Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొలంబసు క్రిస్టాఫర్

వికీసోర్స్ నుండి

కొలంబసు క్రిస్టాఫర్ :

పదునైదవ శతాబ్దమువరకు అమెరికాఖండ మొకటి యున్నదను విషయము యూరపుఖండ వాసులకు గాని తదితర దేశముల ప్రజలకుగాని తెలియదు. మొదటిసారిగా అమెరికాఖండమును కనుగొన్నవాడు క్రిస్టొఫర్ కొలంబసు. ఇతడు జినోవా నావికుడు. జినోవా ఉత్తర ఇటలీలోని ఒక రేవుస్థలము. కొలంబసు 1447 లో జినోవాలో జన్మించెను. ఈతని తల్లిదండ్రులు నేత పనివారు. ఇతడు బాల్యములో ఇటలీలోని పావియా అను పట్టణములో క్షేత్ర గణితము, భూగోళ శాస్త్రము, ఖగోళ శాస్త్రము, జ్యోతిశ్శాస్త్రము, నౌకాయాన శాస్త్రము నభ్యసించి పదునాల్గవయేట జన్మస్థలమునకు తిరిగివచ్చెను. త్వరలోనే ఈతనికి మధ్యధరా సముద్రతీర ప్రాంతములకు పోవు ఒకానొక వాణిజ్యనౌకలో పని కుదిరెను. ఈ కొలువులో నుండి అతడు నౌకాయాన విద్యను ప్రత్యక్షముగా నేర్చుకొనెను. కొలంబసు బాల్యమునుండియు సముద్రతీరమున దిరుగాడుచు, వచ్చు పోవు నౌకలను జూచుచు, నావికులను గూర్చియు, వారి ప్రయాణములను గూర్చియు చెప్పుకొను సంగతులను వినుచు తానుకూడ నౌకాయానమును వృత్తిగా పెట్టుకొని, దూరతీరములకు పోయి ప్రపంచ రహస్యములను, శోధించి, క్రొత్త దేశములను, దీవులను కనుగొనవలెనని కలలు గనుచుండెను.

సరిగా ఈ కాలమునకు పూర్వమే భూమి చదునుగా గాక గుండ్రముగా నున్నదని నిరూపితమయ్యెను. ఈ కాలముననే హిందూదేశమునందు చక్కని నూలు వస్త్రములు, పట్టు వస్త్రములు తయారగుచుండెను. యూరపుఖండ దేశములలో ఈపాటి వస్త్రములను తయారు చేయలేకుండిరి. యూరపులోని శ్రీమంతులు ఇండియాలో తయారగు వస్త్రములనే గాక ఇక్కడి సుగంధద్రవ్యములను కూడ కొని ఉపయోగించుచుండిరి. అందుచేత హిందూదేశము నుండి యూరపు ఖండమునకు వివిధ పదార్థములను తెచ్చుకొనవలె నన్నచో ఇచటికి సముద్ర మార్గమును ఏర్పరచుకొనవలె నన్న కోరిక యూరపుఖండ వ్యాపారులకు మిక్కుటముగా నుండెను. ఇండియాకు తూర్పుమార్గమున పోవువారిని మహమ్మదీయు లాటంక పరచుచుండిరి. కావున పశ్చిమ మార్గము ననుసరించి ఇండియాకు పోవుట సాధ్యము కాదా యని పశ్చిమదేశస్థులు ఆలోచింప మొదలిడిరి. కొలంబసు తన ఇరువది యేడవయేట పశ్చిమముగా సముద్రపయాణము చేసి ఇండియా మున్నగు ప్రాచ్యదేశములను చేరవలెనని సంకల్పించెను. తెలివితేటలను బట్టి, ధ్రైర్య విశ్వాసములను బట్టి, నావికావృత్తిలో నేర్పును బట్టి ఈ పని కాతడు సమర్ధుడే, కాని ఇది యెంతో వ్యయముతో కూడుకొన్నపని. ఆతనివద్ద డబ్బులేదు. ఆతని ననుసరించు నావికులు లేరు. పైగా ఈ ప్రయాణము క్రొత్తదేశములను కనుగొనుటకు ఉపయోగవడునదేగాని వ్యాపారరీత్యా లాభించునది కాదు. కనుక ఎవరేని రాజును ఆశ్రయించవలెను. తన జన్మస్థలములో సహాయపడువా రాతని కెవరును తటస్థపడలేదు. పోర్చుగీసు రాజకుటుంబమునకు చెందిన హెన్రీ ది నావిగేటర్‌. (Henry the Navigator) అను నాతనిని గూర్చి కొలంబను విని యుండెను. హెన్రీ ఆ కాలమున ఆఫ్రికా తీరమునకు సముద్ర యానములను ఏర్పాటు చేయించి క్రొత్త భూభాగములను కనుగొనుటలో పసిద్ధికెక్కియుండెను. పోర్చుగీసు రాజధానియైన లిస్బను పట్టణమునకు కొలంబసు వెళ్ళి అచ్చట పదేండ్లు నివసించి పటములు, చార్టులు గ్లోబులు తయారుచేసి జీవనము గడుపుచు తన లక్ష్యము సిద్ధించు సదవకాశము కొరకు ఎదురు చూచుచుండెను. ఇచటనే అతడు వివాహము చేసికొనెను. ఆతనికి ఒక కుమారుడు కలిగెను.

కొలంబసు, అతని సోదరుడును స్పెయిన్‌ రాజైన ఫెర్డినాండును సందర్శించి తూర్పు దేశములకు పోవలెనన్న తమ యభిలాషను వెలిబుచ్చిరి. కాని అది తెలివి తక్కువ పనియని రాజుగారి మతవిషయక సలహాదారులు నిరుత్సాహపరచిరి. రాజేమియు సహాయము చేయలేక పోయెను. ఇంగ్లండు వారేమయిన సహాయము చేయుదు రేమోయని కొలంబసు చూచెను. ఫ్రాన్సువారి సహాయమునుగూడ అత డపేక్షించెను. కాని లాభము లేక పోయెను. స్పెయిను రాజుభార్య ఇసబెల్లాకు కొలంబసు ప్రయత్నముపట్ల మొదటి నుండియు సానుభూతి యుండెను. కాని భర్త విముఖుడుగా నుండుటవలన చాలకాలము వరకు ఆమె కొలంబసుకు దర్శనమిచ్చి ఆతని ఊహలను, ప్రతిపాదనలను ఎంతో ఇష్టముగా వినుచుండెనేగాని ఏమియు సహాయముచేయజాలక పోయెను. చివర కామె తన నగలను అమ్మజూపి ధనమును సేకరించి ఇచ్చుటకు సమ్మతించెను. ఫలితముగా కొలంబసుకు మూడు ఓడలు లభించెను. వాటిలో పెద్దదానిపేరు “శాంతమేరియా”. అది నూరుటన్నుల నావ. 52 మంది మనుష్యులను అది తీసికొని పోగలదు. మిగిలిన రెండు ఓడల పేర్లు “పింటా,” “నినా”. ఈ విధముగా కొలంబసు. తన అనుచరులతో 1492 అగస్టు 3 వ తేదీన సముద్ర యానమునకు బయలు దేరెను. ఎంతో దూరము పోయినను వారికి భూమి కన్పించలేదు. మార్గ మధ్యములో అతని అనుచరులు ధైర్యము కోల్పోయి తిరుగుబాటు చేయుచు కొలంబసుకు ప్రతి బంధకములు గల్పింప జొచ్చిరి. కాని కొలంబసు వజ్ర సంకల్పముతో అట్లాంటిక్‌ మహా సముద్రము మీదుగా రెండు నెలలు ప్రయాణముచేసి ఒక ద్వీపమునకు చేరెను. దాని కాతడు శాన్‌ సెల్వడార్‌ అని పేరు పెట్టెను. కొలంబసు తాను ఇండియా చేరినట్లూహించెను. కాని అది ఇండియాకాదు. అది బహామా దీవులలో నొకటి. అచటి మనుష్యులు ఎరుపు, గోధుమ వర్ణము కలిసిన దేహచ్ఛాయ గలవారగుటచే కొలంబసు వారికి 'ఎర్ర ఇండియనులు' అని పేరు పెట్టెను. 1493 ఫిబ్రవరిలో కొలంబసు తిరిగి న్వదేశమునకు ప్రయాణమై వెళ్ళెను. స్పెయిను రాజుకు బహుమానములుగా అతడు బంగారమును, ప్రత్తిని యూరపులో లేని కొన్ని జంతువులను, పక్షులను తీసికొని వెళ్లెను. స్పెయిను ప్రజలు కొలంబసుకు, అతని అనుచరులకు ఘనముగా స్వాగత మిచ్చిరి. 1493 అక్టోబరులో కొలంబసు రెండవ పర్యాయము సముద్రయానము చేసెను. ఈ పర్యాయ మతనికి 17 ఓడలు లభించెను. 1500 మంది నావికులు స్వచ్ఛందముగా వచ్చిరి. కొలంబసు కొంతదూరము ప్రయాణము చేసిన పిదప తన అనుచరులను 'హిస్పానియోల' ద్వీపమున (దీనిని ఇప్పుడు హెయిటీ దీవి అందురు) దింపి తాను క్రొత్త ప్రదేశములను కనుగొనుటకు వెళ్ళెను. గ్రేటర్ ఆంటిలీస్ అని నేడు పిలువబడు దీవుల పెక్కింటి నాతడు కనుగొనెను. సంవత్సరమైన పిదప తిరిగి హిస్పానియోలను చేరుకొనెను. కాని అచ్చట అతడు దింపిన అనుచరులు బంగారముమీద పేరాసతో మూర్ఖముగా స్థానిక ప్రజలతో కలహించుటచేత వారిచే వధింపబడిరి. కొలంబసు తిరిగి స్పెయినుకు వెళ్ళెను.

1498 వ సంవత్సరమున కొలంబసు తన మూడవ సముద్రయానమును సాగించెను. ఈ పర్యాయ మాతడు ఆరు ఓడలతో బయలుదేరెను. ఈమారు ఆతడు నైరృతి దిక్కున ఇంకను దూరముగాపోయెను. మార్గ మధ్యమున మూడు ద్వీపములను కనుగొనెను. వాటి కాతడు ట్రినిడాడ్ అని పేరుపెట్టెను. పిమ్మట దక్షిణ అమెరికా సముద్రతీరము ననుసరించి 'ఓరినోకో' నదీ ముఖము వరకు నాతడు ప్రయాణము చేసెను. ఈమధ్య అతడు ఎచ్చటను భూమిపై దిగుటకు వీలుపడలేదు. అతడు చూచిన నదీముఖమునుండి నీరు పుష్కలముగా సముద్రములో పడుచుండెను. కాబట్టి అదియొక ద్వీపమునుండి పారు నది కాదనియు, ఒక పెద్ద భూఖండమునుండి మాత్రమే అంతటి నది ప్రవహించగలదనియు కొలంబసు గ్రహించెను. తానొక క్రొత్త ఖండమును కనుగొన్నట్లు ఆత డూహించ దొడగెను. కొలదిరోజులలోనే కొలంబసు 'పారా'అఖాతమున ఒకచోట దక్షిణఅమెరికాలో దిగెను. అది ఇండియాయే అని కొలంబసు ఊహించెను. కాని అది ఇండియా కాదు. అమెరికా అనునొక క్రొత్తఖండము.

1502 వ సంవత్సరమున కొలంబసు తన తుది సముద్రయానమునకు బయలుదేరెను. మొదట నాతడు పశ్చిమ ఇండీసు వైపుగా ప్రయాణము సాగించెను. ఆ తరువాత జమైకా వెళ్లి నేడు 'హండూరాస్' ఉన్న తావున మధ్య అమెరికా తీరమునకు చేరెను.

1504 వ సంవత్సరమున కొలంబసు స్పెయిను చేరుకొనెను. మార్గమధ్యములో అతడెన్నో అవమానములకు, కష్టములకు గురియయ్యెను. అతడు స్పెయిను చేరుకొను సరికి దురదృష్టవశాత్తు ఇసబెల్లా రాణి మిక్కిలి అస్వస్థతలో నుండి ఆతనికి దర్శన మియ్యలేకపోయెను. కొలంబసు కూడ జబ్బు పడెను. రాణి చనిపోయెను. కొలంబసుకు స్వస్థత చిక్కిన తరువాత అతడు ఫెర్డినాండు రాజును సందర్శించ బోయెను కాని రాజు కొలంబసును అభిమానించి ఆదరించలేదు. కొలంబసువలన ఇక ప్రయోజన మేమియని రాజు భావించి ఉపేక్ష వహించెననికూడ కొందరు చెప్పుదురు. ఏమైనను ఆదరించువారు లేక కొలంబసు నిరుపేదయై, అనేక కష్టములకు లోనై, మరల అస్వస్థుడయి 1506లో పరలోక గతుడయ్యెను.

నూత్న ప్రపంచమని చెప్పబడు అమెరికా ఖండమును కనుగొన్న మహాపురుషుడు కొలంబసు. అమెరికా ఖండమును కనుగొని, స్పెయిను దేశమునకు యూరపు ఖండములో అతడు గొప్ప గౌరవ, ప్రతిష్ఠలు చేకూర్చి పెట్టెను. స్పెయిను దేశపు మహాపురుషులలో అతడొకడు. ప్రపంచ చరిత్రలో ఘనకార్యములను సాధించిన మహావ్యక్తులలో క్రిస్టొఫర్ కొలంబసు ఒకడుగా పరిగణింప బడుచున్నాడు.

డి. రా.