శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 66

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ : 66

                 1
అట్లు హనుమ సీతాన్వేషణ కథ
చెప్పిన విని, ఇచ్చిన చూడామణి
ఉరమున మాటికి ఒత్తుకొనుచు, రా
ఘవు డేడ్చెను, లక్ష్మణు డడలుకొనెను.
                 2
మైథిలి చూడామణి నీక్షించుచు,
శోకము నాపగలేక రాఘవుడు,
నిండి కారు కన్నీళ్ళు వెల్లిగొన
సుగ్రీవుని చూచుచు విలపించెను.
                 3
లేగమీది బాలెంత సళుపుచే
ఆవు పొదుగున ప యస్సు చేపు గతి
ఈ మణిరత్నము నీక్షింపగ నా
మనసు కరగి చెమ్మగిలి స్రవించెను.
                 4
జానకి పరిణయ సమయంబున, ఈ
మణి చదివించిరి మా పితృపాదులు,
పెండ్లి కూతురికి పెట్టిరి పాపట
బొట్టుగ, శోభిలె ముంగురులందున.

                5
ఉద్భవించినది ఉదకంబులలో,
సజ్జనముల పూజలను పొందినది,
ధీమంతుండగు దేవేంద్రుండు ప్ర
సాదించెను యజ్ఞమున కానుకగ.
               6
నే డియ్యెడ ఈ చూడామణి గని,
తండ్రి, రాజసత్తముని దశరథుని,
దాత, విదేహ విధాతను జనకుని,
చూచిన తీరున సుఖియించును హృది.
               7
ఈ మణి ప్రేయసి సీమంతంబున
భాసిలుచుండిన పరమాభరణము,
దీని దర్శనోత్సవ సుఖమున నా
ప్రేయసి వచ్చినరీతి రాగిలుదు.
               8
తీవ్రదాహమున తెరలు త్రోవరికి
చల్లని జలము లొసంగిన భంగిని,
ఇవతాళించెడి భవదమృతోక్తుల
సీత యేమనెనొ చెప్పుము మఱిమఱి.
               9
వై దేహి మఱలిరాదు చూచుటకు,
తిరిగివచ్చె వైదేహి శిరోమణి,
దీని చూతు వెతలూన; ఇంత కం
టెను దుఃఖంబుండునె సుహృన్మణీ!
              10
జానకి ఈ మాసము జీవించిన
బ్రతుక గలదు చిరరాత్రము మిత్రమ!
కాటుక కన్నుల కళ్యాణిని, ఎడ
బాసి నే క్షణము బ్రదుకజాల నిక.

                  11
నా ప్రియసఖి జానకి, ఎచ్చట కన
బడె నన్నచటి కవశ్యము చేర్చుడు;
సీత జాడ తెలిసిన పిమ్మట, క్షణ
మాలసింపగాజాల నే నిచట.
                  12
పిరికిది, మిక్కిలిబేల, కృశోదరి,
నా ప్రాణేశ్వరి ఏ ప్రకార మా
భీకర ముఖులగు రాకాసులలో
ఆపద్భయమున అంగలార్చునో!
                  13
చిమ్మచీకటుల చిక్కు తప్పుకొని
కడపటి మబ్బుల తొడుగుల ఇరికిన
శారద చంద్రుని చాయ ఛన్నమై,
మాయబోలు నా ప్రేయసి వదనము.
                  14
ఏమనె? వై దేహి మహాకపి! అం
తయును చెప్పుము యథాతథముగ, రో
గార్తు డనువయిన ఔషధమునువలె
త్రావి బ్రతుకుదును నీ వాగమృతము.
                  15
మధురభాషిణి సుమంగళ వేషిణి
నా ప్రేయని జానకి ఏమనియెనొ
నా వియోగతపనలలో ఉడుకుచు,
చెప్పుము హరికులశేఖర! నాతో.