెప్ప వచ్చును. 'ప్రతిచక్రవాత' (Anticyclones) సిద్ధాంతమును మొదట స్థిరీకరించినవాడు గాల్టనే.

ఈ కాలమున తన బంధువగు డార్విన్ వ్రాసిన 'జీవరాసుల పుట్టుక' (Origin of Species), అను గ్రంథ (1859) పఠనముచే ఉత్తేజితుడై గాల్టను మానవశాస్త్ర (Anthropology) పఠనమునందు నిమగ్నుడయ్యెను.

గాల్టను తన జీవితమునందలి విశేష భాగమును మనస్తత్త్వ శాస్త్రమునందలి వివిధ విషయములలో పరిశోధన మొనర్చుటయందే గడిపెను. వ్యక్తి భేదములను (Individual Differences) గూర్చి సంఖ్యాశాస్త్ర (Statistics) సహాయమున పరిశోధనము చేయదొడగెను. మానవలక్షణముల (Human traits) పై సంఖ్యాశాస్త్ర ప్రయోగమును గావించి పరిశోధనములను కొనసాగించినట్టి ఖ్యాతి మొట్టమొదట గాల్టనునకే దక్కినది. జీవాభివృద్ధి శాస్త్రము (Eugenics) నకు గాల్టను జనకుడుగా పరిగణింపబడు చున్నాడు.

గాల్టను, వంశపారంపర్యముగా సంక్రమించు మానవ లక్షణములపై పరిశోధనములను సలిపి కొన్ని ముఖ్య విషయములను నిర్ణయించెను. ప్రతిభ, బుద్ధిమాంద్యము, వంశానుగతములు అను విషయము ఇతడు కనిపెట్టెను. వంశానుగత లక్షణములయొక్క తీవ్రత గణితశాస్త్ర సహాయమున కనుగొనుటకు కొన్ని పద్ధతులను గూడా ఇతడు కనిపెట్టెను. ఈ పరిశోధనముల సహాయమున ఇతడు జీవాభివృద్ధిశాస్త్రము (Eugenics) నకు పునాదులు వేసెను.

జీవాభివృద్ధిశాస్త్రవిషయమున ఇతడు ప్రతిపాదించిన వాదము చరిత్రాత్మక మయినది. మానవజాతి సక్రమాభివృద్ధి సంపాదింపవలయునన్న, అర్హులే సంతానమును కను పద్ధతిని ప్రోత్సహించి, అనర్హులయినవారు సంతానోత్పత్తి చేయకుండ నిరోధించుట ఉత్తమ మార్గమని ఇతడు వాదించెను. ఉత్తమ మానవలక్షణములు ఎట్లు వంశానుగతములగునో తెలుపుటకు, గాల్టనువంశమును తార్కాణముగా తీసికొనవచ్చును. వెడ్జివుడ్, డార్విను, గాల్టను అనువారి వంశములలోని వ్యక్తులు రాయల్ సంఘములో వరుసగా ఐదు తరములు సభ్యులుగా నుండిరి.

గాల్టను తరువాత ఇతని స్నేహితుడు కార్ల్ పియర్సను (Karl Pearson) అను నాతడు ఈ పరిశోధనములను కొనసాగించెను. వీరిద్దరును, ఒక తరములో నిర్దిష్టములయిన లక్షణములు గల తల్లిదండ్రులకు కలుగు సంతానమునకును, వారి తరువాతి తరములలో ఉద్భవించు సంతానమునకును, దాదాపుగా ఏర్పడగల లక్షణములను ముందుగనే సూచించు కొన్ని పద్దతులను గూర్చి పరిశోధనములు సాగించిరి. గాల్టను తన పరిశోధనములలో ఉపయోగించు విషయసేకరణకై ఒక ప్రశ్నావళి పద్ధతిని (Questionaire method). మానసిక లక్షణములను నిర్ణయించుటకై కొన్ని మానసిక పరీక్షలను (Mental test) ఏర్పరచెను. ఈ మానసిక పరీక్షలలో ఉయోగించుటకై కొన్ని పరికరములను కూడ ఇతడు నిర్మించెను. వీటిలో ముఖ్యమైనది—(1) గాల్టను ఈల (Galton whistle). ఇది శబ్దగ్రహణ పరిమితిని నిర్ణయించుటకు తోడ్పడును. (2) గాల్టన్ బార్ (bar). ఇది ప్రతివ్యక్తి యొక్క దృష్టి పరిమితిని నిర్ణయించుటకు ఉపయోగించును.

గాల్టను ఈ క్రింది విషయములపైగూడ పరిశోధనములను సాగించెను. (1) రంగులు - కొన్ని రకముల దృష్టి లోపములు వాటి పరస్పర సంబంధము (colour blindness), (2) మానసిక ఊహా చిత్రణములు (mental imagery), (3) సహజ ప్రవృత్తులు (instincts), (4) నేరస్థుల లక్షణములు - చేతి వేలిముద్రలను బట్టి నేరస్థులను పట్టుకొను ఒక శాస్త్ర పద్ధతి.

గాల్టను జె. డి. హెచ్. డిక్సను అను నాతని సహాయమున సంఖ్యాశాస్త్రమున తరచుగ ఉపయోగించు పరస్పర సంబంధ సిద్ధాంతమును (Statistical Correlation) కనిపెట్టెను. తండ్రుల యొక్కయు, పుత్రుల యొక్కయు ప్రజ్ఞ (intelligence) లను నిర్ణయించు పద్ధతిలో గల పరస్పర సంబంధమును ఇతడు పరిపరిశోధనముల ద్వారమున తెలిసికొని పై సిద్ధాంతమును కనిపెట్టెను.

1904 వ సంవత్సరమున లండను విశ్వవిద్యాలయము నందు జీవాభివృద్ధి (Eugenics) శాస్త్రపరిశోధన కార్యములకై ఇతడు కొంత ధనమును పరిశోధన భృతిగా ఏర్పరచెను. ఇదే, తరువాత "ఫ్రాన్సిస్ గాల్టను జాతీయ జీవాభివృద్ధి పరిశోధనాలయము"గా రూపొందెను. ఈ సంస్థ ఉపన్యాసములను, పరిశోధనములను ప్రచురణముల రూపమున విడుదల చేయుచుండును. 1908 లో ఇతడు జీవాభివృద్ధి విద్యాసంస్థ నొకదానిని స్థాపించెను. ఈ సంస్థచే కావింపబడిన జీవాభివృద్ధి విమర్శనములను వెలువరించు 'త్రైమాసిక పత్రిక' (Eugenics Review) మిగుల విఖ్యాతి కాంచినది.

గాల్టను రచించిన గ్రంథములలో ముఖ్యమయినవి : (1) వంశానుగత మేథావి (Hereditary genius-1911) (2) మానవలక్షణ పరిశోధనము (Inquiries in Human Faculty-1883), (3) వంశలక్షణముల చరిత్ర (Records of Family Faculties-1884), (4) జాతిపారంపర్యము (National Inheritance-1889), (5) చేతి వ్రేలి ముద్రలు (Finger Prints-1892), (6) ప్రఖ్యాత కుటుంబములు (Noteworthy Families-1906), (7) జీవాభి వృద్ధిపై వ్యాసములు (Essays in Eugenics-1909).

1909 వ సంవత్సరమున గాల్డన్‌నకు 'సర్' అను బిరుదము లభించెను. ఇతడు 1911 వ సంవత్సరము, జనవరి 17 వ తేదీన మరణించెను.

కె. రా.