Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొల్లేరు సరస్సు

వికీసోర్స్ నుండి

కొల్లేరు సరస్సు :

I

ఈ సరస్సు కృష్ణా, పశ్చిమ గోదావరిజిల్లాల సరిహద్దులో నున్నది. ఇది ఏలూరునకు ఆగ్నేయముగను, కైకలూరునకు ఉత్తరముగను కలదు. ఈ సరస్సు ఈ రెండు తాలూకాలకు చెందియున్నను అధికభాగము ఏలూరు తాలూకాయందే విస్తరించియున్నది. ఇది యొక చరిత్రాత్మకమైన సరస్సు. ఆంధ్రకోస్తాలో సహజసిద్ధమయిన పెద్ద మంచినీటి జలాశయము ఇది యొక్కటే. స్థూలముగా అండాకారములో నుండి మెరకగానున్న ఈ పెద్దసరస్సు మొదట బంగాళాఖాతములో ఒక భాగమై యుండెను. దీని కిరుప్రక్కలను మహానదులైన గోదావరీ, కృష్ణలు సముద్రములోనికి చొచ్చుకొనిపోవునప్పుడు ఒక దాని దక్షిణపుచివర మరొకదాని ఉత్తరపు కొనతో కలియుచున్నది. ఆ విధముగా ఏర్పడిన భూభాగము కొల్లేటిని సముద్రపునీటినుండి విడదీయుచున్నది.

ఈ మంచినీటి సరస్సు ప్రధానముగా తమ్మిలేరు, బుడమేరు అను పెద్దవాగులచే పోషింపబడుచున్నది. ఈ రెండును తూర్పుకనుమలలో పుట్టుచున్నవి. వీటిలో మొదటిది చింతలపూడి, ఏలూరు తాలూకాలగుండ ప్రవహించుచు వచ్చి ఈ సరస్సులో చేరును. రెండవది విజయవాడ, గన్నవరము, కైకలూరు తాలూకాల గుండ వచ్చి దీనిలో చేరును. ఈ రెండు వాగులచే నిది వర్షాకాలమందు ఒక మహాసముద్రమువలె కన్పట్టు చుండును. పెక్కు భూములు వరదలపాలై పోవుచుండును. ఈ వాగులనీరు ఈ సరస్సులో తేరుకొనును, కాని అవి తీసికొనివచ్చెడి వండువలన ఇది త్వరితముగా మెట్ట వేసిపోవుచున్నది. ఇట్లీ సరస్సు కొలది కాలములో అదృశ్యము కాగలదేమో ! దీని వైశాల్యము ఎక్కువగా మారుచుండును. వర్షాకాలములో దీనివైశాల్యము 100చ. మైళ్ళకు మించిపోవును. వర్షములులేని కాలములోనిది బాగుగా తగ్గి ఒక్కొక్కప్పుడు ఎండిపోవుచుండును. 1900 వ సంవత్సరములో వర్షములు లేనప్పుడు ఇట్లే జరిగినది. దీనిని బాగుచేసి గట్లు వేయుటచే సహజముగా దీని పరిమాణము తగ్గుచున్నది. కృష్ణా, గోదావరి జిల్లాలలోని మురుగునీరు చాలభాగము ఈ సరస్సులోనికి చేరును. ఇందలి నీరు “పరెంటలు అవ" "జ్యూయర్అ వ" అను రెండు మార్గములద్వారమున బయటికిపోయి ఉప్పుటేరుతో కలసి సముద్రములో పడుచున్నది.

కొల్లేరుమధ్య అనేకములగు లంకలు కలవు. ఆ లంక లందు సుమారు 26 గ్రామములు కలవు. అవి మిక్కిలి సారవంతములయి, ఎక్కువ ఫలసాయము నిచ్చుచుండును. కాని బుడమేరు వరదలవల్ల తరచుగా అపారమగు నష్టములు కలుగుచుండును. అట్టి సమయములందు రాకపోకలు స్తంభించి రైతులు పెక్కు అగచాట్లకు లోనగుచుందురు.

కొల్లేరులో చేపలు సమృద్ధిగా నుండును. అన్నిరకముల పక్షులు ఇచట నివసించుచుండును. ఒకప్పుడు ఇచటి నుండి పక్షులు, చర్మములు ఎగుమతిచేయబడు చుండెడివట ! ప్రస్తుత మీ సరస్సునుండి పంపింగు విధానములో కొంత భూమికి నీరు అందించబడుచున్నది. ఆ నీటి కందుబాటులోనుండు తీరప్రాంతము లనేకములు మిగుల సారవంతములై అధిక ఫలసాయమును ఇచ్చుచున్నవి.

కొల్లేరు సరోవరముండు ప్రదేశములో పూర్వము 12 ఆమడల విస్తృతిగల ఒక మహానగరముండెడి దట! అందు యాగ కర్మనిష్ఠాగరిష్ఠులగు శ్రోత్రియు లనేకులు వసించు చుండిరట ! 'కొల్లు' అను గ్రామదేవత నారాధించుచు వారందరు మంత్రశాస్త్రపారగులై ఆ దేవతా ప్రీతికై వివిధ క్రియాకలాపముల నొనర్చుచుండిరి. అట్టి పట్టణమున ఒకానొక సమయమందు ఘటిల్లిన దీర్ఘకాలికమయిన అనావృష్టి ఫలితముగా నిర్జలక్షామ మేర్పడెను. బ్రాహ్మణుల యాగాది క్రియలవల్లగూడ నీరు లభించెడిదికాదట! ఒక బ్రాహ్మణగృహిణి జలాభావముచే కాలిమడితో అక్షతలను తడిపి హోమమునకై భర్తకొసగెనట. వాటిని అగ్నియందు వ్రేల్చగనే అవి బంగారు కణికలవలె రూపొందెనట ! స్వర్ణలాభాపేక్షచే అందరును అట్లే చేయనారంభించిరట! ఇట్లు ఆ పురమంతయు, అనాచార కారణమున భ్రష్టమైపోయెను. ఒక బ్రాహ్మణ కుటుంబము మాత్రము ఇట్టి దురాచారమునకు పాల్పడక జలాభావమును అట్లే సహించుచుండెను. ఒకనాడా గ్రామముయొక్క శక్తి దేవత అగ్నిహోత్రములతో ఆ చోటును విడిచిపోవలెననియు, పోవునపుడు మార్గమందు ఒక్కొక్క అగ్నికణ మును పడవేయుచు బోవలెననియు స్వప్నమున ఆ బ్రాహ్మణున కాదేశమిచ్చెను. మరునాడు ఆ బ్రాహ్మణుడు అట్లే వెడలిపోవుచు కొలదిదూరముపోయి వెనుకకు తిరిగి చూడగా పురమంతయు అగాధమగు జలమయమయ్యెనట ! అప్పటినుండి అది కొల్లేరు అని వ్యవహరింపబడు చుండెనట ! ఇది యొక స్థానిక గాథ.

కొల్లేరునందలి పెక్కు దీవులలో నొక దానిని స్వాధీనపరచుకొనదలచిన సేనాని యొకడు ఆ సరస్సులోని నీటిని వెడలగొట్ట దలచెను. అందుకొర కాతడు ఉప్పు టేరును త్రవ్వించెను. ఈ సేనాని కూతురి పేరు “పరెంటలు అవ" అందుచే ఉప్పుటేరు కాలువలలో నొకదానికి “పరెంటలు అవ" అని పేరిడబడెనట !

II

కొల్లేటి సరస్సు చరిత్రాత్మకమయిన జలదుర్గము. ఈ దుర్గము నూటఅరువది రాజహస్తముల వెడల్పును, ఏడు నిలువుల లోతును, మూడుక్రోశములు చుట్టుకొలతయు కలిగిన అగడ్తయు కలిగి మిగుల భయంకరమై యుండును.

మృత్యుదేవతకు భృత్యతతి యనదగిన ముదుసలి మొసళులు అడుగడుగునకు ఒక్కటి చొప్పున అగడ్తయం దుండు చుండును. కోటగోడలు మిగుల బలిష్ఠములై నలువది రాజహస్తముల యెత్తున గగన చుంబితములై యుండెను. గవనులు కుడియెడమలయందు కంచు తలుపులతో తేజరిల్లు చుండెను. శత్రుభీకరమై, దుస్సాధ్యమై, దుర్నిరీక్ష్యమైయున్న యీ జలదుర్గము చాళుక్య నృపాలురలో నొకడగు రెండవ పులకేశి 'అయిహోలు' శాసనమున "కొలనువీ"డని పేర్కొనబడినది. అవ్విధముగ పేర్కొనబడిన శాసనములలో "అయిహోలు" శాసన మొకటి. కునాలశబ్దమే 'కులను', 'కొలను' గా పరిణామ మందినదని శబ్దతత్త్వజ్ఞులు అనుచుందురు. 'కొలను'శబ్దము సంస్కృతీకరింపగా “సరస్సు” అయినది.

రెండవ పులకేశి తన బాహుబల దర్పము వలన వైరివీరులను చీల్చి చెండాడి ఆరక్త మాంసములచే కుణాలుని నీరమును ర క్తిమనుదాల్చి తత్ప్రదేశమంతయు విల్లు నంబులతోడను, మారణాయుధములతోడను వ్యాప్తి కాంచుటచే అప్పటినుండియు అది జలదుర్గమై యొప్పెడిని. ఈ పులకేశి యశశ్చంద్రికలు పశ్చిమమున దూరస్థమైన పర్షియా వరకు ప్రాకినవి. అందుచే, పర్షియారాజు పులకేశి దర్బారునకు కాన్కలతోను, పసదనములతోను రాయబారుల నంపెను. ఇమ్మహానృపుని దండయాత్రల నుండి 'కొలను' విడివడి వేంగీ మహామండలేశ్వరుల స్వాధీనమయ్యెను. తూర్పు చాళుక్య రాజగు బాదపుని నాట బాలాదిత్యుని కుమారుడగు నృపకాముడు ఈ “కొలనువీడు"ను పరిపాలించుచుండెనని విదితము. ఆ పిమ్మట చాళుక్య చోడుని కాలమునను, ప్రథమ కుళోత్తుంగచోడుని కుమారుడగు విక్రమ చోడదేవుని నాటను మాత్రమే కొలనుదుర్గము వినుకలియైనది. ఆ తరువాత విక్రమచోడదేవుని యధికారము అపేక్షించి తెలుగు భీముడు స్వతంత్రుడై స్వతంత్ర పరిపాలనము నెరపెను. వెలనాటిచోళుడు కొలనుపై దండెత్తి ఈ తెలుగుభీముని పరిమార్చి దానిని కైవస మొనర్చు కొనెను. అప్పటి నుండియు తెలుగు నాయకుల పరిపాలనమందే 'కొలను' శబ్దముండుచుండెను. శక వర్ష ములు 1042 - 1054 ( క్రీ. శ. 1120 - 1132) రాజేంద్రచోడుడు కొలనును పరిపాలించిన మొదటి తెలుగునాయకుడని తెలియుచున్నది.

ఇతని పిమ్మట రెండవ కుళోత్తుంగచోళుని సేనానియగు కొలని కోటయ రాజ్యమునకు వచ్చెనని శక వర్షములు 1055 నుండి 1073 వరకుగల శాసనములు అవగతమొనర్చుచున్నవి. శక వర్షములు 1118 నుండి 1153 వరకు (ముప్పదియైదేండ్లు) రాజ్యముచేసిన కొలను కేశవ దేవరాజు కాలమునందే ఇందులూరి సోమయ్య కొలను దుర్గమును జయించి 'కొలనుసోమ' అని విఖ్యాతిచెందినట్లు గనపడుచున్నది. ఈ సోమయ్య కాకతీయ గణపతి చక్రవర్తియొద్ద దండనాథుడును, సచివోత్తముడునై చెలగెను. క్రీ. శ 1228 వ సంవత్సరమున ఓరుగల్లునకు ప్రాగ్భాగమున గల దేశములను - కళింగరాజ్య భాగములను కొన్నిటిని - ఇతడు జయించెనని “శివయోగసార" మందలి-


ఇల బహుసైన్యము ల్గొలువ
         నేకశిలాపురి తూర్పుదిక్కునం
గల రిపుభూము లెల్లఁ గొని
         గర్వముమై...... కాడిమండలీ


కుల నవలీలఁ దోలి (మ)రి
        “గోగులనాడు"ను, 'గొల్నివీడు' నా
వెలసిన దుర్గము ల్గొనుచు
         వేగమె గౌతమి దాఁటి యిమ్ములన్.

“మాడియు రెండుంగొని యూ
డాడెడి పన్నెండు మన్నియములు నొడిచి తా
నాడె కళింగయ సీమకుఁ
గూడిన భువిఁగొనియె సోమకుల ముఖ్యుఁ డొగిన్.

"లీలఁగొలని మండలీకుల వెసదోలి
‘కొలనివీడు' దాను గొనుటఁ జేసి
కాకతీశుడైన గణపతి యండను
కొలను సోముఁడనగ వెలసె జగతి"

అను పద్యములు వాకొనుచున్నవి. ఇంతియగాక సోమయ్య సకల వేదశాస్త్ర సంపన్నుడనియు, బంధు సుజనహితు డనియు, అమిత యశోధనుడనియు ఏకశిలాపురీ ప్రాగ్భాగమున గల రిపుభూములనెల్ల గొని 'కొలనువీడు’ మండలీకుల నవలీల బారదోలి కొల్నివీడునా వెలసిన దుర్గముల గొనుచు కళింగసీమకు చెందిన ప్రదేశములను కొన్నింటిని కైకొనుటచే కొలనిసోముడని ప్రసిద్ధి చెందెననియు అవగత మగుచున్నది. కాబట్టి ఈతనినాటినుండి యిందులూరి వారన బరగుచుండిరి. ఈ సోమయ్య మనుమడే రుద్రదేవుడు. రుద్రదేవుని తండ్రియే మన్మగన్నయ. శివయోగసార అవతరణిక యందలి--


“సులతాను దగ నోరుగలు చుట్టుముట్ట నె
         క్కువ లీలఁ దానె కల్కోటగాచె."

అను పద్యపాదమునుబట్టి ఓరుగల్లును సులతానుడు ముట్టడించినపుడు కొలని రుద్రదేవుడు - ఒక్కరుడే ఆ కలుకోట దుర్గమును కాపాడినందున -


"కాక తేశుఁడు మెచ్చఁ గలుగోట వెసఁగాచి
        యవనేశులను దున్మినట్టి యితఁడు" -

అని “శివయోగసారము" న ప్రశంసింపబడెను. ప్రతాప రుద్రావనీశుని సచివోత్తములలో - ప్రచండ విక్రమాదిత్యు లలో—నొక్కరుడయి పేరెన్నికగన్న రుద్రదేవుడు ఓరుగంటి తూర్పుగవని మొదలు తూర్పున సింహాచల పర్యంత భూభాగమున కంతకును రాజప్రతినిధియై పరిపాలన మొనర్చినవాడు. వీనినే కొలను ప్రతాపరుద్రుడని యందురు.

దండిమహాకవి తన “దశకుమారచరిత్రము” న వేంగి దేశమును పరిపాలించుచున్న చలుక్య నృపాలుండగు జయసింహుని “అంధ్రనాథేన జయసింహేన" అని అభివర్ణించుటయేగాక, ఆంధ్రదేశము నభివర్ణించుచు జయసింహుని రాజధాని యగు వేంగీనగరమును-


“ఆయాసిషం చ దినైః కైశ్చిదంధ్ర నగరం
తస్యనాత్యాసన్న సలిలరాశి సదృశస్య
కలహంసగణ దళిత నళినదళ సంహతి
గళిత కింజల్క శకల శారస్యసారసశ్రేణి!
శేఖరస్య సర స్తీర కాననేకృత నికేతనస్థితః"

అని వర్ణించినాడు. ఇందొక సరస్సు గలదనియు, అది సారస నిలయమనియు, సలిలరాశి సదృశమనియు, ఆంధ్ర నగరమునకు దాపున నుండె ననియు, చెప్పుటవలన ఆ వర్ణన కొల్లేటి వర్ణన యగుటచే తత్సమీప మందలి వేంగియే యంధ్రనగరమై యున్నదని తెలియనగుచున్నది. ఇట పేర్కొనబడ్డ జయసింహుడు కుబ్జ విష్ణువర్ధనుని కుమారుడు. ఈ జయసింహుడు క్రీ. శ. 633 మొదలు 663 వరకు అనగా ముప్పదేండ్లు వేంగిని రాజధానిగా చేసికొని వేంగీమండలమును పరిపాలించినవాడు. ఇతని పరిపాలనా భాగమును ఆంధ్రదేశముగను, ఇతనిని ఆంధ్రవల్లభునిగను, ఇతని రాజధానిని ఆంధ్రనగరముగను దండిమహాకవి క్రీ. శ. ఏడవ శతాబ్దియందే అభివర్ణించుట గమనింపదగియున్నది.

ఈ జయసింహుడు నౌకాయుద్ధమున ఆరి తేరినవాడు. కళింగ నృపుని నౌకాయుద్ధమున నోటమిబుచ్చి ఆ రేని కొమార్తెయైన 'కనక లేఖ’ను వివాహము చేసికొనినట్లు దండిమహాకవి వ్రాసినాడు.

ఈయన కాలమునందే హియాన్‌త్సాంగ్ తెలుగు దేశమున పర్యటన మొనర్చుచు వేంగి నగరమును తత్సమీపస్థమగు కొల్లేటిని సందర్శించినట్లు కనుపించుచున్నది. ఈ సరస్సునకూడ జయసింహుని నౌకలు విహరించు చుండెననియు, బౌద్ధమతము రూపరి హిందూమతము, హిందూసంస్కృతి విలసిల్లినవనియు, ఎక్కడ జూచినను హిందూ దేవాలయములే అగుపించుచున్నవనియు అతని వ్రాతలు దెలుపుచున్నవి.

కొల్లేటి సరస్తీరమున తూర్పుగా గొప్ప బౌద్ధవిహార ముండె ననియు, ఆ విహారమునందు 5 అంతస్థుల మేడ యుండెననియు ఆ విహారమునకు దిజ్నాగాచార్యుడు అధిపతిగా నుండెననియు తెలియుచున్నది. దిజ్నాగాచార్యుడు ఆరవ శతాబ్దిలోనున్న ప్రసిద్ధపండితుడు.

కో. వే. శ.