Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గద్యవాఙ్మయము (తెలుగు)

వికీసోర్స్ నుండి

గద్యవాఙ్మయము (తెలుగు) :

గద్యము - వచనము : ఆంధ్ర లాక్షణికులు 'గద్య', 'వచన' పదములను గురించి ఆయా సందర్భములందు ప్రస్తావించియున్నారు. ఆదికవి నన్నయభట్టు తన మహాభారతమునందలి అవతారికలో “వచనరచనావిశారదులైన మహాకవులును" అని ప్రస్తావించెను. తిక్కన సోమయాజి తన విరాటపర్వ పీఠికలో "పద్యముల గద్యములన్ రచియించెదన్ కృతుల్" అని గద్యపదమును. “వచనము లేకయు వర్ణన-రచియింపగ కొంతవచ్చు బ్రౌఢులకు" అని నిర్వచనో త్తరరామాయణ పీఠికలో 'వచన పదమును' వాడెను. దీనిచే తిక్కనసోమయాజి కాలమునాటికి (క్రీ. శ. 13 వ శతాబ్ది) గద్య, వచనపదములు సమానార్థకములుగా తెలుగునాట వ్యవహరింపబడజొచ్చెనని స్పష్టమగుచున్నది. కన్నడభాషలోగూడ బసవేశ్వరుడు రచించిన షడ్‌స్థలవచనము, కాలజ్ఞానవచనము అను గద్యకృతులు వచనములు గానే పేర్కొనబడినవి. అనంతామాత్యుడు (15 వ శతాబ్ది) తన ఛందోదర్పణ గ్రంథమున నిట్లు చెప్పెను :


"కనుగొనఁ బాదరహితమై
 పనుపడి హరిగదైవోలె బహుముఖరచనం
 బున మెఱయు గద్యమది దాఁ
 దెనుఁగుకృతుల వచనమనఁగ దీపించు కడున్".

మరియు అప్పకవి (1656) ఇట్లు చెప్పెను :

"ధరసాహిత్యము గద్యపద్యములనం
            దా రెండు భేదంబులై
 పరుగు న్గద్యమునందు బాదనియతుల్
            భావింపగాలేవు వా
 క్స్ఫురణంబై విలసిల్లగా నుడువ నొ
            ప్పుం గావ్య మెంతేనియున్
 మరు తండ్రీ మఱి దీనికే వచన నా
            మంబయ్యె నాంధ్రంబునన్ "
                      (అప్పకవీయము IV-23, పేజీ 184)

కందుకూరి వీరేశలింగముగా రిట్లు చెప్పిరి :

“రమారమి నలువది సంవత్సరముల క్రిందట తెలు గులో గద్యకావ్యములు లేవు. అప్పుడు చిన్నయసూరి తన వ్యాకరణము రచించి యందులకు లక్ష్యముగా నీతి చంద్రికను వచనముగా వ్రాసెను".

పై వాక్యములనుబట్టి గద్యము, వచనము అనునవి సమానార్థకములనుట స్పష్టము.

ఆంధ్రవాఙ్మయమున గల వచన రచనలను మూడు తెరగుల విభాగము చేయవచ్చును. 1. ప్రాఙ్నన్నయ్య యుగము నందలి వచనము. 2 నన్నయాదుల గ్రంథములందలి వచనము. 3. వచనైక గ్రంథములందలి వచనము.

ప్రాఙ్నన్నయ్య యుగము: ప్రాఙ్నన్నయ్య కాలము నందలి వచన రచనా స్వరూపమును తెలిసికొనుటకు ఆ కాలమున బయలుదేరిన శాసనములే పరమాధారములు. నన్నయ్య కంటె పూర్వకాలమున లభ్యమైన శాసనములలో ప్రాచీన తమములయినవి రేనాటి చోళరాజులు వేయించినవి. వీరు కాక బాణరాజులు, వైదుంబులు, తూర్పు చాళుక్యులు వేయించిన శాసనములుకూడ వచనమున నున్నవి. మనకు లభించిన శాసనములలో పద్య శాసనముల కంటె ప్రాచీన తరములు గద్య శాసనములే. రేనాటి చోళులు ఈ క్రింది శాసనమును వేయించిరి :

“చోళ మహారాజుఱ్ల ఏళ ఎరిగల్ తుక - రాజుఱ్ల ఇచ్చిన పన్నస రాచమానంబున ఏబది - తిరివుళపాఱకు ఇచ్చిన - పన్నస దీనికి వక్రంబు- వచినవారు పంచమహా- పాతక అగు”. . . . . .(చోళమహారాజు ఉరుటూరు శాసనము-7వ శతాబ్ది క్రీ.శ.)

ఈ పై శాసనము నందలి వచన రచనా విధానము ప్రాథమిక దశయం దున్నట్లు స్పష్టమగుచున్నది. క్రీ. శ. 8 వ శతాబ్దమున వెలసిన వెలుదుర్తి శాసన మిట్లున్నది:

"స్వస్తిశ్రీ ఉత్తమాదిత్య చోళమహారాజు ప్రిథివీ రాజ్యమ్ చేయ ఇమ్మడి ఇటొచ్చిన పన్నవీసకోసియపాఱ చేది శమ౯ కిచ్చిరి"— (ఉత్తమాదిత్య చోళమహారాజు వెలుదుర్తి శాసనము.)

క్రీ. శ. తొమ్మిదవ శతాబ్దినాటికి వచన రచనమున చక్కని పరిణామము కలిగినది. క్రీ. శ. 9వ శతాబ్ది మధ్య భాగమున బయలుదేరిన చాళుక్యభీముని కొఱవిశాసనము పరిశీలింపదగినది.

"శ్రీ విక్రమాదిత్య నృపాగ్ర తనయుణ్డయ్న చాలుక్య భీమునకు శౌచకన్దపు౯నకు వేగీశ్వరునకు రనమద్దాన్వయకుల తిలకుణయ్న కుసుమాయుధుణ్డు గన్న..... రాజ్యంబు సేయుచు నిష్ఠవిషయ కామభోగంబుల ననుభవించుచు సుఖంబుణ్డి యొక నాణ్డు కొరవినల్ల జెఱియ కొడుక పెద్దన రావించి నీవు నా ప్రాణ సమానుణ్ణవైన చెలివి. ” ఈ శాసనమునందలి వచన రచన క్రీ. శ. 11 వ శతాబ్ద మందలి భారత వచన రచనకు సమీపముగా నున్నది.

ప్రాఙ్నన్నయ్య యుగమునందలి వచన రచనములో ముఖ్య విశేషము లిట్లుండును :

1. పదములందు ప్రాకృతభాషా ప్రభావము స్ఫుటముగా కనిపించుట.

2. వాక్య నిర్మాణ క్రమము పరిపూర్ణముగా లేక పోవుట.

3. పెక్కు చోటులందు సమాపకక్రియ లేకుండుట.

4 నేడు ప్రచారమునలేని కొన్ని విశేష పదములు (పన్నస, పొలగరుసు మొ.) ఉండుట.

5. శకటరేఫము, ణ, ఋ అను నక్షరములు అధికముగా నుపయోగింపబడుట.

ఆంధ్రమహాభారతమునందలి వచనరచన: రాజమహేంద్రవరమును రాజధానిగా జేసికొని తూర్పు చాళుక్యరాజు రాజరాజనరేంద్రుడు క్రీ. శ. 1022 - 1063 వరకు ఆంధ్రదేశమును పాలించినాడు. అతని యాస్థానమున నివసించి నన్నయభట్టు ఆంధ్రమున తొలి కావ్యమగు ఆంధ్రమహాభారతమును రచించెను. నన్నయ విరచిత ఆంధ్రమహా భారతము గద్య పద్యాత్మకమైన చంపూ గ్రంథము. తన కావ్యమున నన్నయ వచనమునకు కూడ సముచిత స్థానమును కల్పించినాడు. మహాభారతమున నన్నయ రచిత భాగమున మొత్తము 4014 గద్యపద్యము లున్నవి. ఇందు ఆశ్వాసాంత గద్యములతోసహా వచనములు 1431. అనగా 35.5 శాతము. నన్నయ, మొత్తము గ్రంథమున దాదాపు మూడింట నొక వంతు వచనమును రచించినాడు. అందుచే నన్నయను కేవల పద్య రచయితగానే గాక గద్య రచయితగా గూడ పేర్కొనవలసి యున్నది. నన్నయభట్టు ఈ క్రింది ప్రత్యేక సందర్భము లందు వచనమును ఉపయోగించినాడు : 1. పద్యములను గూర్ప వలనుపడని వంశక్రమాది వృత్తాంతములను చెప్పుటయందు.

2. సుదీర్ఘములగు కథలను సంగ్రహించుటయందు.

3. పాత్రరసోచిత సంభాషణములయందు.

4. శైలీవైవిధ్య సంపాదనమునకై పద్యముల మధ్య భాగములందు.

5. వైదిక, లౌకిక, రాజకీయాది సూక్తులను చెప్పవలసిన సందర్భములందు.

సంస్కృత లాక్షణికులు గద్య విభాగములుగా పేర్కొన్న చూర్ణము, ఉత్కలికాప్రాయము, వృత్తగంధి, ముక్తకమువంటి రచనలు నన్నయ వ్రాసిన వచనములందు కనిపించుచుండును. వృత్తగంధికి ఉదాహరణము :

"ఇట్లు పెక్కు మృగంబుల నెగచి చంపె." ఇది గీతపద్య పాదమువలె నున్నది.

“ఇట్టి మహోత్పాతంబులు పుట్టిన సురపతి" ఇది కంద పద్యభాగమువలె నున్నది.

