షోడశకుమారచరిత్రము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

షోడశకుమారచరిత్రము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీమద్విరించితరుణీ
కోమలవీణానినాదకూలంకషవా
గ్భూమాభిరామ సుకవి
స్తోమనుతౌన్నత్య యస్నసూరీమాత్యా.

1


వ.

అక్కమలాకరుండు, బుద్ధిసాహాయ్యుండును వివేకనిధియును గాంతిమంతుందును యశఃకేతుండును గరుణాకరుండును బ్రభాకరుండును జిత్రకరుండును నీతిమంతుండును ననుమంత్రితనూజు లెనమండ్రును, భీమభటుండును దీర్ఘబాహుండును దృఢముష్టియు విక్రమకేసరియు నను దండనాయకతవయులు నలువురును మతిమంతుండును గళానిధియు వసంతకుండు నను పురోహితపుత్రకులు మువ్వురును, బ్రాణమిత్రులై నిరంతరంబును బరివేష్టించి కొలువ నొక్కనాఁడు.

2


మ.

చెలులుం దానును వేడ్కమీఱ విలసచ్ఛృంగారుఁడై తత్పురీ
లలితోద్యానములందుఁ బుష్పితలతాలాస్యంబు లీక్షింపుచు
న్గలకంఠీభ్రమరీనినాదము లగణ్యప్రీతి సంధిల్ల లీ
లలఁ జేసెన్ జనమేజయాత్మజుండు కాలక్షేప మేపారఁగన్.

3

వ.

ఇట్లు వినోదపరాయణుండై యొక్కశీతలతరుచ్ఛాయాతలంబున నెచ్చెలులుం దానును సుఖాసీనులై యున్నసమయంబున సాధకుం డొక్కరుండు నిజేచ్ఛ నరిగి వారలం గని చేరవచ్చిన నక్కుమారుండు వినతి నాతని నాదరించి మీ రెవ్వ రెచటి కేగెద రని యడిగిన.

4


క.

సాధకుఁడ నేను సుమహా
(సాధి)కు నొకసిద్ధుఁ గొలిచి యతనిపనుపునన్
సాధింపఁ గడిఁదియగునది
సాధింపఁగ నిశ్చయించి చనుచున్నాఁడన్.

5


సీ.

అది యెట్టి దనిన వింధ్యాటవిలోపల
        గరమొప్పు శింశుపాతరువుదండఁ
బారావతాక్షుఁ డప్పన్నగేశ్వరుపాల
        వైదూర్యకాంతి యన్వాలు వర
దీధితి యనియెడు దివ్యరత్నము గల
        దావాలు ధరియించి యాతఁ డేడు
దీవులు నేలు నాదివ్యరత్నముకడ
        నఖిలసిద్ధులు గల వధిప నేను
వాని నిప్పుడు సాధింప వలను మెఱసి
యెంతు ననుటయు నలరి మహీశసుతుఁడు
సఖుల నీక్షించి వారలసమ్మతమున
నతనితో నిట్టు లనియె నత్యాదరమున.

6


శా.

ఏను న్మంత్రులుఁ దోడువచ్చెదము నీ కీప్రొద్ద యన్నన్ ధరి
త్రీనాథాత్మజు నిచ్చ మెచ్చుకొనుచున్ దివ్యౌషధిశ్రేణితో

నూనం జేసి రసంబు తత్పదములం దొట్టించి యద్రిస్థలీ
యానోదగ్రత వారుఁ దానుఁ జని వింధ్యారణ్య దేశంబునన్.

7


గీ.

పాంశుసంఛన్న మైనకూపంబుఁ దడవి
దాని చేరువ శింశుపాతరువు క్రింద
నగ్నికుండంబుఁ బొడఁగని యచట నిలిచి
తనసచివులు రక్షకులుగాఁగ నియమమున.

8


వ.

సుస్థిరాసనాసీనుండై సాధకుండు ఖదిరేంధనంబుల వేల్వం దొడంగిన.

9


క.

బిగిచన్నులుఁ దెలికన్నులు
నగుమోమును మెఱుగుమేను నయనానందం
బుగఁ బద్మనయన యొక్కతె
యగణితవిభ్రమముతోడ నరుదెంచుటయున్.

10


సీ.

ఘనవేణికచాంధకారంబుచే
        మదనాంధకారంబు పొదివికొనఁగ
...రుణాధరయధరరాగంబుచే
        భావజరాగంబు పట్టుకొనఁగ
...నేత్రదృగ్జాలంబుచేత ద
        ర్పకబాణజాలంబు పర్వికొనఁగ
గురుకుచకుచచక్రయుగముచే శంబర
        రిపుజైత్రచక్రంబు ద్రిప్పుకొనఁగ
నుల్లము గరంగ వైశిక పల్లటిలఁగ
ధైర్య మెడలంగ మంత్రతంత్రములు మఱచి
తలఁపుఁ జూపును నంగనం దగిలియుండ
సంయమభ్రష్టుఁడై యుండె సాధకుండు.

11

వ.

ఇట్లు సాధకుండు కామాతురుండై మంత్రసామర్థ్యంబు గోలుపోయిన.

12


క.

పారావతాక్షుపనుపున
ఘోరతమం బడర భూతకోటులు భయదా
కారత సాధకుఁ బొదివి మ
హారవ మెసఁగంగ నార్చి యాగ్రహమొప్పన్.

13


వ.

కడకాలు పట్టి దవ్వులం బడవైచిన వాని వెదక సంభ్రమించి యందఱు నన్నివంకల నమ్మహాటవి దరియం జొచ్చి వెదకి వెదకి దిగ్భ్రమనొంది వచ్చిన జాడ యెఱుంగక యొండొరులం బొడగానక తిరుగుచుండ భూపాలనందనుండు కొన్నిదివసంబులు చెలులం దడవి యొక్కనాఁ డొక్కయేటిదరి నరుగు సమయంబున.

14


ఉ.

గ్రాహము తన్నుఁ బట్టినఁ గిరాతుఁ డొకండు ఘనార్తిఁ గూయుడు
న్సాహసమార నానృపతినందనుఁ డానదిఁ జొచ్చి యుద్ధతి
న్బాహుశితాసి దానివదనంబు రయంబున వ్రచ్చి బోయ న
వ్వాహిని వెల్వరించుటయు వాఁడు ముదం బెసఁగంగ నమ్రుఁడై.

15


క.

పూని యకారణబంధుఁడ
వై నాప్రాణములు గాచి తసమానకృపాం
భోనిధి నను నీదాసుని
గా నేలితి, రమ్ము నాయగారమ్మునకున్.

16


వ.

అని తా నేలెడి కిరాతపల్లికిం దోడ్కొని చని సముచితసంభావనంబు లొనరించి నిజగృహంబులలో నొక్కరమ్యసదసంబున నునిచిన నుండి నాఁటినిశాసమయంబున రత్నదీప

ప్రభావిభాసితం బగు తన్నివాసంబు గలయం గనుంగొనునప్పుడు దైవయోగంబున.

17


చ.

ఒకపురినెమ్మిఁ గాంచి ప్రియ మొందఁగ బంధము లూడ్చి పట్టి యం
గకములు దువ్వి దానిమెడఁ గట్టినరజ్జువు గాంచి వీడ్చినన్
శకునిసనూకృతిం దొరఁగి చయ్యన భీమభటాభిధానుఁ డై
ప్రకటవినీతి మ్రొక్కుటయు రాసుతుఁ డద్భుతమోదమగ్నుఁడై.

18


వ.

అత్యంతసంభ్రమంబునం బరిరంభణం బొనరించి యతనిపునఃపునఃప్రణామంబు లాదరించి సమీపంబున నునిచికొని కరంబు కరంబునం గీలించి నీ రూపంబునకుం గారణం బేమి యని యడిగినఁ గరంబు వినయంబున న(తం డ)తని కిట్లనియె.

19


క.

ఆపన్నగంబు కతమున
నాపన్నత మిమ్ముఁ బాసి యలజడి నశనా
యాపీడనొంది యుజ్జయి.
నీపురముం జేరి మేను నెఱిచెడి తూలన్.

20


సీ.

ఏ నొకముదుసలియింటికి నరిగి నా
        కాహార మొనరింపు మనుడుఁ బ్రీతి
వెలయించి భోజనవేళయందాఁకను
        నది నన్ను శయనింపు మనిన శయ్య
నుండి చూచుచు నుండ నొకకొన్నియవ లది
        ధరణిమీఁదటఁ జల్లెఁ దత్క్షణంబ
మొలచి గుబ్బన నేచి ఫలియింప సక్తువు
        గావించి యదియుఁ బాకంబు చేసి

యొక్కపాత్రంబులోపల నునిచి ప్రాఁత
యవలఁ బాకంబుగావించి యదియు నొక్క
కంచమునఁ బెట్టి యొకచీర గప్పి దొంతి
నునిచి యది నీరుదేరంగఁ జనియెనంత.

21


వ.

అది కపటకృత్యంబుగా నెఱింగి.

22


గీ.

పాత్రముల సక్తువులు వీడుపడఁగఁ బెట్టి
యంబరం బది కప్పినయట్ల కప్పి
యేను శయనతలంబున మేను సేర్చి
కన్నుమూసినపోలిక నున్నయంత.

23


వ.

ఆజంత యరుగుదెంచి నేఁ జేసినవిధం బెఱుంగక యత్యంతరయంబున.

24


క.

నా పేర నిర్ణయించిన
యాపాత్రము నాకుఁ బెట్టి యవ్వలిపాత్రన్
వేపుచ్చుకొని భుజించుచు
నాపాపపుజంత మేఁక యయ్యె నరుదుగన్.

25


వ.

దానం గనుంగొని నివ్వెఱఁ గందుచు నాకుం బన్నినయురుల నీవ తగిలితే యనుచు నవ్వుచు భుక్తోత్తరంబున నొక్క రజ్జువున దానికంఠంబు బంధించి తిగిచికొనుచు నొక్కసూనరిగృహంబునకుం జని బట్టి యిచ్చెద ననిన నతనిభార్య యెఱింగి నా చెలియలి నిట్లు చేసితే కాని మ్మని జంకించిన వెఱచి యయ్యజంబు విడిచిపెట్టి దేవాలయంబునకుం జని నిద్రించితి నదియు నదియ వైరంబుగాఁ బాటించి నాచొప్పునం జనుదెంచి యేను మయూరం బగునట్లుగా నీత్రాడు మత్కంధరాంతరంబున బంధింపంబోలు నేనును బర్హిభావంబు

నొంది బోయలచేతం బట్టువడి యిచ్చటికి వచ్చి దేవరచే పడి తిర్యగ్భావనిర్ముక్తుండ నై భవదీయదర్శనంబునఁ గృతార్థుంగుండ నైతి నని పలికి యొక్కవిన్నపం బవధరింపుమని యిట్లనియె.

26


సీ.

వేగంబ యిచ్చట వెడలంగ వలయుఁ గి
        రాతు లుద్ధతులు ద్వారమున వెడలి
పోవంగఁ గనుఁగొన్నఁ బొలియింతు రీత్రాటి
        వలన మయూరభావములు దాల్చి
యీగవాక్షమ్మున నేగుద ముని నృప
        తనయుకంఠమున నాత్రాడు గట్టె
నెమలి యై యపుడు రాకొమరుండు వెడలి త్రా
        డూడ్చి యాతని చేతి కొసఁగుటయును
నాగుణము కంఠమునఁ గట్ట నాక్షణంబ
తాను బర్హి యె వెడలి రాసూనుచేత
బంధనిర్ముక్తుడై యాత్మభావ మొంది
కడురయంబున నాపల్లె వెడలి వచ్చి.

27


వ.

తనమతమున కుల్లసిల్లుమహినాథకుమారుండునుం దానును గాననమార్గంబున నరిగి యరిగి.

28


చ.

దళ మగుచీఁకటిం దెరువు దప్పి వదంబులు నొప్పిగూరినన్
సొలసి వనంబులోన నొకశుష్కమహీజముక్రింద నుండఁగా
లలితనిశాకిరాతమహిళాకచభారవిభాసితాబ్జినీ
దళమును బోలి తూర్పుదెసఁ దారకరా జుదయించె నత్తఱిన్.

29


చ.

నెలవొడువంగఁ చిత్రముగ నీరసభూరుహ మాకువెట్టి మొ
గ్గల విరిపూవులం దనరి కాచి ఫలించినఁ దత్ఫలావళుల్

దళముగ వారు మోదమునఁ దద్రస మాదటఁ గ్రోలి దాన నాఁ
కలియును దప్పియుం దొలఁగఁగా ముద మందుచు నున్నయంతటన్.

30


గీ.

ఆకుజము గుణాకరాఖ్యమిత్రుం డగు
టయును నద్భుతంబుఁ బ్రియముఁ దనర
నర్థితోడ నప్పు డాలింగనము చేసి
యిట్టు లగుటకు గత మేమి యనిన.

31


సీ.

ఆపాముకినుకచే నందఱఁ బెడఁబాసి
        యడవులలో మిమ్ముఁ దడవి తడవి
యిచ్చోట నొక్కమునీశ్వరుండు సమాధి
        నుండు టెఱుంగక యురక నేను
బ్రణమిల్లి చెలులును రాసుతుండు నెచట
        నెబ్బంగి నున్న వా రెఱుఁగఁజెప్పు
మనుచుఁ గార్యార్థి నై యందంద ప్రార్థింప
        జపవిఘ్నమునకు నాతపసి కినిసి
వట్టితరువవు గ మ్మన్న వంత నొంది
వేఁడుటయు నాదరించి నీ విభుఁడుఁ జెలియు
నిచ్చటికి రాఁగలరు వార లేగుదేర
నెలమిఁ బొంది ఫలింతు వా రెలమి నొంద.

32


క.

దళముగ ఫలింప నీఫల
ములరసముల వారు తృప్తిఁ బొందుడు నంతన్
ఫలవృక్షాకృతి విడుచుచుఁ
జెలువంబుగ వాఁరి గదిసి చెలఁగెద వనినన్.

33

వ. ఆక్షణంబ నీరసవృక్షంబ నైతి దేవర యిచ్చటికి విచ్చేయుకతంబున శాపవిముక్తుండ నై తావకదర్శనంబున ధన్యుండ నైతి నిప్పు డప్పరమమునీంద్రుం డందేని యున్నవాఁ డనినం దద్దర్శనలాభప్రమోదతరంగితాంతరంగు లగుచు నతఁడును దారును నొక్కపథంబున నరుగుసమయంబున.34

క.

పాగలు దొడుగుక[1] యొకయెల
నాఁగయుఁ దానును నభంబునం జని చని భూ
భాగంబున ముగురం గని[2]
వేగంబున నవతరించి వినతుం డైనన్.

35


చిత్రకరుని వృత్తాంతము

వ.

వీఁడె మనచిత్రకరుండు వచ్చె నిట్టిచిత్రంబునుం గలదె యనియుల్లంబున నుల్లసిల్లుచు వానిం బరిపాటి నందఱుం బరిరంభణం బొనరింప నంగనయుఁ ముసుంగిడి తొలంగి యుండె నంతఁ దారొక్కయెడ నాసీనులై యున్నచోఁ గమలాకరుండు చిత్రకరుని వదనంబునం జూడ్కి నిలిపి నీ కీఖేచరత్వంబు మహత్త్వంబు నెట్లు గలిగె నని యడిగిన.

36


మ.

అహిరోషంబున నట్లు వాసి చని వింధ్యారణ్యమధ్యంబున
న్సహజస్ఫూర్జితతేజు లిద్ద ఱసురల్ సత్త్వాఢ్యు లేకామిష
స్పృహఁ దర్కింపఁగ వారిఁ జేరఁ జని గంభీరోక్తి వారించి దు
స్సహవాదంబున కెద్దిహేతు వనిన న్శాంతోరుసంరంభు లై.

37


వ.

ఒక్కపాత్రంబును నొక్కలాతంబును నొక్కపాగదోయినిం జూపి.

38

శాా.

ఈ పాత్రంబు నిరంతరేష్టఫలదం, బీయష్టి వ్రాయంగ నే
రూపంబైనను నిక్కువంబ యగుఁ, జేరుం గోరుచో టన్నరుం
డీపాగ ల్దొడినప్డు, మత్పితృధనం బీవస్తువు ల్వీనికై
కోపం బారఁగఁ బోరఁగావలసె మాగుం బాలువోకుండుటన్.

39


క.

అనుటయు నతిముత్సరతం
బెనఁగెడు వారలను గాడుపెట్టి పఱచి కై
కొనియెద నీవస్తువు లని
మనమున నూహించి చతుర(మత) మేపారన్.

40


క.

ఇరువురు సంగడి విడువక
పరువునఁ జనుచోటఁ గడవఁ బాఱెడువాఁ డీ
వరవస్తువులకు నొడయఁడు
సరభసగతి నరుగుఁ డనిన సమ్మద మొదవన్.

41


క.

ఏ విడువఁగ సమసత్త్వులు
గావున నొండొరులం గడవగాఁ జాలక యా
దేవారులు ద వ్వరిగిన
నావలఁ బాఱి రని నెమ్మనమున నలరుచున్.

42


క.

త్వరతో యష్టియుఁ బాత్రయుఁ
గరమునఁ గబళించి పాదుకలుదొడి యేనం
బరగతి...నాయంజక
పురమున కరిగితిఁ గుమారపుంగవ వినుమా.

43


క.

అందొక్క వృద్ధకామిని
మందిరమున విడిసి తదభిమతధనములు పెం
పొందఁగ నిచ్చియు నప్పురి
యందొప్పెడు కాంత గలదె యనియడుగుటయున్.

44

ఉ.

రత్నరథుండు దానసురరత్నము మాపురిరాజు తత్సుతన్
రత్నవతీసమాఖ్య హరిరత్ననిభాలకఁ బోలుకన్యకా
రత్నము లేదు లోకమున రాజతలీలల నెప్డునుండు నా
రత్నగృహంబునం దనుచు రాసుత యుండెడు మేడఁ జూపినన్.

45


వ.

నాఁటినిశాసమయంబున మదీయపాదుకామహానుభావంబునఁ దదీయసౌధంబునకుం జని రత్నకళికాలోకం బగు తదంతరంబున.

46


క.

తొంగలిఱెప్పల మెఱుఁగులు
తొంగలిగొనుమేను వదనతోయరుహంబున్
రంగారఁ దల్పమున స
య్యంగన నిద్రింపఁజూచి యాత్మగతమునన్.

47


క.

నాగతి మున్ను నెఱుంగదు
నేగతి మేల్కనుపువాఁడ నీసతి నిద్రా
రాగము లగుచూపుల నను
రాగము వొడమునొ యమర్షరాగ మొదవునో.

48


ఉ.

అగ్గల మైనమోహమున నల్లన నేనొకయింత డాసినన్
దిగ్గన మేలుకాంచి సుదతీమణి వింతదనంబులేక తా
నిగ్గులుమీఱు కన్నుగవ నెయ్యపుఁ జూపులు సందడింపఁగా
డగ్గఱునేని నాకు నిట డక్కు మనోభవరాజ్యసంపదల్.

49


క.

అనుచుండ సౌధపాలుఁడు
తన ప్రియ కొకకథను జెప్పి తద్వేళకు నా
కనుకూలంబై కడునిం
పెనయంగా నొక్కపద్య మిట్లని చదివెన్.

50

ఉ.

 లాలితరూపయౌవనవిలాసమనోహర యైతనర్చు నీ
లాలక నిద్రవోవఁ గని యాదటఁ గౌఁగిట మేలుకన్పఁగాఁ
జాలక యాత్మఁ దక్కిన విచారములొందఁగ నూరకుండ నా
కూళఁడు కామరాజ్యమునకు న్వెలిగాఁడె తలంచిచూడఁగన్.

51


క.

అనుపలు కుపదేశముక్రియ
ఘనమోదము నిగుడఁ జేయఁ గదిరెడుతమకం
బునఁ గౌఁగిలించి యమ్మా
నిని మెలుపారంగ నేను నిద్ర దెలిపినన్.

52


క.

చంచలనేత్రము లమరఁగ
సంచలతయు సమ్మదంబు సంశయము మది
న్ముంచిన హస్తస్వస్తిక
కించుక యగునింతియొప్పు గడునలరింపన్.

53


ఉ.

ఇచ్చ జనించు వేడ్క నొకయించుక వింతదనంబు సేయమిన్
మచ్చిక లేక యుండియును మచ్చిక లగ్గల మైనపోలికిం
బొచ్చెము లేనిసౌఖ్యములఁ బొందితి మేము రహస్యవేళలం
బచ్చనివింటిదేవరప్రభావము భావములం గరంపదే!

54


వ.

ఇ ట్లయ్యింతయు నేనును నత్యంతమోదంబునం గంతునిం గృతార్థునిం గావించి తదనంతరంబ.

55


క.

నావృత్తాంతముఁ బేరును
నా వెలఁదికిఁ జెప్పి రాత్రి యంగనతోడన్
భావజుకేళిం దేలుచు
నావిడిదల దివసవర్తనంబు గడుపుచున్.

56


ఉ.

ఇప్పగిది న్రహస్యముగ నే నొనరింపఁగ బోటు లొక్కనాఁ
డప్పువుఁబోఁడిచన్నుఁగవ నంగజముద్రలు గాంచి రాజుతోఁ

జెప్పకయున్నఁ ద ప్పనుచు శీఘ్రమునం జని యేకతంబునం
జెప్పినఁ గూఁతులాగునకుఁ జిత్తములోపల వంత మీఱఁగన్.

57


చ.

తనసుతవర్తనంబు విదితంబుగ నారయఁ బ్రోడ నోర్తు బం
చిన నది యేగుదెంచి యొకచెంగట నుండి రతాంతవేళ మా
నినియును నేను మైమఱచి నిద్దుర వోవఁగఁ జూచి ప్రోడలీ
ల నెఱయ నాదుచేలమున లత్తుకరేఖలు వ్రాసె నచ్చుగన్.

58


క.

అంబుజముఖి యిటు లడియా
ళంబులు గావించి చెప్ప లాక్షాంకసమే
తాంబరుఁ బురిఁ దడవుండు ర
యంబున నని రాజు భటచయంబుం బనిచెన్.

59


వ.

ఆవృత్తాంతం బంతయు రాజసదనాంతర్వర్తిని యగు నావృద్ధజంతచేత విని యచ్చట నునికి యకార్యం బని నిశ్చయించి పాదుకాసమన్వితపాదుండ నై పాత్రయు లాతంబునుం గొని యాక్షణంబ కమలాక్షి యున్నసౌధంబునకుం జని సకలంబు నెఱింగించి గమనోన్ముఖుండ నగుటయు నిన్నుం బాసి నిమేషం బైనను బ్రాణంబులు నిర్వహింపనేర నీతోడన వచ్చెదఁ దోడుకొనిపొ మ్మనిన నిమ్మగువం గరంబులం బొదివికొని గగనగమనంబున వచ్చి వచ్చి యిచ్చట దేవరం గాంచి యానందకందళితభావుండ నగుచు నవతరించితి ననుచు విన్నవించి.

60


గీ.

భక్ష్యభోజ్యలేహ్యపానీయచోష్యముల్
సంకుమదపటీరచంద్రమృగమ
దములు పాత్రమహిమఁ దత్క్షణమాత్రన
పడసి నెచ్చెలులకుఁ బతికి నొసఁగి.

61

వ.

మఱియు నక్కుమారు నాలోకించి.

62


క.

నాయష్టిమహత్త్వంబున
నీయెడ దేవరకు నుండ నిరవుగ సకల
శ్రీయుతమై తగుపట్టణ
మాయకముగ వ్రాయువాఁడ నని యుత్సుకుఁ డై.

63


సీ.

మణిహేమవిస్తారమందిరప్రాకార
        సౌధదేవాలయసంచయములు
ఘనసత్త్వబంధురగంధర్వసింధుర
        దుర్దమసుభటసందోహళములు
వరధరణీదేవవైశ్యశూద్రాదినా
        నాజాతు లైనజనావళులును
నిరుపమలావణ్యసురుచిరగుణగణ్య
        పణ్యపుణ్యాంగనాప్రకరములును
సన్నుతగృహోపవనములు సర్వనిధులు
నెఱయవ్రాసిన నన్నియు నిక్కువంబు
లై త్రిలోకపురీరాజ్య మనఁగఁదగిన
పట్టణము వొల్చెఁ గన్నులపండు వగుచు.

64


వ.

ఇట్లు చిత్రంబుగాఁ జిత్రకరుండు పురంబు నిర్మించి దానికిం జిత్రపురం బని పేరిడి యందు రాజమందిరంబునఁ గమలాగరకుమారుని సింహాసనాసీనుం గావించి తానును భీమభటుండును గరుణాకరుండును, సముచితప్రకారంబులం గొలుచుచు మణికనకభాసురనివాసంబుల విశిష్టవిభవంబుల నుల్లసిల్లుచున్నంత.

65

చ.

చెలువుగ నొక్కలాతమునఁ జిత్రకరాఖ్యుఁడు పట్టణంబుగా
వలసినయట్టిరూపములు వ్రాయఁగ నన్నియు నిక్కువంబు లై
యలవడఁ దత్పురీరమణుఁడై కమలాకరుఁ డన్విభుండు భూ
వలయము నేలఁజొచ్చె ననువార్త జగంబుల నెల్ల మ్రోసినన్.

66


క.

ఎసఁగిన యీవార్తలు విని
మసలక వేకదలి కాంతిమంతుండును బు
ధిసహాయుండును మోదం
బెసఁగంగా నరిగి యానృపాగ్రణిఁ గనినన్.

67


క.

ఆనెచ్చెలులం గని యా
స్థానంబున నున్న మంత్రితతియును దానున్
మానవపతి యెదురుగఁ జని
మే నలరు గౌఁగిలించి మించిన వేడ్కన్.

68


వ.

సింహాసనంబు చేరువ సముచితాసనాసీనులం గావించి వారివదనంబు లవలోకించి.

69


గీ.

మమ్ము బాసి యరిగి..........
దత్తుఁడను రాజుపురిఁ జేరి తత్తనూజుఁ
డగు విజయసేనుతోడ సఖ్యమ్ము చేసి
యుచితవృత్తిమైఁ దిరుగంగ నొక్కనాఁడు.

70


క.

ఆనృపనందను సోదరి
మానసభవురాజ్యలక్ష్మి మదిరావతి య
న్మానవతీతిలకం బు
ద్యానవిహారంబు సలుప నరిగెడువేళన్.

71


క.

విలసితమరాళరాజీ
కలకల మెసగంగ మెలఁగు కమలిని వోలెం

గలనూపురకాంచీమం
జులరావము లెసఁగ నింతి చూడ్కికి నబ్బెన్.

72


క.

హారావళిలో నయ్యం
భోరుహలోచనకుచాగ్రములు గనుపట్టెన్
శారదనదిఁ గానంబడు
హారిసరోజాతకుట్మలాగ్రములగతిన్.

73


ఉ.

అవ్వనజాక్షిఁ జూచి హృదయంబున రాగము నివ్వటిల్లఁగా
నివ్వెఱఁగంది ఱెప్ప లిడనేరక చూడఁగ ధైర్యమూలముల్
ద్రవ్వెడుచూపుల న్వికచతామరసానన చూచె నామదిం
బువ్విలుకాఁడు దట్టముగఁ బుష్పశరంబులఁ దూఱనేయఁగన్.

74


క.

పులకలు జెమరును గంపము
నెలకొన నొకమాటునందు నిలిచితి నే ను
జ్జ్వలపుష్పబాణబాణా
కులిత యగుచు నెట్టకేనిఁ గోమలి చనియెన్.

75


వ.

ఏనును మీనకేతనోదారశరాసారవిదారితమానసుండ నగుచు విజయసేనం గొలువ నరిగి యవసరం బగునంతకు నగరిలో నొక్కెడ వసియించి మదిరావతినిం జింతింపుచున్నంత నన్నాతి యుపమాత గనుంగొని కన్నుసన్న నన్నుం జేరి ధవళాంబరంబునం బొదివినకందుకంబుచందంబున నున్న పూదండ నాకుం జూపి యిట్లనియె.

76


క.

ఏతపం బొనరించితొ
మామదిరావతి ప్రియంబు మదిఁ గదురంగాఁ
దా ముదముతోడఁ గట్టిన
యీమాలిక నన్ను నీకు ని మ్మని పనిచెన్.

77

క.

వేయింటికి నీవ మనో
నాయకుఁడవు మేదినీశనందన యని తా
నాయుజ్జ్వలదామంబును
నాయఱుతం బెట్టె నాననము వికసిల్లన్.

78


క.

ఆలలన తాన కట్టిన
మాలిక ధరియింపఁ దద్రమణికరముల గా
ఢాలింగన మొనరించిన
యాలా గొందుటయు సుఖమయాత్ముఁడ నైతిన్.

79


వ.

అ ట్లత్యంతమోదాయత్తచిత్తుండ నై యన్నాతి నన్ను వరియించు నని యున్నంత.

80


క.

జగతీపతి తన పుత్రికి
దగువరుఁ డని యొక్కరాజతనయునకుఁ దగ
న్మృగనేత్ర నిచ్చువాడై
యగణితశుభలగ్ననిశ్చయము సేయుటయున్.

81


క.

అమ్మాట పిడుగుమ్రోఁత వి
ధమ్మునఁ గర్ణములు వగులఁ దాఁకుటయును ను
ల్లమ్ము గడుఁ దల్లడిల్లఁగఁ
గ్రమ్మడు విరహాగ్ని సైఁపరాక తరలఁగన్.

82


వ.

అత్తఱి మదిరావతి పుత్తెంచినపరిచారిక యొక్కతె యరుగుదెంచి న న్నూఱడించి యబ్బోటి తనయాడినమాటలు విను మని యి ట్లనియె.

83


ఉ.

భూమివరుండు తన్ను నొకభూపకుమారున కిచ్చునంచు నీ
వేమియుఁ జింతఁ బొందవల దీక్రియ నిన్న వరింతు నెంతయుం

బ్రేమ దలిర్ప నొడ్లను వరింపఁగ నామది కియ్యకోలు గా
దామనుజేంద్రుఁ డేల నను నన్యుల కిచ్చు ననాదరంబునన్.

84


గీ.

అనెడుపల్కు సుధాసేక మగుచుఁ జవుల
నలరఁజేసె డెందంబు కొందలము మాన్పెఁ
జలనమొందిన ప్రాణంబు నెలవుకొలిపె
నూతనాంగజరాగంబు నూలుకొలిపె.

85


వ.

అమ్మగువమాటలు విని నమ్మి యిమ్మెయి నూఱడిల్లి యున్నంతఁ గొన్నిదినంబులకు లగ్నదివసంబు వచ్చుటయు.

86


సీ.

రాజనిశ్చితుఁ డైన రాజకుమారకుం
        డభినవవిభవంబు లతిశయిల్ల
నసమానమణితోరణాలంకృతం బైన
        రాజమార్గంబున రమణతోడ
నానావిధవిభూషితానేకజనములు
        చెలువారఁ దనచుట్టు బలసికొలువఁ
గనకహర్మ్యము లెక్కి కామినీజనములు
        తనమీఁద శేషాక్షతములు చల
వివిధశోభనవాద్యము ల్విస్తరిల్ల
నతులవందిమాగధజనస్తుతులు చెలఁగఁ
బ్రీతి మదిరావతీకన్యఁ బెండ్లియాడ
వైభవోన్నతు లలరార వచ్చుటయును.

87


క.

ఏ నావిభవము గనుఁగొని
మానసమునఁ జాలఁ గుంది మదిరావతిపై
నూనిన యాస విడిచి యతి
దీనతఁ బురి వెడలిపోయి ధృతి మాలి వెసన్.

88

క.

కాయజవేదన కోర్వక
కాయము విడువం గడంగఁగా దైవగతిన్
నాయున్నయెడకు బుద్దిస
హాయుఁడు వచ్చుటయుఁ గాంచి హర్షం బెసఁగన్.

89


వ.

గాఢాలింగనం బొనరించి వృత్తాంతం బంతయు నెఱింగించినం జింతింపవలదు నీహృదయవల్లభ నీక సిద్ధించునుపాయంబు గలిగెడు నని యూఱడించి నీపడినయట్ల యేనునుం బడితి నాకథ విను మని యిట్లనియె.

