Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గాజులబండ

వికీసోర్స్ నుండి

గాజులబండ :

హైదరాబాదుపురాతత్త్వశాఖవారు 1947 సంవత్సరములో 'గాజులబండ' బౌద్ధారామమును కనుగొన్నారు. గాజులబండ బౌద్ధారామము నల్లగొండజిల్లా, సూర్యాపేట తాలూకాలో ఏటూరు గ్రామ సమీపమున నున్న గుట్టల ప్రాంతమున గలదు. గాజులబండ ఆంధ్రదేశములో విరాజమానములయిన బౌద్ధక్షేత్రములలో నొక్కటిగా విలసిల్లినట్లు పరిశోధకులు నిర్ణయించినారు. మరియొక బౌద్ధ క్షేత్రముగా 1940 లో కనుగొనబడిన ఫణిగిరి బౌద్ధవిహారమునకు ఇది 5 మైళ్ళ దూరములో నున్నది.

గాజులబండలో పురాతత్త్వ శాఖవారు త్రవ్వకములు సాగించగా బౌద్ధయుగమునాటి చిహ్నములు కనబడినవి. ఈ అవశేషములు పరిసర ప్రదేశమునందలి భూతలమునకు సుమారు 50 అడుగుల ఎత్తున బ్రహ్మాండమయిన నొక ప్రస్తరతలముపై నెలకొనియున్నది. ప్రాచీన కట్టడముల శిథిలావశేషములు ఒక దిబ్బరూపముగా ఏర్పడి యున్నవి. అచ్చట సులభముగా కుండల పెంకులు, ఇటికలు ఏరుకొనవచ్చును. గాజులబండలో దొరకిన వస్తు జాలమునుబట్టి రెండువేల సంవత్సరముల క్రిందటి మన పూర్వుల సంస్కృతీ సభ్యతలు ఎంత గొప్పవో తెలిసికొన వచ్చును.

ఈ క్షేత్రముయొక్క వయః పరిమాణమును నిర్ణయించుటకు రెండు ప్రబలాధారములు దొరకినవి. ఒకటి చిన్న సీసపు నాణెము. ఈ నాణెమునకు ఒక వైపున ఒక గజ విగ్రహముకలదు. మరియొక వైపున స్వస్తిక చిహ్నము కలదు. ఆంధ్రరాజులు అత్యంత ప్రాచీన కాలములో ముద్రించిన సిక్కానాణెముగా ఇది భావింపబడుచున్నది. ఆంధ్రరాజుల ప్రారంభదశలో ఈ నాణెము చెలామణిలో నున్నట్లు తేలుచున్నది. రెండవ ఆధారము, వంకర టింకరగానున్న భాండశకలములు. ఈ శకలములు సుమారు మూడడుగుల పొడవు. అంతే వెడల్పు కలిగినట్టివిగా నున్నవి. ఒక భాండశకలము మీద ఒకానొక బౌద్ధగాథకు సంబంధించిన మూడక్షరములు బ్రాహ్మీలిపిలో కనబడు చున్నవి. ఈలిపిలక్షణములనుబట్టి ఇది క్రీస్తుశకము మొదటి లేక రెండవ శతాబ్దము నాటిదిగా పరిశోధకులు నిర్ణయించినారు. బౌద్ధమతాచారములననుసరించి రెండువేల సంవత్సరముల క్రిందట ముఖ్యభాండములపై తమ నామధేయములను లిఖించుట సంప్రదాయముగా నుండెను.

గుట్టమీది శిలాతలమునకు దక్షిణదిశయందు ధర్మ చక్రాకారమున గట్టబడిన ఒక స్తూపము దృగ్గోచరమైనది . ఈ స్తూపము 30 అడుగుల వ్యాసము కలది. చక్రమునకు ఉండవలసిన ఆకులు, నడిమిబొడ్డు పరిపూర్ణముగా నున్నవి. పశ్చిమదిశయందు చైత్యవిహారము యొక్క శిథిలములు కనబడినవి. చైత్యవిహారము తూర్పుముఖముగా నున్నది. ఇది సుమారు 24 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు కలదిగానున్నది. వాయవ్యదిశయందు మరియొక చైత్యము యొక్క శిథిలములు గోచరమగుచున్నవి. మరికొన్ని కట్టడముల చిహ్నములు అంగణమున కనబడుచున్నవి. వాటి నామరూప స్వభావాదులు ఇంకను బాగుగ తెలియలేదు.

