Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గానశాస్త్ర చరిత్ర

వికీసోర్స్ నుండి

గానశాస్త్ర చరిత్ర :

ప్రాచీన కాలముననే ఈజిప్టు, గ్రీసు, మున్నగు దేశముల వారికి భారతీయ సంగీతము ఆదర్శకముగ నుండెనని హెల్ము హోల్ట్సు (Helm Holts), బ్లెస్ రినా (Blessrina) మున్నగు పాశ్చాత్య శాస్త్రజ్ఞులు తెలిపిరి. గానశాస్త్ర మనగా సంగీత శాస్త్రము. సంగీతము వలన ధర్మము, అర్థము, కామము, మోక్షము అను చతుర్వర్గ ఫలములు కలుగ గలవని చెప్పబడెను. అందు వలన ధర్మము, అర్థము, కామము, అను మూడు పురుషార్థములను మాత్ర మే క లుగ జేయునట్టి దాన, యజ్ఞ,జపా దుల కంటెను సంగీతము ఉత్కృష్ట మైనదిగా చెప్పబడినది. గానము యజ్ఞాంగముగ గూడ వినియోగ మగుచున్నది. పూర్వము బ్రహ్మ ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, అధర్వవేదము అను నాలుగు వేదముల నుండి క్రమముగా వాద్య, అభినయ గీత రసములను సంగ్ర హించి గాంధర్వ వేదమును నిర్మించెను. అట్టి గాంధర్వ వేదమే కాలక్రమమున నాట్య వేదము. భరతము, - తౌర్య త్రికము, సంగీతము అను పేర్లతో వ్యవహరింప బడుచు వచ్చినది. నేడు సంగీతశాస్త్ర మనునది వ్యవహారములో ఉన్నది. గీత, వాద్య, నృత్యముల చేరిక యే సంగీతమని ప్రథమమున నిర్ణయింపబడినది. తరువాత కొందరు గీత వాద్యములు చేరిక యే సంగీతమని వ్యవహరించిరి. నేడు . కేవల గాను పరముగనే ఈ పదము వినియోగమగు చున్నది. గీతము సామవేదము నుండి ఉద్దరింప బడినది. బ్రహ్మ దీనిని భరతమునికి ఉపదేశించెను. పిమ్మట భరతముని తన నూర్గురు కుమారులకు బోధించెను. తదాది కాలక్రమమున అనేకులు ఈ విద్యను ఉద్ధరించుచు గ్రంథములను రచించి యం. (1) పదునైదవ శతాబ్దము వరకు గల గ్రామరాగ కాలము. (2) అప్పటి నుండి పదునెనిమిదవ శతాబ్దము వరకు గల మేళ రాగకాలము. (3) అప్పటి నుండి నేటి వరకు గల ప్రస్తార మేళ రాగ కాలము అని చారిత్రక కాలమును మూడు విభాగములుగ చేయదగును.

గ్రామరాగకాలము (క్రీ.శ. 15వ శతాబ్దము వరకు): గ్రామరాగ కాలమున భాషా రాగ విధానము గాంధర్వ వేదమున కలదు.

పంచభరతులు : శారదాతనయుని " భావప్రకాశము"న పంచభరతులనుగూర్చి చెప్పబడెను. వీరు (1) భరతుడు, (2) మతంగుడు, (8) నంది కేశ్వరుడు, (4) దత్తిలుడు, (5) కోహలుడు అనువారు. (1) భరతుడు: ఇతడు క్రీ. పూ. 4వ శతాబ్దమున “నాట్యశాస్త్రము” ను రచించెను. అందాతడు విశేష ముగ నాట్యమునుగూర్చి చెప్పెను. అందు (1) సాత్త్విక, (2) ఆంగిక, (8) వాచిక, (4) ఆహార్యములు అను విభాగములు గలవి. అది 38 అధ్యాయములు గల గ్రంథము. నాట్యోత్పత్తి, ప్రేక్షక గృహలక్షణము, దైవతపూజ, తాండవలక్షణము. పూర్వరంగము, అంగాభినయము, చారీవిధానము, మండలకల్పనము, గతిప్రచారము, అష్టోకరణములు, నటీనటుల వేషము, అలంకారము, దుస్తులు, వీరి అవస్థాభేదములు, రంగప్రవేశ నిష్క్రమములు, వాచిక విధానము, ఛందోలక్షణము, దశరూపకములు, నాల్గువృత్తులు, ఎనిమిది రసములు, నాట్య ఈ అంశములు అందు విపులముగా ప్రయోజనము చెప్పబడినవి. గాన విషయమున శ్రుతులు, స్వరావళి, స్వరసాధారణములు, మూర్ఛనలు, జాతులు మున్నగు నవి విశదీకరింపబడినవి. (2) మతంగుని "బృహదేశి" అచ్చయినది. అందు భాషాది రాగములు మార్గ సంగీతముగ నెంచి, గ్రామ మూర్ఛనలు, జాతిరాగములు చెప్పెను.

