Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కౌటిల్యుడు (అర్థశాస్త్రము)

వికీసోర్స్ నుండి

కౌ

కౌటిల్యుడు (అర్థశాస్త్రము) :

కౌటిల్యుడు మౌర్య రాజ్యస్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుని కుడిభుజము. అతని రాజనీతి ప్రతిభకంటెను ఆతని పాండిత్యము అధికమైనదని చెప్పుటలో అతివ యోక్తి లేదు. ఆయన రచించిన ఆర్థశాస్త్రము బ్రహ్మాండ మైన గ్రంథమేగాక, అమూల్యమైన విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చును. ఆ గ్రంథమువలన భారతీయులకు ఆనాడే విశిష్టమైన ఒక స్వతంత్ర అర్థశాస్త్రము ఉండియుండెనని స్పష్టమగుచున్నది. అంతేగాక దేశములోని ఆనాటి పరి స్థితులను గూడ ఈ మహాగ్రంథము మనకు స్పష్టపరచు చున్నది. ఇది క్రీ. పూ. 300 వ సం.లో వ్రాయబడినది. ఈ గ్రంథమునకు పూర్వమును, అనంతరమును రచించ బడిన గ్రంథములు దీనియెదుట దివిటీ ముందు దీపముల వలె నుండుననుటయే ఈ గ్రంథము యొక్క ప్రశస్తికి గల ప్రబల నిదర్శనము. అసంఖ్యాకములైన అంశములను గూర్చి చర్చించిన ఈ మహా గ్రంథములోని విషయ వైవిధ్యము అచ్చెరువు కొలుపుచుండును.

ఈ గ్రంథ రచయితయయిన కౌటిల్యునిగూర్చి రెండు విషయములు వివాద గ్రస్తములై నవి. అందు మొదటి విషయము : కౌటిల్యుడను వ్యక్తి యొకడు ఉండి యుండెనా యనునది. మెగ స్తనీసు తన “ఇండికా”యను గ్రంథమున ఇతని ప్రసక్తి తేకుండుటయే ఇందులకు కారణము. రెండవ విషయము ఏమనగా! ఉండి యున్నచో, అత డెచ్చటివాడు ? తక్షశిలా నివాసియా ? ద్రవిడుడా ? లేక కొందరు భావించునట్లు ఆంధ్రుడా ? అనునది ఇందు మొదటి సందేహమునకు నేడు విలువలేదు. రెండవది ఇంకను వివాదగ్రస్తముగ నే యున్నది. ఇతడు యూరోపి యన్ రాజ్యాంగ తత్త్వవేత్తయగు అరిస్టాటిల్ నకు సమ కాలికుడు. తక్షశిలా విశ్వవిద్యాలయ విద్యార్థి. రాజకీయ విషయములలో కోరినపని సాధించుటకు, కుట్రలు పన్ను సామర్థ్యమునకు ఇతని పేరు మారు పేరని చెప్పవచ్చును. ఇతని విజ్ఞానము అపార మైనది. ధర్మశాస్త్రవేత్తలు అంగీక రించని వివాహ బంధనము, వితంతు వివాహము మొద లగు సంస్కరణములను తన గ్రంథములో ప్రతిపాదించిన సంస్కరణాభిలాషి ఈతడు. ఈ ప్రతిభాశాలిని గూర్చి దండి, భవభూతి, దమనకుడు మున్నగువారు ప్రస్తావించి యున్నారు.

కౌటిల్యార్థశాస్త్రము కొంతకాలము మరుగునపడి పోయినది. ఇది కౌటిల్యుడనే వ్యక్తి అసలు ఉండెనా యను సందేహమునకు బలము చేకూర్చినది. కాని ఈ

శతాబ్ది మొదటలో డాక్టర్ శ్యామశాస్త్రిగారి కృషిఫలిత ముగా ఆ గ్రంథము బయటికి వచ్చెను. వారి గ్రంథమందలి కొన్ని భాగములను ఆంగ్లములోనికి అనువదించిరి. యూరోపియను పండితులు ముఖ్యముగా, జర్మను పండి తులు బహుశ్రద్ధతో ఈ గ్రంథమును అధ్యయనము చేయ నారంభించిరి. ఇందువలన ఒక వంక ప్రాచీన భారతీయ రాజ్యశాస్త్రమునకును మరొకవంక చరిత్రమునకును కూడ మేలు సమకూరెను.

అర్థశాస్త్ర రచనములో కౌటిల్యుని ఆశయములు మూడు. గ్రీకుల దండయాత్రవలన కలుషితమై, బౌద్ధ జైన మతముల తాకిడివల్ల శిథిల పరిస్థితికి వచ్చిన వైదిక మతముయొక్క పునరుద్ధరణము మొదటి ఆశయము. చిన్న చిన్న రాజ్యములతో, అసమర్థులైన పాలకులతో, ఛిన్నా భిన్నముగానున్న నాటి రాజకీయ వ్యవస్థతో కల్లోల ముగా నున్న ఆ పరిస్థితులలో బలీయమైన మౌర్య సామ్రాజ్యమును స్థాపించి, విస్తరింపజేసి, తద్వారా విశాల ఐక్యరాజకీయ వ్యవస్థను స్థాపించుట రెండవ ఆశయము. అట్టి వ్యవస్థకు సమర్థుడగు రాజు కావలెను, అట్టి రాజు, తాను అనుభవించుటకు హక్కులేగాక నిర్వర్తింప వలసిన విధులుకూడ కలవని గుర్తెరిగి యుండవలెను. ఇట్టి ఉన్న తాదర్శములు రాజుల విధులలో అంతర్భాగముగ కౌటి ల్యుడు చేసియుండెను. అర్థశాస్త్రమును ధర్మశాస్త్ర బంధములనుండి తప్పించుట అతని మూడవ ఆశయము.

కౌటిల్యుని గ్రంథము సూత్రశైలిలో వ్రాయబడినది. ఆ గ్రంథము రచించుటయందతడు అవలంబించిన ప్రాతిపదిక సూత్రములు మిక్కిలి ప్రధానమైనవి. అవి ఆ గ్రంథమునకు చక్కని వాస్తవిక దృష్టిని, ఆచరణయోగ్య తను చేకూర్చినవి. అవియే మరొక వంక అతనిని ధర్మ శాస్త్రవేత్త ల దూషణతిరస్కారములకును గురిచేసినవి. ఈ గ్రంథ రచనలో కౌటిల్యుడు అవలంబించిన ప్రధాన సూత్రములు మూడు.

1. అర్థశాస్త్రమును ధర్మశాస్త్రపు సంకెళ్ళనుండి విడదీసి దానికి ప్రత్యేక స్థానము నిచ్చెను. అందువలన అనవ సర సిద్ధాంత చర్చలను విడనాడుటకును, వాస్తవిక దృక్పథము నవలంబించుటకు వీలుచిక్కెను. ఇతడు సిద్దాం తములను రచించుటచేతనే తృప్తిచెందెడువాడు కాడు; సాహిత్య ప్రగల్భతను చాటుకొను ఛాందసుడు కాడు. ఇతడు అసాధారణమగు రాజకీయ తత్త్వ దార్శనికుడు గను, ఆచరణాత్మక వివేకశీలియగు రాజకీయ వే త్తగను పేర్గాంచెను. అందువలననే ఇందు పరిపాలనాత త్త్వమునకు సంబంధించిన విషయములకు ప్రాధాన్యము ఇయ్యబడ లేదు. ఈ దృక్పథమువలన, లక్ష్యము సాధించుట యే ముఖ్యముగాని అందులకు ఎట్టి మార్గమునైనను అవలంబించ వచ్చునని అతడు అంగీకరించెను.

2. తనకు పూర్వముగల గ్రంథముల నన్నిటిని పరి కించి, వాటితో తన అభిప్రాయములు కనుగుణముగానున్న విషయములను అంగీకరించుటకుగాని, లేనిచో వాటిని సంస్కరించుటకు లేక నిరాకరించుటకుగాని సంసిద్ధుడై యుండుట ఇందలి మరొక విశేషము. ఆనాటి భావముల నన్నిటిని పరిశీలించి తానంగీకరించినమట్టుకు స్వీకరించి తాను ఆశించిన వ్యవస్థను చిత్రించెను

3. అతివాదము (Extremism) ను నిరసించిన సమ స్వయ వాది కౌటిల్యుడు. ఒక వంక వైదిక మతమును అభిమానించుచు వ్రాసిన గ్రంథములో వితంతు వివాహాది సంస్కరణములను సమర్థించుటయే యిందులకు ప్రబల నిదర్శనము.

అర్థశాస్త్రమునకు స్వతంత్ర ప్రతిపత్తిని సమకూర్చుట ఇతడు ఆ శాస్త్రమునకు చేసిన మహోపకారములలో నొకటి. దేశములోని ఆదర్శప్రజల లక్షణములను వివ రించుచు అతడు అహోరాత్రములు కృషి చేసి, దేశ సౌభాగ్యమును వృద్ధిచే సెడు కర్షకులు దేశకల్యాణమునకు అత్యవసరమని నొక్కి చెప్పియున్నాడు. దుర్గ, రాష్ట్ర, ఖని, సీమ, వన, ప్రజ, వణిక్పథములను రాజ్యమునకు ఆదాయమునిచ్చెడు సాధనములనియు, వాటిని వృద్ధిచేయ వలయుననియు వక్కాణించినాడు.

కరువు కాటకముల నిర్మూలించుట, విప్లవములను, దండయాత్రలను ఎదుర్కొనుట మొదలగువాటికి ధనము కొరతపడినచో ధనసంపాదనమునకు కౌటిల్యుడు సూచిం చిన మార్గములు : "ఆశయసిద్ధి కలిగినచో, తత్కార్య క్రమము ఎట్టిదయినను సమంజసమయినదే" (The end justifies the means) అనెడు అతని సిద్ధాంతమునకు మచ్చుతునకలు : (i) శ్రీమంతులనుండి బలవంతముగా ధనము తీసికొనుట. (ii) దుష్టులభూములను దౌర్జన్య ముగా స్వాధీనము చేసికొనుట (iii) ఫలవంతములయిన భూములపై అధికముగా విన్నులు వేయుట. (iv) రాజు పేర ఋణములు వసూలు చేయుట. రాజ్యకోళమును ఎల్లప్పుడు నిండుగా నుంచవలసిన అవసరమును కౌటి ల్యుడు నొక్కి చెప్పి, దేశరక్షణ, దేశములో శాంతిభద్ర తలు, వర్తక వాణిజ్యముల అభివృద్ధి, దానిమీద నే ఆధార పడునని ప్రభుత్వ యాజమాన్యముక్రింద పరిశ్రమశాఖలను నడుపుట, సస్యసంపద వృద్ధిచేయుట, వర్తక వాణిజ్యముల అభివృద్ధి రాజ్య క్షేమమునకు అవసరమని వివరించి యున్నాడు. పన్నులు వసూలుచేసెడు ఉన్న తాధి కారులను రాజు జాగ్ర త్తతో పరిశీలించుచుండవలెననియు, దండిగ వేతనము లిచ్చుటవలన ఉద్యోగులలో లంచగొండితనము పోవుననియు, విధినిర్వహణమున భక్తిశ్రద్ధలు కానబర చుదురనియు కౌటిల్యుని అభిప్రాయము.

కౌటిల్యుని సిద్ధాంతములు కొన్నిటితో కొందరు ఏకీభవించకపోవచ్చును. కాని ఇతని ప్రతిభను, దూర దృష్టిని మెచ్చుకొనక తప్పదు. ఇతని గ్రంథప్రాముఖ్యమును విస్మరించుటకు వీలులేదు.

ఆర్. వి. రా.