Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గాణపత్యము

వికీసోర్స్ నుండి

గాణపత్యము :

మానవుడు నిరతిశయ సుఖము నందుటకు భారతీయ సంస్కృతిలో సోపానములుగ నిర్దేశింపబడిన ఉపాసన మార్గములలో గాణపత్యము ఉన్నతస్థానము వహించి యున్నది. 'ఆదౌ పూజ్యో గణాధిపః' అను ఆర్యోక్తి ప్రకారము మిగిలిన వివిధ దేవతల యుపాస్తికి గణపత్యుపాసన పునాదివంటిది. సుముఖాది స్కంద పూర్వ జాన్త షోడశ నామములను స్మరించినచో, విద్యారంభము, వివాహము, ప్రవేశము, నిర్గమము, సంగ్రామము మున్నగు సర్వకార్యములును నిర్విఘ్నముగ పరిసమాప్తి చెంది ఫలించునని హిందువుల విశ్వాసము.

గణపత్యుపాసనలోని సూక్ష్మాంశములు చాలవరకు విస్మృతప్రాయము లైనట్లు కనపడును. శైవశాక్త తంత్రములందు గణపతి ప్రసక్తి బాగుగనే ఉన్నది. పురాణములందు విపులముగా గణపత్యాఖ్యానములు వివరింపబడి యున్నవి. కేవల గణపత్యుపాసకులు మాత్రము నర్మదా తీరస్థిత ఋష్యాశ్రమము లందును, మలయాళ దేశీయ ఉచ్ఛిష్ట గణపత్యుపాసకు లందును తప్ప తక్కిన ప్రాంతములందు అరుదుగ కాన్పింతురు. మంత్రశాస్త్ర సర్వస్వ మనదగిన శ్రీవిద్య నవలంబించు ఉపాసకులలో గణపతి మంత్రసిద్ధులు ఎందరో నేటికిని కలరు. కాని వారికి అంబికయందే చరమలక్ష్యము.

మాధవాచార్య కృత శంకర విజయనామక గ్రంథ మందును, దానికి వ్యాఖ్యగ ధనపతిసూరి రచించిన శంకర విజయ డిండిమ మందును గాణపత్య మతస్వరూపము నిరూపింపబడి యున్నది. ఈ గ్రంథములను బట్టి గాణపత్యము ఆరు విధములు . ఇవి-మహాగణపతి, హరిద్రా గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, నవనీత గణపతి, స్వర్ణ గణపతి, సంతాన గణపతి అను ప్రభేదములు గల దేవతలకు చెందినవి. ఈ విభాగమునకును శ్రీవిద్యా నిత్యాహ్నికగత పురశ్చరణ ప్రకరణ మందలి పూర్వామ్నాయము ప్రకారము చెప్పబడు షడ్విధ గణపతి మనువులకును ఈషద్భేదమున్నది. ఇందులో మహా గణపతి సనాతనాచార ప్రవర్తకులగు శిష్టజనులచే గ్రాహ్యముగ పరిగణింపబడు చున్నాడు. తక్కిన విభేదములు, ముఖ్యముగ ఉచ్ఛిష్ట గణపతి అధికార భేదమునుబట్టి ఎవరికోగాని సరిపడవని తలపబడుచున్నవి. మొత్తముమీద గాణపత్యము తప్తాంక ధారణమును బోధించుటను బట్టి శ్రీ శంకరాచార్యుల వారిచే నిరసింపబడినది. అయినను, అతప్తాంకము, వేద విరుద్ధము, అద్వైత భావనో పేతము అగు గణపత్యుపాసనము నిషిద్ధముకాదు; మీదు మిక్కిలి అజపామంత్ర తత్పరులకు మూలాధారాది షడ్చక్రములందు గణేశాది ధ్యానము ఆచార్యుల వారిచే విహితముగ ప్రతిష్ఠింప బడినది.

