Jump to content

శ్రీ సాయిసచ్చరిత్రము /ముప్పదిమూడవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ముప్పదిమూడవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము ముప్పదిమూడవ అధ్యాయము ఊదీ మహిమ: 1. తేలుకాటు, ప్లేగు జ్వరము నయమగుట 2. జామ్నేర్ చమత్కారము; 3. నారాయణరావు జబ్బు 4. బాలబువ నుతార్; 5. హారిభావు కర్ణికల అనుభవములు


గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊదీ మహిమాను వర్ణించెదము.

మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణాకటాక్షములు కొండంత పాపములను గూడ నశింపజేయును. మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును. అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది, యను భేదభావము వారి మనస్సులందు పుట్టుదు. వారి ఋణమును ఈ జన్మయందుగాని వచ్చె పెక్కు జన్మలయందు గాని మనము తీర్చుకొనలేము.

ఊదీ ప్రసాదము

బాబా యందరివద్దనుంచి దక్షిణ తీసికొనుచుండునని యందరికి తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తముతో నెక్కువ భాగము దానము చేసి మిగతదానితో వంటచెఱ్ఱకును ( కట్టెలను) కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది యిప్పటికి నటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊదీ యనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమతమ యిండ్లకు తిరిగి పోవుచునప్పుడు పంచి పెట్టెడివారు.

ఊదీ వలన బాబా యేమి బోధించ నుద్దేశించెను? ప్రపంచములో కనిపించు వస్తువులన్నియు బూడిదవలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నియు సౌఖ్యముల ననుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద యగును. ఈ సంగతీ జ్ఞప్తికి దెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదము పంచి పెట్టుచుండెను. ఈ ఊదీవలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు, కొడుకుగాని, తండ్రిగాని, తల్లిగాని, మనవారు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి. ఒంటరిగానే పోయెదము. ఊదీ యనేకవిధముల శారీరమానసికరోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దానియందు అభిమానరాహిత్యము గంట మ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది (ఊదీ) వివేకమును, రెండవది(దక్షిణ) వైరాగ్యము బోధించుచుండెను. ఈ రెండును కలిగియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా యడిగి దక్షిణ తోసుకొనుచుండెను. శిరిడీనుంచి యింటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా నిచ్చి, కొంత నుదుటపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెను. బాబా సంతోషముతో నున్నప్పుడు పాడుచుండెడివారు పాటలలో ఊదీ గురించి యొకటి పాడుచుండిరి. దాని పల్లవి "కళ్యాణరామ రారమ్మ! గోనెలతో ఊదీని తేతమ్మ!" బాబా దీనిని చక్కని రాగముతో మధురముగ పాడుచుండెడివారు.

ఇదంతయు ఊదీయొక్క అధ్యాత్మికప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడ కలదు. అది అరోగ్యము, ఐశ్వర్యమును, అతురతల నుండి విమోచనమును మొదలగునవి యొసగుచుండెను. ఇక ఊదీ గూర్చిన కథలను ప్రారంభించెదము.

తేలు కాటు

నాసిక్ నివసియగు మోతీరాంజాని యనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామనమోడక్ యను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తనతల్లితో శిరిడీకి పోయి బాబాను దర్శంచెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని, తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనవలెనని చెప్పెను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యెను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ’అనందాశ్రమము’ అను హొటల్ పెట్టెను. అది బాగా అభివృద్ది చెందెను. ఒకసారి యీ నారాయణరావు స్నేహితుడుకి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంత యుండెను. అటువంటి విషయములలో ఊదీ బాగా పనిచేయును. నొప్పి యున్నచోట ఊదీని రాయవలెను. అందుచే నారాయణరావు ఊదీ కొరకు వెదకెను. కాని యది కనిపించలేదు. అతడు బాబా పటముముందరనిలచి బాబా సహయము కోరి, బాబా నామజపము చేసి, బాబా పటము ముందు రాలిపడిన అగరుపత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదీగా భావించి, నొప్పి యున్నచోట రాసెను. అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగనే నొప్పి తగ్గిపోయెను. ఇద్దరు అశ్చర్యానందములలో మునిగిరి.

ప్లేగు జబ్బు

ఒకానొకప్పుడు బాంద్రాలో నుండు ఒక బాబా భక్తునికి, వేరొక గ్రామమున నున్న తన కూమార్తె ప్రేగు జ్వరముతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తనవద్ద ఊదీ లేదనియు, కనుక ఊదీ పంపుమని నానాసహెబు చాందోర్కరుగారికి కబురు పంపెను. ఈ వార్త నానాసహెబుకు ఠాణా రైల్వేస్టేషను వద్ద తెలిసెను. అప్పుడతడు భార్యతో కూడ కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున నానాసాహెబు రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి, సాయినామజపము చేసి, బాబా అనుగ్రహము నభ్యర్ధించి తన భార్య నుదిటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు జూచెను. అభక్తు యింటికి పొవుసరికి మూడు రోజులనుండి బాధ పడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటినుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను.

జామ్నేర్ లీల

1904-1905వ సంవత్సరమున నానాసాహెబు చాందోర్కర్ జామ్నేర్‌లో మామలతదారుగా నుండెను. ఇది ఖాందేషు జిల్లాలో శిరిడీకి 100 మైళ్లుదూరములో నున్నది. అయన కూమార్తె మైనతాయి గర్భిణి; ప్రసవించుటకు సిద్దముగా నుండెను. అమె స్థితి బాగులేకుండెను. అమె రెండుమూడు దినములనుంచి ప్రసవవేదన పడుచుండెను. నానాసాహెబు ఔషధములన్నియు వాడెను కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి దెచ్చుకొని వారి సహయము వేడెను. శిరిడీలో రామ్‌గీర్ బూవాయను సన్యాసి యుండెను. బాబా అతనిని "బాపూగీర్ బువా" యనువారు. అతని స్వగ్రామము ఖాందేషులో నుండెను. అతడచ్చటీకి పొవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని బిలిచి మార్గమధ్యమున జామ్నేర్‌లో కొంత విశ్రాంతి తీసికొని నానాసాహెబుకు ఊదీని హారతీ పాటను ఇమ్మనెను. తన వద్ద రెండే రూపాయలున్నవనియు అవి జలగామ్‌వరకు రైలు టిక్కెటుకు సరిపోవుననియు, కాబట్టి జలగామ్‌నుండి జామ్నేర్ పోవుటకు (సుమారు 30 మైళ్ళు) ధనము లేదని రామ్‌గీర్ బూవా చెప్పెను. అన్నియు సరిగా అమరునుగాన, నతడు కలతజేంద నవసరము లేదని బాబా పలికెను. శ్యామాను బిలిచి మాధవ అడ్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదీని రామ్‌గీర్ బూవాకిచ్చి నానాసాహెబుకు అందజేయమనెను. బాబా మాటలపయి అధారపడి రామ్‌గీర్ బువా శిరిడీ విడచి, రాత్రి రెండున్నర గంటలకు జలగామ్ చేరెను. అచటికి చేరునప్పటికి అతని చెంట 2 అణాలు మాత్రమే యుండెను. కాబట్టి కష్టదశలో నుండెను. అపుడే యెవరో "బాపూగీర్ బువా యెవరు?" అని కేకవైచుచుండిరి. బువా యచ్చటికి పోయి తనేయని చెప్పెను. నానాసాహెబు పంపించినారని చెప్పుచు, అ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగావద్దకు తీసికొని పోయెను. దానికి రెండు మంచి గుఱ్ఱములు కట్టియుండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదలిరి. టాంగా వేగముగా బోయెను. తెల్లవారుఝామున టాంగా యొక సెలయెరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుఱ్ఱములకు నీళ్ళు త్రాగించుటకు పోయెను. బంట్రోతు రామ్‌గీర్ బువాను ఫలహరము చేయమని, ఫలహరపు దినుసులను బెట్టెను. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామ్‌గీర్ బువా యతడు మహ్మదీయుడని సంశయించి ఫలహరము తినుకుండెను. కాని యా బంట్రోతు తాను హిందువుడననియు, గర్‌వాల్ దేశపు క్షత్రియుడననియు, నానాసాహెబు ఆ ఫలహరము బంపెను గాన, తినుట కెట్టి సంశయము వలదనెను. అప్పుడిద్దరు కలసి ఫలహరము చేసి బయలదేరిరి. ఉషః కాలము జామ్‌నెర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామ్‌గీర్ బువా టాంగా దిగి రెండు మూడు నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చుసరికి టాంగా గాని, టాంగా తోలువాడు గాని, బంట్రోతు గాని లేకుండిరి. బాపుగీర్ బువా నోటివెంట మాటరాకుండెను. దగ్గరున్న కచేరికి బోయి యడుగగా నానాసాహెబు ఇంటి వద్దనే యున్నట్లు దెలిసెను. అతడు నానాసాహెబుగారింటికి వెళ్ళి తాను శిరిడీ సాయిబాబా వద్దనుంచి వచ్చినట్లు చేప్పెను. బాబా ఇచ్చిన ఊదీ, హారతి పాట నానాసాహెబు కందజేసెను. మైనతాయి చాలా దుస్థితిలో నుండెను. అందరు అమె గూర్చి మిగుల అందోళన పడుచుండిరి. నానాసాహెబు తన భార్యను బిలచి ఊదీని నీళ్ళలో కలపి కూమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయములో సహాయము బంపెననుకొనిరి. కొద్ది నిముషములలో ప్రసవము సుఖముగా జరిగెనని వార్త వచ్చెను. గండము గడచినదని చెప్పిరి. నానాసాహెబు గారు టాంగాను, నౌకరును, ఫలహరములను పంపినందుకు బాపుగీర్ బూవా అయనకు కృతజ్ఞత తెలిపగా నాతడు మిక్కిలి యాశ్చర్యపడెను. శిరిడీ నుంచి యెవ్వరు వచ్చుచున్నది అతని తెలియదు, కనుక నతడేమియు పంపి యండలేదని చెప్పెను.

బి.వి.దేవ్‌గా రీవిషయమై నానాసాహెబు చాందోర్కరు కొడుకు బాపూరావు చాందోర్కరును, రామ్‌గీర్ బువాను కలసికొని విచారించి సాయిలీల మాగజైన్ లో ( xiii- 11,12,13 ) గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బి.వి. నరసింహస్వామిగారు మైనతాయి, బాపూరావు చాందోర్కర్, రామ్‌గీర్ బూవాల వాజ్మూలమును సేకరించి "భక్తుల అనుభవములు" అను గ్రంథమున (3వ భాగము) ప్రకటించినారు.

భక్త నారాయణరావుకు బాబాను రెండుసారులు దర్శనముచేయు భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన మూడేండ్లకు శిరిడీకి పోవలెననుకొనెను. కాని పోలేకపోయెను. బాబా సమాధి చెందిన యొక సంవత్సరములో నతడు జబ్బు పడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సలవలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నములో నొక దృశ్యమును జూచెను. అందు బాబా అతనిని ఓదార్చి యిట్లనెను " అందోళన పడవద్దు. రేపటినుంచి బాగగును. వారమురోజులలో నడువ గలవు?" స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను. ఇచ్చట మన మాలోచించవలసిన విషయముమిది. "శరీర మున్ననాళ్ళు బాబా బ్రతికి యుండిరా? శరీరము పోయినదిగాని చనిపోయినారా?" లేదు. ఎల్లప్పుడు జీవించియే యున్నారు. వారు జనన మరణముల కతీతులు. ఎవరయితే బాబా నొకసారి హృదయ పూర్వకముగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికి ఎట్టి సమయమందుగాని బాబానుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడు మన ప్రక్కనే యుందురు. ఏ రూపములోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరిక నెరవేర్చెదురు.

బాలబువ సుతార్

బొంబాయి నుండు ప్రముఖ సంకీర్తనాకారుడు బాలబువ సుతార్ ఒకసారి శిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడు అతడు భగవధ్యానము-భజన యందే తత్పరుడైయుండెడివాడు. అందుచే జనులు వారిని ’నవయుగ తుకారామ్’ అని పిలుచేవారు. వారు బాబాకు నమస్కరించగా బాబా "నేనితనిని నాలుగు సంవత్సరముల నుండి యెరుగుదును." అనిరి. తాను మొదటి సారిగా ఇప్పుడే శిరిడీకి వచ్చినవాడగుటచే బాలబువా ఇదెట్లు సంభవమనుకొనెను. కాని త్రీవముగా నాలోచించగా బొంబాయిలో నాలుగు సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తానిట్లనుకొనెను. "యోగు లెంతటి సర్వజ్ఞులు, సర్వాంత ర్యాములు? తమ భక్తులందు వారికెంత ప్రేమ? నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు భోదించిరి."

అప్పా సాహెబు కులకర్ణి

1917వ సంవత్సరమున అప్పాసాహెబు కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠాణాకు బదిలీ యయ్యెను. బాలాసాహెబు భాటే అతనికి బాబాఫోటో నిచ్చియుండెను. అతడు దానిని జాగ్రత్తగ పూజించుచుండెను. పువ్వులు చందనము నైవేద్యము బాబాకు నిత్యమర్పించుచు బాబాను చూడవలెనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్బమున బాబా పటమును మనఃపూర్వకముగ చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచినదానితో సమానమే యని చెప్పవచ్చును. (దీనికి నిదర్శనము పైన జెప్పబడిన కథ)

కులకర్ణి ఠాణాలో నుండగా భివండి పర్యటనకు బోవలసివచ్చెను. ఒక వారమురోజుల లోపల తిరిగి వచ్చుట కవకాశము లేకుండెను. అతడు లేనప్పుడు మూడవరోజన ఈ దిగువ యాశ్చర్యకరమయిన సంగతి జరిగెను. మధ్యాహ్నము 12 గంటలకు ఒక ఫకీరు అప్పాకులకర్ణి యింటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖక్షణములతో సరిపోయెను. కులకర్ణిగారి భార్యబిడ్డలు వారి శిరిడీ సాయిబాబాగారా యని యడిగిరి. వారిట్లు నుడివిరి, "లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి యాజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చితిని." ఆట్లనుచు దక్షిణనడిగెను. అమె ఒక రూపాయి ఇచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఊదీ నిచ్చి, దానిని పూజలో ఫోటోతో కూడ నుంచుకొని పూజించుమనిరి. పిమ్మట యిల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు.

భివండీలో తన గుఱ్ఱము జబ్బు పడగా అప్పాసాహెబు తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీరుగారి రాక భార్యవల్ల వినెను. ఫకీరుగారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. ఫకీరుకు ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుట కిష్టపడకుండెను. తానే యింటివద్ద నున్నచో 10 రూపాయలకు తక్కువ గాకుండ దక్షిణ యిచ్చి యుందుననెను. వెంటనే ఫకీరును వెదకుటకై బయలదేరెను. మసీదులలోను, తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెదకెను. అతని అన్వేషణ నిష్పలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయములో ఉత్తకడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహెబిచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమయిన తరువాత చిత్రేయను స్నేహితునితో వ్యాహ్యాళికి బయలుదేరెను. కొంత దూరము పోగా నెవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు గాన్పించెను. వారి ముఖలక్షనములను బట్టి వారు తన యింటికి 12 గంటలకు వచ్చినవారే యని యనుకొనెను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ నడిగెను. అప్పాసాహెబు ఒక రూపాయి నిచ్చెను. వారు తిరిగి యడుగగా ఇంకను రెండు రూపాయలిచ్చెను. అప్పటికి అతను సంతుష్టి చెందలేదు. అప్పాసాహెబు చిత్రేవద్దనుంచి మూడు రూపాయలు తీసికొని ఫకీరుకు ఇచ్చెను. వారింకను దక్షిణ కావలెననిరి. అప్పాసాహెబు వారినింటికి రావలసినదిగా వేడుకొనెను. అందరు ఇల్లు చేరిరి. అప్పాసాహెబు వారికి 3 రూపాయలిచ్చెను. మొత్తము తోమ్మిది రూపాయలు ముట్టెను. అప్పటికి సంతుష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ యిమ్మనెను. అప్పాసాహెబు తన వద్ద పదిరూపాయలు నోటు గలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని తొమ్మిది రూపాయలు తిరిగి యిచ్చివేసి యక్కడనుండి వెడలెను. అప్పాసాహెబు పదిరూపాయ లిచ్చెదననెను గనుక ఆ మొత్తము దీసికొని పవిత్రపరిచిన పిమ్మట తోమ్మిది రూపాయలు నిచ్చి వేసెను. 9 సంఖ్య చాల ముఖ్యమైనది. అది నవవిధభక్తులను తెలియజేయును ( బాబా లక్ష్మీబాయి శిందేకు 9 రూపాయలు సమాధి సమయమందిచ్చిరి.) అప్పాసాహెబు ఊదీ పోట్లము విప్పి చూచెను. అందులో పువ్వురెక్కలు అక్షతలుండెను. కొంతకాలము పిమ్మట బాబాను శిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక యొకటి చిక్కెను. అతడు ఊదీ పోట్లమును, వెంట్రుకను, ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబు ఊదీ ప్రభావము గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైనవాడయినప్పటికి నెలకు 40 రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత 40 రూపాయల కెన్నొరెట్లు అదాయము వచ్చెను. మంచి పలుకుబడియు ఆధికారము లభించెను. ఈ లౌకికమైన కనుకలేగాక దైవభక్తి కూడ వృద్దియగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నాసము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసికొని, కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను.

హరిభవ్ కర్ణిక్

ఠాణా జిల్లా దహను గ్రామమునుండి హరిభావ్ కర్ణిక్ అనునతడు 1917వ సంవత్సరమున గురుపౌర్ణమినాడు శిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే యింకొక రూపాయి బాబాకు దక్షిణ నివ్వవలెనని తోచి మసీదు మరల ఎక్కుచుండగా, బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకను రారాదని విని యింటికి బయలుదేరెను. మార్గమధ్యమున నాసిక్‌లో కాలరాముని మందిరము ప్రవేశించి, దర్శనము చేసికొని వెలిపలికి వచ్చుచుండగా నరసింగ మహరాజ్ అను యోగి తన శిష్యులను విడచి లోపల నుండి బయటకు వచ్చి, హరభావ్ ముంజేతిని బట్టుకొని, "నా రూపాయి నాకిమ్ము" అనెను. కర్ణిక్ మిగుల అశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా నిచ్చి, సాయిబాబా యివ్విధముగా తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింగ మహరాజ్ ద్వారా గ్రహించెననుకొనెను.

యోగీశ్వరులంద రొకటే యనియు ఏకాత్మతాభావముతో కార్యము లొనర్తురనియు నీ కథ తెలిపుచున్నది.


శ్రీ సాయినాథాయ నమః ముప్పదిమూడవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు