Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గానసాహిత్యము

వికీసోర్స్ నుండి

గానసాహిత్యము :

భారతీయ సంగీతము ప్రాచీనకాలమునుండి సంస్కృత భాషారచిత గేయఫణుతుల నాశ్రయించి యున్నది. వైదికగానము సంస్కృతమయములగు మంత్రముల నాశ్రయించినది. భరతుని కాలమునుండి శార్జ్గదేవుని కాలమువరకు గేయఫణుతు లన్నియు సంస్కృత సాహిత్యయుతములుగానే ఉన్నవి. జయదేవుని అష్ట పదులును, నారాయణతీర్థుని శ్రీకృష్ణలీలాతరంగిణియు గీర్వాణభాషామయములే. కాలక్రమమున దేశభాషా సాహిత్యములతో గూడిన గేయములు సంగీతయుతము లైనవి. ఆంధ్రభాషయందు మనుచరిత్ర, వసుచరిత్రల వంటి ప్రబంధములు అలంకార భూయిష్ఠములుగను, రసవద్ఘట్టయుతములుగను, బహువిధ భాషాచమత్కార సహితములుగను వెలసి యున్నట్లు ప్రాచీన సంగీత వాఙ్మయమున బహువిధములగు ప్రబంధము లనబడు గేయఫణుతులు వెలసి యున్నవి. శార్ఙ్గదేవుడు రత్నాకరమున సుమారు నూరు ప్రబంధముల లక్షణములను దెల్పి కొన్నిటికి స్వర సాహిత్య రూపముల నుదాహరించి యున్నాడు. ఏలలు, రాసలక్షణము, వర్ణస్వరము, రాగ కదంబము, శ్రీరఙ్గ ప్రబంధము, పంచతాళేశ్వరము, గీతములు, లక్షణగీతములు, త్రిపద, షట్పద, అష్టపది, హంసలీల, సింహలీల మొదలగు నూరు ప్రబంధములు తెలుపబడినవి.

భారతీయ సంగీతము కాలక్రమమున హిందూస్థానీ, కర్ణాటకసంగీతములని రెండు విధములుగ ఏర్పడి వాడుకలో నున్నది. కర్ణాటక సంగీత విభాగ మేర్పడిన తరువాత దేశభాషా గేయఫణుతులు విపరీతముగ ఏర్పడినవి. కర్ణాటక సంగీతమునందలి గేయఫణుతులలో గీతములు, వర్ణములు, కీర్తనలు, పదములు, జావళులు, రాగమాలికలు, దరువులు, తిల్లానలు, యక్షగానములు, అధ్యాత్మ రామాయణకీర్తనలు, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు, శ్రీ భద్రాద్రి రామదాసు మొదలగు మహాభక్తులు రచించిన కీర్తనాదులు పెక్కులు, రసవంతములుగ ఏర్పడియున్నవి. ఈ గేయఫణుతులన్నియు శుద్ధ సంస్కృతములును, సంస్కృతాంధ్ర మిశ్రితములు నగు సాహిత్యములలో నున్నవి. ఈ గేయఫణుతులయందు విశేషించి సలక్షణమగు భాషయే గ్రహింపబడినది. అచ్చటచ్చట గ్రామ్య పదప్రయోగములు రంజకత్వము కొరకు చేయబడినవి.

ఈ కర్ణాటక సంప్రదాయమున శాస్త్రీయ సంగీతమనియు, లలితసంగీతమనియు రెండురీతులు గలవు. లలితసంగీతమని పాడబడు పాటలు లక్షణవిరుద్ధ భాషా ప్రయోగయుతములుగ నున్నవి.

కర్ణాటక సంగీత సంప్రదాయమున వాగ్గేయకారు లందరు సంస్కృతాంధ్ర భాషాపాండిత్యముగల వారలు. వీరిలో శ్రీనారాయణ తీర్థులు, శ్రీ క్షేత్రయ, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామశాస్త్రి, శ్రీ సుబ్రహ్మణ్య కవి, శ్రీ భద్రాచల రామదాసు అనువారి రచనలే కర్ణాటక సంగీతమును శోభింపజేయు చున్నవి. ఈ రచనల యందలి భాషను విచారించినచో గానసాహిత్య విశేషములు తేటతెల్లముగ దెలియనగును.

కర్ణాటక సంగీతమందలి గీతముల సాహిత్యములు చాలవరకు కన్నడభాషలో నున్నవి. శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రులుగారి గీతములు సంస్కృత భాషయందే రచింపబడినవి – వీరాంధ్రులు. ఆంధ్రదేశమున సంచారము చేయుచు ఆయా పుణ్యక్షేత్రములందలి ప్రధాన దేవతలను గూర్చి గీత కీర్తనాదులు రచించిరి.

