Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోళ్ళూరు

వికీసోర్స్ నుండి

కోళ్ళూరు :

కృష్ణానదీ తీరమున, స త్తెనపల్లి తాలూకా నట్టడవు లలో కొండలమధ్య కోళ్ళూరు గ్రామమున్నది. దీని నిప్పుడు కొల్లూరు అనుచున్నారు. ఇచ్చట చరిత్రాత్మక మైన ప్రాచీన చిహ్నము లేన్నియో బయల్పడినవి. దేవా లయములు, గోపుర ప్రాకారాదులు, మసీదులు, గోరీలు మున్నగునవి శిథిలావస్థలో నున్నవి. చారిత్ర కాధారము లయిన శిలాశాసనములున్నవి. భూగర్భ శాస్త్రజ్ఞుల పరి శీలన, అంచనాలనుబట్టి యిక్కడ విలువగల ఖనిజములు లభ్యమగునని తెలియుచున్నది. ప్రపంచ విఖ్యాతి వడసిన "కోహినూరు వజ్రము దొరికిన స్థలమిదియే. శాసన దృష్టాంతములనుబట్టి యీ ప్రాంతము కోట కేత రాజు పరిపాలన యందున్నది.

దేవాలయములు...శాసనములు కోళ్ళూరు గ్రామము నకు పశ్చిమ దిశన ఒక దేవళమున్నది. అక్కడొక శాసన మున్నది. ఈ శాసనము ప్రకారము శ్వేతశృంగ పర్వతము నకు పశ్చిమమునను, కృష్ణానదికి దక్షిణమును ఉన్న “కొడ వలూరు" శ్రీరామలిం గేశ్వర దేవాలయ మండపమును కోట కేత రాజు కట్టించినట్లును, అది శిథిలమైయున్నందున శిమ్మాజీ బాగు చేయిం చినట్లును తెలుగులిపిలో వ్రాయ బడి యున్నది. దీనికి పూర్వకాలమును తెలియ జేయుచు మరి రెండు శాసనములున్నవి. గడపకు అడ్డముగా మరొక శాసనము పడ వేసియున్నది. ఈ కొడవలూరే నేడు కోళ్ళూరు (కొల్లూరు)గా వాడుకలో నున్నది. వేదాద్రి నృసింహస్వామిని సందర్శించ వచ్చిన యాత్రికులు ముక్త్యాల ప్రక్కగానున్న భరద్వాజాశ్రమమును చూచు దురు. సమీపముననే యున్న ఈ కోళ్ళూరు వచ్చి ఆంజ నేయ స్వామిని దర్శించిగాని వెళ్ళరు. గ్రామమునకు అష్ట దిక్కులయందు ఆంజ నేయస్వామి ప్రతిష్ఠలున్నవి.

మశీదులు : నదిప్రక్కన ప్రాచీనమైన మశీదున్నది. ఇది ఔరంగజేబు కాలమునాటి దని చెప్పుదురు అరబ్బీ భాషలో మతసూక్తులు చిత్రింపబడి యున్నవి. ఈ మశీదు ఒక చిత్రమైనది. సుందరమైనది. ఇది ఎత్తైన ప్రదేశమున నున్నందున క్రింద భూమి భాగమున మరొక మశీదు కలదు. ఇది జనానావారు నమాజు చేయుటకు ప్రత్యేకించబడినది. ఈ మశీదు ముందు భాగమున మంచి పనితనము కల్గిన దిమ్మెలుగట్టి, గూనలగుండ కృష్ణా నీరును పైకి ప్రవహింప జేసినారు. నమాజు చేసిన తదనంతరము ఖురాన్ మొదలయిన మతగ్రంథముల పఠనమునకును, మున్షీల ఉపన్యాసములు వినుటకును మశీదుకు ముందర హాలు ఏర్పాటు చేసియున్నారు.

దీపస్తంభము : కోళ్ళూరు సమీపమున ఒక ఎత్తయిన దిమ్మెకలదు. లోపల మణుగు నూనెపోసి వత్తులు వెలి గించుట కవకాశమున్నది. పూర్వమిది నగరమధ్యమున నుండెడిదని, దీప స్తంభము వెలిగించెడువారని చెప్పుదురు. తూర్పున 'మేదరసాని' దుర్గమున్నది. ప్రక్కనే యున్న కేతవరము కొండ పై లక్ష్మీనృసింహస్వామి దేవాలయము శాసనములు ఉన్నవి. కోళ్ళూరు మత, సాంస్కృతిక దృష్ట్యానేగాక, రత్నగర్భగా పేరొందినది.

కోహినూరు వజ్రము : వెంకటాయపాలెము వెళ్ళెడు. మార్గమున పేరంటాల గుడికి దిగువన పులిచింత-కోళ్లూరు లకు మధ్య గోరంటక య్యన అనగా చిట్యాల, వెంకటాయ పా లెము, పులిచింత సరిహద్దు పొడుగున వజ్రాల సేకరణకు సరిహద్దుపొడుగున లోతైన గుంటలు త్రవ్వినస్థలము లున్నవి.

"కోహినూరు వజ్రము దొరికినది స త్తెనపల్లి తాలూకా కోళ్ళూరులో నే" అని డాక్టరు బాల్ అను భూగర్భ శాస్త్రజ్ఞుడు నిరూపించియున్నాడు. దీనితూకము మొదట 7371/3 కారెట్లు అనీ, తర్వాత 280 కారెట్లకు వచ్చినదని వివరించినారు. ఈ కోహినూరు వజ్రము క్రీ.శ. 1565 లో కని పెట్టిన వజ్రాలగనిలో దొరికినది. తరువాత నీ కోళ్లూరు పేరుపొంది ఒక శతాబ్ద కాలము మహా వైభవసంపన్న మై వెలసినది. ఈ పట్టణ వినాశమును గూర్చి ఒక వింతయైన కథ జనులు చెప్పుచుందురు. ఆ కథ ఏమనగా :

కోళ్ళూరులో ఒక దేవుడు వెలిసెను ఆ దేవుని మహిమ చేత - భాగ్యవంతు లగుటకు జనులు ఒక సూక్ష్మమార్గమును కనుగొనిరి. తమ ధాన్యమును మూత్రములో తడిపి ఆ దేవతా విగ్రహముపై పోసినచో ఆ ధాన్యపు గింజలు రవ్వలగుచుండెనట ! జనులందరును ఈ క్రియ నాచరించి భాగ్యవంతులు కాజొచ్చిరి. గ్రామము మిద్దెలు, మేడలతో కళకళలాడుచు వైభవ సంపన్నమై తనరారుచుండెను. అయితే ఆ గ్రామములోని ఒక నిరు పేద బ్రాహ్మణుడు మాత్రము అట్టిపని చేయకుం డెను. ఎవ రెంత ప్రోత్సహించి నను ఆ బ్రాహ్మణుడా తుచ్ఛపుపని చేయ నొల్ల కుండెను. ఒక నాడు అద్దమ రేయి ఒక వృద్ధ బ్రాహ్మణుడా పేద బాపని యింటికి వచ్చి, నిద్రలేచి అతనిని కుటుంబసహితముగా ఊరి వెలుపలకి తీసికొని వెళ్ళి అదిగో! కోళ్ళూరు పట్టణ వై భవము చూడు మనెను. ఆ బ్రాహ్మణుడు వెనుతిరిగి చూచునుగదా కోళ్ళూరుపట్టణము ధగద్ధగితముగా మండు చుండెను. ఆ వృద్ధబ్రాహ్మణుడు మాయమయ్యెను. ఈ కథనుబట్టియే “కోళ్ళూరుపట్టణమువలె వెలిగిపోయినది” అను ఒక సామెత పుట్టినది.

ఈ ప్రాంతమున భూగర్భమున ఇనుపగనులు, రంగు రంగుల రాళ్ళు. వజ్రములు, మేలిరకపు సున్నపురాళ్ళు, బెబా రైట్లు మొదలగు ఖనిజములెన్ని యో నిక్షిప్తములై యున్నట్లు తెలియుచున్నది.

కోళ్ళూరు ముఖ్య యాత్రాస్థలములలో నొకటిగా వన్నె కెక్కినది.

మా. వీ.