శ్రీ సాయిసచ్చరిత్రము /పదకొండవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (పదకొండవ అధ్యాయము )



శ్రీ సాయిసచ్చరిత్రము పదునొకండవ అధ్యాయము సాయి సగుణ బ్రహ్మస్వరూపుడు; డాక్టర్ పండిట్‌గారి పూజ; హాజి సిద్దీఖ్ ఫాల్కే; పంచభూతములు బాబా స్వాధీనము


సగుణ బ్రహ్మసవరూపమే శ్రీసాయిబాబా

భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములగా నవతరింపవచ్చును. (1) నిర్గుణస్వరూపము, (2) సగుణస్వరూపము. నిర్గుణస్వరూపమునకు అకారము లేదు. సగుణస్వరూపమునకు అకారము గలదు. రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే. మొదటిదానిని కొందరు ధ్యానింతురు; రెండవదానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణస్వరూపమును పూజించుటయే సులభమని కలదు. కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు అకారము గలిగి యున్నాడు; కావున సహజముగ భగవంతుని గూడ అకారముతో సగుణస్వరూపునిగ భావించి పూజించుట సులభము.

కొంతకాలమువరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించినగాని మన భక్తి ప్రేమలు వృద్దిచెందవు. క్రమముగ అ భక్తి నిర్గుణస్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము - ఈ ఏడును పూజనీయములు, కాని సద్గురువు వీని యన్నిటికంటె నుత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించెదము గాక~ వారు రూపుదాల్చిన వైరాగ్యము; నిజభక్తులకు విశ్రాంతిధామము. వారి వాక్కులయందు మనకుగల భక్తియే యాసనముగ, మనకోరికలన్నియు విసర్జించుటయే పూజా సంకల్పముగ జేసి వారిని ఉపాసింతుము గాక! కొందరు సాయిబాబా యొక భగవద్భక్తుడనెదరు; కొందరు మహభగవతుడందరు; కాని మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని యవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, ఋజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్యసంతుష్టులు. శ్రీసాయిబాబా యాకారముతో కనిపించినప్పటికి వాస్తవమునకు వారు నిరాకారస్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగరసంగమం చేయబోవుటకు ముందు దారితో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లుచేమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహర్తుల దాహన్ని తీర్చుచూ సాగిపోతున్నటులే, సాయిబాబా వంటి మహత్ములు తమ జీవనగమనంలో జనులకు నుఖశాంతులను ప్రసాదించుచూ జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీతయందు శ్రీకృష్ణుడు, మహత్ములు తన యాత్మయనియు, తన సజీవప్రతిమయనియు, తానే వారనియు, వారే తాననియు నుడివియున్నాడు. వర్ణింపనలవికాని యా సచ్చిదానంద స్వరూపమే శిరిడీలో సాయిబాబా రూపమున నవతరించెను. శ్రుతులు బ్రహ్మమును ఆనందస్వరూపముగా వర్ణించుచున్నవి (తైత్తిరీయ ఉపనిషత్తు). ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కాని భక్తులు ఈ అనందస్వరూపమును శిరిడీలో అనుభవించిరి. సర్వమునకు అధారభూతమగు బాబా ఉపాధిరహితుడు. వారు తమ యాసనము కొరకు ఒక గోనెసంచి నుపయోగించెడివారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి, ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి, వారివారి భావాన్ననుసరించి తనను పూజించుట కెట్టి యభ్యంతరము జూపకుండెను. కొందరు చామరములతోను, కొందరు విసనకఱ్ఱలతోను విసరుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరువారికి అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి. కొందరు వారికి చందనము, అత్తరు పూయుచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. శిరిడిలో నివసించుచున్నట్లు కాన్పించినప్పటికి వారు సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండెడివారు. సర్వాంతర్యామియగు యాసద్గురుమూర్తికి మా వినయాపూర్వక సాష్టాంగనమస్కారములు.

డాక్టరు పండితుని పూజ

తాత్యసాహెబు నూల్కరు మిత్రుడైన డాక్టరు పండిత్ యొకసారి బాబా దర్శనముకై శిరిడీ వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్‌కేల్కరు వద్దకు పోమ్మని బాబా చెప్పెను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను. దాదాభట్ అతనిని సగౌరముగా అహ్వనించెను. బాబాను పూజించుటకై పూజాసామాగ్రి పళ్ళెముతో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టరు పండిత్ కూడ అతనిననుసరించెను. దాదాభట్ బాబాను పూజించెను. అంతకు మునుపెవ్వరును బాబా నుదటపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయుచుండెను. కాని యీ అమాయికభక్తుడగు డాక్టరు పండిత్ దాదాభట్ యొక్క పూజాపళ్ళెరమునుండి చందనమును దీసికొని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగ వ్రాసెను. అందరికి అశ్చర్యము కల్గునట్లు బాబా ఒక్క మాటయిననూ అనక యూరకుండెను. అనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లడిగెను. "బాబా! మేమెవరయిన మీ నుదుటిపై చందనము పూయుదుమన్న నిరాకరింతురే? డాక్టరు పండిత్ వ్రాయగా ఈనాడేల యూరకుంటిరి?" అందులకు బాబా ప్రసన్నముగ యిట్లు సమాధానమిచ్చెను: "నేనొక ముసల్మానుననీ, తానోక సద్ర్బాహ్మణుడననీ, ఒక మహమ్మదీయుని పూజించుట ద్వారా తాను మైలపడిపోవుదుననే దురభిమానము లేకుండా, అతడు నాలో తన గురువును భావించుకొని, అట్లచేసెను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను?" దాదాభట్ అ తరువాత డాక్టరు పండిత్ ప్రశ్నించగా అతడు, బాబాను తన గురువుగా భావించి తన గురువున కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితిననెను.

భక్తులు వారివారి భావానుసారము తమను అరాధించుటకు బాబా సమ్మతించినను, ఒక్కొక్కసారి వారి మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పళ్ళెమును విసరీపేయుచు ఉగ్రావతారమును దాల్చెడివారు. అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా యెవ్వరికి ధైర్యము చాలెడిదికాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనముకంటె మెత్తగా గనిపించెడివారు. అప్పుడు వారు శాంతిక్షమలకు ప్రతిరూపమువలే గాన్పించుచుండిరి. బయటికి కోపముతో నూగిపోవుచూ, కళ్ళెఱ్ఱజేసినప్పటికి, వారి హృదయము మాత్రము మాతృహృదయమువలే అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరతీసి, "నేనెప్పుడు యెవరిపైనా కోపించి యెరుగను. తల్లి తన బిడ్డలనెక్కడైనా? నేను మిమ్ములనెందుకు నిరాదరించెదను? నేనెప్పుడు మీ యోగక్షేమములనే అపేక్షించెదను. నేను మీ సేవకుడు, నేనప్పుడూ మీవెంటనే యుండి, పిలిచిన పలుకుతాను, నేనప్పుడు కోరెది మీ ప్రేమను మాత్రమే!" అనెడివారు.

హాజీ సిద్దీఖ్ ఫాల్కే

బాబా యెప్పుడు ఏ భక్తుని ఎట్లు అశీర్వదించునో యెవరికి తెలియదు. అది కేవలము వారి ఇచ్ఛపై అధారపడియుండెను. హాజీ సిద్ధీఖ్ ఫాల్కే కథ ఇందు కుదాహరణము. సిద్దీఖ్ ఫాల్కేయను మహమ్మదీయుడు కల్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట శిరిడీ చేరెను. అతడు చావడి ఉత్తరభాగమున బసచేసెను. తొమ్మిదినెలలు శిరిడీలో నున్ననూ, బాబా వానిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగలో కూర్చొనుచుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశానిస్పృహలకు లోనయ్యెను. ఏమి చేయుటకు అతనికి తోచుకుండెను. నిరాశ చెందవద్దనీ, నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు, మాధవరావు దేశపాండే (షామా) ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్దించుననియూ కొందరు భక్తులతనికి సలహనిచ్చిరి. అటులేయని, తన తరపున బాబాతో మాట్లడుమని షామాను ఫాల్కే వెడుకొనెను. షామా యందులకు సమ్మతించి, ఒకనాడు సమయము కనిపెట్టి, బాబాతో నిట్లనియెను:

"బాబా! అ ముదుసలి హాజీని మసీదుతో కాలుపెట్టనీయ వేల? ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు. అ హాజీని మాత్రమెందుకు అశీర్వదించవు?" దానికి బాబా యిట్లని జవాబిచ్చెను: "షామా! ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు. నీకివన్నీ అర్ధం కావు. అల్లా యొప్పుకొననిచో నేనేమి చేయగలను? అల్లామియా కటాక్షము లేనిచో యీ మసీదుతో పాదము పెట్టగలుగూ రెవ్వరు? సరే, నీవు వానివద్దకు పోయి వానిని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో యడుగుము!’ షామా పోయి హాజీని అ విషయము అడిగి, తిరిగి బాబా వద్దకొచ్చి, హాజీ అందులకు సమ్మతించెనని చెప్పెను. నలుబదివేల రూపాయలు నాలుగు వాయిదాలలో నివ్వగలడేమో కనుగొనుమని తిరిగి బాబా యడిగెను. షామా వెంటనే పోయి, హాజీ తాను నాలుగు లక్షలు కూడ ఇచ్చుటకు సిద్దముగా నున్నాడని జవాబు తెచ్చెను. సరే మరల పోయి వాని నిట్లడుగుము, "మసీదులో ఈ నాడు మేకను కోసెదము. వానికి దాని మాంసము కావలెనో, వృషణము కావలెనో కనుగొనుము." బాబావారి కొళంబా(మశీదులో బాబా భిక్షచేసి తెచ్చిన పదార్దములుంచెడి మట్టిపాత్ర)లో నున్న చిన్నముక్కతోనైన సంతుష్ఠి చెందెదనని షామా ద్వారా హాజీ బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొళంబా, నీటికుండలను బయటకు విసరివైచి, తిన్నగా చావడిలో నున్న హాజీ వద్దకు బోయి, తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని, త్రీవస్వరంతో : నన్ను గురించి యేమనుకొనుచున్నావు? నీవేదో గొప్పవాడివనీ, పెద్ద హాజీవని గొప్పలు పోవుచూ, యేమిటేమితో వదరుచున్నవే? నా దగ్గరా నీ అటలు? ఖురాను చదివి నీవు తెలుసుకొన్నదిదేనా? మక్కామదీనా యాత్రలు చేసితిననే గర్వంతో నేనెవరో తెలిసుకొనలేకున్నావు!" అనుచూ, యేమేమో యింకనూ అతనిని తిట్టి, మసీదుకు మరలి వెళ్ళెను. బాబా అగ్రహవేశములను చూచి హాజీ గాబరా పడెను. అ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టెను. అప్పటినుంచి హాజీని బాబా ప్రేమాదరములతోచూచుచూ, భోజనమునకు బిలుచుచుండెను. హాజీ అనాటి నుంచి తన కిష్టము వచ్చినప్పుడెల్ల మసీదులోనికి వచ్చిపోవుచుండెను. బాబా యొక్కొక్కప్పుడు వానికి డబ్బు నిచ్చుచుండెను. బాబా దర్బారులో అతనుగూడ యొకడయ్యెను.

పంచభుతములు బాబా స్వాధీనము

బాబాకు పంచభుతములు స్వాధీనములని తెలుపు రెండు సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ యధ్యాయమును ముగించెదను.

(1) ఒకనాడు సాయంకాలము శిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు అకాశమును కప్పెను. గాలి త్రీవముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేలయంతయు జలమయమయ్యెను. పశుపక్ష్యాధి జీవకోటితో సహ జనులందరు మిక్కిలి భయపడిరి. శిరిడీగ్రామంలో కొలువైయున్న శని, శివపార్వతులు, మారుతి, ఖండొబా మొదలైన దేవతలెవ్వరూ వారిని అదుకొనలేదు. కావున వారందరు మశీదుకొచ్చి బాబాను శరణుజోచ్చిరి. తుఫానును అపివేయుడని బాబాను వేడుకొనిరి. అపదలో నున్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా "అగు, నీ త్రీవతను తగ్గించు, నెమ్మదించు" మని గర్జించిరి. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలివీచుటమానెను. తుషాను అగిపోయెను. చంద్రుడు అకాశమున గనిపించెను. ప్రజలందరు సంతుష్టించెంది వారివారి గృహములకు బోయిరి.

(2) ఇంకొకప్పుడు మిట్టమధ్యాహ్నము ధునిలోని మంటలు అపరిమితముగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగయుచుండెను. మసీదులో కూర్చొన్నవారి కేమి చేయుటకు తోచలేదు. ధునిలోని కట్టెలు తగ్గింపుడనిగానీ, నీళ్ళు పోసి మంటలు చల్లార్పుడనిగాని బాబాకు సలహ నిచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి, తమ సటకాలతో ప్రక్కనున్న స్తంభముపై కొట్టుచు, "దిగు దిగు, శాంతించుము" అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు, కొంచము కొంచము చొప్పున మంటలు తగ్గిపోయి, ధుని యధాపూర్వము మితిముగ మండసాగెను.

భగవదవతారమైన శ్రీసాయినాథుడట్టివారు. వారి పాదములపైబడి సాష్టాంగనమస్కారము చేసి, సర్వస్యశరణాగతి వేడినవారినెల్ల వారు కాపాడెదరు. ఎవరయితే భక్తి ప్రేమలతో నీ యధ్యయములొని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నిటినుండి విముక్తులగుదురు. అంతేకాక సాయియందే యభిరుచి, భక్తి కలిగి త్వరలో భగవత్సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నియు నెరవేరి, తుదకే కోరికలు లేనివారై, ముక్తిని బొందెదరు!



శ్రీ సాయినాథాయ నమః పదునొకండవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు