Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/ఖడ్గతిక్కన

వికీసోర్స్ నుండి

ఖడ్గతిక్కన :

“సార కవితాభిరాము గుంటూరు విభుని - మంత్రి భాస్కరు మత్పితామహునిఁ దలతు" అని తిక్కన సోమయాజి తననిర్వచనోత్తర రామాయణమున భాస్కర మంత్రిని వర్ణించియున్నాడు. ఈ భాస్కరమంత్రికి నలుగురు కొడుకులుండిరి. వారిలో మూడవకుమారుడు సిద్ధనామాత్యుడు. ఇతని కొడుకు తిక్కన. నాల్గవ కుమారుడు కొమ్మనామాత్యుడు. ఇతని కొడుకు కూడ తిక్కన. ఈ తిక్కన లిద్దరు విక్రమసింహపురము ( నెల్లూరు) నేలుచుండిన మనుమసిద్దిరాజు (1252 - 1260) నొద్ద మంత్రులుగా నుండిరి. కొమ్మనామాత్యుని కుమారుడు తిక్కన మహాప్రధానియై, నిర్వచనోత్తరరామాయణము, మహాభారతము రచించి, యజ్ఞము చేసి, తిక్కనసోమయాజి యని ప్రసిద్ధి కెక్కెను. తిక్కన సోమయాజి పెద తండ్రి యగు సిద్ధనామాత్యుని కుమారుడు తిక్కన సేనానియై ప్రసిద్ధి కెక్కెను తిక్కన సేనానిని ఖడ్గతిక్కన యనియు నందురు.

ఖడ్గతిక్కన తండ్రియగు సిద్ధన మనుమసిద్ధిరాజు తండ్రియగు తిక్కప్రభువు నొద్ద మంత్రిగా నుండెను. ఖడ్గతిక్కన తల్లి పేరు ప్రోలాంబ.

తిక్కనసేనాని గృహమును అభినవ దండి యగు కేతన దశకుమార చరిత్రమునందు ఇట్లు వర్ణించెను :


వేడిన నర్థార్థి వృథ పుచ్చనేరని
         దానంబు తనకు బాంధవుఁడు గాఁగ
నెదిరిన జము నైన బ్రదికి పోవగనీని
         శౌర్యంబు తన కిష్టసఖుఁడు గాఁగ
శరణు జొచ్చిన శత్రువరునైన రక్షించు
         కరుణయె తనకు సంగాతి గాఁగ
బలికినఁ బాండవ ప్రభునైన మెచ్చని
         సత్యంబు తనకు రక్షకుఁడు గాఁగ

జగతి నుతికెక్కె రాయ వేశ్యాభుజంగ
రాజ్య రత్నాకర స్ఫూర్తి రాజమూర్తి
గంధ వారణ బిరుద విఖ్యాత కీర్తి
దినప తేజుండు సిద్ధయ తిక్క శౌరి.

వీర నికాయంబు వేద నినాదంబు
          బాయక యే బ్రొద్దు మ్రోయుచుండు
భూసుర ప్రకరంబు సేసలు చల్లంగ
          బాయకెన్నియొ కుటుంబములు బ్రదుకు


బ్రాహ్మణావళికి ధారలు పోసిన జలంబు
          సతతంబు ముంగిట జాలువాఱు
రిపుల కొసఁగిన పత్రికల పుత్రికలను
          బాయక కరణముల్ వ్రాయుచుంద్రు .

మానఘనుడైన తిక్కన మంత్రియింట
మదన సముడైన తిక్కన మంత్రియింట
మహిత యశుడైన తిక్కన మంత్రియింట
మంత్రిమణి యైన తిక్కన మంత్రియింట."

పరశు రాముని ప్రతాపము, ద్రోణా చార్యుని శౌర్యము, కృపాచార్యుని చతురత్వము, అశ్వత్థామ మగటిమి, ఖడ్గతిక్కనయందు మూర్తీభవించినవి.

పశువుల మేపు బీళ్ళ నిమిత్తమై కాటమరాజునకును మనుమసిద్ధి రాజునకును వివాదము పొసగి మహాయుద్ధము సంభవించినటుల కాటమరాజు కథవలన తెలియుచున్నది. ఈ కాటమరాజుకథ తెలుగుదేశములో, అందు ముఖ్యముగా గుంటూరు మండలములోను, నెల్లూరు మండలములోను కడుప్రసిద్ధమై గానము చేయబడు ద్విపద ప్రబంధము.

కాటమరాజు తండ్రి పెద్దిరాజు. పెద్దిరాజు తండ్రి వల్లు రాజు. ఈ వల్లురాజు నెల్లూరు మండలమునందలి కనిగిరి సీమలోని అలవలపాడునకు అధిపతి. వీరు ఆత్రేయ గోత్రోద్భవులగు యాదవుల సంతతికి చెందినవారు. దేశమున అనావృష్టి సంభవింప, వీరు తమ పసుల మందలను తోలుకొని, దక్షిణమునకు వచ్చి మనుమ మనుమసిద్ధి రాజుయొక్క పశువుల బీళ్లలో మేపుకొని పుల్లరి చెల్లింపకయే వెడలిపోయిరి. అన్నంభట్టు అను బ్రాహ్మణుడు రాయబారిగా మనుమసిద్ధిరాజుచే కాటమరాజు కడకు పంపబడెను. కాటమరాజు పుల్లరి చెల్లింపక తగవు పెట్టుకొనెను. అందులకు మనుమసిద్ధిరాజు కాటమరాజును శిక్షించుటకై, తిరునామాల తిప్పరాజు, శ్రీకంఠరాజు, పెదవేగి బొక్కరాజు, పెదవరదరాజు, అర్లుకొండ అచ్చిరాజు, ఆదివన్నె మాదిరాజు, గయికొండ గంగరాజు, ఉర్లకొండ సోమన్న, ఉదయాద్రి ఉమ్మయ్య, చెన్నపట్టణము చంద్ర శేఖరుడు, దేవముని వెంగళయ్య, పట్టుకోట బసవరాజు, కాళహస్తి పాప తిమ్మరాజు, వెలకంచి వెంగళపతిరాజు, ప్రభగిరి పట్టణము పద్మశేఖరుడు మొదలగు యోధుల తోడ్పాటుతో అప్రతిమానమైన ప్రతిభకలిగిన ఖడ్గతిక్కన సేనాధిపత్యము క్రింద సైన్యమును పంపెను.

పల్నాటి ప్రభువైన పద్మనాయడు పల్లికొండ ప్రభువైన చల్ల పిన్నమనాయడు, దొనకొండ అయితమరాజు, ఎఱ్ఱయ్య, భట్టావులరాజు, వల్లభన్న, నాచకూళ్ళ నాయడు. ముమ్మయ్యనాయడు, ఉత్తమరాజు మొదలగు యాదవనాయకులు కాటమరాజుకు సహాయముగా వచ్చిరి. పిన్నమనాయడు ఈ సైన్యమును నడపెను.

ఉభయ సైన్యములు పాలేటి యొడ్డున ఉన్న పంచ లింగాలకొండ కడ ఎదుర్కొన్నవి సర్వేపల్లి మిట్టమీద నెల్లూరి సైనికదళము విడిసెను

ఈ యుద్ధము ఎఱగడ్డ పాటిలో మాఘ బహుళ అమావాస్య, మంగళవారమునాడు జరిగినట్లు కాటమరాజు గ్రంథమువలన తెలియుచున్నది. స్థానిక చరిత్రములవలనగాని ఇతర శాసనములవలనగాని యుద్ధము జరిగిన కాలము నిర్ణయించుట కష్టము. గ్రంథములో తెలుపబడిన వారము, తిథి, మిగిలిన వాటితో సరిపోవుట లేదు.

పిచ్చుకపై బ్రహ్మాస్త్ర మేల యనియు, త్రుటిలో యాదవసేనను చెండాడ గలుగుదుననియు తలచి ఖడ్గతిక్కన కతిపయ సేనను మాత్రము వెంటగొని, తన నిశిత కరవాలమును ప్రచండముగ జళిపించుచు యాదవసేనను తాకెను. యుద్ధరంగమున ఎచ్చట చూచినను తానెయై వీరవిహారము గావించుటచే యాదవసేనా నికాయము వికావికలయ్యెను. అత్తరి చల్ల పిన్నమనాయడు తన సైన్యమును ఉసికొల్పుచు గొప్ప సేనానివహముతో వెనుకనుండి ఖడ్గతిక్కనను గవిసెను. భయంకరముగ తుములయుద్ధము సాగెను. గోవింద యనుచు నాగోపాల గణము అట్టహాసముతో రణక్రీడ సలిపెను.


"....................... ఏక తడవు
చలముకొని యెండలో సమసినరీతి
నాకులన్నియుఁ బండి యామఱ్ఱిమీద
వడిఁ జేసి సుడిగాలి సుడిసిన యపుడు
కారాకు డుల్లిన కై వడితోను
మడిసెను దిక్కన మంత్రి సైన్యమ్ము."

తన సైన్యమంతయు వీరశయనము నొందగా తిక్కన దండనాథు డొక్కడే రణరంగమున నిలిచెను. ఈ విప్ర వీరుని శరీరమునుండి రక్తధారలు ప్రవహించుచుండెను. అత డత్యంతము బడలికచెంది యుండెను. ఇతని అశ్వ రాజము గూడ క్షతగాత్రయై జవసత్వము లుడిగినదాయెను, అయినను పిరుతివియక తిక్కన పోరాడుచునే యుండెను. అప్పుడు కాటమరాజు పక్షమున సేనాపతి యగు పిన్నమనాయడు ఎలుగెత్తి యిట్లనెను :


"పోరు నిల్పఁగదోయి ! భూసురోత్తముడ!
సరిగాదు మాతోను సమరంబు సేయ
నగ్రజన్ములు మీరు యాదవుల మేముఁ
ఉగ్రంబు మామీద నుంచంగ రాదు
తరతరముల తాత తండ్రులు మేము
భట్టుల బ్రాహ్మల వైష్ణవో త్తముల
వెట్టిచెరల్ మాని వెనుక వేసికొని
ప్రాణా లొసఁగి కీర్తి ప్రబలియున్నాము
కడకు బ్రాహ్మణహత్య కట్టుకోరాదు
ఆమీద నెఱుగుదు వన్నియు నీవు
భూమీశు డెఱుగని పోరు నీకేల?"

అని అతని నివారింప, తిక్కన తన సైన్యమంతయు హతమై యుండుటకు విచారించి, ఒక నీతిమార్గము తలచి మరల సైన్యముతో ఎదురుకొనవలయు నని నిశ్చయించి పురమునకు తిరిగిరాగా, పురజనులు చప్పట్లు కొట్టుచు, కేకలు వేయుచు గేలిసేయ దొడగిరి.


"తాటాకులను మోసి తగ వ్రాయఁగాని
చెలఁగి యుద్దము సేయఁ జేత నేమౌను
ఎదిరించి నిలిచిన హెచ్చు సేనలను
సరి సేయ నవి యజ్ఞ శాలలు గావు
అరులపోటులుగాని యక్షతల్ గావు
చనుదెంచు చక్రాలు చక్కిలాల్ గావు
ఘన చక్రబాణాలు గారెలు గావు
అర్చిదూసెడు కత్తు లరిసెలు గావు
పొడిచేటి బల్లెముల్ పూర్ణములుగావు
కుంతముల్ రుచిఁ బప్పుగూరయుఁ గాదు
కమ్మనిపాయసము కాదు కయ్యంబు
వండిన యా పిండి వంటయుఁ గాదు
బంటుతన మే యూరు బ్రాహ్మఁ డే యూరు."

అనుచు ప్రజలు హాస్యము చేసిరి. ఈ మాటలను సరకు చేయక తిక్కన యింటికి పోయెను. ఇతని రాక తండ్రి యగు సిద్ధనామాత్యునకు చాల విచారము కలిగించినది. అందుల కతడు


"కొడుక ! యీ వంశంబు కడుదొడ్డ దోయి
పెద్ద కాలమునాడు పేరుమోసినది
పులికడ్పునను గొఱ్ఱె పుట్టు చందమునఁ
గలిగితి నాయింతి గర్భంబునందుఁ
జదువున శాస్త్రాన సాహసమందుఁ
దిక్కన! నీసాటి ధృతి లేరనంగ
సాహసంబున వారి సాధింపబోయి
యింతగా వెన్నిచ్చి యిటువలె రాను
మగతనంబున బుట్టి మగవాడ వనుచుఁ
బగతుకు వెన్నిచ్చు ప్రాణం బదేల ?
యరులకు నోడి యీయవని మనుకున్న
సరగ రణభూమిలో సమయుట మేలు
పందవుగాని భావజ్ఞుడవు గావు
ఎందుకీప్రాణం బదేల యీ బ్రదుకు.”

అని తూలనాడెను.

ఇక నింటిలో తిక్కన భార్య వీరపత్ని కనుక తన విభుడు పగరకు వెన్నిచ్చి, ఆకలిగొని అలసి వచ్చినాడనుచు


"కడువేగ విభునికి గ్రాఁగిన నీళ్లు
బిందెల చన్నీళ్ళు బిరబిరతెచ్చి
పసిఁడి చెంబుల నీరు పాళాలుచేసి
యక్కడ మంచంబు నడ్డంబు పెట్టి
యద్దశేరు పసుపు నమరంగనుంచి
కూర్చుండి స్నానంబు గొబ్బునఁ జేయుడు.”

అని చెప్పెను. తదుపరి ఆమె యత్తదగ్గరకు వెడలి


"గొబ్బున నీరాడి కూతురు వచ్చుఁ
దీర్చి యడ్డబొట్టు స్థిరముగా బెట్టు
గంధంబు చెక్కిళ్ళ ఘనముగాఁ బూసి
పళ్ళాన నన్నంబు బాగుగాఁ బెట్టుము."

అని అత్తతో విన్నవించె నట. స్నానశాలయందలి ఏర్పాట్లను తిక్కన గమనించెను. ఇదేమి ఇట్లు ఏర్పాటు చేసితి వనగా ఆ వీరపత్ని


“పగఱకు వెన్నిచ్చినచో
నగఱే నిను మగతనంపు నాయకులందున్
ముగురాఁడువారమైతిమి
వగ పేటికి జలకమాడవచ్చిన చోటన్"

అని ఎకసక్కెమాడెను.

భోజనమునకు రాగా, తల్లి కొడుకునకు పప్పుకూరలతో భోజనము పెట్టి విస్తరిలో విరిగిన పాలు పోసెను. “విరిగిన పాలు నాకుఁ బోయంగ నేమి చిత్రంబు ?" అని తల్లి నాతడు అడుగగా, అందుల కా వీరమాత


"అరుణోదయము వేళ నదియెట్లొ కాని
యావులు బెయ్యలు నటు మేయఁబోయి
యరులతోఁ బోరాడి యటుమీద నీవు
విఱిగిన నినుఁ జూచి విఱిగెను బాలు
అసదృశముగ నరివీరులఁ
బసమీఱఁగ గెలువలేక పందక్రియ నీ
వసివైచి విఱిగివచ్చిన
బసులున్ విఱిగినవి, తిక్క! పాలున్ విఱిగెన్”

అని పల్కెనట. ఆత్మాభిమానియైన ఆ మహాయోధుడు తాను చేసిన పనికి పశ్చాత్తప్తుడై తండ్రిని చేరి


"ఓ తండ్రి ! వినవయ్య యొక విన్నపంబు
నాయొక్క కీర్తి యానందంబు నొంద
యదుబలంబులమీది కరుగుచున్నాఁడ
వారిని దునుమాడి వస్తినా మేలు
పోరాడి వారిచే పొలసితినై న
వీరస్వర్గము నలంకరింతు...”

అని తండ్రికి దండము పెట్టి రణరంగములోనికి దూకెను. ఆకలిగొనిన సింహము పగిది గర్జించు తిక్కనను జూచి, పిన్నమనేడు


“బుద్ధిచాలని యట్టి భూసురోత్తముఁడు
యుద్ధంబు సేయ నుద్యోగించినాడు
సర్వదా బ్రాహ్మఁడు చావకపోఁడు
బ్రహ్మహత్య మనకుఁ బాపుకోరాదు”

అని విచారించుచుండగా ప్రఖ్యాతిగల మంత్రి, ధీమంతుడు బ్రహ్మరుద్రయ్య


“బ్రాహ్మణు డాతఁడు శివబ్రాహ్మణుఁడ నేను
బ్రాహ్మణులము పోరు పాటింపగలము"

అని అందరు నివ్వెరపోయి చూచుచుండగా అతడు ముందునకు దూకెను. ఖడ్గతిక్కన అశ్వముపై నుండి యుద్ధము చేసెను. బ్రహ్మరుద్రయ్య వృషభము నెక్కి యుద్ధము చేసెను. పోరు ఘోరముగా జరిగెను. ఇరువురును సమానస్కంధులు. తిక్కన అగ్నిచందమున నలువైపుల ప్రజ్వరిల్ల సాగెను. మెరపువలె మెరయుచు పిడు గడచిన చందంబున ఒక్కవ్రేటుతో రుద్రయ్యను అవనిపై పడవైచెను. రుద్రయ్య క్రిందపడుచునే ఖడ్గము విసరెను. అది సూటిగా వచ్చి తిక్కనతల త్రుంచివైచెను. ఇరువురు సూర్యులు యుద్ధరంగమున అస్తమించిరి. తిక్కనసైనికులలో హతశేషులైనవారు ఈ క్రిందివిధముగా చెప్పుకొని యాక్రందించినారని యొక కవి చెప్పియున్నాడు.


సీ. "ధైర్యంబు నీమేనఁ దగిలియుండుటఁ జేసి
             చలియించి మందరాచలము తిరిగె,
    గాంభీర్యమెల్ల నీకడన యుండుటఁ జేసి
             కాకుత్సుచే వార్థి కట్టువడియె,
    జయలక్ష్మి నీయురస్థలినె యుండుటఁ జేసి
            హరిపోయి బలిదాన మడుగుకొనియె,
    నాకారమెల్ల నీయందె యుండుటఁజేసి
            మరుడు చిచ్చునఁబడి మడిసి చనియె

గీ. దిక్కదండనాథ దేవేంద్రపురికి నీ
    వరుగు టెఱిఁగి నగము తిరుగుటుడుగు
    నబ్ధి కట్టువిడుచు నచ్యుతు నొదమాను
    మరుఁడు మరలఁ గలుగు మగలరాజ.

సీ. నందిని బుత్తెంచె నిందు శేఖరుఁడు నీ
             వన్న యేతెమ్ము తారాద్రికడకు,
    గరుడుని బుత్తెంచె నరహరి రావయ్య
             వడిసిద్ధ తిక్క కైవల్యమునకు,
    హంసను బుత్తెంచె నజుఁడు నీకడకు ను
             భయకులమిత్ర రా బ్రహ్మసభకు,
    నైరావతముఁ బంపె నమరేంద్రుఁ డిప్పుడు
             దివమున కేతెమ్ము తిక్క యోధ

గీ. యనుచు వేఱువేఱ నర్థితోఁ బిలువంగ
    వారువీరుగూడ వచ్చివచ్చి
    దివ్యయోగియైన తిక్కనామాత్యుఁడు
    సూర్యమండలంబుఁ జొచ్చిపోయె."

తిక్కన శౌర్యపరాక్రమ వృత్తాంతము నెల్లూరు చేరగా, సిద్దనామాత్యుడు తనయుని మృతకళేబరము కొరకు రణరంగమునకు వచ్చెను. నెత్తుటి వరదలో తేలియాడుచు నెగిసి నెగిసి పడుచుండెడు తిక్కన కండలను చూచి, తండ్రి కన్నీరు కార్చి, కావి ధోవతిలో పొదివి నెల్లూరికి తెచ్చెను.

పుణ్యాంగనయగు తిక్కనభార్య ఆ కావిధోవతిలోని కండలను చూచి,


“ఓమామ ! వినవయ్య యొక విన్నపంబు
సత్యంబు స్త్రీ పురుష సమ్మతి వినుము
పురుషుడే ముందైనఁ బుణ్యకాంతలకు
బతిగూడి యొక్క టై పరలోకయాత్ర
పుణ్యప్రదంబని పొగడును శ్రుతులు
పతినెడబాయుట పరగదోషంబు
నాప్రాణ విభునితో నన్నంపు"

మని మామగారివలన సహగమనమునకు ఆజ్ఞ తీసికొని భర్తతో సహగమనము చేసెను.

ఖడ్గతిక్కననుగూర్చి యెక చాటుధార:


"ఏమి తపంబు జేసి పర
         మేశ్వరు నేమిటఁ బూజచేసిరో
రాముని తల్లియున్ బరశు
          రాముని తల్లియు భీముతల్లియున్
గాముని కన్నతల్లియును
          గంజదళాక్షు ననుంగు తల్లియున్
శ్రీ మహితప్రతాపు డగు
          సిద్ధన తిక్కన కన్నతల్లియున్ "


"తిక్కన కాటమరాజుగార్లకు యుద్ధమై తిక్కన పరలోకగతుడైన స్థళము యిప్పుడు పట్టపురాయి గ్రామానకు తూర్పు భాగమందున పినాకినీ నదీతీరమందున పూర్వమందు పరశురామ దేవరకు నందనచక్రవర్తి ప్రతిష్ఠచేసిన స్థళము. ఇది ఇప్పుడు స్థళజ్ఞులు ఆ జాగా పేరు తిక్కనపాడు అని చెప్పుకుంటూ వున్నారు. ఆ స్ధళమందు వఖరాయిమీద గుర్రమును అందుపైన వఖ సవార్ను చెక్కి వున్నది. అది తిక్కన మంత్రి ప్రతిమే" అని స్థళజ్ఞులు వాడుకుంటున్నారు" అని పట్టుపురాయి కై ఫీ యతు తెలుపు చున్నది.

కా సీ.