Jump to content

శ్రీ సాయిసచ్చరిత్రము /పదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (పదవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము పదవ అధ్యాయము సాయిబాబా జీవిత విధానము; వారి పడక; శిరిడీలో వారి నివాసము; వారి బోధలు, వారి యణకువ;అతిసులభమార్గము సాయిబాబా జీవిత విధానము

ఎల్లప్పుడు శ్రీసాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తియందు యుంచుకొనుము. ఏలన బాబా ఎల్లప్పుడు తమ అత్మస్వరూపమునందే లీనమై, సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై యుండువారు; వారి స్మరణయే జీవస్మరణరూపమైన సంసారమనెడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము యైన సాధనము. దీనిలో వ్యయ ప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక అలస్యము చేయక, మన దేహేంద్రియములలొ పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలెను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువొకడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన యదృష్టమును బాగుచేయగలరు. వారిని శ్రద్దగా సేవించినచో సంసారబంధములనుండి తప్పించుకొనగలము. న్యాయమీమాంసాది షడ్దర్శనములను చదువ పనిలేదు. మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుగా జేసికొన్నచో, కష్టములు చింతలతో కూడిన సంసారమునే సాగరమును మనము సులభముగా దాటగలము. సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవానియందు నమ్మకముంచినట్లు, సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలెను. భక్తులు యొక్క యంతరంగమున గల భక్తిప్రేమలను బట్టి, సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును.

గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయములో బాబా యెక్కడ నివసించెను? ఏలాగున జీవించెను? ఎట్లు శయనించెడివారు? భక్తులకు ఎట్లు బోధించుచుండెను? మొదలగునవి చెప్పుదుము.

బాబావారి శయన లీల

మొట్టమొదట బాబా యెచ్చట పండుకొనుచుండెనో, ఎట్లు పండు కొనుచుండెనో చూచెదము. ఒకసారి నానాసాహెబు డెంగలే, నుమారు నాలుగు మూరల పొడవు. ఒకజానేదు మాత్రమే వెడల్పు గల యొక్క కఱ్ఱబల్లను బాబా పడకకని తెచ్చెను. అ బల్లను నేలపై వేసుకొని పండుకొనుటకు మారుగా, బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయలవలె వ్రేలాడునట్లు చినిగిన పాతగుడ్డ పీలికలతో గట్టి, దానిపై పండుకొన మొదలిడెను. గుడ్డ పీలికలు పలుచనివి, యేమాత్రము బలమైనవికావు. అవి ఆ కొయ్యబల్లయొక్క బరువును మోయుటయే గగనము. ఇంక బాబా యొక్క బరువును కూడ కలిపి అవి యెట్లు భరించుచుండె ననునది యాశ్చర్యవినోదములకు హేతువయ్యెను. అ పాతగుడ్డ పీలికలు యంత బరువును మోయగలుగుట, నిజముగ బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలలయందు నాలుగు దీపపు ప్రమిదలుంచి రాత్రి యంతము దీపములు వెలిగించుచుండిరి. ఇది యేమి చిత్రము! బల్లపై అజానుబాహువగు బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా యెక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన యా దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినదే! అ బల్లపైకి బాబా యెట్లు ఎక్కుచుండెను? ఎట్లు దిగుచుండెను? అనునవి యందరకు నాశ్చర్యము కలిగించుచుండెను. అనేకమంది ఉత్సుకతతో బాబా బల్లపైకి యెక్కుట, దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండెడివారు. కాని బాబా యెవరికి అ వైనము అంతుతేలియనివ్వలేదు. అ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగ గుమిగూడుచుండుటచే బాబా విసుగుచెంది నొకనాడు యా బల్లను విరచి పారవైచిరి. అష్టసిద్దులు బాబా యధీనములు. బాబా వానినపేక్షించలేదు. వాని కొరకు నే అభ్యసములను చేయలేదు. వారు పరిపూర్ణలు గనుక సహజముగనే అవి వారికి సిద్దించెను.

బ్రహ్మము యొక్క సగుణవతారము

సాయిబాబా మూడున్నర మూరల మానవదేహముతో గాన్పించినను వారు సర్వహృదయాంతరస్థులు. అంతరంగమున వారు పరమ నిరీహులు నిస్పృహులైనప్పటికి, బాహ్యమునకు లోకహితము కోరువానిగా గనిపించువారు. అంతరంగమున వారు మమకారహితులైనప్పటికి, బాహ్యదృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కోరకు ఎంతయో తాపత్రయపడుతున్నవారివలె కనిపించెడివారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టయినను, బయటకు చంచల మనస్కునివలే గనిపించుచుండెను. లోపల పరబ్రహ్మస్థితి యందున్నప్పటికిని, బయటకు దయ్యమువలె నటించుచుండెడి వారు. లోపల యద్వైతియైనను బయటకు ప్రపంచమనందు తగుల్కొనిన వానివలె కాన్పించుచుండెను. ఒక్కొక్కప్పుడందరిని ప్రేమతో చూచెడివారు. ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసరుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి. ఇంకొక్కప్పుడు వారిని ప్రేమతో అక్కునజేర్చుకొని, ఎంతో నెమ్మదితోను శాంతముతోను ఓరమితోను సంమయముతోను వ్యవహరించెడివారు.

బాబా ఎల్లప్పుడు అత్మానుసంధానమందే మునిగియుండెడివారు; భక్తులపై కారుణ్యమును జూపుచుండెడివారు. వారెల్లప్పుడు నొకే యాసనమందు స్థిరముగ నుండెడివారు. వారెక్కడకు ప్రయాణములు చేసెడివారు కారు. చిన్న చేతికఱ్ఱ(సటకా) యే వారు సదా ధరించెడి దండము; చింతారహితులై యెప్పుడు శాంతముగా నుండేవారు. సిరిసంపదలను గానీ కీర్తిప్రతిష్టలనుగాని లక్ష్యపెట్టక, భిక్షటనముచే నిరాడంబరులై జీవించెడివారు. అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడు బాబా ’అల్లామాలిక్’ (భగవంతుడే యజమాని) అని యనెడివారు. భక్తులయందు అవిచ్చిన్నమైన పరిపూర్ణప్రేమానురాగాలను కలిగి యుండెడివారు. అత్మజ్ఞానమునకు అయన గని, దివ్యానందమునకు వారు ఉనికిపట్టు. సాయి బాబా యొక్క దివ్యస్వరూపము అట్టిది. ఆద్యంతముల లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు నావరించినట్టిది యైన అ పరబ్రహ్మ తత్త్వమే సాయిబాబాగా యవతరించినది. ఎంతో పుణ్యము చేసుకొన్న అదృష్టవంతులు మాత్రమే యానిధిని పొందగలిగిరి. గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్త్వమును గ్రహించలేక, వారినొక సామాన్యమానవునిగా నెంచినవారు. నిజముగ దురదృష్టవంతులు.

శిరిడీ బాబా నివాసము - వారి జన్మతేది

బాబాయొక్క తల్లిదండ్రులు గురించి గాని, వారి సరయైన జన్మతేదిగాని యెవరికిని తెలియదు. వారు శిరిడీలో వుండిన కాలాన్నిబట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 యేండ్లు ప్రాయమున శిరిడీ వచ్చి మూడు సంవత్సరములు అచట నుండిరి. హఠాత్తుగా అచటనుండి అదృశ్యలై, కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాదుకు సమీపమున గనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్‌పాటిల్ పెండ్లిగుంపుతో శిరిడీ చేరిరి. అప్పటినుండి 60 సంవత్సరములు శిరిడీ వదలక యచ్చటనే యుండి, 1918వ సంవత్సరములో మహసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సర ప్రాంతములందు జన్మించియుందురని భావించవచ్చును.

బాబా లక్ష్యము, వారి బోధలు

17వ శతాబ్థములో రామదాసను యోగిపుంగవుడు (1608-81) వర్దిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయులనుంది రక్షించు లక్ష్యము వారు చక్కగా నిర్వర్తించిరి. వారి గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వారి మధ్య సమైక్యభావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడు వారి చెప్పెడి హితవు: "హిందువులదైవముగు శ్రీరాముడును, మహమ్మదీయులు దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య యేమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట యెందులకు? ఓ అజ్ఞానులారా! చేతులు చేతులు కలిపి రెండు జాతులును కలసి మెలసి యుండుడు. బుద్దితో ప్రవర్తింపుడు. జాతీయ ఐకమత్యము సమకూర్చుడు. వివాదము వల్లగాని, ఘర్షణవల్లగాని ప్రయోజనము లేదు. అందుచే వివాదము విడువుడు. ఇతరలతో పోటీ పడకుడు. మీయొక్క వృద్దిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించెను. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో నేదైన అవలంబించి మోక్షము సంపాదించనిచో మీ జీవితము వ్యర్ధము. ఎవరైన మీకు కీడు చేసినచో, ప్రత్యపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైన చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు." సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రభోదము. ఇది ఇహపరసాధనము.

సాయిబాబా సద్గురువు

గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ, చిరతలు చేతబట్టుకొని అధ్యాత్మికాడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రముల నూది వారినుండి ధనము లాగెదరు. పవిత్రమార్గమును మతమును బోధించెదమని చెప్పెదరు. కాని మత మనగానేమో వారికే తెలియదు. స్వయముగా వారపవిత్రులు.

సాయిబాబా తన గొప్పతన మెన్నడును ప్రదర్శించవలె ననుకొనలేదు. వారికి దేహభిమానము ఏ మాత్రము లేకుండెను. కాని భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండెడిది. నియతగురువులని అనియతగురువులని గురువులు రెందు విధములు. నియతగురువులనగా నియమింపబడినవారు. అనియతగురువులనగా సమయనుకూలముగా వచ్చి యేదైన సలహనిచ్చి మన యంతరంగముననున్న సుగుణమును వృద్దిచేసి మోక్షమార్గము త్రోక్కునట్లు చేయువారు. నియతగురువుల సహవాసము ’నీవు నేన’ను ద్వంద్వభావనను పోగొట్టి, అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి ’తత్వమసి" యగునట్లు చేయును. సర్వవిధముల ప్రపంచజ్ఞానమును బోధించుగురువులనేకులు గలరు. కాని మనల నెవరయితే సహజస్థితి యందు నిలుచునట్లు చేసి మనలను ప్రపంచపుటునికికి అతీతముగా తీసికొని పోయెదరో వారే సద్గురువులు. సాయిబాబా యట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో, బాబా వారి యొక్క భూతభవిష్యద్వర్తమానములన్నిటిని చెప్పువారు. ప్రతి జీవియందు బాబ దైవత్వము జూచేవారు. స్నేహితులు, విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి. వారు దుర్మర్గుల యవసరముల గూడ దీర్చెడివారు. కలిమి లేములు వారికి సమానము. మానవదేహముతో సంచరించినప్పటికి, వారికి గృహదేహదులయందు యభిమానము లేకుండెను. శరీరధారులవలె గనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు, జీవన్ముక్తులు.

బాబాను భగవానునివలె పూజించిన శిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను. త్రాగుచున్నను, తమ దొడ్లలోనో పొలములలోనో పని చేసికొనుచున్నను. వారెల్లప్పుడు సాయిని జ్ఞప్తి యందుంచుకొని సాయి మహిమను కీర్తీంచుచుండేవారు. సాయి తప్ప యింకొక దైవమును వారెరిగియుండలేదు. శిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులయినప్పటికి, వారుకున్న స్వల్పభాషాజ్ఞనముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొనుచుండిరి. వారికి అక్షరజ్ఞానము శున్యమయినప్పటికి వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యదార్దమైన కవిత్వము పాండిత్యమువల్ల రాదు. అది యసలైన ప్రేమవలన వెలుపడును. కవిత్వము స్వచ్చమైన ప్రేమభావమునుండి వెలువడుచు. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు అస్వాదించగలరు. ఏ భక్తుడయిన వీనిని శ్రీసాయిలీల పత్రికలోనో లేదా పుస్తకరూపముననో ప్రకటించిన యెంతయో బాగుండును.

బాబావారి యణకువ

భగవంతునికి అరు లక్షణములు గలవు (1) కీర్తి, (2) ధనము, (3) అభిమానము లేకుండుట, (4) జ్ఞానము, (5) మహిమ, (6) ఔదర్యము. ఈగుణములన్నియు బాబాలో నుండెను. భక్తుల కొరకు మానవరూపమున అవతరించిన భగవతత్త్వమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహము అధ్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన, వారు మహత్మ్యమును తెలుసుకొనగల శక్తి యెవరికి గలదు? భక్తులకొరకు బాబానోట వెలుపడిన పలుకులు పలుకుటకు సరస్వతీ దేవి కూడ వెరగుచెందును. ఒక యుదాహరణ. బాబా మిక్కిలి యణకువతో నిట్లనెడివారు: "బానిసలకు బానిసనగు నేను మీకు ఋణగ్రస్థుడను. మీదర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ యశుద్దములో నేనొక పురుగును. ఆట్లగుటవలన నేను ధన్యుడను." ఏమి వారి యణుకువ! బాబా యొక్క యీ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచితిని. ఎవరైన యనినచో, యీ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరెదను; తత్పాపపరిహారార్ధమై బాబా నామజపము చేసెదను.

బాహ్యదృష్టికి బాబా ఇంద్రియవిషయముల ననుభవించువానివలె కన్పట్టినను, ఇంద్రియానుభూతులలో వారికేమాత్ర మభిరుచి యుండెడిదికాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించున్నప్పటి దేనియందు వారికి రుచి యుండెడిది కాదు. వారు ప్రపంచమును చూచుచున్నట్లు గాన్పించినను. వారికి దానియందేమాత్రము అసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతునివలె యస్థలిత బ్రహ్మచారులు. వారికీ దేనియందు మమకారము లేకుండెను. వారు శుద్దచైతన్యస్వరూపులు; కోరికలు, కోపము మొదలగు భావవికారములు శాంతించి, స్వాస్థ్యము చెందెడి విశ్రాంతి ధామము. వేయేల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణలు. దీనిని వివరించుట కొక యుదాహరణము.

నానావలి

శిరిడీలో విచిత్రపురుషుడు డొకడుండెను. అతని పేరు నానావలి. అతడు బాబా విషయములను, పనులను చక్కపెట్టుచుండువాడు. ఒకనాడతడు బాబావద్దకు పొయి, బాబా వారి గద్దె(అసనము) నుండి లేవవలసినదనీ, దానిపై తాను కూర్చుండవలెనని తనకు బుద్ది పుట్టినదని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావలీ దానిపై కొంతసేపు కూర్చుండి లేచి, బాబాను తిరిగి కూర్చొనుమనెను. బాబా తన గద్దెపై కూర్చొనెను. నానావలి బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసి వెళ్ళిపోయెను. తన గద్దె మీదనుంచి దిగి పొమ్మనినను, దానిపై నింకొకరు కూర్చొనినను, బాబా యెట్టి యసంతుష్టి వెలిబుచ్చలేదు. బాబాను నానావలి యెంతగా ప్రేమించువాడనిన, అతడు బాబా మహసమాధి చెందిన పదమూడవనాడు దేహత్యాగము చేసెను.

మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతిసులభమార్గము

సాయిబాబా సామాన్యమానవునివలె నటించినప్పటికి, వారి చర్యలను బట్టి వారు యసాధారణ బుద్దికుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయునదంతయి తమ భక్తులు మేలుకొరకే. వారు అసనములు గాని, యోగాభ్యాసములు గాని, మంత్రోపదేశములు గాని తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలు ప్రక్కన బెట్టి ’సాయి సాయి’ యను నామమును మాత్రము జ్ఞప్తి యందుంచుకొనుమనిరి. ఆట్లు చేసినచో వారు సర్వబంధములనుండి విముక్తులై, స్వాతంత్ర్యము పొందేదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగయోగములు మొదలగునవి బ్రాహ్మణలకే వీలుపడును. తక్కిన వర్ణములవారికి అవి ఉపయుక్తములు కావు. అలోచించుటే మనస్సు యొక్క పని. అది యాలోచించకుండ యొక్క నిముషమైన నుండలేదు. దానికేదైన ఇంద్రియవిషయము జ్ఞప్తికి దెచ్చినచో, దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి దెచ్చినచో గురువునే చింతించు చుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవముగా శ్రద్దగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తియందుంచుకొనుటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు కీర్తనయు.

మహత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనములవలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభసాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయము లన్నిటిని పారద్రోలి పారమార్థిక మార్గమునకు దీసికొనిపోవును. కావున మహత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు; వానినే మననము చేయుడు. వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు. ఇంతమాత్రము చేసినచో బ్రాహ్మణులే గాక స్త్రీశూద్రాది అన్ని వర్ణములవారు కూడ పవిత్రులగుదురు. ప్రాపంచికభాధ్యతలందు తగుల్కొని యున్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు. వారి కథలు వినుడు. వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము. అయినచో మరి దీని నెందుకు అందరు అవలంబించుకున్నరు? అని యడుగవచ్చు. కారణమేమన; భగవంతుని కృపాకటాక్షము లేనియేడల మహత్ములచరిత్రలను వినుటకు కూడ మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము, సుగమము యగును. మహత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే, మహత్ముల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన యహంకారమును, దేహభిమానమును నశింపజేయును; చావు పుట్టుకలనే బంధములను కూడ నశింపజేయును; హృదయగ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్దచైతన్యరూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసికొనిపోవును. విషయవ్యామోహముల యందు మనకు గల యభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలుగుజేసి పారమార్దికమార్గమున నడుపును. మీకు భగవన్నామస్మరణము పూజ భక్తివంటి యితరసాధనము లేవియు లేకపోయునను, కేవలము హృదయపూర్వకముగ మహత్ముల నాశ్రయించినచో చాలును, వారు మనలను భవసాగరమునుండి తరింపజేయుదురు. మహత్ములు అందుకొరకే నవతరించెదరు. ప్రపంచ పాపముల తొలగజేయునట్టి గంగా, గోదావరీ, కృష్టా, కావేరీ మున్నగు పవిత్రనదులు కూడ మహత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలెనని వాంఛించుచుండును. మహత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదాములనాశ్రయించు భాగ్యము లభించినది.

మసీదుగోడ కానుకొని ఊదిమహప్రసాదమును తన భక్తుల యోగ క్షేమములకై పంచి పెట్టు సుందరస్వరూపుడును, ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును, సదా పూర్ణానందములో మునిగి యుండువాడునగు సాయిపాదములకు సాష్టాంగనమస్కారములు చేయుచూ ఈ అధ్యాయమును ముగించెదము.


శ్రీ సాయినాథాయ నమః పదవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు