Jump to content

శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 5

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 5

                   1
మిన్నుల నడుమను వెన్నెల పందిట,
పాలకెరటముల లీలగ చిలుకుచు,
ముచ్చటగా కనవచ్చెను చంద్రుడు;
ఆలకొట్టమున క్రాలుకోడెవలె.
                   2
లోక దోషములు పోకార్చుచు, జీ
వముల మహోల్లాసమున తనర్చుచు,
జలరాశి పయస్సులు పొంగించుచు,
శీతాంశుడు దివి సింగారించెను.
                   3
ముని మాపులను సముద్రుని శోభలు,
మంచినీట పద్మంబుల శోభలు,
ధాత్రిలోన మందరగిరి శోభలు,
మిళితమైనటుల మెరసెను చంద్రుడు,
                 4
వెండిగూటిలో పెంపుడంచవలె, ,
మందరగుహలో మద కేసరివలె,
పోతుటేన్గుపయి పోటుమగని వలె,
రజనీరమణుడు రాజిల్లెను దివి.

                   5
సూదికొమ్ముటంచుల వృషభమువలె,
ఎత్తునెత్తముల హిమనగంబు వలె
పొన్నుకట్లరదముల ద్విరదమువలె,
చెలువారెను సమశృంగంబుల శశి.
                    6
మంచు బురద కసుమాలము జాఱగ,
గ్రహ శోభావహ గత కలంకియై
సుప్రకాశ రోచుల శుభాంకుడయి,
బాసిల్లెను భగవానుడు సోముడు.
                    7
గిరి శిఖరము నెక్కిన సింహము వలె,
కదనము కదిసిన మదగజంబు వలె,
రాజ్యము గెలిచిన రాజన్యుని వలె
వెలసెను పూర్ణ కళలతో చంద్రుడు.
                  8
చంద్రోదయ శుచి జాఱెను చీకటి,
పెరిగె నసురులకు పిశితాశనరుచి,
మణగె మగువలకు ప్రణయదోషములు
స్వర్గభోగమనజాలె ప్రదోషము.
                  9
వీణలు మ్రోగెను వీనుల విందుగ,
ప్రియులతోడ నిదురించిరి పడతులు,
తిరుగవెడలె రాత్రించరజాతము
భయరౌద్రంబులు పయికొన నెల్లెడ.
                 10
మత్తెక్కిన దుర్మదుల సంకులము,
వీర శ్రీ శోభితుల సంభ్రమము,
రథ తురంగ మార్భటసంరంభము,
పిక్కటిల్లు పురవీధులు కనె హరి.

                11
ఒకరినొకరు వికటోక్తు లాడుదురు,
బుజముల బుజములు పొడిచి నవ్పుదురు,
కై పు రేగిన ప్రగల్భము లాడుచు
తిట్టుచు తిమ్ముచు తికమక పడుదురు,
                 12
మగువ లగపడిన తగిలి దువ్వుదురు,
ఱొమ్ములు విఱుచుచు చిమ్ముచు చేతులు,
చాపములూరక మోపుచు దించుచు,
చిత్ర చిత్రమగు చేష్టల చెలగిరి.
                 13
ఇంపుగ పలుకుదు రింతులు కొందఱు,
కొంద ఱలసి తూగుచు పవళింతురు,
సుందరముఖు లిక కొందఱు నవ్వుదు
రూర్పులు విడుతురు ఓర్వనియువిదలు.
                  14
గజశాలల ఘీంకారారవముల,
బుధుల సదస్సుల పూజారవముల ,
వీరజనుల నిట్టూరుపులను, పురి
బుసలుకొట్టు పాముల చెరువాయెను.
                 15
నానాసురుచిర నామధేయముల
ఖ్యాతిగణించిన యాతుధానులును,
బుద్ధిమంతులును, శ్రద్ధావంతులు
కనబడిరి మహాకపికి నగరమున.
                 16
సుగుణగణములకు, సుభగరూపములు
కనువర్తనులగు అసురులగని హరి
ఆనందించెను; అంతలంతల వి
కారరూపులు నగపడిరి కొందఱు.

                 17
కనబడిరచ్చట హనుమకు పిమ్మట,
వారి కులసతులు పరిశుద్ధచరిత,
లభిరూపవతులు, అనురక్తలు తమ
పతులపట్ల మధుపానము పట్లను.
                 18
రేలంతయు తమ ప్రియుల కౌగిలిం
తల నలిగిన నెలత లగపడిరి, మే
నుల వన్నెలు సిగ్గులను ముసుగుపడ,
పువ్వులపొర్లిన గువ్వల గోమున.
                   19
మెలతలు కొందఱు మేడలమీదను
ప్రియుల కవుంగిట పెనగి సుఖింతురు,
ఆచారవ్రత లయిన శుభాస్యలు
భర్తల యిష్టము తీర్తురు ప్రియముగ.
                   20
కోకలు జాఱిన గుబ్బెతల శరీ
రము లగపడె అపరంజి చాయలను,
విరహతాపమున వెలవెల బోయిన
వెలదులు శశిరేఖలవలె తోచిరి.
                   21
ఇచ్చకు వచ్చిన నెచ్చెలికాండ్రను
పొంది సుఖించిన అందకత్తెలను,
స్వగృహంబుల నిజవల్లభుల సరస
ముచ్చట తీఱిన ముగుదల నరసెను.
                   22
చంద్రుని శోభలుచల్లు ముఖములను,
వంగిన ఱెప్పల వాలికకనులను,
తొలకరి మెఱుపులు చిలుకు మంచి ర
త్నాల సొమ్ములు సరాలు చూచె కపి.

                23
కాని, కన్నులకు కనబడదాయెను
వాతాత్మజునకు సీత, రాజ కుల
జాత, ఫుల్ల పుష్పలతాభూత, ప్ర
పూత, శుభగుణోపేత, ఏకడను.
                  24
పరమ సనాతన పథమును వదలక
రాఘవ రాగపరాయణరతయై
భర్తృమనఃశ్రీపదనివిష్టయగు
సీత, కులస్త్రీజాతమతల్లిక.
                25
పసిడి కంటెతో మిసమిసమను మెడ
కంటి నీటి కాకల చాఱలుపడె,
వంపు కురుల ఱెప్పల కను లెరియగ,
ఉండె నడవిలో ఒంటి నెమలి వలె.
                26
తేటపడక కుందిన శశికలవలె,
బూడిద కప్పిన పైడి కాడవలె,
మొక్కపోయిన ప్రభువు కరాసివలె,
గాలికి తూలిన ఘనమాలికవలె.
                27
మానవేశ్వరుడు, మాన్య చరిత్రుడు
రాము, డతని భార్యను సీత నచట,
కానలేక కటకటపడి మారుతి
దుఃఖహతుండయి తోప మూడుగతి.
14-12-1966