ఆంధ్ర మహాభారత భాగములను రచించిన తిక్కన సోమయాజి, ఎఱ్ఱాప్రెగడ - ఈ ఇరువురును వచన రచనమున దాదాపు నన్నయ్యగారి యడుగుజాడలనే అనుసరించిరి. తిక్కన సోమయాజి వచనశైలి నన్నయ్య వచన శైలి కంటె స్వల్పముగ భిన్నమైనది. ఇతడు తన పద్యములందు వలెనే వచనమునందును దేశిపదములను అధికముగా నుపయోగించి యుండుటయే ఈ భేదము. నీతిని బోధించు చోట తిక్కనవచనమును ఉపయోగించియున్నాడు. ఎఱ్ఱాప్రెగడ వచనరచనమున నన్నయ్య, తిక్కనల ననుసరించినాడు. కాని ఎఱ్ఱన తాను రచించిన నృసింహపురాణ మున స్తంభోద్భవ వచనమను నొక రచనను చేసినాడు. ఇది ఉత్కలికాప్రాయమనదగును. దీనివలన వచన రచనలో ఎఱ్ఱన నైపుణికలవాడే యనవలసియున్నది.

ప్రబంధములలో వచన రచన : ప్రబంధము లనబడు తెలుగు కావ్యములందు, మహాభారతమునందువలె విరివిగా వచనము ఉపయోగింపబడలేదు. మొత్తము రచనమున దాదాపు ఐదింట నొక భాగము వచనమున కీయ బడినది. సరళ శైలితో రచించిన వచనములు ప్రబంధములందు చాల తక్కువ. ఒక్కొక్కసారి పద్యములకంటె వచనములే కఠినములుగా నుండును. పెద్దన, భట్టుమూర్తి, చేమకూర వెంకటకవి, నంది తిమ్మన మొదలగువారీ పద్ధతినే అవలంబించిరి.

"ఇట్లు సనుదెంచి నిజజనకు నూరుపీఠం బలంకరించుచున్న గౌరి నమ్మునివరులు గని, తదుత్తమ స్త్రీలక్షణ లక్షితంబగు సర్వాంగోపాంగ ప్రత్యేక సముదాయశోభ లుపలక్షించి చూచి ప్రముదిత హృదయులగుచు నిప్పరమేశ్వరి పరమేశ్వరు నగ్రమహిషియగు టేమి యపూర్వంబని నిశ్చయించి, పార్వతి ముద్రారోహణంబుసేసి, నగపతి చేత సత్కృతులై వీడ్కొని చనుదెంచి రంత నంతకుమున్న తద్వృత్తాంతం బెల్ల నెఱింగి హరి, పరమేష్ఠి, పురందర ప్రముఖ సురాసురోరగ సిద్ధ విద్యాధరా ద్యఖిల భువన భవనాధీశ్వరు లీశ్వరాచలంబున కరిగి..." - (కుమార సంభషము. ఆ. 7–141)

"అపవిత్రంబగు పుత్రలాభంబు దత్కళత్రంబునందును సంభవించె నిట్లా నష్టపూర్వ ద్విజన్ముండు కష్టమార్గంబున నెలసి నెలతయుం దానును బ్రాలుమాలి మృణాళనాళ పేశలంబగు ఫణాధర పరివృఢ ఫణాఫలక తలిమతలంబున నంట సిలంబడ నెడనెడం బెక్కు పాతకంబు లుపార్జించుచు, వర్తించి వర్తించి యొక్క నాఁ డొక్కరుండునుం గుర్కుర కుమారయుగళంబు, గుపితశరభ నిభంబగు దాని గళగళాయమాన గళనిగళ నియమితంబుగఁ గేలఁ గేలించి యొంటిపాటున వేటపైఁ గల తివుట నూటాడుచు సమీ పాటవీమధ్యంబు జొచ్చి" - (పాండురంగ మాహాత్మ్యము. ఆ. 3-89.)

"అని బహు ప్రకారమ్ముల హిమగిరి ప్రభావమ్ము వక్కాణించుచుఁ దత్ప్రదేశంబున శిఖా శిఖోల్లిఖిత గ్లావృక్షంబగు నగస్త్య వటవృక్షంబు గనుంగొని యచట నికట విశంకట కటక కమనీయ మణిశృంగంబగు మణిశృంగంబుఁ గని, యగణ్యపుణ్యాగమ సమర్థంబగు హిరణ్య బిందు తీర్థమ్మునఁ గృతావగాహుండై, గో హిరణ్య ధరణ్యాది దానంబు లనేకంబులు గావించి, ప్రాగ్భాగమునఁ గలి కలిత నర శరణ్యంబగు నైమిశారణ్యంబు సొచ్చి..." -(విజయ విలాసము. ఆ. 1-128.)

ఇట్లీ వచనములు అంత్యప్రాసములు, యమకాద్యలం కారములు కలిగి శాబ్దిక చమత్కృతితో కూడియుండును.

ఆంధ్ర సాహిత్యమున శ్రీనాథ కవిసార్వభౌముడు, పోతనామాత్యుడు ప్రబంధ కవుల శ్రేణిలో చేరకపోయినను, వారి గ్రంథము లందలి వచనములు ప్రబంధమందలి వచన రచనల పోలికలనే కలిగియున్నవి ఒక విధముగా తరువాతి ప్రబంధ కవులు వచన రచనమున పోతనను, శ్రీనాథుని అనుసరించిరని చెప్పవలసివచ్చును. శ్రీనాథుని వచనమునకు ఉదాహరణము :

"గుణాద్భుతంబైన పదార్థంబు వర్ణింపకునికి యసహ్య శల్యంబైన వాగ్జన్మ వైఫల్యంబు. ధూర్జటి జటాకిరీటా లంకారంబైన శశాంకుని సౌకుమార్యంబును, నమృతంబునకు నుత్ప త్తిస్థానంబగు పయోనిధానంబు గాంభీర్యంబును, విశ్వ విశ్వంభ రాంభోజ కర్ణికాయ మానంబగు సువర్ణా హార్యంబు ధైర్యంబును, విభ్రమ భ్రూలతాభంగ లీలావిజిత సుమస్సాయక విలాస రేఖాసారంబై నిర్వికారంబైన యాకారం బెవ్వరి యందునుం గలదె?" (శృంగార నైషధము. ఆ. 4-12. )

పోతనామాత్యుని రచన మిట్టిది :

"ఇట్లాభీలంబయిన నిదాఘకాలంబు వర్తింప బృందావనంబు రామగోవింద మందిరంబైన కతంబున నిదాఘ కాల లక్షణంబులం బాసి నిరంతర గిరినిపతిత నిర్ఘరశీకర పరంపరాభాసిత పల్లవిత కుసుమిత తరులతం బయ్యును, దరు లతా కుసుమ పరిమళ మిళిత మృదుల పవనం బయ్యును, బవనచలిత కమల కల్హార సరోవర మహాగభీర నదీ హ్రదం బయ్యును, నదీ హ్రద కల్లోల కంకణ ప్రభూతపంకం బయ్యును, బంక సంజనిత హరితాయమాన తృణ నికుంజం బయ్యును, జన మనోరంజనంబై వసంతకాల లక్షణంబులు కలిగి లలిత మృగపక్షి శోభితంబై యొప్పు చుండె" - (ఆంధ్రభాగవతము - దశమ స్కంధము - పూర్వభాగము - 718)

లాక్షణికులు చెప్పిన విభాగములను దృష్టియం దుంచుకొని పరిశీలించినచో ప్రబంధము లందలి వచనములు, శ్రీనాథుడు, పోతన తమ గ్రంథములందు రచించిన వచనములు, ఉత్కలికాప్రాయము లనదగి యున్నవి. వీనిలో నచ్చటచ్చట ప్రసన్న సులభశైలిలో నున్న వచనములున్నను వాటి భాగము చాలస్వల్పము. అందుచే వీరిని జటిల వచన రచయితలుగనే పేర్కొనవలసియుండును.

వచనైక రచనలు : కేవలము వచన భరితములుగా నున్న రచనలు ఆంధ్రవాఙ్మయమున కొంత ఆలస్యముగా బయలుదేరినవి. కృష్ణమాచార్య విరచిత సింహగిరి వచనములే ప్రథమాంధ్ర వచనగ్రంథము. ఓరుగంటిని పరిపాలించిన ద్వితీయ ప్రతాపరుద్రుని కాలమున నీతడు జీవించినట్లుగా ఏకామ్రనాథుని ప్రతాప చరిత్రము వలన తెలియుచున్నది. అనగా క్రీ. శ. 13 వ శతాబ్ద్యంతమునను, 14 వ శతాబ్ద ప్రథమార్ధమునను ఇతడు జీవించి యుండును. క్రీ. శ. 15వ శతాబ్దమున నివసించిన తాళ్ళపాక అన్నమాచార్యు లీతని పేర్కొనియుండుటచే ఈ అభిప్రాయమునకు బలము కలుగుచున్నది. చరిత్ర తెలిసినంతవరకును, మనకు లభించిన గ్రంథములలోను, సింహగిరి వచనములే ప్రథమ వచనైక గ్రంథము. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమగు సింహాచలమున నివసించి కృష్ణమాచార్యు లీ గ్రంథమును రచించినాడు. ఇవి 'సింహగిరి దయానిధీ' యను మకుటముతో నుండును. వీనికే కృష్ణమాచార్య సంకీర్తనములని నామాంతరము. ఇవి ఇట్లుండును :

“దేవా ! జయపరంధామ ! పరమపురుష ! పరమాత్మ ప్రకాశ! అమృత! అచలాచల! అవ్యక్త! అగణిత దయాంభోధి ! అనాథపతియైన స్వామి! సింహగిరి నరహరి ! నమోనమో దయానిధీ! ఏడు రామాయణంబులు, పదునెనిమిది పురాణంబులు, ద్వాదశస్కంధంబులు, భగవద్గీతలు, సహస్రనామంబులు చదివిరేమి, వినిరేమి, వ్రాసిరేమి ఈ సంకీర్తనకు వేయవ పాలింటికి సరిరావు. కడమ సంకీర్తన లనేకసారులు విన్నారు. ఇందుకు తప్పరాదు. ...మీ దాసులకు కులగోత్రం బెన్న నేమిటికి! మాయతి రామానుజముని పరంధాత అనాథపతియైన సింహగిరి నరహరి ! నమోనమో దయానిథీ !"

సింహగిరి వచనములందు ప్రత్యేకముగా చెప్పతగినది, భక్తిప్రధానమైన ప్రసన్న శైలి. ఈ శైలీ సౌలభ్యమువలననే కాబోలు, దీనికి చక్కని ప్రజాదరము లభించినది.

వేంకటేశ్వరవచనములు: ఇవి తిరుపతి క్షేత్రమున శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యస్థానమున సంకీర్తనాచార్యులుగా ప్రఖ్యాతిని వహించిన తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు రచించినవి. ఈతడు క్రీ. శ. పదునైదవ శతాబ్ది చతుర్థపాదమున జనించి పదునారవ శతాబ్ది పూర్వార్థమున వర్ధిల్లినాడు. ఈ వచనముల నీయన స్వామివారి సన్నిధిలో నాలాపించువాడు. వీటికి తాళగంధి చూర్ణములని పేరుండుటచే ఇవి పాడుకొనుటకు కూడ నుపయుక్తములై యుండెనని చెప్పవలెను. ఈ వచనము లన్నింటియందును శ్రీ వేంకటేశ్వరస్వామి స్తుతింపబడినాడు. ఇందు విశిష్టాద్వైత మతసిద్ధాంతములు సర్వత్ర కనిపించును. దీనితో వచనరచనారీతిలో అనంతామాత్యుడు చెప్పిన గద్య (వచన) లక్షణము సరిగా సరిపోయినది. దూరాన్వయము, సమాస కాఠిన్యము, అనుప్రాస విన్యాస పరిశ్రమము ఇందు లేవు. కృష్ణమాచార్యుల వచన రచనారీతులు కొన్ని ఇందు కాన్పించును. ఉదా :


"శ్రీ వేంకటగిరిదేవా ! నా దేహంబు నీవుండెడి నిత్య నివాసంబు. నాజ్ఞాన విజ్ఞానంబులు నీ యుభయపార్శ్వంబుల దీపంబులు; నాముకుఁజెఱమల యూర్పులు నీ యిరు దెసలంబట్టెడి యాలవట్టంబులు; నా మనోరాగంబు నీకు చంద్రకావి వలువ. నీకు మ్రొక్క నెత్తిన నాచేతులు రెండును మకర తోరణంబులు. నా భక్తియె నీకు సింహాసనంబు. నా మేనం బొడమిన పులకలు నీకు గుదులు గ్రుచ్చి యర్పించిన పూదండలు. నేను నిన్ను నుతియించిన నుతుల యక్షర రవంబులు నీకు భేరీ భాంకార ఘంటా నినాదంబులు. నా పుణ్య పరిపాకంబులు నీకు నై వేద్య తాంబూలాదులు. మదీయ నిత్యసేవాసమయ నిరీక్షణంబు నీకు సర్వాంగంబు నలందిన తట్టుపునుంగు. నాసాత్త్విక గుణంబు నీకు ధూప పరిమళంబు. నీవు దేవదేవుండవు. నే నర్చకుండను. ఈ రీతి నిత్యోత్సవంబు నాయందు ఆవ ధరింపవే శ్రీ వేంకటేశ్వరా!"

‘వేంకటేశ్వరా’అను మకుట ముండుటచే నీ గ్రంథమునకు వేంకటేశ్వర వచనము లను పేరు కలిగినది.

ఇదికాక, 15, 16 శతాబ్దుల మధ్యకాలమున బయల్వెడలిన వాటిలో శఠకోప విన్నపములు, భవానీ మనోహర వచనములు లేక శంకర వచనములు, కాశికాధీశ్వర వచనములు, కాలజ్ఞాన వచనములు, సభాపతి వచనములు ముఖ్యములైనవి. రచనయందును, సంప్రదాయము నందును, ఇవి సింహగిరి వచనముల యొక్కయు, వేంకటేశ్వర వచనముల యొక్కయు ఛాయలందే నడచినవి. స్తోత్రరూపములుగా నీ కాలమున కొన్ని వచన గ్రంథములుకూడ రచితములైనవి.

వేదాంత వ్యవహారసార సంగ్రహము : మాహురి క్షేత్రమున ప్రసిద్ధుడై, దాసగోపాలస్వామి మొదలగు శిష్యులకు జ్ఞానమార్గోపదేశకు డగు దత్తాత్రేయయోగి ఈ గ్రంథమును రచించెను. వ్యాసకృత మగు బ్రహ్మసూత్రములకు శంకరకృత మగు శారీరకమీమాంసా భాష్యము ననుసరించి సంగ్రహరూపమున వ్యావహారిక భాషలో రచింపబడిన గ్రంథ మిది. ఇందలి శైలి ఇట్లుండును.

“వేదాంత మనగాను శారీరకసూత్ర భాష్యము. ఆ శారీరకసూత్ర భాష్యార్థము సంగ్రహించిన గ్రంథములన్నియు వేదాంతప్రకరణము లనంబడును. ఆ శారీరక సూత్రభాష్యానకు యే అనుబంధ చతుష్టయము కలదో, అదే వేదాంతసార సంగ్రహ మనేటి గ్రంథానకు ఆలోచించేటిదే అనుబంధ చతుష్టయ మనబడును. అనుబంధ చతుష్టయం బనగాను అధికార విషయసంబంధ ప్రయోజనాలును, అధి కారి అనగాను సాధ్య చతుష్టయ సంపన్ను డనంబడును..."

ఈ గ్రంథము సాహిత్య ప్రయోజనము కన్న ప్రచార ప్రయోజనమే హెచ్చుగా కలది కావున సులభ వ్యావహారిక శైలి చక్కగా రాణించినది.

భారత సావిత్రి : క్రీ. శ. 1511 - 1568 మధ్యకాలమున జీవించిన ఎల్లనర నృసింహకవి యీ గ్రంథమును రచించి నాడు. ఇతడు ప్రసిద్ధ వైష్ణవాచార్యుడు. తిరుమల లక్ష్మణమునికి శిష్యుడు. ఈ గ్రంథము భారతమునకు సంగ్రహ రచన. శైలి గ్రాంథికముగా నుండును. మచ్చునకు :

“కురుక్షేత్రంబు యజ్ఞ వేదియు, జనార్దనుండు యూపంబును, దుర్యోధనుండు పశువును, కర్ణుండు హవిస్సు, పాంచాలి యరణియు, భీమసేనుం డగ్నియు, నర్జునుండు హోతయు, భీష్మద్రోణు లాజ్యంబును, రణంబు యాగంబు గావించి, ధర్మరాజు యజమానుండును, గాండీవంబు సృక్‌స్రువంబులును, సమస్త రాజరాజసంఘంబులు కొనియాడ హోమంబు చేయించె."

పరమానంద బోధప్రకరణము : క్రీ. శ. 1560 ప్రాంత మున జీవించిన దాసగోస్వామి యను నామాంతరముకల దాసగోసాయి యను భక్తుడు, ఉపదేశరూప మగు ఈ గ్రంథమును రచించినాడు. ఇతడు మహారాష్ట్రుడయ్యును తెలుగున గ్రంథరచన చేయుట విశేషము. ఇది వేదాంత భరితము. “ఆత్మపూర్ణ సమాధినిష్ఠుడైన వానికి జాతీయ విజాతీయభేదములేదు. వర్ణాశ్రమధర్మాలు చేయబనిలేదు. సర్వధర్మాలు విడిచి బ్రహ్మమై, దేశకాల వస్తువులు లేక, అపరిచ్ఛిన్నుడై జ్ఞానపూర్ణుడై పరబ్రహ్మమువలెనే వుండి వాఙ్మనోతీతమై, నామరూపరహితమై, అఖండపరిపూర్ణ స్వరూపమై యుండును." ఇట్లు వ్యావహారిక శైలిలో నున్న దీరచన.

రాయ వాచకము : ఈ యుగమున వెలసిన వచన గ్రంథములలో రాయవాచక మొకటి. ఇది విశ్వనాథ నాయకుని స్థానాపతిచే రచితమైనది. ఇది రాజకీయ చారిత్రక ప్రయోజనమును దృష్టియందుంచుకొని రచింపబడిన గ్రంథము. ఇందలిభాష సుగమమును, వ్యావహారికమునై యున్నది. కుమార ధూర్జటి యను కవి కృష్ణరాయ విజయమును రచించుటయందు రాయవాచకము ననుసరించి యున్నాడు. రాయవాచకమున నాటి వ్యావహారిక రచనపు నుడికారములు, నాటి మాండలికములు, చక్కగా నుపయోగింప బడినవి. ఇది చారిత్రకముగా కూడ ప్రాధాన్యము కల గ్రంథము.

పైన పేర్కొనిన గ్రంథములేకాక క్రీ. శ. 15, 16 శతాబ్దుల యందు వెలువడిన వచనగ్రంథములలో తామరపల్లి తిమ్మయ్యమంత్రి రచించిన సభాపతి వచనము, సిద్ధరామకవి వ్రాసిన ప్రభుదేవర వాక్యము, కాశీ చెన్నబసవేశ్వరుని వివేకసింధువు, పరమానందయతి కూర్చిన వేదాంత వార్తికము మున్నగునవి పేర్కొనదగినవి.

ఉత్తర ప్రబంధయుగమున అనగా క్రీ శ. 17 వ శతాబ్దమున కూడ కొన్ని వచనగ్రంథములు రచితములైనవి. క్రీ. శ. 1670 ప్రాంతమున గోపీనాథకవి వచన విచిత్ర రామాయణమును రచించెను. ఇది ఉత్కలభాషలో సిద్ధేంద్రయోగి రచించిన గ్రంథమునకు తెలుగు అనువాదము. గోపీనాథకవి శ్రీ సీతారామభక్తుడు. వాల్మీకి రామాయణము ననుసరించి, ఓఢ్ర రామాయణమును చూచి, తానీగ్రంథమును రచించితినని చెప్పియున్నాడు. ఇందచ్చటచ్చట వాల్మీకిరామాయణమున లేని కొన్ని చిత్రకథలున్నవి. శైలి గ్రాంథికమును, మనోహరమునై యున్నది.

భాగవత సారము : దీనిని పుష్పగిరి తిమ్మన రచించెను. ఈ గ్రంథము బహుళ ప్రచారమును పొందినదగుటచే దీనిని చిన్నయ్యన్ అను కవి తమిళభాషలోనికి అనువదించెను. ఇందలి భాష సరళము, గ్రాంథికము. ఉదా:

“ఓ రాజేంద్రా ! నీవడిగిన ప్రశ్నము మంచిది. ఇది పెద్దలు మెత్తురు. వినదగినవి వేయి వేలుంగలవు. వాటిలో నీ వడిగినవి ముఖ్యము. సంసారమగ్ను లీ తత్త్వము తెలియగూడదు. పశు శిశు భార్యాదులు మీది మోహము చేత కాలము క్రమించి కడపట చత్తురు."

క్రీ. శ. 17 వ శతాబ్దమునకు కొలదిగ తరువాత మాచనామాత్యుడు రచించిన బ్రహ్మాండ వచనము, బుద్ధిరాజు పేరయ వ్రాసిన సాత్త్విక బహ్మవిద్యా విలాస నిరసనము, అజ్ఞాన ధ్వాంత చండభాస్కరము అనునవి కలవు. ఈ గ్రంథములన్నియు వేదాంతపరములు.

ఆంధ్ర నాయకరాజుల యుగము : వచన రచనమునకు ఆంధ్రనాయకరాజుల కాలము స్వర్ణయుగము. నాయక రాజులు పాలించిన మధుర, తంజాపురి ప్రాంతముల భాష తమిళము. కాని రాజులు, ఉద్యోగులు మాటాడు భాష తెలుగు. ఆంధ్రరాజులును, వారి ననుసరించిన రాజకీయోద్యోగులును ఇతర సంపన్నులగు ఆంధ్రులును తెలుగు భాషా పోషణము చేసిరి. ఈ సమయమునందలి సారస్వతము యక్షగాన వచన గ్రంథరూపముల వెలువడినది. ఇందు వచనగ్రంథములే హెచ్చు. ముఖ్యమైనవానిని ఈ క్రింద బేర్కొనుచున్నాము :

ధేనుకా మాహాత్మ్యము : క్రీ. శ. 1674 వ సంవత్సరమున తంజాపురిని జయించి పాలించిన ముద్దళ గిరియొద్ద ఆస్థానకవిగా నుండిన లింగనమఖి కామేశ్వరకవి యీ గ్రంథమును రచించినాడు. ఇతడు రుక్మిణీపరిణయము, సత్యభామా సాంత్వనము అను గ్రంథములు కూడ రచించినట్లు తెలియుచున్నది. ఈ కవి ఇందు గోమహాత్మ్యమును వర్ణించినాడు. శైలి సులభ గ్రాంథికము. ఉదా :

“ఆవుపా లమృతంబని అమరవిభుండు పలుకరించెగనుక, ఆవునిచ్చిన అమృతము నిచ్చిన ఫలము కలుగును. మేపుతో గూడ మేలైన దూడఆవును, వృషభమ్మును నెవ్వ డొసంగు నతండు స్వర్గంబునందు సుఖంబు జెందు.”

శ్రీరంగ మాహాత్మ్యము : క్రీ. శ. 1704-31 వరకు రాజ్యమును పాలించిన విజయరంగచొక్కనాథు డిగ్రంథమును రచించెను. ఇది శ్రీరంగక్షేత్ర మాహాత్మ్యమును తెలుపు పది అధ్యాయముల గ్రంథము. గ్రంథకర్త ఈ కృతిని శ్రీరంగేశ్వరుని కంకితముచేసి తన వైష్ణవభక్తిని ప్రకటించుకొనెను. ఇందలి వచనశైలి ఇట్లుండును :

“శ్రీరంగ విమానరాజంబు తొలుదొల్త బ్రహ్మలోకంబున నుండు. తదనంతరంబు నీవు తపంబుచేసిన జతుర్ముఖుండు నీ కీయంగలడు. అయోధ్యానగరంబున నీవు నీవలన జనించిన రాజులును పెక్కండ్రు పూజింపగలరు.”

విజయరంగచొక్కనాథుడే మాఘమాహాత్మ్య మను వేరొక వచనగ్రంథమును రచించియున్నాడు.

జైమిని భారతము : విజయరంగచొక్కనాథునికి సమకాలికుడైన సముఖము వెంకటకృష్ణప్పనాయకు డీగ్రంథమును రచించెను. ఈ జైమిని భారతము పిల్లలమర్రి పినవీరభద్రుని పద్యకృతికి వచనానువాదము. ఇది అయి దాశ్వాసములు గల గ్రంథము. విజయరంగచొక్కనాథునికి అంకితమైనది. ఇందు పినవీరన ఉపయోగించిన జాతీయములు, సామెతలు, సమాసములు తిరిగి ఉపయుక్తములైనవి. అచ్చటచ్చట స్వతంత్రరచనయు గలదు. శైలి ప్రౌఢముగానుండును.

సారంగధర చరిత్ర : ఈ గ్రంథమునుకూడ సముఖము వెంకటకృష్ణప్పనాయకుడే రచించెను. ఇది శ్రీరంగనాథునికి అంకితమైనది. ఇందలి శైలియు ప్రౌఢము. ఉదా :

"అప్పుడు ప్రోడలగు చేడియ లాచేడియలం జూచి యిక్కుమారుని చక్కదనంబును, నీ చక్కెరబొమ్మ యక్కరయు, జూచిన నేటి కిచ్చోటి కేమోపాటు వచ్చునని తోచుచున్నది. ఇత్తరి యిబ్బిత్తరి కింత తత్తరం బేటికి?"

ఇవికాక ఈ కవి రాధికాసాంత్వనము, అహల్యా సంక్రందనము అను ప్రబంధములను కూడ రచించినట్లు తెలియుచున్నది.

ఇవిగాక విజయరంగచొక్కనాథుని కాలముననే శ్యామరాయకవిగారి రామాయణవచనము, శ్రీపతి రామభద్రుని హాలాస్యమాహాత్మ్యము, దేవకి వేంకటసుబ్బకవి రామాయణ వచనము అను గ్రంథములు కూడ రచితములైనవి.

కళువె వీరరాజు : క్రీ. శ. 1704–31 వరకు మైసూరును పాలించిన చిక్క దేవరాయల కాలమున ఈ కవి నివసించి, మహాభారతమును వచన కావ్యముగా రచించెను. ఇందు ఆది సభా భీష్మ పర్వములు మాత్రమే లభ్యమగుచున్నవి. గ్రంథాంత పద్యమును బట్టి ఈ గ్రంథము క్రీ. శ. 1730 వ సంవత్సరమున రచించినట్లు తెలియుచున్నది.

హాలాస్య మాహాత్మ్యము: క్రీ. శ. 1760 ప్రాంతమున నివసించిన కళువె నంజరాజు ఈ గ్రంథమును రచించెను. ఇతడు కళువె వీరరాజు కుమారుడు. హాలాస్య మాహాత్మ్యము దక్షిణ మధురాక్షేత్ర మాహాత్మ్యమును తెలుపు డెబ్బది అధ్యాయముల గ్రంథము. ఇందు సుందరేశ్వరుని అరువది నాలుగు లీలలు వర్ణితములైనవి. ఈ కవియే కాశీఖండమునకు ఆంధ్రవచనరూపమగు కాశీ మహిమార్థ దర్పణమును రచించెను.

తుపాకుల అనంత భూపాలుడు: ఇతడు కళువెవీరరాజునకు సమకాలికుడు. చంద్రగిరి కృష్ణరాజు కుమారుడు. ఇతడు నాలుగు వచన గ్రంథములను రచించెను. 1. విష్ణు పురాణము. 2. భగవద్గీతలు. 3. రామాయణ వచనము (సుందర కాండము మాత్రమే). 4. భారత వచనము (సభా, భీష్మపర్వములు). ఈ గ్రంథకర్త తన్ను గురించి “నిఖిల పురాణేతిహాసకథా సంధాన సమేధమానచాతుర్య వచన రచన వైచక్షణ్య" అని వర్ణించుకొనియున్నాడు. ఇతని రచనములను దృష్టియందుంచుకొనిన ఈ మాటలు యథార్థము లనిపించును. రామాయణ సుందరకాండము నుండి ఉదాహరణమునకు కొన్ని వాక్యములు :

“ఓ పురుషపుంగవా! నీ వుత్సాహ సంపన్నుండవగుచు నను గరుణింపుము. నీవంటి వల్లభు డుండి యే ననాథ తెఱంగున నున్నదాన. భూకారుణ్యంబు పరమ ధర్మంబని పూర్వంబున నీ వలననే వినియుందును. నీవు మహా వీరుండవనియు, మహోత్సాహుండవనియు, మహాబల సమన్వితుండవనియు, నెవ్వరికిం గాని కార్యంబు నీకు శక్యంబనియు నెఱుంగుదును.”

ఆంగ్లేయ రాజ్యారంభము - కుంపిణీయుగము : ఈ కాలమున లిఖితములైన గ్రంథముల ననుసరించి ఈయుగమును రెండుగా విభాగము చేయవచ్చును. 1. మెకంజీయుగము 2. బ్రౌనుయుగము.

1. మెకంజీయుగము : (క్రీ. శ. 1720-1840) ఈ కాలమున వెలువడిన గ్రంథములు క్రైస్తవ మతమునకు సంబంధించినవి. సాహిత్యకముగా వీటికి ప్రాధాన్యము లేకపోయినను ఇవి వ్యావహారికమై, సులభగ్రాంథికముగా నున్న రచనము లగుటచే వచనములుగా చెప్పదగినవి. క్రైస్తవమత సంబంధమైన ఈ సాహిత్యమువలన ఆంధ్ర భాషకు ముద్రణ సౌకర్యము లభించినది. మొదట ఈ కాలమున క్రైస్తవ గ్రంథములు ముద్రణము నొందినవి. రానురాను ఇతర గ్రంథములు కూడ ముద్రింపబడ సాగినవి. తెలుగుభాష కీ మహావకాశము లభించుట క్రైస్తవ గ్రంథములవలననే. ఈ కాలమున ఈ క్రింది గ్రంథములు ప్రచురితములైనవి. 1. క్రైస్తవపురాణకథాసంక్షేపము (1720), ఆ.పి. మిషన్ వారిది. 2. బెంజిమనుషూల్జి వ్రాసిన మోక్షానికికొంచుపొయ్యేదోవ (1746) 3. ఎ.డి. గ్రాంజెన్ అనువదించిన మార్కు, మత్తయి, లూకా సువార్తలు (1812). 4. ఏసుప్రభువు. రక్షకుని నూతననిబంధన— ఇవి గ్రీకు భాషనుండి ఎడ్వర్డ్ ప్రిచ్చెట్ గారు అనువదించినవి (1818).

2. బ్రౌనుయుగము : (క్రీ. శ. 1840-1860) ఈ కాలమున పేర్కొనదగిన గ్రంథము జ్ఞానబోధము. ఇది క్రీ. శ. 1840లో ప్రచురితము. ఇది క్రైస్తవ గ్రంథము. తమిళము నుండి యనువదించబడినది. ఇది బైబిలు గ్రంథమున కనువాదము కాదనియు, క్రైస్తవ మతమునకు సంబంధించిన నీతులను గురించి వర్ణించు గ్రంథ మనియు బ్రౌనుగారు వ్రాసిరి. ఇది వ్యావహారిక భాషలో నున్నది.

కథావాఙ్మయము: ఆంగ్లేయు లాంధ్రదేశమున ప్రభుత్వోద్యోగులుగా నుండుటచేత వారు తెలుగుభాష నేర్చుకొన వలసివచ్చినది. సులభముగా నున్న భాషలో రచింపబడిన తెలుగు కథలు ఆంధ్రీతరుల నాకర్షించుటచే కొంత క థా సాహిత్యరచన జరిగినది. ఈ క్రిందివి ముఖ్యమైనవి :

విక్రమార్కుని కథలు, పంచతంత్ర కథలు – ఈ రెండు గ్రంథములను ఫోర్టు సెంటు జార్జి కళాశాలలో ఆంధ్రోపాధ్యాయులుగా నుండిన రావిపాటి గురుమూర్తి శాస్త్రిగారు రచించిరి. క్రైస్తవ సాహిత్యేతర గ్రంథములలో ముద్రణమునందిన ప్రథమ గ్రంథము 'విక్రమార్కుని కథలు'. ఇది క్రీ. శ. 1819 లో ముద్రితమై, 1828, 1850, 1858 సంవత్సరములలో పునర్ముద్రితమైనది. ఇందు విక్రమార్కుని సాహసగాథలు సరళ భాషలో వర్ణితములైనవి. పంచతంత్ర కథలు సంస్కృత గ్రంథమునకు అనువాదము. ఇది 1834 లో ప్రచురితమైనది. ఈ సందర్భమున పాటూరి రామస్వామి రచించిన శుక సప్తతి కథలు (1840), ధూర్జటి లక్ష్మీపతి వ్రాసిన 'హంస వింశతి' (1842), వాడ్రేవు వెంకయ్యగారి బత్తిసుపుత్లీ కథలు (1847) మున్నగునవి పేర్కొనతగినవి.

ఈ కాలముననే కొన్ని పురాణములు, ప్రబంధములు కూడ వచనమున రచితములైనవి. అందు సింగరాజు దత్తాత్రేయులు, వెంకటసుబ్బయ్య రచించిన రామాయణ వచనము (1840), పైడిపాటి పాపయ్యవ్రాసిన రంగనాథ రామాయణవచనము (1840), పాటూరి రంగశాస్త్రులు లిఖించిన విజయవిలాసము (1841), వైయాకరణము రామానుజాచార్య కృతమైన ఆదిపర్వవచనము (1847), ముదిగొండ బ్రహ్మలింగారాధ్యులుగారి శివరహస్య ఖండము (1852) ముఖ్యములైనవి.

యాత్రా చరిత్రలు : ఈ విభాగమున ప్రప్రథమమున పేర్కొనదగినది ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్రా చరిత్ర. వీరాస్వామయ్యగారు కాశీయాత్ర చేసిన సందర్భమున ఈ గ్రంథమును దినచర్యారూపమున సరళ వ్యావహారిక భాషలో రచించిరి. దీనిని వారి మిత్రులు కోమలేశ్వరపు శ్రీనివాస పిళ్ళెగారు క్రీ. శ. 1830 సంవత్సరమున ముద్రింపించిరి. ఇదిగాక కోలా శేషాచల కవి “నీలగిరియాత్ర" కూడ ఈ సందర్భమున చెప్పతగినది. శేషాచల కవి థామస్ సిమ్సన్ అను ఆంగ్లేయుని వెంట నీలగిరి (ఉదకమండలము) యాత్ర చేసి రచించిన గ్రంథమిది. ఇది ప్రౌఢశైలీ సమన్వితము. క్రీ.శ. 1846-1847 మధ్యకాలమున రచితమైనది; విశాఖ జమీందారగు గోడే శ్రీ వేంకట జగ్గ నృపాలున కంకితమైనది.

పత్రికా ముఖమున గూడ కొంతవచన రచన ఈ కాలమున జరిగినది. 19 వ శతాబ్దపు ప్రథమార్థమున పేర్కొనదగిన తెలుగు పత్రిక 'వర్తమాన తరంగిణి.' ఇందు వివిధ సాహితీ ప్రక్రియలు ప్రచురితములైనవి. ముఖ్యముగా లేఖారూపమున వచనరచనలు ప్రచురితములగుచుండెడివి. చిన్నయసూరి ప్రభృతు లిందు వ్రాయుచుండువారు. ఈ యుగమున లేఖా వాఙ్మయముకూడ వచనరచనకు చక్కని యభివృద్ధిని కలిగించినది. ఈ వాఙ్మయమునకు మూలపురుషుడనతగినవాడు చార్ల్స్‌ఫిలిప్సు బ్రౌను అనునాతడు. బ్రౌను లేఖలు పది సంపుటములుగా నున్నవి. అందు నాటి సాంఘిక, సారస్వత పరిస్థితులు చక్కగా ప్రతిఫలించినవి. ఈ లేఖలలో వ్యావహారిక, గ్రాంథిక రచన లున్నవి. ఈ కాలమున చారిత్రిక, శాస్త్రీయ గ్రంథములు కూడ కొన్ని రచితములైనవి. కర్నల్ మెకంజీగారికి మార్గదర్శకుడైన కావలి వేంకటబొర్రయ్య వ్రాసిన కాంచీపుర మాహాత్మ్యము (1802), సరస్వతీబాయిచే వ్రాయబడి కావలి వేంకటరామస్వామిచే ఆంగ్లమున కనువదింపబడిన పాకశాస్త్రము (1836), అల్లాడి రామచంద్రశాస్త్రిగారి సిద్ధాంత శిరోమణి (1837), వైద్యనాథ సిద్ధాంతిగారి భూఖగోళ దీపిక (1843) ప్రభృతములు ప్రధానములైనవి,

చిన్నయసూరి యుగము : క్రీ. శ. 1857 వ సంవత్సరము రాజకీయముగానే కాక సాంస్కృతికముగా కూడ భారతదేశమునకు ముఖ్యమైనది. మనదేశమున ఈ సంవత్సరముననే విశ్వవిద్యాలయ స్థాపన ప్రారంభమైనది. 1857వ సంవత్సరమున మద్రాసు విశ్వవిద్యాలయము స్థాపించుటయు, అందు తెలుగుభాష పఠనీయముగ ఏర్పాటు చేయుటయు జరిగినవి. దక్షిణదేశమున రచితములైన వచన గ్రంథము లీనాటికి ప్రకాశములు కాలేదు. అందుచే గ్రాంథికమును, సలక్షణము నగు వచన రచన నాటి విశ్వవిద్యాలయ విద్యార్థుల కావశ్యకమైనది. ఇట్టి రచనకు ప్రథమమున పూనుకొన్నవాడు చిన్నయసూరి. 1856 లో నవీన గ్రాంథిక వచన రచనమునకు శ్రీకారప్రాయమైన నీతిచంద్రికను రచించి ముద్రింపించినాడు. చిన్నయసూరి గ్రాంథిక భాషాభిమాని యగుటచేతను, అతనికి విద్యాశాఖలో తగిన గౌరవ ముండుటచేతను, తన గ్రాంథికవచనములు పాఠ్యములుగా నుండుటకు అవకాశము లభించినది. చిన్నయసూరి పంచ తంత్ర హితోపదేశ కథలను గ్రహించి, మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహము అను నాలుగు భాగములుగ “నీతి చంద్రిక "యను గ్రంథమును రచింపబూనెను. కాని ఈతడు రచించినవి మిత్రలాభము, మిత్రభేదము అను భాగములు మాత్రమే. నీతిచంద్రిక పేరుతో నున్న ఈ గ్రంథము సలక్షణ గ్రాంథికమున నున్నది. విశ్వ విద్యాలయమున పాఠ్య గ్రంథముగా నుపయుక్తమైనది. నీతి చంద్రికా రచనా ప్రభావముచే నాటి కాలమున గ్రాంథిక భాషకు ప్రాబల్యము దేశమున నధికమైనది. పాఠ్య ప్రణాళికలు, పత్రికలు, వ్యాఖ్యలు, లేఖలు, ఉపన్యాసములు గ్రాంథికభాషనే ప్రోత్సహించినవి. చిన్నయసూరి తరువాత రాజధాని కళాశాలలో ప్రధాన పండితులైన కొక్కొండ వెంకటరత్నము పంతులుగారు, సూరిగారు ప్రారంభించిన గ్రాంథిక భాషా మహోద్యమమును స్థిరీకరించిరి. 1866 లో సూరి విడచిన సంధివిగ్రహతంత్రములను అట్టి శైలిలోనే రచించి, 1872 లో విగ్రహమును ముద్రింపించిరి. అది విశ్వవిద్యాలయమున అదే సంవత్సరము పఠనీయమైనది. 1871 లో వీరు “ఆంధ్ర భాషా సంజీవని" యను పత్రికను ప్రారంభించి ఇరువది సం. రములు నడపిరి . ఇది గ్రాంథికభాషా ప్రచారమునకే వినియోగింపబడినది. వెంకటరత్నము పంతులుగారు 1877 లో ప్రిన్స్ ఆఫ్ వేల్సు హిందూస్థాన దర్శనము అను గ్రాంథిక వచనగ్రంథమును రచించిరి. ఇదియు పాఠ్యగ్రంథముగా నియమితమైనది.

ఒకవైపు విశ్వవిద్యాలయము స్థాపితమై గ్రాంథిక రచన జరుగుచుండగా వేరొకవైపున ప్రజాసామాన్యము కొరకు సులభశైలిలో వచన కథారచనలు వెలువడినవి. ఇట్టివాటిలో పరమానందగురువుల కథలు (1861), తడకమళ్ళ వెంకటకృష్ణారావు రచించిన అరేబియన్ నైట్సు కథలు (1862), కంబుధరచరిత్ర (1866), తెలుగు వెలుగు ముగుద కథ (1879), ఎర్రమిల్లి మల్లికార్జునుడు వ్రాసిన చారుదర్వీషు కథలు (1881), చదలువాడ సీతారామశాస్త్రిగారి దక్కను పూర్వకథలు ముఖ్యములైనవి. ఇవికాక నీతిచంద్రికకన్న కొలది తేలికరచనలు పాఠ్యగ్రంథముల వంటివి ప్రచురితములైనవి. ఎనమచింతల సంజీవ రాయశాస్త్రిగారి దశకుమారచరిత్ర (1886), దాసు శ్రీరాములుగారి అభినవ గద్యప్రబంధము (1893) పేర్కొనదగినవి. ఈకాలమున కొన్ని పౌరాణికములుకూడ వెలసినవి. కార్మంచి సుబ్బరాయలునాయని వారి దశావ తార చరిత్ర సంగ్రహము (1861). తిమ్మరాజు లక్ష్మణరాయకవిగారి శ్రీ మార్కండేయపురాణసార సంగ్రహము (1876), శ్రీ కూర్మపురాణ సంగ్రహము (1877), శ్రీమత్స్యపురాణసార సంగ్రహము (1877). ఈ గ్రంథములన్నియు సులభగ్రాంథిక వచనమున రచితము లైనవే.

వీరేశలింగయుగము (1890 నుండి) : క్రీ. శ. 1890 నుండియే కందుకూరి వీరేశలింగముగారి రచన ప్రచారము చెందినను, వారి రచనా ప్రభావము 1900 నుండి స్ఫుటముగా కానిపించును. 1899 వ సంవత్సరమునాటికి వారి రచనలన్నియు సంపుటములుగా వెలువడినవి. అందువలన విద్యా సంస్కారము కలవారు వారిరచన లనేక ముఖములుగా పరిశీలించి నూతనరీతిని వచనరచన ప్రారంభించిరి. వీరి రచనలలో శైలీకాఠిన్యము లేదు. తేలికగను, గ్రాంథికముగను నుండు శైలిని వీరవలంబించిరి. వీరేశలింగ యుగమున వచన వాఙ్మయశాఖ పలు భిన్నముఖములుగా చిగిర్చినది. ముఖ్యవిభాము లివి:

నవల : ఆంగ్ల భాషా ప్రభావమున ఆంధ్ర భాషలో నుద్భవించిన ప్రక్రియలలో నవల మొదటిది. వీరేశలింగము గారికి పూర్వమే కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు 1867సం.న 'మహాశ్వేత' యను నవలను ప్రకటించిరి 1872 లో నరహరి గోపాలకృష్ణమ్మ సెట్టి 'రంగరాజ చరిత్ర' యను నవలను ప్రకటించెను. కాని వీరు వీనిని నవలలుగా పేర్కొనలేదు. వీరేశలింగముగారు గోల్డుస్మిత్ వ్రాసిన “వికార్ ఆఫ్ ది వేక్ఫీల్డు" అను నవల ననుసరించి రాజశేఖర చరిత్ర యను నొక నవలను రచించిరి. నవల కుండదగిన లక్షణము లన్నియు దీని కుండుటచే నాంధ్రభాషలో నిది ప్రథమనవలగా ప్రఖ్యాతి నార్జించినది. వీరేశలింగముగారు నడిపిన "చింతామణి” పత్రికా ప్రోత్సాహమున కొన్నినవలలు ప్రచురితములైనవి. 1893లో ఖండవిల్లి రామచంద్రుడు వ్రాసిన ధర్మవతీ విలాసము, తల్లాప్రగడ సూర్యనారాయణరావు రచించిన సంజీవరాయ చరిత్రము అనువాటికి ఈ పత్రిక బహుమతుల నిచ్చినది. ఈ నవలలీ పత్రికలో ప్రకటింప బడినవి. సాహిత్యరంగమున చిలకమర్తి లక్ష్మీనరసింహకవి యొక్క ఆవిర్భావముతో తెలుగు నవలా రచనకు మంచి వికాసము కలిగినది. “చింతామణి” పత్రికా ప్రోత్సాహమున చిలకమర్తి కవి తన ప్రథమ రచన రామచంద్రవిజయమును ప్రచురించెను. దీనికి బహుళ ప్రచారము కలిగినది. ఈ పత్రికాముఖముననే ఈయన రచించిన అహల్యాబాయి (1897). కర్పూరమంజరి (1898), వెలుగును చూచినవి. ఇవికూడ ప్రజాదరమును బడసినవి. ఇవికాక ఖండవిల్లి రామచంద్రుడుగారి మాలతీ రాఘవము, టేకుమళ్ళ రాజగోపాలరావుగారి త్రివిక్రమ విలాసము, రెంటాల వెంకటసుబ్బారావుగారి కేసరీ విలాసము, కూనపులి లక్ష్మీనరసయ్యగారి 'బక్షీ' పేర్కొన దగినవి.

ఈ కాలమున చరిత్రకు సంబంధించిన కొన్ని వచన గ్రంథములు ప్రచురితమైనవి. బుక్క పట్టణము రాఘవాచార్యులు "తెనుగు రాజుల చరిత్రలు" అను గ్రంథమును 1881 లో రచించిరి. ఇది ముద్రణమునందలేదు. 1885 లో ఒడయరు వీరనాగయ్యగారు చాణక్య చరిత్రను వ్రాసిరి. గురుజాడ రామమూర్తిపంతులు "కవి జీవితము" లను పేర కవుల చరిత్రను రచించిరి. వీరే బెండపూడి అన్నమంత్రి చరిత్ర (1897), తిమ్మరుసు చరిత్ర (1898) కూడ రచించిరి.

ఆంగ్ల భాషా ప్రభావమున ఈ కాలమున తెలుగులో వ్యాసములు, ఉపన్యాసములు కొన్ని రచితములైనవి. 1881 లో రచింపబడిన వావిలాల వాసుదేవశాస్త్రిగారి 'ఆంధ్ర భాషను గూర్చిన ఉపన్యాసము'ను మొదట పేర్కొనవలెను. కాల్డ్వెలుగారి భాషాసిద్ధాంతములను పరిశీలించి వ్రాయబడినది ఈ వ్యాసము. గోపాలరావునాయడుగారు 1896 లో 'ఆంధ్ర భాషా చరిత్ర సంగ్రహము' అను ఉపన్యాసమును గ్రంథ రూపమున ప్రకటించిరి. 1885-1900 వరకు బహువిధములైన భాషాసాహిత్య విషయక వ్యాసములు 'చింతామణి' యందు ప్రకటితమైనవి. తెలుగులో వాఙ్మయవిమర్శన మను ప్రక్రియ కూడ ఆంగ్లభాషాప్రభావమున కలిగినదే. ఈ కాలమున నిట్టి విమర్శనములు కొన్ని వెడలినవి. చెన్నరాజధానీ కళాశాలలో దక్షిణామూర్తిగారు పింగళి సూరననుగూర్చి విమర్శనాపూర్వకముగ నుపన్యసించిరి. ఇది 1893 లో ముద్రితమైనది. 1896 లో శ్రీ కొచ్చర్లకోట రామచంద్ర వెంకట కృష్ణారావు బహద్దరువారు 'ఆంధ్రభాషాభివృద్ధి' అను వాఙ్మయవిషయక వ్యాసము ప్రకటించిరి. కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారి భాస్కరరామాయణ కర్తృత్వమును గురించిన వ్యాసము (1898), వెన్నేటి రామచంద్రరావుగారి 'మనువసు ప్రకాశిక', బ్రహ్మయ్యశాస్త్రిగారే రచించిన వసుప్రకాశిక విమర్శనము, నన్నయభట్టారక చరిత్రము కూడ విమర్శనాత్మక గ్రంథములే.

వీరేశలింగము - అతని రచనలు : చిన్నయసూరితో అభివృద్ధిని పొందిన వచనవాఙ్మయము వీరేశలింగముగారి రచనలలో మరింత వికాసము పొందినది. సూరి రచనలు కేవలము గ్రాంథికములై సులభబోధకములు కాకపోవుటచే అవి పండితులకు మాత్రమే పఠనీయము లైనవి. కేవలము సాహిత్యసేవయేకాక, సాంఘికసంస్కరణము కూడ వీరేశలింగముగారి ధ్యేయమగుటచే వారు సులభ బోధకములగు రచనలు చేసిరి. వీరేశలింగముగారి గ్రంథములలో అధికభాగము వచనమే యగుట యొక విశేషము. అందుకే ఈయనకు గద్యతిక్కన యను పేరు కలిగినది. "నే నేర్పరచుకొన్న భాషాభివృద్ధి మార్గము తెలుగుభాషలో మృదువైన సులభశైలిని, సలక్షణమైన వచనరచన చేయుట" అని వారే 'వివేక వర్ధనీ' పత్రికా ముఖమున తెలిపిరి. వీరి రచనలలో సుబోధత, వైశద్యము, సమత, జీవము ముఖ్యలక్షణములుగా పేర్కొనవలెను. వీరి గద్యరచనయందలి విభాగములు నవల, కథలు, జీవిత చరిత్రలు, వ్యాసములు, ప్రహసనములు, గ్రంథ విమర్శనములు, చారిత్రక గ్రంథములు, పత్రికా రచనములు, శాస్త్రగ్రంథములు, ఉపన్యాసములు అను నవై యున్నవి.

బాలురకు పఠనీయములుగా నుండు పెక్కు కథలను వీరేశలింగముగారు రచించిరి. వీరి 'సత్యరాజాపూర్వదేశ యాత్రలు' మున్నగు కథాగ్రంథములు ప్రౌఢులుసైతము చదువతగినవి. ఇవి ఆంగ్లానుసరణములే యైనను సలక్షణ స్వతంత్ర రచనలతో నున్నవి.

ప్రసిద్ధ స్త్రీపురుషులయొక్క జీవిత చరిత్రలను వ్రాసిన వారిలో ప్రథములు వీరేశలింగముగారు. వీరి విక్టోరియా మహారాజ్ఞీ చరిత్ర, జీసస్ చరిత్ర, భవిష్యద్రచయితలకు మార్గదర్శకములైనవి. ప్రత్యేక శీర్షికలతో అతిదీర్ఘము కాక, అతిక్లుప్తమును కాక విషయ వివరణము కలిగియున్న లఘురచనకు వ్యాసమని పేరు. ఇట్టి రచనలను వీరేశలింగముగారు పెక్కు వెలయించిరి. దేశాభిమానము, సంఘ సంస్కరణము, సత్ప్రవర్తన మున్నగు విషయములను గూర్చి వీరు వ్రాసిన వ్యాసములు పెక్కులున్నవి. సాంఘిక దురాచారములను విమర్శించుచు హాస్యప్రధానముగా వీరు రచించిన ప్రహసనములు పెక్కులు కలవు. ఈయన 58 ప్రహసనములు రచించెను. బ్రహ్మవివాహము, అపూర్వ బ్రహ్మచర్యము, విచిత్ర వివాహము, మహాబధిర ప్రహసనము ఆదిగా గలవి ప్రఖ్యాతములు.

గ్రంథవిమర్శన విషయమున కూడ వీరేశలింగముగారే అగ్రేసరులు. వేంకటరత్నకవి 'విగ్రహతంత్రవిమర్శనము' పేర్కొనదగినది. విమర్శ వ్యక్తిగతముగా కాక సాహిత్య ప్రధానముగా నుండుట గమనింపతగినది.

వీరేశలింగముగారు రచించిన చారిత్రక గ్రంథములను మూడు విభాగములు చేయవచ్చును. 1. స్వదేశ సంస్థాన చరిత్రలు, 2. స్వీయ చరిత్ర, 3 ఆంధ్ర కవుల చరిత్రలు. వీనిలో చివరిది ముఖ్యమైనది. ఈ వచన గ్రంథము క్రీ. శ. 11 వ శతాబ్దమునుండి 19 వ శతాబ్దమువరకు గల కవుల చరిత్రను సులభశైలిలో వివరించు చున్నది. వచనమున స్వీయచరిత్ర వ్రాయుటకు వీరేశలింగముగారే ప్రథములు. 'వివేక వర్ధనీ' పత్రికా ముఖమునను, 'హాస్య సంజీవని' యందును వీరు వ్రాసిన వ్యాసములు పత్రికా రచనమున వీరికిగల నేర్పును ప్రకటించును. ప్రాచ్య పాశ్చాత్య సంబంధ శాస్త్రీయ గ్రంథములను కూడ వారు రచించిరి. ఈ గ్రంథములందుపయోగింపబడిన పారిభాషిక పదజాలము కొంత ప్రాచీనమును, కొంత స్వయంకల్పితమునై యున్నది. తర్క సంగ్రహము, కావ్య సంగ్రహము, అలంకార సంగ్రహము, జ్యోతిశ్శాస్త్రము, జంతుశాస్త్రము, శారీరక శాస్త్రము (Physiology) అనునవి వీరినవీనగ్రంథములు. వివిధ సభల యందు ఉపన్యసించు సందర్భమున వీరేశలింగముగారు ముందు తమ ప్రసంగములను వ్రాసికొని చదువుట పరిపాటి. తరువాత వాటిని పత్రికా ముఖమున ప్రకటించు చుండువారు. ఈ ఉపన్యాసములు విషయ వైవిధ్యము కలవై సులభశైలిలో సరళముగా నుండును. "దేశీయ మహాసభ — దాని యుద్దేశములు,” “సంఘ సంస్కరణ, మహాసభాధ్యక్షోపన్యాసము" మొదలగునవి వారి ప్రఖ్యాతములైన ఉపన్యాసములు.

ఆధునిక యుగము : (1910-55) వీరేశలింగముగారు ప్రారంభించిన వచన రచనోద్యమము ఆధునిక యుగమున గొప్ప అభివృద్ధిని పొందినది. ఈ విస్తరణమునకు ముఖ్యకారణము గిడుగు రామమూర్తి పంతులుగారి వ్యావహారిక భాషా ప్రచారము. తత్ప్రభావముచే కేవలము పద్యకవిత్వమునందే కాక వచనమునందును రచయితలు వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిరి క్రీ. శ. 1910 నుండి 1955 వరకు సాహిత్యము నవలలు, కథానికలు, విమర్శనములు, వ్యాసములు అను రూపములలో వర్ధిల్లినది. (పూర్వము ఎప్పుడును వెలువడని విస్తృతమైన సాహిత్య ప్రక్రియ లీ కాలమున ప్రతి విభాగమున వెలసినవి.)


నవల : పాశ్చాత్య భాషా సంస్కారముల ప్రభావమున వృద్ధినొందుచు ఆధునికాంధ్ర వాఙ్మయమునకు పరిపుష్టి కలిగించుచున్న సాహిత్య ప్రక్రియలలో నవల యొకటి. ఆధునికాంధ్ర నవలా రచయితలలో అగ్రేసరులని చెప్ప దగినవారు విశ్వనాథ సత్యనారాయణగారు. 'ఏక వీర ' వీరి ప్రథమ నవల. అందలి శైలియు, కథాని ర్మాణ కౌశలమును, పాత్ర పోషణమును అనన్యాదృశము లైనవి. చెలియలికట్ట, ధర్మచక్రము, బద్దన్న సేనాని, స్వర్గానికి నిచ్చెనలు, తెఱచిరాజు, మాబాబు మొదలైనవి వీరి ఇతర రచనలు. వీరి 'వేయిపడగలు' పరిమాణమునందును, గుణమునందును పెద్దది. ఇది ఆధునికాంధ్రదేశ సాంఘిక, మత, రాజకీయ పరిస్థితులకు ప్రతిబింబము. నవలకుండవలసిన గుణములన్నియు దీనికి గలవు. భాష సరళ గ్రాంథికము . ఇది ఆంధ్ర విశ్వకళాపరిషత్తు బహుమతిని పొందినది. కీ. శే. అడివి బాపిరాజుగారు కూడ నవలా రచనలో సిద్ధహస్తులు. సాంఘిక నవలలైన నారాయణరావు, కోనంగి, చారిత్రక నవలయైన 'హిమబిందు' మున్నగు బాపిరాజుగారి నవలలు ఆంధ్రదేశమున ప్రశస్తిని పొందినవి. బుచ్చిబాబుగారి 'చివరకు మిగిలేది', జి. వి. కృష్ణారావుగారి 'కీలుబొమ్మలు', బలివాడ కాంతారావుగారి 'గోడమీద బొమ్మ' ఇవి సాంఘిక వస్తువుతో నున్న వ్యావహారిక వచన రచనలు. శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారు చారిత్రక నవలా రచయితలలో చేయి తిరిగినవారు. నారాయణభట్టు, రుద్రమదేవి, మల్లారెడ్డి అను నవలలు సులభ గ్రాంథికముతోనుండి కవిత్రయ జీవితములను హృద్యముగా వివరించుచున్నవి. కీ. శే. ఉన్నవ లక్ష్మీనారాయణగారు వ్రాసిన మాలపల్లి, ఆంధ్ర నవలా ప్రపంచమునకు అలంకార ప్రాయము. ఇందలి భాష మాండలిక మేయైనను, ఇది ఆంధ్ర దేశమునందంతటను ప్రచారమును పొందినది. దీనిలో సాంఘిక, రాజకీయ పరిస్థితు లెన్నియో చిత్రించబడినవి. 'బారిష్టరు పార్వతీశం' మొక్కపాటివారు రచించిన హాస్యప్రధానమైన నవల. మునిమాణిక్యం నరసింహారావుగారి 'నేనూ, మా కాంతం', 'కాంతం కథలు', 'తిరుమాళిగ' అనునవి కూడ హాస్యప్రధాన రచములే. వ్యావహారికాంధ్రమున నున్న ఈ రచనలు ఆంధ్రుల అభిమానమును సంపాదించినవి. నవలా రచయితలలో పలువురు స్త్రీలును కలరు. 'సుదక్షిణా చరిత్రము'ను వ్రాసిన శ్రీమతి జయంతి సూరమ్మ, 'వసుమతి' అను నవల రచించిన కనుపర్తి వరలక్ష్మమ్మ, 'చంపకము' వ్రాసిన శ్రీమతి మాలతీ చందూరు పేర్కొనదగినవారు, కొన్ని ఆంగ్లనవలలు ఆంధ్రములోని కనువదింపబడినవి. వానిలో ఫాస్టు, నౌకాభంగము, అనా కెరినీనా, మేరీరాణి, సంజీవి ఇత్యాదులు పేర్కొనదగినవి.

కథానిక : పాశ్చాత్యభాషాసంపర్కమువలన ఆధునికముగా ఆంధ్రభాషలో ఉద్భవించిన సాహితీవిభాగమిది. ఒక చిన్న సంఘటననుకాని, కొన్ని సంఘటనలనుకాని వస్తువుగా తీసికొని రచించినది కథానిక యనిపించుకొనును. ఇది క్లుప్తముగనుండి కొలదికాలమున మాత్రము చదువుకొనుటకు వీలుగానుండును. ఇట్టి శిల్పమును దృష్టియం దుంచుకొని పలువు రాంధ్రరచయితలు ఉత్తమ కథలను సృష్టించిరి. కీ. శే. గురజాడ అప్పారావుగారి క థానికలే ఆంధ్రమున మొదటి రచనలుగా భావింపబడుచున్నవి. చిలకమర్తివారు కథానికలనదగిన 'చమత్కారమంజరి', 'భారతకథామంజరి' మొదలగువాటిని రచించిరి. కాని ఇందలి భాష గ్రాంథికము. విశ్వనాథ సత్యనారాయణగారు కూడ కొన్ని చిన్నకథలు వ్రాసినారు. వ్యావహారిక వచనమున నున్న అడివి బాపిరాజుగారి తరంగిణి, రాగమాలిక, అంజలి అను సంపుటములు ఉత్తమ కథానిక ములు. శిల్పమును దృష్టియం దుంచుకొని కథానికా రచన చేసినవారిలో ముఖ్యులు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు. వీరి కథలు ఎనిమిది సంపుటములుగా వెలువడినవి. ఇవి మానవజీవితమునకు ప్రతిబింబములు. సరళ వ్యావహారికశైలిని వీ రవలంబించిరి. శ్రీ గుడిపాటి వెంకటచలంగారి కథలు ప్రత్యేకతను చాటుచున్నవి. వీరి కథలన్నియు ఆకర్షకములు. సంప్రదాయోల్లంఘనము, స్వైరవిహారము వీరి రచనాలంబనములు. వీరి 'హంపీ కన్యలు', 'సినిమాజ్వరము' ఆంధ్రపాఠకుల మన్ననలను పొందినవి. శ్రీ కొడవటిగంటి కుటుంబరావు స్వతంత్రముగా కథారచనచేయుటయందు నైపుణ్యముకలవారు. వీరి కథలలో చెప్పదగినది ఉత్తమ పాత్రపోషణ. ఇందు వ్యంగ్యము, చమత్కారము అంగములుగానుండును. శైలి వ్యావహారికమే. ‘పక్షికోసం వెళ్ళినపంజరం', 'లేచిపోయిన మనిషి', 'ఆడజన్మ' మున్నగు కథలు ప్రఖ్యాతములు. ఇవిగాక చింతాదీక్షితులుగారి ఏకాదశి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారి కథలు, పాలగుమ్మి పద్మరాజుగారి గాలివాన, బుచ్చిబాబుగారి నిరంతరత్రయం, పేర్కొనదగినవి. శ్రీ భరద్వాజ, ధనికొండ, మధురాంతకం రాజారాం, భాస్కరభట్ల కృష్ణారావు, పొట్లపల్లి రామారావు మొదలగువారుకూడ కథకులుగా ప్రసిద్ధిపొందిరి. కథానిక వలన వ్యావహారిక వచన రచన చక్కని ప్రాచుర్యమును పొందినది.

వ్యాసములు, విమర్శనములు, పరిశోధనలు : ఆథునిక వ్యాసకర్తలలో అగ్రగణ్యులుగా పేర్కొనదగినవారు పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు. ఆంగ్లమునగల 'స్పెక్టేటరు' అను వ్యాసముల ననుసరించి వీరు తెలుగున వ్రాసిన వ్యాసములు 'సాక్షి' యను పేర ఆరు సంపుటములుగా ప్రచురితములై బహుజనామోదమును పొందినవి. సాంఘిక దురాచారములు విమర్శన మిందు ముఖ్య వస్తువు. చమత్కారముగా వ్యంగ్యముగా నెంతటి గంభీర విషయమునైనను చెప్పుటయందు వీరికిగల నేర్పు అద్వితీయము. శైలివ్యావహారికమునకు సమీపముగా నుండు గ్రాంథిక వచనము. తెలుగున ఇంతటి ప్రసిద్ధి వహించిన వ్యాసకర్తలు మరెవ్వరును లేరు.

ఆంధ్రదేశమున వెలువడు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, కృష్ణాపత్రిక ఇత్యాదుల ద్వారమున పెక్కు వ్యాసములు ప్రచురితములైనవి. ఇందలి సంపాదకీయ వ్యాసములు వివిధ విషయభరితములు, ముట్నూరి కృష్ణారావుగారి వ్యాసములు “సమీక్ష" యనుపేర సంపుటీకరింపబడినవి. చరిత్రకు సంబంధించిన పెక్కువ్యాసములు కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావుగారు రచించియున్నారు. వీరి ననుసరించి మల్లంపల్లి సోమశేఖరశర్మగారు వ్రాసిన వ్యాసములు ప్రసిద్ధినార్జించినవి. శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తిగారి విద్యార్థి ప్రకాశిక కోరాడ రామకృష్ణయ్యగారి సారస్వత వ్యాసములు, వావిలాల సోమయాజులుగారి మణిప్రవాళము మున్నగునవి ఉత్తమ వ్యాస సంపుటములు.

ఆంగ్ల విమర్శన శిల్పము నాదర్శముగా గొని ఆంధ్రమున విమర్శనము వ్రాసినవారిలో మొదటివారు కీ. శే. కట్టమంచి రామలింగారెడ్డిగారు. వీరి కవిత్వ తత్త్వ విచారము ఉత్తమ విమర్శన గ్రంథము. కళాపూర్ణోదయమును గురించి వీరు వ్రాసిన వ్యాసము భవిష్యద్రచయితలకు మార్గదర్శకమైనట్టిది. సరస సాహిత్య విమర్శకు అనంతకృష్ణశర్మగారి రచనలు లక్ష్యములు. వీరి 'నాటకోపన్యాసములు', ‘సారస్వతాలోకనము' విమర్శనాత్మక వ్యాసములు. విశ్వనాథ సత్యనారాయణగారి 'నన్నయ్యగారి ప్రసన్నకథా కలితార్థయుక్తి' ఒక చక్కని విమర్శన గ్రంథము. పుట్టపర్తి నారాయణాచార్యులుగారి 'ప్రబంధ నాయికలు', కేశవపంతుల నరసింహశాస్త్రిగారి 'ప్రబంధ పాత్రలు', కోరాడ రామకృష్ణయ్యగారి 'ఆంధ్ర భారత కవితా విమర్శనము' పేర్కొనదగినవి.

ఆధునిక యుగమున ఆంధ్రవాఙ్మయ చరిత్రలు కొన్ని వెలసినవి. వెంకటనారాయణరావుగారు వ్రాసిన ఆంధ్రవాఙ్మయ చరిత్రము సంగ్రహమైనను సమగ్రమైనది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు రచించిన ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్రహము క్రీ. శ. 1800 వరకు గల సాహిత్య పరిణామమును వర్ణించు సరళ వచన గ్రంథము. వీరు, ఖండవల్లి బాలేందుశేఖరంగారితో కలిసి రచించిన 'ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి'అను గ్రంథము సమగ్రాంధ్ర సంస్కృతిచరిత్రను వివరించు ఏకైక గ్రంథము. కీ. శే. కురుగంటి సీతారామయ్యగారు వ్రాసిన 'నవ్యాంధ్ర సాహిత్య వీథులు' ఆధునిక సాహిత్యమున సమగ్ర సమీక్షాగ్రంథము. ఇవన్నియు సులభ గ్రాంథిక వచనములుగా నున్న వే.

కీ. శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఆంధ్ర పరిశోధకులలో ప్రముఖస్థానము నాక్రమించగలవారు. వీరు రచించిన శృంగార శ్రీనాథము చారిత్రకముగను, సాహిత్యకముగను పెక్కు నూత్న విషయములను తెలుపు గ్రంథము. మరికొన్ని వ్యాసములు వీరు రచించినవి మీగడ తఱకలు, సింహావలోకనము అను పేర ప్రచురింపబడినవి. ఇవియు పరిశోధనాత్మకములే. శ్రీ నిడదవోలు వెంకట్రావుగారి ఆంధ్రకవులు జీవితములు, దక్షిణాంధ్ర కవులు అనునవి మదరాసు విశ్వవిద్యాలయమువారు ప్రకటించిన సాహిత్య పరిశోధన గ్రంథములు. కీ. శే. ప్రతాపరెడ్డిగారు బహువిధముల మత సాంఘిక విషయములను శోధించి, ఆంధ్రుల సాంఘిక చరిత్రమును కూర్చిరి. వివిధ వస్తు సంబంధములైన పరిశోధన వ్యాసములు పెక్కు సాహిత్య పత్రికలలో ప్రచురితమైనవి. ఈకాలమున భాషావిషయమగు పరిశోధన కూడ జరిగినది. ఆంధ్రము ద్రవిడ భాషాజన్యమను కాల్డ్వెలు గారి సిద్ధాంతమును గ్రహించి కోరాడ రామకృష్ణయ్యగారు భాషాచారిత్రక వ్యాసములు, గంటి జోగిసోమయాజిగారు ఆంధ్రభాషా వికాసము అను గ్రంథములను వ్రాసిరి. శ్రీ సోమయాజిగారి గ్రంథము పరిశోధనాత్మకములలో బృహత్తరమైన గ్రంథము. ఆంధ్రము సంస్కృతభాషా జన్యము అను సిద్ధాంతమును బలపరచిన కీ. శే. చిలుకూరి నారాయణరావుగారి గ్రంథముకూడ పెక్కు పరిశోధన విషయములతో కూడి యున్నది. పరిశోధనమునకు సంబంధించిన పటములకు విశ్వవిద్యాలయము లందు పరిశ్రమించిన పలువురు పండితులు ఉత్తమ బృహద్వ్యాసములను రచించియున్నారు. ప్రాఙ్నన్నయ యుగమునందలి భాష, ఆంధ్రభాషపై నాంగ్లభాషా ప్రభావము, ఆంధ్ర జానపద వాఙ్మయము, యక్షగానము మొదలగు శీర్షికలతో ప్రామాణిక పరిశోధనలు జరిగినవి.

ఆధునిక కాలమున ఇరత సాహిత్య ప్రక్రియలకన్న హెచ్చు వేగముగాను, సర్వతో ముఖముగాను వచనము అభివృద్ధిచెందుట ముదావహము.

ఎం. కు.