(3) నంది కేశ్వరుని " నందీశ్వర సంహిత నుండి గ్రహింపబడిన ఉదాహరణములు 17 వ శతాబ్దమునాటి “సంగీతసుధ” యందు కలవు. నందికేశ్వరుని గ్రంథము అలభ్యముగ నున్నది. (4) దత్తిలా చార్యుని "గాంధర్వ వేదసారము"న స్వరమూర్ఛనలతో గ్రామరాగములు తెలుపబడెను. ఈ గ్రంథము గూడ అలభ్యముగ నున్నది. (5) కోహలుని “సంగీతమేరు" అను గ్రంథముగూడ అలభ్యముగ నున్నది. స్థాయియందు, అనగా, ఏడు స్వరము లందు 22 శ్రుతులు ఎంచెను. ఏడు భాషారాగములు తెలిపెను. భారతీయ సంగీత సంప్రదాయమునకు ముఖ్య గ్రంథ మగు “నాట్యశాస్త్రము"నకు పెక్కురు వ్యాఖ్యాతలు వెలసిరి. వీరిలో (1) ఉద్భటుడు, (2) లొల్లటుడు, (3) శంకుకుడు, (4) భట్టనాయకుడు, (5) రాహులుడు, (6) భట్ట యంత్రుడు, (7) అభినవగుప్తుడు, (8) కీర్తి ధరుడు, (9) మాతృగుప్తుడు అనువారు ముఖ్యులు • కొందరు నాన్యదేవ, భోజదేవ, సోమేశ్వర, మమ్మటా దులు భరతుని నాట్యమునకు సంబంధించిన వివిధాంశ ములను పురస్కరించుకొని స్వతంత్రగ్రంథములు వెల యించిరి. యథటిక, కీర్తిధరులు భాషా-విభాషాంతర భాషలు అను విధమున మతంగుని మతము ననుసరించి రాగములను విడంబించిరి. నారదుడు 7 వ శతాబ్దమున “సంగీత మకరందము" అను గ్రంథమును రచించెను. అందతడు 22 శ్రుతులు; 29 స్వర తానములు, 93 దేశీ రాగములు, స్త్రీ - పుం నపుం సక రాగములు, 109 చచ్చత్పుటాదులు వివరించెను.

అభినవగుప్తుడు (క్రీ. శ. 1050) : భరతుని నాట్యరీతులు 14 వ శతాబ్దికి అనంతరము దేశ కాలముల ననుసరించి మారుచుండుట వింతగొల్పదు. మార్గ సంగీతము శాస్త్రీయమైనది. దేశి సంగీతము గూడ ఆదరణీయమని ఆయా కాలములందలి శాస్త్రజ్ఞులు చెప్పుచుండిరి. అభినవ గుప్తుడు 96 రాగములను తెలిపి, వాటిని (1) శుద్ధ. (2) భిన్న, (3) గౌడ, (4) వేసారి, (5) సాధారణములు అని పంచవిధములుగ విభజించెను. ఒక శతాబ్దము పిదప 'నాన్యభూపాలుడు' (క్రీ.శ. 1093-1133) అభినవగుప్తుని పంచవిధ రాగములకు భాష, విభాషలను చేర్చి, వాటిని ఏడు విధములుగ చెప్పెను. ఇతడు భరతుని అంతర్భాషలను చెప్పలేదు. శారదా తనయుడు (క్రీ. శ. 1175-1250) : “భావ ప్రకాశన" యందు 104 రాగముల వరకు చెప్పెను. భరతుని భాషాదులనే అనువదించెను. క్రీ శ. 1165 కాలమునాటి పార్శ్వదేవుని “సంగీత సమయసారము"న 108 తాళ ములు, భాషాది రాగ విధానములు చెప్పబడెను. శార్జ దేవుడు (క్రీ. శ. 1210_1247): ఇతడు “సంగీత రత్నాకరము" అను స్వతంత్ర గ్రంథమును రచించెను. షడ్జ, మధ్యమ గ్రామములే కాక, గాంధార గ్రామము కూడ చెప్పెను. కాని అది గంధర్వలోకముననే ఉండినట్లు చెప్పెను. ఇతడు 14 మూర్ఛనలతో గ్రామ రాగముల నెంచి అందు భరతుని వలె ఏడు జాతి రాగములను చెప్పెను. మరియు యకటికుని భాషాదిరాగ విధానము పూర్వోక్తముగా గణించి రాగములను రాగాంగోపాంగ భాషాంగ క్రియాంగములు అను నాలుగు విధముల పేర్చొనెను. మార్గ దేశి రాగముల మొత్తమును 264 గా చెప్పెను. రాగాల ప్తి, రూపకాల ప్తి విధానములు జెప్పెను. ఇతడు

  • భరతుడు చెప్పిన పేర్లకు భిన్నములుగ నున్నవి.

రాగమునకు ". గ్రహాంశతార మంద్రాశ్చ న్యాసా పన్యాసకే తథా ! అపి సన్యాస విన్యాసౌ బహుత్వం చాల్పతా తతః | ఏతా న్యంతర మార్గేణ సహలక్ష్మిణి జాతిషు | షాడవౌడువి తే కాపీ త్యేవ మాహు స్త్రయోదశ" (సం. ర.) అని 13 లక్షణములను చెప్పెను. రాగనిరూపక గమక విషయమున (1) తిరుపము, (2) స్ఫురితము, (3) కంపితము, (4) లీనము, (5) ఆందోళితము, (6) వళి, (7) త్రిభిన్నము, (8) కురీళము, (9) ఉల్లాసితము, (10) ప్లావితము, (11) హుంపితము, (12) ముద్రితము, (13) నామితము, (14) మిశ్రితము, (15) అహతము - అనునవి చెప్పెను. వీటి నిప్పుడును గ్రహింతుము-ఇతడు భరతుని తాళదశ ప్రాణములను, చచ్చత్పుటాది 108 తాళములను వివరించెను. మరికొన్ని తాళములను, స్వక ల్పితమగు నిశ్శంక తాళమును కలిపి 120 తాళములను చెప్పెను.

పాల్కురికి సోమనాథుడు (క్రీ. శ. 1199-1260) : ఇంచు మించు శారదేవుని కాలము నాటి వాడు. ఇతడు తన "పండితారాధ్య చరిత్రమున" గాన విషయము గూడ వివరించుచు ద్వావింశతి శ్రుతుల పేర్లు, ద్వివిధ గ్రామములు, 14 మూర్ఛనలు, 32 శుద్ధతానములు, రాగాంగో పాంగ– భాషాంగ – రాగ విభాగములు సంపూర్ణ షాడవ ఔడవ రాగ విధములు, స్త్రీ - పుం - నపుంసక రాగములు, చచ్చత్పుటాది అష్టోత్తరశత తాళములు, జాతీయ, దేశీయ నృత్యరీతుల వర్ణనలు, ప్రేరణ, ప్రేంఖన, కుండలి, తాండవ లాస్య నృత్యములు, 108 కరణములు చెప్పెను. పెక్కు రాగముల పేర్లు శార్జదేవు డెంచిన చొప్పున ఇతడు తెలిపెను. తిక్కన సోమయాజి కూడ (13వ శతాబ్దము) దేశీయ నృత్యము లిట్లు అర్జునుని నోట పలికించెను. "అభ్యసించితి శైశవ మాదిగాగ దండలాసక విధమును, గుండలియును, ప్రేంఖణంబు తెఱంగును బ్రేరణియును" ఈనాటి కవుల గ్రంథములను బట్టి అప్పటికి వీణ, వేణు, మృదంగములు; ఆనకములు, కాహళము, పటహము, భేరి, ఢంకా, బుడుబుడుక్క, డమరుకము మున్నగు వాద్యములు దేశమున విశ్రుతములై యుండినట్లు తెలియు చున్నది.

జయదేవుడు: 13వ శతాబ్దము నందలి సంగీత శాస్త్ర మును తెలిసికొనుటకు "సంగీత రత్నాకరము వలె లక్ష్య విషయమున జయ దేవుని “గీతగోవిందము" కూడ తోడ్పడును. ఇతడు 24 అష్టపదులందును "మాలవ, ఘూర్జరి, వసంత, రామక్రియ, మాళవగౌడ, కర్ణాట, దేశాఖ్య, దేశవరాళి, గుణకరి, వరాళి, విభాస, భైరవి" అను రాగములును,‘“రూపక, యతి, నిస్సారుక, ఏక, అష్ట తాళము” లును చేర్చి పాడెను. ఇవి భక్త్యను సరణ, నృత్యానుకూల గేయములు. నాయికా నాయక భావభరితముగ నున్నవి. ఈ తాళములు చచ్చత్పుటాది 108 తాళవిధానము లందలివి. అనంతర కాలమున 15వ శతాబ్దము వరకు వేమభూపాలుడు, గోపేంద్ర తిప్పభూపాలుడు, సింగ భూపాలుడు, వసంతరాయలు మున్నగువారు సంగీత గ్రంథములు వెలయించిరి.

ద్వివిధ సంగీతములు: ఇప్పుడు మనకు శ్రుతమగు చున్న హిందూస్థానీ, కర్ణాటక గానరీతులు 15 వ శతాబ్దికి వ్యాప్తిలో నున్నట్లు కానము. మొగలాయి రాజ్యము ఉత్తరమున స్థిరపడినప్పటినుండి హిందూస్థానీ పద్ధతి వెలసినట్లు చరిత్రము వలన తెలియుచున్నది. అప్పటికి పారశీక ఆఫ్ఘన్ స్థానములందలి సంగీత విద్వాంసులు తమ దేశపు ఏలిక లతో ఢిల్లీ ప్రాంతములకు వచ్చి, స్థిరపడి తమగాన విధానమును నెలకొల్ప దొడగిరి. 17వ శతాబ్ది నాటి అక్బరు ఆస్థాన గాయకులైన 'తాన్ సేన్', 'అమీర్ ఖుస్రు', 'రాజామాన్ సింగ్ ' మున్నగువారు 'ధ్రుపద్ ' గానము, 'సారంగ' వాద్యము, హమ్మీర్, కమాచ్, మాల్ కాస్, బేహాగ్, సారంగ్ మున్నగు రాగములు తమ పద్ధతుల చొప్పున ప్రవేశ పెట్టిరి.

మేళరాగకాలము (క్రీ.శ. 15, 16,17,18శతాబ్దములు): విద్యారణ్యులు (క్రీ. శ. 1330-1450) కర్ణాట రాజ్య స్థాపన మొనర్చెను. ఇతడు శుద్ధ వికృత స్వరములను క్రమముగ జేర్చిన పంచదశ మేళ రాగములను* చెప్పిరి. ఇతడు తక్కినరాగములు వీటి జన్యము లని చెప్పెను. గానశాస్త్ర చరిత్ర అనంతరము రామామాత్యుడు మున్నగువారు ఈ పద్ధతిని అనుసరించిరి.

తాల్లపాకవారు : 15, 16 శతాబ్దములందు తాళ్లపాక వారు సంకీర్తన పద్ధతియందు తమ గేయములను దేశీయ రాగములందు పాడిరి. అన్నమాచార్యుడు (1425 - 1503) శృంగార కీ ర్తనలలో, నాయకుని శ్రీ వేంక టేశ్వరునిగను, నాయికను అలి వేలుమంగగను ఎంచి విశ్రుత రాగము లందు రచించెను ఇతని కుమాళ్లు, మనుమలుకూడ కీర్త నలు రచించిరి. ఇప్పుడు ప్రచారమున కొంతవరకు తగ్గిన ఆహిరి, సామంత, పాడి, దేశాక్షి, ఘూర్జరీ మున్నగు రాగములు వీరి కీ ర్తనలందు కలవు. 10వ

రామామాత్యుడు (క్రీ. శ. 1550): “స్వరమేళ కళా నిధి" అను గ్రంథమును రచించెను. ఏడు వికృత స్వరము లలో 9వ శ్రుతిని పంచశ్రుతి ఋషభముగను, 10 వ శ్రుతిని సాధారణ గాంధారముగను, 11వ శ్రుతిని అంతర గాంధారముగను, 12వ శ్రుతిని చ్యుత మధ్య మముగను, 16 వ శ్రుతిని చ్యుత పంచమముగను, 22 వ శ్రుతిని పంచశ్రుతి ధైవతముగను, 1వ శ్రుతిని కై శికి నిషాదముగను, 2 వ శ్రుతిని కాకలి నిషాదముగను తెలి పెను. శుద్ధములతో గూడ చేర్చి (1) ముఖారి, (2) మాళవ గౌళ, (8) శ్రీరాగము, (4) సారంగనాట, (5) హిందో ళము, (8) శుద్ధ రామక్రియ, (7) దేశాయ్, (8) కన్నడ గౌళ, (9) శుద్ధ నాట, (10) ఆహిరి, (11) నాద నామ క్రియ, (12) శుద్ధవరాళి, (13) గౌళ, (14) వసంత భైరవి, (15) కేదార గౌళ, (16) హెజ్జజ్జి, (17) సామ వరాళి, (18) రేవగుప్తి, (19) సామంత, (20) కాంభోజి అను మేళ రాగములను పేర్కొనెను.

సోమనార్యుడు : క్రీ. శ. 1609 వ సంవత్సరమున “రాగ విబోధ" అను గ్రంథమును రచించెను. ఈతని వికృత స్వరములలో (1) చతుశ్రుతి ఋషభము, (2) సాధా రణ గాంధారము, (8) అంతరగాంధారము, (4) షట్రుతి మధ్యమము, (5) చతుశ్రుతి ధైవతము, (6) కై శికి నిషాదము, (7) కాకలి నిషాదము అను వాటిని శుద్ధ ములతో చేర్చి (1) ముఖారి, (2) రేవగుప్తి, (3) సామ " తేషాం మతాః పంచదశ మేలాః" అని సంగీతసుధ అను గ్రంథమున కలదు. 3399 వరాళి, (4) తోడి, (5) నాదనామక్రియ, (8) భై రవి, (7) వసంత, (8) వసంత భైరవి (9) మాళవ గౌళ, (10) రీతి గౌళ, (11) అభేరి, (12) హమ్మీరు, (18) శుద్ధ నాట, (14) శుద్ధ రామక్రియ, (15) శ్రీరాగము, (16) కల్యాణి, (17) కాంభోజి, (18) మల్లారి, (19) సామంత, (20) కర్ణాట గౌడ, (21) దేశాఠీ, (22) శుద్ధ నాట (29) సారంగ అను మేళములు, వీటియందు ప్రచారమునగల 74 రాగములు జన్యములుగ జెప్పబడినవి.

రఘునాథరాయలు : క్రీ.శ. 1614-1683 వరకు తంజా వూరు రాష్ట్రము నేలెను. ఈయన తన “సంగీతసుధ” యందు 15 మేళములు, తజ్జన్యములు చెప్పెను. ఇతడు చచ్చత్పుటాది 108 తాళములు పేర్కొనుటను బట్టి అప్ప టికి సూళాది తాళము లుండియున్నను పూర్వపద్ధతిని త్యజించనివారు కొందరు కలరని తెలియవలెను. నాథనాయకుని వాల్మీకి చరిత్ర అను ప్రబంధమువలన భరతుని 108 కరణములును, తాండవ, లాస్య, ప్రేంఖన, ప్రేరణ, కుండలీ, నృత్యములును దేశమున ఆ కాలమందు సాగుచుండినట్లు విదితమగును. రఘు

