శ్రీ సాయిసచ్చరిత్రము /ముప్పదినాలుగవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ముప్పదినాలుగవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము ముప్పదినాలుగవ అధ్యాయము ఊదీ మహిమ: 1. డాక్టరు మేనల్లుడు 2. డాక్టర్ పిళ్ళె 3. శ్యామా మరదలు 4. ఇరానీ బాలిక 5. హార్జా పెద్దమనిషి 6. బొంబాయి మహిళ


ఈ ఆధ్యాయములో కూడ ఊదీ మహిమ వర్ణితము. ఊదీ ధరించినంత మాత్రమే నెట్టి ఫలములు కలిగెనో చూతము.

డాక్టరుగారి మేనల్లుడు

నాసిక్ జిల్లాలోని మాలెగాంలో ఒక డాక్టరుండెను. అయన వైద్యములో పట్టభద్రులు, వారి మేనల్లుడు నయముకానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టరుగారుతో పాటు ఇతర డాక్టర్లుకూడ నయము చేయ ప్రయత్నించిరి. అపరేషను చేసిరి. కాని ఏమాత్రము మేలు జరుగలేదు. కుఱ్ఱవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు స్నేహితులు తల్లిదండ్రులు దైవసహయము కోరుమనిరి. శిరిడీ సాయిబాబాను చూడమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యెనని బోధించిరి. తల్లిదండ్రులు శిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసిరి. కుఱ్ఱవానిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడుమని అధికవినయ గౌరవములతో వేడుకొనిరి. దయార్థ్ర హృదయుడగు బాబా వారిని ఓదార్చి యిట్లనెను. "ఎవరయితే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడు ఈ జన్మలో ఏ వ్యాధిచేతను బాధపడరు. కనుక హాయిగా నుండుడు. కురుపుపై ఊదీని పూయుడు. ఒక వారము రోజులలో నయమగును. దేవునియందు నమ్మకముంచుడు. ఇది మసీదుకాదు ఇది ద్వారపతి. ఎవరయితే యిందు కాలు మోపెదరో వారు అరోగ్యమును అనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును." వారు కుఱ్ఱవానిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా యాకురుపుమీద తమ చేతిని త్రిప్పెను, ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసేను. రోగి సంతుష్టి చెందెను. ఊదీ రాయగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజులు పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుఱ్ఱవానితో గూడ బాబాకు కృతజ్ఞతలు తెలిపి శిరిడీ విడచిరి. బాబా ఊదీప్రసాదమువల్లను వారి దయాదృష్టివల్లను రాచకురుపు మానిపోయినందులకు వారి మిగుల సంతసించిరి.

ఈ సంగతి విని కుఱ్ఱవాని మామయగు డాక్టరు అశ్చర్యపడి బొంబాయి పొవుచు మార్గమున బాబాను చూడగోరెను. కాని మాలేగాంలోను మన్‌మాడ్‌లోను ఎవరో బాబాకు వ్యతిరేకముగ చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున నతడు శిరిడీకి పొవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవుల అలిబాగులో గడుపవలెననుకొనెను. బొంబాయి మూడురాత్రులు వరుసగా నొక కంఠధ్వని "ఇంకను నన్ను నమ్మవా!" యని వినిపించెను. వెంటనే డాక్టరు తమ మనస్సును మార్చుకొని శిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో నొక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక శిరిడీ ప్రయాణము వాయిదా పడుననుకొనెను. కాని, తన మనస్సులో బాబాను పరీక్షించదలచి, "రోగి యొక్క వ్యాధి యీనాడు కుదిరినచో, రేపే శిరిడీకి పొయెదను" అని యనుకొనెను. జరిగిన చిత్రమేమన సరిగా మనోనిశ్చయము చేసినప్పటినుంచి, జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్టతకు దిగెను. డాక్టరు తన నిశ్చయము ప్రకారము శిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగనమస్కార మొనర్చెను. బాబా అతనికి గొప్ప యనుభవము కలుగజేయుటచే అతడు బాబాభక్తుడయ్యెను. అక్కడ 4 రోజుండి, బాబా ఊదీతోను, అశీర్వచనముతోను ఇంటికి వచ్చెను. ఒక పక్షము రోజులలో అతనిని బిజాపూరుకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము ఆ డాక్టరుకు బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటినుంచి అతనికి బాబాయందు భక్తి కుదిరెను.

డాక్టరు పిళ్ళే

డాక్టరు పిళ్ళే యనునాతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతనిని ’భావూ’ (అన్నా) అని పిలుచువారు. బాబా యతనితో ప్రతివిషయము సంప్రదించువారు. అతని నెల్లప్పుడు చెంత నుంచుకొనువారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే(నారిపుండు) భాదపడెను. అతడు కాకాసాహెబు దీక్షిత్‌తో, "బాధ చాలా హెచ్చుగా నున్నది. నేను భరింపలేకున్నాను. దీనికంటె చావు మేలని తోచుచున్నది. గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేనిబాధ ననుభవించుచున్నాను. కాన బాబా వద్దకు బోయి యీ బాధా నాపుచేసి, దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడు" మనెను. దీక్షితు బాబావద్దకు వెళ్ళి యాసంగతి చెప్పెను. బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షితు కిట్లనెను. "నిర్భయముగా నుండు మనుము. అతడేల పది జన్మలవరకు బాధ పడవలెను?" పది రోజులలో గతజన్మపాపమును హారింపజేయగలను. నేనిక్కడుండి యిహపరసౌఖ్యము లిచ్చుటకు సిద్దముగా నుండ అతడేల చావును కోరవలెను? అతని నెవరి వీపు పయి నయిన తీసికొనిరండు. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను."

ఆ స్థితిలో డాక్టరును దెచ్చి బాబా కూడివైపున, ఫకీరు బాబా యెప్పుడు కూర్చుండుచోట, కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి యిట్లనెను. "ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసికొమ్ము. అసలయిన విరుగుడేమనగా గతజన్మపాపము లనుభవించి, విమోచనము పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చినదాని నోర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వాని నెల్లప్పుడు ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు, సమస్తము అర్పింపుము. అనగా సర్వస్యశరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము." నానాసాహెబు కట్టుకట్టెననియు కాని, గుణమివ్వలేదనియు డాక్టరు పిళ్ళే చెప్పెను. బాబా యిట్లనెను " నానా తెలివి తక్కువవాడు; కట్టు విప్పుము లేనిచో చచ్చెదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును."

ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రము చేసి దీపముల బాగుచేయుచుండగా, అతని కాలు సరిగా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి యుండెను. దానిపయి అబ్దుల్ కాలు పడగనే యందులోనుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా నుండెను. డాక్టరు పిళ్ళే బిగ్గరిగా నేడ్వసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతని ఏడ్పు, నవ్వు ఒకటి తరువాత నొంకొకటి వచ్చుచుండెను. బాబా యిట్లనెను "చూడుడు! మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు." పిళ్ళే " కాకి ఎప్పుడు వచ్చు"ననెను. బాబా యిట్లజావాబు నిచ్చెను "నీవు కాకిని చూడ లేదా? అది తిరిగి రాదు. అబ్దులే యా కాకి. ఇప్పుడు నీవు పోయి వాడలో విశ్రాంతి గొనుము. నీవు త్వరలో బాగయ్యెదవు. " ఊదీ పూయుటవలన, దాని తినుట వలనను, ఏ చికిత్స పొందకయే, జౌషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయెను.

శ్యామా మరదలు

శ్యామా తమ్ముడు బాపాజీ సావూల్ విహిర్ దగ్గర నుండువాడు. ఒకనాడతని భార్యకు ప్లేగు తగిలెను. అమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను. చంకలో రెండు బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామావద్దకు పరుగెత్తి వచ్చి సహయపడుమనెను. శ్యామ భయపడెను. కాని యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారము చేసి వారి సహయము కోరెను. వ్యాధిని బాగుచేయమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి బోవుటకు అనుజ్ఞ నిమ్మనెను. బాబా యిట్లనెను " ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊదీ పంపుము. జ్వరము గాని, బొబ్బలను గాని లక్ష్యపెట్ట నవసరము లేదు. మన తండ్రియును, యజమానియు ఆ దైవమే. అమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయమే వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము!"

శ్యామాకు బాబా ఊదీయందు సంపూర్ణ విశ్వాసముండెను. బాపాజీ ద్వారా దానిని బంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్ళలో కలిపి త్రాగించిరి. దానిని తీసికొనిన వెంటనే, బాగా చెమట పట్టెను; జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి యుదయము తన భార్యకు నయమగుట జూచి బాపాజీ యాశ్చర్యపడెను. జ్వరము పోయెను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామా బాబా యాజ్ఞ ప్రకారము వెళ్లగా, నామె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండుట చూచి యాశ్చర్యపడెను. తమ్ముని అడుగగా బాబా ఊదీ ఒక్క రాత్రిలోనె యా బొబ్బలను బాగు చేసెననెను. అప్పుడు "ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము!" అను బాబా మాటలు భావము శ్యామ తెలిసికొనగలిగెను.

టీ తీసికొని శ్యామా తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి యిట్లనెను. "దేవా! ఏమి నీ యాట! మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగ చేసెదవు తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు." బాబా యిట్లు జవాచిచ్చెను. "కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకున్నను, నన్నే సర్వమునకు కారణభూతునిగా నెంచెదరు. అది యదృష్టమును బట్టీ వచ్చును. నేను సాక్షీభూతుడను మాత్రమే, చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ధ్రహృదయులు. నేను భగవంతుడు కాను. ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారి నెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ యహంకారమును ప్రక్కన దోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధము లూడి మోక్షము పొందెదరు."

ఇరానీ బాలిక

ఇక ఇరానీవాని యనుభవమును చదువుడు. అతని కొమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే యామె మాటలాడ లేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఏ మందులు అమెకు నయము చేయలేదు. ఒక స్నేహీతుడు బాబా ఊదీ నుపయోగించు మనెను. విలేపార్లేనున్న కాకాసాహెబు దీక్షిత్‌వద్ద ఊదీ తీసికొని రమ్మనెను. ఇరానీవాడు ఊదీని తెచ్చి ప్రతి రోజు నీటిలో కలపి త్రాగించుచుండెను. మొదట ప్రతిగంతకు వచ్చు మూర్ఛ 7 గంటల కొకసారి రాసాగెను. కొద్దిరోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించెను.

హార్దా పెద్దమనిషి

హార్దపుర (మధ్యపరగణాలు) నివాసియగు వృద్దుడొకడు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను. అట్టిరాళ్ళు అపరేషను చేసి తీసెదరు. కనుక అపరేషను చేయించుకొమ్మని సలహ యిచ్చిరి. అతడు ముసలివాడు, మనో బలము లేనివాడు. అపరేషను కొప్పకొనకుండెను. అతని బాధయింకొక రీతిగా బాగు కావలసియుండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊదీ యుండెను. స్నేహితులు కొందరు చెప్పగా, వృద్దుని కుమారుడు ఊదీ తీసికొని దానిని నీళ్ళలో కలిపి తండ్రి కిచ్చెను. 5 నిమిషములో ఊదీ గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను. వృద్దుడు శ్రీఘ్రముగ బాగయ్యెను.

బొంబాయి మహిళ

కాయస్థప్రభుకులమునకు చెందిన బొంబాయి స్త్రీ యొకతె ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. అమె కేమియు తోచకుండెను. బాబా భక్తుడు కల్యాణ్‌వాసుడగు శ్రీరామమారుతి అమెను ప్రసవించునాటికి శిరిడీ తీసికొని పొమ్మని సలహ యిచ్చెను. అమె గర్భవతి కాగా భార్యభర్తలు శిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములక్కడ నుండిరి. బాబాను పూజించిరి. వారు సాంగత్యము వలన సంపూర్ణఫలము పొందిరి. కొన్నాళ్ళకు ప్రసవవేళ వచ్చెను. మామూలుగానే యోనిలో ఆడ్డు గనిపించెను. అమె మిగుల బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగుపోరుగువారు వచ్చి బాబా ఊదీని నీళ్ళలోని కలిపి యిచ్చిరి. 5 నిమిషములలో నా స్త్రీ సురక్షితముగా, ఎట్టి కష్టము లేక ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డపుట్టి యుండెను. కాని తల్లి అందోళనము, బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్ల కాలము జ్ఞప్తియందుంచుకొనిరి.


శ్రీ సాయినాథాయ నమః ముప్పదినాలుగవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు