Jump to content

శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 2

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 2

                  1
అట్లు, దాటుటకు అలవికాని పా
రావారము నతిరయమున దాటిన
హనుమ స్వస్థుడై యరసె త్రికూట శి
ఖరము మీది లంకానగరంబును.
                  2
కొండమీది మ్రాకు లురలి కురిసిన
పూల వానలన్ మునిగిపోయి, కపి
పుష్పమూర్తివలె పొడకట్టెను, పటు
వీరవిక్రమోదారుం డయ్యును.
                  3
నూఱామడల సుదూరము పఱచియు
అలసి సొలసి ఉసురసురని సొక్కడు,
ఉత్తమ విక్రమ సత్తాయత్తుడు
సాహసికాగ్రణి శ్రీ హనుమంతుడు.
                4
నూఱామడ లొక దూరమె ! పదినూ
ఱామడలయిన నికేమి ! దాటగా
జాలుదు; నాకీ సాగర లంఘన
మెంతటి దని హనుమంతు డుల్ల సిలె.

                5
అతిశయ వేగాన్వితులగు ప్లవగుల
లో నధికుడు, ప్లవమాన ప్రజ్ఞా
గణ్యుడు మారుతి; కావున వారిధి
దాటెను లంకను దరిసెను వేగమె.
               6
అచ్చట నేపగు పచ్చిక బీళ్లు, సు
వాసనల్ చెరుగు పచ్చితోటలు, శి
లావలయంబులు, లాతినగంబులు,
చోద్యముగా చూచుచు తిరిగెను హరి.
                 7
పెద్ద చెట్లు కప్పిన ఱాపడకల,
పూచిన వృక్షంబుల వనవీధుల,
ఇచ్చ మీఱ చరియించి మహాకపి,
దాటిపోయె నా కూటపరిసరము.
                 8
కొండ నెత్తమున కొంతసేపు నిలు
వంబడి క్రమ్మఱ పరికించెను కపి,
పచ్చని తోపులు, పఱగడ నడవులు
క్రాలుచున్న లంకానగరంబును,
               9
కర్ణికారములు, ఖర్జూరంబులు,
ముచుకుందంబులు, మొగలి పూ పొదలు,
ప్రేంకణములు నెడపెడల పుంజుకొని
కుటజ కదంబ నికుంజము లొప్పెను.
              10
పూచి పొలిచి పుప్పొడితో నిండిన
దేవదారములు, కోవిదారములు,
నీప, లెఱ్ఱగన్నేర్లు, ప్రియంగులు,
గుబురుకొనియె కోకొల్లగ నెల్లెడ .

                  11
పూచిన పువ్వుల మోతలతో, పూ
యని మొగ్గల సోయగముతో, కెరలి
యాడు పులుంగులతోడ, పయ్యెర లు
యాలలూప పొలుపారును తరువులు.
                  12
కలువలు తమ్ములు కవుగలించుకొన,
కారండవములు కలహంసములును
క్రీడించెడి దీర్ఘికలును, పలు తీ
రుల రమ్యసరస్సులును రంజిలును.
                  13
అన్ని ఋతువులను అడుగక ఉడుగక
పూచి కాచు తరువులును తీగెలును
వర్ధిల్లెడి ఉపవనముల వనముల
చూచె నవనవోత్సుకుడై పావని.
                 14
సకల భాగ్య సుఖసంపూర్ణుడు దశ
కంఠుడేలు లంకాపురికోట య
గడ్తలు విలసిలు కమలంబులతో
కలువలతో ఆ కాలము శుభముగ.
                 15
సీతను తో తెచ్చిన గిలి కెలకగ
బుగులుకొన్న దశముఖుతో, దానవ
భటులును తిరుగుదురటు నిటు నెల్లెడ
వేయికండ్లతో వేషధారులయి.
                16
పచ్చని కనక ప్రాకారముతో,
రమ్యమయిన నగరంబిది, అందలి
మేడ లచ్చముగ మెఱయు శరన్మే
ఘముల చాయల గ్రహముల యెత్తున.