ప్రస్తార మేళరాగకాలము (18, 19, 20 శతాబ్దములు) : వేంకటమఖి : ఈతడు గోవింద దీక్షితుల రెండవ కుమా రుడు. “చతుర్దండి ప్రకాశిక" అను సంగీత గ్రంథము రచించెను. ఈతడు (1)చతుశ్రుతి రిషభము, (2) షట్రుతి రిషభము, (3) సాధారణ గాంధారము, (4) అంతర గాంథారము, (5) వరాళి మధ్యమము, (8) చతుశ్ర్శుతి ధైవతము, (7) షట్రుతి ధైవతము, (8) కైశికి నిషా దము, (9) కాకలి నిషాదము అను తొమ్మిది వికృత స్వరములతో శుద్ధస్వరము లేడింటిని జేర్చి 16 స్వరములు తెలిపెను. కాని చతుశ్రుతి రిషభ శుద్ధగాంధారములు ; షట్రుతి రిషభ సాధారణ గాంధారములు; చతుశ్రుతి ధై వత శుద్ధనిషాదములు; షట్రుతి ధైవత కై శికి నిషాదములు ఒక్క స్థానమునందే చెప్పబడుటచేత స్వర స్థానములు పండ్రెండుగ విదితములుగ నున్నవి. వీటిని ప్రస్తరించి శుద్ధ మధ్యమముతో 38 మేళములును, ప్రతి మధ్యమముతో 86 మేళములును మొత్తము 72 మేళము లను ప్రస్తారక్రమముగ వివరించి, వాటియందు లక్షణ గీతములను గూర్చి, వేంకటమఖి మార్గదర్శకు డాయెను.

ఈతని 72 మేళములు 'కనకాంబరి' మున్నగు పేర్లతో కలవు. ఇవి ఇప్పుడు వాడుకలో గల 'కనకాంగి', 'రత్నాంగి' మొదలగు పేర్లకంటే భిన్నములుగ నున్నవి. వేంకటమఖి తన కాలమునాటి మేళము లిట్లు పేర్కొ నెను --(1) ముఖారి, (2) సామవరాళి, (8) భూపాలము, (4) హెజ్జజ్జి, (5) వసంత భైరవి, (6) గౌళ, (7) భైరవి, (8) ఆహిరి, (9) శ్రీ రాగము, (10) కాంభోజి, (11) శంకరాభరణము, (12) సామంత, (13) దేశాక్షి, (14) నాట, (15) శుద్ధవరాళి, (16) పంతువరాళి, (17) శుద్ధ రామక్రియ, (18) సింహారవ, (19) కల్యాణి. ఇతడు తక్కిన రాగములు వీటి జన్యము లనెను.

పురందర విఠలుడు: ఇతడు “సద్రాగ చంద్రోదయము", “రాగమాల" అను గ్రంథములు రచించెను. విద్యార్థులకు వలయు పిళ్ళారి గీతములు, రాగలక్షణము నిలుపు లక్షణ గీతములు, పెక్కు కీర్తనలు కన్నడ భాషలో ఇతడు చెప్పెను. సూళాది సప్తతాళములు విశ్రుతము లగుటకు స్వరాలం కారములను గూర్చెను. నేటికిని ఇవి ఆదరింప బడుచున్నవి.

క్షేత్రయ : తంజావూరు నేలిన విజయరాఘవుని కాల మున (క్రీ శ. 1689-73) నాయికారీతుల చొప్పున శృంగారభావము పుంఖానుపుంఖముగా వెలయ దేశీయ రక్తి రాగములందు వేన వేలు పదములు పాడినవాడు. పదవాఙ్మయమునకు మార్గదర్శకుడు. అంగోపాంగాభి నయము చూరగొను భావము, రాగవిన్యాసాదిక మున విలంబ కాలమున తాళము నడచుట వీటియందు కన నగును. ఈతని మధురభావో పేతములయిన పదములు అనతి కాలముననే దేశమున విశ్రుతములై. నర్తకులకు అమృతతుల్యములై వరలెను. పెక్కు పదములు త్రిపుట, రూపకము, ఆది అను తాళములలో ఇతనిచే చెప్పబడెను. నారాయణతీర్థులు సంస్కృతమున గానయోగ్యముగ "శ్రీకృష్ణ లీలాతరంగిణి" ని రచించెను.

మరికొందరు పదకర్తలు : క్షేత్రయ పదవాఙ్మయ రీతులను అనుసరించి 18. 19 శతాబ్దము లందలి గోవింద సామయ్య, కూవన సామయ్య, మనం సీనయ్య, వీర భద్రయ్య, ఆది అప్పయ్య (క్రీ.శ.1720). సారంగపాణి మున్నగు నాట్యాచార్యులును, గాయకులును పదములు,