శ్రీ రామాయణము - రెండవసంపుటము/కిష్కింధాకాండము

వికీసోర్స్ నుండి

కట్టా వరదరాజకృతమగు

శ్రీరామాయణము

(ద్విపద)

కిష్కింధాకాండము

శ్రీరాజితశుభాంగ ! - చిరగుణిసంగ
హారికృపాపాంగ! - యలమేలుమంగ
భావుక! శతకోటి - భానుసంకాశ!
సేవకాత్మనివేశ! - శ్రీ వేంకటేశ!
అవధారు కుశలవు - లారామచంద్రుఁ
డవధరింపంగ రా - మాయణంబిట్లు
వినుపించు తత్కథా - వృత్తాంతమెల్లఁ
గనుపించు నవ్వలి - కథ యెట్టులనిన

-: శ్రీరాముఁడు వసంతాగమ శోభితమైన పంపాసరస్తీరమునుగాంచి,
        సీతావియోగభరమును తాళఁజాలక లక్ష్మణునితోఁ
             దత్తీరవర్ణనఁగావించి ప్రలాపించుట :-

ఆ రాఘవుఁడు పంప - నందముల్ నింప
చేరికన్ గొని తన - సీతావియోగ

విరహవేదనలచే - వేగి యా సరసిఁ
దరసి యా దరిసీమఁ - దమ్మునిఁజూచి
యచటి వినోదంబు - లాత్మకింపొసఁగ
నుచితవైఖరితోడ - నొకమాట వల్కె
"వైడూర్యనిర్మల - వారిపూరంబు
చూడఁ జూడంగ మె -చ్చులు పాదు కొల్పె!
చేతోవికాసల - క్ష్మీనిధానంబు
లీతీరవనభూము - లీక్షింపు మిపుడు!
ఒక కొన్ని శిఖరస - మున్నతశైల
నికరంబులనఁగ వ - న్నియఁ గాంచె తరులు!20
భరతవియోగంబు - భామావియోగ
మిరువాగు జతగూడి - యేకీభవించి
మన నిచ్చునే యీద్రు - మచ్ఛాయలందు?
అనుపమ ప్రసవ ప - ర్యంకపాళికలు
నీచోటి పుష్పితా - నేకవృక్షములు
నీచాయ మలయమ -హీధరానిలము
నీవేళఁ బ్రాపించు - నీవసంతంబు
భావంబులోనఁ దా -పము మించఁ జేసె
జలదముల్ వడగండ్లు - చల్లినరీతి
నలరులు రాల్పు ల - తాళిఁ జూచితివె!30
చదలందు వాయువ - శంబుచేఁ దొరుగ
విరులకొటారులై - విలసిల్లె నిచట!
రాలియు రాలుచు - రాలక నిలుచు
నీలతాంతములచే - నిచటి భూజములు
వలమానమృదుగంధ - వాహావినోద

విలసనంబులు దెల్పు - విధముఁ జూచితివె?
ఎలతెమ్మెరలచేత - నీకొమ్మగుంపు
చలియింప ఘుమ్మని - చంచరీకములు
విలసిల్లె మకరాంక - విజయగానములు
సొలయుచు వినిపించు - సొబగుఁ జూపట్ట40
నట్టువఁడై తరుల్ - నటియింపఁ జేసి
గట్టుల చరులకు - గానముల్ నేర్పి
గాయకుఁడై యనో - కహలతాంతములఁ
బాయని పుప్పొడి - బలువసంతములు
చల్లు కుమారుఁడై - జాడలయందుఁ
జల్ల తావుల వీచెఁ - జందనానిలము!
తరువులతోడ ల - తాశ్రేణిఁ బెనచి
పురుషులతోడుతఁ - బొలఁతులఁ గూర్చు
నెడకాఁడు తానయై - యీకోడె గాడ్పు
కడవఁ బల్కెడు విహం - గమ కలధ్వనుల!50
ఈ కొండగోఁగుల - నేకముల్ పసిఁడి
కోకలు గట్టులో - కులను గేరెడును!
ఈ వసంతమునందు - నీవనిలోన
నేవిధంబున సీత - నెడవాసి యుందు?
ఉండిన నోరిచి - యుండంగ నీఁడు
మండలీకృతచాప - మహితుఁడై మరుఁడు!
సీత యెలుంగుతో - జేరంగఁ బిలిచె
నీతరిఁ గల కంఠి - యిదె పంచమమున
నత్యూహమను పక్షి - ననుఁ గఱంగించె!
నత్యంతమును నీ ఝ - రాంబుపూరమున 60

వెనుకటి కీపక్షి - వింతగాఁ బలుకఁ
గని మదిలో మెచ్చఁ - గలకంఠి సీత
యీ పక్షి మిథునంబు - లెల్లవృక్షముల
నాపోని రతి నోల - లాడఁ జూచితివె!
కోకపారావత - కూజితావళులు
నాకుఁ గల్పించెఁ గం - దర్పతాపంబు
పూచినమోదుగు - పువ్వులు వహ్ని
యాచిగురాకులు - హేతిమాలికలు
చిటచిటల్ భ్రమరికా - శ్రేణీరవముగ
నటు జూడు మరుప్రతా - పాగ్నియుఁ బోలె!70
ఈ తుమ్మెదలగుంపు - నెనయు ముంగురుల
సీతఁ బాసిన దన - జీవనం బేల?
జానకిఁ గూడివ - సంతకాలముల
నేనిన్నినాళ్లు నే - యేవినోదములఁ
జరియించినాఁడనొ - సౌమిత్రి! తనకు
మఱపు రాదేల! యా - మని వచ్చె నిపుడు!
మనసులోననె యుండు - మదనాగ్ని యేల
పెను చిచ్చుగా రాఁజఁ - బెట్టె నీగాలి?
ఒక మయూరముఁ గాంచి - యొక నెమ్మికొమ్మ
వికసిల్లఁ బింఛంబు - వేడుక నాడ80
స్ఫటికోపమగవాక్ష - పాళిక యట్ల
యటఁజూడుము కలాప - మమరుచందంబు
నీమయూరి నొకండు - నెత్తుకపోక
తామసించిరదేమొ - దానవాధములు!
అటుగాగ మగనితో- ననఁగిపెనంగి

యిటు నన్ను నుడికించె - నేమి సేయుదము!
ఈ వసంతము మర్త్యు -లే యేల యెల్ల
జీవకోటులకు సం - జీవనౌషధము
తనవంటి కల్మషా - త్మకున కొక్కనికిఁ
దనువునఁ బ్రాణవే - దన సేయుఁగాక!90
నను బాసి మేనఁ బ్రా - ణంబులతోడ
జనకజ యిందాఁక - సై రింపఁ గలదె?
అడవినిఁ గాయు చం - ద్రాతపంబగుచు
పుడమి నూరక యేల - పువ్వులు రాలె!
నేనింత కలిగెద - నీవనిలోనఁ
దానంత శోకించుఁ - దమ్ముఁడా! సీత
పట్టుకపోయిన - పట్టునసీత
యెట్టులున్నదొ కదె - యేమి సేయుదుము?
ఇరువురకును మతు - లేకమై యునికి
నెఱిఁగి యుండుదు సీత - హృదయంబు నేను100
జనకజ యున్నచోఁ - జల్లనై యుండి
తనకిప్పుడీ గాలి - దహనుఁడై తోఁచె
మన యాశ్రమమున ది - మ్మరి కాకి కాకు
నినదంబుతోఁ గూసి- నెలఁతను బాసి
యిపుడుఁ జూడఁగ వచ్చె - నీ వాయసంబు
చపలబుద్ధిని పక్షి - చండాలమగుట
నెడమ దిక్కున నుండి - యిపుడు గూయుచునుఁ
గడకుఁ బోదిప్పుడు - కాకా యటంచు!
తిలకగుచ్ఛము మీఁదఁ - దేఁటిఁ జూచితివె
వలపు నెచ్చెలి మీఁద - వ్రాలినట్లమరె!110

 
బూచివాళకమును - బోలి నిండారఁ
బూచి యశోక మి - ప్పుడు వెఱిపించె!
సుమితరసాలముల్ - చూడుము మేన
నమరు సొమ్ములతో జ - నావళిం బోలెఁ
బంపాసరోవర - ప్రాంతకుంజములఁ
గింపురుషద్వంద్వ - గీతముల్ మొరసెఁ
గిన్నెరల్ మీటుచుఁ - గిన్నరాంగనలు
కన్నిబోయతలతోఁ - గలసిపాడెదరు!
ఇందున వికసించు - నెఱ్ఱదామరలు
చెందొవరేకుల - చెలిమి సేయుచును120
బాలభాను విభా వి - భాసితరాగ
కేళిచే మదనాగ్ని - కీలలై వెలసె!
కప్పుఁగల్వల మీదఁ - గలమూఁగు తేఁటి
కప్పు సీతాకటా - క్షములతో నెనసె
రేవుల సింధుర - శ్రేణితుండములఁ
ద్రావెడు గళగళ - ధ్వనుల నంబువులు
కలహంస చక్రవా - క క్రౌంచముఖ్య
జలపక్షి నివహంబు - సందడిఁ గనుము!
ఇవి చూచి తాళుదు - నే ధరాతనయ
యవలంబనము లేని - యర్ధగాత్రుఁడను. 130
ఈతావి కరువలి - నెనయించి యూర్పు
లీతేఁటి దాఁటున - కిచ్చి ముంగురులు
యావల్లికావళి - కిచ్చి కేల్దోయి
యీవనజంబుల - కిచ్చి నెమ్మొగము
యీకల్వచాలున - కిచ్చి లోచనము

లీకలహంసల - కిచ్చి లేనడువు
లీబేడిసలచాలు - కిచ్చి దృగ్జాల
మాబాల సీత యెం - దరిగెనో నేఁడు!
పంపకు దక్షిణ - భాగంబునందు
నింపు మీరినయట్టి - ఋష్యమూకంబు140
జేవురుల్ నిండి పూ - చిన మోదువులకుఁ
దావలంబగుచు కం - దర్పప్రతాప
దావాగ్నిరాశి చం - దమున వీక్షింప
భావంబునకు భీతిఁ - బాదుకొల్పెడును!
ఒకకొమ్మపైఁ గాంత - యొక కొమ్మఁదాను
నొకచాయగానిల్చి - యొయ్యనవీచు
ముక్క తెమ్మెరలచే - ముక్కును ముక్కుఁ
జక్కగాఁ గూర్చివా - చవిఁ గొసరుచును
బికములు గ్రీడింపఁ - బెరిగిన తరువు
లకట! నామదికిఁ బా - యనిచింతఁ జేసె 150
ఇది చూపి వలరాజు - నీవసంతుండు
కదిమి చించిరి ధైర్య - కంచుకంబిపుడు!
ఒకపువ్వులోనుండి - యొకపువ్వుమీఁద
మొకిరి తేఁటులగుంపు - మురువు చూచితివె!
తరువులు లతలఁ బొం - దఁగఁ బిల్చెననఁగ
వరపక్షి కలకల - స్వనమాలకింపు!
కారండవమ్ములు - గలసి క్రీడించి
మారుని వేఁట దీ - మంబులై తోఁచె!
ఏటికి బెగడుదు - రెఱుఁగకఁ బంప
సాటిదియే సురా - పగ సద్గుణముల160

నేమియు నేనొల్ల - నింకొక్కమాటు
భూమిజఁ గనునట్టి - పుణ్యంబుచాలు
ఈవనజంతువు - లీపంపలోని
జీవనజంతువుల్ - చింతపాల్జేసె
మనల కింకొకనాఁడు - మలయుచుండుదుమె
జనకజగూడి యీ - సానుభాగముల?
పంపాసరోవరో - పవనంబు లనుస
రింప మువ్వురము జ - రింపుదు మొక్కొ?
గలుగునే యొకనాఁడు - కలగంఠి సీతఁ
గలసి వినంగనీ - కలకంఠరవము? 170
కందునే యొకనాఁడు - కమలాయతాక్షి
సందిటిలోన ము - చ్చటఁ దీఱఁ బెనఁగ?
దొరకునే యొకనాడు - తొయ్యలిఁ గూడి
సరససల్లాపప్ర - సంగముల్ నడప?
కాంతునే యొకనాఁడు - కనకాంగితోడఁ
గంతుకేళిఁ గరంగి - కరఁగింపుచుండఁ?
జూతుమే యొకనాఁడు - చుక్కలరాజు
రీతినున్న తలోద - రిముఖాంబుజంబు?
అబ్బునే యొకనాఁడు - హరిణవిలోక
బిబ్బోకమునకు నేఁ - బ్రీతివహింప?180
నావెంటవచ్చు జా - నకి వెంటఁ బోక
యేవెంట బ్రాణంబు - లింకనిల్పుదును?
కన్నుల నెఱిఁగించు -కలయింగితంబు
చిన్నినవ్వులఁ దెల్పు - చిత్తాభిమతము

సిబ్బితిచేఁ జూపు - శీల గౌరవము
గబ్బిచిన్నెల నెఱుఁ - గఁగఁ జేయువలపు
యలిగియుండగనేర - దవలిమోమిడదు
తలప దెవ్వరినిఁ జిం - తకులోను గాదు
యేసు గాసిలియున్న - యెఱిఁగి హితోక్తి
దానూరడించి సం - తాపంబుఁదీర్చు190
నడవి యయోధ్యగా - నన్నింటి మారు
పడఁతి తానయి నిల్చి - పరితుష్టుఁ జేయు
తలఁచినట్ల మెలంగుఁ - దనమది డాప
దలయికఁ జూప దే - మనిన సైరించు
నగుమోముతోఁజేరి - నాచెంత నిలిచి
తగినమాత్రంబె మె - త్తని మాటలాడు
నట్టి సీతకు బాయు - నట్టి నన్నీవు
చుట్టుకఁ దిరిగియే - సుఖము గాంచెదవు?
వలదన్న లక్ష్మణ! - వలసినట్లౌదుఁ
దలఁప నేమిటికింకఁ - దడవకనన్ను200
భరతునిం జేరి యా - పదలెల్లఁ దీరి
మఱవక మమ్ము నె - మ్మది నుంచు మీవు"
అని యనాథుని రీతి - నాపన్నుఁడైన
తనయన్నఁ గని నుమి - త్రాసుతుం డనియె
"దేవ! మీయంత సు - ధీనిధు లెందు
భావింప కీదీన - భావమొందుదురె?
తడిసెనేనియు వత్తి - తైలసంగతిని
పొడవడంగిన యట్టి - పోలికచేతఁ

దనవారిపై నింత - దయఁ బూంచువారు
మనసులోఁ జివికి నే - మము నొందలేరు210
విడువు మింతటి యాశ - వెలఁదికై యేల
యడలెద విట్లు ధై - ర్యముఁ బోవనాడి?
ఎందు వోయెడు సీత! - యెఱిఁగి రావణుని
గందున సాధింపఁ - గా శక్తి లేదె?
సీత నొప్పింపక - చెడిపోవవాన
కీతరి తలవ్రాత - యే త్రుంగిపోవ?
జానకితో గూడఁ -జని దితికడుపు
లోనఁ జొచ్చినను గా - లుఁదమ బాణాగ్ని!
ధైర్యంబు వదల నీ - తమె దక్షునకును?
గార్యభాగంబు లౌఁ - గాములుగలవె?220
యత్నవంతున కసా - ధ్యము లెందుగలవు?
యత్నంబె సేయు మ - య్యహితునిఁ దునుమ
నుత్సాహపరుఁడవై - యూహించి కపట
మాత్సర్యపరులను - మర్దింపు మీవు
మది జిక్కఁబట్టి - నీ మహిమంబుఁ దలఁచు
నదనెఱుంగక యేల - యార్తిఁ గ్రుంగెదవు?"
అని యన్నఁ దోకొని - యాపంపఁ దాఁటి
చనుచు శ్రీరాము నె- చ్చఱికఁ గాచుచును
జతనంబు యతనంబుఁ - జాలంగఁ గలిగి
ప్రతి పదంబున సీతఁ - బరికించి కొనుచు230
గిరికందరంబులఁ - గ్రీడించు వారి
దరణితనూజుఁడు - దవ్వులఁ గాంచి

-: ధనుర్బాణులగు శ్రీరామలక్ష్మణులఁ గాంచి వాలిపంపినవారలనుగా సుగ్రీవుడు చింతించి భీతిల్లుట; హనుమంతుండు సయుక్తికముగా వాని సంశయమును నివారించుట :-

భీతిల్లి యార్తిచే - బెదరి కలంగ
నాతరి నితరులై - నట్టివానరులు
వెఱచి పాఱిన కపి - వీరుఁడు దేవ
గిరి సమానుండు సు - గ్రీవుఁడు నిలిచి
యాజానుబాహుల - నలఘువిక్రముల
రాజీవనేత్రుల - రవివంశమణుల
విజితేంద్రియుల ముని - వేషధారులను
గజగమనులను రా - కాచంద్రముఖుల 240
జక్కనివారిని - జతయైనవారి
నెక్కడ కనివిని - యెఱుఁగనివారి
బాణబాణాసన - భర్మకృపాణ
పాణుల సత్యసం - పన్నుల రామ
సౌమిత్రులను జూచి - చాల శంకించి
తామరసాప్తనం - దనుఁడు చలించి
వెఱచినవాఁ డౌట - వింతచూపగుట
హరియౌట నిలిచిన - యచ్చోట నిలక
మనసు నిల్కడ లేక - మలయుచోనెల్ల
తనుఁగాచి వెంట ప్ర - ధానులు రాఁగ 250
హితులైన తన వాన - రేంద్రులఁ జూచి
కృతనిశ్చయమున సు - గ్రీవుఁ డిట్లనియె.

"కపులార ! వీరు రాఁ - గారణంబేమి?
కపటాత్మకులు వాలి - గడివారు వీర
లతఁడు నాపైఁ బంప - నజ్జయైనట్టి
యతివేషముల ధను - రస్త్రముల్ దాల్చి
వచ్చిన వార లా - వాలి రావెఱచు
నిచ్చోటి కటుగాన - నిమ్మహాభుజులు."
అని యానగంబున - నవ్వలి శిఖర
మునకేఁగి యనుజీవి - ముఖ్యవానరులు260
కడురా పదాఘాత - ఘట్టనంబులను
పొడివొడులై శృంగ - ములు దుమ్ము లెగయఁ
అత్యంత శైలముల్ - బలువిడినడవ
నత్యంతనిమ్నోన్న - తాయతీమాన
మేని సోఁకులను భూ - మీరుహశ్రేణి
తోనఁ గూఁకటివేళ్ళ - తోఁ బెల్లగిల్ల
గతిరయాయతమరు - త్కాండముల్ నిండి
ప్రతిపదాంచితగహ్వ - రములు ఘూర్ణిల్ల
నినతనూజునిఁ జేరి - యిరుకెలంకులనుఁ
గనుగల్గి దిక్కులు - కలయఁగన్గొనుచు270
నందఱు వసియింప - నాంజనేయుండు
ముందఱ నిలిచి కే - ల్మొగిచి యిట్లనియె.
“ఏటికి వెఱచెద - విది మలయాద్రి
కూట మన్యులకు రాఁ - గూడ దిచ్చటికి
వాలినిఁ జూడ మ - వ్వాలి కిచ్చటికిఁ
బోలదు చేరనొ - ప్పునె యింత బెదర?
ఆవాలి యెడ నీభ - యంబున కేల

నీ వింతవాఁడవై - నీకపిత్వంబు
వదలవైతివి మహీ - వల్లభులకును
మదిలోన నిలుకడ - మతిచాలకున్న
దొరయందురే వాని - దొరకుఁ గావలదె
వెరవును సదసద్వి - వేక గౌరవము?"
అనుమాట విని పవ - నాత్మజుఁజూచి
సునిశితబుద్ధి నా - సుగ్రీవుఁడనియె.
“ఆయధపాణులై - యలఘుతేజముల
నాయమరకుమారు -లన జోడుగూడి
వీరుల రాఁజూచి - వెఱవక నిలుచు
వీరులెవ్వరు పృథి - వీస్థలిలోన?
ఏ వెఱచుట యెంత - యిది యేటిమాట
పావని! నాగుండె - పట్టిచూచితివె!290
తటతట నదరెడు - తప్పదువార
లిటు చూచెదరు వాలి - యే పంపనోపు
రాజులు దిక్కుల - రాజులతోడ
యోజించి చెలిమి సే - యుదు రట్లు చేసి
తమచేతఁ కాని య - త్నము వారిచేత
సమకూర్చుకొందురు - జాడవారలకు
పైకొని వంచనో - పాయముల్ తమరు
చేకొని నమ్మిన - చెఱుపకపోరు
బలవంతుఁడును నీతి - పరుఁడునై వాలి
దలఁచు నీరీతి మా- త్సర్యగార్యములు300
పగవారి లెటులైన - బట్టి సాధింపఁ
దగుఁగాన నతనికిఁ - దగు నిట్టి తెఱఁగు

మన మేమఱక బుద్ధి - మంతులమగుచుఁ
జను వానిఁ బనుప యో - జన సేయవలయుఁ
గావున నీవ య - క్కడి కేఁగి మేని
లావు గానఁగనీక - లఘువృత్తి తోడఁ
గొంచపుమేనితోఁ - గొంకుచుఁ జేరి
యంచల నిల్చిన - యాలాపసరణి
వారల రాకయు - వారిచిత్తములు
వారి వాక్యములు స - ర్వంబునుఁ దెలిసి310
నా దృష్టిపథమున - నాకు నౌగాము
లీదృగ్విధంబది - యేఱుపడంగ
నిలిచి పల్కుము పొమ్ము - నీవని" పనుపఁ
దలఁచి తాఁ బోవుట - తగవని యెంచి

-: హనుమంతుఁడు బ్రహ్మచారి రూపముఁ దాల్చి రామలక్ష్మణుల సందర్శించుట :-

యా కొండపైనుండి - యలఁతిరూపమున
రాకుమారకుల జే - రంగఁదాఁ దాటి
సన్నగావుల బ్రహ్మ - చారియై సిగయు
జన్నిదంబును ముంజి - సరము దండమును
మెఱయ రాఘవుల స - మీపంబుఁ జేరి
చరణపద్మములకుఁ - జాగిలి మ్రొక్కి320
లేచి యంజలి చేసి - లెక్కనేనైతి
మీచెల్వు దివ్యుల - మేరఁజూపట్టు
నే నిమిత్తమున మీ - రీవనిలోన
భానుసన్నిభదివ్య - బాణతూణీర

కోదండపాణులై - క్రుమ్మరవలసె
నీదండ మృగముల - నెల్లఁ జంపుచును?
నయనిధులు సువర్ణ - నాభులు నిరత
జయకీర్తిశాలు లా - జానుబాహువులు
కమలపత్రాక్షులు - కరుణాభిరాము
లమరసన్నిభులునై - నట్టి ధార్మికులు330
పదములు గంద పం - పాసమీపమున
వెదకుచు నెయ్యది - వేఁడివచ్చితిరి?
వేఁడుక నేనుఁగు - వేటాడవచ్చు
గోడే సింగములనఁ - గొంకులు దేఱి
చక్కని మేను లి - చ్చట వసివాడ
నెక్కడి కేఁగెద - రెవ్వారు మీరు?
కరికరోపమ కమ్ర - కరములు నరుణ
చరణముల్ సరిపూర్ణ - చంద్రాననములు
హరిపలగ్నములు బిం - బాధరంబులును
సరసిజపత్రవిశాల - నేత్రములు340
పీనవక్షములు గం - భీరయానములు
మేనుల తేజంబు - మెఱుఁగుఁ జెక్కులును
కల మీరు రాజల - క్షణలక్షితాంగ
విలసనశ్రీల నీ - విశ్వమంతయును
నేలఁ జాలిన వార - లేఁటికి కొండ
యోలంబుఁ జేరితి - రో యయ్యలార!
జగతికి డిగు సూర్య - చంద్రుల రీతి
మిగుల రాణించు మీ - మేనుల చాయ

యీవను లీశైల - మీ నికుంజములు
పావనోభావప్ర - భావముల్ గనియె350
సకలవిభూషణో - జ్జ్వలులుగాకేల
యకట! యీ మునిచర్య - లందివచ్చితిరి?
కుపసమూడ్చిన త్రాఁచు - కొదముల రీతి
నపరంజి కత్తులా - యతకరాగ్రములఁ
బూనుక యమ్మహా - భోగులవంటి
నానాస్త్రములతో దొ - నల్ సవరించి
యెక్కువెట్టిన విండ్ల - నిక్కడికేమి
యక్కరఁగలిగి మీ - రరుగుదెంచితిరి?
ఆనతీగదరన్న! - యప్పటనుండి
యేనెంత వేడిన - నేమియుననక360
యురకయుండెదరేల - యో తండ్రులార!
అరసేయ కొకమాట -యానతియిండు
జలజాప్తసుతుఁడు నా - స్వామి సుగ్రీవుఁ
డలఘుతేజుఁడు నన్న- నంపినవాడు
ఆ భానునందనుఁ - డన్నయౌ వాలి
చే భార్యఁ గోల్పోయి - క్షితియెల్ల నొసఁగి
యని నోడి యీకొండ - యండగానుండి
తన వెంట నల్వురు - త్తమసత్త్వ నిధులు
యేను మున్నుగఁ గొల్వ - నిచ్చోట వాలి
రానిచోటని యెంచి - రాయిడి లేక370
నెమ్మదితో నుండి - నేఁడిందువచ్చు
మిమ్ము విలోకించి - మిగుల శంకించి
'యెవ్వరో వీరు నీ - విప్పుడే పోయి

యివ్విధంబని వారి - నెఱిఁగి రమ్మ'నుచు
మీతోడిచెలిమి - మిగుల నాసించి
ప్రీతిఁ బంపిన నాదు - పెంపెల్ల మాఁటి
వచ్చితి నిట కేను - వాయునందనుఁడ
నచ్చుగా హనుమంతుఁ - డందురు నన్ను
పవమానమానస - పదవిజిగీషు
జవసత్త్వశాలిని ని - చ్ఛావిహారుఁడను380
కామరూపము నందఁ- గలవాఁడఁ గాన
నీమేన సుగ్రీవ - హితమతి నగుచు
నే వచ్చినాఁడ నా - యెడఁ గృపయునిచి
యీ విధంబని మిమ్ము - నెఱిఁగింపుఁడనిన
నామాటలకు మది - నలరి యుప్పొంగు
సౌమిత్రితో రామ - చంద్రుఁడిట్లనియె.
"ఎవ్వానితోఁ జెల్మి - యిచ్చలోఁ గోరి
యివ్వనభూముల - కేతేరవలసె
నట్టి సుగ్రీవుని - యనుచరుండితఁడు
చుట్టమై వచ్చె ని - చ్చోనపూర్వముగ?390
మంచిమాటలు పల్కి - మనసిచ్చి యాద
రించుము మది నల - రించె నిందాక
చాల ఋగ్వేదంబు - చదువని వాఁడు
పోల యజుర్వేద - ము పఠింపనతఁడు
సామవేదమున వా - సనలేని వాడు
నామీఁద నాధర్వ - ణానభిజ్ఞుండు
నేర్చునే యీరీతి - నిలిచిమాటాడ
నేర్చువ్యాకరణమీ - నిపుణమానసుఁడు

పునరుక్తు లపశబ్ద - ములు లేక నుదుట
కనుబొమలను నాసి -కను జూపులందు400
మొగమునందు వికార - ములు లేక మాట
సగము వల్కక యప్ర - సక్తముల్ గాక
వెనకయు ముందఱ- వెదుకక జోలి
వెనచక వినిన తె - ల్విడి గనుపింప
కొదుకుడు వడక త్రొ - క్కుడుపాటు లేక
యదనుండి కుత్తుక - నెనసి మోమునకు
జవరనగా వచ్చు - శబ్దముల్ చెవికిఁ
జవి వుట్ట మధ్యమ - స్వర శేషమున
దుడుపరించక యింపు - దులకింప చిక్కు
పడనీక త్రిస్థాన - భావ్యంబులైన410
పరమకళ్యాణ సు - భాషితావళులు
సరళంబులగుచు ర - సస్థితుల్ గలుగ
నిటువలెఁ బలికిన - నెత్తిన కత్తి
యటువైచి నఱికెద - నని వచ్చినట్టి
పగవాఁడు నేఁటికి - బద్ధుఁడు గాఁడు?
మగసిరి మందులీ - మాటలన్నియును
నిట్టి యాప్తుఁడు లేని - యెడమహీపతుల
కెట్టు చేకూరు వా - రెంచిన పనులు?
తగినట్టి యొక్క ప్ర - ధాని గల్గినను
జగతీశునకుఁ గల్గు - సకలభాగ్యములు420
ఇంతటివాని న - య్యినసూతి యెట్లు
సంతరించెనొ పుణ్య - సంపదచేత?
ఇతఁడు గల్గిన వాని - కెల్ల కార్యములు

కతమిచ్చు కొంగు బం - గారముల్ గావె?
మాటాడు” మనిన ల - క్ష్మణకుమారకుఁడు
పాటించి పవవసం - భవున కిట్లనియె.
"నీచేత సుగ్రీవు - ని తెఱంగు మాకు
గోచరించెను చెల్మిఁ - గోరి వచ్చితిమి.
అతనితో నీవాడి - నట్టి చందమున
హితమాచరించెద - మినకుమారునకు430
మానుతు మిట మీద - మదివిచారములు
భానునందనుఁ డాప్త- బంధుండు మాకు.”
అని పల్కుటయుఁ దన - యధిపతికార్య
మనుకూలమయ్యె కృ - తార్థుఁడనైతి
జెలిమికి నగు చింత - సేయుదు ననుచుఁ
దలంచి యాపవమాన - తనయుఁడుప్పొంగి

రామలక్ష్మణులు పంపాసరోవర ప్రాంతాగమన కారణమును విని హనుమంతుఁడు
                 వారలను సుగ్రీవుని యొద్దకు గొనిపోవుట :-

"చేకూడె వీరితోఁ - జెలిమి నాస్వామి
కే కార్యమో వీర - లీడేర్పఁదలఁచి
చెలిమి యాశించి వ - చ్చిరి వీరలొక్క
బలవంతుతోఁ జాలఁ - బగఁ గొన్నవారు.440
అదియుఁ దీర్చెదమని" - యాత్మ భావంబు
ముదితాత్ముఁడగుచు రా - మునికి నిట్లనియె.
"అయ్య! యీ ఘోరమై - నట్టి కానలకు
నియ్యిరువురు మీర - లేల వచ్చితిరి

యానతిం"డని పల్కు - హనుమంతు మాటఁ
దానందుకొని సుమి - త్రాపుత్రుఁడనియె.
“దశరథుఁడను నయో - ధ్యానాయకుండు
దిశలెల్ల బాలించు - దినకరాన్వయుఁడు
ధార్మికాగ్రణి యజా - తవిరోధి సత్య
ధర్మపాలకుడు మా - తండ్రియవ్విభుడు.450
మొదట యగ్నిష్టోమ - ముఖ్యయాగములు
పదిపదులును చేసి - బ్రహ్మను బోలి
తా సర్వసమవృత్తి - ధరయేలు నట్టి
వాసవసన్నిభు - వరవుత్రుఁ డితఁడు
పరమకల్యాణుఁ డా - పద్బాంధవుండు
శరణాగతావన - జాగరూకుండు
సర్వలక్షణగుణ - సంపూర్ణుఁ డఖిల
నిర్వాహకుఁడు సత్య - నియతమానసుఁడు
జనకుని యనుమతి - జానకిఁ గూడి
నను దోడుకొని గహ - నములకు వచ్చె460
శ్రీరాముఁ డీరాజ - సింహుఁ డీయనకుఁ
గూరిమి తమ్ముఁడ - గొలిచిన వాఁడ
దాసుఁడ సౌమిత్రి - తనపేరు సౌఖ్య
భాసురుఁ డౌదార్య - పరుఁడు ప్రాజ్ఞుండు
సూనృతవాది య - శోధనుఁ డఖిల
దీనసంరక్షణ - దీక్షావినోది
సత్యపరాక్రమ - సంపన్నుఁ డుచిత
కృత్యుఁడు పూజ్యుఁ డ - క్లిష్టకర్ముండు

ధన్యుండు సర్వభూ - తహితుండు లోక
మాన్యుండు నైనట్టి - మాయన్న దేవి470
యేమిర్వురము లేని - యెడఁ బర్ణశాల
భూమిజ యసహాయ - ముననున్న వేళ
నెవ్వఁడో రాక్షసుఁ - డెత్తుక పోవ
నవ్వామలోచన - నరయుచు వచ్చి
త్రోవలోపలఁ గబం - ధుని గాంచ వాఁడు
దేవత్వమున మింట - దివ్యయానమున
నిలిచి మీ సుగ్రీవు - ని తెఱఁగు మిమ్ముఁ
జెలిమి చేసిన మాకు - సీత చేరుటయుఁ
బగఁ దీర్చుటయుఁ దేట - పఱచి వాఁడేఁగ
జగతీతనూజ ని - చ్చట వెదకుచును480
నినుఁగంటి మిదియ మా - నిర్ణయం బిట్టి
యనఘుఁడు సకలలో - కైకనాయకుఁడు
రామచంద్రునియంత - రాజు సుగ్రీవుఁ
గామించి యాతనిఁ - గర్తగానెంచి
కొలిచి యాయన కను - కూలుఁడై యతని
వలయు గార్యములఁ గై - వశుఁడై మెలంగ
శరణంబు వేడి యి - చ్చట మీదువలన
తరణినందనుని - వర్తనమెల్లఁ దెలిసి
వసుధ దివ్యులకు నె - వ్వనియనుగ్రహము
పొసఁగకుండిన సౌఖ్య - ములు లేక యుండు490
నట్టి మాయన్న మీ - యర్కనందనుని
పట్టు చిత్తమున చే - పట్టినవాఁడు!
ఆసించు వారి స - హాయుఁడౌస్వామి

మీసహాయంబు గా - మించినవాడు!
ఆపన్నుఁడగుచు సై - న్యములతో మీరు
ప్రావుగావలసి మీ - పాలికిఁ జేరె!”
అనుచుఁ గన్నీటితో - నడఱు లక్ష్మణుని
గని వాయుతనయుఁడు - క్రమ్మఱంబలికె.
“నరవరులార! య - నంతకల్యాణ
పరమసద్గుణగణ - పరిపూర్ణుఁడైన500
శ్రీరామచంద్రుని - జెలిమి గల్గుటను
మారాజు భాగ్యసం - పద నెన్నఁదరమె!
సుగ్రీవుపాలిటి - సుకృతంబు ధార్మి
కాగ్రణులైన మి - మ్మరలేక తెచ్చె
నాయన రాజ్యంబు - నాలిఁ గోల్పోయి
పాయని వెతలఁ బా - ల్పడి యున్నవాఁడు
బలవంతుఁ డాతఁడీ - పట్టున సీతఁ
జలపట్టి యెటులైన - సాధింపఁగలడు
ఏమెల్లఁ గలుగ న - య్యినసూనుచేత
నేమి దలంచిన - నీ డేరు మీకు!510
చూతురు రండు మీ- సుగ్రీవు " ననిన
నాతరి సౌమిత్రి - యన్న కిట్లనియె.
ఇతని మాటలు వింటి - రే భానుతనయు
కతమున సాధింపఁ - గలము జానకిని
వాయుపుత్రుఁబ్రసన్న - వదన భాషణము
లీయెడ సత్యంబు - లితవగు మనకు
బోవుద మనిన” య - ప్పుడె బ్రహ్మచారి
తావానరాకృతిఁ - దాల్చిమై వెంచి

తన వీపుపై రఘూ - ద్వహుల నెక్కించు
కొని మదోత్కట భద్ర - కుంజరంబనఁగ520
నినతనూజుని చెంత - కేఁగి యాకెలని
వనములో వారల - వసియింపఁ జేసి
వారల రాక స - ర్వమును సుగ్రీవు
జేరి తానంజలి - జేసి తెల్పుటయు

-: శ్రీరామ సుగ్రీవుల సమావేశము :-

ననఘాత్ములని పూజ్యు - లనియు శరణ్యు
లనియు విశ్వసనీయు - లనియుఁ దానమ్మి
వానరరూపంబు - వదలి భానుజుఁడు
మానుషాకృతిఁ దాల్చి - మణిమయాహార
కోటీర కంకణ - కుండలకనక
శాటీవిభా చక - చకలు రాణింప530
జానకీరమణుని - సంధించి కొన్ని
కానుక లునిచి యా - కపివరుండనియె.
"ధరణీశ ! సకలభూ - తహితుండవనియుఁ
గరుణాకరుఁడవు వి - క్రమనిధివనియు
సత్యసంధుఁడవని - సద్గుణైశ్వర్య
నిత్యుఁడవనియును - నీప్రభావములు
మా వాయుసుతుఁడు ప - ల్మారు వాకొనఁగ
దేవ! నేనలరి సం - ధించితి మిమ్ము
యిట్టి నా కేఁటికి - యీవనచరుల
చుట్టఱికంబని - చూడక వచ్చి540

నన్ను మన్నించుట - నాదువంశంబు
వన్నియఁ గాంచెఁబా - వనుఁడ నేనైతి
నాతపంబు ఫలించె - నాపుణ్యవాస
నాతిశయంబుచే - నబ్బె నీ చెలిమి
కరముగాచితి నన్నుఁ - గరుణించి నెయ్య
మరమర లేక సే - యఁగనెంచెదేని
వలకేలొసంగి నా - వాఁడవీవనుచుఁ
బలుకుము నమ్మించి - పని గొమ్ము నన్ను!"
అనుటయు దక్షిణ - హస్తంబొసంగి
జనవిభుండు భా - స్కరకుమారకునిఁ 550
గౌఁగిట నిండారఁ - గదియించి కంట
నాఁగిన ప్రమద బా - ష్పాంబుపూరముల
నోలనాడంగ వా - యుజుఁడు మథించి
కీలిఁ జేకొని తెచ్చి - కెలన నుంచుటయు
నిరువురు వలవచ్చి - యింధనవహ్ని
పరమసాక్షిగ మాట - పట్లు గైకొనుచు
నన్యోన్యవదన స - మాలోకనముల
ధన్యులై యిరువురు - తమకార్యములకు
నోరపారలు వోక - యొద్దిక యగుచుఁ
దీరుచుఁ గనునట్టి - తేఁకువల్ గలిగి560
సామీరి యునుచు కే - సరపుష్పవర్ణ
కోమలంబగు నేపె - కొమ్మపానుపున
సరిగాఁగ వసియింప - చందనశాఖ
కరుపలిపట్టి ల - క్ష్మణునకు నిడఁగ
నతఁడందు మీఁద స - మాసీనుఁడైన

శతపత్ర హితతనూ - జాతుఁ డిట్లనియె.
"అయ్య! మీరాడిన - యప్పుడే నాదు
తొయ్యలి చేకూడెఁ - దునిసెను వాలి
కలిగెను రాజ్యంబు - కడతేరె చలము
ఫలియించెఁ గోరికల్ - బంట నేనైతి570
సేగులన్నియు మానె - సిలుగులు దీఱె
వేగె నాపాలికి - విరిసెఁ జీకటులు
వికసిల్లె మనము ప్ర - వేశించె శుభము
సకలేశ! నీకటా - క్షప్రభావమున

      -: సుగ్రీవుని సీతాన్వేషణ ప్రతిజ్ఞ - పాఱవేయఁబడిన సీతయొక్క
            యాభరణముల నాతఁడు శ్రీరామునకుఁ జూపుట :-

శ్రీరామ! మీరు వ - చ్చిన రాక విపిన
చారులౌటయుఁ బర్ణ - శాల నుండుటయు
మీరు లేనట్టిచో - మీ దేవి నొకఁడు
చోరుఁడై యెత్తుక - జుణిఁగిపోవుటయు
హనుమంతుచే వింటి - నవనిజఁ దెచ్చు
పనియెంత యదినాదు - భారంబు గాదె!580
పోయిన శ్రుతిఁదెచ్చు - పోలిక నీదు
జాయను జేకూర్చఁ - జాలుదు నేను
యేలోకముననున్న - నేఁదెత్తు సీత!
పాలసుఁడై విష - పానంబుఁ జేసి
బ్రదుకునే నరుఁడు? సు - పర్వనాయకుఁడు
తుదిముట్టునే నీదు - తొయ్యలిఁ బట్టి!
అసురనాథుఁడు సీత - నాకాశవీథి

దొసఁగులఁ బెట్టుచుఁ - దోకొని పోవఁ
గనుఁగొంటి వానియం - కములపై 'రామ!
నను గావవే! లక్ష్మ - ణా! యడ్డపడవె!590
అనుచు నేడ్చుచుఁ బోవు - నది మీరు తెలుపు
విని తలఁపున వచ్చె - వీరు నల్వురును
నేనొక్కఁడను గూడి - యిచ్చోట నుండఁ
దా నాగకన్య వి - ధంబున సీత
యుత్తరీయములోన - నొకకొంత చించి
యత్తరిఁ దనమేని - యాభరణముల
నిచ్చోట బడవైచె - నేనవి తెచ్చి
యిచ్చెద గుఱుతుగా - నీక్షింపు" డనుచు
బలికిన నెవ్వి యా- భరణము ల్చూడ
వలయుఁ దెప్పింపు నీ - వారిచే ననిన600
తన గుహలో నొక్క - తావున డాఁచి
యునుచు సొమ్ముల మూట - యున్నట్ల దెచ్చి
సముఖంబు నందు నుం - చఁగఁ రఘువరుఁడు
తమిఁ జూచి యామూటఁ - దనకేల నంది
విప్పిన దిగదిగ - వెలుఁగుచు సీత
నప్పుడు చూచిన - యట్లు భ్రమించి
నెమ్మోము మంచు నిం - డినఁ దెల్వి మాయు
తమ్ముల పగర చం - దమ్మున వాడ
“హా! సీత! హా! సీత! - యని కన్ను మొగిచి
యా సుమిత్రాకుమా - రాదులు కలగ 610
ధరణిపై వ్రాలి యం - తనె తేఱి తొడవు
లురము పై నునిచి తా- నుసురసురనుచు

“చూచితే లక్ష్మణ ! - సుగ్రీవుకెలని
వైచెను జానకి - వరభూషణములు?
ఏరీతి నడలుచు - నేగెనో?" యనుచు
సూరాత్మజుని మోముఁ - జూచి యిట్లనియె,
"భానుజ! యేరీతి -బలవరింపుచును
జానకి వోయె? నే - జాడఁ జూచితివి?
ఎవ్వడింతకు దిగి - యెత్తుక చనియె?
క్రొవ్వి వాఁడేఁటికిఁ - గూలక యుండు?620
ఇంతపాతకుని నీ - వెఱిగింపు మిపుడె
యంతకు వీటికి - ననుపుదు వాని!"

-: స్నేహితుఁడైన సుగ్రీవునికి శ్రీరాముఁడు వాలిని వధించెదనని ప్రతిజ్ఞఁ జేయుట :-

అనిన గద్గదకంఠుఁ - డై భానుసుతుఁడు
మనువంశమణికిఁ గ్ర - మ్మర నిట్టులనియె
"దేవ! వాఁడేగిన - తెఱువెఱుంగుదును
రావణనామమా - త్రము విన్నవాఁడ
నతని యూరును లావు - నతని వర్తనము
నితర మేమియును నే - నెఱుఁగ నేమియును
నిజము వల్కెద నవ - నిజ నెట్టులైన
నజరులు మెచ్చ నే - నర్పింతు మీకు630
రావణుఁ బుత్ర పౌ - త్రయుతంబు గాగఁ
గావరం బణఁచి యె - క్కడనున్నఁ ద్రుంతు!
పొగడొందు మీకు నీ - బుద్ధి లాఘనము
తగపు కాదేఁటికి - ధైర్యంబువదల?

నింత చింతిలుదురే - యేఁ గల్గియుండ
నెంతటి పనియైన - నెటు గాకమాను
నిటు జూడుమయ్య! ప్రా - కృతవానరుండ
నటువంటి దుఃఖంబు -నెంత లేదనుచు
నున్నవాఁడను! మహీ - శోత్తంస! నీకు
గన్నీరుఁ దెచ్చుట - గాదు పల్మారు640
బలవంతమై ప్రాణ - పర్యంతమైన
నలమట వచ్చిన - నతిధీరమతులు
తమలోనె తాల్మిచేఁ - దాలుకొనంగ
నమరుగాకిట్లు దై - న్యంబుఁ జెందుదురె?
తెలియక మూఢుఁడై - ధృతి లేనివాఁడు
కలము భారమున సా - గరములో మునుగు
కైవడి శోకసా - గరములో మునుఁగుఁ
గావునఁ జలియింపఁ - గాదెట్టియెడల!
మ్రొక్కెద మీపాద - ములకు దీమసము
చిక్కఁబుట్టుము చింత - చేఁ గుందవలదు650
సుఖివి గమ్మిప్పుడు - శోకించి నరుఁడు
సుఖమందలేఁడు తే - జోహానిఁ జెందు
ననఘ! యేనింతవ - యస్యభావమునఁ
జనవిచ్చుకతన మీ- చల్లదనంబు
మది నమ్మితోచిన - మాటలాడితిని
సదయాత్మ! యిదిమీరు - సహియింప వలయు
నను మీరు సేయు మ - న్ననకుఁ దార్కాణ
గనుపింప సైరణఁ - గనుఁడని" పలుక

రాముఁడు నారచీ - రచెఱంగు చేతఁ
దామరసదళాయ - తవిలోచనములఁ660
దొరగు కన్నీరు వోఁ - దుడిచి సుగ్రీవుఁ
బరమాప్తుగా మది - భావించి పలికె
"చెలికాని తనము మ - చ్చికయును దలంచి
పలికిన నీహిత - భాషణంబులను
మనసు రంజిల్లె సే - మంబుఁ గాంచితిని
నినుఁబోలు నింకొక్క - నెయ్యుఁడున్నాఁడె?
సీతను వెదకింపఁ - జేయుము యత్న
మాతతాయులఁ బట్టి - హతము సేయుదము
రావణవధకుఁ గా - రణమైన పూన్కి
యీవిధంబని మది - నెంచి వాకొనుము670
తొలుకరియందు వి - త్తులు మంచినేల
ఫలియించుక్రియ నాదు - పలుకులన్నియు
నీయందు ఫలియింప - నీ డెందమునకు
చాయయై తోఁచిన - జాడ వర్తిలుము
నాసత్యమాన యె - న్నడు నాడి తప్పఁ
జేసినట్టి ప్రతిజ్ఞ - జెల్లింతుగాని!
కడమ యేఁటికి నాదు - కార్యభారంబుఁ
గడతేర్ప నీచేతఁ - గాక చొప్పడదు
నాదు ప్రాణాభిమా - నములు రక్షింప
నేదిక్కు చూచిన - నిఁక వేరు లేదు680
నేరమిట్లని పల్క - నీచేతిలోని
వారము వలయుకై - వడిఁ బనిగొనుము"
అనిన భానుజుఁడు త - దాప్తులుఁ జాల

మనముల నుప్పొంగి - మారాడ వెఱవ
నితరేతరము నిట్టు - లేకాంతవేళ
హితభాషణములాడు - నేతక్షణంబ
నీతను సాధించి - శ్రీరామవిభుని
చేతికందిచ్చిన - చెలువగ్గలింప
సౌమిత్రి యరల భా - స్కర కుమారకుఁడు
రామచంద్రునితోడఁ - గ్రమ్మఱఁ బలికె. 690

శ్రీరాముఁడు వాలిని వధించుటకుఁ బ్రోత్సహించుట

శ్రీరామ! నినువంటి - స్థిరశౌర్యశాలి
కూరిమి వెనుచు నా - కు హితుఁడుగాన?
నాకుఁ గావలయు మా - నసహితార్థములు
చేకూరెనని దలం - చితి నిక్కువముగ
నీవు చేపట్ట ని - న్నింటికేనె తగుదు
నీవాఁడనైన నే - నిఖలపూజ్యుఁడను
సాధింతు నింద్రుని - సామ్రాజ్యమైన
నీధాత్రి సాధించు - టెంత నీకరుణ?
ఇనవంశ మణులతో - నిటవానరులకు
ననుపమ స్నేహ మి - ట్లబ్బిన కతన 700
మావారిలో నస - మాన గౌరవముఁ
బావనత్వమును సం - భావించె నాకు
నన్ను నేఁ బొగడుకొ- నంగరాదనుచు
నెన్ని మీతోడ నొం - డేమియుఁ బలుక
నాఁడు నాఁటికి నాదు - నడకల నింత
వాడని చిత్తంబు - వచ్చుఁ గార్యములఁ

బలుకు లేల? మహాను - భావులతోడి
చెలిమి సామాన్యమే - చేసెద మనఁగ
నీతోడ నెయ్య మ - నేకకార్యములు
హేతువుల్ కోరిక - లీడేర్చుటకును710
జ్ఞానాధికుని మది - చలియింపనట్టి
పూనిక నిర్విఘ్న - ములు కామితములు
కలిమిని లేమి నొ- క్కసమంబె కాని
తొలఁగింప రార్యులు - తోడ్పడువారి
చే పేదయైన నొ - చ్చిన దీలుపడిన
ప్రాపున నమ్మిన - పరమాప్తజనుల
విడువక తమసౌఖ్య - విభవరాజ్యములు
విడుతురు సజ్జనుల్ - విమలకీర్తులకు"
అన విని యిటుల యౌ - నని సమ్మతించు
జనకజారమణల - క్ష్మణులఁ దోకొనుచు720
నవ్వలి వని కేఁగి -యచ్చోట నొక్క
పువ్వులతో సాల - భూరుహశాఖఁ
గొనివచ్చి తావైచి - కూర్చుండ రాము
నునిచి నా చెంగట - నొయ్య వసించి
యొకకొమ్మ పవనుజుఁ - డునుప సౌమిత్రి
యొకఁడు దాన వసింప - నుచితవాక్యముల
శ్రీరాముఁజూచి సు - గ్రీవుఁడు వినయ
గౌరవముకుళిత - కరుఁ డౌచుఁ బలికె
"వాలిచే గులసతి - వసుధయు నిట్లు
కోలుపోయి వహించు -కొనువారులేక730

నాచేతఁగాక మి - న్నక చెట్లువట్టి
యేచోటఁ దలయెత్త - నిఁక బాసె ననుచు
నున్నవానికి నాకు - నోతండ్రి! యిట్టి
బన్నంబుఁ దీఱని -పదములుఁ గంటి
మఱుఁగుఁజొచ్చిన నన్ను - మన్నించి బ్రదుకుఁ
దెఱువు చూపఁగ నీవే - దిక్కయినావు
రక్షింపు” మనిన ధ - ర్మజ్ఞుండు ధర్మ
రక్షకుఁడును నగు - రఘువీరుఁ డనియె
“ఉపకార మొనరింప - నుచిత మాప్తులకు
నపకార మొనరించు - నది శత్రువిధము740
గావున నీవైరిఁ - గడతేర్పలేక
యీవిండ్లు నమ్ములు - నేల పూనితిమి?
ఆపరంజికట్టు మ - హాశాతశల్య
నివుణంబులను గరు - న్నిచయఝాంకృతులు
రత్నపుంఖములు వ - జ్రప్రతిమములు
నూత్నశల్యాభి - నుతములు నైన
కాశప్రకాండప్ర - కాండముల్ గ్రోల
నాశించె వాలి ప్రా - ణానిలంబులను
చూడు! మీవను” మాట - సుగ్రీవు మదికి
వేడుకయును జాల వెతయుఁ గావింప750
“దీనుఁడనగు నాకు - దిట దెచ్చి ప్రాణ
దానంబుఁ జేసిన - ధన్యుఁ డీతండు.
ఇతని కార్యమున కే - నిత్తు శరీర
మతిమానుషంబు లీ -యన చరిత్రములు
బ్రదుకుఁ గంటి" నటంచుఁ - బలుకంగఁ బోయి

కొదుకుడు వడుచుఁ గొ - ల్కులవెంట జాఱి
కన్నీరు దొరుగ గ - ద్గదకంఠుఁ డగుచు
విన్నపంబని రఘు - వీరుతోఁ బలికె
"శ్రీరాము! యేను కి - ష్కింధఁ గొన్నాళ్లు
స్వారాజ్య మింద్రుని - జాడ నేలితిని760
ఆవెన్క మావాలి - యతిబలశాలి
తావచ్చి యిల్లాలిఁ - దగఁబట్టి యేలి
యవనియుఁ గైకొని - యదలించి త్రోచి
యవమతి చేసి న - న్నటు బాఱఁదరిమి
తిగిచి నావారి బం - దిగముల వైచి
నొగిలించి కొందఱ - ను దొలంగఁద్రోలి
యిచ్చోట నేనున్కి - యెఱిఁగి కొందఱను
ముచ్చ్రిలి పొడిపింప - మూఁకలనంప
వారినేఁ బోనీక - వధియించి తనకుఁ
దీఱనిపని గానఁ- దెగిచంపలేక770
తానిందు రారాక - తక్కినవారి
చే నన్ను గెలిపింప - చేతనుఁగాక
యూరట చాలక - యున్నాఁడు గాన
మీరాక చూచి న - మ్మిక చాలనైతి!
వాలి పంచినయట్టి - వారిగా నెంచి
యోలక్ష్మణాగ్రజ! - యోడి పాఱితిమి
బలవంతులును నీతి - పరులును బుద్ధి
గలవారు నగుటయే - గద నన్ను గాచి
యీనల్వురునుఁ జెంత - నెడవాయలేక
సూనుల క్రియఁగాచి - చుట్టునుండుదురు780

నలువురు దనకు ప్రా - ణసమానులగుట
యలమటలకు నోర్చి - యణఁగి యుండితిని!
జగదీశ! నాదు వి - చారముల్ దీఱి
పగయణఁగదు వాలి - పడఁజూచి కాని
సుఖదుఃఖ సమయముల్ - చూడకప్రాణ
సఖులతోఁ దనదు ము - చ్చట లెల్లఁ దెలుప
వలయుఁ గావున మీరు - వగపుతోనున్నఁ
దెలుపఁ గావలసె నా - తెఱఁగెల్ల మీకు
రక్షింపుఁ” డనిన పూ - ర్ణదయాసముద్రుఁ
డీక్షించి సుగ్రీవు - నిట్లని పలికె.790
"వాలికి నీకును - వైరంబు వచ్చె
నేల యింతటిపగ - కేమి కారణము!
అతని బలంబును - నతని పౌరుషము
నతని వృత్తాంత మే - నరసినవెనుక
వానకాలము నది - వలెఁ జాలవేగ
మైనట్టి నాకోప - మతనిపైఁ జూపి
తునిమెద నీకు ని - త్తును గోర్కులెల్ల
ననుమానములు మాని - యది తెల్పు”మనిన
ఆసమాటకు వాన - రాగ్రణి యలరి
యాసమాధికరహి - తాత్ముతోఁ బలికె800

-:సుగ్రీవుఁడు వాలితోఁ దనకు గల్గిన వైరకారణమునుఁ జెప్పుట:-

"శ్రీరామ! మున్ను కి - ష్కింధఁ బాలించు
శూరుఁడౌ రిక్షర - జుఁ డగచరుండు

ఆవానరాధీశుఁ - డగ్రకుమారుఁ
డౌవాలి కతఁ డిచ్చె - నఖిలరాజ్యంబు
నాయన చెప్పిన - యట్టికార్యములు
సేయుచు నేను గొ - ల్చినవాని కరణి
నరమర లేక భ - యంబు భక్తియును
దొరయ నేఁగాచిన - దొరయౌట వాలి
నాయందు తనదు ప్రా - ణములట్ల ప్రీతి
సేయుచు చనవిచ్చి - సిరులు పాలించి810
మెలఁగుచో నొకనాఁడు - మిన్నక క్రొవ్వి
యలుకతో దుందుభి - యనెడు రాక్షసుఁడు
చలపట్టి యొక్కఁడు - సరిప్రొద్దువేళ
బిలమువాకిట నిల్చి - పేర్వాడి పిలిచి
కలనికి రమ్మన్నఁ - గ్రక్కున వాలి
యలిగి కయ్యము సేతు - నని యిల్లువెడల
వలదని యవ్వాలి - వనితలు నేను
నిలిపిన గ్రోధంబు - నిలుపక వాలి
యారేయి నను వల - దని యింట నునిచి
ధీరుఁడై యొకఁడు దై - తేయుపైఁ బోవ820
మనసు నిల్వక యేను - మాయన్నవెంట
నని సేయ వెడలి తో - డైవచ్చునంత
మమ్ము నిర్వురఁ జూచి - మల్లాడ వెఱచి
యమ్మదాంధుండు భ - యంబుచేఁ బాఱ
తరుముక నేము ని - ద్దఱము రా వాఁడు
ధరణి బిలంబు కొం - దలముతోఁ జొచ్చి
పోయిన నన్ను నా - పొంత గావునిచి

మాయన్న యతని వెం - బడి గుహఁ జొచ్చి
యైరావతంబను - నమ్మహాబిలము
ఘోరాంధకారసం - కులమైన కతన830
వెదకి దానవుఁ బట్టి - విడవక యొంటి
కదనంబు సేయ న - క్కడ యేడు గడచె.
వాలిదుందుభుల రా - వంబులు రెండు
నాలకించితి నంత - నాగహ్వరమున
నిండారు నురువుల - నెత్తురుఁ గాల్వ
కండలతోడ న - క్కజముగా వెడలె
నది చూచి దానవుఁ - డక్కటా! వాలిఁ
గదనంబులోపలఁ - గడతేర్చె ననుచు
నవనీధరంబా మ - హాబిలాభీల
వివరంబులో వైచి - విన్నఁబాటొదవ840
బురికి నేతేర న - ప్పుడు మంత్రులెల్ల
దొరఁజేసి నన్నుని - ర్దోషుగా నెంచి
పట్టంబు గట్టినఁ - బ్రజల నాప్తులనుఁ
జుట్టంబులను దయఁ - జూచి బ్రోచుచును
నున్నచో నవ్వాలి - యురుసత్వశాలి
యన్నిశాచరు ద్రుంచి -యటకుఁ జేరుటయు

-:శత్రువిజయానంతరము మఱలివచ్చిన వాలి, సుగ్రీవుని ద్రోహిగాఁ దలంచి రాజ్యమునుండి వెడలగొట్టుట:-

నెదురుగా నేనేఁగి - యేడ్చుచు వాలి
పదములపై వ్రాలి - బాష్పాంబు లురుల

"అన్న! వచ్చితివె ! నీ - వని కేఁగు నపుడు
తన్ను నా గహ్వర - ద్వారంబు నందు850
నునిచి నీవేఁగిన - నొకయేఁడు గాచి
వెనక మీయిర్వుర - వీరనాదములు
వింటి నావెంబడి - వివరమార్గమునఁ
గంటి సఫేనర - క్తప్రవాహంబు
నది చూచి వెఱచి నే - నచలంబుఁ దెచ్చి
వదలక యాబిల - ద్వారంబు మూసి
వచ్చితి నిటకేను - వలదన్న వినక
యిచ్చిరి సామ్రాజ్య - మీమంత్రివరులు
కాచితి నిన్నాళ్లు - కడఁక మీసొమ్ము
నీ చేత కిచ్చితి - నీదు సేవకుఁడ860
నివె బీగముద్రలు - హితులును బంధు
నివహముల్ వీరె మ - న్నింపు మందఱను
నిదె ధవళచ్ఛత్ర - మిదె చామరంబు
నదియె కిష్కింధ మీ - రర్థిఁ గైకొనుఁడు
నను గావుమెపుడు ను - న్న తెఱంగుతోడ
నినుఁ గొల్చియుండెద - నీచిత్తమునకు
రాకున్న వెడలి య - రణ్యముల్ చేరి
యాకలములు దిని - యైన నుండెదను
ద్రోహిని గాను మీ - దు పదంబులాన!
యూహింపుఁడని మఱి - యును బ్రణమిల్లి870
లేవక యున్న వా - లి దురాగ్రహమున
దీవింప కనరాని - తిట్టులు తిట్టి
పదముల ననుఁ ద్రోచి - బంధులఁజూచి

“ఇది గంటిరే! వీని - నెటులోర్వవచ్చు?
నేను దానవునితో - నెక్కటిఁ బోరఁ
దానొక్కనగము కం - దరమున వైచి
వచ్చియున్నాఁ డేను - వాని వధించి
వచ్చి మున్ వచ్చు త్రో - వయుఁ గానలేక
సుడిగొని సుగ్రీవ! - సుగ్రీవ! యనుచు
వెడలఁ గానక వీఁడు - వేసిన యట్టి880
బిలము వాకిట కొండ - బిట్టుగా పాద
తలమునఁ బొడిగాఁగఁ - దన్ని యాత్రోవ
వెలువడి వచ్చితి - వీని దుష్కర్మ
ఫలమేల యనుభవిం - పక పోవఁడీఁడు!"
అని నాప్రధానుల - - నందఱఁ బట్టి
పెనుసంకెలలు వైచి - పీఁచంబు లడఁచి
వారిండ్లు ముద్రించి - వారి ద్రవ్యములు
చూఱలు గొని నన్ను - సుడియంగనీక
వెడలి పొమ్మన నూరు - వెడలి ప్రాణములు
పిడికిట బట్టుగ - భీతిచేఁ బఱచి890
యెడట నిల్వఁగ నీడ - యెఱుఁగకయిట్టి
యచలంబుపై వీర - లరసి పోషింప
వాలికి రారాని - వసతి గావునను
యీలీల నుండితి - నిన్నినాళ్లకునుఁ
గనుఁగొంటి మీపాద - కంజముల్ చేర
మనుగంటి తీఱె నా - మది విచారంబు
తన రాజ్యభోగముల్ - తానుఁ గైకొన్నఁ
జనుగాక పొమ్మనఁ - జను నయ్య! నన్ను

వెడలిపొమ్మనుగాక - విగ్రహించినను
పడతి నేమని చెఱ - పట్టి మాయన్న900
తొలగుబావతనంబుఁ - దొలఁగి యావాలి
యెలమితో మఱఁదలి - నేలుచున్నాఁడు?
వేయేల? ఈచెఱ - విడిపించి తన్ను
జాయాసమేతుగా - సదయుండవగుచుఁ
గావింపుమన లేన - గవుమోముతోడ
నావానరేంద్రున - కనియె రాఘవుఁడు.
"చెలిమి నాతోడఁ జే - సియు నింతచింత
గలదె సుగ్రీవ! యిం - కవిచారమేల?
వాలిఁ జంపుదు నే న - వశ్యంబు నిన్ను
నేలింతు కిష్కింధ - నింతితోఁ గూర్తుఁ 910
గడతేర్తు శోకసా - గరమెల్ల నీకు
గడియలోపల నెంత - గలదిది నాకు
పని గొమ్ము నన్న"ని - పలుకు శ్రీరాముఁ
గనుగొని వానరా - గ్రణి యిట్టులనియె.
"జగదేకవీర! కౌ - సల్యాకుమార!
అగణితగుణధామ! - అయ్య! శ్రీ రామ!
నీవు విల్లందిన – నిర్జరప్రభుఁడు
లావుల నెదుర నే - ల తలంప నేర్చు!
దేవాళియును నిన్ను - దృష్టింపఁజాల
రీవాలి యెంత నీ - యేటున కోర్వ?920
పిన్న విన్నపము నే - బెదరినవాఁడ
దన్ను ముంచినది గ - దా సముద్రంబు
వాలిని వడిగల - వాఁడని యెంచి

చాలఁగ నోడి యి - చ్చట నున్నవాఁడ!
ఏమి పల్కిన వినుఁ - డెఱిఁగించి మీర
లామీఁద ననిన వా - క్యము నాకు హితము.

-: సుగ్రీవుఁడు వాలి పరాక్రమమును వర్ణించి చెప్పుట :-

వానరబలవైరి - వాలి నిద్రించి
తాను నిత్యము ప్రభా - తంబుల లేచి
పడమటివారాశిఁ - బదములుఁ గడిగి
వడిఁ దూర్పుకడలి క్రే - వలఁ దీర్థమాడి930
దక్షిణవార్ధి చెం - తనుఁ గర్మవిధులు
దక్షతఁ దీర్చి యు - త్తరసాగరమున
హరునిఁ బూజించి జా - మైనచో మఱలి
పురికి నేతెంచు న - ద్భుతజవశక్తి!
డాక నుప్పొంగి కొం - డలు పెల్లగించు
నాకంబు పొడవు మి - న్నక దాఁటి మఱలు
కుజముల మేని సోఁ - కునఁ గూల గెడపు
విజయార్థి యగుచు ది - గ్వీథులఁ దిరుగు
నెదురెవ్వరును లేక - యెదురులు చూచు
కదియ మృత్యువునైనఁ - గబళింపనోపు940
నతిశయమదసింధు - రాయతబలుఁడు
నుతికెక్కునట్టి దుం - దుభి యనువాఁడు
మహిషరూపము గల్గు - మనుజాశనుండు
మహనీయశారీర - మదవికారమున
జలధి చెంతకు బోయి - సమరంబు సేయఁ
బిలిచినఁ గంపించి - భీతిల్లి వార్ధి

ఓయి! దానవనాథ! - యోడితి నేను
మాయందు నేటికి - మచ్చరంబిపుడు?
హరునికి మామ మ - హాశైలరాజు
గిరిజకుఁ దండ్రి లె - క్కింపఁ డెవ్వరిని950
యాహిమవంతుని - యంతవాఁడైన
నూహింప నీతోడ - నుద్దియౌఁగాక
కడమవాఁ రెందఱె - క్కడ నిన్ను బోరఁ
బుడమిపై నచటికిఁ - బొమ్మని" పలుక
నతఁడంపగోల రి - వ్వనఁ బాఱు కరణి
నతివేగమునఁ దుహి - నాచలంబునకుఁ
బోయి యట్లనె కయ్య - మునకుఁ బిల్చుటయు
నాయద్రి యతుల భ - యాతురుండగుచు
వెలఱు వాఱిన మబ్బు - విధమునఁ గొండ
తలమీఁద నిలిచి హ - స్తంబులు మొగిచి960
“యసురనాయక! నిల్చి - యనిసేయ వెఱతు
నసమర్థుఁడను మదీ - యాధిత్యకాగ్ర
గండోపలము లేల - కదలించి తన్ని
పిండి చేసెదు మౌని - బృందంబు చాల
నాయందు నున్నార - నంతంబు రాఁవు
సేయరాదిచట వ - సింతురు మునులు
వెఱచిన వారిని - వెంటాడ వీర
వరుల దరము గాదు - వదలు మాగ్రహము"
అన “నోరి ! హిమవంత! - యనిలోన నన్నుఁ
గినిసి మార్కొను విశం - కితపరాక్రముఁడుఁ97 0

గలిగిన జూపుము - కాకున్న నిన్ను
గులగులల్గాదన్ని - కూల్చకమాన!"
ఆనిన దుందుభిఁజూచి - యచలనాయకుఁడు
తనలోన దలంచి యా - దనుజున కనియె.
"విను మసురాధీశ! - విబుధనాయకుని
తనయుండు కిష్కింధఁ - దానేలు రాజు
రావణగర్వని - ర్వాపణశాలి
భావజాహితపాద - పద్మమదాళి
ఖరకరాత్మజదర్ప - గహనోగ్రకీలి
గిరిచరవీరాగ్ర - కీర్తనశీలి980
తారాహృదంబుజా - తనవీనహేళి
చారువిభూషణ - సౌవర్ణమాలి
యమితశౌర్యనిరస్త - హర్యక్షకేళి
సముదగ్రబలజిత - సామజపాళి
కనకఘంటాసము - త్కరభీమ వాలి
యనుదినవినుతదే -వాళి యవ్వాలి
వాలిన బలముతో - వడినిన్ను దీఱి
యాలంబు సేయఁ బొ - మ్మని" పల్కుటయును.
ఆకాఱుఁబోతు మా - యావిరక్కనుఁడు
కేక నజాండంబు -గిటగిట వణఁక 990
కేళ్లు దాఁటుచునుఁ గి - ష్కింధకు వచ్చి
హల్లోహలంబుగా - నట్టహాసంబు
సేయచు వాలి వ - సించు గహ్వరము
హో యని ఘూర్ణిల్ల - సుధ్ధతి నార్చి
గుజ్జుఁ గొమ్మలఁ దరుల్ - గోరాడి గొరజ

విజ్జున దన్ని య - వ్వివరంబుఁ గూల్చి
కనకవాటముల్ - ఖండించు మించు
తనరాక వాలి చి - త్తంబునఁ దెలిసి
తారకాన్వితుఁడైన - ధవళాంశుఁడనఁగ
తారాదికులసతుల్ - తనుఁజుట్టు కొలువ1000
నమరాంగనలఁ గూడి - యల్లన వచ్చు
తమ తండ్రియన బిల - ద్వారంబు వెడలి
"దుందుభి! నీకిట్టి - దుండగం బేల?
ఇందురావచ్చునే - యేనింద్రసుతుఁడ?
వాలిని వానర - వంశవల్లభుఁడ
నేల క్రొవ్వున వచ్చి - యిచటఁ ద్రుంగెదవు?"
అనిన నిశాచరుం - డయ్యింద్రసుతునిఁ
గనుఁగొని బెడిదంబు - గానిట్టులనియె.
"ఇంతుల నీచుట్టు - నిడుకొని వట్టి
పంతంబులాడిన- బంటవయ్యెదవె?1010
ఏ నుండి నీవుండి - యెందుకు నేఁడు
లేనికోపము మాట - లే పోటులగునె?
వెఱచిన పగవాని - వెన్నిచ్చువాని
శరణుజొచ్చినవాని - సతులలో వాని
నిదురించువాని మ - న్నింప శూరులకు
వదలని ధర్మమై - వరలు గావునను
దాళికి నేఁటికిఁ - దన చేయిగాంచి
వాలి! వీటికిఁ బొమ్మ - వలదు కాచితిని!
నీయంతవానిగా - నిలువు పట్టమున
సేయుము ప్రీతి నీ - చెలులకందఱికి1020

రమియింపు ప్రీతితో - రమణులఁ గూడి
యమలిన రత్నమా - ల్యములు దాలుపుము
నడకకొలంది దా - నము చేసికొనుము
తడవి ముద్దాడుము - తనయులఁబిల్చి
యీ రాత్రియేకాని - యిఁకమీఁద లేవు
నీరాజ్యసుఖములు - నీశరీరంబు
తప్పదు దుందుభి - తాను నమ్మించి
యిప్పుడు ఫులినాకి - యిటునిన్నువిడిచెఁ
బొమ్మన్న" వాలియ - ప్పుడు కోపగించి
రమ్మని తారాది - రమణులఁ బిలిచి1030
నగరికి ననిచి వా - నరవజ్రపాణి
నగుమోముతోడ య - న్నరభోజిఁ బలికె
"లోలాత్మ! యేను స్త్రీ - లోలుండఁగాను
వాలితో నినువంటి - వాఁడు నిట్లనునె!
నినువీధి పెడరేఁప- నేఁడు నామీఁద
గినిసి వచ్చితివి ప - ల్కితివి నేరుపులు
పోక నిల్వు"మటంచు - పురుహూతుఁడిచ్చు
శ్రీకరకాంచనాం - చితపద్మసరముఁ
దాలిచి వాని ను - ద్ధతితోడఁ గదిసి
వాలి చేతులు చాచి - వాని శృంగములు1040
మెదలనీయక పట్టి - మెడ మెలిపెట్టి
చదికిలిపాటుగా - జగతిపైఁ ద్రోచి
పట్టిన పట్టుతో - బలువడి నీడ్చి
పొట్టపై మోకాలు - బొడిచికుదించి
వెలికలఁ బడవైచి - వీపెల్లనలియఁ

బలువైన మొరపరా - పట్టులఁ గొట్టి
బోరగిల్లఁగ నూకి - బొండుగాఁ ద్రొక్కి
నోరను జెవులను - నురుగు నెత్తురులు
మెదడును వెదలంగ - మిడిగ్రుడ్లు వడఁగ
సదమదంబుగఁ ద్రొక్కి - చంపి మా యన్న1050
నెత్తురెల్లను మహి - నిండంగ రిత్త
తిత్తిగా విదిలించి - దిర్దిరంద్రిప్పి
కొమ్ములఁ బొడిచిన - గ్రుద్దినకాల
రెమ్మిన చెట్లచే - వ్రేసిన తాను
వానికి లోఁగాక - వధియించి కొండ
తో నుద్దియైన యా - దుందుభి మేను
విసరి యామటఁబడ - వేసిన వాని
యనలు నెత్తురు మతం - గాశ్రమభూమి
మునులపై దొరుగ న - మ్మునిరాజుఁ గినిసి
తనయోగదృష్టి నిం - తయు విచారించి1060
వాలికృతంబుగా - వగచి యాలోనఁ
గాలాగ్నియును బోలి - గ్రక్కున మండి
"యెప్పుడు వాలి దా - నిచటికి వచ్చె
నప్పుడే పొలియుగా" - కని శపియించి
"వానిఁ గొల్చిన యట్టి - వారెవ్వరైన
నీనగంబులం గల - యిచ్ఛాఫలములు
మెసవిన యప్పుడే - మేనులు వాసి
వసుధఁ బాషాణభా - వముల నుండుదురు!"
అనుచు నాజ్ఞాపింప - నాతఁడీమౌని
యనుకంప నొంద స - మర్థుండు గాక1070

యదిమొదల్ ఋష్యమూ - కాద్రికి రాక
మదిఁ గొంకి యుండ నె - మ్మదిగల్గె మాకు
దూరంబు లేదదె - దుందిభి కాయ
మోరామ! బలుఁగొండ - యో యన మించెఁ
గనుఁగొమ్ము వాలి యి - క్కడి కొండమీఁదఁ
దనరిన యీసప్త- తాళంబులందు
నొకతాళపర్ణంబు - లొకనిమేషమున
నొకటి చిక్కక యుండ - నురుశక్తిఁ దునుము!
ఇది వాలి విక్రమం - బిందుకు మీరు
మదిఁ దలంపుఁడు నన్ను - మనుచు మార్గంబు"1080
అన విని లక్ష్మణుఁ - డలతి నవ్వొలయ
వనజాప్తసుతుని భా - వమెఱింగి పలికె.
"ఎందుచే నమ్ముదు - వీరాము శక్తి
యందుచే విశ్వాస - మందుము నీవు
నీవు వల్కిన వాలి - నిజశక్తిగరిమ
లావంతయును మెచ్చు - లైతోఁచ లేదు
శ్రీరాముఁడు వినంగఁ - జెల్లునే పలుక
శూరునిగాఁ జంద్ర - జూటు నేనియును?
వాలికి వెఱచిన - వాడవై యెంత
జోలి చెప్పితివి హె - చ్చులు గావు మాకు1090
దేవదానవనర - తిర్యగాత్ములకు
నేవలనఁ దలంప - నిట్లనరాని
శౌర్యంబు గలిగిన - జానకీరమణు
మర్యాదఁ దెలియని - మాటలాడితివి!"
అన విని సుగ్రీవుఁ - డంజలిచేసి

-: శ్రీరాముఁడు సప్తతాళములఛేదించుట :-

తన సందియముఁదీఱఁ - దలంచి యిట్లనియె,
"ఈతాఁటిమ్రాకులం - దేకవృక్షంబుఁ
జేతులఁ దావంచి - చిదుము పర్ణములు
వాలి యీరఘుకుల - వర్యుఁడం దొక్క
సాల మొక్కనిశాత - శరముచేఁ దునిమి1100
పాదాగ్రనిహతిచేఁ - బలువిడి జిమ్మి
యీ దుందుభికబంధ - మిన్నూఱు విండ్ల
నేల యవ్వలఁ బడ- నేఁడు మీటంగఁ
జాలిన వాలిని - సమయింపఁ జాలు!”
అని పల్కి మఱియు దా - నాత్మఁ జింతించి
యినతనయుఁడు రాము - నీక్షించి పలికె.
"దేవ ! మీశక్తి శో - ధింపఁ దలంచి
యేవ వుట్టంగ నే - నిటు వల్కలేదు.
ఆ వాలిశక్తి యే - నరసినవాఁడ
గావున మీకెఱుఁ - గఁగఁ దెల్పవలసె1110
వెఱపింపలేదు మీ - విక్రమచర్య
లరయ భస్మచ్ఛన్న - మగు నగ్నిరీతిఁ
దెలియకున్నది గాన - దెలుసుకోవలసి
పలికితిఁ దప్పుగాఁ - బాటింపవలదు!
ఆకారమున దోచు - నఖిలంబు మహి వి
వేకుల కట్టి వి - వేక మెక్కడిది
కపులకు? నేనట్ల - గాన మీతోడఁ
జపలబుద్ధిని పరీ - క్షయొసంగు మంటి!"

అన దరహాసము - ఖాంబుజుఁ డగుచు
మనువంశుఁ డర్కకు - మారుతో ననియె. 1120
"కపట మెఱుంగవు - గాన సుగ్రీవ!
యిపుడు నీవచనంబు - లింపగు మాకు
బలియుని తోడుతఁ - బగవూని యొరుల
చెలిమిఁ దానెఱుఁగక - సేయుటల్ దగునె?
పగగెల్చునే హీన - బలునితోఁ గూడి?
తగవె చేసితివి సం - తసమయ్యె మాకు
కొదఁ దీర్తు" నని పదాం - గుష్టంబుచేత
పదియోజనంబుల - పాటి దూరమున
దుందుభికాయంబుఁ - దొలఁగ మీటుటయు
నందుకు సుగ్రీవుఁ - డలరి యిట్లనియె.1130
"నాఁటికి నిక్కబం - ధము రక్తమాంస
పాటవంబున మించుఁ - బలుగొండ వోలి!
ఇపుడు వానల నాని - యెండల నెండి
విపులమై కాష్టంబు - విధమునఁ జివికి
నిస్సారమైన దీ - నిని మీఁటి నంత
దుస్సహసత్త్వమిం - దునఁ దేట పడదు
ఈ మహాతాళమ- నేకపతుండ
భీమబాహాదండ - భీకరకాండ
సంధానమున మహీ - స్థలిఁ గూల్చి దీన
బాంధవ! నాశంకఁ - బాపుము నీవు!1140
అటులైన విలుకాండ్ల - యందుల నీవు
పటుతరమృగములఁ - బంచాననంబు
ధరణిఁ దేజములందుఁ - దపనబింబంబు

ధరణీధరముల బృం - దారకాచలము
నసమవిగ్రహులని - యాత్మలో నెంచి
కొసరులన్నియుఁ దీఱి - కొలిచియుండెదను
సత్య మీమాట నీ - చరణంబు లాన
నిత్యకల్యాణ! మ - న్నింపు నన్ననిన

-: శ్రీరాముని నిజశక్తిప్రదర్శనము మెచ్చి సుగ్రీవుఁడు వాలిపై యుద్ధమునకు వెడలుట:-

ఆమాటలోనఁ బ్ర - త్యాలీఢచరణ
తామరసుండయి - దండపూనికను1150
కలగుండువడఁగ జ - గంబులన్నియును
విలుగుణధ్వని జేసి - విశిఖంబుఁ దొడిగి
వేసిన నాతాళ - వృక్షంబు లేడు
దూసి కుంభినిఁ గూల్చి - తొలుచుకఁ గొండ
యావల వెలువడి - యవని నాఁటుటయు
భావించి వానర - పతి వెఱఁగంది
గజగజ వడఁకి రా - ఘవుని పాదముల
నిజమౌళి సోఁకఁ బూ - నికఁ బ్రణమిల్లి
లేచి హస్తములు గీ - లించి నెమ్మొగము
చూచి యుప్పొంగుచు - సుగ్రీవుఁ డనియె1160
'శరమొక్క టేర్చి యా - సప్తతాళములు
నఱికి యుర్వరఁ గూల్చి - నగము భేదించి
భూమి వ్రయ్యలుసేయు - భుజశౌర్యనిధిని
స్వామి! నిన్నేమని - సన్నుతించెను
నొకవాలి యననేల - యురుశక్తివింట

నొకకోలఁ దొడిగి ప్ర - యోగించితేని
యమరేంద్ర దిక్పాల - కావళినైన
సమయింపనేర్తువు - క్షణములోపలను
సకలోన్నతంబైన - శౌర్యంబు గలుగు
నొక నీదు చెల్మి నా - కొనరిన కతన1170
నాకోర్కు లీడేరె - నాకన్య మేల
నీకు దాస్యము వూని - నిల్చికొల్చెదను
మ్రొక్కెద"నను గపి - ముఖ్యుఁ గౌఁగింట
నొక్కి సౌమిత్రి వీ - నులు చెలరేఁగ
కెలన నున్నట్టి సు - గ్రీవునిఁ జూచి
కలఁకఁ దీఱంగ రా - ఘవుఁ డిట్టులనియె
"పొమ్ము సుగ్రీవ! యీ - ప్రొద్దె కిష్కింధ
కమ్మేర వాలి నీ - వనికి రమ్మనుము."
అని పల్కి యతని ము - న్ననిచి యావెంట
జని యిర్వురును పుర - సవిధకుంజముల1180
తరువుల మాటునఁ - దమ్ము గాననీక
మఱపు నేమఱపు నె - మ్మది లేకయుండ

-: వాలిసుగ్రీవుల మొదటియుద్ధము :-

కేలప్పళించి కి - ష్కింధాగుహాంత
రాళంబు మోసల - రవికుమారకుఁడు
కయ్యంబు గావింపఁ - గదలి రమ్మనుచు
నయ్యెడ భయదాట్ట - హాసంబుఁ జేసి
వాలినిఁ బిలిచిన - వరభుజాగర్వ
శాలియై తమ్ముని - సద్దుగానెంచి

పడమటికొండకు - భానుండు చేరు
వడువున సుగ్రీవు - వలనికిఁ జేరి 1190
పొడిచిన యిరువుర - భూరియుద్ధంబు
పుడమి చలింప న - ద్భుతకరంబయ్యె!
కలను గావించు నం - గారకబుధుల
పొలువున నిరువురు - భుజవిక్రమముల
పిడికిటిపోట్లచేఁ - బృథివీధరములఁ
బిడుగులు వడియెడి - పెక్కువ దోఁపఁ
బోరుచో వారి న - ప్పుడు దేరి చూచి
శ్రీ రామలక్ష్మణుల్ - చిత్తంబులందు
నాశ్వినేయులనంగ - నాహవభూమి
శాశ్వతశౌర్యులై - జగడింపుచున్న1200
వాలీసుగ్రీవుల - వైపుల చూచి
వాలి వీఁ డితఁడు ది - వాకరాత్మజుఁడు
నని నేర్పఱచు నుపా - యము వాలినేయు
ననువును గానక -యటునిటు జూచి
యూరక చేకాచి - యుండ సుగ్రీవుఁ
"డా రాఘవుల నమ్మి - యనికివచ్చితిని
నను దెచ్చి వాలి ముం - దఱ నొప్పగించి
కనుపించుకొనక చ - క్కఁగ నేఁగినారు
తనువెల్ల నొగిలె నీ - తని ప్రహారముల
తను జంపు వాలి యిం - తటఁ బాఱకున్న"1210
ననుచు వచ్చినత్రోవ - నతిజవశక్తి
వెనక చూడక పాఱె - వీఁడంచు వాలి
నగుచుండ మునుపున్న - నగమున కేఁగి

మొగమెల్లఁ బగుల నె - మ్ములఁ దిరుగంగ
కదుములు గట్టి ర - క్తములు మైనిండ
నదరులవారలౌ - నడుగడుగునకు
గుట్టూర్పు లుచ్చి మూ - ల్గుచు నింకనొక్క
పెట్టుచే సుగ్రీవు - పీఁచమణంతు
నని వెంబడించి తా - నటుఁ జేరరామి
మనసులో నలిగి క్ర - మ్మఱ వాలి చనినఁ1220
దలపట్టి చూచుక - తనదు భంగంబుఁ
దలఁపుచు నొకచెంత - తరణినందనుఁడు
చేరుచోఁ బావని - చెంతరా నృపకు
మారకుల్ భానుకు - మారునిఁ జేరి
నిలుచున్న శ్రీరాము - ని మొగంబు జూచి
తలఁకుచు వంచిన - తలయెత్తి పలికె,
"అనలుండు సాక్షిగా - నరలేని చెలిమి
యొనరించి యడిగిన - యొడబాటు లిచ్చి
సత్తువల్ చూపి బా - సలను నమ్మించి
కత్తులు దాఁటి సం - గటి వచ్చినిలిచి1230
వాలితో హత్తించి - వానికిఁ దనకు
నాలంబు దురుసైన - యట నిల్వవెఱచి
యొదిగి యెచ్చట నుంటి - రో! యన్నలార!
ఇది యేమి చేసితి - రెఱుఁగలేనైతి
నిటువంటివాఁడని - యెఱిగింపలేదొ?
పటుశక్తి మాకు జొ - ప్పడదని మీరు
వాకొన్న నేరము - వచ్చునో యెందు?
రాకొమారులు స్వకా - ర్యంబు లేమఱరు

వాని నేఁ గెలిచిన - వచ్చి నాచేత
జానకి సాధింప - సమకట్టినారు.1240
అది తప్పి నాచేత - నయ్యెడి దేమి?
మదికిఁదోచినయట్టి - మార్గంబుఁ గనుఁడు
పదివేలువచ్చెఁ జం - పక పోవరేమొ
కొదవగల్గినఁ బేరు - కొనుఁడు చేసెదను.”
అను మాటలకు సిగ్గు - హాస్యంబుఁ బొడమ
జనకజారమణుఁ డి - చ్చఁ గలిగి పలికె.
"ఏల కోపించెద? - వేనమ్ము దొడిగి
వాలినేయని హేతు - వచనంబు వినుము
రూపులు నడపు లా - రూఢముల్ బలము
చూపులు పలుకులు - సొబగు లంగములు1250
నొక్కరూపమకాని - యొకరందు నెచ్చు
తక్కువల్ వెదకియు తడవు చింతించి
యూహింపఁజాలక యుంటి మింతటికి
నీహనుమంతుండు - నెఱిఁగియున్నాడు.
ఏము ద్రోహము సేతు - మే? నీకు నెఱుఁగ
లేమైతి మపుడు వా - లిని నిన్ను జూచి
నాయమోఘాస్త్రసం - ధానంబు చేసి
చేయి గాయక యున్న - సీమకు లేని
యపకీర్తి మాకునై - హాని నీకైన
నపుడేమి సేయుదు - వది యెన్నవైతి1260
నీకొక్క కీడైస - నేము చింతించి
యాకడ మఱిసేయు - నది యేమి గలదు?
అవివేకపడుచుఁ గా - ర్యము చేసెననుచు

నవనీజనులు నన్ను - నాడకుండుదురె?
నమ్మించి నినుఁజంపి - న యనంత దురిత
మెమ్మేరఁ గడ తేరు - నెఱుఁగవుగాక!
శరణంబు నీవు ల - క్ష్మణునకు నాకు
ధరణిజకును మన - స్తాపమేమిటికి?
ఒక గుఱు తే నీకు - నునిచెద నింక
నొకపరి వాలితో - యుద్ధంబు చేసి 1270
మఱిచూడు మాత్మీయ - మానుషచర్య
లరమరల్ దీరి పొ - మ్మని సేయ వలదు
ఇలువెడలిన వాలి - నిలఁగూలె ననుచుఁ
దలఁపుము చూచి నం - తనె పాఱిపొమ్ము
ముమ్మాటు మమ్ము న - మ్ముము నాదు చేతి
యమ్ము నీమదిలో భ - యమ్ము వారించు”
నని పల్కి “లక్ష్మణ! - యల్ల దే పూచి
కనుపట్టె వనములో - గజపుష్పలతిక
అది తెచ్చి సుగ్రీవు - నఱుతఁ గీలించి
కదియింపు వాలితోఁ - గదనంబు సేయ."1280
అన్నచో సౌమిత్రి - యన్న వాక్యములు
మన్నించి గజపుష్ప - మాలిక దెచ్చి
సుగ్రీవు మెడను వై - చుటయు నాఁడయ్యె
సుగ్రీవుఁడతఁడు తే - జోవిలాసముల
విపరీతమున నుడు - వీథిలో సూర్య
నుపమింప నవ్వాన - రోత్తంసుఁ డలరె!
చదలున సంధ్యావ - సర వారిదంబుఁ
గదియు బాలార్క రే - ఖను మించినట్లు

లక్ష్మణార్పిత పుష్ప - లతికానవీన
లక్ష్ముఁడై బలగర్వ - లక్ష్ములఁదనరి1290
రామునితో వాన - రకులోత్తముండు
సేమంబు దలఁచి కి - ష్కింధకు నేఁగ

- సుగ్రీవుని ద్వితీయ రణప్రస్థాసము, సప్తజనాశ్రమమహిమానువర్ణనము

విల్లెక్కువెట్టి యా - వెనుక రాఘవుడు
భల్ల మొక్కటి యేర్చి - పట్టి యావెనుక
నలనీలతారాంజ - నానందనులును
గొలువ మార్గమునందుఁ - గువలయకముల
లలిత మృణాళడో - లాసంచరిష్ణు
కలహంస చక్రవా - క క్రౌంచ మిథున
కేళీవిలాససం - కీర్ణంబులగుచు
రోలంబమాలికా - రుతివీనులలర1300
సుమహిత వైడూర్య - శోభావిభాసి
కమలపలాశరే - ఖలు శోభిలంగ
వెలయు తటాకముల్ - వీక్షించి పచ్చి
కల మచ్చికల కురం - గములఁగన్గొనుచు
గిరిమేఘ నిభములై - ఘీంకృతుల్ సలుపు
కరులను కిరులను - కాసరంబులను
జెదరిపోఁద్రోలుచు - సీతావిభుండు
కదిసిన సుగ్రీవుఁ - గాంచి యిట్లనియె
"ఎవ్వరి నెలవిది? - యిచ్చోటి తావి
పువ్వుఁదోఁటలును గ - ర్పూరపుటనఁటి 1310

గుంపులు పండిన - గుజ్జుమామిళ్లు
సంపెగల్ మదికింపు - సమకొల్పె నిచట
వినిపింపు" మన రఘు - వీరునిఁ జూచి
యినకుమారుఁడు భక్తి - నిట్లని పలికె,
"రామ! యీపావనా - శ్రమము మనోభి
రామమై స్వాదునీ - రంబుల గలుగు
కొలఁకుల విహగసం - కులముల నమృత
ఫలముల విలసిల్లు - పాదపంబులను
చాలమీఱును సప్త - జనులను మౌని
జాల మిచ్చటి జలా - శయముల యందుఁ1320
దలక్రిందుగా నుగ్ర - తపములు చేసి
తలలెత్తి సప్తరా - త్రములకు నొక్క
నాఁటి కందఱు పవ - నంబు భక్షించి
నీటిలో మఱల ము - న్నీటిచందమున
శయనింపుచును శత - సంవత్సరములు
నియమంబుగా నిట్లు - నిండిన పిదప
బొందులతో దివం - బులకు వారేఁగి
రిందు నయ్యాశ్రమం - బిది చిత్తగింపు
మిపుడు వారలయాజ్ఞ - నీమహాసాల
విపులమహాశాఖ - వృత్తగౌరవముఁ1330
దేఱిచూడఁగరాదు - దివిజులకైనఁ
జేర నేర్చునె మృగ - శ్రేణి చెంతలకు?
వినవచ్చుచున్నని - వేదఘోషములు
ననుపమ స్వాహాస్వ - ధానులాపములు
తుదకొమ్మలను హోమ - ధూమమాలికలు

గదియుచో నిచటి న - గశ్రేణి యెల్ల
ఘనసమాకలితన - గశ్రేణి యనఁగఁ
గనుపండువయ్యె రా - ఘవ! విలోకింపు
చొరవచ్చుగాని యీ - శోభనారామ
మరుదెవ్వరికి పున - రాగమనంబు1340
శింజానకనకలాం - చీరత్నకటక
మంజీరనినద సం - పదలాలకింపు!
వినవయ్య! యీవన - వీథులయందు
ననుపమ నృత్తవా - ద్యాది రావంబు!
రాసి నాసావివ - రప్రీతిగాఁగ
వాసన వలిగాలి -వచ్చునిచాయ!
నాహవనీయాది - హవ్యవాహనస
మాహితజ్వలిక - లవె విలోకింపు
మివియన్నియును నమ్ము - నీంద్రుల మహిమ
లవని జాగిలి మ్రొక్కు - మనుజుఁడు నీవు1350
వారలఁ దలఁచి యె - వ్వారు మ్రొక్కినను
శ్రీరామ కలుగు న - శేషసౌఖ్యములు."
అన విని యభిముఖు - లై రఘువరులు
మునుల నుద్దేశించి - మ్రొక్కి ప్రార్థించి
యలరుచు సప్తజ - నాశ్రమ స్థలము
తలఁగి కిష్కింధచెం - తకుఁ జేరఁబోయి
యావాలిపాలితం - బైన పట్టణము
క్రేవఁదమోవని - శ్రేణులయందు
శరచాపహస్తులై - శతమఘతనయ
చరణిత సంగర - స్థలిఁ జొచ్చి యుండ1360

రవికుమారుఁడు ముంద - ఱను వెన్కగడలఁ
బవనజూదులు చాల - బలిసి సేవింపఁ
జుట్టులు తాఁదేఱి- చూచుచుఁ జెలఁగి
యట్టహాసమున బ్ర - హ్మాండంబుఁగదల
బహుయంత్ర చిత్రాత - పత్రధ్వజాంశు
మహితమౌ వాలిధా - మము విలోకించి
సమ్మతపడఁ బల్కి - శాత్రవుఁ దునుమ
నమ్మించు జానకీ - నాయకుఁజూచి
వెఱచినవాడయ్యు - వెఱవక నిలిచి
తరణితనూజుఁ డు - ద్ధతి నిట్టులనియె.1370
“వచ్చితి మిదియె మా - వాలినివాస
మిచ్చోట మీరు నా - కిచ్చిన ప్రతిన
మఱవకుండని"పల్క - మహిసుతాప్రియుఁడు
కరుణించి సుగ్రీవుఁ - గాంచి యిట్లనియె.
"కంధరాస్థలి - నిలిపిన తీవె
మాకు నేర్పడ వాలి - మార్కొను మీవు.
ఎప్పుడు చూచితి - మింద్రకుమారు
నప్పుడే హతుఁడయ్యె - నని యెన్నికొనుము!
ఒకతూపె కాని యొం - డొకతూపుఁ దొడుగ
నొకయంతఁ దీర్తు నీ - యుపతాపమెల్ల! 1380
తెలిసియుఁ దెలియక - దిట దప్పి నన్ను
పలుమారు నమ్మక - పలుకనేమిటికి?
భయసంభ్రమము లేల? - పలికిన పలుకు
నియతి నేఁదప్పుదు - నే? యెట్టియెడల

శతమఘుం డవని స - స్యములు ఫలింప
మతియించుగతిఁ దెమ్ము - మఘవనందనుని
వెనుకటి కొకనాఁడు - విజయంబె కాని
యనిలోన నీకు లో - నగువాఁడుఁగాదు!
అదిగాక సతులస- మక్షంబునందు
మదగర్వములు హెచ్చు - మది నెల్లఱకును1390
నీమహాధ్వని విని - నిలువక వెడలి
తామున్ను వోలె యు - ద్ధముసేయు వాలి
యంతట నాయమో - ఘాస్త్రంబుచేత
నంతకు వీటికి - ననుపుదు"ననిన
పెళపెళ నార్చి కు - ప్పించి కిష్కింధ
జలదరింపంగ గ - ర్జానినాదమున
రాజదోషమునఁ జే - రక కులకాంత
లేఁజాడఁ బరువెత్తు - నెన్నికదోప
నావుల మందలు - నచ్చోట నిలక
తావులు దప్పి కొం - దలముతోఁ బఱవ1400
రణములో విఱుఁగు తు - రంగంబులనఁగఁ
దృణభక్షణము మాని - మృగములు చెదర
సడలిన పుణ్యవా - సన వారిఁ బోలి
సుడివడి యెల్లప - క్షులు మహిఁబడగ
దారణ పవమాన - ధారాభిహతిని
భోరనఁ గలఁగు నం - బుధిమ్రోఁత యనఁగ
దట్టించి సింహనా - దము సేయ వాలి
పట్టణంబున మహో - త్పాతంబు పుట్టె

 -: వాలి యుద్ధమునకుఁబోవఁ బ్రయత్నింప దార హితము చెప్పుట :-

ఆగర్జితము విని - యప్పుడువాలి
తాగహ్వరమునఁ గాం - తామధ్యమమున1410
రాహువు వట్టిన - రవిరీతిఁ దనదు
దేహకాంతి యొకింత - తెఱఁగు మాయంగ
కలితమృణాళప్ర- కాండకాసార
కలనఁ గోఱలతో ము - ఖంబు శోభిల్ల
తరుణసంధ్యారాగ - తనుకాంతి నిలయ
గిరి గహ్వరమునఁ దీ - గెలు సాగి వెడల
గమన వేగమున - వ్రక్కలుగాఁగ ధరణి
సముదగ్రగాఢప్ర - చండకోపమున
వచ్చు మహావాలి - వాలినిఁ గాంచి
మచ్చిక గల్పించి - మది భయం బుంచి1420
యనునయాలింగన - మాచరింపుచును
వినయంబుతోఁ దార - విభున కిట్లనియె
"వల్లభ! సిగనున్న - వాడినవువ్వు
లొల్లక మఱునాఁటి - యుదయకాలమునఁ
దొలఁగవైచినగతి - దుస్సహంబైన
యలుక యేఁటికి మాను - నదిగార్యసరణి
యీరాత్రి జగడింప - నేఁటికి తెల్ల
వాఱిిన సుగ్రీవు వధి - యింవుమీవు
రాక్షసులకెకాని - రాత్రి యుద్ధములు
లక్షింప మీబోటు - లకు మేరగాదు1430

యిందుచే నీవైరి - కెచ్చును నీకు
గుందును లేచు కై -కొనుము మామనవి
దురమున కిప్పుడు - దురదురఁబోవ
సరిపోదు నాకట్టి - చందంబు వినుము
జగడంబునకు వచ్చి - చాలంగనొచ్చి
తెగిపారి ప్రాణభీ - తినిఁ బోవువాఁడు
యీవెంటనే వచ్చి - యెదిరించి నిన్ను
లావుతోఁబోరఁ బి - ల్వఁగడంగి నపుడె
యిదియేమియో యను - యెన్నికనాదు
మదిలోనఁ గడు నను - మానంబు పుట్టె! 1440
అట్టహాసము జేసి - యంబుజహితుని
పట్టిని పైజల - పట్టి యీ వేళఁ
బిలిచిన చందంబు - బిరుదు పోటరుల
చెలిమిచే ననుచు నేఁ- జింతఁ జేసితిని
యోర్పరియును గడు - నుచితకృత్యముల
నేర్పరియును నైన - నీ సహోదరుఁడు
తాఁ బరీక్షించి యిం - తకు దగువాని
చేఁ బగదీఱుపఁ - జింతించి వచ్చె
మన యంగదుఁడు నేఁటి - మాఁపటి వేళ
నను జేరి తాను వి - న్న తెఱంగుఁ జెప్పె.1450
చారులు తనతో బ్ర - సంగించు మాట
యేఱుపాటుగ నది - యేవిన్నవింత
వడిగలవారు చె - ల్వముఁగలవారు
పుడమియంతయుఁద్రోవ - బ్రోవ నేర్పరులు

వా రయోధ్యాపుర - వల్లభుండైన
వీరుఁడౌ దశరథ - విభుని నందనులు
రామలక్ష్మణులు ధ - ర్మస్వరూపకులు
తాము సుగ్రీవుని - దండకు వచ్చి
చెలిమి చేసినవార - జేయులందులను
బలవంతుఁడగు రామ - భద్రుఁ డీపనికిఁ1460
బూని వచ్చినవాఁడు - పూనిన కార్య
మౌనిది కాదిది - యనరానివాఁడు
వరమతి సాకు ని - వాసవృక్షంబు
కరణి నాపన్నుల - గతియైనవాఁడు
నార్తుల కెల్ల స - మాశ్రయుం డతఁడు
కీర్తికిఁ దానె సం - కేతస్థలంబు
జ్ఞానసత్వవివేక - సంపన్నుఁ డఖిల
దీనబాంధవుఁడు శ - క్తిత్రయాధికుఁడు
తలిదండ్రిమాట యౌ - దలఁ దాల్చువాఁడు
కలనైన బొంకెఱుం - గని సత్యవాది1470
కోదండదీక్షాది - గురుఁడైనవాఁడు
వేదండగమనుండు - విజయలోలుండు
ధాతువులకు పర్వ - తముఁబోలి సుగుణ
జాతంబులకు సమా - శ్రయుఁడైనవాఁడు!
ఆరఘువీరుని - యసమవిరోధ
మేరికిఁ గడతేరు? - నెఱుఁగవయ్యెదవు
హితము నామాట నే - నెఱుఁగుదు నతని
నతిలోకధర్మస - త్యపరాక్రమములు

చూడఁజాలక నిన్ను - సుద్దులచేత
నోడించి పగవాని - యురువెంచలేదు1480
నీమేలుఁగోరి నే - నిలుపోపలేక
స్వామి! యడ్డమువచ్చి - వలదంటిఁ జలము
ఆ రవితనయుని - యౌవరాజ్యమునఁ
గోరిపట్టముఁ గట్టి - కోపంబుఁ దీర్చి
శ్రీరాముతోడుతఁ - జెలిమి గావించి
యూరక సుఖమున - నుండుట మేలు
కడనున్న నేమి యి - క్కడ నున్న నేమి?
కడవాఁడు గాడు భా - స్కరకుమారకుఁడు
లాలనీయుఁడు తమ్ము - లను వేఱుసేయు
పాలసులకు నిత్య - పదవులు గలవె?1490
ఎవ్వరాతనికన్న - హితులైన బంధు
లెవ్వరున్నారు నీ - కెందుఁ జూచినను?
నీవు రాజ్యము సేయ - నీతోడఁ బుట్టి
యీవగ సుగ్రీవుఁ - డిడుమలఁ బడునె?
ఇలమీఁద యాసయు - నింతులయాస
కలిమిపై యాస యొ - క్కటియె యెల్లరకు!
పిలిపింపు మతనిఁ జె - ప్పినయట్ల నడచు
చలమెఱుఁగడు సర్వ - సముఁడు సౌమ్యుండు
రమ్మనకేమి నే - రము నీకుఁ జేసె?
నమ్మలేవైతి బ్రా - ణమువంటివాని
సోదరుఁ గడవ న - న్యులును జుట్టములె?
కాదు సుమయ్య! రా - ఘవమిత్రుఁ జెనక!
హితురాలవని నన్ను - నెంచితివేని

మతి నాగ్రహము మాని - మనవి గైకొనుము
ఇంద్రాదులైన జ - యింతురే రామ
చంద్రుఁడు కేల న - స్త్రము వూని యున్న?
నీవెంత! జగముల - న్నియు గెల్వఁజాలు
చేవిల్లు గైకొన్న - శ్రీరామవిభుఁడు!"
అని యెన్ని పలికిన - నవియెల్లఁ జెవులఁ
జొనుపక కాలవ - శుండైన వాలి1510
తనువిధి పెడరేఁప - దట్టించి తారఁ
గనుఁగొని పరుషవా - క్యముల నిట్లనియె,
"పగవాఁడు వచ్చి ద - ర్పంబుతో నన్ను
జగడంబునకుఁ బిల్వ - సైరింపఁ గలనె?
ఇయ్యవమతి కన్న - నెటులైన నేమి
కయ్యంబు సేయక - కాదిందువదన!
ఏలీల సైరింతు - నెఱుఁగవుగాక
బాల! తోడను బుట్టు - పగయోర్వఁగలనె?
సుగ్రీవు నినదంబు - శ్రుతి సోఁకెగాన
నాగ్రహం బణపలే - నట్టులనయ్యె1520
రామునియెడ నకా - రణభీతి తనకు
నేమిటి కీచింత - యేఁటికి నీకు?
ధర్మమానసుఁడు కృ - తజ్ఞుండు నైన
ధార్మికాగ్రణి కీడుఁ - దలఁచునే తనకు!
హితము వల్కితివి నీ - కిది యుచితంబు
ప్రతికూలమని యెంచఁ - బడదు నీమాట
భానుజు నెదిరించి - వట్టి వధించి
వానిగర్వ మణంచి - వచ్చెద గాని

బోటులతో నంతి - పురి కేఁగు మీవు
పాటలాధర! విన్నఁ - బాటు నొందకుము1530
నిలుచునేవాఁడు నా - నిగ్రహంబునకు?
శిలల వృక్షంబుల - చే బుద్ధి చెప్పి
వచ్చెద నాయాన! - వనిత యేమనిన
నిచ్చట నీయాన - నిఁకఁ దాళజాల”
అనఁ దార కన్నుల - నశ్రులు రాల
దన నాయకుని మోముఁ - దనివోక చూచి
కౌఁగిట నిండారఁ - గదియించు వెతల
వేఁగుచు వలవచ్చి - "విచ్చేయు మనికి
జయమందు" మనుచు సే - స శిరంబు మీఁదఁ
జెయి చాచియునిచి తాఁ - జింతతో మఱల1540
నావాలి వెడలి మ - హాంధకారమున
నేవగ నున్నాఁడొ - యినసూనుఁ డనుచుఁ
గలయ దిక్కులు జూడ - గజపుష్పిపుష్ప
కళికాకలితలతా - గ్రైవేయకమున
దిగదిగ వెలిఁగి యా - దిత్యానలేందు
యుగపత్ప్రకాశస - మున్నతుండైన
తమ్మునిఁ గనుఁగొని - దట్టించి యాగ్ర
హమ్మున భయదగ్ర - హమ్ముచందమున
దండపూనికఁ గాల - దండాభబాహు
దండైకముష్టివి - ధాప్రహారమునఁ1550
బొలియింతునని చేరఁ - బోవు నవ్వాలిఁ
జులకగాఁ కనుఁగొని - సుగ్రీవుఁ డనియె.
"ఎప్పటివలెఁ జూచె - దింక నాకేలు

దప్పదు నీకుఁ బో - దగదింక బ్రతికి
యిదె చూడుమని కేల - నెత్తిన వృక్ష
మదరంట గిరిమీద- నశనియుఁ బోల
వాలిపై నేసిన - వాలి వారథినిఁ
జాలభారమునఁ జం - చలమైన యోడ
తీరునఁ జలియించి - - ధృతిశాలి వాలి
భోరున పైవ్రాలి - పొడమి చేకొద్ది1560
యిద్దఱు నభిమున - కెగసి సింగముల
యుద్దులై రవిచంద్రు - లోయన దొరసి
కదిసి ముష్టాముష్టి - గరుడవేగమున
నెదిరి బాహాబాహి - నెడమీక పెనఁగి
వ్రాలి కచాకచి - వసుధపై బొరలి
వాలిసుగ్రీవుల - వార్యశౌర్యముల
నన్యోన్యజయకాంక్ష - ననిసేయ నలఘు
మన్యువుతో శాంత - మన్యవుం డలగి
బలగర్వముల హెచ్చ - పైపయిఁ బెరిగి
తలనాఁటి పాటెల్లఁ - దలఁచుకోఁ జేయ1570
సత్తువ దఱగి మో - సమువచ్చె నెందు
చొత్తు నేనని యెంచి - చూచెద నింక
కొంతసేపని కాళ్ల - గోళ్ల చేతులను
దంతంబులను మహో - ద్ధతిఁ బోరుచుండ
నిరువురు వృత్రాసు - రేంద్రుల రీతి
సరివోర భయదగ - ర్జలతోడఁ బెనఁగు
మబ్బులవలెఁ దోచు - మర్కటాధిపులు
బొబ్బలు వేటులు - పోటులు నొక్క

రీతిగా మాల్య మె - ఱింగింపఁ జేతి
ఘాతల నలసి న - ల్గడఁ జూచుచున్న1580
రవితనయుని గాంచి - రఘువీరుఁడొయ్యఁ
జెవిసోఁక సింజిని - చే యమ్ము దిగిచి
యల్లెమ్రోతను గూళ్ళ - నణఁగిన పులుగు
లెల్లఁ దానున్న మ - హీరుహగ్రమునఁ
జలియింప మెల్లనే - శరము చేవదల
బలువైనపిడు గద్రి - పైఁ బడు నటుల
వాలిపేరెద నాటి - వ్రయ్యలు సేయ
కాలువ లగుచు ర - క్తంబులు దొరుఁగఁ
వినిమూర్ఛ నొంది కుం - భిని వ్రాలి వాలి
కను దేలగలవైచి - గాజువారుచును1590
మేనిశాంతి యడంగ - మేదినిఁ జంద్ర
హీనమౌ నభముతో - నేనయంగ మూర్ఛ
వచ్చియుండియుఁ దండ్రి - వరదుఁడై తనకు
నిచ్చినసురభిళ - హేమదామంబు
మహిమఁ బ్రాణంబును - మదిలోని యెఱుక
మహనీయకాంతియు - మానకయుండె
పూచినమోదుగు - పొలుపున రక్త
రోచుల సంధ్యోరు - రుచిమీరి యున్న
వారిదంబన పుణ్య - వాసనల్ దీరి
యారీతిఁబడిన య - యాతి చందమున1600
జ్వాలలన్నియుఁబోయి - శాంతమైయున్న
కీలికైవడి ధాత్రి - కిని వ్రాలియున్న
విలయభానునిరీతి - వేదనఁబొంది

తెలివిడితోఁ గన్నుఁ - దెఱచిన యట్టి
వాలిచెంతకు రఘు - వరులు ప్రమోద
శాలులై చేరంగఁ - జని మహామహుని
దుర్జయు నింద్రుని - తో సరివాని
నార్జవాన్వితుని దే - వాసురాసాధ్యు
నుత్తుంగభుజుని సిం - హోరస్కునిం బ్ర
మత్తుని గాంచన - మాలి నాజాను1610
బాహుని హరినేత్రు - భాసురవదను
నాహరినాయకు - నాహా జనింపఁ
గనుఁగొనుచుండ రా - ఘవుని నెమ్మోముఁ
గనివాలి ధర్మయు - క్తంబు సమ్మతము
నుచితంబు నిందాప్ర - యుక్తంబు నైన
వచనంబు దీనభా - వమున నిట్లనియె.
"ఏమఱిపాటున - యేనుండ నేసి
యేమి లాభముగంటి - విదియుఁ బౌరుషమె?
పోరికి నేరాఁగఁ - బోవల దనుచుఁ
దార నీ తెఱఁగెల్ల - దనకుఁ దెల్పుటయుఁ1620
గులవంతుఁడవు ధార్మి - కుఁడవు ప్రాజ్ఞుఁడవు
బలవంతుఁడవు దయా - పరుఁడవు సత్య
వాదివి సౌమ్యభా- వనుఁడవు శస్త్ర
వేదివి నీతికో - విదుఁడవు సర్వ
సముఁడవు వీతమ - త్సరుఁడవు కీర్తి
రమణీయుఁడవు పరా - క్రమభూషణుఁడవు
యని విన్నవాఁడనై - యది నిజంబనుచు
మనసులో నమ్మి యే - మఱియుంటి నిపుడు

రాజులు ధర్మమా - ర్గంబుఁ జేపట్టి
భూజనంబుల బాధఁ - బొందింపుచున్న1630
ఖలుల శిక్షింతురు - కలుషభయంబు
దలఁచి వర్తింతురు - తప్పరెవ్వరును
ఏను నా తమ్ముఁడు - నెక్కటిఁ బోర
మౌనివేషము బూని - మాయావి వగుచు
వచ్చి చంపుదురె? యీ - వసుధను నీకు
నెచ్చోటనైన నే - నెగ్గు చేసితినె?
మునులకైవడి ఫల - మూలముల్ మెసవి
వనులఁ గ్రుమ్మరు నట్టి - వనచరుఁ బట్టి
పడనేయ నీ కేమి - పని? కలనైనఁ
జెడఁజూడ వెన్నడు - క్షితి నెల్లవారిఁ1640
దను జంపునది రాజ - ధర్మంబె నీకు?
వినికని యెఱుఁగుదు - వే యిట్టివారి?
ఇల వెండిబంగార - మివి మొదలైన
కలుము లాశించి యొ - క్కరునిఁ ద్రుంపుదురు
రాజు లీయాస శ్రీ - రామ! నీమదిని
యోజింప లేదు ప్ర - యోజనం బేమి?
విలు కేలఁ బట్టి యీ - వేషమైనపుడె
కలుగునే ధర్మార్థ - గరిమముల్ మీకు
కామాతురుండవై - కర్మవాసనల
చే మతి చరియించి - చేసితి కీడు 1650
నిరపరాధుని నన్ను - నీవట్టు లేసి
ధరణీశ! సభల ను - త్తర మియ్యగలవె ?
క్రూరాత్మకుఁడు నాస్తి - కుఁడు పతితుండు

చోరుఁడు శరుఁడు నీ - చుఁడు మద్యపాయి
రమణుల నావుల - రాజుల ద్విజుల
సమయించువాఁడు పా - షండవర్తనుఁడు
గురుతల్పగమనుఁడు - కొండీఁడు ద్రోహి
పరివేత్తయన్యాయ - పరుఁడు హింసకుఁడు
నిరయగాములు గాన - నీ కేఁటి కయ్య!
కొఱమాలి యీకోఁతి - కొలఁగట్టుకొనఁగ? 1660
ఈమాంస మీచర్మ - మీదంత శల్య
రోమాదికంబులు - రోతురుగాని
రోయరెవ్వరు వాన - రుల ధార్మికుండ
వీయపకీర్తి నీ - వేల పొందితివి?
పంచనఖంబులఁ - బరగిన జంతు
సంచయంబుల నైదు - చనుగాని మీకు
కడమవాటిని దినం - గాదేమి దలఁచి
పడవేసితివి నీకు - భక్ష్యంబె యేను?
అంటుదురే కేల - నైన వానరుల
యొంటిమాంసంబు? ని - న్నొకనిఁ జూచితిమి!1670
రామచంద్ర! వివేకు - రాలు మా తార
వేమారు నాకు నీ - వృత్తంబుఁ దెలిపె
నది వినియుండియు - నహమిక చేత
విధి పెడరేఁపఁగ - వెడలి వచ్చితిని
నను నేయఁబనియేమి? - నా నేర్పు నేర
మునకు నెవ్వాఁడ వ - మ్మునఁ బడనేయ?
నీవు రాజవుగావు - నీ వెంటఁ బరమ
పావని యాసీత - పతివైన కతన

మది నమ్మి నిను నధ - ర్మపరుఁడ వనుచు
హృదయంబులోనఁ దా - నెఱుఁగక వచ్చి 1680
యీపాటు బడిపోయె - హీనకర్ముఁడవు
పాపివి యన్యాయ - పరుఁడ వల్పుఁడవు
ద్రోహివి శరుఁడవు - దుర్బుద్ధి వధమ
సాహసాత్ముఁడవు వం - చకుఁ డవజ్ఞుఁడవు!
అక్కట! దశరథు - నంత రాజునకు
యెక్కటి సుతుఁడ వై - యీవు గల్గితివి?
పెక్కేల ధర్మంబు - పేరిటి యొరిజ
చక్కని నీత్యంకు - శంబును లేని
నీవను మదదంతి - నిర్ణిమిత్తముగ
నీ వాలి యను తరు - విలఁగూల్చె నేఁడు!1690
ఇంతటి సాహస - మేఁజేయు శౌర్య
వంతుఁడనని సభ - వారెల్ల వినఁగ
నేమని యనుకొందు - వే నీకుఁ గీడు
గామింప నొకనాఁడు - గాడు జేసితివి!
నిలిచి నాముందఱ - నే బంటననుచు
నలుకతోఁ గనుపించ - వైతివిగాక
వింటితో నంతకు - వీటికిఁ బనిచి
మంటితోఁ గలపనే - మాటమాత్రమున!
వరుసయే నిద్రించు - వానిఁ గాలాహి
గఱచిన గతి నెఱుఁ - గక యుండు వాని1700
చెట్టు చాటుననుండి - చిటుకనకుండ
మెట్టగోలను పుడ - మిని ద్రెళ్లనేయ
వీఁడేమి భ్రాంతిని - వెలఁదిఁ జేకూర్చు

వాఁడని వాని బ - వంతముల్ నమ్మి
యెందుకుఁ గొఱగాని - యినకుమారకుని
బొందుచేసుక తన్ను - బొడవడంచితివి!
బుద్ధి చాలక మోస - పోతివి గాక
వద్దికి వచ్చి మీ - వార్త నాతోడ
నొకమాటు వినిపింప - నురక రావణుని
సికవట్టి తెచ్చి మీ - శ్రీపాదమునకు1710
నొప్పగింపుదు సీత - నొక నిమేషమున
నిప్పుడే చేకాన్క - నేను సేయుదును!
జలధిలోనున్న ర - సాతలంబునను
జలపట్టి డాఁచిన - జానకీదేవి
నీకిత్తు నాగమ - నికరంబు ఖలులు
దాఁకొని మునుపశ్వ - తరిగానమర్చి
కడలినుండగ శౌరి - కడవఁడై తాను
జడధిలో డాఁగు రా - క్షసుల మర్దించి
చేకొన్న గతి నీతి - సీతతోఁ గూడి
శ్రీకర రాజ్యల - క్ష్మి నెసంగఁ జేతు!1720
తను బడవైచి యీ - తపననందనుని
తనరాజ్య మేలింపఁ ద - లఁచితిగాక
దీన నీకేమి సి - ద్ధించు? నీబుద్ధి
జానకి వెంటనే - చనియె గానోపు!
రామ నీకీ యధ - ర్మము ప్రాప్తమయ్యె
నేమి సేయఁదలంచి - యేమి చేసితివి?"
అని నోటఁదడి లేక - యాస్యంబువాడ
తను జూచి పల్కియం - తట శక్తి లేక

శరమెల్ల నుడివోవు - జలదంబు రీతిఁ
గరిబొగ్గువడిన శి - ఖావంతు కరణిఁ1730
దేజంబు మాసిన - దినరాజు మాడ్కి
నాజిలోఁ బడిన మ - హాసత్త్వశాలి
వాలి యాడిన యట్టి - వచనముల్ ధర్మ
మూలముల్ నిష్టురం - బులునైన కతన
చెవిసోఁక విని రఘు - శ్రేష్ఠుండు చాల
వివరంబుగా వాలి - వినఁగ నిట్లనియె.
"కపివీర! ధర్మార్థ - కామలౌకికము
లిపుడింతయు నెఱుంగ - కేల పల్కెదవు?
ఇందుకౌఁ గాదని - యెడువారు లేని
యందుచేఁ దోచిన - యట్లు వల్కుదురె?1740
పనపర్వతద్వీప - పతియైన జగతి
నినవంశమణులైన - యిక్ష్వాకుకులులు
పాలింపఁ దమరు పా - ల్పడి మృగపక్షి
జాలంబులను మహీ - జనుల రక్షింపఁ
బొలియింపఁ గర్త లె - ప్పుడుగాన భరతుఁ
డలఘుపుణ్యుఁడు ధార్మి - కాగ్రణి సకల
లోకరక్షకుండు సు - శ్లోకుఁ డుత్తముఁడు
చేకొని రక్షింప - శిక్షింపఁ గర్త
గాన యాయన యను - గ్రహముచేఁ బంపు
పూని వచ్చితి మట్టి - పుణ్యశీలుండు1750
నెలమి నా ధర్మాత్ముఁ - డేలుచున్నట్టి
యిలమీఁద నెవ్వారి - కేమన వచ్చు?
కామాంధుఁడును నీతి - గతిలేనివాఁడు

నీమహి నీవె కా - కెవ్వఁ డున్నాఁడు?
తగునె జ్యేష్ఠభ్రాత - తండ్రితోసాటి
యగు విద్యనేర్పిన - యతఁ డట్టివాఁడు
తనయుఁడు శిష్యుఁడు - తమ్ముఁడు నొకటి
యని యెంతు రాగమాంతార్థకోవిదులు
ధర్మమర్మ మెఱుంగఁ - దరముగా దాత్మ
నిర్మలు లన్నిఁట - నిండుక యుండి 1760
చూచుచుందురు శుభా - శుభకర్మరతులు!
ఏచోట దగుఫలం - బిచ్చువారలకు
కపుల సంగతి నేమి - గని యెఱుఁగుదువు?
అంధుఁ డంధుని గూడి - నట్ల మీజాతి
బాంధవుల్ నీకన్న - బ్రాజ్ఞు లన్నిటను
తెలివిడి సేతు నీ - తెఱఁగు మాతెఱఁగు
కల విఱుచుక విని - కడతేరు మీవు
కానక నిందింపఁ - గాదు మమ్ములను
నీనేర మెఱుఁగగ - నేరవు నీవు 1770
తమ్ముని సతి రుమా - తరుణితో నెట్లు
సమ్మతంబునఁ గ్రీడ - సల్పెద వీవు?
పాపాత్ముఁడ వధర్మ - పరుఁడవు గాన
తూపుఁ గైకొని నిన్ను - ద్రుంగ నేసితిని
యెవ్వరు నడవని - యీకాని నడక
క్రొవ్వుచే నడచు నీ - కును హాని రాదె?
చెలియలిఁ దమ్ముని - చెలియఁ గూతురిని
వలచి పట్టినవాని - వధియింపఁదగవు

భరతుని యాజ్ఞఁ ద - ప్పగఁరాదు మాకు
దొర సెప్పినటుసేయ - రోసంబురాదు. 1780
ఇలయు నిల్లాలి నీ - కిప్పింతు ననుచుఁ
జెలిమివేళఁ బ్రతిజ్ఞఁ - జేసినవాఁడ
నీరవిసుతునితో - నేనాడితప్ప
నేరఁగానవు నిన్ను - నిగ్రహించితిని!
చెలికానికైన యొ - చ్చెము మాన్పలేని
చులకనివాఁడు యశో - నిధి యగునె?
నమ్మినవాని మా - నంబుఁ గాచుటయె
సమ్మతంబును ధర్మ - సరణియు నగుట
గట్టిగా నిది యెఱుఁ - గని సేఁత గాదు
పట్టి నిన్ను వధింపఁ - పరమధర్మంబె 1790
రాజదండనము కా - రణముగా ధర్మ
రాజదండనము నే - రదు నీకుఁ గలుగ
నమరలోకసుఖంబు - లందెదు వింక
సమబుద్ధిఁ గ్రోధంబుఁ - జాలింపు మీవు
జగతి నాజ్ఞార్హుని - సమయింపకున్నఁ
దగులు రాజునకు పా - తకము వెంబడినె
కావున మారాడ - గా రాదు నీకు
జీవనాపేక్ష దూ - షింపకు మమ్ము.
మావంశకర్తయౌ - మాంధాతచేత
నీవిధంబుగ ధర్మ - మీడితం బయ్యె 1800
మత్తులు పాపక - ర్మంబులు సేయ
నుత్తములగు రాజు - లోర్తురే చూచి?
అన్యోన్యతారకం - బగుట నాచైది

 
యన్యాయమని నీకు - ననరాదు వాలి!
కలుషపంకములెల్లఁ - గడిగి స్వర్గాది
విలసన శోభనా - న్వితునిఁ జేసితిని!
ఇంక నీకొకమాట - హృదయకళంక
సాంకర్యములు దీరు - సమ్మతి వినుము
రాజులు లతికావ - రణములు దాల్చి
యోజించి దీమంబు - లుద్ధిగా నునిచి 1810
మిఱ్ఱుపల్లములైన - మేదినులందు
కఱ్ఱలనురులును - గండెలివైచి
వలలొడ్డి పోఁగులు - వారి చాటులను
నిలిచి పంచనల వ - నీమృగంబులను
పరమధార్మికులయ్యు - భయముచేఁ బఱవఁ
గరుణ యింతయు లేక - కదిసి చంపుదురు
మీరును వనచర - మృగములు గాన
చేరువఁ బొంచి యే - సితి వినోదమున
తెలియక నన్ను నిం - దించిన నేమి?
ఫలము నీకిట మీఁదఁ - బరికించుకొనుము1820
దేవతల్ రాజుల - తీరున బుట్టి
భావించి పుణ్యపా - పము లేర్పరించి
రక్షింపఁ దగు వారి - రక్షింతు రెఱిఁగి
శిక్షించు వారల - శిక్ష సేయుదురు
కననేరనైతి వా - గ్రహముచే ధర్మ
మనరాని దుర్భాష - లాడ నేమిటికి?
చాలింపు" మనిన నం - జలి చేసి వడఁకి
వాలి యీరఘుకుల - వరునట్లనియె.

స్వామి! మీయానతి - సత్యంబు ఖలుఁడ
తామసాత్ముఁడ నీచ - తరుఁడ నీయెదుర1830
నెదిరించి మాటాడ - నెంతటివాఁడ?
సదయాత్మ! యిది నాదు - జాతి చేష్టితము
ఎఱుఁగని వానరుం - డేమన్న నేమి?
మఱచి యానేరముల్ - మది నోర్చుకొనుఁడు
నేరంబులకునైన - నిష్కృతిఁ జేసి
శ్రీరామ! నన్నుర - క్షించితిరిట్లు!
సర్వభూతహిత ప్ర - చారుండ వఖల
నిర్వాహకుఁడవు మా - నితపుణ్యనిధివి
పరమధార్మికుండవు - పాపమానసునిఁ
గరుణతో శిక్షించి - గడతేర్చినావు1840
నిగ్రహంబిదిగాదు - నీయనుగ్రహము
సుగ్రీవుమీఁది యీ - సున ముక్తి గలిగె
నున్నబల్కు లను వీ - నులఁ జల్ల చేసి
నన్ను రక్షింపు మ - నాథశరణ్య!"
అని రొంపిలోఁ బడు - హస్తి చందమునఁ
దనమోము కన్నీటఁ - దడిసి సొంపరగఁ
గాయంబువెంట ర - క్తప్రవాహంబు
కాయంబు నిండ గ - ద్గదనిస్వనమున
శ్రీరామచంద్ర! కూ - రిమి చుట్టములకు
తారాదిసతులకుఁ - దన దేహమునకు1850
మదిలోనఁ జింతించి - మరుగ నాప్రాణ
సదృశుఁడౌ రత్నకాం - చన శుభాంగదుని
యంగదునిఁ దలఁచి - యడలెద బాలుఁ

డంగద కోర్వకే - మనువాఁడొ వాఁడు!
ఆతపంబున నింకు - నల తటాకంబు
రీతిఁ గృశించి జీ - ర్ణించు నానాఁట
ననుబాసి నిమిషమై - న సహింపఁ జాలఁ
డనయంబు నారొమ్ము - నందె నిద్రించు
నేనిడకాహార - మెవ్వరిచేత
నైన నొల్లఁడు తల్లి - యండకుఁ బోడు1860
పసిబిడ్డ మనసు ని - ల్పఁగ లేఁడు మాట
రసికుండుగాఁడు తా - రాకుమారకుఁడు
ఆయొంటి కొడుకుల - కై కలంగుదును
నాయాత్మ నీచర - ణంబులేకాని
వాని కాధార మె - వ్వరులేరు సకల
దీనబాంధవ! కడ - తేర్పు మెట్లైన
నమ్మితిఁ బుత్రదా - నంబు సేయుటకు
నమ్మింపు నీకేలు - నామౌళినుంచి
రక్షింపు నేర్పు నే - రములు సహించి
పక్షీకరింపు మీ - భానుజునట్ల!1870
ఇరువురు సరి మీకు - నీ లక్ష్మణుండు
భరతసుగ్రీవులు - భావింప మీకు
రామ! యేకైవడి - రక్షింపఁ ద్రోయ
రామియో యటుల తా - రాకుమారుఁడును!
చెఱువు పట్టున నొక్క - చెలమైన నిలుపఁ
బఱగుట దీరని - పని యిది మీకు
హతుఁడైన పగవాని - యాత్మజుఁడగుట
హితశత్రుఁ డితఁడని - యెవ్వారలైన

-: వాలి తనకర్తవ్యము రామునకుఁ దెలిపి పరలోకమునకేఁగు స్థితిలో నుండుట:-

బట్టించియిది విన్న - పము సేయఁ జెవిని
బెట్టక ప్రోవుఁడీ - బిడ్డని మీరు 1880
తనమీఁదఁ బగచేతఁ - దారపైఁజాలఁ
గినిసి సుగ్రీవుఁ డం - కిలి సేయకుండ
నాయనాథను గావు - మనఘ! మీకరుణ
నీయవనీచక్ర - మెల్లఁ బాలించి
తరువాత స్వర్గంబుఁ - దాఁజేరఁ గలఁడు
తరణితనూజుఁడెం - త కృతార్థుఁడయ్యె!"
అనిపల్కు వాలి మ - హాశౌర్యశాలిఁ
గనుఁగొని రఘుకులా - గ్రణి యిట్టులనియె
"చేమించి యిటునడ - చిన కార్యమునకు
నేమిదలంచిన - నిఁక నేమి గలదు?1890
ఇందుచే నీపాప - మెల్లను దీఱె
నందవు నినుద్రుంప - నఘములునాకు
శోకమోహంబుల - సుడిఁ జిక్కువడక
యేకడఁ దత్త్వమూ - హింపు సత్యముగ
దివమున కేఁగుము - ధృతివూని తార
నవమతి యొనరింపఁ - డర్కనందనుఁడు
నాయంబు నీభాను - నందను నందు
నీయందుఁ గలభక్తి - నిలుపు నంగదుఁడు
అతనికేమి కొఱంత - యాత్మజుఁ దలఁచి
యతినీచ మగుదుఃఖ - మంద నేమిటికి?1900

అని యుచితంబుగా - నాడిన రాముఁ
గనుగొని యావాలి - క్రమ్మఱంబలికె
"జానకీరమణ! ని - శాతసాయకము
చేనేసితివి రొమ్ము - చినిఁగి కూలంగ
నానొవ్వి యదియంత - యనరాని మాట
లేనిన్ను బలికి నా - హృదయంబులోన
మిగులఁ దపించెద - మీరవి మఱచి
పగమాని నన్ను జే - పట్టుఁడుల్లమున
నాపట్టి బాలుఁడై - నను రవితనయు
ప్రాపున మేనుడాఁ - పడ సంగరముల1910
మీ పనిపాటల - మెలగఁగ నేర్చు
నోపు నెంతటికైన - నోడఁడెవ్వరికి
వానికేమి గొఱంత - వాఁడు నీవాఁడు
జానకీరమణ! వి - చారమేమిటికి
ఏ నెవ్వఁడను విశ్వ - మెల్ల రక్షింపఁ
బూనిన మీతోడఁ - బొసఁగఁ బల్కుటకు?"
అని శరవేదన - నరగన్ను వెట్టి
తనువు మ్రాన్పడనచే - తనుఁడయి వాలి
యిలమీఁద వ్రాలిన - యెడఁదార తనదు

-: రామబాణ హతుఁడైనవాలి యవస్థఁగని తారవిలపించుట :-

నిలయంబులో వాలి - నిర్యాణవార్త 1920
విని మూర్ఛనొంది యా - వెంబడిఁ దెలిసి
తనవెంట వృద్ధ బాం - ధవకోటి రాఁగ
నంగదుఁ దోకొని - యావాలి పడిన

సంగరస్థలికి రా - సకలవానరులు
భీతిచేఁ బఱచిన - బెదరక తార
“హేతు వెయ్యదిపాఱ - నేమి భయంబు?
వసుధ యేలఁదలంచి - వాలినింజంపె
బిసరుహప్తసుతుండు - బెగడ నేమిటికి?
నిలుఁడన్న వారలా - నెలఁతను జూచి
కలఁగుచు “నోయమ్మ! కనుమల్లవాఁడె1930
శరము కీలనమర్చి - శమనునిరీతి
దురుసైన బలువిల్లు - దొనలును బూని
నికట భాగమునందు - నిలిచిన వీరుఁ
డొక్కఁడెవ్వడొ చూచి - యోడిపాఱెదము!
ఇటువంటి దొరఁజూచి - యేమేల నిలుతు
మటుపోవ నేల నీ - యాత్మజుఁగూడి
మఱలుము నేఁడె కు - మారునిం దెచ్చి
పురికిఁ బట్టము గట్టి - పోషింపుమమ్ము
వజ్రనిభంబైన - వాలమ్ము చేత
వజ్రసూనుఁడు రణా - వనిఁగూలినాడు1940
మనమేఁగ జెల్లదు - మాయమ్మ మఱలి
చనుదెమ్ము కాదన్న - చనుమెందునైన
బ్రదుకుపై యాస దె - ప్పరముగ మేము
గదియవత్తుమె వాలిఁ - గన్నులఁజూచి?”
అనవిని యావాన - రావళిఁగాంచి
తనమదిఁ చింతిల్లు - తార యిట్లనియె
"అవివేకులార! మ - హాశౌర్యశాలి
ప్రవిమలాత్మకుఁడు నా - ప్రాణనాయకుఁడు

వాలియిట్లుండ నీ - వసుమతి యేల?
ఏలయంగదుఁడు? నా - కేమియు నేల?1950
వచ్చినరండు రా - వలదేని పొండు
విచ్చలవిడి" నని - వెలఁది తావచ్చి
పిడుగుగొట్టినయట్టి - పెనుగొండమారు
పడు గాత్రమున నుర్విఁ - బడియున్న వాని
నసురనాయకుల బా - హాశక్తి చేతఁ
గసిమసఁగు ప్రతాప - ఘనలీలవాని
కొండలు పొడిచేసి - కుంభినిఁ గూల్చు
చండిభుజాసత్త్వ - సంపదవాని
తనతండ్రి మెచ్చని - ధైర్యశౌర్యములు
గనువాని సజలమే - ఘధ్వని వాని1960
మృత్యుపాశములు నె - మ్మెయిఁ గట్టువడుట
యత్యంత మూర్ఛితుం - డైనట్టివానిఁ
బతిఁజూచి జానకీ - పతిఁజూచి మఱఁది
నతని చెంగటి సుమి - త్రాత్మజుఁ జూచి
వారల మీఱి యా - వాలి చెంగటికి
జేరి పైవ్రాలిమూ - ర్ఛిల్లి యాతార
తానంతఁ దెలిసి సం - తాపంబు నొంది
“హా! నాథ! హా! యంగ - దా యంచు" వగచి
యన్నువ పులుఁగు చా - యను విలపింపఁ
గన్నుల నశ్రువుల్ - గ్రమ్మ నంగదుఁడు1970
పలవింప వారల - భావించి తాను
కరఁగుచు నన్న చెం - గటఁ జేరవచ్చి
సుగ్రీవుఁడును జాల - శోకింప రాఘ

వాగ్రణి శరముచే - నాహవభూమి
తొడిఁబడ మూలంబు - తోఁ బెల్లగిల్లి
పడిన వృక్షమనంగఁ - బరవశుఁడైన
వీరుని వానర - విభువాలిఁగూర్చి
తారాది పావన - తార యిట్లనియె
"హరిరాజ" నీ వేల - యరగన్ను మొగిచి
ధరణిపై మెదలి సం - తాపమొందెదవు?1980
పరపుల మీఁదటఁ - బవళింపకేల
పరపైన రానేలఁ - బవళించనీకు?
కనువిచ్చి చల్లఁగాఁ - గనుఁగొనవేల?
ననుఁజూచి యేలయా - ననము వాంచితివి?
ఆకట! కిష్కింధా మ - హా పట్టణంబు
నకుజోడుగా నొక్క - నగరంబునీకు
సంతరించితి రేమె - స్వర్గవీథికల?
ఇంతటి వానికే - యిటువంటిపాటు?
నందనవనము మి - న్నక పాడుచేసి
నందనోద్యానంబు - నకుఁ బోవనగునె?1990
ననుబాసి దివిజకాం - తలఁగూడఁ దలంచి
తను గొంచపఱతురె - తరుణులలోన?
ఎటువలె నోర్తుని - న్నడవాసి నేను!
కటకటా! క్రోధంబె - కడతేర్చెనిటుల!
ఇలయేల? నీ వెంట - యేవత్తు దివికి
నిలుతునె యెడవాసి - నిమిషమేనియును!
దేవతాసతులు నీ - తీరుఁ జూచినను
భావజునకు నేల - బందాలు గారు?

తప్పక విధివిహి - తంబైన బుద్ధి
నిప్పుడు సుగ్రీవు - నెదిరించితీవు!2000
తనకేలమాను వై - ధవ్యాదులైన
యనుపమ దుఃఖము - లవి చుట్టుకొనక?
ఆక్కట! సుకుమారుఁ - డైన యంగదుఁడు
దిక్కెవ్వరును లేక - దీనతనొంది
కితవుఁడైనట్టి సు - గ్రీవునిఁ గొలిచి
బ్రతిమాలి యేరీతి - బ్రదుకు వాఁడింక
వానికెయ్యది బుద్ధి? - వచ్చియున్నాడు
సూనునిఁ గనువిచ్చి - చూచిమాటాడి
యిదిబుద్ధియనుచు వా - యెత్తవు! నీదు
పదపద్మముల మీఁదఁ - బడియున్న వాఁడు2010
హా! హరిహయపుత్ర! - హా! వాలి!"యనుచు
నాహిరిఁ బాడిన - యనువుగా నేడ్చి
'అంగద' రమ్మని - యంగదతోడ
యంగంబు వట్టి యొ - య్యన లేవనెత్త
“ఏతండ్రి పోషించు - నిఁకనిన్నుఁ దండ్రి?
మీతండ్రి వోవన - మ్మినవారిఁ జెఱచి
భానునందనునితోఁ - బ్రతినఁ జెల్లించి
జానకీజాని నీ - జనకునిఁ జంపె
ఏమయ్య! సుగ్రీవ! - యీ వాలిఁ జంపి
నీమచ్చరంబెల్ల - నేఁడు దీర్చితివి!2020
ఆపదల్ గడతేరె - నా రుమంగూడి
యీపురంబేలు మీ - వేక చిత్తమున!
చింతించిచెయిగానిఁ - జేతఁబట్టితివి

పంతంబుతోఁ బగ - పాతరం బడియె"
అనియంగదకుమారు - నావాలి చెంత
నునిచి యాతార వి - యోగ దుఃఖమున
శోకింప నావాలి - సుదతులందఱును
గాకలీరవముతోఁ - గన్నీరు చింద
హా! యంగదకుమార! హా! ప్రాణనాథ
హా! యీశ! హా వాలి! - యనిపలవించి 2030
"అయ్య! కుమారు నూ - రార్పవదేల?
తొయ్యలి యీ తార - తోఁ బల్కవేల?
ఏమేమి నేరంబు - లేము జేసితిమి
మామీఁదఁ గరుణించి - మాటాడవేల?
ఎవ్వరు వాలింతు - రీకపిరాజ్య
మెవ్వరుదిక్కుమా - కేమి సేయుదుము?"
అవి వాలిపై వ్రాలి - యందఱు నేడ్వఁ

-: హనుమంతుఁడు తారనూరార్చుట - ముందుచేయఁగల కార్యమును తెలుపుట :-

గని వాయుతనయుఁడు - గ్రక్కున వచ్చి
తారపాదముల మీఁ - దనువ్రాలి కంట
నీరుంచి తారక - న్నీరు వో దుడిచి2040
"ఓయమ్మ! నీవింత - యుమ్మలికింప
నాయమే వాలికై - నకొఱంత యేమి?
ఇలయెల్ల నేలె న - నేక దానవులఁ
బొలియించె భుజబలం - బునఁగీర్తి గాంచె
రాముబాణంబుచే - రణములోఁ బడియెఁ

గామింపఁ దగిన స్వ - ర్గముఁ జూఱవట్టె
నంగదు అంతటి - యాత్మజుండుండ
నంగనామణి! యేటి - కమ్మ యీచింత?
విజ్ఞాన రాశివి - విమలమానసవు
ప్రాజ్ఞురాలవు భూత - భావికార్యములు2050
తెలియనేర్తువు నీకుఁ - దెలివిడి కాని
నిలనేమియున్నవి? - యీవాలి కొఱకు
సేయంగఁదగు క్రియల్ - చేసి యంగదునిఁ
బాయక కిష్కింధఁ - బట్టంబుఁ గట్టి
యిల యేలుచుండ నీ - వీక్షించి కీశ
కులమెల్ల రక్షించి - కొడుకును నీవు
మమువంటి మంత్రుల - మాన్యుల నెఱిఁగి
సనుబుద్ధిఁబోషించి - చలముఁ జాలించి
మఱిఁదినిఁ దగినట్టి - మర్యాదనుంచి
గుఱిచేసి యీ నమ్మి - కొలిచిన వారి2060
జెదరనీయక వాలి - చేసిన మేర
లదనుతో నడిపింప - నగు గాక నీవు
చింతించి 'గతజల - సేతు బంధనము'
కాంతునిఁ దెచ్చెదే - - కడచన్నవాని?
భామిని! బుద్బుద - ప్రాయముల్ మేను
లేమి యెవ్వరికైన - నివియార్జితములె?
పుట్టినయప్పుడె - పొలియుట నిజము
గట్టిగా దేహికిఁ - గనమె లోకులను
క్షణభంగురంబైన - సంసారమునకు
నణుమధ్య! యెఱుఁగక - యాత్మనమ్ముదురు 2070

వాలి యహంకార - వశతచేఁ గూలె
నేల యీమమకార - మిప్పుడు నీకు?
సేయు కార్యంబులు - చింతింపవమ్మ!
జాయలే యిహపర - సౌఖ్యదాయినులు
ఎట్టివారికిఁగాన - యిన్నియు నెఱిఁగి
యిట్టికైవడి నేడ్వ - నిఁక నేమి గలదు?
చాలింపు" మనిన యం - జనకుమారకుని
వాలి యిల్లాలు పా - వనశీల వలికె.

హనుమంతునకు తార ప్రత్యుత్తర మిచ్చుట

"అన్న! వాయుకుమార! - యంగదుఁ బోలి
కన్నట్టి కొడుకు లే - కడ నెందఱైనఁ2080
గలిగిన వారలు - గపి రాజ్యమేల
గలరె? సింహబలంబు - గాకరక్షింప
నక్కలచేనౌనె? - నాచేత నగునె?
ఒక్కని దొరఁ జేరి - యునుపరాజ్యమున
వీనికిఁ బినతండ్రి - విభుఁడు సుగ్రీవుఁ
డేనెవ్వతెను? నాకు - నేమి గార్యంబు?
తల్లియుఁ దండ్రియుఁ - దైవంబు గురువు
నెల్లను రవిసూనుఁ - డీకుమారునకు
వీరశయ్యా సమ - న్వితుఁడైన వాలి
యిరణంబున బడి - యెటకు నేఁ గెడినొ?2090
అచ్చోటికే వెంట - నరుగుదు నీవు
సచ్చరిత్రుఁడ విట్లు - జనునె భాషింప?
వాలియే తనకు దై - వము యేల వట్టి

జోలి మాటలు రాజ - సూనులు వినంగ?"
అనునంతఁ దనకన్ను - లల్లనవిచ్చి
తనయుని హనుమంతుఁ - దారను జూచి
యాచెంతఁ గన్నుల - నశ్రులు రాల
జూచు భానుతనూజుఁ - జూచి చింతించి
శతమఘతనయుఁడు - సాంత్వన వినయ
హితగారవములఁ దా - నిట్లని పలికె.2100

-:మరణోన్ముఖుఁడైనవాలి, తనకుమారుడైన యంగదుని తన భార్య తారను, సుగ్రీవున కప్పగించి మృతిఁ జెందుట
"ఓయి! సుగ్రీవ!నా - యొచ్చంబులెల్ల
నీయాత్మ మఱవక - నిలుపంగ రాదు
ఇరువురకును సౌఖ్య - మేడది యొక్క
ధరణియాశించు పా - తకమానసులకు?
తగినట్టివాఁడవు - ధరణికిఁ దానుఁ
దెగినట్టి తరువాతఁ - దెల్లమెల్లరకు
నిట్టి యవస్థచే - యేనుండి పలికి
నట్టి మాటలు విను - నది నీకుఁదగవు
ఇలమీఁద వ్రాలి ది -క్కె వ్వరు లేక
కలఁగుచు నుడివోని - కన్నీటఁ బొరలి2110
యున్న యంగదుఁ జూడు - మొక్కఁడె తనకుఁ
గన్నట్టికొడుకు చ - క్కనివాఁడు నీవు
నుపలాలనము సే - యు యోగ్యుఁడు వీత
గపట మానసుఁడెఱుఁ - గఁడు వివేకంబు
నాకుమారుఁడు గాఁడు - నమ్మితి వాఁడు

నీకుఁ బుట్టినవాఁడు - నెగులొందనీకు
నిన్నాళ్లు లాలించి - నేనీకుమారు
నెన్ని గౌరవముల - నేది పెంచితిని
యాతీరు దప్పక - యరయుము ప్రాణ
దాతవు నేతవు - త్రాతవు నీవు2120
ఋణమున బోఁడు ధా - ర్మికుఁడు చేచూపి
రణములఁ జూడు తా - రాకుమారకుని
నీవంతవాఁడయి - నీవిరోధులను
మాయించుఁ దోడాస - మసలఁడెచ్చోట
నాశక్తి యెంత యం - తటి సత్త్వశాలి
యాాశిశువు వెపుడు వ - జ్రాంగి నీకతఁడు
అల సుషేణుతనూజ - యైన యీ తార
యలము వివేక కా - ర్యసమర్థురాలు
యేరీతిఁ బలికె నీ - విట్టట్టులనక
యారీతి నడచి మే - లందుమేయెడల2130
శ్రీరాముతో నేమి - చేసెదనంటి
వారామచంద్రుఁడే - మనియె నీతోడ?
అటుల కావింపు మీ - వది తప్పితేని
యటమీఁద నిహపర - హానిఁ జెందుదువు
ఈ యింద్రదత్తమౌ - హేమదామకము
మాయన్న! తాల్చి నా - మాఱుగామనుము!
అసువులు బాయక - యటమున్న నీకు
నొసగెదఁ దగువాత - యోగ్యంబు గాదు
నీవు ధరింప దీ - నికి నియ్యకొమ్ము”
నావుడు శోక దై - న్యముల నీఁదుచును2140

రాహువు చేఁ జిక్కు - రాజునుఁ బోలి
యా హరిదశ్వుని - యాత్మనందనుఁడు
కలఁక నొందకఁ బిల్చి - కాంచనమాలఁ
దలవంచికొని చేరఁ -దా మెడవైచి
సుగ్రీవు నెమ్మోము - చూచి హర్షించి
యగ్రభాగమునందు - నంగదుఁ గాంచి
“రమ్ము కుమార! యూ - రడు మేల వగవ?
ఇమ్మీఁద సుగ్రీవుఁ - డేదిక్కు నీకు
నన్ను జూచినయట్ల - నాసహోదరుని
వెన్నాసయై నిల్చి - వీక్షింపు మెపుడు2150
వేరు సేయక కాల - విధము దేశంబు
నారసి సుగ్రీవు - నాజ్ఞప్తి వినుము.
అనిచిన పనులందు - నాకలిఁదప్పి
యును దేహసౌఖ్యంబు - నూహింపఁ బోక
మదిలోన నిన్నాళ్లు - మందెమేలంబు
వదలి సేవక వృత్తి - వర్తింపు మీవు
భానుతనూజుని - పగవారి నతని
కాని వారిని వారి - కడవారిఁజేరి
మాటాడఁ బోకుము - మధ్యమరీతిఁ
బాటించి చొరవలఁ - బైకొనఁ బోక2160
కడలనుండక యొక్క - క్రమమునఁ గాచి
నడువుము నీవని" - నందను కేలు
తమ్ముని కరములో - దానుంచి రాము
సమ్ముఖంబున ఘోర - శర మహావ్యధను

దయితలందఱు మూగి - తనమీఁద వ్రాల
నయశాలి వాలి ప్రా - ణంబులు విడిచె.

-: వానరులు తారాసహితముగ వాలిమృతికై శోకించుట :-

అపుడు వానరులు మ - హారోదనంబుఁ
గృపణభావమునఁ గి - ష్కింధ చలింపఁ
గావింప గిరివని - కందరావళుల
భావింప మున్నంటి - ప్రభమాసియుండ 2170
హితబాంధవులు చేరి - "యెవ్వఁడీ వనము
లతిశయంబగు - నాజ్ఞ నరయ శక్తుండు?
ఈవాలియే కాక - యిఁక నేఁటి బ్రదుకు?
పోవుద మెందైన - పుడమిపై వలస
గోలభుఁడును యక్ష - కుంజరుతోడ
నాలంబుఁ బదియు నే - నబ్దముల్ చేసి
పదియునాఱవయేఁట - బట్టివధించె
నిదుర యాహారంబు - నిరసించి వాలి!
ఇంతటివాఁడింక - నెవ్వఁడు పాప
మెంత చేసితిమొ నేఁ - డితని బాసితిమి?" 2180
అనిపల్క దారాదు - లందఱు తమదు
పెనిమిటిపై వ్రాలి - బిట్టుశోకింప
లతలతోఁ గూడి మూ - లంబుతోఁ బెకలి
క్షితి వ్రాలి భూజంబు - చెలువున నున్న
వాలి మొగంబుపై - వ్రాలి యా తార
యాలింగనము చేసి - యడలుచుఁ బలికె.

“ ఏను జెప్పిన బుద్ధు - లేఁటికి వినక
యీ నేలఁ? బ్రాణంబు - లీనేల కీవు
విషమభూమిని రాము - విషసాయకమ్ము
విషసర్పమునుఁ బోలి - వెదకి వధించె!2190
నాయన! యీభూమి - నాకన్న నీకు
ద్రోయరానిదియె హ - త్తుక కౌఁగిలింప?
తరణినందను పాల - దైవంబు గలిగి
పరిణామ మొందించెఁ - బగయణఁగించి
నమ్మిన రిక్షవా - నర సమూహంబు
కమ్ముక వేళలు - గాచి కొల్వునకు
నిదె వచ్చియున్నవా - రీ యంగదుండు
పదముల చెంగటఁ - బడియున్నవాఁడు
వారికిఁ గొలువిచ్చి - వాని లాలించి
కూరిమి నెత్తి య - క్కునఁ జేర్చుకొమ్ము2200
అలిగియున్నావె! మా - టాడవదేల!
అలిగిన నీకు నిం - ద్రాదు లడ్డంబె?
నీచేతఁ దెగినట్టి - నీచులు వడిన
యీచాయఁ బడియుందు - రే నీవునట్ల?
జగడంబులన్న ని- చ్చలు నుబ్బునీవు
తగునె నన్నిటు లనా - థను జేసి వదల
శూరులకును బడు - చుల నియ్యరామి
కారయ నేనే యు -దాహరణంబు
తన తల్లిదండ్రులు - దానును శోక
వనధిలోఁ బడితి మె - వ్వరు దిక్కు మాకు !2210

ఎందుకు చుట్టంబు? - లెందుకు తనయు?
లెందుకు సంపద? - లేందుకు దేహ?
మెందుకు ప్రాణంబు? - లెందుకుమోటు
చందమై పతిలేని - సతినిల్చెనేని?
నెత్తురు కండలు - నీకు కెంజాయ
మెత్తని పరుపులే? - మేదినిఁబడగ
జగతిపై ధూళి వా - సన గందవొడియె
నిగనిగమను మేను - నిండఁ దాల్చుటకు?
మొరపరానేలపై - మొగముఁ జేర్పంగఁ
బఱచిన పువ్వుల - పానుపే నీకు?2220
గిరిదూరి యిలదూరి - గెడపిసాలములు
మరలి తూణముఁ జేరు - మహిసుతాప్రియుని
శరము నీమేనిలో - సరికట్టెఁ గాని
యురము భేదించివె - న్నుచ్చి పోదయ్యె!
వజ్రకుమార ప - ర్వతమనరాదు
వజ్రహరంబు నీ - వరగాత్రయష్టి!
కాయమ్ముఁ జించి యా - కడవీపు వెడలి
యాయమ్ము కనుపింప - దాయనుగాక!
ఆయమ్ము నాఁట ని - న్నాలింగనంబు
సేయనే యిటుల వం - చింతురే నన్ను?2230
గరుడుని ఱెక్కల - గరులపరంజి
మెఱుంగు పింజయ నీదు - మేనిపై నెంత
సింగారమయ్యె నీ - క్షించిన మాకు

-: వాలితేజము సూర్యమండలముం జొచ్చుట :-

నంగదునకు భయం - బైన నౌఁగాక!"
అని యేడ్చునెడ నీలుఁ - డచటికి వచ్చి
కనకపుంఖంబు రా - ఘవసాయకంబు
గవిఁ జొరబారు నా - గకొమరుఁ దివియు
నవధానమునఁ గేల - నతిశక్తిఁ బట్టి
దిగదిగ వెలుఁగఁగఁ - దిగిచిన తొగల
పగరమయూఖంబు - పగిదివెలుంగ 2240
వాలి గాయమువెంట - వడియు నెత్తురులు
జాలెత్తి జేగురుల్ - చరముక పాఱు
సెలయేరులన నుర - స్సీమశైలంబు
పొలువున మించున - ప్పుడు చూడనయ్యె!
అది గనుఁగొని తార - యంగదుఁ జీరి
“యదెకంటె! మీతండ్రి - యంతిమావస్థ!
కనుఁగొంటివే వాలి - గాత్రంబు వెడలి
దినకరప్రభ నొక్క - దివ్యతేజంబు
చనుచునున్నది నమ - స్కారంబు సేయు"
మన విని యంగదుం - డటుల మ్రొక్కుటయు2250
తార యాప్రాణేశు - దరసి “యోస్వామి!
ఊరకయుందురే - యొల్లకమమ్ము?
వీఁడె యంగదుఁడు దీ - వెనలిమ్ము కొడుకు
గాఁడె యిట్టేటికిఁ - గరుణింప విపుడు?
సింగంబు చేతఁ జ - చ్చిన వృషభంబు
సంగిడి నావువ - త్సంబుతోఁ గదియు
కైవడి నీ చెంతఁ - గాచి కొల్చెదము

దేవ! యుపేక్షింప - దీఱునే నీకు?
సమరయాగముచేసి -శరవారిధార
సమబుద్ధి నపభృత - స్నానంబు నీవు 2260
నను వెలిగాఁ జేయ - నాయమే? నీదు
తనువుపై కాంచన - దామమేమయ్యె
అమరనగంబు పై - నాతపలక్ష్మి
యమరినరీతి నీ - యంగంబునందుఁ
దఱగదు శోభావి - తానమిందఱిని
జెఱపగాఁ దలంచి యీ - చెడుబుద్ధిపుట్టి
నామాట గాదని - నాథ! యిల్వెడలి
సేమంబు రవిసూనుఁ - జేర్చి పోయితివి."
అని విలపింపుచో - నర్కనందనుఁడు
కనుఁగొలుకుల నుబ్బి - కన్నీరు రాల 2270
దాలిమి చాలక - తనవారుఁ దాను
చాల శోకించి భూ - స్థలి మీఁదఁ బొరలు
తార నూరార్చి సీ - తాప్రాణవిభుని
గ్రూరసాయకహేమ - కోదండధరుని
వీరరసావేశు - విమలప్రకాశు
శ్రీరామవిభుఁ జేరి - చేమోడ్చి పలికె.
"స్వామి! నాతో మీరు - శపథంబుఁ జేసి
యేమి వల్కితి రది - యీడేర్చినారు
ప్రతినఁ జెల్లించి నీ - పలికిన పలుకు
ప్రతిపాలనము చేసి - ప్రౌఢి మించితిరి 2280

-:తనయన్నవాలి మృతికి సుగ్రీవుఁడు శోకించుచు, తనకు రాజ్య మక్కర లేదని విరక్తుడగుట:-

ఇటమీద నేనొల్ల - నిలయుఁ బ్రాణములు
కటకట ! యెంతటి - కష్టుండ నైతి
నన్నరణంబులో - నటువడి యుండఁ
గన్నట్టి తనయుఁడం - గదుఁడు శోకింప
నతని కులాంగన - యైన యీతార
నెతనొంద నిందఱ - వీక్షించువాఁడ!
ఎందుకు రోయుదు - నిటమీఁద? నన్ను
నెందులో జతచేసి - యెంతురందఱును
అవమానరోషదై - న్యాదులచేత
నవశమై నాచిత్త - మప్పుడట్లుండె2290
యిప్పుడిట్లున్నది - యింతటిపాటి
తప్పునకోర్చపా - తకుఁడెందుఁ గలఁడు?
ఈకొండపై నొంటి - నేజఱియించి
యాకుల నలముల - నాఁకలి దీర్చి
యుందు నింతియెకాని - యొల్ల నీధరణి
యందుపై స్వర్గంబు - నటమున్నె యొల్ల
శ్రీరామ! యెట్లువ - చింపుదు నాదు
క్రూరబుద్ధియు వాలి - గుణగౌరవంబు?
ఎటులన్న! వినుపింతు - నేను నీతండు
పటుశక్తిఁ బోరాడ - బవరంబులోనఁ2300
గళవళింపుచుఁ బడి - కదలంగలేక
వెలవెలనైనఁ జే - వృక్షంబు వాలి
నామీఁద వ్రేసి ప్రా - ణములకుఁ దెగక

 
యామేర చెయిగాచి - యర్కకుమార!
పొమ్ము మెల్లఁగ లెమ్ము - పోరికి రాకు
తమ్ముఁడవని నిన్నుఁ - దాళితి నిపుడు
నీమాట తారతో - నేనని వచ్చి
నీమీఁదఁ దెగనైతి - నిలువకు మిచట
పనిచెద చంప నీ - పగ త్రెంపఁ బోల”
దనుమాట లాడియు - నాడక మున్న2310
పెనుగొండపై పెద్ద - పిడుగును బోలి
ఘనమైన నీసాయ - కము రొమ్మునాఁటి
యాయనం బడవైచె - నతఁడట్టివాఁడు
నేయిట్టివాఁడ నె -న్నెన్ని మాటలకు
నతనితోఁ బోరాడి - యని సేయలేక
యతిలోకశౌర్యు ని - న్నర్థించి తెచ్చి
చావ నేయించితిఁ - జాలవంచించి
దేవ! నా కేదిబు - ద్ధిదురాత్మకునికి?
తలఁప చూడను గోరఁ - దగనట్టి ఘోర
కలుషంబు జేసితి - గతియేది తనకు!2320
గోపించి త్వష్టనుఁ - గూర్చిన యింద్రు
శాపంబు తనకు సం - భావితమ్మయ్యె!
అతని బ్రాహ్మహ - త్యాదోష మెల్ల
భూతలం బతివలు - భూజముల్ నీళ్లు
పంచుకపోయిరి- పాపంబు దాని
మించిన దగుటయే - మిటఁ దీర్చుకొందు?
కులనాశనంబైన - క్రూరకర్మంబుఁ
దలఁచిన దనకు న - ధర్మభోగంబు

నిలయును బ్రాణంబు - నీబహుమాన
ములునేల! మిము నెట్లు - మోము జూచెదను?2330
దేవ! క్షుద్రుఁడ నింది - తుఁడ వంచకుండ
మావాఁడవని మీరు - మాటాడఁ దగఁడు!
నీరు పల్లంబున - నిలిచినయట్లు
భూరిపాతకదుఃఖ - ములు తనుఁజేరె!
అన్నఁ జంపించిన - యపకీర్తి తనువు
నన్ని యంగములు మ - హాపాతకములు
కానున్నయట్టి దు - ష్కర్మగజంబు
పోనీక తనుగరిఁ - బొడిచిన యట్లు
హానిఁ బొందింపుచు - న్నది పుటపక్వ
మైన హేమము గూడి - నట్టి లోహములు2340
తొలఁగిన కైవడిఁ - దొలుత నాయందుఁ
గలుగు సద్గుణలేశ - గౌరవోన్నతులు
నీపాపమున నశి - యించె నంగదుఁడు
వాపోవ మాజాతి - వారికి నెల్ల
సగము ప్రాణములయ్యె - జానకీరమణ!
పొగులుచున్నట్టి యీ - పుత్రునిఁజూచి
తమ్ముని గన్న చం - దంబున నాదు
నెమ్మది కిప్పుడు - నెనరు సంధిల్లె
భువి నంగదునివంటి - పుత్రుఁ డెవ్వరికి
నవనిపై మరిచూతు - మనిన నున్నాఁడె?2350
కొడుకుమాత్రమె వీఁడు - కులము రక్షింపఁ
గడుఁ బాలుపడిన ము - క్తాఫలం బితఁడు
వాలినిఁ బాసి యో - ర్వఁగ లేఁడు వీఁడు

చాలదు బ్రతుక త - జ్జనని శోకమున
నంగదతారల - ప్రాణంబులొకటి
యంగభావములె వే - రై యుండు గాని
వీరలిద్దఱిఁ జంపి - వీఱిడి ప్రాణ
మేరికిఁ బ్రీతిగా - నేఁదాల్చువాడ?
అనలంబులో జొచ్చి - యన్నను వాలి
తనయుని దారను - దాఁగూడువాఁడ!2360
నీ మాట మదినమ్మి - నిన్నుఁ జేపట్టి
యేమినిమిత్తమై - యీవాలిఁ జంపి
యింత చేసితి నవి - యెంచితిరేని
యంత నేనెఱుఁగని - యల్పుఁడగాను
యేమి మీరానతి - యిచ్చిన నదియె
తామాచరించి సీ - తానిమిత్తముగ
మేనులు దాఁపక - మీకార్యభరముఁ
బూని యీడేర్పనో - పుదురొక్కఁ డొకఁడె
యీనలుఁడీ నీలుఁ - డీ జాంబవంతుఁ
డానయనిధి యైన - యాంజనేయుండు2350
గలుగ నాపని యెంత?-కాకుత్థ్సవంశ
తిలక! యిన్నియుఁ బల్కి - తిని గాకమీకు
నీపవనజుఁ డొక్కఁ - డే చాలునతని
ప్రాపు గల్గినఁ గల్గు - భద్రంబు లెల్ల
పరమపాతకుఁడనై - బ్రదుకంగఁదగని
కొఱమాలినట్టి నాకు - ననుజ్ఞ యిండు
వాలి చేరఁగ" నన్న - వచనముల్ చెవుల
నాలించి కన్నుల - నశ్రులు రాలఁ

గడుచింతలో రెండు - గడియ లేమియును
నుడువక సీతామ - నోనాయకుండు2380
ప్రాణనాయకు మీద - బడి యేడ్చుచున్న
యేణాంకముఖి తార - నీక్షించుటయును

-: వానరులు తారను రామునియొద్దకు తీసికొనివచ్చుట :-

నాసన్న యెఱిఁగి మ - హాకపుల్ బలిమి
చేసి యీడ్చినరాక - చిత్తంబు గలఁగ
వాలిఁగౌగిటఁ జేర్చి - వదలక యున్న
“ఏలమ్మ! రఘువీరు - డేమి వల్కెడునొ !
విని నీదుహృదయంబు - వినిపించి యతని
యనుమతి నేమైన - నగుట యుత్తమము"
అని రాఘవుఁడు బిల్చె - ననుమాట యెపుడు
వినియె నప్పుడు లేచి - వేనలిఁ దురిమి2390
పయ్యెద సవరించి - పట్టిఁ జేపట్టి
యొయ్యూరమున నిలు - చున్నట్టివాని
శరచాపహస్తుని - శతపత్రనయను
హరిమధ్యు నతిలోకు - నాజానుబాహు
లక్ష్మణాగ్రజు రాజ - లక్షణపూర్ణ
లక్ష్ముని రవిమండ - లవిభాసమాను
రామునిఁ గరుణాభి - రాముని సుగుణ
ధాముని ధీరుఁ బ్ర - ధానపూరుషుని
యెన్నఁడు మును జూచి - యెఱుఁగనివాని
యన్నెలంతుక యంగ - దాలాపసరణి2400

యెఱిఁగి వేగమె చేర - నేతెంచి హృదయ
మెఱిఁగింపఁ దెగువతో - నిట్లనిపలికె

-: తార రామునితో సంభాషించుట - తన భర్తతోఁ గూడ తన్నుఁజంపుమని యాతని ప్రార్థించుట :-

"అప్రమేయుఁడవు ద - యా వారినిధివి
యప్రతీపప్రతా - పాభిరాముఁడవు
ధృతిమంతుఁడవు యశో - ధికుఁడవు సత్య
రతుఁడ వింద్రియజయ - ప్రౌఢభావుఁడవు
అవనిపై వెలసిన - యమరేంద్రుమాడ్కి
నవతారమందుమ - హానుభావుఁడవు
దేవ! నామనవి చిం - తించి కాదనక
కావింపుడిది యవు - గాదనవలదు2410
ఏయమ్ముచేఁ వాలి - నేసితిరిప్పు
డాయమ్ము చేఁ దన - యాయమ్ము నాఁట
నేసిన వాలితో - నెడవాసియున్న
గాసి యంతయుఁ దీఱి- కాంతు సద్గతిని!
ననుబాసి వాలియుం - డఁగ లేఁడు క్షణము
కననొల్లఁడమరలో - క సరోజముఖుల
మీరు జానకితో ని - మేషంబుఁ బాయ
నేరనిగతి నర్ధ - నిమిష మాత్రంబు
ననుఁ బాయలేఁడు వా - నరవజ్రపాణి
యనుపుము కూర్చి పు - ణ్యము నీకుఁ గలదు2420
స్త్రీవధ దోషంబు - చేకూడు ననుచు
దేవ! నీయాత్మ జిం - చించెద వేని

యేనాఁట దానఁగా - నీమేను వాలి,
లో నర్ధభాగ మా - లోకింప వీవు!
వాలిఁ జంపెదనని - వరమిచ్చి ప్రతిన
చాల చేసితిని భా - స్కరపుత్రుతోడ
నట్టి ప్రతిజ్ఞకు - హాని రాకుండ
గట్టిగా నేయు మీ - కడమసగంబు
వాలిఁ జంపినకీర్తి - వన్నెకు నెక్కు-
నీలోనె తనుఁబడ - నేసితివేని2430
జలజాక్ష! యిదివేళ - శాస్త్రసమ్మతము
వాలినేసిన యట్టి - వాఁడవే తారఁ
గూల నేసినఁబతిఁ - గూర్చితి వేని
నీకుఁ గన్యాదాన - నియతఫలంబు
చేకూడు నాఁటికిఁ - జేసిన పెండ్లి
కల్ల నీ విప్పుడు - గట్టింపు వాలి
పల్లవారుణ పాణి - పద్మంబుచేత
నాకంధరను దాళి - నాదు దీవెనను
జేకొందు వటులైన - సీత నీప్రొద్దు2440
మత్తేభనిభు హేమ – మాలిని వాలి
హత్తించి తనుఁ ద్రుంచు - నదియెధర్మంబు
కాదన్న దనపావ - కంబులోఁజొరఁగ
నోదేవ! యనుమతి - యొసఁగుఁడు మీరు.”
అన నూరడించి హి - తానులాపముల
వనితామణికి రఘు - వర్యుఁడిట్లనియె.


-: శ్రీరాముఁడు ప్రత్యుత్తరమిచ్చి తారయొక్క కర్తవ్యముఁ దెలుపుట :-

“వీరభార్యవు నీవు - వీఱిఁడి దాని
మేర నీక్రియఁబల్క - మేరయే నీకు?
ఎవ్వని తలయందు - నేరీతివ్రాసె
నవ్వనజాసనుఁ - డదిగాక పోదు2450
దైవయత్నమునకు - తను దూర నేల?
నేవాలి కహిఁతుడ - నే పడనేయ?
నను నెన్న నేల? యీ - నలువకట్టడకు
తనశక్తి నెవ్వఁడు - తలఁగిపో నోపు?
చింతయేమిటికి నేఁ - జేయుదు నీకు
నింతి యింతటికన్న - హెచ్చయిన హితము
అంగదు యౌవరా - జ్యంబున నునిచి
యంగదలేని సౌ -ఖ్యమునొందు మీవు
కొడుకులు లేనట్టి - కొమ్మలు దలఁచు
కడమాటలేల? భా - గ్యము చేసినావు2460
పతి లేక యుండి శో - భనవతు లెందు
సుతులను గనినమం - జులవాణులెల్ల
సుతుఁడన్న మాత్రమె - శూరత వాలి
కత మఱపించు నం - గద కుమారకుఁడు!
వలవదీబుద్ధి నా - వచనంబుఁ చేసి
యలివేణి! తగినకా - ర్యము చూడు మిపుడు"
అనిన నేడుపుమాని -యశ్రులు దుడిచి
మనను కొందలపాటు - మట్టుకుఁ దెచ్చి

పదరి కానిమ్మని - పలుకక గుట్టుఁ
జెదరక తలపొంచి - శ్రీరాముఁజూచి2470
వినయంబు భయము వి - వేకంబు ప్రియముఁ
దనర నూరకయున్న - తారను జూచి
సాత్వికజ్ఞానవి - శారదుండగుట
తత్త్వబోధనముగ సీ - తాకాంతుఁ డనియె

 - :శ్రీరాముఁడు తారకుఁ దత్త్వబోధన గావించి వాలి యగ్నిసంస్కారమునకుఁ బ్రోత్సహించుట:-

"కామిని! ధర్మార్థ - కామమోక్షములు
నేమించి పొందుట - నియతిచేఁ జుమ్ము!
నియతి నానాధీన - నియమంబుగాన!
నియమింపఁదగు నొక్క - నికి విభుత్వంబు
ఉర్వికి దొరలేక - యున్న నేపనులు
నిర్వాహకములు గా - నేరవు గాన2480
జలజాక్షి! చింతించు - సమయంబుఁగాదు
తలఁపు మీవేళ మీఁ - దటి కార్యచింత
కాల మందఱికిని - గర్తయౌగాని
కాలమునకు నొరుల్ - కర్తలుగారు
పగలును రాత్రులై - పరఁగుడు నదియె
మగువ! కాలము; కాల - మయుఁ డీశ్వరుండు
జగతి మిత్రజ్ఞాతి - సంబంధమెల్ల
విగణింపఁ గాలప్ర - వృత్తమైయుండు
కాలధర్మంబునఁ - గడచన్న యట్టి
వాలికి నెందాక - వగలఁ పొందెదరు?2490


అతఁడు వీరస్వర్గ - మందినవాఁడు
కృతకృత్యుఁడౌ వాలి - కినిఁ దగినట్టి
భావికార్యముఁ దీర్పఁ - బరగు మీకనిన"
నావేళ రాముని - యనుమతి వలన
సౌమిత్రి తారను - సమ్మతపఱచి
తామరసాప్తనం - దనున కిట్లనియె
“కావింపు ముత్తర - కర్మముల్ వాలి
కావలఁ బెక్కుకా - ర్యంబులు గలవు
తడవు సేయఁగరాదు - ధార్మికుండతఁడు
పడియున్నవాఁ డుర్వి- పై మృతినొంది2500
యీ తార నంగదు - నీవు లాలించి
యాతని కొనరింపు - మగ్నికృత్యంబు

-: వాలికి నగ్ని సంస్కారము చేయుట :-

అర్కనందన! రాజ - వవనికి నీవు
మర్క టేంద్రుల నంపి - మఱికాష్ఠములను
గంధపుచెక్కలుఁ - గదళికాండములు
గంధపొడియు నూత్న -కనకాంబరంబుఁ
దెప్పింపు మంగదుఁ - దెమ్మని పనుపు
మిప్పుడు, లాజలు - నెఱ్ఱపువ్వులును
పరిమళప్రసవధూ - పము లక్షతములు
పెరుగు పాలును నెయ్యి - బెల్లంబు తేనె2510
తామసింపకు"మని - తారుని బిలిచి
"యీ మగఘవతనూజు - నింటిలోనున్న
కనకవల్లికి నీవు - గ్రక్కునఁ దెమ్ము

చనుము కిష్కింధకు - జతఁగూడియున్న
బోయీలఁ బిలిపింపు - పురముఁగైసేయ
జేయుము తగువారి - చేత శీఘ్రమున.”
అనిపల్క విని తారుఁ - డప్పుడేపోయి
యనుపమంబగు చతు - రంతయానంబు
తన పార్శ్వమైన బె - స్తలుఁ దాను దెచ్చి
యనుప రాముడు చూచి - యుల్లాస మొంది 2520
“పోయి లక్ష్మణ! గపి - వ్యూహంబుచేత
నీయందలంబులో - నెత్తించి వాలి
నంగదతారార్క - జాదులచేత
సంగతి నగ్నిసం - స్కార మీడేర్చి
రమ్మన్న నట్లనే - రామాజ్ఞ వాలి
తమ్ముఁడా యన్ననం - దలములో నునిచి
సాగింప రత్నభూ - షణ కాంచనములు
నాగవల్లీదళాం - తరముల నునిచి
ముందఱను వసంత - ములుగాఁగ జల్లి
సందడిగా బంధు - జాలంబు గొలువ2530
తారాది రమణులు - తనయుఁడుఁ దాను
చేరిక నిరుగడ - జేరి శోకమునఁ
జితి సమిపమునకుఁ - జేరి యచ్చోట
శతమఘతనయు భూ - స్థలిని డించుటయుఁ
దన తొడపై వాలి - తలయుంచి తార
కనుఁగొలుకుల నుబ్బ - కన్నీరురాల
శోకింపఁ జెంతల - సుదతులూరార్చి
యాకలభాషిణి - ననలకుఁ దివియఁ

.

నంగద సుగ్రీవు - లావాలిఁ గాష్ఠ
సంగతులు వేసి సం - స్కారంబుఁ జేసి 2540
తిల తర్పణములిచ్చి - తీర్చి కర్మములు
జలములఁ గ్రుంకి ల - క్ష్మణసహితముగ
శ్రీరాము చెంతకుఁ - జేరిన వారి
నారాఘవుఁడు చూచి - యాత్మలోఁ గలఁగి
కరుణారసంబుతోఁ - గన్నీరు నించి
తరణిజముఖుల నం - దఱ నాదరించి
యుపలాప మొనర్పు - చున్న నచ్చటికి
గపివీరులెల్ల మూఁ - కలు గూడి వచ్చి
యినకుమారునిఁ జేర – నెల్ల దేవతలు
వనజసంభవుచుట్టు - వసియించునట్టు 2550
లందఱు రామున - కంజలిఁజేసి
నందిత భక్తితో - నలువంకఁ గొలువ
నాసమయంబున - ననిమేషశైల
భాసురగాత్రంబు - భానుసంకాశ
వదనంబు నుత్తాల - వాలంబుఁ గలుగు
సదయాత్ముఁడైన యం - జనకుమారకుఁడు
కరములు మొగిచి రా - ఘవకులో త్తముని
చరణపద్మములకు - సంప్రీతిఁ బలికె.

-: ఆంజనేయుఁడు శ్రీరామునిఁ గిష్కింధకురమ్మని ప్రార్థించుట :-

"ఈసూర్యసుతుఁడు లో - కేశ్వర! మీకు
దాసుఁడై తండ్రి తా - తల తరంబునకుఁ 2560

గలిగిన కిష్కింధఁ - గ్రమ్మర నేలి
చెలులఁ జుట్టముల ర - క్షింపఁ బాల్పడియె
వేడుక మీరలు - విచ్చేసి పురముఁ
జూడఁగావలయును - సుగ్రీవుఁ బట్టి
పట్టంబు గట్టి చే - పట్టి మీ రునుచు
చెట్టుగా నతనిఁ జూ - చిన వారికెల్ల
సంతోషముగ మాకుఁ - జాలగౌరవము
సంతరించిన పూన్కి - సఫలంబు మీకు
నాకు దోచినది వి - న్నపము చేసితిని
మీకెట్లు సరిపోయె - మీరది చేసి2570
రక్షింపుఁ" డన నకా - రణ దీనలోక
రక్షకుండగు రఘు - రాముఁ డిట్లనియె.
"వాయుతనూజ! నీ - వచనముల్ మాకు
జేయుట మిగుల వి- శేషమౌ నైనఁ
దప్పనేరము మేము - తండ్రికట్టడగు
నెప్పుడు పదునాలు - గేండ్లు కానలనుఁ
జరియించువారమై - శపథంబు చేసి
పురములకెట్లు రాఁ - బోలు? నట్లగుట
మాకు రారాదు మా - మారుగా నీవు
చేకొని రాజ్యాభి - షిక్తునిఁ చేసి2580
భానుజుఁ గట్టుము - పట్టంబు నాదు
పూనిక చెల్లింపు - బొమ్మని" పలికి
శ్రీరామవిభుఁడు సు - గ్రీవునిఁ జూచి
కారుణ్య మిగురొత్తగా - నిట్టులనియె.


శ్రీరాముఁడందుల కియ్యకొనకుండుట - సుగ్రీవపట్టాభిషేకమున కనుజ్జయిచ్చుట

"ఈ యంగదుఁడు చాల - హితుఁడైనవాడు
మీయన్న కొడుకు న - మ్మినవాఁడు నిన్ను
పాలించి యువరాజు - పట్టంబు గట్టి
యేలింపు మతనిచే - నెల్ల రాజ్యంబు
శ్రావణప్రథమవా - సర మిది గాన
రావణు మీఁది కా - ర్యము సేయరాదు2590
కలఁగక యీవాన- కాలంబు నాల్గు
నెలలు నీపురములో - నిశ్చింతముగను
నూరక సుఖమున - నుండుము నీవు
మారాడ వలదది - మాల్యవంతమున
నీలక్ష్మణుఁడు నేను -నీ బిలాంతమున
కాలూఁది దినములు - గడపుచుండెదము
కడివోని వికసిత - కమలముల్ గలుగు
కడపటి నెలఁ గార్తి - కమునందు నీవు
వెదకింపు వానర - వీరులచేత
వదలక మన సీత - వసియించు చోటు2600
పొమ్మని పలుకున - ప్పుడు పైఁడికట్ల
కొమ్మునుఁ బవడవు - గోళ్లుదంతములు
పలకతాపనలచేఁ - బసిఁడి మెఱుంగు
ములుకుల బలుచీర్ణ - ముల హరువైన
రథగజసుభట తు - రంగ మావళులు
పృథుతరలతికలు - బిసరుహంబులును
మదవతీకాముక - మహనీయమదన

కదననానావిధ - కరణవైఖరులు
ముత్తేల కుచ్చును - ముదురబల్కెంపు
కత్తెరలును బూర్త - కాళి మెత్తలును2610
బురుసామెఱుఁగు పికిల్ - పూవు దస్తులును
పరపైన కుంకుమ- పరవు కురంగి
బటువులు తాపితాఁ - బన్నాగమెచ్చు
దిటమైన యపరంజి - దిండునుకెంపు
బోడిగ కోలలు - పుత్తడి యును సు
జోడును గలిగి రా - జులకెందు లేని
పల్లకిఁ గడు జోక - పఱచి తారుండు
బొల్లు మోములు గల్గు - బోయీలతోడ
తెచ్చిన రాముని - దెసఁ జూడనతఁడు
నిచ్చె ననుజ్ఞ యం - దెక్కి పొమ్మనుచు.2620
ఆపల్లకీ మీఁద - నర్కనందనుఁడు
చూపట్టెఁ దపన తే - జోరాశి యగుచు
భేరీమృదంగాది - బిరుదవాద్యములు
భోరుకలంగ నా - ప్తులు చేరి కొలువ
నావెన్క నంగదుఁ - డందంలంబెక్కి
తావాలిహితులు చెం - తలఁ గొల్చి రాగ
చెంగట దిడ్లు వై - చిన పల్లకీల
సంగడిఁ దారాది- సతులఁ దోకొనుచు
వానరసైన్య రా - వము నింగి ముట్టఁ

-:సుగ్రీవుని పట్టాభిషేక మహోత్సవము :-

దానొక్క శుభముహూ - ర్తమునఁ గిష్కింధఁ2630

జేరి వేడుకఁ బ్రవే - శించె, నారతులు
నారు లెత్తఁగ వాలి - నగరిలోపలికి
నటులఁ బ్రవేశించి - యలివేణి రుమను
గుటిలకుంతలఁ జూచి - గూర్మినటింప
నాసతి వచ్చి గా - ఢాలింగనంబు
జేసి కన్నీటితోఁ - జింతిల్లుచుండ
నూరార్చి వెలువడి - హుజురుసావిడికిఁ
జేరిన బాంధవ - శ్రేణి మంత్రులను
నవరత్నసింహాస - నంబున నుంచి
గవరనకాంచన కలశకోటులను2640
ద్రిభువనాఖిలనదీ - తీర్థముల్ దెచ్చి
నభిషేక మొనరించి - యంబుజాతములు
హేమాక్షతంబులు - నేకాతపత్ర
చామరయుగళముల్ - శాతఖడ్గంబు
పచ్చిబెబ్బులితోలు - పడుచుల జంట
దచ్చియు నిలువుట - ద్దమ్ములు పంది
వాఱు లుద్దములు న - వ్యప్రసూనములు
గౌరవస్త్రంబులు - గంధాక్షతములు
పాలు తేనియ నేయి - ఫలవివేషములు
పాలు గల్గిన చెట్ల - పల్లవంబులును2650
గోవజవ్వాది కుం - కుమము కస్తూరి
కావలసిన రత్న - కనకాంబరములు
సకలౌషధులును లా - జలు దెచ్చియిచ్చి
యకలంక హోమశాం - త్యాదులుఁ జేసి
ధారణీసురలెల్లఁ - దనియ వారలకు

భూరిపదార్థముల్ - భూరిగానొసఁగి
బలియులు జాంబవ - త్పవనజ కుముద
నలనీల శరభమైం - దద్వివిదాది
వానరోత్తము లష్ట - వనువులు మఘవుఁ
బూని స్వర్గమునని - ల్పు విధంబుఁ దోఁప2660
రాజుగా వానర - రాజధానికిని
రాజీవహిత కుమా - రకుఁ గర్తఁ జేసి
యానందముల నొందు - నప్పుడుప్పొంగి
భానుసూనుఁడు - వాలిపట్టిఁ జేపట్టి
పట్టాభిషేక పై - భవమాచరించి
పట్టైన యువరాజు -పట్టంబుఁగట్టి
యా మహోత్సవము స - మస్తలోకులకు
నామోదకరమైన - యప్పుడావార్త
పవమానతనయునిఁ - బనుప రామునకు
నవిరళప్రీతిగా - నటువిన్నవించి2670
నుతశౌర్యులను ప్రధా - నులు నీతి చేత
క్షితి యెల్ల బాలింపఁ - - గిష్కింధలోన
దాను రమాసహి - తముగ సుగ్రీవుఁ
డానందకలితాంత - రంగుఁడై యుండె.

-: రామలక్ష్మణులు గుహాయందు నివాసము చేయుట :-

ఆవేళ రఘువీరుఁ - డనుజుఁడు దాను
నావరుషఋతుస - మాగంబునను
వివిధమృగంబుల - వింతపక్షులను
నవనిజముల నంద - మైన ప్రస్రవణ

శైలబిలంబుల - క్ష్మణునకుఁ జూపి
వాలివిరోధిభా - వమెలర్పఁ బలికె. 2680

-: గుహవర్ణనము - రాముఁడు సీతకై విరహమునొందుట :-

"లక్ష్మణ! వానకా - లమునకు నెంత
లక్ష్మీకరంబీ బి - లంబుఁ జూచితివె?
వలసిన మాత్రంబె - వాయువు లిచటఁ
బొలయు చున్నవి చలి - వుట్టదిచ్చోట
ఈకొండ తెల్లనై - యెఱ్ఱనై నల్ల
నై కనుపట్టె మ - హా శిఖరములు
మూఁడు మూర్తులకును - మొదలింటి మూర్తి
జాడగా నున్నదీ - శైలరాజంబు!
ఇందులో గల తోఁపు - లీసరోవరము
లెందు జూచినవి గా - వీ వసుంధరను.2690
ఈపడమఱఁ జూడు - మిదియొక్క బిలము
చూపట్టె పడమటి - చోటున్నతముగ
నీయుత్తరపు దిశ - నీశాన్యమైన
చాయ పల్లమున వి - శాలమై నీల
నీలమై మణిదీప - నిచయమై నిబిడ
సాలమై మించి న - చ్చటి కందరంబు
అల్లదె నైఋతి - యగు దిక్కునందు
తెల్లని మగఱాల - దిగదిగ వెలుఁగు
గనుల చెంగట నొక్క - కందరాంతరము
కనకమయం బౌచు - కనుపట్టె గనుము

తెలుపును నలుపునై - తిన్నగాఁ బెరిగి
కలసిన రెండు శృం - ముగలొప్పుఁ జూడు
హరిహరమూర్తియో - యన నెల్ల వారి
నెఱిఁగించు నర్ధనా - రీశ్వరుఁడనఁగ
నలత్రికూటంబుపై - నమరుజాహ్నవినిఁ
దలపించు నీకొండ -దక్షిణ దిశను
ఉల్లోల జలశీక - రోర్ములఁబాఱు
తెల్లని యీయేరు - తేరికన్ గనుము
అయ్యేరు వికచప - ద్మాళిఁ గైసేయు
తొయ్యలిగతి నింపుఁ -దులకించ నెదుర2710
దవ్వుల మృదుసైక - తముల నీయేరు
నవ్విన రీతిను - న్నవి యంచలిచట
నిచ్చట మనమున్న - నెప్పుడు వినఁగ
వచ్చు గిష్కింధలో - వాద్యఘోషములు
చెవిసోఁకె వినవన్న! - సింహనాదములు
రవళి వానరులచే - రవిజు మేలునకు
నెంత వేడుకనుండు - నిపుడు సుగ్రీవుఁ
డంతిపురంబులో - నతివలఁ గూడి!
అతనికి నాకును - నన్యోన్యమతుల
వెతలొక్క చందమై - వేగుచుండంగ2720
సందులో నొకరికి - నైన దైవంబు
సందిచ్చె దరిఁచేర్చి - సతితోడఁగూర్చి!"
అనుచు లక్ష్మణుఁ గూడి - యాశైల నికట
వనభూములను రఘు - వరుఁడు గ్రుమ్మఱుచు
పొడవుగుబ్బలి మీఁదఁ - బొడము చందురుని

పొడవుఁగన్గొని “విరిఁ - బోడి మాసీత
కుంకుమ నలుగిడు - కొనువేళ మిగుల
పొంకమౌ నగుమొగం - బును బోలె" ననుచుఁ
దలచి యంతన పరి - తాపంబు నొంది
కలఁగుచు భ్రమసి కాఁ - క వహించి మిగుల2730
పండువెన్నెలఁ జిక్కి - “బలువిడిఁ గాదె
నెండలు సౌమిత్రి! - యెటకుఁ బోవుదము?
తపియింపఁ జేసి మా - ర్తాండ మండలము
చపలాక్షి యెటువోయె - జానకి యిపుడు"
అనుచు గూర్చుండి - యాయనుజు నూరువులఁ
దనమేను జేర్చి "సీ - తా!" యంచుఁ బలికె
కన్నులు మొగిచినఁ- గాంచి సౌమిత్రి
యన్నతో భయవిన - యముల నిట్లనియె

-: లక్ష్మణుడు శ్రీరామునికి గర్తవ్యముఁ దెలుపుట :-

“దేవ! ధార్మికుఁడ వా - స్తికుఁడవు ధైర్య
భావనుఁడవు కార్య - పరుఁడవా మీఁద2740
నీమేరఁ జింతింతు - రే? దీనులైన
పామరులకు జయ - ప్రతిభలు గలవె?
మానసోత్సాహంబు - మానక వైరి
దానవహరణ య - త్నము సేయు మీవు
నీవు గావలె నన్న - నిమిషమాత్రమున
నీవసుమతితోడ - నెల్ల లోకములు
శరము సంధించి - భస్మము సేయఁగలవు!
వరశౌర్యకేళి రా - వణుఁ ద్రుంచు టెంత?

ఎపుడు శరత్కాల - మేతెంచె నపుడె
నిపుణత బూది నిం - డిన ధనంజయుని 2750
యాజికవర్యుఁ డా - జ్యాహుతిచేతఁ
దేజంబు నొందించు - తెఱఁగుగా నిన్ను
నెచ్చెరించెద నేల - యీలోనె కలఁగి
యిచ్చలోఁ దాల్మి వ - హింప వేరెయన
నామాట విని సుమి - త్రాత్మజుఁ జూచి
రాముఁడు సుగుణాభి - రాముఁ డిట్లనియె.
"హితము పల్కితివి మే - లీవానశాల
మతకరించి శరత్స - మారంభమైన
యప్పుడే తగినట్టి - యత్నంబుఁ జేసి
చొప్పరులగు కపి - శూరులచేత2760
జానకియున్నట్టి - చందంబుఁ దెలిసి
దానవాన్వయమెల్లఁ - దరిగి వేయుదము
మనకార్యభారంబు - మఱవక పూని
తనకార్యముగ నెంచుఁ - దపనందనుఁడు
భక్తితో నొక రును - పఁగ మనువాఁడు
శక్తి కొద్దిని సహ - చరుఁడవుఁ గాక
యేల కృతఘ్నుఁడౌ - నింగితజ్ఞుండు?
మేలెఱింగినవాఁడు - మిహిరాత్మజుండు
అతఁడుండ మనకసా - ధ్యము లేల కలుగు
హితము చేసినవారి - నెఱుఁగఁడేవాఁడు?2770
గడుపుద మీవాన - కాలంబుఁ గలఁక
లుడివోయి సుగ్రీవు - నుల్లంబురీతి
నదులన్నియును బ్రస - న్నతలొందు నొక్కొ!

కదియునొకొ శర - త్కాల వాసరము?
అనవిని సౌమిత్రి - యంజలిఁ జేసి
యనఘాత్మ! సుగ్రీవుఁ - డటువంటివాఁడు
చాల కృతజ్ఞుఁడు - జానకి వెదకఁ
జాలు నీ కార్యంబు - సమకూర్ప నేర్చు
మనము చెప్పినయట్టి - మాటలో నడచి
మన నేర్చు కడుబుద్ధి - మంతుఁ డుత్తముఁడు3780
ఈ మాల్యవద్గిరి - నీ మూఁడు నెలలు
రామ! సోఁకోర్చి యూ - రట నొందు” మనిన
తమ్ముని మాట హి - తమ్ముగా నెంచి
సమ్మతిననియెఁ గౌ - సల్యాసుతుండు

-: వర్షఋతు వర్ణనము :-

సౌమిత్రి! యిపుడు వ - ర్షాకాలమగుట
నీమేర మిన్నెల్ల - నెడమీక నిండి
భానుని కిరణముల్ - బలసి వారాసి
నీనవమాసంబు - లేఁకట దీఱ
జలదంబులై షడ్ర - సములకు తామె
నెలవైన యుదకముల్ - నిండారఁగ్రోలి2790
ధారణిపై వర్ష - ధార లేమేర
భోరునఁ గురియు న - ద్భుత కరంబులుగ
మేఘ మాలికలను - మెట్టులవెంట
నాఘర్మకరుఁడు దా - నాకాశమంది
యర్జున కుటజ ల - తాంతముల్ చూసి
నిర్జించె నాచిత్త - నీరజమిపుడు

పొలయు నూర్పులుగ న - భోమారుతములు
మలయ సంధ్యామేఘ - మాలికారక్త
వసనుఁడౌ విటునికై - వడి నాకసంబు
లసమానగతి నొప్పె - లక్ష్మణ! కనుము.2800
గ్రీష్మాతపములఁ గ్రాఁ - గినయట్టి వసుధ
యూష్మంబె గావిరు - లుప్పతిల్లంగ
ననుబాసియున్న జా - నకిఁ బోలితాప
మున నున్న చంద మి - ప్పుడు విలోకింపు
కేతకీ కైరవ - క్రీడాసమీర
పోతముల్ సీతమై - పొలపంబుఁ దెలిపె
ఈయేరుమద్ది కం - టీగిరి మీద
బాయక నవసుమ - ప్రచుర సంపదలు
యేవిచారము లేని - యీరవిసుతుని
కైవడి దృష్టి మం - గళకరంబయ్యె2810
అలఘు మేఘములు కృ - ష్ణాజినంబులుగ
జలధార లురముల - జన్నిదంబులుగ
యీనగంబులు చూచి - తే తమ మీఁది
మౌనులు వేషముల్ - మార్పడఁ దాల్చె
మెఱుపు గుంపుల చిరి - మిణి తరటులను
హరిహయుఁడను సాది - యదలించివేయ
సకిలించు నుత్తమా - శ్వమురీతి జలద
మకలంక గర్జల - నదె వచ్చెఁ గనుము
నీలమేఘంబులో - నెఱిమించునట్టి
వాలిక మెఱపు రా - వణుని యూరుపుల2820

వసియించు మనసీత - వలె వడంకుచును
దెసలకు వన్నియఁ - దెచ్చెఁ జూచితివె!
పర్జన్యుఁడను నొస - పరి మావటీఁడు
గర్జితంబనెడి ఘీం - కరణంబు సలుప
మెఱపు టంకుశముచే - మీఱి కాల్మీఱి
పఱువనీక యడంచి - పట్టిన నిలచు
మదసింధురమురీతి - మబ్బుసంజోకఁ
జదలు గన్పట్టె ల - లక్ష్మణ! విలోకింపు
మేదిక్కు చూచిన - నిలయెల్ల నిండి
యీదిక్కనెడిమాట - యేర్పడనీక2330
యిరులు కొల్పుచునున్న - యీ ప్రావృషేణ్య
శరదంబు లింతుల - సందిళ్లలోన
పొదువుక సుఖియించు - పుణ్యులకెల్ల
మదికి నానంద మి - న్మడి సేయకున్నె,
ననువంటి పాపాత్ము - నకు దుర్దినంబు
లనిపించు యహితంబు - లైన నౌఁగాక
ఈకొండ మల్లియ - లెల్లెడఁ బూచి
నాకు వేదన నెమ్మ - నంబులోఁ జేసె
విడవని వేసవి - వేఁడిమితోడ
నడఁగె మహీరజం - బవని నంతటను2340
రాజులు దండయా- త్రలు మానిరిపుడు
భూజనుల్ నిజవురం - బులకు నేఁగుదురు
నానానదముల నుం - డక మరాళములు
మానససరము దీ - మముగానఁ జేరె
చక్రవాకద్వంద్వ - సమితిఝరాంబు

వక్రత లెంచక - వసియించెఁ గనుము
అడుసు ద్రోవలుగాన - నవనిపైఁ గానఁ
బడదెందుఁ జతురంగ - బలసమూహంబు
కరడులు లేనట్టి - కడలియుఁ బోలి
శరదముల్ గప్పిన - చదలు చూచితివె!2850
ఒకచాయఁ దోఁచక - యొకచాయఁ దోఁచి
ప్రకటితలీల నం - బరభాగ మిపుడు
నమరె వాణియుఁ బోలి - యవనికలోన
నమరు, పాత్రము బోల్ప - నలఘుపాత్రముగ
కడిమిపువ్వుల తావిఁ - గమిచి జేగురులు
గడుగుచుఁ బఱచె నే - కడ నిర్ఘరములు
కేళీనటత్కేకి - కీకారవంబు
లాలింపు లక్ష్మణ! - యాకోనలోన!
గండుతుమ్మెదల పొం - కమున నేరేడు
పండులు చూడు మ - పార మీవేళ.2860
ఈరసాలఫలంబు - లిల మోవనీక
ధారగా మధురస - ధారలు చిలుక
ముక్కుగంటులను గ్ర - మ్ముకవచ్చు తరుల
పెక్కువ యెంత యొ - ప్పిదమయ్యె నిచట!
మెఱుపు దంతములతో - మెఱయు నీమొగులు
తెర లేనుఁగల బారు - తీరున మించె!
పచ్చని పచ్చిక - పట్టుల లేళ్ళ
రచ్చలై వర్షధా - రలు మీఁదఁ గురియ
నిట్టి సంధ్యావేళ - నీక్షించు పాంథు
లెట్టుగా వేగింతు - రెటుదెల్లవాఱు? 2870

ఓయి సౌమిత్రి! మే - ఘోదయవేళ
నేయెడ జూచిన - నీనభోవీథిఁ
గదలెడు పుండరీ - క సరంబుఁబోలి
కదలిపోవు బలాకి - కాశ్రేణిఁ గనుము.
ఈ నేలఁ బచ్చిక - నెనసి మహీజ
సూనముల్ రాలియె - చ్చో నింద్రగోప
భాసురంబయి పట్టు - పైని పుప్పొళ్లు
రాసిగా రాలిన - రత్నకంబళ్లు
పఱచినగతి చిత్ర - పట్టాంబరములు
నెఱపినకైవడి - నెయ్యంబు వెనిచె!2880
నిదురింప తరియయ్యె - నీరజాక్షునకు
నదులకుఁ జెయిచాఁచి - నచ్చి వారాసి
సతులు మానధనంబు - సడలించి తారె
పతులఁ బైకొనునట్టి - పాళంబువచ్చె
నావులఁ గదిసె మ - హావృషభములు,
కావరించెను గీట - కాసరశ్రేణిఁ
బొలిమేర వనగజం - బులు చెలరేఁగె,
కొలగట్టుకొని వియో - గులనేఁచి మరుఁడు
వానరభల్లుకా - వళి చెలరేఁగె,
నేనుఁగులు నెమళ్లు - నెసకంబు లెసఁగె,2890
కైతక గంధమా - ఘ్రాణముల్ చేసి
గీతముల్ బాడె భృం - గీనిచయంబు
వానచేఁ బ్రాణంబు - వచ్చిన బొగ్గు
లానుక యున్నవో - యలరు దావులకు,
వ్రాలిన తేఁటులో - వాటియగ్రముల

వ్రేలు బండ్లోయన - వెలసె జంబువులు
వనభూము లవికల - స్వన ఖగవ్రాత
మునకెల్ల పానభూ - ములరీతిఁ దోఁచె,
పులుగులు తరుపర్ణ - పుటములయందుఁ
దొలఁకని వారి బిం - దువులు గ్రోలెడును2900
తేఁటుల మ్రోఁత తం - త్రీస్వనంబులుగ
పాటలు కోకిలా - పారనాదముగ
దారుణ గర్జ మ - ర్దళనినాదముగ
తారుచు నాడు పా - త్రలు మెఱుఁగులుగ
భూనభోంతరరంగ - మున దంపతులకు
మానసంబులను బ్రే - మము నించెనిపుడు.
ఒక్కట నదులు న - వోఢలో యనఁగ
జక్కవగుబ్బలు - జతఁగూడి నిక్క
తటనాగవల్లికా - దళములు తరులఁ
జిటులు పోకలు సూన - సీర్యత్పరాగ2910
పూరంబులను గంధ - వొడులు లతాంత
వారంబు కదళికా - వనదళగళిత
కర్పూర ఫలకముల్ - గైకొని చెలుల
నేర్పున జలపక్షి - నికరంబు రాఁగఁ
గనుఁగొంటివే వార్ధి - గదియంగఁ జేరె
పెనిమిటులెంతటి - ప్రియులు కాంతలకు
కారుచిచ్చులను ద - గ్ధములైన గిరులఁ
జేరినగతి నీల - జీమూతములను
నల్లనిమబ్బుల - నలుగడఁ గూడి
యల్లుకొన్న తెఱంగు - లందమై మించె.2920

వానకాళ్ళును జెలు - వము హెచ్చ విరియఁ
బూనియున్న కదంబ - పుష్పగుచ్ఛముల
తమ్ములపై నాడు - తమిమాని కొదమ
తుమ్మెదల్ విపినవీ - థుల వచ్చి వ్రాలె.
రాజులకెల్ల నూ - రటలు గల్పించి
తేజోభివృద్ధి దం - తిశ్రేణి కొసఁగి
సింగంబులను దరి - సీమలనుంచి
పొంగి యాడెడు కలా - పులఁ బ్రోదిచేసి
వనముల కెల్ల జీ - వనము గల్పించి
వనజాతములకుఁ జె - ల్వము గలిగించి2930
యిలకెల్ల నానంద - మిచ్చె నౌారౌర!
జలదాగమము ఋతు - స్వామి గావలయు!
వాహినీతతి పతి - వ్రతలు దారగుట
యూహించి ఘోషించె - నుదధియుఁ బోలి
తెరువరుల్ ప్రాణభీ - తినిఁ బోవరాక
తెరువులు వెదక న - దీకూలములను
పట్టముల్ గట్టు భూ- పతులకుఁ బోలి
దట్టంబులగు జల - ధర కలశముల
నగములనెల్ల ను - న్నతిఁ దీర్థమార్చె
నగవైరి యనఁగ వా - నలు విలోకింపు!2940
చెలువేది? దిక్కులు - చీకటుల్ గ్రమ్మ
తలచూపకున్నాఁడు - తపనుఁడు నేఁడు,
రాజులు తమపేరు - రమ్ముల మీఁద
రాజిల్లు ముక్తాస - రములుంచి నట్లు
సెలయేరు మొత్తముల్ - శిఖరభాగముల

వెలువడి తెల్లనై - విలసిల్లెఁ గనుము!
ఝరములు తటగండ - శైలభాగములఁ
బొరలి యాక్రిందఁ జ - ప్పుడుగాఁగ దుమికి
తరులందుఁ జెదరి ము - త్యపు వసంతములు
మెఱయించు బాగు సౌ - మిత్రి! వీక్షింపు2950
వరవిమానముల పై - వచ్చునచ్చరుల
సురతావసరముల - సురవీటిశ్రేణి
గేలిసేఁతలఁ బెరి - గిన తారహార
మాలికల్ వచ్చు క్ర - మంబు చూపట్ట
తేమలు మేమముల ను - దీర్ణమై వచ్చె
రమణీయవారి ధా - రాప్రపంచంబు!
కుటములఁ బక్షులు - గూండ్లు వీడుచును
పటుకలారావ మం - బరము నిండింప
జల్లగా వికసించు - సన్నజాజులను
పెల్లుబ్బ వాసనల్ - పృథివి నిండింప2960
నినుఁ డ స్తమించుట - యెల్లవారలకు
గనుపించె నిపుడు ల - క్ష్మణ! ప్రొద్దుగుంకె.
ఆమిక నిగమాధ్య - యనపరాయణులు
సామగానము సేయు - సమయంబు వచ్చె
గృహమేధులగువారు - గృహిపదార్థములు
గ్రహియించి మఱలి ర - గారంబులకును
బలశాలి కోసల - పతి భరతుండు
సొలవక యాషాఢ - శుద్ధపౌర్ణమిని
యుపవాసనియమ వ్ర - తోచితక్రియల
నిపుడుండు మనరాక - కెదుఱులు చూచి2970

మనలఁజూచి యయోధ్య - మనుజులందఱును
వినతులు సేయఁ బ - ర్వినమ్రోఁత యనఁగ
సలిలవేగంబుచే - సరయూప్రవాహ
ఘళఘళధ్వానమా - కర్ణింప దిగియె.
పగదీరి తన రాజ్య - పదవులు జేరి
మగువలగూడి నె - మ్మది నున్నవాఁడు
రాజీవహితకుమా - రకుఁడు జేసినవె
పూజలు! వాఁడెంత - పుణ్యమానసుఁడు?
ఇలనొడ్ల పాల్చేసి - యిల్లాలిఁ బాసి
యలమటలను బడి - యధముని రీతి2980
నిట్టుగా నొచ్చితి - నెంత పాపంపు
పుట్టువుఁ బుట్టితిఁ - బుణ్యహీనతను!
బలవంతమైనట్టి - పగయును నింత
యలజడిగావించు - నలజడివాన
తనమదిలోని ఖే - దము నింక నెట్టి
యనువునఁ దీఱునే - మనువాఁడ నింక?
"కపివీర! కిష్కింధఁ - గదలకయుండు
మిపుడని" యవకాశ - మిచ్చితిఁగాని
"యీ వేళఁ బోవుద - మెచ్చటనున్న
రావణాసురునిపై - రమ్మ"న నైతి 2990
అవదుల నొందినాఁ - డనియు నీవేళ
నవని దండెత్తరా - దనియు నేఁ జేయఁ
దలఁచి తా నిట్టి య - త్నము సమకూర్ప
బలవంతమున గాని - పాటిల్లదనియు
నెంచి "మీనగరిలో - నీ వుండు "మనుచు

నుంచితి నదియుఁ గా - లోచితంబగుట
నేఁజేయు నుపకార - మెంచి భానుజుఁడు
కాఁ జేయకున్నె నా - కామితార్థంబు?
తలఁతునే 'సుగ్రీవ - తటినీ ప్రసన్న
తలు' మది ధరణిసు - తాప్రాప్తి కొఱకు?" 3000
అని ఖన్నుఁడై యున్న - యన్నచందంబుఁ
గనుఁగొని మరల ల - క్ష్మణుఁ డిట్టులనియె,
"అయ్య! యెప్పుడు శర - దాగమంబయ్యె
నయ్యెడఁ దావచ్చు - నర్కనందనుఁడు
తాలిమిఁగైకొని - తాళుమీ వాన
కాలంబు సత్యసం - కల్పుఁడ వీవు,
యెల్లకార్యంబులు - నీడేరు"ననుచు
చల్లని మాటలు - సంప్రీతిఁ జేసి
కొన్నాళ్ళు వసియింపఁ - గువలయశ్రేణి

-: రామకార్యము చేయఁదగునని హనుమంతుఁడు సుగ్రీవునితోఁ చెప్పుట :-

చెన్నులుమీరె ప - చ్చికలింపుదీరె3010
మబ్బు వెల్వలఁ బారె - మంచుదైవారె
నబ్బురంబుగ మారుఁ - డమ్ములు నూరె
నా వేళ హనుమం - తుఁ డలఘుధీమంతుఁ
డావానరాధీశు - నల్లనఁ జేరి
కృతమాత్మఁ దలఁచి తా - నింగితం బెఱింగి
హితము విచారించి - యిది ధర్మమనుచు
మది నెంచి సమయక -ర్మము నిశ్చయించి
కదిసి యేమియు నెఱుం - గక మత్తుఁడగుచు

రేపగల్ తారాప - రీరంభ సుఖ స
మావహరాగర - సానందుండగుచు3020
నున్న యేలిక బుద్ధి - యును వివేకంబు
కన్నుఁగానమియును - గాంచి యిట్లనియె.
"నీతియు రాజ్యంబు - నీ సంప్రదాయ
భూతియు ఖ్యాతియుఁ - బొందితి వీవు
చెలిమి యేమరి యుండఁ - జెల్లదు తగిన
చెలికాని నెఱుగక - చే వదలుదురె?
చుట్టఱికము జేసి - సోఁకోర్చి వారి
పట్టున వలసిన - పనులఁ జేకూడి
యక్కరల్ దీర్పని - యధముల కేల
దక్కును? చిరకీర్తి - ధర్మసౌఖ్యములు3030
హితుని కార్యంబు నీ - వెన్నక కామ
రతుఁడవై యునికి మ - ర్యాదగాదిపుడు
వారలీపని సేయ - వలయు మాకనుచుఁ
బేరు కోనట మున్న - పిలిచి వానరుల
సీతను వెదకింపఁ - జేసిన ప్రతిన
సీతాప్రియుని మాడ్కి - చెల్లించుటొప్పు
రాముఁడు మిక్కిలి - ప్రాజ్ఞుండు శౌర్య
ధాముఁ డాయనమాటఁ - దలఁపకుండుదురె!
ఆయన కరుణచే- నాపదల్ దీరి
శ్రేయోభివృద్ధులు - చేకొన్న నీవు3040
నతని సీతను గూర్చు - నందాక మదిని
వెతమాలి యునికి వి - వేకంబు గాదు
కర్తవు మాకెల్లఁ - గావున నీకు

కర్తవ్యమైన మా - ర్గముఁ దెల్పవలసె
దేవగంధర్వదై - తేయాది సకల
జీవకోటులతోడ - సృష్టియంతయును
నొక్కతూపునఁ ద్రుంప - నోపు రామునకు
రక్కసు లెదురు వా - రా సంగరమున?
రావణుఁడన నెంత? - రఘువీరుఁడెంత?
కావలసిన జేయఁ - గావలెనన్న.3050
అతని కార్యమునకు - నరమర లేక
హితము సేయుట నీకు - హితమైన తెఱఁగు.
ఇహపరంబుల యతఁ - డేకాక నిన్ను
వహియించుకొని ప్రోచు - వారలుం గలరె?
కావలెనని నీవు - కట్టడ సేయ
లేవుగా కెందఱు - లేరు సాధకులు?
సీతను దివియందు - క్షితిమీఁద జలధిఁ
బాతాళమున డాఁచి - పదిలంబు జేసి
యుంచిన వెదకి తే - నోపుదు మేము
మించనాడుటగాదు - మీచిత్తమెఱుఁగుఁ3060
బిలిపించి పనుపుము - పృథివిపై వెదకఁ
గలవారి జవశక్తిఁ - గలవారి నెనరు
గలవారి నమ్మిక - గలవారి నేర్పు
గలవారిఁ గీశపుం - గవుల నేర్పఱచి.”
అనిన పావని పావ - నాలాపములకు
మనసులో నలరి స - మ్మతమంది మెచ్చ

-: సుగ్రీవుఁడు హనుమంతుఁడు చెప్పిన ప్రకారము సీతను వెదకుటకు నీలున కాజ్ఞాపించుట :-

నీలునిఁ బిలిపించి - "నీ వీక్షణంబ
భూలోకమునఁ గల్గు - భూరిసాహసుల
కపులను దగిన లే - ఖలు వ్రాసి కార్య
నిపుణులౌ వేగు మా - నిసి ముఖంబులను 3070
దమదమ మూఁకలఁ - దమసాధనములఁ
దమచుట్టములతోడఁ - దవిలి రమ్మనుచుఁ
బనిచి దప్పింపుము - పడవాళ్ల విలువ
పనిపూని యిచటికిఁ - బదియేనునాళ్ళు
వచ్చినవారెల్ల - వచ్చిరి రాక
యెచ్చోట నాయాజ్ఞ - యెఱుఁగనివారు
ఒకనాఁడు దప్పిన - నుసురు గాలముల
సకలవానరులు మె - చ్చఁగవైతు వాని
కొండలు వనముల - గొలిపించు కొనక
నిండు పంటలతోడ - నిలువఁ బూజ్యముగఁ3080
బుట్టాప్తి సంబళం - బుల కెచ్చుగాఁగ
కట్టడ చేసి మా - కార్యాంతరముల
రమ్మన్న వేళకు - రండన్ని నాళ్లు
నెమ్మది మీయిండ్ల - నెలఁతలఁగూడి
యురకపసా పడ - కుండడంచేను
గరిమతో బహుమాన - గతినడిపింప
నీ కార్యమునకు రా - కెందుకు వారు
నాకు? బొమ్మంగదు - నకు వినిపించి

యతని యొప్పవుకమ్మ - లన్ని దిక్కులకు
నతిశయంబుగఁ బంపు" - మని సెలవిచ్చి3090
యంతిపురంబున - కరిగిన నీలుఁ
డంతయుఁ దెలియఁ దా - రాత్మజుతోడ
విన్నపం బొనరించి - వేగులవారి
నన్నిదిక్కులకుఁ బొం - డని పంపునంత

-: శరదృతు సమాగమము - రాముఁడు సీతావియోగమునకై దుఃఖంచుట :-

ఆవేళ రాఘవుం - డంబుదాగమము
తావల వంతలు - దరిచేర నిండి
శరదవసరమైన - చదలెల్ల మిగులఁ
బరిశుద్ధముగ మేఘ - పటలంబు విరియఁ
బిండి చల్లినయట్లు - పృథివి దట్టముగఁ
బండువెన్నెలలు ని - బ్బరముగాఁ గాయ3100
నెడవాయు జనకజ - నింటిలోఁ దనదు
పడఁతులతో నెడ - వాయక యున్న
భానుజుఁ దనవెంటఁ - బడిపోరుచున్న
నూనసాయకుఁ దలం - చుక యోర్వలేక
పరవశుఁడై చాల - భ్రమసి వివేక
పరుఁడయ్యు మదినిల్వఁ - బట్టఁగ లేక
తులకించు హేమధా - తు విచిత్రశిఖర
తలమున వసియించి - తమకంబు వెంచి
సారసపక్షి ఘో - షములఁ జెన్నొందు
శారదాకాశ మి - చ్ఛ గలంగఁజేయ3110

నాయంచ నడపుల - నవనిజం దలఁచి
“హా!" యని పలవించి - యరఁగన్ను మొగిచి
తెలివిడి నొంది "యే - తీరున సీత
మెలఁగునో తనుబాసి?" -మించు సంపెంగల
కొమరు గాంచిన కొండ - గోగులం జూచి
"కమలాక్షి నెన్నడు - గందునో యేను?"
జక్కవల్ రొదసేయ - జానకి వినినఁ
బొక్కవే చెవులు నా - పొంతలేకునికి?
ఈ సానువులు గిరు - లీ కందరంబు
లీ సరోవరము లే- నేవేళఁ జూచి 3120
యోర్తునే జాసకి - యొద్ద లేకున్న?
నేర్తునే నామది - నిలుప ధైర్యంబు?
మెత్తన జనకజ - మే నంతకన్న
మెత్తన మనసెట్లు - మీనాంకు చేతి
రాయిడి కోర్చునో - ప్రాణముల్ వట్టి?
ఆ యింతితోడివే - ప్రాణముల్ తనకు!”
అనుచుఁ జాతకము జ - లాపేక్ష చేత
వనదంబుఁ దలఁచు - వగచిన యట్ల
సీతఁ దలంచుచు - శ్రీరామవిభుఁడు
చేతోభవుని మాయ - చే గట్టువడియె. 3130

-: లక్ష్మణుడు శ్రీరాము నోదార్చుటకు మాటలాడుట :-

అటమున్న సౌమిత్రి - యా నగోపాంత
విటపంబులను ఫల - వితతియుఁ గంద

మూలముల్ గొనుచు రా - ముఁడుఁ దదుపాంత
శైలాగ్రమున నొంటి - జానకిఁ దలఁచి
కన్నీరు రాల్చుచోఁ - గని చేరఁబోయి
యన్నకు మ్రొక్కి తా - నంజలి చేసి
హితమును వినయంబు - నెఱుకయుఁ దోఁపఁ
జతురవాచావిశే - షమున నిట్లనియె.
"దేవ! నీయంతటి - ధీరమానసుఁడు
లావున శౌర్యవి - లాసంబు మఱచి3140
చింతల్ల నిందేమి - చేకూరె! నేల
యింతటి యార్తి? ని - -న్నెఱిఁగి వర్తిలుము
మది ప్రసన్నతయు నే - మఱకకార్యంబు
వదలకుండుటయు నే - వలన ధైర్యంబు
దలఁచినపని సేయఁ - దగిన కాలంబు
బలములఁ జేకూర్చి - పగఱనోర్చుటయుఁ
దగునెట్టియెడ దేవ - తాప్రార్థనములు
దగు గాక యిట్టిచోఁ - దగ వౌనె వగవ?
నిను వరించిన యవ - నిజ నొక్కఁడంటి
తునియక తనమేని - తో నుండగలడె!3150
పావక జ్వాలిక - పట్టినకేలు
లా వెల్లఁ బొలిసి కా - లక నిల్వఁగలదె?
ధరఁబగ సాధించు - తరిగాని యిపుడు
తరిగాదు మనను కొం- దలమందఁ జేయ!
ఆనతీయగఁ దగు - నది పల్కుఁడనిన
జానకీవిభుఁడు - లక్ష్మణున కిట్లనియె.

-: శ్రీరాముని ప్రత్యుత్తరము - శరదృతు వర్ణనము :-

ఇలజీవకోటుల - నెల్లను దృప్తి
వెలయించి సుఖియించె - విబుధనాయకుఁడు
తనయందు గలవారి - ధారలు గురిసి!
వనదముల్ చాలించి - వ్రాలె నూరటను3160
జలదభీకమయూరి - ఝరసామజములు
సలలితారావ మె - చ్చట లేక యణఁగె,
ధారాళవర్షాంబు - ధౌతంబులగుచు
గౌరగౌరములై న - గంబులు వొలిచె
యేడాకరంటుల - నెనసిన పొరల
గూడు కప్పురపు రే - కులనొకకొంత
కళుకుచుక్కలఁ గొంత - కలువలరాజు
కళలందు నొక కొంత - కమ్మని బొండు
మల్లెల నొకకొంత - మార్తాండు నందు
వెల్ల దమ్ములఁ గొంత - వితరణప్రౌఢిఁ
దనకల్మి పంచి యం - దఱియందు నుంచి
కనిపించుకొనె శర - త్కాలవాసరము!
శరదవసరమున - సారసశ్రేణి
విరిసె భానుని కరా - విర్భూతి వలన!
కపురంపునెత్తావి - కడలందు నుడిసి
రపముతో మకరంద - రసములు గ్రోలి
ఘుమ్మను తుమ్మెద - కొమ్మలచాలు
గమ్మన మొరయు మం - గళగానములకు
వీనులు చొక్కఁగ - విని మేనులుబ్బి
దానధారలు సము - త్కటముగాఁ గురియఁ3180

బొలయుచుఁ గరులున్న - పొంకంబుఁ జూడు!
చలదద్రులన మీఱె - శారదవేళఁ
దామరపుప్పొడి - దడియు ఱెక్కలను
సాములు మట్టిని - చల్లు కొన్నట్లు
తనువులపై నంట - దరలహంసములు
పెనఁగెడు జక్కవ - పిలుకలఁ నరిమి
తొలగని హంసికిం - దూఁడు లందించి
మెలఁగు చెల్వము లెంత - మెచ్చొదవించె!
సెలయేటి కెలని ప - చ్చికల మచ్చికలఁ
దలఁక యాలమం - దల విలోకింపు3190
మాకాశమున నిసు- మంతయు మబ్బు
లేకున్న నెడబాసి - లేమ నీవేళ
పురివిచ్చఁబోయినం - బురి విచ్చలేక
తొరగఁగన్నీరు మూ - తులు విరియించి
కుత్తుకల్ పల్లకీ - కొమ్మలఁ బోలి
యత్తరి మువ్వంక - లై సాగిలంగఁ
గేకల రాక యీ - కేకులు వోవు
పోకలు చూడు మి - ప్పుడు వియోగముల!
కుచభారముల వ్రాలు - కొమ్మలు వోలి
యిచటి భూరుహముల - నెల్ల కొమ్మలును3200
పూపు గుత్తులభరం - బులనసియాడు
తీవెలు బెనఁగొన్న - తీరుచూచితివె!
కరిణిఁగొనక యల్ల - కరి సరోవరము
దరిఁజేరి సలిలంబుఁ - ద్రావంగ మఱుచి
యూరట లేకయే - నున్న చందమున

నారటంబునఁబొందు - నది విలోకింపు!
చికిలి చేసిన కత్తి - చెలువునఁ జూడు
మకలంకమయ్యె నీ - యాకాశ మిపుడు.
అలఘునదీప్రవా - హంబులు దరిగి
వెలుతులయ్యెను కూల - విసరంబులకును!3210
కలువలపై నున్న - కమ్మనెత్తావి
గిలుబాడివచ్చె ద - క్షిణగంధవహుఁడు
అర్కుని వేడిమి - నడుసెల్ల నెండి
కర్కశత్వంబులు - గనియె మార్గములు.
గర్వితారుల గెల్వఁ - గా విచారించు
నుర్వీశ్వరులకు ను - ద్యోగముల్ గలిగె.
నీరంధ్రవృష్టిచే - నెమ్మేని దుమ్ము
వారించి వృషభముల్ - వడి ఱంకెలిడియె.
పెంటి యేనుఁగులపైఁ - బెరిగిన బాళి
వెంటాడి క్రీడించు - విపినవీథులను.3220
నీరాస వికచాబ్ద - నికరస్రవంతిఁ
జేరి యంచలబారు - చెదరిపోఁద్రోలి
గళగళధ్వనులతోఁ - గరములనిండ
జలములు వట్టి వి - చ్చలవిడిఁ ద్రావి
యురముల శిరముల - నురు ఫూత్కుృతులను
విరళాంబువులు జల్లె - వేదండకోటి.
వసివాళ్లు వాడుచు - వాల్మీక గోళ
విసరరంధ్రంబులఁ - వెడలి యన్నియును
వానలచేఁ గరు - వలిఁ గ్రోల రాక
మేనులు డస్సి భూ - మికి వెలువడుచు 3230

విషములు గ్రక్కెడు - వివృతాస్య భీమ
విషధరంబులను భా - వింపు మెల్లెడల.
పరిపూర్ణచంద్రబిం - బవికాసముఖము
సురుచిరనక్షత్ర - శుభలోచనములు
చంద్రికాధవళవ - స్త్రంబును మీఱ
చంద్రాస్యగతిని ని - శాలక్ష్మి మెఱసె!
కారుపోతుల బారు - గంటివె కోవ
దీరిచినటుల నెం - తే పోతరించి
నీలవర్ణములఁ బం - డిన రాజనంపు
చేలలో మేసి వ - చ్చె వనాంతములకు. 3240
ఒక యంచ నిదురింప - నుత్పలశ్రేణి
వికసింపఁ జూడ్కికి - విందుసేయుచును
హరిణాంకతారాస - మన్వితనభము
కరణిఁ జూపట్టె - కాసార మిపుడు.
అడుగులఁ దొడిగిన - యందెలమ్రోత
కడల హంసముల క్రీం - కారముల్ గాక
కడవోక విరిసిన - కైరవశ్రేణిఁ
దొడవులు గాగ ని - ద్దురపోవుచున్న
ముక్కులు విరియని - మొగడ తామరలు
మొక్కచన్నులు గాఁగ - ముందఱనున్న3250
నడబావిఁ గంటివె - నారీలలామ
వడువున మిగులఁ జె - ల్వము గనుపట్టె.
జీర్ణవైణవరంధ్ర - ఝీంకరణంబు
కర్ణామృతరసంబు - గా విని జొక్కి
మేపులు మఱచి యీ - మృగసమూహంబు

చూపట్టె సౌమిత్రి! - చూడుమిచ్చోట.
చూచితె కాశప్ర - సూనగుచ్ఛంబు
లీచాయ వెలిజల్లు - లెత్తించినట్టు
లారఁగట్టిన చీర - లన సెలయేటి
యోరలఁ దెల్లనై - యున్న చందంబు3260
మదిరాసవోన్మత్త - మదవతీమణులఁ
గదిసి క్రమ్మరు కాము - కశ్రేణిఁ గనుము.
ఎంత తేటలు వుట్టె - నీవేళ వాగు
వంతలన్నియు శర - ద్వాసరమహిమ
బెళుకు బేడిసలును - బెరిగిన నాఁచు
జలరుహమ్ములు నక్ర - చయమును గలిగి
నీటైన చూపులు - నెఱివంకకురులు
తేటమోములు నవ్వుఁ - దేఱు చెక్కులును
గాఁగ నీనదులు న - ల్గడ తెరచాటు
మూఁగు నప్పుడు మేలి - ముసుఁగులతోడి3270
రమణుల వదనవి - భ్రమవిలాసముల
నమరెను శరదాగ - మారంభవేళ.
కొండగోఁగుల తేనె - గ్రోలి మొగుడ్చు
పుండరీకములకుఁ - బోక దింటెనల
వ్రాలెడు తుమ్మెదల్ - వలరాజు గెలుపు
పాలించవచ్చిన - భాగ్యదేవతలు
ఈపంప చెంగట - నెఱిఁగించె వినుము.
రేపుమాపులు కుర - రీసమూహంబు
సైకపుచీరలో - జఘనంబు దోఁచు
రాకేందువదన తె - ఱంగుచూపట్టి3280

యిసుమంత గనుపట్టు - నిసుముదిన్నెలను
పసమీరెఁ జూడుమీ - పంపాస్రవంతి
జడివాన లుడివోయి - శరదవసరము
పొడచూపె దండెత్తి - పోవురాజులకు,


-: శ్రీరాముఁడు లక్ష్మణునితో సుగ్రీవుఁడు తమ కార్యము మఱచినాఁడని తెలిపి, కిష్కింధకుఁబోయి యాతనికి చెప్పవలసిన మాటలను చెప్పుమనుట :-

ఇది వేళయని మది - నెఱిఁగియు రాక
మదిలోన మనల నే - మఱి భానుసుతుఁడు
నూరక నగరిలో - నున్నాఁడు తనకు
నూఱేండ్లుగా దోఁచె - ను నిమిషమైన
వనములలో చక్ర - వాకంబుఁ గూడి
చను జక్కవమిటారి - చాడ్పున సీత3290
నావెంట రాఁగ ని - న్నాళ్లు నుద్యాన
భావమై యుండె నీ - భయదకాననము
ఇలయేల నొల్లక - యిల్లాలిఁ బాసి
కలఁగుచునున్న నా - గతి విలోకించి
దయఁ జూడఁదగుఁగాక - తనవంటివాఁడు
నియతి యేమఱియుండు - నే నన్ను మఱచి?
తనవంటి యాశగా - దా వీరిదనుచుఁ
గనలేక యున్నాఁడు - కాముకుండగుచు
వానకాలము దీర్చి - వత్తువుగాక
వానరబలముతో - వలదిప్పుడనుచుఁ3300

బొమ్మంటి నిపుడైన - భూమిజ వెదకఁ
బొమ్మని కపికోటి - బుత్తేరఁడయ్యె!
కిష్కింధ కేఁగి వా - కిట నీవు నిల్చి
ముష్కరు మూర్ఖుని - మూఢు సుగ్రీవు
నచటికిఁ బిలిపించి - యనఁదగినట్టి
వచనముల్ నేనన్న - వాఁడగాఁ బలికి
యుపకారమునకుఁ బ్ర - త్యుపకార మెవ్వఁ
డుపమించి సేయక - యుండునో వాఁడు
ఎందుకుఁ గొఱకాని - హీనుఁడటంచు"
నందఱు ననుకొందు - రని పల్కుమీవు. 3310
తగిన కార్యమునకుఁ - దగినట్టి పనికి
తగవుపల్కిన పల్కు - తప్పరాదనుము.
ఒరులచేఁ దనకు మే - లొదవిన మేలు
మఱచినట్టి కృతఘ్ను - మాంసరక్తములు
నంటక రాక్షసు - లైన రోయదురు!
కంటగింపుచు నని - కనిపించుకొనుము.
వినవలతువొ రఘు - వీరు కోదండ
ఘనతర జ్వావల్లి - కారవమనము.
తాళభేదనము ఖా - ద్య ములైన క్రియల
చాల రాఘవుఁ బరీ - క్షగొనంగ నేర్చి3320
వాలిఁ జంపించిన - వాఁడవు మఱచి
స్త్రీలోలమతినున్నఁ - జెల్లునే యనుము.
ఆడుమన్నటులెల్ల - నాడి నీ సేయు
కోడిగంబులకు లొం - గుచుఁ జెల్మి చేసి
యిచ్చకమ్ములు వల్కు - టెల్లను సీతఁ

దెచ్చెద వనుట గా - దే యంచు ననుము.
కలుద్రావువాని వై - ఖరి మేను మఱచి
తొలఁగి మంత్రుల గూడి - దొరవైతి ననుచు
భోగించెద నటన్న - భోగభాగ్యములు
సాగనీయదు రామ - సాయకంబనుము3330
ఏనేమి యంటినో - యివి దాఁచబోక
వానితో గట్టిగా - వాకొని రమ్ము
వాలి నేసినయట్టి - వాలిక తూపు
పోలేదు తూణీర - ముననున్నదనుము.
మీ యన్నఁ జంపి పం - పినత్రోవలోనె
వేయు నేఁటికి ముండ్లు - వేయ లేదనుము,
వాలి నొక్కనిఁ జంపు - పగగాదు నిన్ను
బాలక గురు వృద్ధ - బంధులతోడ
వానరకులమెల్ల - వధియింప కేము
మాన మొక్క నిమేష - మాత్రలో ననుము. 3340
ఆనాలి వోయిన - యట్టి మార్గమునఁ
బోవ నేఁటికి నీవు - బుద్ధిమంతుడవు
తగవు ధర్మమ్ము స - త్వము శాశ్వతంబు
లుగ నెంచి సత్కీర్తు - లు గడించికొనుము.
ఏటికి యమపురి - కేఁగంగ నీకు?
మాట వాని .. డించి - మనుటలే లెస్స.
అని హితంబు భయంబు - ననునయంబొప్పఁ
గనిపించి పలికి వే - గమె తోడి తెమ్ము
పొమ్మని" పలుకు నప్పుడు - రాము జూచి
సమ్మతంబమర ల - క్ష్మణు డిట్టు లనియె.3350

-: లక్ష్మణుఁడు సుగ్రీవునిఁ జూడఁబోవుట :-

స్వామి! సుగ్రీవుఁడు - సన్మార్గవృత్తి
మేమఱి తన యొడ - లెఱుఁగక క్రొవ్వి
యధికప్రయత్న సా - ధ్యంబైన రాజ్య
మధముఁడై కర్మఫ - లానుభవమునఁ
బోనాడుకొని చెడి - పోవు యత్నంబు
తో నున్నవాఁడు కోఁ - తుల కేది బుద్ధి?
మనప్రయోజన మాత్మ - మఱచి తానున్న
......... వాఁడు - మదిఁగాన లేఁడు!
కాముకుఁడై వీడు - గర్వాంధుఁ డగుచు
స్వామికార్యము మాని - సతులనుగూడి 3360
యీయెఁడ గడు గుణ - హీనుఁడై యుండ
నీయ వచ్చునె రాజ్య - మిట్టి యల్పునికి?
వాలి వెంటనె పంప - వలెగాని వీనిఁ
దాలిమి పుట్టదు - తనదృష్టి బడిన!
వాని జంపక రా న - వశ్యంబు నాదు
పూనిక మది నిక్కం - బుగఁ ......
కట్టెద నంగదుఁ - గపిరాజ్యమునకుఁ
బట్టంబు వాని చే - బట్టుదు లెస్స!
వానరులను బిల్చి - వాఁ డుర్విమీఁద
జానకీదేవిని - సాధింపఁగలఁడు3370
ఇదె పోవుచున్నాఁడ - నే” లని విల్లుఁ
బొదులును దాల్చి గొ - బ్బున బోవువానిఁ
దమ్మునిఁ జూచి శాం - తరసాంబురాశి
క్రమ్మర రాఘవా - గ్రణి దయఁ బలికె

“నీవు ధార్మికుఁడవు - నేఁడేమి కీడు
గావించె మనకు భా - స్కర కుమారకుఁడు?
అతని మీఁదట నేల - యనిమిత్తమైన
యతిశయక్రోధ మి - ట్లాడనేమిటికి?
నీమదిఁ జూడగ - నే నిట్టులంటి
నామాటలకు నీవు - ననుసారివైతి 3380
మనము వెట్టన చెట్టు - మనరట్టు చెఱుపఁ
బనుప వాలితమ్ముఁడు - సాధారణుండె?
ఇడుములఁ బడువాని - నింటెనంపి
గడవు దప్పెనటంచుఁ - గరుణ దప్పుదురె?
మితము మీరిన నేమి? - మెల్లనే పిలిచి
హితముగాఁ బలికి వ - హించుకొన్నట్టి
కార్యంబు తన్నదైన - కారణంబు నొక్క
పర్యాయముగ నెంచి - పని....నవ..యు
కాక యిట్లుందురేని - కావునవానిఁ
జేకొని బుద్ధిగాఁ - జెప్పరమ్మనుచుఁ 3390
జను”మన్న నప్పుడే - సౌమిత్రి కదలి

—: లక్ష్మణుఁడు కోపముతో వచ్చుచున్నాఁడని యంగదుఁడు సుగ్రీవునకుఁ దెలుపుట :—



కినుక మోమునఁదోప - కిష్కింధకడకుఁ
జనునెడ వైశాఖ - శైలంబు మీఁదఁ
గనుపట్టు నింద్రుని - కార్ముకం బనఁగఁ
దనచేత హేమకో - దండం బుపాంత
వనముల కపరంజి - వన్నువ వెట్ట

(పాఠం అస్పష్టం)

నామాట విని మంత్రు - లందఱుఁ గూడి
యేమరిపాటొక్క - యింతయు లేక
శతసహస్రమధేభ - సత్త్వవానరుల
శతబలిగజతార - శరభ ముఖ్యులను
మూఁకలతోఁగూడి - మొనసేయఁ బనుప
నాకసం బగలించు - నట్టహాసముల
వారెల్ల కిష్కింధ - వాకిట నిలిచి
భూరుహంబులు నగం - బులు బెల్లగించి
కరములఁ గీలించి - గవనులు మూసి
మరగుల గోట కొ - మ్మల నిండ బలిసి3430
వాలమ్ము లార్చుదు - ర్వారవిక్రముల
శైలసన్నిభుల ని - శాతదంష్ట్రులను
నతిశూరులను వికృ - తాకారయుతుల
జితదానవులఁ గపి - -శ్రేష్ఠులఁ జూచి
యాలక్ష్మణుఁడు కోప - మగ్గలింపంగ
వాలితమ్ముఁడు తమ్ము - వంచించుటయును
నతని వారలు తన్ను - నరికట్టఁ దలఁచి
ప్రతికూలులై కోట - బలిసి యుండుటయు
రామఁడు విరహభా - రంబుచే నోర్వ
లేమియు దలఁచి తా - లిమి లేక కనలి3440
కాలాగ్నికల్పుఁడై - కన్నులయందు
కీలికీలలు గ్రమ్మఁ - గిటకిటఁబండ్లు
గీటుచు నూర్పులు - గరలఁ గోదండ
గోటితో శింజిని - గూర్చి యమ్మేర్చి
శరజిహ్వికలు శరా - సనశరీరంబు

సరిలేని తేజోవి - షంబును గలుగు
సౌమిత్రి పంచాస్య - సర్పంబు క్రూర
మైమించి కిష్కింధ - యగ్రభాగమునఁ
జేతులు మొగిచి ని - ల్చిన వాలిసుతునిఁ
బ్రీతుఁడై రమ్మని - పిలిచి యిట్లనియె3450
"మనపురంబునకు ల - క్ష్మణుఁడదె వచ్చి
తనరాక మీకు నెం - తయుఁ దెల్చుమనియె
ననుచు భావజునితో - ననుము పొమ్మ"నుచు
బనుప నంగదుఁడును - బరువున వచ్చి
రవిసూనుతో నత్తె - ఱంగుఁ దెల్పుటయు
నవివేకమును నిద్ర - యలసభావంబు
మదమత్తతయును మ - న్మధవికారంబు
పదవిచే నగుక్రొవ్వు - పైఁబడి యుండ
నామాట వినక మా - రాడక యతఁడు
తామసప్రకృతి ని - ద్రవహించి యున్న3460
వాకిట గావలి - వానరుల్ గూడి
మూఁకలై లక్ష్మణు - ముందుఱనిల్చి
కిలకిలాశబ్దాను - కృతినుతుల్ సేయ
బలుమ్రోత పిడుగులు - పడినచందమున
నవని యంతయు నిండ - నమ్మహారవము
రవితనూజుని కర్ణ - రంధ్రముల్సోఁక
దిగ్గిన లేచి యు - దీర్ణభావమున
నగ్గలిక "న దేఁమి - యార్భట" యనిన
బరువుతో వచ్చి ప్ర - భావస్వదక్షు
లిరువురు మంత్రులా - యిననూనుఁ జూచి3470

“అయ్య! మహారాజు - లైనట్టివారు
నెయ్యం బపేక్షించి - నినుఁ జేరువారు
రామలక్ష్మణులు వి - క్రమకళానిధులు
భూమియంతయు నేలు - పోడిమివారు
ఈరాజ్యసుఖము నీ - కిచ్చినవారు
వారిచర్యలు మఱు - వఁగఁ దగునయ్య?
అన్న పంపఁగ సుమి - త్రాత్మజుఁ డిప్పు
డున్నాఁడు వచ్చి పు - రోపకంఠమున
బాణబాణాసన - పాణియై సితకృ
పాణియై యున్న య - ప్పరమసాహసుని3480
గపులందఱును జూచి - గడగడ వణఁకి
యిపుడు సన్నుతి సేయ - నీ ధ్వని వుట్టె”
ననుచు నింద్రసమానుఁ - డైన సుగ్రీవుఁ
గనుఁగొని పలికి “యో - కపిలోకనాథ!
ఆలాపసారథి - యాత్మీయకార్య
కేళీరధంబు మి - క్కిలి జతచేసి
యమ్మహారథవర్యుఁ - డంగదుఁ బిలిచి
పొమ్మన్న మీకు దె - ల్పుటకునై వచ్చి
నతఁడు చూపులచేత - నగచరావళిని
హుతవహువలె నేర్చ - నూహించినాఁడు3490
నీవు బాంధవులతో - నేఁ డెదురేఁగి
యావీరవరుని స - మర్చనల్ చేసి
వారువచ్చిన రాక - వారితో మీరు
మీఱిపల్కిన మాట - మేకొని తీర్చి
కని కొల్వుఁడన విని - కమలాప్తసుతుఁడు

తనమంత్రివరుల నం - దఱఁ జూచి తగవు
గురులఘుత్వమ లన్య - గుణ గౌరవంబుఁ
బరికించి తానున్న - పట్టెమంచమున
నుండక దిగువఁ గూ - ర్చుండి వివేక
పాండిత్య శాలియై - భానుజుఁడనియె. 3500


-: సుగ్రీవుఁడు లక్ష్మణుడు వచ్చిన కార్య మడుగుట :-

"రామున కేను నే - రము సేయలేదు
తామసింపను మితిఁ - దప్ప మేమఱచి
యేమి నిమిత్తమై - యింతకోపమున
సౌమిత్రి వచ్చె నే - సదనంబుఁ జేర
నెవ్వరేనియు వాలి - హితులు వంచించి
దవ్వుల నేనున్కి - దగనివాఁడనుచుఁ
జెవిసోఁక కొండెముల్ - చెప్పిరో కాక
చెవులె కన్నులుగదా - క్షితిపాలకులకు!
అతఁడు స్వకార్య ప - రాయణుఁడగుట
హితమతి మీకార్య - మీ డేర్తుననుచు3510
నానమాట యొకింత - యాడినజాలు
దోసమెంచక యొక్క - తూపు సంధించి
పంతగించిన యట్ల - పడవేసెనేని
చింతించి యామీఁదఁ - జేసెడి దేమి
నామాట వినియొక్క - నారాచ మేర్చి
రాముఁడు వాలి నూ - రక చంపలేదె?
ఎవ్వఁడెఱుంగు? నా - కీరాజ్య మేల?
దవ్వులఁ బ్రాణముల్ - దాఁచి యుండెదను

చెలిమి చేసిన నది - చెడకుండ నేర్పు
గలిగి మెలంగ దు - ష్కర మెవ్వరికిని! 3520
సరిపోదు నాకు ల- క్ష్మణుఁ డాగ్రహించి
శరశరాసనములు - సవరణ నేసి
వచ్చినప్పు డొకఁడు- వలె దోఁచె మీకు
నిచ్చఁ దోఁచి, బుద్ధి - యెఱిఁగింపు డిపుడు
దోషమేమియును లే - దు మదాత్మయందు
నీషద్భయంబైన - నేఁటికి నాకు?
వారల యెడనైన - వారొక్క రేల
ధారుణి నొరుల చి - త్తము లెవ్వ డెఱుఁగు?
మనసులు నిలుకడ - మానిన వగుట
మనకిట్టచో నను - మానింపవలసె" 3530

—: హనుమంతుఁడు సుగ్రీవునకు హితము చెప్పుట :—



అనుమాట వినిచేరి - హనుమంతుఁ డపుడు
వినయంబుతోఁ గపి - విభుఁ కిట్లనియె.
"ఇది యేమి యరదు? నీ - వింగితజ్ఞుఁడవు
మది నుపకారంబు - మఱచి యుండుదువె?
నీనిమిత్తము వాలి - నిఁ బ్రతాపశాలి
జానకీవిభుఁ డొక్క - శరముచే నేసె
తనవాఁడవని నిన్నుఁ - దలఁచి రాఘవుఁడు
కినిసి లక్ష్మణుఁ బంపెఁ - గిష్కింధ కపుడు
కినుక యేమిటికన్న! - కృతమాత్మ నెఱిఁగి
యును శరత్కాల మ - భ్యుదయంబు నొందె. 3540

మత్తుఁడవై వారి - మఱచితిగాన
క్రొత్తయే నీమీఁదఁ - గోపించికొనుట?
కాలజ్ఞుఁడవు వివే - కము లేనియట్టి
పాలసుఁడవు గావు - బలశౌర్యనిధివి
యరుల సాధింపఁగ - ననువైన యట్టి
తరివచ్చియును నీవు - తలఁపక యున్న
నూరక తమ రేల - యుందురు? వారి
నేరమే యిది? నీదు - నేరమిగాఁక
ఇంటిని గోలుపో - యినవారిమీఁద
నెంతయు దయవలె - నింతియే కాక 3550
సరకు సేయక ముపే - క్షాబుద్ధి నున్న
దొరవైన నైతివి - దోషంబుగాదె
తప్పునకై పోయి - దండమర్చించి
చెప్పిన బుద్ధులు - శిరసావహంచి
పనుపు సేయుట మంచి - పని ప్రధానులకు
కనిపించుకొని యంత - గదిమి చెప్పినను
నది హితం బుచితంబు - నగుగాన యేను
మదిశంక లేక యీ - మాట లాడితిని
వారు గోపించిన - వలదని మాన్పఁ
దీఱుననుచు నెంచి - తే? నిల్వగలమె? 3560
పాఱిపోనేర్తుమొ? - పాఱెదమనిన
వారు వోనిత్తురొ? - వలవ దీభయము
ప్రతికూలుఁడే రఘు - పతి? మన కతఁడె
గతి! సదేవాసుర - గంధర్వమైన
జగ మెల్ల నొకతూపు - సంధించెనేని

నిగురు సేయు నతండు - నిమిషంబులోన!
అదిగాక నీకునా - యన చేసినట్టి
విదితోపకారంబు - వీటి బోనాడి
పొరద్రోవలను నీవు - పోయిన వారు
విరసింతురటు గాన - వినుము నాబుద్ధి.3570
రాజశాసనమతి - క్రమము జేసితివొ?
స్వామికార్యముల వం - చన జేసినావొ?
కల్లలాడితివొ? సం - గరములో విడిచి
యిల్లు చేరితివొ? నీ - కేల యీతలఁపు?
ఇంటికి వచ్చిన - నెవ్వారినైన
వెంటబెట్టుకరాని - వీఱిఁడి గలఁడె?
రప్పింపు పూజింపు - రామునితమ్ము
డప్పుడు మనమీఁద - నలుగఁడేమియును.”

—: అంగదుఁడు లక్ష్మణుని సుగ్రీవుని యొద్దకు దోడి తెచ్చుట :—


అన విని తారా స - హాయుఁ డంగదునిఁ
గనుఁగొని “నీవు ల - క్ష్మణుఁదోడి తెమ్ము3580
వేగంబె చను”మన్న - విని వాలితనయుఁ
డాగుణనిధి నూర్మి - ళాధీశుఁ జేరి
ప్రణమిల్లి “నగరిలో - పలికి విచ్చేయుఁ
డణిమాదులైన య - ష్టైశ్వర్యములను
మీరిచ్చినవి వచ్చి - మీరుచూచినను
శ్రీరాము కరుణ నూ - ర్జితములై వెలయు!
రండు! మాపినతండ్రి - రమ్మనె మిమ్ము.

ఉండనేమిటికి పు - రోపాంతసరణి"
అనిన సుగ్రీవుపై - నలుక యంగదునిఁ
గనుఁగొన్న కరుణయుఁ - గడలేక యుండ3590
మాఱు మాటాడక - మర్కట సైన్య
వార మంగదుని క్రీ - వల గొల్చిరాఁగ
వాలి సూనుని వెంట - వచ్చె సౌమిత్రి
నీలమేఘంబులు - నిలిచిన కరణిఁ
గిరులు వనంబులు - దాఁటి సుగ్రీవ
పరిపాలితంబైన - పట్టణంబునకు
మేరుకైలాసోప - మేయంబు లగుచు
భూరిరాజిత సౌధ - ములు మిన్నుముట్ట
కరుణనింద్రుఁ డొసంగు - కామితఫలద
తరుకోటి యరకట్ల - తలఁపు పుట్టింప3600
విపణిమార్గంబుల - వివిధవస్తువులు
నపరిమితంబులై - యబ్బురపఱుపఁ
దమ్మి కొలంకుల - తావులు దెచ్చి
తెమ్మెరల్ బడలికఁ - దీఱంగవీవ

—: కిష్కింధ వర్ణనము :—


నమరావతియొ కాక -యలకాపురంబొ
హిమవన్నగమొ వేల్పు - టెరవైన గిరియొ
యనఁగఁ గొండలు చుట్టు - నమర నన్నడుమ
ననుపమ భోగ భా -గ్యములఁ జూపట్టు
వానరపురము త్రో - వనె రాఁగ వీథి
లోన దారుండు నీ - లుఁడు శతబలియు3610

విజయసూర్యాంగద - ద్వివిద సుషేణ
గజగవయగవాక్ష - గంధమాదనలు
పనసమైనాక సం - పాతి సూర్యాక్ష
హనుమతసురగోము - ఖాగ్నినేత్రులును
నలజాంబవద్విక -కర్ణక మయకుముద
మలయ విద్యున్మాలి - మైందగోకర్ణ
దధిముఖ ఋషభ మం - దారసునేత్ర
దధివక్త్ర వీరహ - స్తసుపాటలులును
మొదలుగాఁగల కపి - ముఖ్యులు జేరి
ముదము మీరఁగఁ గొల్వు - మ్రొక్కులు వేయ3620
సంగీకరింపుచు - నావలికేఁగి
బంగారమిటికల - ప్రహరిగోడయును
సవరత్నముల రోహ - ణగిరీంద్రమన గ
రవణంబుగలహజా -రము మగరాల
బోరు దల్పులు ద్వార - ముల మరకతపుఁ
దోరణంబులు నింపుఁ - దొలకించు నట్టి
నగరిలో భానుమం - డల మంబరమున
మొగులలోఁ జొచ్చిన - మురువు చూపట్ట
నావలఁ జని యయి - దాఱు మానికపు
సావడుల్ గనుచు న - చ్చట వాహనములు3630
తగ్గని మణిదీప - కళికలేకడల
నెగ్గళ్ళు కంచుకుల్ - వృద్ధులాప్తులును
పట్టెమంచంబులు - పఱుపులు వివిధ
పట్టాంశుకములు కం - బళ్లును పరఁగి
పీఁటలు తలగడల్ - బరుదులు టంక

వాటపు కొప్పెరల్ - వాద్య ఘోషములు
గంధోత్తమా పూర్ణ - కుశలముల్ దివ్య
గంధ ధూపములు న - ల్గడలఁ గన్గొనుచుఁ
జక్కని యుడిగింపు - సతులు మెలంగు
చక్కటిఁ జేరి య - ష్టమ కక్ష్య నిలిచి 3640
విలుగుణధ్వని సేయ - విని భానుసుతుఁడు

-: సుగ్రీవుఁడు తారను లక్ష్మణునితో మాటలాడుటకు బంపుట :-

కలఁగి దిగ్గన లేచి - గడగడ వణక
వెఱవకుమని తార - వెన్నుపైఁ జఱచి
పరిరంభణము జేసి - పడనీక నిలుప
నపు డంగదుఁడు వచ్చి - “యయ్య! సౌమిత్రి
కుపితాత్ముఁడై మన - కోణెవాకిటను
వచ్చియున్నాడన" - వాలితోఁబుట్టు
నిచ్చలో 'దనతోడ - నేకాంతవేళ
హితముగా నంగదుఁ - డేమి యన్నాఁడొ?
సతమయ్యె నది "యని - చాల శంకించి3650
నోరెండ “బ్రహ్మకు - నూఱును నిండెఁ
దార! యయ్యది బుద్ధి - తనకిట మీద?
మంచివాఁడనుచు - లక్ష్మణుని నమ్మితిము
చంచలేక్షణ? కాల - శమనుఁడైనాఁడు!
ఇతని కప్రియము నే - నేమి చేసితిని
కతమేమొ యిట్టి యా - గ్రహముతోఁ జేర?
వలదన కీనేల - వాలిఁ జంపించి

కొలగట్టుకొంటి నా - కును వీరి కేల
చెలిమి వాటిలె? నింత - చేసిన యట్టి
తులువ వాయుజుఁడు మం - త్రులు ద్రోహులైన3660
కడతేర వచ్చునే? - కపిరాజ్యముల?
అడియాసఁ గైకొంటి - యతివకై యేను
కనువోవు నిద్దుర - గాదిట్టి వారి
చనుమానములు చాలు - సఖ్యంబు చాలు
నిల యేలుటయుఁ జాలు - నేమియు నొల్లఁ
దొలఁగించి తనకొక్క - త్రోవఁ గల్పింపు
నారీలలామ! ప్ర - ణామంబు సేతుఁ
జేరి నీచరణ - జీవముల్ సోఁక
కాదన్న మునుమున్ను - గా నీవు వోయి
నాదు మాఱుగ లక్ష్మ - ణపదాంబుజముల3670
వ్రాలిన నాఁటది - వచ్చె నే డనుచుఁ
జాలించు గినుక ప్ర - శాంతాత్ముఁడైన
నతనితో నీ నేర్చి - నట్లు భాషించి
హితముఁ జేసితివేని - యేవచ్చి వెనుకఁ
బొడగంది నతని ని - ప్పుడు రమ్మటన్న
పడఁతి రానొల్ల నా - ప్రాణంబు గాచి
బ్రదికించుకొను"మన్న - భర్తమాటలకు
మదిరారుణేక్షణ - మదన సంగ్రామ
కేళీరసాల స - కిన్నరకంఠి
లాలితభూషణా - లంకారకలిత3680
మంజీర మేఖలా - మాలికాకటక
శింజితఝణఝణ - శ్రీభాసమాన

యలినీలకచ కించి - దవగతగాత్రి
కలవాణి తార రా - ఘవసహోదరునిఁ
జేరవచ్చినఁ జూచి - స్త్రీ సన్నిధాన
మేరికి మదినాగ్ర - హింపరాకునికి
తేఱి చూడక పర - స్త్రీ పరాఙ్ముఖుఁడు
శ్రీరాముఁ దలఁచి వం - చినమౌళితోడ
నూరకయున్న హా - లోద్రేకమదవి
కారంబుతో సిగ్గు - కడకోసరించి3690
దిట్టతనంబునఁ - దియ్యపల్కులను
గట్టువాచిలుక వ - క్కాణించి నట్లు
నీతియు వినయంబు - నెనరును గలుగఁ
జాతుర్యవతి తార - సౌమిత్రి కనియె

—: తార లక్ష్మణునితో సంభాషించుట :—


“స్వామి! నీకేల రో - షము నాగ్రహంబు?
ఏమి నేరముచేసి - రెవ్వారలైన?
మేదిని నీయాజ్ఞ - మీఱినవారు
మీదు బుద్ధి యతిక్ర - మించినవారు
యెందైనఁ గలుగుదు - రే? కల్గిరేని
పొందుదురే వారు - భూరిసౌఖ్యములు?3700
శాంతమూర్తివి సర్వ - సముఁడవు నీవ
నంతకల్యాణగు - ణాకరాత్ముఁడవు
తగునయ్య? యింత క్రో - ధము నీకు? దాసు
లగు వారిపై” నన్న - యంగదుతల్లి
మాట నేర్పులకు నె - మ్మది విస్మయంబు

గాటంబుగాఁగ ల - క్ష్మణుఁ డిట్టులనియె.
"కిన్నరకంఠి! సు - గ్రీవుఁడు నీతి
నెన్నక ధర్మార్థ - కృత్యముల్ మఱచి
కామోపభోగ సం - గతి నార్తుఁడైన
రాముని కార్యభా - రము చేయి విడిచి3710
మంత్రులతో పాన - మత్తుఁడై యస్వ
తంత్రుఁడై స్త్రీ పర - తంత్రుఁడై యిట్లు
యొడ లెఱుఁగక యున్న- యునికి వీక్షించి
పొడమకుండునె క్రోధ - ము యతీంద్రులకును?
దనకు నేర్పరచు గ - తంబుఁ దీఱియును
మనసున నేమఱి - మత్తుఁడై వాఁడు
యేమని వచ్చితి - వేవచ్చురాక
కామిని! యుచితంబొ - కాదొ భావింపు
పానంబు ధర్మార్థ - పదవులఁ జెఱచుఁ
గాన నీ మగని కె - క్కడిది సత్యంబు?3720
ధర్మంబు దలఁచి యిం - తటనై న నీవు
దుర్మానశీలుని - తో హితాదేశ
పద్ధతిగాఁ బోయి - భాషించి వాని
బుద్ధిమంతునిఁ జేసి - పూనిన ప్రతిన
నడిపింపఁ జేయు"మ - న్న సుమిత్రపట్టి
నుడువుల కలరి య - న్నుల మిన్న వలికె
"కోపకాలము గాదు - కొలిచిన వారిఁ
జేపట్టి నేరముల్ - చేసిరేనియును
సహియింపఁ దగు కార్య - సంగతులందు
విహితమె యాగ్రహ - వృత్తి రాజులకు3730

రాజులలోఁదమో - రాజసగుణము
లేజాడ మిముఁ జేర - నీక సాత్త్వికమె
పూని యుండిన మీకుఁ - బొసఁగునె యలుగ
వానరప్రభుఁడైన - వాలి సోదరుఁడు
కామాంధుఁడై కన్ను - గానకుండుటయు
స్వామికార్యముఁ దీర్పఁ - సమయమౌటయును
మీరు చేసిన యట్టి - మేలుఁ దలంప
నేరక వీఁడుండు - నే యని తలఁచి
యాగ్రహంబున రాముఁ - డనుపుట యితని
నిగ్రహించెదనని - నీవు వచ్చుటయు3740
నన్నియు నెఱుఁగుదు - నైన నామనవి
చిన్నబుచ్చక వీఁడు - చేతిలోవాఁడు
మాలోన నొకఁడని - మన్నించి కరుణఁ
దాళి ప్రోచుట మీకు - ధర్మమైయుండు
తెలివిచాలక జితేం - ద్రియులైన యతులు
నలివేణులకు లెంక - లై యున్నచోట
నితఁడు వానరుఁడౌట - నెన్న నేమిటికి?
అతివలఁ దగిలి రా - గాంధుఁడై యునికి
చపలస్వభావుని - శరణంబు వేడి
కృప మీరు తెచ్చి కి - ష్కింధలో నునుప
నున్నవాఁ డేక్రియ - నోర్చు నీవింత
కన్నెఱ్ఱఁ జేసినఁ - గాకుత్థ్సతిలక?
వెఱుచి యిందాక నే - విన్నవించుటకు
మఱుఁగు చేసిత్ నా - రుమానాయకుండు
నీవు రాఁకట మున్న - నిఖల వానరుల3750

రావించి రామకా - ర్యభారంబుఁ దెలిపి
యందుకుఁ దగిన కా - ర్యాలోచనంబుఁ
గందువ నెమ్మదిఁ - గనియున్నవాఁడు
నెయ్యుని పట్టున - నెనరుంచి మీర
లయ్యంతిపురమున - కరుదేరవలయు3760
"రారాదు మీకన - రాదు మీ ప్రోవు
వారెల్ల తనయుల - వలెఁ గాదె మీకు?
విచ్చేయుఁ"డని యాత్మ - విభు హితం బెంచి
యచ్చపలాక్షి ప్రి - యంబులు వలుకఁ
దారవెంబడి సుమి - త్రాకుమారకుఁడు
పోరామిచే నంతి - పురముఁ జొచ్చుటయుఁ
గట్టెదురునఁ బైడి - గద్దియమీఁదఁ
జుట్టును వలకారి - సుదతులు గొలువ
రుమతోడఁ గూడి మె - ఱువుఁగడియముల
నమరు కీలాయింతి - యంసంబుఁ జేర్చి3770
యొకయింతి తొడలపై - నొకపాద మునిచి
సకలమణీభూషణ - చయములు వెలుఁగ
హాలారసారుణి - తాలోలుఁడైన
వాలిసోదరుని భా - వముఁ దేఱి చూడ
నతఁడును రామకా - ర్యార్థియై మ్రోల
నతిశయక్రోధకా - లాంతకు రీతిఁ
గుపిత వృత్తినధిజ్య - కోదండుఁడైన
తపన తేజుని సుమి - త్రాపుత్రుఁ జూచి
బగ్గున గుండియ - వగులఁ బీరంబు
దిగ్గన డిగ్గి భ - క్తి స్నేహములను3780

యొకయింతి తొడలపై - నొకపాద మునిచి
సకలమణీ విభూ -షణములు వెలుఁగ
హారారసారుణి - తాలోకుఁడైన
వాలిసోదరునిభా - వముఁ దేఱిచూడ
నతఁడును రామకా - ర్యార్థియై మ్రోల
నతిశయ క్రోధకా - లాంతకురీతిఁ
గుపిత వృత్తినధిజ్య - కోదండుఁడైన
తపనతేజుని సుమి - త్రాపుత్రుఁ జూచి
యవని పాలకుఁడు రా - జ్యము సేసె నేని
యవినింద్యుఁడై నుతు - లంది వర్ధిల్లు 3790
క్రూరకర్ముఁడు కృత - ఘ్నుఁ డసత్యపరుఁడు
దారాభిరతుఁడు పా - తకియునౌ నతని
నందఱును నృశంసుఁ - డందురు వానిఁ
బొందును బాతకం - బు లపారములుగ
నుపకార మొకరికి - నొనరింతు ననుచు
నపుడాడి తనకార్వ- మైనట్టి వెనుక
నామాట నిలుపని - యన్యాయపరుని
భూమిఁ బాపము లెల్లఁ - బొందునేకము
నందుపై శ్రీరాము - నంతటివాని
పొందు నీవంటి య - ల్పుఁడు సేయునపుడు 3800
నాడిన మాటల - యందుఁ గొంతైనఁ
దోడు చూపకయున్న - దోషంబు గాదె?
తనకుపకార మెం - తయుఁ జేయువారి
మనసురాఁ జేనైన - మాత్రమేనియును
ప్రత్యుపకార సం - పన్నుఁడు గాని

యత్యధము నృశంనుఁ - డని బ్రహ్మ వలికె
భ్రష్టుని గోఘ్నుని - పానాభిరతు ని
కృష్టుని చోరునిఁ - గెడతేర్పఁ దలఁచి
యిటు చేయుఁడని విధి - యించిరి గాని
కటకట! మేలెఱుఁ - గని దుష్టమతికి 3810
నెందుఁ బ్రాయశ్చిత్త - మిదియని లేదు!
నిందకోరిచి రాము - నికి రెండు దలఁచి
కల్లలాడిననీకుఁ - గమలసంభవుఁడు
చెల్లరె! యెట్లు ని - ష్కృతి విధియించు
సీతను వెదకింపఁ - జేపట్టెగాక
నీతోడు శ్రీరాము - నికి నేమిపనికి
కప్ప వల్కినయట్ల - కాలాహి వల్కి
కప్ప నమ్మికఁ జేరఁ - గని మ్రింగినట్లు
నీకార్యమునకునై - నెయ్యంబుఁ జేసి
వాకొంటి వప్పుడు - వలసిన యట్ల 3820
వాలినిఁ జంపి నీ - వారమై రాజ్య
మేలించి నిను దెచ్చి - యింటలోనునిచి
యిన్ని పాటులఁబడు - టెల్లను నీవుఁ
గన్నెలు నేవేళఁ - గలుద్రావి చొక్కి
కామాతురుండవై - కడపట మమ్ము
నేమియుఁ దలఁపక - యిట్లుండు కొఱకె?
ఓరి! రామద్రోహి! - యొకతూపుఁ దొడిగి
నీరొమ్ము నాటించి - నేఁడె కూల్చెదను!
వాలి చన్నటి త్రో - నను నిన్నుఁ బనిచి
కాలుని వీటిలోఁ - గాపురంబుంతు! 3830

అన్నదమ్ములము మే - మగుటచే మీరు
నన్నదమ్ములు గాన - నదియె యుక్తంబు
శ్రీరాము నానతి - చేయక తనకు
మీఱరాదటు గాక - మెలఁతలలోన
నున్నవాఁడవు గాన - నోర్చిచే కాచి
నిన్ను మన్నించితి - నీవింకనైన
సీతను వెదకించి - చేసిన ప్రతిన
యేతరిఁ జెల్లించి - హితుఁడవైమార
రామకార్యముల పో - రామి వాటించి
సేమంబు గనుమేల - చెడుద్రోవ నీకు? 3840
నీమాట వినికాని - నేఁదాళ" ననిన
నామాటలోఁ దార - యడ్డంబు వచ్చి
“నట్టింటి కీతని - నెమ్మి నేఁ దెచ్చి
చెట్టనైతి" నటంచుఁ - జేరి యిట్లనియె

—: లక్ష్మణుని మాటలకుఁ దార ప్రత్యుత్తరముఁ జెప్పుట :—


అనరానిమాట లి - ట్లపరాధిఁ బోలి
యనఁజెల్లు నయ్య? యీ - యర్కనందనుని
కానివాఁడనరాదు - కల్లయు లేదు
హీనుఁడు గాఁడు మే - లెఱిఁగినవాఁడు
కపిరాజ్యమును రుమా - కాంతను నన్ను
నపరిమితములైన - యైశ్వర్యములును 3850
నవనిజాతాసహా - యానుగ్రహమున
రవితనయుఁడు గాంచి - రాజయినాఁడు
బహుకాల మాపదఁ- బడినవాఁడగుట



మహిళలతోఁ గూడి - మఱచె మితంబు
ఇంతలోఁ దప్పిన - దేమి? కౌశికుని
యంతవాఁడును దొల్లి - యచ్చరఁ గూడి
కాలంబు మఱవఁడే ? - కపినాథుఁ బట్టి
పాలార్పనగునె ద - బ్బరలాడె ననుచు?
కరుణింపఁ దగవు రా - ఘవునకు నీకు
వెఱపు దీర్చుట యొప్పు - విశ్వాసపరుడు! 3860
ఇంతటివారు మీ - రితరుల మనసు
లెంతయు నెఱుఁగ లే - కిటులాడఁ దగునె?
ఏమి వల్కిన నేమి - యిది మీకు కొదవ?
సామాన్యులే మీరు - సద్ధర్మపరులు
ప్రాకృతరీతి స - ర్వజ్ఞుఁడ వయ్యు
వాకొందురే యిచ్చ - వచ్చినయట్లు?
తగదెఱుఁగుదువు సీ - తను దెచ్చికాక
నగరికి రాచేర్చు - నా భాను సుతుఁడు?
చెల్లుమాకని యాడఁ - చెల్లునే? యెట్టి
బల్లిదులకు మీఁదు - పరికింప వలదె? 3870
చులకఁ జేతురె? భాను - జుఁడు కొంచగాఁడె?
తొలుతను నెఱుఁగక - తోడు వేడితిరె?
కార్యాంతరంబుఁ - కనియెద రితని
మర్యాద నాయాడు - మాట యిప్పటికి
సరిపోదు మీకు రా - జ్యముఁ గులసతిని
యొరులు చేకొని యార్తి - నొందించు కతన
మేలుగీడుల నొక్క - మేరనే నడువఁ
బోలునే యెంతటి - బుద్దిశాలులకు

గట్టిగా నేరము - గలదు సుగ్రీవు
పట్టున నైనఁ జే - పట్టు నాకొఱకు 3880
రక్షింపు మితని ధ - రాచక్రమైన
పక్షంబుగల రమా - భామినినైన
ననునైనమాను మా - నేఁడు పూనినట్టి
పని సేతఁ జేకూర్చు - భారకుం డితఁడు
రావణుఁ దునిమి శౌ - ర్యముచేత రాము
దేవేరి రోహిణీ - దేవి యాచంద్రుఁ
గలసిన గతిఁ బతిఁ - గలసియుండంగఁ
దలఁపించు నీకు నిం - తయుఁ దరువాత
శతకోటులు సహస్ర - సంఖ్యయు నయుత
శతలక్షలందు ల - క్షసహస్రములును 3890
కడపట నన్నూఱు - గా రాక్షసాళి
మడపినగాని సా - మాన్య యుద్ధమునఁ
జావఁడు సుమ్ము ద - శగ్రీవుఁ డట్టి
లావరి నీతఁ డా - లములోన నెదిరి
యసహాయుఁడై చంపు - నని వాలిచేత
వెసఁ బలుమారు నే - విన్నట్టిదాన
నంతటివాఁడైన - యర్కతనూజు
నింతయుఁ గైకొమి - యిది నేర్పు తెఱఁగ?
ఈతఁడు మీకార్య - మీడేర్పఁ దలఁచి
తో తేరఁ బనిచిన - దూతల వినుఁడు 3900
ఎలుగులు వెయికోటు - లిన్నూరుగోట్ల
బలిముఖుల్ వేగుల - పనులు మానసులు!
వారలు పిలుచుక - వచ్చువానరుల

వార లెవ్వరు గణిం - పఁగ నోపువారు?
ఆబలంబెల్ల స - హాయంబు గాక
చేబారలిడినఁ దె-చ్చెదరె జానకిని?
వానరవిభురాణి - వాసంబులెల్ల
దీనత భయము నొం - దిరి నిన్నుఁ జూచి
శాంతమూర్తివి గమ్ము - సభయుఁడౌ నంశు
మంతుకుమారుని - మన్నింపు" మనిన3910
గౌరవంబు హితంబు - ఘనమును గార్య
కారియు ధర్మయు - క్తంబునై నట్టి
తారానులాపంబు - తనకోపవహ్ని
నారించు జలధార - యైమట్టు పఱుపఁ
దాలిమితో నున్న - తనుజూచి మైని
చేల యూడిచి చల్వ - చేకొన్న యట్లు
వెఱవు దొరంగించి - వేడుకఁగాంచి
దొరతనమున కెల్ల - తొడవైన యట్టి
కాంచనమాలిక - కడనున్నపట్టె
మంచముపైవైచి - మందహాసమున3920
మగువలు దాను ల - క్ష్మణుఁ జేరవచ్చి
మొగమెత్తి నయయుక్త - ముగ నిట్టులనియె

—: సుగ్రీవుఁడు లక్ష్మణునితోఁ బ్రసంగించుట :—


“తనకు నీకపిరాజ - ధానియుఁ గీర్తి
యును గామినులు గల్మి - యొసఁగినవాఁడు
మీయన్నగాఁడె? సౌ - మిత్రి! యేనట్టి
కాయంబు మఱచిన - కల్లసేయుదునె?

రాముని చిత్తంబు - రా మెలంగకయె
భూమి నొక్కఁడు సౌఖ్య - మున నుండగలఁడె?
ఎల్లి రావణుఁ ద్రుంచి - యింతిఁ జేపట్టి
చల్లఁగా శ్రీరామ - చంద్రుఁ డుండును.3930
తాళంబులు నగంబు - ధరణియు నొక్క
కోల నాటఁగ నేయు - కోదండపతికి
రావణఁడెంత శ - రంబొక్క టేర్చి
కావలసినఁ ద్రుంప - గలఁడు విశ్వంబు!
అట్టివానికి నాస - హాయత యెంత?
చుట్టఱికము చేసి - యలకఁగాఁ జేయ
రాదని నిన్ను గౌ - రవము సేయుటకుఁ
గాదె వచ్చితి వెఱుఁ - గక వెఱచితిమి
మాననేల నిమిత్త - మాత్రుని నన్ను?
బూనింపుఁ డెయ్యది - బుద్ధి చేసెదను3940
విల్లుమో పెట్టిన - విశ్వమంతయును
తల్లడింపఁగఁ జేయు - దశరథాత్మజుఁడు
ఒకరితో డాస సే - యునె? నీదురాక
నకలంక కీర్తు లే - నందితి నిపుడు
వెంట వచ్చిదను మీ - విక్రమావళులు
కంటికి మెచ్చుగాఁ - గనుఁగొనవలసి
మందెమేలమున నే - మఱి నీవురాక
ముందుగా నేను రా - ముని సన్నిధికిని
రాకయున్నట్టి నే - రము సహియించి
చేకొని నన్ను ర - క్షింపుమీ యెడల"3950

అనిపల్క సౌమిత్రి - యర్కనందనునిఁ
గనుఁగొని కరుణించి - క్రమ్మఱం బలికె

-: లక్ష్మణుండు సుగ్రీవుని ననునయించుట :-

నినువంటి దొర రాము - నికిఁ గల్గుకతన
దనుజుల గెల్చుటెం - తటిపని యింక
ఇంత కార్యంబు మే - మెంచుట నీతి
మంతుఁడవగు నిన్ను - మది నమ్మికాదె?
ఇటునటు బెదరించి - యేరీతినైన
దిటముగా నినుఁ దోడి - తేక మావలన
నే కార్య మీడేఱు - నెందులో వార
మా కడమాచేత - నయ్యెడి దేమి?3960
రావణుఁడెక్కడ - రామునిదేవి
చావును బ్రదుకు నె - చ్చట మాకుఁ దెలుసు?
నీ బల్మిఁబట్టుక - నేము రాక్షసుల
చేబల్మితోడ గె - ల్చెదమటుగాక
యీమాటఁ దలఁపగ - నెయ్యది శక్తి
నీమఱుఁగునను బూ - నితి మిట్టి పనికి?
సందేహమేల దుర్జ - యశౌర్యనిధివి
యందు నమ్మినవారి - నీడేర్పఁగలవు!
సత్యసంధుఁడవు ప్ర - జారంజకుఁడవు
మత్యుపాయ బలాభి - మానదక్షుఁడవు3970
యెంతయెంచిన నీకు - నే తగుగాన
యింతటివాఁడని - యెంచి చేరితిమి
యేనన్న మాట - హృదయంబు లోనఁ

బూని నిల్పక యోర్చి - పోషింపు మమ్ము
నీకు రాఘవునకు - నేనొక్క రూప
నాకుఁ దప్పేది? మ - న్ననకుఁ బాత్రుఁడవు
రాముఁడన్నది మాట - రామునితోడు
నామీఁద మీరొక్క - రన్నది మాట
మీమాటలును జెల్మి - మీ నిలుకడలు
మీమనంబు లెఱుంగు - మిగిలిన వేల?3980
కార్యాంతరుఁడ నౌటఁ - గన నేరనైతి
మర్యాద రాముఁడీ - మాటలు విన్న
నేమి వల్కునొ? తన - కేమి యెట్లెన?
నీ మీది భార మ - న్నియు నీకె తెలుసు
శ్రీరామవిభుఁడు చే - సిన సుకృతంబు
కారణంబుగ దైవ - గతిచేతఁ గాక
యాపదవేళకు - నడ్డమై నిలుచు
నీపాటి చుట్ట మె - న్నిన వేఱె కలఁడె?
మాకుఁ జుట్టమ వను - మాట మాత్రంబె
యేకడ భుజబల - ధృతి విక్రమముల4990
సరివత్తు వెంచినఁ - జాలుదు వీవు
నిరుపమ వానరా - నీకసంగతిని
తామసింపఁగ నేల - తన వెంటరమ్ము
రాముని కడకుఁ గా - ర్యంబులు గలవు.
ఆలిఁ గోల్పోయి యీ - యవధుల కెల్లఁ
బాలైన రాముని - పై దయఁ దలంచి
నాతప్పు లెన్నక - నన్ను మన్నించి
ప్రీతుండవగు నీదు - పెంపుఁ దలంచి.”

అనుమాట లాలించి - యనిలకుమారుఁ
గనుఁగొని వానరా - గ్రణి యిట్టులనియె.4000

-: సుగ్రీవుఁడు తిరిగి సౌమిత్రితో సంభాషించుట - సీతను వెదకుటకు - వానర సైన్యము బంపుట :-

"సేవకావళిని ర - క్షింప శిక్షింపఁ
దావిభుఁడౌట సీ - తానాయకుండు
పనిచినఁ దమకార్య - భరము హేతువుగ
ననవలసినమాట - లనియె లక్ష్మణుడు.
అది నాకు భూషణం - బగుఁగాని యేమి
కొదవ యిట్లాడుటల్ - కొదవ యిర్వురకు?
నాకుఁ బ్రియోక్తు లా - నతి యియ్యఁ దగునె?
వాకొందురే కడ - వానికిఁ బోలి?
స్త్రీలోలుఁడగు నన్నుఁ - జెక్కిలిఁ గొట్టి
పాలుఁ ద్రావించె ద - బ్బరరాక యుండ! 4010
దొరల చిత్తంబు లెం - దునకైన వచ్చుఁ
దరికొద్ది ఖేదమో - దము లేల మనకు?
ఏమఱియుండరా - దిఁకనైన నీవు
తామసింపగ మహేం - ద్రనగంబునందు
కైలాసహిమ వింధ్య - కనకాచలేంద్ర
పూర్వాస్తకు - త్కీలంబులందు
ఫలభారవినమిత - పాదపగహన
ములయందు మత్తేభ - ముల వోలి యున్న
హరిణారుణాసితో - దారగాత్రులను
హరివీరులను మహా - హవజయోన్నతులఁ

గామసంచారులఁ - గామరూపులను
భీమబాహాబలో - పేతుల నెల్లఁ
బిలిపింపు మే మున్న - పిలువనంపితిని
బలశాలులైనట్టి - పడవాళ్ళ చేతఁ
గామినీమణులందుఁ - గామభోగములఁ
దామసవృత్తిచే - దండు వొమ్మనినఁ
దప్పించుకొందురం - దఱు నిండ్లుమరిగి
చెప్పించనగు మాట - చెవిసోఁక పలికి
పోయిరా పదిదినం - బులు మితిఁ జేసి
నాయాజ్ఞ వలికి వా - నరుల రప్పింపు 4030
ఆ గడువుకు రాని - యట్టివారలను
వేగంబె తలతెగ - వ్రేయుము నీవు
గొబ్బున నొకలక్ష - కోట్ల వానరుల
నిబ్బరంబుగఁ బోవ - నేర్చినవారి
నిందఱి గుఱుతులు - నెఱిఁగినవారి
నెందుఁ బూనిన పను - లీడేర్చు వారి
నంపుమీ"వన నట్ల- యనుపు వాయుజుని
పంపున బిలనదీ -పర్వతగహన
వననిధి ద్వీపది - వ్యవనంబులందు
వనచరావళినెల్ల - వరుసతో వెదకి4040
వేగుల వారలుఁ - బిలిచిన నలఘు
వేగంబుతోఁ గపి - వీరులందఱును
గాలమృత్యువనంగఁ - గనఁబడి కీలి
కీలయుఁబోలు సు - గ్రీవాజ్ఞ చేత
నొకరైన యనుమతి - నుండక వచ్చి

రొకముహూర్తమున సై - న్యోపేతులగుచు.
అంజనాచల వాసు - లై మూఁడు కోటు
లంజనాసిత వర్ణు - లైన వానరులు
హస్తాచలంబుఁ బా - యని పదికోట్లు
హస్తులోయున పచ్చ- నైన వానరులు4050
కైలాసముననుండి - కదలి వైకోట్లు
వేలంబు తెల్లగా - విరియు వానరులు
వేయికోటుల మీఁద - వేయిగాఁ గెంపు
చాయల వలిగొండ - చక్కి వానరులు
కపిశవర్ణంబులు - గనివేయి కోటు
లపుడు వింధ్యాద్రిపై - నమరు వానరులు
క్షీరాబ్ధి కడనుండి - చేరినవారు
నారికేళాశనుల్ - నవ్యతమాల
పల్లవవర్ణులు - పదివేలు కోటు
లల్లుక విడిసిన - యట్టివానరులు4060
నానానదీగిరి - నదవనాటవులు
నేనాఁడు నుండు న - నేకవానరులు
చేరిన హేమాద్రి - చెంతనున్నట్టి
వీరవానరులను - వేగంబె పిలిచి
యచ్చోట హనుమంతుఁ - డంపినఁ బిలువ
వచ్చిన వేగుల - వానరోత్తములు
హరుఁడు మున్నచ్చోట - యాగంబుఁ జేసి
హరికిఁ దానర్పించు - హవిరన్నరాశి
చెదరు నన్నంబెల్లఁ - జెట్టులై మొలిచి
యదునుగాకయుఁ బండు - నమృతోపమాన4070

ఫలములం దొక్కటి - భక్షించిరేని
నెలకు నాఁకలి దప్పి - నిద్ర లేదనుచు
విన్నవారగుట న - వ్విపినంబులోన
నున్న ఫలావళు - లూర్చి కైకొనుచు
వెనుక సేనలు రాఁగ - వేగంబెవచ్చి
యినకుమారునితోడ - నివి యిట్టివనుచుఁ
గానుక చేసి యే - కడ నున్న యట్టి
వానరవీరుల - వచ్చెదరనుచు
విన్నపం బొనరింప - విని రవిసుతుఁడు
మన్ననతో బహు - మానంబుఁ జేసి 4080
వారలఁ బనిచిన - వాలిసోదరుని
తో రఘువంశచం - ద్రుని తమ్ముఁడనియె
"సంతోషమాయె నీ - సైన్యంబు రాక
యింతటి సామర్థ్య - మేరికిఁ గలదు?
నెమ్మది సరిపోయె - నేమిర్వురమును
రమ్ము పోవుదము శ్రీ - రాముని కడకుఁ
గాక యీమాట - రాఘవునితోఁ బలుకు
మాకడ నే వత్తు - నని యంటివేని
యిది బుద్ధి యనుమ"న్న - ఇక్ష్వాకుకులుని
వదనంబుఁ జూచి వై - వ స్వతుఁడనియె. 4090
"నా కొకయిచ్చయే? - నన్ను రమ్మనిన
రాకయుండుదునె శ్రీ - రాము సన్నిధికి?”

-: సౌమిత్రితో సుగ్రీవుఁడు శ్రీరామునిఁ జూడ నేఁగుట :-

అటులె పోవుదమని - యప్పుడు 'తారు
నటు జూచి 'చతురంత - యానంబుఁ దెమ్ము

వేగ నిచ్చటి'కని - వెలఁదుల నెల్ల
నేగతి నేయింట - నెవ్వారులుండ
నియమింపవలయు న - న్నింటికిఁ దగిన
నియతి మనోవర్తి - నిత్యకృత్యములు
నడిపింపఁదగు వారి - నగరి వాకిటను
బడగరంబులకును - ప్రహరిచుట్టుటకు4100
బట్టణరక్షకా - ప్తతగలవారిఁ
గట్టడ చేసి యే - కార్యంబులకును
తార చెప్పినయట్ల - తనయాజ్ఞ నడవ
నేరుపాటుగఁ జేసి - యిచ్చె నుంగరము
ఆముద్రఁ గైకొని - యలివేణి తార
రాముని కార్యని - ర్వాహంబులకును
దగిన యాలోచనల్ - తనతోడ నడుప
నగునని యన్నియు - నంగీకరించి
యమ్మానవతి వెంట - నతివల నాద
రమ్మున నంతఃపు - రమ్మున కనిచి4110
పయనమై తనమ్రోలఁ - బల్లకి యునుప
జయభేరి వ్రేయించి - శాకనీకులను
రప్పించి శుభముహూ - ర్తమున నిల్వెడలి
యప్పు డుప్పొంగు రా - మానుజుఁ జూచి
"యీ పల్లకీమీఁద - నెక్కుఁడు నన్నుఁ
జేపట్టి యేను మీ - సేవ సేయుచును
వెంటవచ్చెద”నన్న - విని లక్ష్మణుండు
దంటగా నతని హ - స్తము కేలఁ బట్టి

యిరువురు నందు పై - నెక్కి యుత్సాహ
భరితులై యన్యోన్య - భాషణంబులను4120
బ్రమదంబు లందుచుఁ - బ్రణవమృదంగ
ధిమిధిమిధ్వానంబు - దిక్కుల నిండ
కపుల కోలాహల - గంభీరరవము
లప్పుడు బ్రహ్మాండ మ - ల్లాడంగఁ జేయఁ
గాంచనచ్ఛత్రము - క్తాచామరంబు
లంచల లక్ష్మీస - హాయతఁ దెల్పఁ
గిలకిలారభటిఁ గి - ష్కింధాపురంబు
జలరాశి ఘూర్ణిల్లు - చందమై తోఁపఁ
బురము వెల్వడి రయం - బున రాముఁడున్న
ధరణీధరంబుచెం - త వనంబులోనఁ4130
బల్లకి డిగి రఘు - పతిఁ జేర నేఁగి
యల్లనఁ గేల్మొడ్చి - యడగుల వ్రాలు
వానరపతిఁ జూచి - వైదేహిమగఁడు
మానసం బానంద - మగ్నంబు గాఁగ
బదముల వ్రాలు నా - ప్తసహోదరులను
గదిసి లేవఁగనెత్తి - కౌఁగిటఁ జేర్చి
యగ్రభాగమున హ - స్తాభినయమున
“సుగ్రీవ! యిచటఁ గూ - ర్చుండు” మటంచు
నానతి యిచ్చిన - నటుసేయు నతని
జానకీజాని ప్ర - జ్ఞాశక్తి పలికె4140

-: రామ సుగ్రీవ సంభాషణము :-

"ధర్మార్థములు మదిఁ - దలఁపక యాత్మ
శర్మంబె కోరి యి - చ్ఛావృత్తి వలనఁ

గామోపభోగసం - గతి నున్నవాని
నేమిటఁ గొఱగాని - హీనుగా నెంచి
యార్యులు నిందింతు - రటుగాన తగిన
మర్యాద నుచితక - ర్మము లాచరించి
మెలఁగుట ధర్మంబు - మేదినీరుహము
బలువైన కొమ్మపైఁ - బవళించి యొకఁడు
యేమఱి నిదురించి - యిలఁ బడి వెనకఁ
దా మేను దెలియు చం - దంబగు గాన4150
కేవలకామంబు - కీడు శాత్రవు
నేవేళఁ గెలువ నూ - హింపవలయు
నట్టిచో దండెత్తి - యసురుల జయింప
బట్టగుగాన యీ - పట్టున నీవు
నుద్యోగ మేమఱి - యుందురే' యనిన
ఖద్యోతనిభురాముఁ - గని యతండనియె.
"పోయిన రాజ్యంబు - పొలఁతియుఁ గలిమి
యోయయ్య! నీవు నా - కొసగితి మొదలఁ
దరువాత నీ సుమి - త్రాకుమారకుఁడు
పరిపాలనము చేసి - పాలించె నిపుడు!4160
ఉపకారమునకుఁ బ్ర - త్యుపకార మెవ్వఁ
డుపమించి సేయక - యుండునో వాఁడు
నీచుఁడు గాన వ - నేచరావళిని
యేచాయఁ గలవారి - నెల్లను గూర్చి
స్వామి కార్యమునకు - సవదరించితిని,
తామసించిరి నను - తప్పులో గొనుము
కామరూపులు దేవ - గంధర్వపుత్రు

లీమర్కటోత్తము - లీ యెలుఁగులును
దగిన కోలాంగూల - తతులును జాల
మగఁటిమి గలవారు - మహిమ గలారు4170
మేరువింధ్యాది భూ - మీరుహశ్రేణి
వీరేలుదురు చుట్టు - విడిసియున్నారు.
అందఱు రణశూరు - లందఱు మేరు
మందర శైలోప - మానాపఘనులు.
అందులో శతకోటు - లధిపతుల్ వారి
యందొక్కఁ డొకఁడు - కోట్యర్బుదశంఖ
పద్మమహాపద్మ - బలసమన్వితులు!
పద్మబాంధవునైనఁ - బట్టి తేఁగలరు
రావణుఁ బుత్ర మి - త్ర కళత్రయుతము
గా వధియింప నొ - క్కఁడె చాలు! వాఁడు4180
'సీతను దెచ్చెద - సెలవిమ్ము తనకు
నీతఱి' ననియుత్స - హించిన వారు
'ఏమెఱుఁగని యట్టి - యిరవులు గలవె?
భూమిజ నిపుడె చూ - పుదు' మనువారు
ఈపాటి పనికైన - నేను రానేల?
నాపంపునకుఁ జాలు - నా? యనువారు
రావణుఁ దెచ్చియీ - రాముని యెదుర
నీవేళ నేనుంతు - నే' యనువారు
నయ్యున్న యీవాన - రావళిఁ జూడు
మయ్య! నీమదిలోని - యలమటల్ దీఱు'4190
నని యిట్లు సుగ్రీవుఁ - డాడిన మాట
విని యుత్పలశ్యామ - విమలగాత్రుండు

శ్రీరామచంద్రుండు - చిత్తంబు వొదల
సూరతనూభవుఁ - జూచి యిట్లనియె
"వాన లింద్రుఁడు మహి - వర్షించుటయును
భానుమండల మాత - పంబుఁ గాయుటయు
నిండుచందురుఁడు వె - న్నెలలు గాయుటయు
నండజస్వామి వి - హాయసంబునను
జరియించుటయు నీని - జస్వభావములు
హరినాథ! యిట్టిమ - హానుభావములు4200
నొరులకు నుపకార - మొనరింప నీకుఁ
బరమధర్మంబైన - ప్రకృతిగుణంబు!
ఇది నీకు నెచ్చని - యెన్న నేమిటికి?
మదినీవు దలఁచిన - మాత్రనే మాకు
సీతయుఁ జేకూడుఁ - జింతితార్థములు
చేతిలో నున్నవి - సిద్ధమింతయును
నిన్నుఁ బోలిన యట్టి - నెయ్యుఁడు గలుగ
నెన్నిక యేల? మా - కే కార్యములకు
శచి ననుహ్లాద రా - క్షసనాథుచేత
నచలవృత్తి పులోముఁ - డాదికాలమునఁ4210
జెఱపట్టి తెప్పించి - చెడి యింద్రుచేత
మరణంబు నొందిన - మాడ్కి రావణుఁడు
నీదండి గలుగ నా - నిశితాస్త్రములను
మేదినిపై గూలు - మిత్రులతోడ”
అనుమాట లాడుచో - నర్కమండలము
పెనుధూళి నద్దపు - బిల్ల చందమునఁ
గనిపించి యేమియుఁ - గనిపించరాక

పెను చీకటులు దిశా - బృందంబుఁ గప్పె
ఏడు వారాసులు - నేకమై పొరలు
జాడ భోరున మహా - శబ్దంబు మింట4220
నిండె! నంతటిలోన - నిలిచెఁ గట్టెదురఁ

-: సీతను వెదకుటకు వానరనాయకులు తమ తమ బలములతో వచ్చుట :-

గొండలీనిన యట్ల - కోఁతుల బారు
నదులఁ గాననముల - నలినాకరముల
నదములయందు న - నంతంబులైన
కమలకేసర శశాం - కరవిప్రకాశు
లమరాంశజుల పౌజు - లటు గనుపింప
జతఁగూడు మూఁకతో - శార్దూలసింహ
శతబలియైనట్టి - శతబలి యపుడు
కోటానుకోటులౌ - కోఁతులు మింట
దాటుచు రాఁగ ముం - దఱఁ బొడగనియెఁ4230
దరువాత నీలాంబు - దంబులంబోలు
హరులతో వానరా - ధ్యక్షుని మామ
తారాగరుండు ప్ర - తాపపావకుల
వీరవానరుల వే - వేలుఁ గోటులను
గూరుచుకొని వచ్చి - కోదండపాణిఁ
జేరి యొక్క సలాము - జేసి తాఁ జనియె
రుమ తండ్రియను నట్ల - రోహితవర్ణ
సమధికగాత్రుల - సంఖ్యాభిరతులఁ

గొందఱు వానర - కోటులఁ గూర్చి
పొందికగాఁ వచ్చి - పొడఁగని పోయె4240
పద్మకేసర విభా - పటలాంగుఁ డగుచుఁ
బద్మంబుపై లక్ష - బలము సేవింప
సామీరితండ్రి కే - సరియనువాడు
స్వామికి వచ్చి మ - స్తము వాంచి మ్రొక్కె
కపివరుల్ కోట్ల సం - ఖ్యలుగాఁగఁ గొలువ
నపుడు వేవేగ గ - వాక్షుఁడు వచ్చి
కండెముల్ దిరిగిన - కరములు మొగిచి
దండదానపు నడఁ - దావచ్చి మ్రొక్కె
వేఱె తానొక రెండు - వేలుఁ గోటులకు
వీరులౌ భల్లూక - విభులతోఁ గూడి 4250
తామ్రాననము ప్రభా - తదిశను బోల
ధూమ్రుండు చుట్టల - తోవచ్చి కనియె
పర్వతాకారుఁడై - పదమూఁడు కోట్ల
పర్వతచరవీర - బలముతో వచ్చి
పనసుఁడు తనపేరు - భట్లు పద్యముల
వినుతింపఁ జేమోడ్చి - వెనుకకుఁ బోయెఁ
గాటుక కఱికప్పుఁ - గలమేనితోడ
నాటియౌ నంజనా - చలము వీనికిని
ననఁ బదికోట్ల మ - హాకపిశ్రేణి
తనుగొల్వ నీలుఁ డౌ - దల మ్రొక్కి చనియె4260
ఐదుకోటుల వాన - రాధిపు ల్గొల్వ
గైదండతో సము - ఖముదాఁక వచ్చి
కోఁతి కట్టికలు సాం - గు భళా! యనంగ

నేతాము వలెఁ జేతు - లెత్తి తామ్రొక్కి
గవయుఁడు తనమూఁకఁ - గడకోసరించి
యవనిజావిభుని డా - యఁగవచ్చి నిలిచె
వేయికోటుల కపి - వీరులతోడఁ
జేయి మొగిడ్చి ని - ల్చెను దధిముఖుఁడు
నిండు వేడుక నాశ్వి- నేయనందనులు
వెండియు మైందవ - ద్వివిదులన్ వారు4270
వేయేసి కోటుల - వీర వానరులు
సాయక కొల్వ వెం - బడిఁబొడగనిరి
మూఁడు కోటుల కపి - ముఖ్యులతోడఁ
గూడి గజుండు తాఁ - గొల్వులో నిలిచె
పదికోట్లు భల్లూక - పతులు సేవింప
వదలని ధృతి జాంబ - వంతుండు వచ్చె
నారుమణ్వంతుఁడు - నప్పుడు వచ్చె
నూరుకోటుల కపీం - ద్రులు చేరికొల్వ
వేయికోటుల కపి - విభులతో వజ్ర
కాయులతో వచ్చె - గంధమాధనుఁడు.4280
నమ్మిన పదికోట్ల - నగచరుల్ గొల్వ
ముమ్మరమ్ముగ దధి - ముఖుఁడు కేల్మొగిచె
జంభారి విభవులై - శరభుఁడు వహ్ని
రంభుఁడు కుముదుఁడు - ప్రబల విక్రములు
కీశుల లెక్క మి - క్కిలిగాఁగ రాఘ
వేశునిఁ బొడఁగని - యేఁగిరవ్వలికి
శతశంఖ బలము ని - జంబుగాఁ గొల్వ
క్షితిసుతావిభుని ద - ర్శించి నంగదుఁడు

కోరితారుఁడు దుర్ము - ఖుం డింద్రభాను
డేరుపాటుగ వార - నేక కోటులగు
వానరావళిఁ గూడి - వచ్చి రాఘవునిఁ
గానుక లిడిపొడఁ - గని పోయిరపుడు
లాఁతివారలుగాక - లావరులైన
కోఁతులు తనువేయి - కోటులు గొల్వఁ
జాఁగిలి మ్రొక్కి యం - జలి చేసెనంత
నాగరికుం డంజ - నానందనుండు |
నుతబలుల్ లక్షయు - నూఱుకోటులును
జితిపడినట్టి కై - జీతంబువారు
వానరుల్ సేవింప - వచ్చి నలుండు
జానకీవిభున కం - జలి చేసి నిలిచె4300
ఈరీతి వానరు - లిలయు నింగియును
నీరంధ్రముగ దిశల్ - నిండ గర్జలను
నుప్పరం బెగయుచు - నుర్వి చలింపఁ
గుప్పించుచును మీఱి - కొప్పరింపుచును
వాలంబు లార్చుచు - వచ్చి భాస్కరుని
నీలమేఘంబులు - నిండుకొన్నట్లు
సుగ్రీవు నెదుట పౌ - జులుదీర రాఘ
వాగ్రణి మదికి న - త్యానందమయ్యె
అందఱ నందందు - నమరించి భాను
నందనుఁడా రఘు - నాయకుఁ జేరి4310
"దేవ ! యీవనుల న - ద్రిప్రదేశముల
నావారి విడియించి - నాఁడఁ బాళెముల
కపులెల్ల వచ్చిరి - గాన రావణుని

కపుడె సూరును నిండె! - నవనిజ చేరె!
సందియంబేల? ని - జమ్ముగా నమ్ము
మందఱ సేనల - యలవి యేర్పఱుప
నెంతవారును నేర - రిందఱు శౌర్య
వంతులు సురదాన - విజయాభిరతులు!
ఈ వానరుల కన్న - నినుమడి నాదు
సేవకులయి కై - జీతంపు మూఁక4320
కడలతోఁకల దోచి - కడలి నీరెల్ల
కడలను జల్ల యిం - కఁగఁ జేయఁగలరు
మేని సోఁకుల చేత - మేదినీధరవి
తానంబుఁ దూఱుపె - త్తఁగఁ జేయఁగలరు
ధరణితలంబు పా - తాళంబు మోవ
నురగేంద్రుతోఁ ద్రొక్కి - యునుపంగఁ గలరు
అటునిటు గాలియ - ల్లాడం గనక
ఘటికలో దెసకట్టు - కట్టంగఁ గలరు
నింగిపైఁ జరియింప - నీటిలో మెలఁగఁ4330
జంగున ద్వీపముల్ - చౌకళింపంగ
దొడ్డకొండలు దెచ్చి - దొంతరల్ పెట్ట
నడ్డి యేడది? చేత - నగు వీరికెల్ల!
నీదుకార్యమునకు - నేఁడెల్ల వారు
నోదేవ! పనివూని - యున్నారు పచ్చి
కామసంచారులుఁ - గామరూపకులుఁ
గామితార్థప్రదుల్ - కామవర్జితులు
పనిఁగొమ్ము వీరలఁ - బనిచి" నావుఁడును
విని భానుతనయుని - వీక్షించి యాతఁ

 
డాలింగన మొనర్చి - "యాప్తులతోడ
నాలోచనము చేసి - యవనిజం దెచ్చు
పని నీకుఁ దీరని - భారంబు! మాకు
బనియేమి? యేమని - పలుక నేరుతుము
నీకెట్లు సరివోయె - నీవది చేసి
కైకొను మాకల్ప - కమనీయకీర్తి"
అనవిని సుగ్రీవుఁ - డట్లకాకనుచు
వినతుని వానర - వీరునిఁ బిలిచి

-: సుగ్రీవుఁడు వానరనాయకు లను నాల్గు దిక్కులకు సీతను వెదకుటకు నాజ్ఞాపించుట :-

"శూరుల భాస్కర - సోమసంతతుల
ధీరుల వానరా - ధిపులను గూడి
తూఱుపుగాఁ బొమ్ము - తొలుత జాహ్నవిని
మీఱి యాసరయువు - మించి కౌశికియు4350
యమునయుఁ గనుఁగొని - యామున నగముఁ
గ్రమియించి సింధువుఁ - గని సరస్వతినిఁ
జూచి సరావతి - శోణనదంబు
నాచాయ బ్రహ్మమూ - లాపగల్ వెదకి
మాళవకోసల - మగధ విదేహ
గౌళకాశీపుండ్ర - కౌశికముఖ్య
దేశంబులందు వై - దేహిని వెదకి
కోశగారంబు గ - న్గొని వెండిగనులు
గనుఁగొని మందరా - గమున వసించు
వనచరవిభుల న - వ్వలిదిశ కనిచి 4360

యాయసముఖపురు - షాదకిరాత
కాయాద హేమాంగ - కర్ణ చూలులను
బరికించి పచ్చిచేఁ - పలు దినువారి
నరయుచు జలవాసు - లైన వారలను
ద్వీపవాసులను న - దీప్రాంతభూమి
జూపట్టు పురములు - చూచి శోధించి
సాఁగి యవద్వీప - సౌవర్ణ కుడ్య
భాగముల్ నీహార - పర్వతంబరసి
రత్నవంతము సాగ - రంబు వేలయును
యత్నంబుతోఁ జుట్టి - యచటి ద్వీపములు4370
మరుదేశముల దధి - మత్పర్వతంబు
నరసి యచ్చటనుండి - యతిశోణమైన
శరనిధి దాఁటి య - చ్చట బ్రహ్మ చేత
వరమంది తమచాయ - వచ్చినవారి
యిరుగడ మింటిపై - నేఁగఁగ నీక
తరిమి నీడలు పట్టి - తమరు మ్రింగుచును
ఛాయాపహారిదు - ష్కవులనుఁ బోలు
ఛాయాగ్రహములపైఁ - జనక కేడించి
యావారినిధి దాఁటి - యవలఁ బ్లక్షాఖ్య
చేవెలసిన దీవిఁ - జేరి శోధించి4380
ముందఱనిక్షు స - ముద్రంబుఁ జూచి,
యందులో ద్వీపంబు - లన్నియు వెదకి,
గుల్మలతావృక్ష - కోటి భాసురము
శాల్మలీ ద్వీపంబు - సరణిగా నరసి,
మధురసవార్ధి నే - మఱక శోధించి,

మధువాని యలయక - మాని యచ్చోట
గరిడి మాడ్కిని విశ్వ - కర్మ నిర్మించు
గరుడని యింటి న - ల్గడ విచారించి
యందు భాస్కరునితో - ననిఁ జేసి పొలియు
మందేహులుండు ధా - మము విచారించి, 4390
యవల గుశద్వీప - మారసి, నేతి
రవణంబు గల సము - ద్రంబున వెదకి,
క్రౌంచంబనెడి దీవిఁ - గాంచి శోధించి,
మించి పై దధివార్ధి - మీఱి యాకెలన
మొనయు శాకద్వీప - మున కేఁగి యవలఁ
దనరెడు పాలసం - ద్రము విచారించి,
యానడుమను వృష - భాచలంబరసి,
పైనున్న కాంచన - పద్మసరంబు
తెరవుగాఁ బుష్కర - ద్వీపంబుఁ జేరి
సరణి సుదర్శన - సరసి శోధించి,4400
యందుఁ గ్రీడించు వి - ద్యాధరయక్ష
బృందారకులఁ జూచి - పేర్కొని మ్రొక్కి
యాకడ శుద్ధోద - కాంబుధిఁ జూచి,
వ్యాకీర్ణమైన యౌ - ర్వక్రోధజనిత
బాడబానల శిఖా - పటలంబు నిగుడు
జాడగాఁ జనక యె - చ్చరికతోఁ దొలఁగి
యాతరి వివిధభూ - తారావములకు
భీతినొందక హేమ - పృథివీధరంబు
చేరి యానగముపై - శేషుని ధరణి
భారనిర్వహు నీల - పరిధాను వేయి4410

తలలొప్పు వానిఁ జం - ద్రప్రభాగాత్రు
నలఘునిఁ ద్రిపటి స - మన్వితకనక
తాళధ్వజునిఁ జూచి - దండనే యుదయ
శైలంబుఁ జేరి యో - జనమాత్రమునకుఁ
దగినట్టి వెడలుపు - దశయోజనములు
తెగయును గలుగు వే - దిక దానఁ జూచి,
సౌమనసంబనఁ - జనినట్టి దిన్నె
హేమమయంబయి - యెసఁగుచో నచట
నాదిన్ ద్రివిక్రముఁ - డందుపై నొక్క
పాదంబు మేరువు - పై నొక్కయడుగు4420
నిలిపినాఁ డక్కొండ - నెళవు తూరుపున
బిలమా రసాతలా - భీలమై యుండు
నాజాడగావచ్చు - నర్కుఁ డాగట్టు
పై జంబు వొక్కటి - ప్రబలి మిన్నందు
నుదయవేళలయందు - నుష్ణమయూఖుఁ
డది చుట్టివచ్చు న - య్యవనీరుహంబు
శాఖలఁ దపములు - సలుపుచుండుదురు
వైఖానసుల్ మును - ల్వాలఖిల్యులును
నాయుదయాద్రిపై - నరసి, యవ్వలికి
బోయి సుదర్శన - పుణ్యనామంబు4430
మిక్కిలి యగు దీవి - మీరు వీక్షించి
యక్కడ నరుణసం - ధ్యాప్రకాశమునఁ
గనుపించు చోటుల - గని రండు మీఱి
చనకుఁ డవ్వలఁ దమి - స్రమునిండి యుండు
పొమ్ము మూఁకలఁగూడి - పోయి శోధించి

క్రమ్మరు మొకనెల - గడువు చేసితిని.
ఆ మితికిని రాక - యాజ్ఞఁ గైకొనక
తామసించినవాఁడు - దండనీయుండు

—: వినతుఁడు తూర్పుదిశకు వెడలుట :-

వేగఁ బొమ్మని” పల్క - వినతుఁడు తూర్పు
సాఁగిపోయెను దన - సైన్యంబుతోడ.4440
తరువాత నీలమైం - దద్వివిదులను
గరువలి పట్టిని - గజుని గవాక్షు
శరభసుహోత్రుల - జాంబవద్గజుల
శరగుల్మ విజయకే - సరిపుంగవులను
గంధమాదనుని యం - గదుని సుషేణు
గందేభసత్త్వు ను - ల్కాముఖు నలుని
రమ్మని తగినకా - ర్యంబది గాన
సమ్మతపడఁ బల్కి - జతకట్టుచేసి
“దక్షులు మీరు సీ - తను వెదకుటకు
దక్షిణదిశకు నిం - దఱుఁగూడి పొండు4450

-: అంగదాదులు దక్షిణ దిశకు వెడలుట :--

వానరోత్తములార! - వైశిఖరములు
నానర్మదయును విం - ధ్యము భోగవతియు
వరదమేఖల శరా - వతి కృష్ణవేణిఁ
బరికింపుచును మహా - భాగయు దాఁటి
కదలి దశార్ణవ న - గరములు చూచి
కదిసి కౌశిక కళిం - గ ఋషీకములును

దరసి మాహిషికా వి - దర్భదేశములు
నరసి యవ్వల దండ - కారణ్యమునకుఁ
బోయి గోదావరిఁ - బొడగని యవలి
చాయగా నంధ్ర దే - శంబెల్లఁ జూచి4460
చోళకేరళపాండ్య - శూరసేనములు
గౌళదేశమయోము - ఖమహీధరంబుఁ
గ్రమియించి యవ్వలఁ - గావేరి దాఁటి,
యమరు గంధపుకొండ - యండకుఁజేరి,
యూమలయాద్రిఁ బా - యని యగస్త్యునకుఁ
జేమోడ్చి యాయన - చేఁ జూపినట్టి
నెలవునఁ దామ్రప - ర్ణీనది దాఁటి
యిల నెన్నఁదగిన మ - హేంద్రపర్వతము
భావింపుఁ డచ్చటి - పర్వకాలముల
దేవతానాథుఁ డెం - తే వేడ్క వచ్చు4470
కనుఁగొనుఁ డలపాండ్య - కనకకవాట
మన మీరు నది దక్షి - ణాంబుధిచెంతఁ
గాలూఁది నిలువ నే - కడ నాసలేక
యా లంక శతయోజ - నావధియైన
నడిమి వారాశిలో - నఁ ద్రికూటమనెడు
పొడవైన గట్టుపైఁ - బొలుపు వహించు
నదె రావణస్థాన - మచ్చోటఁ గలయ
వెదకుఁడు రాముదే - వేరి నేమఱక
అంగారక యనంగ - నాసురి లంక
సంగడి నది యుండు - ఛాయాగ్రహంబు4480

అచ్చోట నుండునో - యని మీకుఁ దెలియ
నిచ్చలోఁ గడు సంశ - యించి పల్కెదను
గట్టిగా శోధించి - కడలికి నవలి
గట్టునఁ బుష్పిత - కనకంబుఁ జేరి
యందొక్క రాజతా - యత శృంగ మొప్పు
నింద్రుఁ డయ్యెడఁ జరి - యించు నెల్లపుడు
నొక శిఖరము కన - కోజ్జ్వలంబగుచు
నకళంకమహిమ సూ - ర్యనివాసమయ్యెఁ
బాపాత్ములకుఁ గానఁ - బడదా నగంబు
చూపట్టునెడ మ్రొక్కి - చూడుఁడా నెలవు,4490
దాని యవ్వలఁ జతు - ర్దశ యోజనములఁ
దానొప్పు సూర్యవం - తముపేరి నగము
వైద్యుతంబను కొండ - వరలు సాదండ
హృద్యమై తగు సెల - యేరులచేత
స్థిరముగా నాదిమ - శిల్పి నిర్మితినిఁ
గర మొప్పు నచట న - గస్త్యుని నగము,
అది కాంచనమయంబు - నామడవెళపు
పది యోజనము నే - ర్పడు పొడవగుచుఁ
దెరఁ గొప్పు భోగవ - తీ సౌజ్ఞ చేతఁ
పురము రంజిలు నది - భుజగుల కెల్ల4500
వాసమై తనరు నే - వల నది యేలు
వాసుకి యన మహా - వ్యాళవల్లభుఁడు
ఆచెంత వృషభాద్రి - యన నొప్పు నందు
నేచాయఁ బరిమళా - నేక వస్తువులు
గోరోచనాగరు - కుంకుమమృగమ

దారూఢరాసుల - యగ్రభాగములు
నదియేలు రోహితుఁ - డనెడి గంధర్వు
డెదురెందులేని య - హీనశౌర్యమున
దక్షుఁడు వాని ప్ర - ధానులు శుకుఁడు
చక్షువు గ్రామణి - శైలూషు లనఁగ4510
నలువురు గాతు రు - న్నతబలు లట్టి
పొలిమేర చెంగటఁ - బోక వర్తిలుఁడు
ఆవలఁ బితృలోక - మట యమపురము
పోవరాఁదగుట గొ - బ్బున మీరు మఱలి
రండొక్క మాస ప - ర్యంతంబులోనఁ!
బొం డెవ్వడైన భూ - పుత్రినిఁ జూచి
వచ్చిన వానికి - వలసిన విచ్చి
యిచ్చెద సగము నే - యేలు రాజ్యమున
నాదు ప్రాణములక - న్న హితుండు వాఁడు
వైదేహి యున్నట్టి - వార్తఁ దెచ్చినను,4520
నెలకు రానట్టి వా - ని వధింతు నేను
గెలుఁడు పొండ”నుచుఁ బ - ల్కి యనంతరమున

-: సుషేణుఁడు పడమటి దిక్కునకు వెడలుట :-

ఘనుని సుషేణుని - గాంచి "రా మామ!"
యనుచు నల్లుఁడు గాన - నడుగులవ్రాలి,
"ఈమరీచి కుమారు - లెల్ల నత్యంత
భీమపరాక్రమో - పేతులౌవారు!
అంతటికన్న నీ - యర్యముల్ శౌర్య
వంతులు నీవెంట - వత్తు రీ రెండు

లక్షలతో నీవు - లక్ష్మణాగ్రజునిఁ
బక్షీకరించి యీ - పడమటి దిశకుఁ4530
జనుము సీతను గాంచి - చనుదెమ్ము మఱల
వినుము మార్గంబు నే - విన్నవించెదను.
ఎలమి సురాష్ట్ర బా - హ్లికశూరదేశ
ములు బురంబులు వనం - బులు వెదకుచును
బడమర బ్రవహించు - పావన నదులు
పొడగని యచటి త - పోవనావళుల
జాడగా పడమటి - జలరాశి వారి
కేడపుఁ దోఁపులఁ - గ్రీడించి చెంత
జీకటి తోఁపులు - జేరి యచ్చోట
నాఁకలిదప్పులు - నలమటల్ దీఱి4540
మురజ జటీపట్ట - ములు నంగలోహ
పుర మవంతియుఁ గాంచి - భూమిజ వెదకి
శతశిఖరములకాం - చనపర్వతంబు
జతనంబుతోఁ జేరి - శరభవరాహ
వేదండసింహాది - వివిధ జంతువుల
యాదండఁ జేరక - యణఁకువనేఁగి
పడమటిదిశ వజ్ర - పర్వతంబునకు
నడచుచో నిరువది - నాలుఁగుకోట్ల
గంధర్వు లుందు ర - క్కడ వారి మీరు
సంధింపఁ బోవక - సాధారణముగ
వీరు వానరులన - వెదకుఁ డాకొండ
నూఱు యోజనము లం - దును జనకజను.
ఆవలఁ జని సహ - స్రారచక్రంబు

గావించె మును విశ్వ - కర్మ యచ్చోట
నది చక్రవన్నామ - కావనీధరము
వెదకుఁ డచ్చట దైత్య - విభుఁడొక్కరుండు
సాహసాఢ్యుడు పంచ - జనుఁడు వసింప
నాహరి గరుడవా - హనుఁ డౌచు వచ్చి
యాచక్రమున వాని - యౌదలఁ ద్రుంచి
భూచక్రమున వైచి - బొందుగలోన4560
శల్యమై తగు పాంచ - జన్యంబు భువన
కల్యాణకరము దాఁ - గైకొని యవియె
తనకుఁ గైదువులుగా - దామోదరుండు
చనియె మీ రాచక్ర - శైలంబు వెదకి
యాజాడఁ జనుచోట - నరునదినాల్గు
యోజనంబులమేర - నొప్పువరాహ
శైలంబునందుఁ గాం - చనరత్నశిఖర
జాలంబు ప్రాగ్జ్యోతి - షపురంబుఁ జుట్టి
యెసఁగు నాగిరిదుర్గ - మేలెడు నట్టి
యసురవల్లభు నర - కాసురుఁ డండ్రు.4570
అది మీఱి మేఘవ - దాఖ్యపర్వతము
చదలు మోచిన శృంగ - చయములచేతఁ
బరగు మున్నది యింద్రుఁ - బట్టంబు గట్టు
పరమోత్సవమువేళ - భద్రాసనంబు!
అండగా నది చుట్టి - యరువదివేలు
కొండలు సౌవర్ణ - గూటముల్ గలిగి
మెఱయు నాచెంతనే - మేరువు దాని
యఱుతఁ బ్రకాశించు - నస్తాచలంబు.

అచటికి రవి చేర - నఖిలదేవతలు
నచలితప్రీతి సా - యంసంధ్య యనుచు4580
నియమముల్ దీర్తురు - నిర్జరనగము
పటుయోజనంబుల - పదివేల మేరఁ
గ్రుంకుడు గొండయె - క్కుడు వడితోడి
పంకజాప్తుని తేరు - పఱుచు నింతయును
గడియలో మును విశ్వ - కర్మ యక్కొండ
పొడవున నిర్మించె - బురవరం బొకటి!
అలమేరు భూధరా - స్తాచలమధ్య
తలమున బంగారు - తాఁటిమ్రా నొకటి
పది కొమ్మలను హేమ - ఫలములచేతఁ
జదలు మోచును మేరు - సావర్ణి యనెడు4590
నొకఋషి యచ్చోట - నున్నాఁడు మీర
లకలంకభక్తితో - నతనికి మ్రొక్కి,
యావల నంధకా - రావృతం బగుట
పోవక మఱలుఁడు - భూపుత్రి వెదకి
మితముఁ దప్పక రండు - మీ పుత్రి తార
హితమని తనమది - నెంచు నిత్తెఱఁగు!
అని సుషేణుని బంచి - యపు డుత్తరముగ
జనకజ నీక్షింప - శతబలి ముఖులు
సేవించు శతబలిఁ - జేరంగఁ బిలిచి
కేవల ప్రీతి సు - గ్రీవుఁ డిట్లనియె.4600

-: సుగ్రీవుఁడు శతబలి నుత్తరదిశకు సీతను వెదుకఁబంపుట :-

"లక్షవానరులు గొ - ల్వఁగ సీత వెదక
యక్షేశు దిక్కుగా - నరుగుము నీవు

నీచేత శ్రీరామ - ని ఋణంబుఁ దీర్చి
యాచంద్రతారక - ఖ్యాతిఁ గాంచెదను!
సెలవిచ్చితిని శూర - సేనపుళింద
ములు జూచి ప్రస్థలం - బును భరతమును
కురుమద్ర కాంభోజ - కోసల యవన
కరహాటశక బాహ్లి - కంబులు జనక
పారసీకావంతి - భాగంబు లెల్ల
నారసి తుహినాద్రి - కరిగి యవ్వలను4610
గాలపర్వత హేమ - గర్భసుదర్శ
నాలోకనమునఁ గృ - తార్థులై వెదకి
దేవనగముఁ జేరి - ధీరులై మీర
లావల శతయోశ - నాయత ధరణి
మరభూమిగాన యే - మఱక యవ్వలను
హరనివాసము రజ - తాద్రి శోధించి
యలకాపురంబు య - క్షాధీశుఁడున్న
నెలవందుఁ గమనీయ - నీరంబుచేత
నమరు విశాలస - రోంబుపానమున
శ్రమమెల్లఁ దీరి క్రౌంచ - బిలంబుఁ జూచి4620
మఱికామశైలంబు - మానససరము
దరిసి మైనాక భూ - ధరమును మయుని
యిరవు విచారించి - యేఁగి యచ్చోటఁ
దిరుగు గుఱ్ఱపుమోము - తెఱవలఁ జూచి
వారి చెంగటనున్న - వాలఖిల్యులనుఁ
జేరి ప్రణామంబుఁ - జేసి జానకినిఁ

గనిపింపుఁ డనుచు వై - ఖానస నగముఁ
గని సార్వభౌమ ది - గ్గజము నీక్షించి
కరణీశతంబుతో - గలసి యాకరటి
చరియించుఁ జేరఁగఁ - జనక యాకలన4630
వెదురు గుంపులు నట - వీ ప్రదేశములు
నదులను బసిఁడి కొం - డలు విచారించి
పోయి యుత్తరకురు - భూములయందు
బాయక యిష్టార్థ - ఫలదంబు లగుచుఁ
గలధౌతమయములై - కనుపట్టువృక్ష
ములను నిత్యానంద - ములఁ గూడియున్న
పుణ్యదంపతులనుఁ - బొడగని యత్య
గణ్యమౌ సోమన - గంబు చెంగటను
నావాస మొసరించు - నఖిల దేవతల
సేవించి యుత్తర - సింధువుఁ గాంచి4640
యంతట మఱలిరం - డవలికి నరుగ
నెంతవారికిఁ దీర - దిప్పుడే కదలి
పొండు ముప్పది దినం - బులకును మరలి
రండు రాకున్న నే - రము వచ్చు మీకు
హితము సేయుదు నేను - నీ రాఘపులకు
సతతంబు” నని - శతబలిఁ బనిచి
యందఱిిలోపల - హనుమంతుఁ జూచి
యిందు రమ్మని పిల్చి - యేకాంతమునను
కార్యసాధకుఁడని - కడు నిశ్చయించి
యర్యమ తసయుఁడి - ట్లని పల్కె నపుడు4650

 -: హనుమంతుని సుగ్రీవుఁడు దక్షిణదిశకుఁబంపుట :-

"జగతిని దిక్కుల - జలధులయందు
గగనభాగమున స్వ - ర్గరసాతలముల
నీగమనం బెందు - నిర్ణిరోధంబు
వేగంబు వాక్చిత్త - వృత్తాధికంబు
నప్రతిహతము నీ - యతులితశౌర్య
మప్రమేయము నీమ - హాబాహుశక్తి
వనపర్వతద్వీప - వసుధాంబు నిధులఁ
గని మున్ను నీ వెఱుఁ - గనియవి లేవు
యక్ష గంధర్వ వి - ద్యాధర సిద్ధ
రాక్షసులకు నిల్వ - రాదు నీయెదుర 4660
లలితతేజోవేగ - లాఘవసత్త్వ
ముల నీకు సరిలేరు - ముల్లోకములను!
అనిలుఁడు గాఁడు నీ - యంతటివాఁడు
జనకుని కీ శక్తి - శతగుణాధికము!
అతిబుద్ధిచే నుపా - యబలంబుచేతఁ
బ్రతిలేనివాఁడ వ - భంగ శీలుఁడవు
మృతిలేనివాఁడవు - మేనికి నస్త్ర
హతిలేని వాఁడ వ - పాయదూరుఁడవు
లక్షిత దేశాకా - లజ్ఞాన నీతి
దక్షుఁడ వతివజ్ర - తరశరీరుఁడవు!4670
అన్న! నీ వెటులైన - నవనిజఁ జూచి
నన్ను రాఘవునిఁ బ్రా - ణములతో నునుపు
మిందఱ బ్రతుకుల - కీవె కారణము
ముందఱ నీమనం - బునఁ దోచినట్ల

శోధించి వై దేహిఁ - జూచి వచ్చినను
సాధింప నేర్తు వ - క్షయము పుణ్యంబు
కదిలి పొ మ్మీకార్య - కర్తవు నీవు
పదువుకు నీమాట - పలుకులో వారు
నిన్నె నమ్మితి రాము - ని పదమ్ములాన
వన్నె వాసియుఁ దెమ్ము - వానరావళికి" 4680
అనిపల్కి యా దొర - లందఱు వినఁగఁ
గనిపించి మఱియు నీ - క్రమముగాఁ బలికి

 -: శ్రీరాముఁడు హనుమంతునకుఁ దనముద్దుటుంగర మిచ్చుట :-

పొమ్మన్న రాముఁ డ - ప్పుడు విచారించి
యిమ్మారుతాత్మజుఁ - డిట్టివాఁ డనుచు
మదినుంచి యపు డను - మానంబు లేక
యిది కార్యమనుచు నా - మాంకితంబైన
యనుమతి రాముఁ డూ - హించి లక్ష్మణుని
తన కడవ్రేలి కుం - దనపు టుంగరము
'పట్టుము తరువాత - బ్రహ్మపట్టంబు
గట్టెద నీ' కని - కట్టడ సేయు4690
రీతిగా నంజనా - ప్రియకుమారకుని
చేతికి నిచ్చి "మా - సీతను నీవు
పొడగన్న యప్పుడా - భూపుత్రి నిన్నుఁ
గడునమ్మ నేరదు - గావున నీవు
నీముద్దుటుంగర - మిచ్చి యిచ్చోటి
సేమంబులెల్ల వ - చింపుదు వెనుక

నిన్ను సుగ్రీవుఁడు - నియమించినట్టి
యెన్నికయును నాదు - హృదయవర్తనము
వదనవికాసభా - వము నింగితంబు
చెదరనీయక కార్య- సిద్ధి దెల్పెడును4700
చను” మన్నఁ గరములు - చాఁచి యుంగరము
వినయంబుతో నంది - వినతుఁడై లేచి
చేనున్న ముద్రిక - శిరసుపై నుంచి
వానరప్రభులు కై - వారము ల్సేయ
వలుద చుక్కలలోని - వనజారి యనఁగ
వెలయుచు నుత్సాహ - విశదాత్ముఁ డగుచు
'నీవానరాధీశు - లీవును గూడి
రావణు నగరి ధ - రాపుత్రిఁ జూచి
గెలిచి రండను' చు సు - గ్రీవుఁడు మఱియుఁ
బలికి పొమ్మనవుఁడు - ప్లవగ నాయకులు4710
ఎందెందు సుగ్రీవుఁ - డెవ్వారిఁ బనిచె
నందందు పయనమై - యప్పుడే కదలి
ధరయు నింగియు నిండి - దాఁటుచు మిడుత
పరివోలి దిశలు కం - పము నంద నడచి
పోయిన 'నెప్పుడె - ప్పుడు నెలవచ్చు
నీయెడ వేగింతు - వేనింక' ననుచు
సౌమిత్రి గూడి ప్ర - స్రవణశైలమున
రాముఁడు దినములు - క్రమియింవుచుండె.
సాగె నుత్తరముగా - శతబలి మునుపు
వేగఁ దూఱుపునకు - వినతుఁడు చనియె. 4720

అంగదాదులును బా - యక దక్షిణముగఁ
బొంగుచుఁ బవమాన - పుత్రుఁడు చనియె
మనసురంజిలఁ బడ - మటి దిక్కుగాఁగ
ఘనుఁడు సుషేణుఁడు - గదలె నాక్షణమ
నలుదిక్కులందు వా - నరవీరు లట్లు
చలము బలంబు న - చ్చలమై చెలంగ
“నేనె రావణుఁ గాంతు- నేనె వధింతు
నేనె జానకిఁ దెచ్చి - యిత్తురామునకు"
ననుచు నందఱు చాల - కగ్గలికలను
జనుచు గర్జింపుచుఁ - జప్పరింపుచును4730
దాఁటుచు సింహనా - దములు సేయుచును
పేటెత్తి నగములు - పెకలఁ దన్నుచును
వాలంబు లార్చుచు - వడి నొక్కరొకరు
గేలి సేయుచుఁ బంత - గించి పాఱుచును
మెరములు వేయుచు - మేని సోఁకులను
తరువులు గూల్చుచు - దఱుములాడుచును
'నేల మీరిందఱు - నీ కార్యమునకు?
జాలుదు నే'నని - జగడించుకొనుచు
'నను జూడుఁ డ'నుచు పం - తంబు లాడుచును
'చనుఁడు మీ యూళ్ళకు - సైన్యంబు' లనుచు4740
'పాతాళమున నున్నఁ - బగవానిఁ ద్రుంచి
సీతను గానుక - సేతు నే' ననుచు
'నిల వ్రక్కలింతునొ - యీ విశ్వమెల్లఁ
దలక్రిందు సేతునొ - తను జూడుఁ' డనుచు
'నామడ రెండు మూఁ - డామడలైన

నేమి? దాటుదము ర - మ్మీ'వను వారు
'రావణుఁ దోఁక నూ - రకఁ గట్టి రాము
దేవి మూఁపున నుంచి - తెత్త'ను వారు
'యెందున్న జానకి - నేఁదెత్తు నొకఁడు
పందెమాడునె?' యంచుఁ - బచరించువారు4750
అందఱు నుండగ - హనుమంతుఁ బిలిచి
యింద యంచును జేతి - కిచ్చె నుంగరము
తానేమి యెఱుఁగు? నిం - దఱు వానికన్న
హీనులే? కనుఁగొంద - మిఁక' ననువారు
అతడేమి సేయు? రా - జైనట్టివాఁడు
మితిలేని పొగడికల్ - మిక్కిలి పొగడ
కాఁబోలు ననుచు నుం - గరము చేతికిని
తాబిల్చి యిచ్చె - సీతానాయకుండు!
కనుపించుకొను వేళ - గాదని తాళు
కొని యుంటినపుడు నా - కోపంబణంచి4760
చేరి చెక్కిలిఁ గొట్టి - చేతి యుంగరము
తేరోరి యని పల్క - దినకరాత్మజుడు
తానేమి సేయునో? - దశరథాత్మజుఁడు
తానేమి సేయునో? - తప్పె గార్యంబు!'
అనువారు 'పోరోరి! - యది యేటిమాట?
మనమెల్ల నాహను - మంతుని వాల
రోమ మాత్రము లేమె - ఱుంగమే యతని
సామర్థ్య మటు సేయఁ - జను' ననువారు
నగుచు వానరు లట్ట - హాసంబుచేత
గగనంబు పుడమియుఁ - గంపింపఁ గదలి4770

చనినఁ బ్రభాకర - సంతతిం జూచి
అనఘాత్మకుఁడు లక్ష్మ - ణాగ్రజుఁ డనియె
“ఏ రీతి నెఱిగితి - వీ విశ్వ మెల్లఁ?
దీఱునే యొరుల కీ - తెఱపు లేర్పఱుప?
ఎన్నడు చూచితి? - వెవ్వారిచేత
విన్నావు? దివ్య వి - వేకమౌఁ గాక!
పూసగ్రుచ్చిన యట్లు - భుజపత్రికలను
వ్రాసి పారము సేయు - వైఖరిఁ జిత్ర
పటము చెప్పిన యట్లు - పటుబుద్ధి చేత
నెటువలె వాకొంటి? - విన్ని దిక్కులను!4780
చూచిరేనియు నవి - సులభమే మదికి
గోచరించి వచింపఁ - గూడునే యట్లు?
ఇంత ప్రజ్ఞాశక్తి - యేరీతిఁగలిగె?
నంతయు వివరింపు" - మన రాముఁ జూచి
కరములు ముకుళించి - కలయట్టిరీతి
తరణితనూజుఁ డం - తయు విన్నవించె.

-: సుగ్రీవుఁడు రామునకు సీతను వానరులు వెదకిన విశేషములను చెప్పుట :-

"అయ్య! దుందుభికి మా - యన్నకు మొదట
కయ్యంబు నడచిన - కార్యమంతయును
విన్నవించితి గద - విబుధుఁడై యున్న
నన్ను మావాలి మి - న్నక యాగ్రహించి 4790
తరిమిన నతనిచే - దాడికిఁ గాక
కొఱవి ద్రిప్పిన యట్లు - కుంభిని యెల్ల

దిక్కులు సాగర - ద్వీపముల్ దాఁటి
యక్కడక్కడ తమం - బవధిగా మఱలి
చేరఁ జో టెచ్చటఁ - జింతింపలేక
పాఱెడు తను జూచి - పవమానసుతుఁడు
మును మతంగుని శాప - మున ఋశ్యమూక
మను కొండచుట్టు మీ - యన్న రావెఱచు
నాయద్రిపై నున్న - నన్నిఖేదములు
వాయుదమని పల్కు పావని మాట4800
జేసితి నటుగాన - చిత్తంబులోన
నేసర్వమును జూచి - యెఱిఁగి యుండుదును.”
అనుచుఁ బల్కిన యంత - నన్ని దిక్కులకుఁ
జనిన వానరులు మా - సమితంబునకును
బాయక సీతను - బగలెల్ల వెదకి
రేయు నిద్రించి కో - రిన ఫలాపళులు
మెసవుచు నెందు భూ - మిజఁ గానలేక
యసురసురై వచ్చి - నట్టిమార్గమున
నందఱు వచ్చిరి - యా వినతుండు
'ముందుగాఁ బూర్వాభి - ముఖమునఁబోయి4810
తాఁగాన'నియె నం - తట శతబలియుఁ
'దాఁగాననవియె ను - త్తరపు దిక్కునను.'
వారి వెంబడిఁ దాను - వచ్చి సుషేణుఁ
డారీతి వచియించె - నర్కజుతోడ.
తమరు వోయిన పోక - తమవచ్చురాక
తమ యగచాటులు - తడవిరిగాని
యందొక్కడైనన నే - నవనిజఁ గంటి

నిందునన్నట్టి వాఁ - డెవ్వఁడు లేక
యాస దీఱఁగఁ బల్క - నది విని మిగుల
గాసిచే రఘుపతి - కన్నీరు రాల్ప 4820
నందఱ ప్రాణముల్ - హనుమంతు మాట
యందుఁ గీల్కొనఁ జేసి - యడియాస చేత
"ఎప్పుడు వచ్చునో - యీ నెల గడువు
తప్పె నాయన రాక - తామసంబయ్యె
సీతను జూచి వ - చ్చినమేలు కాక
యేతరి వెదకితి - నెచ్చోటఁ గాన
నను నంతకన్న రా - నట్టిదేమేలు
తనచేనిలోని విం - దఱి బ్రదుకులును"
అనుచు విచారింప - హనుమంతుఁ డచటఁ
దన వెంట దారాంగ - దకుమారముఖులు 4830
కూడి రా నద నది - గోటలు గిరులు
జాడల వెదకుచు - చవులైనయట్టి
ఫలములు మెసవుచుఁ - బతిచెప్పినట్టి
నెళవులఁ గాలూఁది - నిలువక తిరిగి
జనకజఁ గానక - చనిచని కండుఁ
డను మునీశ్వరుని మ - హాశ్రమంబునకు
నందఱు గుమిగూడి - యరుదేర నచట
నెందెందుఁ జూచిన - నేమియు లేక
యతిఘోరతపము సే - యఁగఁ దొల్లి యతని
సుతుఁ డీల్గుటయుఁ బుత్ర - శోకంబుచేత 4840
నావనంబెల్ల మృ - గాంబు భూమీరు
హావళి యుడివోయి - యావళినొంది

పాడఱుగాకని - పదరి శపింప
నాఁడాదిగా నిర్జ - నస్థలం బగుచు
నున్నది గాన వా - రోడక సీత
నన్నెలవుల నెల్ల - నారసి చూచి
కానక యొక్క రా - క్షసుని వీక్షించి
వానరవీరుల - వాడును జూచి
"ఎక్కడివారు? మీ - రేఁటికి వచ్చి
చిక్కితి రిపుడు నా - చేతిలోపలికి 4850
పోనిత్తునే!” యని - పొడవుగా భయద
మైనట్టి తనదు బా - హాయుగళంబుఁ
జాఁచుక వచ్చు రా - క్షసుని వీక్షించి
కొంచవారక వాలి - కొడు కాగ్రహించి
చేకొద్ది రొమ్ము వ్రే - సిన సొమ్మసిల్లి
మోకరించుక ప్రాణ - ములు వోయి పడియె.
దానవుఁ బొరిఁగొన్న - తమ యువరాజు
వానరులెల్ల గై - వారముల్ చేసి
యాచుట్టు నెళవుల - నవనిజ వెదకి
యేచోటఁ గానక - యెల్లరు గూడి 4860
యలసి యాకెలని మ - హామహీరుహము
చలువ నీడను వరు - సను గూరుచుండి
తనవారితో నంగ - దకుమారకుండు
తనువెల్ల నలసి కొం - దలముతోఁ బలికె.
"మన చేతనైన క్ర - మంబున రాజు
చనుమన్న చోటికిఁ - జని చూడుమన్న
చోటులు కలియంగఁ - జూచి వేసరక

దాఁటుమన్న నగాళి - దాఁటి వాహినులు
చూడుమన్నవి యెల్ల - చూచి యేరీతి
నాడించె నటులెల్ల - నాడి యింతయును4870
రిత్త వోవంగ ధ - రిత్రీతనూజ
నిత్తరి గనమైతి - మిఁక నేటి బ్రదుకు?
కానలేమని పోయి - గడువునకైన
భానుజుఁ జేరిన - బ్రదికించు నతఁడు
మితమును మీరి భూ - మిజఁ గానకున్న
నతఁ డుగ్రశాసనుఁ - డగుట యెఱింగి
జీవనాపేక్షులు - చెల్లునే యింకఁ
గావున నిదురయాఁ - కలి దప్పులుడిగి
వెదకుఁడు సీతను - విశ్వంబులోన!
పదరక చేతనౌ - పాటులఁ బడినఁ4880
గార్యమొక్కట దైవ - గతిని సిద్ధించు
మర్యాదమాని యే - మఱియున్నవారు
రామసుగ్రీవుల - క్రమము నాజ్ఞయును
మీమనంబులు కుందె - మేనులువాడె!
అలసితి మాకొంటి - మని ప్రాలుమాలి
చలవ నీడను సుఖ - శయనులైనారు.
వచియించితి" నటన్న - వాలినందనుని
వచనంబు విని మాల్యవ - వంతునిఁ జూచి
గంధమాదనుఁ "డిది - కార్యమౌఁ బ్రాణ
బంధులైనను బట్టి - భానునందనుఁడు4890
తప్పిన దండించుఁ - దగదు రం” డనుచు
నప్పు డందఱు లేచి - యలయిక లేక

సీతను వెదకి ద - క్షిణముగా వచ్చి
ధౌతప్రభాధగ - ద్ధగితమై తమకుఁ
గనుపట్టెనో వచ్చి - కైలాసమనఁగఁ
దనరు రాజిత మహీ - ధరము నీక్షించి
యావెండికొండ డా - యఁగఁబోయి యెల్ల
తావులఁ జల్లని - తావులు చల్లు
కపురంపుటనఁటులు - ఖర్జూరములును
దపనీయ కమలశీ - తళసరోజినులఁ4900
గనుఁగొని తమపని - గట్టెక్కెననిన
యనువున నాకొండ - నందఱు నెక్కి
యాచాయ నుండునో - యవనిజ యనుచుఁ
జూచియుఁ గానక - చూతముగాక
చూతమున్నట్టి యా - చోటని డిగ్గి
శీతలంబైన యా - చెట్టు క్రిందటను
వెదకియుఁ గానక - వింధ్యాద్రిఁజేరి
యదియును జూచి తా - రాంగదాదిములఁ
దాఁగూడి పవమాన - తనయుఁడు గుహలు
వాగులుఁ గోనలు - వనములు చరులు4910
దక్షుఁడై వెదకి యా - ధరణీధరమున
రాక్షసు మూల ఘో - రద్వారమైన
బిలముఁ గన్గొని చేరఁ - బిలుచుచుఁ దార
నలనీలకుముద మైం - దద్వివిదులును
వాయుజుండును జాంబ - వంతుఁ డంగదుఁడు
నాయెడ గజగవ - యగవాక్షముఖులు
నందఱు గుమిగూడి - యాఁకట నొగిలి

యందుఁ బ్రవేశింప - ననువుగాకున్న
జింతిల్లు నెడ తడి - సినఱెక్కలను శ
కుంతముల్ బకహంస - కోయష్టికములు4920
మొదలైనయవిరాగ - ముదితులై బిలముఁ
గదియంగరాక యా - కడనున్న యొక్క
దనుజుని గేహ మం - దఱుఁ జూచుచుండ
హనుమంతుఁ డా వాన - రావళిఁ జూచి,
“ఇదె వచ్చె జలపక్షు - లీగుహనుండి
నదియైన దొనయైన - నడబావియైనఁ
జెఱువైనఁ గొలనైన - సిద్ధ మిచ్చోట
నిరపుకొన్నది చూడుఁ - డీ భూరుహములు
చెంగలించిన బాగు - చీకటు ల్గదిసి4930
చెంగట మనకిది - చేరంగరాదు.
ఐన నేమాయె? రం - డని" యాబిలంబుఁ
దాను మున్నుగఁ జొ - చ్చి - తనవారలెల్ల
వెనుకొని రాఁబోవ - విపులతేజములు
పనికిరావయ్యె నా - సాటివారలకు
మఱి పోవఁ బోవ ము - మ్మరముగా నెదురఁ
దెరవుఁ గానంగని - దివ్యతేజంబు
దిగదిగ వెలుఁగుచో - దృష్టింపలేక
మొగిడించి కన్నులు - ముందఱ వెనక
కానక యొక్కఁడొ - క్కనిఁ గౌఁగలించి
మేనులు మఱచి యే - మియుఁ దెల్వి లేక4940
యొక యోజనము మేర - యూరకపోయి
యొకరైన వాయెత్త - నోపక భ్రమసి

దగదొట్టి నాల్కలఁ - దడి లేక చాల
దిగులుతో దప్పివా - తెఱ లెండఁబాఱ
బ్రదుకుల యాస స్వ - ప్నములందు లేక
చదికలఁబడువాని - జదియఁద్రొక్కుచును
బడుచు లేచుచు గాలి - పట్టియే తక్క
కడమవారెల్ల న - గ్గలిక లే కరిగి
యావలఁ జనుచోట - నరజామునకును
కావిరి విఱిఁగిన - క్రమముతోఁ దమకు4950
నలమట లెడవాసి - యజ్ఞానముడిగి
తెలివిడి వచ్చిన - దృష్టించునపుడు
కనుమ్రోలఁ గాంచన - కలధౌతభూజ
వనములు చూచి యా - వలఁ బోవ హేమ
కమలముల్ నవరత్న - కర్ణికావళులు
విమలముక్తాఫల - వీచికాగణము
కలహంస చక్రవా - కక్రౌంచ మిథున
విలసనంబులు గల్గు - విపులదీర్షికలు
కాంచి ముందఱఁ జూడఁ - గనగన వెలుఁగు
కాంచనవప్రంబుఁ - గనకసౌధములు 4960
మగరాలగోడలు - మణికుట్టిమములు
పగడాలకొణిగలు - పసిఁడితల్పులును
బచ్చతోరణములు - బరువుముత్తియపుఁ
గుచ్చులు జల్లులు - గోమేధికముల
జాలకంబులు పారి - జాతప్రసూన
మాలికలును నీల - మయవేదికలును
పట్టపటుధ్వజ - పాళికల్మణుల

మెట్టికలును హేమ - మృగచిత్రచయము
నవరత్నరథము లు - న్నతగోపురములు
భవనముల్ సావళ్లు - పడకిండ్లు తెరలు4970
పట్టిమంచంబులు - పఱపులు మేల్మి
పట్టుతలాడలు - బటువు బిల్లలును
మణిదీపకణికలు - మర్దలవేణు
పణవమృదంగాది - బహుసాధనములు
రత్నకంబళ్లు ప - రంగిపీటలును
రత్నపాత్రికలు నా - రతి పళ్ళెరములు
కౌళికాగరు ధూప - గంధసంవాసి
తాళాంతరాళర - మ్యప్రదేశములు
వివిధవస్తుసమృద్ధ - విపణివీథికలు
పువులు గస్తురిగంధ - వొడికదంబములు4980
మదిరాఘటంబులు - మాంసరాసులును
పొదిగొన్న దధ్యాజ్య - పూర్ణకుంభములు
కాంచనరాసులు - గలిగిన యట్టి
కాంచనపురము చెం - గట విలోకించి
మందునకైనను - మానిసి కులము
పొందికలేనట్టి - పురములోఁ జొచ్చి
హరివరుల్ కనకల - తావళితోడ
బెరస కెంపులతేనె - పెరలు ముమ్మనుచు
నపరంజి తుమ్మెద - లాడ వైడూర్య
విపులప్రసపగుచ్ఛ - విశదమై కనక 4990
కేసరామృతరసా - కీర్ణమై హేమ
భాసిరజోబృంద - భరితమై శాత

కుంభ నానాపక్షి - కోటియై కవక
సంభారఫలనమ్ర - శాఖియై పొలుచు
నొక్కబీజమునీడ - నొసపరి చన్ను
జక్కవల్ చీరవ - స్త్రము మాటుపఱుప
మూయుఁ గన్నులతోడ - మువ్వన్నెమెకము
మేయొల్పు జఘనంబు - మీఁద రాణింపఁ
జిగురు చేతులు కల్వ - చెలికాని లోన
సగమైన నుదుట నం - జలితోడఁ గూడ5000
కాఁక దీరుకడాని - కమ్మియో యనఁగ
వ్రేఁకమౌ తనముచే - వెలుఁగు నంగమున
జాళువా పావల - చరణపద్మములు
వాలిచి వ్రాల్పక - వనభూమి నెగయు
నుదిరి దుమ్మునఁ గప్పి - యున్నట్టి తపసి
ముదితను జూచి క - మ్ముక వారలెల్ల
బెన్నిధిఁ గనుఁగొన్న - పేదయుఁబోలి
సన్నుతింపుచు నమ - స్కారముల్ చేసి
యందఱు గడనుండ - హనుమంతుఁ డపుడు
ముందఱ నిల్చి కే - ల్మొగిచి యిట్లనియె5010

  -: స్వయంప్రభా వృత్తాంతము :-

"అమ్మ! నీ పేరెద్ది? - యసహాయ వగుచు
నిమ్మేనఁ దపమూన - నేమి గారణము?
ఈపురం బెయ్యది? - యెందు నెవ్వరును
జూపట్ట రది యేమి? - చోద్య మేర్పఱపు
దీనుల మముఁ గృపా - దృష్టి నీక్షించి

మానుపు మొకమాట - మావిచారములు!
దేవతారమణివొ! - తెలుపు మీవిపిన
దేవతవో? నీవ - దిక్కుగా నిలుచు
నీపురలక్ష్మివో? - యిపుడు మాపాలఁ
జూపట్టు పుణ్య మె - చ్చునఁ దీఱినదియొ?5020
ఆనతి యీవమ్మ! - యవనిజ వెదకఁ
బూని సుగ్రీవు పం - పున వచ్చినాము
ఆఁకలిదప్పుల - నలసిన మేము
చీకటిబిలముఁ జో - చ్చితిమి నిరాశ
నీరత్నరాసులు - నీ హేమరాసు
లీరమణీయమ- హీరుహంబులును
నీపట్టణ మపార - హేమమాణిక్య
దీపప్రకాశసం - దీపసౌధములు
నెవ్వరి సొమ్ము నీ - వింతియె కాని
యెవ్వరు లేరిందు - నెందుఁ జూచినను"5030
అనినఁ దపస్విని - హనుమంతుమోముఁ
గనుఁగొని యుచితవా - క్యముల నిట్లనియె,
"మాయావియైనట్టి - మయుఁడు పూర్వమున
నాయబ్జసంభవు - నాత్మగుఱించి
తపము గావించి ధా - తవరంబుచేతఁ
జపలాక్షి హేమ న - చ్చరజాతిదాని
దివినిఁ బట్టుక వచ్చి - తెరవెందు లేని
వివరంబుఁ గల్పించి - విపులాంతరమున
శైలంబుక్రింద కాం - చనరత్నమయవి
శాలమౌ నగర మీ - చాయఁ గావించి

యా కొమ్మయును దాను - నరమర లేని
యేకాంతసుఖముల - నెల్లభోగముల
నొంటి కాపురము సే - యుచునుండ నతని
వెంటాడి తనచేఁ బ - విప్రహారమున
గిరియును దొలిచి వా - కిలి చేసి మయునిఁ
బొరిగొని హేమను - బూఁదేరుమీఁద
నెక్కించుకొని యింద్రుఁ - డేఁగెడువేళ
నక్కొమ్మ నెచ్చెలి - నైనట్టి కతన
నను నుండుమనుచు నీ - నగరంబులోన
నునిచి తాఁబోయె నే - నున్నట్టిదాన!5050
మేరుసావర్ణి కూ - ర్మితనూజ నేను
పేరు స్వయంప్రభ - పెక్కేండ్లనుండి
మహనీయయోగస - మాధిచే నిచట
విహరింతు వలసిన - వేళ నెందైన
నరుగుదు వేలుపు - లర్థించి చేరఁ
బరిచర్య సేతు సం - భావించి వారి.
ఎవ్వరివారు? మీ - రేనిమిత్తముగ
నివ్విపినమునకు - నేతెంచినారు?
బిలముఁ జొచ్చితి రేయ - పేక్షచే? నేమి
వలసిన నిత్తు భా - వముల నున్నట్టి5060
పలుకులు మీకు దె - ల్పఁగ నాకు వినగ
నలవగునేని యే - నడిగితిఁ గాన
యన విని హనుమంతుఁ - డంజలిచేసి
వినుమని జడదారి - వెలఁది కిట్లనియె
“దశరథసుతుఁడు సీ - తానాయకుండు

శశివదనుఁడు రామ - చంద్రుండు తాను
తమ్ముఁడు మగువయుఁ - దండ్రివాక్యంబు
నెమ్మది నుంచి వ - నీభాగములకు
వచ్చి వసింప రా - వణుఁడు జానకిని
మ్రుచ్చిలి కొనిపోయి - మోసపుచ్చుటయు5070
నారాఘవుండు సూ - ర్యతనూజుతోడ
పోరామి చేసి యి - ప్పుడు మమ్ము బిలిచి
'ధరణిజ వెదకుఁడు - దక్షిణ దిశను
సరగున రండు మా - సములోనె మఱలి'
అని మమ్ము బనిచి మా - యట్టివానరుల
ననిచిరి వెదుకంగ - నన్నిదిక్కులకు
నేము వచ్చినవార - మెల్లచోటులను
భూమిజ వెదకి యి - ప్పుడు చాలనలసి
యీయెడఁ దడిసిన - యెఱుకలతోడ
నేయిముద్దలవంటి - నీడజశ్రేణి5080
బిలము వాకిట తమ - పెంటులతోడ
వెలువడఁ జూచి మీ - వివరంబులోన
నీరము ల్గలవని - యేమిందుఁ జేరి
నీరంధ్రమగు తమో - నివహంబుఁ జొచ్చి
వెలుఁగు లోపలఁ జిక్కు - విధమునఁ బెద్ద
వెలుఁగులో నుడిపడి - వెదకంగ లేక
ప్రాణముల్ పిడికిటఁ - బట్టుక కొంత
త్రాణఁ దెచ్చుకొని యం - దఱము నీవలికి
సాగి వచ్చితిమి కాం - చనపురిఁ జూచి
యోగిని! యొకకొంత యూరడిల్లితిమి?

జలము లానితిమి ర - సాలాది పక్వ
ఫలములు మెసవి క్షు - ద్బాధ వాసితిమి
ఎన్ని నాళ్లాయె మే - మిచటికి వచ్చి?
కన్నియ! మఱలిపోఁ - గానము తెరువు
దరిఁజేర్పు మమ్ము నిం - దఱి నీవు సేయు
పరమోపకారంబు - భావంబులందు
నిలుపుటింతియె కాక - నేర్తుమే నీకు
కలకంఠి! ప్రత్యుప - కారంబు సేయ
వనచరులము గాన - వరకృపాదృష్టి
గను” మన్న సావర్ణి - కన్నె యిట్లనియె.5100
శ్రీరాముకార్యంబుఁ - జేసెద మనుచుఁ
జేరిన మిమ్ముఁ జూ - చినయంతె చాలు
మీకేమి వలయు నీ - మేరఁ గల్గినవి
వాకొని కై కొని - స్వాదునీరంబు
నానాఫలంబు లిం - దఱు దృప్తిఁ దీఱ
నాని పొం డనవుఁడు - హనుమంతుఁ డనియె.
"కమలాక్షి! మమువంటి - కపుల కీత్రోవ
నమరించితి వయాచి - తాతిథ్య మీవు "
అన్నిటఁ దృప్తుల - మైతిమి మమ్ము
మన్నించి దరిఁజేర్చు - మార్గంబు గనుము5110
అర్కనందనుని యా - జ్ఞార్హుల మేము
కర్కశుఁ డారాజు - గడువును మీఱె
వెడలనంపుట పది - వేలు మా క"నుచు
నుడివినయట్టి హ - నూమంతుఁ జూచి
"ఏరికిఁ బోవరా - దిచటికి వచ్చి

మీరెల్ల నొక్కని - మేషమాత్రంబు
కన్నులు మూసుక - కదలకయుండుఁ"
డన్న వానరులెల్ల - నటుల సేయుటయుఁ
గరములఁ గన్నులు - గప్పుక యున్న
హరివీరవరుల మ - హాయోగశక్తి5120
బిలము వెల్వలఁ దెచ్చి - పెట్టి యూరార్చి
చలవమాటలు వల్కి - “జలరాశి యిదియె!
ఇదే ప్రస్రవణశైల - మిదియె వింధ్యాద్రి
యిది యుదయాచలం - బిది యస్తనగము
తెలిసికొండ" ని నాల్గు - దిక్కు లేర్పఱచి
వలసిన యెడ కేఁగి - వత్తురు గాక
మేలు గావలయును - మీకెల్ల" ననుచు
చాలదీవించి కాం - చనగాత్రి చనిన
బయలుదేరిన యంత - భ్రమయును దీఱి
పయనమై జనకజఁ - బరికింప మనుచుఁ5130
జూచుచో వికచప్ర - సూనగుచ్ఛములు
కాచినకాయలు - కమ్మనిపండ్లు
చల్లగాడ్పులును వ - సంతా గమమున
నుల్లసిల్లిన భీతి - నొంది వారెల్ల
మనముల “నాశ్విన - మాసంబునందు
నినసూనుఁ డనిచె నిం - కేమి చేయుదము?
పుష్యమాసము వచ్చెఁ - బోలు మరంద
నిష్యందసూనముల్ - నిండె నీవనుల
మార్గశీర్షమొ యిది - మనకింక నేది
మార్గ?" మంచును దీన - మానసు లగుచు5140

నందఱుఁ జింతింప - నంగదుఁ డపుడు
తుందుడుకున వారితో - నిట్టులనియె

-: సీతను వెదకి కనుఁగొనలేనందులకుఁ జింతిల్లి అంగదుఁడు ప్రాయోపవేశము చేయనిశ్చయించుట :-

"ఎంచ నేమున్నది - యిఁకమీఁద? కావ
రించి మించితిమి సు - గ్రీవాజ్ఞ మనము!
గడువు దప్పితిమి రా - ఘవుదేవినైనఁ
బొడగానమైతిమి - పొసఁగ బొంకుటయు
బుద్ధిమంతులు కార్య - బోధకు ల్వంశ
వృద్ధులు నీతికో - విదులు ధార్మికులు
నుత్తమగుణశాలు - లురుకీర్తినిధులు
మత్తారి వీరదు - ర్మానభంజనుల 5150
కాలోచితంబైన - గతి వివరింతు!
తేలనాడకుఁడు ప - దింబదిగాఁగ
నాలోచనము సేయుఁ - డర్కనందనుని
పాలికిఁ జని యాజ్ఞఁ - బడిపోవు కన్న
నిచట జచ్చుటయ మే - లింత లేదనుచు
నచటి కేఁగినఁ దాళఁ - డల్పదోషంబు!
సీతను వెదకి చూ - చినయది లేదు
మీతెఱం గడుగ నే - మిటికింక నాకు?
ఆతరువాత మీ - రైనట్లు కనుఁడు
ఏ తెరవునఁ బోతి - రేమి? యామీద 5160
ప్రాయోపవేశన - పరుఁడనై యిపుడె
కాయంబుఁ దొరుగ ని - క్కడ శయనింతు!

ఇదియె మీకును బుద్ధి - యిండ్లు సంపదలు
మదవతుల్ తనయులు - మనలరాకలకు
నాసించి యుండుదు - రని వారిమీద
నాసలు సేయక - యవి తెగఁగోసి
మఱలిపోవుద మను - మాట చిత్తముల
మఱవుఁడు రఘవంశ - మణి నన్నుఁ దెచ్చి
కరుణించి యువరాజు - గావించెఁ గాక
ఖరకరాత్మజుఁడు తాఁ - గావలెననుచుఁ5170
బట్టంబుఁ గట్టెనె - పట్టిగా యనుచు?
అట్టిచో నేమియు – ననలేక తాళి
కాదనఁగా లేక - కడకుఁ బొమ్మనియె
నేదైన నొకనేర - మెన్నెద ననుచు
నందుపై నిదివచ్చె - నట్టె పొమ్మనుచు
నందురుగాని యా - యర్కవంశజులు
సీతఁ గానఁగలేక - చేరిననన్నుఁ
జేతులఁబట్టక - చెదఱఁ ద్రోలుదురు!
అపుడు సుగ్రీవుచే - నగపడి మొదట
కపటంబుచే లేని - కల్ల పైమోపి5180
వాలికిఁ బుట్టినఁ - వాఁడని తన్ను
కాలుఁగేలునుఁ గని - గలుగఁ గొట్టించు
నేనేల పోవుదు? - నీపుణ్యభూమి
మేను దొరంగుటె - మేలం" చు ననిన
నందఱు నంగదుఁ - డాడినమాట
యందమౌ నిదియని - యతని కిట్లనిరి.
“ఉగ్రశాసనుఁ డౌట - నోర్వఁడు తప్పు

సుగ్రీవుఁ డపుడు రా - జుల కిచ్చకముగ
నాజ్ఞసేయక మానఁ - డతివను బాసి
యజ్ఞుఁడై కామాంధుఁ - డైనరాఘవుఁడు5190
తనకేల యనుగాక - తగదుపొమ్మనుచుఁ
గనిపించుకొనఁ డిట్లు - గానేల మనకు?
చపలాత్ములై చేరఁ - జనుట కాదందు.
అపరాధులగువార - లధిపులకడకుఁ
బోవుదమందని - పోరాదు మఱలి
చావ నేమిటికి! మో - సమువచ్చె"ననుచు
ననిన తారాగ్రజుఁ - డైన తారుండు
తనకుఁ దోచియట్టి - దారి నిట్లనియె.

-:తారుఁడు బిలములోనే యుండిపోవుదమని వానరులకు బోధించుట - వానరు లందుల కంగీకరించుట:-

"ఎందును బోనేల? - యీరిక్షబిలము
నందులో నుండుద - మందఱుఁ గూడి5200
ఇచ్చోట మనకు నె - య్యెవి లేవు? మనసు
వచ్చినగతి నుండ - వచ్చు నెన్నటికి!
ఈరామసుగ్రీవు - లేల యింద్రునకు
జేరవచ్చునె యిట్టి - చీకటిబిలము?
కాదని వేఱొక్క - కడ కేఁగి యుండ
రాదు క్రమ్మరఁబోవ - రాదెఱింగియును!"
అన విని యిదిబుద్ధి - యవునని మెచ్చి
వనచరు “లిదియె యె - వ్వరికి సమ్మతము

తనహాని కెవ్వఁడు - తా సమ్మతించు?
చనుద మచ్చటి కను - సమయంబునందుఁ5210
దప్పెఁ గార్యం బని - తారుని మాట
కొప్పిన వానర - యూధంబుఁ జూచి
యష్టాంగవజ్రమా - యనతనబుద్ధి
యష్టాంగములతోడ - నమరినవానిఁ
జతురుఁ జతుర్బల - సంపన్ను రాజ
చతురుపాయసమర్థు - సాహసనిధిని
బలవంతుఁ బ్రాజ్ఞునిఁ - బాడ్యమిచంద్రు
వలె దినదినవృద్ధి - వరలెడివాని
మతి బృహస్పతిని కౌ - మారవయస్కు
నతిధీరు నంగదు - నమరనాయకుఁడు5220
మున్ను శుక్రుని బుద్ధి - మోసంబుఁదెచ్చు
కొన్నకైవడి నియ్య - కొని తారుమాటఁ
జెవినాని తానట్ల - సేయుదు ననెడి
యవివేకమునకుఁ దా - నసహిష్ణుఁ డగుచు
సకలాగమాంతార్థ - శాస్త్రకోవిదుఁడు
సకలసద్గుణశాలి - స్వామికార్యైక
పరతుఁ డాశ్రితకల్ప - భద్రసంధాత
కరువలిపట్టి చెం - గటఁ జేర నేఁగి
యొకఁ డెఱుంగకయుండ - నొకని బోధించి
వెకలి యాలోచన - విఱుఁగంగనాడి5230
భేదపుట్టించి తాఁ - బినతండ్రిఁ జేరఁ
గాదని యున్నయం - గద కుమారకుని

మామ చెప్పినబుద్ధి - మనసొగ్గి యున్న
యామహామహునితో - హనుమంతుఁడనియె.

-: హనుమంతుఁ డంగదునికి తారునిమాటలు వినవలదని హితోపదేశ మొనర్చుట :-

“ఏలయ్య! తారేయ! - యీబుద్ధి నీకు?
వాలితో సరియైన - వాఁడవు నీవు
యీరాజ్యమంతయు - నేలఁగఁజాలు
నేరుపు శౌర్యంబు - నీయందుఁ గలదు!
నీమాటలోపల - నిలుతురే వీరు?
సామాన్యులే? సత్త్వ - శాలు లిందఱును. 5240
ఈగజుఁ డీనీలు - డీజాంబవంతుఁ
డీగంధమాదనుఁ - డీసుహోత్రుండు
నీనలుఁ డీమైందుఁ - డీద్వివిదుండు
నేనును గైకోము - నిన్నుఁ జీరికిని!
నీయాజ్ఞలోపల - నిలుతుమే మాకు
రాయలైనట్టి యా - రవిసూనుఁ డుండ?
స్వామికార్యహితంబు - సడల నేరుతుమె?
ఏమని వింటివి - యీ తారుబుద్ధి?
వీఁ డిపు డిటు లాడి - వెనకఁ దామంచి
వాఁడగు సుగ్రీవు - వద్దికిఁ జేరి!5250
తిరుగబాటునకు నా - దినకరుసుతుని
సరిబల మున్నదే - జగడింత మనిన?
నెవ్వరి సత్తువ - నీవు పోరెదవు?
దవ్వు చేసెను బిన - తండ్రికి నిన్ను

వీనిఁ బట్టుక లోక - విశ్రుతకీర్తి
యైనట్టి సుగ్రీవు - నాజ్ఞ మీఱెదవు.
వలదన్న! బుద్ధులు - వయసులరావు
తలఁచుకొ మ్మిపుడు సీ - తానాయకుండు
సేయుమేలునకునై - సీమతోపాటు
చేయాసగాక వం - చింప ధర్మంబె?5260
పావనాత్ముఁడ వీవు - భగినీముఖోప
జీవి మాటలు వినఁ - జెల్లునే నీకు?"
అని "యోరి! తార! యే - మంటి వీబిలము
మనకు నాధారమై - మనఁగఁ జోటగునె?
మంచి మాటాడితి - మార్తాండసుతుని
నెంచి రాఘవు నెంచి - యింద్రుని నెంచి!
వారి కసాధ్య మీ - వసుధాబిలంబు
చేరరాదంటివి - చెల్లునామాట?
అంతటికున్నదే - యలిగి పైవచ్చు
నంతకురీతి రా - మానుజుఁ డొకఁడు5270
కుప్పెకోలను దమో - గుహయు నీయురము
దొప్పకైవడిఁ జించి - తునియలు సేయు!
మాయావి యైనట్టి - మయుఁడు ద్వారంబు
సేయక యిచట వ - సించి యుండంగఁ
గులిశంబుతోవచ్చి - గుహచేసి మయునిఁ
బొలియించి నటువలెఁ - బోవదు సుమ్ము
రాముసోదర మహా - స్త్రప్రయోగమున
నీమహాశైలంబు - నీరిక్షబిలము

మణిమయపురము నీ - మర్కటప్రభుల
క్షణములోపలను భ - స్మము సేయుఁగాని!5280
చెడుబుద్ధి యీరీతిఁ - జెప్పిన నిన్ను
విడిచి కాచితి దార - విలపించు ననుచు”
నని తాల్మివహియించి - యంగదుఁ జూచి
"వినవన్న! యువరాజ! - వీనిమాటలను
నీవిందు నిలిచిన - నిను బాసి కపులు
పోవుదు రిండ్లును - పొలఁతులఁ దలఁచి
యపు డొంటిగాఁ జిక్కి - యనదవై యున్నఁ
జపచపగాఁ జూచి - చౌక సేయుచును
నెట్టివారును నిన్ను - నెంచరుగాన
గట్టిగా నాబుద్ధిఁ - గైకొను మీవు 5290
మా వెంట వచ్చిన - మహికెల్లఁ గర్తఁ
గావించి పట్టంబు - గట్టి నిల్పుదుము
కపటము మది నెఱుం - గఁడు సత్యసంధుఁ
డెపుడు తారాదేవి - యెడఁ బ్రీతిఁ గలఁడు.
ఆయమ్మఁ జూచిన - యందు హితంబె
సేయు సుగ్రీవుఁడు - క్షితియెల్ల నొసఁగి
యతఁ డపుత్రకుఁడు నీ - వతనికి మాకు
గతిగాక యెవ్వరు - గలరిట మీఁద
తరతరమ్ముల వచ్చు - తగిన సంస్థాన
మొరుల మాటలు విని - యూడదన్నెదవు! 5300
ఏనున్నవాఁడ ని - న్నేమన్న నతఁడు
నానిలుకడనమ్మి - నా వెంటరమ్ము!”
అని స్వామిహితము న - య్యంగదహితము

జనకజారామల - క్ష్మణహితంబునుగఁ
బవనజుఁ డాడిన - భాషణావళులు
చెవిసోఁక విని మదిఁ - జేపట్టి యలరి
చెంగటఁ దిగిచి మ - చ్చికఁ గౌగలించి
యంగదుఁ డప్పుడా - హనుమంతు కనియె.

-: అంగదుఁడు తన కార్యము నిర్వర్తింపలేదని సుగ్రీవుఁడు గోపించునని కిష్కింధకు వెడలకుండ ప్రాయోపవేశము చేయఁ బూనుట :-

“నీమాట కెదురాడ - నేరముగాని
నామీఁద నేర మె - న్నకపోఁ డతండు5310
ఒరుల నిల్కడలు హి - తోక్తులు శౌర్య
నిరతులు మదినెన్ను - నే భానుసుతుఁడు?
ఎట్టివాఁడైన నీ - యిలమీఁదఁ దోడఁ
బుట్టిన జ్యేష్టుని - పొలఁతిని జూచి
తల్లిగా నెన్నక - తానాస సేయు
క్షుల్లకు నొక్కనిఁ - జూచుటల్ గలదె?
అట్టి యధర్మాత్ముఁ - డన్నకుఁ బుట్టి
నట్టి కుమారు దా - యాది వీఁడనుచుఁ
జంపక మానునే? - చచ్చి సాధించు
సంపద లున్నవె? - నాక్షులు గారె 5320
నీవును వహ్నియు? - నిలిపిన వంశ
పావనుఁడగు రామ - భద్రునితోడ
మొదటనాడినమాట - ములుచ వీఁడనుచు
బెదిరించి సౌమిత్రి - పెడతల వేయ

వచ్చినప్పుడుగదా - వచ్చె నాపాలి
కెచ్చైన యుపకార - మెఱుఁగనివాఁడు
కడమవారల మీఁదఁ - గనికరం బుంచి
నడపునే యదికృత - ఘ్నత యౌనొ కాదొ?
వెఱచికదా మీరు - వెదకఁ బొండనుచు
పరువులువారె నా - పద వచ్చినపుడు5330
పాపంబునకు నోడి - పనిచెనే మనల?
నాపాటి దొరకు మ - ర్యాద యెక్కడిది?
ఆరీతి నౌగాము - లరయని వానిఁ
జేరునే బ్రదుకాసఁ - జేసినవాఁడు?
అపరాధినగువాఁడ - నబలుఁడ నెట్లు
కపినాయకుని సము - ఖమునకు వత్తు?
పోయినఁ జంపక - పోనీఁ డతండు
చేయిగాంచిన నుంచుఁ - జెఱసాలనైన
వేయేల? ప్రాయోప - వేశంబె చాలు
నీయాన నమ్మిరా - నేర నచ్చటికి5340
నిందునకు ననుజ్ఞ - యిండు మీరెల్ల
నందఱు పురమున - కరుగుఁడు మఱలి.
మ్రొక్కితి ననుచు రా- మునితోడ ననుఁడు
మక్కువ సేయు ల - క్ష్మణునితో మీరు
తనమీఁదఁ గలిగిన - దయయెల్లనాఁడు
పనివింటి మనసులో - పల నిల్పుమనుఁడు
తండ్రిని మఱపించి - దయఁ జూచి నీవె
తండ్రివై మనుపుచోఁ - దప్పు చేసితిని

యటువంటి ద్రోహినే - మని వత్తుననుచు
నిటులైనయపుడు ని - న్నెంతయుఁ దలఁచి5350
తలమోచి సాష్టాంగ - దండంబుఁ జేసి
తలఁచితి ననుఁడు ముం - దఱ రుమాపతికి
నేమని యనుముందు - నీమాట వినినఁ
దామున్నె మృతినొందుఁ - దార నాజనని
యాయమ నూరార్చి - యర్కజుచేతఁ
జేయించి యోర్చి ర - క్షించు కొమ్మనుఁడు
నామీఁదఁ గలుగు మ - న్ననయెంచి మీర
లేమర కాతార - యింటికి పోయి
గ్రక్కునఁ దెలుపక - క్రమముగాఁ బలికి 5360
పొక్కంగనీక నే - ర్పునఁ గాచికొనుఁడు
అక్కడి పెద్దల - కందఱకేను
మ్రొక్కితి ననుఁడ”ని - మున్నె తాఁదెచ్చి
పఱచిన దర్భల - పై బవళించి
తొరిగెడు కన్నీరు - తో మోము తడియఁ
దారకుఁ దానొంటి - తనయుఁడగాన
నేరీతి బ్రదుకునో - యిటమీఁద ననుచు
మాటికిఁ జింతించి - మదిచిక్కఁ బట్టి
మాటలాడక హను - మంతుని యెదురఁ
గన్నులు మొగిడించి - కదలక యార్తి
నున్న యంగదుని ప్రా - యోపవేశంబు5370
కపులకుఁ బ్రాణాశ - కడకోసరింప
నపుడందఱును వాలి - నందనుఁ బొగడి
“యింతవాఁ డిటులైన - నీతనికన్న

నంత తీపయ్యెనె - ప్రాణము ల్మనకు?
నితని వెంబడివచ్చి - యెడబాయనేల?
నితఁడు వోయిన త్రోవ - నేపోద ” మనుచు
దక్షిణాగ్రములు గా - దర్భలు పఱచి
దీక్షించి వార్చి త - దీయపార్శ్వముల
వేర్వేరఁ బ్రాయోప - వేశముల్ చేసి
యుర్విపైఁ బవళించి - యూరువులాని 5380
తడపు నిగుడ్చుచు - దశరథతనయు
లడగక వచ్చుట - యవనిజఁ దోడి
తెచ్చుట రాముని - దేవి రావణుఁడు
మ్రుచ్చిలించుట కపి - ముఖ్యులతోడ
సీతకై రాఘవుల్ - చెలిమి చేయుటయు
దూతల నలుగడఁ - ద్రోలి వానరులఁ
బిలిపించుటయుఁ దమ్ము - బిలిచి దక్షిణము
వెలువరించుటయు దే - వీనిమిత్తముగ
నిందఱి బ్రదుకుల - కెసరులు పెట్టి
యిందుకునై విధి - యెన్నాళ్లుగాచె?5390
అనిఁ జచ్చినదిగాదు - హా! యని మున్ను
జనకజఁ జెఱబోవ - శౌర్యంబు మెఱసి
యాజటాయువు రీతి - నడ్డంబు దూరి
యాజిలోఁ బడుటగా - దన్యాయములుగ
రాజభయంబుచేఁ - బ్రాణముల్ విడువ
యోజించితిమి దైవ - యోగంబుచేత
ననుచు శోకాతురు - లై రొదసేయ


-: అంగదునితో ప్రాయోపవేశము చేయుటకు సిద్ధముగనున్న వానరులను సంపాతి చూచుట :-

వనచరధ్వని ఘన - ధ్వనిఁ బోలి నిండ
నాలించి వింధ్యగ - హ్వరములోఁ బెక్కు
కాలంబు మనిన వి - ఖ్యాతబలుండు5400
ఆజటాయువునకు - నన్న పక్షులకు
రాజు సంపాతి "యే - రావమో?” యనుచుఁ
దానున్న యాబిల - ద్వారంబు వెడలి
వానరులను గాంచి - వార లీరీతిఁ
బ్రాయోపవేశన - పరులగాఁ దలఁచి
"ఏయెడఁ జనరాక - యేనిన్నినాళ్లు
బిలములో నాఁకటి - బీదనై యుండఁ
దలఁచని తలఁపు రి - త్తకు రిత్త వీరు
నా చెంతఁ జేరి ప్రా - ణమ్ములు విడువఁ
గాచుక యుండ నొ - క్కరి బోవనీక5410
యందఱఁ మ్రింగి నా - యాఁకలిఁ దీర్తు
విందుచేసె విధాత - వీరిచేఁ దనకు”
అను మాట లాలించి - హనుమంతుఁ జూచి
తన భీతిచే నంగ - దకుమారుఁ డనియె.
“తప్పెఁ గార్యంబు సీ - తానిమిత్తముగ
నిప్పుడు మనమెల్ల - నెంచిన యట్టి
తలఁపును దైవయ - త్నము జతగూడి
పొలియక యటమున్నె - పొలియంగవలసె.
తినుమని వీని వా - తికి నగ్గమైతి
మిననూతి పూనిక - యీడేరదయ్యె5420

రామునికార్య మా - రడిఁ బోయె మొదట
భూమిజకై పక్షి - పుంగవుఁడైన
యల జటాయువురీతి - నన్యోపకార
ములకునై యీదేహ - ము లొసంగలేదు,
ఊరక ప్రాణంబు - లొల్లక పొలియుఁ
గారణంబయ్యె నే - కైవడినైన
కార్యార్థమై - ప్రాణముల్ విడువఁ
గామింప నుత్తమ - గతులు చేకూడు.”
అని "తండ్రిపనుపున - నడవికి రాక,
మునుకొని సుగ్రీవు - మొగము చూడంగఁ5430
దమకుఁ బోరానియం - తయుఁ" గథాసరణిఁ
గ్రమముతో వినఁబల్కి - "కైకేయి వలన
వానరప్రభులకు - వచ్చెగా! యిట్టి
హాని" యంచును "జన - కాత్మజ కొఱకుఁ
గనిపించుకొని పుణ్య - గతులకు నేఁగె
ననఘుఁడైన జటాయు "- వనుచు నీరీతిఁ
బలుమాఱు నార్తుఁడై - పలుకు నంగదుని
పలుకు లాలించి సం - పాతి యిట్లనియె.

-: సంపాతి వానరులతో సంభాషించుట :-

మీరెవ్వరయ్య ? యే - మి నిమిత్తముగను
శ్రీ రాము దేవేరిఁ - చెఱవట్టుకొనియె5440
దనుజనాయకుఁడు? నా - తమ్ముఁడైనట్టి
ఘనుఁడు జటాయు వే - క్రమమునఁ బడియె?
రాముని తెఱఁగు స - ర్వము వినవలతు

భూమిధరంబుపైఁ - బొడవున నుండి
శ్రీరామదాసులు - క్షితిక్రింద నుండఁ
గారాదు మీదువా - క్యంబు లే వినఁగ.
కావున నన్నెఱ - లు లేనివాని
లావునఁ బట్టి మె - ల్లనె డింపుఁ డిపుడు.”
అనిన వానర వీరు - లాపక్షి మాట
తమ్ము మ్రింగునో - వీఁ డని యెంచి5450
యొప్పక తెంపుతో - నున్న వారగుట
సప్పుడూహించి 'యై - నట్టులయ్యెడును
డింపుద”మని పట్టి - డింప నంగదుఁడు
సంపాతిఁ జూచి కొం - చక యిట్టులనియె.

-: అంగదుఁడు తమ వృత్తాంతము సంపాతికిఁ జెప్పుట :-

'పక్షీంద్ర! మీతాత - బలసత్త్వశాలి
ఋక్షరజుం డతం - డిరువురఁ గనియె.
వాలిసుగ్రీవుల - వైరంబు పుట్టి
వాలి సుగ్రీవుచే - వదలిపోఁదరమె?
దశరథుఁడన నయో - ధ్యానాయకుండు
శశిముఖియగు కైక - చనవు చెల్లించి5460
యడవుల కనిచిన - నవనిజఁ గూడి
వెడలి రాముఁడు ఘోర - విపినంబులందుఁ
జయించునపుడు ద - శగ్రీవుఁ డతని
తరుణి నెత్తుకపోవఁ - దా విలోకించి
యరికట్టి యొకఁడు జ - టాయువు వాని
విరథునిగాఁ జేసి - విల్లు ఖండించి

పెద్దవాఁడగుట ద - ర్పించి రావణుఁడు
గద్దించి ఱెక్కలొ - క్కటఁ ద్రుంచుటయును
ధరణిపైఁ బడియుండఁ - దమ్ముఁడుఁ దానుఁ
దరుణిపోయిన జాడ - తమ కేఱుపడక5470
వచ్చి జటాయువు - వార్తచే నసుర
మ్రుచ్చిలికొనిపోవు - మూలంబెఱింగి
తమ తండ్రి కాతఁ డెం - తయు నాప్తుఁ డతఁడు
తమకార్యమునకునై - తనువుఁ బాయుటయు
నరలేక పుణ్యలో - కావ్యాప్తి కొఱకు
కరుణించి యగ్నిసం - స్కారంబుఁ జేసి
ముందుగానక ఋశ్య - మూకంబుఁ జేరి
యందుఁ జింతలుచున్న - యర్కనందనుని
చెలిమి కార్యార్థియై - చేసి రాఘవుఁడు
బలిమిచే నొకకోలఁ - బడ వాలినేసి5480
భానుజుఁ గిష్కింధఁ - బట్టంబుఁ గట్టి
తానిల్పె నతనిపైఁ - దమకార్యభరము.
ఆ రవినందనుఁ - డన్నిదిక్కులకు
వీరవానరులను - వెదకంగఁ బనిచి
తము పొండనుచుఁ బంపె - దక్షిణంబునకు
నమరేంద్రతనయుఁడౌ - నావాలిసుతుఁడ
నంగదుఁడనువాఁడ - నర్కజుమాట
నంగీకరించి మే - మన్ని దిక్కులును
జనకజ వెదక యె - చ్చటఁ గొన లేక
పెనుడస్సి జీకటి - బిలముఁ జొచ్చితిమి5490

మఱలిరాలేక క్రు - మ్మరు వారిఁజూచి
కరుణించి మునిబాలి - కామణి యొకతె
దఱిఁజేర్పఁ దత్ప్రసా - దమున నీకొండ
దటి జేరితిమి మితిఁ - దప్పిన కతన
నుగ్రశాసనుఁడని - యూహించి మేము
సుగ్రీవుఁ జేరి య - చ్చో నాజ్ఞ పడక
వెతఁదీఱ బ్రాయోప - వేశంబు సేయు
మతినున్నవార ము - మ్మలికతో "ననిన
నామాట వీనుల - నాని సంపాతి
యామర్కటేంద్రుల - కప్పు డిట్లనియె.5500

 -: సంపాతి తన వృత్తాంతమును చెప్పుట :-

“ఎన్నినాళ్లాయె మే - మెడవాసి? వింటి
నిన్నాళ్ళకు జటాయు - విటులయ్యె ననుచు
నేనిది వినియు స - హించితి నిపుడె
దానవాధమునిఁ జే - తడియారకుండఁ
జంపి యీసూడు దీ - ర్చకయున్న నన్ను
సంపాతి యనుచు నెం - చఁగ నేమిఫలము
మాన్యవర్తనలచే - మదిమది నుండి
యన్యోన్యగమనజ - యాభిలాషలను
నన్నదమ్ములము వి - హాయస వీథి
నున్నతపథమున - నురువడి నెగసి5510
యినమండలముఁ జేర - నేఁగఁ దపించు
తన సహోదరునిపై - దయయుంచి యేసు
చాటు చేసితి విప -క్షములందు కతన

గాటంపు టెండలఁ - గమిలేనిక్రియలు
యీవింధ్యబిలములో - హీనసత్త్వమునఁ
దావచ్చి పడితి నా - తమ్ముఁ డెచ్చటికిఁ
బోయెనో యెఱుఁగ మి - ప్పుడు వాని హాని
నో యయ్యలార మీ - యుక్తులవింటి
ననిన వాలితనూజుఁ - డావిహాగేంద్రుఁ
గనుఁగొని పేరాసఁ - గ్రమ్మఱం బలికె.5520
"సీతకునై పొలి - సిన పక్షిరాజు
నీతోడఁబుట్టుట - నిజమయ్యె నేని
మాటవాసిగ నీవు - మహిసుత యిట్టి
చోట నున్నదియని - చూపి చెప్పినను
మమ్ము రక్షించుట - మము నంపి చాల
నమ్మిన సుగ్రీవు - నకుఁ గీర్తి యగుట
శ్రీరామునకు సీత - చేకూడుటయును
కారణమ్ములుగాఁగఁ - గల సుకృతంబు
నిన్నుఁ జేరు"నటన్న - నీడజస్వామి
మన్నించి వారితో - మఱియు నిట్లనియె.5530
"క్షితిమీఁదఁ గన్నులు - చెఱచు దైవంబు
మతి యిచ్చినట్లు నా - మదిలోన నిపుడు
బుద్ధి చలింపదు - పోయెఁ గాలంబు
వృద్ధుఁడనైతి దో - ర్వీర్యంబు లేదు
చేదోడు గావింపఁ - జేతఁగాకున్న
వాదోడు చేసి మీ - వాఁడ నీనగుదు.
బలిజేరి తా దార - వట్టి వామనుఁడు
యిలఁ గొల్చినది చూచి - యే నెఱుంగుదును.

అమృతవార్ధి మధించి - హరి దివిజులకు
నమృతంబుఁ బంచిచ్చి - నది యెఱుంగుదును 5540
భావజారాతి తాఁ - బార్వతీదేవి
ఠీవితోఁ బెండ్లియా - డిన దెఱుంగుదును
చేరి దిక్పాలక - శ్రేణి యందందుఁ
గోరి పట్టములుఁ గై - కొను టెఱుంగుదును
రావణు నెఱుఁగు ట - బ్రమె? సీతయున్న
తావును మీకు ని - త్తరి వివరింతు
"హా! రామ! హా! లక్ష్మ - ణా యనిపలుకు
నారీశిరోమణి - నల్లనివాఁడు
తొడలపై నిడుకొని - తొలుకారుమెఱుపు
వెడద మేఘంబులో - వెలుఁగు నట్లమరఁ5550
గొనిపోవఁ గంటి నీ - గుహలోన నుండి
తనకది యిప్పుడు - తలఁపులోఁ దోఁచె
శతయోజనము మేర - జలరాశిలోన
నతఁడుండు లంక యా - యన రాజధాని
యపరంజి కోటలు - నట్టి తల్పులునుఁ
విపులమాణిక్యన - వీనసౌధములు
లెక్కగాఁ గొనకి ని - లింపులఁ బట్టి
మక్కుమారుచు దైత్య - మండలి గలిగి
యా లంక యొప్పు ది - వ్యజ్ఞానశక్తి
చాలియుండును నాకు - సకలంబుఁ దెలియు 5560
నిలమీఁది ధాన్యంబు - లేరుకో తినెడు
పులుగులు యోజనం - బునకు పైనెగయు,
నందుపైఁ బోవలే - వామీఁద నైదు

కందువల్ పక్షిమా - ర్గంబులు వినుఁడు
ఇది కుళింగములను - నెల్ల పక్షులును
పదలక చరియించు - వలదటుమీఁద
బలి భోజనంబుల - ఫలభక్షణముల
నలరు పక్షులకు రెం - డవమార్గ మొప్పు
క్రౌంచంబులును భాస - గణమును కురర
సంచయంబును నేఁగు - జాడ యామీఁద5570
పావురంబులు డేగ - పదుపు నమ్మీఁదఁ
దేరి నాలవజాడఁ - ద్రిమ్మరుచుండు
దానిపైత్రోవ గృ - ధ్రము లేఁగ నేర్చు
నానెలవున మీరి - హంసము ల్గిరుగు
ఆపైన గారుడం - బైన మార్గంబు
చూపట్టుఁ బక్షు లీ - చొప్పున మెలఁగు
సప్తవాతస్కంధ - సంచారమార్గ
సప్తమస్థలములఁ - జరియింతు మేము
పక్షులు దివి నూట - పది యోజనముల
లక్షించుఁ దనుమేపు - లకు నుర్విమీఁదఁ5580
గలుగు నామిష మట్టి - ఖగజాతిఁ గలుగు
బలముచే జ్ఞానసం - పదచేత మాకు
గరుడండు పినతండ్రి - గావున నెల్ల
ధరణిపై మాకసా - ధ్యము లేదు చూడ!
అదె లంక! యదె సీత! - యసుర భామినులు
బెదరింపుచును గాసి - పెట్టుచున్నారు
వాఁడె రావణుఁడు ది - వ్యవిరోధి తనదు
వేఁడిమిఁ గొలువులో - వెలుఁగుచున్నాఁడు!

అతఁడు కుబేరుని యనుజన్ముఁ డతఁడు
క్షితియెల్ల మనుపనుఁ - జెఱపశక్తుండు!5590
ఆ రావణునిఁ గూల్చి - యవనిజఁ దెచ్చు
మీరాఘవుండు నా - మేటి దీవనను
జలధిఁ దాఁటునుపాయ - శక్తియే మీకుఁ
గలిగినఁజాలు లం - కానాథుఁ డెంత?
తమ్మునికిని వారి - దానంబు సేయ
నెమ్మదిఁ గోరితి - నేడబ్ధియందు
నాకోర్కి యీడేర్పుఁ ” - డనవారలతనిఁ
జేకొని జలరాశి - చెంగట నుంచి
కృతకృత్యుఁడైన ప -క్షివరేణ్యుఁ దెచ్చి
క్షితిధరాగ్రమునకుఁ - జేర్చియుంచుటయు5600
వాడిన చేలపై - వానయుఁ బోలి
నీడజోత్తము మాట - నిండు ప్రాణములు
పోకుండ మరల ని - ల్పుటయుఁ గూర్పుండ
వాకొని యాజాంబ - వంతుఁడిట్లనియె
"అయ్య! సుగ్రీవుని - యాజ్ఞకు వెఱచి
యియ్యెడఁ గపు లెల్ల - నీ దర్భలందుఁ
బ్రాయోపవిష్టులై -పడియుండఁ జూచి
సేయ నేమియు లేక - చింతాపయోధి
మునిగి తెల్విడిఁ దప్పి - ముదుసలిఁగాన
విననైతిఁ దెలియ నీ - వృత్తాంతమెల్ల5610
ఏమంటి? వసురేంద్రుఁ - డెచట నున్నాఁడు?
భూమిజ నెందు ని - ప్పుడు గనుఁగొంటి?
మా కేది బుద్ధి!యీ - మారు వేసరక

వాకొను" మన జాంబ - వంతునిఁ జూచి
యందఱు వినుచుండ - నపుడు వీనులకు
విందుగా సాంపాతి - వెండియుఁ బలికె
"జైవాతృకుఁడను ప - క్షంబులు కమలె
లావును లేదు చా - లదు జవశక్తి
కావున నీశైల - గహ్వరాంతరము
తావలంబుగ నుందుఁ - దన తనయుండు5620
నాహారమిడి నీర - మందిచ్చి యిట్టి
దేహంబుఁ బోషించు - దినము వేసరక
నతనిపేరు సుపార్శ్వుం - డందురు వాఁడు
హితబుద్ధి నాహార - మద్ది యేతేర
వనములందుఁ జరించు - వాఁ డొక్కనాఁడు
తనచేతి కేమియుఁ - దగలక ప్రొద్దు
పొటుకున గ్రుంకు న - ప్పుడు వచ్చి నిలువ
కటకటఁ బడి వానిఁ- గనుఁగొని యేను
నాఁకటి కోర్వక - యలిగి నేఁడేల
చీకటి వేళ వ - చ్చితివి మై మఱచి?5630
ఏమిషంబున నుంటి - విందాక ? నేల
యామిషం బిడవైతి - వాఁకలి యెఱిఁగి?
నీప్రాపుచాలు మే - నికి నేల వగవ?
ఓప నిట్లుండఁ బ్రా - యోపవేశమునఁ
దనువువాతు నటన్నఁ - దనయుఁడు చాల
వినయంబుతోఁ దను - వీక్షించి పలికె


-: సంపాతి సీత వృత్తాంతమును జాంబవంతునికిఁ జెప్పుట :-

అయ్య! ప్రమత్తుఁడ - నై యేను గ్రొవ్వి
నెయ్యంబు మఱచి యుం - డినవాఁడ గాను
ఏను నింతియును మ - హేంద్రాద్రి గడచి
యీ నెలవుల మెత్త - నైనమాంసంబు5640
వెదకి కానక వార్ధి - వేలకుఁ జేరి
సుదతియు నేను వీ - చులవెంట దిరిగి
యొకయెడఁ గాలూది -యుండియు మీన
మొకటియు దొరకక - యున్నట్టివేళ
దపనప్రభాగాత్రిఁ - దరుణి నొక్కతెను
నిపుణత నల్లని - నెమ్మేనువాఁడు
గొనిపోవ నార్తిచేఁ - గుంది 'హా! రామ!'
యనియు 'హా - లక్ష్మణా' - యనియుఁ గూయిడుచుఁ
బోవుచో వాఁడు నా - పొంతకుఁ జేరి
యోవిహగేంద్ర! మా - యూరికిఁ ద్రోవ 5650
యెయ్యది" యనివేడ - నే నిట్టు లనుచు
జెయ్యి చూపుటయు ద -క్షిణముగాఁ జనియె
కలన నోడినవాఁడు - కామినీమణుల
దొలగించువాఁడును - ద్రోహంబు చేసి
చనువాఁడు దొంగిలి - చనువాఁడు చంపి
చనువాఁడు త్రోవనే - చనుచుండి రేని
యెఱుఁగక భ్రమనొంది - యిట్టట్టు మఱల
దిరుగుచుందురుగాన - తెరవు నన్నడిగి
నప్పుడు దివినున్న - యమరులు వచ్చి
తప్పె నేటికి పురా - తనసుకృతమున5660

పరమసాధ్విని రామ - భార్యను వాఁడు
చెఱవట్టుకొని భీతి - చేఁ బోవు కతన
నూరక చనియెఁ గా - కూరక చనునె?
నీరామఁ గొనిపోవు - నే రావణుండు?
ఇంతకు దీని వాఁ - డెత్తుకపోవు
నింతలో మఱలునో - యెఱుఁగరా దతని
పొలఁతిఁ జేకూర్చుక - పొమ్మిందు నేల
నిలిచెద వనిపల్కు - నిర్జరశ్రేణి
మాటలు విని యేను - మగువయు నెగసి
యీ టెంకిఁ జేరితి - మిది నిమిత్తముగ5670
నీకు నాహారంబు - నేఁ డబ్బదయ్యె
కాకయుండిన నిట్టి - కల్ల సేయుదునె?
అను సుపార్శ్వుడు వల్క - నప్పు డామీఁద
వినియుండి జానకి - వృత్తాంత మెల్ల
నసమర్థుఁడను వాక్స - హాయత గాని
యిసుమంత పనికైన - నేమిటివాఁడ?
రామకార్యంబు పో - రానిది యైన
సామాన్యమతి నుంటి - శక్తి చాలమిని
శ్రీరామచంద్రుండు - చేత విల్లంది
నారాచ మొకటి సం - ధానంబు సేయ5680
దొల్లును దొంతుల - తోఁ జూర్ణమగుచు
నెల్లలోకములు మీ - రెఱుఁగరు గాక
యొకరి తోడాసించు - నో? రాఘవునకు
నొకఁ డసాధ్యము గల్గు - నో జగత్రయిని
యందుపై బుద్ధి బ - లాతి శౌర్యముల

కందంబులై మించు - కపివరుల్ మీరు
చేకూడి యున్నారు - సీత రామునకుఁ
జేకూర్పఁ గలరైనఁ - జెప్పెదమీకు
కొంచగాఁడని యెంచ - కుఁడు దశాననుని
ముంచి మీకీతఁలు - మోఁతలు చేయు5690
నతని ప్రతాప మిం - ద్రాదులకైన
నతిదుర్జయం బని - ద్రాహారకరము
తామసం బేల - యత్నము చేసి మీర
లీమీఁది కార్య మూ - హించికొం డిపుడు"
అని పల్కి యువరాజు - నంగదుఁ జూచి
"జనకతనూజాప్ర - చారమంతయును
నాకు నేర్పడు కార - ణము వినిపింతు
నీ" కని ఖగవంశ - నేత నిట్లనియె
“ఇనుని వేడిమిచేత - నెఱకలుగాలి
పొనుఁగుడువడి మూర్ఛఁ - బుడమిపై ద్రెళ్ళి5700
యీవింధ్యబిలములో - నేడువారములు
చావుతో సరియైన - జాడమేమఱచి
తెలిసితి నెనిమిదో - దినమున మేను
కలయఁ జూచితి విం - ధ్య గహ్వరంబగుట
నపుడు మెల్లనె నడ - యాడుచుఁ జెంతఁ
దపమొనరించు ను - త్తము నిశాకరునిఁ
జూచి యయ్యాశ్రమ - క్షోణి నెమ్మేను
వైచి యెన్మిదివేల - వత్సరంబులకు
నిట్టిట్టు మెదలక - నెఱుఁగక పడిన
పట్టున నగజర - భావంబుతోన5710

నున్నెడ నెప్పుడి - ట్లుంటి నాప్రొద్దె
యన్నిశాకరుఁడు సు - రాలయంబునకుఁ
జని యెనిమిదివేలు - సంవత్సరంబు
లనిమిషపురి నుండి - యట తరువాత
మఱలి యావింధ్యక్ష - మాధరంబునకు
నరుదేర నిచట సిం - హాదులై నట్టి
వనమృగచయము పూ - ర్వంబునఁ దమ్ము
మనిచి రక్షించిన - మచ్చికఁ జేసి
యాశ్రమమహిమచే - నన్నియు నచట
నశ్రాంతచిరజీవు - లై యున్న కతన5720
గని యెదుర్కొని నిశా - కరమౌనిఁ గొలిచి
చనుదేర దేవతా - సభలోన నున్న
యా విరించి యనంగ - నాశ్రమంబునకుఁ
దావచ్చి సకలబాం - ధవజనకోటి
తనుజేరిరా మేరు - ధరణీశుఁ డనఁగ
మునివరుఁ డచ్చోట - ముచ్చమునింగి
దరిదాపు లేక ప - త్రంబులు గమలి
ధరణిపైఁ బడియున్నఁ - దను దేఱిచూచి
తనగృహంబున కేఁగి - తడవుగా నచట
మనసొగ్గి నిలువక - మఱలంగ వచ్చి5730
నాచెంత నిలిచి పూ - ర్ణకృపావిభూతి
వాచంయమీంద్రుఁ డో - ర్వక యిట్టులనియె
"అమరావతికి నేఁగు - నప్పుడు నీదు
గ్రమము చూచియును శీ - ఘ్రమునఁ బోవలసి
యిచ్చోట నెటులున్న - మృతి నీకు లేమి

యిచ్చలోఁ దెలిసి నే - నిచటికి మఱల
నేతేరఁ బనిగల్గి - యేమియు ననక
యాతరి మాటాడ - నైతి నీతోడ
నెచ్చటనుండుదు? - వెవ్వఁడ? వేల
యిచ్చోటఁ బడితివి - యీఁకియల్ గమలి
యగ్నిచేఁ గమలెనొ! - యనిలసంహతిని
భగ్నమయ్యెనొ నీదు - పక్షవ్రజంబు
తెలియఁబల్కు' మటన్న - దీనతనతని
పలుకులు వినిన ప్ర - భావంబు చేత
మాటాడశక్తియు - మదిలోని యెఱుక
పాటునఁ బడిన యేఁ - బలికెదననుచు
మదినెంచు నప్పుడా - మౌనినాయకుఁడు
మది నెఱింగిన మాట - మాటక పలికె
ఏమోయి! సంపాతి! - యెఱుఁగనే నిన్ను ?
ఈమాడ్కి దురవస్థ - నేల పొందితివి?5750
అనుజుఁ డైనట్టి జ - టాయువు నీవు
మును పొక్కనాఁడు నా - ముందఱ నిలిచి
రాజవేషములఁ తే - రఁగ వచ్చి మ్రొక్కి
పూజించితిరి నన్ను - పొందామరలను
దీవించి పనిచితిఁ - దిరిగి రారైరి
రేవలనికిఁ బోతి? - రిట్లైతివేల?
ఎఱిఁగింపు' మని మౌని - నీక్షించి యేను
శరణంబు వేడి దాఁ - చక యిట్టులంటి
మునినాథ 'యన్నద - మ్ములము మీచేత
ననిపించుకొని విహం - గాధిరాజ్యంబు

పాలింపుచును వయో - బల గర్వములను
కైలాసమున కేఁగి- కాలానుగతిని
మాలోన మేము సు - మాళించి మౌని
జాలంబు వినఁగ న - చ్చట నిరువురము
నినునిరథంబు వో - యిన జాడ నతని
వెనుక నస్తాద్రిఁ బ్ర - వేశించు దనుక
బజుచుటకై యేము - పన్నిదం బాడి
యెఱకలు జాడించి - యెగసిన యపుడు
భోరను రవమొండు - బొదువ సపక్ష
మేరు మందరముల - మేరఁ జూపట్టి 5770
మఱి పోవఁబోవ వై - మానికశ్రేణి
తెరువిచ్చి యొదుగుచు - దిగులుతోఁ జూడ
నాకాశమున నేఁగు - నప్పు డీయవని
మాకంటి కొకబంతి మాత్రమై తోఁచెఁ
బొడవునఁ జూడ నీ - భూమీధరములు
చిడిపిరాలనఁగ మిం - చెను జూపులకును
సైకపు నూలి పోఁ - చలువైచినట్ల
మాకుఁ గన్పట్టె సమ - స్తవాహినులు.
ఎచ్చట నెడ లేని - యీవనశ్రేణి
పచ్చబొట్లనఁగ నే - ర్పఱపరాదయ్యె!5780
ఆరీతి మిన్నుల - నరిగి భాస్కరుని
తేరువెంబడిఁ బోవు - దివిజకామినుల
గ్రహముల ఋషులువె - న్కను వైచి యుగ్ర
మహుఁడైన నడుమింటి - మార్తాండుఁ జేర
నెంతటివెడలుపో - యీ మహీచక్ర

మంతయై కనుపట్ట - నతని మండలము
భానుబింబముఁ జేర - భానుతాపమునం
దానోరు దెఱచి సం - తప్తుఁడై సొరిగి
యలసిన యట్టి జ-టాయువుఁ జూచి
యిలమీఁదఁ బడకుండ - యేఁ జాటునిలిచి5790
యదరక మద్గురు - డాతపత్రములఁ
బొదువుక మఱలు న- ప్పుడు పద్మబంధు
కిరణాగ్ని చేత నీఁ - కియ లెల్లఁ గమల,
గెరలి వ్రాలితి వింధ్య - గిరి గహ్వరమున
నాజనస్థాన మ - హావనచ్ఛాయ
నాజటాయువు వ్రాలి - నటువలెఁ దోఁచ
నతఁడేమియయ్యెనో! - యటమీద నిందు
కతమున నాదు ఱె - క్కలు మూరిఁబోయెఁ
"గరుణింపవే! నిశా - కరమౌనిచంద్ర!
శరణార్థి" ననుచు బా - ష్పములు నించుటయు5800
మౌనియంత ముహూర్త - మాత్రంబు మదిని
ధ్యానంబు చేసి నీ - తనువున మఱల
బలమును వేగంబు - పక్షముల్ తొలుతఁ
గలిగిన కైవడిఁ- గలుగఁజేసితిని!
అటులైన రామకా- ర్యార్థమై శైల
కటకంబునం దీవు - గాఁచియుండంగ
వలయుఁ గావున నేఁడు - వలదు నావరము
ఫలియించు మీఁద నా - పలు కేల తప్పు?
రాముఁడు దశరథ - రాజనందనుఁడు
భూమిజతో వనం - బులకుఁ దావచ్చి5810

యున్నచో రావణుఁ - డోడక యతని
కన్నాఁగి జానకి - గైకొని పోయి
తన లంకయందు ను - ద్యానంబులోన
నునిచినచో సీత - యున్నకీ లెఱిఁగి
యమరనాథుఁడు పాయ - సాన్నంబు దివ్య
మమృతపర్యాయ మ - హాంబులయందు
నొరు లెఱుఁగకయుండ - నుర్వీతనూజ
కరమున కిచ్చి యాఁ - కలి నీరుపట్టు
నలయికలును బాపి - యరుగు నాసాధ్వి
తలఁచని తలఁపుచే - తను నిల్చినట్టి5820
పాయసాన్నంబు వి - భాగించి రాము
డాయెడ నుండిన - యందుచేఁ దృప్తి
గనుఁగాక యనుచు స - గం బుర్వినునిచి
తనపాలు నిత్యంబు - దానారగించు
నపుడు సీతాన్వేష - ణార్థులై వచ్చి
కపులు నీతోడ రా - ఘవ చరితంబు
వినిపించు నప్పుడు - విలసిల్లు నీదు
తనువునఁ బక్షస - త్త్వజవాదికములు
అందాక లోకహి - తార్థమై యుండు
మిందు'నంచు ననుగ్ర - హించినాఁ డతఁడు.5830
అతఁడు నాతోడ ని - ట్లానతియిచ్చి
యతిశయించెను కాల - మైదునూఱేండ్లు.
ఎదురెదురులు చూచి - యేను మీరాక
మదిఁగోరియుంటి సే - మముఁ జేరఁగంటి.”
అనుమాటలాడియు - నాడకమున్న

తనువునిండఁగఁ బత - త్రంబులు మొలిచె!
లావుల వెంటనే - లావునువచ్చి
నావిహగేంద్రుఁడు - హనుమంతుఁజూచి
"యనుమానములు మాని - యవనిజ వెదకు
పనికి మీరుద్యోగ - పరులుఁ గావలయుఁ5840
బక్షముల్ మొలిచె నా - పైనది మీకు
సాక్షి మీకార్యంబు - సఫలమౌటకును
అనుచు ఱెక్కలతోడి - యద్రియుఁబోలి
పెనుమ్రోఁత రివ్వని - పృథివిపై నిండ
సంపాతి యెగసి కీ - శశ్రేణిఁ జూచి
సంపూర్ణకాముఁడై - చదలఁ బోవుచును
“అదె! లంకణ వాఁడె! ద - శాననుఁ డల్ల
యదె సీత! చనుఁడు మీ - రని వినఁబల్కి
పోయినఁ గపులెల్ల - పుటముగా సెగసి
యాయద్రి పైనుండి - యవనికిదాఁటి5850
"సంపాతి మాటలు - చాల నమ్మితిమి
చంపఁజూచె నతండు - జలధి పాల్జేసి,
ఎక్కడి పని? మన - మెక్కడ? లంక
యెక్కడ? రావణుఁ - డెక్కడ? సీత
యెక్కడ? వానరు - లెక్కడ? పోవు
టెక్కడ?" యని కపు - లెల్ల వాకొనఁగ
నందఱఁ గనుగొని - యందుకుఁ దగిన
యందంబు మది నెంచి - యంగదుం డనియె.

        -: అంగదుఁడు సంపాతిచెప్పిన రీతిని సముద్రమును దాటుటకు
                   దగినవారెవ్వరో యని విచారించుట:-

"ఏల చింతించెద - రీ విచారమున,
బాలకు లెఱుఁగక - పాములఁ బట్టి5860
నాశమొందినగతి - నశియింతు రింత
ధీశక్తి వదలంగఁ - దీఱునే మనకు?
చాలశౌర్యము జూపు - సమయంబుగాని
జాలిఁబొందెడు నట్టి - సమయంబుగాదు.
ఇక్కమలాకరం - బెంత దాఁటుటకు?
ఱెక్కలు వచ్చు సు - గ్రీవాజ్ఞఁ దలఁప!
మనమెంత జడిసిన - మాపినతండ్రి
కిని దయవచ్చునే? - కినుకయే గాక.”
అని మాటలాడుచో - నర్కమండలము
కనరాక యస్తాద్రి - కడకుఁ జేరుటయు5870
నా రేయి వా రని - ద్రాహారు లగుచుఁ
దూఱుపు తెల్లనై - తొలుసంజ వొడమఁ
గపులెల్లఁ దనుచుట్టుఁ - గదిసి యుండంగ
నపుడు వెండియునుఁ దా - రాత్మజుండనియె,
"సభయులమైన కీ - శశ్రేణి కెవ్వఁ
డభయప్రదాన మి - య్యంగ సమర్థుండు?
ఇందఱి ప్రాణంబు - లిచ్చి వానరుల
బొందులతో నుంచు - పుణ్య మెవ్వరిది?
అక్కట! శతయోజ - నాయతంబైన
యిక్కమలధి దాఁట - నెవ్వఁడున్నాఁడు5880

ఇనకుమారు ప్రతిజ్ఞ - యీడేర్చి యతఁడు
తనవాఁడుగా నుండు - ధన్యుఁ డెవ్వాఁడు?
ఎవ్వాఁడు జానకి - నీక్షించి మఱల
నవ్వుమోమున వచ్చి - నన్ను రక్షించు?
సీతఁ జూచితి నని - శ్రీరాముతోడ
నీతఱి నను ధన్యు - డెవ్వఁ డున్నాఁడు?
రామసుగ్రీవుల - రక్షించు పాటి
స్వామి కార్యహితుండు - జగతి నెవ్వండు ?
ఓయయ్యలార! యిం - దొకఁడేఱుపడినఁ
జేయెత్తి మ్రొక్కి కొ - ల్చెద నమ్మహాత్ము5890
నొక రేఱుపడరయ్య! - యూరకయున్న
సుకరంబుగాఁగఁ దోఁ - చునే కార్యసరణి?"
అని యెంత వలికిన - నమ్మహాకవులు
మొనయక యొండొరు - మోములఁ గనుచు
నురకున్న వానర - యోధులఁజూచి
మఱలఁగ వాలికు - మారుఁ డిట్లనియె,
"మీరు కులీనులు - మీరసహాయ
శూరులు మీరు తే - జోబలాధికులు
స్వామికార్యహితప్ర - చారులు మీర
లేమియు వాకొన - కిటు లూరకున్న5900
బడుచువాఁడను మీదు - ప్రాపున వచ్చి
యెడలోముకొని మీర - లున్నచో నుండి
యందఱు మీరు న - న్నరయుచుఁ బిలిచి
ముందఱ నిడుకొని - ముద్దుగా నడుప
నున్నట్టివాఁడఁ బ - యోరాశిఁ జూచి

మిన్నక ననుఁ జాటి - మీరుంటిరేని
యేమగు నాచేత? - నిది శక్తియనుచు
మీమీ తలంపుల - మితిగన్నయట్టి
జవసత్త్వములు వల్కి - జలరాశి యొకఁడు
చవుకళింపంగ యో - జనసేయుఁ" డనిన5910
నామాట లాలించి - యంగదుఁ జూచి
తామొక్కరొకరె స - త్త్వంబుల కొలది
గట్టిగా జూచుక - కలశక్తి మఱుఁగు
వెట్టక యకపి - వీరులిట్లనిరి.

-: వానరులు తమతమ బలమును నంగదునకుఁ దెలుపుట :-


"పది యోజనంబుల - పాటికి జలధి
యదరక దాటుదు" - ననియె గజుండు
"వారాశి యే నిరు - వది యోజనముల
దారి" గవాక్షుఁడు - "దాఁటుదు"ననియె.
"పగ్గ లేమిటికి? ము - ప్పది యోజనములు
తగ్గక" గవయుండు "దాఁటుదు" ననియె.5920
"బరవసంబున నలు - వదియోజనములు
శరధి దాఁటుదు" వని - శరభుఁడు పలికె,
"బంధురశక్తి నేఁ - బది యోజనములు
కంధి దాటుదు" ననె - గంధమాదనుఁడు.
“నాకు నర్వది యోజ - నంబులుగాని
యాకడ మఱికూడ - దనియె" మైందుండు
"యోజింప డెబ్బది - యోజనంబులకు
నాజవంబనియె" ను - న్నతి ద్వివిదుండు.

నలుఁ "డెనుబదియోజ - నంబులుగాని
కలుగ దామీఁద లా - ఘవమని" పలికె.5930
“నేను వృద్ధుఁడ సత్త్వ - హీనుఁడఁ జేత
నైన మాత్రంబు నే - నబ్ధిదాఁటినను
నందు దీఱెడిదేమి? - యాది కాలంబు
నందు శౌరి త్రివిక్ర - మావతారమునఁ
జెలఁగుచో యేఁబ్రద - క్షిణము చేసితిని
తొలుత భానుఁడు తేరు - తోలుకపోవ
నదిమీఱిపోవుదు - నని పోవఁబోయి
కదియు మేరువు నిర - కటమునఁ జనఁగ
మోకాలు నొచ్చె నా - మొదలింటి శక్తి
చేకూడ దిప్పు డీ - సింధువు దాఁట5940
ఇదిమేర యనవల - నేకాకయున్న
నుదధి యంతయు దాట నోపుదు మొదటం
బాటుగా దిపుడు తొం - బది యోజనముల
పాటి దాఁటుదు మరి - పాఱదు శక్తి"
అని జాంబవంతుఁ డి - ట్లాడిన మాట
విని తనశక్తి భా - వించి యంగదుఁడు,
"చాలదు నూఱు యో - జనములు దాఁట
రాలేదు మఱలి వా - రాశి మీఁదటను.
అందునకై సంశ - యంబుతో మదినిఁ
గొందలపడుచు మే - కొనక యున్నాడఁ5950
జనుదునే?" యని పల్క - జాంబవంతుండు
మనసులోఁ గలఁగి క్ర - మ్మఱ నిట్టులనియె.
“ అంగద! యీమాట - లాడుదురయ్య!

అంగద నిను నంప - నగునయ్య? మాకు?
ఏమెల్ల నటుమీఁద - నేమిటివార
మేము కొల్చినవార - మినుఁడవు నీవు
స్వామి భృత్యన్యాయ - సరణియూహింప
నీమాట విననగు - నే మాకు నెల్ల ?
బలిమి గూకటి వేరు - పదిలమైయున్న
ఫలపుష్పములను జొ - ప్పడు భూరుహంబు5960
దొర లెస్సయున్న హి - తుల్బాంధవులను
పరివారమును జేరి - బ్రదుకుచుండుదురు
నిన్నొక్కనిం బంపి - నిలుతుమే యిట్టి
చెన్నటి మేను లూ - ర్జితములే మాకు?
రాజులఁ బనిఁగొను - బ్రజలునుఁ గలరె!
పూజనీయుఁడవు మా - బోఁటివారెల్ల
నినుఁ జూచుకొని యెందు - నీదు సేమమునఁ
గనుగల్గి రక్షించ - గా నీతిగాక
యేము నెమ్మది నుందు - మీవు బొమ్మనుచు
నేమింతుమే యిట్లు - నీతిఁ బోవిడిచి 5970
చాలింపు మిట్టి వి - చారంబు" లనిన
నాలించి మఱలంగ - నంగదుఁ డనియె,
"ఏనూరకున్న చో - నెవ్వాడు వోవు
వానరప్రభుల స - త్త్వంబులు వినమె?
చేతగాదనువానిఁ - జెవిమెలిపెట్టి
త్రోతమె యీయెడఁ -దోయధిఁ బడఁగ
దొరచేత నగుపనుల్ - దొరలు సేయుదురు
పరిజనుల్ చేనైన - పాటి తీర్పుదురు

మనకెల్లఁ గర్త యా - మార్తాండసుతుఁడు
పనిపూని వచ్చిన - భటుల మిందఱము5980
అతని యానతి మీఱ - నగునె యెవ్వరికిఁ
గతమిచ్చెనే నన్నుఁ - గడనుండు మనుచు?
నీపని యితనిచే - నీడేఱు ననుచు
జూపుము పనిగొమ్ము - చూచెదమతని"
అనిన నందఱి మాట - నాలకింపుచును
దనకేమి పనియని - తలఁచిన కరణి
గడనున్న వీరశే - ఖరు నాంజనేయు
వడిఁజూచి యాజాంబ - వంతుఁ డిట్లనియె,

-: సీతను వెదకుటకై జాంబవంతుఁడు హనుమంతుని ప్రోత్సహించుట :-

"ఏమయ్య! హనుమంత! - యేమియు ననక
స్వామి కార్యహితంబు - సడలి యున్నావు5990
సామజోత్తమము దీ - ర్చఁగనైనపనికి
దోమలు వూని పొం - దునె కార్యసిద్ధి?
నీచేతనగుపని - నీచేతఁగాక
నీచవానరులెల్ల - నిర్వహింపుదురె?
మాదృశులకుఁ దర - మా? వార్ధి దాటి
యీదృశకార్యంబు - లీడేర్తు మనఁగ?
రామలక్ష్మణులకు - రవితనూజునకు
నీ మేర సరివత్తు - వీ వెల్ల యెడల
ధరణిభరంబెల్లఁ - దాఁబూనఁ జాలు
గరుఁడుఁ డొక్కఁడు విహం - గమజాతిలోన 6000

వానరజాతి నె - వ్వరు నీడు లేని
భూనుతశక్తి - సంపూర్ణుఁడ వీవు
వానరు లేల దే - వమనుష్యదైత్య
దానవుల్ గూడి యం - దఱు నీకు సరియె?
వైనతేయుని యంత - వాఁడవు హెచ్చు
గాని మాయందు నొ - క్కరుఁడవే నీవు?
నీశక్తి యెఱుఁగక - నేఁ డూరకున్న
కీశకోటికి నెల్లఁ - గీడావహిల్లు.

 -: హనుమంతుని జన్మవృత్తాంతము :-

పుంజకస్థలియను - పూఁబోడిగాదె
యంజనాదేవి? య - య్యలినీలవేణి 6010
చక్కదనంబుఁ గే- సరిచూచి మెచ్చి
యక్కరతోఁ బెండ్లి - యాడె నవ్వెలఁది
మొదట నచ్చర నొక - ముని శపియింప
నది వచ్చి కుంజరుం - డను కపీంద్రునకు
మానవతరుణియై - మహి జనియించె
నానీరజేక్షణ - యపు డొక్కనాఁడు
గిరికందరంబులఁ - గేలీవిలాస
పరతచేఁ జరియింపఁ - బవమానవశతఁ
జేల తోలంగిన - శిబ్బెపు గుబ్బ
పాలిండ్లు నరఁటికం - బముల క్రొమ్మెఱుఁగు6020
వెదఁజల్లు తొడలు నీ - వీబంధ మూడి
ప్రిదిలినఁ దోఁచు నా - భీవివరంబుఁ
బటువైన కటితటీ - భారంబు నడుము

గిటగిటయును జూచి - క్రేఁగన్నువైచి
యాలింగనముచేయు - ననిలుని గాంచి
బాల పాతివ్రత్య - భంగభయమున
నొడబాటు చాలక - యొదుగుచోఁ బట్టి
విడువక యోకొమ్మ! - వెఱవ నేమిటికి?
పవనుఁడ నేను దో - ర్బలశౌర్యశాలి
నువిద నీకొక పుత్రు - నొసఁగ వచ్చితిని6030
యహితంబు గాదు నీ - కని" యొడంబఱచి
బహుమాన మొనరించి - పవనుండు చనియె.
తరుణి యాప్రొద్దె మం - దరకందరమున
గరువలి కృప నిన్నుఁ - గాంచె మోదమునఁ
బుట్టినప్పుడె నీవు - పొడుపు గుబ్బలిని
కట్టెఱచేఁ దోచు - ఖరకరుఁ జూచి
ఫలబుద్ధిచేఁ జేరి - పట్టెదననుచు
నులకగా మున్నూఱు - యోజనంబులకు
సెగసి భానుని వేడి - నెంతయు నీవు
బెగడఁగఁ జేరఁ గో - పించి యింద్రుడు6040
భిదురంబుచే వ్రేయ - భీమమైనింగి
నది వచ్చి నీవామ - హనువుఁ గొట్టుటయు
తొడనొచ్చి యొకకొంక - తోడుతఁగొట్టు
వడి పడియున్నచో - బవమానుఁ డలిగి
యుర్విపైఁ దనమూర్తి - యుపసంహరించి
పర్వి జీవుల గత - ప్రాణులఁ జేయ

దడ కట్టుపడి జగ - త్రయమున నూర్పు
వెడలక ప్రతిమల - విధమున నున్న
జీవకోటులను జూ - చి విరించి వచ్చి
దీవించి నిన్ను నె - త్తి కవుంగలించి
హనువు నొప్పియుఁ దీర్చి - యాదరించుటను
హనుమంతుఁ డనెడి వి - ఖ్యాతి గాంచితివి.
అదిగాక దివ్యశ - స్త్రాస్త్రముల్ నిన్ను
బొదివి నాఁటకయుండ - బుడమి నెవ్వరును
నిను గెల్వకుండ మ - న్నింప నింద్రుండు
తన వరంబుగ నమృ - తత్వం బొసంగె
వాయువు తనయంత - వానిగా నిన్ను
నీయెడలఁ జరింప - నిచ్చె వరంబు
జీవకోటులను ర - క్షించి చైతన్య
భావము ల్గలిగించి - బ్రాణంబు లిచ్చి6060
యట్టి యవధ్యుండ - వతిసత్త్వనిధివి
పట్టిన పనులు దీ - ర్పఁగ సమర్థుఁడవు
బుద్ధిమంతుఁడవు నే - ర్పును నీకె కలదు
యుద్ధకోవిదుఁడ వ - త్యుత్సాహనిధివి
క్షేత్రజుఁడవు నీవు - కేసరి కపికి
పుత్రుఁడవైతి గా - డ్పున కౌరసుఁడవు
గావున నీసరి - గాము మేమెల్ల
లావున జవసత్వ- లాఘవంబులను
మును త్రివిక్రమునకు - ముయ్యేడుమారు
లొనరఁ బ్రదక్షణం - బొనరించుకొఱకు6070

నొకముహూర్తంబులో - నుర్విఁ జుట్టితిమి
సకలౌషధులును ప్ర - సన్నంబు లగుట
వయసు సత్తువయేల - వచ్చు నెప్పటికి?
రయమున పెద్దవా - రము గానలేదు.
అన్న! త్రివిక్రముఁ - డై మేను పెంచు
వెన్నుని గతి నీవు - విశ్వరూపంబుఁ
జూపి యావారిధిఁ - జులకఁగా దాటి
నీపౌరుషము లంక - నిండంగ డాసి
సీతను జూచి వ - చ్చినఁ గాక యొరుని
చేతఁ దీరునే యీ య - జేయపౌరుషము?6080
వానరులకును జీ - వము లిచ్చి యభయ
దానంబొసంగుము - తడయ నేమిటికి?"
అనుమాట లాలించి - యంజనాతనయుఁ

-: జాంబవంతుని మాటలకు హనుమంతుఁ డుప్పొంగి సముద్రము దాటుటకు
                   నంగదుననుజ్ఞ వేఁడుట :-

డనుపమోత్సాహశౌ - ర్యవిజృంభణముల
వాలంబు మహి యద్రు - వంగ దాఁటించి
తాలేచి మితిలేని - తనమేను వెంచి
చెంతవానరు లెల్ల - సింహనాదములు
గంతులు వినుతులుఁ - గావింపుచుండ
నట్టహాసముచేసి - యనిలనందనుఁడు
చుట్టును జెలరేఁగు - చుట్టాలఁ జూచి6090

వాయునందనుఁడను - వాయువుంగాఁడు
నాయంతవాఁడ నం - తబలంబుచేత
సరిగాఁడు నాకు ఖే - చరగమనమున
గరుఁడఁ డన్యులుసాటి - గారననేల?
దాఁటుదునే మేరు - ధరణీధరంబు
మాటమాత్రనె నభో - మండలి నెగసి
జలజంతువులతోడ - జలరాశి యెల్ల
నిలఁ జేతులను జల్లి - యింకఁ జేయుదునె
ధరణితలంబు హ - స్తమునఁ బెకల్చి
శరనిధిలో వైచి - జలగడుగుదునె!6100
ఒకయడు గిచ్చోట - నొకకాలు లంక
నొకట నుండగఁ జిందు - లురక త్రొక్కుదునె!
తొక్కిన యడుగుల - తో నివి రెండుఁ
ద్రొక్కి నిల్పుదునె య - ధోలోకములను!
ఉదయించు రవియందె - యుండ నందుండి
కదిసి యస్తాద్రి క - క్కడికిఁ జేరుదునె!
దీవులు జలధులు - దిరిగి నల్దిక్కు
లీవలావల దాఁటి - యిపుడె చేరుదునె!
ఎగయుచో నామేన - నెసఁగు వాయువుల
నొగ డాకులన రాల్తు - నోవిమానములు! 6110
ఇల వ్రక్కలించి భో - గీంద్రునిఁ బట్టి
యెలఁ దమ్మితూఁడుగా - నెగరవేయుదునొ!
ఎందున్న రవిచంద్రు - లిట్టట్టురాక
యందె నిల్వఁగఁజేతు - లాని నిల్పుదునొ!
అమ్మనంబులుగా కు - లాచలశ్రేణి

రెమ్మి పైపై నెగ - రించి యాడుదునొ
ఇందుండి యీలంక - కెగయుచో నిచటి
చందనాచల మహీ - జశ్రేణి వెంట
విడువకరాఁ దాని - వెంబడిచేత
నుడుమండలం బెల్ల - నొక్క మొత్తముగ6120
నిప్పపువ్వులజాడ - నీమహిమీఁదఁ
గుప్పలుగా రాల - గుప్పగింపుదునొ !
ఎగయుచో ననుఁ జూచి - యీభూతకోటి
పొగడి వెంటనె పెడ - దొబ్బలు పెట్టి
దివి భువి నిండింప - దిగులుచే భ్రమసి
చెవులు మూసుకొనఁగఁ - జేతునోమిమ్ము!
మేరువుగతి నాక్ర - మించి మిన్నెల్ల
నీరంధ్రముగ నిండ - నేను జేయుదునొ!
గరుడవాయువు లొక్క - కడయైననాకు
సరియనవచ్చును - జవసత్త్వములను6130
మెఱపు తళుక్కన్న - మెఱచిన కరణిఁ
దిరిగివచ్చెదను వై - దేహినిఁ జూచి
మున్నుజూచెఁ ద్రివిక్ర - ముని జాంబవంతుఁ
డెన్నఁడు ననుజూచి - యిటమీఁద నతని
నాబుద్ధిజవబలౌ - న్నత్యముల్ మిగులఁ
బ్రాబల్యగతి కొనల్ - వారేని యెడల
గరుసు మీరెను భుజా - కండూతి తనకుఁ
దరణిసూనుండు కృ - తార్థతఁ గాంచె నిపుడు
శ్రీరామలక్ష్మణుల్ - చింతలు దీఱి
యూరడిల్లుదు రింక - నుల్లంబులందు6140

లక్షయోజనములు - లంఘింతు మీరు
లక్షింపుఁ డల్లది - లంకాపురంబు
శతయోజనము లెంత - చంగున దాఁటి
హితముఁ జేసెద మీకు - నీక్షింపుఁ డిపుడు!
ఎదిరింపఁ గలదె బ్ర - హ్మేంద్రాదులైన
నిది యసాధ్యంబన - నెయ్యది నాకు?
అమరావతికి నేఁగి - యమృతంబుఁ దెత్తు
నిమిషంబులో రాము - నికి వలయునన్న!
లంకాధిపతితో ని - లాసుత తోడ
లంక నాచేత న - లంకారముగను {{float right|6150 }
పెకలించి తెత్తునో - పీఁచమణంచి
యొకరాక్షసుఁడు లేక - యుండఁగఁజేసి!
రావణు నావాల - రజ్జు వల్లరులఁ
జావకుండఁగఁ గట్టి - జానకీదేవి
నామూఁపుల నమర్చి - నమ్మించి సగము
జాములోఁ దెచ్చి - చాయ నిల్పుదునొ!
ఊరకే రావణు - నూరెల్లఁ జూచి
శ్రీరాము దేవేరిఁ - జేరి యూరార్చి
వత్తునొ యొకమాట - వాలినందనుని
చిత్తంబునందుఁ దో - చిన బుద్ధి యడిగి {{float right|6160 }
వాకొను" డన జాంబ - వంతుండు భీక
రాకారుఁ డైనట్టి - హనుమంతుఁ బలికె
"శరణు చొచ్చిన నీదు - చరణపద్మముల
మరుఁగుననని యున్న - మర్కటోత్తముల

కంగదునకు నాకు - నానందమయ్యె!
మంగళంబగు గాక - మా యన్న! నీకు
నినుఁ జేరుఁగాక మా - నిత జయలక్ష్మి!
కనుచాటు దాఁకక - క్రమ్మరుమయ్య
మమువంటి పెద్దల - మంచి దీవెనలు!
సమబుద్ధి వజ్రాంగి - చాడ్పున నీవు6170
చేకొని సంకల్ప - సిద్ధుఁడ వగుచు
నాకల్పమైన వి - ఖ్యాతి గైకొనుము.
వానరులకు రఘు - వరులకుఁ బ్రాణ
దానముల్ చేసి కీ - ర్తనములు గనుము.
నీవాని నన్ను మ - న్నించి నామాట
నీవననిధి దాఁటు - మిచ్చటనుండి
జలధి దాఁటిన భూమి - చలియించు క్రుంగు
నిలువనేరరు కపుల్ - నీజవంబునకు
నీ మహేంద్రాచలం - బెక్కి యీకొండ
భూమిక్రుంగక యుండఁ - బుటముగా నెగసి6180
పోయిరమ్మన వాయు - పుత్రుఁ డుప్పొంగి
యాయద్రిఁ జేరి శృం - గాగ్రవీథులకు
నడుచుచో గులగుల - నగము గొంతాము
వడువున పట్టులు - వదలి ఘూర్ణిల్ల
బిలములు సందీక - పిచ్చుకగూళ్ళ
పొలుపునఁ గనరాక - పొడివొడి గాఁగ
గజసింహ గవయ సూ - కరలులాయములు

నజగజ వడఁకి న - ల్గడలను బఱవఁ
జరులఁ గ్రీడించు ని - ర్జరమిథునములు
పరువుతోడ విమాన - పంక్తుల నేఁగ6190
వడిగల గతినొప్పు - పడగలు విచ్చి
లెడనెడఁ గాలాహు - లెరమాని చూడ
నిజబిరుదాంకవం - దిగణంబు రీతి
ద్విజకోటి యెగసి నల్ - దిక్కులఁ గెలయఁ
దపము సేయనునున్న - తాపసశ్రేణి
యవుడు నిల్వఁగరామి – నవ్వలికరుగఁ
జిత్తంబు వదలంగ - శిఖరంబు లెక్కి
యుత్తాలమగువాల - ముడువీథి నార్చి
లంకపైఁ జూపు ల - ల్లన నిగుడించి
శంకింప కామ్రోల - జలరాశిఁ గాంచి6200
దాఁటెదనని వియ - త్తలము వీక్షించి
హాటకాచలనిభం - బైనగాత్రంబు
గిరిమీద మెఱయ న - గ్గింప వేలుపులు
కరవలిపట్టి య - గ్గలికతో నుండె
విలసిల్లె ననివేద - వేద్యునిపేర
నలమేలుమంగాంగ - నాధీశుపేరఁ
నంచితకరుణాక - టాక్షునిపేరఁ
గాంచనమణిమయా - కల్పునిపేరఁ
వేదవేదాంతార్థ - వినుతునిపేరఁ
నాదిత్యకోటిప్ర - భాంగునిపేరఁ6210

గంకణాంగదరత్న - కటకాఢ్యుపేర
వెంకటేశునిపేర - విశ్వాత్ముపేర
నంకితంబుగ వెంక - టాధీశచరణ
పంకజసేవాను - భావమానసుఁడు
హరిదాసమణి కట్ట - హరిదాసరాజు
వరదరాజు నితాంత - వరదానశాలి
రచియించు వాల్మీకి - రామాయణంబు
ప్రచురభక్తిని మదిఁ - బాటించి వినినఁ
జదివిన వ్రాసిన - సభలఁ బేర్కొనిన
మదిఁ దలఁచిన నెట్టి - మనుజులకైన6220
ధారుణిమీఁద సీ - తారామచంద్ర
పారిజాతదయాప్ర - భావంబు వలన
హయమేధరాజసూ - యాదిమయాగ
నియతఫలంబులు - నిరతాన్నదాన
సుకృతంబు నిత్యయ - శోవైభవములు
నకలంకతీర్థయా - త్రాదిపుణ్యములు
సత్యవ్రతపదంబు - సకలసౌఖ్యములు
నిత్యమహాదాన - నిరుపమశ్రీలు
కలికాలసంప్రాప్త- కలుషనాశనము
కలుములు హరిభక్తి - గౌరవోన్నతులు6230
శత్రుజయంబును - స్వామిహితంబు
పుత్రలాభంబును - భోగభాగ్యములు
ననుకూలదాంపత్య - మంగనాప్రియము
ధనధాన్యపశువస్తు - దాసీసమృద్ధి
మానసహితము ధ - ర్మప్రవర్తనము

నానందములు ఖేద - మందకుండుటయు
నలఘువివేకంబు - నతులగౌరవము
వలయు కార్యములు కై - వశము లౌటయునుఁ
బావనత్వము దీర్ఘ - పరమాయువులునుఁ
గైవల్యసుఖము ని - క్కముగాఁగఁ గలుగు.6240
ఎన్నాళ్లు ధారుణి - యెన్నాళ్లు జలధు
లెన్నాళ్లు రవిచంద్రు - లెన్నాళ్లు గిరులు
నెన్నాళ్లు నిగమంబు - లెన్నాళ్లు విశ్వ
మన్నాళ్లు నీకథ - యలర నార్షంబు.
ఆదికావ్యంబు సమ - స్తపూజ్యంబు
వేదసమానంబు - విశ్వసన్నుతము
నైన కిష్కింధా మ - హాకాండ మిపుడు
మానితశ్రీలచే - మహినొప్పుగాఁత!6248



కట్టా వరదరాజకృతమగు
వాల్మీకిరామాయణమునందు
కిష్కింధాకాండము
సంపూర్ణము