Jump to content

షోడశకుమారచరిత్రము/పీఠిక

వికీసోర్స్ నుండి


షోడశకుమారచరిత్రము

పీఠిక

ఇది యెనిమిదియాశ్వాసముల పద్యకావ్యము. కాని, మాకు దొరకినప్రతులలోఁ దృతీయ చతుర్థాశ్వాసములు లేవు. ప్రథమాశ్వాసమునఁ గృత్యాది లేదు. అచ్చటచ్చట గ్రంథపాతములు గలవు. మొదటి రెండాశ్వాసములు గలప్రతి యొకదానిని చెన్నపురి బ్ర॥ శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు పంపిరి. ఈ తాళపత్రప్రతిలో నీరెండాశ్వాసములును ౧౭౪వ పత్రము మొదలు ౧౯౯వ పత్రమువఱకుమాత్రమే యున్నవి. మొదటి ౧౭౩ పుటలలో నేమివ్రాయఁబడియుండెనో యాభాగ మిందు లేదు. రెండవ ప్రతి, ౫-౬-౭-౮ ఆశ్వాసములు మాత్రమే కలిగి ౨౦౫-వ పత్రము మొదలుకొని ౨౪౮ పత్రములు సంఖ్య వేయఁబడి యున్నది. దీనిని, కాకినాడ, మ॥ దుగ్గిరాల వేంకటసూర్యప్రకాశరావుపంతులు బి.ఎ., గా రిచ్చిరి. మొదటి ౧౦౪ పుటలలో పోడశకుమారచరిత్రము ౧-౨-౩-౪ ఆశ్వాసములు మొదలైనవి వ్రాయఁబడి యుండవలెను.

శ్రీమాన్ బహుజనపల్లి సీతారామాచార్యులవారు శబ్దరత్నాకరములో నిందుండి కొన్నియుదాహరణముల నిచ్చి యున్నారు. వారిచ్చిన ప్రయోగము లీముద్రితప్రతిలో నున్న వియే. వారికిని బూర్ణగ్రంథము దొరకెనో లేదో యని సందేహము కలుగుచున్నది.

కవి, వెన్నెలకంటి అన్నయ్య. సీతారామాచార్యులవారు, ఎల్లన్న యని తలఁచినారు. ఆధార మూహ్యము. ఆంధ్ర విష్ణుపురాణకర్త యగు వెన్నెలకంటి సూరయ్య గోత్రమును నీ యన్నయ్య గోత్రమును హరితసగోత్రమే. అన్నయ్య సూరామాత్యుని పుత్రుఁడు, సూరామాత్యుని తండ్రి యన్నయ్య యనియు, కవి యన్నయ్య తన కృతిని దండ్రియగు సూరామాత్యునకే యంకితము చేసె ననియు—

ద్వితీయాశ్వాసాదిని—సుకవిస్తోమ నుతౌన్నత్య యన్న సూరామాత్యా.

పంచమాశ్వాసాదిని— సూచితమాహాత్మ్య యన్న సూరామాత్యా.

షష్ఠాశ్వాసాదిని—రసిక, వ్యాపారవిహారమంత్రి యన్నయసూరా.

సప్తమాశ్వాసాదిని—శోభితషాడ్గుణ్య యన్న సూరవరేణ్యా.

అష్టమాశ్వాసాదిని— శోభితపాండిత్య యన్న సూరామాత్యా.

అను మాటలంబట్టి తెలియవచ్చుచున్నది. విష్ణుపురాణ కృతికర్త సూరామాత్యుం డీయన్నయతండ్రి యనుకొందమన్న నాతనితండ్రి యమరనామాత్యుఁ డని కలదు. కవులచరిత్రములో నీయన్నయ్య పేరు నీపోడశకుమారచరిత్రమును లేవు.

జక్కనకవి విక్రమార్కచరిత్రమును సిద్ధనమంత్రికిం గృతి యిచ్చెను. సిద్ధనమంత్రి పెద్దతండ్రి వెన్నెలకంటి సూర్యుఁ(భాస్కరుఁ) డని గ్రంథమునం దెలుపఁబడినది. (౧-౬) ఈ సూరనమంత్రి రెడ్డి వేమనరపాలునిచే నగ్రహారముఁ గొనియెనఁట. మఱియు ననపోతారెడ్డికి వెన్నెలకంటివంశజుఁ డగు మఱియొకకవి కృతుల నిచ్చె నని విష్ణుపురాణములోఁ గలదు. వీరికిని అన్నయ్యకు నెట్టిసంబంధమైన నున్నదో లేదో తెలిసికొనుటకుఁగాని మఱి యేవిషయమును దెలిసికొనుటకుఁగాని కృత్యాది పద్యములు దొరకలేదు.

కవికాలము: ఇందుఁ గవి తనకృతిభర్త యగునన్నయ్యను, కృష్ణకందార, భోజ, జగదేకమల్ల, సోమేశ్వరులతో (7-188) బోల్చియున్నవాఁడు. భోజుఁడు ధారానగరాధిపతి. జగదేకమల్లుఁడు పశ్చిమచాళుక్యచక్రవర్తి. వీరు పదునొకండవ శతాబ్దమువారు. సోమేశ్వరుఁడు భూలోకబిరుదాంకితుఁ డగు పశ్చిమచాళుక్యచక్రవర్తి (A. D. 1126-88). ఇతఁడు సంస్కృతమున నభిలషితార్థచింతామణి యను మానసోల్లాసమును రచించెను. ఇతనికి సర్వజ్ఞభూపుఁ డనుబిరుదు కలదు. కృష్ణకందారుఁడు యాదవరాజు. జైత్రపాలుని తనయుఁడు. పదుమూఁడవశతాబ్దమున సూక్తిముక్తావళికర్త యగు జహ్లణకవిని వేదాంతకల్పతరుకర్త యగు నమలానందుని బోషించెను. కాన నీగ్రంథము పదుమూఁడవ శతాబ్దానంతరము రచియింపఁబడియుండును.

గ్రంథాకృతి:-ఈకవి దశకుమారచరిత్రమును మనస్సున నుంచుకొని యీ పోడశకుమారచరిత్రమును రచియించెను. కొన్నికథలను కథాసరిత్సాగరాదులనుండి సంగ్రహించి తన కవితాచమత్కృతిచే రసపుష్టిని వర్ణనాధిక్యమును గలిగించి జనమేజయుని రెండవకుమారుని గథానాయకునిగఁ జేసి, అతనికిఁ దోడుగ నతని మంత్రితనయులను, బురోహితపుత్రులను, దండనాథసుతులను, బదేనుగురను గూర్చి కథ సాగించినాఁడు. కావున నందందుఁ గల పోడశరాజకుమారచరిత్ర మనుపేరు చెల్లదు. ఒక్కతావున పోడశనందనచరిత్ర మని యున్నది. దానికి బాధ లేదు.

కవిత్వము నిర్దుష్టమైనది. ఉభయభాషాప్రౌఢి మెఱయుచున్నది. శైలి మంచన కేయూరబాహుచరిత్రమును, జక్కన విక్రమార్కచరిత్రమును, కేతన దశకుమారచరిత్రమును బోలుచుండును. పద్యములు హృద్యములై ధారాశుద్ధి గలవిగా నున్నవి. ఎవ్వరియొద్ద నైన సంపూర్ణప్రతి యున్నచో దయతోఁ బంపి యీ పోడశకుమారచరిత్రమును బూర్ణముగాఁ బ్రకటించుభాగ్యమును వా రాంధ్రసాహిత్యపరిషత్తునకుఁ గల్గింతురుగాక.