90


గీ.

అట్లు వింధ్యాద్రి మిముఁ బాసి యరిగి యేను
బెక్కుగహనంబులు తరించి యొక్కయడవి
నిందిరామందిరం బయి యందమందు
శంఖపాలాఖ్య నొప్పారు సరసిపొంత.

91


క.

పలువురుబోటులతోడను
జలకేళి యొనర్ప వేడ్కఁ జనుదెంచిన యు
జ్జ్వలయౌవనైకవసతిని
విలసితరూపవతి నొక్కవెలఁదిం గంటిన్.

92


క.

అంగనకబరీమేఘము
నంగతటిద్ద్యుతియుఁ జూచి యనురాగముతో
నంగజుకేళిమయూరము
భంగిని సమ్మదవిఘూర్ణభావుఁడ నైతిన్.

93


క.

ఆకాంతయు న న్నచట వి
లోకనములఁ జూచుచుండె లోలాత్మక యై
యాకొలనివంక నొక్కమ
హాకరి యచ్చటికి వచ్చె నంభోవాంఛన్.

94

మ.

గళదుద్యన్మదరంజితభ్రమరరేఖం గాలకూటచ్ఛవిః
కలితోదంచితమందరంబువిధ మై కర్ణానిలాలోలదీ
ర్ఘలసన్నిర్మలచామరంబుల బలాకావేష్టితాబ్దంబునా
నలి గర్జిల్లెడు నాగజంబుఁ గని కాంత ల్కొందలం బందఁగన్.

95


వ.

ఓడ కోడకు మని యమ్మానినిం జేర నరుగుటయు.

96


క.

అతిభీతిరాగయోగో
ద్ధతకంపచ్ఛేదపులకితప్రసభసము
న్నతకుచము లురము గాడఁగఁ
నతివ ననుం గౌఁగిలించె నతిరభసమునన్.

97


చ.

కనుకలిఁ జిక్కి యేను బిగికౌఁగిటఁ జేర్పఁగఁ గోరునాసరో
జనయన యప్డు కుంజరమిషంబునఁ బైఁబడి యిట్లు కౌఁగిలిం
చినఁ బులకించి యిట్టి దని చెప్పఁగరాని సుఖంబుఁ జెప్పిన
న్నను నెఱుఁగంగనేరక మనంబున నేన కరంగుచుండితిన్.

98


వ.

ఇవ్విధంబున నభినవసౌఖ్యంబు లనుభవించి యే నయ్యేనుంగు నుద్దేశించి.

99


ఉ.

ఓకరిరాజ నీకతన నుత్పలలోచన దాన వచ్చి న
న్జేకొని కౌఁగిలించె వికసిల్లుచు నిట్టిపరోపకారికి
న్నీకుఁ బ్రియాసమాగమము నిచ్చలుఁ గావుతఁ దత్కరోల్లస
చ్ఛ్రీకరశీకరప్రకరసేకసుఖంబులు నివ్వటిల్లఁగన్.

100


వ.

అని దీవించితిం దదనంతరంబ యాసామజంబు నపారాశుసీత్కారపూరితశీకరాసారమండితం బైన కరదండం బార్చుచు నామీఁదన కవిసిన నయ్యింతి నోసరిలం జేసి.

101


క.

కరికరము వట్టికొని
...............................

వెరవుమెయి దాఁటి యరిగితి
మరలి కనుంగొనకమున్న మహితరయమునన్.

102


క.

ఏను గరి కడ్డుపడునా
లోనన నెచ్చెలులు పద్మలోచనఁ గొనుచుం
గాననము దరిసి రెచ...
...................................

103


వ.

.........రంబ ప్రవేశించి యున్నంత దంతావళంబు సరఃప్రాంతంబున నెంతయుం దడపు విహరించి యది తొలంగి చనుట యెఱింగి యయ్యెడ వెడలి యయ్యెలనాఁగ చనిన
వలని......బున.

104


ఉ.

ఆవనజాక్షి నేవలన నారసి కానక యాతురుండ నై
భావజవహ్నిఁ గ్రమ్మికొని భావము గాల్పఁ జరించునంత రా
జీవవిరోధిమండలము చిచ్చఱపిడ్గును బోలె నెన్నఁ
...........................................చున్.

105


వ.

అప్పు డేపారు మదనానలతాపంబున కోర్వక మరణోద్యుక్తుండ నై యాంగికంబు లగుశుభసూచకంబులు గల్గిన నంగనం గనుంగొనియెద నను......డ నై పెక్కెడలం జరించి యిక్కడకు నరుదెంచి నిన్నుఁ గాంచితి నని తనవృత్తాంతంబుఁ జెప్పిన యనంతరంబ మనోభవాధీనమానసుండ నైనన న్నూఱడించి యిట్లనియె.

106


క.

.................
.......................మునిగుడికిం
జని లో నొక్కెడ నుండఁగ
మనకోర్కి ఫలించు నిచట మసలఁగ నేలా.

107

క.

అని పలికి నన్నుఁ దోడ్కొని
చనఁగా నిరువురముఁ బుష్పసాయకుగుడికిం
జని గర్భగృహంబున న
మ్మనస...............................

108


వ.

.......యంబునం గరదీపికాసముదయంబు వెలుంగ నాందోళికారూఢ యై యమందవిభవంబున.

109


క.

ఘనవాద్యఘోషభీషణ
జనవననిధినడుమ లక్ష్మిసరణి నమరుచుం
జను.................
.....................నంగజుగుడికిన్.

110


గీ.

వచ్చి చెలువందఁగా నెల్లవారి నిలిపి
యొక్కతియ గుడి సొచ్చి చిత్తోద్భవునకు
మ్రొక్కి కరకమలంబులు మోడ్చి నిలిచి
కన్ను నీ రొల్క నిట్లని విన్నవించె.

111


క.

అగణితవిలాసు నొక్కని
.....................................
.......క వేఱ యొక్కని
మగఁ డని తగిలింపఁ దగునె మనసిజ నీకున్.

112


క.

ప్రాణేశవిరహ మోర్వం
బ్రాణము విడిచెదను మీఁదిభవమున నైనం
బ్రాణేశ్వరుఁ గందు రతి
ప్రాణే.................................

113


వ.

నిర్భరతరం బగుసాహసంబున గర్భగృహంబు సొచ్చి కంఠంబున నురి యిడుకొనుటయు.

114

క.

బాలిక డగ్గఱి యెత్తి కు
చాలింగనపులకదళిత మగుకేల మెడం
గీలుకొనిన యురి వుచ్చిన
నాలోంచి నను నెఱిఁగి యాసమయమునన్.

115


క.

ఆనందకంపలజ్జల
నూనినమదితోడ వెచ్చనూర్చుచు నయ్య
బ్జానన సబాష్పగద్గద
యై నన్నుం గౌఁగిలించె నత్యనురక్తిన్.

116


వ.

అట్లు ప్రియాలింగనసౌఖ్యతరంగితాంతరంగుండ నై యాకురంగలోచనం గనుంగొని.

117


క.

వనజాతనేత్ర యడలకు
నిను వెరవునఁ గొనుచుఁ బోదు నిమిషములోనన్
మనపాలి పుణ్యదేవత
మనసిజుఁ డిచ్చోటఁ గూర్చె మనలం గరుణన్.

118


వ.

అని యూఱడించు సమయంబున బుద్ధిసహాయుండు నన్ను గనుంగొని యిట్లనియె.

119


చ.

వెలఁదుక భూషణంబులును వేషము నచ్చుపడంగఁ దాల్చి యే
వెలువడి పెండ్లికన్యయన వేడుక నందల మెక్కి యేగెదం
గలజను లెల్లఁ బారు వెసఁ గామిని దోడ్కొనిపోయి యంబికా
నిలయములోన నుండు మని నేర్పున ధైర్యము విస్తరిల్లఁగన్.

120


చ.

కచభర మూడ్చి నుందురుముగా నిడి మించిన పూవుగుత్తులం
గుచములు గాఁగఁ గట్టుకొని కోమలి భూషణవస్త్రమాలికా
ప్రచయము దాల్చి మీసములు రాని మొగంబునఁ గాంతియొప్పఁగా

నచలగతి న్ముసుంగిడి లతాంగిగతి న్వెలి కల్ల నేగినన్.

121


వ.

పరిజనంబులు సంభ్రమంబున నెద్దియు నెఱుంగక యాందోళిక యెక్కించుకొని క్రందుకొనం గొలిచి యందఱు నరిగిన.

122


క.

మదిరావతిఁ దోడ్కొనిచని
మది రాగం బెసఁగ దుర్గమందిరమున నె
మ్మది రాగిల్లుచు నుండఁగ
నది రాజ్యముకంటె నాకు హర్షముచేసెన్.

123


వ.

అట్లుండునంత బుద్ధిసాహాయ్యుండు మూఁడవజామునఁ బ్రియకామినీసహితుం డై యచ్చటికి వచ్చిన నచ్చెరు వంది పిచ్చలించుచునున్న యంతరంగంబు లలక గాఢాలింగనం బాచరించి యిచ్చెలువ యెచ్చట నీకుం జేకుఱె ననిన హాసభాసితవదనుం డగుచు నిట్లనియె.

124


ఉ.

ఏ వనితాకృతి న్నగరి కేగి నృపాత్మజ యుండునట్టి య
య్యోవరి కేగి తల్పమున నొప్ప ముసుం గిడి యున్న యంత న
న్భూవరకన్యఁగాఁ దలఁచి పొల్తుక యొక్కతె చేరవచ్చి తా
నావనజాక్షి చిత్తగతి యంతయు మున్నె యెఱుంగుఁ గావునన్.

125


వ.

ఎవ్వరు వినకుండ నల్లన నిట్లనియె.

126


ఉ.

వందఁగ నేల యిట్లు వలవంత దొఱంగుము రాజకన్యకుం
బొందఁగవచ్చునమ్మ తనబుద్ధికి వచ్చినవానిఁ దండ్రి యా
త్మం దలపోసి యిచ్చినయతండు వరుండని యుండు నెమ్మితో
నందని మ్రానిపండులకు నఱ్ఱులు సాఁపరు పద్మలోచనల్.

127

క.

ఈవేగుజాము పెండిలి
యీవిధమున నుండు టుచితమే తలపోయన్
భావజవహ్ని యడంగెడు
భావంబున ధైర్య మింత పట్టుకొలుపుమా.

128


క.

మానసభవుశిఖివేఁడిమి
యే నెఱుఁగనె దీని ననఁగ నేటికి విరహా
గ్లానిం గుందుచు మానిని
గా నేరక యున్నదానఁ గమలదలాక్షీ.

129


గీ.

శంఖపాలాఖ్య నొప్పారుసరసి పొంత
మన్మథాకారు నొక్క(కుమారుఁ) జూచి
యుల్ల మలరంగఁ జేరుచో నొకగజంబు
విధివశంబున మముఁ బాపె వీఁకఁ గదిసి.

130


క.

కరి ప్రాణేశ్వరుఁ బాపిన
విరహమునకు నోర్వలేక వేఁదురునై యా
మరుఁడు దగిల్చిన చిచ్చున
నురిసెద నది మొదలుగాఁగ నుత్పలనయనా.

131


క.

నావుడు మత్ప్రియఁగా మది
భావించి ముసుంగు పుచ్చి భావం బలరన్
నీవల్లభుఁడను నే నని
నావృత్తాంతంబుఁ జెప్పినం దెలిసి వెసన్.

132


క.

అంగము తాపము వాయఁగ
నంగన ననుఁ గౌఁగిలించి యాత్మ గరంగం
బొంగెడునాదెసఁ గనుంగొని
యంగన యిట్లనుచుఁ బలికె నవమృదుఫణితిన్.

133

క.

ఈమదిరావతితల్లియు
నామాతయుఁ దోడఁబుట్టినా ర ట్లగుటన్
భూమీశునాజ్ఞఁ బెండ్లికి
నే ముదమున వచ్చి కంటి నిచ్చట నిన్నున్.

134


వ.

అని చెప్పిన నత్యంతసంతుష్టాంతరంగుడ నై మదిరావతీకల్యాణనిమిత్త మదిరాపానమత్తపరిజన ప్రతీహార ద్వారపాలాదుల వంచించి వచ్చితి నని చెప్పిన నుప్పొంగుచు నీ ప్రొద్ద కదలి యిద్దఱము నన్నార్థుల(?)మై యింతులం దడవికొని కాంతారమార్గంబున నరుగుదెంచి యిచ్చట దేవరం గాంచి కృతార్థుల మైతి మని చెప్పిన నద్భుతరసాయత్తచిత్తుం డయ్యెఁ దదనంతరంబ.

135


క.

ఆనరనాయకుఁ డత్తఱి
నేనిక వేఁటాడ దూర మేగి యొకమహా
కాననములోన దుర్గా
స్థానముఁ గని యచటఁ జేరఁ జనియెడునంతన్.

136


వసంతకునికథ

క.

పరమేశ్వరి కతిభక్తిని
నరబలి యొనరింప వచ్చినకిరాతులు ద
న్నరపాలునిఁ గని పట్టిన
నరుల విడిచి భీతిఁ గాననముఁ దూఱుటయున్.

137


క.

బుద్ధ్యధికుండు వసంతకు
వధ్యశీలాగ్రమునఁ గాంచి వసుధాధీశుం
డధ్యానందుం డగుచున్
విధ్యనుకూలతకు నాత్మ వికసిల్లంగన్.

138

క.

తనమంత్రులుఁ దానును వా
హనములు వే డిగ్గి చేర నరిగి యతని బం
ధనము లెడలించి యాలిం
గనముల నొనరించి యపుడు ఘనమోదమునన్.

139


వ.

అతండును దానును సముచితోపాయనంబు లిచ్చి దేవికి సాష్టాంగదండప్రణామంబు లాచరించి శీతలతరుచ్ఛాయ నాసీనులై యుల్లాసంబున నతం డడుగఁ దమవృత్తాంతం బెఱిఁగింపఁ దదనంతరంబ వసంతకుండు గరయుగంబు మొగిచి మహీకాంతున కి ట్లనియె.

140


రూపిణికథ

క.

భూరమణ నిన్ను వెదకుచు
ఘోరాటవిలోనఁ దిరుగఁ గొందఱుచోరుల్
క్రూరత మీఱఁగ నొక బే
హారిధనంబు హరియింప నతఁ డాతురుఁ డై.

141


క.

మొఱ వెట్టఁగ నావైశ్యుని
వెఱ పంతయుఁ బాపి చోరవీరులనెల్ల
న్నుఱుమాడి యాతఁ డెంతయు
వెఱఁ గందఁగ సొమ్ము లెల్ల వెస నొసఁగుటయున్.

142


వ.

అత్యంతసంతోషంబున నతండు వినతుం డై నన్ను బహువిధంబులం గొనియాడి మదనోల్లాసం బనుతనపురంబునకుఁ దోకొనిపోయి యపారధనంబు లిచ్చి సంభావించె నప్పురంబు బహువిధవినోదాస్పదంబు.

143


సీ.

శుకుఁ డైన నవ్వీటిజోటులఁ జూచిన
        భంగంబు నొందు దర్పకునిచేత

శివుఁ డైన నప్పురిచెలువలఁ జూచిన
        మరు లొందు భావసంభవునిచేత
శరజన్ముఁ డైన నప్పురికామినులఁ గన్న
        రాగాంధుఁ డగు రతిరాజు చేత
వరదుఁ డైనను నన్నగరకాంతలను గన్న
        మదనాతురుం డగు మదనుచేత
బ్రహ్మచర్యంబులకు నెల్లఁ బాయుదెరువు
వివిధనియమంబులకు నెల్ల వీడుకొల్పు
మహితభోగంబులకు న్మది మందిరంబు
ల................మన్మథోల్లాసపురము.

144


సీ.

హాటకహర్మ్యంబు లంగరేఁకులవారు[3]
        పరిచారికావళి భటచయంబు
స్మరబంధ చిత్రము ల్సకినలమంచము
        ల్చరుపు గీరంబులుఁ బారువంబు
లాలవట్టంబులుఁ గీలుబొమ్మలు మంచి
        పైఁడిపన్నారులు బట్టుతెరలు
నిలువుటద్దములు గంటలయుయాలలు హంస
        తూలికపాన్పులు దోమతెరలు
సారమృగమదకర్పూరచందనములు
లలితచీనాంబరాదులు పొలుపు మిగిలి
చెలువు మీఱ మనోహరశ్రీల మెఱసి
యొప్పుదురు వారకామిను లప్పురమున.

145

వ.

ఇట్లు మనోహరం బై యొప్పునప్పురంబున నుండి యొక్కనాఁడు దేవాలయంబున కరిగి రూపిణి యనునర్తకీనృత్యంబు చూచుచుండ నయ్యంగన నన్నుం గనుంగొని యంగజాయత్తచిత్త యై తనయనురక్తి చెప్పి నాపాలికి దూతికం బుత్తెంచిన నది ప్రార్థించి తోడ్కొనిపోవఁ దత్సదనంబునకుం జనిన నది యనురాగంబున నాతోడి యిప్టోపభోగంబులం దగిలి.

146


ఉ.

మెచ్చదు వీటిలోనఁ బెఱమిండల నెవ్వరుఁ దన్నుఁ గోరి వే
యిచ్చెద మన్న నందికొననీ దొకయప్పుడుఁ దల్లితోడ నా
యిచ్చిన యీగి సెప్పికొను నెందును బాయుట కోర్వ దాత్మలో
నచ్చపలాక్షి నన్నుఁ బ్రియమారఁగఁ బొందినయంతనుండియున్.

142


క.

ఎడపక నాఁడు న్నాఁటికిఁ
గడునూత్నము లైనరతులఁ గౌతుక మొదవం
బడఁతి యలరింప నెక్కడఁ
బొడిచితె ప్రొద్ద యని యింపు పొంపిరి వోవన్.

148


వ.

నిరంతరానుమోదంబున నున్నయవసరంబున.

149


సీ.

జత్తుల వట్టంబు జఱభి మాటలపోతు
        పలుగాము డాకిని బందికత్తె
చెడుగు బమ్మెతకత్తె చిక్కొంకి రక్కెస
        యోడిసి జూదరిక.........
.............................
        .......................
.............................
        .......................
.........................
.........................
.........................
.......దినంబులు పోరిపోరి.

150


క.

ఈపగిదిఁ బోరియును నను
రూపిణిఁ బాపంగలేక క్రూరత నొకరే

పాపాత్మిక యది నాప్రా
ణాపాయ మొనర్పఁ దలఁచి యతిదౌష్ట్యమునన్.

151


క.

రూపిణికి నాకుఁ జొక్కిడి
యాపొలఁతుకఁ బాపి యిద్దఱతివలచేతన్
మోపించుకొనుచుఁ గొని చని
వే పాఱెడు నీటిలోన విడిచి యరిగినన్.

152


క.

మోచుకొని యరుగునప్పుడు
చూచుచునుండియును నేను జొక్కుకతమునన్
లేచి చనలేక నదిలో
వెచిన నొకగొంతతడవు వఱద నరుగఁగన్.

153


క.

అంగంబు నీటిలోన ము
నింగినఁ జొక్కెడలుటయును నెరిఁబడి యేనుం
డంగ వఱదబడి యొకమా
తంగముడొక్క ననుఁ జేరె దైవవశమునన్.

154


క.

ఆయేనుఁగుడొక్కను బా
హాయుగమునఁ బట్టి యెక్కి యగ్రమునం దే
నాయతరంధ్రము గాంచి యు
పాయంబున లోనఁ జొచ్చి యచలాంగుఁడ నై.

155


వ.

కొంతతడవునకు సేదదేఱి యున్నంత నాదంతీకళేబరంబు నదీవేగంబున నంబునిధానంబు సొచ్చిన.

156


ఉ.

ఒక్క మహాఖగం బెచటనుండియొ యచ్చటి కేగుదెంచి యా
డొక్క నిజాననాయతపుణ దోరపుఁజంచువున న్వహించి కొం
చెక్కుడు వీఁకఁ జంక్రమణ మెంతయుఁ దోఁపఁగ నేగె నత్తఱిన్

ఱెక్కలు వీచుమ్రోఁతల నెఱింగితి దాని మహాఖగంబుగన్.

152


వ.

అంత నమ్మహాఖగంబు లంకాద్వీపంబునకుం బోయె నప్పు డక్కరికళేబరంబు ప్రిదిలి ధరం బడిన నేనును బోరున నందు వెడలి తలచీర యలవరించుకొని యన్నెలవు వాసి నలుదిక్కులుం జూచుచు నరుగ నత్యంతశాంతులగు దైత్యులు కొంద ఱరుగుదెంచి నన్నుం గాంచి నీవు నరుండ విది లంకానగరం బిచ్చటికి నీవు వచ్చుట యచ్చెరు వని పలికి మమ్ము నేలిన కరుణావిభూషణు విభీషణుం గానుపించెదము ర మ్మని కొనిపోయి సముఖంబు చేసిన నాపౌలస్త్యుండు చాలం గరుణించి నన్నతుండనైన నన్నుఁ బ్రసన్నావలోకనంబున నిరీక్షించి యెక్కడనుండి వచ్చి తని యడిగిన నంతలోనన యొక్కయుక్తిం బొడగాంచి కరంబులు మొగిడ్చి.

158


సీ.

అనఘ జంబూద్వీపమున మదనోల్లాస
        మనఁగ నింపొందు మహాపురంబు
నెలసి యందుల రమాధీశుండు నుద్భక్తి
        వరదనామమున సేవకుల కెల్ల
వరము లిచ్చుచు నున్నవాఁ డమ్ముకుందుని
        నత్యంతభక్తి నే నాశ్రయించి
దేవ విభీషణదేవరఁ గాంచుపు
        ణ్యంబు నా కిమ్మని యర్థి వేఁడ
దేవసన్నిధి నిద్రింప దివ్యమహిమ
నెవ్వరో నన్నుఁ గొనివచ్చి యిచట నిడిరు

నిఖిలభాగవతాగ్రణి నిన్నుఁ గంటిఁ
బరమపుణ్యుని గాంచిన ఫలముఁ గంటి.

159


వ.

అనిన నెంతయు సంతసిల్లి కనకరత్నమయంబు లగు శంఖచక్రంబులును గదాంబుజంబులును చెప్పించి యవి యద్దేవునకు సమర్పింపు మని యిచ్చి నాకు దివ్యాంబరాభరణమాల్యంబులు నపరిమితకనకంబును నొసంగి యిరువురు దైత్యుల రావించి వీని నీవస్తుసంతానంబును భరియించి మదనోల్లాసపురంబు సమీపంబున నునిచి రండని పనిచిన వారు నన్నుం గొనివచ్చి యన్నగరంబు చేరువ నునిచి మగుడ నరుగ నత్యంతమోదాయత్తచిత్తుండ నై నాకిచ్చినధనంబు నొక్కకందువ దాఁచి తత్క్షణంబ.

160


చ.

కరముల శంఖచక్రములు గైకొని కాంచనరత్నభూషణో
త్కరములు దాల్చి నూతనవికాసమున న్మెయి నివ్వటిల్లఁగా
సరసిజనాభుపోల్కిని నిశాసమయంబున నేను రూపిణీ
వరసదనంబు సొచ్చుటయు వారనివేడ్కలు నివ్వటిల్లఁగన్.

161


క.

వనజాక్షుఁడు వచ్చె నటం
చనుమోదముతోడ నిదియు నమ్మయు సాష్టాం
గనమస్కృతు లొనరించినఁ
గని నాచేఁ జిక్కిరనుచుఁ గౌతుక మెసఁగన్.

162


గీ.

నేఁడు మొదలుగ వరియింతు నిన్ను నింక
నొరులఁ జేరంగనీ నన నుల్లసిల్లి
పుష్పకోమల యనురక్తిఁ బొంది యుండ
మకరదంష్ట్రయుఁ జిక్కె నామాయఁ దగిలి.

163

వ.

ఇట్లుండ నంత నొక్కనాఁడు దనకూఁతును వేడికొని యది యిట్లనియె.

164


క.

ఓకాంత నిన్ను వేఁడెద
నాకమునకు బొందెతోన నను నంపఁగదే
నీకాంతుఁడు శ్రీకాంతుని
నేకాంతమునందు వేఁడి యేక్రియ నైనన్.

165


గీ.

అనుచుఁ బ్రార్థించుటయుఁ దన యమ్మమాట
నాకుఁ జెప్పిన నే నెమ్మనమున నగుచు
నమ్మకరదంష్ట్రఁ గాకు సేయంగఁ దలఁచి
దానిఁ బిలిచి యే నిట్లంటి మానవేంద్ర.

166


సీ.

ఎల్లి యేకాదశి నెంతయు నిష్ఠను
        స్నానదానంబు లొనర్చి నీవు
పెడతలం జెంపల నడునెత్తి ముందట
        నైదుకూఁక ట్లుండునట్లు గాఁగఁ
దల బోడ గావించి తనువులో సామున
        సిందూరము నలంది చేత నొక్క
యడిదంబుఁ బూని దిగంబరవై రాత్రి
        నిచ్చెనఁ దెప్పించి నెమ్మితోడ
నాదుగుడిపొంతఁ జాల నున్నతిఁ దనర్చు
తోరణస్తంభ మెక్కి యెవ్వారు నెఱుఁగ
కుండ నిచ్చెన దప్పించి యుండు మువిద
యట్టు లైనను నేగెద వమరపురికి.

167


వ.

అనుచుం జెప్పినయప్పలుకులు నిజంబుగా మనంబున నిశ్చయించి మఱునాఁడు మద్వచనప్రకారంబున నన్నియుం జేసి

నాఁటి నిశాసమయంబునఁ దోరణస్తంభంబున కరుగునప్పు డంతకుమున్న యేనును నతిరయంబునం జని హరిమందిరం బెక్కి యేకాదశీవ్రతపరాయణులై యున్న విప్రులు విన నేఁడు మహామారీపతనం బగు నేమఱకుండుం డని పలికి వారు గానకుండ నేను సురిఁగి యరిగితి వారు వెడలి వచ్చి చూచి యరసి యెవ్వరిం గానక యది యాకాశవాణిపలుకుగా నిశ్చయించి.

168


క.

హస్తములు మోడ్చి శాంతి
స్వస్తికమంత్రములు నెరయ వారందఱు లో
కస్తవ్యోక్తుల దుర్గం
బ్రస్తుతి సేయంగ నర్ధరాత్ర మగుటయున్.

169


వ.

అంతకమున్న యెవ్వరు నెఱుంగకుండఁ దోరణస్తంభం బెక్కి యున్న మకరదంష్ట్ర యయ్యవసరంబున.

170


క.

స్తంభాగ్రతలమునను సం
స్తంభమ్మునఁ బవనుచేతఁ దల్లడపడుచుం
గుంభినిపై నుఱుకుదునా
యంభోరుహనయన యనుచు నతిరావమునన్.

171


వ.

ఎలుఁ గిడిన నయ్యెలుంగు విని యిదియ మహామారీభాషణం బనుచు నమ్మహీసురులు మస్తకన్యస్తహస్తులై ప్రస్తుతించుచు నోదేవీ! మాకీర్తనంబు లుల్లంఘింపక మామీఁద లఘింపక మమ్ము మన్నింపు మనుచు నుండ సైరింపలేక మకరదంష్ట్ర కంపంబు నొందుచు మఱియును.

172


క.

పడుదుం బడుదు ననంగాఁ
బడకు పడకు మనుచు వారు ప్రార్థింపంగా

నెడపని పలుకులమ్రోఁతయు
గుడిఁ బ్రతిరావమును శ్రవణఘోరంబయ్యెన్.

173


క.

తెలతెలవాఱినఁ బౌరులు
గలవారందఱును జూచి కలకల నగఁగా
బలునగుఁబాటుల కోర్వక
యిలపై నా జంత కూలి యీల్గె రయమునన్.

174


వ.

ఏ ని ట్లాగోరంపుజఱభి యభిమానంబును బ్రాణంబునుం గొని సమాధానంబున రూపిణితో నభిమతసుఖంబు లనుభవించుచు నున్నంత.

175


క.

కమలాకరుఁ డనుపతి చి
త్రముగాఁ దనమంత్రివరుఁడు వ్రాసిన నిజమై
నమహాపురి నున్నాఁ డ
త్యమితోన్నతి ననుచు జగము లాడఁదొడఁగినన్.

176


క.

ఆవార్తలు విని తత్పతి
వీవని మది నిశ్చయించి యిచ్చయలరంగా
నావనితారత్నమునకు
నావృత్తాంతంబు చెప్పినం బ్రియ మెసఁగన్.

177


క.

ఏనును నీవుఁ గదలి య
మ్మానవపతి పురికిఁ బోదమా యనవుడు న
మ్మానినివచనంబుల క
త్యానందముఁ బొంది సకలధనములుఁ గొనుచున్.

178


ఉ.

దేవరఁ గాన నర్థిఁ జనుదేరఁగ నొక్క వనంబులోఁ గిరా
తావలి నన్నుఁ దాఁకిన నుదగ్రత నందఱ కన్నిరూపులై

చేవ దలిర్ప ఖడ్గమునఁ జెండఁదొడంగిన బంధుల న్వెస
న్వేవురఁ గూర్చి తెచ్చి కడు వీఁక దలిర్పఁగఁ జుట్టుముట్టినన్.

179


క.

తెగి యేను దునుమం దొడఁగినఁ
బగగొని ఖడ్గహతి కోర్చి పైఁబడి కొందఱ్
దెగఁగాఁ గొందఱు గాల్సే
యెగయకయును మెలఁగ మిడుకనీక యదిమినన్.

180


క.

బెట్టు వడియుండ నొక్కటఁ
బట్టి నిగళబద్ధుఁ జేసి భామను సొమ్ముల్
ముట్టడిగొని యిచ్చోటికి
బట్టుకొనుచు వచ్చి రిపుడు బలి యిచ్చుటకున్.

181


వ.

అంత నాభాగ్యంబున నిచ్చటికి దేవర విచ్చేసితి రనిన నత్యంతసంతుష్టాంతరంగుం డై భీమభటాదులవలనుం గనుంగొని 'నేఁ డిట్టిపుణ్యదివసం బగునే యని పలికి వసంతకువలను గనుగొని వలయుభటవర్గంబుం గొని చని కిరాతపల్లి ముట్టుకొని మనసొమ్ములతోడ రూపిణిం గొనితెం డనిన నపరిమితపరివారుం డై చిత్రకరాదులతోడ దాడి వెట్టి శబరాలయంబు ముట్టికొని.

182


చ.

అమితకిరాతవీరులఁ గృతాంతునిపాలికిఁ బుచ్చి బోరునన్
రమణినీ వర్ణనీయమృగరాజి ధనాదుల సంవినోదపా
త్రము లగుపకుల న్శబరరాజమనోహరకన్యకావలిం
బ్రమద మెలర్పఁ గైకొని ధరావరుపాలికి వచ్చి రంతటన్.

183


శా.

తారానాయకబింబరత్నకలశీధారాళనిర్యత్సుధా
సారాభ్రంకషదుగ్ధవార్ధిలహరీసంతాననిత్యప్రభా

పారంపర్యపరాభవారభటికుప్రాగల్భ్యభాస్వద్యశో
హారశ్రేణిపరిష్కృతాఖిలదిశాహస్తీంద్రకుంభస్థలా.

184


క.

శ్రీరామాయణభారత
పారాశరసూక్తికూర్మపద్మప్రముఖ
పారపురాణవిలోచన
గౌరవమతిధన్య మంత్రిగణమూర్ధన్యా.

185


మాలిని.

శరదమృతమయూఖశ్లాఘతేజోమయంగా
హరిహరపదపద్మధ్యాసధన్యాంతరంగా
నరపతినయవిద్యానర్తకీనాట్యరంగా
పరబలతిమిరాళీభంజనోద్యత్పతంగా.

186


గద్యము.

ఇది శ్రీమద్వెన్నెలకంటి సూరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనమైత్రీవిధేయ అన్నయనామధేయప్రణీతం బైన షోడశకుమారచరిత్రంబునందు ద్వితీయాశ్వాసము.

  1. పాగలు దొడికొని
  2. మగుడంగని - శబ్దరత్నాకరము
  3. యీ పద్యము మూఁడవయాశ్వాసములో నున్నదని - శబ్దరత్నాకరము.