               17-18
ఎత్తగు బురుజుల నెగురుచున్న జెం
డాలవరుసల, విశాలరథ్యలను
అచ్చము తెల్లనిరచ్చతోరణలు
కాంచె దేవపురి కైవడి లంకను.
               19
కొండనెత్తముల, మెండుగ కట్టిన
తెల్లని మేడలు నల్లని మిన్నుల
నంది పుచ్చుకొను నటులున్న లం
కా నగరంబును కాంచె మహాకపి.
               20
రాక్షసేశ్వరుడు రావణుండు పా
లింప బలిమి, నిర్మింప నేరిమిని
విశ్వకర్మ, వినువీధుల తేలెడి,
లంకను కపితల్లజుడీక్షించెను.
               21
ప్రాకారము మొలపట్టుగ, శూలము
లలకలుగ, బురుజు లాభరణములుగ,
జలధారలు వలువలుగ, మయుడు మన
సార కట్టిన ప్రియపురీమణి యది.
              22-23
కై లాసగిరి శిఖరముల కై వడి
గగనము నొరుయుచు, గాలిని చీల్చుక
యెగిరిపోవుగతి మిగుల నెత్తుగా,
సుఖనివాసములు శోభిలుచుండెను,
              24
నాగకులమునకు భోగవతి పగిది, ,
క్రూరరాక్షసుల కూటంబయ్యెను
ఎన్నగ నోపని యిష్టనగరి, యిది;
మును కుబేరు కాపుర మనుట నిజము.

                  25
కోరలు సాగిన క్రూరరాక్షసులు
పట్టసశూలము లిట్టటు త్రిప్పుచు
రక్షింతు రహోరాత్రము లీ పురి,
క్రూరసర్పములు కొండ గుహం బలె.
                 26
కట్టనిరక్షా ఘట్టమువలె లం
కను చుట్టిన ప్రాకారము నారసి,
ఘోరరాక్షసుల గూఢ రక్షణము
నంగబలము కపి ఆలోచించెను.
               27
ఈదగరాని మహోదధి నెటులో
గడచి వచ్చెదరుగాక వానరులు,
అది నిరర్థకము; కదనంబున లం
కను పట్టు టశక్యము సురల కయిన.
               28
బాహు విక్రమ ప్రథితుడె రాముడు
అయిన నేమిచేయంగల డిచ్చట?
పట్టగరాదీ పర్వత దుర్గము
గండు రక్కసులు కావలి యుండగ. .
              29
బలపరాక్రమోద్భటు లీదైత్యులు,
సామదానములు సాగవు, భేదము
పాఱదు, యుద్ధోపాయ మసాధ్యము,
కానరాదు అవకాశమింకొకటి.
              30
వానరయోధులనైన యీ పనికి
గతి నలుగురె; అధిపతి సుగ్రీవుడు,
వాలి నందనుడు, నీలుడు, నేనును;
ఏమి చేయదగు నీ దుస్సంధిని.

                31
ఎందుకిప్పు డీ ముందు విచారము ?
మొదట వెతకెద ప్రపూతను సీతను,
ఉన్నదొ లేదో ఉనికి తెలిసికొని,
ఊహింపందగు నుత్తర కార్యము.
              32
అనుచు పర్వతమునందె నిలువబడి
చిక్కబట్టి మనసొక్క నిమేషము,
రామ కామితార్ధపరాయణ రతి,
ధ్యానమగ్నుడయి తలపోసె నిటుల.
             33-34
ఈ రూపముతో నేను రాక్షసుల
దుర్గమ నగరము దూరు టశక్యము,
క్రూరు లుగ్రవీర్యుల నిశాచరుల
కనులు ప్రామి జనక జను వెతకెదను.
              35
కనబడీ కనబడని రూపముతో
చీకటిపడ చొచ్చెద నగరంబును
వీలు చాలు కనిపెట్టి నేను వ
చ్చిన పని సాధించెద యుక్తంబుగ.
              36
సురల కేనియు నసురలకేనియును
కాలిడ శక్యముకాని లంకలో
చొరబడి, దానిని చూచి, ఊరుపులు
పుచ్చుచు కపి తలపోసె నిట్లు మది.
               37
రావణు డధిక దురాత్ముం, డాతని
కంటబడక లంకానగరములో
ఏ యుపాయమున నేను మైథిలిని
వెదకి చూడకలుగుదును శీఘ్రముగ .