వేదమునందు గణపతి నుద్దేశించిన ప్రార్థనా సూక్తము లెన్నియో ఉన్నవి. కాని గణపతియను నామముతోబాటు బ్రహ్మణస్పతియను నామము ప్రాముఖ్యము దాల్చి యున్నది. ఇది సుప్రసిద్ధమైన 'గణానాంత్వా గణపతిమ్... బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రుణ్వన్నూతిభి స్సీద సాదనం' అనుమంత్రమందు స్పష్టమగుచున్నది. ఈ బ్రహ్మణ స్పతి విఘ్నేశ్వరుడు కాడనియు, ఈ మంత్రమందలి గణపతి పదము గౌణము మాత్రమే అనియు తలప పని లేదు. ఏల యనగా, జైమిని మహర్షి కృత వేదపాదస్తవమందు గణపతి ప్రశంసగల స్తోత్రము : 'విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే' అనునది పై సిద్ధాంతము నిరాధారము కాదని రుజువు పరచుచున్నది. కాలక్రమమున జనబాహుళ్యమునకు సుబోధకములగు పౌరాణిక వర్ణనల మూలముగా విఘ్నేశ్వరుడు, గజాననుడు, లంబోదరుడు మొదలగు గౌణనామములే ప్రచారములోనికి వచ్చి, వైదిక నామములు వెనుకబడ సాగినవని ఊహించ వచ్చును. గణపత్యథర్వశీర్ణోపనిషత్తునందు గణపతి మంత్రస్వరూపము, మాహాత్మ్యము, సర్వదేవ తాత్మకత్వము సువ్యక్తము చేయబడినవి. తైత్తిరీయారణ్యక భాగమగు నారాయణోపనిషత్తులో గణేశునిదగు “ఏకదన్త వక్రతుండదన్తి" స్వరూపము ధ్యేయకోటిలో ఉద్ఘాటింపబడినది. వేద భాష్యకారులుతొలుతనే “వాగీశాద్యా స్సుమనసస్సర్వార్థానా ముపక్రమే ॥ యంనత్వా కృతకృత్యాస్స్యుస్తం నమామి గజాననం" అనియు, "తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తంనో దంతః ప్రచోదయాత్" అనియు ప్రార్థించుటలో గాణపత్యముయొక్క ప్రాధాన్యమును సూచించినారు.

విఘ్నేశ్వరుని సేవచే విఘ్నములు తొలగుట యటుంచి, భూనాయక, ధననాయకులను ప్రార్థించు వారలు భూమిని, ధనమును పొందగలుగు విధముగా, విఘ్ననాయకుని సేవించువారలు విఘ్నములు వినా ఏమి పొందకలరు? అను దురూహచే కాబోలు, సాధారణ జనులు విఘ్నేశ్వరునికొక దండముపెట్టి తమదృష్టినంతను తదితర దేవతలపై కేంద్రీకరించుట కలదు. కాని ఇందులో విఘ్నేశ్వరుని యాధాత్మ్యమును ఎరుగజాలమివిచారింపదగినది.

బ్రహ్మవైవర్తపురాణ మందలి గణపతి ఖండములో 'విపత్తివాచకో విఘ్నః, నాయకః ఖండనార్థకః విపత్ఖండనకారం తం, ప్రణయే విఘ్ననాయకం' అను శ్లోక వివరణము కలదు. ప్రారంభించిన పనికి అంతరాయములు వాటిల్లకుండుటే కాక, సర్వానర్థనివృత్తులు కలుగ జేసి అనాది మాయాసుప్తుడగు జీవునికి పరబ్రహ్మాను సంధానమను ఆనందప్రాప్తి వైపు మొదటి అడుగు వేయించునది గణపత్యుపాస్తియే అని భావము. గణేశ, బ్రహ్మ, విష్ణు, రుద్ర, గౌరులు అను పంచలోక పాలకులను పూజించుటచే, క్రమముగా మనోనిగ్రహము, చిత్తశుద్ధి, ఈశ్వరభ క్తి, యోగసిద్ధి, జ్ఞానము అనుఫలములు ప్రాప్తించునందురు. కాని సాధకుని సమస్త ప్రయత్నములును మనోనిగ్రహ లక్షణాంతములే అని గ్రహింపదగి యున్నది. గణపత్యనుగ్రహము నందిన వానికి తక్కిన మహాఫలములన్నియు ప్రాప్తిప్రాయములే అనవచ్చును. శంకరాచార్యులవారు ఉపాసనలన్నియు సాధన చతుష్టయ ప్రాప్తికేనని చెప్పినారు. గణపత్యుపాసనయు నంతే. గణేశుని వశిత్వసిద్ధి ప్రఖ్యాతము. 'నపార్వత్యాః పరాసాధ్వీ, నగణేశా త్పరోవశీ, నచవిద్యాసమో బంధుః, నాస్తి కశ్చిద్గురోః పరః" అనువాక్యము ఈ ఊహను బలపరచుచున్నది.

గణపతి పురాణము నందును, లీలాఖండమునందును, ఉపాసనా ఖండము నందును కన్పట్టు వర్ణనలను బట్టియు గణపతియొక్క నిఖిల పురుషార్థ ప్రధాన సామర్థ్యము వ్యక్తమగుచున్నది. ప్రణవమే గణపతిగ రూపుదాల్చినదని పౌరాణికో క్తికలదు. ప్రణవము నుచ్చరించియే సకల శ్రుతిసూక్తులును ప్రవర్తించునట్లు, సర్వశాస్త్రములు ప్రణవపదమునే వివరించునట్లు, ప్రణవాత్మకుడగు గణపతి అర్చింపబడిన పిదపనే సకల దేవతా పూజలును సాగి, గణపత్యనుగ్రహముతోనే ఇతర దేవతాభిముఖ్యమును కలుగును.

గణపతి లీలలు ఇరవై యొకటి పురాణప్రసిద్ధములు. విష్ణువు యొక్క దశావతారములవలె ఇవియు భక్తజన మనోరంజకములై యున్నవి. గణపతి జన్మ వృత్తాంతము వివిధ ఘట్టములలో వివిధముగ పేర్కొనబడినది. గౌరీ గాత్రమలజనితు డని మత్స్యపురాణగాథ. శివుని జ్ఞానమహిమ చేతనే కలిగినాడని వరాహ పురాణ గాథ. ఈ రెండింటినుండి తేలు సారాంశమేమనగా : శివపార్వతుల అవినాభావము, సామరస్యము అంత గొప్పదను విషయము. శివభక్తుడగు పరశురామునకును, ఈశ్వరాంతఃపురమునకు ద్వారపాలకుడుగనున్న గణపతికిని ఒకప్పుడు అంతఃపురప్రవేశమునుగురించి వాదోపవాదము జరిగి, యుద్ధముగ పరిణమింపగా, గణపతియొక్క దంత మొకటి పరశురామునిచే పెకలింపబడినయంతట, గణపతి ఏక దంతుడాయెనని చెప్పెదరు. మరియొక పురాణ గాథ ననుసరించి గజాసురుని సంహరింప బూనిన గణపతికి సకలాస్త్రశస్త్రములు విఫలములైనందున తన దంతమునే తీసి దానితో రాక్షసుని సంహరించెనని తెలియుచున్నది. దేవీభక్తులకు పరమేశ్వరియొక్క తనయుడైనను ఎదిరింపగల శక్తి పొడముననియు, అసుర ప్రవృత్తిగలవా డెంత బలశాలియైనను, గణపతి బలమునకు లొంగితీరు ననియు ఈ రెండింటి నుండి తేలు సారాంశము.

గణపతి నేర్పరితనముగల లేఖకుడని ప్రతీతి యున్నది. వేదవ్యాసులు మహాభారత రచనకు ముందు గణేశుని తన లేఖకునిగ నెన్నుకొనెననియు, గణపతి లేఖిని నిలువ నవసరము లేకుండ వ్యాసుని కవితాధార కొనసాగె ననియు, వ్యాసుని అర్ధగాంభీర్యము, గణపతి సర్వజ్ఞత్వ మును మించిపోలేదనియు వినికిడి. దీని స్వారస్య మేమనగా, మహాభారత రచన కొనసాగుటకు శ్రీకృష్ణ పర బ్రహ్మముయొక్క అనుగ్రహము కన్నను గూడ తదభిన్నుడయిన గణపతి ప్రసాదమే ముఖ్యావలంబనమైన దనుట. కృష్ణుడు శ్యమంతక మణిని గురించి అపనిందపాలైన సందర్భములో గణేశపూజ చేసిన పిదపనే నిందలు తొలగెనని స్కాందపురాణ మందు గలదు గదా!

విఘ్నేశ్వరాష్టోత్తరశతనామము లందు 'బ్రహ్మచారిణేనమః' అను నామమును బట్టి కొందరు గణపతికి వివాహము లేదందురు. దుర్వాసముని విరచిత 'ఆర్యా ద్విశతి'లో శ్రీనగర వర్ణన ఘట్టమందు, 'వందే గజేంద్రవదనం వామాంకారూఢ వల్లభాశిష్టం కుంకుమ పరాగశోణం, కువలయినీజారకోరకా పీడం' అని స్తుతింపబడినాడు గణపతి. దీనినిబట్టి ఒకే భార్య అనుకొనవలసి యుండును. కాని సిద్ధి, బుద్ధి అను శక్తులిద్దరు కలరని గణపతి పురాణము. స్కాందపురాణమందు అణిమా, మహిమాది అష్టసిద్ధులను భార్యలుగ గణపతికి ప్రజాపతి యొసగెనని చెప్పబడి యున్నది. నిజము నరసినచో, గణపతి స్వశక్తికు డనకతప్పదు గదా ! ఆ శక్తికి అనేక రూపతయు ఉపపన్నమే యగును.

పార్వతికిని శివునకును చంద్రకళా శేఖరత్వమున్నటులే గణపతికిని కువలయినీజారకోరకాపీడత్వ మున్నదనుటను బట్టి అమృతత్వద్యోతన మున్నది. కావున అమృత పర్యాయమగు బ్రహ్మచారి నామముగూడ సమంజసమే.

శివకుమారుడగు గణపతిని శివారాధకులందరు శిరసా వహించుటేకాక, శివాభిన్నునిగను భావించుచుందురు. బ్రహ్మాండ పురాణాంతర్గత లలితోపాఖ్యానమందు శ్రీనగరవర్ణనావసరమున మహాపద్మాటవికి వెలుపల శతరుద్రులతో నిండిన షోడశావరణములు కలిగి రుద్రాలయ మున్నదనియు, అందు మహారుద్రుడు వసించుననియు, లలితా భక్తులకు వీరు నిర్విఘ్న ఫలప్రదులగుదురనియు చెప్పబడియున్నది. రుద్రాలయము యొక్క నవమావరణమునందు గృత్సపతి, వ్రాత, వ్రాతపతి, గణ, గణపతి, విరూప, విశ్వరూప మున్నగు అష్టాదశ రుద్రులు కలరందురు. ఇటులే విష్ణ్వారాధకులలో గణపతిని విష్ణురూపునిగను, విష్ణువునకు మేనల్లునిగను ధ్యానించుట కలదు. ఇక, రత్నత్రితయములో మిగిలిన దేవిని ఉపాసించెడి వారలకు శక్తిజన్మయగు గణేశుడు అత్యంత ముఖ్యదేవతయై యున్నాడు. బ్రహ్మ గణపతిని పూజించిన పిదపనే తానొనర్చు సృష్టి వెర్రితలలు వేయుట మానెనని పురాణగాథ కలదు.

సాధకులకు మాయీయ, కార్మణ, ఆణవములు అను మలములు మూడు బ్రహ్మవిద్యా ప్రతిబంధకములుగ నుండుననియు, అందు మాయీయ మలమును గణేశతత్త్వమే నివర్తింప జేయుననియు, కార్మణ మలమును శివతత్త్వము నివర్తింప జేయుననియు ఆణవమలమును అంబికా తత్త్వమే నివర్తింప జేయునవియు తద్జ్ఞులు చెప్పుదురు. ఈ త్రివిధమలములతో అసంభావన, సంశయము, విపరీత భావన అను మూడింటిని క్రమరీతిలో పోల్చవచ్చును.

మహార్థమంజరీపరిమళమను గ్రంథమందు గణపత్యుపాస్తి ఆవశ్యకత, 'వాసనా మాతృలాభే౽పి యో౽ప్రమత్తో న జాయతే । తమనిత్యేషు భోగేషు యోజయంతి వినాయకాః' అను శ్లోకమున స్ఫుటీకరింపబడినది. విఘ్న శబ్దమునకు లలితోపాఖ్యాన రీతిగా అష్ట లక్షణములు చెప్పబడినవి: "అలసా కృపణాదీనా, నిద్రా తంద్రా ప్రమీలికా, క్లీబాచ నిరహంకారా" అని. విశుక్రుడను రాక్షసుడు లలితాకటకములోనికి జయవిఘ్నయంత్రమును విసరివేయుటతో, పైన చెప్పిన ఎనిమిది విఘ్న దేవతలు శక్తి సైన్యమును ఆవరించెనట. ఇట విశుక్రుడే జీవభావమని సౌభాగ్యభాస్కరమందు వ్యాఖ్యానింప బడినది. స్వసైన్యము వికావిక లగుట చూచి, విఘ్న యంత్రమును నిర్భిన్నము చేయుటకై లలితాంబ కామేశ్వర ముఖావలోకనము చేయగా, గణేశుడు ప్రాదుర్భవించెనట. 'మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా' అను నామమునకు వ్యాఖ్యలో పుర్యష్ట కాధీశ్వరుడగు ప్రమాత స్వాత్మస్వరూపనిష్కగ్షజ్ఞానజన్యమయిన చిదానంద లాభప్రదమధ్యవికాసము నందుటే గణేశ పదార్థమని తెలుపబడినది. ఈ మధ్య వికాసము యొక్క సహాయము చేతనే దేహాత్మభ్రాంతి యనబడు భండాసురుని సంహారము సాధ్యమగునని వివరణ.

కేరళదేశమున భగవత్సేవ జేయు దినమున తెల్లవారక ముందే గణపతి హోమము గావించి బ్రహ్మచారికి పెరుగన్నముతో భోజనము పెట్టి, సూర్యోదయానంతరము రంగవల్లులతో సింహాకృతి రచించి, స్వస్తికము, సర్వతో భద్రము లిఖించి, వానిపై దీపారాధన గావించి, మొదట గణపతిని ఆవాహనచేసి, పూజించి జొన్న పేలాలు నివేదింతురు. గణపతిని విసర్జించకుండనే దేవీపూజ నిర్వర్తించి, దేవిని విసర్జించిన తరువాత గాని గణపతిని విసర్జించరు. దీని అభిప్రాయము బహుశః, గణపతిసేవ జరుగుచున్నంత వరకును పుత్రప్రీతిచే అంబికయు ప్రసన్నురాలై యుండునని కావచ్చును.

తమిళనాడులో గణపతి చాల ముఖ్యమయిన ఇలవేలుపు. పిళ్లయార్ కోవెలలేని గ్రామము అరుదు. ప్రతి గోపురముపైన, ప్రతి యింటిపైన వినాయకుని విగ్రహము చూడగలము. విఘ్నేశ్వరునకు ప్రణామము చేయునపుడు ఆ ప్రాంతపు జనులు విశేషభక్తిప్రపత్తులతో గుంజిళ్లుతీయుట, కణతలపై పిడికిళ్ళతో గ్రుద్దుకొనుట, ఆ విధాన మెరుగని క్రొత్తవారికి వింతగా కన్పించును. ఆంధ్రప్రాంతములో గూడ గుంజిళ్ళుతీయు ఆచారము కలదు. కాని వినాయక చవితి అనబడు భాద్రపద శుద్ధ చతుర్థినాడు మాత్రమే ఇట్లు చేయుదురు. ఆనాడు పార్థివ గణపతిని పూజించుటకు ఊరుంబాలెములు తిరిగి నేరేడు, మారేడు, నెలవంక, మామిడి ఆకులను, దూర్వార, చెంగల్వ, ఉత్తరేణి పత్రములను, వివిధ పుష్పజాతులను వేరువేరుగ తెచ్చి వేడుకతో పూజించు ఆచార మున్నది. గణపతి నవరాత్రుల ఉత్సవముచేయు అలవాటు కలదు. మహారాష్ట్ర దేశమున గణపతిపై చాల ప్రియము. ఔత్త రాహులలో సామాన్యజనము రామకృష్ణులకు, కాళీ మాతకు చూపు భక్తి మరి యే మూర్తికిని ఇవ్వరు. శిష్టులలో గాణపత్యము లేకపోలేదని యనుకొనవచ్చును.

ఈ విధమున భారతదేశమందు ఆసేతు శీతాచలము, ఆబాలగోపాలమునకు విదితమైన జాతీయ దైవము గణపతిదేహముపై తప్తాంకలింగ చక్రధారణము లేకుండ, సురాపాన స్వేచ్ఛావిహారము లేకుండ, శ్రద్ధాభక్తులతో చేయబడు గణపత్యుపాస్తి ప్రశస్తము. అధవా, ద్వంద్వ మోహనిర్ముక్తులు కాని సాధారణ జనులు చేయునట్టి గణపతిదేవతాపూజ ఏ దేశాచార ప్రకారము జరిగినను, ఆయా సంప్రదాయములోని వారలకు నిఖిల పురుషార్థముల నొసగగలదని శాస్త్రసిద్ధాంతము.

వే. వే. సు. శా.