శ్రీ రామాయణము - రెండవసంపుటము/ఆరణ్యకాండము
శుభమస్తు.
కట్టా వరదరాజకృతమగు
శ్రీరామాయణము
(ద్విపద)
ఆరణ్యకాండము
——: ఇష్టదేవతాస్తుతి :——
శ్రీరాజితశుభాంగ! - చిరగుణిసంగ
హారికృపాపాంగ! -యలమేలుమంగ
భావుక! శతకోటి - భానుసంకాశ!
సేవకాత్మనివేశ! - శ్రీ వెంకటేశ!
అవధారు! కుశలవు - లా రామచంద్రు
డవధరింపంగ రా - మాయణం బిట్లు
వినుపించు తత్కథా - వృత్తాంతమెల్ల
కనుపించు నవ్వలి - కథ యెట్టులనిన;
——: శ్రీరాముఁడు మునుల యాశ్రమముఁ జూచుట :——
అపుడు రాముఁడు దండ - కారణ్య భూమి
విపులతేజమునఁ బ్ర - వేశంబుఁజేసి
యరుగుచో నభమును - నర్కమండలము
కరణి భూసురు లుండు - కందువఁ జేరి
వనమృగంబులకు ని - వాసమై సకల
మునివరాగమ నాద - ములఁ జెలంగుచును
గలిత నానావిహం - గమకలస్వనముఁ
గలిగి యాదిత్య రా - కాచంద్రముఖుల
నాటపాటలచేత - నమరు నికుంజ
వాటికలను స్రుక్ స్రు - వమ్ములు దాల్చు
హోతలచే నొప్పు - హోమవేదికల
హేతులు వెలి విరి - యించు నగ్నులను 20
బలివిధానముల రం - భారసాలాది
ఫలమహీరుహములఁ - బద్మినీకుముద
జలజాకరముల భా-స్కరపావకులకుఁ
దులవచ్చు మౌనుల - తో విరాజిల్లు
నొక యాశ్రమముఁ జూచి - యుగ్రకార్ముకము
లొకరైన నెక్కిడ - నొల్లకఁ దమదు
భుజములఁ గీలించి - పోవు రాఘవుల
నజినోత్తరీయులై - నట్టి సంయములు
వెఱగంది కరుణతో - వీక్షించి చేరి
భరతాగ్రజునిఁ జూచి - పలికిరిట్లనుచు. 30
-: మునులకు శ్రీరాముఁ డభయప్రదానముఁ గావించుట :--
"అతిథివై తివి యస్మ - దాశ్రమంబునకు
నతివతో వచ్చి నీ - కర్చ లిచ్చెదము
అమరావతీపురం - బమరేంద్రుఁ డేలు
క్రమమున నిలకెల్లఁ - గర్తవు నీవు
వసియింపు మిచట మీ- వారము మేము
వసుమతీ సురల దే-వతలను బ్రోవ
భారకుండవు దైత్య - బాధలు మమ్ము
నోరామ! యెన్నేని - యుగ్గడించెదము
నినుఁజూచి ప్రాణముల్ - నిల్చెను మాకు
మునులమౌటను శమం - బుల నోర్వవలసె40
మాకుఁ గ్రోధంబులు - మచ్చరంబులును
కాకుండు నటుగాన - కలుషించి మేము
చేతనై యుండియుఁ - జేసిన తపము
పాతకుల శపింప - బరిసిపోవుటను
దాలియుందుము కన్న - తల్లి బిడ్డలను
బాలించు గతి నీదు - పాలిటనుంచి
శరణాగతుల మమ్ము - సభయుల నీదు
మఱుఁగున నుంచి నే - మములు చెల్లించి
కావు మీవని ఫల - కందమూలములు
కావలసినవెల్లఁ - గానుక చేసి 50
యలరింప వారికి- నభయ మొసంగి
లలనాలలామతో - లక్ష్మణుతోడ
నాదినంబెల్ల న - య్యాశ్రమసీమ
మోదంబుతో రఘు - ముఖ్యుఁడు నిలిచె.
-:రాముఁడు విరాధునిఁ జూచుట:-
ఆపరదినంబున - నమ్మహాభుజుఁడు
తపనసంకాశులౌ - తాపసోత్తముల
యనుమతిఁ జెంత మ - హారణ్య భూమి
యనుజన్మ సీతాస - హాయుఁడై చొచ్చి
పులులును గారెను - పోతులు బందు
లెలుఁగులు దోఁడేళ్ళు - నేదులు లేళ్లు 60
గాక ఘూకంబులు - గంకగృధ్రములు
నేకడ నెడ మీక - యీండ్రమై మెలఁగు
నవి చూచుచుం బోవ - నట్టహాసమున
నవనియు నింగియు - నరికట్టు వడఁగ
నతిభయంకరమైన - యంజనాచలముఁ
బ్రతివచ్చు మేను భూ - భారంబు గాఁగ
తెఱచిన నోరుతో- దిగదిగ వెలుగు
మెఱుఁగు కోరలతోడ - మిణుగురుల్రాల్చు
చూపులతో నుగ్ర -శూలంబుతోడ
జూపఱ బెదర వ - చ్చు సురాపరాధు 70
నా విరాధుని విల - యాంతక నిభుని
భావి రావణవైరి - భావించి చూడ,
శీఘ్రవేగమున పి - చ్చిలినెత్తు రొలుక
వ్యాఘ్రచర్మము మేన - వలెవాటు వైచి
నాలుగు సింహముల్ - నాలుగు పులులు
నాలుగుకొమ్ముల - నాగమస్తములు
పదికారుపోతు లి-ర్వది హరిణములు
పదియేను తోడేళ్ళు - పందులేఁబదియు
శూలాగ్రమున వ్రేలఁ - జొరఁబారి తనదు
మోలఁగన్పట్లు రా-మునికడఁ ద్రోచి80
జానకి కేల్వట్టి - చంకను వైచి
దానవుఁ డపుడు రౌ - ద్రరసంబు మెఱయ
గడగడ వడఁకు రా - ఘవుదేవితోడఁ
గడకేఁగి నిల్చి బిం-కమున నిట్లనియె.
“ఎవ్వరురా! మీర - లిమ్మహాటవిని
గ్రొవ్వుతోఁ జక్కని - కోమలి తోడఁ
బోటు బంటులఁబోలి - భుజముల విండ్లు
హాటకపుంఖంబు - లైన బాణములు
కైదువులును బూని - గ్రాసమై నాకు
మీఁ దెఱుంగక వచ్చి - మీరు చిక్కితిరి90
మాయావులై మీరు - మౌని వేషముల
నాయెదురను జడల్ - నారచీరలును
దాలిచి వచ్చినం - దప్పునే మౌని
జాలంబె కాదె భో - జనము నాకిపుడు
తలఁచ నీతలఁపు సుం - దరి తెకదేర
గలిగె నూరికె నాకుఁ - గామాతురునకు
దీని వివాహమై - తెరువాఁగి మిమ్ముఁ
బోనీకఁబట్టి యి - ప్పుడె మ్రింగువాఁడ
నే విరాధుఁడ నాకు - నీ యరణ్యంబు
తావలంబ"ని పల్కు - దానవు మాట 100
విని దైన్యమున మోము - వెలవెలగాఁగ
దన పెదవుల నొకిం - తయుఁ దడి లేక
జానకీవిభుఁడు ల -క్ష్మణు మోముఁజూచి
దీనుఁడై తన పెంపుఁ - దెలియక పల్కె,
"కంటివే లక్ష్మణ! - గాలిమైఁ గదల
నంటియో యననొప్పు - నవనీతనూజ
చెఱఁబట్టువడి వెఱ- చెనుఁ బ్రాణభీతి
నెఱుఁగక వచ్చితి - మిట్టి మార్గమున
మనము చూచుచునుండ - మనవెంటవచ్చు
వనిత నెత్తుకపోయి - వాఁడున్నవాఁడు 110
కైక తలంచు సం - కల్ప మంతయును
జేకూడెఁ గౌసల్య - సేయు పాపమున
ధరణియొక్కని కిచ్చి - తండ్రినింజంపి
తరుణినిం గోల్పోయిఁ - దన వివేకమున
నాచెట్టవట్టి మా - నముఁ దూలపోవ
నోచె నీజనకత - నూజు యేమందు?
ఏమి సేయుదు?" నన్న - నెంతయు నలిగి
రామునితో సుమి - త్రా సుతుండనియె.
"దేవ! యిట్లందురే - దేవతావిభుని
లావునంగెల్చి ఖే - ల ప్రతాపుఁడవు120
కావలెనన్న లో - కత్రితయంబు
నీ విశిఖాగ్నిచే - నీరు సేయుదువు!
నేను నీ బంట నుం - డియు నింతలోనె
దీనుని వలె నేల - ధృతి మాని పల్క?
వీడన నెంత! నా - వివిధాస్త్ర కోటి
వాడిమిచే భూమి - వ్రయ్యలు సేతు!
భరతుని మీఁది నా - పగయెల్ల నేఁడు
మరలించి యొకకోల - మర్దింతు వీని
పిడుగు గొట్టినయట్టి - పృథివీధరంబు
వడువున నెమ్మేను - వ్రయ్యలుగాఁగ130
నాచేతి యొకతూఁపు- నాటించి దనుజ
నీచునిం గూల్చెద - నిమిషమాత్రమున!
విపినమండలమెల్ల - వీనిరక్తమున
నివుడె నదిశ్రేణి - నెనయంగఁ జేతు!
సంచిత పరమక - ల్యాణిని సీత
నుంచెదఁ దెచ్చి మీ - యొద్ద నీ క్షణమె!
ననుఁజూడు"డని పల్క - నగుమోముతోడ
దనుజుఁడు భీతి యిం - తయు లేక పలికె.
-:విరాధరామ సంభాషణ:-
"ఎట్టివారలు మీర - లీవాళకముల
నట్టడవినిఁజిక్కి - నారు నాచేత140
మీరు వోయెదమన్న - మిన్నకపోవఁ
దీరునే విధి మిమ్ముఁ - దెచ్చెనా కడకు"
నను మాటలకు రాముఁ - డా నిశాచరుని
గనుఁగొని “ఏము భా - స్కర వంశజులము
దశరథరాజనం - దనులము, తండ్రి
యశమెంచి యతని స - త్యము నిల్పఁదలఁచి
వనులను జరియింప - వలసి యిచ్చోటి
మునికోటి ప్రార్థనం - బులఁ జరించెదము."
అన్న మాటలకు వాఁ - డా రాజనుతుల
నెన్నక మదిగర్వ - మెచ్చ నిట్లనియె.150
"రాజనందనులార!- రాక్షస వంశ
రాజైన జయుని పు-త్రకుఁడను నేను
శతహ్రదయందురు - జనయిత్రి నాకు
నతిబలుండ విరాధుఁ - డందురు నన్ను
దేవతాఖచర దై - తేయ కింపురుష
లావణ్యవతుల నె - ల్లను విచారించి
తగినట్టి చక్కని - దాని నెచ్చోట
జగతిని వెదకి యీ -జలజలోచనను
నిచ్చోటఁజూచితి - నీయింతి మీరు
తెచ్చి కానుక చేసి - తిరిగాన మిమ్ముఁ160
గాచితి నీయింతిఁ - గని నామనంబు
లోచనంబులును మే - లునకుఁ బాల్పడియె!
కమలజుఁ జేత సం - గరములో నొరులు
తెమలింప రానట్టి - ధృతిఁ గన్నవాఁడ
సాయుధాహతులచే - హతి లేక యుండ
నా యజునివరంబు - లందిన వాఁడ!
జనుఁడు మీయిచ్చకు - సరిపోయినట్టి
యనువునఁబ్రతుకుల - యాస కల్గినను,
ననుభవించెదరు కా - దనుచు నేమైన
నని యిట్టులట్లు మ -ల్లాడితిరేని170
పొండన్న" నాగ్రహం - బున విరాధునకు
వెండియు నారఘు - వీరుఁ డిట్లనియె.
-: రాముఁడు విరాధునితో యుద్ధము చేయుట :-
" ఓరి! విరాధ! నా - యుగ్ర బాణముల
నీరీతి ననరాని - యీమాటలాడు
నిన్ను ఖండించెద - నేఁడు నీచేత
మున్నుఁ గాసిలియున్న - మునులఁ గాచెదను"
అని యేడు దూపుల - నద్రియుంబోలు
దనుజుని యురము ర - క్తంబులఁ దొరుగ
వ్రేసిన నవి దూరి - వీపునే వెడలి
భాసుర పావక - ప్రభలు గప్పుచును180
పుడమి నాఁటిన మహీ- పుత్రినం దొక్క
యెడనుంచి తనశూల - మెత్తి యార్చుచును
వదనంబుఁ దెఱచి వై - వస్వతుఁగరణిఁ
గదియ రాఁజూచి రా - ఘవులుఁగోపించి
యిరువురు నిరుగడ - నిషుపరంపరలు
గురిసి దానవుమేన - గుదిగ్రుచ్చి నిలుప
నతఁడు మైజాడింప - నమ్ములన్నియను
క్షితిమీఁద రాలినఁ - జెదర కయ్యసుర
శూలంబుఁద్రిప్పి యా-ర్చుచు మీఁదవైవ
నాలంబులో నది - యాలంబు గాఁగ190
రెండు దూపులచేత - శ్రీరామవిభుఁడు
ఖండింప పటువజ్ర - ఘాతనిర్భిన్న
సముదగ్ర కాంచనా - చలశిలాశకల
సమతఁ జెందుచును ర - సా స్థలింబడినఁ
బోయిన శూలంబుఁ - బోవనిమ్మనుచు
నాయతాత్మీయ బా - హాయుగళమున
రామలక్ష్మణులఁ జే- రఁగ నేఁగి పట్టి
యేమి దలంచెనో - యిరుభుజంబులకు
నెక్కించుకొని పోవ - నినకులోత్తములు
“చక్కనిత్రోవనే - చనుచున్న వాఁడు200
మనమేఁగవలసిన - మాత్రంబెయేఁగి
తునుముద మట మీఁద- దోశ్శక్తి నితని
పోవనిమ్మని వాని-భుజముల మీఁదఁ
బోవువారలఁజూచి - భూపుత్రి వగచి,
"ఏలకో వీనిచే - నిమ్మహాశౌర్యు
లాలంబులోఁజిక్కి - రసమర్ధులగుచుఁ
గావలసిన వీని - ఖండింపలేరె
లావున నింక నే - లాగు నాతెఱఁగు!”
అని వెంటఁబోవుచు - నార్తి నొందుచును
వనమృగంబులకు భా- వమున భీతిలుచు,210
"ఓరిదానవ! మది - నోడక యేల
నీ రాఘవులఁ బట్టి - యేఁగెద విట్లు?
పోవచ్చునే నీవు - బోయిన నేలఁ
బోవనిత్తురె పట్టి - పొలియింప కిపుడు
మనువంశ విభులను - మావారి డించి
చనుమన” విలపించు జానకి మదికి
హితముగా ఖడ్గంబు - లిరువురుఁదిగిచి
దితిసుతు భుజములుఁ - దెగవ్రేయుటయును
వానిచేతుల వెంట - వసుమతి వ్రాలి
జానకిచూచి మె - చ్చఁగఁ గడ నిలువ220
నావిరాధుండు మ-హా రావ మొప్ప
లావెల్లఁ బొలసి యి-లాస్థలిఁ బడినఁ
గత్తుల నఱికియు - గాఁజాల కుట్ల
తిత్తిగాఁ బొడిచియుఁ - దీసియిట్టట్టు
వెలికిలఁ బొరలంగ - వ్రేసి మోకాళ్ళ
నలియంగఁ బొడిచి య - న్నయును దమ్ముఁడును
దలయుఁ గాళ్లునుఁ బట్టి - దానవు నెత్తి
యిలమీఁదఁగొట్టియు - నెమ్ములన్నియును
బొడివొడిసేసియుఁ - బొందుగఁ ద్రొక్కి
మెడనులిమియు గ్రుడ్లు - మిణకరింపంగఁ230
బిడికిళ్ల గ్రుద్దియు - భీమరాక్షసుని
మడియింపనేరక - మల్లాడి యలసి,
“వింటివే లక్ష్మణ! - వీఁడిట్లు బడియు
నొంటనుఁ జావులే - కున్నాఁడు ధాత
వరముచే నటుగాన - వసుమతిఁద్రవ్వి
బొరియలో నీద్రోహిఁ - బూడ్చి చంపుదము
త్రవ్వుమిచ్చో”నను - దశరథసుతుని
యవ్వాక్యములకు వాఁ - డాపన్నుఁడగుచు
శరణాగతత్రాణ - సద్ధర్మపరుని
ధరణిజారమణు న- త్తరిఁజూచి వలికె.240
—:విరాధుని శాపకథనము :—
“స్వామి! నీచరణముల్ - శరణంబు నాకు
యీమానినియె సీత - యీవు రాముఁడవు
యితఁడు లక్ష్మణుఁ డని - యెఱిగితి నిపుడు
మతిమిమ్ముఁ గనలేక - మార్కొంటి నేను
బాధింపకుము దీన - బాంధవ! సకల
సాధు రక్షణ విచ - క్షణుఁడవు నీవు
వినుము నా తెఱఁగు నే - విబుధేంద్రు చెంతఁ
జనుమానమున నుండు - సంగీత నిధిని
తుంబురుండనుచు నం - దురు పేరు, రాజ
సంబున గంధర్వ - జాతి నుత్తముఁడఁ250
గామాంధకారంబు - కన్నులఁదొట్టి
కామించి రంభతోఁ - గలసి క్రీడింపఁ
దనకొలువునకు ని - తఁడు వేళఁగాచి
కనుఁగల్గి యుండఁడు - గర్వించి యనుచు
దనుజుఁడవై నీవు - ధరణిపైఁబుట్టు
మనుచుఁ గుబేరుఁడ- త్యాగ్రహవృత్తి
శపియింప వెఱచి యం - జలిచేసి చాల
కృపణత్వమున నుండఁ - గృపయుంచి యతఁడు
మీరాకయును నాకు - మీతోడి రణము
కారణంబున ముక్తి - గలుగు చందంబు260
వివరింపఁగిన్నర - విభుని శాపమున
నవనిపై నిట్టి ఘో - రాకృతిఁబుట్టి
సరిచూచితిని నాఁటి - శాపంబునకును
దరియౌట యభయప్ర - దానంబుఁ జేసి
రక్షింపుఁడిక సంగ- రంబునం బడిన
రాక్షసులను మహి - ద్రవ్వి పూడ్చుటయె
ధర్మంబుగా నటు - దలఁచిన యట్టి
కర్మంబు సేయుఁ డేఁ - గనియెద ముక్తి.
దయఁజూడుఁ డిచ్చోటు - దరలి యీప్రొద్దె
పయనమై దక్షిణ - భాగంబు నందుఁ270
జనుచోట నర్ధయో - జనమాత్రనొక్క
ముని శరభంగ నా - మునిఁగాంచఁగలరు.
అందుచే శుభములు - నందుదు రేను
బొందుదు నిట్లూర్ధ్వ - పుణ్యలోకములు
పాలింపుఁడ”నుమాటఁ - బరమ కారుణ్య
శాలి యా జానకీ - జాని యాలించి
వెఱఁగును దాల్మి వి - వేకంబుఁగరుణ
దొరయంగ సౌమిత్రి - తోడ నిట్లనియె.
“వింటిమి లక్ష్మణ - వీని చందంబు
మంటిలోఁబూడ్చక - మరణంబు లేదు280
వీనికి నోదము - విధమునం బెద్ద
యేనుఁగ పొడవుతో - నిపుడొక్కగుంటఁ
ద్రవ్వు మీ"వని చెంతఁ - ద్రవ్వించి వాని
నవ్వేళఁగుత్తుక - యంఘ్రిచేఁద్రొక్కి
యిరువురు పాఁతర - కీడ్చి పొర్లించి
శిరము క్రిందుగ రొద - సేయుచుఁ ద్రెళ్ల
బడఁద్రోచి దానవు - పై రాళ్లు గుండ్లుఁ
బడవైచి మ్రాకులా - పై నిండవైచి
గడ్డలు దుమ్మునుఁ - గప్పిధారుణికి
నొడ్డుగాపైదిన్నె - యునిచి యవ్వెనుక290
జానకి నోరార్చి - శరచాప హస్తు
లై నిబిడంబైన - యడవిలోఁ జొచ్చి
నభమున సూర్యచం -ద్రములనుఁ బోలి
శుభమూర్తులై వచ్చు - చో రామ విభుఁడు
-: శ్రీరాముఁడు శరభంగ మౌని యాశ్రమమును జేరుట :-
సీత నప్పుడు తన - చెంతకుఁదివిచి
ప్రీతితోఁ దమ్మునిఁ - బేర్కొని పలికె
"అతిఘోరమైన యీ -యడవి దాఁటితిమి
హితముగాఁగ విరాధుఁ - డెఱిఁగించి నట్టి
శరభంగమౌని యూ-శ్రమముఁ జేరితిమి
పరికింపు మిచటి పి-ప్పల మహీరుహము300
నారావిచెంతనా - నామరుల్ గొలువ
స్వారాజు వచ్చి యి - చ్చట నున్నవాఁడు
శింజాన కంకణ - శ్రేణి నచ్చరలు
వింజామరలు జెంత - వీచుచున్నారు
తెల్లని హయముల - తేరునఁగట్టి
యుల్లసిల్లుచునున్న - యొక సహస్రంబు
యిరువదే నేఁడుల - యెలజవ్వనంపు
దొరలు పసిండిక -త్తులుఁ బరిజించి
కుండల కోటీర - కోటితో దివ్య
మండనంబులు దాల్చి - మన్మధాకృతులు310
జుట్టునుం గొలువ న -చ్చో నుర్విమీఁద
మెట్టని పదముల - మిహిర తేజమున
నున్న వాఁడింద్రుఁ డ - యోధ్యలోఁదొల్లి
విన్నట్టి యందఱ - వేషముల్ చూచి
యితరులు సురలని - యితఁడింద్రుఁ డనియు
మతిదోఁచె శరభంగ - మౌని చెంగటికి
వచ్చియున్నాఁడు నే - వారి సేవించి
వచ్చెద నీపుణ్య - వనసమీపమున
జానకి చెంత ని - చ్చట నుండు మీవు
మౌనివరేణ్యుతో - మనమాట కాఁగ320
యీచాయఁగాఁజూచి - యేమేమొ కొన్ని
చేచాఁచి యింద్రుండు - జెప్పెడి నిపుడు
వేగఁబోవలెనని - వినయంబు తోడ
సాగి మున్నుగరామ - చంద్రుండు రాఁగ
గొబ్బున ననిపించు - కొని వాహనములఁ
దబ్బిబ్బుగా సుర - తతి యెక్కి కదలఁ
దాను రథంబెక్కి - ధరణీ ధరారి
యానిలింపులఁజూచి - యప్పు డిట్లనియె.
“అదె వచ్చె రఘురాముఁ - డాయన చేతఁ
బ్రదుకులు మనకెల్లఁ - బదిలమై యుండు.330
రావణాది నిశాచ - రశ్రేణి నెల్ల
యీవీరవరుఁడు జ - యించిన వెనకఁ
బొడగని మరికాని - పొసఁగ దేమియును
నుడివి యిట్లనిపల్కి - నోరెత్త రాదు
కనిపించు కొనువేళ - గాదు రండనుచు”
మనసులో మ్రొక్కి య - మ్మాతలి తేరు
నడపింప వినువీథి - నాకంబుఁ జేర
గడియలో నరుగ రా - ఘవశేఖరుండు
సీతయు సౌమిత్రి - చెంతల రాఁగ
—: రాముఁడు శరభంగుని దర్శించుట :—
జాతహర్షంబుతో - శరభంగుఁ జేరి340
యతనికిఁ బ్రణమిల్లి - హస్తముల్ మొగిచి
హితమతి నిల్చిన - నీక్షించి మౌని
దీవించి యొక్క ప్ర - దేశంబుఁజూప
నావీరవరుఁడు సు - ఖాసీనుఁడగుచు
శరభంగ మౌనితో - శతమఘు రాక
మరలిపోయిన యాగ - మంబు వేఁడుటయు
నామహామహుఁడు ప్రి - యంబు రెట్టింప
రామునిఁజూచి స - ర్వము నిట్టులనియె.
“శ్రీరామ! యెవ్వరి - చేత సాధింపఁ
గారాని సత్యలో - కము నాతపమున350
సాధించుటనుఁ జేసి - జలజసంభవుఁడు
బోధింప నింద్రుఁడి - ప్పుడు వచ్చి నన్నుఁ
బిలిచిన తోడనేఁ - బ్రియహితాలాప
ములువల్కి నినుఁజూచి - ముచ్చటదీరి
మఱిపోవువాఁడనై - మదినీదు రాక
యరసి జంభారిఁ బొ - మ్మని పనిచితిని
యిదినిమిత్తంబుగా - నింద్రుండు వచ్చె
నదినీకుఁ దెల్పితి - నవనిజారమణ!
నీకు హితంబెద్ది - నిర్జరరాజ
లోకమైనను సత్య - లోకంబెయైన360
నితరలోకములైన - నే దపోమహిమ
జితము చేసినవాఁడఁ - జేకూర్తు నీకు
నడుగు" మీవన మునీం - ద్రాగ్రణిఁ జూచి
యడుగ నొల్లక రాఘ - వాగ్రణి వల్కె
“అయ్య! మీకరుణచే - నన్నిలోకములు
నెయ్యడవలసిన - నేనె సాధింతు
నవి నాకు నెంత మీ-యనుమతి చేత
నవనిపై నొక్క ర - మ్యప్రదేశమున
నుండగోరెద మాకు- నొకయెడ నాన
తిండు వసింప నెం- దే విచారించి"370
యనిన రామునిఁ జూచి - యామునిరాజు
మనసులో నలరి క్ర - మ్మర నిట్టులనియె.
-: శరభంగుఁ డగ్నిప్రవేశముఁజేసి బ్రహ్మలోకమున కరుగుట :-
“అనఘ రాఘవ! ఇమ్మ - హాశ్రమంబునకు
ననతిదూరము సుతీ - క్ష్ణా శ్రమం బొప్పు
నమ్ముని కడకేఁగి - యతనితో మీర
లిమ్మన్న కడకేఁగి - యిమ్ము మీకిచ్చు
చని వేఁడుఁ డొకయింత - సయిరించి నన్నుఁ
గనుఁగొని తరవాతఁ - గదలుఁడు మీర
విదియె మందాకిని - యియ్యేటి యోరఁ
గదలి యమ్మునిఁగన్న - గాంతురు శుభము !380
ఇప్పుడే చనియెద - నేనని యతఁడు
కుప్పసంబూడిన - కొదమ త్రాచనఁగ
కెరలెడు హోమాగ్ని - కీలల మేను
దరికొల్చి యంగంబు - దహనునకిచ్చి
యతఁడిచ్చు నొక కొమ - రాకారమంది
జతఁగూడు పావక - జ్వాలలు వెడలి
యనఘ పుణ్యులు నాహి - తాగ్నులు దివ్య
మునులును దేవతా - ముఖ్యులు నుండు
లోకంబులెల్ల నా - లోకించి మించి
యాకడ బ్రహ్మలో - కావాప్తి నతఁడు390
చతురాననునకు నం -జలిఁజేసి నిలిచి
యతఁడు సేమము వేడ - నరలేక పల్కి
యాలోకమున నిశ్చ - లానంద సౌఖ్య
లోలుఁడౌ మౌని నా - లోకించి మెచ్చి
యున్నచో నయ్యాశ్ర - మోపాంత వనుల
—: దండకారణ్యములోని మునులకు శ్రీరాముఁ డభయదానమిచ్చుట :—
నున్నట్టి మౌనులు - యోగిపుంగవులు
పలుగురా ల్పొడిచేసి - భక్షించువారు
నిలివెఁడు నీటిలో - నెలకొనువారు
కొరుకుడు ధాన్యముల్ - గొనిమనువారు
కరవలి తమమేఁత - గానున్నవారు400
పుడమి మోవని దేహ - ములనుండు వారు
పడినట్టి పాటుగాఁ - బడియుండు వారు
యెత్తిన చేతుల - నేయుండు వారు
బిత్తరిం జలికోర్చి - పెనుపొందువారు
కలఁగక తలక్రిందు - గానుండు వారు
వెలుఁగు వహ్నులలోన - వెలుఁగొందువారు
పిడికెడు తిండిచేఁ - బేర్కల వారు
పుడిసిటి మాత్ర మం - బులుగ్రోలు వారు
కందమూలముల నాఁ - కలి దీర్చువారు
నందిత జీర్ణ ప - ర్ణము లాను వారు410
గరికెవ్రేళ్లు మెసంగి - క్రమియించువారు
కురకుర చిదిపిరాల్ - గ్రోలెడువారు
నందఱు గుమిగూడి - యాశరభంగు
కందువఁజేరి రా - ఘవుల దీవించి
యొక్కమాటగ వార - లొండొరు మీరి
తొక్కు లాడుచు రాము - తోడ నిట్లనిరి.
“మఘవుఁడు దొర దేవ - మండలికెల్ల
రఘువంశజుల కెల్ల - రాజవు నీవు
లోకుల నెల్ల నే - లుటకునై నీవు
లోకంబునకు నెల్ల - లోకేశుఁ డొకఁడు420
చాలినవారు దు -ర్జనుల నడంప
వాలాయమున మంచి - వారిఁబోషింప
నీకె భారము మాట - నిజము చెల్లింపఁ
జేకొని ధర్మిమూ - ర్జితముఁ గావింపఁ
బితృవాక్యమొనరింపఁ - బృథివిపైఁ గీర్తి
యతిశయింపఁ బ్రతాప - మభివృద్ధి సేయ
గుణములచే నెల్లఁ - గోటికి నెక్క
గణుతింప నీకెయే - కడఁ జెల్లుచుండుఁ
గావున మాకు నొ - క్క ప్రయోజనంబు
గావింప వలయు నౌ - గాములు మాని.430
రాజులు పుడమి నా - ఱవయొక పాలు
భూజనమ్ముల చేతఁ - బుచ్చుక వారి
కన్నట్టి బిడ్డల - కైవడిఁ జాల
మన్నించి ప్రోవ ధ - ర్మంబటు గాన
న్యాయమార్గంబున - నడవక యున్న
నాయవనీపతి - నఘములు వొందు
నడచినఁ గీర్తి య - నంతపుణ్యంబు
కడపట స్వర్గలో - కసుఖంబు నొందు
సత్యమార్గంబున - జగతిఁ బాలించు
నత్యంత ధార్మికుం - డైన భూపతికి440
నతఁడేలు సీమలో - యతివరుల్సేయు
నతిశయ జపతపో-యాగాదికముల
ఫలముల నాలవ - పాలుప్రాపించు
నిలయేలు పుణ్యుల - కెల్ల కర్మములు
రామ! నీయంతటి - రాజు గల్గియును
సామాన్యులైన రా - క్షసులచే బాధ
నేమెల్లఁ బొరయంగ - నెంత లేదనుచు
నేమియు ననకుండ - నెట్లగు నీకు?
ఈచిత్రకూట మ - హీధరప్రాంత
వాచంయములకు ని - ల్వఁగ యాములయ్యె.450
మందాకినీతీర - మౌనిబృందంబు
డెందంబులకు నివ్వ - టిల్లె భయంబు
పంపాతరంగిణీ - ప్రాంతమౌనులకు
మంపిల్లఁ దొడఁగె నె- మ్మదిలోన భీతి
యితరాశ్రమంబుల - యీ ఋషివరుల
వెతలెల్లఁ గతలుగా - వినిపింపవలయు
మముఁజూడు మిప్పుడు - మాశరీరముల
క్రమముఁ జూచినఁ దెల్పఁ - గాఁ బనిలేదు
మాయాపదలు మాన్చి - మహిసుతాప్రాణ
నాయక! అభయదా - నంబుఁ గావింపు!460
శరణుజొచ్చితిమి మీ - చరణాబ్జములకు
నెఱిఁగి ప్రోవుము మాకు - నెవ్వారుదిక్కు
రాక్షసబాధలు - రాకుండ మమ్ము
రక్షింపు కరుణాభి - రామ! శ్రీరామ!"
అనుచు దైన్యంబుతోఁ - బ్రార్థింపుచున్న
వనవాసులకు రఘు - వర్యుఁడిట్లనియె.
చూచితి మిమ్ము మీ - చొప్పెల్ల వింటిఁ
గాచితి నవధులె - క్కడి వింక మీకు
పితృవాక్యమొనరించు - పేరిట మిమ్ముఁ
బ్రతినచే రక్షింపఁ - బనివూనినాఁడ470
నెక్కడి వాపద - లిఁక మీద మీకు
నిక్కడ మిముఁగావ - నే వచ్చినాఁడ
మీరేమిచెప్పిన - మీరక చేసి
ఘోరరాక్షసులఁ బై - కొని త్రుంచువాఁడ
నావనవాసంబు - నకు ఫలంబైన
మీవాక్యములుజేసి - మేలందు వాఁడ
బట్టుగా మిమ్ముఁ జే - పట్టిన వాఁడ
గట్టితి దనుజ శి - క్షా కంకణంబు!
నను వేఁడుకొననేల - నానావిధాస్త్ర
ధనువులెన్నటికిఁక - దాఁచనివాఁడ480
నిందఱి కభయమే - నిచ్చితి మీదు
మందిరంబులను నె - మ్మది నుండుఁడింక!
అప్రతిమంబైన - యస్మత్ప్రతాప
దీప్రానలంబు దై - తేయకాననము
దహియించు నప్పుడం - దఱుఁ జూచినన్ను
బహుమాన మొనరింపఁ - బ్రౌఢి మించెదను"
—: సుతీక్ష్ణాశ్రమ ప్రవేశము :—
అని నమ్మికలొసంగ - నామునీశ్వరులు
తనవెంటరాఁగ సీ - తా సమేతముగ
ననుఁగు సోదరుఁగూడి - యపుడా సుతీక్ష్ణ
మునివరాశ్రమము రా - ముఁడు ప్రవేశించి490
యచట జటావల్క - లాంబరధరుని
సుచరిత్రు నాసుతీ - క్ష్ణునిఁ జేరఁబోయి
యామునికెఱఁగి తా - నంజలిసేసి
“రాముఁడందురు నన్న - రణ్యభూములకు
వచ్చి మిమ్ములఁజూడ - వచ్చితి” మనిన
మెచ్చి యాముని రాజు - మిగుల దీవించి
చెంత నాసీనునిఁ - జేసి రామునకు
నెంతయుఁ గరుణతో - నిట్లని పల్కె.
“అన్న రాఘవ! మిమ్ము - నన్నదమ్ములనుఁ
గన్నుల వడిదీరఁ - గనుఁగొంటి మిపుడు500
సేమమేకద! ఇంద్రు - చే వింటినిపుడు
భూమినంతయుఁగైక - పుత్రునకిచ్చి
చిత్రకూటనగంబు - చేరి యావెనుక
నత్రిని దర్శించి - యననూయఁ గొలిచి
శరభంగమౌని యా - శ్రమము చేరుటలు
హరిహయుచేత నీ - యాగమనంబు
వినియున్నకతన నే - వేరె యొక్కెడకుఁ
జనువాఁడనై నీదు - సందర్శనంబు
వేసి లోకాంతరా - శ్రితులకై వెదుకఁ
బోసమకట్టి యి - ప్పుడు నిల్చినాఁడ510
వింటిని మున్నె మీ - వృత్తాంతమెల్ల
కంటిని మీశుభా - కారముల్ నేఁడు”
అని పల్క రఘువీరుఁ - డా తపోనిధినిఁ
గనుఁగొని సంతోష - కలితుఁడై పలికె.
"పావకనాత్మక! నీ ప్ర - భావమంతయును
భావించి మును శర - భంగుఁడు దెల్ప
వీనుల విందుగా - వినియున్న వాఁడ
యేనెలవుల నుందు - యెఱిఁగింపు" మనిన
నాయనుగ్రహమున - నాతియు నీవు
నీయాశ్రమముల మీ - యిచ్చకు వచ్చు520
క్రేవలనుండుఁడీ - కెలన నానామృ
గావళి యావలి - యధికమై యుండు
నంతమాత్రమె కాని - యన్యంబులైన
చింతలిచ్చట నున్నఁ - జేర వెవ్వరికి
నేమఱక మెలంగుఁ - డిచ్చోట ననిన
నామౌనిఁజూచి యి - ట్లనియె రాఘవుఁడు.
"ఎచ్చరికయకాక - యేము కానలకు
వచ్చి యొంటిఁ జరించు - వారమే యెడల
జతనమ్ము మఱతుమే - సజ్య కోదండ
యుతులమై యస్త్రమ - యూఖముల్ వెలుఁగ530
నుండుదు"మని పల్కు - చుండఁ గైసేసె
పుండరీకాప్తుండ - పుడు పశ్చిమాద్రి
సాయంతనములైన - సంధ్యాది విధులు
పాయక తీర్చి శు - భ ప్రదేశమున
నారేయి వసియించి - యమ్ముని యొసఁగు
చారు సపర్యల - సంతుష్టి నొందె
—: శ్రీరాముఁడు మునులయాశ్రముం జూడఁ బ్రయాణమగుట :—
ఉదయావసరమున - నుత్పల గంధ
సదమల శీతాంబు - సరమునఁగ్రుంకి
నేమముల్టీరిచి - నెలఁతతోఁగూడి
ప్రేమసోదరునితో - శ్రీరామవిభుఁడు 540
మరల సుతీక్షాశ్ర - మముఁ బ్రవేశించి
హరిచింతన మొనర్చు - నయ్యోగిగాంచి
"ఓ మహాత్మక! సుఖ - మొంది యీరేయి
నీమహాశ్రమములో - నిదురపోయితిమి.
మావెంట వచ్చిన - మౌనివరేణ్యు
లావలఁ బోవుద - మనుచున్న వారు
పయనంబులో నెండ - బడకొక్కచోటు
రయమునఁ బోయి జే - రఁగఁదలంచెదము
అనుమతి యిండన్న - నారాము మాట
మనసురంజిల విని - మాౌని యిట్లనియె. 550
“రామ! యీదండకా - రణ్యంబులోన
భూమిజ నీడయుఁ - బోలివర్తింప
విహరింప నీవుఁ బ్ర - వేశించి యచటి
విహగస్వనంబుల - వీనులు చొక్క
సౌమ్యంబులగు మృగ - సంఘముల్ మెలఁగు
రమ్యప్రదేశముల్ - రంజిలచేయు.
మీకు నింపొసగు భూ - మీరుహచ్చాయ
యా కెలంకులచంద - నానిలంబులను
నచటి తమ్మికొలంకు - లందు నెంతయును
రుచివుట్టు నీరంబు - గ్రోల నింపెసఁగు 560
నావనగిరి కంద-రాంతరంబులను
దేవియుఁ దాము మో- దింతురుగాక!
చలువచప్పరముల -జాడ రసాల
విలసితచ్ఛాయల - వేడుక సేయు
నావనంబునెగాని - యన్యంబులైన
తావు మీరుండఁగ-దగదు పొండ"నిన
ఆమౌనివరునకు- నంజలిజేసి
రామలక్ష్మణులు ధ - రాతనూజయును
వలగాఁగ వచ్చియా - వల సాగి తమ్ము
వలఁగొని మునులు న-ల్వంకల రాఁగ 570
నెక్కువెట్టిన విండ్ల - నిరువుర నడిమి
చక్కి జానకి నుంచి - చనుచున్న యపుడు
ఆరమణీమణి - యాత్మఁ జింతించి
శ్రీరామచంద్రు నీ - క్షించి యిట్లనియె.
-:నీత రామునితో రాక్షసుల జంపమానుఁడని మనవిఁ జేయుట:-
"అయ్య! యిమ్మునినాథుఁ - డాడిన మాట
యయ్యెడ హితమని-యేఁగ నేమిటికి?
వసుధఁ గాముకులగు - వారికి నిట్టి
వ్యసనముల్ దగుఁగాక - వలవదు మీకు;
కామమోహితులకుఁ - గల్లలాడుటలు
నేమి హేతువు లేక - యీనులెంచుటలు 580
పరకామినులకుఁ బైఁ - బడి మెలంగుటలు
ధరణిపైఁదగుఁగాక - ధర్మమార్గమున
నతిజితేంద్రియుండవై -యాడినమాట
ప్రతినతోఁ జెల్లించు - పరమకల్యాణ
శాంతమూర్తికి నీకుఁ - జనునయ్య? వీరు
మంతనంబులు విని - మారాడలేక
మొగమాటచేత యీ-మునులకై లేని
పగ నంతరించుక - ప్రతినలు వలుక
చాలింపుడేఁటికి - శపథముల్ జగడ
మేలయ్య? యీమౌను - లెటువోయిరేని 590
కయ్యముల్ వలవ ద - కారణద్వేష
మియ్యడవులలోన - నేఁటికి మనకు?
పుడమి యొక్కరికిచ్చి - పొమ్మన్న నురకె
యడవుల బట్టి యి - ట్టనదలమగుచు
నుండువారము మన - మొక్కరికొఱకు
దండకాటవిలోన - దైత్యుల తోడఁ
బోరాడ నేటికి? భుజముల విండ్లు
మీర లెక్కిడఁ జూచి - మేనిలో నాకుఁ
బ్రాణముల్ నిలువకఁ - బల్లటిల్లెడును
ప్రాణనాయక! డిందు - పడదు చిత్తంబు 600
దండకాటవి యేల - తగవేరెచోట
నుండినఁ దీరక - యున్నదే మనకు?
నాకిది సరివోయి - నదిగాదు మదిని
మీకెట్లు దోఁచెనో - మీచిత్తమింక!
కాదని పోయినఁ - గలహముల్ పుట్టు
నాదండకాటవి - నసురులతోడ
రాజులకును ధను - ర్భాణముల్ కష్ట
రాజివహ్నికి బల - ప్రదములౌఁగాన
మునులమై నచ్చిన - మూలలయందు
నునుప యీవిండ్లును - నుగ్రబాణములు 610
తెచ్చిన దోషమీా - తీరున హాని
వచ్చుటకును హేతు - వాదమైయుండె
మున్నొక్కముని తపం - బున నెంతవారి
నెన్నక లోకంబు - లెల్ల సాధింప
నది యింద్రుఁడెఱిఁగి చా - యలకత్తి నొకటి
బదను తూలికఁ దెగి - పారంగఁ దెచ్చి
నీవశంబున నిది - నిలుపుక యుండు
మీవ వచ్చువఱకు - నేమర వలదు”
అని చేతికిచ్చి తా - నమరావతికిని
జనునంత నమ్ముని - శాతకృపాణిఁ 620
జేతనుఁబట్టుక - చెంతల వనుల
నీతరి మెలఁగుచో - హేతి హేతువున
పోటు చింతలు గెల్చు - బుద్ధులు సాహ
సాటోపమును హింస -లాచరించుటయుఁ
జాలఁగఁగలిగి తా- సందియ జపము
వేళలు దప్పించి - వేలిమి మాని
తప ముజ్జగించి చిం - తకురిత్తబుద్ధి
విపరీతమై మౌని - వృత్తిఁ బోనాడి
నాసించి వేఁడిన- యర్థంబు పూని
చేసుటగాక వి - శేషంబు గలదె?
ఐనఁగాకున్న నే - నాడినమాట
పూని నిల్వకరిత్త - పోదెందునైన 680
నటమీాఁద ద్విజులతో - నాడిన మాట
యెటులైనఁ జెల్లింప - కేల మానుదును?
తననైన నీసుమి - త్రాపుత్రునైన
నినునైన వర్జింతు - నిలుపుదు మాట
మించి పల్కిన మాట - మేలాయె ననుచు
నెంచక నిటులాడ - నెట్లగు నీకు
నాకు మేలేంచి క - న్న తెఱంగు హితము
వాకొంటిగాన భా - వమునఁ దాళితిని
కాచితి నీతప్పు - కలవాణి తలఁచి
చూచిన నన్ను ని - చ్చోనిట్లు బలుక 690
కొఱఁతగాదిది నీదు - కులశీలధర్మ
గరిమంబులకు నలం -కారంబుగాని!”
- పంచాప్సరస సరోవర వృత్తాంతము :--
అని పల్కి చేవిల్లు - నమ్ములుఁ దాల్చి
వెనుక సీతయు సీత - వెనుక లక్ష్మణుఁడు
గదిసిరా భీకర - గహన మార్గమున
నదులును గిరులును - నలినాకరములు
పొదలును గారెను - పోతులు పులులు
మదపుటేనుఁగులు జి - హ్మగములు గౌరు
చూచుచు గడచిరా - సూర్యబింబంబు
గోచరంబై క్రుంకి - కొండఁ జేరుటయు 700
నావేళ నొక యోజ - నాయతంబైన
వ్యావల్గ దండజ -వ్రాత తీరంబు
స్వాదు ప్రసన్నతా - స్వాద్యనీరంబు
రోదసివ్యాప్తమ- రుత్కిశోరంబు
చారుమరాళిగా - శతవిహారంబు
వారిజ మధు పూర్ణ - వారిపూరంబు
చారణయుత దివ్య - చంద్రాననప్ర
చారంబునైన కా - సారంబుఁజూచి,
ఆచాయనొక మ్రోఁత - యది యిట్టిదనుచు
గోచరింపక దిశల్ - ఘార్ణిల్లి మొరయ. 710
నలుదిక్కులనుఁజూచి - నలినాప్తకులుఁడు
దెలియనేరక చెంతఁ - దిరుగుచు నున్న
ధర్మభృతుండను - తాపసనాథుఁ
బేర్మితోఁ జేరంగ - బిలిచి యీరవము
యెక్కడజనియించె? - యెవ్వరింగాన
మిక్కడ నన మౌని - యిట్లని పలికె.
“అనఘ! యీకొలను పం - చాప్సరంబండ్రు
మును దీని నిర్మించె - ముని మాందకర్ణి
ఆ మాందకర్ణి యీ - యబ్జాకరమునఁ
దామరగుంపులో - దపము సేయుచునుఁ 720
బదివేలు దేవతా - బ్దములు వసింప
నది చూచి బెగడివా - తాహరుఁడగుచు
నీముని మదిలోన -నెవ్వరి మేలు
గామించి యో యిట్టి - గతి నుగ్రతపము
సేయుచున్నాడని - చిత్తంబులందు
నాయమర ప్రభు - లందఱు తలఁచి
యింద్రుని కెఱిఁగింప -నెంతయు భీతి
చంద్రాస్యలైన య - చ్చరల నేవురిని
దనకొల్వులో నున్న - తరణులలోన
నెనలేని వారిఁగా - నేర్చి తాఁబిలిచి 730
"చూతము నేఁడు! మీ - సొలపులచేత
నాతని తపమెల్ల - నారడిఁ బుచ్చి
రండని పనిచిన - రంభాదు లెల్ల
నుండంగ తముఁబిల్చి - యుర్వీధరారి
పనిచినాఁడని వారు - పయనమై యపుడె
మునియున్న యీసరం - బునఁ బ్రవేశించి
తమ యాటపాటలన్ - దమవిలాసములఁ
దమిరేఁచి మరునియో- దమునఁ ద్రోయుటయుఁ,
గాముని విరియంపఁ - గములకుఁ దగిలి
యాముని గిలిగింత - లటు పుట్టఁజూచి 740
మరలి పోరాకుండ - మాయచే నీటి
తెరఁగట్టి యుంచి తా - తెఱవలఁ బిలిచి
లాలించి యనురూప - లావణ్య మహిమ
యాలంకరణముల - నందంబు వూని
నీటిలో నొక్క మ - ణీమయంబైన
హాటక దివ్య గే - హంబుఁగల్పించి
యైదుగురికి మేడ - లైదు నిర్మించి
యాదిత్య కాంతల - నందుల నునిచి
వారికి వలసిన - వస్తువులెల్ల
స్వారాజ్యమునలేని - సకల భోగములు 750
గలిగించి వారలఁ - గలసి తపంబు
ఫలియించి యన్ని రూ - పములతో మెలఁగి
పంచసాయబాణ - పంచకంబునకుఁ
బంచేంద్రియములు బా - ల్పఱచి యయ్యువతి
పంచకలీలా ప్ర - పంచ సర్వస్వ
వంచిత నియమాది -వర్తనుం డగుచు
నామౌని యున్నవాఁ - డతని సన్నిధిని
రామల మణినూపు - ర ఝళం ఝళముల
నతఁడుఁ గన్గొనఁగ నా - ట్యము వినుపించు
నతివల గీత వా - ద్యముల రావంబు 760
లమ్ముని నటనశా - లాభ్యంతరమున
ధిమ్మనునట్టి మ - ద్దెలల మ్రోఁతయును
కళఁగూడి శ్రవణమం - గళముగాఁగొలను
వెలపల మీకెల్ల - వినవచ్చె నిపుడు! "
అన విని కడు మెచ్చి - యాధర్మభృతుని
వనమున కేఁగి భూ - వర కుమారకులు
నతని చేతను బూజ - లంది యవ్వెనుక
నితరతపోనిధు - లెల్లనర్చింప
నట నిల్చి శరభంగుఁ - డాదియైనట్టి
జటిపురందరుల యా - శ్రమముల లోన 770
నెలయు రెన్నెల్లు మూ - న్నెల్లును నాల్గు
నెలలైదు నెల్లాఱు - నెలలును నేడు
నెల లెనిమిది నెలల్ - నెలలు తొమ్మిదియు
నెలలోక్క పదియుఁగా - నిలుచుచు వచ్చి;
ఎచ్చటెచ్చట నుండ - నెన్నాళ్లు ప్రీతి
నెచ్చునచ్చట నెల్ల - యిచ్చట నుండి
చరియింప విపినవా - సమునాఁటి వఱకు
బరికింప మితిలోనఁ - బదియేండ్లు గడచె.
-:శ్రీరాముఁడు మఱల సుతీక్ష్ణాశ్రమమునకు వచ్చుట :-
తరవాత సీతయుఁ - దమ్ముఁడు గొలువ
మరల సుతీక్ష్ణాశ్ర - మముఁ బ్రవేశించె. 780
నచ్చోటిమును లెల్ల - ననురాగ మెచ్చ
వచ్చి పూజించి ర - వ్వనములోపలను
కొన్నాళ్ల వెనుక ర - ఘుప్రవీరుండు
మున్నువోలె సుతీక్ష్ణ - మునిఁజేర నేఁగి
ప్రణమిల్లె, మునిరాజ - పట్టభద్రుండు
క్షణమాత్రము సమాధి - సంపన్నుఁ డగుచుఁ
గనువిచ్చి చూచుచోఁ - గదిసి రాఘవుఁడు
మునితోడఁ గేలుఁద - మ్ములు మోడ్చిపలికె
"అనఘ యగస్త్య మ - హామాౌని యిచటి
వనములలోనున్న- వాఁడని పలుక 790
వినియుందు మిది మహా - విపినంబుగానఁ
గనిపించ డీజన - కతనూజఁగూడి
కొలువ వేడుకయయ్యె - కుంభసంభవుని
నెలవానతిచ్చి మ - న్నింపుఁడు నన్ను"
అనిపల్కు రఘుపతి - యాననాబ్జంబుఁ
గని సుతీక్ష్ణముని శి - ఖామణి పలికె
“జానకీరమణ!ప్ర - శ్నముచేసి నీవు
పూని యగస్త్యుని - బొడగందు ననుచు
వడిగితి నేనమ్మ -హా మౌనిచంద్రు
కడకేఁగు మని తెల్పఁ - గాఁబూని యుంటి 800
నిరువురి తలఁవులు -నేకమై యిపుడు
సరివచ్చె నామాన - సము ప్రీతి నొందె
చక్కగా నిచటి యా-శ్రమము దక్షిణపు
దిక్కున రెన్నాళ్ల - తెరువు పైనమునఁ
జనుచోట మీరగ - స్త్యభ్రాత యనెడి
మునివరు సేవించి - మువ్వురునచట
నతని యాశ్రమములో - నాప్రొద్దు నిలిచి
హితమతితో నమ్ము - నీశ్వరుండనుప
నావని చెంగట నామటి మేరఁ
బోవుచో నుత్తుంగ - పూగపున్నాగ 810
నారంగజంబీర - నారికేళామ్ర
పారిజాతాశోక -పనస భూరుహము
కైరవనీరజః - కల్హారచక్ర
సారస భాసుర - జలజాకరంబు
వాజిపేయాది స-వనకర్మనిరత
యాజక స్వాహాస్వ - ధాభిరావంబు
జటివరకాషాయ - శాటికాకలిత
కుటశిఖాశాఖాగ్ర - కోటిభాసురము
నానాగమాభ్యస - నక్షమాపార
మౌనికుమార ర - మ్యప్రదేశంబు 820
నైనయగస్త్యాశ్ర-మా వాసమునకు
నానందమునఁ బోయి - యమ్మునిఁ జూచి
రండుపొండ" నవుఁడు - రామలక్ష్మణులు
వెండియుఁ బ్రణమిల్లి - వీడుకోలంది
తనకు నమ్ముని - దెల్పు దారినే వచ్చి
యనుజునితో రాముఁ - డప్పుడిట్లనియె.
-:శ్రీరాముఁ డగస్త్యభ్రాత యాశ్రమమునకు వచ్చుట :-
“ ఇదె యగస్త్యభ్రాత - యిరవుగాఁబోయి
నదె పిప్పలాక్ష్మారు - హచయంబు దోఁచె
శైత్య మాంద్యముల వా - సనలతోఁ గూడి
యత్యంత మృదు పవ - నాంకురం బెసఁగె 830
వినవచ్చుచున్నవి - వేదఘోషములు
కనుపట్టె శుకశారి - విహంగములు
వలనొప్పె దర్భలు - వైడూర్యరుచులు
తొలకరించెను హోమ - ధూమముల్ చదల
స్నానముల్ దీర్చి పూ - జావిధానముల
మానులిచ్చు ప్రసూన - మాలికల్ బెరసె!
అందుచే నమ్మౌని - యాశ్రమంబగుట
సందియం బేల యి - చ్చటనున్నవాఁడు
మున్నగస్త్యుఁడు లోక - ములనెల్లఁబ్రోవ
నెన్ని వాతాపి ని - య్యెడ వధియించి 840
దాన మృత్యువుఁ గెల్చి - తపసులఁగాచెఁ
గాన నమ్మాౌనీంద్రు - కథనమచ్చెరువు!
-:అగస్త్యముని వాతాపియిల్వలులను జంపినకథ:-
వాతాపియనఁగ ని-ల్వలుఁడన వెలయు
దైతేయు లిరువురు - తమపితరులకు
తద్దినమ్ములు వెట్టు - తలఁపుచే నిట్టి
బుద్ది నేర్చుకత్రోవఁ - బోవుచున్నట్టి
తపసుల నియమించుఁ - దావిప్రుఁడగుచు
నపుడిల్వలుండు మ - హామునీశ్వరుల
చాలనర్చించి భో- జనమిడు వేళ
పోలుగ వాతాపి - పొట్టేటిఁ జేసి 850
దాని వధించి త - త్పలలంబు వెట్టి
వానిఁ బేర్కొని “రమ్ము - వాతాపి" యనిన
భుజియించు విప్రుల - పొట్టలు జించి
నిజవర గర్వంబు - నివ్వటిల్లంగ
వెలువడి నిలుచుండి- విప్రులనెల్లఁ
దలపట్టి మ్రింగు పి - తాళ్ళతోఁ గూర్చి
బలవంతుఁడై క్రొవ్వి - పలలభోజనుఁడు
కలశజుఁడాత్రోవఁ - గా నొక్కనాఁడు
సురలెల్ల నీరాక్ష - సులు పసివట్టు
ధరణీసుతులు కోట్ల - తరములు గలరు! 860
అట్టి పాపాత్ముల - నడఁచి రమ్మనుచు
గట్టిగా తగుబందు - కట్టిన వచ్చి
గహనమార్గమున రాఁ - గని యిల్వలుండు
బహుమానమునఁ బిల్చి- బ్రాహ్మణార్థంబు
నేమించి యప్పటి - కెప్పటివంట
లామతించిన యగ- స్త్యమునీశ్వరుండు
భుజియించి వార్చున - ప్పుడు సహోదరుని
వృజినాత్మకుఁడు బిల్వ - విని కలశజుఁడు
వాఁడు జీర్ణించి వై - వస్వతు పురికి
నేఁడేఁగె! వచ్చునే - నీవు పిల్చినను? 870
"ఓరి! జగద్రోహి!- యోడక మునుల
నీరీతిఁ జంపితి - రిన్నాళ్లు మీరు!
అట్టి పాపములెల్ల - ననుభవింపంగఁ
గట్టడి చేసితిఁ - గడతేర్తు నిన్ను
ననవిని వాడాగ్ర - హంబుతోఁ గదియ
మునిశిఖామణి బొమల్ - ముడిగొనుచుండ
గోపించినన్ గుప్పఁ - గూరగాఁ బడియె
నాపాపమతి భస్మ- మై నిమేషమున
నామాడ్కి నిల్వలు - నడచిన యట్టి
యమహాత్ముని భ్రాత - యాశ్రమంబునకు 880
వచ్చితి ” మనునంత - వనజబాంధవుఁడు
వచ్చెను బశ్చిమ - వనధి చెంగటికి
నావేళ వారగ - స్త్యభ్రాతఁ జేరి
సేవించి యమ్మౌని - చేఁ బూజలంది
యతని యాశ్రమమున - నారేయి యెల్ల
క్షితిసుతతో నిద్ర - చేసి వేకువను
నిత్యకృత్యంబు ల - న్నియుఁ దీర్చి పరమ
సత్యసంధుండు - దాశరథి యావేళ
నాయగస్త్యభ్రాత - యనుమతి నతఁడు
చేయి చూపినత్రోవ - సీత దోడ్కొనుచుఁ 890
-:అగస్త్యాశ్రమ వర్ణనము:-
జనిచని భల్లకా-సరరిక్షగవయ
వనచరకరకిరి - వ్యాఘ్రపంచాస్య
జంబుకహరిణ మా - ర్జాల గండకక
దంబభాసుర వనాం - తరములు గడచి
ముందరఁ జూతక్ర - ముకనారికేళ
చందనపనసర - సాల జంబీర
వాసంతి కాకుంద - వర ఫలప్రసవ
వాసనావాసిత- వాతపోతముల
జాతివైరంబు లె- చ్చట లేని జంతు
జాతంబులను బర్ణ - శాలల మీదఁ 900
నారవైచిన యట్టి-యరవిరి నార
చీరల హోమముల్ - సేయంగ నెగయు
పొగలను మౌనీంద్ర - పుత్రులు జదువు
నిగమంబులును స్వాదు - నీరంబు లొప్పు
కమాలాకరంబులఁ - గల తపోవనముఁ
గమలాప్తకులుఁడు ముం - గలఁ జూచి పలికె.
-:అగస్త్యమహర్షి మహిమాభివర్ణనము :-
కనుఁగొను మెదుట ల - క్ష్మణ! చూడఁజూడఁ
గనుపండువయ్యె! జ - గద్ధితంబైన
తన చరిత్రమ్ము చేఁ - దనరు నగస్త్య
మునివరాశ్రమము సన్ము - ని సేవితంబు! 910
ఈ యగస్త్యుఁడె సుమీ - యెల్ల దానవుల
మాయించి సురలకు - మనికిఁ గల్పించెె
నీతడెఁ కాడె జ - యించి మృత్యువును
వాతపి నడచిఁ యి - ల్వలుఁ బొడిచేసె
నీమునిగద! భాను - డిట్టట్టు మెలఁగ
రామిగా వింధ్యప - ర్వతము మిన్నంద
మహిఁగ్రుంగఁద్రొక్కి హి- మనగంబుఁదాను
వహియించుకొని జనా- వళి నుద్ధరించె
నీశాంతమూర్తియే - హిమవన్నగమున
కీశుఁడు పెండ్లికి - నేగిన యపుడు 920
సురలెల్ల నుత్తర - క్షోణికి నేఁగ
ధరణి మొగ్గతిలంగ - దక్షిణంబునకు
నందఱికిని దుల - యై తాను వచ్చి
పొందుపాటుగ నిల్పె - పుడమి యంతయును
నీపుణ్య నిధి వార్ధు- లేడునుఁబట్టి
యాపోశనంబుగా - నరచేత నుంచె!
నితఁడు లోపాముద్ర- యిల్లాలు గాఁగ
నతిశయ పరమక - ల్యాణంబు లందె!
నీ యాశ్రమంబులో - నింద్రాదిసురలు
సేయు పూజలొసంగు - చింతితార్థములు 930
నిమ్మౌని యనుమతి- నెట్టివారైన
తమ్మినెచ్చలిమేని - ద్వారంబు దూరి
లాలించు దేవతా - లలనలఁగూడి
యే లోకమునకైన - నేఁగఁ జాలుదురు!
ఇచ్చోట నుండిన - నిఁకమన వెతలు
ముచ్చటల్ దీరి యి - మ్మునిరాజుఁ గొలిచి
మన పట్టణమున - నెమ్మది నున్నయట్టి
జనకజకుఁ బ్రియంబు - సమకూర్చవచ్చు
ముందరనేఁగి యి - మ్మునితోడ మనల
చందంబు జానకి- సహితంబుగాఁగ 940
యేను వచ్చుటయు నీ - వెఱిఁగింపు" మనుచు
నానతి యొసఁగిన - నటుల లక్మణుఁడు
నాకుంభజుని శిష్యు- నచ్చోటఁజూచి
వాకొన్న సౌమిత్రి - వచనంగతికి
-:శ్రీరామాగస్త్యుల సమావేశము:-
ఆచార్యసన్నిధి - కరిగియోదేవ!
“రాచవారిద్దఱు - రమణి యొక్కతెయు
భానువంశజులఁట! - పరికింపఁదమకు
జానకిరామల - క్ష్మణులఁట! పేళ్లు
దశరథసుతులఁట! - తమతండ్రి పనుపఁ
గృశియించి వనులఁ జ - రింపుచు మిమ్ము. 950
సేవింపఁదమరు వ - చ్చిరఁట! లక్ష్మణుఁడు
తావచ్చినాఁడు సీ - తారఘువరులు
కడనున్నవారఁట! - క్రమ్మఱ యేమి
నుడువుదు? నానతిం - డు మహాత్మ!" యనినఁ
“గ్రక్కునం బిలువుమె - క్కడ నున్నవాఁడు?
నిక్కము నేరాము -నిం గనవేడి
యెదురులు చూచితి - మిన్నాళ్లు నట్టి
సదయావలోకుఁ గౌ- సల్యాకుమారు
దశరథతనయు సీ - తామనోహరుని
శశివదనుని రామ - చంద్రుఁ దో తెమ్ము 960
పొ"మ్మన్న శిష్యుఁ డ - ప్పుడువచ్చి కరత
లమ్ములు మొగిచి యా - లక్ష్మణుఁ జూచి;
“ఎక్కడున్నాఁడొ - యిపుడు మీయన్న
యక్కడి కేఁగి మా - యాచార్యునాజ్ఞ
దోడి తెత్తము రమ్ము - తోడనే రాముఁ
జూడవేడుక నగ - స్త్యుఁడు నన్నుఁ బనిచె"
అన లక్ష్మణుఁడు దాను - నాశ్రమద్వార
మున కప్పుడేఁగి రా - ముని కవ్విధంబు
వివరించి పిలిచిన - వెలఁదియుఁ దాను
రవివంశమణి తదా - శ్రమములోఁ జొచ్చి 970
యమ్మేర తపసియి - ల్లాండ్ర కెంగేలుఁ
దమ్ములు బ్రాలేయ - తండుల చయము
గ్రసియించుటకు వేళ - గాంచియిట్టట్టు
నసియాడు పోషిత - హరిణడింభములుఁ
గనుఁగొనుచును జన - కతనూజు తోడఁ
గనుసన్న నేయుచుఁ - గదియదా నెదురు
హాటకగర్భుఁడౌ - నలబ్రహ్మయుండు
చోటును పావకు - చోటును శౌరి
చోటును శతమఖు - చోటును భాను
చోటును సోముని - చోటును శివుని 980
చోటును విప్రుల - చోటు కుబేరు
చోటును వాయువు - చోటు ననంతు
చోటును గాయత్రి - చోటును యముని
చోటును వసువుల - చోటును వరుణు
చోటును స్కంధుని - చోటును ధర్ము
చోటునుఁ గనుచు వ - చ్చు ననంతరమున
నెదురుగా శిష్యుల - నేకులు గొల్వ
నుదయార్కబింబస - ముజ్జ్వలుం డగుచు
వచ్చు నగస్త్యు బా - వనుఁ బుణ్యశీలు
నచ్చోట జూచి సీ - తాంగనా విభుఁడు 990
సాగిలి మ్రొక్కి యం - జలి చేసి భక్తి
యోగంబుచే నేమి - యునుఁబల్కలేక
యూరక నిలుచున్న - నురుతపోధనుఁడు
గారవంబొప్ప రా - ఘవులఁ దీవించి
యట నిల్వుమని తన - యావాసమునకు
జటులు వెంబడిరాఁగఁ - జని వీతిహోత్రు
నారాధనముఁ చేసి- యతిథికోటులను
బారల మౌనుల - పంక్తు లమర్చి
యందఱ వేర్వేర - నర్ఘ్యపాద్యములఁ
జందనాక్షతములఁ - జాల నర్చించి 1000
భోజనాదులను తృ- ప్తులఁ చేసి మౌని
రాజుక్రమ్మఱ వచ్చి - రామునిఁ జూచి
తాదండ నొక కుశా-స్తరణంబు నందు
నాదరంబున నుంచి - యప్పుడిట్లనియె.
"నరనాథతనయ! వా - నప్రస్థులైన
పరమయోగీంద్రులు - పావక క్రియలఁ
దీరిచి చేరిన - తెరవరులకును
నీరమన్నమునిచ్చి - నెగులు వారింపఁ
దలఁపని యధముండు - దబ్బరసాక్షి
వలికిన నీచుఁడు -వడు నారకముల 1010
తాఁబడి తనమేను - తానె భక్షించి
లోఁబడి వాఁడధో - లోకమ్ము నొందు"
నని ధర్మశాస్త్రంబు - లందుఁ దెల్పుటను
నినుఁ బూజ సేయుట- నీతంబు మాకు!
కందమూలఫలాది - కములు మాచేత
నంది తృప్తుఁడవుగ - మ్మ"ని యర్చలిచ్చి
--: అగస్త్యమహర్షి శ్రీరామునకు వైష్ణవ కోదండ తూణీరముల నిచ్చుట:-
"శ్రీరామ! తొల్లిరా - జీవలోచనుఁడు
భూరికాంచనమయం - బును సునాభంబు
నతివజ్రసారంబు - హతదానవేంద్ర
శతమును దేవతా - సౌఖ్యకారణము 1020
ననితరసాధ్యంబు - నాహవవిజయ
జనకంబు భానుతే - జస్సమన్వితము
నక్షయదివ్యశ - స్త్రాస్త్రతూణీర
రక్షతంబజహర - శ్లాఘనీయంబు
నగునట్టి వైష్ణవం - బైన కోదండ
మగవైరి వశముగా- నపుడుంచెఁ గాన
నతఁడవి తెచ్చి నా - యాశ్రమసీమ
జతనంబుగా నుంచి - చనియె గావునను
నేమది పూజించి - యెదురులు చూడ
రామ! వచ్చితివ కా - రణ బాంధవుఁడవు! 1030
హరిసందకమున కీ - యసి జోడు కాదె!
హరిహయుం డుదయించె- నావింటితోడ
యీవిల్లు నీయమ్ము - లీనిషంగంబు
లీవాలు నిచ్చెద - నీవు గైకొనుము!"
అనిపైఁడి యొరతోడి - యడిదంబు పంప
దొసయును విల్లుఁదో - డ్తోడ నొసంగి
శ్రీరామ! యలసి వ - చ్చినవారు మీర
లారామశీత ర - మ్యప్రదేశముల
వసియింపుఁసీత - వసివాళ్లు వాడి
కసుగంది మేనితో - గాసిల్లె మిగుల 1040
నెన్నడునలమట - లెఱుఁగదీసాధ్వి
యిన్నిపాటుల కోర్చె -నేమనవచ్చు!
వనులకుఁ బతియె - దైవంబుగా నెంచి
నినుఁగూడి వచ్చెనీ - నిత్యకల్యాణి!
మగని మేలునకోర్చి - మనసిచ్చి నడచు
మగువలెకాక భూ - మండలియొండు
నిటుగంటి సతిగల - దే! వధూమణులు
కుటిలమానసులు పే - ర్కొన నెల్లవారు!
చపలాలతలవంటి - చంచలత్వంబు
నెపుడు నమ్ములతోడ - నెనయు వాఁడియును 1050
గరుడవాయువులకుఁ - గలుగు వేగంబు
తరుణులకెందుఁ జి - త్తములందుఁ గలదు!
మాన్యయీసీత నీ - మానిని గాన
ధన్యవర్తన నరుం - ధతియునుఁ బోలి
యుత్తమగుణముల - యునికి పట్టైన
యిత్తలోదరిఁ గూడి - యిచట నీరాత్రి
నావనం బెల్ల ధ - న్యంబును లోక
పావనంబును గాఁగఁ - బవళింపుఁడనిన
నమ్ముని యనుమతి - నచట మువ్వురును
నెమ్మితో శయనించి - నిదురించి లేచి 1060
తెలవాఱఁ దగువిధుల్ - తీర్చి మువ్వురును
కలశ సంభవుని జెం - గటఁ ేరవచ్చి
కరములు మొగుప రా - ఘవు మోముఁ జూచి
కరుణదైవార న - గస్త్యుఁడిట్లనియె.
-:అగస్త్యుఁడు గోదావరి తీరస్థపంచవటిని గుఱించి చెప్పుట:-
“శ్రీరామ! యీ రేయి - సీతతో నిచటి
యారామమున నిద్ర - నంది సౌఖ్యమున
దినకృత్యములు దీర్చి - తే నీకు నేఁడు
పనియెద్ది? వివరించి - పలుకుమా" యనిన
“మునినాథ! యెచ్చోట - మువ్వుర మేము
వనవాస మీడేర్ప - వసియింప వలయు 1070
తగిన చోటిది యని - తలఁచి మాతోడ
విగణింపు" మనిని న - వ్విమల మానసుఁడు
నొకకొంతసేపు తా - నూరకె తలఁచి
సకలజ్ఞుఁ డగు నగ - స్త్య మునీంద్రుఁడనియె
" జననాథ! రెండు - యోజనముల మేర
వనము చెల్వగు పంచ - వటియను పేర
నొక్కరమ్యస్థలం - బున్నది మీకు
నక్కడఁ గలుగు ని - ష్టార్థంబు లెల్ల
మేలెంచి దశరథు - మీఁది నెయ్యంబుఁ
బాలించి యచటికిఁ - బనిచెద మిమ్ము. 1080
మాయభీష్టము నీవు - మాయాశ్రమమున
జాయతో వసియింప - జాల సమ్మతము;
అటులయ్యు మీహృద - యముల వర్తనము
నిటమీఁది కార్యంబు - నేయోగదృష్టి
భావించి చూచిమీ - పలికిన యట్లు
యావనంబనకుఁ బొం - డని పంపవలసె
పంచవటీవనీ - బాగంబు లనుస
రించి యాగోదావ - రీ సమీపముల
వలయు వన్యములైన - వస్తువుల్గొనుచు
మెలఁగుఁ డిచ్చటికి స - మీప మచ్చోటు 1090
యేకాంతమది మీకు - ఋషులనందఱిని
చేకొని వారి ర - క్షింపుఁ డచ్చోట
గనుఁగొంటిరే మధూ- కవనంబు పొన్న
పొన నల్లనైనతోఁ - పు రఘుప్రవీర!
యా తోఁపునకు నుత్త - రాశగాఁ బోవఁ
బ్రీతిఁ బుట్టించు మ -ఱ్ఱియొకండు చెంత
నామఱ్ఱి పడమటి - యండనే యొక్క
భూమిధరంబు చూ - పుల విందుసేయుఁ
బడమర యచటి కా - పావనాశ్రమము
పొడ గానవచ్చు గుం - పుగ నైదుచెట్లు" 1090
అనిత్రోవ వివరించి - యపుడగస్త్యుండు
పనిచిన నమ్మౌని - పదముల వ్రాలి
యయ్యాశ్రమముఁగాచు - నజహరాదులకుఁ
జెయ్యెత్తి మ్రొక్కి ద - క్షిణముగా వెడలి
ధనుపుఁ దూపులు నంది - తమ్ముఁడుసతియు
వెనుక రా నతిఘోర - విపిన మార్గమునఁ
—:జటాయు సందర్శనము:—
బంచవటికిఁ బోవు - పయనంబు నందు
నంచితశాఖావృ - తాకాశ యగుచు
నూడలతో నొప్పు - నొక పెనుమఱ్ఱి
జాడగా వచ్చి యా - చాయమువ్వురును 1110
వసియింపుచో నొక్క - వలమైన కొమ్మ
నెసఁగుజటాయువు - నీక్షించి యలరి
"ఎవ్వఁడవీవు నీ - యిరవెద్ది? తండ్రి
యెవ్వఁడు నీకుఁ బే - రెయ్యది" యనిన
“నీతండ్రి చెలికాఁడ - నే జటాయువును
సీతతో నీవు వ - చ్చినఁ జూడగంటి
మనఁగంటి నేనన్న" - మాటకా రాముఁ
డనఘమానసుని జ - టాయువుఁ జూచి
యేరీతి మాతండ్రి - కీవు నెయ్యుఁడవు
మారాజునకు నీకు - మచ్చిక యైన 1120
కతమెట్టు” లనిపల్క - ఖగవతంసంబు
క్షితిసుతారమణు నీ - క్షించి యిట్లనియె.
-: జటాయువు వంశాను కథనము :-
"సదయాత్మ! బ్రహ్మ వం - శజులము మేము
తుది మొదల్ దెలియ నీ - తో వివరింతు
కృతముఁగర్దముఁడు వి - కృతుఁడు శేషుండు
నతని డాసిన సంశ్ర - యాఖ్యుండు వీర్య
వంతుండు బహుపుత్ర - వరుఁడు స్థాణుండు
నంత మరీచియు - నత్రియుఁ గ్రతువు
నావెనుకఁ బులస్త్యుఁ - డాంగిరసుండు
నావరసఁ బ్రచేత - సాఖ్య పులహులు 1070
దొరసి దక్షవివస్వ - తు లరిష్ట నేమి
బెరసిరి ధాతకు - ప్రియపుత్రులగుచు
నృపశేఖర! యరిష్ట - నేమియన్ వాఁడె
యపుడు కాశ్యప భూపుఁ - డనవన్నె కెక్కె
నజుని మానసపుత్రు - లగు వీరియందు
సుజనవందితుఁడు ద - క్షుఁడు తనూజులను
కోరి యర్వదిలెక్క - కునుగాంచె నట్టి
వారిలో నెనమండ్రు - వనితల నిచ్చె
ననఘు కాశ్యపునకు - నదితియు, దితియు,
దనువు, కాళికయునుఁ - దామ్రయుఁ, గ్రోధ 1140
వశ, మను, వనలయన్ - వారల నట్టి
శశిబింబముఖులఁ గా -శ్యపుఁడు వరించి
యారమణుల జూచి - యలి వేణులార!
కూరిమి తనయులఁ - గోరుండు మీర
లిచ్చెదనని” పల్క - నింతులు గొందక
ఱిచ్చగించిరి కొంద - ఱేమియు ననక
నురకుండి రదితికి - నుదయించి రప్పు
డరయముప్పది మువ్వు - రాదిత్య వరులు
నెనమండ్రు వసువులు - నిసులు పన్నిద్ద
రును బదునొక్కండ్రు - రుద్రులశ్వులును1150
నిరువురుగా వార - లిద్ధ తేజముల
ధరణిపై వెలసి, రా - తరవాత దితికి
నసురులుజన్మించి - రానిశాచరులు
వసుధఁ బాలించి ర - వార్య శౌర్యమున
దనువను నతివ గం - ధర్వులం గనియె
గనియెను గాళిక - కాలకాసురునిఁ
నరకాసురునిఁ దామ్ర- నందనీమణులఁ
బొరసె పక్షులజాలి - పొదల నేవురను
నవిక్రౌంచి యన భాసి - యనశ్యేని యనఁగ
రవివంశ! శుకిధృత - రాష్ట్రియు ననఁగ 1160
నందులో గూబల - నలక్రాౌంచి కాంచె
నందను బాతుల - నాభాసిభామ
శ్యేనిగృధ్రములఁ గాం - చెను ధృతరాష్ట్రి
కానుపు హంస చ - క్రద్వయంబయ్యె
శుకిగాంచె నతను - నా సుందరివినత
నొకతెఁ గాంచెను మరి - యును గ్రోధవశకు
గలిగిరి పదువురు - కన్యలు మృగియు
నల మృగమందయు - హరి భద్రమదయు
మాతంగి శార్దూలి - మరి కమ్రరోమ
శ్వేతయు సురసయు - క్షితి సురభియును 1170
నను పదువురియందు - నల మృగజాతిఁ
గనియెను మృగి రిక్ష - గణచమరముల
మృగమంద గనియె నె - మ్మిని భద్రమంద
నెగడు నిరావతి - ని తనూజఁ గనియె
నాయిరావతి గాంచె - నైరావతంబు
నాయెడ హరిగాంచె - హరులు గోఁతులను;
శార్దూలగవయాది - సంతతినెల్ల
శార్దూలి గనియెను - సామజంబులను
మాతంగి గనియెను - మరి శ్వేతగాంచె
ఖ్యాతిగా నష్టది - గ్గజ వరంబులను 1180
సురభి రోహిణియను - సుదతి గంధర్వి
నిరువురఁగనియె రో-హిణికి నావులును
గంధర్వి యనునట్టి - కన్యకు సుతులు
గంధర్వులను వారుఁ - గలిగిరి వరున
సురసకు నాగరా - జులు సుతులై రి
గరిమతోఁ గద్రువు - గాంచెఁ బన్నగుల
మనువను భామ బ్ర - హ్మక్షత్రవైశ్య
జనశూద్రులను గాంచె - జాతు లేర్పడఁగ
ననలకు గలిగె మ - హా భూరుహములు
వినత యాశుకియును - వెలఁదికిఁ బౌత్రి1190
సురసకుఁ గద్రువు - చూడంగ చెలియ
లరయఁ గద్రువుగాంచె - నలశేషు మొదట
నతఁడు సహస్రఫ - ణావళిచేత
క్షితిఁ దాల్చుఁ దాలిమి - చే నెల్లనాఁడు
వినత కనూరుండు - విహగవల్లభుఁడు
జనియించి రందు జ్యే - ష్ణకుమారుఁడైన
యట్టి యనూరిని - యందు సంపాతి
పుట్టె నాయనతోడఁ - బుట్టిన వాఁడ
నన్ను జటాయువ - నంగ వంశమున
నెన్నికఁ గనువాఁడ - నేమైన నన్ను1200
నాసించి యడిగిన - యర్థంబుఁ దెచ్చి
యీ సమర్ధుఁడ జుమ్ము - నీకు నిచ్చుటకు
నడవిలో నాసహా - యత మీకు వలయు
నిడుమలపాలు గా - రేను తోడైన
నిచటి దైత్యుల బాధ - యెంతని నీకు
వచియింతు! మీరొంటి - వచ్చిన వార
లదిగాక సీతాస - హాయత మీకు
దుదిలేని యనుదిన -దుఖకారణముఁ
గావున నీవు ల -క్ష్మణుఁడు వేరొక్క
తావుల కేఁగిన - ధరణిజ నేను 1210
కాచి యుండఁగ శక్తిఁ - గలిగినవాఁడ
నాచేతఁ దీరు నెం -తటికార్యమైన
వత్తునే!" యన రఘు - వరు డట్టిమాట
చిత్తంబులోన మె - చ్చి ప్రసన్నుఁడగుచు
నాలింగనము జేసి - యర్చలొసంగి
చాలంగ మధురభా - షణములు పల్కి.
-:జటాయువుతో సహా శ్రీరామసీతాలక్ష్మణుల
పంచవటీప్రవేశము:-
తరణితోఁ దనవెంట - తమ్ముఁడు పక్షి
వరుఁడును రాఁ బంచ - వటి కేఁగు నపుడు
దానవశలభముల్ - తనదివ్యవైశి
ఖానలజ్వాలల - నణఁగుఁగా కనుచు 1220
మదిఁ దలఁపుచుఁ బోవు - మార్గంబునందు
నది చూడుమని రాముఁ - డనుజుతో బలికె
“సౌమిత్రి! తృణకాష్ఠ - జలసమృద్ధంబు
భూమికినెల్ల వి - భూషణం బైన
యీ పంచవటిఁ జూడు - మిది యగస్త్యుండు
చూపి చెప్పినయట్టి - చోటు గావునను
నందైన మనమొక - యిలుగట్టియుండ
నందుకుఁదగిన చో - టది విదారించి
రమ్మని" పల్కిన - రాముని మాట
సమ్మతంబగుట ల - క్ష్మణుఁ డిట్టులనియె.1230
"దేవ! మీచిత్త మే - తీరున నుండె
నావిధి వెులఁగ స - మర్థుండుగాక
తన కేమి దెలియునీ - తరిఁ బర్ణశాల
మొనరింపఁ దగునని - యూహించి పలుక
నేవేళ నెయ్యెడ - నేమి కార్యంబు
కావలసినఁ బిల్చి - కట్టడచేసి
పనిగొనఁ దగుఁగాక - - బంటనై యున్న
ననువేఁడనేల మీ - నగరి కార్యములు"
అనవిని "లక్ష్మణ! - హరిణాది వివిధ
వనజంతువులకు ని - వాస మిచ్చోటు1240
యిందుల సెలయేరు - లిసుకదిన్నెలును
గందరంబులు సార - కాసారములును
గదలిగామాకంద - ఖర్జూరనింబ
బదరిరసాల రం - భా బిల్వపనస
కేతకి కుందంకం - కేళీలవంగ
జాతిలతాసమం - జసమంజరులును
నేడాకనంటుల - నెండిన పొరల
వీడిరాసులుగాఁగ - విపినమార్గములఁ
బలకలై తొరఁగిన - పచ్చకప్పురపు
తెలిదుమారము రేఁచు -తెమ్మెరల్ గనుము!1250
గుడిసెలగతి నొప్పు - గొజ్జంగ పొదల
వడియుఁ బన్నీటి కా -ల్వల కెలంకులను
చలువలీనెడుఱాతి - చలువల మృగము
దొలఁగి పోలేక ని -ద్ధుర బోవువేళ
మడువు కట్టిన నాభి - మదరక్తధార
పుడిసిలించుక చెంచు - ప్రోయాండ్లు దెచ్చి
మునియాగశాలల - ముంగిలు లలికి
చనుట జూచితివె ల -క్ష్మణ ! పంచవటిని
నల్ల గోదావరి - నళికదంబములు
ఫుల్లాంబుజములపై - పూఁదేనియలను1260
నసియాడి ఘుమ్మని - యంచల మొరయ
బిసములు మెసవక - బెదరు చూపులనుఁ
గలహంస చక్రవా -క ప్రముఖములు
మెలఁగక యున్నవి - మేలిమి తెరల
నీయేటి తేటనీ - రించుకఁ గ్రోలఁ
గాయంబు శ్రేయోని - కాయమై యుండు
జానకి యీనికుం - జముల వసించి
మాను నయోధ్యపై - మమత యుల్లమున
సవరపు మెకము లి-చ్చటి రేవులందు
నవతరించి జలంబు - లాని క్రమ్మరిన1270
వాలచామరములు - వాతూలవలన
లోలవల్లరుల న -ల్లుక ముళ్లు వడిన
తప్పించుకొన కేళ్లు - దాటి యట్టిట్టు
కుప్పించి యపుడురి - గోలలం బడిన
తీరున వదనముల్ - దెఱచి యెచ్చటికి
బోరాక దిగులుచే - బోరలల్లాడ
కలఁగు చందము మాని-కన్నెలు చూచి
కెలనికిఁ జేరి బె - గ్గిలనీక దువ్వి
యాచిక్కు లెడలింప - నవిదాఁటి మఱలి
చూచుచుఁ బారెడు - సొబగుఁ జూచితివె! 1280
యిజటాయువుఁ గూడి-యిచ్చోటి మౌని
రాజుల కెల్ల నూ-రట చేసి యిందు
-:సౌమిత్రి పర్ణశాలను నిర్మించుట:-
వసియింత"మని పల్క - వడి నొక్కచోటి
కనువెల్లఁ బోఁజెక్కి - గాఁతముల్ ద్రవ్వి
జమ్మిమ్రాకులను గుం-జలు నిల్పి యిప్ప
కొమ్మల దూలముల్ - గొట్టి యమర్చి
ముదురులై చక్కనై - ములు జీరనట్టి
వెదురుబొంగులు దెచ్చి - వెసఁగయిలెత్తి
నిడుపాటి వేఁప పెం - డెలు గట్టి మీఁద
పొడువాటి దర్భల - ప్పుడు వాస పోసి1290
మొగదల నాయుధం - బులశాల హోమ
జగతియు నిర్మించి - చలువచప్పరము
విప్పుగా వైచియా - వెలిములుకంప
గొప్ప యేనుఁగ పొడు - గున పొంకపఱచి
గావలిగుడిసె యొ - క్కటి తా వసింపఁ
గ్రేవల నునిచి వా - కిటఁ దల్పులునిచి
సన్నజాజులును గొ - జ్జంగి తామరలు
పన్నీరు పువ్వులు - పాదిరి విరులు
కలువలు సంపెఁగల్ - ఘమ్మను తావి
వలపు దండలు గట్టి - వడిఁదీర్థమాడి1300
నారికేళపుటాకు - న నమర్చి దళ్లు
నేరాళముగ పువ్వు - టెత్తులు గట్టి
కురువేరు వటివేరు - గూర్చిన జల్లు
లిరవులు వాసింప - నిండెల్ల విరుల
మేలు కట్టులు గట్టి - మేదినియూడ్చి
పాళెలు నరఁటి కం - బములు నమర్చి
చెఱకు కోలలు నాటి - సిరము కప్పురము
పఱచి ముగ్గులు దీర్చి - పడకింటిలోనఁ
బువ్వుఁ బానుపుచెంత - బుగబుగ తావి
నివ్వటిల్లఁగ ధూప - నికరంబమర్చి1310
వచ్చి యన్నకు మ్రొక్కి - వనజాక్ష! రామ!
విచ్చేయుఁ డింటికి - విడిది యేర్పడియె
నని తోడుకుని పోయి - యాపర్ణశాల
గనిపించు కమ్మని - కందమూలములు
పనసరసాలాది - ఫలములు కాన్క
యునిచి చెంగట నిల్చి - యున్న సౌమిత్రి
గనుఁగొని సంతోష - కలితుఁడై మెచ్చు
గనిపింప రఘుకులా - గ్రణి యిట్టులనియె.
"అన్న! లక్ష్మణ ! యీగృ - హంబు నిర్మింపఁ
గన్నట్టి మెచ్చు మ్రిం - గఁగరాదు నాకు!1320
యైననేమిచ్చెద - నాలింగనంబె
కాని నీకని" చేరి - కౌఁగిటం జేర్చి
యీచమత్కార మీ - విన్నాళ్లు నెందు
డాఁచితి? ధర్మజ్ఞుఁ - డవు కృతజ్ఞుఁడవు
భావజ్ఞుఁడవు! తండ్రి - పరలోకమునకుఁ
బోవు విచారమి - ప్పుడు నీకె కాక
నినువంటి తమ్ముఁడుం - డినయట్టినాకుఁ
బనియేమి! తండ్రినా - పాలికున్నాడు!”
ఆనుచుఁ గ్రమ్మరఁ జేరి - యక్కునఁ జేర్చి
జనకజఁగూడి యా - శాలాంతరమున1330
నింద్రభోగము మది - నెంచక రామ
చంద్రుఁడు గొన్నాళ్లు - సంప్రీతినుండె
-:హేమంత వర్ణనము:-
మఱియొక్కనాడు హే - మంతకాలమున
కుఱకుఱ సోనచి - న్కులు కురియంగ
సౌమిత్రి చేఁ గల-శముగొని రాఁగ
రాముఁడు జానకీ- రమణియుఁ దాను
గోదావరినిఁ గ్రుంకఁ - గోరి ప్రాహ్ణమున
నీఁదుకు జడియక - యేఁగ నీక్షించి
సన్నపుమంచు పై - జడిగొన నేఁగు
నన్నతో లక్ష్మణుం - డప్పు డిట్లనియె1340
'అయ్య' యీ యడవినీ - హారంబు మించే
నెయ్యెడ పంటల - నెసఁగె ధరిత్రి
చలువ లగ్గలమయ్యె - జలముల నెల్ల
వెలుఁగక పొగసూరె- వీతిహోత్రుండు
ఘనులైనవార లా - గ్రయణేష్టి చేసి
తనియించి పితృదేవ - తలఁ బుణ్యులైరి
పల్లెలన్నియుఁబాడి - పంటలచేత
నుల్లసిల్లుచు జాల - నుప్పొంగె నిపుడు
రాజుల దండయా - త్రల తరియయ్యె
రాజీవహితుఁడు పు - త్రకు దిక్కుఁ జేరె 1350
దక్షిణాయనమైన - తరి నుత్తరాశ
వీక్షింపఁ దపనుండు - వెలియైన కతనఁ
దిలకంబు లేనట్టి - తెఱవయుం బోలి
విలసన శ్రీలచే - విలసిల్లదయ్యె
దూరమై దినమణి - దొలఁగి చరింప
బీరెండకాఁకలన్ - బెడఁబాయు కతన
మంచుగుబ్బలిని హి - మాని మించుటయు
సంచితంబయ్యె య - థార్థనామంబు
బడలికల్ దోఁచక - పగలయ్యు నెండ
యుడివోయి సంచార - యోగ్యమై యలరె1360
నీటిలోపలియందు - నీడలయందు
పాటించి చేరఁ జొ - ప్పడ దెవ్వరికిని
నిలవరములు చేసె - నిశల వేల్పెటను
తొలఁగె తారగములు - తుహినంబు నిండి
రాత్రియామములు - దీర్ఘంబులై మించె
చిత్రంబు చంద్రు నీ - క్షింప నియ్యెడల
మనుజుల యూర్పుల - మాసి యద్దంబు
పొనఁగినగతి హిమం - బునఁ బెంపుదఱిగి
యెండకొట్టునఁ గందు - నీసీత మాడ్కి
నుండె చంద్రిక యిప్పు- డొరపెల్ల మాని1370
యలుగులు రా వారి - యనువునఁజాల
వలిమీరి నుత్తర - వాయువుల్ విసరె
గోధూమనస్య సం - కులములై వనము
లాధూమములు గప్పు - నటులఁ గన్పట్టె
పసిఁడి నిగ్గులు దేరు - పంటల నొఱఁగి
యెసఁగె రాజనపు చె - ల్వీసీత ముందు
సాంద్రతేజము లేక - సవితృ మండలము
చంద్రమండలముతో - సరివచ్చె నిపుడు
పచ్చిక గల్గిన - పట్టుల మంచు
లెచ్చె నీరెండల-నీ ప్రభాతమున1380
నీరాశచేబోయి - నీర తుండములఁ
బూరింపవివె గజం - బులు చలిచేత
పిఱికివా రని కేఁగ - భీతిలినట్లు
సరసులఁ జేరదీ - జలపక్షికులము
పూయకవనము లి - ప్పుడు నిద్రవోవు
చాయ నున్నదిగంటె - సవరణ లేక
హిమవారిఁదోఁగిన - యినుకదిన్నెలును
దెమలక పాఱె న - దీప్రవాహములు
నెండలఁ గ్రాఁగక - హిమవారి నెనసి
యుండుట జాలించి - యున్నవంబువులు1390
కొలఁకులఁ దామర - కులములఁ దూండ్లు
నిలువఁ బువ్వులమాట - నిర్నామమయ్యె
నీ కాలమున నిన్ను - నెనసిన తపముఁ
గైకొని భరతుఁ డే - గతి నున్నవాఁడొ!
మనరీతి భరతుండు - మౌనియై యెట్లు
చనువాఁడొ యావేళ - స్నానంబుసేయ!
గుణవంతుఁ డగుకైక - కొడుకు సమస్త
మణిభూషణంబులు - మాని మి మ్మెపుడు
తలఁపుచుండుటఁ జేసి- తాను జయింపఁ
గలఁడు స్వర్గాదిలో - కంబులన్నియును1400
తల్లుల నడకలు - దలఁచి యూరింతు
రెల్లరు నతఁడొక్కఁ - డే తండ్రిఁబోలె
నట్టి లోకోత్తరుం - డైనట్టి మగఁడు
నిట్టి సద్గుణముల - కిరవైన సుతుఁడు
కలిగియు నేలకో - కైకకు నిట్లు
కులమెల్లఁ జెఱచు దు - ర్గుణము వాటిల్లె!"
అను మాట కడువేఁడి - యై చెవిసోఁక
విని సహింపక రఘు - వీరుండు వలికె
“నిందింతురే కైక - నీవు నాయెదుర
నందంబు కాదు గు - ణాఢ్యుఁ డైనట్టి 1410
భరతునినోపికం - బలుమారుఁ బొగడ
నరలేని భరతుని - యందు నామనము
కరఁగుచునున్న దే - కడఁ గలనైన
మఱపురా వాయన - మాట లిప్పుడును!
ఎన్నడొకో మన - మింకొక్కనాఁటి
కన్నదమ్ముల మొక్క - టై నలువురము
నొండొరులనుఁ జూచు - చుండు కోరికలు
పండిన భాగ్యసం - పదలు జేకూడు!"
అని పల్కుచును జన - కాత్మజ వెంటఁ
జను దేర మువ్వురుఁ - జని రమ్యమైన1420
గోదావరీనదీ - కూలంబుఁ జేరి
స్వాదుజలంబుల - స్నానంబుఁ జేసి
నిత్యకర్మంబు ల - న్నియుఁ దీర్చి పరమ
సత్యవ్రతాచార - సంపన్నుఁడైన
రాముఁడు నంది పా - ర్వతులతోఁ గూడ
నామేరు కోదండుఁ - డనఁ బెంపుఁగాంచి
మఱలి నిజాశ్రమ - మందిరంబునకుఁ
బరమసంయములు సం - భావింప వచ్చి
యచ్చోట సౌమిత్రి - యందు నెయ్యమున
ముచ్చట లాడుచు - ముదితాత్మయైన 1430
ధరణిజఁగూడి చి - త్రాసమేతముగ
హరిణాంకుఁ డున్నట్టి - యందంబు మీఱ
ననురాగరసలోలుఁ - డై తగినట్టి
యనువున వర్తించు - నాసమయమున
-:శూర్పణఖ పంచవటికి వచ్చుట:-
రావణు సోదరి - రాక్షసి దుర్గు
ఱావృత లోకభ - యంకరాకార
పాపి శూర్పణఖ యా - పర్ణశాలా స
మీపమ్మునకు వచ్చి - మిహిరసంకాశు
నాజానుబాహుఁ జం - ద్రానను వికచ
రాజీవలోచను - రఘుకులోత్తముని 1440
మత్తేభగమనుఁ గో - మలనీలవర్ణు
నుత్తమగుణుఁ గృత - యుగభాగధేయు
వరపుణ్యనిధి జటా - వల్కలకలితు
శరణాగతత్రాణు - జానకీరమణు
రామచంద్రుని మహా - రాజలక్షణునిఁ
గామించి దుర్ముఖి - గదిసి యిట్లనియె,
-: కాముకురాలైన శూర్పణఖ శ్రీరామునితో
మాట్లాడుట :-
"మౌనివేషంబున -మానినిఁగూడి
కానలలో నుండఁ - గారణంబేమి?
యెవ్వారు మీరు పే- రెఱిఁగింపు" మనిన
నవ్వీరవరుఁడు ని - శాటినిఁ జూచి1450
కలయర్థమెల్ల ని - క్కమకాని బొంకు
పలుకడుగాన డా-పల సీత యునికి
యందుపై మునివృత్తి - నలరుట నున్న
చందంబె కాఁగ డాఁ - చక యిట్టులనియె.
"భానువంశజుల మీ- బాల నారమణి
జానకి పేరు ల - క్ష్మణుఁ డందు రితని
తమ్ముఁ డితఁడు నేను - దశరథసుతుఁడ
రమ్మునా పేరు శ్రీ - రామచంద్రుండు
దానవివలె నున్న - దాన వెవ్వతెవు?
నీనెల వెయ్యెది? - నీకుఁ బేరేమి?"1460
యనిన శూర్పణఖ మ - హారాజతనయుఁ
గనుఁగొని మదినిఁ గొం-కక యిట్టులనియె.
"నే దానవిని నాకు - నెల వీవనంబు
నాదు నామము శూర్ప - ణఖయందు రెందు
నాశ్రమస్వేచ్చావి - హారిణి నేను
వైశ్రవణుండు రా - వణుఁడు నాయన్న
లోకభీకరుఁడు త్రి - లోకసంహారి
యాకుంభకర్ణుఁ డా - యన సోదరుండు
ఖరదూషణాది రా - క్షసులు నాదైత్య
వరునకుఁ దమ్ము ల - వార్యవిక్రములు 1470
సైదోడు మా విభీ - షణు డందులోన
సాధువర్తనవాఁడు - సత్పురుషుండు
నిందఱి తోఁబుట్టి - యిచ్చకు వచ్చు
చందానఁ గామసం -చారిణి నగుచుఁ
జరియింతు నీసీత - చక్కదనంబు
సరిగాదు నీదివ్య - సౌందర్యమునకుఁ
గాంతలయందుఁ జ - క్కనిదాన నేను
కంతునిఁ జెఱకు సిం - గాణికి లొంగి
నినుఁ జూచి మదినిల్వ- నేరక వలచి
యనురాగ రసవార్ధి - యందుఁ దేలితిని!1480
కొఱమాలినట్టి యీ - కొకిబికి సీత
బరిహరింపుము నాదు - పలుకియ్యకొనుము
నీచెలువును నీదు - నిండుజవ్వనముఁ
జూచువారలు సీతఁ - జూచి యేమండ్రు
కాంచనరత్న సం - గతి నన్నువంటి
చంచలేక్షణ నీకు- జతఁగూడవలదె!
వలసిన యెట కేఁగి - వలసిన రూప
ములనుందు నీమది - ముచ్చటఁ దీర్తు
నీలక్ష్మణుని సీత - నిప్పుడే మ్రింగి
వేళంబె నీకు నే - వెలఁది నయ్యెదను!1490
ఈవనంబులయందు - నీగిరులందు
నీవేడ్కఁ జెల్లింప - నేర్తు నిన్నటను
ననుమతి యిమ్మన్న"- యానిశాచరిని
గని నవ్వి రఘుకులా - గ్రణి యిట్టులనియె
-: రామ శూర్పణఖల సంవాదము :-
"ఐనదైనను గాని - దైన నాకొక్క
మానినియున్న దీ - మాత్రంబె చాలు!
జడలు వల్కలము లి -చ్చటఁ దాల్చి యొంటి
నడవులలో మౌని - నై యున్న నాకుఁ
బరిచర్య లొనరింప - బలుకుతోడునకుఁ
దరుణిమాత్రమెచాలు - తాజితేంద్రియుఁడ1500
నెచ్చోట సరిలేని - యింతివి గాన
నిచ్చోట సవతిపో - రేఁటికి నీకు?
ననుఁబాయనేర దీ- నాతి యీరమణిఁ
గనుఁబ్రామి యెడఁబాయఁ - గాజాల నేను
మనసొ క్కకడనుండ - మఱివేఱె చక్కఁ
దనము లాసింప రెం - తటి మగవారు
మెలఁత! యింతేల నీ - మీఁదటి యాస
గలుగదు నాకుఁ బొం - కముగాదు నీకు
సౌందర్యశాలి వి - చ్చట నంటు లేదు
సుందరులను వేడ్కఁ - జూచి కామించు1510
కొమరుఁబ్రాయపువాఁడు - కోరిన నీకు
నమరు సౌమిత్రిపై - నాసించి చేర
మేరువుపైనంటు -మిహిరుని దీప్తి
తీరున నతనిఁ బొం- దినఁ దగు నీకు
నాలు లేని విచార - మతని చిత్తమునఁ
జాల నున్నది పొమ్ము - జాగేల! యిచట
నొంటిగా నచ్చోట - నున్నట్టివాఁడు
కంటిబొట్టుగ నీదు- కందెఱ నుండు
నతని యిల్లాలిపై - యక్కరల్ దీరి
జతఁగూడి యుండుము - సమరాగములను1520
జనుమని" పలుక ల - క్ష్మణుఁ జేరఁబోయి
దనుజ కామాంధయై - తమకించి పలికె?
-:శ్రీరామునిచేఁ దిరస్కృతయై శూర్పణఖ సౌమిత్రిని సమీపించుట :-
“తగినట్టి దాన నీ - తరివచ్చి యిట్టి
పొగరు జవ్వనము న - బ్బురపుచెల్వంబుఁ
గలిగి యొంటిగ నిట్లు - కానలోపలనుఁ
జెలువెల్ల నడవిఁగా - సిన జ్యోత్స్న కరణి
తెకతెరఁదోప చే - తికిఁ దొరకితిని!