బిలహరి గీతము :


పాలయ నాగేశ్వర - వంది బుధావళి
పారిజాత నమామి తవచరణం

వాంఛతిధీరపిమే గాన వై ఖర్యా మహిమానం తవ గాతుం కృష్ణాతటవాసిన్ కదళీవనమందిరజయ రే.

ఈ గీతము కృష్ణాతీరమందు కృష్ణా జిల్లా దివి తాలూకా లోని పెదకళ్ళేపల్లి అను అగ్రహారములోని నాగేశ్వర స్వామిపై చెప్పబడినది. ఇట్టివి వందలకొలది గీతములను వ్రాసియున్నాడు. వాటియందు సంస్కృతసాహిత్యము లోని సొగసు లన్నియు చేర్చబడి యున్నవి. వర్ణముల సాహిత్యములలో అచ్చ టచ్చట పటిష్ఠమైన తెనుగు సాహిత్యములు గలవు. శంక రాభరణ రాగమున ఆట తాళ వర్ణములో. పాపము ! అపార మధుపాళుల ఎడ కృ పారహితమై సపా యనుచు పాటలను పాడు, చెలి పాలిటి కపాయ మగు పొటిగను (పా) స్వరజతులయందు గూడ (1) కుంద ముకుళ రద, సురబృంద వినుత పద, భువిలో వర దాయకి గద, నామొఱలు చెవులను వినవా గిరిసుత. (2) నీపవననిలయా, సురసముదయాకర, విధృత కువ లయ, మదదనుజవారణ మృగేంద్రార్చిత, కలుష దహన, ఘనాపరిమిత వైభవము గల నీ స్మరణ మదిలో దలచిన జనాదులకు బహుసంపదల నిచ్చే విభుడు మా కభయ మియ్యవే. ఈ పై వి శ్రీ శ్యామశాస్త్రిగారి స్వరజతులలోని రచనలు. దార్థాలం కారయుతములు .

ఇవియు శబ్దా

ఇక కీర్తన రచనా విశేషములు, కర్ణాటక సంగీత త్రిమూర్తులలో శ్రీ ముత్తుస్వామిదీక్షితులవారు తమ గేయముల నన్నిటిని సంస్కృత భాషయందే రచించిరి. “సహితానాం భావః సాహిత్యం" అను సంస్కృతో క్తి ననుసరించి సర్వశాస్త్ర భావములతో గూడినదియే సాహిత్య మనబడును. ఈ నానుడి ననుసరించినవి. దీక్షితులవారి కీర్తనముల సాహిత్యములు. వేదాంత శాస్త్ర, మంత్రశాస్త్ర, జ్యోతిశ్శాస్త్ర, అలంకారశాస్త్ర సంప్రదాయములతో నిండియున్నవి. "శ్రీ వరలక్ష్మీ" అను శ్రీరాగ కీ ర్తనమున : సారసపదే, రసపదే, సపదే, పదేపదే" అను ప్రయోగమును ; “మా యేత్వం" అను తరంగిణి రాగ కీ ర్తనలో “సారసకాయే, రసకాయే, సకాయే" అను నదియు; "త్యాగరాజ యోగవైభవం" అను కీర్తనలో "త్యాగరాజ యోగ వైభవం, అగరాజ యోగ వైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం, భవం, వం" అను ప్రయోగమును; "శం. ప్రకాశం, స్వరూప ప్రకాశం, తత్త్వస్వరూప ప్రకాశం సకల తత్త్వస్వరూప ప్రకాశం" అను ప్రయోగమును శబ్దాలంకార విలసిత ములై భాషా చమత్కృతిని దెల్పుచున్నవి. వీరి కీ ర్తనము లలో ఇట్టి ప్రయోగములు అసంఖ్యాకములు గలవు. నవావరణ కీర్తనములు మంత్రశాస్త్ర సంప్రదాయము లతో నిండి యున్నవి. నవగ్రహ కీర్తనములు, జ్యోతి శ్శాస్త్ర సంప్రదాయములతో నిండియున్నవి. అ శాస్త్ర సంప్రదాయముల నెరిగినవారు కాని వీరి కీర్తన ముల అర్థమును గ్రహింపజాలరు.

శ్రీ శ్యామశాస్త్రులవారి కీర్తనములు ప్రౌఢసాహిత్య శోభితములు; సంస్కృత సమాస భూయిష్ఠములు ; శబ్దాలంకార విలసితములు; ప్రశస్త భావపూరితములు. సావేరి కీ ర్తనలో : “ధారాధర వినీల కచలసితా - సరస కవితా నిచితా సార ఘనసార సిత - దరహసితా వారిరుహ వారి వదనో చిత వాగీశ వినుత భృతనత నారాయణి శ్యామకృష్ణ నుత నా-మనవిని విను గిరిసుత దురుసుగా కృపజూచి సంతత మరోగ దృఢశరీరినిగ సల్పు నను" వీరి కీ ర్తనము లలో పలుతావుల ఇట్టి ప్రౌఢ భాషా పరిశోభితములును, రసవంతములు నగు వాక్యములు గలవు. ఈ రచనలు మనుచరిత్ర రచనా తుల్యములని తెల్ప సందియము లేదు.

