సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/ఖనిజముల రంగులు
ఖనిజముల రంగులు : పదార్థములనుండి పరావర్తనముచెంది గాని, వెలువడి గాని లేక సరిగా ప్రసరించిగాని వచ్చిన వెలుతురు, నేత్ర ప్రణాళిక యందు కల్పించు వికారములనుబట్టి మనము ఆ పదార్థములయొక్క రంగులను గుర్తించుచున్నాము. దీనికి మూడు విషయములు సంబంధించి యున్నవి. (1) ప్రకాశము (illumination) యొక్క స్వభావము, (2) పదార్థముయొక్క స్వభావము, (3) కన్ను.
భూమియందలి రాళ్ళు నానావిధము లయిన ఖనిజముల కలయికల వలన ఏర్పడుచున్నవి. ఈ ఖనిజములు దాదాపు నిశ్చితమైన రసాయనిక సంఘటన (Chemical Composition) గల్గిన అంగారక పదార్థములై (Inorganic Substances) యున్నవి. ప్రకాశముయొక్క స్వభావమును, కన్నుయొక్క వర్ణగ్రహణ శక్తియు సాధారణముగా నున్నప్పుడు, ఖనిజము లందలి వన్నెయు, తదితర విషయములును, ఆయా ఖనిజముల యొక్క రసాయన సంఘటన పైనను, దీనికి ప్రత్యక్షముగానో, పరోక్షముగానో సంబంధించినట్టి ఇతర భౌతిక లక్షణముల పై నను ఆధారపడి యుండును. నానావిధములయిన రంజనములను (Colourations), వర్ణ ప్రతిరూపములను (Colour Patterns) కల్పించుటయందు బాహ్య పదార్థ లేశములు (Impurities) ప్రముఖమైన పాత్రను వహించుచున్నవి ఇవి చిన్న చిన్న దండములు (Rods), పళ్ళెములు, కడ్డీలు, గీతలు (Laminations) మున్నగు రూపములలో నున్నపుడు ఖనిజములలో అనేక విధములయిన, సుందరములగు నక్షత్ర రూపములును (Star impressions), వర్ణ విలాసములును కల్పించబడును. ఖనిజములలో వర్ణోత్పత్తికి కారణభూతము లయిన ఇతర భౌతికధర్మము లేవనగా - కాంతి నిరోధక (opaque), పారదర్శక (transparent) అసమగ్ర పారదర్శక (translucent) స్వభావము; వక్రీభవన గుణకము (refractive index), వెలుగు (lustre), ప్రకాశ పృథఃకరణము (dispersion), స్ఫటికత్వము (crystallinity), లేక నిరాకారస్థితి (amorphous state) : స్ఫటిక నిర్మాణము (Crystal Structure); ద్వివక్రీకరణము (double refraction) నకు సంబంధించిన ధర్మములు, వెలుతురుయొక్క అభిస్పందనము (Polarisation of light); ద్విదిజ్ఞ్నానావర్ణత (dichroism), మరియు చకాస (luminiscence)
పెక్కు ఖనిజములు వాటియొక్క రాసాయనిక సంఘటననుబట్టి విశిష్టములైన వర్ణములు గలిగియున్నవి. అట్టివాటికి ఇడియోక్రొ మేటిక్ ఖనిజము లని పేరు (Idiochromatic), ఉదా. స్వాభావిక లోహములు (Native Metals): బంగారు, రాగి మొ. అలోహ మూలకములు (Non-metallic elements) : గంధకము, రాగి, యురేనియము, కోబాల్ట్, నికెలు మొ. లోహములతో కూడిన ఖనిజములు.
వర్ణము రసాయనిక సంఘటనపై ఆధారపడునను సత్యము తామ్ర ఖనిజములలో స్పష్టమగుచున్నది. ఈ లోహముయొక్క గంధకిదముల (Sulphides) యొక్క విశిష్ట లక్షణములు లోహకాంతియు (metallic lustre), అపార దర్శకత్వమును. అట్టి కొన్ని తామ్ర గంధకిదముల ప్రత్యేక వర్ణములు ఈక్రింది విధముగా నున్నవి : ఛాల్ కోపై రైట్ (Chalcopyrite Cu Fe S2) గాఢ మయిన ఇత్తడి పీతవర్ణము (deep brass yellow Colour); ఛాల్ కోసైటు (Chal Cocite = Cu2S నల్లగనుండి మందమయిన కాంతి గలిగియున్నది; కోవెలెట్ (Covellite = Cu S) సాధారణముగా ఇతర తామ్ర ఖనిజములపై నున్నని నెమలిపింఛపు రంగుగల పూతగా నేర్పడును. బోర్నైట్ (Bornite=Cu5 Fe S4) ధూమ్రవర్ణము, కొంచెము నీలము, ఎరుపు వన్నెగలిగి యుండును. కావుననే దీనిని "బహువర్ణ తామ్రఖనిజము" (Variegated Copper ore) అని అందురు. దీనిలో క్రొత్తగా పగులువారిన ఉపరిభాగము ఇత్తడి రంగును లేక గోధుమ వన్నెయు గలిగి యుండును.
తామ్ర ఆమ్లజనిదములు (oxides) కాంతిమంతము లైన వర్ణములు గలవిగా నుండును. రూబీ కాపరు (Ruby Copper) అను మారు పేరుగల క్యూప్రయిటు (Cuprite) విశిష్టమయిన ఎరుపు రంగు, ఉపలోహకాంతి (Sub-metallic Lustre) లేక వజ్రపు మెరుపు గలిగి యున్నది. దీనికి కారణము దానియొక్క మిక్కిలి హెచ్చయిన వక్రీభవన గణక మే (2.85). ఆకుపచ్చరంగు గల్గిన మాలకైట్ (Malachite), మబ్బురంగు గల్గిన అజురైట్ (Azurite) అను రెండును రాగియొక్క క్షార కర్బనిదములు (Basic Carbonates of copper). ఈ రెండు రంగులకును గల తేడాకు కారణము మొదటి దానితో కూడియున్న అధిక జలమే. ఇనుము యొక్క ఆమ్ల జనిదములలోను, జలీయత ఆమ్ల జనిదములలోను (Hydrated oxides) గల ప్రాణవాయువుయొక్కయు, నీటియొక్కయు మొత్తములు వాటియొక్క వర్ణములను నిర్ణయించును మాగ్నటైటు (Magnatite Fe3 O4 ) కాంతి నిరోధకముగాను, నల్లగాను ఉండి, ధాత్వీయ కాంతితో నొప్పుచుండును. కాని దీని స్ఫటికములు సాధారణముగా కాంతి విహీనములై యుండును దీని యొక్క గీటు అనగా దాని చూర్ణము యొక్క వన్నె నల్లగా నుండును. హేమటైటు (Hematite Fe2 O3 ) స్వచ్ఛమైన ధాత్వీయ కాంతి గలిగి నల్లగానుండును. కాని చూర్ణము గోధుమ లేక నెత్తురు రంగు గలిగి యుండును. ఇనుముయొక్క జలీయత ఆమ్లజనిదము (Hydrated Oxides) లయిన గోధైట్ (Goethite), లిమొనైట్ (Limonite) గోధుమ, పసుపు పచ్చ మొదలగు రంగులుగా నుండును. ఇవి కూడ హేమటైట్ వలె రంగుల పరిశ్రమలో ఉపయోగపడును.
పాషాణ - గంధకిద ఖనిజములు (Arsenic Sulphides) రెండు గలవు. ఇవి 1. నిమ్మపండువలె పచ్చగా నుండు ఆర్ ఫి మెంటు (Orphiment As2 S2). 2. ఎఱ్ఱని ఎరుపుగానుండు రియాల్‌గార్ Realgar (As2 S2) రెండవదాని యొక్క అణువులో (Molecule) ఒక గంధకపు పరమాణువు (atom) తక్కువ అగుటవలన ఈ రెండు ఖనిజములలోను రంగు భేదము గలుగు చున్నది.
పిచ్ బ్లెండ్ (Pitch blende) లేక యురేనియ ఆమ్లజనిదము నల్లనై, కాంతి విహీనముగ నుండెడు అనాకర్షణీయమైన ఖనిజము. కాని - రాగి, కాల్షియము, భాస్వరము లేక పాషాణము (ఆర్శినిక్) లు దీనిలో చిన్న మొత్తములలో కలసి యున్నప్పుడు యీ ఖనిజములు ఉజ్జ్వలమైన కాంతితో నొప్పును.
సాధారణముగా ఖనిజములందు చాలా సూక్ష్మరూపములలో రంగు నిచ్చెడి ఇతర పదార్థములు సమముగా కలిసి యుండుటవలన ఆ ఖనిజములకు ఒకే రంగు (homogeneous colouration) ఏర్పడును. అట్టివి అల్లోక్రొమాటిక్ (Allochromatic) అనబడును అట్టి ఈ తరగతికి చెందిన ఖనిజములయొక్క రంగును, వాటి ముఖ్య ధర్మములలో మార్పు లేకుండా కృత్రిమ పద్ధతులతో మార్చుటగాని లేక పూర్తిగా తొలగించుట కాని సాధ్యము. ఫ్లోరైటు (Fluorite) అను ఖనిజము పరిశుద్ధముగా నున్నపుడు వర్ణ విహీనమై పారదర్శకముగా ఉండును. కానిదానిలో ఇతర పదార్థము లుండుటవలన అపరిశుద్ధత ఏర్పడినపుడు ఆకుపచ్చ, ఊదా, గులాబి, నీలారుణ, పసుపుపచ్చ మొదలగు రంగులు కానవచ్చును. ఒక్కొక్కప్పుడు అది భిన్నవర్ణములు గల గీతలుగూడా గలిగియుండును. క్రోమియం (Chromium) అను మూల ద్రవ్యముయొక్క లేశములు కురువిందము(Corundum) జాతికి చెందిన కెంపు. నీలములకు ఎఱ్ఱ నీలరంగులను, బెరిల్ (Beryl) కు పచ్చవన్నెను (మరకతము) అబ్బునట్లు చేయును. సాధారణముగా చూర్ణముగానున్న ఖనిజముయొక్క రంగు ఘనరూపమున నున్నప్పటి రంగుకంటె భిన్నముగ నుండును. ఏదేని ఖనిజమును గరుకుగా నున్న పింగాణీ పలక పై రుద్దిన, దాని చూర్ణముయొక్క రంగు లేక గీటు లభించును. గీటు పెక్కు ఖనిజములయొక్క విశిష్ట లక్షణమై యున్నది. ఐరన్ పైరైట్స్ (Iron Pyrites) ఘనరూపములో నున్నప్పుడు ఇత్తడివలె పచ్చగా నున్నను దాని గీటు నల్లగా నుండును. క్రోమైట్ (Chromite) ముదురుగోధుమ రంగుగానో లేక నల్లగానో ఉండి, దాని గీటు ఎరుపు. గోధుమరంగులో నుండును. ఇడియోక్రొమాటిక్ ఖనిజముల గీట్లు సాధారణముగా రంగుగను, అల్లోక్రొమాటిక్ ఖనిజముల గీట్లు తెలుపు లేక బూడిద రంగులుగను ఉండును. ఛాల్సిడోనీ (Chalcedony)వంటి కొన్ని ఖనిజములలో మాంగనీసుయొక్క ఆమ్లజనిదము, హరితము (chlorite) వంటి ఇతర ఖనిజములు వ్యాపించి ఉండుట వలన వానిలో చెట్టుకొమ్మల వలె విస్తరించిన ట్లగపడు నమూనాలు కానవచ్చును. ఖనిజములలోనున్న మలినము (impurity) నందు నిరంతరము మార్పులు గలుగుట వలన అగేట్ (Agate) లో వలె చిత్రవర్ణములు గల పెక్కు పొరలు అందు ఉద్భవించును.
పెక్కు ఖనిజముల నుండి విలక్షణమైన ప్రకాశము గోచరించును. దీనికి కారణము ఖనిజముల యందున్న కాంతి పరావర్తనము చెందుటయే. ఒక్కొక్కప్పుడు సూక్ష్మరూపములలో ఖనిజ లక్షణములు గల యితర పదార్థములు, గాజు పదార్థములు, ద్రవపదార్థములు లేక వాయువులు - కలసిఉండుట వలన ఖనిజములలో రంగు లేర్పడుచున్నవి. ఈ పైన చెప్పిన కలయికలు లేనియెడల రంగులు ఏర్పడజాలవు. హైపర్‌స్తీన్ (Hypersthene)లో ఇల్‌మెనైటు (Ilmenite) అను ఖనిజము సూక్ష్మ రూపములో చేరిఉండుటచే దానికి మెరుపు గలుగును. సహజముగా కాంతి విహీనమయినప్పటికి దానిలో వివిధ రూపములలో అనేకములయిన ఇతర పదార్థములు కలసి ఉండుటచే లాబ్రొడరైట్ (Lobrodorite) లేక చంద్ర కాంతము కొన్ని కోణముల వద్ద వెలుతురును గ్రహించినపుడు మిక్కిలి ప్రకాశము గల నీలము, ఆకుపచ్చ, ఎరుపు లేక ఇత్తడి రంగులను ప్రదర్శించును. అట్లే ఆలిగోక్లేస్ (Oligoclase) లో ఒక జాతికి చెందిన సూర్యకాంతము నందు హెమటైట్ యొక్క అనేక సూక్ష్మకణము లుండుటచే ఆ మణికి ఎఱ్ఱని వన్నెయు, తళతళలాడు కాంతియు చేకూరును. ఖనిజము యొక్క సహజమైన వన్నె యే గాక, దానిపై ఆవరించియున్న, లేదా, దానితో కలసియున్న సన్ననిపొరలపై సూర్యుని వెలుతురు పడుటవలన గూడ రంగులు కన్పడును. ఈ ధర్మమునకు ఇరిడిసెన్స్ (Iridiscence) అని పేరు. ఇది వెలుతురు యొక్క జోక్యము (Interference) వలన ఏర్పడు చున్నది. ముఖ్యముగా ఓపల్ (opal) అను మణి యందు ఈ ధర్మము బాగుగా కాననగును. ఓపల్ అనిశ్చితము లయిన నీటి మొత్తములు గలిగి ఘనీభవించియున్న ఇసుక రాయి. ఇది ఒక సంశ్లిష్టమగు పొరలు పొరలుగా నున్న నిర్మాణము కలది. ఈ సూక్ష్మములైన పొరలపై వెలుతురు పడినప్పుడు అవి సన్నని ద్రవపదార్థముల పొరల వలెనే ప్రవర్తించును. ఆ పొరలనుండి బహిర్గతమగు వెలుతురు యొక్క ఒక భాగము, వాటి ఉపరితలముపై వెంటనే పరావర్తనము చెందును. మరియొక భాగము మొత్తము పొరలచేత వక్రీభవనము చేయబడి, తరువాత వాని క్రిందిభాగముచే పరావర్తనము చెందబడును. ఈ భాగము పొరయొక్క ఉపరితలము నుండి బహిర్గతమగు నప్పటికి, రంగునందలి కొన్ని యంశములు అర్ధతరంగ పరిమాణముచే (half wave length) వెనుకబడి, మరియొక ప్రకాశవంతమగు భాగమునందలి అంశములతో సంఘర్షించి, వాటిని పూర్తిగా నాశన మొనర్చును. ఈ విధముగా కొన్ని వర్ణాంశములు (colour components) మాత్రమే మిగిలి విచిత్రవర్ణములను (Play of colours) కల్పించును.
ఖనిజములలో ఒకే ఒక దిశలోనున్న రేఖాపుంజములు కారణముగా (bundles of lines) కాటోయెన్సీ (chatoyancy) లేక cat's eye effect ఏర్పడును. ఈ రేఖాపుంజములున్న దిశకు సమకోణములో (at right angles) రాతిని చూచినచో, పుంజమునకు అడ్డముగా ఒక కిరణసమూహము ప్రసరించుట కన్పించును. పై చెప్పబడిన రేఖాపుంజములు అగపడుటకు కారణములు — ఇతర ఖనిజములు సూక్ష్మరూపములలో కలిసి ఉండుట (ఉదా : రుటైల్); గొట్టములరూపములో నున్న రంధ్రము లుండుట లేదా ప్రతి స్ఫటిక రేణువులు (colloidal particles) లేక వీటియొక్క సమ్మేళనము వలనగాని కావచ్చును. 'కాట్స్ ఐ ఎఫెక్ట్' (cat's eye effect) ధర్మము క్రైసోబెరిల్ అను ఖనిజమునందు బాగుగా కాననగును. కొన్ని ఖనిజములలో ముఖ్యముగా కురువిందముయొక్క (corundum) కొన్ని నమూనాలలో ఆస్టెరిజమ్ (Asterism) లేక నక్షత్ర రూపప్రదర్శనము సామాన్యముగా అగపడును. దీనికి కారణము, ప్రధాన స్ఫటికాక్షమునకు (Principal Crystallographic axis) సమకోణములోను, పరస్పరము 60 డిగ్రీలవద్దను, వంగియున్న రేఖాపుంజముల యొక్క క్రమబద్ధమైన ఏర్పాటే. ఈ గుణము చూపు రాళ్ళను ఆస్టెరియాస్ (asterias) లేక నక్షత్రమణులు, నక్షత్రపద్మరాగములు, నక్షత్ర ఇంద్రనీలములు అని అందురు.
వెలుతురును ప్రసరింప జేయుటయందు వివిధ పదార్థములు భిన్నప్రకృతులను గలిగియుండును. ఇవి 4 రకములుగా విభజింపబడినవి. అవి యేవన - 1. పారదర్శకము (Transparent) - అనగా ఒక వస్తువు యొక్క ఆకారరేఖలు, సామాన్య దళసరితనముగల పదార్థముగుండా చూచినపుడు స్పష్టముగ కన్పించును. 2. అస్పష్ట పారదర్శకము (Semi Transparent) అనగా వస్తువు కన్పించినను, ఆకారరేఖలు అస్పష్టముగా నుండును. 3. అర్ధపారదర్శకము (translucent) - అనగా వెలుతురు అంచులగుండా మాత్రమే ప్రసరించును. 4. అపారదర్శకము (opaque) - వెలుతురును ఏమాత్రము ప్రసరింపనీయనివి.
వక్రీభవనము (Refraction) : ఒకానొక తరంగ పరిమాణము (wave length) గల వెలుతురు గాలినుండి (గాలియొక్క వక్రీభవనశక్తి ఇంచుమించుగా సున్న) ఏ పదార్థము లోనికైనను ప్రసరించునపుడు కిరణము పొందిన వక్రీభవనము యొక్క స్వభావము, ఆ పదార్థము యొక్క వక్రీభవనశక్తి (Refractive Power) పై గాని లేక దృక్ సాంద్రత (optical density) పై గాని ఆధారపడియుండును. ఏక పతనకోణము (గాలిలో) (single angle of incidence), ఏక వక్రీభవనకోణము (పదార్థము) ల నిష్పత్తికి పదార్థముయొక్క వక్రీభవన గణకము అని పేరు. ఇది వెలుతురును ప్రసరింపజేయు ప్రతి పదార్థమునకు స్థిరమయిన దృక్ పరిమాణము (optical constant). అందువలన దానిని నిర్ణయించుటచే ఖనిజములను పోల్చుకొనుటయందు అది మిక్కిలి ఉపయోగపడుచున్నది. గాలియొక్క వక్రీభవన గణకము 1 (ఒకటి) గా నిర్ణయించబడెను. ఇది ప్రమాణముగా తీసికొనినచో గాజుయొక్క వక్రీభవన గణకము = 1 .53; శిలాస్ఫటిక ము (quartz) = 1.54; గార్నెట్ (garnet) = 1.78 నుండి 1.88 వరకు; వజ్రము = 2.42; రుటైల్ (Rutile) = 2.6 నుండి 2.9 వరకు ఉండగలదు.
ఒక ఖనిజమును, లేదా దానియొక్క భాగమును పరావర్తనము చెందిన వెలుతురులో చూచినపుడు అగపడు రూపము ప్రకాశమనబడును (lustre). ఇది ఆ ఖనిజము యొక్క వక్రీభవన గణకము మీదను, నిర్మాణము మీదను, పారదర్శకత్వము మీదను ఆధారపడియుండును. ఖనిజముయొక్క కఠినత్వముకూడ వీనికి సంబంధించినదే. కఠినత్వము ఎంత హెచ్చుగానున్న, ఖనిజమునకు అంత నునుపుగా సానపెట్టవచ్చును. హెచ్చయిన వక్రీభవన గణకము గల ఖనిజములు వజ్రకాంతిని గలిగియుండును. కొన్ని ప్రత్యేకమగు కాంతుల పేర్లు, వాటినిగలిగి ఉండు ఖనిజములు ఈ క్రింద నియ్యబడినవి :
కాంతి | దానిని కలిగి ఉండు ఖనిజములు |
రెసినస్ (Resinous) | ఓపాల్, హెస్సినైట్ గార్నెట్, ఆర్ పి మెంటు |
సిల్కీ (Silky) | క్రైసోటైల్, శాటిన్ స్పార్, ట్రిమొలైట్ |
గ్రీజీ (Greesy) | సోవ్‌స్టోన్ |
మెటాలిక్ లేక లోహ కాంతి | అపార దర్శకము లగు అనేక ధాత్వీయ ఖనిజములు |
స్ఫటికత్వము (crystallinity) : ఒక ఖనిజములోని అణువులు ఒక క్రమము ననుసరించి ఉన్నప్పుడు దానికి ఒక స్ఫటికాకృతి కలుగును. అణు నిర్మాణము క్రమబద్ధముగా లేని ఖనిజములు నిరాకృతి (amorphous) గలవిగా నుండును. స్ఫటికాక్షముల (crystallographic axes) యొక్క అన్యోన్య అభినమనము (mutual inclination) ను బట్టియు, వాటి పొడవు, నిష్పత్తులను బట్టియు స్ఫటికములన్నియు ఆరు సంహతులుగా విభజింప బడెను.
ద్వివక్రీభవనము (Double Refraction) మరియు ద్వివర్ణత (Dichroism): ఒక పదార్థము నుండి వెలుతురు యొక్క కిరణము ప్రసరించి ఏకకిరణముగానే బయల్వెడలినచో దానిని ఏక వక్రీభవనము (Singly refracting) లేక ఐసోట్రోపిక్ (Isotropic) అని అందురు. ఉదా. స్ఫటికాకారము లేని పదార్థములు (amorphous Substances) మరియు క్యూబిక్ స్ఫటిక సంహతికి (cubic crystal system) చెందిన ఖనిజములు ఇతర సంహతులకు చెందిన పదార్థముల స్ఫటికములలో పతనకిరణము (incident ray) రెండుగా రూపొంది, ఆ రెండును స్ఫటికములో భిన్నమార్గముల ప్రవర్తించును. అట్టి ఖనిజములన్నియు ద్వివక్రీభవనములు (doubly refractive) లేక (anisotropic) అనబడును. అట్టివాని గుండా వెలుతురు ప్రసరించునప్పుడు వక్రీభవనము నందలి భేదమే గాక దాని యొక్క సెలెక్టివ్ శోషణము (selective absorption) లో గూడ భేదముండును. ఇందువలన వాటి రంగులలో భేద మేర్పడును. ఈ ధర్మమును ద్విదిజ్ఞ్నా నావర్ణత (dichroism) అందురు. ఇది రత్న పరీక్ష యందు చాలా ముఖ్యము. రంగుగల ఖనిజముల యొక్క ద్విదిజ్ఞా నావర్ణతను డైక్రొ స్కోప్ (dichroscope) అను ఉపకరణము యొక్క సాయమున బాగుగ తెలిసికొనవచ్చును. ఈ ఉపకరణములో ద్వివక్రీభవన ఖనిజము యొక్క జంట రంగులు కాననగును. పై ధర్మమును కల్గిన ఖనిజముల ఉదాహరణములు: బయోటైట్ (biotite), కసిటరైట్ (cassiterite), టూర్మలీన్ (tourmaline), జిర్ కన్ (zircon), స్ఫీన్ (sphene), రుటైల్ (rutile) హైపర్ స్తీన్ (hypersthene), హారన్ బ్లెండు (hornblende) మొదలగునవి. రంగులేనట్టి లేక తెల్ల రంగు గల ఖనిజములు ద్వివక్రీభవనములై నప్పటికిని ద్విదిజ్ఞ్నా నావర్ణతను ప్రదర్శింపవు
స్వయంప్రకాశము (Luminiscence) : అల్ట్రావయలెట్ కిరణములు (ultra violet rays), ఎక్సు- కిరణములు (X-Rays), కాథోడ్ (cathode) కిరణములు లేక రేడియో ధార్మిక కిరణములు కొన్నికొన్ని ఖనిజములపై ప్రసరించినపుడు అవి ప్రకోపింపచేయబడి అందమైన రంగులతో వెలుగును. ఈ కిరణ సముదాయములు వాటి యొక్క తరంగ పరిమాణము కంటె సాధారణమైన వెలుతురుయొక్క తరంగపరిమాణము తక్కువగా నుండుటచే మన కంటికి అదృశ్యములు. ఈ రకపు ప్రకాశము చీకటి యందు గాని, వెలుతురు తక్కువగా నున్నప్పుడు గాని చక్కగా కన్పించును. పై జెప్పబడిన కిరణములు ఖనిజముమీద పడిన తర్వాతగూడ ఆ ఖనిజము ప్రకాశించు చుండినచో, ఆ గుణమును ఫాస్ఫారిసెన్స్ (phosphorescence) అందురు. ఖనిజముల యొక్క స్వయం ప్రకాశత్వము అల్ట్రావయలెట్ కిరణముల సహాయముతో బాగుగా గోచరించును. స్వయం ప్రకాశ పదార్థములు ఈ కిరణ విసర్జనముల (Radiations) ఒత్తిడిచే శక్తిని (energy) లో గొనును. అందువలన వాటి పరమాణువుల (atoms) యందలి ఎలక్ట్రానులు (electrons) విస్తృతమయిన మండలములలో తిరుగ మొదలిడును. ఈ కారణముగా ఆ పదార్థములో అస్థిరపరిస్థితులు ఏర్పడి అధికమయిన శక్తి వృద్ధినొందును. అట్టి శక్తి స్వయంప్రకాశ రూపమున విడనాడబడుట చేత ఎలక్ట్రానులు మరల వాటి సహజ మండలములలోనికి వచ్చును. ఈ కారణమున పదార్థములోని అస్థిరపరిస్థితులు సరియగును. ఖనిజములలోను, భిన్నములయిన రాళ్ళలోను గల కలుషములు (impurities), స్ఫటికనిర్మాణములో అవి కలిగించు లోపముల మూలమున, ప్రకాశముయొక్క తీక్ష్ణత, తదితర ధర్మముల మీదను గాఢమయిన ప్రభావమును కలిగియున్నవి. వాటిలో కొన్ని ప్రకాశమును అధికముచేయును. అట్టివానిని చైతన్యకారకము (activators) లందురు. మరికొన్ని ప్రకాశమును అణచివేయును. అట్టివానిని క్లుప్తకము (inhibitors) లందురు. ఉదా: విల్లెమైట్ (willemite) పై అల్ట్రావయలెట్ కిరణములు పడినపుడు ఉజ్జ్వలమయిన ఆకుపచ్చ వన్నెతో ప్రకాశించును. దీనికి కారణము ఆ ఖనిజములో మాంగనీసు లేశరూపమున కలిసియుండుటయే. వజ్రము ఆకాశ నీలవర్ణము, ఆకుపచ్చ లేక పసుపుపచ్చ రంగులతో వెలు గును. ఒక్కొక్కప్పుడు వజ్రములపై సూర్యరశ్మి కొంత సేపు సోకిన తరువాత వాటిని చీకటిలో ఉంచినను ప్రకాశించును. కెంపు (Ruby) శోభాయమానమైన సింధూరవర్ణ (Scarlet) కాంతిని ప్రదర్శించును. ఈ కాంతి కొంత వరకు సాధారణమైన సూర్యరశ్మిలో గూడ చూడనగును. క్రోమియమును కలిగియున్న గులాబి, ఎరుపు వర్ణముల స్పి నెల్సు (spinels) భ్రాశమాన (fluorescent) ఖనిజములకు మరియొక చక్కని ఉదాహరణము. అపురూపములగు (Rare earth) మూలపదార్థములు లేశరూపములో కలిసి ఉండుటవలన ఫ్లోరైట్ (Fluorite) ఖనిజము యొక్క కొన్నిరకములు అల్‌ట్రావయలెట్ కిరణములు వాటిమీద పడినప్పుడు నీలి – ఊదారంగులను ప్రదర్శించును. భ్రాశమానములయిన ఇతర ఖనిజములలో, పసుపుపచ్చ - నీలము వన్నెగల కురువిందము (corundum), షీలైటు (Scheelite), ఓపాల్ (opal) మున్నగునవి పేర్కొనదగినవి.
వై. జి. కె. ఎం.