Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కేరళ దేశము - చరిత్ర

వికీసోర్స్ నుండి

కేరళదేశము - చరిత్ర :

ప్రాచీన కేరళము: ఐతరేయారణ్యకమునందు ' చేర 'అను పదము కనిపించుచున్నది. చేరులు కొన్ని ప్రాచీన నియమములను ఉల్లంఘించిన మూడు తెగల ప్రజలలో ఒకరుగా పేర్కొనబడి యున్నారు. దక్షిణాపథమునందలి ఇతర జనుల ఆచార వ్యవహారములనుండి కేరళీయులు బహుళముగా అతిప్రాచీనకాలములోనే విడిపోయి యుందురు. రామాయణమునందును, మహాభారతమునందును,' కేరళ' అను పేరు కలదు. సుప్రసిద్ధ వైయాకరణియగు కాత్యాయనుడు (క్రీ.పూ. 4 వ శతాబ్దము) కేరళమును పేర్కొని యున్నాడు. కాళిదాసు కాలమువరకే 'కేరళ' అను నామము ఈ ప్రదేశమునకు రూఢియై యుండెనని ఆతని రఘువంశమున గల “భయోత్సృష్ట విభూషాణాం" అను శ్లోకమువందలి ' కేరళ యోషితాం' అను సమాస ప్రయోగముచే స్పష్టమగుచున్నది. గ్రీకులు చారిత్రక గ్రంథములలో 'కేరబోత్రాస్' (Kerabothras) అను భారతీయ పరిపాలకుడు పేర్కొనబడినాడు. అశోకుని రెండవ శాసనము, పదమూడవ శాసనము (Edict) ప్రత్యంత రాజ్యముల పట్టికలో కేరళ పుత్రుల రాజ్యమును పేర్కొను చున్నవి. గ్రీకుల దూత యగు మెగస్తనీసు చేర రాజ్యమును, ఆ దేశపు నాయర్లను పేర్కొనియున్నాడు.

పరశురాముని పరశు ప్రహారమువలన సముద్రము నుండి తేలిన భూభాగము 'కేరళ' అని ఒక గాథ నుడువుచున్నది. దీనికి కేరళ తీరభాగము యొక్క నైసర్గిక స్వరూపమే కారణమైయుండును. 'కేరళ'ను పరశురామ క్షేత్రమని సంకల్పమునందు పేర్కొనుటయు గలదు. చారిత్రకముగా ఇది యెంతవరకు సత్యమో తెలియదు. రఘువంశమున 4 వ సర్గయందు గల 53, 58 శ్లోకముల వలన పరశురాముని అస్త్రముచే అపరాంత దేశము సముద్రమునుండి ఉత్సారిత మయిన దను గాథ కాళిదాసుని కాలముననే ప్రసిద్ధమైయుండెనని తెలియుచున్నది భూగోళ శాస్త్రజ్ఞులు మాత్ర మొక కాలమున సముద్రభాగమగు ఈ ప్రదేశము సముద్రము వెనుకంజ వేసినందున తేలిన భూమియని సిద్ధాంతపరచిరి. పూర్వము సముద్రము పశ్చిమ కనుమల పాదములవరకు వ్యాప్తమై యుండెను. తదుపరి అనేక నైసర్గికములయిన మార్పులవలనను, భూగర్భ ప్రక్షోభములవలనను, సముద్రము మేట వేయుట వలనను, నదుల వరదలవలనను, చాలవరకు ప్రస్తుత కేరళ తీరము ఏర్పడి యుండునని కొందరి అభిప్రాయమై యున్నది.

కేరళ తీరమునకును మధ్య ప్రాచ్యదేశములకును నడుమ ప్రాచీనకాలము నుండియు సన్నిహిత సంబంధ ముండియున్నట్లు నిదర్శనములు కలవు. యూఫ్రటీస్ (Euphrates) నదీతీరమునగల ప్రపంచ విఖ్యాతమయిన 'ఉర్' అను పట్టణమునందు చంద్రదేవుని దేవాలయ మొకటి కలదు. దానియొక్క శిథిలములందు కానబడు టేకుకలప అట్టి సన్నిహిత సంబంధమునకు నిదర్శనము. అదియునుగాక క్రీ. పూ. 3000 సంవత్సరముల క్రిందట మలబారునుండి నూలుబట్టలను కొనిపోయి ఈజిప్టుదేశము నందు వాడినట్లు తెలియుచున్నది. క్రైస్తవ మతగ్రంథమగు పాతటెస్టమెంటు వలన సోలమన్ (Soloman) అనురాజు దంతముతో చేయబడిన నెమళ్ళు, కోతులు మొదలగు బొమ్మలను సేకరించుటకై తన వ్యాపార నౌకాదళమును మలబారుతీరమునకు పంపినట్లు తెలియుచున్నది.

తూర్పు తీరమున గల సముద్ర తీరములలో అతిముఖ్యమయిన ముజిరిస్ (Musiris) (ఇప్పటి కాంగనూరు) అను పట్టణము ముఖ్యమయిన రేవుపట్టణమై యుండెను. ముజిరిస్, నెల్‌సిర్‌డా, బార్ కర అను ముఖ్యమయిన రేవుతీరములు వ్యాపార కార్యకలాపములందు ప్రసిద్ధములయి యున్నట్లు గ్రీకులును, రోమనులును, వ్రాసిన చరిత్రలవలన తెలియుచున్నది. ముజిరిస్ అను పదమునకు ముఖ్యముగా 'ముజిరిస్' లేక 'మరిచ' అనగా మిరియాల పట్టణము అని అర్థము. ఈ పట్టణమునుండి, మిరియాలు, అల్లము, ఏలకులు, ఇంకను అనేక సుగంధ ద్రవ్యములు విదేశములకు ఎగుమతి అయినట్లు తెలియుచున్నది.

అనాదిలో రాజకీయముగా చేరులు, చోళులు, పాండ్యులు అను మూడు వంశముల రాజులచే దక్షిణ దేశము పరిపాలింపబడెను. వీరిలో చేరులే కేరళము యొక్క ముఖ్య పరిపాలకులు. అందుచేతనే ఈ దేశమునకు 'చేరళం' అను నామము ప్రసిద్ధమైనది. 'చేరళం' శబ్దమే 'కేరళం'గా మారినదని చారిత్రికులు నుడువు చున్నారు. ఈ ఆధారములను బట్టియే కేరళ మొక ప్రత్యేక దేశముగా ప్రాచీనకాలమునుండియు, పరిగణింప బడుచుండెనని తెలియుచున్నది.

పై నుదాహరింపబడిన తెగలనుగూర్చి సరియైన చరిత్ర లేదు. ఐనను తమిళ సంఘమునకు చెందిన కొన్ని కొన్ని గ్రంథములను బట్టి కొంతవరకు స్థూలముగా ఈ తెగల చరిత్ర మనకు తెలియుచున్నది. ఇందు మనకు తోడ్పడు గ్రంథములు 'పురననురు', 'లికననురు’, ‘పదట్టుపట్టు', 'సిలప్పాధికారము'. 'పెరియ పురాణము', 'తొల్కాప్పియము' అనునవై యున్నవి. సిలప్పాధికారమను గ్రంథమును వ్రాసిన 'ఇలన్ ఆదిగము' అను నాతడు ఈ దేశ భాగమును పరిపాలించిన చేర పెరుమాళ్ యొక్క సోదరుడు.

'ఉదయన్ చేరలతన్' (సుమారు క్రీ.శ. 130) అను రాజు ఈ దేశమును పరిపాలించిన రాజులలో మొదటి వాడని తెలియుచున్నది. గ్రంథములయం దితడు ' పెరుము కొట్టు' అని వర్ణింపబడెను. ఇతని కీ పేరు వచ్చుటకు ఇతని ఘనమైన అతిథి సత్కారమే కారణము. ఈతని పుత్రుడును, రాజ్యాధి కారియునగు 'నెడుమ్ చేరల్ ఆడన్' అను నాతడు మలబారు తీరమునందలి కొందరు స్థానిక శత్రువులను జయించెననియు, గ్రీకు వ్యాపారస్థులను చెరబెట్టె ననియు తెలియుచున్నది. ఇతడు ఇంకను అనేకులగు రాజులను జయించి, తన్మూలమున 'అధిరాజు' అను బిరుదమును, తదుపరి 'ఇయమ వరంబన్' అను బిరుదమును పొందెను. హిమాలయపర్వతములను తన రాజ్యమునకు సరిహద్దుగా నేర్పరచెనని ఈ రెండవ బిరుదమున కర్థము. తన శౌర్య సాహసములచే హిందూదేశము నెల్ల జయించి, హిమాలయపర్వతములవద్ద తనయొక్క విల్లు ఆకారమున ఒక చిహ్నమును నిలబెట్టెను. కాని చిట్టచివరకు సమకాలికుడగు చోళరాజుతో ఘటిల్లిన యుద్ధములో అతడు చోళరాజు_ఉభయులును తమ రాణులతో సహా మృతులైరి.

'నెడుమ్ చేరల్ ఆడన్' యొక్క సోదరుడును రాజ్యాధికారియు నగు 'పల్ యానై కుట్టువన్' అను నాతడు 'బహుగజ కుట్టువన్ కొంగూను' అను నతని జయించి తన రాజ్యమును పశ్చిమ తీరమునుండి తూర్పు తీరమువరకు విస్తరింపజేసెను. ఆడన్ అను నాతనికి ఇరువురు రాణుల వలన ఇరువురు పుత్రులు కలిగరి. వారిలో ఒకడు "కలంగైక్కన్నినర్‌ ముడై చ్చేరళ్‌” అను నాతడు. రెండవవాడు “సెంగుట్టవన్‌ (ధార్మికుడగు కుట్టవన్‌) అను నాతడు. (సుమారు క్రీ. శ. 180). వీరిలో 'చేరళ్‌ ' అను నాతడు అనేకశత్రువులను జయించి 'అధిరాజ' అను బిరుదములు పొందెను. సెంగుట్టవన్‌ అను నాతడు కవీశ్వరుడు. ఇతనికి 'కడల్‌ పిరాగ్‌ ఓట్టియ” (సముద్రమును పారదోలినవాడు) అను బిరుదము కూడ కలదు. ఇతడు నౌకాదళమును, ఏనుగుల యూధమును, అశ్వదళమును పోషించినట్లు తెలియుచున్నది. ఇతడు గొప్ప ఆశ్వికుడై యుండెను. ఈ కుట్టవన్‌ కాలములోనే పత్నిని ఆరాధించు విధానము, 'సిలప్పాధికారము' నందలి నాయకి యగు 'కన్నగి' పూజ, తదుపరి కేరళదేశములో పరిపాటిగా జరుగుచుండు భగవతీ ప్రార్థన అనునవి అమలులోనికి తేబడెనని తోచుచున్నది. పవిత్రురాలయిన పత్ని లేక 'కన్నగి'యొక్క ప్రతిమను తెచ్చి చెక్కించుటకై హిమాలయ పర్వతములవరకు కుట్టవన్‌ వెడలి, అచ్చట ఆర్య రాజునుఓడించి, ఒక శిలాఫలకమును తీసికొనివచ్చి, మార్గ మధ్యమున ఆ ఫలకమును గంగాజలములోముంచి, దానిని చేర రాజ్యమునకు తెచ్చెను. 'పత్ని' యొక్క శిలా విగ్రహమును చెక్కించి చేరరాజ్యమునకు రాజధానిగా నుండిన తిరువణిక్కులము (అనగా క్రాంగనూరు) నందు దానిని ప్రతిష్ఠించెను. ఈ ఉత్సవమున సింహళదేశపు రాజయిన 'గజబాహు'అను నాతడుకూడ ఉండినట్లు తెలియుచున్నది. గజబాహుకాలము క్రీ శ. 173 - 195 అని నిర్ణయింపబడినది. అందుచే కుట్టవన్‌ క్రీ. శ. రెండవశతాబ్దివాడని తేలుచున్నది. చోళుల వంశములో జరగుచున్న వారసత్వపు యుద్ధములో ఇతడు కల్పించుకొని తొమ్మిదిమంది రాజులను సంహరించి, పదవరాజునకు రాజ్యము సంక్రమింప జేసెను.

'పదిట్టపట్టు' (పది పదులు) అను తమిళసంఘ సాహిత్య సంకలనము ఉదియన్‌ యొక్క మూడు తరములకు చెందిన ఐదుగురు రాజులను వర్ణించుచున్నది. ఈ వంశపు మరియొక తెగకు చెందిన మరిముగ్గురు రాజులను గురించి కూడ ఇందు వర్ణనము కలదు. కాని ఈ ముగ్గురురాజుల పరిపాలనములు వంశ పారంపర్యముగ వచ్చినవి కావు. కౌటిల్యుడు వర్ణించిన విధమున, చేరరాజ్యము ఒక కుటుంబమునకు చెందిన వివిధరాజులచే పరిపాలింపబడెను. అదియే 'కులసంఘ' మనబడెను. ఆ పద్ధతిలో వంశజు లందరు ఆ రాజ్యములో భాగస్వాము లగుదురు. ఈ విధమయిన కులనంఘ పరిపాలనము ఆ రోజులలో అమలులో నుండినట్లు తెలియుచున్నది.

ఈవిధముగా 'ఆండువన్‌' అను నతడును ఆతని పుత్రుడైన 'సేల్‌ వక్కడంగవాలి ఆడన్‌” అను నతడును - ఈ ఇరువురును ఉదయన్‌' యొక్క సంతతిలోని రాజులకు సమకాలికులుగ ఉండి యుండవలయును. ఉభయులును పరాక్రమవంతులును, ఉదారులునై యుండిరి. మహాకవి కపిలారు తన పోషకుడయిన 'పారి' అను నతడు మృతుడయిన తరువాత 'వాలిఆడన్‌' అనునతని పోషకత్వమున చేరెను. ఆడన్‌ పుత్రుడయిన 'పెరుముచేరల్‌ ఇరుమ్‌పోరై' (కీ. శ. 190) అను నాతడు తాగడూరునకు చెందిన 'ఆదిగైమాన్‌' అను సామంతరాజును ఓడించెను. 'పెరుంసీరల్‌ ఇరుంపారయి' యొక్క భాగినేయుడొకడు పాండ్యచోళ రాజులను జయించి అయిదుశిలా దుర్గములను స్వాధీన పరచుకొనెనట.

క్రీ. శ. మూడవ శతాబ్దము తదుపరి చేర పాండ్యరాజుల యుద్ధనైపుణ్యమును గురించియు, ఉత్తరదేశము నుండి వచ్చిన శూరులతో వారు కావించిన పోరాటమును గురించియు, అచ్చటచ్చట ఉల్లేఖింపబడియున్నది. వాస్తవముగా చెప్పవలయుననిన కేరళదేశపు చరిత్రను క్రమముగా తెలిసికొనుటకు 5 శతాబ్దములవరకు తగినట్టి ఆధారములు లేవు. క్రీ. శ. ఎనిమిదవ శతాబ్దమందు మరల కేరళ చరిత్రయందు ఇరువురు గొప్ప రాజులుద్భవించిరి. అందు శైవమతమునకు చెందిన 'చేరమన్‌ పెరుమాళ్ళు' అను నతడు, వైష్ణవ మతమునకు చెందిన 'కులశేఖరాళ్వారు. అను నీ ఇరువురు రాజులును మహోదయపురము ( ప్రస్తుతపు క్రాంగనూరు )నే రాజధానిగా ఏర్పరచుకొనిరి. దీనిని విదేశీయులు ముజిరిస్‌ (Musiris) అని వ్యవహరించుచుండిరి. ఈ చేరరాజులకు 'పెరుమాళ్‌' అనునది గౌరవనామము.

ఈ వంశమునకు చెందిన కులశేఖరుడు కవీశ్వరుడును, మహాభక్తుడునై యుండెను. రామానుజీయ వైష్టవులచే ఇతడు కులశేఖరాళ్వారు అని పిలువబడి, పన్నిద్దరాళ్వారులలో చేర్పబడెను. ఈ కులశేఖరుడే 'తపతీ సంవరణమ్' సుభద్రా ధనంజయము అను సంస్కృత నాటకములను, 'ముకుందమాల' అను సుప్రసిద్ధ స్తోత్రమును వ్రాసెను. కులశేఖర పెరుమాళ్ రచించిన తమిళ స్తోత్రములు నాలాయిర ప్రబంధములో గలవు. దీనినిబట్టి చేరరాజుల కాలములో తమిళభాషయే కేరళభాషగా వెలసినదని తెల్ల మగును. ఈ చేర పెరుమాళులలో నొక రాజు అపుడపుడు కేరళతీరమునకు వ్యాపారముకొరకు వచ్చిన అరబ్బులతో ఏగుదెంచిన ఒక ముస్లిము గురువు ప్రభావమున ఇస్లాంమతము నవలంబించెను. “నేను కాబాకు వెళ్ళివచ్చెదను. అంతవరకును కత్తిని ధరించి నా ప్రతినిధివై పరిపాలింపుము" అని తవ అన్నకుమారునకు రాజ్యము నప్పగించి వెళ్ళి అతడు అక్కడనే పరమ పదించెననియు, అప్పటినుండియు రాజ్యమును పాలించిన వారందరును, కత్తిని సింహాసనము నధిష్ఠింపజేసి తత్ప్రతినిధులుగా పాలించుచు వచ్చిరనియు కొన్ని చారిత్రి కాధారములను బట్టి నిర్ణయింపబడినది.

చేరరాజుల పరిపాలనమునందు కేరళతోపాటు నేటి కోయంబత్తూరు జిల్లాలోని కొన్ని భాగములు కలిసి యుండెనని తెలియుచున్నది. చేరరాజులయొక్క పరిపాలన రెండవసారిగా పై నుదాహరింపబడిన రాజుల కాలముననే ప్రారంభింపబడినట్లు తెలియుచున్నది. ఈ ఇరువురి తరువాత రాజశేఖర, స్థానురవి, భాస్కరరవి వీర కేరళ ప్రభృతులు కొందరు రాజులు ఏలినట్లు తెలియుచున్నది. కాని క్రీ. శ. 10వ, 11వ శతాబ్దములందు చోళరాజులయిన రాజరాజు, రాజేంద్రరాజు, చేర రాజుల నోడించిరి. అందువలన చేరరాజుల బలము చాలవరకు సన్నగిలినది. శాసనముల వలనను, మరికొన్ని ఆధారముల వలనను, ఆ కాలపు చేరరాజులను గురించి కొద్ది కొద్దిగా తెలియుచున్నది.

పదునాల్గవ శతాబ్దముయొక్క ఆరంభమున మరియొక గొప్ప రాజు ఉదయించెను. రవివర్మ కులశేఖర (సంగ్రామధీర) అను రాజు మరల దక్షిణదేశ చరిత్రలో తన యొక్కయు, తన రాజ్యముయొక్కయు ప్రఖ్యాతిని నిలబెట్టెను. కంచీపుర శాసనములవలన రవివర్మ జీవిత చరిత్రమునందలి కొన్నికొన్ని ముఖ్యాంశములును, కాలములును, మనకు తెలియుచున్నవి. ఇతడు క్రీ. శ. 1266 వ సంవత్సరమున జన్మించెను. 33 సంవత్సరములు వయస్సు వచ్చుసరికి ఇతడు కేరళ దేశమంతటికిని అధికారిఅయ్యెను. నలుబదిఏడు సంవత్సరములు వచ్చుసరికి (క్రీ. శ. 1313) ఇతడు దక్షిణాపథమునకు 'మహారాజు' అను బిరుదమును కాంచీపురములో స్వీకరించెను. పాండ్య రాజులను, చోళరాజులను జయించెను. పాండ్య రాజయిన విక్రమపాండ్యుని కూతును వివాహమాడెను. ఈ పట్టాభిషేక మహోత్సవము శ్రీరంగమునందును, తిరువాడియందును, జరుపబడెను. కాని దక్షిణభారతమునకు గొప్ప రాజకీయ సంక్షోభము కలుగనున్నదని, మహమ్మదీయ రాజయిన మల్లిక్ కాఫరు హొయసాలుల నోడించి పాండ్యరాజులపై దాడివెడలిన సందర్భమున రవివర్మ గట్టిగా గ్రహించెను. ఇతని ప్రథమవిజయ ప్రయత్నములు ప్రాతిపదికములుగా దక్షిణదేశ మందు విజయనగర సామ్రాజ్యము స్థాపింప బడెననుట అతిశయోక్తి కాదు. ఇతడు మహాకవియు, కవిపోషకుడును విద్వాంసుడునై యున్నాడు. 'ప్రద్యుమ్నాభ్యుదయము' అను నాటకమును సంస్కృతమున రచించిన దిట్ట ఇతడు. పట్టాభిషిక్తుడయిన కొలదికాలమునకే దివంగతుడయ్యెను.

రవివర్మ పిదప నవీనయుగము వరకు కేరళదేశము అనేక రాజులచే పరిపాలింపబడెను. చేరరాజులకును పాండ్యరాజులకును మధ్య, అపుడపుడు కొద్దిపాటి యుద్ధములు జరుగుచుండెను.

తిరువాన్కూరు రాజకీయవేత్తలయిన మహారాజులచే పరిపాలింపబడెను. భారతదేశమునందు ఎచ్చటను అమలులో లేనప్పుడు మొట్టమొదట తిరువాన్కూరు సంస్థానములో, బాధ్యతాయుత ప్రభుత్వమును, వయోజనుల ఓటింగు పద్ధతియు ప్రవేశ పెట్టబడినవి. సాంఘిక సంస్కార పరములైన శాసనములు కావించుటయందుగూడ భారత సంస్థానములన్నిటికంటెను కేరళము మిన్నయైనది. విద్యా వ్యాప్తి (ముఖ్యముగా స్త్రీ విద్యావ్యాప్తి) గావించుట యందును కేరళమే అగ్రతాంబూలమునకు అర్హమైనది.

కేరళ రాజకీయ చరిత్రము : నేటి కేరళ రాష్ట్రము దాదాపు పదునొకండు వందల సంవత్సరములనుండి మూడు ప్రత్యేక విభాగములు కలిగి, తిరిగి క్రీ. శ. 825 వ సం॥ రమునకు పూర్వపు రూపమును పొందినది. కావున ఈ రాష్ట్ర చరిత్రమును మూడు భాగములుగా విభజించి సంగ్రహముగా పొందుపరచుట యుక్తము.

తిరువాన్కూరు రాజ్యము: తిరువాన్కూరు రాజులు ఇతిహాస పురాణాదులందును తమిళసంఘ వాఙ్మయము నందును పేర్కొనబడిన చేరవంశమునకు తాము చెందిన యట్లు భావింతురు. క్రీ. శ. కంటె పూర్వమునుండియే ఈ వంశపు చరిత్ర ప్రాచీన తమిళ గ్రంథములందు కానబడుచున్నది, వీర కేరళ వర్మ రాజ్యాభిషిక్తుడై 'వేనాటి' కధిపతియైనపుడు తులాభార పద్మగర్భ సంస్కారముల నాచరించె ననియు, వీరమార్తాండవర్మ కలియుగాది 3831 వ సంవత్సరమున 'కులశేఖర పెరుమాళ్' అను బిరుదమును గ్రహించె ననియు గాథ కలదు. కులశేఖరాళ్వార్ అని వైష్ణవులచే పూజింపబడు చేరరాజు ఈ వంశమునకు చెందిన ప్రాచీన పురుషుడు తన తపతీ సంవరణము అను సంస్కృత నాటకమందు 'కేరళ చూడామణి' అను తన బిరుదమును తెలుపుకొన్నాడు. కొన్ని శాసనములవలనను ఈ విషయము రుజువగుచున్నది. క్రీ. శ. 7 వ శతాబ్దములో పాండ్యరాజగు అరి కేసరి మారవర్మ ‘కొట్టార' అను పురముపై దండెత్తెననియు ఆపురము చేరరాజులకు చెందినదనియు 'నక్కిరార్ ' రచనల వలన తెలియుచున్నది. క్రీ. శ. 12 వ శతాబ్దియందు వెలసిన పరాంతక పాండ్యరాజుయొక్క కన్యాకుమారి శాసనము తిరువాన్కూరు చేరరాజును స్పష్టముగా పేర్కొనుచున్నది. శ్రీరంగము, విరుద్ధనీశ్వరము, తిరువనంతపురము. పొన్నామలే మున్నగు శాసనములు ఈ రాజులను చేరరాజులనియే వ్యవహరించు చున్నవి.

కురుక్షేత్రయుద్ధమున చేరరాజులు పాల్గొనినట్లు మహాభారతము చెప్పుచున్నది. ఈ చేర రాజులు ఉత్తరభారతముపై దండెత్తినట్లును, తరువాతి కాలమున చేర రాజులు చోళ పాండ్యుల సంయుక్త సేనలను తరిమి వేసినట్లును తమిళ సంఘ సాహిత్యమున చెప్పబడియున్నది. చేరమాన్ పెరుమాళ్ అను బిరుదనామముతో ఈ చేర రాజులు పరిపాలించి క్రాంగనూరు, తిరువంచికులమ్ మున్నగు ప్రదేశములందు రాజధానులను కలిగియున్నట్లు తెలియుచున్నది. క్రీ. శ. 825 ప్రాంతములో, వారి రాజ్య వైశాల్యము తగ్గి, చక్రవర్తిత్వము పోయి, విభజింపబడిన పిదప 'వేనాడు' అను భాగమును పాలించినవారే తిరువాన్కూరు రాజులు. అప్పుడు కొల్లమ్ (Quilon) అను పట్టణము వారికి రాజధానిగా నుండెను. ఈ రాజులలో శ్రీవల్లభ కొత్తా గోవర్ధన మార్తాండ, వీరకేరళ వర్మ, కొత్తా కేరళవర్మ, శ్రీవీర రవివర్మ, రెండవ శ్రీవీర కేరళ వర్మ, అరయమార్తాండ వర్మ, శ్రీదేవాథరన్ కేరళ వర్మ మున్నగు పేరులు వినబడుచున్నవి. శ్రీవీర రామ కేరళ వర్మకును (క్రీ.శ. 1209-1214) శ్రీవీరరవి కేరళ వర్మకును తరువాత, సుప్రసిద్ధుడగు మార్తాండ వర్మ మిగుల బలవంతుడై అనేక సామంత నాయకులకు ప్రభువై రాజ రాజ స్థాయి నందుకొనెను.

ఇతని తరువాత రవివర్మ కులశేఖరుడు క్రీ. శ. 1299 నుండి 1313 వరకు పరిపాలించెను. విక్రమపాండ్యుని జయించి పాండ్య రాజు కూతురును రాణిగా గై కొనెను. పశ్చిమ సముద్రతీరము నాక్రమించుకొని, సహ్యాద్రిని దాటి నెల్లూరువరకు గల ప్రదేశమును వశపరచుకొని, వేగవతీ నదీతీరమునగల సుప్రసిద్ధ కాంచీపురమున ‘రాజాధిరాజ పరమేశ్వర' బిరుదముతో తన 46 వ యేట దక్షిణాపథ చక్రవర్తిగా అభిషిక్తుడయ్యెను. శ్రీరంగమునందును, తిరుపతియందును అభిషేకోత్సవములను జరుపుకొనెను. పరమధార్మికుడై అనేక దేవాలయాది హిందూ సంస్థల నుద్ధరించి, స్వయముగా పండితకవియై అట్టి వారిని పోషించెను. స్వయముగా 'ప్రద్యుమ్నాభ్యుదయ' మను రసవత్తర సంస్కృత నాటకమును రచించెను. కాని ఈ విజయములన్నియు ఆతని ఆకస్మిక మరణమువలన అంతమొందుటచే కాకతీయ సామంతులును, పాండ్యరాజులును తమ ప్రాంతములను మరల కైవస మొనర్చుకొనిరి. వీరరవివర్మ తరువాత పాలించిన రాజులలో ఆదిత్యవర్మ రామమార్తాండవర్మ, ఆదిత్యవర్మ, సర్వాంగనాథవీర రవివర్మ, చేర ఉదయమార్తాండ వర్మ, ముఖ్యులు.

క్రీ. శ. 6-7 శతాబ్దములలో ఈ రాజ వంశమువారు రాష్ట్రములో వివిధ భాగములందు వసించుట కారంభించిరి. నిడుమంగాడు, కొట్టారకరా, కల్కులమ్, మున్నగునవి ఇట్టి పురములే. తిరునల్వేలి ప్రాంతమునుండి పలుమారు లాక్రమణ జరుగుచుండుటచేత కల్కులమ్ అనుచోట సేనలను స్థాపించి రక్షణమున కేర్పాట్లు చేయవలసివచ్చినది. అందుచేత అదే రాజధానిగా మారిపోయినది. ప్రాచీన రాజధాని కొల్లమ్ (Quilon) యొక్క ప్రాముఖ్యము తగ్గిపోయినది. ఈకాలపు విదేశీయులగు యాత్రికుల వ్రాతలవలన, సంఘటితమైన వ్యవస్థ కలిగి అభ్యుదయ పథములో నడచుచున్నట్లు తెలియుచున్నది.

క్రీ. శ. 15 - 16 శతాబ్దముల కాలము విజయనగర సామ్రాజ్య విస్తరణమునకు చెందినది. విజృంభమాణమగు మహమ్మదీయుల శక్తి నెదుర్కొని వారి నరికట్టు బాధ్యతను వహించి విజయనగర రాజులు ఇతర హిందూరాజులకు సాహాయ్యమొసగి వారిని సామంతులనుగా నొనర్చుకొనిరి. తిరువాన్కూరునకు అట్టి సాహాయ్య మనవసరమై నందున విజయనగరమునకు అది తలయొగ్గలేదు. తత్కారణముగా స్పర్ధ ఏర్పడి క్రీ. శ. 1503 ప్రాంతములో యుద్ధముజరిగి, తిరువాన్కూరు గెలిచినదని బుడతకీచు వైస్రాయి వ్రాసియున్నాడు. ఒక శతాబ్దము వరకు అనేక సారులు విజయనగర తిరువాన్కూర్ల మధ్య యుద్ధములు జరిగినవి. అట్లే మధురనాయకులతోను పోరాటములు జరిగినవి. ఈ కాలములోనే బుడతకీచులు ఉత్తర మలబారుతీరమున వ్యాపారమునకై వచ్చి స్థానముల నాక్రమించుకొనిరి. కొల్లం (Quilon) మున్నగు ప్రదేశములందు ఫ్యాక్టరీలను పెట్టిరి. సెంటుఫ్రాన్సిస్స్ ఝెవియర్ (St. Francis Xavier) దక్షిణ తిరువాన్కూరులో నివసించి క్రైస్తవమత ప్రచారము సాగించెను. ఈ కాలపు రాజులలో ఉదయమార్తాండవర్మ కీర్తిమంతుడయ్యెను. క్రీ. శ. 17వ శతాబ్ది అత్యంతమగు అశాంతికాల మని చారిత్రకు లొప్పుకొనెదరు. ఈ కాలముననే రవివర్మ యను మైనరు రాజునకు రీజెంటుగా రాణి ఉమాయమ్మ పరిపాలించినది. ఆమె, క్రీ. శ. 1684 వ సంవత్సరములో బ్రిటిషువారికి ఒక ఫ్యాక్టరీని నిర్మించుటకు అనుజ్ఞనొసగి, బ్రిటిషువారి స్నేహాదరములకు పాత్రురాలైనది. అంతకు మున్నే ఉన్ని కేరళవర్మ క్రీ. శ. 1644 లో ఒక ఫాక్టరీని నిర్మించుటకు అనుజ్ఞ నొసగియుండెను. ఈ సంబంధమే బలవడి తిరువాన్కూరు కూడ, ఈస్టు ఇండియా కంపెనీ యొక్క అధికార ప్రాబల్యమునకు ఇతర దేశీయరాజ్యములవలె లొంగిపోయినది.

క్రీ. శ. 18వ శతాబ్దమున సుప్రసిద్ధు డగు మార్తాండవర్మ పరిపాలనలో తిరువాన్కూరు రాజ్యమునకు గొప్పస్థాయి లభించినది. ఈ మహారాజు చిన్ని చిన్ని సంస్థానముల నేలుచు, పరస్పర కలహము లొనర్చుచు, ప్రజలపై దౌర్జన్యములను గావించుచు రాష్ట్రమునందు అశాంతికి సామంతుల నందరిని జయించి, వశులను గావించుకొని, దాడి చేయుచుండు వివిధ సాయుధ నాయర్ ముఠాల మద మడచి, కొచ్చిన్‌వరకుగల తిరువాన్కూరు భూ భాగమునెల్ల సంఘటితపరచి, ఆభ్యుదయపథమున నడచు పరిపాలన మొనర్చెను. చట్టములనుచేసి, జలాశయములను కట్టించి ప్రఖ్యాతిని గాంచెను. ఈ మహారాజు కావించిన అపూర్వమై, చరిత్రాత్మక మైన ఒక మహాకార్యము తిరువాన్కూరు రాజ్యమును శ్రీ అనంతపద్మనాభస్వామికి సమర్పించి, తాను శ్రీ పద్మనాభ దాస యను పేరుతో పరిపాలించుటయై యున్నది. ఈ పదమే ఇప్పటికిని వాడబడుచు నేటి బాలరామవర్మ చిత్రా తిరునాళ్ మహారాజావారి యొక్క బిరుదమై విరాజిల్లుచున్నది.

మార్తాండవర్మచే సంఘటితమైన విస్తృత తిరువాన్కూరు రాజ్యమును అతని మేనల్లుడగు రామవర్మ కార్తిక తిరునాళ్ మరింతదృఢపరచి కర్ణాటకనవాబులతోను, కాలికట్టు సాముద్రీ రాజులతోను తిరునల్వేలి పాళెగార్లతోను యుద్ధమొనర్చి, వారి ఆక్రమణము నుండి రాజ్యమును కాపాడుచు పరిపాలనను సంస్కరించి, ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి, శాంతిభద్రతల నెలకొల్పి, అభ్యుదయ పథానువర్తియై సద్యశమును కాంచెను. 'ధర్మరాజు' అను విఖ్యాత నామముతో ప్రజ లతనిని గౌరవించిరి. ఇతని పిదప బాలరామవర్మ పరిపాలనా దక్షత లేనివాడై కుట్రలుపన్ను నీచులగు సలహాదారుల చేతులలో కీలుబొమ్మయై, అపయశస్సును గాంచుటచే, ప్రజలలో సంక్షోభము కలిగినది. వేలుతంపి దళవాయి అని ప్రసిద్ధిగాంచిన ఒక వీరుడు తిరుగుడు పాటుచేసి ప్రధానిగా నేర్పడి, అక్రమపరిపాలనము నంతమొందించెను. ఈస్టు ఇండియా కంపెనీవారికి చెల్లింపబడుచున్న పైకము బాకీపడిపోయినందున, అది చెల్లించుటకై దళవాయి వేలుతంపి సేనను తీసివేసెను. నిరుద్యోగులైన సైనికులు తిరుగుబాటు చేయగా బ్రిటీషు రెసిడెంటు సహాయమతో, వారి నణచవలసివచ్చెను. తత్కారణముగా వారికి మరికొన్ని హక్కులను, ఎక్కువ కప్పమును ఇయ్యవలసి వచ్చినది. తిరిగి కప్పము బాకీపడుటతో దళవాయికిని రెసిడెంటుకును గల స్నేహమంతమొంది, కర్నల్‌ మెకాలే యొక్క పొగరుబోతుతనమునకు సహించని దళవాయి బ్రిటీషువారికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసెను. కొచ్చిన్‌ సంస్థాన మంత్రియగు పలియన్‌ అచ్చన్‌ కూడ ఏకీభవించెను. కాని బ్రిటీషు సైన్యము తిరుగుబాటును సంపూర్ణముగా అణచివేసెను. వేలుతంపి దళవాయి మాత్రము బ్రిటీషుసైనికులకుచిక్కక, ఆత్మహత్యగావించు కొనెను. ఇతడు బ్రిటీషువారికి విరుద్దముగా మొట్టమొదట కత్తినెత్తిన వీరుడు. బ్రిటీషువారితో తిరిగి మైత్రికలిగినది. అసమర్థుడగు బాలరామవర్మ మరణానంతరము రాణి గౌరీలక్షీబాయి, రాణి గారీపార్వతీబాయి, మహారాణితై, కర్నల్‌ మన్రోయను రెసిడెంటు సలహాల ప్రకారము బ్రిటీషువారి ప్రభుత్వ విధానము ననుసరించి అనేకమైన మార్చులను గావించి చక్కగా పరిపాలించిరి.

వీరి పిదప రాజ్యూభిషిక్తుడయిన స్వాతితిరునాళ్‌ మహారాజు సుప్రసిద్దుడగు వాగ్గేయ కారకుడు. గొప్ప పండితుడు. కవి. భక్తాగ్రేసరుడు. సమయజ్ఞు డగు ఈ మహరాజు మున్‌సిపు కోర్టులను, జిల్లాకోర్టులను ఏర్పరచి, ఇంజనీయరింగు శాఖను స్థాపించి, చట్టములను శాసించి, వైద్యశాలలను జ్యోతిషాలయములను నెలకొల్పి ప్రగతి మార్గమున పరిపాలించెను. 34 సంవత్సరములు మాత్రమే జీవించిన మహామహుడు తుదకు రెసిడెంటుతో అభిప్రాయ భేదము కలిగి దైవభక్త్యతిశయముచే పూజాధ్యాన పరాయణుడై వైరాగ్యముతో జీవితము ఏకాంతముగా గడుపుచు వచ్చెను. పరిపాలన యందు శ్రద్ధ కలిగి యుండలేదు. బహుభాషాభిజ్ఞుడయిన ఈ పండిత మహారాజకవి సంగీత సాహిత్యములం దెనలేని ప్రతిభాశాలియై పెక్కు కావ్యములను, స్తోత్రములను ఏడుభాషలందు అఖిల భారతమున గాయకులకు ఉపాధేయములగు కీర్తనలను రచించెను.

ఇతని తమ్ముడగు ఉత్తరం తిరునాళ్‌ కాలములో (1855) బానిసలకు విముక్తి లభించినది. రెసిడెంటుతో అతనికి మైత్రి గలిగియున్నను, ఐరోపీయ క్రైస్తవ మిషనరీలు అతని పరిపాలనా పద్ధతులను విమర్శించుచు పలువిధములయిన ఆరోపణలను గావించి, మద్రాసు గవర్నరువద్ద చాడీలు చెప్పిరి. కాని సర్దుబాటు జరిగి అలజడి శాంతించినది. ఆతని తరువాత రాజగు అల్యం తిరునాళ్‌ రామవర్మ కాలములో తిరువాన్కూరు సంస్థానము ఉన్నతదశ నొందెను. ఈ స్టేటుకు 'ఆదర్శరాష్ట్ర' (Model State) మను గౌరవముకూడ కలిగినది. అనేకములయిన అక్రమములైన పన్నులు రద్దుచేయబడెను. సంస్థానము బ్రిటిషు జిల్లాలమధ్య వ్యాపారమునకు సంబంధించిన ఆటంకములు తొలగి వాణిజ్య మభివృద్ధి నొందినది. “అంచల్‌ " అను పోస్టు వ్యవస్థయొక్క సౌకర్యము ప్రభుత్వమునకే కాక ప్రజలకుకూడ కలిగించ బడినది. సర్కారు భూముల పట్టాహక్కులు భూస్వాముల కీయబడినవి. పాఠశాలలు, కళాశాలలు, పబ్లికువర్క్సు వైద్యశాఖలు మిగుల అభివృద్దిగాంచినవి. 'మహారాజా' అను బిరుదము అతనికి బ్రిటిషు చక్రవర్తిచే ప్రసాదింప బడెను.

అతని తరువాత శ్రీ విశాఖ తిరునాళ్‌ పదవీధరుడయ్యెను. గొప్ప పథకములు వేసెను. ఆ మహారాజు లంచగొండితన మును, పరిపాలన యందలి అవినీతిని రూపు మాపుటకు ప్రయత్నించెను. అయిదు సంవత్పరములు మాత్రము పరిపాలించి గతించెను. ఆ మహారాజు పిదప, శ్రీ మూలం తిరునాళ్‌ 39 సంవత్సరములు చక్కగా పరిపాలించి తిరువాన్కూరు సంస్థానమును సర్వతోముఖాభివృద్ధికి తీసికొనివచ్చి ఆధునిక రాజ్యాంగ సంస్కరణల నొనరించి శ్రీ మూలంసభ యను శాసనసభను నెలకొల్పి, దేశీయ సంస్థాన పరిపాలకులలో అగ్రగణ్యుడని ఖ్యాతి వహించెను.

శ్రీ మూలం తిరునాళ్‌ 7 వ ఆగస్టు 1924 సంవత్సరమున దివంగతు డయినందున శ్రీ బాలరామవర్మ చిత్రా తిరునాళ్‌ మహారాజు సింహాసనాసీను డయ్యెను. 1949 వరకు తిరువాన్కూరు మహారాజుగ ఇతడు ఏలుబడి సాగించెను. పిదప తిరువాన్కూరు-కొచ్చిన్‌ సంయుక్త రాష్ట్రమునకు రాజప్రముఖుడుగా 1 - 11 - 1956 వరకు పాలించెను. కేరళరాష్ట్ర సంస్థాపనతో గవర్నరు ఏర్పడిన తరువాత వీరికి రాజకీయములతో సంబంధములేదు. తమ వంశ మర్యాదలను కాపాడుకొనుచు ఇప్పటికిని వీరు తిరువనంతపుర ములో శ్రీ పద్మనాభస్వామి కైంకర్య మొనర్చుచుందురు.

కొచ్చిన్: తిరువాన్కూరు చరిత్రవలెనే కొచ్చిన్ సంస్థానపు చరిత్రకూడ మరుగువడియుండెను. కొచ్చిన్ సంస్థాన ప్రభువులు 'చేరమాన్ పెరుమాళ్' అను రాజు కాలము నుండి వంశపారంపర్యముగ తమ రాజ్యాధికారమును అనుభవించుచు వచ్చిరి. చేరమాన్ పెరుమాళ్ అను నాతడు తన రాజ్యమును తన బందుగులకును ముఖ్యులయిన రాజవంశీయులకును పంచియిచ్చెను.

1502 వ సంవత్సరములో, పోర్చుగీసువారికి, కొచ్చిన్ సంస్థానముచే, కొచ్చిన్ రేవునకు సమీపమందు గల భూమి దానముచేయబడెను. ఆ ప్రదేశములో మరుసటి సంవత్సర మొక కోటను నిర్మించుకొనుటకును, కొచ్చిన్ సంస్థానముతో వాణిజ్య సంబంధములు నెలకొల్పుకొనుటకును, పోర్చుగీసువారు ప్రభుత్వానుమతిని పొందిరి. 'జా మోరిన్’ అను నాతనితో తలపెట్టిన యుద్ధములలో కొచ్చిన్ ప్రభువు, పోర్చుగీస్ వారినుండి అధికమయిన సాయమును సంపాదించుకొనెను. 17 వ శతాబ్ది ఉత్తర భాగములో పోర్చుగీసువారి ప్రతిభ పశ్చిమ తీరమున తగ్గ నారంభించెను. 1663 వ సంవత్సరములో పోర్చుగీసువారు, డచ్చివారిచే నోడింపబడి కొచ్చిన్ నగరమునుండి వెడలగొట్టబడిరి.

పిదప కొచ్చిన్ ప్రభువు డచ్చివారితో సంధి నొనర్చు కొనెను. పూర్వము పోర్చుగీసువారి కొసగిన హక్కులనే డచ్చివారికి గూడ నొసగెను. దాదాపు ఒక శతాబ్ది పిమ్మట (1759) డచ్చివారి అధికారము సన్నగిల్లెను. అపుడు కాలికట్‌నం దున్న 'జామోరిన్' అను నాతడు కొచ్చిన్ రాజుపై దండెత్తెను. తిరువాన్కూరు రాజు చేసిన గొప్పసహాయముచే జామోరిన్ తరిమి వేయబడెను.

క్రీ. శ. 1776 లో కొచ్చిన్‌పై హైదరాలీ దండెత్తెను. ఆతనికి ఆతని అనంతరము అతని కుమారుడైన టిప్పు సుల్తానునకును కొచ్చిన్ సంస్థానము అనేక దశాబ్దముల వరకును లోబడి యుండెను. క్రీ. శ. 1791 లో కొచ్చిన్ మహారాజు ఈస్ట్ ఇండియా కంపెనీవారితో మిత్రత్వ సంధి యొనర్చుకొనెను. ఆ సంధి ననుసరించి కొచ్చిన్ మహారాజు కంపెనీవారికి తన సంస్థానము లోబడియుండు నట్లును, కంపెనీవారు తన కొసగు రక్షణమునకు ప్రతిఫలముగ ప్రతి సంవత్సరమును వారికి తాను కొంత ధన మర్పించునట్లును, అంగీకరించెను. తదాదిగా కొచ్చిన్ సంస్థానపు మహారాజులందరును తమ సంస్థానమును శాంతి భద్రతాయుతముగ ఏలుకొనగలుగుచుండిరి. తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానములు రెండును కేరళ రాష్ట్రములో అంతర్భాగము లయ్యెను. అందుచే కొచ్చిన్ మహారాజు తన రాజ్యాధికారమును కోల్పోయెను. (1956)

మలబారుప్రాంతము : కేరళ రాజ్యములో ఉత్తరభాగమందు కాలికట్ నివాసియగు “జామోరిన్" అను నాతనియొక్క పూర్వునకు "పెరుమాళ్" ప్రభువంశములో తుదివానినుండి కొంత భూమియు, ఆ భూమితో పాటు బహుమానముగా వానికొక ఖడ్గమును లభించెను. ఆ ఖడ్గ సహాయమున 'జామోరిన్' పరిసరప్రాంతము లందలి రాజులందరిని లోబరచుకొనగలిగెను.

జామోరిన్ సాగించిన దండయాత్రలలో ఒకొ క్కప్పుడు అతనికి అరబ్బులు సాయపడుచుండిరి. అంతకుపూర్వమే అరబ్బులు కేరళమునకు వచ్చి 'కాలికట్' నగరమును తమ వ్యాపారకేంద్రముగ నేర్పరచుకొనిరి. నావికా నిర్వహణమునందు ఆ రోజులలో అరబ్బులు దిట్టలై యుండిరని ప్రతీతి కలదు. వారి సహకారముతో జామోరిన్ సిసలయిన ఒక నావికాదళమును నిర్మించెను. కేరళ చరిత్రలో ఆ యుగమొక సువర్ణయుగముగా అభివర్ణింప బడినది. ఆ నావికాదళ సహాయముచే పోర్చుగీసు దండయాత్రికులను, సముద్రపు టోడదొంగలను, కేరళతీరమునకు కొంతకాలమువరకు చేరకుండా తరిమివేయ గలిగిరి. 14 వ శతాబ్దిలో విజయనగరపు ప్రభువులు తాత్కాలికముగ జామోరిన్‌ను తమ ఆధీనములోనికి తెచ్చుకొనిరి. కాని 15 వ శతాబ్దాంతమున పోర్చుగీసు నావికుడగు వాస్కోడిగామా అనునాతడు కాలికట్టులో దిగినంతనే, జామోరిన్ మరల మలబారు ప్రభువులందరిలో ప్రబలుడయ్యెను.

అనంతరము మలబారునందు చిన్న చిన్న రాజులనడుమ అంతఃకలహములు చెలరేగెను. పోర్చుగీసువారు ఏదో యొక పక్షము వహించుటయు, ఇంతలో ఇతర పాశ్చాత్యులు మలబార్ రంగములో ప్రవేశించుటయు, మైసూరు సుల్తానులు కొన్ని మలబారురాజ్యములను గెల్చుటయు వెనువెంటనే రక్తపాతముతో యుద్ధములు చెలరేగుటయు వాటి ఫలితముగ చిన్న చిన్న రాజ్యములలో ఒకటివెంట నొకటి అంతరించుటయు, సంభవించెను. 1792 వ సంవత్సరములో బ్రిటిషువారి సాయమును పొందిన తిరువాన్కూరు సంస్థాన సైన్యములను టిప్పుసుల్తాను ఎదుర్కొనవలసిన వాడయ్యెను. అనంతరము జరిగిన ఒడంబడిక ప్రకారము టిప్పుసుల్తాను మలబారు ప్రాంతమును బ్రిటిషువారి కప్పగించెను. జామోరిన్ కుటుంబమువారు కౌలుపత్రముల క్రింద భూములపై తమ పెత్తనమును, అనుభవించుచు వచ్చిరి. అనంతరము ఇతర రాజులతోపాటు జామోరిన్ అను నాతనికిగూడ శాశ్వతమయిన పెన్షను మంజూరు చేయబడినది.

క్రీ. శ. 1792 వ సంవత్సరము నుండి కేరళములో బ్రిటిషు అధికారము ప్రారంభమయ్యెను. కేరళ చరిత్రము విదేశీయ పాలకులను ప్రతిఘటించిన వీరోచితమయిన గాథగా ప్రస్తుతి గడించినది.

ఈ విధముగా కేరళదేశము చేరరాజుల ఆధిపత్యమున ఏక పరిపాలనాబద్ధమై పెక్కు శతాబ్దముల కాలము విలసిల్లెను. తరువాత కాలప్రభావమున చారిత్రకముగ పెక్కు మార్పులకు అది గురి యయ్యెను. కేరళరాజ్య విస్తీర్ణము హెచ్చుచు, తగ్గుచు వచ్చెను. ప్రతిభాశాలియైన చేరమాన్ పెరుమాళ్ అను కడపటిరాజు తరువాత అది మరికొంత విభజనకు పాలయ్యెను. ఇటీవలి చరిత్రకాలములో పైన నుడివిన ప్రకారము కేరళము మూడు ప్రత్యేక రాష్ట్రములుగ రూపొందెను. భారతీయ రాష్ట్రముల పునర్నిర్మాణ సందర్భమున 1956 సంవత్సరము 1 వ తేదీ నవంబరునాడు భాషా మూలకముగను, సాంస్కృతికముగను ఏకసూత్ర బద్ధముగా వెలయుటకు కేరళరాష్ట్రము నిర్మాణమాయెను. ఇట్లు చిరకాలాగతముగా నుండిన మలయాళీలవాంఛ ఫలించినది.

ఆచార వ్యవహారములు : కేరళీయులు తమిళులకంటె తెలుపైన చామనచాయ గలిగి అవయవ సౌష్ఠవముతో నొప్పారుచు శుభ్రమైన దుస్తులను ధరించి నిరాడంబరము పరిశుభ్రము అగుజీవనమునకు అలవడినవారు. స్త్రీపురుషులందరు ప్రాయశః తెల్లని వస్త్రములను ధరింతురు. ప్రతి దినము కాకపోయినను వారములో తరచుగా శిర స్స్నానము చేయనివారుండరు, తైలాభ్యంగనము స్త్రీ పురుషులకుకూడా నిత్యమగు దేశాచారము. కేరళీయ స్త్రీల వ్రేలాడు శిరోజములు సుప్రసిద్ధములని రఘువంశ శ్లోక మొకటి చాటుచున్నది. మళయాళ స్త్రీలు బట్టకట్టు విధము ఆయా జాతులనుబట్టి మారుచుండును. నాయరు స్త్రీలు తెల్లని 'వుడువ' రౌక (రవిక), ఉత్తరీయము ధరించువారు. క్రైస్తవ స్త్రీలు 'వుడువ' ను నడుముపై చిన్న కుచ్చులు వ్రేలాడునట్లు ధరించెదరు. తిలకము లేక పోవుటయు, ఈ కుచ్చులను ధరించుటయు, వారు హిందువులు కారనుటకు చిహ్నములు. ముస్లిం స్త్రీలు (మలబారు మోప్లాలు) రంగుల దుస్తులు ధరింతురు. కాని తలపై ముసుగు గుడ్డలను వేసికొనెదరు. పురుషులు ముండు అను పంచెను ధరింతురు. షర్టును వేసికొందురు. తలగుడ్డ ప్రసక్తిలేదు. ఈ పద్ధతులు గత నాలుగైదు దశాబ్దములనుండి మారిపోయినవి. నేడు ఇతర భారత స్త్రీలవలె రంగుల చీరలు, రవికలు సాధారణముగా నాగరికులలో దినదిన ప్రచార మొందుచున్నవి. పురుషులలో ఆంగ్లేయ పద్దతి కోటు పంట్లాము ధరించుట వ్యాప్తి నొందుచున్నది. కాని కాళీయులందరును, కనీసము పురుషులందరు ఒకేమాదిరి దుస్తులు ధరించుట వలనను, ఒకే భాషను మాట్లాడుచుండుట వలనను, కొన్ని ఇతర ప్రాంతములందువలె వారి జాతిమత భేదము అంతగా బాహ్యదృష్టికి గోచరముకాదు. తిలకముధరించుట హైందవులగు పురుషులలో అరుదై పోయినందున ఈ భేదము మరింత కానరాని దని చెప్పవచ్చును. స్త్రీలు పూర్వకాలమందు చెవులు, ముక్కులు, కంఠము, తల, కాళ్లు, చేతులు, నడుము మున్నగు సర్వావయవములకు బరువగు రకరకాల ఆభరణములను ధరించువారే కాని ఇపుడా యభ్యాసము సన్నగిల్లి ఇతరప్రాంతములందు వలెనే వారును ఆధునిక నాగరిక స్త్రీలవలెనే మెలగు చుందురు.

కేరళముయొక్క ప్రత్యేక దేశాచారములలో "మరుమక్క తాయమ్" మరియు సంయుక్త కుటుంబపద్ధతులు పేర్కొనదగినవి. 'మరుమక్క తాయమ్' పద్ధతి ప్రకారము వారసత్వపుహక్కులు ఆడపిల్లల సంతతికి చెందును. క్షత్రియులు, అంబలవాసులు (దేవాలయ సేవకులు) సామంతులు, నాయర్లు, కొందరు ఇఝవాలు లేక తియ్యాలు, కొందరు ముస్లిములుకూడ ఈ యాచారమునే పాలించుచుండిరి. పాతిక సంవత్సరములక్రింద శాసనముల ద్వారా కొన్ని మార్పులు జరిగినవి. పార్లమెంటుచే నంగీకృతమైన హిందూవారసత్వపు శాసనముల వలన ఈ కేరళీయాచారము దాదాపు సమసిపోవుచున్నది. కేరళదేశమునందలి సంయుక్తకుటుంబ (Joint-Family) పద్ధతి ఇతరప్రాంతములందలి పద్ధతికంటె భిన్నమయినది. ఈ పద్ధతి ప్రకారము కుటుంబములోని వారందరు అవి భక్తులుగా కుటుంబము యొక్క అగ్రజుడగు పురుషుని (కార్నవన్ = ధర్మకర్త) అధీనములో నుండవలయును. గత నాలుగు శతాబ్దములనుండి కుటుంబములోని వ్యక్తులకు ఆస్తివిభాగమునుగోరి పంచుకొనుటకు అధికారము శాసనముల వలన లభించినది.

పై నుదహరించిన ఆచారముల కనుబంధమగు మరియొక వివాహపద్ధతియు కేరళలో ప్రచలితమైయుండెను. దానినే “సంబంధమ్" అని వ్యవహరించు చుండిరి. ఈ వివాహ సంబంధము రెండు విధములుగా నుండెను. కేరళీయ నంబూద్రి (నంబూరి) బ్రాహ్మణ కుటుంబములలో బుట్టిన అగ్రజునికి మాత్రము సవర్ణయగు బ్రాహ్మణితో వివాహము జరుగుటయు, అతనికే ఆస్తి యంతయు దక్కుటయు, కుటుంబములోని ఇతర పురుషులందరు వర్ణేతరులైన “నాయర్" స్త్రీలతో పై “సంబధ” వివాహములు చేసికొనుటయు ఆచారముగా నుండెడిది. ఆ విధముగా నంబూద్రి కుటుంబములు ప్రాయశః 'జన్మీ' (jenmi) అను భూస్వాముల తెగగా మారినవి. అట్లే నంబూద్రీలకు “నాయర్" స్త్రీలయందు కలిగిన సంతానము బ్రాహ్మణ సంస్కృతి నలవరచుకొని క్షత్రియుల స్థాయిని బొంది సాంస్కృతికముగా బ్రాహ్మణుల కంటె ఏ మాత్రము తీసిపోని పాండిత్యమును సంపాదించెను. ఇతర ప్రాంతము లందలి శూద్రులవలె గాక కేరళీయ నాయరులలో వేదశాస్త్రాది ప్రాచీన విద్యా వై దుష్యమును, వంస్కారమును ఇప్పటికిని గొప్ప స్థాయిలో గలదు. దీని ముఖ్యకారణము పై వివాహ సంబంధమే యనుట నిర్వివాదము. ఈ పద్ధతి ప్రకారము భార్య తన పుట్టింటి యాస్తి ననుభవించుచు, అక్కడనే కాపుర ముండుటయు, భర్త తన యింటిలో నుండియే భార్య యింటికి రాకపోకలు మాత్రముచే దాంపత్యజీవన మనుభవించుటయు ఆచారమైనది. నంబూద్రీ -నాయర్ సంబంధములో ఏకగృహవాసము వర్ణభేదము వలన పొసగనందున ఈ పద్ధతి ఆరంభమైనది. కాని అదియే సత్సంప్రదాయముగా, సదాచారముగా నాయర్‌లలో స్వవర్ణ వివాహము లందును స్వీకరింపబడినది. ఇప్పటికిని భార్యా భర్తలు వేర్వేరు గృహములందు నివసించుట గలదు. ఈ యాచారము యొక్క వ్యాప్తికి స్త్రీలు పూర్వము నుండియే వారసత్వపు హక్కులు గలిగియుండుట వలన దోహదము కలిగినది. నంబూద్రీలతో పై విధముగ వివాహము చేసికొను పద్దతి మూడు దశాబ్దముల క్రింద నిషేధింప బడినందున 'సంబంధ' వివాహ పద్ధతి నశించినది. ఇప్పుడు భార్యలు తమ భర్తలతో ఏకగృహవాసము చేయుటయే తరచుగ కనిపించును. ఈ కేరళీయ ప్రత్యేకాచారములు అఖిలభారతీయ వ్యాప్తిగల హిందూ లా సంస్కరణ శాసనమువలన దాదాపు నిరవశిష్టముగా అంతరించినవని చెప్పుట అతిశయోక్తి కాదు.

'నాయర్'ల వివాహ సంస్కార పద్ధతిమాత్ర మింకను ప్రత్యేకమును, విశిష్టమునై యున్నది. ఈ వివాహపద్ధతికి ఇతర ప్రాంతములలో ప్రచలితమైన యాచారములతో నెట్టి సంబంధమును లేదు. వేదశాస్త్రాదులలో విధింపబడిన ఏ మంత్రతంత్ర విధాన మవసరము లేదు. కన్యాదానము మంగళసూత్రధారణము, హోమాదులు, సప్తపది మున్నగునవి ఏవియు వీరి ఆచారమున లేవు. బంధు మిత్రాదులు సమావేశమైన సభయందు వేదికపై ఆసీను డయిన వరుని సముఖమునకు వధువు సానుచరయై హారతి తీసికొనివచ్చి నిలుచుండును. వరుడు సిద్దముగా నుంచబడిన పళ్ళెమునందలి తెల్లని వస్త్రమును (చీరను) లేక పట్టుపుట్టమును వధువున కందిచ్చును. వధువు దానిని స్వీకరించును. పిదప వధూవరులు పెద్దలకు నమస్కరించి, దేవతాదర్శన మొనర్తురు. ఐదు నిమిషములలో ఈ వివాహ మహోత్సవము ఇట్లు సంపూర్ణ మగును. భార్య భర్తను విడనాడవలసినపు డా వస్త్రమును తిరిగి యందించి విడిపోవుట ఆచారముగా నుండినదట! ఇపు డది యరుదు. కాని వివాహమున జరుగు తంతుమాత్ర మంతియే. ఈ మధ్యకాలమున పూలహారములు వేయుట, మాంగల్యధారణము చేయుట నూతనముగా కలవారి కలవాటయినది. దీనివలన వివాహపద్ధతి వైదిక సంస్కారము కాదనియు, కేవల గాంధర్వ వివాహపద్దతి యనియు, రిజిష్టర్డు వివాహముకంటె సులభమైన దనియు స్పష్ట మగు చున్నది.

వర్ణాశ్రమధర్మముల కనుబంధముగా నేర్పడిన కులవిభేదముల కరకుదనము కేరళ కొక ప్రత్యేకత నాపాదించు చున్నది. భారతదేశమం దంతటను కులతత్త్వ పద్ధతులు వ్యాప్తమై యుండినను, అవర్ణు అంటరానివా రగుటయే గాక, వారికి సవర్ణు లుపయోగించు రహదారులపై నిరాటంకముగా నడచుట కవకాశము లేదు. అట్లు నడచుట అవసరమైనచో వారు సవర్ణులకు దూరముగా నడచు చుండి “ మే మవర్ణులము సమీపించుచున్నాము. తొలగి పొండు" అని సూచించు నినాదములనో, లేక సైగలనో చేయవలసి వచ్చుచుండెనట! అస్పృశ్యత (untouchbility) యే గాక అసామీప్యత (un-approachability) యును అమలులో నుండెడిదట ! ఆ కారణము చేతనే కేరళము భారతదేశము నందలి ఒక "ఉన్మత్తాలయము" (mad-house) అని స్వామి వివేకానందునిచే విమర్శింపబడినది. తిరువాన్కూరు రాష్ట్రములో ఈ కట్టుదిట్టములన్నియు శాసనము ద్వారమున 25 సంవత్సరములక్రింద రద్దుచేయ బడినవి. దేవాలయ ప్రవేశాధికారముతో పాటు అన్ని మానవహక్కులు సమానముగా నొసగబడినవి.పిదప విప్లవాత్మకమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కరణలు జరిగినవి.

తిరువాన్కూరు మహారాజావారి అనుశాసనమున కనువగు వాతావరణము కలిగించి అస్పృశ్యతా నివారణమును ఆచరణలోనికి తెచ్చినది శ్రీ నారాయణ గురువుగారి సంఘ సంస్కారపరమైన ఆందోళన. శ్రీ గురువుగారు అస్పృశ్యజాతి యనబడు “ఇఝవా” కులమునకు చెందినవారు: ఒకే దైవము, ఒకే జాతి, ఒకే మతము అను నొక ముద్రావాక్యముతో గొప్ప మతసంచలనము గావించి ఈ అవర్ణులగు వెనుకబడిన జాతుల వారియందే గాక, సవర్ణులందును మహత్తరమైన సంచలనమును గలిగించిరి. తత్పరిణామముగా ఈ కుల, మత వివక్షతలన్నియు రానురాను అంతరించినవి.

క్రైస్తవులు : కేరళ రాష్ట్రములో క్రీ. శ. ఒకటవ శతాబ్దియందు సెయింట్ థామస్ అను మతగురువుచే క్రైస్తవమతము ప్రవేశ పెట్టబడినది. ఇతడు క్రీ. శ. 52 వ సంవత్సరమున కేరళమునకు వచ్చి పెక్కు నంబూద్రి కుటుంబములను, ఇతర హైందవ కులములను క్రైస్తవ మతములో కలిపివేసెను. కేరళ క్రైస్తవులు ఇప్పటికిని సెయింట్ థామసును అత్యంత గౌరవమర్యాదలతో చూచెదరు. ఇతడు కేరళములో ఏడు క్రైస్తవ దేవాలయములను స్థాపించెను. అనంతరం మితడు కోరమాండల్ రేవు ప్రాంతమునకు పయనమయి అచ్చటగూడ తన మతవ్యాప్తి కార్యక్రమమును కొనసాగించెను. ఈ ఉదంత మిట్లుండ కేరళమునందు 4 వ, 5 వ శతాబ్దములలో మాత్రమే క్రైస్తవ మతము ప్రవేశ పెట్టబడె నను జనశ్రుతి గూడ గలదు.

ఈనాటికిని సిరియన్ క్రైస్తవ వర్గములో పెక్కు బ్రాహ్మణ సంప్రదాయములు, ఆచార వ్యవహారములు ఆచరణ మందున్నవి. పాలయూరు అను గ్రామములో అనేక సిరియన్ క్రైస్తవ కుటుంబముల ఆవరణములలోను, బావులయందును, పూర్వము బ్రాహ్మణులచే ఉపయోగింపబడిన కంచుభూషణములును, ఇత్తడి పాత్రలును ఈనాటికిని లభింపగలవు.

సెయింట్ థామస్‌చే కేరళములో క్రైస్తవులుగా మార్చబడిన వారందరును థామస్ క్రైస్తవులమని చెప్పుకొనుచుందురు. వీరందరును కోడుంగల్లూరు, పాలయూరు, పారూరు, కోకమంగలమ్, క్విలన్, నిరానం, చాయల్, (నిలక్కల్) అను కేంద్రములకు చెందినవారే. కొడంగల్లూరునందు సెయింట్ థామస్ ప్రప్రథమముగా, 'చేరమన్ పెరుమాల్'ను, అతని కుటుంబమును, నలుబది యూదుకుటుంబములను, నాలుగువందల హైందవకుటుంబములను, క్రైస్తవ మతమున ప్రవేశపెట్టినట్లు తెలియుచున్నది. కేరళమున క్రైస్తవ మతమును వ్యాప్తిగావించిన పిదప సెయింట్ థామస్, తూర్పు సముద్ర ప్రాంత మందును అదే కార్యక్రమముపై పర్యటన మొనర్చుచు. క్రీ. శ. 72 వ సం॥లో నిహతుడయ్యెను.

పిమ్మట దక్షిణ భారతము నందలి క్రైస్తవులు పెక్కు కష్టములకు లోనైరి. తూర్పుతీర ప్రాంతమందలి క్రైస్తవులలోను పెక్కురు పెక్కు బాధలకు గురియై తిరిగి హిందూమత ప్రవిష్టు లయిరి. ఇతరులు కేరళమునకు ప్రయాణించిరి.

క్రీ. శ. 9 వ శతాబ్దిలో క్రైస్తవ వ్యాపారస్థుడగు 'బార్ యే' అను నాతని నాయకత్వమున ఒక క్రైస్తవ బృందము పర్షియానుండి బయలుదేరి క్విలన్ నగరము చేరెను. 50 సంవత్సరముల అనంతరము 'మార్ సాబార్ "మార్ ప్రాత్ ' అను సిరియన్ బిషప్పులు గూడ క్విలన్‌కు వచ్చిరి. సాబార్ అనునతడు కొడుంగల్లూరునందు కేంద్రమును స్థాపించుకొని, ఉదయం పెరూర్ అను రాజును, అతని ప్రజలను, క్రైస్తవులనుగా మార్చెను. ఇట్లెందరో హైందవ ప్రభువులు క్రైస్తవ మతావలంబకులుగా జేయబడిరి.

మధ్యయుగములనాటి కేరళ క్రైస్తవుల చరిత్రను గూర్చిన సత్యవిషయములు విశేషముగా దెలియుటలేదు. కేరళములో అనంతరకాలమున క్రైస్తవప్రచార మొనర్చిన వివిధ విజాతీయ క్రైస్తవ మిషనరీల నడుమ స్పర్థలు చెలరేగినట్లు చరిత్ర వలన విదితమగుచున్నది. వాస్కోడిగామా క్రీ. శ. 1498 సం.లో కోఝికోడ్‌నకు వచ్చి 1502 లో కేరళ క్రైస్తవులతో సంబంధమేర్పరచుకొనెను. పిమ్మట 1504 లో బాబిలోన్ మత గురువుచే ఆదేశింపబడిన నలుగురు బిషప్పులుగూడ క్రైస్తవమత ప్రచారమునకై కేరళమున కేగిరి. ఇట్లెందరో విదేశీయ క్రైస్తవ మత ప్రచారకులు (పోర్చుగీసు, పర్షియన్, బాబిలోన్, సిరియన్) కేరళమునందు స్థావరము లేర్పరచుకొని విభిన్నములైన స్వీయ మతప్రచార విధానములను చురుకుగా కొనసాగించుకొనుచు వచ్చిరి. పరస్పర విరుద్ధములైన ఈ క్రైస్తవమత ప్రచారవిధానముల మూలమున కేరళ క్రైస్తవుల యొక్క సాంస్కృతిక, సామాజిక జీవితములందు తీవ్రమయిన మార్పులు ఘటిల్లెను.

భారతదేశములో బ్రిటిషువారి రాజకీయ ప్రాభవము ఆరంభమగుటతో జాకోబైట్ క్రైస్తవ వర్గము ప్రొటెస్టెంటు శాఖగను, మార్ థామస్ సిరియన్ శాఖగను విభక్తమయ్యెను. ఇటలీనుండి వచ్చిన క్రైస్తవ మతాధికారి జాకోబైట్ వర్గములో ఉత్పన్నమయిన చీలికలను గూర్చి విచారణ జరిపెను. కాని తన్మూలమున ఐక్యము చేకూరుటకు మారుగా పృథక్త్వమే పూర్వముకంటె అధికతరమయ్యెను. 1663 లో కొచ్చిన్ రేవు డచ్చివారి స్వాధీనమయ్యెను. అపుడు డచ్చివారు మినహా తక్కిన విజాతీయు లందరును కేరళమును విడిచి వెళ్ళవలయునని డచ్చి గవర్నరు శాసించెను. పోర్చుగీసువారు విరోధ భావమును ప్రకటించియుండనిచో జాకోబైట్ చర్చి కాథొలిక్ వర్గములో లీనమైయుండెడిదని పెక్కురి అభిప్రాయము. పూర్వము విజాతీయ క్రైస్తవమత గురువులచే అధిష్ఠింపబడిన వేర్వేరు శాఖల విదేశీయ క్రైస్తవ సంస్థలయందు కొంత కాలమునుండి కేరళ జాతీయ క్రైస్తవ ప్రముఖులే నాయకత్వము వహించుచున్నారు.

కేరళ ముస్లిములు : ఇస్లాంమత స్థాపనకంటె పూర్వమే అరబ్బులు కేరళతో వ్యాపార సంబంధములు కలిగి యున్నట్లు చారిత్ర కాధారములు కలవు. కేరళయందలి మిరియాలు, ఏలకులు మున్నగు సరకులను అరబ్బులు వివిధ దేశములకు ఎగుమతి చేయుచుండెడివారు. 'అల్ ఫిల్ ఫిల్' (మిరియాల దేశము) అను పేరు కేరళకు అరబ్బుదేశములో ప్రసిద్ధమై యుండినదట. సాధారణముగా క్రీ. శ. తొమ్మిదవ శతాబ్దములో ఇస్లాం మతము కేరళలో ప్రసారితమైనదని చారిత్రకులు వ్రాయుదురు. కాని, అరబ్బుల చారిత్ర కాధారముల వలన ఇస్లాం మత్రప్రవక్త తన జీవితకాలములోనే మత ప్రసారమునకై పరిసర దేశములకు కొందరు ముఖ్యాను యాయులను పంపించె నని తెలియుచున్నది. ప్రాచీన మయిన ఒక ఐతిహ్యము ప్రకారము లంకలో నొక గుట్టపై ప్రథమ మానవుని (ఆదం) యొక్క పాదముద్ర కలదనియు, కొందరు యాత్రికులు అరబ్బుదేశము నుండి బయలుదేరి మార్గమున 'కొడుంగల్లూర'ను కరళ తీరమున నిలిచిరనియు, అక్కడ వారిని కేరళ చక్రవర్తి పెరుమాళ్ సగౌరముగా బహూకరించెననియు, వారి క్రొత్తమతముచే ప్రభావితుడై తిరుగు ప్రయాణమునందు వారితోపాటు మక్కాకు వెళ్ళి అక్కడనే జబ్బుచేసి దివం గతు డయ్యెననియు తెలియుచున్నది. అతడు కేరళ చక్రవర్తులలో తుదివాడు. మలబారులోనున్న 'ధర్మతం' అను నగరము అరక్కళ్ సంస్థానాధిపతుల రాజధాని. క్రీ. శ. ఏడవ శతాబ్దములోనే పైన పేర్కొనబడిన తుదిచక్రవర్తి సోదరి శ్రీ దేవియు, నామెపుత్రుడు మహాబలియు ఇస్లాం మతమును స్వీకరించిరనియు, ఈ అరక్కళ్ వంశమువారి రికార్డులవలన తెలియుచున్నది. ఈ రికార్డులు అరబ్బు చారిత్రకుల వ్రాతలను బలపరచుచున్నందున క్రీ. శ. 7 వ శతాబ్దముననే ఇస్లాం మతముయొక్క ప్రసార మారంభ మైనదని నిర్ణయించుటకు అవకాశము కలదు. షేఖు జయినొద్దీన్ (అరబ్బు చారిత్రకుడు) వ్రాసిన కేరళ చరిత్ర ప్రకారము 'మలిక్ ఇబ్నె దీనార్' మున్నగు 25 మంది మతగురువులు ‘కొడుంగల్లూరు' రేవునకు క్రీ. శ. 642 - 43 మధ్యకాలమున వచ్చి చేరిరనియు, అక్కడనే మొట్టమొదట మసీదును కట్టిరనియు స్థానిక పాలకుల మత సహిష్ణుత వలనను, ఔదార్యమువలనను ఉత్తరమునందును దక్షిణమునందును 11 కేంద్రములను స్థాపించి రనియు తెలియుచున్నది. ముస్లిం అరబ్బుల రాకకు పూర్వమే కొచ్చిన్, మలబారు ప్రాంతములలో యూదులు తమ కేంద్రముల నేర్చరచికొని వ్యాపారము సాగించుచుండిరి. వారికిని ముస్లిములకును సంఘర్షణ జరిగెను. అందులో స్థానికుల సహాయమువలన ముస్లిములు విజయమును గాంచిరి. కొడుంగల్లూరు రేవు యొక్క ప్రాముఖ్యము క్రీ. శ. 10వ శతాబ్దమువరకు పూర్తిగా తగ్గినది. క్యాలికటు రేవునకు ప్రాధాన్యము లభించినది. ముస్లిములు అటువైపునకు వెళ్ళి క్యాలికటురాజులగు 'సాముద్రుల' (Zamorins) సహాయమును సంపాదించి, వ్యాపార కేంద్రములను స్థాపించి, అందుతోపాటు మత ప్రచారమును విరివిగా చేయగలిగిరి. ముస్లిముల సహాయము వలన క్యాలికటు రాజులు తమ సమానులగు కొచ్చిన్ వల్లువనాడు రాజులపై తమ ఔన్నత్యమును స్థాపించుకొనిరి. వీరి సహాయమువలన చేర చక్రవర్తి పెరుమాళ్ళ గౌరవమును సంపాదించుట కాశించినను యూరపియనుల రాకవలన ఆ సంకల్పము నెరవేరలేదు.

క్రీ. శ. 1498 తో వాస్కో డిగామా (Vasco de-Gama) అను నతడు బుడతకీచు దేశము(Portugal) నుండి క్యాలికట్ రేవున ప్రవేశించెను. సాముద్రి (Zamorin) రాజు మొదట బుడతకీచులు ముస్లిములపై ఆధిపత్యము సంపాదించుట కంగీకరింపలేదు. బుడతకీచులు సాముద్రికి ప్రతిస్పర్థులైన ఇతర రాజులను ప్రోత్సహించి వారి అంగీకారముతో 33 పడవలు గల నౌకాబలమును క్యాలికట్ రేవునకు చేర్చి అక్కడ సరకులతో నిండియున్న అరబ్బుల నావలను ముంచివేసిరి. దాదాపు వంద సంవత్సరములు బుడతకీచులకును, మారుచుండు స్థానిక బలములకును, పోరాటము జరుగుచుండెను. కొచ్చిన్ రాజులు కొచ్చిన్ రేవు యొక్క అభివృద్ధిని కోరి బుడతకీచులకు సహాయ మొసగిరి. వారికి వీప్ (Weyp) అను ప్రదేశమున రేవును కట్టుటకై తా వొసంగిరి. మోప్లా (ముస్లిముల) దళ నాయకులగు 'కుట్టి అలీ, కుంజ అలీ, మరక్కారు' లు ఈ వంద సంవత్సరముల పోరాటములో బుడతకీచుల నెదిర్చిరి. కాని తుదకు వారి నావిక వ్యాపారము దెబ్బతిన్నందున పలువురు, లంకకును, తమిళనాడునకును కేరళము యొక్క అభ్యంతరపు ప్రదేశములకును చేరుకొనిరి. వ్యాపారవృత్తులు దిగిపోవుటచే ముస్లిములు స్థానిక భూస్వాములక్రింద వ్యవసాయవృత్తి నవలంబించిరి. అనేకులు భూస్వాములుగా కూడా మారి పూర్తిగా స్థానికులై పోయిరి. క్రీ. శ. 18 వ శతాబ్దమున మైసూరులో హైదరలీ తన రాజ్యమును స్థాపించెను. అతడు మలబారు సముద్రతీరము విదేశీయుల ఆక్రమణములో నుండుట తనకు ముప్పని 'మయ్యాజీ' అను రేవును సంపాదింప దలచెను. మలబారు ముస్లిములు ఈ అవకాశమును గ్రహించి, ఆరక్కళ్ (ముస్లిం) సంస్థానాధీశుని నాయకత్వమున ఒక ప్రతినిధివర్గమును పంపి హైదరలిని ఆహ్వానించిరి. సాముద్రి (Zamorin) అపుడే పాలఘాట్ (Palghat) రాజుపై దండెత్తెను. పాలఘాట్ రాజా హైదరలీ సహాయము నర్థింప అతని సేనలు సాముద్రి సేనల నోడించి ఆక్రమించుకొనెను.