శ్రీ త్యాగరాజస్వామి కీర్తనలు ఆంధ్రభాషా సాహి త్యము యొక్క ఉత్తమ లక్షణములతో అలరారుచున్నవి. మరియు ఆంధ్రభాషలోని రసవంతములైన సామెతల తోను జాతీయములతోను తులదూగుచున్నవి. శ్రీ త్యాగ రాజ స్వామియు, వారి పూర్వులును చిరకాలము నుండి తమిళ దేశ వాసు లగుటచే, ఆ భాషలోని జాతీయ ములనుగూడ శ్రీ స్వామివారు తమకీ ర్తనములలో ప్రయోగించిరి. వీరి కీర్తనములందలి సుందర భాషా ప్రయోగములకు ఉదాహరణములు : అఠాణకీర్తన : కీర్తన: “బాల కనకమయ చేల, సుజనపరిపాల, శ్రీరమా లోల, విధృతశరజాల, శుభదకరుణాలవాల, ఘననీల నవ్యవనమాలికాభరణ ॥ ఏల నీదయ రాదు ?" ఆరభికీ ర్తన : "శ్రీ వేంక టేశ ! స్వప్రకాశ! సర్వోన్నత! సజ్జన మానస ని కేతన ! కనకాంబరధర ! లసన్మకరకుండల విరాజిత ! హరే! యనుచు నే పొగడగా ! త్యాగ రాజ గేయుడు ! మాన వేంద్రుడైన రామచంద్రుడు ॥ సమయానికి॥ కన్నడరాగ కీ ర్తన : “ఆశాపాశముల దెగకోసి, యన్నియు మది రోసి, కర్మము బాసి, నిను కరుణావారాశియని పూజ జేసి, దుస్సంగతి జేసి, మేనుగాని జెందక, శ్రీశ ॥ దేవా ధీశ, నిను కాశీశ సుతుడని ఆశ నీయెడ నీశ భ క్తియు జేసినవారి ॥ కిదే భాగ్యముగాక ఏమియున్నది రా " మరొక కీ ర్తరములో : “జనక జామాత వై జనక జామాత వై జనకజాలము చాలు చాలును.” బేగడకీ ర్తన : 66 “జ్యాపరనుత ! జ్యాజాపర! బిడౌజావరజా! శ్రిత త్యాగరాజ ! జ్యావరాజ రుద్రావనీసుర! భావనీయ! మునిజీవనానిళము ॥ నీపద పంకజములనే నెర్వ నమ్మినాను " రాగ తాళగతులకు "ఆబోతుకు నటుకులు రుచి తెలియున; తవిటికి రంకాడ బోయిన, కూటి త ప్పేల కోతి గొనిపోయినట్లు" ఇట్టి లోకోక్తులు పెక్కులు త్యాగ రాజుల వారి గాన సాహిత్య మున ఇమిడియున్నవి. కల్గింపని భక్త్యావేశమును, సాహిత్యభావములు శ్రీ త్యాగరాజస్వామి కీర్తనము లలో నిండియున్నవి. భంగము నాటంక పరుపని ఇంపగు

అధ్యాత్మ రామాయణ కీర్తనల సాహిత్యము మంజుల పద లసితము ; అనుప్రాసాద్యలం కార బంధురము . సంగీత సాహిత్య నిపుణులు గానివారు లయబద్దముగ, రంజకముగ ఈ కీర్తనల గాన మొపర్పలేరు. ఉదా : బాలకాండలో బేగడ రాగమందలి కీర్తనలో ఒక చర ణము—విశ్వామిత్ర సహితులై రామలక్ష్మణులు సీతా స్వయంవరమునకు పోయిన వృత్తాంతము — “రంగదభంగ తరంగ గంగ ను ప్పొంగుచు దాటి -వి దేహ రాజపురి చెంగట రాగ నెరింగి జనకుడు చె లంగుచు నెదురుగను రంగుగజని గా ధేయునకును సా ష్టాంగ మెరిగి పూజించి దిశలు వెలు గంగజేయు చంద్రసూర్యులో, సుర పుంగవులగు నరనారాయణులో, శృంగారకళల బంగారుతళుకు ల నంగాను తగిన వీర లెవ్వ రె రుంగవలయునన, దశరథాత్మజులు మంగళకరులీ రామలక్ష్మణులు మహాభుజుల్ ఘనులని ముని డెల్పెను వినీలవేణి వినుత గుణశ్రేణి.”

మొవ్వగోపాల పదముల రచించిన క్షేత్రయ్య పద ముల సాహిత్యము ఇంపుసొంపులతో గూడిన తెలుగు నుడికారములతో ఒప్పారుచున్నది. ఈ పదములు రస మంజరి యను నలంకారశాస్త్రము ననుసరించి నాయికా భేదములకు రసలక్షణములకు లక్ష్యములుగా రచింప బడినవి. ఇంత రసవంతమైన తెనుగుపదముల కూర్పు మరి ఇతర గేయకారులు కవితయందు గానబడదు. నేటి కాలపు భాషా విమర్శకులు ఈ పదములు సాహిత్య మును బహువిధములు కొనియాడిరి. మచ్చున కొక ఉదాహరణము :

యదుకుల కాంభోజి - ఝంపె : ప. అలిగియుండుట కేమి కారణమో తెలిసి నీ వరిగి రాపోవె ఓ భామా ! చెలువ యిదివరలో మొవ్వ గోపాలునికి చేసిన యపరాధ మేమో ఓ చెలియ. చ. 1. అందందు దిరిగి రావలసి వచ్చిన వేళ చందురు కావి పసిడంచు సరిగపయ్యెద సరవి తడియొ త్తగ లేదా అంకురము లొదవ సురటిమై చెమటలార్పగ లేదా గంధము పునుగు కస్తూరి జవాది కుచతటముల మై నలదగ లేదా ఓ చెలియా చ. 2. కురులు కూడియు కూడ నటువంటి తొలినాడే కూడి నెనఱుంచగ లేదా కరుణతో నిను నెల్లకాలమును విడువక నే కాచు కొమ్మనఁగ లేదా వరుసతో దాను నేమించు నూడిగ లెల్ల వడివడిగ సేయగ లేదా మరు కేళి వేళ నే నెదురెదురుగ వెన్నుగూడి పెదవిని నొక్కగలేదా ! ఓ చెలియ.

మను, వసుచరిత్రాది ప్రబంధ సాహిత్యమునకు, గాన సాహిత్యమునకు, విశేష తారతమ్యము గలదు. ఆశ్రవ్య ప్రబంధములు శృంగార వీర కరుణాది రసతరంగితములు; ఆష్టాదశ వర్ణనాలంకృతములు; చిత్రబంధ కవిత్వ రచనా సంకలితములు; ప్రౌఢాంధ్ర భాషాజ్ఞానో త్పాదక ములు; ఉత్తమ నాయికా నాయక లక్షణో పేతములు; నానా లంకార భూయిష్ఠములు; ద్రాక్షాది త్రివిధపాక పరిపక్వ ములు; నాయికలు పాదాది కేశాంతవర్ణనలతో గూడిన వియు నై యుండును. గోపి

గాన సాహిత్యము విశేషించి భ క్తిరస ప్రధాన మై యుండును. ఇందు నవవిధ భక్తులగు “తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వంద నార్చన ముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం బను నీ తొమ్మిది భ క్తి మార్గముల" స్వరూపము గుంఫితమై యుండును. భగవద్గుణాను వర్ణనముతో నిండి యుండును. జ్ఞాన వై రాగ్య బోధక మైయుండును. పద ముల యందలి, జావళుల యందలి సాహిత్యము కలు చేసినట్టి శృంగారభక్తియుతమై యుండును. భ క్తుడు తన్ను నాయికగా భావించి, పరమాత్మను నాయకునిగ నెంచి తనపరితాపమును ఆతనితో దెల్పు శృంగార భక్తి విషయమే ఈ పదజావళుల సాహిత్యముచే ప్రకటితమగు చున్నది. ఈ గేయఫణుతులన్నియు తాళ -ఆవృత్తము లోని అక్షరముల పరిమితి ననుసరించి యతిప్రాసాది లక్షణములతో గూడియున్నవి. వీటిలో గొన్నిటికి గణ నియములు లేవు. ఆద్యంతాక్షర నియమములు కూడ గల్గినవిగలవు. దీక్షితులవారి కీర్తనములలో ప్రతి పాదము నకు ఇట్టి ఆద్యంతాక్షర నియమముగలదు.

ఇంక జానపదగీతముల సాహిత్యమునకు గూడ ఒక విధమగు ప్రత్యేకత గలదు. స్త్రీలు పాడుకొను లంకా యాగము, కుచ్చలకథ మొదలగునవి కూడ హృద్యమైన, సులభ మైన భాషావి శేషములతో గూడి యున్నవి. ఆంధ్ర వాఙ్మయమున ఈ గాన సాహిత్యమునకుగూడ నొక యర్హాస్థానము గలదనుటలో సందేహము లేదు.

చి. వే. శ.