సుకుమారమూర్తి వి - చ్చో నొంటి గాఁగ
నారి లేకిట్లు స - న్యాసియుఁ బోలి
నారచీరలుగట్టి - నవయ నేమిటికి?1530
నను వరియించిన - నానాఁటి కీవుఁ
గననేర్తు వింద్రభో - గము లిట్టి మేన
గౌఁగిలి యాసించి - కదియఁ జేరంగ
లోఁగిన దను దయా- లోకమాలికల
గను" మన్న వెగటు బిం - కంపు లేఁతనవ్వుఁ
గనుపింప నతఁడు ర - క్కసికి నిట్లనియె,
"ఏలిక లటులుండ - నెందు దానులకుఁ
బోలునే యిటువంటి - భోగభాగ్యములు!
యేను రాముని బంట - నెఱుఁగక వచ్చి
మానిని! బేలవై - మందలించెదవు!1540
వారు చెప్పిన పనుల్ - వడి రేపగళ్లు
నూరట లేక యే- నొదుగుచుఁ జేసి
యధమజీవనుఁడనై - యరవిడి గుడిసె
నధికభయంబుతో - నణఁగి యున్నట్టి
యేనెడ నీవెక్క - డెంతకు నెంత!
మానినీమణి! నాకు - మగువ లైనపుడె
దాసిపై సీత క్రిం - దట నూడిగములు
జేసుక యాయమ్మ - చెప్పిన యట్లు
నడవనేర్తువె నీవు? - నా కేమి పోదు!
పడతులతోడ సం - భాషింపరాదు1550
అకట! కురూపిణి - యైన యాసీత
నొకనాఁడు చేరఁగ - నొల్లఁడా ఘనుఁడు!
నినుఁజూచు కన్నుల - నెలఁతను వేఱె
కననేర్చునే యలం - కారనాయకుఁడు!
అతనికి నీవు చి - న్నారివై యున్న
నతిశయసౌఖ్యంబు - లందఁజాలుదువు
తరవాత సీతఁ జెం - తకుఁ జేరనీక
పరిహరింతువు నిన్నుఁ - బాయ లేఁడతఁడు
నాబుద్ధి విని రాము - నకు దేవివైన
నోబాల! రాముఁ డ - యోధ్యకుఁ జనిన 1560
లేదు! అందఱికి నే - లికసాని వగుచు
సీమకు లేనట్టి - సిరులఁ బొందెదవు!
పొమ్మ"న్న మఱలి యా - పొలదిండి ముద్దు
గుమ్మ యామాట ని - క్కువముగా నెంచి
తూర్ణవైఖరి జగ - ద్రోహిణి యపుడె
పర్ణశాలను సీతఁ- బాయక యున్న
రాముని కడకు చే - రఁగ నేఁగి మిగుల
గామిడితనముతో - గద్దించిపలికె?
“ముసలిది చెలువంబు - మొదటనే లేదు
రసికురాలును గాదు - రామ! నీవేల?1570
యీసీతఁ జేపట్టి - యిటునటు నన్ను
గాసిఁబెట్టెద వెఱుం - గవు రసస్థితులు!
మంచితనంబుతో - మనసిచ్చి పలుక
కించవై నను నుడి - కించనెంచితివి?
ఇదియేల! సవతిపో-రేఁటికి నాకు
మదిమది నుండినీ - మదిఁ గాననైతి
గ్రక్కున నీసీతఁ - గబళించి మ్రింగి
యొక్క తెనై యున్న - నొంటిగా నీవు
నిలుపోపలేక మ -న్నించి ప్రార్థించి
పిలిచిన రాక నే-బిగియుదుంగాన”!1580
-:లక్ష్మణుండు శూర్పణఖ ముక్కు, చెవులు గోసిపంపుట:-
అని లేటి చూపుల - నట్టిట్టు బెదరి
కనుచున్న సీతఁ జెం - గటికి నా జంత
కొఱవలవంటి చూ-డ్కులను రోహిణికిఁ
గఱకఱ నెదురు ను - ల్కయకో యనంగ
మృత్యువువలె నోరు - మిక్కి లితెఱచి
యత్యుగ్రగతి వచ్చు - నాసురిం జూచి
భూమిజ వడఁగ గొ-బ్బునఁ జేర దిగిచి
రాముఁడు లక్ష్మణ! - రమ్మని పిలిచి
“మందెమేలములాడ - మన కేల?, దీని
చందంబుచాలు దు- ర్జాతి యీ నాతి 1590
మంచిమాటలఁబోదు- మదిలోన దామ
సించక తగునాజ్ఞ - సేయుము దీని
మత్తురాలిది" యన్న - మాటలోఁ జేతి
కత్తి నెలమి యొరఁ - గ్రక్కునఁ దిగిచి
రక్కసింబట్టి యు - ర్వరఁబడ వ్రేసి
ముక్కునుఁ జెవులును - మొదలంటఁ గోసి
పొమ్మని విడిచిన - భోరన రోద
నమ్ము సేయుచునది - నాసిక లేక
కూయుచుఁ జేగురుఁ - గొండయో యనఁగ
హా! యని పొడవుగా - హస్తంబు లెత్తి1600
యేఁగుచో పండ్లు నీ - రెండలుగాయ
నీఁగలు దొనదొన - నిందందుమూఁగ
నఱచి నిరోష్ఠ్యంబు - లైన మాటలను
మొఱయిడు నపశబ్ద - ములు నింగి ముట్ట
నెత్తురుల్ వర్షించు - నీరదంబనఁగ
నత్తరి నల్లని - యంగంబు నిండి
చిమ్మనఁగ్రోవుల - చిమ్మన యట్లు
క్రమ్మిన రక్తధా - రలు ప్రవహింపఁ
జలము మానక జన - స్థానమార్గమునఁ
దలయుఁ జీరయు వీడ - దానవురాలు1610
-:ఖరుని ముందఱ శూర్పణఖ తనభంగపాటును జెప్పి రోదనముఁ జేయుట -
అడవిత్రోవనె పోయి - యన్నయాఖరుని
యడుగులం బిడుగుస - య్యనఁ బడినట్లు
వ్రాలి యాదండకా - వనములో జాన
కీ లక్ష్మణులఁ గూడి - క్రీడించుచున్న
రాముని తెఱఁగునే- రని పని చేసి
తాముక్కు జెవులునుఁ - దఱిగించు కొనుట
దన యవమానమం - తయు నేర్పఱింప
విని యాఖరుఁడు క్రోధ - వివశుఁడై పలికె.
“ఏల ధరణింబడి - యేడ్చెద? వింత
చాలును లే లెమ్ము - సైదోడు నీవు! 1620
ఎవ్వఁడు నీకింత - యెగ్గు గావించె
నెవ్వఁడు నిదురించు - నెడ పాముఁ జెనకె
నెఱుఁగక యిటుచేసి-యెవ్వఁడా దండ
ధరపాశములు మెడఁ - దగిలించు కొనియె
నెవ్వఁడీ చిలివిషం -బిటుచేసి విషముఁ
గ్రొవ్వునఁ ద్రావి మ్ర - గ్గుచునున్నవాఁడు!
కామరూపంబులు - గలనిన్నుఁ జెనక
నామఘవుఁడు దక్క - నన్యులోపుదురె?
వాని ప్రాణములు నా - వాఁడి బాణముల
చే నేఁడె హరియింతుఁ - జింత యేమిటికి?1630
పాలునీరునుఁ గూర్ప- పాలుమాత్రంబె
క్రోలుహంసయుఁ బోలి - కుంభినీతలము
వానిమై నెత్తురుల్ - వరదలువాఱఁ
బానంబుఁ చేసి తా - పము దీర్తుఁగాక!
వాని మేదోమాంస - వసలు భూతంబు
లానిక మెసవి గ -ఱ్ఱనఁ ద్రేఁవుగాక!
ఇలవాఁడు బడియుండ - నీడ్చిగోమాయు
కులము లంగకములఁ - గొనిపోవుఁగాక!
ఏను చంపెదనన్న - నెవ్వారలైన
వానిఁ గావఁగనున్న - వారె లోకముల?1640
నేసేద దేరి వా-నినెఱుంగఁ బల్కు
నాసాహసముఁజూచి - నను మెచ్చు మపుడు"
అన విని ఖరునితో - నాచుప్పనాతి
మనుజాశినియుఁ గ్రోధ - మహిమ నిట్లనియె.
“అన్న! యిప్పుడు దండ - కాటవిలోన
కన్నుల పండువై - కనుపట్టువారు
చిఱుతపాయపు వారు - చిత్తజునేలు
మురిపెంపు నెమ్మేని - మురువుల వారు
వెడఁద రొమ్ములవారు - వెలిఁదామరలను
కడఁద్రోయు చక్కని - కన్నులవారు 1650
నగుమొగంబులవారు - నలువునుఁ బసిమి
నిగుడు నిర్వురమేని - నిగ్గులవారు
నెక్కడపో దార - లెత్తుక వచ్చి
జక్కవచంటి న - చ్చరవంటి దానిఁ
దాము తెచ్చినవారు - దశరథ సుతులు
రామ లక్ష్మణులను - రాజనందనులు
నారచీరలు గట్టి - నారు కోదండ
ధారులై తలజటల్ - దాల్చినవారు
ధీరులు నిర్జితేం - ద్రియులైన వారు
శూరులు చూపరఁ - జొక్కించు వారు1660
నొకపర్ణశాలలో - నుండనేఁబోయి
వెకలినై మనుజులో - వేల్పులో యనుచుఁ
జేరఁగ నేనేఁగి - సీతయనంగ
వారి చెంగటనున్న - వనిత నిచ్చటికి
నెలయింప నొంటిగా - నేకాంతమాడు
పొలువు వారెఱిఁగి గొ - బ్బున నన్నుఁ బట్టి
యీవిరూపముఁ జేసి - యిపుడున్న వారు
నీవు వారలఁద్రుంప - నేవారి మేని
నెత్తురుల్ ద్రావక - నెంజిలి దీరి
క్రొత్త మానిసిఁగాను - కోర్కె చెల్లింపు"1670
-:ఖరుఁడు పదునల్వురు రాక్షసులను శ్రీరామలక్ష్మణులపైఁ బంపుట:-
అని విని హుమ్మని - యాగ్రహం బొప్పఁ
దనచుట్టముల దండ -ధరులనుబోలు
రాక్షసేంద్రుల నతి - రథుల సంగ్రామ
దక్షల సాహసో - ధ్ధతుల రప్పించి
పదినల్వురను వేగ - పయనంబుఁజేసి
"ఇది వేళవచ్చె మీ - రిద్దరుగూడి
దండకాటవి కేఁగి - దశరథాత్మజులఁ
జెండాడి రండు నా - చెలియలి చేత
విన్నాఁడ" ననివారి - వేషముల్ గుఱుతు
లన్నియు వివరించి - యనుచు నవ్వేళ 1680
మీరంగ వారలు - మిముఁ జూచినపుడె
పారిపోవుదురు శూ - ర్పణఖ కోపంబు
తీరదు గావునఁ - దెఱవలు గట్టి
వారిఁ బోనీయక - వసుధ పైఁ గూల్చి
వారింటిలో నున్న - వనజాక్షిఁబట్టి
యేరాక్షసుఁడు దెచ్చె - నేవాని మెచ్చి
యడిగిన నిత్తుఁ బొం" - డని పంప వారు
విడెములందుక తమ - వెంట శూర్పణఖ
మార్గంబు గనుపింప - మారుతాహతిన
నర్గళంబుగ వచ్చు - నభములనంగ1690
వడిమీర వచ్చిదా - వహుతాశనార్చు
లడవియేనుఁగలు డా - యఁగ లేని యట్లు
శ్రీరాము తేజోవి - శేషంబు జూచి
యారాక్షసులు జేర- నసమర్థులగుచుఁ
ద్రొక్కుడు పడుచుండఁ - దోడనే చేరి
ముక్కిడి రక్కసి - మూఁకల నడవ
నది చూచి రఘురాముఁ - డాసీత వినఁగ
మదిలెక్కఁగొనక ల - క్ష్మణుఁ జూచి పలికె
“వారె వచ్చిరి కంటి - వా! దైత్యవరులు
ధీరలై చుప్పనా - తికి వహించుకొని1700
యీ నిశాచరుల నే - నిలఁగూల్చి వత్తు
జానకిఁగాచి యి - చ్చటనుండు మీవు
నీపర్ణశాలలో - చింత యేమఱక
కాపాడు”మనిన ల - క్ష్మణు డట్లు సేయ
-:రాముఁడు రాక్షసులను సంహరించుట:-
శరమేర్చి చేవిల్లు - జ్యావల్లిఁ గూర్చి
సురవైరి వీరులఁ - జూచి యిట్లనియె
మునులకైవడిఁ గంద - మూలముల్ మెసవి
వనభూములను జటా - వల్కలశ్రేణిఁ
దాలిచి శాంతియు - దాంతియుఁ బూని
మూలల నొదిగి యే - ము చరింపుచుండ1710
నేమి దలంచి మీ - రిద్దఱుఁ గూడి
నామీఁద దండెత్తి - నార కారణము
వలదు పొండటుగాన - వాలాయముగను
కలనుపై వేడుకఁ - గలదేని మీకు
నాచేత విల్లును - న్నది మీరు వచ్చి
గోచరించితిరి మీ - కోరిన యట్లు
ననుభవించెదరన్న" - నసురులు రాముఁ
గనుఁగోని కడునౌడుఁ- గఱచి యిట్లనిరి
"ఖరుఁడు మాదొర పంపఁ - గా వచ్చినార
మురుశక్తి చేత ని - న్నుక్కణంపంగ 1720
నిందఱితోడ నీ - వెదిరించి పోర
నందుకు శక్తి లే - దని జేసితేని
నీవిల్లు ఖండించి - నీక్రొవ్వు మాన్చి
పోవుదుమిఁక దాఁచి - పోరాదు నీకు”
నని తమచేతి మ - హాశూలసమితి
దనుజులంకించి యం - దఱు మీఁదవైవ
నన్నిబాణంబుల - నన్నిశూలములు
మున్నాడి తునిమి రా - ముఁడు భీముఁడగుచుఁ
చక్కఁగా నీజన - స్థానంబుమీఁద
నెక్కడ వచ్చునో - యింక రాఘవుఁడు?
ఈచోటు నీకొమ్మ - నిఁక వేఱెదిక్కు
చూచుకొ మ్మది యేలఁ -జొరుము లంకకును 1780
కాకున్న మననీఁడు - కాకుత్స్థకులుఁడు
నీకుఁదోఁచిన జాడ - నేఁడె వర్తిలుము
అన్నకన్న మహోగ్రుఁ - డైనట్టి వాఁడు
నన్ను నీరీతి మా - నముఁ గొన్నవాఁడు"
అని రొమ్ము గడుపునం - దంద కరంబు
లను మోదుఁకొనుచుఁ బ్ర -లాపింపఁజూచి
-:ఖరుని రణప్రస్థానము:-
తానాగ్రహంబుతో -దనుజులు వినఁగ
దానితో ఖరుఁడు ప్ర - తాపింప పలికె.
"నీ యవమతి చేత - నీరధివోలి
నా యాగ్రహము శూర్ప - ణఖ! మిన్ను ముట్టె1790
నెవ్వాఁడు నిన్ను నేఁ - డిటుజేసె వానిఁ
గ్రొవ్వాఁడి తూపులఁ - గుంభినిఁ గూల్చి
యారక్తధారల - నాఁకలి డప్పి
తీరుతు నీకు నా - దిత్యులు బెదర"
అన వినిమదినమ్మి - యది సమాళింపఁ
గనలుచు దూషణుఁ - గాంచి వాఁ డనియె
"అనుకూలులై నాకు -నాప్తులై చేయిఁ
గనియున్న ఘోర రా - క్షసుల నేర్పఱచి
పదునాల్గువేలకు - బలిసి నావెంటఁ
గదిసి కొల్వఁగఁ బిల్చి - కలనికిఁ బనుపు
తే రాయతముఁ జేసి - తెప్పింపు ఖడ్గ
నారాచశక్తి కుం - తశరాసనములు
జోడింప నేమున్ను - చూచెద రాము
తోడి సంగరమన్న” - దూషణుఁ డపుడు
కదలివచ్చె నొకటె - కాంచనాచలము
కదలునే యదియిది - కనకరథంబు
లనుచుఁ జూపఱు మెచ్చ - నపరంజి కండ్లు
నెనయు వైడూర్యంపు - టిరుసులు వజ్ర
మయమైన నొగయును - మణిగణప్రభల
దిగదిగమని నర - తిర్యగాదిత్య1810
పక్షి పన్నగలతా - ప్రసవభూమిజ
యక్షరాక్షసముఖా - నంతచిత్రములు
రణజయకారణ - రాహుధ్వజాగ్ర
రణదురుఘంటికా - రావంబు మొరయ
బహువిధసాధన - ప్రబలార్కదీప్తి
రహి మాప శబల వ - ర్ణంబులై పొలుచు
హయములఁ బూన్చిన - యరదంబుఁ దెచ్చి
జయశాలియైన దూ - షణుఁడు నిల్చుటయు
నారథంబెక్కి తూ - ర్యంబులు మొరయ
సారథింబచరించి - జయభేరు లులియ1820
ముందర బహుసైన్య -ములు గొల్వ ననికి
స్యందనంబెక్కి దూ - షణుఁ డాప్తబలము
పజ్జలరా నేఁగఁ - బదునాల్గువేలు
రజ్జు లాడుచుఁ బైఁడి - రథములవారు
పరశు పట్టెనకుంత - పాశకృపాణ
శరచాపతోమర - చయభిండివాల
ముసలచక్రగదాస్త్ర - ముద్గరప్రముఖ
లసమానసాధనో - ల్లాసులై కదల
ఖరుఁ డరదముఁ దోలి - కాలాంతకార్క
వరతేజయునఁ జేర - వానికి మునుపె1830
సమరభీషణుఁడు దూ - షణుఁడు సైన్యంబుఁ
దమకించి సెలవిచ్చి - దండకాటవికిఁ
జేరుచో దిక్కులు - జెవుడు పడంగ
భోరున రథచక్ర - ముల రవం బెసఁగ
నది గర్జితంబుగా - నభ్రమై యంప
గుదులను బిడుగుల - గుఱియఁజేరుటయు
-: ఖరుఁ డపశకునములు గాంచుట:-
నావేళ వానిపై - నశుభకారణము
గా వినువీధి ర - క్తంబులు గురిసె
రథవేగనిహతిఁ దు - రంగంబు లలసి
పృథుగతి మొగ్గి ధ - రిత్రిపైఁ బడియె1840
గురువిభాదూరమై - కొరవులతోడి
పరివేషమునఁ దోఁచె- భానుమండలము
టెక్కెంబుమీద నుం - డెను బంత గ్రద్ద
వెక్కసంబుగఁ గూసె - విహగకులంబు
దిక్కులఁ జీకట్లు – తెరలుగా ముంచె
నక్కలు వాపోయె - నలుదెసలందు
చదల నెల్లెడఁ దోఁచె - సంజకెంజాయ
గదురు నెత్తురులు మృ - గశ్రేణి గ్రక్కె
కంకగృధ్రంబు లిం - గలముల నుమిసె
యంకిలిఁజేసె మ- హారోదనములు 1850
చండాంశుకెలన మ - స్తకములు లేని
మెండెంబు లాకసం - బునఁ గనుపట్టు
గ్రహణముల్ దోఁచె న - కాలంబులందు
మాహినిండెను బ్రచండ - మారుతౌఘములు
జలజలం బగలు న - క్షత్రముల్ డుల్లె
కొలఁకుల జలము గ్ర - క్కున నింకిపోయె
గాలి లేకయు ధూళి - క్రందుగా నెగసె
రాలును బిడుగులు - రాల్చె మేఘములు
వడవడఁ గంపించె - వసుమతి యెల్ల
యెడమ మూవులు చలి - యించె దైత్యులకు1860
ఖరుని కుత్తుకఁ బుట్టె - కాకుస్వరంబుఁ
బొరసె మహోత్పాత - ములు సేనలోన
నది చూచి సరకు సే - యక నవ్వి ఖరుఁడు
మదిఁ గ్రొవ్వి తనయాప్త - మంత్రులకనియె
-:ఖరాసురుని దంభోక్తులు:-
భావింపుఁ డెన్నియు - త్పాతముల్ పుట్టె
నీవేళ కలనికే - నేఁగు నాయెదుర
నెటులైన రాము జ - యించక మాన
నటమీఁద మృత్యువు - నైన జయింతు
చుక్కలు రాలింతు - సూర్యమండలము
వ్రక్కలింపుదు శర - వ్రాతంబుచేత
జానకీపతిఁ జంపి - సౌమిత్రిఁ ద్రుంచి
కాని నేఁడూరక - క్రమ్మరరాను
తోడఁ బుట్టినదాని - తుందుడు కార్చి
"వేఁడుకఁ ద్రావింతు- విమతరక్తములు
నైరావతము మీది - యలవజ్రినైన
పోరిలోన జయించు - పూనికి నాది
యని నన్ను వీక్షింపుఁ" - డన మృత్యుపాశ
మునఁ జిక్కు పొలదిండి - మూఁకతోఁ గదల
నపుడు చారణసిద్ధ - యుక్షగంధర్వ
తపనేందు ఋషిదేవ -తాసంఘమెల్ల 1880
నవరత్నభాసమా - నవిమానములను
దివినుండి రాఘవు - దీవించి పొగడె
"నెందు గోబ్రాహ్మణ - హితముగా దైత్యు
లందఱు నని నశి - యింతురు గాక!
వీరల మర్దించి - విజయంబుఁ గాంచి
యీరాముఁ డిలయెల్ల - నేలెడు గాక!”
అని పోకఁ జూచుచు - నాకాశమార్గ
మున దేవతావళి - ముసగసలాడ
ననికి ఖరుండు రా - నల శ్యేనగామి
యును విహంగమదుర్జ - యులు మేఘమాలి1890
కరవీరనేత్రుఁడు - కాలకార్ముకుఁడు
పరుష మహామాలి - పలలభోజనులు
రుధిరాశనుఁడు సుపా - ర్శ్వుడు యజ్ఞశత్రు
పృథుకంధరులునను - పేళ్లచే వెలయు
ద్వాదశముఖ్యప్ర - ధానులు చుట్టు
ద్వాదశాదిత్యప్ర - తాపులై రాఁగ
దూషణు రథము చ - తుర్దిశలందు
భీషణాకారుల - భేద్య విక్రములు
స్థూలాక్షుఁడు ప్రమాథి - సొరిది మహాక
పాలుఁడు త్రిశిరుఁడు - పాయక కొలువ1900
నలువురితోడ ముం - దరఁ జతురంగ
బలములఁ బురికొల్పి -పైవచ్చునపుడు,
ఖరుఁడు దూషణుఁడును - గ్రహమాలికాను
సరులైన చంద్రభా - స్కరులనుఁ బోలి
ధరగ్రక్కతిల్ల ను - ద్ధతిఁ దమ మీఁదఁ
బఱతెంచు రాక్షస - బలము నీక్షించి
చదలపై మహిదోఁచు - శకునంబు లరసి
మది రాముఁ డలరి ల - క్ష్మణుఁ జూచి పలికె.
-:శ్రీరాముఁడు సీతను గాపాడు భారము లక్ష్మణున కప్పగించి సన్నద్ధుఁడగుట:-
"ఖరుని మూఁకలువచ్చె - గహనమార్గమునఁ
బరికింపు మచట ను - త్పాతముల్ వొడమె1910
పొగలు గన్పట్టె ని - ప్పుడు మదస్త్రముల
మొగిడి నూరకె నాయ- మోఘకార్ముకము
నీచెంత వనపక్షు - లెలుఁగించు జూడఁ
జూచిన మనకు ని - చ్చోఁగయ్యమంది
బలవంతమై ప్రాణ - పర్యంతమునకుఁ
గలుగు సన్నలు దోచెఁ - గంటివే యిపుడు
నావలభుజము మి - న్నక యదరెడును
గావున మనకుని - క్కము గెల్పు గలదు
కలనికి నేఁగుచోఁ - గడుమోమునందుఁ
గళగల్గియుండినఁ - గడవారి నోర్చు1920
మిగులఁ బ్రసన్నత - మించె నీ మోము
మగఁటిమిచే గెల్పు - మనకు సిద్ధించు
నదె వింటివే కాహ- ళాదిరవములు
నదయదైతేయ వీ - రాట్టహసములు
వినవచ్చుచున్నవి - వేళ నేమఱక
ధనువెక్కుఁబెట్టి య - స్త్రము లేరుపఱచి
జానకిఁ దోడ్కొని - శైలకందరము
లోన వసింపు మీ - లువుఁ గావు మిపుడు
తగదన్న నాదుమీఁ - దటియాన నీకుఁ
బగవారి నఱగించు - బహుళవిక్రమము1930
నీకుఁ గల్గిన దైత్య - నికరంబు నెల్ల
మాకు వేడుకబుట్టె - మదమడంచుటకు
మాఱాడకు" మటన్న - మాటకు నతఁడు
శ్రీరాము నానతి - శిరమునఁ జేర్చి
-: శ్రీరాముఁడు పరాక్రమముఁ జూపుచు ఖరుని సేనలతో బోరుట:-
సీతఁ దోకొనిపోవఁ - జిత్తంబు వొదల
హేతులువెదచల్లు - నేరుటమ్ములను
నారోపితమహాశ - రాసనం బంది
దారుణంబగు తను -త్రాణంబుఁదొడిగి
శింజినీక్వణనంబు - సేయుచు దనుజ
భంజనంబునకుఁ బా - ల్పడి నిలుచున్న1940
రామునిఁ గని సుప - ర్వమునీంద్రులెల్ల
"నీ మహామహుఁ డొక్కఁ - డిందఱితోడ
జగడ మేక్రియఁ జేయఁ - జాాలునో యితఁడె
పొగడొందుగాక! గె - ల్పునకుఁ బట్టగుచు
నాదివిష్ణువు దాన - వావళినెల్ల
మోదంబుతోఁ జక్ర - మున గెల్చినట్లు
లెటు వైరులనుఁ బొలి - యించునో! యితని
దిటముఁ జూతమటంచు - దృష్టింపుచుండ
ననికి సన్నద్ధుఁడౌ - నవనిజారమణుఁ
గని భూతకోటులు - గంపించి యొదుగ 1950
విలయావసరరుద్ర - వేషంబుతోడ
నలవోకగా రాక్ష - సాళిఁజూచుటయు
నప్పుడు సింహనా - దాభీలమగుచు
నుప్పొంగి దానవ - వ్యూహంబుఁ గెరలి
కార్ముకజ్యావల్లి - కాఝాంకృతములు
దుర్మధాంధత దిశా - స్తోమంబు నిండ
వచ్చుచో రఘుకుల - వరుఁ డొక్కవాఁడి
చిచ్చఱ నమ్మేర్చి - చేతఁగీలించి
కాలాగ్నికల్పుఁడై - కన దక్షయాగ
శాలలో వెలుఁగు నీ - శ్వరుని చందమునఁ1960
బెనుపొందు ననుఁజూచి - భీతిచే నచటి
వనదేవతలు భూత - వర్గంబు వెఱుచి
నలుదిక్కులనుఁ బోవ - నాళీకమిత్ర
కులమణి యున్నచో - గోదండబాణ
కేయూరకటకకిం - కిణికాకిరీట
సాయక కుండల - జాజ్జ్జ్వల్యమాన
వరవిభాపటలంబు - వనజాప్తదీప్తి
కరణి పైఁబొదువు మే - ఘంబులో యనఁగ
నిండినసేనలో - నిలిచి ఖరుండు
చండాంశతేజుఁడై - సారథి కనియెఁ 1970
“గడపుము రథము రా - ఘవులపై నిపుడు
పడవైతు వారి నా - బాణచాతురిని
దానవావళికి సం - తసముఁ గల్పింతు
మౌనుల యడియాస - మానుతు నిపుడు
చేరఁబట్టుక వత్తు - సీత నీక్షణమ
పరిహరింపుదును శూర్పణఖ ఖేదములు"
ననపల్క విని వాడు - నట్ల సేయుటయుఁ
దన యిరుగడవీర - దానవశ్రేణి
నడచుచోఁ జుక్కల - నడుమఁ గన్పట్టు
కడునుగ్రుఁడైన యం - గారకు కరణిఁ1980
గనుపట్టుచుఁ బ్రచండ - కాండవర్గంబుఁ
గనుచెదరంగ రా - ఘవుమీఁదఁ గురిసి
ఘర్జించుటయుఁ దక్కు - గలయోధులెల్లఁ
దర్జించి శూలము - ద్గరకరవాల
కుంతతోమరగదాం - కుశభిండివాల
సంతతు లందంద - జడివట్టి ముంచి
యరదము ల్వరపి వా - హముల పైఁదరమి
కరుల ఢీకొలిపి భీ - కరులై చెలంగి
జగడింప వా రేయు - శరపరంపరలు
నగముపైఁ గురియువా - నయుఁబోలి కప్ప 1990
నాసాధనములెల్ల - నాపగాశ్రేణి
యాసముద్రునిలోన - నణఁగిన యట్లు
పనిగొనలేవయ్యె - బాణపాతములఁ
దనమేన బహురక్త - ధారలు దొరఁగ
నతిశోణసాంధ్యరా- గారుణజలద
శతపరిచ్ఛన్నభా - స్కరుఁడకో యనఁగ
వెలుఁగొందు నారఘు - వీరునిం జూచి.
కలఁగుచు దివిజసం - ఘము వినువీథి
"అక్కట! యీ రాక్ష - సావళి మట్టె
నొక్క యీ శ్రీరాము - నుక్కడంచెదరు 2000
ఇతఁ డెట్లు వోరు వీ - రిందఱి తోడ
కృతపుణ్య! శ్రీరామ! - గెలుతువుగాక!"
అనుచుండఁ బరిమండ - లాయతోద్దండ
కనకకోదండని - ర్గతహేమవుంఖ
కాండప్రకాండతి - గ్మకరకరాళ
చండప్రభానిర - స్తనిశాటసైన్య
నిబిడాంధకారుఁడై -నీడలు వడంగ
ప్రబలదానవసేన - పడలు వడంగ
ననిసేయ, భగ్నంబు - లైన తేరులును
తునిసి మావంతుల - తో వ్రాలు గరులు 2010
నడ్డంబు నిడుపునై - హయములమీద
నొడ్డగిల్లిన మ్రగ్గు - నుగ్రసాదులును
ఖండితకంకణాం - గదభుజాలతలు
నొండొండ ధరణిపై - నొరలు మస్తములు
డొల్లు కిరీటముల్ - డుల్లు దంతములుఁ
ద్రెళ్లు కాయమ్ములుఁ - దెగిన కంఠములు
జీరాడు కేశముల్ - చెదరు హారములుఁ
బాఱు నెత్తురునదుల్ - పడు కేతనములుఁ
బొడియైన శరములుఁ - బొరలు గాల్బలము
మరియు సారథులు దు - మారమౌ విండ్లుఁ2020
బగులు కేడెమ్ములు - బరియలై చినుఁగుఁ
బొగరు దైత్యులకడు - పులు వేగ మురియు
ముక్కులు విఱుఁగు నె -మ్ములుఁ జెక్కలైన
చెక్కులు నజ్జులౌ - చెవులు తుండించు
కాళ్లును నలియు స- క్కలునురుమైన
వ్రేళ్లును వ్రయ్యలౌ - వీవులుఁ గలిగి
శతసహస్రములైన - సంఖ్యల దైత్యు
లతిమాత్ర చిత్రరా - మాస్త్రఘాతములఁ
బడుగుఁ బేకయునుఁగాఁ - బడిన వెండియును
పుడమియల్లుఁడు వింటఁ - బూన్చి వికర్ణి2030
నాళీక నామబా - ణ ప్రయోగములఁ
జాల నెండిన వన - జాలంబు నేర్చు
దహనుని రీతి దై - త్యశ్రేణి నెల్ల
దహియింప గరుడచ్ఛ - దసమీరణముల
నిలమీఁద వ్రాలు మ - హీరుహశ్రేణి
పొలువున దనుజుల - ప్పుడు గూలుటయును
చెదరినల్గడ హత - శేష సైన్యంబు
మదమేది ఖరదైత్యు - మఱుఁగుఁ జొచ్చుటయు
మున్నాడి యీహనం - బున దూషణుండు
వెన్నాఁగి తనవారి - వెఱవకుండనుచు2040
శర మేర్చి శమనుండు - శంకరునెదురు
కరణిఁ గోపించి రా - ఘవు ధిక్కరించి
నిలిచినఁ బోవక - నిలిచిన సేన
బలదర్పమున వాని - బలమాత్మ నమ్మి
సింహనాదముతో - శిలలురువృక్ష
సంహతియును మహిఁ - జలియింపవైచి
యుగ్రశస్త్రములఁ బ్ర - యోగింప రాఘ
వాగ్రణి వారిపై - నాగ్రహంబునను
-:శ్రీరాముఁడు గాంధర్వాస్త్రమున రాక్షసులఁదునుముట:-
గాంధర్వమగు తూపుఁ - గైకొని వింట
సంధించి వేసిన - జగమెల్ల బెగడఁ2050
దనయందు దివ్యశ - స్త్రములు మిన్నెల్లఁ
జినుకుటింగలములుఁ - జిందనీనుచును
రాఁజుచు నమ్మహా - స్త్రము తమ మీఁద
రాఁజూచి సమరంబు - రాముశౌర్యంబు
శరముఁ బూనుటయున - స్త్రము రాకఁజావు
నెఱుఁగక దిగులుచే - నిన్నియు మఱచి
రివ్వలు విఱిగి పా - ఱి తొలంగుబుద్ధి
నెవ్వరికిని లేక - యెట్లున్న వారు
నటులె యుండఁగ నేత - దస్త్రసంభూత
చటులాస్త్రములు ధరా - చక్రంబు వొదివి 2060
బలమెల్ల సమయింప - బలులైదువేల
బలము దూషణుఁడంపఁ - బటుపరాక్రములు
వారు రామునిపై న - వార్యరోషమున
ఘోరాస్త్రకోటులు - గోలుగాఁగురియ
వారి యమ్ములు తన - వాలంపుగముల
వారించి జానకీ - వరుఁడు గోపించి
-:దూషణవధ:-
యాదూషణునిమీఁద - నతని సైన్యంబు
మీఁద నాదిత్యులు - మేలని పొగడ
దూషణుండేసిన - తూపులు భీమ
రోషభీషణుఁడౌచు - రూపఱనేసి2070
వాని సారథిఁద్రుంచి - వానియశ్వములఁ
జానేసి చే శరా - సనము ఖండించి
మూడు దూపుల నుర - మ్మున రక్తధార
లోడికల్ గట్టమ - హోద్ధతి నెనయ
విరథుఁడై యమ్ములు - విల్లును లేక
ధరణిపై నొరకొండఁ - దరలించినట్లు
నపరంజికట్లచే - నశనిసన్నిభముఁ
జపలాలతా ప్రకా - శములైన శత్రు
జనపాల రక్తమాం - సములాని విజయ
జనకమై దివిజభీ - షణమయి పొల్చు2080
నొక పరిఘముఁబట్టి - యురవడి రాఁగఁ
జకచకల్గల యర్ధ - చంద్రబాణములఁ
జేతులు రెండునుఁ - జిదిమి వైచుటయు
భూతలం బద్రున న - ప్పుడు దూషణుండు
కొమ్ములుఁ గొట్టిన - కుంభిని మీఁదఁ
గమ్ముకు పడిపోవు - గంధేభ మనఁగ
నారక్కసుఁడు వడ్డ - నఖిలభూతములు
శ్రీరామవిభుఁ బ్రశం - సించి రుల్లముల
నతని బాంధవులు మ -హాకపాలుండు
నతిశౌర్యధనుఁడు స్థూ - లాక్షుఁడన్ వాడు2090
మత్తచిత్తుండు ప్ర - మాథియు సనఁగ
నత్తరి మువ్వురు - నసికుంత ముసల
సాధనమ్ములు వైవ - జానకీవిభుఁడు
సాధులౌ నతిధులం - జని కాంచినట్టు
లేదురేఁగి రండని - యేర్చిన యమ్ము
పదను జూడ మహాక - పాలుని శిరము
ఖండించి స్థూలాక్షు - కన్నులు రెండు
రెండు తూపులగ్రుచ్చి - త్రెళ్ళంగనేసి
మఱియొక్క కోల ప్ర - మాథిఁ గీటడఁచి
వెరఁజి తక్కిన యైదు - వేల రాక్షసులఁ2100
బోనీక చంపున - ప్పుడు ఖరుం డలిగి
-:శ్రీరామబాణములకు ఖరుని పన్నిద్దరు మంత్రులు బలియగుట:-
తాను పన్నిరువురఁ - దన మంత్రివరులఁ
బనిచిన వారలు - పన్నిరువురును
మొన సేయఁ జూచి రా- ముఁడు భీముఁడగుచుఁ
గాండ మొక్కట శ్యేన - గామినిఁ ద్రుంచె
రెండు తూపులఁ బృథు - గ్రీవునిఁ దునిమెఁ
జంపె నొక్కటయజ్ఞ - శత్రువుంబట్టి
యంపెఁ గాలుని వీటి - కావిహంగముని
జతగూర్చి పనిచె దు - ర్జయు వానితోడు
నతని వెంబడిఁ గూర్చి-యం పెను పరుషు2110
వడిఁగరవీరాక్షు - వానితోఁ గూర్చి
కడతేర్చి తానంపెఁ - గాల కార్ముకుని
లీలగా మేఘ మా -లిని బలివెట్టి
యాలంబులోన మ - హామాలిఁ గూల్చె
యనిపె సర్పాశ్వుని - యమ్ము సంధించి
యనలకల్పుని రుధి - రాశనుఁగూల్చె
సైన్యశేషము నెల్ల - సమయించు రాము
జన్యరంగమున రా -క్షసులెల్లఁ బడిన
నాదైత్యకేశంబు - లాహవ యాగ
వేదికి దర్భలై - విలసిల్లె నపుడు2120
రణయాగశాలకు - రాక్షసశస్త్ర
గణములన్నియు నుప - కరణంబులయ్యె
నగ్నలయ్యె మణీమ -యాభరణంబు
లగ్నిసమాన రా-మాస్త్రసంహతుల
జానకీపతి పాద - చారిచారియై యొకఁడు
దానవపరచతు - ర్దశ సహస్రముల
నొకముహూర్తంబులో - నుక్కణఁగింప
నొక త్రిశిరుండు తా - నొద్దికయగుచు
-:త్రిశిరసంహారము:-
ఖరునికి నూరట - గానిల్చి యుగ్ర
శరచాపహస్తుఁడై - శౌర్యదర్పములఁ2130
దనవెంటరాఁగ ర - థంబు పైవజ్రి
యనువున ఖరుఁడు దు- రాగ్రహుఁడగుచుఁ
దేరువోనిచ్చుచోఁ - ద్రిశిరుఁడా ఖరుని
జేరి యడ్డము నిల్చి - "శ్రీరాము మీఁద
నేఁటికి జనియెద - వేగల్లి నిన్నుఁ
జాటుగునే యిట్టి - సమరంబులకును
తేరిచూడుఁడు నన్ను - దేవరవారు
పోరాడ నీతఁడ - ప్పుడు పురందరుఁడె?
మనుజుండు వీఁ డెంత - మడియింతు నన్నుఁ
గనుము చంపుదుఁబట్టి - కాకుత్థ్సకులుని2140
నా యాయుధము తోడు -నాకితం డెంత?
నీయాన! వధియింతు-నేఁడె రాఘవుని
నతనిఁ జంపుటయొండె - నతనిచేఁ దనకు
మృతియొండె కా కేల - మిక్కిలిమాట
యేను జయించిన - - నీజనస్థాన
మేనాఁడు నెమ్మది - నేలుము నీవు
కాకయుండిన రమ్ము - కలని కవ్వెనుక"
నని పచారించి వాఁ - డరదంబుఁ దోలి
పెనుభేరి మొరయించు - పెక్కువ నార్చి
శిరములు మూఁడును - శిఖరముల్ మూడు2150
ధరణీధరంబుపైఁ - దనరిన యట్లు
గాత్రంబుపైఁ దోఁపఁ - గాండవర్షంబు
చిత్రంబుగా మొగుల్ - చినికిన యట్లుఁ
గురియుచో రాముఁడుం - గోపించి దివ్య
శరముల మేను జ - ర్జరితంబు సేయ
రాఘవత్రిశిరుల - రణకేళి యస్త్ర
లాఘవంబును సుర - శ్లాఘనీయముగ
హరియునుఁ గరియుఁ గ- య్యము సేయుసరణిఁ
బురణింప ద్రిశిరుఁ డ - ప్పుడు కోపగించి
రాము నెన్నుదురు నా-రాచముల్ మూఁడ2160
చేమఱువక వ్రేయఁ - జిఱునవ్వు దొలఁక
నాకసంబున వేల్పు - లచ్చెరువంద
కాకుత్థ్సకులుఁడు రా - క్షసుని కిట్లనియె.
“మేలుమేలు! నిశాట! - మిక్కిలి బంట
వాలంబు నీవునే -యంగ నేర్పరివి
శరము లేసితివొ య -బ్జంబు లేసితివొ?
యెఱుఁగరాదిట్లని - యించుక నైన
నాచేతిశరముల - నాఁటిన నెనుకఁ
జూచెదవది సరి - చూచుకొమ్మ "నుచు
నెన్ని లోకంబుల - కేఁగినఁ ద్రుంతు2170
నన్నట్లు పదునాలుఁ - గమ్ములు దొడిగి
యురము నొవ్వఁగ నేసి - యురువడినాల్గు
శరములచే రథా - శ్వంబులఁగూల్చి
సారథి నెనిమిది - సాయకమ్ములను
నూరాత్మజుని వీడు - చొరఁద్రోలి యొక్క
తూపున టెక్కెంబుఁ -దునియలు చేసి
కోపించి మఱియుఁ బె - క్కు శిలీముఖములఁ
దనువు నాటించి య- స్త్రంబులు మూట
దునిమె దానవుశిరో -ధులు మూఁడు వరుస
పులిఁజూచి వనమృగం - బులు వారినట్లు 2180
కలఁగి రాఘవుఁ జూచి -కలన రాక్షసులు
-:ఖరాసురుఁడు రామునితో యుద్ధము చేయుట:-
పరువెత్తి త్రిశిరుని - పాటు ఖేదమున
ఖరునితోఁ దెల్సినఁ - గడునల్గి యతఁడు
చంద్రుపై రాహువు - చనినట్లు రామ
చంద్రుపై నలిగి య-స్త్రమ్ములు గురిసె
తనతేరు చెంతకు -దరమి యా నముచి
యనిమిషేంద్రునిఁ జేరు - నట్టిచందమునఁ
గదిసి పుంఖానుపుం - ఖములుగా దిశలు
చదలును దారుణా - స్త్రచయంబు గాఁగ
నురువణించిన రాముఁ - డుగ్రసాయకము 2190
లురుశక్తి వైచి య - త్యుగ్రతేజమునఁ
దపనుని దీప్తియిం - తయుఁగాననీక
యపుడు నభంబెల్ల - నాక్రమించుటయు
నాళీకములఁ జిల్కు - నారాచములను
జాల దైత్యుఁడు రామ - చంద్రుని మేను
నంకుశాహతిఁ గరి- నలయించు రీతి
సంకిలి నొందింప - నపుడు వేలుపులు
గాలాంతకుఁడు వీఁడె- కాబోలు ననుచుఁ
జాల రాముని గెల్పు - సంశయింపంగఁ
బెక్కండతోఁ బోరి - బెలుకురి యలసె2200
చిక్కె- రాఘవుఁడని - చింతించె ఖరుఁడు
సింగంబు మృగముఁ జూ - చినరీతి రాచ
సింగంబు ఖరునిఁ జూ - చె తృణంబు గాఁగ!
శలభంబు వహ్ని నెం - చక డాసినట్లు
ములుచదానవుఁడు రా - ముని లెక్కఁగొనక
చలము మీరఁగ నర్ధ - చంద్ర బాణమున
విలుఁదునియఁగ నేసి - వెసఁ బెనువాఁడి
మరియు నేడమ్ముల - మహిసుతావిభుని
యురమును కవచ మో- హో! యనఁ ద్రుంచి
వేయమ్ములను రెప్ప - వేయక మునుపె2210
కాయమ్ము నిండారఁ - గాయముల్ చేసి
పూచిన మోదుగు - పొలుపునఁ గువల
మేచకాంగము రక్త - మిళితంబుగాఁగ
గెలిచితినని విశం - కితుఁడైన ఖరునిఁ
గలుషించి చూచి రా - ఘవశేఖరుండుఁ
-:రాముడు ఖరుని రథాది పరికరములఁ గూల్చుట:-
దనకుదొల్లి యగస్త్య - తాపసుఁ డొసఁగఁ
గను విష్ణుదైవలో - కంబైన ధనువు
చేనంది శితశర - శ్రేణిచేఁ గ్రుచ్చి
దానవు జర్ఝరి - తశరీరుఁ జేసి
యొక బాణమున వాని -యున్నతధ్వజముఁ 2220
జకచక ప్రభలీన - జగతిఁ దెళ్ళించి
మించిన దనుజుఁడే - మియు సడ్డ చేసి
యెంచక ములుకులు - నేనుఁగు మేను
నాఁటించుకైవడి - నాల్గు బాణముల
నాఁటించి నొప్పింప - నవరక్తధార
నెమ్మేన నిండఁబూ- నిన సప్తసాయ
కమ్ముల ఖరుని యం - గము నొవ్వనేసి
శిరముపై నొకతూపు - చేతుల రెండు
శరముల మూఁడర్ధ - చంద్రబాణముల
నురముపై నాఁటించి - యొక పదమూఁడు2230
దురుసుటమ్ములను నె - త్తురు చింద నేసి
కాఁడిమానొక విశి - ఖమున నాల్గింట
బోఁడిమి చెడహాయం- బులఁ దూపులాఱు
నిగుడించి సారథి - ని శరత్రయమున
నొగలును నిరుసు రెం - డు మహాస్త్రములను
ద్వాదశాస్త్రములచే - ధనువు మేనఁ ద్ర
యోదశాస్త్రము లేసి - యబ్బడఁగింప
సారథి వొలిసి య- శ్వంబులు మడిసి
తేరు చెక్కలువోయి - దేహంబు వ్రస్సి
టెక్కెంబు విరిగి ఖం - డితములై వింటి2240
చెక్కలు మహిఁగెడ - సినఁదేరి చూచి
యిలకు లంఘించి యొం - డేమియు మదినిఁ
దలఁప కాయసగదా - దండంబుఁ దాల్చి
యెదురుగా నిల్చిన - ఋషులు దేవతలు
“నదిరయ్య! రాము బా- హా పరాక్రమము!"
అనివిమానములపై - నంజలి చేసి
కనుచుండ కోసల - కన్యకాసుతుఁడు
ఖరుని తెంపును భుజా- గర్వంబుఁ జలము
గరువంబుఁ దెలివియుఁ - గాంచి యిట్లనియె,
-:రాముఁడు ఖరునితో జతురోక్తులుగ బరుషము లాడుట:-
“చతురంగ బలములు - సరస రా నీవు2250
ప్రతివూని నీలిచి నీ - పాపంబు చేత
నందఱు బొలిసిన - నటునిటుఁజూడ
నెందు నెవ్వరు లేక - యేకాకి వగుచు
నిలిచితివింక నే - నెలవు జొచ్చెదవు
చలమేల తొలఁగు మె - చ్చటికైనఁ బ్రతికి
కౄరకర్మము సేయు - కుచ్చితుఁడెల్ల
వారలచే నప - వాదంబునొందు
జెడు నెంతవాఁడైనఁ - జెడక యుండుదురె!
కడు ద్రోహులైన రా - క్షస కులాధములు
నీచకర్మము సేయు - నెడవానిబాముఁ 2260
జూచినగతిఁ జంపఁ - జూతురందఱును
కామ లోభాదులఁ - గలుషముల్ సేయు
పామరు నట్టి పా - పంబులే చెఱచు
తెలియక వడగలు - దిని యందుచేత
నలికిరి పాములు - నశియించినట్లు
నిన్నాళ్లు నీవని - నెల్ల మౌనులను
వెన్నాడి చెఱచిన - వృజినంబు నీకు
ననుభవింపఁగ దరి - యయ్యె నందేమి
యొనఁగూడె లాభ మ - య్యో వారిఁ జెఱుప?
నేరెండివోయిన - వృక్షంబు పడిన 2270
మేర నీ మేను భూ - మిని వ్రాలఁగలదు
ఋతు ధర్మములనెల్ల - వృక్షముల్ ఫలము
లతిశయముగఁ గాంచు - నట్టి చందమునఁ
జేసిన కర్మరా - శికిఁ దగుఫలము
లాసన్న గతిఁబొందు -నవి కాలవశత
జనుల విషాన్నభో - జనమునుఁ బోలి
చెనఁటి కర్మము చంపు - శీఘ్రకాలమునఁ
బుడమికి నప్రియం - బులు చేసినట్టి
జడమతులనుఁ బట్టి - సంహరించుటకు
రాజునై యట్టి భా - రముఁబూని మౌని2280
రాజిఁబోషింప దీ - రక వచ్చినాడ?
కలితసౌవర్ణ పుం - ఖంబులైన వింట
వెలువడు నట్టి నా- విశిఖరాజములు
వుట్టలో బాములు - వోయెడు రీతిఁ
నెట్టుక నీమేన - నేఁడు దూరెడును
మున్ను నీచేఁదుది - ముట్టినవారు
చన్న త్రోవనె నీవు – చనుదువుగాక!
నీవె చంపిన మౌని -నిచయంబు మింటి
త్రోవ విమాన పం - క్తుల నేఁగు వారు
పడుమంచు నరకకూ -పంబుల నీవు2290
పడఁజూచి యందఱు - పకపక నవ్వి
మారు మోములు వెట్టి - మాలనిఁజూచు
మేరఁ గేడింప ని-మ్మెయిఁ జేతుఁగాక!
తొలఁగ నీయక యొక్క - తూఁపుచే నీదు
తల తాఁటి పంటిచం - దంబున ధరణి
డొల్లక మునుపె తో- డ్తోడఁ జేయమ్ము
వెళ్లక మునుపె వే - వేగ నీచేత
నైన మాత్రము చూడు”- మనిన ఖలుండు
జానకీరమణు నెం - చక యిట్టులనియె
-:ఖరాసురుఁడు రామ పరుషోబోక్తులకు బ్రతివచనములు పలుకుట:-
"చిల్లరగాండ్లు వ - చ్చి దురంబులోనఁ 2300
ద్రెళ్ళిరి నీచేతఁ - దేఁకువ మాలి!
యంతమాత్రనె బంట - వై ప్రల్లదంబు
లెంతయుబ్రోది నీ - వేల పల్కెదవు?
జగతి క్షత్రాచార - సంపన్నులకును
దగవౌనె తమ పోటుఁ - దమరె వాకొనఁగ
క్షత్రియాధములు లో - కమునందు తమరె
శత్రులనందఱి - జంపుదు మనుచుఁ
బరవకూఁతలు గూసి - పగవానిచేత
దురములో మానంబుఁ - దూలపోవుదురు
యెవ్వడు సంప్రాప్త - మృత్యుఁడౌ నతఁడు 2310
క్రొవ్వునఁ దన్ను న - ల్గురిలోనఁ బొగడి
హతుఁడగుఁ బగరచే-నగ్నివర్ణమున
క్షితి నెఱ్ఱనై యున్న - శిలగాల్పఁగలదె?
వడిగలతనము నీ - వంటి వానికినిఁ
బొడమునే? నిను నొక్క-పోటరి వనుచు
నెన్నువానికి భయం - బింతియే గాక
నిన్నుఁ బేర్కొనిన దా- నవుఁడేలవెఱచు?
నీవాడు మాటలె - నీదు లాఘవము
నేవగ నలుగురు - నెఱుఁగ బల్కితివి!
పర్వతంబునుఁబోలి - -పటుగదాదండ 2320
ధూర్వహభుజుఁడనై - తోఁచి నీయెదురఁ
గదలక యముఁడున్న - గతి నిల్చునన్నుఁ
బదరి చూచియునిట్లు - భాషింపఁదగునె?
పలుమాటలిక నేల - బవరంబులోన
గెలిచి చంపుదు నిన్నుఁ - గేవలశక్తి
నినుఁడు గ్రుంకిన మన - యిర్వురి పోరు
కొనసాఁగి కనరాదు - గొబ్బున నిపుడె
జయమందువాఁడ నీ- సమరంబులోన
భయమేది యణఁగిన - పదునాల్గువేలు
దానవులకు వారి - తరుణులు హితులు 2330
దీనులై శోకింపఁ - దేరు కన్నీరు
నినుఁజంపి యూరార్చి - నిలుపుదుఁజూడు ”
-: ఖరుఁడు రాముని పై గదను ప్రయోగించుట :-
మని యుఱుముక వచ్చు - నశనియె పోలు
చేగదయెత్తి యా - ర్చి యణంగుమనుచు
వేగంబె త్రిప్పి బ -ల్విడిఁ బ్రయోగింప
నది వచ్చి వనభూరు - హశ్రేణి నెల్ల
సదమదంబుగఁ గొట్టి - చరముక పారి
పై రాఁగ నొకకొన్ని- బాణంబు లేసి
యారాముఁ డదిపొడి - యైపోవఁ జేయ
మంత్రౌషధముల సా- మర్థ్యంబుచేత 2340
సంత్రాసమతి వ్యాళి - సమసిన యట్లు
గద వడిపోవనౌ - గద యని దైత్యుఁ
డెద వడఁకటునిటు - నీక్షింపఁజూచి
చిఱునవ్వు మొగముఁ గై - సేయఁ జేచాఁచి
ఖరునితో వీరశే - ఖరుఁ డిట్టులనియె
"ఇదిగదా! యాస్తి నీ - కిప్పుడు నిట్టి
గదపోయె, శక్తియె - క్కడిది పోరాడ?
ఈపాటివాడ వి -ట్లేల గర్వోక్తు
లీపౌరుషపుమాట - లిపుడు వల్కితివి
చచ్చిన వారల - సతుల కన్నీరుఁ 2350
దెచ్చిన మాన్పఁగఁ - దీరునే నీకు!
కల్లలాడుదురె? రా - క్షసులెందు నైన
చెల్లరే! కులమెల్లఁ - జెఱచితి నీవు!
నీచుఁడవైతివి - నీదు ప్రాణములు
నాచేతి శరములుం - డఁగనీయ విపుడు!
అమృతంబు గరుఁడఁడు -హరియించినట్టి
క్రమమునఁ బోనీక - కైకొనుఁగాక!
నీతల ఖండింప - నిగుడురక్తమున
భూతకోటులనుఁ దృ - ప్తులఁ జేయు వాఁడ!
చక్కని జవరాలి - సందిటిలోన 2360
జొక్కి రతిశ్రమ - సుఖపరవశత
నిదురించుగతి నస్త్ర - నిహతిచేఁబెద్ద
నిదురఁగైకొన ధాత్రి - నినుఁ ద్రెళ్లనేతు!
ఆమీఁద నీయాశ్ర - మా వాసులకును
సేమంబు లొసఁగి మా-సీమఁ జేరుదును
ఏనుజనస్థాన - మిఁకఁ బాడు చేసి
మౌనుల కిచ్చిన - మాట నిల్పుదును
దనుజ కామినుల - రోదనములు వినుచుఁ
గనుగన్నగతిఁ బారఁ - గాఁ దరుముదును
నీకుల కాంతలు - నీమీఁద వ్రాలి 2370
శోకింపుచుండ నేఁ - జూచుచుండుదును!
క్రొవ్వి బ్రాహ్మణకంట - కుఁడవైన నీకు
నెవ్వరు వెఱతురో - యిన్నాళ్లు నిచట
నట్టివారల యజ - నాది కర్మములు
నెట్టుక నీడేర్ప - నిన్ను వధింతు!
పోయెదనన నెందు - పోనిత్తు నెటకుఁ
బోయెద" వని పల్క - బొమముడితోడఁ
గిటకిట యన పండ్లు - గీఁటుచు నలిగి
కటములు మిగుల ను- త్కటముగా నదుగఁ
బొడవైన యొక మహా - భూజంబు వెఱికి 2380
యడుగుల ధారణి - యల్లాడ నడఁచి
"చావుపొమ్మని” వైవ- జనకీరమణు
-:రాముడు ఖరునిఁ జంపుట:-
డావంతయుఁ దలంక - కాశుగంబులను
బొడిపొడిచేసి యా - భూమీరుహంబు
నడుమనే తునిమి క-న్గవ జేగురింప
వేయు తూపుల దైత్య - వీరుని యురము
గాయముల్ సేయ ర - క్తంబులు దొరుగ
సెలయేరులనుఁ బోల్చు - జేగురుకొండ
యలవున గదురు కం - పమరులం దరుమ
నెదుడుగా రాఁగపై - నెగయు దుర్గంధ2390
మెద నేవగించి మ- హీసుతావిభుఁడు
వెనువెనుకకుఁబోయి - వీతిహోత్రునకు
నెనవచ్చు తనకింద్రుఁ - డిచ్చినయట్టి
బ్రహ్మండనిభసుప్ర - భావమౌ నొక య
జిహ్మగంబున రొమ్ము - చినుఁగవేయుటయు
హరునిచేఁగూలిన - యముని చందమున
హరిహయ ఘోరవ - జ్రాహతిఁబడిన
బలవృత్ర నముచుల - పగిది నద్దనుజుఁ
డిల మీఁద వ్రాలిన - యెడ బ్రహ్మరుషులు
-:దేవతలు శ్రీరామునిఁ గీర్తించి పుష్పవృష్టి గురియించుట:-
రాజర్షి వరులను - రణభూమి జాన 2400
కీ జానిఁ గనుఁగొని - కీర్తనల్ చేసి
శ్రీరామ! వీఁడు చే - సిన యుపద్రవము
లోరువలేక యిం -ద్రోపేతముగను
నేమెల్ల శరభంగు - నింటికి వచ్చి
యీమాట లాడుచో - నింతియు నీవుఁ
దమ్ముఁడు దాఁజూచి - తఱిగాదటంచు
నమ్మౌనియును 'మేము - నాలోచనములు
జేసి యింద్రుని తోడ - శీఘ్రవేగమునఁ
బాసిపోయితిమి - పుష్పకముల మీఁద
మునులెల్ల నిది కార్య - ముగ నెలయించి 2410
నిను దెచ్చి రిచటికె - న్నేయుపాయముల
మాయాపదలు దీరె-మౌనుల కెల్ల
నీ యాశ్రమములందు - నిడుమలు మానె
నీదండకాటవి - నెల్ల మౌనులును
వేదోక్తకర్మముల్ - వెలయఁ జేయుదురు”
అనునంత జడివట్టె- నరుల వాన,
తనియించెఁ జెవులుగం - ధర్వగానములు,
తులకించె దివిజదుం - దుభినినాదంబు,
విలసిల్లె నచ్చర - విరిఁబోండ్ల యాట,
మలసెఁ జందనశైల - మారు తాంకురము 2420
పొలిచెను విల్లెత్తు - పొడవుచే ధరిణి;
అవుడు వేల్పులు రాము - నాశీర్వదించి
కపటదైత్యులు మూఁడు - గడియలలోన
నీరాముచే మ్రగ్గి - రెల్లరు నాది
నారాయణుఁడయి మా - నవమూర్తిఁ దాల్చి
యితఁడయ్యెఁగాఁబోలు - నిఁక మంటి మనుచుఁ
గ్రతుభుజు లెల్ల స్వ - ర్గమునకుఁబోవు
నావేళ లక్ష్మణు - డనలగహ్వరముఁ
దా వెలువడి మహీ - తనయఁదోకొనుచు
నారామవాసులై - నట్టిసంయములు 2430
జేరి వెంబడి రాఁగ - - శ్రీరాముఁజూచి
సౌమిత్రి సంతోష - సహితుఁడై పొగడ
భూమీసురస్తుతుల్ - పుడమిపై నిండ,
“మునులనుఁ జేపట్టి - మొనలకు నడచి
దనుజులన్ దునిమి యెం - తటిధన్యుఁడయ్యె!
కనుచాటు లేక సౌ - ఖ్యంబుతో నెపుడు
మనుగాక నాస్వామి - మహి నెల్లనాఁడు!"
అనుచు సిబ్బితితోడఁ - బ్రాణేశువదన
వనజంబుఁజూచి భా-వము పల్లవింప
జేరి కౌఁగిటఁ జేర్చి - శ్రీరాము మరియుఁ 2440
దేరి కల్గొనుచు నెం - తే మది మెచ్చి
యతిమానుషం బై న - యాత్మేశు శౌర్య
మతిశయంబని మెచ్చి - యడుగుల వ్రాలి
లేచి క్రమ్మరఁగ నా - లింగనసౌఖ్య
వీచులఁ దేలి య- వేల ప్రమోద
వారాశి నోలాడు -వసుమతీతనయఁ
జేరనక్కునఁ జేర్చి - శ్రీరామవిభుఁడు
మౌనులఁ బనిచి ల- క్ష్మణుఁడును దాను
నానందరసమగ్నుఁ - డైయున్న యంత
-:అకంపనుఁడు రావణుని సముఖమందు శ్రీరామ పరాక్రమము నుగ్గడించుట:-
అప్పుడకంపనుఁ-డనెడి రాక్షసుడు 2450
"చుప్పనాతిని ముక్కు - సోణాలఁదాకఁ
జెక్కి దానికి వహిం - చికొని పోరాడు
రక్కసులను ద్రుంచి - రాక్షసప్రభుల
ఖరదూషణాదుల - ఖండించి నపుడె
సురవైరులకుఁ దల - చూపరాదిచట
నీజనస్థానమిం - కెవ్వ రేలుదురు!
రాజు నెవ్వనిఁగాఁగ - రావణాసురుడు
నియమించునోపోయి - నేఁ దెల్పకున్న
పయికార్యమతని కే - ర్పడియుండ” దనుచు
లంకకు వీతక - లంకకు వాఁడుఁ 2460
గొంకుచు దశకంఠు - కొలువున కేఁగి
"దనుజేంద్ర ! మనజన - స్థానంబు లోని
దనుజులందఱు రణ - స్థలములోఁ బడినఁ
దప్పించుకొని నీప - దమ్ములుఁ జూడ
నిప్పుడొంటిగ డాఁగి - యేను వచ్చితిని
చిత్తంబులో వల - సినయట్లు జూడుఁ
డిత్తరి" ననుమాట - యెప్పుడు వినియె
నప్పుడే కోపించి - యాపంక్తిముఖుఁడు
రెప్ప వేయక వాసి - దృష్టించి పలికె
"చాలించురోరి! పి - శాచప్రచార!2470
యేలదబ్బరలాడ - నిట్లు నాయెదుర?
పట్టుచుఁ బట్టుక - పాడయ్యె నంటి
వెట్టుజనస్థాన - మిందఱు వినఁగ?
అదియేల నిట్లయ్యె - నసురలనెల్ల
వెదకి చంపిన యట్టి - వీరుఁ డెవ్వాఁడు?
వాని కెవ్వఁడు దిక్కు- వాఁడు ప్రాణముల
తోనెట్టులుండు నిం - దు దిగిన యపుడె?
బ్రదుకనొల్లక యింత - పనిసేయువాని
బ్రదికింపనేర్తురే - బ్రహ్మాదిసురలు!
నాకప్రియముఁ జేసి - నలినాక్షుఁడైన2480
నాకేశుఁడైనఁ బి - నాకి తానైన
ధనదుఁడైనను యమ - ధర్మరాజైన
మన నెట్లు నేర్చు నే - మరు మొగంబిడినఁ
గాలునికిని నేను-గాలుండ! కీలిఁ
గీలికి! మృత్యువు - గెడపమృత్యువను!
తనప్రతాపంబుచేఁ - దరణిఁ బావకులఁ
బొనిగింతు! వాయువుఁ - బోలి క్రమ్మరుదు!
నిజమాడు మేఁటికి - నీమది భీతి?
రుజచేతఁగల్లలా - రోపించి పలుక!"
అన నకంపనుఁడు ద-శాననుఁ జూచి2490
వినయపూర్వకముగా - వినుమంచుఁ బలికె.
“దశరథసుతుఁడు ప్ర - తాపభాస్కరుఁడు
శశిబింబవదనుఁ డా - జానుబాహుండు
జితవైరివీరుండు - సింహసంహననుఁ
డతిలోకుఁ డఖలక - ల్యాణశీలుండు
రాముఁడు దండకా - రణ్యంబులోన
నేమిటికో వచ్చి - యెందరింజంపి
యచలుఁడై యున్న వాఁ - డతనితో నెదుర
నచలధన్వియు నోపఁ - డని తోఁచె నాకు"
అని పల్కునంతగా - లాహియుఁ బోలి 2500
కనిసి రోజుచు “నుడి - కించెదనన్ను?
రాముఁ డెవ్వడు? వాడు - రణమెట్లుచేసె?
రాముని వెంబడి - రారుగా నేఁడు
నాయింద్రముఖ్యనా - నామరశ్రేణి
యీ యర్థమంతయు - నెఱిఁగింపు మనిన
ముమ్మాఱుగా దశ - ముఖుఁదేఱిచూచి
క్రమ్మరఁ జేరి య -కంపనుడనియె.
"విలువిద్యయందుఁ బ్ర - వీణుఁడు రాముఁ
డలఘుసాహసుఁ డింద్రు - నంతటివాఁడు
కారుణ్యశరధి య - శల్యపాత్మకుఁడు 2510
సారసాక్షుఁడు సర్వ - సముఁడు ప్రాజ్ఞుండు
నతని తమ్ముఁడు నస - మాధిక శౌర్యుఁ
డతని లక్ష్మణుఁడని - యందురు పేరు.
అన్నతో సరియైన - యతిబలశాలి
యన్నిట మేటి దే- వావళికన్న
ననిలునితోఁగూడు - నగ్ని చందమునఁ
దన సహోదరుని ప్ర - తాపంబు చేత
రాముఁడున్నట్టి గ - ర్వముఁజూచి యింక
నేమిటి పౌరుషం - బెట్టి వారలకు?
అతఁడు జనస్థాన - మారడిఁబుచ్చె2520
నతనిచే హతులైరి - యఖిలదానవులు
రామునికిని సంగ - రంబునఁదోడు
హేమపుంఖశరంబు - లింతియే కాని
కడమవారలఁజూచి - కాన మవ్వీఁట
వెడలు తూవులు మహా - విషభుజంగములు
నెందెందు చూచిన - నెల్ల రాక్షసుల
ముందఱ దోఁచు రా - ముఁడు సమరమున
నింతటివానిచే - నీజనస్థాన
మంతయుఁ బాడయ్యె - నసురులు వడిరి.”
అనిన రావణుడు దు - రాగ్రహంబొదవ 2530
నని కేఁగి శ్రీరాము - నవనిఁ గూల్చెదను
నిపుడెపోయెద నన్న - యెడ నకంపనుఁడు
కుపితాత్ము దశకంఠుఁ - గూర్చి యిట్లనియె,
-:అకంపనుఁడు రావణునితో రామునిగెల్చు నుపాయము సీత నపహరించుటయే యని చెప్పుట:-
"రాముని బలపరా - క్రమశక్తు లింత
సామాన్యమే! నీవు - శపథముల్ పలుక
శరములచే నదీ – సలిలప్రవాహ
ములనైన నొకక్షణం - బుననిల్పగలఁడు!
అవని నక్షత్రగ్ర - హావళినైన
దివియైనఁ గినిసి భే - దించు నమ్ములను!
పాతాళమునఁగ్రుంగి - పడిపోవునట్టి2540
భూతలంబైన ని - ల్పును శరాగ్రమున!
జలములు లేకుండ - జలధు లింకించు
జలముల నించు ని - ర్జలవారినిధుల
నిల మిన్ను గావించు - నిల సేయు మిన్ను
నెల నినునిగఁ జేయు - నెల సేయు నినుని
పగలు రేలును రేలుఁ - బగలును జేయు
జగతిపై నతని క - సాధ్యముల్ గలవె?
తలఁచిన విశ్వమెం - తయు వినిర్మించి
మలఁగించు విశ్వంబు - మాటమాత్రమున
సరికట్టు వాయువు - నల్లాడకుండ 2540
గురివెట్టు జమునిము - క్కున మషీ రేఖ!
ఇటువంటి రఘువీరు - నెదుర నీవొంటి
నెటుల పోయెదవంటి - నెఱుగలేకుంటి!
సాటియే శ్రీరామ - చంద్రుతో నీవు
మాట లేఁటికి హస్తి- మశకాంతరంబు!
పోయితివే మోస - పోదువు ఖరుఁడు
వోయినట్లనెకాని - పోయి రారాదు!
పోరాదు నీకునే - బోరానివాఁడె?
తీరని పనిగాన - తెలుఁపగా వలసె.
పాపకర్ములకు - పర్వలోకంబు 2560
ప్రాపింపనటుల యా- భానువంశజునిఁ
జెనకిన వారికిఁ - జేకూడనేర
వనుపమ జయకీర్తు - లాపదల్ గాక
యాదండకావని - యందు కుండలిత
కోదండపాణి ర - ఘుశ్రేష్ఠుఁ జూచి
యెదురింప నీవేల - యీజగత్రయముఁ
బొదివిన నొకక్షణం - బున నీరు సేయ
నతని గెల్వఁగ నుపా - యము వేఱె కలదు
క్షితితనూజాత యా- సీత రామునకు
దేవేరి వెనువెంటఁ - దెచ్చుకొన్నాఁడు 2570
దేవగంధర్వదై - తేయకామినుల
సరి లేరు జానకి - సౌందర్యమునకు
నరభామినులఁ దగు - నా సాటిసేయ
మరుని సమ్మోహన - మంత్రాధిదైవ
మరవిందభవుసృష్టి - నంటని ప్రతిమ!
లోచనానందక - ల్లోలవారాశి
యాచంద్రముఖి చెల్వ - మలవియే పొగడ
జానకీదేవి వం - చన మీఁదఁ బట్టి
తేనోపుదేని యం - తియె చాలు నీకు!
నాయింతి వేఱైన - యపుడె రాఘవుఁడు 2580
బాయ నేరక మేనఁ - బ్రాణముల్ విడుచు
నాకిది సరిపోయి - న తెఱంగు మీాఁద
నీకు నేక్రియ దోఁచె - నేఁడట్లు చేసి
పగఁదీర్పు" మన విని - పంక్తికంధరుఁడు
“తగు నీదు బంధుహి - తంబిది నాకు
నటుల సేయుద"మని-యంగీకరించె
నటునటు నాదినం - బంతయుఁ దీర్చి
-:శ్రీరామునిపైఁ బగ దీర్చుకొనుటకై రావణుని దండకారణ్యప్రస్థానము:-
వేగినంత పటాణి- వేసడంబులను
వాగెలు గుదియించి - వలుదపగ్గముల
నొగలబిగించి ప - న్నుక సూతుఁడెదుర 2590
గగనయానరధంబుఁ - గ్రక్కునఁదేర
నా తేరిపై నెక్కి -యరుగ నారథము
శీతాంశుఁ డంబుజ - శ్రేణిఁ గన్పట్టు
తీరున వినువీథిఁ - దిగదిగ వెలుఁగ
మారీచదైత్యాశ్ర - మముఁబ్రవేశించి
యతనిచేతను బూ - జలంది వాఁడిచ్చు
నతిశయభక్ష్యభో - జ్యాదులన్ దనిసి
వానితో నొకయెడ - వసియించి కొన్ని
లేని నెయ్యములు గ - ల్పించి భూషించి
యున్నెడ రావణు - నుల్లంబులోన 2600
నున్నకీ లెఱుఁగక - యొంటిగా నితఁడు
తనయింటి కేపని - దలఁచియోవచ్చె
నని యెంచి మారీచుఁ - డతని కిట్లనియె.
"యేమిగార్యముగ నా - యింటికి వచ్చి
తీమేర ననుచరు -లెవ్వరు లేక?
ఏమి సేయుదు నీకు - నేమి కావలయు
నేమి తలంచితి - వెఱిఁగింపు మనిన”
మారీచుకూరిమి -మాటల కలరి
యారావణుఁడు విన - యమున నిట్లనియె.
“ధరణీసురలకహి - తంబులు గోరు2610
ఖరదూషణాది రా - క్షసవీరవరులఁ
దడవుగా మనజన - స్థానంబు నందు
గడితాణెముగ నుండఁ -గట్టడ జేసి
యున్నది యెఱుగుదు - వో లేదొ? యిట్టు
లున్నచో నిన్ననే - నొకవార్త వింటి
రామచంద్రుఁడు దశ - రథపుత్రుఁడొక్క
కామినితో దండ - కావని జేరి
కదనంబులోపల ఖరదూషణాది
మదమత్తదనుజకు - మారవర్గమును
నారాచములఁగూల్చి - నాఁడందుకతన2620
నారాఘవుని దేవి - నపహరించెదను
అందుకు నీ సహా - యము మదిఁగోరి
నందునవచ్చితి” - నని యప్డు వలికె
నప్పుడె గుండె ఝ - ల్లని తెల్విఁదప్పి
దప్పితో నాలుకన్ - దడిలేక భ్రమసి
పెదవులుఁ దడవుచు - భీతిచేఁ జాల
నెదవడి మారీచుఁ - డిట్లని పలికె
-:మారీచుని హితోక్తులు:-
"సీతను దెమ్మని - చెప్పిన పరమ
పాతకుఁ డెవ్వఁడా - పాలసబుద్ధి
వినియేల చెడనీకు? - వేగంబె వానిఁ2630
గినిసి దండించినన్- గీడొంద వీవు!
అవని యరాక్షసం - బైపోవ నిన్ను
నవివేకిగాఁ దన - యాత్మలో నెంచి
యెవ్వఁ డింతకు దెగి - యెను? వానిఁ దెల్పు
మివ్వేళఁ దగునాజ్ఞ - నేన సేసెదను
పాముకోఱలఁ గేలఁ- బట్టుమన్నట్లు
పామరుఁ డెవ్వఁ డీ - పనికి ని న్ననిచె?
మిగులవేడుక కొమ్మ - మీఁదఁ గేలునిచి
తగ నిద్రవోవు నీ - తలఁగాలఁ దన్ని
యెవ్వఁడుబోధించె? - నెవ్వఁడు నీదు 2640
క్రొవ్వఱ మృత్యువు -కోఱలన్ ద్రోసె?
నాభిజాత్యంబను - నట్టి తుండంబు
నాభీలవిక్రమం - బనునట్టి మదము
గంధసింధురము నొ - క్కఁడు జేరి దుర్మ
దాంధుఁడై చెడిపోవు - నాతఁ డున్నాఁడె
దానవమృగములన్ - దరమి వధింప
దానుఁ బాల్పడి శస్త్ర - తతి గోళ్లుగాఁగఁ
గోఱ లస్త్రములుగా - గురుశౌర్యదేహ
సారంబుతో నొప్పు - జానకీరమణ
పురుషసింహము నిద్ర - వోవఁగ నెవ్వఁ 2650
డురక మేల్కొలిపి మృ - త్యువుచేతఁ జిక్కి
విల్లను మకరంబు - విశిఖంబులను క
రళ్లును శౌర్యదు - ర్వారపంకంబు
వలనొప్పు సమరప్ర - వాహవేగంబు
నలరు రామునిపేరి - హ్రదములోఁ జొచ్చి
సుడిఁజిక్కి యెవ్వఁడు - సుడివడఁజూచు
సడలని కాలపా - శములకుఁ జిక్కి?
కావున నీబుద్ధి - కాదయ్య నీకు!
రావణ! కులమెల్ల - రక్షింపు మీవు
ఎందఱు లేరు నీ -కింతులు? వారి 2660
యందల రమియింపు - మరుగుము మఱలి
రాముని దేవి ధ - రాపుత్రి మనుజ
భామిని నీకేల - పతితోడఁ గూడి
దండకావనుల ఖే - దంబులు దీరి
యుండగా నిమ్ము మీ - యూరికిఁ బొమ్ము
నామాట విను" మన్న - నమ్మిక చుట్ట
మీమేరఁ బలుకుటల్ - హితమని యెంచి
యప్పుడే మఱలి మ - హారథంబెక్కి
యుప్పరంబునఁ దాల్మి - యుల్లంబుఁ బేర్చి
తనదు లంకారాజ - ధానికిఁ జేరి 2670
దనుజులు భజియింపఁ - దానున్న యంత
-:రావణుని యెదుట శూర్పణఖ ప్రలాపించుట:-
అపుడు శూర్పణఖ మ - హారోదనంబు
విపుల చలింపఁ గా - వింపుచు వచ్చి
దనుజుల నెల్ల నిం - తటి వేగిరమున
దునుమునే! యముని సై - దోడైనవాఁడు
రాముఁ డీతని పరా - క్రమము దానవుల
దోమలఁ బొగవోలి - త్రుంగించె నిపుడు
నిది తమయన్నతో - నెఱిఁగింతు ననుచు
నదివచ్చి లంక భ - యంకరవికృత
రూపిణియై చొచ్చి - రుచిరసింహాస2680
నోపరి దేవేంద్రుఁ - డున్నచందమున
భానుమండలవిభా- భాసురదివ్య
నానామణివిభూష - ణములు రాణింప
ననుపమబలులు బ్ర- హస్తాదులైన
యెనమండ్రు మంత్రులు - హితవృత్తిఁ గొలువ
దిగదిగ వెలుఁగుచు - దీప్తారచు లడరఁ
బొగలేని వహ్నిపెం - పుననున్నవాని
పాకారి ముఖ్య ది - క్పతు లాహవమున
డాకొని తేరిచూ - డఁగరానివాని
శతశోటి తనభుజ - స్థలముపై నాఁటు2690
కతమునఁ జీరయౌ- గాయంబువాని
తనమేన నైరావ - తము కుమ్ముకత్తి
పెనుగంటు పైసరల్ - పెనఁగొన్నవాని
పదితల లిరువది - బాహువుల్ దిశలు
పదియునుఁ గబళింపఁ - బనిగొన్నవాని
వెళుపైన యురముపై - వేల్పుమిటారు
లలఁదిన కుంకుమ - యసలొప్పువాని
లలి మహారాజ - లక్ష్మణచిహ్న
ముల నొప్పు నవయవం - బుల మీఱువాని
బారుదీరిన యట్టి - భానుబింబముల 2700
తీరెచ్చు కోటిర - దీప్తులవాని
గురుతరవైడూర్య - కుండలప్రభల
మెఱుఁగుఁ జక్కులు జాజు - మెఱయించువాని
నంజనాచల నిభం - బైన గాత్రమున
సంజకెంజాయ వ- స్త్రముఁదాల్చువాని
కలనిలో విష్ణుచ - క్ర ప్రహారముల
గళములయందు రే - కలు మించువాని
కులశైలపంక్తి ను - గ్గుగఁ జేయ సప్త
జలరాసులు గలంపఁ - జాలినవాని
తన పేరు విన్నబృం - దారకశ్రేణి 2710
మనముల మనునాస - మాన్చినవాని
వడిగలవాని యే - వలన ధర్మములఁ
జెడజూచువాని నూ - ర్జితశక్తివాని
నమరగంధర్వ వి - ద్యాధరయక్ష
రమణులఁ దెచ్చి కా -రల నుంచు వాని
పరకామినుల మీఁది - బాళిచే నొక్క
తరినైనఁ దనివి నొం - దకయుండువాని
జపము లధ్యయనముల్ - సవనముల్ ఘోర
తపములుఁ జేయుచిం - త మెలంగువాని
భోగవతీనామ - పురి కేఁగి భయద 2720
నాగలోకముల ను - న్న ఫణీంద్రవరుల
వాసుకితక్షక - వ్యాళులఁ గెలిచి
యిాసున దక్షకు - నిల్లాలి దెచ్చి
డక్కఁబెనంగి నా - టకశాలలోనఁ
జొక్కుటాటలు నేర్పి - చూచినవాని
కైలాసమున కేఁగి - కలనఁ గుబేరుఁ
దోలి పుష్పకము నె - త్తుకవచ్చువాని
పృథుశక్తిఁ దరువులు - వెఱికించి చైత్ర
రథము నందనముఁ జూ - ఱలు వుచ్చువాని
తరణిచంద్రగ్రహ - తారకావళులఁ2730
గలములఁబట్టి న - ల్గడవ్రేయువాని
పదివేలవర్షముల్ - బ్రహ్మనుఁగూర్చి
మది నదరక శిరో - మాలికల్ దునిమి
హుతవహులో వ్రేల్చి - యూర్జితస్థితులు
నతిశయవరములు - నందినవాని
మనుజులు దక్క నే - మగవారిచేతఁ
దనకు నాశము లేని - తప మూనువాని
బ్రహ్మవిద్యానిధిఁ - బరమసాహసుని
బ్రహ్మణ హింసలఁ - బాల్పడువాని
క్రూరుని కఠిను మూ - ర్ఖుని దురాచారు 2740
ధీరుఁ గృతఘ్ను నా - స్తికు మదోన్మత్తు
దయలేనివానిఁ గ్రో - ధమునుఁ గామంబు
సయిదోళ్లుగా ధాత్రి - జల్లించువాని
దిగధీశులనుఁ జెక్కి - తీర్చినచరణ
యుగళమంజీరంబు - లొప్పెడువాని
బృందారకేంద్రు సూ - రించు నమూల్య
చందనవస్త్రభూ-షల మించువాని
చంద్రప్రభాచాక - చక్యంబు దొలఁకు
చంద్రహాసము కేల - సవరించువాని
లోకభీకరునిఁ ద్రి - లోకకంఠకుని 2750
బ్రాకటజయశీలుఁ - బౌలస్త్యు నుగ్ర
భావను మయసుతా - ప్రాణవల్లభుని
రావణు లోకవి - ద్రావణుఁ జూచి
సిగ్గెఱుంగక ముక్కు - చెవులునుఁ బోయి
బొగ్గువంటి శరీరమున - బీట లెత్తి
తులకించి రొంపి నె - త్తురు గౌలుచేతఁ
గొలువువారెల్ల ము - క్కులు మూసికొనఁగ
గద్దరియై మంత్రి - గణములోఁ బెద్ద
గద్దియ నున్న రా - క్షసరాజు బలికె
-:శూర్పణఖ రావణుని నీతిరాహిత్యము నధిక్షేపించుట:-
“అసురనాథ! భో - గాసక్తిచేత 2760
నాసన్నమృత్యుభ - యంబుఁ గల్గియును
మత్తుండవై మేను - మఱచి యేమియును
జిత్తగింపక యుపే - క్షించి యున్నావు!
గ్రామ్యంబులైన భో - గంబులన్ దవిలి
సామ్యవర్తనల మిం - చకయుండెనేని
యతని నెల్లరు స్మశా - నాగ్నియె పోలె
హితుఁడని యెంచక - యెడసి పోపుదురు
తగునట్టి కార్యంబుఁ - దగినట్టి వేళ
తగఁదీర్పఁడేని యా - ధరణిపాలకుఁడు
గార్యహాని యొకఁడె - కాక తానందు2770
నార్యులు నిందింప - నల్పుఁడై సమయు
తా నస్వతంత్రుఁడై - ధరయేలునట్టి
వాని రాజనుచు నె - వ్వరుఁ జేరఁబోక
గజములు బంకసం - కరపల్వలమును
త్యజియించుగతి పాయఁ - దలఁతు రుల్లముల!
తనప్రభుత్వమునకుఁ - దాఁ గర్తగాని
మనుజనాథుఁడు వార్థి - మధ్యంబునందుఁ
బడియున్న శైలంబు - పగిది రూపేరు
పడక మెల్లనె పద - భ్రష్టుఁ డైపోవు!
దేవత లెల్ల "నెం - తే యల్పుఁడయ్యె” 2780
రావణుఁడన నెట్లు - రాజ్య మేలెదవు?
బుద్ధి లేదేని ప్ర - భుత్వంబును నీకు
సిద్ధింప నేర్చునే - శిథిలమౌ కాక?
భండారమును మంత్రి - బలము చారులును
మండలాధీశ్వరు - మనను వెంబడిని
నడవకుండిన వారి - నరపతీత్వంబు
లడవిగాసిన వెన్నె - లై పొల్లుపోవు!
దూరపు కార్యముల్ - తోఁచుట నృపులు
చారులచే దీర్ఘ - చక్షువులైరి!
అట్టియోజన లేని - యధముఁడు ధరణి2790
యెట్లు బోషించు? వాఁ - డేమిటి రాజు?
నీ కిట్టి ధరణీశ - నీతిమార్గంబు
లేకున్నకతనఁ గ - ల్గెను వంశహాని
నీజనస్థానంబు - నీదు సోదరులు
రాజమాత్రునిచేత - రణభూమిలోన
పాడరి హతులైన - పట్టునఁ దేరి
చూడకయది చెవిఁ- జొనుపకయున్న
దిక్కు లేదనుచు దై - తేయుల నొకరిఁ
జిక్కకుండఁగ సుర - శ్రేణి దండించు
దశరథసుతునిచే - దండకావనము 2800
కుశలంబు నొంది నీ - క్షోణికి నెల్ల
హానివచ్చిన కార్య - మది నీకుఁ దెల్పు
మానిసి కరవుగా - మహి యేలినావు!
అదిగాక యిట్టి కా - ర్యము నీవు వినియు
నెదవడి నీచేత - నేమియుఁగాక
యున్నావొ! నా కేమి -యును మదిఁదోఁచి
యున్నకార్యంబుగా - దొకమాట వినుము
చెడుబుద్ధివాని కొం - చెపుటీవివాని
జడుని లోభిని దుర్వి - చారుని శఠుని
రాజని యెంచరు ప్రజలు - దుర్నీతి 2810
రాజమాత్రులు ప్రజా - రంజనపరులె!
గణుతింపఁ బ్రజపట్టు - గలుగని రాజు
తృణమాత్రుఁ డతని చే - తికి నెట్టిపనులు
చేకూడనేర్చునే! - చిల్లపెంచులను
పాకంబు చెడి యెండఁ - బారుకాష్ఠములు
గరికిపోచలు వాయు - గతమహీరజము
పరిజనంబులను చే - పట్టనిదొరయు
నొక్కచందమే కాన - నొకకార్యమునకు
నెక్కడ గురి చేసి- యెంచ రెవ్వరును
ముడిచిన పువ్వులు - మునుముట్టఁగట్టి2820
విడిచిన మైలయు - విడిచిన యట్లు
మొదట సమర్ధుఁడై - మున్నట్టి పెంపు
వదలిన రాజు నె -వ్వరు వదలుదురు
ధర్మశీలుండు కృ- తజ్ఞుండు వైరి
మర్మభేదనుఁడు క్ష - మాసత్త్వధనుఁడు
నగునట్టి రాజు సే - యకయుండి సేయు
తగవుగా సకలయ - త్నములు జేకూడు
యోగనిద్రారతి - నుండు నీశ్వరుఁడు
జాగరూకతఁ బ్రపం - చముఁ బ్రోచినట్టు
లీగణంబులు గల్గు - నృపుఁడు పూజ్యుండు2830
వేగులచే నెల్ల - వృత్తాంతములును
దెలియక మందబు - ద్ధిని ధాత్రియేలఁ
దలఁచిన నీకు ప్ర - తాప మెక్కడిది”|
అని శూర్పణఖపల్క - నామాట లెల్ల
విని రావణుడు చాల - విన్ననైయుండి
వంచిన తలలెత్తి - వదరెడుదాని
కించు వాక్యము లాల - కించి యిట్లనియె.
“రాముఁ డెవ్వఁడు? ఘోర - రణ మెట్లు చేసె?
నేమిటికై వచ్చె - నీయడవులకు?
నేరీతిఁ గెలిచె? నె - య్యేవి సాధనలు?2840
వేరు వేరుగ నాకు - వినిపింపు” మనిన
దానవి పంక్తికం - ధరుఁ జూచి యెల్ల
దానవుల్ వినుచుండ - తా నిట్టులనియె.
-:శూర్పణఖ శ్రీరామాదుల సౌందర్య పరాక్రమములను వర్ణించి, సీతనపహరించి పగసాధింప బుద్ధి చెప్పుట:-
ఆజానుదీర్ఘబా - హాయుగళుండు
రాజీవ నేత్రుఁడు - రవికులోత్తముఁడు
నారచీరలుగట్టి - నాఁడు చెల్వమున
మారునితో మారు - మసలెడువాఁడు
దశరథరాజనం - దనుఁడు రాఘవుఁడు
శశివదనుండు రా - క్షసుల మర్దింప
బంగరుకట్లచే - బలునారి మెఱయు2850
సింగాణి విల్లు ప - సిండి పుంఖముల
మీఱు లకోరీల - మిఱిమిట్లు గొనఁగఁ
గ్రూరసర్పంబుల - కొమ రగ్గలింపఁ
గరముచాచుట నిషం - గంబుఁ దూపులునుఁ
దొరగించుటయు వింటఁ - దొడుగుట పగర
గుఱిసేసి వ్రేయుటఁ - గోరి వీక్షింప
నెఱుఁగఁగ రాక య - నేకబాణములు
యిలయు నింగియు నిండి - యింద్రుండు గురియు
శిలలు సస్యంబులఁ - జెఱిచిన యట్లు
దనుజుల నొకముహూ - ర్తంబులోఁ దునిమి2860 1660
మనజనస్థానంబు - మహిఁ బాడుచేసె!
జానకీపతి పాద - చారియై తిగ్మ
భానుని కైవడి - పదునాల్గువేల
దనుజవీరులనుఁ జే - తడి యాఱకుండ
దునిమి ఖరాదియో - ధుల సంహరించి
చెక్కు చెమర్పక - చింతిల్లుచున్న
నక్కడి మౌనుల - కభయంబు లిచ్చి
యాఁటదానిని దీని - హతము సేయంగ
నేటి కీ వలదని - యిటు సిగ్గు చెఱిచి
విడిచి పొమ్మన్న నీ - వేదిక్కు గాన 2870
వెడలి వచ్చితి సురల్ - వీక్షించి నగఁగ!
అన్నిగుణంబుల - నాయన తమ్ముఁ
డన్నకు సరివచ్చు నట్టి - యుత్తముఁడు
తమ్ముడు చెలికాఁడు - దాసుఁడు హితుఁడు
నమ్మినవాఁ డాయ - నయె రాఘవునకు
ననుకూలశీలయౌ - నాయన భార్య
తనరు సీత యనంగ - దరలాక్షి యొకతె!
చక్కని నెమ్మోము - జాబిల్లి రేక
నొక్కులు దిద్దునె - న్నుదురును మేల్మి
బంగరునిగ్గులు - పచరించు మేను 2880
సింగపునడుము రా - జీవపత్రముల
నిరసించు కన్నులు - నెఱివంక బొమలు
గరువంపు నుడువు ను - త్కటకటీరంబు
జక్కవగుబ్బలు - సంపంగి టెక్కు
ముక్కును వలమురి - మురువైన గళము
తుమ్మెదకురులు చే - తుల సోయగంబు
కెమ్మోవి చెలువందు -కిసల హస్తములు
కెందమ్మి యడుగులు - గిలగిల మొరయు
నందెలు మణికంక - ణాంగదంబులును
జెలునొప్పు నాసాధ్వి - శ్రీమహాలక్ష్మి 2890
పొలుపున గిరిరాజు - పుత్రివైఖరిని
వనదేవత యనంగ - వారిజాసనుని
వనితకైవడి జగ - ద్వర్ణిత యగుచు
నెక్కడి సురకాంత - లేడ యప్సరస
లెక్కడి యహికన్య - లెందుకువారు!
వారి సౌందర్య మ - వ్వనజాక్షి కాలి
గోరునకైనఁ ద - క్కువ నిక్కువంబు!
తగు నీకు సీత సీ - తకు వీవు దగుదు
వగణితభోగభా - గ్యాకారములను
అటువంటి సతి యింద్రు - నంతటివాని2900
కెటువలె దొరకు! నయ్యిగురాకుఁబోడి
నరునివెంబడి గహ- నంబులవెంటఁ
దిరుగునే! యని తోడి - తెచ్చి నే నీకుఁ
గానుకఁ జేసి నే - గలిగిన ఫలము
నీ నెమ్మదికి నింపు - నెలకొల్పవలయు
నని యెంచి పర్ణశా - లాంతరంబునను
జనకజతోడఁ బ్ర - సంగంబు జేసి
యేకాంతమున నీయ - హీనశౌర్యంబు
నీకల్మియును వితీ - ర్ణియుఁ జెలువంబు
మరులు పుట్టఁగఁ బల్కి - మది నీయకొలిపి 2910
తరుణి నే దెచ్చు మం - త్రము భిన్నమైన
నారామసోదరుఁ - డరికట్టి నన్ను
పారిపోవఁగనీక - బ్రతిమాలుచుండఁ
జెవులును ముక్కుఁ గో - సెను! నీనిమిత్త
నవమానములకెల్ల - నాలయంబైతి!
సీతను నీవు చూ - చిన వలరాజు
హేతికి లోనుగా - కెట్లు దాళుదువు!
ఆమానవతి మీఁది - యాస గల్గినను
తామసం బేల నీ - తనిఁగుడికాలు
ముందుగా నడవుము - మూఁకలఁ గూర్చి!2920
సందడి సేయకు - సన్నకు సన్న
మాయావియై పోయి - మఱలినగాని
నీయత్నమంతయు - నిష్ఫలంబగును!
నీ వొక్కడే యేల - నినువంటివారు
వేవేలు గూడిన - విల్లందెనేని
రాముని ఘోరనా - రాచదావాగ్ని
చేమాడిపో కేమి - సేయంగ వచ్చు!
నిదురవేళలనైన - నీవు శ్రీరాము
నెదురక మాయచే - నెలయించియైన
నొంటరిగానున్న - యుర్విజఁ బట్టి2930
యింటికిఁ దెచ్చుకొ - మ్మిది బుద్ధి నీకు
నీదుశక్తి యెఱింగి - నే డేఁగి రాము
పైదలిఁ గొనివచ్చి - భార్య సంపదల
నాకొమ్మ నీకు ని - ల్లాలుగా సుఖము
జేకొమ్ము ! నీకుఁ దోఁ - చినయట్లు పొమ్ము"
-:రావణుని రెండవమాఱు దండకావనప్రస్థానము:-
అనవిని రావణుఁ - డౌఁగాక యనుచు
జనియెదనని యాన - శాలకు నరిగి
మేకతంబున నన్యు -లెఱుఁగకయుండ
రాకొట్టి తగినసా -రథిఁ జేరఁ బిలిచి
రథ మిచ్చటికిఁ గొని - రమ్మన వాఁడు2940
పృథువేగ మొప్ప ని - ల్పినఁదేఱి చూచి
కామగంబును మణి - గణవిభాదివ్య
ధామంబు దనుజన -క్త్రఖరాన్వితంబు
నగు తేరిపై నెక్కి - యర్ధరాత్రమున
గగనమార్గంబునఁ - గదలి శీఘ్రమున
ధవళాతపత్రంబు - దశశిరోభాగ
రవిభాసమానవ - జ్రకిరీటములును
నెఱతావిదిశల నిం -డిన పారిజాత
సరములఁ బొలుచు వి- శాల వక్షంబుఁ
జగచక ల్వెదచల్లు - చలువదువ్వలువ 2950
నకళంకరుచి చంద్ర - హాసంబు మెఱయ
మెఱుపులు గల నీల - మేఘంబు వోలి
ధరణికి డిగ్గి యా - దశకంధరుండు
నెడనెడనున్న మ- హీధరావళియు
నుడివోని ఫలముల - నొప్పు వృక్షములఁ
జలువనీటి నెసంగు - జలజాకరముల
నలరెడు మౌనుల - యాగవేదికల
నారికేళరసాల - నారంగవకుళ
భూరుహనీరంధ్ర - పుణ్యాశ్రమములుఁ
బన్నగ గంధర్వ - పక్షి కింపురుష2960
కిన్నిరమిథున సం - కీర్ణకుంజములు
వాలఖిల్య మారీచ - వైఖానసౌజ
లాలితపర్ణశా - లాప్రదేశములు
వీణాది సంగీత - విద్యలచేఁ బ్ర
వీణలౌ నచ్చర - వెలఁదులగుంపు
చలువముత్యపుసరుల్ - చందనప్రసవ
ములు దాల్చు దేవతా - ముగ్ధాజసములుఁ
గలహంస బకచక్ర - కారండవాది
జలపక్షి కలకలాం - చత్తటాకములు
విచ్చలవిడిఁ జెంత - విహరింప నిలకుఁ2970
వచ్చిన దేవతా - వరవిమానములు
తీరంబులకుఁ దెచ్చి - తెరలు వైచుటయు
నారజల్లిన యట్ల - నలరు ముత్తెములు
గరడులచే లవం - గములు తెప్పలుగఁ
దరిఁజేర వెరఁజు వ - ర్తకుల మొత్తంబు
మోసులైన ప్రవాళ - మూలకందములు
రాసులై దేరు తీ - రలతాగృహములు
మిరియపుఁ బొదరిండ్ల - మీద ఘుమ్మనుచుఁ
దిరుగుచు నసియాడు - తేఁటిదాఁటులును
వెండి బంగారముల్ - వెలలేని మణులు2980
నిండిన గనుల నె - న్నిక కెక్కుచరులు
తఱచుగాఁ బెరుగు చిం - దంపు తిప్పలును
గరిమముల్ మించిన - కరపట్నములును
గజవీరభట తురం - గమ రథంబులును
విజయకరణములై - వెలయు కోటలును
చల్లనై మెల్లనై - చాలనెత్తావు
లెల్లడ వెలివిరి - యించు గాడ్పులును
గలిగిన జలధి చెం - గటి విభవములు
కలయఁ జూచుచుఁ దశకంధరుం డరిగి
కట్టెదురను దొల్లి - గజకచ్ఛపములఁ2990
బట్టుక కొనివచ్చి - పక్షి పుంగవుఁడు
కొమ్మపై వ్రాలువేఁ - గున నది విఱుగ
నమ్మహిశాఖఁ బా - యక వాలఖిల్య
మునులుండ నెఱిఁగి తా- ముక్కున గఱచి
కొని హిమాచలముపైఁ - గొమ్మఁ దా నునిచి
యందుండు మౌనుల - నవ్వలి కనిచి
యందుపై గజకచ్ఛ - పాహారి యగుచు
దాన సత్త్వము హెచ్చి - తల్లిఖేదంబు
మానుపఁదలఁచి య - మరపురిఁ కేఁగి
సురరాజ గుప్తమౌ - సుధ గొనివచ్చె3000
గరుడి నిందుకు దాళి- గగనంబు మోచి
శతయోజనాయత - శాఖలచేత
నతిశయించి తపోధ - నాదరమైన
ధర్మమూలము సుభ - ద్రంబను మఱ్ఱి
దుర్మదాంధుఁడు ప్రోవు - త్రోవలోఁ జూచె.
-:రావణుఁడు మారీచుని సంధించుట:-
ఆచెట్టు గడచి వాఁ - డవ్వలఁ జనుచుఁ
జూచె మారీచర - క్షోవరాశ్రమము
నందు జటావల్క - లాదులతోడ
నిందుశేఖరు మది - నెపుడు భావించి
యొప్పు మారీచుఁ దా - నొయ్యన జేరి3010
యప్పుడు రావణుఁ - డానిశాచరుఁడు
దనకిచ్చు పూజలఁ - దనిసి యున్నంత
గనుఁగొని వాఁడు రా - క్షసరాజుఁ బలికె.
"ఇప్పుడే వచ్చితి - విటమున్నె పోతి
విప్పుడు మరలిరా - నేటికి నీకు?
మీకందఱికి సుఖ - మేకద? యేమి
వాకొన వచ్చి రా - వణ! చేరినావు?
మదిఁగలఁగెడు నాకు - మాటక తెలుపు
మిది" యన్న విని దాన - వేశ్వరుఁ డనియె.
-:రావణుఁడు సీతాపహరణమున మారీచుని సహాయముఁ గోరుట:-
"ఓయి! మారీచ! నీ - వొకడవేకాక3020
యేయెడ వెదకిన - నేఁ బ్రాపుఁ గాన!
ఖరదూషణాది రా - క్షసుల నందఱును
నరుఁ డొక్కఁ డెదురుగా - నక సంహరించె
జడియక మన జన - స్థానంబు చెఱిచి
కడులావుతో దండ - కాననంబునను
బదునాల్గువేలైన - పలల భోజనులఁ
జిదిమి వైచితిని - మీచింతలుదీరె"
ననుచు బీరములాడి - యందలిమునులు
తను మెచ్చ తమ్ముఁడు - దాను నున్నాఁడు
అందుపైఁ దనకది - యాలని యొక్క 3030
సుందరిఁ దెచ్చియుం - చుక యున్నవాడు
రాముఁడు మిగుల దు -ర్జనుఁడు మూర్ఖుండు
సోమరి యింద్రియ - సుఖపరవశుఁడు
కరినుఁడు క్రూరసం - కల్పుఁడు లోభి
శరుఁ డధర్మపరుం డ - సత్యవాదుండు
ముష్కరుఁ డధముఁడు - మూఢుఁ డజ్ఞాని
నిష్కారణంబుగ - నేఁడు శూర్పణఖ
చేరిన ముక్కునుఁ - జెవులునుఁ గోసి
యారయ మనకెల్ల - నపకీర్తిఁ జేసె
నందుకు బదులుగా - నతని యిల్లాలి3040
నందరు మెచ్చఁగ - నపహరించినను
మనమైలవాసి నె - మ్మది నుండవచ్చు
దనుజుల కెల్లనుఁ - దలయెత్తఁ గలుగు!
