శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 6
శ్రీ
సుందరకాండ
సర్గ - 6
1
ఇష్ట రూపముల నెత్తజాలు కపి
జానకి నచ్చట కానలేమి, దుః
ఖమున మునిగి శీఘ్రమే సమకట్టెను
లంక నాల్గుమూలలు గాలించగ.
2
సూర్యుని భాతిని జ్యోతిర్మయమై
బలముగకట్టిన ప్రాకారముతో
సర్వసంపదల సంశోభిలు దశ
ముఖు నంతఃపురము ప్రవేశించెను.
3
కంఠీరవములు కాననమున్ బలె
గండురక్కసులు కావలికాయగ,
దుర్గమమగు దైత్యుని నగరును గని,
కపికుంజరు డుత్కంఠితు డాయెను.
4
వెండిచట్టముల బిగియించిన చి
త్తరువులతో బంగరు తోరణములు,
అంచెలంచెలుగ నమరియున్న శి
ల్పంబులతో ద్వారంబులు వెలసెను.
5
ఏనుంగులపయి నెక్కు అమాత్యులు,
కాకలుతీఱిన కదనశూరులును,
అణచరాని మదహయములు కట్టిన
అరదములును నిండారియుండె పురి.
6
వెండితోడను పసిండితోడ గజ
దంతముతో కడు వింతగ చేసిన
రథములు తిరుగును రాజనగరి, శా
ర్దూల సింహముల తోలుగౌసెనల.
7
బహురత్నంబుల భాండారములు, అ
పూర్వభాండము, లమూల్యరత్నకం
బళము, లందలంబు , లరదంబులు, సు
ఖాసనము, లసంఖ్యాతము లొ ప్పెను.
8
బలిసిన పెంపుడు పక్షులు మృగములు
చిన్నెలవన్నెల శృంగారముగా
గుంపులు గుంపులు గునిసియాడు, వా
కిండ్ల నెల్లెడల కండ్లపండువుగ.
9
నియమసుశిక్షితులయిన రక్షకులు
వెలుపలితల కావలికాయగ, ము
ఖ్య - స్త్రీ జనముల కలకలములతో
నిర్భరమై యుండెను నగరంతయు.
10
ముదితారత్నంబులతో, వారల
రత్నాల నగలరవళితో తరం
గించు రావణుని కేళీసౌధము
మ్రోతలతోడి సముద్రము చాడ్పున.
11
రాజలాంఛనలు రాజిలుచుండగ,
మంచిగంధపరిమళములు సుడియగ,
వీరగణము పరివేష్టింపగ, సిం
హములున్న అరణ్యమువలెనుండెను.
12
దుందుభిమర్దళ బృందవాద్యముల ,
శుద్దశంఖముల శుభనిస్వనముల,
ప్రతిదిన పూజల , పర్వహోమముల,
ఆరాధింతురు అసురులు దానిని.
13
పారావారమువలె గభీరమయి,
సాగరమట్టుల మ్రోగుచు సతతము,
రత్నములును, గృహరత్నములును రా
ణించు రావణుని నిలయముగనె కపి.
14
మందయానముల మసలు నేనుగులు,
కదనుత్రొక్కు నడకలను గుఱ్ఱములు,
దీమసంబుతో తిరుగు రథమ్ములు,
లంకాభరణ లలామ మయ్యెనది.
15-16
ఆ సౌధము భయ మనక చొచ్చి, దశ
కంఠుని చెంతనె కలయతిరిగి, హరి
పాఱచూచెను భవంతులు, తోటలు
ఎక్కి దిగుచు ఒక్కొక్క అంతరువు.
17
అంతనప్రాకె ప్రహస్తుని భవనము
పై కి రయంబున, దూకె పిదప వీ
రాగ్రణియైన మహాపార్శ్వుని సౌ
ధాగ్రము మీది కనాయాసంబుగ.
18
కుంభకర్ణునకు కూర్చువాసమయి
మేఘము పోలిన మేడపై కెగసి,
దాని కవల శుద్ధముగానున్న వి
భీషణు శాంతినివేశము నరసెను.
19
పిదప మహోదరు ప్రియసదనమును, వి
రూపాక్షుని నిజకాపురము, నవల
విద్యుజ్జిహ్వుని వేశ్మము, నట్టులె
వజ్రదంష్ట్రుని నివాసగృహంబును.
20
శుక్ల సారణుల సుఖసౌధంబులు,
వీక్షించి, పిదప ఇంద్రజిత్తు శో
భాయమాన దివ్యాయతనంబును
అవలోకించెను ఆమూలాగ్రము.
21-22
జంబుమాలి నిలయంబు, సుమాలి గృ
హము, సూర్యశత్రు నాలయము, నటులె
రశ్మికేతు హర్మ్యము వెదకి, పిదప
వజ్రకాయుని నివాసమున దుమికె.
23-24
ధూమ్రాక్షుడు, విద్యుద్రూపుడు, భీ
ముడు నున్న గృహంబులు పరికించెను,
ఘన విఘనులు, వక్ర, వికట, శఠ, శుక
నాసులునున్న భవనములు చూచెను.
25
హ్రస్వకర్ణ దంష్ట్రకులు, రోమశుడు,
ఇంద్రజిహ్వుడును, హితుడు వజ్ర జి
హ్వుడు, మత్తుడు, యుద్ధోన్మత్తుడు, హ
స్తిముఖుడున్న నిలయములను కాంచెను.
26
చూచెను పిమ్మట, శోణితాక్షుడు, క
రాళ, పిశాచ, దురాసదులున్న వి
శాల నికేతన శాలాగృహముల
నొకటి వెనుక వేఱొకటి అరసె హరి.
27
ఎచ్చట చూచిన నచ్చట, సర్వ స
మృద్ధములయి అభివృద్ధి కిరవులయి,
భోగభాగ్య సంపూర్ణంబులుగా
కానబడెను లంకాభవనంబులు.
28
రూపురేఖల, నిరూఢవిభవముల,
సాటిలేని రాక్షసుల శుభ నికే
తనము లన్నిటిని దాటి, హనుమ స
మీపించెను లంకాపతి హర్మ్యము.
29-30
అచట రావణుని అంతికమందున
శూలముద్గర కరాళహస్తులను
వీక్షించెను వికృ తేక్షణలను కపి;
వివిధ శిబిరముల విడిసెను సేనలు.
31
వివిధాయుధముల వీగు మహాకా
యుల రాక్షసయోధుల నొక్కెడ, ఎ
ఱ్ఱని తెల్లని పచ్చని వన్నెల యే
నుగుల నొక్కెడ గనుంగొనె మారుతి.
32
కులమును రూపును వెలయబుట్టి, శి
క్షణములన్ నలగి గడితేఱి, రణం
బుల పరగజముల పొడిచి తరుము ఐ
రావతమున్ బలె రావణు గజములు.
33
క్రుమ్మరించు మేఘమ్ముల మాదిరి,
సెలయే ళ్ళురలి పొరలు కొండలవలె,
రణముఖముల మార్మసలి కసిమసగి
తాండవించు మాతంగ వ్యూహము.
34
బలసాహస కౌశల చిహ్నములుగ
కనక పతకములు గైకొన్న దనుజ
వాహినీ పతులు వందలు వేలును
పొడకట్టిరి కపిపుంగవున కచట.
35
పసిడి జరీదుప్పట్లను కప్పిన
వన్నెల చిన్నెల పల్ల కీలు చూ
పట్టెను హనుమకు, బాలసూర్య మం
డలముల చక్కదనాలు వెలార్చుచు.
36
లేత తీగె లల్లిన పొదరిండ్లును,
చిత్తరువులు రంజిలు చావళ్ళును,
చూడ చక్కనగు క్రీడాగృహములు
మ్రానికలపతో మలచిన నగములు.
37
పాన్పు లమర్చిన పడకటిండ్లు, అభి
రామములయిన విరామసదనములు,
రాక్షసేశ్వరుని రాణివాసమున
కండ్లపండువుగ కాంచె మహాకపి.
38
నెమలి గుంపులకు నృత్తశాల యగు
మందర పర్వత మకుట తలము వలె,
జెండాలాడెడి శిబిరంబులతో
ఇంపగు రావణు గృహము నరసె హరి.
39
బహురత్నములకు పట్టుకొమ్మయై,
నిధి నిధానముల నిక్షేపంబయి,
శిల్పసుసిద్ధికి సీమాంతంబయి,
ధనపతిధామంబును మఱపించెను.
40
రత్నాంగణముల ప్రజ్వల దీప్తులు,
రావణేశ్వరుని రాజసతేజము
కలసి పిక్కటిల కనబడె సౌధము,
రక్త కిరణముల రాజిలు రవివలె.
41
తీరు తీరు బంగారు మంచములు,
ఆస్తరణములు, సుఖాసనములు, తెలి
పట్టు జరీదుప్పట్లు పానుపులు,
పరిశుభ్రములగు పాన పాత్రములు.
42
మధువున తడిసిన మణిమణికంబులు,
వేఱువేఱుగా తీరిచియున్న కు
బేరుని భవనము మీఱి మెఱసె రా
క్షస రాజేశ్వరు శయనాగారము.
43
అందక త్తియల అందెల సందడి,
మొలనూళ్ల నొరయు మువ్వల రవళిక ,
తతమృదంగ వాద్యమ్ముల ఘోషము
మంగళోత్సవ సమంబుగ నుండెను.
44
లలనారత్నకలాపముతో కళ
కళలాడెడి మంగళముఖాంగణము,
లంతంత మనోహరముగ నొప్పెడి,
శోభన గృహమును చొచ్చె మహాకపి.
24-12-1986