శ్రీ వేమనయోగి జీవితము/జీవిత విశేషాలు

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీ వేమనయోగి జీవితము.

మహానుభావుల చరితములు అప్రతిమానవిరాజితములు, వానివైభవము జెప్ప నలవిగానిది. అందలి యభిప్రాయములు సాధారణముగా నందఱికిని బోధపడునవి కావు. ఇట్టిమహానుభావులు నూటికి కోటికి యొక్కరైన నుండుట యరుదు. ఎచ్చటనైన మనము చేసిన పుణ్యముకొలది లభించిరేని యట్టివారినే ముందు పూజింపవలయును. వీరుఅందఱివలె సామాన్యమనుష్యులలో జేర్పతగినవారు కారు. ఇట్టివారు భూలోకమున జనించి మహాకార్యముల ననేకములను జేసి జనుల తరింప జేయుదురు. తత్త్వము నుపదేశించెదరు. వీరు కేవలము ఈశ్వరాంశసంభూతులై పుట్టెదరు. ఏ దేశమున నైనగాని ఏకాలమున నైనను గానీ దాంభికులు కొండఱు బయలుదేరి ప్రజలను, అసత్యమతమునందును అబద్ధపు జాతులయందును నెట్టి వంచించి దారిజూపక స్వకీయులనియైన నాలోచింపక బాధించుచుండుట సహజము. అట్టిసమయమున భగవంతుని యనుగ్రహముచే తదంశమున జనించి అసత్యబోధకములగు జాతిమతముల రూపు నడగించి ధర్మమును నిలువబెట్టెదరు. ఇదియే నిజమగుధర్మము. ఈధర్మమునే మహాభారతయుద్ధసమయమున నర్జునుడు హింసకు భయంపడి మ్రాన్పడి యున్నప్పుడు కృష్ణభగవానులు, ఆయనకు శ్రుతుల యందలి గీతావాక్యముల నుపదేశించుచు "పరిత్రాణాయాసాధునాం వినాశాయ చదుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే" అని చెప్పెను."ఓ అర్జునుడా! సత్పురుషులను రక్షించుటకును దుర్మార్గులను శిక్షించుటకును ధర్మమును నిలువబెట్టుటకును ప్రతియుగమునందును నవతారము నెత్తుచున్నాను." అని దీనికి తాత్పర్యము. ప్రకృతము మన వేమనకవిగారు అట్టిభగవదవతారములలో జేర్పదగినవాడు. ఈయన పదునైదవశతాబ్దములోనివాడు. రెడ్లు అనునాలవజాతివా రగు శూద్రజాతిలో జేరినవారు.

వేమన స్థలకాలాది నిర్ణయము.

వేమన్న యన ఎవ్వరినో సాధారణముగా చెప్పు "కామన్నమల్లన్నల" బోలె తలంపనలదు. ఈ మహానుభావు డాగర్భశ్రీమంతుడు. మహారాజుకూడను. వీరిది రెడ్లవంశము. ఆంధ్ర దేశమును పాలించిన రెడ్ల రాజులు కొందఱు అద్దంకిని రాజధానిగా చేసికొనియు మఱికొందఱు కొండవీటిని రాజధానిగా చేసి కొనియును పాలించిరి. ఇఱు తెగలలోను వేమన యను పేరు గలవా రుండిరి. ఇఱువురును కోమటివెంకారెడ్డి వంశీయులే అయినను అద్దంకినేలిన వేమభూపాలుడు వేమనయోగికంటె భిన్నుడు. అద్దంకివేమన చరితమునే అబినవబాణు డనువాడు. "వేమభూపాలచరిత మ"ను పేరున సంస్కృతమున గద్య కావ్యముగా రచించెను. అందద్దంకిరాజులవంశవర్ణనగలదు, దానిలో మన వేమనకవినిగాని ఈయన జీవితమును గూర్చినసూచననుగాని తుదకుశతకపు ప్రస్తావనగాని సూచించి యుండలేదు. అందువలన మన వేమన అద్దంకివేమన కాజాలడు. కొండవీడులో నున్న వేమనయే కావచ్చును. శతకములో కొన్నిపద్యముల భాషావైఖరిని బట్టిచూడగా ఈ యంశము దృడమనియే తేలుచున్నది కొండవీటి రెడ్లు పదునైదవశతాబ్దపువారని యనేక శాసనములయు చరిత్రాకారులయు అభిప్రాయమై యున్నది. కావున మన వేమనకవియును కొండివీటిరెడ్లవంశమున జనించినవాడును, పదునైదవశతాబ్దమువాడే యగును.

వేమన గ్రంథమును చేయుటకు కారణము

వేమన గ్రంథమును చేయుటకు అనేకుల నేకములను కారణములనుగా చెప్పెదరు. అందు గొన్ని పిట్టకథలు, మఱికొన్ని సంస్కృతభాషలో కాళిదాసుపైనను భర్తృహరిపైనను గలిగినట్టి రంకుబొంకు కథలు, ఇకగొన్ని హిందీభాషలో తులసీదాసుని కారోపించిన రీతిని యమాయికత్వసూచకములు మఱియును గొన్ని బంగాళీలో ఠకుర్‌జీయందు బెట్టినట్లు మహత్త్వమును చూపునవి. ఇట్లు పెక్కులు గలవు. వీనినన్నింటిని నమ్మినయెడల నిజమగుచరిత్ర జ్ఞానమునకు భంగముకలుగును. కావున సాధ్యమైనంతవఱకు అట్టివానిని విమర్శించి నిజములగు కథల నేఱ్పఱుచుట జీవిత లేఖకునకు ముఖ్యమగు కార్యము. అట్టిదానిని కూఱ్చుటకు గవికృతములగు గ్రంథములు ఆధారములగును. మన వేమన రచించిన యితరగ్రంథములు ఏవియును లేవు. కూడినవఱకు వేమన గ్రంథమునుండియే అట్టివానిని వెదుక వలయును. వేమన తన గ్రంథమును సుబోధకమును ఇంపుజనింపునదియు నగు శైలిలో వ్రాసెను. ఆవ్రాయుటలో నెన్నియో విషయములను దురవగాహములైన వానిని సులభముగా వాక్రుచ్చెను. నిజముగా పైనుదహరించిన భర్తృహరి తులసీదాసు మున్నగువారి యొక్క "నీతిశతకము, వినయపత్రిక" మొదలగు గ్రంథములు లోకమునకు వినయవిధేయతలను సత్యమతస్వరూపమును నీతిని బోధించుటకే పుట్టినవి. మన వేమనకవిగారి గ్రంథజననము గూడనందుల కే. దొఱకినంతలో వేమనపద్యములన్నిటిని విమర్శించి చూడపెక్కులు "తత్వమార్గమునకు" అనగా నిజమగు వేదాంతవస్తువును బోధించుటకు సంబంధించి నవి గలవు. ఒకపర్యాయ మితరమతముల ననగా రామానుజాదిమతముల నిందలును గలవు. వీనిని బట్టి చూడ మన వేమన శైవుడని తేలును. శైవుడన్నంతమాత్రముచేత లింగధారణము ముద్రలునతనికి గిట్టవు. ఇట్టివానిని ఎక్కువగా నిందించి యున్నవాడు. వీనియన్నిటికంటెను పెక్కుచోట్ల నామములను వానిని ధరించినవారిని నిందించి యుండెను. వీటిని నన్నిటిని బట్టిచూచినను "మొత్తముమీద నీమహానుభావుడు చెప్పిన తత్త్వవిషయము త్రిమతములలో దేనికి సంబంధించియుండును" అని విమర్శించినను, శివభక్తిప్రధానముగా గలసాత్వికుడగు నద్వైతియని బోధపడును. 15 వ శతాబ్దపు చరిత్రములు గూడ నాకాలమున రామానుజమత ప్రాబల్యమును తదుపశమనమునకై శైవమత విజృంభణమును సూచించుచున్నవి. ఆపదునేనవశతాబ్దములో "వాడువీడనక" యందఱును అసత్యమతముల నవలంబించి చెడిపోవు చుండుటచేత వేమన భర్తృహరి మొదలగు వారివలెనే నయమున భయమున ప్రజలకు నీతిని మతమును నేర్పుటకై అతిసులభశైలిలో నీపద్యములను రచించి వెలయించెనని తేలుచున్నది. సత్యాన్వేషణబుద్ధితో విమర్శించిన బుద్ధిమంతు లీవిషయముల నొప్పికొనకపోరు.

అయినను లోకములోని కథలలో వేమన్నగారికి గ్రంథకరణమునకు కారణములుగా చెప్పెడివానిలోనివి. చక్క జేసి వాస్తవములను నభిప్రాయముచేత కాకపోయినను చదువరుల కొకవిధమగు నానందమును కొలుపగలవను నూహతో నొకటిరెండింటిని ఈక్రిందపాఠకుల కుపాయనములనుగా చేయుచున్నాను. వేమనపద్యములను గూర్చి కవితావిషయమును గూర్చి "ముద్దులు మూటగట్టెడి మధురశైలితో నింపుగారచన జేయబడినది" అనుటకంటె ఎక్కువచెప్ప బనిలేదుగదా!

1 - వ కథ.

ఆంధ్రదేశమును పదునాల్గవ శతాబ్దమునుండి పదునైదవశతాబ్దమువఱకు రెడ్లు పాలించియుండి రనుట చర్విత చర్వణము. అట్లు పాలించినవారిలో కొందఱద్దంకిని ప్రధాననగరమునుగా జేసికొనియును, నిక గొందఱు కొండ వీడును ముఖ్యపట్టణముగా జేసి కొనియును మఱియు గొందఱు రాజమహేంద్రనగరమును రాజధానినిగా జేసికొనియును త్రిలింగ దేశమును పరిపాలించుచు వచ్చుచుండిరి. ఇట్టి రెడ్డి వంశమునందు జనించిన మనవేమనకు మొదటిపేరు వేమారెడ్డిగారు. ఈయన కొండవీటిసీమ కధిపతియగు కొమరగిరి వేమారెడ్డి ప్రభువుల కొమరుడు. ఈయనజనని మల్లమ్మారాణిగారు. ఈయన తండ్రికి మూడవకొమరుడు. ఇతని పెద్దయన్న పేరు కోమటి వెంకారెడ్డి, వేమనవంశీయులందఱును పంటరెడ్లతెగలో జేరినవారును శైవమతాభినివేశము గలవారలునై యుండిరి. పంటరెడ్ల యాస్థానకవులే గదా! మన యాంధ్రభాషాప్రపంచమున ననుపమానపాండిత్య ప్రతిభాశాలురని ప్రసిద్ధిజెందిన శ్రీనాథ భాస్కరాదికవులు.

కోమటి వేమన్న కథ.

వేమారెడ్డివంశమునకు మూలపురుషుడు దొంతి అలియరెడ్డి యనువారు, ఈయన ఆ కాలములో ననుముకొండయందు నివసించుచు వ్యవసాయము జేసికొని సామాన్యుడగు కర్షకునిబోలి జీవించుచున్నను ధనికుడనియే పేరొందెను. ఈయలియరెడ్డిని గూర్చి జనులిట్లు తలంచుట కొక కారణమును గా నీక్రిందికథను చెప్పెదరు. మున్నొకప్పుడు వేమన్న యనుపేరుగల కోమటి యొక్కడు యాత్రార్థియై శ్రీశైలమునకు జని భ్రమరాంబికా మల్లేశ్వరుల సేవలొనర్చుకొని కొంతకాల మచట నివసించెనట! శ్రీశైలపర్వతము అరణ్యమధ్యమునం దుండుటచేత యాత్రికు లెప్పు డనిన నప్పు డచ్చోటికి బోవరు. సంవత్సరమున కొకతూరి మహాశివరాత్రి కాలమున దర్శనార్థులై ప్రజలు గుంపులు గుంపులుగా గూడి యడవిజంతువుల వలని బాధలేకుండ కట్టుదిట్టములను చేసికొని పోవుచుందురు. మనకథలోని కోమటి వేమన్న యాత్రకు పోయి ఉత్సవ మంతయును సమాప్తమై వచ్చిన యాత్రికు లందఱును మఱలి స్వగృహములకు బోయినను ఇతడుమాత్ర మటనుండి పోకయుండుట గని యచ్చటి యర్చకుడు సందేహము జెంది "యాత్రికులందఱు వెడలిపోయినను ఈయడవిలో నొంటరిగా నీవెందులకుంటివి? అని యడిగెనట. అందునకు కోమటివేమన్న ఒక సంవత్సరమిటనుండ తలపుగొంటినన సరి నీవుండ వచ్చును కాని దేవాలయమున కుత్తరపుదిక్కునకు మాత్రమెప్పుడును బోకూడదని యర్చకుడు పలికెను. అటుతఱువాత నొకనాడు కోమటివేమన్న తనలో తాను ఈదేవలుడు నన్నుత్తరమునకు బోవద్దని యనుటకు గారణ మేదియైన నుండనోపును; అదికను గొనియెద ననినిశ్చయించికొని అడవిలో పోయిన త్రోవను గుర్తుపెట్టికొనుటకై తన చెఱగున నున్న నువ్వులను దారి కిరుప్రక్కలను చల్లుకొనుచు పోయి అక్కడ కొన్నిరోజులుండి పరిశోధించి యచ్చట పరసవేదియుండుటను తెలిసికొని మఱునాడు రెండు కుండలను సంపాదించికొని కావడి గా నమర్చికొని పరసవేదిని నింపుకొని ఇతరులకు తెలియకుండ పైని గడ్డిగాదము గప్పికొని యనుముకొండకు చేరి రాత్రిసమయ మగుటచేత దొంగలబాధకు భయపడి అలియరెడ్డి యింటికి పోయి ఆయనవలన ఆరాత్రి యచ్చటబరుండుట కనుజ్ఞనొంది పసులకొట్టములో కావడిదింపి భోజనము సేయ జేరువనున్న నొకపూట కూటింటికి బోయెనట. ఇంతలో అలియరెడ్డి పసుల కొట్టమునకు వచ్చి తళతళ మెఱయుచుండుటను కనుగొని పరిశీలించి పరస వేదియని తెలిసికొని ఆకుండలను జాగ్రత్తజేయించి కోమటి వచ్చులోపల కొట్టమునకు నిప్పంటించెనట. తఱువాత కోమటి భోజనముచేసి వచ్చి కొట్టము ముట్టికొని మండుచుండుటను చూచి నిర్భాగ్యుడనగు నాకు పరసవేది యంటునా? యని విచారపడుచు దానిపై యాసను వదలుకొనలేక యామంటలో బడి మడిసెనట. ఆపిమ్మట కోమటి పిశాచమై పీడలు చేయుండ నళియరెడ్డి మ్రొక్కులు మ్రొక్కికొని ముడుపులు కట్టుకొని అతనిరూపమును బంగారు ప్రతిమను చేసి పూజించి యెట్టకేలకు ఆపిశాచపుకోమటిని తృప్తినొందించి ఇకమీద తనకుగల బిడ్డలకందఱికి వేమన్న పేరు బెట్టెద నని ప్రస్తుతమున తనకొడు కగు పుల్లారెడ్డికి పుల్లయ వేమారెడ్డి యనిపేరు పెట్టెనట. కథముగిసినది. ఇది వేమనవంశమునకు మూలపురుషుడగు నలియరెడ్డిని గుఱించినది. వేమనవంశీయులు ధనికులు అని చెప్పుటకో ఏమొ? అలియరెడ్డిపై నిట్టికథ కల్పితమైనది.

ఆదొంతి అలియరెడ్డి 1323 వ సంవత్సర ప్రాంతమున ననుమకొండ నేవోకొన్ని కారణములచే వదలి కొండవీడున నుండి కాలధర్మము నొందెను. అటుపిమ్మట పుల్లయవేమారెడ్డి స్వతంత్రుడై కొండవీడునకధిపతియై పల్నాడు సీమలోని కొంతభాగము నాక్రమించికొనియెను. ఈయన చాల ధర్మాత్ముడట. 108 శివాలయములను గట్టించి నిత్యనై వేద్యదీపారాధనల నేర్పఱచెనట. షుమారు 12 సంవత్సరములు రాజ్యముజేసి కైవల్యము జేరెను. ఇతనికి అనపోతవేమారెడ్డి యని తమ్ము డొకడుండెను. పుల్లయవేమారెడ్డి తఱువాత నీయన రాజ్యమున కధిపతియై వృద్ధినొందించి కొండపల్లిలో కోటనుకట్టించినట్లును, కొండవీడు, అద్దంకి రాయచూరులను గూడ పరిపాలించి నట్లు గూడ అమరేశ్వరములోని యొక శాసనమువలన తేలుచున్నది. అనపోతవేమారెడ్డి పరిపాలన కాలమున గూడ నొక చిత్రకథ జరిగినదని జనులవాడుక.

2. అనపోత వేమారెడ్డిని గూర్చిన కథ.

ఈయన పోతవేమారెడ్డి ప్రభుత్వము చేయుకాలమునందు కొండవీటికొండపైని నొకగోసాయి నియతాత్ముడై యుండెను. ఆతనికి ప్రతిదినమును నొకగొల్లడు పాలగొనిపోయి సమర్పించు చుండెడివాడట. ఒక రోజు గోసాయి చాలదయగలవాని వలె యాగొల్లవాని చేర బిలిచి "దినమును నా కెందులకు బాలనిచ్చు చున్నావు? ఇందువలన లాభమేమి మానుకొ"మ్మని మందలించెను. గొల్లడును "నేను కోరిక లేకయే మీకు బాలిచ్చుచున్నా"నని మారువల్కి తనపూన్కిని విడనాడకు పాలను సమర్పించుచునే యుండెనట. ఇట్లు కొన్నిదినములు గడచెను. ఒకదినమందు యధాప్రకారముగా పాలను కొని తెచ్చిన గొల్లని బిలిచి "యోరీ నిన్ను జూడ నాకు జాలిగలుగుచున్నది. నీకు మేలుచేయవలయునని తలచితిని నేను చెప్పునట్లు చేయుదువా? "యని యడిగెను. గొల్లండునువల్లెయనెను. గోసాయి తన కెదురుగా నొకమానిసిలోతున గోతి నొకదానిని త్రవ్వ వాని కాజ్ఞాపించె. గొల్లం డట్టులే చేసెను. ఆపిమ్మట ఎండిన కట్టెలను చిదుగులను నందుబేర్చి నిప్పంటించి భగభగమనిమండుచున్న సమయమున నా గొల్లని ఏవేవి మాటల నిష్టగోష్టిగా చెప్పుచు వాని నాగోత బడద్రోయ బ్రయత్నించె నట. అందుపై నిరువురకును నెట్టుకొనుటలు జఱిగినయవి చివరకు గోసాయినే గొల్ల డామంటలో బడనెట్టి పాఱిపోయెను. గోసాయి నీఱయ్యెను. మఱురోజు గడచిన తఱువాత గోసాయి యేమయ్యెనో? చూతముగాక యనుకొని గొల్ల డచ్చటికి పోయి నాగోతియందు చూచును గదా! ఎంతవింత? గోసాయి గోడగడ్డలై ఎక్కడపోయెనో కాని యాస్థానమున మనుష్యుని యంతంత పొడవుగల రెండుబంగరువిగ్రహము లచ్చట మెఱయుచుండెను. వాడును ఏరికి దెలియనీక తాను రహస్యముగా వానినింటికి గొనితెచ్చి దారిద్ర్యకారణమున దినముల పేరిట ఆబంగారు విగ్రహముల కాళ్ళు వ్రేళ్లు చేతులు మొదలగు నవయములను తెగనఱికి అమ్ముకొనుచుండ నెట్లోతెలిసికొని మనయనపోత వేమారెడ్డిగారు "రత్నహారీతుపార్థివ:" యనున్యాయానుసారియై వానిని బొక్కసము జేర్పించెకొనెనట, ఈయన తఱువాత మనశ్రీనాథాదికవికల్పకముల కాలవాల మగుననవేమారెడ్డి కొంతకాలమును ఈతనికుమారుడు కొమరిగిరి వేమన్న కొంతకాలమును రాజ్యము బాలించిరి. అప్పటినుండి యనగా కోమటివేమన్నను చంపినప్పటనుండి వెల్లడిగా నతని పెద్దకొమారునకు కోమటివెంకారెడ్డి యనిపే రుంపబడియెనట.

వేమనయోగి వెలయాలిపై రోయుట.

ఈకోమటి వెంకా రెడ్డియును మన వేమన యోగియును నన్నదమ్ములు. వెంకారెడ్డిగారు రాజ్యపాలనము జేసి చన్నరాజులకంటె మిన్నయనియును, ప్రజాపక్షపాతి యనియును ధర్మస్వరూపుడనియును బేరుగాంచినవాడు. ఈయన కొంచెమించుగా బదుమూడవ శతాబ్దాంతమున సింహాసనాసీనుడై 14 శతాబ్దమున, ప్రథమభాగమున నుత్తమలోక సాయు జ్యము నొందెను. ఇట్టిసమయములో ప్రకృతచరితమునకు సంబంధియగు కోమటివేమారెడ్డిభార్య నరసాంబ, ఈమె యమేయ ప్రభావ సమన్వితయగు పతివ్రత గుణవతియు నై యుండెను. రాజ్యపాలన భారమును వెంకారెడ్డివహించెను. ఇతని తమ్ముడును మన కథానాయకుడు నగు వేమన్నగారు ఇల్లువాకిలి, పిన్న పెద్ద, కష్టముసుఖము అనువిషయముల నించుకయైన యోచింపక తనయిచ్చ వచ్చినట్టులు అల్లరిచిల్లర వాండ్రతో చేరి తిరుగుచు పెండ్లిపేరంటమును వదలుకొని ప్రమత్తుడై యుండి కొన్నిదినములకు ఒకబోగముదాని నుంచికొని దానితో నిష్టగోష్టి ననుభవించు చుండెనట. సరి. ఇకపైనిచెప్పవలసిన దేమియున్నది, అసలే వెలయాలు అందునను ధనపిశాచి అచ్చటను రాజేబొజగు అయినచో నాతని రాబట్టి తనకు పాదసంవాహన మొనర్చు దాసునిగా చేసికొని యిల్లు గుల్లజేయించు స్వభావముగలది కదా! అందులో నికయిల్లేపట్టక పెల్లుగాస్వతంత్రతను వహించినవానిని బొంగరమువలె త్రిప్పుటలో వింతయేమున్నది? మన వేమన్నగారు మామూలు ప్రకారమొకనాడు తాను ప్రేమనిధానమని యెన్నుకొనుచున్న వేశ్యయింటికి బోగా నాపె యతివినయ వినమితమై చేరవచ్చి "నాముద్దు నొకదానిని చెల్లింపవలయును, అట్లుచేసిననే నేను జీవించెదను, లేకున్న లేదనిపల్క గట్టి గాచేసెదనని వేమన్న మాఱుపల్కెను. అదియును "మీవదినెగారు అగు నరసాంబారాణిగారు ధరించెడి యాభరణములన్నియు నాకు గావలయును నేను వానిని ధరించుకొందును మీరు నానందము నొంద్రెదరు. తెచ్చిఈయుం"డనె నట. వేమన్నయువల్లెయని వెడలిపోయి తనవదినెగారి నడిగెనట. సకలసద్గుణని కురుంబయగు నానరసాంబ మఱది మాటలను విని ఎట్లైనను విషయలంపటత్వము నీతనికి బోగొట్ట తలచి తన ముక్కుననున్న బులాకి తప్ప తక్కినసొమ్ముల నన్నిటి నిచ్చెను. వేమన్న సంతుష్టుడై వాటిని గొనిపోయి వేశ్యకిచ్చెను. అదియును నానగలతో నలంకరించికొని బులాకీలేకుండుట గని అదికావలయునని పట్టుపట్టెనట. ఆపల్కులను విని వేమన్న వేశ్యయం దించుకఱోసి మోహపాశమును త్రెంపలేక ప్రయత్నించెదనని కోటలోనికి జని వదినెగారిని యడుగ నోరురాక చింతతోపరుండి యుండగా నీవృత్తాంతము నెట్టులో దాసీలవలనవిని నరసాంబారాణి గారు స్వయముగా వచ్చి 'యేమి నాయనా! విచారముతో నున్నట్లున్నది' అనియడిగెను. వేమన్నయును తనవిషయలంపటతను నిందించికొని యున్నదున్నట్టులు చెప్పెను. ఆమెయు నాతడొక్కించుక దారిలోనికి వచ్చియుండుటను కనుగొని విషయములపై రోతపుట్టింపదగు సమయమిదియే యగు ననుకొని ఈ భాగ్యమున కింతగా విచారింపవలెనా లే లెమ్ము! ఇచ్చెదను. దీసికొనిపోయి నీయిష్టము దీర్చికొనిరమ్ము కాని నాకు నీవొక విషయమున ప్రమాణమును చేయుము. ఈయలంకారము నావెలయాలు ధరించికొన్న తఱువాత దానిని నగ్ననుకావించి ప్రతియ నయవమును చక్కగాపరికించి విశేషముల నాకు చెప్పవలయును అనిపలికి ప్రమాణమును చేయించికొని వేమన్న నంపెను.

పిమ్మట వేమన యత్యంతము కుతూహలావిష్టుడై ఆవారాంగనగృహాంగణము బ్రవేశించి దాని కొసగి యలంకరించికొను మనియెను. అదియును లేచి లేనిముసిముసినగవుల నగుచు అలంకరించికొని ఎదుటనిలచెను. వేమన్న తత్క్షణమే దానిని విగతవస్త్రగావించి పరికించిచూచి యసహ్యత జెందెనట. ఇదియే మన వేమా రెడ్డిగారు వేమన యోగిగా మారిపోవుట కంకురార్పణము చేసినసమయము. అప్పుడు వేమన విషయవాసనల దెగడి "ఇన్నిదినములు వ్యర్థుడనై ఈముఱికికూపములో బడి యుంటినే గానితరణోపాయము గానలేకపోయితిని గదా ఛీఛీ నిష్ప్రయోజకుడను" అనినిందించికొనుచు మితిమీరిన విచారముచేత ఇంటికిజని యెవ్వరికి నగుపడకయుండ నొకగదిలో పరుండెను. భోజన సమయమునకు వేమనరానందున నరసాంబగారు వెదకించి యెచ్చటను గానక యింటిలోవెదకి యొక గదిలో నొంటరిగాముసుగు నిడికొని పరుండిన వేమన్నను లేపి తోడుకొని పోయి భుజింప జేసెను. ఆదినము మొదలుకొని వేమన వేశ్యయింటికి బోవుట మానుకొని యుండుట నెఱింగి నరసాంబగారు మఱల మఱదిని విషయములవంక ద్రిప్పి గృహస్థధర్మావలంబినిగాచేయ దలంచి వేమన్నకు "మీయన్నగారు నాకుకొన్నినగలను చేయింప బూనుకొనియున్నారు. వానిని మననగరిలో కుందనపు పనివాండ్రగు నభిరామయ్య లక్ష్మయ్య యను గంసాలురు చేయుటకు ప్రతిదినమును వచ్చుచుందురు. నీవు ఊఱకయే యుందువు గనుక బంగారము పాఱుపొకుండ నచ్చటనుండి పనిచేయింపవలయును" అని యాజ్ఞ నిచ్చెను. వేమన్న యును అట్లేయని తమవదినె చెప్పిన చొప్పున ప్రతిదినమును కుందనపు మందిరమునకు బోయి కూర్చుని వారు చేయునగలు బంగారము మొదలగువానిని జాగ్రత్తతో బీఱువోకుండ కనిపెటుచుండెను.

అభిరామయ్య కథ.

కులముచే కంసాలియయ్యును అభిరామయ్య మంచి యాచారసంపన్నుడు నిహపరములపై శ్రద్ధకలవాడును కృతజ్ఞుడును విశ్వాసోచితుడగు పనివాడునై యుండెనేకాని ఇటీవలివారివలె లేనిపోని పిచ్చివేషముల పైనివేసికొనిన దంభగుణప్రధానులగు కొందఱిలో జేర్పదగినవాడు కాడు. అతడు ప్రతిదినమును నగరి వారిసొమ్ములను జేయుటకు నియతముగా సూర్యోదయమునకు రావలసియుండెను. 'కాని జాముప్రొద్దెక్కునప్పటికి కర్మశాలకు వచ్చి చేరుచుండెను. ఆతని తమ్ముడగు లక్ష్మయ్య మాత్రము ముందఱగా చనుదెంచి పనిని చేయుచు "అభిరామయ్య యేడి?" యని తన్నధికారులడిగిన యెడల 'ఈపాటికి వచ్చుచుండును, స్నానమును జేయుచున్నాడు.' అని ఏవో కొన్ని కారణములను వారి మనంబులకు నచ్చునట్లు చెప్పి తనసౌభ్రాతమును వెల్లడించుచుండెడివాడు.

ఇట్లు జఱుగుచుండ మన వేమనగారి కార్యదర్శిత్వము ప్రారంభమైనది మొదలుకొని యభిరామునిపై పూర్వముకన్న మిన్నగా నధికారశకట మితరుల ప్రోత్సాహము లేకయే పఱుగిడ నారంభించెను. 'ప్రతిదినమును ఆలస్యమేనా? పోనీ! ఒక్కరోజు కదాయని చూచినకొలదిని యధికమగుచున్నది ఇట్లయిన నోర్చుటలేదు జాగ్రత్తగా వచ్చుచుండుము' అనియొకదినమున వేమన కోపారుణితవదనుడై పల్కెను. అభిరాముడందులకు మనంబులో చాల కష్టమునొంది 'చిత్తముచిత్త'మని మాఱుపల్కెను. అవశజీవిక గలవార లింతకంటె నెక్కువ నేమని చెప్పగలరు? ఆరోజు గడచినది. మఱుసటి దినము నుండి యభిరామయ్య నియతముగా సూర్యోదయమునకే వచ్చుచుండె ననుకొందురా? లేదులేదు. మఱల యెప్పటియట్లే జాగుచేయుచుండెను. కొంతకాలము తఱువాత "చెప్పిననుకూడ తనయిచ్చవచ్చినట్లే చేయుచుండుట" వేమనను సరిగా గూరుచుండ నిచ్చినది కాదు. కావున మునుపటికంటె మిక్కిలిగా నాగ్రహించి పలికెను. ఆమాటనువిని యభిరామయ్య మనస్సులో నెంతటివిచారమును తెంపును బొందెనో గాని లేచి చేతుల గట్టికొని "మహాప్రభూ! జననమునుండియును దేవరయన్నోదకములచే పెఱిగినమేను లియ్యవి కావున నొకప్పుడైనను తమయాజ్ఞ నిసుమంతనైన నతిక్రమింపజాలము. కాని యీ తమనౌకరు ప్రతిదినమును స్నానము సంధ్య జపము తపము మొదలగువానిని ఆచరించికొనవలసియున్నది అందుచేత నాలస్యమగును. కాన జాముప్రొద్దగునప్పటికి గానిరాజాలను. క్షమింపవలయును." అనిపలికెనట! వేమన్నయు నందులకు కినిసి "నగరిపనికి నిష్ఠ లడ్డమువచ్చునా ? నీకర్మములను ముందుగానే తీర్చికొని మేము చెప్పినట్టులు ప్రతిదినమును నియతసమయమున వచ్చి పనిజేయకతప్ప"దని చెప్పి వెడలిపోయెను. ఈసంగతి ఎట్లో వేమన్న యన్నగారు విని "కొంపలవెంట దిఱుగు కోనంగి దాసరికంటెను కుటుంబియై గుణియై దైవభక్తిగల యభిరామయ్యయే మే"లని పల్కెనట. వేమన్న చెప్పినప్రకారము అభిరామయ్య రాక యెప్పటి యట్టులె యాలస్యము చేయుచుండెను. దీనిని చూచి వేమన్న ఇన్నిమారులు చెప్పినను ఇతడు మాటనులక్ష్యము పెట్టినవాడుకాడు. మనమిచ్చు ధనముకంటె గూడ నమూల్యమైన వస్తువు నితను సంపాదింప బూనెను కాబోలు నేమొ! అయినను ఎంతనిష్ఠగలవాని కైన నింతయాలస్యమా ? రేపు దీనినెట్లయినను కనుగొనవలయు నని నిశ్చయించికొనెను?

మఱునాడు వేమన రెండుమూడు గడియల రాత్రి యుండగనే లేచి యభిరామయ్య విషయమును సంపూర్ణముగా గని పెట్టుటకై యతనియింటి యొద్ద చేరి ఆసమీపమున నున్న చెట్టుపై గూర్చుండి యుండెను. కనికనచీకటి యుండగా నభిరామయ్య నిద్దుర లేచి చెంబుచేత బట్టుకొని వీరభద్ర విజయము మున్నగు స్తోత్రపాఠములను చదివికొనుచు కాల కృత్యముల నిర్వర్తించుకొనుట కూఱికి బయల నున్న కొలను జేరి పాదప్రక్షాళనమును ముఖశుద్ధినిచేసి స్నానము జేసికొని బట్టల నుదికి యారవైచికొని ఆబట్టలను గట్టికొని చేరువనున్న పూవులతోటలోని కేగి చేతిచెంబునిండ పూవులను కోసికొని కొండ కభిముఖుడై పోయెను.

ఇట్లు పోయిపోయి యచ్చటగుహలో గూర్చుని యోగము నవలంబించి యున్న లంబికాశివయోగిని దర్శించి సాష్టాంగముగా దండము నిడి చేతుల గట్టికొని నిలువబడెను. ఇంతకు ముందే వెనువెంటవచ్చుచున్న వేమన్నయును అభిరామయ్యకు గనుపడక యుండునట్టులు సమీపమునున్న చెట్టుచాటుననిలిచి యోగియొక్కయు నభిరామునియొక్కయు సంభాషణములను వినుచుండెను. ఇంతలో సమాధినుండి మఱలి యాలంబికాశివయోగిగారు, "నాయనా! శిష్యా! చాలకాలమునుండియును బత్తితో మాకు పరిచర్యలను సేయుచున్నావు మేమును నీయంతరంగమును మిక్కిలి జాగ్రత్తతో బరీక్షించితిమి, నీవిప్పుడుపదేశము నొందుటకు తగిన యోగ్యత నొందియున్నావు మాకునిచ్చటి నివాస కాలమును ముగియ వచ్చినయది కావున రేపటిదినము నీకుపదేశము నొసంగ దలచియుంటిని, ఎన్ని పనులున్నను ఱేపు తప్పక రావలయును సుమా?" యని పలికి మఱల ధ్యాన స్తిమితలోచను డయ్యెను.

అభిరామయ్యయును మఱల యోగికనులు దెఱచు నంతకునుండి సెలవుగైకొని కృతార్థుడనైతిని కదా యనిసంతసించుచు మఱలు లోపలనే వేమన్న యాతనికి తెలియకుండునట్లు త్వరగా వెనుకకుమఱలి దుకాణము జేరి కూర్చుండి యుండెను. అభిరామయ్యయును పిదప మెల్లగావచ్చెను. వేమన్నగారు మఱలయెప్పటి యట్టులు మంగళాష్టకములు బఠించి వెడలిపోయెను. అభిరాము డెప్పటియట్టుల వానినన్నిటిని శాంతుడై విని యూఱకయుండెను. వేమన యిప్పుడీ వెళ్లుట నేఱుగా తమవదినెగారియొద్ద కేగి యామె కాళ్లపై వ్రాలెను. ఆమెదీవించి లెమ్మని యాతని బలికెను. "అమ్మా నీవు మాతృసమానవు, నామనవి యొక్కటి యున్నది దానిని నీవు తీర్పవలయును. బిడ్డలకోర్కుల దీఱ్పని తల్లులు గూడనుందురా? నీవు నేను కోరినట్లు చేసెదనని చెప్పిననే మీకాళ్లనుండి లేచెదను. లేకున్నలేవను కాన చేసెదనని చెప్పు"మనియెను. ఆమెయు నట్లేయని పల్కెను. 'రేపటి యుదయమున సూర్యుడుదయింపకమున్నె అభిరామయ్యదుకాణములోనికివచ్చి రెండుజాములవఱకు పనిచేయునట్లు మాయన్నగారిచేత నాజ్ఞ యిప్పింపవలయును.' అనివేమన్న కోరెను. "నాయనా? బీదవాడభిరాముడు సాధువుకూడను వానికి మిక్కిలి మనస్సునొచ్చునట్టులు చేయకూడదు నీవు ప్రతిదినమును నాతని త్వరపెట్టుచున్నందుకే యాతని కింతవఱకు నొచ్చియుండును, అయినను దానివలన నీకు కలుగుఫలము జెప్పుము చేయించెద"నని పల్కు వదినెగారి మాటల కడ్డమై వేమన్న "నాయుపయోగమును తఱువాత జెప్పుదును" అని పల్కి ఆమెవలన వాగ్దానమును తీసికొని వెడలిపో యెను. నరసాంబయును ఆరాత్రి ప్రభువు భోజనమును చేసి సరసములందుండునప్పుడు మెల్లమెల్లగా దగ్గఱజేఱి బంగరుకమ్మ నొకదానిని చూపి "దీని జతదిపోయినది దీనిమాదిరిది నాకు ఱేపే కావలయును, దేవరతలచిన కొఱతయేమి? కావున నభిరామయ్యను రేపుతెల్లవాఱకముందే యిచ్చటికివచ్చి దుకానము తెఱచి రెండుజాములలోగానే సిద్ధము చేయులాగున నాజ్ఞాపింపవలయును" అనికోరెను. ప్రభువునట్టులే యనిపలికి వెంటనే యభిరామయ్యను బిలిపించి రాణిచెప్పిన చొప్పుననే ఖచితముగా నాజ్ఞనిచ్చి యంపి వైచెను. అభిరాముడింటికిబోయి విచారసాగరమగ్ను డై దరిగానక కొట్టుకొనుచుండెను.

'ఎన్నిరోజులనుండియో మేఘోదకా కాంక్షియగు చాతకపోతకమువలె నోరుదెఱచికొని ఎప్పుడు సిద్ధునియనుగ్రహము కలుగునాయని యెదురుసూచుచుండ నేటికియ్యదిఫలోన్ముఖమయ్యును పూర్వకృతకర్మమాహాత్మ్యముచేత గాబోలు విముఖమైపోవు గతిపట్టినది. ముందునూయియును, వెనుకగోయియును కదా? ఎట్టులు చేయుదును, జీవికను వదలుకొందునా? బ్రదుకుట యెట్లు? పోనీ యోగియుపదేశమునే వదలి పెట్టుదునా? బ్రదికి ప్రయోజనమేమి కలదు? అని విచారమునొంది ఎట్లైననుకాని "బ్రదికియుండిన శుభములు పడయవచ్చు" ననురీతిని మతినిసమాధానము చేసికొని మఱునాడు రాజభవనమున కుందనపు పనిచేయ బోవుటకే నిశ్చయించికొని భోజనము చేసిపరుండెను కాని నిద్దుర యెట్లుపట్టగలదు. ఎన్నిరోజులనుండియో చేసినకృషి, నిండిన చెరువునకు కట్టతెగ గొట్టినట్లుగా నొక్కదినములో పల వ్యర్థమైపోవును కదా యనుచింత, "కనులు మూసికొని నిద్రింపవలయు" నని యనుకొను నాతని నుఱ్ఱట్టులూపుచు ఎన్నిటినో పెక్కులను చిక్కులను బెట్టి కలవరము నొందించుచుండెను.

వేమన్నయును మఱుదినము పెందలకడనే లేచి యభిరామయ్య బోయిన త్రోవచొప్పుననే పోయి యాకొలనిలోనే స్నానము నాచరించి కొని పూవులతోటలోని పూవులను కోసికొని పర్వతపుగుహలో బ్రవేశించి శివయోగిసన్నధిని చేరి అభిరామయ్యకంటె నయిదారుమడుగు లెక్కువబత్తి గనబఱచుచు పూలచెంబుదోసలిలో నుంచికొని యోగియొక్క దయార్ద్రకటాక్షవీక్షణమునకై వేచియుండెను. యోగియును కొంతసేపటికి కనుల విప్పిచూచి ప్రతినిత్యమునువచ్చెడు పురుషుడుగాక నేడు క్రొత్త విగ్రహమునిలచియుండుట గనుగొని "ఎవరురా నీవు?" అని యడిగెను. వేమన్న వినయసంభ్రమములు ముప్పిరిగొనగ చిత్తము స్వామీ! దాసుడను. అభిరామయ్యగారి శిష్యుడను. వారు తమ యాజ్ఞ ప్రకారము రానెంచియుండగా "ప్రభువుల వసరమని చెప్పి యొకపనిని యొప్పగించిరి. కావున వారు రాలేక తమకు పూజాసమయము అతిక్రమించునో యేమొ యని నన్నుబిలచి పూవులు సమర్పింప బంచిన, వచ్చినవాడను" అని పలికి నమ్రుండై నిలువబడి యుండెను.

యోగి యామాటలను విని "మంచిది పూల నచ్చటనుంచి" వాడు వచ్చుచున్నాడేమొ! కనుగొను మనిపలికి కనులుమూసికొనెను. కపటియగు మన వేమన్నయును ఇటునటు జూచి యచ్చటనే నిలువబడి యుండెను. మఱలకొంతసేపు అయినతఱువాత కనులువిప్పి యోగి "ఏమిరా! యిచ్చటనే యుంటివా? వచ్చుచుండెనేమొ చూడు మని యంటినే చూచితివా? చూడు మనిపలికెను. మఱల వేమన్నయును క్రిందటిపర్యాయము వలెనే పది పండ్రెండడుగులు గుహదాటి వచ్చి రెండుమూడు నిమేషములు పరికించిన వానివలె యాలస్యముచేసి మరల గుహలోనికి పోయి "స్వామీ! వారింకను రాలేదు. చూడగా వారు వచ్చునను జాడయైనను కనుపట్టుట" లేదని విన్నవించి చేతులు కట్టికొని నిలు వబడి యుండెను. యోగియును "ఇక నభిరాముడు రాడని" నిశ్చయించుకొని వేమన్ననుజూచి "వాడు పరమదరిద్రుడురా? ఈనగాచి నక్కలపాలు జేయుచున్నాడు పోనీ నీవైననువచ్చితివి గదా. చాలును, రారార"మ్మని చేరబిలిచి శ్రోత్రమున తానుచిరకాలమునుండి సంపాదించి జపించిపునశ్చరణ జేసిసిద్ధి నొందించుకొనిన "చింతామణి" మంత్రము నుపదేశించి తనయోగదండముతోటి నాలుకపైని బీజాక్షరములను వ్రాసి, "పోయి నీగురునితోకలిసికొని యాతనిదయను సంపాదింపుము కృతకృత్యుడవు కాగలవు. పొమ్ము" అనిపలికి చూచుచుండగనే యచ్చటి వాడచ్చటనే యంతర్థాన మయ్యెనట-

చెట్టువేసినవాడొకరుడు ఫలముననుభవించువాడు వేఱొక డన్నట్టులైనది మనయభిరాముని సమాచారము. కానిండు. తఱువాత వేమనచరితము నఱయుదము. ఏమనిచెప్పవచ్చును. ఆమంత్రపు మహిమను! డొక్కచీఱినను ఒక్కయక్షరమునైన నెఱుగని మన వేమనకు, ఆమంత్ర మాహాత్మ్యమువలనను, బీజాక్షరముల ప్రభావాధిక్యతచేతను, తత్క్షణమే వేదవేదాంగాదిసమస్తవిద్యలును వాని వానియంతరార్థములును అందలిసారములును, ఆ సారము చేత నెఱుగదగిన, యుపనిషణ్మతప్రతిపాద్యుడైన యీశ్వరుని విగ్రహమును, చక్షు:ప్రీతిజే యుచు ప్రత్యక్షములై భాసిల్లిన యవి ఒక్కవేదవేద్యమగు నధ్యాత్మవిద్యమాత్రమే గాక ఎన్నియో యుగములు గురుశుశ్రూషల జేసి తదనుగ్రహమునను స్వానుభవమువలనను తెలియదగిన లోక తంత్రములన్నియును బొడకట్టినవి. ఇంతయేల వేమన్నకు తత్వోపదిష్టుడైనపిమ్మట దెలియనిమతధర్మములుగాని రాజనీతిగాని ప్రజాతంత్రముగాని పారలౌకికానుసంధానమగు నధ్యాత్మవిద్యగాని భూతభవిష్యద్వర్తమానకాలములలో నెచ్చటనెప్పుడైన జఱిగిన జఱుగగల జఱుగుచున్న సమాచారములలో గాని తెలియనివి యెక్కడను లేకుండెను.

వేమన్నకు విద్యాసాక్షాత్కారమైన యట్టులే కృతఘ్నతాభయ సాక్షాత్కారము గూడ కాజొచ్చెను. కావున చాలవిచారపడి వెనుకకు మఱలివచ్చి దుకానములో నింకనుపనిచేయుచునే కూఱుచున్న యభిరామయ్యను చేరవచ్చి యాతని చుట్టునున్న నంగడి పనిముట్లను దూరముగా బాఱవైచి సాగిలబడి యభిరామయ్యపాదములను గట్టిగా బట్టికొని "మహానుభావా! క్షమింపవలయును. మీయెడ గొప్పతప్పు నొనరించితిని. మీదాసుడను గాన నేనుచేసిన తప్పును క్షమించితినను నంతవఱకు మీ పాదములను విడువను." అనియెను. అభిరామయ్యయును వెలవెలబోయి "ఇదియేమి" అని నయభయ ములు దోప "లే లెం"డని పలికెను. వేమన్న క్షమించితి నని యనునంతవఱకును మీపాదములను విడువననెను. అభిరామయ్య "మీరు ప్రభువులు క్షమించుటకు నేనెవ్వడ"నని పలికెను. ఇట్లు విడువనని వేమన్నయును లెండని యభిరామయ్యయును వాదించు చుండగా నింతలో నాసమాచారము నాలుగుదిక్కులకును బ్రాకి రాజుగారు కూడ నచ్చటికే వచ్చుట తటస్థించెను. చిట్టచివఱకు అందఱుజేరి ఎట్లో యభిరామయ్యగారి చేత క్షమించితి ననిపించిరట! వేమన యంతట కాళ్లను వదలిపెట్టి చేతులను కట్టికొని మొదటనుండి తానుచేసిన పనియును అభిరామయ్యను మోసపుచ్చుటయును శివయోగిగారు తన కుపదేశించుటయును మున్నుగా నంతయును చెప్పి వైచెను. అందఱు నాశ్చర్యాంబునిధి మగ్నులైరి. అభిరామయ్య భరింపరాని చింతచే స్థబ్ధుడయ్యెను.

కనుగొన లశ్రుకణపూరితములుకాగా పెదవులు దడదడమని యదరుచుండ నేమియోమాటలాడ దలంపుగలవానిబోలి యున్న యభిరామయ్యవైపు మన వేమన మఱియొక మారు చూచెను. "అభిరామయ్యా! ఇంకనునన్నుక్షమింపనే లేదా? నేనుపశ్చాత్తప్తుడనై నీఱగుచున్నాను. అయినను నీయందింతటి ద్రోహము నొనర్చుటవలన నేనధికముగానే శిక్షింపబడవలసియుండు ననుట నిజము. నేనిట్లుపదేశము నొందుట స్వప్రయోజనాకాంక్షచేతకాదు. ధనార్జన బుద్ధిచేత గాదు. ధనములలోనికెల్ల నుత్తమధనమై మనలనిర్వురును మోక్షార్హులనుగా నొనర్చి యద్వితీయమై యనశ్వరమై కల్పాంతస్థాయియగు బ్రహ్మముతో కైవల్యము నొందించుటకే నేనిట్లు చేసితిని. దీనివలన నీకునునాకును తరణోపాయము ఘటిల్లును. అజరామరణమును ననంతఫలదమునగు యశ: కాయము దీనిచేతనే మనయిర్వురకు లభింపగలదు. శాశ్వతమగు కార్యము దీనివలన చేకూర్చెదను. ఎట్లని యనియెదవా వినుము అభిరాముడును నామమాది యందు నటు పైనినాపేరును గలసి వచ్చునట్టులును ఆంధ్రదేశములోనిజనులు "వీరుపండితులు వీరుపామరులు, వీరుజ్ఞానులు, వీరజ్ఞానులు, వీరు బ్రాహ్మణులు, వీరన్యులు" అనుభేదమొకించుకయైనను లేక ఈజాతి యనక యెల్లవారును ఇప్పు డప్పు డనక భూతకాలమునను, వచ్చు కాలమునను, రాబోవుకాలమునను ఈతెగయాతెగయనకుండ స్త్రీలు బాలుర వృద్ధులు మున్నగువారు సర్వులును ఎల్లప్పుడును స్మరించునట్లుగా - "విశ్వదాభిరామ వినురవేమ!" యను మకుటముతో నీతి, మత, జాతుల దెల్పునదియును భుక్తిముక్తుల నిచ్చునదియును. రక్తివిరక్తుల నొసగునదియు నగునొకప్రబంధమును కొన్నివేలపద్యములతో వెలయించెదను. ఇదిగో యంజలి పట్టితిని ఖేదమునొందకుము, మోదమునొందుము, ఆగ్రహింపకుము, అనుగ్రహింపుము, శపింపకుము, దీవింపుము, నన్ను నీశిష్యునిగా బరిగ్రహింపుము "దాసుని తప్పులు దండముతోసరి' యనెడిమాట కర్థమును కలుగ జేయుము" అనిదీనదీనుడై దయారసము చిప్పల నమేయవాగ్వైఖరిని యఖండజ్ఞానరూపియై వేమన మఱల పలికెను.

అభిరాముడు "అయ్య! మీవలన నిసుమంతయును దొసగులేదు. 'దరిద్రుడు తల గడుగగా వడిగండ్లవాన కురిసె' నన్నట్టులు నాదురదృష్టముచేత యట్లు జఱిగినదే గాని వేఱుగాదు. బ్రహ్మ మనుజుని ముఖమున నెన్నిబంతులు ఎన్నియక్షరములను వ్రాసెనో అన్నియును వ్యర్థములు కావు. నేనదృష్టహీనుడను కనుక నాకు దగిన ఫలము లభించినది. మీరు అదృష్ట శాలురు గనుక ఆయోగి చరమావస్థలో బ్రహ్మవిద్యోపదేశమును బడయగలుగుట సిద్ధించినయది. వేయిజన్మములనైన నార్జింప వలనుపడని పరమాత్మసాధకమగు బ్రహ్మవిద్య అనాయాసముగా నొకనిమిషములో సిద్ధించుటకంటె యదృష్ట మేమి కావలయును. దీనికెవ్వ డధికారియో? ఏది యెవ్వని సొత్తో అదివానిదగునే కాని ఇతరుని దగునా ? కావున చింతనొందకుడు నాకుమీపైని ఇసు మంతయు నాగ్రహము లేదు." అని హృదయము చిక్కబట్టి పలికెను.

"నీవతిశాంతుడవు యోగ్యుడవు. నాకింతటి మహోత్కృష్టత నొసంగిన కరుణార్ద్రమూర్తివి. నిన్ను నేనేమని వర్ణింపగలవాడను. నేనునీయెడ ద్రోహముచేసితి ననుటనిజము, ఇంతటిదోషమునుకు నేనొక పరిహారమును తెలిసికొంటిని. అయ్యది ప్రాయశ్చిత్తములలోని కెల్లమేటి అదియెయ్యది యనియెదవేమొ? అదియే నేనుముందుచెప్పిన గ్రంథనిర్మాణము, దానివలన లోకంబులకును లోకులకును జ్ఞానము చేకూరును. కుత్సితమతములు రూపడగి పోగలవు. అందు మనయిద్దరిపేర్లును వెలయగలవు. ఇక నాకనుజ్ఞ నీయ వేడెదను." అనిపలికి యభిరాముని చేత ఈషద్వికసిత నేత్రాంచలప్రసారముల ద్వారా సెలవుగైకొని అదిమొదలుకొని ఈవేమనగారు చివర "వేమ!" "అభిరామ వేమ" అని వచ్చునట్లుగా గ్రంథనిర్మాణమును చేయబూనికొనిరట; ఇది వేమనగారు గ్రంథముచేయుటకు కారణమునుగా మనవారలు చెప్పెడి యొకకథ, ఇందలి సత్యాసత్యనిర్ణయమునకు పాఠకులే ప్రమాణభూతులు కావున దీనిని గుఱించి విశేషముగా జెప్పనక్కఱలేదు అని తలంచుచున్నాము.