శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 61

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 61

                 1
అంతట అంగద హనుమత్ప్రముఖులు
జాంబవంతుని ప్రసంగ వైఖరికి
ప్రీతులగుచు, కపివీరులతోడ, మ
హేంద్రగిరి విడిచి యెగసిరి మింటికి.
                 2-3
హనుమ దారితీయ, మహాకాయులు
కపికుల వీరు లెగసిపో నగపడె,
మదపు టేనుగుల మందలు మందర
మేరు గిరులను భ్రమించుచున్నటుల.
                  4
పంచభూతముల ప్రస్తుతులందిన
హనుమ, ననఘుని, మహాజవసత్వుని,
వానరులందఱు వాచినట్లు చూ
పులతో మోసిరి పూజ్యభావమున,
                5-6
రామకార్య నిర్వాహకుల మనుచు
ఖ్యాతి కెక్కుకాంక్షలను వానరులు,
పగతీర్చెదమని ఎగబడిరందఱు,
యుద్ధమునకు సన్నద్ధులై కెరలి.

                7
అట్టుల ఉత్సాహముతో వనచరు
లెగురుచు దుముకుచు ఎగదిగ పరుగిడి,
చేరిరి పచ్చని చెట్లతోడ నం
దనము వంటి సుందర మధువనమును.
                 8
మధువనమను నామమున ప్రసిద్ధము,
పంచభూతములు బాధింపవు, సు
గ్రీవుడె సంరక్షించును ప్రీతిని,
ఎల్లప్రాణులకు ఇష్టధామ మది.
                9
వానరేశ్వరుని మేనమామ, దధి
ముఖుడను హరికుల ముఖ్యుడు దానిని,
కంటికి ఱెప్పగ కాపాడును, వన
పాలకు లెపుడును పరిచరింపగా.
                 10
పోవుచున్న కపిపుంగవు లందఱు
కాంచిరి మనసుల కాంక్షలు కదలగ,
ఫలపుష్పంబులు పరిమళింపగా,
తేనె లూఱు కపిదేవుని తోటను.
                11
జిడ్డు తేనియలు చిప్పిల్లెడి మధు
వనమును దరిసిన వానరవీరులు,
నోరూఱంగ, కుమారు వేడుకొని
రింత మధువు పోయింపుము మాకని.
              12-13
యువరా జంగదు డుల్లాసముతో
తల యూచెను; కిలకిలలాడుచు కపు
లాతని మెచ్చుచు, చేతులు తట్టుచు,
పాటలు పాడుచు పాతర లాడిరి.

                14
పాడిరి కొందఱు, వేడిరి కొందఱు,
ఆడిరి కొందఱు హాస్యము లాడుచు,
గిరగిర తిరిగిరి, బిరబిర పఱచిరి,
ఈలలు వేయుచు ఎగిరిరి కొందఱు.
              15-17
ఒకని హస్తముల నొకడు పట్టుకొను,
ఒకని బుజముల మఱొక్కడు తట్టుచు,
ఒకని చెవిని వేఱొక్కడు నలుపుచు,
ఒకరి నొకరు పలుకక పెడపోదురు.
                 ?
ప్రణుతించుచు, మఱి ప్రణమించుచు తమి
ఒకరినొకరు త్రోయుచు, ఎడబాయుచు,
క్రిందుమీదులయి చిందులు త్రొక్కుచు,
ప్రలపించుచు పరిపరి విలపించుచు.
                  ?
చెట్టునుండి కడచెట్టుకు దుముకుచు,
కొండనుండి అడుగుకు దిగజాఱుచు,
అతివేగమున మహావృక్షంబుల
సిగలమీది, కెదురెగసి యెక్కుచును.
                 ?
ఒకడు పాడ, మఱియొక్కడు నవ్వును,
ఒకడు నవ్వ వేఱొక్కం డేడ్చును,
ఒక డేడ్వగ ఇంకొక్కం డఱచును,
ఒక డఱచిన పరు డొక్క డూరకొను.
              18
పానము చేసిన వానరులు తెలివి
మాలిపోన్ , కనులు తేలగిల్లిపోన్
బడలిపడిరి; కనబడడు మత్తిలని
వాడును, తనియనివాడును వారల.

                   19
తేనె త్రాగి తలతిరుగ వానరులు
పచ్చని తోటను పాడుచేసి, రది
కని దధిముఖు డాగ్రహమున వచ్చి, ని
వారింప తొడగె భయభర్త్సనముల.
                   20
వనపాలకుడు, ప్లవగకులమాన్యు, డ
తని మాటలకు బెదరక మార్మసల,
కొఱకొఱలాడుచు కోతుల తోలెద,
వన వినాశమును వారించెద నని.
                  21
దర్పముతో కొందఱిని తిట్టి, కొం
దఱచేతుల అఱకాళ్ళను తా
డించె బలిమి, లాలించె చెలిమి, హరి
నయభయముల తంత్రంబులు మెఱయగ.
                   22
త్రాగిన కై పువ రేగి వానరులు,
ప్రతిరోధంబును పాటింపక , జం
కక, అటునిటు లాగదొడంగిరి దధి
ముఖు, నే దోషంబును లేకున్నను.
                23
గోళ్ళను గిచ్చుచు, కోరల కొఱుకుచు,
కరముల క్రుమ్ముచు, కాళ్ళను తన్నుచు,
పానమదంబున వానరు లెగబడి
మధువనమును ధ్వంసము కావించిరి.