Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కేరళదేశము (భూగోళము)

వికీసోర్స్ నుండి

కేరళదేశము (భూగోళము) :

భౌగోళిక పరిస్థితులు : కేరళ రాష్ట్రము భారతరాజ్యాంతర్గతము లగు పదునైదు రాష్ట్రములలోకెల్ల చిన్నది. రాష్ట్ర పునర్నిర్మాణచట్టము ననుసరించి ఈ రాష్ట్రము 1 - 11 - 1956 వ తేదీన నిర్మాణమైనది. పూర్వపు తిరువాన్కూరు. కొచ్చిన్ రాష్ట్రముల భూభాగములును (కొన్ని మినహాయింపులతో), మద్రాసు రాష్ట్రాంతర్గతమగు మలబారు జిల్లాయు, దక్షిణ కెనరా జిల్లాలోని కాసరగోడు తాలూకాయు ఈకేరళరాష్ట్రమునచేరియున్నది. పూర్వపు తిరువాన్కూరు-కొచ్చిన్ రాష్ట్రమునుండి నాగర్‌కోయిల్, కన్యాకుమారి మున్నగు నాలుగు తాలూకాలును, షెన్ కొట్టాలోని కొంత భాగమును మద్రాసు రాష్ట్రములో చేర్పబడినవి. ప్రస్తుతము ఈ రాష్ట్రముయొక్క దక్షిణపు సరిహద్దు కన్యాకుమారికి ఉత్తరమున 35 మైళ్ళ దూరమున నున్న 'పాఠశాల' అను గ్రామము. ఉత్తరమునను, ఈశాన్యమునను మైసూరు రాష్ట్రపు సరిహద్దులను, తూర్పునను, దక్షిణమునను మద్రాసు రాష్ట్రపుసరిహద్దులను గలిగిన ఈ రాష్ట్రము అరేబియా సముద్రతీరమున 360 మైళ్ళ వరకు ఉత్తర దక్షిణముగా ప్రాకుచున్నది. కేరళరాష్ట్ర వైశాల్యము ఉత్తర దక్షిణాగ్ర భాగమున 20 మైళ్ళ నుండి మధ్యభాగమున 75 మైళ్ల వరకును వ్యాపించి యున్నది. కేరళరాష్ట్రము 80 - 18' మరియు 12°-48' ఉత్తర అక్షాంశ మధ్యభాగమునను, 74°-52' మరియు 770-22' తూర్పు రేఖాంశముల మధ్యభాగమునను ఉన్నది.

చిత్రము - 3

కేరళముయొక్క విస్తీర్ణము 14,992 చ. మైళ్ళు. స్విట్జర్లాండు, ఆల్బేనియా, బెల్జియం, మున్నగు ఐరోపా రాజ్యములకంటె విస్తీర్ణమందును, జనసంఖ్య యందును కేరళ రాష్ట్రము పెద్దదని చెప్పవలసియున్నది.

కొండలు : కేరళమును పరిసర ప్రాంతముల నుండి పశ్చిమ కనుమలు విడదీయుట వలన ఆ రాష్ట్రమున కొక ప్రత్యేకత కలదు. పశ్చిమ కనుమలచే ఈ రాష్ట్రము యొక్క భౌగోళిక పరిస్థితులు ప్రభావితములై యున్నవి. పశ్చిమమున సముద్రమును, తూర్పున పశ్చిమ కనుమలును గలిగిన సన్నని భూభాగమే కేరళ రాష్ట్రము. ఈ పశ్చిమ కనుమల ఎత్తు 3000 అడుగుల నుండి 6000 అడుగుల వరకును పెరిగి, కొన్ని స్థలములందు 8000 అడుగుల వరకును అందుకొనును. కొట్టాయం జిల్లాలోని 'ఆనెముది ' శిఖరము 8,837 అడుగుల ఎత్తుగలిగి, హిమాలయము నకు దక్షిణమునగల పర్వత పంక్తు లన్నిటికంటె ఎత్తయినదిగా పరిగణింపబడుచున్నది.

నదులు : అధిక వర్ష పరిమాణమువల్లను, మిట్టపల్లములుగా నున్న భూమి యగుట చేతను, అనేక నదులు, వాగులు ఈ రాష్ట్రమున ప్రవహించుచున్నవి. అవన్నియు అరేబియా సముద్రమున కలియుచున్నవి. పశ్చిమ కనుమలు ఏ ప్రదేశమునను సముద్రమునకు 75 మైళ్ళ కంటె ఎక్కువ దూరమున లేనందున ఈనదులు చిన్నవిగా నున్నవి. ఉత్తర దక్షిణముగా చూచినచో (1) వరల పట్టణము (70 మైళ్లు), (2) బారియాన్ (98 మైళ్ళు), (8) కడలుంది (75 మైళ్ళు), (4) భారతపుఝా (166 మైళ్ళు), (5) చాలకుడి (70 మైళ్ళు), (6) పెరియార్ (142 మైళ్ళు), (7) పంపా (90 మైళ్ళు), (8) అచ్చన్ కోవిల్ (70 మైళ్ళు), (9) కల్లడ (70 మైళ్ళు) అను ముఖ్యమైన నదులు ఉన్నత ప్రదేశమునుండి ప్రవహించుచు 500 అడుగులకంటె ఎక్కువ ఎత్తునుండి కొన్నిచోట్ల క్రిందికి జారుచుండును. అందుచే అచ్చట విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదనమునకును, జలసేచనమునకును ఈ నదులు మిగుల అనువగు అవకాశములు కల్గించుచున్నవి.

అడవులు : కేరళ రాష్ట్రములో అటవీసంపద ప్రధానమైనది. మొత్తము భూభాగములో 25.8 ప్రతిశతి ప్రాంతము అడవులచే ఆక్రమింపబడి యున్నది. ఈ విషయములో అస్సాము తరువాత కేరళము రెండవదిగా పరిగణింపబడు చున్నది. ఈ వనసంపత్తివలన రాష్ట్రమునకు ప్రతి యెకరమునకు పదునొకండు రూపాయల ఆదాయము లభించును. అఖిలభారతమునందు సగటున ప్రతి యెకరమునకు నాలుగు రూపాయలు మాత్రమే అడవుల నుండి ఆదాయము లభ్యమగుచున్నది.

కేరళీయ వనములు వివిధములయిన మృగజాతులకు ఆలవాలములై యున్నవి. 'పెరియారు' తటాక సమీపమున గల రిజర్వు వనములు (Reserve forests) వన్యమృగముల కాశ్రయ మొసగుచున్నవి. ఏనుగులు, ఆబోతులు, చిరుతపులులు, సాంబర్లు, అడవి పందులు మున్నగు అనేక జాతుల మృగములు స్వేచ్ఛగా ఆ వనములందు సంచరించు చుండును. దాదాపు 600 కంటె ఎక్కువ వృక్ష జాతులు ఈ వనములందు గలవు. టేకు, నల్ల మద్ది, సీసము మున్నగు కొన్ని తరగతులకు ఈ వనములు కేంద్రములు. కలప వ్యాపారమునకు కేరళము సుప్రసిద్ధము. కల్లాయి (Kallai) యందుగల కలప అడితి (Depot) ప్రపంచములో కెల్ల రెండవదని ప్రశస్తి గాంచినది. మరి చలతా పరివేష్టితములైన అత్యున్నత వృక్షరాజములు మనోహర దృశ్యములను చేకూర్చుచున్నవి. ఏనుగు దంతములును కేరళ వన్యసంపత్తులో చేరినవే.

ఖనిజములు : ఖనిజ సంపత్తులో కేరళరాష్ట్రము ఏ ఇతర రాష్ట్రమునకును వెనుదీయదు. అణుయుగారంభము పిదప కేరళీయ ఖనిజములు అత్యంత ప్రాముఖ్యము వహించినవి. అణుశక్తికై ఉపయోగింపబడు 'థోరియమ్' (Thorium) అను పదార్థముగల 'మోనోజైట్' (Monozite) ఈ రాష్ట్రములో విరివిగా లభించును. కొల్లము (క్విలన్) జిల్లా సముద్రతీరము మోనోజైట్ (Monozite) ఎల్ మెనైట్ (Elmenite), రూటైల్ (Rutile), జిర్ కోసీ (Zircosi), సిలమెనైట్ (Silamenite) అను ఘన ఖనిజపదార్థములకు పుట్టినిల్లు. పోర్సిలెయిన్ తయారు చేయుటకు అవసరమయిన చీనా మన్ను ఈ రాష్ట్రమందు పెక్కుస్థలములలో లభించును. ఇటుకలు చేయుటకు ఉపకరించు రెండవరకము మన్ను అచట విరివిగా కలదు. షార్క్ లివర్ ఆయిల్, టర్టైల్ ఆయిల్ మున్నగు నూనెలును, నిమ్మగడ్డి (Lemon grass) మున్నగు తృణపదార్థములును, ఓషధులకును, సుగంధ ద్రవ్యములకును ఉపకరించు ముడిపదార్థములును కేరళములో లభించును.

సిమెంటు తయారు చేయుటకు అవసరమగు ముడిద్రవ్యములుగూడ ఇందు లభ్యమగును. కేరళములో తెల్ల సిమెంటు ఫ్యాక్టరీ యొకటి కలదు. 360 మైళ్ళ పొడవు గల సముద్రతీరము కలిగి, సమీపమందలి భూమిని ఆక్రమించుకొను సాగరజల తటాకములును, మంచినీటి చెరువులును విరివిగానున్న కేరళ రాష్ట్రములో జల సంబంధమగు సంపత్తుకు కొదువలేదు.

జనసంఖ్య :

1. కేరళ రాష్ట్రపు మొత్తము జనసంఖ్య (1951) 1,35,51,529
పురుషుల సంఖ్య 66,82,861
స్త్రీల సంఖ్య 68,68,668
2. గ్రామీణులు 1,17,66,592
నాగరులు. 17,84,937
3. అక్షరాస్యులు 54,73,765
నిరక్షరాస్యులు 80,77,764
1951 లెక్కలనుబట్టి జనసాంద్రత చ. మై. 1కి 904 మంది
1957 లెక్కలనుబట్టి జనసాంద్రత చ. మై. 1కి 1000 మంది

విభాగములు : కేరళ రాష్ట్రమునకు రాజధానీ నగరము తిరువనంతపురము. ఇందు 9 జిల్లాలును, 55 తాలూకాలును, 4615 గ్రామములును, 88 నగరములును, 22 మునిసిపాలిటీలును, 897 పంచాయితీలును కలవు.

జిల్లాలు విస్తీర్ణము జనసంఖ్య
1. తిరువనంతపురము 846.3 చ. మై. 13,27,812
2. క్విలన్ 1981.9 చ. మై. 14,84,783
3. అల్లెప్పీ 705.3 చ. మై. 15,14,105
4. కొట్టాయం 1998.6 చ. మై. 13,26,489
5. ఎర్నాకులం 1558.5 చ. మై. 15,30,143
6. త్రిచూరు 1147.8 చ. మై. 13,62,772
7. పాల్ఘాటు 1971.7 చ. మై. 15,65,167
8. కోఝికోడ్ 25,55.0 చ. మై. 20,65,177
9. కన్ననూరు 22,265 చ. మై. 13,75,081

1958 సంవత్సర లెక్కలను బట్టి కేరళ జనసంఖ్య 1,52,30,000

ప్రధాన నగరములు :

నగరము విస్తీర్ణము జనసంఖ్య
1. తిరువనంతపురము 17.00 చ.మై. 1,86,931
2. క్విలన్ 6.15 చ.మై. 66,126
3. అలెప్పీ 12.50 చ.మై 1,16,278
4. కొట్టాయం 6.25 చ.మై 44,204
5. చెంగన్‌చెర్రీ 5.50 చ.మై. 36,289
6. మట్టన్‌చెర్రీ 2.69 చ.మై. 71,904
7. ఎర్నాకులం 3.37 చ.మై. 62,283
8. త్రిచూరు 4.78 చ.మై. 69,515
9. పాల్ఘాట్ 10.27 చ.మై. 69,504
10. కోఝికోడ్ 11.8 చ.మై. 1,58,724
11. కన్ననూరు 4.88 చ.మై. 42,431
12 తెల్లిచెర్రీ 3.00 చ.మై. 40.040
13. కొచ్చిన్‌పోర్టు 1.01 చ.మై 29,881

వాతావరణము : పల్లపు ప్రాంతములందు వాతావరణము వేడిగాను, నిమ్నోన్నత ప్రదేశములందు ఆరోగ్య కరముగాను, చల్లగాను, ఉన్నతగిరి ప్రదేశములందు శీతలముగాను ఉండును. F90° కంటె ఉష్ణప్రమాణ మెక్కువగా నుండక పోయినను, ఉక్కగానుండి, పల్లపు ప్రాంతములలో అధికముగా చెమటపట్టు చుండును. సాగర, నదీ జలములు ఎల్లెడల ప్రవహించు చుండుటచేతను, కొబ్బరి, రబ్బరు, పోక, జీడిపప్పు, వరి పొలములు, టోపియోకా అను కర్రపెండలము పండు భూములు మున్నగునవి ఎల్లప్పుడు పచ్చగా నుండుటచేతను, ప్రకృతి సౌందర్యాతిశయ సంపన్నమై అలరారుచు, 'దక్షిణ కాశ్మీరము' అని ప్రఖ్యాతి వహించినది కేరళము.

'వర్షపాతము : మే నెల తుదిలోనో, లేక జూన్ నెల మొదటనో గర్జారావ సహితముగా దక్షిణ పశ్చిమ వర్షాగమన మారంభించి సెప్టెంబరు వరకు వానలు కురియు చుండును. తిరిగి అక్టోబరులో ఉత్తర పూర్వ వర్షాకాల మారంభించి, డిశెంబరునెల తుదివరకు సాగి పిదప కాలము విప్పును. జనవరి, ఫిబ్రవరి మాసములు చల్లగా విప్పారి యుండును. మార్చి, ఏప్రిల్, మేనెలలు వేసవికాలము కేరళము యొక్క అధికాంశ భాగమున వర్షములు అధికముగా కురియును. కొట్టాయం జిల్లాయొక్క ఉన్నత పర్వత పక్తులలో 200 అంగుళములవరకు వర్షములు కురియును. కేరళముయొక్క వివిధ ప్రాంతములలో వర్షపరిమాణము మారుచుండును. తిరువనంతపురములో సగటున సంవత్సరమునకు 64 అంగుళములును, క్యాలికట్, కోఝికోడు ప్రాంతములలో 118 అంగుళములును వర్ష పరిమాణ ముండును. వర్షాభావమువలన కలుగు నష్టము కంటె, అతివృష్టివలన కలుగు నష్టమే అధికము. సంపూర్ణమైన అనావృష్టిని కేరళ రాష్ట్రము ఎరుగదనయే చెప్ప వచ్చును.

నేల : భూమియొక్క వైవిధ్యమునుబట్టి కేరళమును మూడు తరగతులుగా విభజింపవచ్చును.

(1) సముద్రమునకు అతి సమీపముగా నున్న పల్లపు భాగము.

(2) మధ్యభాగమున గల నిమ్మోన్నత ప్రదేశము.

(3) రెండవ భాగమునకు తూర్పున కనుమలను ఆనుకొనియున్న అడవులుగల అత్యున్నత భూభాగము .

సముద్రతీరమునకు సమీపముననున్న పల్లపుప్రదేశము లందు కొబ్బరితోటలు, వరిపంట విస్తారముగా పండును. మధ్యభాగమున చిన్న గుట్టలు, లోయలు వ్యాపించి యున్నను, ఈ ప్రాంతమందే సేద్యమునకు అనువగుభూమి ఎక్కువగా కలదు. ఉన్నత ప్రదేశములు గల పర్వత భూభాగములందు విశేషముగా తేయాకు, కాఫీ, ఏలకుల తోటలు గలవు. అంతకంటె నిమ్న భాగములందు మిరియములు, అల్లము, రబ్బరు, పసుపు మున్నగు పదార్థములు పండును. అడవులు వన్య వృక్ష మృగజాతులకై ప్రసిద్ధి గాంచినవి.

భూమి పంపిణి : కేరళరాష్ట్రములో భూమి ఈ క్రింది విధముగా పంపిణీ చేయబడియున్నది:

అటవీ ప్రాంతము 24,32,644 యెకరములు
సాగుచేయబడిన మొత్తము ప్రాంతము 54,65,424 యెకరములు
పంటలుపండు నికరపు వైశాల్యము 44,76,877 యెకరములు
ఆహార ధాన్యములు పండు విస్తీర్ణము 38,02,247 యెకరములు
ఆహారేతర పంటలు పండు విస్తీర్ణము 16,63,177 యెకరములు
మాగాణి విస్తీర్ణము(1956) 8,11,063 యెకరములు

వ్యవసాయము : కేరళ రాష్ట్రీయులలో నూటికి 87 మంది వ్యవసాయముపై ఆధారపడియున్నారు. భారతదేశమున సగటున నూటికి 83 మంది ప్రజలు వ్యవసాయమే జీవనాధారముగా కలిగియున్నారు. ఈ పరిస్థితి వలన వ్యవసాయానుగుణ్యమైన భూమిపై ఒత్తిడి మరింత హెచ్చుగానున్నది. వ్యవసాయము క్రిందనున్న భూమిని లెక్కించినచో, తలకొక 30 సెంటుల భూమి కలదని తేలుచున్నది. అందువలన నూటికి 55 వంతుల వ్యవసాయ కమతముల వైశాల్యము ఒక యెకరముకంటె తక్కువగా నున్నది. వ్యవసాయవృత్తి గలవారి సంఖ్య 53.6% అనియు, వ్యవసాయేతరుల సంఖ్య 46.4% అనియు లెక్కలవలన తేలుచున్నది.

నీటి వనరులు: కేరళ రాష్ట్రములో ఈ క్రింద ఉదహరించిన నీటివనరులచే వివిధములైన పంటలు పండుచున్నవి:

ప్రభుత్వపు కాలువలు 3,27,671 యెకరములు
ప్రయివేటు కాలువలు 68,113 యెకరములు
చెరువులు 77,400 యెకరములు
బావులు 28,499 యెకరములు
ఇతరములు 3,09,380 యెకరములు
మొత్తము 8,11,063 యకరములు

ప్రాజెక్టులు : ఈ దిగువ నుదహరించిన స్టేట్ మెంటు వలన ఆయా ప్రాజెక్టుల నిర్మాణమునకు ఎంతధనము వ్యయమయినదియు, వాటిక్రింద ఎంతభూమి లాభము పొందినదియు తెలియగలదు :

ప్రాజెక్టు పేరు మొత్తము వ్యయము (లక్షలలో) లాభము పొందుభూమి యెకరములు
1. నెయ్యార్ (మొదటితరము) 146.00 15,000
2. కుట్టినాడు (తోటపల్లి) వరద కాలువ 57.65 121,000
3. చాలకుడి (మొదటితరము) 128.25 28,400
4. పీచీ " 235.00 46,000
5. వాఝూనీ " 107.57 12,800
6. మల్లంపుఝూ 528.00 47,600
7. పాలయూర్ 116.66 8,000
8. మంగలమ్ 97.51 6,000

దాదాపు 9 కోట్ల రూప్యముల వ్యయముతో అంచనా వేయబడిన ఎనిమిది నూతన జలవిద్యుత్ప్రణాళికలలో 'తన్నీరు ముక్కం', 'మిన్‌కరా' అను నిర్మాణములు పూర్తియైనవి. విద్యుచ్ఛక్తి ప్రణాళికలలో ముఖ్యమైన 'పల్ల వాసల్' ప్రాజెక్టు క్రింద 37,500 కిలోవాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పాదిత మగుచున్నది. రెండవదియైన 'సెంగులమ్' ప్రాజెక్టు క్రింద 48,000 కిలో వాట్ల శక్తి ఉత్పాదింప బడుచున్నది. మూడవదియైన 'పారింగల్ కుత్తు' వలన 24,000 కిలో వాట్ల విద్యుచ్ఛక్తి తయారగుచున్నది.

పంటలు (1955 - 56) :

1. వరి

2. పప్పుధాన్యములు

3. టోపియోకా (కర్రపెండలము)

4. చెఱకు

5. మిరియాలు

6. అల్లము

7. పసుపు

8. నువ్వులు

9. నిమ్మగడ్డి (Lemongrass)

10. అరటి

11. కొబ్బరి

12. పోకలు

13. జీడిపప్పు

14. వేరుశెనగ

15. ప్రత్తి

16. రబ్బరు

17. తేయాకు

18. కాఫీ

19. ఏలకులు

20. వివిధములు

పరిశ్రమలు : కేరళములో ఆధునికావసరములగు పెక్కు భారీపరిశ్రమలకు సంబంధించిన రిజిస్టర్డు ఫ్యాక్టరీలు 62 కలవు. ఓడల నిర్మాణ పరిశ్రమ, కొబ్బరిపీచు పరిశ్రమ, రబ్బరు పరిశ్రమ, కలప పరిశ్రమ, షార్క్ లివర్ ఆయిల్ పరిశ్రమ, తేయాకు పరిశ్రమ, ఇటుకల పరిశ్రమ, జీడిపప్పు పరిశ్రమ మున్నగునవి ప్రత్యేకముగా పేర్కొన దగిన పరిశ్రమలు.

మాతృభాషలు :

మాతృభాషలు జనసంఖ్య
1. మలయాళము 1,26,65,626
2. తమిళము 5,92,966
3. కొంకణము 67,688
4. కన్నడము 47,468
5. తెలుగు 43,576
6. మరాటీ 20,203
7. గుజరాతీ 6,036
8. హిందీ 5,920
9. ఇతరులు 1,02,044

మతములు : మతముల ననుసరించి కేరళముయొక్క జనాభా ఈ క్రింది విధముగ విభజింపబడినది :

మతము జనాభా
అన్నిమతములవారు 1,35,51,529
హిందువులు 83,60,596
క్రైస్తవులు 29,35,385
ముస్లిములు 22,02,774
సిక్కులు 308
ఇతరులు 52,466

కేరళ రాష్ట్రపు జనసంఖ్యలో ఈ క్రిందివారు చేరియున్నారు:

షెడ్యూల్డ్ కులముల వారు 12,51,730
షెడ్యూల్డ్ జాతులవారు 74,056

విద్య :

పాఠశాలలు

ప్రైమరీ పాఠశాలలు 8666
సెకండరీ పాఠశాలలు 762
బేసిక్ పాఠశాలలు 104
ట్రెయినింగ్ పాఠశాలలు 443
టెక్నికల్ పాఠశాలలు 50
ఫిషరీ పాఠశాలలు 33
మొత్తము 10,058

కళాశాలలు

ఆర్ట్స్, సైన్సు కళాశాలలు 44
ట్రెయినింగ్ కళాశాలలు 13
సంస్కృత కళాశాలలు 3
అరబ్బీ కళాశాలలు 3
శరీరవ్యాయామ కళాశాలలు 2
వైద్య కళాశాలలు 2
ఇంజనీరింగు కళాశాలలు 3
పశువైద్య కళాశాలలు 1
వ్యవసాయ కళాశాలలు 1
మొత్తము 72