Jump to content

శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 1

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 1

1


అట్లు రావణుడు అపహరించి చని,
సీతను దాచిన సీమలు వెతకగ
తలపెట్టె నరిందముడు మహాకపి,
చారణులు తిరుగు దారి వెంబడిని,

2


అలవికాని అసహాయ దురాసద
కార్యమునకు సమకట్టిన మారుతి,
మోర యెత్తి, మెడ పొడవుసాచి, కన
నయ్యె ఆలలో ఆబోతుంబలె.

3


వైదూర్యమణుల వన్నెలతో సు
శ్యామలమయి, తడియాఱని పచ్చిక
బీళ్ళలో హనును విహరించెను, మం
దాలసగతి సుఖలాలసమతియై.

4


ఱొమ్ముతట్టి పడత్రో సెను చెట్లను,
పకుల నెడనెడ విక్షేపించెను,
హతమార్చెను పెక్కడవిమృగములను,
మదమెక్కిన సింహము చందంబున .

              5
ఆ మహేంద్రగిరిధామము, సహజము
లగు మాంజిష్ఠ సితాసిత ధాతు
చ్ఛాయలు దీపించగ, నిత్యోత్సవ
శృంగారము, చేసినయట్లుండెను.
              6
కాపురముందురు ఆ పర్వతమున
నాగ యక్ష కిన్నర గంధర్వులు,
ఇష్టరూపముల, నిచ్చవచ్చిన దు
కూల మాల్యములు తాలిచి సుఖముగ.
               7
భద్రగజములకు పాదుపట్టయిన
ఆ మహేంద్రగిరియందు మహాకపి,
కానవచ్చె లోతైన తటాకము
మధ్యనున్న మద మాతంగమువలె.
             8
భావించెను, పావని మది నప్పుడు
ముందు సాగుటకు పూర్వము, మరుదా
దిత్య దేవతాదికమునకు నమో
వాకము సలుపగ ప్రాంజలిపట్టెను.
             9
తూర్పు తిరిగి, చేతులు మోడిచి, తన
జనకు డనిల దేవునకు ప్రణతులిడి,
సవ్యముగా సాక్షాద్దక్షిణదిశ
కభిముఖుడై అంతంతలు పెరిగెను.
            10
తోడి వానరులు చూడగ, రాఘవు
కార్యార్థము సాగరము దాటుటకు,
పెంచెను దేహము విస్తారముగా;
పున్నమ దినమున పొంగు వార్దివలె,

                    11
అంతులేని లవణాబ్ది దాటుటకు,
మేను పెంచి మితి మిక్కటంబుగా,
త్రొక్కి కాళ్ళతో, గ్రుద్ది చేతులను,
మర్దించెను హమమంతు డా గిరిని.
                     12
చలనంబెఱుగని కులశైలము కపి
యించుకంత తాడించగ వణకెను,
వృక్షంబులు కంపించెను కమ్మని
పూలు రాసులై రాల నంతటను,
                    13
పట్టువదలి యటు చెట్లనుండి జల
జల రాలిన పువ్వుల కుప్పలు గు
ప్పించె సువాసన పెల్లుగ నెల్లెడ;
పూలకొండయై క్రాలె మహేంద్రము.
                  14
కపి బలిష్ఠమగు కాళ్ళ త్రొక్కిడికి
ఇట్టటులయి, సెలయేళ్లు పొర్లి పి
క్కటిలె గిరిని, మావటి కశఘాతల
మదపుటేన్గు మెయి మధుధారలవలె.
                 15
హనుమ పాద పీడనలకు పగిలిన
గండశిలలపై కాటుక జీఱలు,
వెండిచాఱలు, పసిండిగీఱలును,
పూజెలు పెట్టినపోల్కి బయల్పడె.
                16
రాపిళ్ళకు పర్వత మగలి, పగిలి
న మణిశిలల బండలు ఎగజిమ్మెను;
నడుమ మంటలు, కొనల జడి పొగలు,
త్రోయు వీతిహోత్రుని చందంబున.

                   17
ఆమూలాగ్రము నదవదయై కుల
గిరి మారుతి త్రొక్కిళ్ళకు కీడ్వడ ,
గుహల వసించిన బహు భూతంబులు,
వికృత స్వరముల విల విల మూల్గెను.
                  18
కొండ దెబ్బతిని ఘూర్ణిల్లగ బె
గ్గిలిన జంతువుల యెలుగుల ఘోషము,
పూరించెను పదిమూలల పృథివిని,
నగరోద్యానవనంబులు మ్రోగెను.
                  19
ఆ చప్పుడు విని అజగరములు స్వ
స్తిక లాంఛన ఫణ శిఖలు విప్పి, వడి
లేచి, విషజ్వాలికలు క్రక్కుచున్ ,
పట్టికఱిచె గిరి పాషాణములను.
                   20
గాఢాగ్రహమున కాకోదరములు
కాటువేయగా, కాళ విషాగ్నులు
తగిలి బ్రద్దలుగ పగిలి, మండె, పెను
కొండరాళ్లు వెయి తుండెతుండెలుగ.
                   21
ఆ మహేంద్రగిరియందలి ఓషధు
లఖిల విషఘ్నములయ్యు, నపుడు చ
ల్లార్పగజాలక వ్యర్థములాయెను,
క్రూరాహిక్షత ఘోర విషాగ్నుల.
                  ??
కపి బీభత్సముగా త్రొక్కిన గిరి
అతల కుతులమై అగలెను, బిలముల
పెనుబాములు రావిళ్లనలగి బయ
లెక్కెను నిప్పులు క్రక్కుచు విసవిస

                  ??
కంపించిన గిరి గహన వృక్షముల
రాలె చిగుళ్లును పూలును జలజల ,
నీలాంజన హరితాళ మణి శిలా
ధాతుద్యుతు లుత్కటముగ నెగసెను.
                  ??
తామ్రరుచులు, గందపు తెలివన్నెలు,
కానల గిరికొను నానా కాంతులు,
ధగధగ మెఱయగ నగముమీద, దీ
పావళి పండుగ ఠీవినితోచెను.
                 22
అపుడా శైలము అగలి పెకలెనని
తలచిరి మనసుల తాపసు లందఱు,
తరుణులతో విద్యాధరు లలసత
ఎగసిపోయి రెడనెడ వినువీధికి.
                 23
పానభూమిలోపల అమూల్యమగు
నానావిధ కాంచన భాండంబులు,
చూడ సొగసయిన పైడి కంచములు,
బంగారపు మధుపాన పాత్రికలు,
                24
నంజుట కింపగు నవ లేహ్యంబులు,
పక్వ మాంసములు, భక్ష్య భోజ్యములు,
గొడ్డుతోలుతో కుట్టిన యొరలును,
బంగారు పిడుల వాలుకత్తులును.
               25
ఎచటి వచటనె విడిచిపెట్టి చనిరి,
రక్తగంధ హారములను తాలిచి
త్రాగుచున్న విద్యాధరు, లెఱుపె
క్కగ తెలితామర కన్నులు కై పున.

                   26
కాళ్ళ నందియలు, కరముల క డెములు
ధరియించిన, విద్యాధర కాంతలు.
కాంతులతో ఆకసమున కెగసిరి,
చిఱునవ్వులు నచ్చెరువులు పెనగొన.
                  27
అంతలోన విద్యాధరులు, మహ
ర్షులు, తమ మహిమలు చూపగ, ఆకా
శమునందె నిలిచి, గుములుగూడి, వీ
క్షించుచుండిరి మహేంద్ర శైలమును.
                  28
ఆలకింపగానయ్యె వారపుడు,
చారణసిద్ధ మహా ఋషిగణములు
ఉప్పరవీధిని చెప్పికొనెడి అ
న్యోన్య సంగ్రహ యథాలాపంబులు.
                  29
అమిత వేగబలు, డచల సమానుడు,
అనిల తనూజుడు హనుమంతుం డిదె,
గండు మొసళ్ళకు కాపురమగు ము
న్నీటి నమాంతము దాట సిద్ధపడి.
                 30
రామార్థము, కపిరాజు నాజ్ఞ మెయి,
దుష్కరమగు ఉద్యోగము తలనిడి,
పొందగరాని సముద్రము వలపటి
గట్టెక్కగ కంకణమును కట్టెను.
                 31
అని భాషించు మహాత్ముల వచనము
లాలించుచు విద్యాధరు లందఱు,
అప్రమేయుడగు హరివృషభుని, కుల
పర్యంత పీఠముపై దర్శించిరి.

                    32
తోక కుచ్చు లలవోక విదిర్చెను,
కొండవంటి మెయి కుదిపి కదిల్చెను,
ఉద్భట మేఘము ఉరిమిన తెఱగున
గర్జించెను లోకము లాకులపడ .
                    33
చుట్లుతిరిగి కుచ్చుల కురు లింపుగ
చాలువారు లాంగూలము నటునిటు;
జాడించె; ఖగేశ్వరు డెడాపెడల
మద పన్నగమును విదిలించినగతి.
                  34
సాంతము చాచిన ఆయత వాలము
వెన్ను వెనుక దిగి వ్రేలుకాడబడె,
పక్షీంద్రుని నెఱవాడి గోళ్ళలో
తగిలి వాలబడు త్రాచుపామువలె.
                 35
పరిఘకాండములవంటి బాహువులు
నిశ్చలంబుగా నిగిడి నిలువబడ,
కాళ్ళు రెండు బిగ్గరగ ముడిచి, కటి
యుగము మోపి, కూర్చుండెను దృఢముగ.
                 36
పిదప కరములను బిగియకట్టి, కుది
యించి కంఠము, యమించె సత్వతే
జోవీర్యంబులు నావేశింపగ;
సన్నద్ధుండయి సామీరి యపుడు.
                 37
దూర దూరమగు దారి నరయుచున్
చూపులు మీదికిమోపి, ప్రాణముల
నాగబట్టి హృదయంబున, మారుతి
ఆకాశము నటు లవలోకించెను.

                  38
ఊదిపట్టి పదయుగమును దృఢముగ,
గాలి చొరవిగతి కర్ణముల్ ముడిచి,
బిగియపట్టి ఊపిరి యెగాదిగలు
ఉరవడించె నుప్పరమున కెగయగ.
                 39-40
పలికెను అభిజన వర్గముతో నిటు
రామాస్త్రమువలె వ్రాలుదు లంకను,
కాననేని జనకజ నచ్చోటను
ధావింతును సురధామంబునకే:
                41-43
జానకి అచటను కానరానిచో
ఆయాసమనక అతివేగంబున
తిరిగి పోయి దై తేయుని రావణు
కట్టి తెచ్చెద యెకాయెకి నిచటికి.
                  ★
సీత నెట్లయిన దో తెచ్చెద, చరి
తార్థుడనయ్యెద, అట్లుకానిచో
పిరిగొని లంకను పెళ్ళగించి రా
వణునితోడ సత్వర మేతెంచెద
               44
ఇట్లు తోడికపు లెఱుగబల్కి, వే
గోద్వేగ బల సముత్కటమతియై,
ఎగిరె మార్ద్యముగ, ఖగపతి కై వడి
వ్యోమ విహార మహోత్సవాభిరతి
               45
హనుమంతు డటు లాకాశమునకు
ఎగిరిపోవగా నగమున నెల్లెడ
పెకలిన తరువులు వేళ్ళతోడ కొ
మ్మలతోడుత వెంబడి పైకెగసెను
                

                  46
పులుగులతో పువ్వులతో నిండిన
శాఖలు వీడని సాల వృక్షములు
ఊరు వేగమున ఊగుచుండగా,
విహరించెను వినువీధి మహాకపి.
                  47
హనుమరయోద్ధతి కగలిన తరువులు
కూడ నరిగె నొక కొంత; దూరమున,
కరిగెడి యా ప్తుల అంపకాలకై
పంపగపోయెడి బంధుజనమువలె.
                 48
తొడల వడికి పాదులు పెకలిన మఱి
కొన్ని వృక్షములు కూడనె పోయెను;
ప్రభువువెంట భయభక్తులతో చను
సైన్య నివహముల చందము తోపగ.
                 49
కుసుమించిన లేగొమ్మల నొప్పెడి
వివిధ వృక్షముల వీధులు చుట్టిన
పర్వతంబుపై పవనతనూజుడు,
అగపడె చూపఱు లచ్చెరు వందగ.
                 50
భారములైన మహీరుహ శాఖలు
పట్లు' వదలి పడె వారిధి నడుమను,
దేవేంద్రుని భీతికి పర్వతములు
తోయధిలోపల త్రుళ్ళిపడ్డగతి.
                 51
దేహమునంటి విదిల్చిన వదలని
పలువన్నెల మొగ్గల పూవులతో
ఒప్పారెనుహరి ఉప్పరమందున;
మెఱుపులు పొదివిన మేఘము కైవడి.

                    52
హనుమ వేగమున కదిరిపడిన పూ
లచటనె నిలిచెను, ఆప్తమిత్రులను
పంపగ వచ్చినవారలు సలిలో
పాంత తటంబున ఆగిపోవుగతి.
                   53
అతని మహారయ హతి రాలిన తె
ల్లని పువ్వులు, నల్లని జలములలో
చూపట్టెను, వెలిచుక్కలు పొడిచిన
నీలాంబరమును పోలి అందమయి.
                    54
అతి లాఘవజవ గతి, గమనములకు
లేచిన సుడిగాలికి తొడిమలు విడ,
చిత్రముగా పడు సింధు జలంబుల
వివిధ ద్రుమ పల్లవ కుసుమంబులు.
                   55
కపి పరుగులవడి కకవికలై వా
రధి జలములలో రాలిన పువ్వులు,
కానవచ్చె ఆకాశతలంబున
అలరారెడి ముత్యపు ముక్కలవలె.
                  56
వేగముగా వినువీధి నేగు హరి
చాచిన చేతుల చందము తోచెను,
కొండ నెత్తముననుండి దిగు అయిదు
తలలపాముల జతరిబలె వెఱగొన.
                   57
ఎగసి యెగసి పయికేగుచు దిగబడు,
సాగర జలములు త్రాగవచ్చెనన
పైకిప్రాకు ఎగువాటముగా వడి
నింగిని మ్రింగ ననంగ మహాకపి

                    58
వాయుమార్గమున వడివడి వరుగిడు
కపి కేసరి తీక్షణ వీక్షణములు
మండుచు కనబడె కొండ నెత్తమున
వెలుగు జంట కొఱవుల చందంబున.
                  59
గోరోచన రుచిమీఱి, గుండ్రముగ,
వెలుగు హరీంద్రుని పెద్ద కన్ను గవ,
ఒక చో నప్పుడె ఉదయంబందిన
సూర్యచంద్రులన శోభిలుచుండెను.
                  60
ఎఱ్ఱని ముక్కును ఎఱ్ఱని మోరయు,
అగ్గలించె నన్యోన్యచ్ఛాయల,
సంధ్యా సావాసముతో రంజిలు
సూర్యమండలము శోభల చాల్పున.
                 61
వంక లేనటుల పై పయి కెగయగ
చాచిన వాలము చక్కన కనబడె,
కపి కేసరి స్వాగతమునకై దివి,
ఎత్తినట్టి దేవేంద్రు ధ్వజమువలె.
                 62
తెల్లనికోరల దీప్తు లెగయ, చ
క్రాకారముగా తోకచుట్టుకొన ,
మారుతి కనబడె మార్తాండుడు గుడి
కట్టి కూరుచున్నట్టుల దీటుగ.
                63
ధౌతతామ్ర రక్తములయి బలిసిన
పిరుదులతో కపివీరుం డొప్పెను,
చీల్చిన గైరిక శిలల జంటతో
గుబ్బతిల్లు పెనుకొండ చందమున,

               64
పారావారముపయి రివ్వున చను
కపి కంఠీరవు కచ్చల సందుల
దూసిపోవు వాతూలము మ్రోగెను,
జీమూతము గర్జించిన రీతిని.
               65
వాలమునెత్తి ప్రవాహవేగమున
చెంగనాలతో చెంగలించె హరి,
ఉత్తర దిక్కుననుండి చీల్చుకొని
దూకుచుపోయెడి తోకచుక్కవలె.
               66
క్రుంకుచున్న సూర్యునివలె దీర్ఘము
గానున్న మహావానరు డగపడె,
నడుము కట్టగా పొడ వెదిగిన మద
మాతంగంబు సమానముగా దివి.
               67
నింగిని కాయము, నీళ్ళను నీడయు,
తోడ్తో నడవగ తోచెను మారుతి,
గాలి త్రోపుడుపాలయి వారిధి
పై వడి నేగెడినావ విధంబున.
               68
ఏ ఏ వైపుల - నెగసె వాయుసుతు
డాయా చాయల తోయధిజలములు
గతివేగమునకు కల్లోలములై
పెరిగి విఱిగి పడె పిచ్చెత్తిన గతి
            69

కొండవంటి తన గండు ఱొమ్ముతో
పోటెత్తిన మున్నీటి తరగలను
ఎడత్రోయుచు తొడివడ పడి నెట్టుచు
మించి సముద్రము దాటు మహాకపి

                   70
కపి గతిరయమున కదలిన గాడుపు,
మేఘ భ్రమణము మీటిన వాతము,
కలిసి కలంచగ కడలి, అంతయును.
భీమ ఘోషమున బిమ్మిటిపోయెను.
                   71
ఉప్పెన రేగిన ఉప్పునీటి కెర
టాల కడలి గగ్గోలయి తూలగ,
అంతరిక్ష మిసిరింతల సుడివడ,
ధావించె సముద్రముపై మారుతి.
                  72
మేరు మందరాకారములుగ ఉ
ప్పొంగిన భూరితరంగ పంక్తులను,
లెక్క పెట్టు పోలికను వేగిరిం
చెను కపి సాగరమును తరించుతఱి.
                 73
హనుమగమనవేగాతిరేకమున
నురుగులు కట్టుచు పొరలిన వారిధి.
తరగ లాకసము తాక నెగసి శర
దభ్రంబుల చాయల నగపడె భువి.
                74
కడలి నీళ్ళు పాదెడలి పై కెగయ,
వెళ్ళబడెను తాబేళ్లు మొసళ్లు తి
మింగిల మీనము లంగవస్త్రములు
తీసిన జీవుల దేహంబులవలె,
                75
గగనమార్గమున నెగిరి పరుగులిడు
కపి శార్దూలము కాంచి గరుడుడని,
ఉదధి యిల్లుగా నున్న సర్పములు
వడకుచు ముడిగెను ప్రాణభయంబున.

                   76
వెడలుపు పదియామడలు, పొడవు ము
ప్పది యామడలుగ వ్యాపించిన కపి
మేని నీడ బింబించె నందముగ
క్రింద మహార్ణవ కీలాలంబుల.
                   77
వాయుమార్గమున వడిధావించెడి
హనుమంతుని వెనుకనె చనునీడలు,
లవణార్ణవ సలిలంబుల తేలెను
శ్వేతాభ్ర ఘనశ్రేణి విధంబున .
                  78
అతి తేజస్వి, అనంతకాయుడు మ
హాకపి నిగిడి నిరాలంబ మయిన
వాయుమార్గమున పరుగిడుచుండెను:
పక్షంబులుగల పర్వతంబువలె.
                 79
బహు బలిష్ఠమగు వానర యూధప
మే దెస నారోహించె రయోద్ధతి,
ఆయా దెసను మహావారాన్నిధి
కుదిసి సుళ్ళుపడి, క్రుంగి దొప్పగిలె.
                80
పక్షుల గుంపున వ్రాలిన గరుడుని
కరణి, మేఘముల కలచి లాగు సుడి
గాడుపు కై వడి, కపివీరుడు వడి
పఱచుచుండె నంబరవీధింబడి.
                81
మసలెడి మబ్బుల ముసుగులలోపల
చాటగుచును బాహాటం బగుచును,
ఆకసమున నడయాడెను మారుతి;
దాగుడుమూతల రాగిలు శశివలె.

                82
కపిదోర్దండాఘాతల పిగిలిన
మబ్బులు మెరసెను మలక వన్నెలను,
పాల తెలుపులై , నీలిచాయలయి,
పచ్చి పసుపులై , పండు కెంపులయి.
                83
గాలిలో నటుల తేలియాడు పటు
వేగశాలి కపివీరుని చూచుచు,
పువ్వుల వానలు బోరున కురిసిరి
తనిసి దేవ గంధర్వ చారణులు.
              84
రామభద్రు కార్యత్వర నేగు మ
హావానరు నిష్టార్థసిద్ధికయి,
తాపము కొలుపడు తపనుడు, పవనుడు
ఇవతాళించును హితముగ ఇరుగడ.
                85
అలయక ఆగక ఆకసమున బడి
చనుచున్న మహౌ జస్విని చూచుచు
తనిసిరి ఋషిసత్తములు, దేవతలు
పొగడిరి, గంధర్వులు కొనియాడిరి.
               86
ఆకాశమున నిరాయాసముగా
పయనించు మహావానరు చూచుచు,
యక్ష పన్నగులు రాక్షస విబుధులు
హర్షించిరి ఉత్కర్షులై తలరి.
                 87
తారాపథమున బారలు సాచుచు
వేగవేగముగ సాగు హరిని గని,
ఇక్ష్వాకుల స్నేహితుడు సముద్రుడు
చింతించెను తన చిత్తమునం దిటు.

                   88
వానరేంద్రునకు వలసిన సాయము
చేయకున్ననే నీ యవసరమున,
చెప్పుకోతగిన శిష్టులెల్ల నిం
దింతురు న న్నవీధేయుడ నంచును.
                  89
ఇక్ష్వాకుల కులహిమకరుం డయిన
సగర నృపాలుడు సాకెను నను మును,
ఇక్ష్వాకుల కతి హితుడగు నీతడు
ఇంత కష్టపడ నీయరా దిపుడు.
                 90
కావున నీతడు గాసి తీర్చుకొను
వీలు పన్నుటయె విధి నాకిప్పుడు,
ఇంచుకంత విరమించిన సుఖముగ
పోవచ్చును తన భావికార్యమున.
                 91
ఇట్లు మదిని ఊహించి సముద్రుడు,
అడుగు మట్టమున అణగియున్న మై
నాకు హిరణ్మయు, నగ సత్తముతో
వలికె తన మనోభావ మచ్చువడ .
                92
పాతాళ భువన వాసులు దైత్యులు
ఉర్వివయికి రాకుండ సురేంద్రుడు,
అలవిగాని యొక అడ్డగోడగా
నిక్షేపించెను నిన్నచ్చట మును.
               93
జాత బలిష్ఠులు దైతేయులు క్ర
మ్మఱ పరాక్రమము కెరల లేచి పా
తాళ ద్వారము బాటవచ్చినపు,
డడ్డగడియవై ఆపుచు వారిని.

                   94
పైకిని క్రిందికి ప్రక్కకు పెరిగెడి
శక్తికలదు గిరిసత్తమ నీయెడ
కావున చెప్పెద కార్యము కలదిట
లెమ్ము మీదికిన్ రమ్ము నిజాకృతి
                  95
వానరవంశ వివర్ధనుండు వీ
రాతివీర సాహసికుం డీతడు
హనుమ శ్రీరాముకార్యార్థము నీ మీ
దుగ నాకసమున నెగిరిపోయెడిని.
                 96
నాకు పూజ్యు లిక్ష్వాకు కులీనులు,
నీకును ఆదరణీయులు, వారిని
అనువర్తించు మహాత్ముని కితనికి,
సాయపడుట మన సహజ ధర్మ మగు.
                 97
కావున సమయము గడవకమునుపే
సహకరింపు మీ సచివకార్యమున,
స్నేహకృత్యమును చేయక తడసిన
గురువులు పెద్దలు కోపింతురు సుమి !
                98
లెమ్ము లెమ్ము, సలిలమ్ముల ముసుగులు :
విడివడ, మీదికి విచ్చేయుము సఖ !
పూజ్యుడు కపిసోముడు మన కతిథిగ
నిలుచుగాక నీ నెత్తమునందున.
                 99
నిను భజింత్రు సురలును గంధర్వులు,
కనక కలశ మంగళ శేఖరుడవు,
నీ యంతికమున నిలిచి మహా కపి
సాగిపోవును యథాగతి పిమ్మట.

                100
కరుణాళుడు రాఘవుడు, ప్రవాస వి
షాదిని మైథిలి, సామీరి యితడు;
వీరి వెతలు భావించి, నగాగ్రణి !
మీదికి రమ్మిది మిత్రుల ధర్మము.
                101
సాగరుడాడిన సాధూక్తులు విని,
పైకి లేచె మైనాకుడు; తోడ్తో
తోయధి జలములు త్రుళ్ళి సుళ్ళువడి
తరులును తీగెలు తరలి వెంటరాన్.
                102
దీప్త కిరణముల దినమణి యెట్టుల
కాలమేఘములు చీలిచి బయలగు,
అటు లగాధతోయధి జలంబులను
భేదించుచు గిరి మీదికి వచ్చెను.
               103
సాగరు నాదేశము మన్నించుచు,
నీటిలోపల మునింగియుండియును
లేచివచ్చెను మహాచలంబు తన
కనక శిఖరములు కనబడ మెఱయుచు.
               104
పన్నగ కిన్నరులున్న హిరణ్మయ
శృంగము లపు డీక్షింపగ నాయెను,
అరుణకిరణమాల్యముల పోలి ఉ
ప్పరమును రాయుచు కెరలుచున్నగతి,
               105
శైల శిఖరములు స్వర్ణచ్ఛాయలు
వెదజల్ల నెడాపెడ నుజ్వలముగ,
ఇనుప పొలము పోలిన ఆకాశము
పసిడి పంటలన్, మిసమిసలాడెను.

                 106
అచ్చపు మేలిమ నతిశయించు శిఖ
రము లెగసి స్వయంప్రభలను చిమ్మగ,
రాణించెను నగరాజు 'నూరుగురు'
సూర్యులు పొడిచిన శుద్ద శోభలను.
                  107
తనముం దసంగతముగా, వారిధి
నడుమ లేచి నిలబడిన గిరిని గని,
అనుమానించెను హనుమంతుం డది
విచ్చేసిన ఒక విఘ్నభూతమని.
                 108
అతివేగ బలోద్దతుడు మహా కపి,
వజ్ర కఠినమగు వక్షంబు నడచి,
పడత్రోసెను పర్వతము నమాంతము,
ఝంఝావాతము జలధరమునువలె.
               109-111
ఱొమ్ముతాకునకు దిమ్మతిరిగి పడి
హరి బలవేగము నెఱగి ప్రీతుడయి,
మానుషరూపము పూని నగేంద్రుడు
వానరేంద్రుతో పలికె నెలమినిటు.
                 112
అతి దుష్కరకార్యము సాధింపగ
సమకట్టితి విచ్చట కపిసత్తమ !
ఇంచుక నా శిఖరాంచల శయ్యల
విశ్రమింపుమీ వేసట జాఱగ.
                113
రఘుకులీను లగు రాజఋషుల ప్రే
ముడిని సముద్రుడు పుట్టెను పొదలెను,
రాఘవ హితకార్య వ్రతు ని న్నిత
డర్చించుటకయి అర్థించు నిపుడు.

                114
ఉపకారికి బదు లుపకరించుట స
నాతన ధర్మము; ఈతడు నిను పూ
జించి, సుకృతి కానెంచి, పిలిచి
ప్రేరేపించె హరీ! నన్నిటుల.
               115
నూఱామడలు సుదూరమొక్క మొగి
ఎగసి మీదుగ పరుగులెత్తు హనుమ,
నీ నెత్తములను నిలిచి సుంత వి
శ్రాంతి తీసికొని సాగి పోదగును.
              116
అనుచు సముద్రుడు నను బోధింపగ
నీ నిమిత్తమయి నేనిటు లేచితి,
కాన నీవు నాకడన నిలిచి, వి
శ్రాంతిని గైకొని సాగిపోదగును.
               117
నా యింటి సుగంధములు కందమూ
లముల నారగింపుము, సెలయేటి జ
లముల నాస్వదింపుము, సేదలు తీ
ర్చుకొని పొమ్ము రేపకడ మహాబలి!
                118
సుగుణోన్నతుల నెఱిగి పూజించుట
ముల్లోకములను ముఖ్యాచారము,
మాకుకూడ సంబంధంబున్నది
నిను పూజించి తనియుటకు హరీ!
               119
ఎగురజాలు జీవగణంబులలో
ప్లవగులు ముఖ్యులు; వారల లోపల
నిను ముఖ్యునిగ గణింతు నిరంతము,
భావమునందున పవననందనా!

              120
అల్పుండయినను అతిథి ప్రాజ్ఞులకు
పూజార్హుడుగద ! పుణ్యంబున నీ
వంటి అతిథి భగవానుడు దొరికెను
ఏమివలయు నాకిక ధర్మార్థికి.
               121
దేవత లందఱలో వరిష్ఠుడగు
మాతరిశ్వునకు ప్రీతిపుత్రుడవు,
జవసత్వంబుల సాటివత్తు వా
మేటి కీవు, రిపుకూటకులాంతక !
               122
నీ కర్పించిన నిష్ఠలుపూజలు
జనకు వాయుదేవుని తనియించును,
అందువలన నిపు డర్చింతును నిను,
కల దందుల కొక కారణ మది విను.
              123
మునుపు కృతయుగంబున పర్వతములు
ఱెక్కలుండ, నవి రివ్వురివ్వుమని
ఎగురసాగె నెగదిగ దిగంతముల;
పవన సువర్ణుల జివ సంభ్రమముల.
               124
ఆ పర్వతముల యాతాయాత వి
హారములను ఏమారి కూలునని,
శంకించిరి భయ సంకటమతులయి,
మునులును దేవతలును భూతములును.
              125
అది యెఱగి సహస్రాక్షుడు ఇంద్రుడు
కుపితుండయి తన కులిశాయుధమున
ఖండించెను ముక్కలుముక్కలుగా,
పర్వతముల నిజపక్షబంధములు.

               126
క్రుద్ధుడయిన ఇంద్రుడు వజ్రాయుధ
మె త్తి నావయిపు కేతెంచిన తఱి
సుడిగాడుపువలె వెడలి సమీరుడు
చుట్టి నన్ను పడనెట్టె వారిధిని.
                127
నీ జనకుడు కరుణించిన కతమున
దక్కెను నాకీ ఱెక్కలు పావని !
అది మొద లీ లవణార్ణవమున ఱె
క్కలను ముడుచుకొని కాలము గడపుదు.
              128
రక్షించెను నను పక్షంబుతో
కాన , నాకు భగవానుడు పూజ్యుడు,
ఇది మన బాంధవహేతు, వందుచే
మాన్యుడ వీవును మాకు మహాకపి !
              129
ఇట్లు నడిచె మును పీ వృత్తాంతము
కావున, కపిశేఖర! నీ విచ్చట
విశ్రాంతిం గొని, ప్రీతుడవై , మము
ప్రీతుల జేయు మభీష్టము తీరును.
              130
అపనయింపుము ప్రయాసల వేసట,
అందుకొనుము మా అతిథి పూజలను,
బహుమానింపుము సుహృదుల ప్రీతిని,
ప్రీత మనస్కుడనై తిని నినుగని.
              131
నగవరుడగు మైనాకుని పిలుపును
ఆదరించి బదులాడె నిటుల హరి,
ప్రీతుడనై తిని "ఆతిథ్యము గ్రహి
యించ” ననుచు భావించి కినియకుము.

                    132
కాలము చాలదు, కార్యము మించును,
నడుమ నెచ్చటను తడసి మసలనని
బాసచేసి నే బయలుదేరితిని,
క్షమియింపుడు నను కార్యాతురుడను.
                  133
ఆదరవచనము లాడుచు నిట్టుల
హనుమయు నపుడా అచలవతంసుని
తాకి కరంబుల తనిపి నవ్వుచును,
ఆకాశంబున నరిగె యథాగతి.
                 134
అంత సముద్రుడు నచలేంద్రుడును స
మీర నందనుని గారవమున నీ
క్షించుచు పూజించిరి, దీవించిరి
మనసారగ సమ్మదమున పొదలుచు.
                 135
శైల సముద్రుల సాంగత్యము విడి,
బహుదూరము ఉప్పరము పయింబయి,
తండ్రి మహానిలు దారి నందుకొనె,
అచ్చమయిన బహిరాకాశంబున.
               136
మిక్కిలి యెత్తుగ మిన్నులు తన్ను చు
ఊతలేని దివినుండి, సాగరుని
మైనాకుని సమ్మదమున చూచుచు
పోవుచుండె కపి పుంగవు డయ్యెడ .
               137
ఆ రెండవ కార్యమును చూచి "యె
న్నం డిట్టిది కన్నది విన్నది లే,”
దతి దుష్కరమని నుతియించిరి, సుర
చారణ సిద్ధ మహాఋషు లందఱు.

                  138
అచటనున్న అమృతాంధసు లానం
దించిరి, హనుద్విశ్రామార్థము
హేమ శిఖరముల నెత్తిన మైనా
కుని గని, ఇంద్రుండును హర్షించెను.
                  139
శ్రీమంతుండు శచీ మనోహరుడు
ముదితుండై గద్గద కంఠముతో
స్వయముగ నిట్టుల పలికె హిరణ్మయ
నాభుని, మెరసెడి నగనాథుని గని.
                 140
హేమనాభ ! శైలేంద్ర ! సంతసిం
చితిని నీవు చేసిన కార్యమునకు;
ఇచ్చితి నభయము, నింక స్వేచ్ఛగా
సుఖియింపుము ప్రస్తుత సువ్రతివయి.
                141
శతయోజనముల జలధినిదాటగ
విక్రమించె నిర్భీతి నీ హనుము,
సాయపడితి విష్టముగ నీ భయ
క్లిష్ట సమయమున గిరికుల భూషణ !
               142
దశరథ పుత్రు డుదాత్తుడు రాముడు,
అతని దూతగా నరుగు మారుతికి
అతిథి సత్క్రియల నాచరింపగా
వచ్చితి, వియ్యది మెచ్చించెను నను.
               143-144
అప్పుడు, తుష్టండయి ప్రసన్నముగ
ఉన్న మ హేంద్రు మహోదయు చూచుచు,
పర్వతేంద్రుడును పరమహర్షమున
తనిసి నిలిచెను యథాస్థావరమున.

                 145
ఇంతలో హనుమ యెగసి చనుటగని,
సురలు సిద్ధులు ఋషులు గంధర్వులు
పలికిరి, సూర్యప్రభలతో వెలుగు
ఉరగమాతయగు సురసను కనుగొని.
               146
అనిల తనూజుడు హనుమంతుడు వా
రాశి దాటు నాకాశమార్గమున
క్షణమాత్రము విఘ్నము కావించుము,
ఊతలేని యీ ఉప్పరవీధిని.
               147
రక్కసి ఆకారముతో, ఆకస
మంట పెరిగి, పింగాక్షులు ఘూర్ణిల,
కోరలు సాచుచు, నోరు తెఱచుకొని,
కదలక నిలువుము కపి కట్టెదుటను.
              148
నీ సమక్షమున నిలిచి, యెదిర్చి, జ
యించి పోవునో ? ఎడదారినిబడి
దేవురించుచున్ తిరిగి పోవునో,
చూడవలతు మీ శూరుని బలమును.
              149
దేవతలిట్లు నుతించుచు పలుకగ,
నాగమాత చెలరేగిన బులుపున,
రక్కసి రూపున ఱంపిల్లుచు భీ
కరముగ లేచెను కడలికి నడుమను.
              150
వికృత వికారవిభీతిభూతమగు
రూపుతో సురస, యేపుమీఱి చను
హనుమ మార్గమున కడ్డకట్టగా
చుట్టుముట్టి నిష్ఠురముగ పలికెను.

                151
ఈశ్వరుండె పంపించె నిన్ను నా
కాహారముగా హరికులపుంగవ !
భక్షింతును నా వక్త్రమును ప్రవే
శింపుము ఆలోచింపక తడయక .
               152
గండ్రవోలె కక్కసములు పలుకుచు
కదల కలక్ష్యముగా నటు నిలిచిన
రక్కసి సురసకు, ప్రాంజలి మోడిచి
హర్షముఖుండయి హనుమ యిట్లనియె.
             153
దశరథ నృపపుత్రకుడు రాఘవుడు
భార్య సీతతో భ్రాత లక్ష్మణుడు
వెంబడించగ ప్రవేశించెను శప
థము పాలింపగ దండకావనము.
             154
బద్ధవైర మేర్పడె దైత్యులతో
రావణు డాకారణమున రాఘవు
భార్యను, సీతను, పరమయశస్విని,
అపహరించి చనె, నతడు లేనపుడు.
             155
రాముని పనుపున రాయబారినై
వెడలితి సీతను వెతక నేనిటుల,
నీకును విధియగు నీ కార్యంబున
సాయపడుట , దాశరథుపౌరవీ !
            156
ఇది కాదంటివయేని ముందుగా .
నీత మనికి లక్షించి, తదర్థము
తెలిపి రామునకు, తిరిగివచ్చి నీ
వక్త్రము చొత్తును, బాసజేసెదను.

                157
అనుచు బాసచేసిన హనుమను విని
ఇచ్ఛారూపిణి యిట్లనె సురసయు,
అలవికాదు న న్నతిక్రమించగ,
వరమిట్టిది నా కెఱుగుము వనచర !
              158
అపసరించి తన్నావల బోవగ
చూచు కపినిగని సురస యిట్లనియె,
హనుమంతునినిజ పరాక్రమ బలములు
తెలియగోరి యేతెంచిన దగుటను.
             159
కాదు కాదు శాఖామృగశేఖర !
పడవలె నీవిప్పుడె నా నోటను,
తప్పుకొనగ సాధ్యము కాదెట్లును,
బ్రహ్మయిచ్చె నీ వరము నాకు మును.
              160-161
అని నోరు తెఱచుకొని నిలువబడిన
దాని చూచి క్రోధముతో ననె హరి
భూతంబా ! విప్పుము నీ వక్త్రము
నన్ను మ్రింగతగునంత వెడల్పుగ.
                162
దశయోజన విస్తరముగా పెరిగి
అఱచు సురసతో అట్లు పలికి హరి
తన దేహము పెంచెను దశయోజన
విస్తీర్ణముగా విపరీతాకృతి.
                163
పదియోజనమున పఱపున మేఘము
కై వడి వీగెడి కపిరూపము గని,
ఇరువదామడల విరివి నెగడ తన
నోరు తెఱచె విడ్డూరముగ సురస.

             164-165
కోరలు నిగుడగ ఘోరనరక గ
ర్తమువలెనున్న సురస నోరారసి,
కుంచె దేహ మంగుష్ఠమాత్రముగ
బుద్ధిశాలి కపిపుంగవు డప్పుడు.
               166
వెంటనె వానరవీరుడు సురసా
వక్త్రబిలములోపల చొరబడి, వడి
దాని దేహము యథాయథలుగ ఛే
దించి, వెడలి, మీదికెగసి, యిట్లనె.
               167
నీదు నోటిలోనికి చొచ్చితి, వి
చ్చేసితి; నన్నాశీర్వదించి, సెల
విమ్ము నాకు, పోయెద దాక్షాయణి!
సీతను దాచిన చేలకు వేగమె.
              168
రాహుముఖ వినిర్గతుడగు శశివలె,
తన ముఖకందరమునబడి వెలువడి,
వెలుగుచున్న కఫివీరుని చూచుచు,
పలికెను నిజరూపముతో సురసయు.
             169
పొమ్ము! యథాసుఖముగ శుభమగు; నీ
యిష్టార్థము ఫలియించును పావని !
రఘుకులతిలకము రాముని పజ్జకు
జనకసుతను సీతను పొందింపుము.
             170
హనుమంతుడు చేసిన మూడవ దు
ష్కరకార్యంబును కాంచి భూతములు
'సాధుసాధ'ని ప్రశంసాగీతల
కీర్తించిరి ఉద్గ్రీవస్వరముల.

              171
శిశిరోదకములు చిందెడి మార్గము
పక్షులు పోయెడి అక్షయమార్గము
సాధు కై శికాచార్యుని మార్గము
ఐరావతము నడాడెడి మార్గము.
             172
హరిశార్దూల విహంగ భుజంగమ .'
వారణములు చను వాహన మార్గము
బహువిమాన విభ్రమ విన్యాస క
లాపంబుల సమలంకృత మార్గము,
            173
వజ్రాయుధ దుర్భర ఘాతలచే
పెకలి యెగసిపడు పిడుగుల రాపి .
ళ్లకు లేచిన జ్వాలలమాలల సా.
లంకృతమయిన నిరంకుశమార్గము.
            174
పుణ్యులు, క్రతుఫలపూర్ణులు, నక్షయ
భోగము లందగ పోయెడి మార్గము,
అమృతములగు హవ్యములు మోసికొని
పావకు డేగెడి పావనమార్గము.
            175
గ్రహములు, నక్షత్రములు, చంద్ర సూ
ర్యులు చరియించెడి జ్యోతిర్మార్గము,
నాగ యక్ష గంధర్వమహాఋషి
సంకులమగు కూలంకష మార్గము.
             176
విమలము, వితత వివిక్తము, విశ్వా
వసు సేవితము, దివస్పతి యేనుగు
తిరిగెడి మార్గము, దినకర రజనీ
కర విహార మార్గము, శివమార్గము.

               177
విధి నిర్మించిన వితత వితానమయి
విద్యాధరకుల విబుధ గణంబులు,
సంసేవించు విశాల మార్గమున
పక్షీంద్రునివలె పఱచె మహాకపి.
               178
అతివిశాలము, నిరాలంబనమగు
వాయు మార్గమును పట్టి గరుత్మం
తుని వలె చనుచుండెను హనుమంతుడు,
జీమూతములను చీలిచి చిమ్ముచు,
              179
కపియూధపు పటు గాఢ తాడనల
చెల్లాచెదరై నల్లని మబ్బులు
మిసమిస మెఱసెను పసుపుపచ్చలై
పండు కెంపులయి పాల తెలుపులయి.
             180
వెనుకముందెడా పెడగొట్టిన
శ్యామలాభ్రముల సందిలిసందుల
వానరు డగపడె వానాకాలపు
చంద్రు చందమున చాటయ బయలయి.
           181
అనిల తనూజుడు హనుమంతుండు, ని
రాలంబ నభం బంతయు తానయి,
ఖేచరులకు వీక్షించనయ్యె, వ్రే
లాడు ఱెక్కల కులాచలమట్టుల,
             182
ఆ లీలన్ దివి తేలియాడుచున్
ఎగసిపోయెడి కపీంద్రుని గని, సిం
హికయను రాక్షసి, ఇచ్ఛారూపిణి
తలపోసెను. మది తనువు పెంచి యిటు.

             183
కూడు లేక అల్లాడుచుంటి చిర
కాలముగా, సంఘటితంబాయెను
నేటికొక్క మహనీయ సత్వమిటు,
ఆహరింతు నా యాకలి తీఱగ.
            184
చింతించుచు నిటు సింహిక, దివి చను,
కపివరు ఛాయను గావుపట్టె; తన
నీడనుపట్టిన పీడలు తోపగ,
తనలో నిటులనుకొనె హనుమంతుడు.
             185
పట్టి కట్టి రెవ్వరొ నా ఛాయను,
మందగించిన దమంద విక్రమము,
ఎదురుగాలి వడి గదిమినెట్ట న
ట్టేట నిలిచిపోయెడి నావపగిది.
            186
మీదను క్రిందను మిగిలిన కడలను
పరికింపగ కనబడె కపికయ్యెడ;
ఉదధినుండి పయికుప్పెన చాడ్పున
వెడలుచున్న ఒక విపరీతాకృతి.
           187-188
ఆ దయ్యపు మొగమారసి, కపిరా
జప్పు డన్న ఛాయాగ్రాహి యనుచు
సందియమేది, భృశంబుగ పెంచెను
మేను మహాకపి; వానమబ్బువలె.
             189-190
పెరిగిన కపి మే నరసి సింహికయు
పాతాళాంతర భూతంబుగ తన
నోరు తెఱచి, కపివీరుని కదియగ
వచ్చెను మేఘమువలె గర్జించుచు.

              191
తన్ను మ్రింగ వక్త్రంబును తెఱచిన
సింహికను సమీక్షించి గ్రహించెను,
దాని కాయపరిమాణంబును మ
ర్మస్థానములను మారుతి ధీమతి.
               192
అంతలోన అంతంతలుగా తన
వజ్రకాయమును వంచి కుంచి, మఱి
పించి, హరి ప్రవేశించెను సింహిక
తెఱుచియున్న భీకరముఖబిలమున,
             193
రాహుముఖ సముద్రములో గ్రహణము
నాడు మునుగు చంద్రముని చందమున
సింహిక నోటను చెనకి దుముకు, కపి
వీరుని చూచిరి చారణసిద్ధులు.
             194
హనుమ దాని కుక్షినిబడి, తీక్షణ
నఖములతో అంతర్మర్మాంత్రము
లెల్ల చీల్చి, బయలెక్కె మనోజవ
మున, అది నోటిని మూయకమునుపే.
             195
ధృతి దాక్షిణ్య ధురీణములగు వీ
క్షణధారలు రాక్షసిని సింహికను "
హింసించి, హనుమ యెప్పటి యట్టుల
కాయము పెంచ నమేయముగ మఱల.
              196
సృజియించెను పరమేష్ఠి సింహికా
మారణకై హనుమంతు నన్నటుల,
ఆతని ఘాతల నగలగ గుండెలు
తూలి సోలిపడె త్రుళ్లి నీళ్ళ నది.

               197
వానరుచే హతమై నీల్గిపడిన
సింహిక నటు లచ్చెరువున చూచుచు
ఆకసమున నడయాడు భూతములు
వాతాత్మజుతో పలికిరి యిట్టుల.
              198
అతిభీషణ కృత్య మిది మహాకపి !
అలవిమాలిన భయంకర భూతము
సింహిక, దానిని సంహరించితివి;
సాధింపు మభీష్టము నిక సుళువుగ .
              199
స్మృతియును, ధృతియును, మతియు, దక్షతయు,
సామర్థ్యచతుష్టయ, మివి కలిగిన,
నీవంటి క్రియానేతలెన్నడును
కష్టపడరు తమ కార్యసాధనల.
             200
తలపు ఫలించగ, దైవభూతములు
సంభావించగ, సంతోషముతో
అరిగెను క్రమ్మర ఆకాశంబున
గరుడుని కైవడి కపికులకేసరి.
             201
అంతలోనె హనుమంతుం డవతలి
తీరమునందిగి, పాఱజూడ, కన
వచ్చెనంతటను పచ్చని తోటలు
శతయోజనములు చాళ్లుచాళ్లుగా.
              202
దిగినంతనె హరి తిలకించెను శా
ఖామృగంబులకు కామితంబులగు
వివిధ వృక్షములవీధులు, మలయో
ద్యానవనంబుల బోనివాడలను.

                   203
ఉదధిని, ఉదధి దిగుదల పల్లముల,
తేమ నేలల నెదిగిన వృక్షముల ,
పరికించుచు సాగరసంగ నదీ
నదముఖంబులను ముదముగ చూచెను.
                  204
శ్రావణ మేఘము చాయవిస్తరిలి
ఆకసమంతయు ఆముకొన్న తన
ఆకారము నవలోకించి మదిని
భావించెను మేధావి హనుమ యిటు.
               205
నా రూపోన్నతి, నావేగోద్ధతి,
చూచిరేని దనుజు లపూర్వంబీ
కపిభూతంబని కౌతూహలమున
విస్మితులై నా వెంబడి పడుదురు.
               206
అని, కొండను పోలిన తనరూపము
సంక్షేపించెను స్వల్పాకృతిగా;
మోహము వీడ ముముక్షువు ప్రకృతి
స్థితి కొనుగతి పొందెను నిజరూపము.
               207
పెంచిన రూపము దించి హనుమ, నిజ
వానరాకృతిని కానవచ్చె; మును
బలిబలము హరింపగ విష్ణువు మూ
డడుగుల పరిమితి ముడిగివభాతిని.
             208
పలురూపంబుల మెలగి, అన్యుల క
లవిగాని మహార్ణవము దాటి గ
ట్టెక్కి, కార్యము సమీక్షించి, అపుడు
సముచితమగు రూపము ధరించె, కపి,

                 209
కొబ్బరితోటలు, గుబురు మొగలిపొద,
లుద్దాలకముల ఓలము లొరసెడి,
లంబగిరితలంబున వ్రాలె, మహా
త్ముండు మారుతసుతుండు కొండవలె.
                210
ఏటిగట్టున నొకింతనిలిచి హరి
గిరి సిగబంతిగ మెరయు లంకగని,
ఎగిరి దుమికె నా నగముమీద ప
క్షులు మృగములు కలగుండు గొని చెదర .
                 211
త్రుళ్ళి విరిగిపడు కల్లోలములకు,
నాగులకును, దానవులకు, నెలవగు
కడలిదాటి వెలిగట్టున దిగి, హరి
అరసెను లంకను అమరావతివలె.