శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 33

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 33


                   1
పండిన పగడమువంటి మోముతో,
వినయవినతమగు వేషముతో దా
సునివలె దగ్గరె ప్రణతులు సలుపుచు
వృక్షము దిగి కపివీరుండప్పుడు.
                  2
అతితేజస్వి, మహానిలతనయుడు,
శ్రీమన్మారుతి చేతులు రెండును
జోడించి శిరస్సున, వై దేహిని
పలుకరించె నర్మిలి మధురోక్తుల
                  3
ఎవరి యింటిదానవు పద్మేక్షణ !
కఱకు నారమడి కాసె చుట్టి, ఈ
చెట్టుకొమ్మ నొకచేత పట్టుకొని,
ఏల నిలువబడితీ వనాంతమున.
                  4
ఏటి కిటుల నీ కాటుక కన్నుల
సూరెల జాఱెడు శోకబాష్పములు,
మంచి తెల్లతామర పూఱేకుల
నుండి జాఱిపడు ఉదకంబులవలె.


                       5
సురు లసురులు, కిన్నర గంధర్వులు,
రాక్షస పన్నగ యక్షఖేచరుల
జాతులలో నీ జాతం బెక్కడ ?
ఎఱిగింపుము శరదిందు శుభానన!
                      6
రుద్రులగణమొ, మరుత్తులగణమొ, వ
సువులగణమొ మానవతీ ! నీ వె
వ్వరిదానవు తెలుపందగు; దేవత
భాతి నాకు చూపట్టెద విచ్చట.
                     7
చంద్రుని సందిలి జాఱిపోవ, వై
హాయసపథ మెడబాయ, అంతరి
క్షము విడిచిన నక్షత్ర కులములో
గణుతికొన్న రోహిణివో దేవీ !
                     8
మోహమొ కోపమొ ముసియింపగ, గురు
పాదు వశిష్ఠుని బాసి, ప్రవాసము
రోసి వచ్చిన అరుంధతీ భగవ
తివొ? కళ్యాణీ ! తెలియగ చెప్పుము.
                    9
సుతుడో, జనకుడొ, పతియో, భ్రాతయొ
కాలము తీఱగ ఈ లోకము విడి
పరలోకంబున కరిగిన ,నీ విటు
లాత్మశోకమున అదవద వనరెదొ ?

                   10
తెఱపి లేక రోదింతువు నిట్టూ
ర్పుల పొగలెగయగ, భూమినంటు చర
ణములు, రాజచిహ్నము లున్నవి; ప
ట్టపుదేవి వని తడయక తలంతును.


                   11
నీ యెడ నగపడు నేయే చిహ్నము
లాలక్షణముల నాకాంక్షించిన , .
ఏ పృథివీపతికో, పట్టమహిషి.
వయిన రాజకన్యకవని నమ్ముదు.
                   12
దశముఖుడు జనస్థానమునుండి, బ
లాత్కారముగా లాగి హరించిన
సీత వీవయిన చెప్పుము శుభమగు;
అడిగెద నిది రామార్థము సాధ్వీ !
                   13
చూడరాని నీ శుష్క దైన్యమును,
సాటిలేని నీ చక్కదనంబును,
తాపసి వృత్తము తఱచి చూడ, రా
ముని మహిషివి నీ వనుచు ధ్రువంబగు."
                   14
రమణీయముగా రామకీర్తనము
హనుమ ముఖంబున నాలకించి వై
దేహియు ఆనందించి, చెట్టుదరి
నున్న వానరుం డూకొన నిట్లనె.
                  15
జగతిలోని. రాజన్య లోకమున
వన్నె వాసిగల పార్థివ ముఖ్యుడు,
శత్రుసాదన యశస్వి దశరథుడు;
ఆతని కోడలినైతి పుణ్యమున.
                  16
విదితాత్ముడు, శ్రుతివేత్త, విదేహ ధ
రాధీశ్వరుడు, మహామతి జనకుడు,
ఆ పూజ్యుని తనయను, సీతను, నే
ధీమతి, రఘుపతి, రాముని భార్యను.
 


                   17
అఖిల భోగభాగ్య సమృద్ధమయిన
ఇక్ష్వాకు నృపుల గృహముల, పన్నెం
డేండ్లు వసించితి ఇష్టకామ్యములు
తీఱ సుఖంబుగ గౌరవంబుతో.
                  18
పదుమూడవయేట దశరథేశుడు
రఘుకులనందను రాజ్యంబున కభి
షేకించ తలంచి,వశిష్ఠుని చో
దన నుపక్రమించెను విధియుతముగ.
                 19
శ్రీరాముని అభిషేక మహోత్సవ
సంరంభము లటు సాగుచుండగా,
భర్తారునితో బ్రాతిమాలి కై
కేయి యిట్లు పలికెను పరుషంబుగ.
                 20
నీళ్ళు త్రాగ, నిక నిత్యభోజనము
చేయను, మామక జీవిత వృత్తమె
అంతమగును వసుధాధిప ! శ్రీరా
ముని అభిషేకము పూర్ణమయినచో,
                  21
నృపసత్తమ ! నీవపు డిచ్చిన ప్రియ
వాగ్దానము తప్పక యిప్పుడు జరు
గన్ వలె, పోవలె కానకు రాముడు,
కావలె కాగల కారణార్థములు.
                  22
సత్యసంధు, డిక్ష్వాకు కులీనుడు
దశరథుడును మును తా నిచ్చిన వర
ములను స్మరింపుచు మూర్ఛపోయె, కై
కేయీ కఠినోక్తి ప్రహరముల.


                      23
ధర్మమునకు సత్యమునకు కదలక
కట్టుబడిన యిక్ష్వాకుం డంతట,
జ్యేష్ఠుండు యశస్వియు నగు పుత్రుని,
యాచించెను రాజ్యము రోదించుచు,
                     24
అభిషేక ప్రాజ్యశ్రీ కంటెను
పితృవాక్య మతిప్రియమని రాముడు
మనసుచే మొదట అనుమతించి పి
మ్మట తెలిపెను సమ్మతి వాక్కులతో,
                     25
సత్యపరాక్రమశాలి రాఘవుడు
ఇచ్చుటమాత్రమె యెఱుగు, నెఱుంగడు
పుచ్చుకొనుట యెప్పుడును, అప్రియము
పలుకడు ప్రాణాపత్తిని సైతము.
                     26
పై పచ్చడ మావలనై చి, విడిచి
రాజ్యమ్మును సర్వము; భావించెను
నన్ను జన్నెగా కన్నతల్లి ప్రియ
హస్తంబులలో అప్పగించుటకు.
                     27
కాని, నే నతనికన్న ముందుగనె
సిద్ధమయితి వనసీమల యాత్రకు,
రామ సాహచర్యము లేనిది కాం
క్షింపను స్వర్గనికేతన మయినను.
                     28
అంతకుమున్నె మహాభాగుండు, సు
మిత్రా పుత్రుడు, మిత్రానందుడు,
నారగుడ్డలు పెనంచి కట్టి యా
త్రార్థుండాయెను అన్నతోడ చన.


                     29
జనపతి ఆ దేశము మన్నించి, దృ
ఢవ్రతులమయి వెడలి వచ్చితి మిటు
బుద్ధిపూర్వముగ; పూర్వము చూడని
గంభీరములగు కాంతారములకు,
                     30
దండక లోపల నుండగా మహా
బాహువు శ్రీ రఘుపతి పత్నిని నను,
కపటవేషమున అపహరించి కొని
వచ్చె నిచ్చటికి పాపి, రావణుడు.
                     31
కరుణించెను రాక్షసుడు రెన్నెలలు
ప్రాణముతోనే బ్రతికియుండుటకు,
రెండుమాసములు నిండిన వెంటనె
జీవితమ్మును త్యజింతు నిచ్చటనె.