శ్రీ సాయిసచ్చరిత్రము /మూడవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (మూడవ అధ్యాయము )



శ్రీ సాయిసచ్చరిత్రము మూడవ అధ్యాయము సాయిబాబా యనుమతి - వాగ్దానము; భక్తులకు బాబా నియమించిన పనులు; బాబా కధలు సముద్రమధ్యమున దీపస్తంభములు; బాబా ప్రేమ - రోహిలా కథ; అమృతతుల్యములైన బాబా పల్కులు. సాయిబాబా యొక్క యనుమతియు, వాగ్దానమును

వెనుకటి యధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీసాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి యనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి: "సచ్చరిత్ర వ్రాయు విషయములో నాపూర్తి సమ్మతి గలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము. భయపడకుము. మనస్సు నిలకడగా నుంచుము. నా మాటలయందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నవిద్య అంతరించి పోవును. శ్రద్దాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామెహము క్షిణీంచును. బలమైన ప్రేమభక్తి కెరటములు లేచును. ఎవరయితే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును."

ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యము జయప్రదుగా సాగునను ధైర్యము కలిగెను. అటుపై ని మాధవరావు దేశపాండే(శ్యామా) వైపు తిరిగి బాబా యిట్లనెను:

"ప్రేమతో నా నామమునుచ్ఛరించిన వారి కోరిక లన్నియు నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారి నన్ని దిశలందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నా పై పూర్తిగా నాధారపడియున్నారో వారీ కథలు వినునప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయువారికంతులేని యానందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరయితే నన్ను శరణు వేడెదరో, భక్తివిశ్వాసములలో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో, వారిని దుఃఖబంధనములనుండి తప్పింతును. ప్రాపంచిక విషయములనన్నింటినీ మరచి, నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను, చరిత్రమును మననము చేయుచు, ఎల్లప్పుడు నన్ను జ్ఞపియందుంచుకొనువారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు? వారిని మరణంనుండి బయటకు లాగెదను. నా కథలు వినిననో సకలరోగములు నివారింపబడును. కావున భక్తిశ్రద్దలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. అనందమునకు తృప్తికి నిదియె మార్గము. నా భక్తులయొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్దచైతన్యముతో తాదాత్మ్యము కలుగును. ’సాయి సాయి’ యను నామమును జ్ఞప్తి యందుంచుకొన్నంత మాత్రమున, చెడుపలుకుటవలను, వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును.

భక్తులకు వేర్వేరు పనులు నియమించుట

భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నదివొడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది. విషయజ్ఞానము శూన్యమగుటచే నీపని నా అర్హతకు మించినది. అయినచో, యింత కఠినమైన పని నేనందుకు అమోదించవలెను? సాయిబాబా జీవితచరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే యింత కఠినకార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగనే సాయిబాబా నా యహంకారము పరిహరించి, వారి కథలను వారే వ్రాసికొనిరి. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందునుగాని నాకు గాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికిని స్మృతి యను రెండు కండ్లు లేకుండుటచే సాయిసచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని. కాని భగవంతుని అనుగ్రహము మూగవానిని మాట్లాడునట్లు చేయును కుంటివానిని పర్వతము దాటునట్లు చేయును. తన యిచ్చానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము అ భగవంతునికే గలదు. హర్మోనియమునకుగాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియును. చంద్రకాంతము ద్రవించుట, సముద్రముప్పొంగుట వానివానివల్ల జరుగవు. అవి చంద్రొదయము వల్ల జరుగును.

బాబా కథలు దీపస్తంభములు

సముద్రమధ్యమందు దీపస్తంభము లుండును. పడవలపై పోవువారు ఆ వెలుతురుతో రాళ్ళు రప్పలవల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణీంతురు. ప్రపంచమను మహసముద్రములో బాబాకథలను దీపములు దారి చూపును. అవి అమృతముకంటె తియ్యగానుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను, సుగమముగను చేయును. యోగీర్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవులద్వారా హృదయమందు ప్రవేశించునప్పుడు శరీరస్పృహయును, అహంకారమును, ద్వంద్వభావములును నిష్ర్కమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలయిపోవును. శరీరగర్వము మాయమై పోయి కావలసినంత జ్ఞానము నిల్వచేయబడును. శ్రీసాయిబాబాకీర్తి, వర్ణనలు ప్రేమతో పాడినగాని వినినగాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి యివియే మోక్షమునకు సులభసాధనములు. కృతయుగములో శమదమములు(అనగా నిశ్చలమనస్సు, శరీరము) త్రేతా యుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలను నామములను పాడుట, మోక్షమార్గములు. నాలుగు వర్ణములవారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంభించిట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని మహిమను పాడుట యతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. భగవత్కథలను వినుటవలన పాడుటవలని మనకు దేహభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగ జేసి, తుదకు అత్మసాక్షాత్కారము పొందునట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సలభముగ చదువగలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మనము చేసికొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తిపొంది యాత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సచ్చరిత్రామృతము వ్రాయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్దించనవి. నిమిత్తమాత్రుడుగనే యుంటిని.

సాయిబాబా యొక్క మాతృప్రేమ

ఆవు తన దూడనెట్లు ప్రేమించినో యందరికి తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడు నిండియే యుండును. దూడకు కావలసినప్పుడెల్ల కుడిచినచో పాలు ధారగా కారును. ఆలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు లొడుగుటయందును, అలంకరించిటయందును తల్లి తగిన శ్రద్ద తీసికొని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయమేమియు తెలియదుగాని, తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి యలంకరింపబడుట చూచి యమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చ దగిన దేదియు లేదు. అది యసామాన్యము; నిర్వ్యాజము. సద్గురువులు కూడ నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు గూడ నాయందట్టి ప్రేమ యుండెను. దానికీ క్రింది యుదాహరణ మొకటి.

1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగమునుండి విరమించితిని. నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురుపౌర్ణమినాడు ఇతరభక్తులతో నేను కూడ శిరిడికి పోయితిని. అణ్ణా చించణీకర్ నాగురించి బాబాతో నిట్లనెను: " దయచేసి యీ అన్నాసాహెబు యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు, వాని కుటుంబము పెరుగుచున్నది. వాని కింకేదైన ఉద్యోగ మిప్పించుము. వాని యాతురతను తీసి, నిశ్చింతను గలుగచేయుము." అందులకు బాబా యిట్లు జవాబిచ్చెను: "వాని కింకొక ఉద్యోగము దొరుకును. కాని వాడెప్పుడు నా సేవలో త్రప్తిపడవలెను. వాని భోజనపాత్రలు ఎప్పుడూ పూర్ణముగనే యుండును. అవి ఎన్నటికిని నిండుకొనవు. వాని దృష్టినంతటిని నావైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరియెడల అణుకువ నమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగ పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును."

నన్ను పూజింపుడనుదానిలోని ఈ ’నన్ను’ అనగా ఎవరు? అను ప్రశ్నకు సమాధానము యీ గ్రంథము యొక్క ఉపొద్ఘాతములో ’సాయిబాబా ఎవరు’ అనుశీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి యున్నది. చూడుడు!

రోహిలా కథ

రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ యెట్టిదో బోధపడును. పొడుగాటి వాడును, పొడుగైన చొక్కా తొడిగినవాడును, బలవంతుడునగు రోహిలా యొకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై శిరిడీలో స్థిరనివాసము ఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు "అల్లాహు అక్బర్’ యని యాబోతు రంకెవేయునట్లు బిగ్గరగా నరుచుచుండెను. అందువలన పగలంతము పొలములొ కష్టపడి పనిచేసి యింటికి వచ్చిన శిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ళువరకు వారు దీనినోర్చుకొనిరి. తుదకు అ బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిలా అరపుల నాపుమని బతిమాలిరి బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయే కాక వారిపై కోపించి వారిపనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిలా జోలికి పోవద్దని మందలించిరి. " రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు, అమె గయ్యాళి యనియు, అమె వచ్చి రోహిలాను తనను బాధ పెట్టుచునదనియు, రోహిలా ప్రార్దనలు విని అమె ఏమి చేయలేక ఊరకయుండు" ననియు బాబా చెప్పెను. నిజమగా రోహిలాకు భార్యయే లేదు. భార్యయనగా దుర్భుద్ధియని బాబా భావము. బాబాకు అన్నిటికంటె దైవ ప్రార్దనలయందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిలా తరపున వాదించి. ఊరిలోనివారి నోపికతో నోర్చుకొని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియు, నది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను.

బాబా యొక్క యమృతతుల్యమగు పలుకులు

ఒకనాడు మధ్యాహ్న అరతి యయిన పిమ్మట భక్తులందరు తమ తమ బసలు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా యీ క్రింది చక్కని యుపదేశమిచ్చిరి:

"మీరెక్కడ నున్ననూ, ఏమి చేయుచున్ననూ నాకు తేలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయములు పాలించువాడను. అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరాచరజీవకోటి నావరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రయచాలకుడను నేనే సృష్టిస్థితిలయకారకుడను నేనే. ఎవరయితే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారి కేహానిగాని బాదగాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచరజీవకోటి యంతయు నా శరీరమే, నా రూపమే!"

ఈ చక్కని యమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో యే నౌకరీ కొరకు యత్నించక, గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకొంటిని. కాని, అణ్ణా చించణీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను. అది జరుగునా లేదా యని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పులుకులు సత్యములైనవి. నాకోక సర్కరు ఉద్యోగము దొరకెను. కాని అది కొద్దికాలము వరకే. అటుపిమ్మట వేరే పని యేదియు చేయక శ్రీసాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని.

ఈ యధ్యాయమును ముగించుబోవుముందు చదువరులకు నేను చెప్పునదేమన, బద్దకము నిద్ర చంచలమనస్సు దేహాభిమానము మొదలగు వానిని విడిచి, వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథలవైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలిసికొందురుగాక. ఇతర మార్గము లవలంబించి అనవసరముగా నలసిపోవద్దు. అందరు నొకే మార్గమును త్రోక్కుదురుగాక! అనగా శ్రీసాయి కథలను విందురు గాక! ఇది వారి యజ్ఞానమును నశింపజేయును. మోక్షమును సంపాదించి పెట్టును. లోభి యెక్కడ నున్నప్పటికిని వాని మనస్సు తాను పాతిపెట్టిన సోత్తునందే యుండునట్లు, బాబాను కూడ నెల్లరు తమ హృదయములందు స్థాపించుకొందురుగాక! శ్రీ సాయినాథాయ నమః మూడవ అధ్యాయము సంపూర్ణము సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు