శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 65
శ్రీ
సుందరకాండ
సర్గ 65
1
నింగినిబడి పయనించి వానరులు
రమ్యమైన ప్రస్రవణ గిరిని దిగి,
రామునకు సుమిత్రాసుతునకు శి
రస్సులు వంచి నమస్సులు సలిపిరి.
2
యువరాజును ముందుంచుకొని, హరీ
శ్వరునిచేరి అభివాదములు సలిపి
సీతావృత్తము చెప్పుట కారం
భించిరి వేడుక వెల్లి విరియగా.
3
రావణు నంతిపురమున బందెపడి,
రాకాసుల తర్జనలను తెరలుచు,
రామునితోడ సమానముగా అను
రాగవ్యధలన్ కాగుచు నున్నది.
4
వారలట్లు తమ వార్తలు తెలుపుచు,
'సీత కుశలమని' చెప్పిన మాటలు
విన్నంతనె రఘువీరు డాతురత
అడిగె వానరుల కభిముఖుడై యిటు.
5
సీత యెచ్చట వసించుచునున్నది ?
దినములు గడుపును దేవి తానెటుల ?
నన్ను తలచి ఏమన్నది ? వైదే
హీ వృత్తాంతము నెల్లను చెప్పుడు.
6
రాఘవు డడిగిన ప్రశ్నలకు సమా
ధానము చెప్పగ వానరవరు ల
ర్థించి రపుడు, వైదేహికథాకో
విదుడగు హనుమను వేయినోళ్ళతో.
7
తనవా రర్థించిన మంచిదనుచు,
అనిల తనూజుడు హనుమంతుండును
శిరసువంచి దక్షిణముఖుడై సీ
తను స్మరించుచు కథనము మొదలిడెను.
8-9
సీతను అన్వేషింపగ దాటితి
నూఱామడల పయోరాశిని, ద
క్షిణ తటమున రావణుని నివాసము
లంకాపురము కలదు దుర్గమముగ.
10
అచట రావణుని అంతఃపురమున
తిలకించితి వై దేహిని రాఘవ !
తావక బద్ధ ధ్యానరతిని త
పించు నీ పయి అపేక్షలను నిలిపి.
11
రక్కసి మూకలు కక్కసపెట్టగ,
క్షోభిలు దేవిని చూచితి వనమున,
పగలు రేలు కావలియుందురు, వికృ
తాకారిణులగు రాకాసు లచట.
12
ఎట్టి కష్టముల నెఱుగక, సుఖముగ
ఉండదగిన నీ యోషారత్నము,
దుఃఖించును దైత్యుని యింట, నిశా
చరుల బందెలో నరకయాతనల.
13-14
ఏకవేణి బిగియించి, నీ పయిన
పంచప్రాణము లుంచి, కటిక ఱా
నేలమీద శయనించుచు రూపఱె,
మంచుపడ్డ కోమల కమలమువలె.
15
అన్నియు మఱచి, అనాశ్వాసిత మా
నసయై పడియున్నను; నే నిక్ష్వా
కుల సంకీర్తన సలిపినంతటనె
పునరాశలతో పులకలు మొలవగ.
16
దేవి తేఱి నాతో విశ్వాసము
చిగురొత్తగ భాషించె కుతుకమున,
తెలిపితి యావద్వృత్తాంతము, సు
గ్రీవుని మైత్రి నెఱింగి సంతసిలె.
17
సముదాచారము సహజం బామెకు,
అట్టులె నీయెడ అనురాగంబును
నిత్య నిష్ఠతో నిలిచియున్న; దీ
ఘోర సత్యమును గుర్తించితి నట.
18
చిత్రకూటమున చేరినపుడు నీ
సముఖంబందున జరిగిన వాయస
దుశ్చరితము నాతో చెప్పెను, నీ
కప్పగించుమని ఆనవాలుగా,
19
మఱియు దేవి నన్నరసి యిట్టులనె,
వాయుసుతా ! నీ వీయెడ చూచిన
నా దుర్ధ శనంతయు వినిపింపుము
నా మాటలుగా రామున కిట్టుల.
20
జ్ఞప్తి యుండు రఘునాథ ! నా నుదుట
చెరిగిన తిలకము నరసి నీ వపుడు
చెంతనున్న మణిశిల చాది స్వయము
బొట్టు పెట్టితివి, పోలు స్మరింపగ.
21-22
ప్రాణపదముగా పరిరక్షిచిన
ఈ చూడామణి నిమ్ము రామునకు,
సుగ్రీవుడు వినుచున్ కనుచుండగ
తెలుపుము నా పరిదేవన మంతయు.
23-24
నీటపుట్టిన మణి యిది, పంపితిని,
దీని గని ప్రమోదింతువు నీవని;
ఒక్క నెల బ్రతికియుందును రాక్షసు
చెఱలో, ఆవల జీవింపను ప్రభు !
25
అనుచు దేవి చెప్పెను నా కంతయు;
చిక్కి చెన్ను మాసినది మేను, రా
వణుని యింట చెఱబడి అల్లాడును,
కనులు తెఱచుకొని కన్నె లేడివలె.
26
తేటతెల్లముగ తెలిపితి నఖిలము,
రఘుకులేంద్ర ! వారాశిజలంబులు
దాట తగిన సాధన సన్నాహము
సర్వవిధంబుల సలుపు టవశ్యము.
27
రాజపుత్రు లూఱడిలి ప్రీతులై
నట్లెఱింగి; మణి ఆనవాలుగా
రామునకిచ్చి హనూమయు విరమిం
చెను సీతాభాషిత కలాపమును.