ఇతర బౌద్ధ క్షేత్రములందువలెనే కట్టడములకు పెద్ద పెద్ద ఇటికలు వాడియున్నారు. ఇచ్చటి ఇటికలు 2 అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు, 3 అంగుళముల మందము కలిగియున్నవి.

గాజులబండలో దొరకిన భాండ సామగ్రి ఆంధ్రదేశములోని పెక్కు బౌద్ధక్షేత్రములలో కనుగొనబడినట్టిదిగానే యున్నది. అత్యంతముగ పదునుచేసిన మెత్తనిమట్టి మిశ్రమముతో భాండముల నిర్మాణము జరుగుచుండెను. ఈ భాండములను ఆవములో కాల్చి పక్వము చేసినప్పుడు భాండము యొక్క రంగు పలుచని నల్లరంగు కలదిగానో, సాదాగులాబీరంగు కలదిగానో మారును. కుండలమీద చిత్రించుటకు సర్వసాధారణముగా గాఢరక్తవర్ణమును ఉపయోగించుచుండిరి. కొన్నికుండలమీద మీగడరంగులో చిత్రణములు కలవు. రంగు ఒక్కొక్కచోట పలుచగను, మరికొన్నిచోట్ల ఒత్తుగను పూసినట్లు కనబడుచున్నది. కొన్ని భాండశకలముల లోపలిభాగములో నలుపురంగు పూసినట్లుగా గనపడుచున్నది. కుండలమీద పెక్కు రంగులతో చిత్రించబడిన పువ్వులు, లతలు, తాంత్రిక చిహ్నములు అపరిమితముగా, వివిధములుగా నున్నవి.

పూర్వకాలమునాటి శిల్పకళావిన్యాసమునకు ఉదాహరణముగా, అత్యంత శోభావంతములయిన కళాఖండములు భూగర్భమున దొరకినవి. గచ్చుతో నిర్మితమయిన

చిత్రము - 100

గాజులబండ - సున్నపురాతిపై చెక్కబడిన శిల్పవిన్యాసము

మానవ శిరస్సులు ముఖ్యముగా పేర్కొనదగినవి. ఇవి ఆనాటి ప్రజల శిల్పకళా నైపుణ్యమును, అంతరంగిక భావ ప్రకటనా సామర్థ్యమును, వాస్తవిక దృష్టియు, రూపురేఖా నిర్మాణ కౌశల్యమును ఎంత గొప్పస్థాయిలో నుండెనో అధికముగా వ్యక్తీకరించుచున్నవి. ఈ శిరస్సులు దక్షిణాపథమందలి ఆదిమవాసుల ముఖవైఖరులను పోలి యుండును. ఒత్తు పెదవులును, వెడల్పగు నాసికయు ప్రస్ఫుటముగా గనుపడుచుండును.

గాజులబండ పరిశోధన కార్యము ఇంకను పరిపూర్తి కాలేదు. త్రవ్వకములు పూర్తి అయినచో బౌద్ధాంధ్ర యుగముల పరిణామదశా వైవిధ్యమును నిర్ణయించు విలువగల సాధనసామగ్రి లభించునను ఆశ కలదు. ప్రాచీన ఆంధ్రదేశము యొక్క చరిత్రాధ్యాయములలో లుప్త భాగములను గాజులబండ పూర్తి చేయగలదని తలంపబడు చున్నది. ముందుముందు గాజులబండ క్షేత్ర వైభవము, చరిత్ర ప్రాధాన్యము వెల్లడికాగలవు.

ఆ. వీ.