నాయన్న దమ్ములు - నన్నుగా నీస
హాయత గల్గిన - యట్టైన నాకు
నెదురింప నేర్తురే - యింద్రాదులైన
యదిగాక నీవు మా-యాబలంబునను
జతురుండ వగుట నా - సాహచర్యంబు
మతి నెంచి వచ్చితి - మనవిఁ జేపట్టి
కనకమృగంబ వై - కలధౌతరేఖ 3050
లను మీరి రత్నవా - లంబుఁ ద్రిప్పుచును
సీతముందఱ నటిం - చినఁ జూచి మెచ్చి
యాతన్వి పట్టి తె -మ్మని వేఁడెనేని
రామసౌమిత్రు లా - రామనుఁ గాన
నేమది వచ్చిన - నెలయింపు మీవు!
రాహుగ్రహంబు చం - ద్రప్రభఁ బట్టు
నూహచే నాసీత - నొడిచెద నేను!
ఇటులఁ జేసితిమేని - యింతిని బాసి
దిటదప్పి రాముఁ డా - ర్తిని మృతినొందు!
సులభమార్గం బిది - చూచితి రాము3060
గెలుచు నుపాయమే - క్రియ మఱి లేదు
రమ్మని ప్రార్థింప - రావణు మాట
రిమ్మవట్టింపు మా- రీచుఁ డిట్లనియె
-:మారీచుం డీయకార్యకరణమునుండి రావణుని మఱల్పం బ్రయత్నించుట:-
జగతిపై దొరల కి - చ్చకము గావలసి
మొగమోడి ప్రియవాక్య - ములు వల్కువారు
గలిగి యుందురు గాని - కడతేర్చు హితము
దలఁచి యెప్పటికి హి - తంబైన మాట
నుడువు వారలు లేరు - నూటవేయింట
నుడివిన వినువారు - ను ధరిత్రి లేరు.
ఇంద్రుని గుణముల - నెచ్చిన రామ 3070
చంద్రుని భుజశక్తి - శౌర్యదర్పములు
వేగులవారిచే - వినిన దోషమున
వేగనీయని యవి - వేకంబుఁ గప్పె
నెఱుఁగక యున్నాఁడ - వింతకోపించి
శరము రాముఁడు వింట - సంధించెనేని
చాటి చెప్పెదను రా - క్షసులను నట్టి
మాటయే లేకుండ - మహిఁ జుల్కఁ జేయు!
సీతనిమిత్తమై - చెడఁగోరితేని
నీతోడ నాతోడ - నే చల్లఁగాను
శ్రీరాము కోపాగ్ని - చే విశ్వమెల్ల3080
నీరయి లంకతో - నెఱవేరుఁగాని!
రావణ! నినువంటి - రాజును గొల్చి
చావ నేమిటికి రా - క్షసులకారణము,
నినువంటి కాముకు - నికి రాజ్యమేల?
తనవారి నావారి - తనమెంచనేర
నైనట్టి పని యయ్యె - నాస లీడేరి
హానిఁ జెందిన మంచి-దని యెంచేదేని
చెడిపోవుటయకాని - సీత పేరైనఁ
దడవిన యవుడే నీ - తల లుర్విఁ గూలు
రామదూషణము లూ-రక నీవు చేసి 3090
రామహాత్ముని నల్లి - యైన నాడుదురె?
కైకకు లొంగిన - కన్నట్టి తండ్రిఁ
జేకొని నిజమరిఁ-జేయంగఁ దలఁచి
పనులకు వచ్చిన - వాఁ డట్టిపరమ
మునివేషధారి రా - మునిమీఁద లేని
గుణము లారోపించి - కొన్నిదోషములు
గణుతించి పలికె దా - కాకుత్థ్సకులుని
రాముఁడు పరమధ-ర్మస్వరూపకుఁడు
రాముఁడు సత్యప - రాక్రమశాలి
యాయన దండ ను - న్నట్టి జానకిని3100
నీయట్టివాఁడుఁ దే - నేర్చునే బ్రదికి
మనయిరువురికిని - మంచికార్యంబు
మనసున దలచిఁ యీ- మాటలాడితివి!
బానుఁ డుండగఁబట్టి - ప్రభఁ దివియంగఁ
బూనుదురే! ఇట్టి - బుద్ధులు గలవె?
బాణాసనాదుల - పారకాష్ఠములు
బాణముల్ జ్వాలికా - పటలంబుగాఁగ
రణమను నీరసా - రణ్యంబులోనఁ
దృణముగా వీరదై - తేయసైన్యంబు
నేర్చు రాఘవవహ్ని - యేగతిఁ జేసి3110
యోర్చెదు మిడుతపై - నురికిన యట్లు?
చాపపాశము పూని - శత్రులం దునుమఁ
గోపించి యముఁడు మా-ర్కొని వచ్చినట్లు
వచ్చు రామునిఁ జేర - వశమె యొక్కనికి?
పిచ్చుక యెట్లు గు - ప్పించు వారిధిని?
యతని కోదండస - హాయంబు గలుగు
క్షితి తనూజాతఁ దె - చ్చెదనందురయ్య?
సింహవక్షుని దయా - సింధునిఁ బురుష
సింహుని శ్రీరాముఁ - జేరి యాసీత
ప్రళయానలశిఖా - భావంబుచేత 3120
వెలుఁగొంద కీ వెట్లు - వీక్షింపఁగలవు?
అకట! ఇట్టివృథా ప్ర-యత్న మేమిటికి?
సుకరంబు గాదు నీ - చూచినచూపు
రామునిఁ గినిసిన - రాలేవు మఱలి!
భూమి యేలుక సుఖం - బున నుండు మీవు
మనవిభీషణునితో - మంత్రులతోడ
మనసులోఁ గల - యట్టి మర్మ మేర్పరపి
యతనికి మనకు బ - లాబలంబులును
స్థితులును గుణదోష - చింతలు నరసి
వారలు చెప్పిన - వైఖరి నడవు3130
మారాముఁ జెనకి ద్రో - హము సేయనేల?
హిత మహితంబు న- వెంచక జనక
సుతఁ దెత్తునని చెడఁ - జూచెదవేల?
నీవు గల్గిననట్టి - నెలఁతలు నీకు
వేవేలు గలరేల - విడువు మీతలఁపు
-:పూర్వము శ్రీరామునిచేఁ దనకుఁగల్గిన భంగపాటును మారీచుఁడు రావణునఁకు జెప్పుట:-
ఇదిపరమార్థంబు - హితము నామాట
మదిఁజేర్చి లంకకు - మఱలిపొ మ్మీవు.
దనుజేంద్ర! తొల్లి భూ - ధరము చందమునఁ
దనువెత్తి యయుతవే - దండసత్త్వమునుఁ
గుండల మాణిక్య - కోటీరదివ్య3140
మండనంబులుఁ దాల్చి - మదగర్వరేఖ
దండకాటవి కేఁగి - తాపసోత్తముల
కండలు దిని దావుఁ - గడుఁగ్రొవ్వు దొట్టి
యున్నచో గౌశికుఁ - డొదిగి నావలన
జన్నంబుఁ దాఁజేయ - శక్తుఁడు గాక
నాదశరథుఁ జేరి యవనీశ! పలల
ఖాదులు నాదు యా - గము సాగనీరు.
అందుకు మీరాము -నంపుము దనుజు
లెందరు వచ్చిన - నితఁడు దండించు
ననవిని గాధేయు - నాదశరథుఁడు 3150
గనుఁగొని “తగునె రా - క్షసులతోఁ బోరఁ
బదియునాడేండ్ల యీ - బాలకునంప
నది యేటిమాట? య - స్త్రాభ్యాసశక్తి
చాలదు వీనికే - సైన్యంబుఁగూడి
తోలుదు దానవా - దుల సంగరమునఁ
జలమేల" యనిన వి - శ్వామిత్ర మౌని
యలుక తోడుత నమ్మ - హారాజుఁ జూచి
“మారీచుఁ జంపనో - మనువంశ తిలక!
శ్రీరామునకెకాక- శివునకుఁ దరమె?
ఎవ్వనిచేఁ దీర - దితనిచే వాని 3160
క్రొవ్వడగింతు నీ - కుదరంబు గాదు
బలవంతుడవు శౌర్య - పరుడవు కయ్య
ములను రాక్షసబలం - బులు ద్రుంచినావు.
అందులో నొకఁడుగా - డల తాటకేయుఁ
డందుపై రావణు - ననుచరుఁ డతఁడు
అతులతేజస్వి నీ - యాత్మజుఁ డొకఁడె
యతనికి మృత్యువా - యనవచ్చెనేని
నాజన్న మీడేరు - ననునమ్మి వెంట
నో జనవర! పంపు - ముఱక రాఘవుని."
అనితోడి తెచ్చి తా - యజ్ఞంబు సేయ 3170
ధనువంది రాముఁ డ - త్తరిఁ గాచియుండ
నితనిసత్తువ నమ్మి - యిచ్చిరి మునులు
హుతవహునందు నా - జ్యోపహారంబు
లాపొగలేఁజూచి -యాఁపఁగారాని
కోపంబుతోఁ గౌశి - కుఁడు మొఱవెట్ట
బాలుఁ డీతండని - పదరి యయ్యాగ
శాలలో రక్తమాం - సంబులు గురియఁ
జంపనొల్లక యొక్క - శరముచేఁ దన్ను
గొంపోయి జలధిలోఁ - గూలంగవైచె!
తలక్రిందుగాఁ బడి - తామూర్ఛవోయి 3180
విలవిల దన్నుక - వెసఁ గన్నుఁ దెఱచి;
శరమిట్లు నూరుయో - జనములు దెచ్చి
శరనిధిలో వైచి - చంపకపోయె!
అది యౌర! రామాజ్ఞ - యౌర! రామాస్త్ర
మిది యౌర! తనపుణ్య - మింతియే చాలు
నని లంకఁ జేరితి - నట్టి శ్రీరాముఁ
గినిసి మేల్మఱచి యేఁ - గీడు సేయుదునె!
కాదని యేమైనఁ - గనిపించుకొనిన
లేదు ప్రాణంబు దా- ల్చి పురంబుఁ జేర!
సుకసుఖంబుననుండి - చూపోపలేక 3190
యకట! యీకీడు సే - యఁదలంచి నపుడె
లంకయుఁ జెడు దైత్యు - లకు హాని వచ్చు
శంక యేమిటికి ని - జంబె పల్కితిని!
పామున్న మడుగులోఁ - బక్షీంద్రుచేత
నామీనసంఘంబు - హతి వొందినట్లు
రామాపకారంబు - రావణ! నీవు
కామించి చేసి రా - క్షసులఁ జంపెదవు
నీవు చూచుచునుండ - నీవార లెల్ల
రావణసంగ్రామ - రంగంబులోనఁ
బడిపోవ శేషించు - పాఱుఁబోతులను3200
వెడమతినై చూచి - విలపింపఁ గలవు.
ఆలంకలోని గే-హములు బాణాగ్ని
కీలల భస్మమై - కెడయఁ జూచెదవు
రావణ! యన్యదా - రపరిగ్రహంబు
సూవె పాపముల కె - చ్చో నాలయంబు
నీ కులసతులతో - నిత్యసౌఖ్యములు
జేకొని రమియింపు - సీత యేమిటికి!
సతుల ప్రాణములు రా - జ్యము గోరితేని
మతిఁ దలంపకుము రా- మద్రోహ మీవు
కాదని సీతపై - గమనంబు నీకు3210
ప్రాదుర్భవంబైనఁ - బడుము దుఃఖముల,
విను మింక నొకటి యా - విలుకాండ్రమేటి
వనవాస మీ డేర్ప - వచ్చిన వెనుక
దానవుల్ వెంట ని - ద్దఱు తోడుగాఁగ
యేను వారును వింత - మృగరూపములను
మెఱుఁగుఁ గోఱలు గబ్బు - మేనులు మెఱయఁ
జరియించుపుచును మహా - శ్రమములఁ జెఱచి
మునులను జంపి య - మ్ములుజిక్క మెసవి
వనములు నుగ్గాడి - వచ్చి తొల్లింటి
తనపగవారి మీఁ - దట నున్నకతన3220
జనకజరామల - క్ష్మణులపైఁ గదియ
నారాఘవుండు మూఁ - డమ్ముల నొక్క
సారిగాఁ దొడఁగి మా - పరువులు జూచి
పడవేయఁ బూనినఁ -బారిపోవుటకుఁ
బడుపాట నాకు దె - ల్పఁగరాదు నీకు!
మన్ను రామునిసత్త్వ-మును బాణశక్తిఁ
గన్నట్టివాఁడనై - గ్రక్కునఁ దొలఁగి
వచ్చి రోషమున స - ర్వంబును రోసి
యిచ్చోట సన్యాస - మేను గైకొంటి
నందుచే నిఁక దక్కె - ప్రాణంబు లనుచుఁ3230
దుందుడుకారి యిం - దు వసించినాఁడ
కడమ యిర్వురును రా - ఘవుని బాణములఁ
గడతేరి యమపురిఁ - గా వున్నవారు!
ఏచుట్టు చూచిన - నిరువురు వయసు
రాచబిడ్డలు నొక్క - రమణియుఁ గూడి
ముని వేషములను నా - ముందఱ నిల్చి
ధనువులతోడ న - స్త్రములు సంధించి
యంతకునట్లు పా -యక యున్నవారు
చెంతకు నీవు వ - చ్చినవేళనుండి
మున్ను నేఁగాన రా - ముని విశ్వరూప3240
మెన్నండు నీరాక - నిపుడు గన్పట్టి
రామమయంబై ధ - రాచక్రమెల్ల
నామదిఁ దోఁచె ని - న్నటి కలలోన
వెఱచి నేఁబాఱ నా - వెంట రాఘవుఁడు
తరుముక రాఁ గాంచి - తల్లడించెదను
అది నిమిత్తముగ ని - ట్లాడితి వీవు
బ్రదుకనిత్తువె యెంత - ప్రాలుమాలినను?
నాకు రకారాది - నామముల్ భీతిఁ
జేకూర్చె రాముని - చేఁ జిక్కినట్ల
రమ్మనకుము నన్ను - రథము పైనెక్కి3250
పొమ్మనకుము రత్న - పుమృగంబ వగుచుఁ
బిలువుమంచనకుము- విను రావణాఖ్యఁ
బిలిచినఁ బలుక - ప్రేమ దశాస్య
నామధేయముఁ బూని - నా చెంత మెలఁగు
మేమఱియును రాము - నిఁకఁ దలంపకుము!
నే వెఱచిన యంత - నీవును వెఱతు
వావల వెఱతు రిం - ద్రాదిదేవతలు
బలినముచులనైన - బాణజాలములఁ
బొలియించువార లి-ప్పుడు మారుకొనిన!
ననుఁ బ్రోచి నీదు మా - నంబుఁ బ్రాణంబు3260
మనికియు వేఁడిన - మాను మీమాట
యొకరినిఁ జెఱచుట - యుత్తమపురుషు
లకు నెల్లలోకంబు - లకు హానిగాన
హితముఁ దెల్పెదఁ దగ - వెంచి యీమాట
మతియించి యిఁకనైన - మాను మీచలము
బ్రదికియుండినఁ జాలు - పదివేలు వచ్చె
నిదిమాకు నేల నీ - వెటు వోతి వేమి?
నీ వెంట రానొల్ల - నినుఁ జేరనొల్ల
నీవాఁడగా నిది - నేనెంచి కాదె
సన్యాసినైతి మ - చ్చర మేల నాకు3270
నన్యాయపరుని వా -క్యము లేలవిందు
నాచుప్పనాతికై - యఖిలదానవులుఁ
జూచు నంతటిలోనఁ - జూర్ణమై పడిరి!
అది వచ్చి బోధింప - నని కేఁగి ఖరుఁడు
నెదవ్రయ్య వ్రాలె మ - హీస్థలియందు
నీవు నాముక్కిడి - నిర్భాగ్యురాలి
చేవలం దవిలి యీ - చేటు కోర్చితివి
వలసిన వినుమట్లు - వలదేని ఖరుఁడు
పొలిసినగతి నీవుఁ - బొలియుదు వచట”
-:రావణుఁడు మారీచుని హితోక్తులకుఁ బెడచెవిఁబెట్టి సీతాపహరణములో సహాయము చేయనిచో వానికి తనచేఁ జావు సిద్ధమని చెప్పుట:-
అని యిట్లు మారీచుఁ - డాడిన మాట3280
తనకు రోగికి నౌష - ధంబునుఁ బోలి
పథ్యంబుగాఁ గణిం - పక వాని బుద్ధి
మిథ్యగా నెంచి న - మ్మిక లేక పలికె
"చవుటినేలలయందుఁ - జల్లిన బీజ
నివహంబుకైవడి - నీమాట లెల్ల
బనిఁ గొన నేరవి - ప్పటికి నాయెడల
నని యేల రాముతో - ననిపల్క నేల?
తలిదండ్రులకుఁ గాక - తన సీమ విడిచి
కలిగిన బంధువ -ర్గము పొత్తువాసి
తప్పక యొకయాడ - దాని మాటలకు3290
నిప్పుడీ యడవుల - నిడుమల కోర్చి
పాపియై చెడి చెట్లఁ - బట్టినవాని
ప్రాపున మన్నట్టి - పరదేసి పడుచుఁ
బట్టిన యంత నా - పద వచ్చెనేని
యిట్టి పాటి విభుత్వ -మేటికిఁ దనకు!
లేక యేమాన ధా - త్రీతనూజాత
నీకార్య మింద్రున - కేని గాదనఁగ
వచ్చునే? నీతి యె - వ్వరు తెల్పువార
లచ్చోట లేరని- యడుగ వచ్చితినె?
మేలైనఁ గీడైన - మేలు నీవట్టి 3300
యాలోచనలు మాను- మాత్మలో నేను
సీతను దెచ్చుట - సిద్ధంబు తనదు
నీతి పరస్త్రీల - నెమకి పట్టటలు
రాజు వేఁడిన మంత్రి - రాచకార్యములు
తేజంబు విభునకుఁ - దేవేఁడియైన
నుపచారములు వల్కి - యొదుఁగుచుఁ దగిన
యపుడు మెల్లని మాట - లాడినట్లాడి
మఱి యొక్క తఱి తన - మతముగా విభుని
మఱలించుకొని తన -మాటఁ జెల్లించి
నడచినఁ దగుఁగాక -యప్రయాసంబు3310
తడవక హృదయ మిం - తయుఁ గానలేక
వెగటుగాఁ బల్కిన - వినినఁ బూజార్హుఁ
డగు రాజు సైరించు - నా వెఱ్ఱివాఁడ!
అనలుని వేఁడిమి - యమరేంద్రు శౌర్య
మునుఁ జంద్రుని ప్రసాద - మును బాశపాణి
దండశక్తియు భాను - తనయుని సమత
నిండార విభుని కి -న్నిగుణంబు లునికి
రాజులు మహి నెల్ల - రకుఁ బూజ్యులగుట
యోజింపనేర కి - ట్లొంటి నీకడకు
వచ్చినవాని దు - ర్వచనము ల్వలుక 3320
వచ్చునే యెఱుఁగని - వాని చందమున?
నినుఁ గార్యమడిగితి - నీచేతనైన
పని నీవొనర్పుము - పసిఁడి మెకంబు
మేనెత్తి సీతాస - మీపవనంబు
లోనఁ గుమ్మరిన నా - లోకించి సీత
పట్టి తెమ్మని రాముఁ - బనిచిన నతఁడు
పట్టఁ జేరినఁ దగు - ల్పడక కేడించి
దూరంబుగాఁ బోయి - తోడ రాఘవుని
శారీర మున్నట్లు - జానకి వినఁగ
" హాసీత హాలక్ష్మ- ణా "యనిపలుక 3330
నాసద్దువిని రాము - నరయు మీవనుచుఁ
బనుపు లక్ష్మణుఁ బిల్చి - పనిచిన నతఁడుఁ
జను నొంటిగాఁ బర్ణ - శాలలోనున్న
సీతనప్పుడు జేరి - చెఱవట్టి మఱల
నే తెంతు శచిఁ దెచ్చు - నింద్రునిరీతి
నీకార్య మీ డేర్ప - నెల్ల రాజ్యమున
నీకు సగంబిచ్చి - నే మెచ్చియుందు
కదలు మిప్పుడె దండ - కావనంబునకు
నిదె రథం బెక్కి యే - నేతెంతు వెనుక
జగడంబులకుఁ బోక - జానకి నురక 3340
తగిలించుకొని కృతా - ర్థతనుండువాఁడ
నిటు సేయవేని యే - నిప్పుడ నిన్ను
నటునిటుఁ బోనీక - యసిఁ ద్రెవ్వనేతు!
ఏలిన దొరతోడ - నెదురాడువాఁడు
మేలొంద నేర్చునే - మేదినియందు!
మృగమవై యిపుడ పొ - మ్మీవు పోయినను
బగఱచేఁ జావును - బ్రదుకు సందియము
వోవ లేననిన ని - ప్పుడె నాదుచేతఁ
జావు సిద్ధము నీకు - సరిపోయినట్లు
నను" మన్న రాజు నే- నను నహమికను3350
దను వీఁడు కాదన్న - దండింతుననియె
నిందుకు బెదరుదునే - యని తలంచి
క్రిందు మీఁదరసి మా - రీచుఁ డిట్లనియె
-:రావణుని మూర్ఖతకుఁ జింతించి మారీచుఁడు మఱల హితోపదేశము చేయుట:-
రావణ! పుత్రమి - త్రకళత్రసహిత
మీ వేళ నినుఁ ద్రుంప - నిచ్చలోఁ దలఁచి
యెవ్వఁడు బోధించె - నీబుద్ధి నీకు?
నెవ్వఁడు పాపాత్ముఁ - డిట్ల నీమేలు
చూపోపఁజాలక - చొరరాని చోటు
లీపగిదినిఁ బ్రోవ - నిచ్చకంబాడె?
నీకు మృత్యువును స- న్నిహితంబు చేసి 3360
యీకీడు దలఁచువాఁ -డెవ్వఁ డున్నాఁడు?
నిను మించిన బలుండు- నీబలం బడఁప
మనసున నెంచి యీ- మరులు పుట్టించె
మర్యాద మీఱుచో- మంత్రులు తగిన
కార్య మాలోచించి - కన్నయర్థంబు
నిలువనాడక యున్న - నిగ్రహింపంగ
వలయుఁగావున నట్టి - వైపు చింతింపు!
రాజైనయతఁడె మ - ర్యాదఁ దప్పినను
భూజను లెట్లు కా - పురము సేయుదురు?
దొర మంచివాడైఁనఁ - దోఁచినమాట 3370
వెఱవక మంత్రులు - విన్నవింపుదుదు.
అతిశయింపఁగ నీతి - యవనిఁబాలించి
నతనివే సుమ్ము ధ - ర్మార్థకామములు
నీతి లేదేని వా - నికి నేమి లేదు
హేతువౌ నతఁ డుర్వి - నెల్లఱఁ జెఱుప
రాజమూలంబు ధ - ర్మముగాన మంత్రు
లేజాడఁ బతియందు - హితులు గావలయు
క్రూరుఁడై తా ప్రతి - కూలుఁడై నీతి
దూరుఁడౌ నతని కెం - దును మేలురాదు
ఒరకంబులను రథం - బుర్విపైఁ గదలు 3380
తరిఁజూచి చక్కని - దారిగా గడపు
సారథిగతి మంత్రి - సన్మార్గమునకు
భూరమణుల చిత్త - ములఁ ద్రిప్పకున్న
నిరువురకును హాని - యేకాన నీకుఁ
బరమధర్మంబు నా - పలుకు సేయుటలు
కానివాఁడొక్కఁ డొ - క్కప్రయోజనంబుఁ
దాను సేయ ననేక - ధార్మికావళికి
నవరోధములు పుట్ట - వధిపతి నేర
మువనీజనుల కెల్ల - నాపదల్ సేయు!
నక్క వాకిలి గాచి - న మృగంబు లేమి 3390
యక్కరల్ దీరి సౌ - ఖ్యము లందఁగలవు?
తెలియక యటుల యిం - ద్రియపరుఁడైన
యిలఁపతిచేఁ సౌఖ్య - మెవ్వ రొందుదురు?
కాకతాళన్యాయ - గతి ఘోరమైన
నీకీడుతలఁపు హా - నికి మూలమయ్యె!
పోయినయపుడె చం - పును మృగరూపు
మాయావిఁ దన్ను రా - మశిలీముఖంబు
తనుమాత్రమునకు సీ - తాకాంతుఁ జేరఁ
జని చూచినంతలోఁ - జావు సిద్ధంబు
సీతను నీవు దె -చ్చితివేని వెనుక3400
నీతోడ లంకతో - నిమిషమాత్రమున
దానవులెల్ల హ - తంబు గాఁగలరు
మాను మీతగని కా - మము దాన వేంద్ర!
హితము నాపలుకని - యెంచవు దైవ
గతిచేత నవసాన - కాలంబు చేరె
అట్టివానికి నేల - యాప్తని మాట
పట్టియుండును? చల - పట్టుటేకాక
నీవు చంపెదనన్న - నీచేత నేల
చావఁగావలయు? న - చ్చటనె యౌఁగాక!
నీచేతి చావుచే - నిరయంబు రాముఁ 3410
జూచి వచ్చిన మోక్ష - సుఖమును గలుగుఁ
యమగదాదండమై - యకట! యీబుద్ధి
సమకూరె నీకు నా - సలు దీఱె నాకు
పోదము రమ్ము గొ - బ్బున మున్నుగాఁగ
నే దండకాటవి - నేఁడె చేరెదను
మించనాడితి నీకు - మేలవుఁగాక
యంచితివే నను"- నంచు బల్కుటయుఁ
-:రావణునితోఁ గూడిపోయి మారీచుఁడు మాయామృగ మగుట:-
గౌఁగిలించుక దశ - కంధరుం డలరి
యౌగాక యని వాని - కప్పు డిట్లనియె.
పరమాప్తుఁడవు శార్య - పరుఁడవు దైత్య3420
వరు లెందఱైన నా- వారు గల్గియును
నింతవాఁడని నిన్ను - నెంచి యిట్లొంటి
నింతదూరము వచ్చి - యే వేఁడుకొంటి
నెవ్వఁడవో యైతి - వింతపర్యంత
మివ్వేళ నిన్ను నీ - వెఱిఁగి పల్కితివి
రత్నమయంబు నా - రథమెక్కి కదలి
యత్నంబు గనుము మా - యామృగాకృతిని."
అని రథారూఢుఁడై - యతఁడును దానఁ
జని చని కొన్ని దే - శంబులు గడఁచి
దండకావనము చెం - తకు నేఁగి యచట3430
నుండి కాంచనరథం - బొయ్యన డిగ్గి
తాను మారీచు హ - స్తముఁ గేలఁ గూర్చి
వానితోఁ బ్రణయపూ - ర్వకముగాఁ బలికె
"ఆపొన్న పెనుమఱ్ఱి - యండనే యున్న
యీ పొన్న గుంపుల - కీవలిచాయ
నరఁటితోటకుఁ దూర్పు - నందు రాఘవుఁడు
చరియించునది పర్ణ - శాల వీక్షింప
సీత యిచ్చోట వ - సించు నిందులకు
నీతలంచిన యట్ల - నీ వేఁగు" మనిన
-:మారీచుఁడు బంగారు లేడి రూపము ధరించుట:-
మారీచుఁ డపుడాత్మ - మాయాప్రపంచ3440
మారావణుఁడు మెచ్చి - యవునని పొగడ
మరకతమణిభాస -మానశృంగములు
వరుణోత్పలచ్ఛాయ - లమరుమొగంబు
నీలనీలప్రభా - న్వితకర్ణములును
జాలఁ గాంచనరుచుల్ - చల్లుకంథరయు
నింద్రనీలపుముక్కు - హీరమరాళ
చంద్రసన్నిభమైన - శాతోదరంబు
గొప్పవైడూర్యముల్ - గూర్చినయట్ల
యిప్పపూవులచాయ - నెసఁగువాలంబు
గోమేధికంబులు - గొరిజలు వెండి 3450
కామలవలె సోయ - గము లైన కాళ్లు
ముత్తెపుఁబొడలు కెం - పుల మూపురంబు
లత్తుకచ్ఛాయఁ జె - లంగు కందంబు
కురువింద నయనముల్ - క్రొవ్వాఁడి చూపు
లరుదు మీఱఁగ మృగం - బై పొడసూపి
చెట్టుల కెగఁబ్రాకి - చివురులు మెసవి
గుట్టలు చంగు చం - గునఁ జౌకళించి
సీతముందఱ వ్రాలి - చిత్రమృగంబు
ధాత వ్రాసిన వ్రాఁత - తను నెచ్చరింప
బోవుఁ గ్రమ్మరఁ జూచుఁ - బోవక మఱలు 3460
తావు లాస్వాదించు - దాఁటు నట్టిట్టు
మెల్లనే నడచు భూ - మిని బొడల్ వెట్టు
నొళ్లు జాడించు మే - నూరక విఱుచు
సెలవులఁబచ్చిక - క్షితిమీఁద రాల్చుఁ
దెలియక తననీడ - దృష్టించి బెగడు
మృగముల వెన్నాడు - మింటికి నెగయు
జగతిపైఁ బవళించు- జవమునఁ బఱచు
వెనుకొని మృగిఁ జేరి - వెనుకఁ జక్కట్లు
తన మోము చాచి యెం - తయు మూరుకొనుచు
దివిఁ జూచు చూచి నల్ - దిక్కులుఁ జూచుఁ 3470
గవియు నుంకించు నే - కడ కాలుఁద్రవ్వ
మెకముపైఁ బాళిచే - మేపు వర్జించి
యొకవింతరవముతో - నుఱకవాచఱచు
మారీచుఁ డీరీతి - మాయలు జేసి
యారామమున నిట్టు - నట్టు మెలంగ!
పువ్వులుఁగోయుచు - భూమితనూజ
దవ్వుల వనదేవ - తయుఁ బోలి మెలఁగఁ
గనిపించుకొనిన నా - కపటమృగంబుఁ
గనుఁగొని యాశ్చర్య - కలితయై యుండ
నపు డింద్రధనువు చా - యను మేను మెఱయ3480
విపులపై నూరక - వేడంబు వెట్టి
కొఱవిఁ ద్రిప్పిన మాడ్కి - గుజరాతికెంపు
మెఱుఁగులు నెమ్మేన - మిన్నెలఁ బొదువ
మఱియుఁ జెంతకు వచ్చి - మాటకు నేఁగి
వెఱచినగతిఁ బారి -వెఱవకఁ జేరి
మెలఁగుచో జానకి - మృగశాబకంబు
చెలువంబుఁ జూచి మె - చ్చి ముదంబు వొదల
రామాశిరోమణి - రామలక్ష్మణులఁ
బ్రేమఁ గొబ్బునఁ జేరఁ - బిలిచిన వారు
వచ్చి యామృగము చె - ల్వమునుఁ జేష్టలునుఁ3490
బచ్చని మెఱుఁగునుఁ - బరికించి చూచి
కన్నుల విందుగాఁ - గని మెచ్చునట్టి
యన్నతోఁ సౌమిత్రి - యపు డిట్టు లనియె.
-:బంగారులేడి మారీచుని మాయ యని శ్రీరామునితో లక్ష్మణుఁడు చెప్పుట:-
"మృగము కాదదియు మా- రీచునిమాయ
యగునని దోచె నా - యంతరంగమున
వేటలాడుచు వచ్చి - వీఁ డాచరించు
బూటకంబులఁ జిక్కి - పొలిసినయట్టి
రాజులు గడు నపా -రము వీని జాడ
లీజటివరు లెల్ల - నెన్నికొనంగ
వినియుందు నిటువంటి - వింతమృగంబుఁ3500
గనినట్టివార - లెక్కడనైనఁ గలరె?
ఇది వాని మాయయౌ - నేల సందేహ
మది యేల మనకు రం - డని” పల్కుటయును
విని యెఱుంగక విధి - విహితమౌ బుద్ధి
తనుఁ జెడ రేఁప సీ - తాకాంత పలికె.
-:బంగారులేడిని పట్టితెమ్మని సీత శ్రీరాముని వేఁడుట:-
"స్వామి! రాఘవ! యిట్టి - చక్కని మృగము
సీమలన్నియునుఁ జూ - చితి మెందులేదు!
ఇది మనోహరరేఖ - నింపు పుట్టించె
మదికిఁ బట్టుకరమ్ము - మనవిఁ జేకొమ్ము
పట్టణం బెడవాయు - పదియుమూఁడేండ్ల 3510
కిట్టి వేడుక నాకు - నీక్షింపఁగలిగె!
సతతంబు మన పర్ణ - శాల ముంగిళ్ల
నీతర వన్యమృగాళి - నెల్లఁ జూచితిని.
ఏనాడుఁ జూడ లే - దిది నవరత్న
నానావిభాసము - న్నతమై చెలంగె
తనురూపలక్ష్మిచే - తనుజూడఁ జూడఁ
గనుపండువయ్యె నీ - కాంచనమృగము
వింటిరే! చెవులకు - విందులై నులుల
నంటిన దీనిసో - యగమైన పలుకు!
కడమ యొండొక్కటిఁ - గ్రమియించి యిచటఁ3520
దడయక మనమయో - ధ్యాపురిఁ జేరి
పడకయింటికి వెల - పలి చప్పరమున
సడలని యపరంజి - సరిపెణ ల్గట్టి
పెంచఁగోరెదను చం - పిన గాదు దీని
వంచించి పట్టి తే - వలయును మీరు.
అచటి యత్తలు భర- తాదులుఁ జూచి
యచలితానందంబు - ననుభవించెదరు.
దీని ప్రాణములతోఁ - దెచ్చు మార్గంబుఁ
గానకుండిన చంపి - కవచంబుఁ దిగిచి
యాయజినంబుపై - నాసీనుఁ జేసి3530
నాయభీష్టంబు లె - న్నటికిఁ జెల్లింప
నీరీతిఁ బతులతో - నింతులు పలుక
మేరగాదైన నీ - మృగముపై మిగులు
నాసక్తి గలిగియు - న్నది" యని చలముఁ
చేసి పొమ్మని పల్క - సీతపైఁ గరుణఁ
దనకును వేఁడుక - దానిపైఁ గలిగి
యునికిచే శ్రీరాముఁ - డొకమాట పలికె.
“లక్ష్మణ! చూచితే - లలితవిలాస
లక్ష్ములచేతఁ దొ - లఁగ కీమృగమ్ము
నందనవనములో - నను చైత్రరథము3540
నందులో నట్టి సా - రంగంబు లేదు
కనకరోమంబులు - గల యీమృగంబుఁ
గను మావలించినఁ - గనుపట్టు నాల్క
సురుచిరరత్నరిం - ఛోళిచేఁ బొలిచె
మెఱుపు మేఘములోన - మెఱసిన యట్ల
నిగనిగ మనునింద్ర - నీలంపు బరణి
మొగముగాఁదగఁగ సొం - పు వహించె మృగము
కమనీయ శంఖము - క్తానిభం బగుచు
రమణీయమగు నుద-రంబు దీనికినిఁ
జెలువొప్పఁ బట్టితె - చ్చెదు గాకయన్న 3550
విలుకాండ్రు రాజులు - వేఁటమార్గముల
వెలువడి మనసుల - వేడుకల్ దీర
పొలసుగావలసి చం - పుదురు జంతువులఁ
గాంచన రత్నాది -కంబులు సంత
రించుటకై ఖని - శ్రేణిఁ ద్రవ్వుదురు.
అందుచే బొక్కస - మధికమై వృద్ధిఁ
బొందు నానాఁట నె-ప్పుడు నినలేదె!
తనమది శుక్రుండు - దలఁచిన యంత
ధనము బొక్కసమిండ్ల - దఱుగకయుండు
కైవడి నొక్కచోఁ - గలదు లేదనెడు 3560
యావిచారము మాని - యత్నంబు సేయ
నది సఫలం బగు - నని యర్థశాస్త్ర
విదులైన యట్టి కో - విదులు వల్కుదురు.
ఈ మనోహరమైన - మృగమునుజూచి
భూమి నెవ్వరికైనఁ - బొడమదె యాశ!
ఈచర్మమున వసి - యింప నీసీత
యాచించెఁ జూచిన - యప్పటినుండి
కాదనకుము తెత్తుఁ - గదలి మృగంబుఁ
గాదిది ప్రియ కియం - గాదు ప్రవేణి
యనుమృగోత్తమముగా - దానికి ననుఁగఁ3570
దనరునట్టిదిగాదు - తలఁప నీమృగము
నవి దీనితో సాటి -యనరాదు నేఁడు
దివినుండి చంద్రుని - దేహంబు విడిచి
వచ్చెనో! రాక్షస - వరులు మాయావు
లిచ్చోటి కీరీతి - నేతెంచినారొ!
అటులైనఁ జెయ్యిగా - యక తిత్తియొలిచి
యిటుఁ దెచ్చి జనకజ - కిత్తు నీక్షణమ
మారీచుఁ డంటివి - మాయావి రాచ
వారల మును వీఁడు - వధియించినాఁడు
కావున వీని వే - గమె యాజ్ఞ చేసి3580
నేవత్తు నిచ్చోట - నీవుండు మిపుడు
వాతాపి ఋషులకు - వంటయై వారి
నేతరి తాఁ బొలి-యించి మించుటయుఁ
దాను జూలుగ నశ్వ - తరియను దాని
దానిగర్భంబు వి - దారించినట్లు
మును హింసనొనరింప - మొనసి యగస్త్య
ముని వాని దన తేజ - మునఁజంపినట్లు
మనము లీఁ జెనఁటిని - మారీచు నీచుఁ
దునుముదు సీతనా - తోనేమి వల్కు
నట్టి గార్యము సేయు - నదియ నాపూన్కి3590
పట్టి తెత్తును దీనిఁ - బడనేసియైన
దీని చర్మము గొని - తెత్తు నేమఱక
జానకిఁ గావు మి - చ్చట మనకెపుడు
నతఁడును నీవు బ్ర-యత్నంబుచేత
క్షితిసుతఁ గాచిర - క్షింపుఁ డేమరక
-:శ్రీరాముఁడు బంగారులేడిని పట్టుటకు బయలుదేరి దానింజంపుట:-
అనుచుఁ గట్టడి చేసి - యారఘువీరుఁ
డనుపమ ఖడ్గబా - ణాసనాస్త్రములు
కైకొని కదలినఁ - గని యామృగంబు
పోక దవ్వుగఁ జెంతఁ - బొడచూపి కడసి
యేమఱి నటులుండె - హెచ్చులు లేక3600
తామాయమై పోయి - తగులక యనుచు
తిరిగిరాఁజూడ నం - తికమునఁ జెట్టు
మఱుగుఁ జేసుక నిల్చి - మరియుఁ చేరుటయు
నల్లంటు వడదాఁటి - యావల పోక
మళ్ళిపోవఁగనీక - మరులు పుట్టించి
యమ్ము నందింతునో యని యెంచు రాము
నెమ్మది యెఱిఁ గిఁక - నీకాననముల
నెక్కడికో పోయి - యీమాటలోనఁ
గ్రక్కునఁ జెంగటఁ - గనుపించి దాఁటి
చేతి కందినక్రియ - జిక్కెఁ బొమ్మనఁగ 3610
యేతరి గనరాక - యెలయింపఁ జూచి
యిది దానవులమాయ - యే తప్పదనుచు
మది నెంచి ప్రకుపిత - మానసుం డగుచు
దీనిఁ జంపుదునని - తెలివితోఁ ద్రోవఁ
బూని చేచాఁచి యం - బుజమిత్రకిరణ
సన్నిభంబగు నొక్క - శర మేర్చి తివిచి
కన్నుఁదామరల చెం - గావి గీల్కొనఁగఁ
దిన్నగా వింట సం - ధించి వేయుటయు
మిన్నంది బ్రహ్మని - ర్మితమైన శరము
మాయామృగంబైన - మారీచహృదయ 3620
మాయెడ రెండు వ్ర - య్యలుగాఁగ విరియఁ
బిడుగుకైవడి నాఁటి - భేదింప వాఁడు
పొడవుగా నొకతాటి - పొడవున కెగసి
కూయుచు నిలఁబడి - ఘోరరూపమున
మాయామృగాకృతి - మాని రావణుఁడు
తనకుఁ జెప్పిమాట - తలఁచి రాఘవుని
యనుపమస్వరముతో - నన్నిశాచరుఁడు
'హాసీత! హాలక్ష్మ -ణా!" యని యవని
నాసురాకృతిఁ బడి - ప్రాణముల్ విడువ
మణిభూషణములు హే - మకిరీటవరము3630
మిణుగురుల్ రాల్చు ను - న్మీలితాక్షులును
మెఱుఁగుఁ గోఱలు గల్గి - మేదినిమీఁద
హరిహయుచేతి వ - జ్రాయుధాహతిని
బడిన కొండయు బోలి - పడియున్నవాని
జడుని మారీచరా - క్షసుఁ దేరి చూచి
సౌమిత్రి మున్నె యె - చ్చరికగాఁ దెలుపు
నామాట నిజమని - యాత్మలోఁ దలఁచి
"హాసీత! హాలక్ష్మ - ణా! యనురవము
చేసి కూలెను వీడు - సీత యామాట
విని యేమి యయ్యెనొ - విన్న సౌమిత్రి3640
తనమది నేమని - తలఁచునో యకట!”
అని యెంచి మదిలో భ - యమ్ము దుఃఖమునుఁ
బెనఁగొనఁ జానకీ - ప్రియుఁ డొక్కమృగము
చంపి తదీయమాం - సం బరఁటాకు
చింపి లోఁ బొటిలంబు - చేసి కైకొనుచుఁ
దమ యాశ్రమము త్రోవఁ - దడయక వచ్చు
సమయంబునందు న - చ్చట మహీతనయ
విననైన తన ప్రాణ - విభుపోయి నెలుఁగు
చెనఁటిదానవునిచేఁ - జెవిసోఁకుటయును
విని గుండెలవియ న - వ్వెలఁది సౌమిత్రిఁ3650
గనుఁగొని మై నడఁ - కఁగ నిట్టులనియె
-:ఆర్తనాదము విన్నసీత లక్ష్మణుని శ్రీరాముని సహాయమునకై వెళ్లుమని
చెప్పుట:-
“సౌమిత్రి! యిప్పుడు స్వ - స్థానముల్ దప్పి
నామేనిలోనఁ బ్రా - ణములు చలింపఁ
దనపతి యార్తనా -దము వినవచ్చె
నినువంటి తమ్ముఁ డుం - డియు నిట్టులయ్యె
నీ ళ మీయన్న - నీవు రక్షింపు
మావల నొక దైత్య - హర్యక్షమునకుఁ
జిక్కెను వృషభమై - శ్రీరామచంద్రుఁ
డొక్కఁడు కానలో - నురక పొమ్మంటి
శరణుఁ బొందిన యన్న - చాలఁ జేపట్టి3660
కరుణతో రక్షింపు - కదలి పొమ్మిపుడె"
ననుచు నాపన్నయై - యడలంగ వినియ
విననట్టెయున్న భా - వించి లక్ష్మణునిఁ
గనుఁగొని సహియింప - గాలేక జనక
తనయ నిష్ఠురభంగిఁ - దానిట్టులనియె
"ఇట్టిచో లక్ష్మణ! - యీవు బోనపుడె
గట్టిగా హితుఁడవు - గావు శత్రుఁడవు!
ననువేఁడి నాప్రాణ - నాథుని చావు
మనసులోఁ గోరి యీ - మాడ్కి నున్నావు
రాముని మేలుఁ గో - రకయున్న నిన్ను 3670
నేమి వల్కఁగ నేర్తు - నెటువలె నోర్తు?
నినువంటివానికి - నేఁ డిట్టిబుద్ధి
చనదు పొమ్మని ల -క్ష్మణుఁ డిట్టులనియె,
"ఓయమ్మ! యిటులాడ - నుచితమే నీకు?
మాయన్న ననిలోన - మార్కొని నిల్వ
యక్షరాక్షసదాన - వామరవరులు
లక్షించి యతని యా- లముఁ జూడఁగలరె?
నరమృగపశుపక్షి - నాగవల్లభులు
దురములో రాము నె - దుర్కొనఁగలరె?
నన్ను నిట్లేల మా - నము తూలిపోవ3680
మన్ననఁ దప్పి యీ - మాటలాడెదవు?
వలదమ్మ! నీ ప్రాణ - వల్లభుతోడ
గలనిలో నెదురింపఁ - గా నెవ్వఁడోపు
నీవెన్ని వలికిన - నిను నొంటిడించి
పోవరా దేను ద - ప్పుదునె రామాజ్ఞ!
మూఁడులోకములు రా - మునిమీఁదఁ దమకు
దోడుగా శతమఖా - దులఁ గూడివచ్చి
విల్లందియున్న నీ - విభుని కట్టెదురఁ
ద్రుళ్లడంగక సమ - ర్ధులె యెదురింప?
మాను మీచింత యీ - మారీచు నెలుఁగు3690
గాని రాఘవుమాట - గా దేను వింటి
మారీచుఁ జంపి నీ -మగఁడదే వచ్చు
నారాక్షసుండు మా - యాబలాన్వితుఁడు
రాముని శరముచే - వ్రయ్యలై పడుచు
నీమాట దానాడె - నిది నిక్కువంబు
నీకుఁ గావలియుండ - నియమించి నన్ను
నీకడ నుంచి తా- నేఁగె రాఘవుఁడు
నట్టిచో నిను డించి - యన్నసన్నిధికి
నెట్టుపోవుదు నేల – నెఱుఁగ కాడెదవు?
ఖరుని గీటడఁచి రా - క్షసుల మర్దించి3700
శరవహ్నిచే జన - స్థానంబుఁ గాల్చి
వీరఁడై యున్న యా - విభునిపై దనుజు
లీరసంబునఁ గల - హింపఁ గోరుదురు!
అసురలతోఁ బగ - యయ్యెను మనకు!
కసుఁగందకున్న రా - ఘవునిపై నలిగి
దనుజులు నానావి - ధముల వంచనలు
కనుపించుకొని సేయఁ - గాఁ దలంపుదురు
వారిమాయలు రఘు - వర్యుని యెదురఁ
దీరునే నీవు చిం - తిల నేఁటికమ్మ?
ఉరకుండుమన" నాగ్ర - హోపేత యగుచు3710
మరియు నాసీత ల - క్ష్మణు జూచి పలికె
-:సీతాదేవి లక్ష్మణునితోఁ బరుషోక్తులాడుట:-
“కులపాంసనుండవు - క్రూరచిత్తుఁడవు
కలుషమానసుఁడవు - కామాంధమతివి
రామునికిని హాని - రాఁ బ్రమోదించు
తామసాత్ముఁడ వీవు - దాయాది వగుటఁ
దరిచూచుకొని కీడుఁ - దలఁచిన నిన్ను
బరమపాతకుని నా - పతి నమ్మి వచ్చె!
మొదటనే యీవనం -బుల కేము రాఁగ
మది నేమి దలఁచి వెం - బడివచ్చినావొ?
కాక యేమని బందు - కట్టెనో భరతుఁ3720
డాకైక యేఁటికి - నంపెనో నిన్ను?
తమ్ముని భరతుని - దండనే యునిచి
నమ్మించి నాపెండ్లి - నాఁటనుండియును
నిందుకే కాచినా - వేమొ? రాఘవుని
సుందరి నొకఁడు నే - ర్చునే తేరిచూడ!
అకట! రామద్రోహి - వగుదు గా కేమి!
నికట శాత్రవుఁడవై - నిలుతు గాకేమి!
క్షుల్లకంబులు సేయఁ - జూతుఁ గాకేమి!
యుల్లంబులో విషం - బుంతు గాకేమి!
ఇందీవరశ్యాము - నినవంశతిలకు 3730
మందరాచలధైర్యు - మన్మథాకారుఁ
గమలపత్రాక్షు రా - కాచంద్రవదను
శమదమసంపన్ను - సత్యసంకల్పు
శ్రీరామవిభునిఁ బా - సిన నిమిషంబు
నేరుతునే మేన - నిలుపఁ బ్రాణములు
నన్యు లాసించిన - యందాక ధరణి
కన్యయుఁ బ్రతుకునే - కనలేవుగాక!
క్షణమైన నిఁక నోర్వఁ - జాల నీయెదురఁ
దృణముగా రాఘవుఁ - డెచ్చోటనున్న
నతనికిఁ బ్రీతిగా - నర్పింతుఁ బ్రాణ 3740
మతిమానుషంబైన - యాత్మశీలంబు
చూచి నీతలఁపు మం - చునుఁ బోలి విరిసి
నీచులు చనుగతి - నీ వెసంగుదువు!"
అని పరుషోక్తు లి - ట్లాడిఁ జెవుల
విని కటకటఁబడి వేదనంబొంది
యంజ నుండఁగ రోసి - యట్టట్టు వోయి
యంజలిచేసి రా - మానుజుం డనియె.
-:సీతయొక్క దూషణవాక్యములను వినలేక లక్ష్మణుఁ డామెను విడిచి బయలుదేరుట:-
“నీవు నాపాలిట - నిలిచిన యిష్ట
దైవంబు నామీఁద - తల్లివి నాకు
నటువంటివాఁడ నే - నైన ధరిత్రి 3750
యెటు మోచుఁ బటపట - నిరుపాయఁగాదె!
బంటనై సుతుఁడనై - పాయక నమ్మి
వెంట వచ్చి నన్ను - వినరానియట్టి
యీవేఁడిమాట లి - ట్లేమిటికమ్మ
నీ వాడెదవు మారు - నిన్నాడఁదగునె?
ఇంతులకు స్వభావ - మీమాటలైన
నింతటి సతివి న - న్నెఱుఁగ కాడుదువె!
కర్ణశూలంబులు- గాఁ బుణ్యపాప
నిర్ణయంబులు లేని - నీవాక్యములకు
నీవనదేవత - లిందరు సాక్షి! 3760
దైవముల్ పంచభూ - తంబులు సాక్షి!
యనరానిమాట లి - ట్లాడిన పాప
మనుభవింపఁగఁ బాత్ర - మగు నీవె సాక్షి!
మనవంశమునఁ గైక - మగనిఁ బుత్రకుల
ననుపమదుఃఖంబు - లందించెఁగాని
నీవలె నీకీడు - నిను ముంచుకొనఁగ
నీవాక్యములు వల్కె - నే చెడఁగోరి
యేమైన నేమి నీ - వెటుపోయి తేమి?
రామునిఁ జేరనే - రము లేదు నాకు
పోయెద నిపుడె యీ -భూదేవి నిన్ను 3770
బాయక రక్షింపఁ - బాల్పడు గాక!
వనదేవతలు సహ - వాసలై నీకుఁ
గనుచాటు రాకుండఁ - గాతురుగాక!
ననునొవ్వనాడు న - నంతపాపంబు
నిను ముంచుకొనక మా - ని తొలంగు గాక!
మానినీ! నీకు సే - మము గల్గుగాక!
తా నేఁగుచున్నాఁడ - తడకట్ట తొణఁగెఁ
దడయక దుర్నిమి - త్తములు మాయన్న
కడకేఁగి మఱలి యి - క్కడి కేము వచ్చి
నినుజూచునట్టి పు - న్నెము సేతుమేమొ3780
కనఁజాల మిక్కిలి - కలఁగె నామనసు."
అన సీత యేడ్చుచు - సరలేని మఱిఁది
గని యశ్రులు దొలంక - గా నిట్టులనియె.
"ఓలక్ష్మణ! యెఱుంగ - కురక పల్కెదవు
చాలింపు నాకై వి - చార మేమిటికి?
తామసించెద వేల - తనప్రాణవిభుని
సేమంబుఁ దలంచి రాఁ - జింతింప కిపుడు?
గోదావరీనదీ -కూలముల్ నిండ
లేదొ, శైలబిలంబు - లేదొ, దావాగ్ని
లేదొ, విషంబింత - లేదొ? కూపంబు3790
లేదొ, యా యుధమైన - లేదొ, చచ్చుటకుఁ
జూడు మీ వనుచు గా - జులు పైకిఁ ద్రోచి
వీడిన కీల్గంటు- వెసఁ జక్క ముడిచి
చుట్టఁబైఁట చెఱంగుఁ - జుట్టి రాఁ జెక్కుఁ
బెట్టిన కమ్మల -బిగువంటి చూచి
రంగైన పైఠాణి - రవిక బిగించి
యింగితం బెఱిఁగించి - యెలుఁగు రాపడఁగ
నెగవెక్కి యేడ్చుచు - నిటునటు జూచు
మగువ కీ లెఱిఁగి ల - క్ష్మణుఁ డూరడించి
యాయమ్మపదముల-కవనతుండగుచు 1070
నోయమ్మ యిదె పోవ - నున్నాఁడ ననుచుఁ
దిరిగి చూచుచు మదిఁ - దేఁకువ మాని
యరిగెను సౌమిత్రి -యా రాముఁ జూడ,
-:రావణుఁడు సన్యాసివేషమునఁ బర్ణశాల కరుదెంచుట:-
ఎప్పుడు లక్ష్మణుఁ - డెడవాసి చనియె
నప్పుడే రావణుఁ - డచటికి వచ్చి
చెంద్రిక పూవల్వ - చెంగావి గాఁగ
చంద్రహాసము కర - స్థగితదండముఁగ
గుజ్జరి కేడెంబు- కుండిక గాఁగ
సజ్జిక పూసరి -జపమాల గాఁగ
సైంహికేయ పతాక - ఛత్రంబు గాఁగ 1070
సింహాదిమృగములు - చెదరి పాఱంగ
గొడుగుపావలు మెట్టి - గొడుగు వీతేర
వెడవెడ జపము గా - వింపుచు ముసలి
సన్యాసియై పర్ణ - శాలలో నున్న
వన్యాసిని విషాద -వతియైన నారి
శశిభాస్కరులు లేని - సంధ్య చీకటియు
శశిఁ బాయు రోహిణీ - సతిఁ బరగ్రహము
లాఁచినగతి రామ - లక్మణుల్ దొలఁగఁ
జూచి చేరఁగవచ్చు - చో దశాసనునిఁ
గనుఁగొని చల్లని - గాడ్పు రావెఱచె,1070
వనమహీరుహములు - వడవడ వడఁకె,
తరలక నిల్చె గో - దావరీ తటిని,
హరిణాది మృగము లా - హారంబు లుడిగి,
రాముఁ డచ్చోటికి - రామున్నె యతని
భామిని దాఁజేరి - పట్టెద ననుచుఁ
గడిమి చిత్రాతారఁ - గదియంగఁ జాయ
కొడుకు చేరిన యట్లు కుటిలాత్మకుండు
గఱిక గప్పిన నూతి -- కైవడిఁ గపట
మెఱుఁగనీయక చేరి - యిందీవరాక్షి!
గుణవతిఁ గురువింద- కోరకవదన 3830
నణుమధ్యఁ గమలప్ర - తాయతనయనఁ
జపలాలతాగాత్రి - చంద్రబింబాస్య
విపులాతనూభవ - వెతలఁ జింతిలఁగ
నాదుష్టబుద్ధి కా - మాంధుడై చూచి
వేదంబుఁ జదువుచు - వినయయుక్తముగఁ
గదియంగఁ బోయి యా- కార్యంబుఁజూచి
మదినుబ్బి పరమదు - ర్మార్గుఁ డిట్లనియె.
"వెలఁది! తామరయిల్లు - విడిచి యిచ్చోట
మెలఁగఁగ వచ్చు ల -క్ష్మీవధూమణివొ
శ్రీయను పేరింటఁ - జెలఁగి క్షీరాబ్ధి 3840
శాయినిఁ బాయని -శక్తివో నీవు!
వలరాజు నెడవాసి - వనభూములందు
మెలఁగ వచ్చిన రతి - మీనలోచనవొ!
యజరలోకముఁ బాసి - యవనిఁ గ్రీడింప
విజయంబు చేసిన - విబుధకామినివొ!
అచ్చోటఁ దగిన నా-యకుఁడు లేకున్న
వచ్చిన యచ్చర - వనితవో నీవు!
ముదిత! హ్రీదేవతా - మూర్తివొ! కీర్తి
మదవతివో! భూత - మానినీమణివొ!
ఎవ్వరిదానవే - యింతి నీ నిండు 3850
జవ్వన మదనుని - సామ్రాజ్యపదవి!
నిగనిగమను డాలు - నిగుడించు సోగ
మగరాల చాలు నీ - మంచి పల్వరుస!
తరళతారకములై - తమ్మిఱేకులనుఁ
గరిసించి మీఱు నీ - కన్నులతీరు
జగతి నెల్లడ నింద్ర-జాలంబుఁ గప్పి
నిగ నిగ లీను నీ - నిడుద పెన్నెఱులు!
అరచందురుని చంద-మరసి యానంద
మిరవు కొన్నదిగదె - యింతి నీనుదురు!
తళతళమనుచు చి - త్తరములు చూపు 3860
వలరాజు తూపు జ - వ్వని నీదు చూపు!
పులినమై మెఱసి యొ -ప్పులకుప్పయయ్యె
జలజాతనయన నీ - జఘనమండలము!
పదియారుకళలొప్పు - పరిపూర్ణచంద్రు
నెదురు కోల్గొనియె - నీ యెలనవ్వుమొగము !
కళుకులు చల్లు బం - గరు కలశముల
గొలిపించుకొని మేనిఁ - గులుకు పాలిండ్లు!
బంగరు ననఁటి కం-బముల చెల్వమున
సింగారమయ్యె నో - చెలియ నీ తొడలు!
కెంజిగురాకుల - గేలి సేయుచును 3870
రంజిల్లె నీపాద - రాజీవయుగళి!
ఎంతపుణ్యము చేసె - నీ ముత్తెసరము
లింతి! నీ గుబ్బల - నెడవాయవెపుడు!
ఎటువలె నుండునో - యిగురాకుబోణి!
అటునిటు నడయాడు - నప్పుడు నీవు!
ఏ మాడ్కి నుండునో - యెలనవ్వు సొలవు
చేమించు నపుడు నీ - చెక్కుటద్దములు!
ఏవేడ్క సేయునో - యేకాంతవేళ
నీవు గారాపు చి - న్నెలఁ బల్కినపుడు!
ఏరు పాఱఁగ దరి - యిడిసిన యట్ల 3880
నారి! నిన్నిటు జూచి - నామది కరఁగె!
యక్షగంధర్వవి - ద్యాధరదివిజ
రాక్షసభామినుల్ - రారు నీసాటి,
ఇటువంటి జవరాల - వీపర్ణశాల
నిటు లొంటి నున్న చో - నేఁ దేరి చూచి
యోరిచి యూరక - యుందునే నిన్ను
నూరి కేఁ గొనిపోవ - నూహ చేసితిని.
పూఁబోణి! రాక్షస - భూయిష్ట మగుటఁ
బ్రాఁబడి యుండదీ - పట్టు నీ కిపుడు
నీవు కాఁపురములుం - డిన నివాసములు3890
నీవు ధరించు మ - ణిభూషణములు
నీవు కట్టిన రమ - ణీయవస్త్రములు
నీవు పూసిన యట్టి - నెమ్మేనిపూఁత
నీకొప్పులోన వ - న్నియ గన్న విరులు
నీ కేలుదమ్మిఁ బూ - నిన వలయములు
నీదు చన్నులమీఁద - నెలకొన్న సరులు
నీదండనుండువ - నీమృగశ్రేణి
పొంది నిన్ను రమించు - పురుషరత్నంబు
నందందు ముఖ్యంబు - లని తలంచెదను
దేవతలకు నైన - దృష్టింపరాని 3900
యీవని సింహాది - మృగములఁ జూచి
వెఱవక యేరీతి - విహరించె దిట్లు?
తరుణి! నీ వెవ్వరి - దాన వేర్పఱుపు
మేమి నిమిత్తమై - యిచటికి వచ్చి
తేమి గావలసిన - నే నిత్తు నీకు
పలుకవే పలు కేమి - పచ్చకప్పురమె!
తలయెత్తి చూడు మెం - తటి సిగ్గు నీకు
నెవ్వరు లేరిందు - నేనొక్కరుండ
జవ్వని! నీవు ని - చ్చట నొక్కరితవు"
అనిన నట్టి దురాత్ము - నతిథిగా నెంచి 3910
తన యొంటిపాటు నా- తని ప్రల్లదములు
దిక్కు లేమియుఁ జూచి - దీమసంబూని
యొక్క కైవడి వీని - కూరట సేయఁ
దనవారు వచ్చినఁ - దగపాదపూజ
లొనరింతురని మది - యోజన చేసి
కపటసన్యాసిని - గాంచి యాసీత
యపలపింపఁ దలంచి యప్పు డిట్లనియె.
"భావింపుఁ డివె యర్ఘ్య - పాద్యాదికములు
కావలసిన భిక్షఁ - గైకొనుఁ డిపుడు
అయినది వంట చ - ల్లారక మునుపె3920
ప్రియముతో భుజియించి - తృప్తివహించి
వలసినగతి తరు - వాత వర్తింపు
డెలమితో వేగిర - మేల మీకిపుడు?
అంగీకరింపుఁ డీ - యాతిథ్య" మనిన
యంగనామణిమాట- లాత్మఁ గైకొనక
తాను మృత్యువుఁ బొంద - దలఁచిన యట్ల
జానకి నెత్తుక - చను బుద్ధి నెలమి
వేగిరపడు దైత్య - విభు తమకంబు
జాగుఁ జేసినఁ బోని - జాడయుఁజూచి
యెప్పుడు వత్తురో - యేర్పడరాదు3930
తప్పెఁ గార్యంబు పా - తకువాతఁ బడితి
రామలక్ష్మణు లేల - రారైరి? వార
లేమేర నున్నారో? - యేమి సేయుదును?"
అని యెదురులు చూచి - యతి షధారి
తనతోడఁ బలుకంగ - తా నూరకున్న
శపియించునో యని - చాల శంకించి
యపు డప్రసక్తిపూ - ర్వానులాపముల
మఱల నెమ్మాముదా - మర మరలించి
జరపులఁ బెట్ట మృ- షాయతి కనియె.
-:సీత తనవృత్తాంతమును రావణునికిఁ జెప్పుట:-
"జనక మహారాజు - జనకుండు నాకు3940
తన పేరు సీత యా - దశరథసుతుఁడు
రామచంద్రుండు నా - ప్రాణవల్లభుఁడు
సౌమిత్రి మఱిఁది యి - చ్చట వసింపుదుము
తనయింట వారింట - ద్వాదశవర్ష
దినములు నేబొంది - తిని వైభవముల
పదియుమూఁడవ యేఁడు - ప్రాపింపఁ దనదు
మదిలోన దశరథ - మనుజనాయకుఁడు
శ్రీరాముఁ బట్టాభి -షిక్తునిఁ జేయ
గోరి యుద్యోగింపఁ - గోపించి కైక
రాముఁగానల నంచి-రాజ్యంబు భరతుఁ 3950
గామించి యేలింపఁ - గా వరంబడుగ
మా మామ యిచ్చిన - మది నట్ల సేయ
నేమించి తండ్రికి - నిజము నిల్పుటకు
మునివృత్తి సవతి త - మ్మునిఁ గూడి యేను
వెనుకొనిరా వచ్చె - విపినభూములకు
మావారు వేటాడి -మాంసముల్ దేర
నీవనంబుల కేఁగి - యెంత ప్రొద్దాయె
రారైరి! వచ్చు ప - ర్యంతంబు నిచట
మీరుండుఁ డిం తేల - మీకు వేగిరము?
ఏమరణ్యమ లకు -నే తేర నాదు 3960
స్వామికిఁ బంచవిం - శతి హాయనములు
పదునెనిమిదియేండ్ల - పాయంబు తనకు
నిది తుది పదియు మూఁ - డేండ్లవ వచ్చె
నినువంటి పెద్దల - నే చూచిరేని
తనుశక్తి దాఁపకెం - తయునుఁ జేకొద్ది
యాశలు దీర నీ - యగఁ గడఁదేర్ప
దాశరథులకు నెం - తయు నైజగుణము.
ఎందుండి వచ్చితి - వెచటికిఁ బోయె
దిందు రాగతమేమి - యేర్పడఁబల్కు"
మన రావణుండు భ - యంబు జనింప 3970
తన తెఱఁగెల్ల సీ - తను జూచి పలికె.
“గంధేభగమన! రా - క్షస యక్షచార
గంధర్వసురభయం - కరుఁడ రావణుఁడ!
నీ చక్కఁదనము క - న్నియ! చూచి మెచ్చి
నోఁచి పెండ్లాడు మం - డోదరి ప్రముఖ
కులకాంతలను రోసి - కోరియు వేఁడి
వలచి వచ్చితిని నీ - వాఁడనై యిటకు!
ఎల్ల దిక్కులు గెల్చి - యెల్లలోకములఁ
జెల్లుగా నాముద్ర - చెల్లఁగ నేలి
వరియించు నారాణి -వాసంబు లెల్ల 3980
సరసిజానన! నీదు - చరణముల్ గొలువ
నేలికసానియై - యెందు నెవ్వరికి
భూలోకముల నేలి -పోఁడుముల్ గనుము!
ఇంతిరో! పట్టంపు - టిల్లాలవైన
కాంతువు నేఁడె లం - కాపట్టణంబు
కమలాబ్ధి చుట్టు న - గడ్తయై యుండ
నమరు త్రికూటాచ - లాగ్రంబు నందు
నున్న లంకాపురి - నోచకోరాక్షి!
నన్నుఁ గూడి సుఖంబు - న మెలంగు మీవు
నాయింట దాసీజ - నము లైదువేలు 3990
పాయక మణిమయాభరణము ల్దాల్చి
యచ్చరసతులుగా - నతివ నీసేవ
కిచ్చెద నీమన -సిమ్ము నా కిపుడు
విరిదోటలోఁ గల్ప - వృక్ష పంచకము
తరణి! నీముడిపువ్వు - దండల కిత్తు!
అమరభూధర రోహ - ణాచల మణులు
రమణి! నీకెత్తు యా - రతుల కే నిత్తు
ఆమీఁద కామధే - న్వాది ధేనువులు
భామిని! నీయింటి - పాడి కే నిత్తు!
కల్యాణి! నాదు లం -కారాజ్య మెల్ల 4000
మూల్యంబు వీడియం -బునకు నే నిత్తు
తరుణులలో నీవె - తరుణివి జగతి
పురుషులలో నేనె - పురుషుఁడ నిజము
అనుమతింపు” మఁటన్న - యాసీత వానిఁ
గనుఁగొని నెమ్మేను - గజగజ వడఁక
తెలివిఁ దెచ్చుక చాల -దిటముతో రామ
కులసతి వానిఁ బే - ర్కొని యిట్టులనియె.
"హరుఁ డెక్కువెట్టని - యమరభూధరము
కరుఁడు గలంకయుఁ - గనని వారాసి
అకళంకచంద్రుఁ డా - హవసురేంద్రుండు 4010
సకల సద్గుణగణై - శ్వర్యపూర్ణుండు
అట్టిరాముని దేవి - నన్యుఁ డొక్కరుఁడు
జుట్టన వ్రేల్చాఁచి - చూపశక్తుండె?
ఆమహాబాహుఁ డై - నట్టి రాఘవుని
భామిని నతఁడు చే - పట్టినదాన
సత్యసంధుఁడు రామ - చంద్రుండు నన్నుఁ
బ్రత్యాశ గలిగి చే - పట్టిన దాన
పూర్ణచంద్రాననాం - బుజుఁడైన యాసు
పర్ణసాయకుడు చే - పట్టినదాన
పట్టైయిన ధర్మంబె - పట్టిన రాజ 4020
పట్టభద్రుండు చే - పట్టినదాన
కోదండపాణియై - కొమురొప్ప రాము
పాదపద్మములు చే - పట్టినదాన
క్షుద్రనిశాచర - స్తోమంబు దునుము
భద్రేభగమనుఁ జే -పట్టినదాన
సాహసనిధిఁ గృపా- జలధి నాజాను
బాహుని కరుణ చే - పట్టినదానఁ
గోరఁ జెల్లని సింహ - కులసతి నక్క
గోరిన చందానఁ - గోరితి వీవు
కాంచనవృక్షముల్ - గనినట్లు కాల 4030
వంచితాత్మకుఁడవై - వాకొంటి విట్లు
ఆఁకొని యున్న సిం - హము కోఱపళ్లు
వీఁక చేఁ దివియ భా - వించెద వీవు
విషయాతురుండవై - విషమవాక్యములు
విషముఁ ద్రావిననీకు - విషమింపకున్నె
నాలుక నసిధార - నాకినయట్లు
పోలసూదిని కన్ను - పొడుచుకొన్నట్లు
మెడరాయి కట్టుక - మీరివారాశి
బడినట్లు రవిఁ గేలఁ -బట్టినయట్లు
కాలాగ్నివడి నడి - గట్టుకొన్నట్లు 4040
శూలాగ్రముల నేఁగఁ - జూచిన యట్లు
రాముని దేవిఁ జే - రఁగఁ దలంచెడవు!
తామసాత్మక నీదు - తలవ్రయ్యు నిపుడె
జలరాశి యెంత తు - చ్ఛపునది యెంత?
కులశైల మది యెంత - గొగ్గిరా యెంత?
కల్పవృక్ష మదెంత - ఖాదిరం బెంత?
అల్పమానస! రాము - నంతటివానిఁ
జనకెదు బంగారు - సీసంబు నెట్టు
లెనయు? రామునితోడ - నీడు రాఁగలవె?
గరుడునితో మాలకాకి యేరీతి 4050
సరివచ్చు రాముని -సాటి వే నీవు!
రాముఁ డుజ్జ్వల ధను - ర్బాణసన్నాహ
భీముఁడై యుండనం - బేదనుబోల
ననుబట్టి మేనఁ బ్రా - ణంబులు డాపఁ
గనుకల్గి యేతల్లి - కడుపు మెచ్చెదవు?
యాగబియ్యంబని - యత్తి వజ్రంబు
మూఁగిమ్రింగిన జీర్ణ - మున కేలవచ్చు?
నిపుడె వచ్చెదరు వో - యినఁ బోతివింక
కపటాత్మక! నిలిచినఁ - గడకుఁ బోలేవు
రాముని బాణప - రంపరల్ బొదివి4060
నీమేను దహియించు - నిమిషంబులోన!”
అని భీతిచే సీత - యాడినమాట
లనునయాలాపంబు - లను లెక్కఁగొనక
కావరంబున దశ - కంధరుం డలిగి
యావధూమణి తోఁ - నప్పు డిట్లనియె.
{{C|-:రావణుడు సీతకు నిజరూపంబును గనఁబఱచుట; సీతదూషించుట:-}
“తొయ్యలి! ధనదుండు - తోబుట్టునాకు
నియ్యాన జగము లన్నియు నాకు వెఱచు
జనులు మృత్యువు గన్నఁ - జలియించు రీతి
ననుఁజూడ సురలప్రా - ణములు చలించు
దానవ గంధర్య - దైత్యకింపురుష4070
మానవసురసిద్ధ - మండలియెల్ల
వెఱతురు, తల్లులు - వేరైన యన్న
నరవాహనుఁడు గాన - నాకు నాతనికి
నొక కారణంబుచే- యుద్ధంబుఁ గలుగ
నకలుపషాత్మీయ మ - హాప్రతాపమునఁ
బాఱఁద్రోలిన యక్ష - పతి యందు నిలువ
నేరక ముక్కంటి - నెయ్యుండు గాన
కైలాసమునఁ దలఁ - కకయుండె నిట్టు
లాలంబు నే గెల్చి - యతని పుష్పకము
గైకొంటి నది కామ - గమనయోగ్యంబు 4080
నాకు వేడ్కను సేయు - నాఁడు నేఁటికిని
అందుమీదఁ జరింతు - లఖిల లోకముల
నిందీపరేక్షణ! - యింద్రాదిసురలు
నా పేరు వినిన నె - న్నఁడు దమ యిండ్లఁ
గాఁపురంబులు చేసి - కనుకూర్క రెపుడు!
చల్లగా నారతి - శ్రమ మార్ప గాని
వెల్లావిరిగ గాలి - విసరఁగ వెఱచు
మదినాకు హితమైన - మార్గంబెకాని
గదిమి భాస్కరుఁ డెండఁ - గాయంగ వెఱచుఁ
గలగఁగ స్వాదూద - కములచేఁగాని4090
బలువిడి వాహినుల్ - ప్రవహింప వెఱచు
నేనాజ్ఞ సేయక - యెవ్వారికైనఁ
బూని యయ్యముఁడు చం - పుకఁ బోవ వెఱుచు
నెచ్చోట నాయిచ్చ - నేకాని తాను
విచ్చలవిడి నగ్ని - వెలుఁగఁగ వెఱచుఁ
బూయని తరువులఁ - బువ్వుల నిత్తు
కాయని వృక్షముల్ - కాయఁ జేయుదును
కురియింతు వానలు - కోరినయపుడు
భరియింతు సకలభూ - భారంబు నేను!
నావీడు జలధికి - నడుచక్కి లంక4100
రావణుఁ డందురు - రామ! నా పేరు
అచట వజ్రమయంబు - లైన కోటలును
నిచితముక్తాఫలా - న్వితగోపురములు
గోమేధికపు పిల్ల - కోటలు రజత
హేమాదిధాతుస - మేతసౌధములు
చతురంగబలపూర్ణ - సామగ్రిరత్న
చతురంతయానాది - సకలవస్తువులు
తలఁచినప్పుడు పండు - తరువుల వనము
లలరు నన్నియుఁ బూచు - నట్టి పూఁబొదలు
కలఁగి భేరీమృదం - గములు మిన్నంద4110
నలరెడు లంకామ - హాపట్టణమున
ననుఁ గూడి క్రీడించి - నరుఁ డైనరాము
మనసున దలఁతువే - మఱికొంత లేక
కొఱఁగానివాఁడని - గుణహీనుఁ డనియుఁ
గరుణ సేయక చూచి - కన్నట్టితండ్రి
యడవుల తరిమించి - యాజ్ఞ సేయించు
గడసరి మగఁడనం - గానేల నీకు?
సిగ్గు కా కేమని - చెప్పెదు రాము
నగ్గించి నాదుస - మక్షంబు నందు
నీపుణ్యవశముచే - నిన్ను గామించి4120
నాపాటి దొరవచ్చు - నా? కాన లేవు!
ఎఱుఁగ వింతయు కాక- యేకడ కేఁగ
తరుణి! కూలుదువు చిం - తాసముద్రమున
ననుఁజూచు నట్టిమా - నవలీతీలలామ
మనసున నితరుని - మఱు చేరఁగలదె?
జగడంబులో నన్ను - జనకజ! నీదు
మగని నాయెడఁ దృణ - మాత్రుగాఁదలఁపు!
అట్టినే నీవు భా - గ్యము నేయు కతన
గట్టద నట్టిమం - గళసూత్ర మిపుడు
రా లేచిరమ్మన్న - రాముని దేవి 4130
జాలిచే మదినిఁ గొం - చక యిట్టులనియె.
'ఇంద్రుని సతిఁదెచ్చి - యిముడుకోవచ్చు
చంద్రుని సతిఁబట్టి - సైరింపవచ్చు
శ్రీరాము నిల్లాలిఁ - జెనకి యొక్కరుఁడు
"నేరుచునే మేన - నిలుపఁ బ్రాణములు!
బ్రదుకనొల్లక యిట్లు - పలికిన నిన్ను
బ్రదుకనిచ్చునె రఘు - ప్రవరు బాణాగ్ని
యదె వినవచ్చె రా -మానుజు మాట
ఇదె వచ్చు నాస్వామి - యెటకుఁ బోయెదవు!"
అని బెదిరింప ఘో - రాకారుఁ డగుచుఁ 4140
గనలుచు “నా పెంపుఁ - గనలేవు నీవు
యిలఁగాలు మోపక - యేమింట నిలచి
యిలనెల్ల నొకవ్రేల - నెత్తఁ జూచెదవొ!
వనధులేడును హస్త - వనజంబులోన
నునిచి పుక్కిటఁ బట్టి - యుమియ నెంచెదవొ!
ఏనుమృత్యువుఁ బట్టి - యిట్టట్టు జుఁణిగి
పోనీక చంపినఁ - బొందు సేసెదవొ!
చంద్రసూర్యుల నొక్క - సరిగాగఁబట్టి
చంద్రాస్య! యొకముద్ద - సలుప నడ్డెదవొ!
ఇలయు నింగియుఁగూర్చి - యేకంబుఁ జేసి4150
చెలఁగి యెక్కిడ నిల్వఁ - జేరవచ్చెదవొ!
కామరూపముమించు - కామరూపమున
నేమది యలరింప - నెయ్యముంచెదవొ!
వలచివచ్చినవాఁడ - వట్టిమాటలను
తొలఁగిపోవుదునె? యె - త్తుక పోదుఁగాక!"
-:సీతాపహరణము:-
అని కన్నుదోయి సూ - ర్యాగ్నులరీతి
గనకన వెలుఁగ నం - గంబు జాడింప
నెటువలె దాఁచెనో - యిందాక ననఁగ
కటికి కాటుకకొండ - గతి మేను మెఱయ
నెందుండి తెచ్చేనో - యీదశాననము4160
లందుపై నిరువది - హస్తంబు లనఁగఁ
గరమొప్పి కామాంధ - కారంబురీతిఁ
గరకప్పు మేనితోఁ - గడు విరహమున
బదియవస్థలు దోఁచు - పగిది మస్తములుఁ
బదియును మీరఁగ - పదియవస్థలును
నినుమడించినయట్ల - యిరువది చేతు
లనువుగా నవి శాఖ-లై చిగురించు
కరణి హస్తంబులుఁ - గనుపింప నవ్వి
శరశరాసనకుంత - చక్రగదాసి4170
పరికరంబులుఁ దాల్ప - బలగర్వ రేఖ
భామిని వెఱగంద - బలిచెంతఁ బెరుగు
వామనుండన దైత్య - వరుఁడు మిన్నంది
కంకణకుండలాం - గద కిరీటములు
సంకులచ్ఛాయ దం - ష్ట్రలు శోభిలంగ
దివ్యాభరణవస్త్ర - దేదీప్యమానఁ
భవ్యవిగ్రహుఁడయి - బాలకట్టెదుర
నిలిచి "నన్నెఱుగవే - నిర్జరప్రభుని
బలిమి నోడించిన - పంఙ్తికంధరుఁడ!
అలివేణి నీవు నా - కనుకూలమైన4180
గొలిచెద నీతులా - కోటి నవీన
నిరుపమమణివిభా - నీరాజితాంఘ్రి
సరసిజయుగళదా- స్యము నిర్వహించి!
బిగిసెదవేలనే - బేలనే నీకు!
మగువ! యల్పాయువుల్ - మనుజులందఱును
వారిలో నధముఁ డీ - వల పదభ్రష్టుఁ
డీరాఘవుఁడు శౌర్య - మింతయు లేదు
నీకు వానికి నేఁటి - నెయ్యంబు చాలు
నాకు దక్కితివి మ - నంబు దాచెదవు
నీవుదాళిన నేను - నిలుపోపఁ జాల
భావజు చిగురు ఱం - పపుకోతలకును4190
చేయిమ్ము నాకని” - సీత కెంగేల
డాయఁగఁ జేరి య - డ్డము లేక పట్టి
యిాడిచి బుధుఁడు రో - హిణిఁ బట్టి నట్టి
జాడగా జఘనపా - ర్శ్వము క్రింద నొక్క
కరమొయ్యఁ జూచి రా - ఘవు దేవిఁ దెచ్చి
మొఱసేయ మాయచే - మొలిపించి నట్టి
రథముపై తన మనో - రథము చేకూడి
పృథుశక్తి నందుపై - పృథివీతనూజ
నునిచి తానాచెంత - నుండగఁ జూచి4200
వన దేవతలు భీతి - వగచి కలంగి
నలుదిక్కులకుఁ బాఱ - నానామృగములు
కలఁగిపోవఁగ లేక - కన్నీరురాల్ప
నదలింపుచును సీత - నంజక తిట్టి
బెదరింపుచును బ్రాణ - భీతిచేఁ గలఁగ
నూరడింపుచును తన -యారువులందుఁ
జేరిచి పడనీక - చేతులు బొదివి
"హారామ! హారామ! హా సుమిత్రాకు
మారక!" యనుచుఁబ - ల్మారు కూయిడఁగఁ
బన్నగాంగనరీతిఁ - బలవింపుచున్న4210
కిన్నరరమణి పో - ల్కిని ప్రాణభీతి
గజగజ వడఁకుచు - కన్నీరు రాల
నజరులు బ్రదుకుఁడీ -యని తెల్పఁబోవు
కైవడి నాతేరు - గగనమార్గమునఁ
బోవుచో దిగులుచే - భూమిజ వణఁక
'హాలక్ష్మణా! హాద - యానిధి! రామ!
పాలింపు" మని విధిఁ - బలవించెనిట్లు
"మఱచితిరే నన్ను - మదిఁ గ్రొవ్వి వీఁడు
చెఱపట్టుకొనిపోయి - చెడఁ గోరినాఁడు!
ఈ యధర్మంబు మీ - రేమియు నెఱుఁగ 4220
రీయధముని చేత - నే జిక్కువడితి
మేనులు సుఖము భూ - మియు ధర్మమునకు
మానువారలు నన్ను - మఱచి యున్నారు!
కాలంటు వచ్చిన - కలుగు సస్యములు
చాలఫలించిన - జాడ వీనికిని
కర్మానుభవసిద్ధ - కాలంబుఁ జేరి
దుర్మార్గుఁ డగుచు న - ధోగతిఁ బడగఁ
దలచె, కై కతలంపు - దైవయత్నంబుఁ
దులతూగి యదినేఁటి - తోఁ గడతేఱె!
ఓ జనస్థానంబ! - యూహించు నీవు 4230
రాజన్యమణియైన - రామునితోడ
నీరాక్షసునిరాక - యిట్టి నాతెఱఁగు
కారణ్యమును దెల్పి - కాచి రక్షింపు!
కనుగొంటిరే కర్ణి - కారంబులార!
దనుజుఁ డెవ్వరు లేని - తరి నన్నుఁ బట్టి
కొనిపోవుచున్నాఁడు - కోరి మీరైన
ననుదెల్పుఁ డారాము - నకు వచ్చుగాని
చనవయ్య నీవు ప్ర - శ్రవణశైలంబ!
ననుఁ దెల్ప శ్రీరాము - నకు దయఁదలఁచి!
అమ్మ! గోదావరీ! - యకట! నీవైన4240
నమ్మించి మారాము - నకుఁ దెల్పవమ్మ!
వాకొనవే పంచవటి! కరుణించి
నీకు దండము రాము - నికి నాతెఱంగు!
ఓర్వలేదని నన్ను - నోపర్ణశాల!
సార్వభౌముని రామ - చంద్రు రమ్మనుము
తేలిపోవక వన - దేవతలార!
చాల వేగమె రామ - చంద్రు రమ్మనుఁడు!
మృగసమూహములార! - మీకు మ్రొక్కెదను
మొగమాటవూని రా - ముని తోడి తెండు!
శరణు జొచ్చెదఁ బక్షి - జాతంబులార! 4250
కరుణించి వేగ రా - ఘవుఁ దోడి తెండు!
చాలనమ్మితి వన - స్పతులార! యిపుడె
కాలూఁదనీక నా - కాంతుఁ దోతెండు!
ఈలోకమున నున్న - నీమేనుఁ దొఱఁగి
యేలోకముల నున్న - నే నమ్మియున్న
మనువంశతిలకంబు - మఱలంగ నన్ను
గొనిరాక తానేలఁ - గొదవ రానిచ్చు!
నమ్మితి రావయ్య - నాప్రాణనాథ!
నమ్మితినే లక్ష్మ - ణా! నినుఁజాల!
అనరానిమాట ని -న్నాడిన ఫలము 4260
తన కేల మాను యిం - తకుఁ జుట్టుకొనక!
ఏఁటికిఁబొమ్మంటి - నే నిన్ను? రాము
నేటికిఁ బనిచితి - నెఱుఁగంగలేక?
అని పోవుచోట మి - న్నరికట్టు నొక్క
పెను మఱ్ఱికొమ్మపై - పృథుశక్తి నున్న
యాజటాయువుఁ జూచి -యశ్రులు దొరఁగ
భూజాత యాసీత - పొక్కుచుఁ దనదు
నెలుఁగు రాపడనాల్క - నెడఁదడి లేక
కలఁగుచు నోవిహం - గవరేణ్య! తండ్రి !
కావవే! దనుజుఁ డొ - క్కఁడు దిక్కు లేని 4270
కైవడి నెత్తుక - గగనమార్గమునఁ
జనుచున్నవాఁడు ల -క్ష్మణుతోడనైన
నను నేలు శ్రీరాము - నకునైనఁ బోయి
యెఱకలుగలవాఁడ - విప్పుడే యెగసి
యరుగుము నమ్మితి- నని కూయుచుండ
ఖగవంశమౌళి యా - కస్మికంబైన
జగదేకమాత యా - జానకిమాట
విని చెఱఁగొని పోవు - విబుధారి నతని
ఘనమైనయూరుప్ర - కాండపీఠమున
జలదమాలికలోని - చంచలలతిక 4280
వలె భీతి గడగడ - వడఁకు భూపుత్రి
గనుఁగొని మిగుల నా - గ్రహముతో విహగ
వనికబాంధవుఁడు రా - వణున కిట్లనియె
-:జటాయువు రావణునకు హితోపదేశము చేయుట:-
"ఓరి! దశానన! - యుచితమే నీకు
శ్రీరాము కులకాంతఁ జెఆగొనిపోవ?
సత్యపరాక్రమ - సద్ధర్మపరుఁడ
భృత్యుఁడ రామున - కెప్పుడు నేను
సకలము నేలంగఁ - జాలి యింద్రాదు
లకునైనఁ జేరి యా - లము సేయరాని
శ్రీరాము నిల్లాలి - సీతనుఁ బట్టి4290
యేరీతిఁ గొనిపోయె - దెటు బోవనిత్తు!
సద్ధర్మపరుఁడైన - జననాయకునకు
బుద్ధియే పరకాంత - పొందు లాసింప?
పరుఁడను మాత్రమే - భాస్కరవంశ
శరనిధిసంపూర్ణ - చంద్రుఁ డుత్తముఁడు
అట్టి రాముని భార్య - ననదనుఁబోలి
పట్టితి మృత్యువుఁ - బట్టిన యట్లు!
కనుఁగొంటి నిన్ను నా - కన్నుల యెదుర
జనకజ కింక వి - చార మేమిటికి ?
విడువు మీకల్యాణి - విడవేని యిపుడు4300
విడిపింతు నీమేన - వేగఁ బ్రాణములు!
ధర్మార్థకామముల్ - ధరణీశులాది
ధార్మికులకె గాని - తలఁప నన్యులకుఁ
బాటిల్లునే పుణ్య - పాపంబు లెల్ల
హాటకంబగుట రా - జాధీన మింతె!
చపలాత్ముఁడవు దుర్వి - చారుఁడ వెపుడు
కపటమానసుఁడవు - కామాంధమతివి
యిట్టిదురాత్మున -కేరీతిఁ గలిగె
నిట్టిమహైశ్వర్య - మెన్న నచ్చెరువు!
గుణహీనులను గాము - కుఁడు చాల హీన4310
గుణుఁడందు రట్టి దు - ర్గుణపరాయణుఁడు
చిరకాల మెట్టు లూ - ర్జితముగా బ్రదుకు?
ధరమీఁద నీకిట్టి - తలఁపెట్లు గల్గె?
రాముఁడు సేయు నే - రము నీకు నెద్ది?
ఏమిటికీ ద్రోహ - మెంచితి వీవు?
ఆ చుప్పనాతి మ -హాపాతకంబుఁ
జూచి కానఁగలేక - శూరుల మనుచు
ఖరదూషణాది రా - క్షసు లెదిరించి
దురములోఁ బడిరని - తోచెనే నీకు?
పొడవవచ్చిన వారిఁ - బొడుతురు గాక4320
విడుతురే యెందైన - వీరశేఖరులు?
నిరపరాధుని రాము - నీవిట్లు చెనకి
ధరణిజఁ గొనిపోవ - ధర్మ మార్గంబె
రాముని ఘోరనా - రాచముల్ పిడుగు
భూమిధరంబులఁ - బొడి సేయునట్లు
మేను వ్రయ్యలు చేసి - మీ వంశమెల్ల
హానిఁ బొందింపక - యవి యేలమాను!
వజ్రంబు వృత్రుని - వధియించునట్లు
వజ్రసారము రఘు - వరుని బాణంబు
తఱుముక వచ్చి నీ - తల లుర్విమీఁదఁ 4330
దెరలించు, నీవేగఁ- దెరువేది యపుడు?
భూమిజ యొడిలోని - భోగీంద్రరమణి
కామాంధ! మెడఁజుట్టు - కాలపాశంబు!
తెలియక కొనిపోవఁ - దీరునే నీకు
జలమేల! సీత ని - చ్చట డించిపొమ్ము
భరియింపఁ దగుమోవు - భరియించి వోవ
నరిగించుకొనిన నా- హార మింపగును!
కాక మితం బెఱుం - గని వాని కెందు
రాకుండునే హాని -రాక్షసనాథ!
తనకు హానిజనించు - తలఁపు దలంచు4340
చెన్నటి యెందైన నీ - క్షితి నున్నవాఁడె?
అరువదివేలేండు - లాయెను నాకు
ధరణి నీయంత పా - తకుఁ జూడలేదు!
వయసువాఁడవు నీకు - వార్ధకంబగుటఁ
బయి సేయకున్నాఁడఁ - బదరి నీమీఁద
నధమరాక్షస నీకు - నాయుధశ్రేణి
యధికంబు నే రిక్త - హస్తుండ నిపుడు
ఐనను నీకులో - నయ్యెడి తలఁవు
మాను మీచింత నా - మదిలోన లేదు
ఎటులైన మేలు నే - నీక్షింపుచుండ 4350
కటకట! సీత నా - కన్నుల యెదుర
చెఱవోవఁ బ్రాణమా - సింతునే! నిన్ను
నరికట్టి రామున - కర్పింతు నిపుడె!
హేతువాదంబుల - నెట్లు వేదములు
భూతలంబునఁ దన - బుద్ధికిందఱలు
నారీతి నీసీత - యబ్బదు నీకు
కారాని పని సేయ - గానెట్లు వచ్చు?
తనతో ముహూర్తమా-త్రం బెదిరించి
యని సేయు మైనటు - లయ్యెడు నిపుడు!
ఖరుఁడు రాఘవసాయ-కములచే బడిన 4360
హరువున వజ్రసా - రాత్మీయ నఖర
నారాచములచేఁ దృ- ణంబుగా నిన్ను
జేరెదఁ జట్టలు - చింతు నీపొట్ట
రామలక్ష్మణులు దూ - రము వోయిరనుచు
నీమదిఁ దలఁచియో - నీవు వాఱెదవు?
రామునికిని దశ -రథునకు హితము
నామదిఁ దలఁచి ప్రా - ణములైన విడుతు
విడువ నీ జానకి - వేఁడి యాతిథ్య
మడిగితి నాతోడ - నని సేయు" మనుచు
"పండును తొడిమెతో - బాపినయట్లు4370
భండనంబునఁ దల - వడవేతు నిన్ను"
-:జటాయువు రావణునితోఁ బోరి నేలఁ గూలుట :-
అన రావణుఁడు కన్ను - లందుఁ గెంజాయ
జనియింప నట్టహా - సము సేసి నిలిచి
తేరు మఱల్చిన - దిగ్గున పక్షి
వీరుఁ డాగ్రహముతో - వృక్షంబు విడిచి
ఱెక్కలతోడ ధా - త్రీధరం బనఁగ
గ్రక్కున నెగసి రా - క్షసనాథుఁ దాఁకి
పోరాడుచో మహా - ద్భుతచండవాత
ధారలఁ బెనగొన్న - ధారాధరముల
నుద్దులై వారితో - డురువుల నాఁగి 4380
అద్దిరా! వీరి బా - హాగర్వ మనఁగ
వదలక పోర రా-వణుఁ డాగ్రహించి
కదిమి నాళీకవి - కర్ణిబాణముల
నాజటాయువు నేయ - నండజస్వామి
తేజంబుతోడ పం - క్తి గ్రీవు నెదిరి
భిదురసారములైన - పెనుగోళ్ళ వాని
యెదురొమ్ము నెత్తురు - లెగయఁగఁ గోటి
వ్రయ్యలు చేసిన - వాడల్గి వెనుక
తియ్యక విహగేంద్రుఁ - దెగుము పొమ్మనుచు
దండధరోద్దండ - దండప్రకాండ 4390
చండిమ ద్వాదశా - స్త్రములు సంధించి
యేసిన నవి తన- యెఱకలు గాడి
దూసిపోయిన నల్క - తోఁ బక్షివిభుడు
మహనీయమోక్తిక - మాలికాస్తబక
మహితమౌ నతని భీ - మశరాసనంబు
పైఁబడి వ్రేళ్లునఁ - బరియలు గాఁగ
తాఁబూని విఱిచిన - దశవదనుండు
వేరొక్క విలుగొని - - విశిఖవర్షంబు
వారిదంబును బోలి - వాఁడు వర్షించి
శరపంజరముఁ జేసి - చదలనట్టిట్టు4400
నరుగరాకుండ త - న్నరికట్టుటయును
గూడు వెల్వడు పులు - గును బోలి చూడ
నీడజోత్తంసుఁ డ - న్నిశితాస్త్రకోటి
ఱెక్కలచే విద - ర్చి నిశాటు దాఁకి
యుక్కు ముక్కున ధను - వొడిసి రాఁదిగిచి
మున్నుట్టివలె త్రుంచి - మున్నాడి మేన
నున్నట్టి జోడు తా - నురువడిఁ జించి
పాఱఁగ వైచి ద - ర్పంబునఁ చేరి
వారువంబుల దైత్య - వచనముల్ గలుగు
వాటి పీఁచమణంచి - వాని సారథిని 4410
దోఁటి ముక్కున రెండు - తునియలు చేసి
ధరణిపై వైచి ర - త్నమయంబుఁ గనక
గిరిసమానంబుఁ గిం - కిణిరాన్వితంబు
నగుచు నేడ్చుచు సీత - యందు పై నుండు
గగనయానరథంబు- గ్రక్కునఁ దన్ని
పొడిసేసి చంద్రునిఁ - బోలిన తెల్ల
గొడుగు చింపులు చేసి - కుంభిని వైచి
టెక్కెంబు విఱిచి పం - టించి తాలెక్క
ముక్కాడనీయక - ముక్కునఁ బొడిచి
జేవురుఁ గొండగా - జేసి గర్వింప 4420
రావణుఁ డపుడు ధ - రాసుతఁ బట్టి
యిలఁ బాదచారియై - యేమియు లేక
నిలుచు నప్పుడు భూత - నివహంబు మెచ్చి
బలదర్పములనున్న - పక్షిపుంగవుని
బలహీనుఁడగు దైత్య - పతిఁ దేరి చూడ
సందిట గట్టిగా - జానకి నుంచి
యందఱు వెఱఁగంద - నాకాశవీథి
దానవవిభుఁ డేగ - దాను వెంబడిని
“పోనీను పోనీను - పోకుము పోకు!
నిలునిలు మీరాము - నెలంతను డించి 4430
తొలఁగుము పొవని - త్తును కాచి నిన్ను
అతివజ్రసారది - వ్యాస్త్రరాఘవుని
యతివను గొనిపోవు- నదికారణముగ
దానవకులమెల్ల - దగ్ధమై నీవు
హాని బొందుదువు కా - మాంధుఁడ వగుచు
సీతఁ బట్టితి వేల - జెడగోరి దప్పి
చేత విషంబు మ్రు - చ్చిలి త్రావువాఁడు
బ్రదుకనేర్చునె? కాల - పాశము ల్నిన్ను
వదలక కట్టి యీ - వైఖరిఁ దెచ్చె
గాలంపుటెఱ్ఱలఁ - గని చేరి మ్రింగి4440
పోలేక తగులు నం - బుధి మీన మనఁగ
వలవనిట్టి దురాశ - వలదురా! నీకు!
ములుచదానవ! యేల - మోసపోయితివి?
ఈ రావణుఁడు శౌర్య - హీనుఁడై వెఱచి
చోరకృత్యమునకుఁ - జొచ్చినాఁ డనుచు
నవ్వరే నిన్ను బృం - దారకు లెల్ల?
దవ్వుగావు యశఃప్ర - తాపముల్ నీకు
వీరధర్మము మాని - వెన్నిచ్చి పఱచి
యోరి! రావణ! పోవ-నుచితమే నీకు!
కాని కార్యము లంత్య - కాలంబులందు 4450
పూని చేసినవాడు -పొలసిన యట్లు
యిట్టి దుష్కర్మ మీ - విప్పుడు చేసి
కట్టఁ జిక్కితివేల - కాలపాశముల?
ఖలుఁడు సేయఁగరాని -కార్యముల్ చేసి
పొలియుఁ గావున నిన్ను - బొరిగొందు నిపుడు!
అనిమిత్తవైరంబు - నధికపాపంబు
వనజగర్భుఁడు చేసి - వర్ధిల్లగలఁడె?
విడువు జానకి" నంచు - వీపుపై దుమికి
కడువాడియైన వం - కరగోళ్ళచేత
పిక్కలఁ గాల్మీరి - పెరిగి మత్తేభ 4460
మొక్కటియును బోవ - నోడక నిలిపి
యలుగు కొద్దిని డిగ - నంకుశం బెత్తి
వలదేరి నఱుకు మా - వంతుని రీతి
వ్రయ్యలుగాఁ గొట్టి - వాని మస్తములు
పయ్యాడి మకుటముల్ - పదియు డొల్లించి
తలవెంట్రుకలు కట్టి - తానీడ్చి తెచ్చి
యలయించి ముక్కున - నంగముల్ బొడిచి
చాలఁ బీడింప రా - క్షసచక్రవర్తి
యాలోన భయకంపి - తాత్ముఁడై జడిసి
గట్టిగా నెడమచం - కను సీత నుంచి 4470
కొట్టెను వల కేల - కొట్టఁ బక్షీంద్రుఁ
డాకొట్టువడి యండ - జాధీశుఁ డలరి
పోక రావణు కరం - బులఁ జంచువులను
పదియును నఱికినఁ - ‘బడిపోవు కరము
లది లేదు బొంకని’ - నట్లు వెండియును
పుట్టలోఁ బన్నగం - బులు వచ్చినట్లు
నెట్టుక మొలిచిన - నిర్జరారాతి
సీత నొక్కెడనుంచి - చేతులఁగాళ్ళ
చేతను బోడిచినఁ - జేయుట లేక
యా విహగోత్తముఁ - డతిబాహుశక్తి 4480
రావణుతోఁ బోర - రామకార్యమున
దెగి ప్రాణముల యాస -దీరిపోనీక
జగడించు ఖగకుల - స్వామి కీలెఱిఁగి
చండించి తనచేతి - చంద్రహాసమున
రెండుగాళ్లును రెండు - ఱెక్కలు దునియ
నఱికినఁ బెద్దకొం - డయుఁ బోలి ధరణి
బొరలు జటాయువు - బొగులుచు చూచి
‘తన నిమిత్తముగ నిం - తటి పక్షిరాజు
దనుజునిచేత నిం - తకువచ్చె’ ననుచు
చేరఁగఁ బోయి యా - సీత కన్నీరు 4490
ధారలుగాఁగ నెం - తయు నేడ్చుచుండ
నారఁబారినయట్టి - యగ్నియుఁ బోలి
ధారుణిపై నీల - ధారాధరంబు
చెలువైన దేహంబు -సితకరద్యుతిని
తెలుపైన యుదరంబు - దీర్ఘతుండంబు
గలుగు జటాయువు - గాంచి రావణుడు
‘గెలిచితి నిట్టి ప - క్షివరేణ్యు’ ననుచు
నలరుచో, సీత జ - టాయువు మీఁదఁ
గలఁగుచుఁ బడి - యార్తిఁ - గౌఁగిటఁ జేర్చి
జనకుని జూచి - విషాదంబు నొందు 4500
తనయకైవడి నేడ్చి - తాలిమి లేక
యంతంతఁ దనకైన - యపశకునములఁ
జింతించి యివికీడు- సేయుగా యనుచు
“ఓరామ! యెఱుఁగలే - కున్నావు! నన్ను
నీరాక్షసుఁడు పట్టి - యేగెడి, జాడ
నామొఱ యాలించి - నానాద్విజంబు
లీమృగంబులు నీకు నెఱిఁగింపవేమొ!
నాకు నడ్డము వచ్చి - నాదురదృష్ట
మీకీడు పొందగ - నిట్లున్నకతన
దానవు నెదిరించి - తనభుజాశక్తి 4510
నైనమాత్రంబు జ - టాయువుఁ జూచి
మృతినొందె రక్షింప -వే! రఘురామ!
హితమూని ప్రోవరా - వేల సౌమిత్రి?
అని చాల విలపించు - నవనిజఁ జూచి
దనుజనాయకుఁడు - చెంతకుఁ జేరఁబోయి
చేవట్టి దిగిచిన - శ్రీరామ!రామ!
కావవే! యనుచు వృక్షముఁ గౌగలించు
వల్లికయును బోలి - వదలక పెనఁగి
మల్లాడ, విడక కా - మవికార మొదవ
కేరడంబులు వల్కి - కీల్గంటు వట్టి 4520
మారు మోమిడ నీడ్చి - మహిఁ బడవైచి
కరిచేతఁ జిక్కిన - కమలిని యనఁగ
తెరలి గాసికి నోర్చి - దిగులుచేఁ బొగల
మృతికి హేతువు సంత - రించుకొన్నట్లు
వెతఁబెట్ట నీపాటు - వీక్షించి పొరలి
సచరాచరంలైన - జగతిఁజీకట్లు
పచరించె, రావయ్యె - పవనాంకురములు
మాసె నభోమణి - మమత రోదనము
చేసె భూతావళి, - సీతపాటునకు
నావేళ నెంతయు - నబ్జసంభవుఁడు4530
భావంబులోఁ జూచి - “బ్రతికితి నిపుడు
దేవతావళికెల్లఁ - దీరె విచార
మీవసుధాభార -మిఁక గడతేరరె”
అని తలఁపఁగ దండ- కాటవి నున్న
మునికోటి “తమతప - ములు కొనసాగు
రావణుఁ డిఁకఁ జచ్చు - రణములో” ననుచు
భావించి యానంద - భరితులై రపుడు!
తనభుజాంతరమున - ధరణితనూజ
నునిచి దశాననుం - డుప్పరం బెగసి
పోవుచో దివ్యవి - భూషణద్యుతుల4540
నావిశ్వజనని వి - హాయసవీథి
మెఱుఁగు వెట్టుచుఁ బోవ - మేదినీతనయ
ధరణీధరముఁబోలు - దనుజగాత్రమున
దావానలార్చి చం - దంబున వెలిఁగె!
ఆవేళఁ గనకాంబ - రాంచితయైన
సీత బాలాతప - శ్రీ సంఘటించె
దైతేయ వరవారి - ధరరాజమునకు!
శ్రీరాము నెడవాయ - సీత నెమ్మొగము
చారువికాస ల - క్షణములు లేక
నాళంబుతో బాయు - నాళీకమనఁగ 4550
చాలఁగ వాడి తే - జము మట్టుపడియె!
పగలింటి చంద్రబిం - బమురీతి సీత
మొగము కన్నీటిచే - మురువెల్ల మాసె
జనక భూవరతనూ - జనుచంక నిఱికి
చనువేళ వానివ - క్షంబు చెల్వమరె!
చదల నుర్విని దిగి - సాగుమై సిరుల
నుదిరి ముచ్చును బోలు - నొరగంటి రీతి
మణిమయమేఖలా - మంజీరకటక
ఝణఝణ ధ్వనులొప్ప - జానకితోడ
పెళపెళ నురుములు -పెల్లుగ నురుమ 4560
జలదంబు చనురీతిఁ - జనియె రావణుఁడు!
-:రావణుఁడు సీత నెత్తుకొని పోవుచుండ నామె యాభరణములు కొన్ని క్రిందఁబడుట:-
జానకీసతివెంట - జనుచోట వదలి
వేనలిలో రాలి - విరులు నల్గడల
దనుజేంద్రుఁ గనుఁగొని - తలఁకుచురాల
మినుకుచుక్కలతోడి - మెఱవడి చూపె?
సీత పాదాబ్జమం - జీరంబు జారి
భూతలంబునఁ బడు - పొలువుఁ జూపట్టె
దనుజేంద్రు మరణని - దానమై మింటఁ
గనుపట్టు నట్టి యు - ల్కాపాత మనఁగ
గగనమారుతముచేఁ - గదలి పయ్యంట4570
జగతితనూజ భు - జంబుపైఁ దొలఁగె
దశకంఠకీర్తిము - క్తామయధ్వజము
దశరథాత్మజునిచేఁ - దలఁగు నన్నటుల!
కొఱవిపోలిక మీఱు- కువలయతనయ
సురవైరి గొనిపోవు - చో భూషణములు
వ్రాలెను వీరరా - వణునకుఁ గీడు
వేళ గ్రహంబు లు - ర్విని బడినట్లు
ధరణితనూజ ముక్తా - మణిసరము
పెరిగి యుర్వికి వచ్చు - పెంపుకన్పట్టె
నరుదుగా నప్పుడె - యవనికి డిగ్గ4580
గరమొప్ప నాకాశ - గంగయౌ ననఁగ!
చండవాయువులచే - జలియించి కూయు
చుండుపక్షుల మోత - లొప్పు వృక్షముల
‘మీరె వీని వధించు - మేదినీతనయ
శ్రీరాముఁ డిఁక’నని - చెప్పిన కరణి
దనుజుఁడు గొనిపోవు - ధరణితనూజఁ
గనుఁగొని వెన్నాడి - కదిసిపోలేక
మిన్నుల దాటి భూ - మికి వ్రాలె! కాల
మన్ను ద్రవ్వుచు మింటి - మార్గంబుఁ జూచి
కన్నీటితోడ మొ - గంబులు వాచి4590
విన్నబాటున నీడ - వీక్షించి యదియె
జనకజగా నెంచి - సడలిపోలేక
కనుచుండె నానామృ - గశ్రేణి యపుడు!
సెలయేరు కన్నీరు - చీదంగ శిఖర
ముల పేరి తమకరం - బుల మీదఁ జాచి
‘ఓయమ్మ! జానకి! - యోడకు మీవు!
మాయావి దనుజుని - మద మడగించి
వాఁడె నీ పెనిమిటి - వచ్చెను పోవ
నీఁ’డన్న గతి గిరు - లెల్లఁ జూపట్టె
‘తన వంశజుని కాంత - దనుజుఁడు పట్టు4600
కొనిపోవఁ గని మాన్పఁ - గోరని యట్టి
యీజీవనం బేల నిఁకఁ - బక్షిమాత్రు
నీజటాయువుతోడ - నెనయ లేనైతి!’
అని యెంచి యొయ్యన - నర్కమండలము
తన తేజముడివోయి - ధవళిమం బూనె!
‘ఈ రాఘవుని దేవి - నీ రావణుండు
పోరేది పట్టుక - పోవుచున్నప్పుడె
యెక్కడి ధర్మ మిం - కెక్కడి సత్య
మెక్కడి యార్జన - మేటి శౌర్యంబు’
అని సర్వభూతంబు - నాహా నినాద4610
ఘనరోదనముల భూ - కంపంబుచేసె
వనమయూరంబు లా - వసుమతీతనయఁ
గనుఁగొని పొగులుచుఁ - గన్నడు రాల్చె
పలుమారు ప్రాణేశుఁ - బలవరింపుచును
విలపించు జానకి - విధ మాలకించి
‘హా పోయెదవే! జన -కాత్మజా!’ యనుచు
వాపోయె విపినదే - వతలమొత్తంబు!
కలఁగిన తెలివితో - కన్నీరుసోన
జలజలఁ గురియు లో - చనములతోడ
వదలిన కొప్పుతో - వదనాంబుజమునఁ4620
జెదరిన కురులతో - చెమటచేఁ గరగు
తిలకంబుతో వాడు - దేఱిన వదన
జలజంబుతో రాలు - సరములతోడ
“సత్యసంకల్ప! కౌ - సల్యాకుమార
అత్యుదార! జగజ్జ - నాధార! రామ!
కరుణింప వే దిక్కు - గావె! సమస్త
శరణాగతత్రాణ - సౌమిత్రి!” యనుచు
శోకింప రావణా - సురుఁడు లోకైక
భీకరుఁ డొక్కయం - బేదయుఁ బోలి
రాముని పట్టపు - రాణివాసంబు4630
నామేర గొనిపోవ - నలుక జనింపఁ
గనుఁదామరల కెంపు - గనుపింప సీత
దనుజేంద్రు వీక్షించి - దర్పించి పలికె.
-:సీత రావణుఁడు చేసిన పనికి నిందించుట:-
“తగునె రాత్రించరా - ధమ! కానిపనులు
తెగిసేయ? దీనఁ జెం - దెడు లాభమేమి?
ఒంటిగా నుండు న - న్నోడక పట్టి
బంట నేననుకొన్న - పౌరుషంబగునె!
కనరైరి గాక రా- ఘవులు నీ తలలు
తునిమివైవరె యొక్క - తూపు సంధించి!
సిగ్గేమియును లేక - చెప్పెదు బలిమి 4640
యెగ్గెఱుంగక దొంగ -కే నోరు గనము!
నా నిమిత్తంబుగా - నాప్రాణవిభుని
కానల కెలయించి- కపటమృగంబు
కలిగించి యటు బందు - కట్టి లక్ష్మణుని
తొలగించి నన్ను నె - త్తుకపోవఁజూచి
యరికట్టినట్టి జ - టాయువుఁ దునిమి
గరువించనేల? యీ-ఖగరాజుతోడి
వృద్ధునితోఁ బోరు - వేళ నీదైన
యుద్ధంబు భుజశక్తి - యును గాననయ్యె!
పరకాంత నెవ్వాఁడు - బలిమిచేఁ బట్టి 4650
వరియింపఁ బొందును - వాఁ డధోగతుల
నిందుకు రోసెద - వే నీ ప్రతాప
మందఱు వినిన వే - యాడు దుర్మతివి
తగదోరి! యిట్టి య - ధర్మవర్తనము
మగనాలి నాసింప - మర్యాదగాదు
కాదను పని సేయ - గా దేఁగు నపుడె
నీదు శౌర్యముకాల్ప - నే జగద్రోహి!
ఇంతవేగమున నీ - విటు వాఱకున్న
కాంతురు వచ్చి రా - ఘవులు పోనీరు
కారుచిచ్చున పక్షి - గమలినయట్లు 4660
శ్రీరాము బాణాగ్ని - చేఁ ద్రుంగ గలవు!
ఇదపథ్యముగ నెంచి - యిప్పుడే నిన్ను
వదలి పొమ్మను మేల -వలనని కీడు
నన్ను దక్కించుకొ - నంగ లేవిదియె
కన్నయర్థము చచ్చి - కనులాభ మేమి?
ఐన గానిమ్మను - నడియాస లేల?
మాను మొక్క నిమేష - మాత్రంబులోన
రాముఁ జూడక యున్న - బ్రాణముల్ నిలువ
వీమేనిలో నెంత - నేమి సేయుదువు?
మృత్యువు నెడరింప - మించి నామాట 4670
నత్యంతహితమని – యాత్మఁ గైకొనవు
సురవైరి నీమెడఁ - జుట్టినముత్య
సరములు కాలపా - శములుగాఁ దలఁపు
మింక నేఁడది నీకు - నే లెదనన్న
లంగాపురంబు కా - లపురంబు గాక
వైతరిణీనది - వహ్నులఁ దేలి
యాతరిఁ దరి లేని - యసిపత్రవనము
చిగురించు కత్తుల - చేత నీమేను
పొగరెల్లఁ దీరి య - ప్పుడె పోవఁగలవు!
పసిఁడిపూవులు నుక్కు - బలవుఁడు పచ్చ4680
మిసిమియాకులు గల్గి - మించు బూరుగను
గనకభూరుహమును - గాంతువు గాక
తునిసి యాసన్న మృ - త్యుఁడవైన నీవు!
రామునియెడఁ జేయ - రానట్టి కీడు
తామసాత్మకుఁడవై - తలఁచితి గాన
తడవుగా నింక నీ - తనువేల నిలుచు!
పుడమి వేఁగడఁగి యి - ప్పుడె పడగలదు
విల్లంది పదునాల్గు - వేల రాక్షసుల
బల్లిదుఁడై తృణ - ప్రాయంబుగాఁగ
నొక ముహూర్తంబులో - నుక్కడగించు4690
నకలంకవిక్రముఁ - డైన రాఘవుని
నిశితాస్త్రకోటిని - నీవనంబెంత
నిశిచరాన్వయ మెల్ల - నీరు గాఁగలదు!
పోనీయఁ డెత్తుక - పోయిన నిన్ను
దానవాధమ! నన్ను - ధరణిపై డించి
పనుపుము రాఘవు - పాలికి నెందు
జనినఁ బోనియ్యఁ డి - క్ష్వాకువంశజుఁడు"
అనుచు కన్నీటితో - నడలుచు బలుకు
జనకజ నెత్తుక - చనుచు రావణుఁడు
-:సీత తన యాభరణములు కొంగులోముడిచి వానరులవద్ద విసరివైచుట:-
అంతరిక్షంబున - నరుగుచోఁ దమరు4700
మంతనంబున నున్న - మర్కటాధిపులు
యేవురు నొక్కమ - హీధరాగ్రమున
నావేళ వసియింప- నవనిజ గాంచి
“వీరైన నిచటికి - విచ్చేయునపుడు
మారాఘవునకు నా - మాట దెల్పుదురు”
అని యూహ చేసి ప - య్యంటచెఱంగు
కొనఁగొంత చించి యా - కొంగున దనదు
మేనిసొమ్ములు గట్టి -మేదిని మీఁద
దానవనాథు నిం - తయుగాననీక
కపులచెంగట వైవఁ - గ్రక్కున వార4710
లపు డాకసంబుపై - నరిగెడు తన్నుఁ
గనుగొని యిట్లని - కనలేక యుండ
దనుజనాయకుఁడు మం - దాకిని దాటి
పంపాదినదుల న - పార శైలముల
సంపూర్ణకాముఁడై - చనువేళ గడచి
కొదమత్రాఁచును బోలు- గుణవతి సీతఁ
గుదురుగ తొడమీఁద - గూర్చుండ చేసి
కరడుల మిన్నంది - ఘళఘళారావ
భరితదిశానభో - భాగమై, లుళిత
మీనమై, నక్రస - మ్మిళితమై, తరళ4720
ఫేనమై, యలఘుగం - భీరమై, గుప్త
శైలమై, యతులవి - శాలమై, సప్ర
వాళమై యుప్పొంగు - వనవీథి దాఁటి
సిద్ధులు వీనికి- జెడు కాల మగుట
సిద్ధంబు జానకిఁ - జెఱపట్టి తెచ్చె
ననుచు నాలోచింప - నమరు లుప్పొంగ
తనరాజధాని య - త్తరిఁ బ్రవేశించి
యా లంకలోఁ దన - హర్మ్యంబు జేరి
నీలవైడూర్య మా - ణిక్య సౌవర్ణ
ధామమైనట్టి యం - తఃపురసీమ4730
నామానవతి మయుఁ - డాసురమాయ
నునిచిన గతి సీత - నునిచి విశాట
వనితలం జుట్టుఁగొ- ల్వఁగ నియమించి
యారమణులఁ జూచి - యవనిజ వినఁగ
గారవంబున దశ - కంధరుండనియె,
‘ఈ రమణీమణి - యేలిక సాని
మీరెల్ల నుడిగంపు - మెలఁత లీచెలికి
యేసొమ్ము లేచీర - లెట్టిభోజనము
లేసంపదలు వేఁడె - నెడపక తెచ్చి
యప్పుడ చేకూర్పుఁ - డతివ నాసొమ్ము4740
కప్పురగంధి కేఁ - గడు విధేయుఁడను
నెవ్వరు సీతకు - నెగ్గుగా నడచి
రవ్వేళఁ దెగవ్రేతు - నాత్మజులైనఁ
గని కొల్వుఁడనుచు వే - గమ పడకిల్లు
దనుజనాయకుఁడు సం - తసముతో వెడలి
కొలువు సావడి కేఁగి - కోరిన కోర్కి
ఫలియించె ననుచు నా - ప్తముఁ దెల్ప వేఁడి
తడయక యెనమండ్రఁ - దన ప్రధానులను
కడు వేడ్కఁ జూచి రా- క్షసనాథుఁ డనియె,
“శ్రీరాము నావళి - చే జనస్థాన 4750
మారడి నొంది పా - డైయున్న దిపుడు
నెలకొని మీరు తా - ణెము వోయి యచటఁ
దలఁగక యుండుఁడు - దైత్యులఁ గూడి
ఖరదూషణాదులఁ - గదనంబులోన
నఱికిన దశరథ - నందనుఁబట్టి
తెగవేసి యాసూడు -ద్రిప్పుకయున్న
మగతనం బేడది - మజ్జాతికెల్ల
నిద్దుర వోవుదు - నేరాముఁ జంపి
గద్దల కాతని - కండలు నై చి
యూఱడు నందాక? - యుర్విపైఁ బేద 4760
యూరి కేఁగగ నిధి - యొదవుచందమున
నెంత సంతోషింతు - నీ రాము గెల్చి
చింతఁ దీఱిన యట్లు - సేయక నాకు
రాముఁడు నడచు వా - ర్తలు నాఁడు నాఁట
నేమఱ కిఁకనైన - నిడి వేగువారి
చేత నెప్పుడు నడ - చిన కార్య మపుడె
నాతోడ నెఱింగింప - నాల్గుమూనాళ్లు
నొక కొమ్మ వనిచి - మీరుండుఁ డెచ్చరిక
నొకట నేమఱక సే - యుఁడు నాకు హితము
నేరూపమున పగ - యీడేర్చి రాముఁ 4770
బోరిలోపల జయిం - పుఁడు మోస వోక
మీ వడిగల తన - మేకదా నాకు
నేవల వజ్రాంగి - యేకార్యములకు
ఇట్టి నమ్మికఁ జేసి - యేగడి నుండఁ
గట్టడిఁ జేసితిఁ - గదలి పొండిపుడు.”
అని పల్కుటయు వార - లసురేంద్రు నాజ్ఞఁ
జనిరి యప్పుడె జన - స్థానంబుఁ జేర
బలవద్విరోధ మీ - పని రఘువీరుఁ
డలిగిన మిక్కిలి -హానియౌ దనకు
నని తలఁపక చిక్కె - నవనితనూజ 4780
తనకుఁ దక్కెను కామి - తములు చేకూడె
ననుచు నిశ్చింతత - నద్దశాననుఁడు
-:రావణుఁడు సీతకుఁ దన వైభవముఁ జూపుట:-
జనకజ యున్నట్టి - సౌధంబుఁ జేరి
యాడుకుక్కలలో భ - యంపడు లేడి
పోడిమి శోకాగ్ని - సొగసూరి చుట్టుఁ
బనులు వూని పిశాచ - భామలున్నట్టి
జనకజఁ గేల్వట్టి - చయ్యనఁ దిగిచి
రమ్మని యంతఃపు - రంబులో వేల్పు
కొమ్మలు కోటాన - కోటులు కొలువ
నవరత్నభాసమా - నములైన దనదు4790
భవనముల్ గలుగు సం - పదలను జూపి
యాసపుట్టింతు నే - నని రాము రాణి
వాసంబుతో దైత్య - వరుఁ డిట్టులనియె.
“కొమ్మ! ముప్పదిరెండు - కోట్ల చేరువలు
నెమ్మి నందొక్కక్క - నికి వేయి వేయి
దానవసైన్య మా - ప్తబలంబు నాకు!
దీనిచే దేవతా - ధిపుల గెలిచితిని.
ఆబలంబెల్ల నీ - యడుగులు గొలిచి
యోబాల! యిటమీఁద - నుప్పొంగుగాక!
ఈనగరి వసించు - నింతుల నీకుఁ 4800
గానుకగా నూడి - గమున కిచ్చితిని
నూతన ప్రీతి న - న్నుఁ బరిగ్రహించి
శీతాంశుముఖి! కటా - క్షింపుము నన్ను
నొప్పకయుండి నే - నొడఁబాటు సేయు
నప్పుడు మనసిచ్చు - నతివ నామెచ్చు
యింపుమీఱఁ బరిగ్ర - హింపుము నన్ను
చంపకగంధి వి- చార మేమిటికి?
నీవు గాదన్న నీ - నీరధి నడిమి
దీవి లంకాపురి - తేరిచూడంగ
నింద్రాదు లొప్పుదు - రే! యేల పూర్ణ4810
చంద్రబింబాస్య! వి - చారమేమిటికి?
కాదంటివేని జ - గత్రయి నాదు
కోదండమునకు మా - ర్కొన నెవ్వఁడోపు!
ఇలఁ గోలుపోయి తా - నిడుమల నాకు
నలములు దిని మౌని - యై కొఱమాలి
యున్న రాముని మీఁద - నూరక యేల
కన్నిడి భాగ్యంబు - గడకుఁ ద్రోచెదవు?
నేటికిఁ గలనీదు - నిండుజవ్వనము
పాటలాధర! చింత - పాలు చేసెదవు?
దేవతారమణివె? - తిరుగనివయసు4820
చేవ నీమేన నూ - ర్జితమె యెప్పటికి?
మనసుదాఁచగ నేల?-మదిలోన నిట్టి
యనుమాన మేల? నా - యక్కరల్ఁ దీర్పు.
ఏను గావలెనన్న - యిగురాకుబోణి
మానసంబున వేరె - మగనిఁ గైకొనునె?
పురుషుల మనములు - పొక్కించి సరస
మెఱుఁగని నిను ధాత - యేల పుట్టించె?
కరువలి నురిగోలఁ - గట్టి తేగలరె?
తరలింపవచ్చునే - దహనుతోఁ గీల?
నాచేతఁ జిక్కియు - న్న మిటారి నొకఁడు4830
చూచి తెచ్చెదనన్న - శూరుఁ డున్నాఁడె?
అలివేణి! ఎంతపు - ణ్యముఁ జేసినావొ
యెలమితో నీలంక - నేలుము నన్ను
నేలుము రతికేళి - నేలితివేని
వేలుపుల్ నినుగొల్వ - విహరింపఁ గలవు!
వలసిన భూషణ - వసన సుగంధ
ములు గాల్చి నావెంట - ముల్లోకములనుఁ
జరియింపు మిట్టి పు - ష్పకముపై నన్ను
వరియించు మారు నీ - వలకుఁ దప్పించి
దాసుఁడ నీదు పా - దములకు వినతిఁ4840
జేసెద హస్తరా - జీవముల్ మొగిచి.”
అన రెండుచేతుల - నవనిజవదన
వనజంబు వొదివి భా - వము పల్లటిల్ల
హో! యని యెలుఁగెత్తి - యొగరాకు మెసవి
గోయిల యెలుగెత్తి - క్రోల్చినరీతి
యెగవెక్కి యేడ్చిన - నీసుతో మఱల
జగతితనూజపైఁ - జాలఁగోపించి
యేమియు నవుగాము - లెఱుఁగఁగ లేక
కామాంధుఁడై దశ - కంధరుఁడనియె.
“అలివేణి! ఇది దైవ -యత్నంబు చేత. 4850
తలఁచని తలఁపు నా - దానవైనావు
నీభాగ్యమెంత యె - న్నిన నంత చెల్లు
నోభామ! ఇదినాకు - సుచితకృత్యంబు
కాని కార్యంబునఁ - గానేల మేము
దానవులముగాన - ధర్మమెయుండు
యవని రాక్షసవివా - హంబిది నీదు
నవుమోము విన్నద - నంబును మాని
కంటవెల్వడు నీరు - క డకోసరించి
బంటనైనట్టి నా - పలుకీయ కొనుము
సిగ్లు నీకేఁటికి - చిగురుంగటారి 4860
కగ్గము సేయక - యండకు రమ్ము
శ్రేణిగా నాదు కి - రీటనవీన
మాణిక్యకోటి తా - మరలనుఁబోలు
నీపాదములసోఁక - నేఁడెంత కంటి
నో పంకజేక్షణ! - యోర్చుకొమ్మిపుడు
ఇట్టి దైన్యంబుచే- నే యెలనాగ
చిట్టకంబులకు సై - చె దశాననుండు
పదిశిరంబులు సోఁక - పదముల వ్రాలె
నిది నీవెఱుంగలే - వింతియే కాక
తరితీపు లేల? బి - త్తరి! కౌఁగిలించి 4870
మరుకేళి లాలించు - మా" యని పలుక
—: సీత రావణుని నిందించుట - సీతను రావణుఁడశోక వనమున నుంచుట :—
మదిరోసి తనదు స - మక్షంబునందు
చిదిమి తృణంబు వై - చి శిరంబు వాంచి
వానిఁజూడక కల - స్వనమురాయంగ
జానకీదేవి కొం - చక యిట్టులనియె.
సద్ధర్మపరుఁడు దా - శరథి ప్రాజ్ఞుండు
సిద్ధసంకల్పుఁ డూ - ర్జితపరాక్రముఁడు
రామచంద్రుండు నా - ప్రభువునుఁ బ్రాణ
మా మీఁద దైవంబు - నఖిలప్రదాత
యట్టి రాముఁడు సుమి - త్రాత్మజుఁగూడి 4880
చుట్టాలనాప్తుల - సుతులతోఁ బట్టి
ఖరదూషణాదుల - ఖండించినటుల
దురములోపల నిన్ను - ద్రుంపక పోఁడు
నీ వెవ్నినట్టి యీ - నీచరాక్షసుల
భావింపఁ దార్క్ష్యుచేఁ - బాములు బోలి
కోదండదీక్షాది - గురుబాణవృష్టి
నేదండయునులేక - యిపుడమ్రగ్గెదరు
గంగాతటాంబు భం - గములును బోలి
సంగరంబున నీవి - శాలగాత్రంబు
కాంచనపుంఖరా - ఘవశరశ్రేణి 4890
చించివ్రయ్యలుచేసి - క్షితిమీఁదఁగూల్చు
నీవు సురాసుర - నికరంబు చేత
చావు లేదనిక్రొవ్వి - చదరులాడెదవు
వారిలో నొకఁడె నా - స్వామి యారాము
చే రణంబున నీకు - సిద్ధంబు చావు
నాశహేతువునీకు - నా ప్రాణవిభుఁడు
దాశరథియె నీకు - దండధరుండు
వశమె యూపమున బ - ల్వడి కట్టువడిన
పశువు తప్పించుక - బ్రదుక నెంచఁగను?
రాముఁడు నిన్ను నే - రఁగఁ దేఱి చూడ 4900
నేమేర బ్రదుకుదు - వెఱుఁగవుగాక
వలసిన నాకునై - వనజారినైన
నిలఁగూల నేయు న - య్యినకులోత్తముఁడు
జలధులింకించు భా - స్కరు నడ్డగించు
తలక్రిందుగావించు - ధరణిమండలము
పొడిసేయు మేరువు - పోనీఁడు నన్ను
నెడవాయఁజాలఁడొ - క్కించుక తడవు
నీయాయువును నీదు - నిఖలరాజ్యంబు
నీయశంబునుఁద్రుంగె- నేఁటితోనిజము
పతిఁ బాయఁజాల నీ - పడతులఁ బాపు 4910
నతిశయంబగు పాప - మది రిత్తవోదు
దైవబలంబు చే - దశరథాత్మజుఁడు
నీవారితోనిన్ను - నిర్జింపఁ గలఁడు
మృత్యువుపెడరేఁప - మేలని నన్ను
దై త్యాధమాధమ - తగదు తెచ్చితివి
యొనరంగ స్రుక్ స్రువ - ద్యుపకరణములు
వినుతింపఁదగుయాగ - వేదికఁ జేర
చండాలుఁడర్హుఁడే - జానకిఁగర్మ
చండాల! నీకెట్లు - చను నాస చేయ? 4920
అరవింద సరసిలో - హంసంబుఁ గూడి
చరియించు హంసి తు - చ్ఛపుఁబల్వలములఁ
గదలనేరని నీరు - కాకిపై నేల
మదినిల్పు? నాకు నీ - మాట లింపగునె?
రామునిఁ బాసియుఁ - బ్రాణాశ యింక
నేమిటి కిటమీఁద - నెటులైన మేలు
త్రుంపుము దండింపు - తునియలుసేయు
మంపగుగానియూ - హింపకన్యముగ"
అని పరుషోక్తు లి - ట్లాడిన జూచి
కనలి కోపించి లం - కానాయకుండు 4930
సీత నెమ్మోము వీ - క్షించి నెమ్మదికి
భీతి వుట్టంగ ద - ర్పించి యిట్లనియె.
"అతివ! నీకొక్కయే - డాత్మశోధింప
మితము చేసితి నందు - మీఁద సైరింప
యాలోన మనసిచ్చి - తేని నీచేత
నేలింతు లంకతో - నెల్లలోకముల
కాక యీ చలముతో - కడతేరుదేని
యాకడ నిను వండి - యటికలనుంచి
తెత్తురు నాకు నెం - తే నువారంబు
బిత్తరుల"ని చాల - బెదరు వుట్టించి 4940
యా చుట్టునున్నదై - త్యాంగనశ్రేణిఁ
జూచి యావై దేహిఁ - జూపి యిట్లనియె.
'మదిఁగ్రొవ్వినది సీత - మట్టుకురాదు
మదమణంపక నాదు - మాటగైకొనదు
బుద్దిరాఁజేసి యి - ప్పుడు దారి పడగ
దిద్దు కొండ"ని యుప - దేశించు నంత
వారలా సీతను - వలగొని చుట్టి
దారుణగతిఁజూప - దశకంఠుఁడనియె,
“రండు కామినులార! - రమణిని తొడుక
పొండశోకవనంబు - పొంతకు మీరు 4950
నయము భయంబును - నానాఁట జూపి
ప్రియములు వలికి యొ - ప్పింపుఁ డుల్లమున
నడవిలో నున్నటి - హస్తినిఁదెచ్చు
కడక నేర్చిన చెంచు - కన్యలరీతి
నెలయించుకొని నాకు - నీ సీతఁగూర్చి
యలఘువైఖరి మెచ్చు - లందుఁడు మీరు
కదలిపొండ"నుచు నే - కతమునఁ బల్క
మదిరారుణేక్షణ - మదమత్తలగుచు
నందఱు నాసీత - నలముక దనుజ
సుందరుల్ గదలి య - శోకవనంబు 4960
సకలర్తు ఫలపుష్ప - జలజాలకము
మకరాంక కారోప - మాసమన్వితము
చేరి యానడు చక్కి - సీత నశోక
భూరుహచ్చాయ న - ప్పుడు నిల్పి తమరు
చుట్టును వసియింప - నూరెల పులులు
పట్టుకపోఁజేర - బలువలఁ దగిలి
వెతలఁ బాల్పడు లేడి - విధమున దనదు
కృత మెంచి వగలు ది - క్కెవ్వరు లేక
ధారాళముగఁ గంటఁ - దడివెట్టి యపుడు
శ్రీరామునెమ్మదిఁ - జేర్చి చింతిలుచు 4970
నెందు నూరటలేక - యెందునారడియు
నందు చింతాక్రాంత - యై యున్న యంత
—: రాముఁడు మారీచునిఁ జంపి వచ్చుచు దుశ్శకునములఁ గాంచి వగచుట :—
అచ్చోట రఘువీరుఁ - దామాయ లేడి
చిచ్చర యమ్ము వై - చి వధించి మఱలి
వచ్చుచో వరడులు - వాపోయఁ జుట్టి
వచ్చె నానామృగ - వ్రాతమేడ్చుచును
ఈ యవశకునంబు - లేలకోపొడమె?
మాయావి దనుజుడు - మహిఁ గూలునపుడు
నాడిన మాటచే - నవనిజ కొక్క
కీడును లేక సు - ఖించు గావుతను! 4980
ఇది లక్ష్మణుఁడు విన్న - నిప్పుడే వచ్చు
నది సీతవిన్న పొ - మ్మనిపించు నతని
దనుజులా జానకిఁ - దమరు హరింప
ననువుగానక యీమృ - గాకారుఁడైన
దనుజుని బెడ రేఁచి - తను నెలయించి
కొనిపోవఁ జూచిరి - కోరి జానకిని!
'హాసీత! హాలక్ష్మ - ణా' యనివీఁడు
చేసిన రావంబు - చేవచ్చు హాని
నాదు సోదరుని జా - నకిని దొలంగి
ఖేదముల్ మాని సు- ఖింతురుగాక! 4990
దనుజులతో జన - స్థానంబు కొఱకు
పెనుపగఁ గొంటిని - పెరుగకపోదు
కాని నిమిత్తముల్ - గనిపించెదిశల
దీనికి హేతువే - తీరుగాఁగలదొ"
అని జాలినొంది ర - యంబుతో వచ్చు
జనకజాభర్తల - క్ష్ముణుని దూరమున
వెలవెలఁ బాఱుచు - వెతలచే నెదురఁ
దలవాంచి కొనివచ్చు - తమ్మునిఁజూచి
పల కేలు బట్టి పో - వక నిల్చియార్తిఁ
గలఁగుచు జలజల - కన్నీరురాల 5000
—: రాముఁడు సీతనుఁగానక శోకమున విలపించుట :—
"సీతనేమి నెపమ్ము - చే డించివచ్చి
తీతఱి నిఁక సీత - యేడది మనకు?
సౌమిత్రి! మనపర్ణ - శాలలోపులను
భూమిజ నుండ ని -ప్పుడు చూడఁగలమె?
ఎక్కడ సీత ది - క్కెఱుఁగక పొలియు
టొక్కటి చెఱవోవు - టొక్కటి ఖలులు
మెదలనీయక పట్టి - మ్రింగుట యొకటి
యిదిదప్ప దిప్పుడు - యెడమ కన్నదరె!
ఇంకొకమరి చూతు - మీ వోయిసీత?
నంకిలినొంది నా - యాత్మ చలించె! 5010
నీకు నొప్పనసేసి - నేవచ్చినాఁడ
చాకుండఁ దోతెమ్ము - జానకి యేది?
సకలభోగములు ని - స్సారంబు చేసి
యొకతెయు నావెంట - నుగ్రాటవులకుఁ
బాయక వచ్చియీ - పట్టున నన్ను
మాయామృగము గోరు - మన సీతయేది?
నాసుఖదుఃఖముల్ - నాతోడ వంతు
చేసుక యనుభవిం - చియు చింతలేక
ముదమొందుచును నాదు - ముచ్చటలెల్ల
మదిలోన యీడేర్చు - మన సీత యేది? 5020
ఏచెలి నెడవాసి - యేనోర్వఁజాల
నాచంద్రబింబాస్య - యగు సీత యేది?
సీతతో నెడవాసి - చేపట్టనొల్ల
భూతల సామ్రాజ్య - భోగంబులైన
నాయింద్ర సామ్రాజ్య - మైననాప్రాణ
నాయకి యగునట్టి - నాసీత యేది?
మాటున నుంచి నా - మనసు చూచెదవె
మాట నేమిటికన్న - మనసీత యేది?
నాప్రాణములకన్న - నాకుహెచ్చైన
యాప్రాణ వల్లభి - యగు సీతయేది? 5030
నావనవాసంబు - నకుఁ దోడునీడ
కావలెనని నమ్మి - కామించి తెచ్చు
పూనికె నెరవేర్వ - పూని యున్నట్టి
మానవతీమణి - మనసీత యేది?
కైక పూనిక చెల్లెఁ - గానోపు సీత
కాకుత్థ్స కులమెల్లఁ - గడతేర్చునేమొ?
కొడుకుఁ గోడలిజంపు - కొనిన కౌసల్య
యిడుమలఁ బడికైక - నిఁకఁ గొల్చునేమొ?
సీతచచ్చినఁ జావు - సిద్ధంబు తనకు
నీతరి నన్ను నీ - వెడఁబాతువేమొ! 5040
జానకి గలిగిన - సకలంబు గలుగు
వానిగా నెంచి దై - వము నోర్వదేమొ?
ఎడవాయునప్పు డ - య్యెలనాఁగ మోము
కడపటి చూపుగాఁ - గనుఁగొంటినేమొ?
ఇప్పుడు మనయింటి - కేఁగుచో నాదు
చప్పుడు విని పర్ణ - శాలలో వెడలి
నగుమోముతో వచ్చి - ననుఁబైఁట చెఱఁగు
సగము జూఱంగ ము - చ్చట గౌఁగిలించి
నిలిచిన బ్రాణముల్ - నిలుచు నామేన
తొలఁగిన నటమున్నె - తొలఁగు నాక్షణమ! 5050
మత్తుఁడవై నీవు - మదిఁ గ్రొవ్వియొంటి
నుత్తమగుణవతి - నుర్విజనుంచి
వచ్చినవాఁడవు - వాకొనరాదె
చచ్చెనో బ్రదికెనో - జానకివార్త!
సుకుమారగాత్రి మం - జులవాణి సీత
నొకనిచేఁ దగిలి కు - య్యోయంచుఁ బోవ
నీమేనితో నుండి - యిట్టి నీకతన
నేమేమి దుఃఖంబు - లేనందఁ గలనొ!
ఆదురాత్ముని మాట - యాలించి సెవికి
వేదుఱుట్టఁగనిట్టు - వెడలి వచ్చితివి. 5060
వత్తురే యెటులైన - వనితను డించి
కత్తులబోనైన - గహనంబులోన
నక్కటా! పరులకు - నవకాశమిచ్చి
యొక్కింతయైనమో - మోటవో విడిచి
నామాటయును మీఱి - నా వట్టినిన్ను
నేమని యందు నిం - కేమి సేయుదును?
ఖరుని జంపినయాది - గా దైత్యులెల్ల
కరకరి మనమీఁదఁ - గడు పగపూని
యుందురు గావున - నొక్కఁడు జనక
నందను బట్టి మి - న్నక మ్రింగి పోయె! 5070
ఆలిఁ గోల్పోయిన - యధముఁడనైతి
పాలుమాలిన యట్టి - పలుకులేమిటికి?"
అనుచుఁ గన్నీటితో - నాపన్నుఁడైన
యనుజుని గడునొవ్వ - నాడి రాఘవుఁడు
వడిఁ బర్ణశాలకు - వచ్చుచో నచట
పుడమి పట్టియుఁదాను - ప్రొద్దుపోకలను
మెలఁగు చోటులఁజూచి - మిక్కిలి మదిని
కలఁగుచుఁ దమ్మునిఁ - గని యిట్టులనియె.
—: రాముఁడు లక్ష్మణుని రాకకుఁ గారణమడుగుట లక్ష్మణుఁడాసంగతి రామున కెఱింగించుట :—
"సీతను డించి వ - చ్చెదనను బుద్ధి
నీతలంపునఁబుట్టు - నేదైవ గతిని 5080
ఎట్టి యెన్నికచేత - నీవు జూనకిని
నట్టడవిని డించి - నమ్మివచ్చితివి!
సీతను డించి వ - చ్చిన నిన్నుఁజూచి
నీతోడు నాగుండె - నెగ్గునఁ బగిలె
నేమి పల్కెనుసీత? - యేలవచ్చితివి?
ఏమి హేతువులు? నీ - విఁక దాచనేల?
ఆమాట వినియెద - నడ్డదీఱంగ
సౌమిత్రి!” యనిన ల - క్ష్మణుఁ డిట్లు వలికె.
“స్వామి! నాయిచ్చ ని - చ్చటికి రాలేదు
మీమాటగాఁగ భూ - మిజ విన్నకతన 5090
ననరాని దుర్భాష - లాడినఁ జెవుల
వినలేక యిచ్చోటు - వెడలి వచ్చితిని
ఆయమ్మ ననువిడ - నాడిన మఱియు
నోయమ్మ! నీకిట్టి - యుపతాపమేల?
శరణాగతులఁబ్రోవఁ - జాలు మాయన్న
శరణు వేడునె యల్ప - జనులనీరీతి?
ఎవ్వఁడో దానవుఁ - డిట్లువంచించి
యివ్వాక్యములు వల్కె - నింతియెకాక
నీనాయకుఁడు నాడు - నే యిట్టిమాట?
మానవతీమణి! - మాను మీవగవు 5100
నున్నవారిఁక పుట్ట - నున్నట్టివారు
నన్నిలింపులు మహేం - ద్రాది దిక్పతులు
శ్రీరామచంద్రుని - చేత విల్లున్న
పాఱిపోవక నిల్చి - బ్రదుక నోపుదురె?
ఇది వచ్చు నీనాథుఁ - డేమిటి కమ్మ
మదిలోన దాలిమి - మాని పల్కెదవు?
అనినఁగోపించి యా - యమ్మ మీతోడ
వినిపింప రానట్టి - వేఁడి పల్కులను
'ఓరి! పాపాత్మ! న - న్నోడక పొందఁ
గోరి యీక్రియ నెచ్చుఁ - గుందులాడెదవు 5110
మీయన్నఁ జంపి నా - మీఁ దటియాశఁ
బాయ లేకిట్టి య - బద్ధముల్ పలుక
నీకు లోనౌదాన - నే? యీతలంపు
నీకొనగూడదు - నిష్కలంబగుదు
భరతుఁడు నిన్ను బం - పఁగద్రోహచింత
విరసమేర్పడనీక - వెంటవచ్చితివి
అజ్జ చూచుక యుంటి - వన్నకు వెఱచి
సజ్జను గతిఁ బట్టి - జంపించి తిపుడు
నీవుచూడఁగ నేఁడె - నీకిత్తుఁబ్రాణ
మావలఁ బొమ్ముని - రాశ సూరికిని.' 5120
అని పల్కనీవెట్టు - లయినఁ గమ్మనుచు
జనకజ డించి యి - చ్చటికి వచ్చితిని
ఏమి సేయిదు?” నన్న - నీసుతో వినియు
నామాట వినక "యె - ట్లైన నౌఁగాక
యేమన్న నేమి? రా - నెట్లగు నీకు?
భూమిజ యేమైనఁ - బోవనిమ్మనుడు
నేరంబు నీమీఁద - నిలిచె హితంబుఁ
గోరక నన్నింత - కొదవ చేసితివి
ఆటది యనుమాట - లాగురి యిట్టి
పాటి యన్యాయంబు - పరగునేసేయ? 5130
నీకోపమే చూచి - నేనన్నమాట
యాకడఁ ద్రోచితి - వల్పుఁడవైతి
వెఱుఁగని జానకి - యేమన్న నేమి?
ఎఱిఁగి యెఱింగి నీ - కెట్లు రావచ్చు?
అమ్మునేఁ దొడిగిన - యపుడె మాయామృ
గమ్ము చందముమాని - కపటదానవుఁడు
పడువేళ నీరీతి - పలుకుచు వాఁడె
పడియున్న వాఁడు నా - బాణపాతమున."
అని వచ్చి పాడైన - యాపర్ణశాలఁ
గనుఁగొని శోభావి - కాసంబు లేక 5140
హేమంతమునఁ దమ్మి - నెడబాసి యొప్పు
తామరకొలని యం - దము మించుదాని
సీతలేదని తెల్పు - చెలువునఁ బక్షి
జాతనానామృగ - స్వనములదాని
చెదరిన దర్భలు - శీర్ణపాత్రములు
ప్రిదులు నాసనములు - బెదరునేణములు
తలఁగిన వనదేవ - తలు రాలువిరులుఁ
గలిగిన తమయిల్లు - కలఁగుచుఁ జొచ్చి
జానకిఁ గానక - శాలాంతరంబు
లోన నాలుగు దిక్కు - లునుఁ దేఱిచూచి 5150
—: పర్ణశాలయందు సీతలేకుండుటఁజూచి రాముఁడు దుఃఖించుట :—
యెదవడి "లక్ష్మణ! - ఏమియోసీత
వెదకినఁ గానము - వెడలిపోయినదొ?
దనుజులు మ్రింగిరో? - తాను నామనసుఁ
గనవేడి డాఁగెనో? - కానమేమియును
మృతినొందెనో భీతి? - మేలిమి విరులు
లతలు గోయ వనంబు - లకుఁ బోయినదియొ?
నీటికేఁగెనొ? యొక్క - నెలవుననైనఁ
బాటలాధర గాన - బడదేమిసేతు?"
అనుచుఁ గన్నీటితో - నడలి యున్మత్తు
ననువునఁ జాలఁగా - మాతురుండగుచుఁ 5160
బొద బొద గవి గవి - పొలము పొలంబు
నది నది వని వని - నగము నగంబు
చూచి హా! సీత! హా - శోభనాకార!
హా! చంద్రబింబాస్య! - హా! చకోరాక్షి!
పలుకవే! యేను నీ - పాలిటివాఁడ
నిలుపోపలే నిఁక - నిమిషమాత్రంబు
నినుఁ బాసి ప్రాణముల్ - నిలువవు మేన”
అని మేను మఱచి 'యు - హ్హని' వెచ్చ నూర్చి
“తిలకంబ! కానవే - తిలకలలాట
వళులార! కానరే - యలినీలకచను? 5170
హరిరాజ! కానవే - హరిరాజమధ్యఁ?
గరివర! కానవే - కరివరగమన?
హరిణంబ! కానవే - హరిణాయతాక్షి?
గురివింద! కానవే - కురువిందరదన?
లతలార! చూపరే - లతికాలతాంగి?
శతపత్రమా! ఏది - శతపత్రగంధి?
మల్లిక! కానవే - మల్లికానఖరఁ?
బల్లవమా! చూపు - పల్లవాధరను?"
అని వెదకుచుఁ బోయి - "యవనిజ! నీదు
కనకచేలముఁ గంటిఁ - గంటినే" ననుచు 5180
"నీవశోకము చెంత - నిలిచియు రమణి!
కావవే నన్నుశో - కము ముంచె"ననుచు
"ఓయి! లక్ష్మణ! సీత - యున్నదామేర
పోయి తోతెమ్ము గొ - బ్బున జేర" ననుచు
"నినువంటి చక్కని - నెమ్మోము దాని
జనకజఁ దోతెమ్ము - చంద్రా!" యటంచు
"వినవన్న లక్ష్మణ! - వెదకి రాక్షసుఁడు
చనియె సీతను మ్రింగి - చలపట్టి" యనుచు
"ఇంక నాతో నెయ్య - మేఁటికి నీకు
శంకింప కెందైనఁ - జనుము నీ" వనుచు 5190
"జిలిబిలి నవ్వులు - జింకచూపులును
పలుచని చెక్కులు - పాటలాధరము
నెలవంక బొమలు క్రొ - న్నెలఁబోలు నుదురు
తళుకు కమ్మలును కుం - తలవిలాసంబు
తిలకంబు వలుద ము - త్తియపు ముంగరయు
తిలపుష్ప నాస హ - త్తిన పలువరుస
శ్రీకారములు నేలు - చెవులును మించు
రాకేందు నిభమైన - రమణి నెమ్మొగముఁ
గానక నేనర - గడియైనఁ దాళ
లేను లక్ష్మణ సీత - లేదేమిసేతు? 5200
కమనీయశంఖమం - గళమైన గళము
గమగమ మను పచ్చి - కస్తూరి తావి
మిక్కుటంబుగమారు - మెడవెట్టి కఱచి
రక్కసుఁ డా సీత - రక్తపానంబు
సేయునప్పుడు దలఁ - చెనొసుమీ నన్ను?
కూయుచు "రఘువంశ - కుంజరా" యనుచు
సీత యొక్కతయు వ - సింపుచోఁ గెంపు
రాతిచొక్కపుటాంగ - రములు నీలంపు
గాజులు వజ్రాల - కడియముల్ రత్న
రాజికంకణములు - రంజిల్లు కేలు 5210
తగులనీయక తా వి - దర్చికొనంగఁ
దెగిపట్టి విఱుచుకఁ - దినియెనో యసుర
నిన్ను శృంగారించి - నిలిచి రాక్షసుల
వెన్నా డి తినుఁడని - విడిచిపోయితిని!
కానవే నీవైనఁ - గమలాక్షి సీత
తానెందునున్నదో - తమ్ముఁడ! వెదకు
హా! సీత! పోయితి - వా? నన్నుఁ బాసి
హా! సుమిత్రాకుమా - రా! సీతయేది?
హా! దైవమా! యంచు - నరగన్ను మొగించి
పోదమా వెదక నా - పొదరింటిచాయ?" 5220
అని యొంటి బరువెత్తి - యటనిల్చి మఱలి
మునుపున్న కడకుఁ ద - మ్ముఁడు దాను మఱలు
చూచిన చోటులే - చూచుఁ గూర్చుండు
లేచుఁ గూర్చుండు తా - లిమిలేక పొరలు
చరులలో వెదకును - సానువులెక్కు
గిరులు సాధించు తీ - గెలుద్రిప్పి చూచు
దొనలు పరీక్షించు - తోఁటలు దిరుగు
వనములు వెదకు శై - వలిను లీక్షించు
మేను మ్రాన్పడి నిల్చు - మిన్నక నవ్వుఁ
దానూరకే పల్కు - తలయూఁచి వగచు 5230
కన్నీరు రాలుచుఁ - గరయుగళంబు
మిన్నక పొడ వెత్తి - "మేదినీతనయ
జానకి" యని పర్ణ - శాలకు వచ్చి
తానందుఁ బడి ముహూ - ర్తము మూర్ఛనొంది
తెలిసి కన్ దెఱచి న - ల్దిక్కులు జూచి
వెలవెలనై తల - వ్రేలంగవైచు
"అక్కటా! లక్ష్మణ! - యవనిజ వోయె
నెక్కడ వెదకుద - మేమి సేయుదము?
ఎందు వోవుదు మింక - నెవ్వారు దిక్కు?
కందునే సీత చ - క్కని మొగంబింక?" 5240
అనుచు దిగ్గనలేచి - "యదె సీతవచ్చె"
అని "కౌఁగిలించెద" - నని గమకించి
కామునివలఁ జిక్కి - కళవళంబంది
యేమియుఁ దెలియక - "ఏమే! లతాంగి!
పొలయల్క లెంతయుఁ - బ్రొద్దునీకేల?
అలిగి మోమటుద్రిప్ప - నగునె యిందాక?
పరిహాసమునకై నఁ - బాసి యుండుదురె?
తరణి! నాచెంతఁ గై - దండగారాదె?
డగ్గరిరమ్ము చి - ట్టకముల లేని
సిగ్గుల మరుమోము - చేసి యుండుదురె? 5250
నీవు పెంచిన మృగీ - నివహంబుఁ గంటె
నావలె నిన్ను గా - నక కలంగెడును
కన్నియ! కన్నీరుఁ - గార శోకింపు
చున్నవి దయచూచి - యూరార్సు మిపుడు
పక్ష్మలాక్షిని సీతఁ - బాసినవెనక
లక్ష్మణ! నాకు నే - ల శరీరమింక?
పోపుచున్నవి ప్రాణ - ములు నిమిషమునఁ
గావవే జానకి - గన్నులఁ జూపి
యేనింద్ర పదమున - కేఁగిన యవుడు
తానందు వచ్చి మా - తండ్రి కోపించి 5260
'పదునాలుగేండ్లు నా - ప్రతినఁ జెల్లించి
తుదిరాక యిటకు వ - త్తురె నట్ట నడుమ
హానిఁ జేసితివి నా - యాజ్ఞకు భ్రష్ట
వై నీవు దబ్బర - లాడిపోయితివి
వ్యర్థజీవనుఁడవై' - యనుగదా! నన్ను
నర్థించి యింద్రాదు - లందఱు వినఁగ
నేల పోవుదు దివి - కేఁ బోక యెచట
నేల నిల్తును సీత - నెడబాసి నపుడె?
హీనమానవు కీర్తి - యెడవాసి నటుల
జానకి ననుడించి - చనియె సౌమిత్రి! 5270
జలకేళి కేఁగెనో? - జానకి పోవఁ
దలఁపదెన్నడు నొంటి - దావెంట బోక.”
అనుచు దిగ్గన లేచి - యదెపర్ణ శాల
వెనక చాయను సీత - విధమునఁ బోయె
సౌమిత్రి! పొమ్మ”న్న - జని యందు వెదకి
యామేర లేదని - యతఁడు వల్కుటయు
విలపించునెడ రఘు - వీరునిఁ జేరి
కలఁగుచు సౌమిత్రి - కన్నీరుఁదుడిచి
—: లక్ష్మణుఁడు రాము నోదార్చుట :—
“స్వామి! యాబలిచేతి - జగతిఁ గైకొనఁడె
తామున్ను శౌరి సీ - తయునట్ల నీకుఁ 5280
జేకూడు నేటికి - చింతిల్ల నింత
మీకు నాపదలు క్ర - మించు ధైర్యమున
నోరువు గలిగిన - నొచ్చెంబు లెల్ల
దీరు నెవ్వరికైన - ధృతి వదలుదురె?”
అని వేడుకొనుచుండ - “హా! సీత!" యనుచుఁ
—: రాముఁడు మఱల సీతనుఁగూర్చి విలపించుట :—
బనువుచు వెలికిలి - పొటుగా నొరిగి
చేతులధరమోపి - శిరమెత్తి యార్తి
"సీత! సీతా! సీత! - సీతా!" యటంచు
కామమోహితుఁడయి - కన్నులు మొగిచి
'వామాక్షి నాచెట్ట - వట్టిన ఫలము 5290
నడవుల నిన్నాళ్లు - నలమట లొంది
కడపట నీరీతిఁ - గడతేఱవలసె '
అని కన్ను దెఱచి “య - ల్లదె వచ్చె వచ్చె
జనకజ యిపుడు - లక్ష్మణ! బ్రతికితిమి
ఎటు వోయితివి సీత! - ఇందాక నన్ను
కిటుకులఁ బెట్టి యీ - గేలి సేయుదురె?
తెరవునాకును నీవ - దిక్కింతె కాని
మఱివేరె లేదని - మదిఁ గానవై తె
ఈ శోకవారాశి - నేతేపఁ గడతు?
ఓ శశివదన! యి - ట్లొంటి నేఁగుదురె? 5300
ఏల పాడుగఁ జేసె - దీ పర్ణశాల?
బాల! ప్రవేశింపు - భద్రమౌఁగాక"
అని కంటె లక్ష్మణ! - యాసీత నన్నుఁ
గని యేడ్చుచుండగఁ - గరుణింపడయ్యే
సీత యేడది? కైక - చెల్లించుకొనియె
వేతరి నాయమ్మ - వేనోములైన
పురషాధముఁడు వీని - పుట్టువు సకల
దురితకారణము వ్య - ర్థుఁడు వెతగాక
యిల్లాలిఁ గోల్పోయి - యేమని వచ్చె
చెల్లరె యితఁడెంత - సిగ్గరి యనుచుఁ 5310
బురికి నేఁగినఁ జూచి - పొడిచి యాడుదురు
నరులెల్ల నిఁకలక్ష్మ - ణా! ఏది బుద్ది
హా! కైక! హా! లక్ష్మ - ణా! యేను జనక
భూకాంతుఁ జూచి న - ప్పుడు సీతనడుగ
నేమందు? నీ మాట - యించుక వినిన
నామహేళుడు వాయు - ప్రాణంబు లవుడె
తమ్ముడ! నేఁడు సీ - తనుఁ గడగాంచి
సమ్మతించిన కీర్తి - చాలదే నీకు?
ఇట మీఁద నిలిచితి - వేని నాచంద
మెటులౌనొ యాదుఃఖ - మేల చూచెదవు? 5320
పొమ్ము గొబ్బున పురం - బునకు భూజనుల
సమ్మతిఁ బాలింప - సద్ధర్మ నిరతు
భరతుని తోడనా - పలుకుగాఁ దెలిపి
ధరణిఁ బాలింప బో - ధనుఁడవుగమ్ము
కైకసుమిత్రలఁ - గౌసల్యఁ జూచి
వాకొను మందంద - వచనసంగతులు
మెల్లనే తనపాటు - మేదినీతనయ
చెల్లిపోవుటయునుఁ - జెప్ప నేర్పరివి
అమ్మలఁ బోషింపు - మని భరతునకు
ముమ్మారుగాఁ దెల్పు - ము కుమార! నీవు!” 5330
అనుచు నేడ్చుచుఁ బల్కు - నారామచరణ
వనరుహమ్ముల మీఁద - వ్రాలి లక్ష్మణుఁడు
“హా! రామ! హా! జన - కాత్మజా!” అనుచు
భోరున గన్నీరు - పొరలి పాఱంగ
శోకించు లక్ష్మణుఁ - జూచి యేమియును
వాకొన నేరక - వాతెఱ యెండ
వదనంబువాడ "న - వ్వరె? యెవ్వఁడైన
మదిఁగ్రొవ్వి క్రూరక - ర్మంబులు జేసి
యాపాపముల నెవ్వఁ - డైస నీపాటి
యాపదలకు నోర్చు - నాయనే కాక 5340
పాపముల్ చేసిన - పరిపాటి తనకు
నాపదల్ దొంతర - లై చుట్టుకొనియె
రాజుతండ్రి నిజంబు - రాజ్యంబు విడిచి
భూజనంబులఁబాసి - భోగముల్వదలి
యడవులు పట్టి యి - ల్లాలిఁ గోల్పోయి
చెడియెడు చేటులఁ - జేకొనవలసె
నిన్నాళ్లు నీసీత - నెడవాయకుండి
యన్నియు మఱచితి - నన్ని దుఃఖములు
మూట గట్టుకయెట్లు - మోవనోపుదును?
చాటి చెప్పెదఁ దన - చావు సిద్ధంబు! 5350
మఱచితిమోయి లక్ష్మణ! మనచేత
కొఱమాలి చెవులు ము - క్కును బోపనాఁడు
జంతరక్కసివచ్చి - జానకిఁ బట్టి
యింత వేగిరమున - నిటుమ్రింగివోయె
ఆముక్కిఁడి నిశాటి - యవనిజ దిక్కు.
లేమిని చంకఁగీ - లించి పోయినదొ?
తామరసాననం - దామరసాక్షి
తామరల్ గోయ గో - దావరీనదికి
జనియెనో? చూతము - సౌమిత్రి! మున్ను
తనుబాసి యొంటిగాఁ - దరలదెచ్చటికి 5360
లోకంబులెల్ల నా - లోకింతు వీవు
లోకలోచనుఁడవు - లోలాక్షీ సీత
యెక్కడ నున్నదొ - యెఱిగింపవయ్య?
మ్రొక్కెదమిదె కేలు - మోడ్చి మార్తాండ?
ఇలయెల్ల జరియింతు - వెప్పుడు నీవు
మలయసమీరణ! - మా సీత యేది?
ఆకాశవాణి! నీ - వైన భూపుత్రి
యేకడ నున్నదో - యెఱిఁగింపవమ్మ!
నీపట్టి యెటువోయె? - నీవై న సీతఁ
జూపవే కరుణతోఁ - జూచిభూదేవి!" 5370
అనునంత సౌమిత్రి - యంజలి చేసి
యనఘాత్మ! విపదిధై -ర్యమనఁగ వినరె
సకలయత్నముల ను - త్సాహంబె మనుజు
లకు సకలార్థ మూ - లములండ్రు బుధులు.
సర్వప్రయత్నద - క్షత మదిఁ బూని
యుర్విజ వెదకు ను - ద్యోగంబు సేయ
జానకి యెటువోవు - జగతిపై లేక
మానునే? యుండిన - మనకు దాఁగెడినె?
ఇదివచ్చు వైదేహి - యేమిటికయ్య
మదిలోన నింతయు - మ్మలికింప మీకు? 5380
చాలింపుఁడని" పల్కు - సౌమిత్రిమాట
నాలకించియు నాలి - యందు విరాళిఁ
దాలిమిలేక "గో - దావరీ సలిల
కేళికి సీత యేఁ - గినదేమొ పోయి
చూచి రమ్మని" పల్కఁ - జూచెద నంచు
నేచాయ నచ్చోటి - యిరుకెలంకులును
వెదకి లేదని వచ్చి - విన్నవించుటయు
మది నమ్మలేక ల - క్ష్మణుఁడును దానుఁ
—: రామలక్ష్మణులు వెదకుచుఁ ద్రోవలోగనఁబడిన
గుఱుతులచే సీత కొనిపోవఁబడెనని యెఱుంగుట :—
బోయి "గోదావరీ - పుణ్యస్రవంతి!
ఓయమ్మ! మాసీత - యున్నట్టి చోటు 5390
తెలుపవే! యన వన - దేవతల్ నదియుఁ
దెలిపెదమనిపూని - దిగులుచే వెఱచి
రావణభయము కా - రణముగా వార
లీవిధం బనకున్న - నినవంశకులుఁడు
“కనమైతి మోయి! ల - క్ష్మణ! యింకమీఁద
మనమయోధ్యకుఁ బోవ - మనవారలెల్ల
యేమన్న నేమి! తా - నింటికి వచ్చి
యామిథిలాధీశు - నతివ మాయత్త
"శ్రీరామచంద్ర! మా - సీత మీవెంట
నీరాజ్య భోగము - లెల్లనుమాని 5400
వచ్చె, నెచ్చట నుంచి - వచ్చితి?” రనిన
నచ్చోట నేమందు - నాసాధ్వితోడ!
అన్నింటి మాఱు నీ - యవనిజ చెంత
నున్నఁజాలు నటంచు - నూరట చేత
నమ్మివచ్చితి లక్ష్మ - ణా! నాకు నింక
నెమ్మెయిఁ దెలవాఱు - నేమి సేయుదును?”
అనుచు నట్టటు వోవ - హరిణాది వివిధ
వనమృగంబుల రఘు - వర్యుఁడు చూచి
"మృగశాబకములార! - మృగశాబనేత్ర
జగతీతనూజ యి - చ్చట నున్నదనుచు 5410
నెఱిఁగింపరే! యన్న - నెల్ల జంతువులు
బరువుతో దక్షిణ - భాగంబు నడచి
మఱలి తోడనె నభో - మార్గంబు చూచి
ధరణిపైఁ బోరలి యెం - తయు విలపించి
మృగిఁ బట్టి యందొక్క - మృగమీడ్చి యెత్తి
గగనవీథికిఁ బోవ - గమకింపఁ జూచి
యపుడింగితజ్ఞుఁడై - నట్టి రాఘవుఁడు
"చపలాక్షి నెత్తుక - చనియె రాక్షసుఁడు
దక్షిణంబుగ" నని - తపన బింబంబు
దక్షిణాయనముగాఁ - దరలిన యట్లు 5420
రవితేజుఁడైనట్టి - రవివంశ తిలకుఁ
డవనిజ వెదకుచు - నటఁ బోవఁబోవఁ
బువ్వుటెత్తులు గొన్ని - పుడమిపై నుండ
దవ్వులఁ జూచి సీ - తాసహాయుండు
"ఇప్పువ్వుదండ తే- నీప్రొద్దె సీత
కొప్పులోఁ దురిమిన - గుఱుతు చూచితిమి
వాడనీయక భూమి - వాయువు రవియుఁ
జాడెలోపల నివి - సవరించినారు!
చూచితివే?!" యని - చూపుచు నచట
ప్రాచియౌదిశను ప్ర - స్రవణశైలంబు 5430
గనుఁగొని "మాసీతఁ - గానవే" యనుచుఁ
జినుఁగు మృగంబుపై - సింహంబురీతి
గద్దించి "నీవెఱుఁ - గక నేఁడుసీత
ముద్దియ నేర్చునె - మూలల డాఁగ?
నీవె దాచితివి కం - టిని దొంగనివుడు
వేవేగ దేవిని - విడువుము నిన్ను
నిర్ఝరంబులతో వ - నిశ్రేణితోడ
జర్ఝరితములుగా - శరపరంపరల
నిన్నుఁ జూర్ణము చేసి - నీయందుఁ గాంచి
యున్న మృగంబుల - నొకటముర్దించి 5440
వైచెదనని రఘు - వర్యుండు మఱలి
చూచి, “లక్ష్మణ! వీఁడు - సులభుఁడు కాఁడు
గోదావరీనది - గ్రుచ్చి యింకించి
యీదుష్ట శైలంబు - నినుముగాఁ దునిమి
పొడిపొడి చేసిన - ప్పుడుగాని వీరు
పుడమిజ దెచ్చి చూ - పుదురె వేఁడినను?”
అన విని శైలేంద్రుఁ - డాదశాసనుఁడు
తనమీఁదఁ గోపించి - దండించు ననుచు
నేమియు ననలేక - యిరుసులు విఱిగి
యేమూలనో తన - యిరకటంబులను 5450
జరులలోఁ బడిన కాం - చన రథాద్యములు
ధరణిజారమణు ముం - ధఱఁ బడవైన
నాతేరుఁ గనుఁగొని - యటునిటు జూడ
సీత రావణుఁడు దె - చ్చినవేళ నచట
తరువుతోఁ బెనఁగు పా - దంబుల జాడఁ
బరికించి యాచెంతఁ - బడియున్న యట్టి
టెక్కెంబు గొడుగు కే - డియమును వింటి
చెక్కలు హరులు జ - చ్చిన సారథియును
జోడును నెత్తురుఁ - జూచి రాఘవుఁడు
జోడైన దమ్మునిఁ - జూచి యిట్లనియె. 5460
“కండలు నెత్తురు - గంటివే యిచట?
ఒండొండు కనుఁగొను - ముజ్జ్వలప్రభల
వైడూర్య కవచమె - వ్వనిదియో చినిఁగి
యీడ నున్నది చూడు - మీటెక్కియంబు
బంగరుగొడుగిది - పడియున్న దొకటి
ముంగలను పిశాచ - ముఖములతోడి
ఖరములు కాంచన - కవచితాంగములు
తెరలి యున్నవి చూచి - తే? సూతునతని
చేతనున్న తరంటు - చేత నేయుండ
నీతఁడు ద్రెళ్లినాఁ - డిదె గనుఁగొమ్ము! 5470
మాణిక్యమయములై - మహిఁబడియున్న
తూణీరములు పైఁడి - తూపులు గనుము!
హేమచామరయుగం - బిరువురు పూని
యేమేరఁ బడినవా - రిదె విలోకింపు!
—: సీత నెవ్వఁడో పురుషుఁ డెత్తుకొనిపోయెనని రాముఁడు సకలజగత్తుపై కోపముఁబూనుట :—
ప్రాణనాయకి సీత - పట్టున నాకు
ప్రాణపర్యంతమౌ - పగ గల్గె నిపుడు!
మనసీత యడుగులు - మగవాని యడుగు
లెనసియున్నవి కంటె - యీప్రదేశమున
మ్రింగెనొ చంపెనొ - మేదినీతనయఁ
బొంగిలి నెత్తుక - పోయెనో వాఁడు 5480
నాతోడి పగపూని - నమ్మి ప్రాణములు
పాతకుఁ డెట్లు డాఁ - పగ నెంచెనొక్కొ?
దయచేత సకలభూ - తములందు నేను
చెయిగాచి యుండుట - చింతింపలేక
యెంతురో యింద్రాదు - లీతనిచేత
నింతయు గారని - హీనసత్త్వునిఁగ!
ధార్మికాగ్రణియయ్యు - తలమోచి యేను
ధర్మంబె చేపట్టి - దయఁగల్గి మెలఁగ
నట్టిధర్మమువచ్చి - యడ్డంబుగాక
పట్టియిచ్చెను సీతఁ - బగవారిచేత! 5490
ఇప్పుడే విల్లంది - యెల్లలోకములఁ
జప్పుడు గాకుండ - క్షణములోపలను
హరిహయబ్రహ్మరు - ద్రాదులతోడ
శిరపరంపరలతోఁ - జమరివైచెదను!
వనపర్వతద్వీప - పతియైన వసుధఁ
దునిమివైచెద నొక్క - తూపు సంధించి
మూఁడులోకంబుల - మొనచేసి యెదురు
వాఁడు గల్గునె? త్రుంప - వలచితినేని!
చంద్రాస్యకై వింట - శరమేర్చి యిపుడె
చంద్రసూర్యాగ్నులఁ - జక్కు చేసెదను! 5500
గ్రహతారకాదిన - క్షత్రకోటులను
మహిఁ గూలనేసి దు - మారంబు సేతు!
కులపర్వతము లేడు - గుదిగ్రుచ్చి యిపుడె
తొలఁగక పొడిచేసి - దుమ్ములు రేతు!
ఏడు వారాసుల - నింకించి పెద్ద
బీడులుగాఁ జేసి - పెల్లగించెదను!
పదునాల్గులోకముల్ - భస్మీకరించి
యిదియది యనకుండ - నేకంబు సేతు!
గ్రక్కున సృష్టి చీ - కట్లు గ్రమ్మించి
చక్కాడి వైచెద -సచరాచరాచరముల 5510
దరికొల్పి సప్తవా - తస్కంధములును
శరవహ్నిచేత పీఁ - చమడంచివైతు!
స్థావరజంగమా - త్మకమైన విశ్వ
మీవేళఁ గోపాగ్ని - కిత్తు నాహుతిగ!
ఇల నింగియును నింగి - యిలయును జేతు
తెలియనీయక రెండు - దెరల సేయుదును!
ఇందఱు జానకి - నిప్పుడే నాదు
ముందఱ తమకరం- బులు ముకుళించి
యునిచిన నుంచిరి - యునుపక యున్న
దునిమివైచెదను దొం - తులతోడఁ గూల! 5520
దేవగంధర్వదై - తేయకింపురుషు
లీవేళ మనసీత - నెప్పటియట్ల
వేగంబె నాచేత - విల్లందు మునుపె
జాగుసేయక పర్ణ - శాలలోనుంచి
బోయినఁ బోయిరి - పోకున్న నెటకుఁ
పోయినఁ ద్రుంతు నే - భువనంబులెల్ల
నూరక తెచ్చిన - నొప్పు కొనంగ
నేరుతుమే ధర - ణీతనూభవను!
ముడిచిన పువ్వులు - ముడిచినమేరఁ
దొడిగిన సొమ్ములు - తొడిగిన కరణిఁ 5530
గట్టిన వస్త్రంబు - గట్టినయట్లు
పెట్టిన తిలకంబు - పెట్టినమాడ్కి
వేసిన కీల్గంటు - వేసినజాడఁ
జేసిన వీడెంబు - చేసినపోల్కి
నవ్విన నమ్మోము - నవ్వినరీతి
జవ్వని దెచ్చియుం - చక మాననిపుడు!"
అని జడల్ సారించి - యమరంగముడిచి
తన చీరములు కటి - స్థలి బిగ్గఁజుట్టి
నుదురు చెమర్పఁ గ - న్నులు జేవురింపఁ
బెదవులు గదల ద - ర్పించి కన్ బొమలు 5540
ముడివడ మును పురం - బులమీఁద నలుక
వొడిమ నిల్చిన చంద్ర - భూషణుండనఁగ
"తే విల్లు” తెమ్మని - తీసి సౌమిత్రి
చేవిల్లు గైకొని - శింజినిఁగూర్చి
తనయంపపొదినుండి - తలచూపు నొక్క
పెనుత్రాఁచు వంటి య - భేద్యశరంబు
వలకేలఁ బట్టి య - వార్యరౌద్రమున
నిలపట్టికై రాముఁ - డిట్లని పలికె.
వినుము "లక్ష్మణ! నాదు - విశిఖరాజంబు
ధనువుతో నిపుడు సం - ధానంబు సేయ 5550
జనులకు ముదిమియుఁ - జావునుఁ బుట్టు
వును గాలమును గర్ము - వును దప్పనట్లు
తప్పదు చూడ మి - త్తరి పర్ణశాల
యిప్పుడున్నదొ లేదొ - యింటిలో సీత!
తొడుగగునే నాదు - తూపని" పలికి
కడునల్కతో లయ - కాలాగ్నిరీతి
పగలింటి సూర్యుని - పగిది నున్నట్టి
జగదేకవీర కౌ - సల్యాకుమారు
రామచంద్రుని పాద - రాజీవయుగళిఁ
దా మౌళిఁ గీలించి - తలఁకి వేలేచి 5560
యమ్ము సంధించిన - యన్న కేల్వట్టి
సమ్మతపఱప ల - క్ష్మణుఁ డిట్టులనియె.
—: లక్ష్మణుఁడు రామచంద్రుని శాంతింపఁజేయుట :—
"స్వామి! కృపాపర - జలధివి, శాంత
భూమికుండవు, సత్య - బోధాత్మకుఁడవు,
సకలసంరక్షణ - శాలివి, నీకు
నొక సీతకై యిట్టి - యుగ్రభావంబు
తగునయ్య? ఏనిమి - త్తముగఁ గోపించి
జగతి జీవుల నెల్లఁ - జంపఁ బూనితివి?
చంద్రుని చలువ భా - స్కరుని వేడిమియు
నింద్రుశౌర్యంబు మ - హిక్షమాగుణము 5570
నీయందు నీకీర్తి - నిజముగా నెపుడు
పాయ నేర్చునె? యేల - పదరెద రిపుడు?
నేర మొక్కఁడు సేయ - నిఖలలోకములు
నోరామ! పొలియింప - నూహసేయుదురె?
గుఱుతులు మనమొక - కొన్ని చూచితిమి
వెఱచి పాఱిన నేల - విడుతుము వాని
నెచటికిఁ గొనిపోవు - నీసీత నొకరుఁ
డచలుఁడై మెల్ల నే - యరయుద మిపుడు
జానకికై యొంటి - జగడ మిచ్చోట
నైనది యెవ్వఁడో - యడ్డంబు వచ్చె! 5580
తెలియుద మిది నీదు - దేవేరి నొకఁడు
ములుచయై కొనిపోవ - మూఁడులోకములు
నీకేమి సేసె? దీ - నికి నింత తెగువ
కాకుత్థ్సకులదీప! - క్రమ మౌనె సేయ?
కారుణ్యమూర్తివి - కల్యాణనిధివి
నీరామ కెవ్వఁడు - నేఁడింత కీడు
దలఁచెనో యట్టి పా - తకు ద్రోహిఁ బట్టి
తలఁ ద్రుంపు మిది రాజ - ధర్మమై యుండు
భూమిజ వెదక ని - ప్పుడు చింతయేల?
ఈమౌను లున్నవా - రేనున్నవాఁడ 5590
శోధింత మెందైనఁ - జొచ్చి జానకిని
సాధింత మింకవి - చార మేమిటికి?
పోఁబడి దెలిసియుఁ - బోనీయ మనము
ఛీ! బీదలమె! యెందు - సీత లేకున్న
సురల వేడుద మట్టి - సురలును సీత
తెరవు జెప్పకయున్నఁ - దీఱనిపనికి
నేను గల్గియు మీకు - నేల చింతిల్ల?
జానకిఁ దెచ్చి యీ - శాలాంతరమున
నిలుపుదు వజ్రస - న్నిభములౌ బాణ
ములచేత జగము ని - ర్నూలంబు సేతు! 5600
గాక యీమాటకుఁ - గల్లలాడినను
మీకుఁ దమ్ముఁడనుగాను - మీ రల్గనేల?"
అనుచు వెండియును సా - ష్టాంగప్రణామ
మొనరించి శాంతుఁ జే - యుదునని పలికె.
—: లక్ష్మణుఁడు రామునకుఁ గర్తవ్యమునుఁ దెలుపుట :—
"తపములు గావించి - దానంబు లిచ్చి
జపములు సేయించి - శాంతులు నడిపి
యజ్ఞంబు లొనరించి - యమరులఁ గొల్చి
ప్రాజ్ఞుఁడు దశరథ - పార్థివోత్తముఁడు
నోఁచి కన్నట్టి స - న్నుతపుణ్యమూర్తి
వాచక్రవాళ వి - శ్వావనియందు! 5610
ఏ తండ్రి పుత్రకు - నెడవాసి పొలిసె
నోతండ్రి! నీతండ్రి - యొక్కఁడేకాక!
అట్టి యనంతక - ల్యాణగుణంబు
లిట్టిమూర్తి వహించు - నీ వల్గఁ దగునె?
నీకు దాసుఁడగాన - నే నన్నమాట
చేకొనఁ బాడి మీ - చిత్తంబులోన
నీవు దలంచు పూ - నికచేత దండ
కావనిలోపలఁ - గల మునీంద్రులకు
నభయమిచ్చిన పూన్కి. - యదియునుఁ దప్పి
సభయులై వారెల్లఁ - జత్తు రీక్షణమె! 5620
అందాకనున్నదె - యటు మనవార
లందఱు నిప్పు డయో- ధ్యాపట్టణమునఁ
బురముతోడుత మ్రగ్గి - పోదు, రామున్నె
భరతుఁడుం జచ్చు కో - పము చెల్లునయ్య?
కోపంబుచేత మీ - కు యయాతిపాటు
ప్రాపించు నిపుడు నా - పలుకు గాదనిన
మన కులగురుఁడు తా - మరచూలి పట్టి
ఘనుఁడు వసిష్ఠుఁడు - కన్నబిడ్డలను
కోపంబుచేతనె - కోల్పోయెఁ గాన
పాపంబుఁ దెచ్చు కో - పము రామచంద్ర! 5630
గ్రహములచే పీడ - గ్రహరాజులైన
యహిమాంశుఁడును జంద్రుఁ - డనుభవించియును
దాళిరి గాక చే - తను గాక శక్తి
చాలక యుండిరె - జానకీరమణ!
దైవయత్నంబె ప్ర - ధానంబటంచు
దేవ! నాతో నాన - తి యొసంగువారు
పనిలేదు మీకిట్టి - పలుకు, దైవంబె
యనుకూలమైన నీ - యాపదల్ గలవె?
ఎప్పుడు నింద్రాదు - లేనియు నలిగి
తప్పింప నేర్తురె - దైవయత్నంబు! 5640
దైవయత్నంబుచేఁ - దలఁగిన సీతఁ
గావలెనని యెంత - కళవళించినను
వచ్చునె? రాదని - వసుమతి నెల్ల
చిచ్చఱయమ్ములఁ - జిదిమివైచెదవె!
మన యదృష్టంబుచే - మఱలిన మఱలె,
జనకజ రాకున్నఁ - జచ్చినవారి
తోడి పాటగుఁగాక! - తొయ్యలి కొఱకు
మూఁడులోకముల ని - ర్మూలింప నగునె?
ఈ వియోగమునకు - హేతువు లేక
పొవునె? సీత య - ల్పునిభార్యకరణి 5650
స్వామి! ప్రాకృతునికై - వడి శోకమోహ
తామసవృత్తులఁ - దల్లడింపుదురె?
పడుచువాఁడాడిన - పలుకని నీవు
కడవఁద్రోయక వివే - కము దెచ్చుకొనుము.
ప్రాజ్ఞుఁడ వెఱుఁగుదు - వాత్మలో నిట్టి
యజ్ఞాన మితరుని - యట్ల పొందుదురె?
సూరోత్తములు శుభా - శుభకరములు వి
చారించి చేసిన - సౌఖ్య మొందుదురు!
అవుగాము లెఱిఁగి హి - తాలోచనములఁ
దవులని వారలు - తలఁచి కామించు 5660
క్రియలు ఫలించునె? - కీడాచరింప
నియతమె భుజశౌర్య - నిర్వాహకులకు?
చేతనౌనని మీరు - సృష్టిలోఁ గలుగు
భూతకోటుల నెల్లఁ - బొలివుచ్చఁ దగునె?
ఎంతటి పని యిది - యెవ్వాఁడు మనకు
నింతద్రోహము చేసె - నెటులైనఁ గాని
వెదకి వాని వధించి - వెలఁదిని మఱల
బ్రదికించి సాధించి - పగఁ దీర్చికొనుము!
అయ్య! బృహస్పతి - యైనను మిమ్ము
నియ్యడ బోధింప - నెంతటివాఁడు! 5670
మిమ్ము మీరెఱిఁగి భూ - మిజఁదెచ్చు బుద్ధి
సమ్మతింపుఁడు శౌర్య - సమయంబు గాదు
దేవతలకుఁ గల - దే? శక్తి మీదు
భావ మిట్లని యేరు - పఱచి కానంగ
నుతశౌర్య! దేవమా - నుషపరాక్రమము
లతిశయంబుగఁ గల - దని మిమ్ము నెఱిఁగి
రాణివాసద్రోహి - రాక్షసుఁ బట్టి
ప్రాణముల్ గొనుట ద - ర్పంబవుగాక
వట్టి పాపంబు జీ - వశ్రేణి నేలఁ
బట్టి చంపుదురె మీ - పాటి ధార్మికులు? 5680
వదలుము శోకంబు - వాయువుచేత
గదలునే మేరువు? - గాన సైరింపు
చాలించి నాకు ప్ర - సన్నులై మహికి
మేలెంచు” మనిన నే - మియు ననలేక
పరమకారుణ్యవై - భవసాగరుండు
ధరణిజఁ బాయు ఖే - దమున నాగ్రహము
రానీక నిలిపి సా - రగ్రాహి గాన
జాసకీపతి మహా - సారాంశమైన
తమ్ముని మనవి చి - త్తమ్మున నునిచి
యమ్ము వ్రేలఁగవైచి - యల్లెన వదలి 5690
మీఁదటి కార్య మే - మియుఁ గానలేక
సోదరు నెమ్మోముఁ - జూచి యిట్లనియె.
"ఏమి సేయుద మింక - నెచటికిఁ బోవ
నే మందు వేచంద - మింతిఁ దెచ్చుటకు?
నాతోడ నాలోచ - నముచేసి పలుకు
నాతోడ” నన లక్ష్మ - ణకుమారుఁ డనియె,
"రాజీవలోచన! - రఘురామ! చూత
మీ జనస్థానంబు - నీ పంచవటియు
వెదకుద మిచ్చోట - విపినభూములను
నదులునుఁ బొదరిండ్లు - నగములు గుహలు 5700
చరులును బిలములు - సానువుల్ తావి
విరులతోఁటలు నిందు - వెదుకంగఁ గలదు,
ఇందులఁ గ్రీడింతు - రెప్పుడు నమర
సుందరుల్ కిన్నర - శోభనాంగులును
రమ్ము పోద" మనంగ - రాజాస్య నన్న
దమ్ములు వెదకుచు - ధనువులమ్ములను
జతనమ్ములుగఁ బట్టి - శత్రులఁ దునుము
యతనమ్ముఁ గని చాయ - నై వచ్చి వచ్చి
—: రామలక్ష్మణులు సీతను వెదకుచు జటాయువును జూచి సీత వృత్తాంత మెఱుఁగుట :—
ముందఱఁ గన్నులు - మూసుక వ్రాలు
మందరగిరి వోలి - మాంసరక్తములఁ 5710
దొప్పఁ దోఁగిన మేని - తోడ జటాయు
వప్పుడు బడియుండ - నల్లంతఁ జూచి
కంటివే మనజన - కతనూజ యింట
నొంటి యుండగఁ బట్టి - యోడక మ్రింగి
కెరలక గుటిక మ్రిం - గిన సిద్ధుఁ డగుచు
నరిగించు కొనఁగ సౌ - ఖ్యమున నున్నాఁడు!
మాయామృగమురీతి - మఱియొక్క దైత్యుఁ
డీయెడ గృధ్రమై - యిటులున్న యవుడె
తలఁదైవ్విపడ నిశా - తశరంబు చేత
చులకగా నేసెదఁ - జూడు" మీవనిన5720
నోటిలో నిండిన - నురుగు నెత్తురులు
మాటాడ సత్తువ - మాని గ్రక్కుచును
మెల్లనే యొకనేర్పు - మీఁ గన్నుఁ దెఱచి
చల్లగాఁ గని రామ - చంద్రుతోఁ బలికె.
“అన్న! నీ కెపుడు దీ - ర్ఘాయువౌఁగాక!
నిన్నుఁ జూచిన దాఁక - నిలిచె బ్రాణములు!
శ్రీకరం బైన సం - జీవినీలతికఁ
జేకూడ వెదకుచుఁ - జేరినయట్లు
యేయింతిఁ గోల్పోయి - యిటకుఁ జేరితిరి
యాయమ్మ నొకరావ - ణాసురుఁ డనెడి5730
దనుజుఁ డెత్తుకపోయె - దక్షిణదిశకు
తన ప్రాణములతోడఁ - దగఁ బెనవైచి
వానిచే జచ్చి యి - వ్వసుమతిఁ బడిన
వానిఁ జంపఁగ మీరు - వచ్చు టచ్చెరువు!
చచ్చినవానినే - జంపెద ననఁగ
వచ్చునె! యోరఘు - వర! జటాయువను!"
అని సీతతోఁ గూర్చి - యాడినమాట
విని శోకమోహముల్ - ద్విగుణితం బైన
చేతులనున్నట్టి - సింగాణి విండ్లు
భూతలంబున వైచి - పొక్కుచు గదిసి 5740
యిరువురు పైఁబడి - యేడ్చి “హా” యనుచు
మరుగుచుఁ "బోయేదే - మాతండ్రి" యనుచు
గౌఁగిలి వదలక - కన్నీరుమేని
పైఁగాలువలు వాఱఁ - బక్షీంద్రుమీఁది
మమతచే శోకించి - “మరణ మిట్లేల
సమకూడె పక్షిరా -జా!" యంచునడిగి
“ధరణి యొక్కని కిచ్చి - తండ్రిఁ బోనాడి
యురకె కానలువట్టి - యొంటిగా వెంట
నమ్మి వచ్చినయట్టి - నాతి గోల్పోయి
యమ్మీఁద నినువంటి - యాప్తబాంధవుని5750
చావు చూచితి మన - స్తాపదావాగ్ని
యేవెంట నారు నే - నెందులోవాఁడ
దహియించు నన్నియు - దహనుఁడా దహను
దహియించు నాదు సం - తాపానలంబు!
ఇంకించు వారాసు - లేనియు కలుష
సంకాత్మకుని నిన్ను - భంగించు టెంత?
నాకొఱ కీవు ప్రా - ణంబు లిచ్చితివి
నీకుఁ బ్రత్యుపకృతి - నేఁ జేయఁగలనే?
పటుశోరవాగుర - పాశంబుచేత
నిటు గట్టుపడి పార - మెఱుఁగక యున్న5760
ననువంటి భాగ్యహీ - నజనుఁడు జగతి
వనధి పర్యంత మె - వ్వఁడు గల్గ నేర్చు
మాతండ్రి కీవు స - మానమౌవయసు
చేత మించుటెకాదు - చెలికాఁడ వీవు
నాపాపకర్మంబు - నాదైన యట్టి
యాపదవేళకు - నడ్డంబురాఁగ
నిను బడవైచె దీ - నికి నేమి సేతు?”
అని జటాయువు మేని - హస్తాంబుజముల
నివురుచుఁ బక్షీంద్రు - నెత్తురులంట
కవుఁగలించుక “యన్న! - ఖగసార్వభౌమ!5770
ఏమాయె మాసీత - యెక్కడ బోయె?
ఏమంటె యెత్తుక - యేఁగినవాని
నెవ్వఁడు? వాని యూ - రెయ్యెడ" దనుచు
నవ్వేళ మఱుమాట - లాడ లేనట్టి
యా జటాయువుఁజూచి - “హా! పక్షిరాజ!
హా! జానకీ!'యని - యవనిపైఁ బొరలి
క్రమ్మర లేచి యా - ఖగరాజుఁ జూచి
తమ్ముఁడు విన రఘూ - త్తముఁ డిట్లు లనియె,
"నీపాటుఁ జూడక - నే స్వకార్యముగఁ
బాపంబులకు నోర్చి - పలుకరించెదను!5780
ఇటమీఁద నిను వేఁడ - నేమియు సీత
నెటవలెఁ గొనిపోయె? - నించుక వలికి
యురకుండు" మన విహ - గోత్తముఁ డొయ్య
మఱలంగ రఘువంశ - మణికి నిట్లనియె
"ఏరీతిఁ దెచ్చెనొ - యెఱుఁగ రావణుఁడు
మీరమణీమణి - మింటిమార్గమునఁ
దేరుపై నుంచుక - దిక్కేది పోవ
“హా! రామ! హా! రామ!" యను నార్తరవము
చెవిసోఁకి యరికట్టి - చేసితిఁ గయ్య
మవి వాని తురగంబు - లది వాని రథము 5790
యిది టెక్కె మిది గొడు - గిది తనుత్రాణ
నిదె శరాసము సూతుఁ - డితఁ డూడిగముల
చామరహస్తు లి - చ్చటఁ బడియున్న
చామనచాయ రా - క్షసు లిరువురును
నివి వానిహస్తంబు - లేనిట్లు బోర
జవము సత్త్వంబును - సన్నమౌటయును
తనుఁ బడనఱికి యా - తఁడు సీతఁ గొనుచు
ననుపమాత్మీయ మా - యాబలప్రౌఢి
నొకమబ్బు నొకవాన - యొక గర్జితంబు
నొకగాలి కల్పించి - యొక్కఁడు నందు 5800
నెవ్వారిఁ గననీక - యేఁగె వాఁడెఱుఁగఁ
డవ్వేళ విసగడి - యలఁ బట్టినాఁడు
ఆముహూర్తము వింద - యందురుగాన
భూమిజ నిను వచ్చి - పొందు నిక్కముగఁ
బదిగడియలకైనఁ - బదినాళ్లకైనఁ
బదినెలలకునైన - పైఁ బనిలేదు
రామ! ఈ వేళ సూ - ర్యస్వరం బొదవె
కామితసిద్ది ని - క్కముగ నీకొదవు!
కాలంబునకుఁ జిక్కు - గండెయుఁ బోలి
కాలునిచే వశం - గతుఁడయి వాఁడు 5810
పోయెను దక్షిణం - బుగఁ గుబేరునకు
దాయాది యనఁగ వా - తను క్రొవ్వుదొట్ట!
ఆవిశ్రవసుపుత్రుఁ - డఖిలకంటకుఁడు
రావణుఁడన” నోట - రక్తంబుగ్రక్కి
"యేమేమి యెటకుఁ బో - యె?" నటంచు నాస
రాముఁడు హస్తసా-రసములు మొగిచి
యడుగఁగా బిరబిర - నక్షులు ద్రిప్పి
-:జటాయువు మరణము - శ్రీరాముఁడాతని కగ్ని
సంస్కారాదులఁ జేయుట:-
విడిచెఁ ప్రాణంబు లా-విహగనాయకుఁడు!
తల వ్రేలగిల వైచి - తనకాళ్లు రెండు
నిలఁ జక్కగాఁ జాచి - యెఱకలు వదలఁ5820
బడిన జటాయువు - పైఁబడి రాముఁ
డడలుచో లక్ష్మణుడుఁ - డటులపై వ్రాలి
"నీకు నీక్రియ వచ్చె - నేయార్తి!"యనుచు
శోకింపఁ దమ్ముని- జూచి రాఘవుఁడు
"వినుము సౌమిత్రి! యీ - విపినంబులోన
దనుజుల నింతయుఁ - దాలెక్కగొనక
వీరుఁడై యరువది - వేలేండ్లు బ్రదికి
యీరాక్షసునిచేత - నిలమీఁదఁ గూలె
సీత నేఁ డొక్కని - చెఱఁ జిక్కిపోవ
నీతఁ డడ్డము వచ్చి - యిచ్చెఁ బ్రాణములు5830
జానకి బాయువి - చారం బదెంత?
ఈ నిర్మలాత్ముఁ డ- నేకపక్షులకు
రాజటు విహగసా-మ్రాజ్యంబు మాని
యాజిలోఁ బడియె నా - యవసరంబునను!
వృద్ధుఁడు దశరథ - విభునితో మొదల
బద్ధ సఖ్యము జేసి - పరమాప్తుఁడగుచు
నున్న మాత్రమె శాక యొక్కఁడు నెదిరి
వెన్నీక రణములో - విడిచె ప్రాణములు!
శూరులు ధార్మికుల్ - సూనృతపరులు
ధీరులు నున్నారు - తిర్యగాత్ములును 5840
నితని దహింపుద - మిపుడని" కాష్ట
వితతి యమర్చి పై - విహగేంద్రు నునిచి
మథనాగ్ని వేగ ల -క్ష్మణుఁడు దెచ్చుటయు
వ్యధనొందుచును రఘు - వర్యుఁ డిట్లనియె.
“పక్షిపుంగవ! నీకు - పరమధార్మికులు
దీక్షచే యాగముల్ - దీర్చు పుణ్యులును
ఆహితాగ్నులు కామి -తార్థదాతలును
సాహసాధికులును - చనునట్టిగతికి
నాయనుగ్రహముచే - నాచేతనైన
యీయగ్నిసంస్కార - హేతువుచేత 5850
నీవు వొందుదువని” - నీడజస్వామి
నావేళ దహియించి - యచ్చోటినదిని
స్నానంబుగావించి - తర్పణక్రియలు
పూనికఁ దీర్చి యా - పురుషరత్నములు
మమతతో వనమృగ - మాంసపిండములఁ
గ్రమమున నిడి మచ్చి - కను బ్రీతుఁ జేసి
క్రమ్మఱ మునిగి రా -ఘవులు శోకించి
యమ్మేరఁ బాసి వా - రవ్వలఁ జనగ
నాయెడ బంధుకృ- త్యంబుగా వారు
సేయు సంస్కారవి - శేషంబు వలన 5860
నమరత్వమునఁ బొంది - యచ్యుతపదవి
నమరె జటాయు వ - య్యర్కవంశజులు
నొకత్రోవఁ జనుచు నిం - ద్రోపేంద్రు లనఁగ
నికటాటవిని ధర - ణిజ జూతమనుచుఁ
బడమరగా గొంత- పయనంబు నడచి
యడవిలోపల దక్షి - ణాశగాఁ దిరిగి
శరచాపహస్తులై - సన్నమౌనడవి
తెరువునఁ బోవుచో - తెరువేరుపడక
కాలుమోపఁగరాని - కఱకు రానేలఁ
గాలిద్రోవైననుఁ - గానక పొదలు 5870
కోరింద పొదలును - గుంపెనగచ్చ
యీరంబులును శమిా - వృక్షముల్ తుమ్మ
మ్రానులు చండ్రలు - మద్దులొద్దులును
రేనులుఁ బెనఁగి దూ - రియుఁ బోవరాక
పాములు గాములుఁ - బందులు పులులు
చీములు దోమలు - జీండ్రుమనంగ
నట్టికాఱడవిలో - నర్ధయోజనము
పట్టునఁ గ్రౌంచాఖ్యఁ - బరగుకాననము
చేరి యయ్యడవిలో - సీతను వెదకి
వారుగానక కొంత - వడివడదీరి 5880
బరవసంబున మూఁడు - పరువులనేల
యరిగివారలు మతం - గాశ్రమంబునకుఁ
జనుబుద్ధితో నడు -చక్కిఁ జీకట్లు
పెనఁగొన్న యొకశైల - బిలము నీక్షించి
-:లక్ష్మణుఁ డయోముఖిని విరూపనుఁ గాఁ జేయుట:-
చేరి యాచెంగటఁ - జీరాడుకడుపు
కోఱలు నెఱ్ఱని - గుండ్లును పీఁచు
తలవెంట్రుకలు క్రూర - దంతముల్ గదురు
వలచుమే నట్టల - వంటిచన్నులును
బిల్లకాళ్లును మొద్దుఁ - బిక్కలు పెద్ద
పల్లముముక్కు చ - ప్పటయైన పిఱుదుఁ5890
గలిగి లక్ష్మణుఁ జూచి - కామాంధ యగుచు
వలకేలు వట్టియా - వలవచ్చు రాము
సడ్డసేయక "నీకు - చాలలోనైతి
వెడ్డువెట్టిననిన్ను - విడిచి పోఁజాల
నీపుణ్యఫల మిది - నే నయోముఖిని
వీపుపై నినుదాల్చి - విహరింపనేర్తు
నెటువలెయుంటివో- యిన్నాళ్లు నొంటి
నిటమీదననుఁ గూడి - యెల్లకాలంబు
రాజునువలెఁ గాపు - రము సేయు మీవు
నాజవ్వనంబు మా - నంబు నీసొమ్ము5900
కౌఁగిలి"మ్మని పల్కఁ - గన్నెఱ్ఱఁ జేసి
తాఁగత్తి జళిపించి - తల పట్టివంచి
చెవులును ముక్కునుఁ - జండ్లు పోఁగోసి
రవణంబుఁ జెఱచి పా - ఱంగఁ దోలుటయు
నతిభీతిచేఁ బారె- నామడమేర
నతిగని రఘువీరుఁ - డలఁతిన వ్వొలయ
నావలజను చోట - నపశకునములు
భావించి యన్నతో - బలికె లక్ష్మణుఁడు
భూమిజారమణ ! యి - ప్పుడు మదిఁగలఁగె?
నేమియో యదరెడు - నెడమభుజంబు 5910
యెప్పుడు నాకైన - యీనిమిత్తములు
తప్పవేక్రియ నుపద్ర - వము లందెదమొ?”
అనియొక నాలుగై - దడుగులమేరఁ
జనునంత నట్టహా - సము నింగిముట్ట
నొకమ్రోఁత వినవచ్చె - నురుమునుఁ బోలి
యొకదుమ్ముతో గాలి -యునుఁ జుట్టుకొనియె.
విని యాటదోయను - వేళ వంజులక
మనుపక్షి యొక్కమ - హాశాఖనుండి
యెలిచిరొప్పినఁ గంటె - యీపైఁడికంటి
గెలుపుచెప్పెడి నేమి - కిటుకు రాఁగలదొ? 5920
యన్నియుఁ గనుఁగొంద - మనుచు సౌమిత్రి
యన్నతో నాడియు - నాడకమునుపె
-:కబంధదర్శనము:-
యేమ్రోఁత వినవచ్చె - నెందుండి యెచట
నామ్రోఁతలో పర్వ - తాకారుఁ డొకఁడు
కాటుకబలుఁగొండఁ - కైవడి పెద్ద
మోటురీతిని నురం - బున తల మెఱయ
పచ్చనై మండుచుఁ -బటువైనకొమ్ము
బొచ్చులో తెల్లని - పుసులు జారంగ
పెనుబొమ్మపై నెడ - భీమదృష్టులనుఁ
గనుపట్టు నొక పెద్ద - కంటఁ జూచుచును5930
పందికొమ్మలవంటి - బలుకోఱ లమర
కందిన మైచాయ - కడలిర్లు కొలుప
వెడలుపౌ బొందితో - వెంట్రుక ల్మేన
పొడువాటి దబ్బనం - బుల చాయనిక్క
సెలవులు నాలుక - చే నాకికొనుచు
బలియుఁడౌ యోజన -బాహు కబంధుఁ
జేతులఁ జిక్కిన - సింహాదిజంతు
జాతంబు మెసవురా - క్షసుఁ దేఱిచూచి
తలలేని మొండెమై - తమపోవు త్రోవ
తొలఁగరాకుండ చే - తులు బారచాఁచి5940
యుండు దానవుఁ జూచు - చుండుచో నాఁడు
చుండు నేలనే యుండి - యొడిసి హస్తముల
పరువునేలనె తమ్ముఁ - బట్టుక తివిచి
పిరువీకుడులు చేసి - భీతి వుట్టించి
యెక్కిడునట్టి వీం - డ్లెందుకో కాని
చిక్కిరి పొమ్మని - చేరఁద్రోయంగ
ధైర్యంబు వదలక - తల్లడ పడక
శౌర్యసహాయుఁడై - జానకీవిభుఁడు
యేమియు ననకున్న - నెట్లకొ యనుచు
సౌమిత్రి చాలవిచా - రంబు నొంది5950
యొక్కెడ నైతిమి - మొడిచి మ్రింగెడును
దిక్కేది యని గుండె - దిట దప్పి చెదర
బాలుఁడు గావున - బ్రదుకుపై నాస
చాలంగఁ గలిగి ల - క్ష్మణుఁ డిట్టులనియె
“ అన్న! చిక్కితిమి గ - దయ్య! యీయసుర
నిన్ను నన్నునుఁ బట్టి - నేఁడు మ్రింగెడును
యిరువురి బోనీయఁ - డెటులైన వీని
చెఱుకు నన్నొప్పన - చేసి నీ బారి
తప్పించుకొని పొమ్ము - తనవంటివార
లిప్పుడుంచిననుఁ బో - యిన నేమి ఫలము? 5960
నీవు గల్గినఁ జాలు - నీ దేవిఁ గూడి
దైవంబు తోడుగా - ధరణి యేలుచును
సాకేతనగరిలో - జనకజతోడు
వాకొని యొకమాట - వచ్చిన యపుడు
ననుఁ దలఁపుఁడు గాద - నఁగ నేల మీకు
మనమిర్వురముఁ గూడి - మడిసిపో నేల?”
అనిన వత్సలత ద - యాజలరాశి
మనసు గలంగి ల - క్ష్మణున కిట్లనియె
ఏల యింత విచార - మింతటి పనికి 5970
బాలక! నీ కిట్లు - పలుక ధర్మంబె?
యేను గల్గఁగ నని - యీమాట పలుకు
లోనుగా వాఁడు కా - లునిరీతి మండి
"మీర లెవ్వరు? పేరు - మీ కెద్ది? యేమి
కారణంబుగ నిట్టి - కంటకాటవికి
జేరితి రాఁకటి - చేనున్న నాకు
మీర లాహారమై - మించితి రిపుడు
కైదువుల్ నట్టి శృం - గములతో నొప్పు
వీదిలోపలి మహా-వృక్షంబు లనఁగ
పోలిక నాముఖం - బునఁ బడినారు
చాలింపుఁ డిఁక నాశ - చావు సిద్ధంబు"5980
అనిన మాటలు విని - యాస్యంబువాడఁ
గని తమ్ముఁజూచిరా - ఘవుఁ డిట్టులయె
"అక్కటా! మనము రా - జ్యమునకుఁ బాసి
యిక్కడ నొకఁ డింతి - నెత్తుకపోవ
నరయుచుఁ గడలేని -యాపదనొంది
తిరుగుచునుండ న - దృష్ట మీరీతి
వచ్చునే మనవంటి - వారికి నెందు
నెచ్చోట నెవ్వారు - నెఱుఁగనికీడు
కాలంబు దొడ్డది - గావున దాని
వేలుపులకు గెల్చు - విధమేఱు పడదు5990
దైవంబునకు హెచ్చు -తక్కువ లేదు
కా వడ్డములు వివే - కపరాక్రములు
యిసుముకట్టలు నది - నేరీతినాఁగు
పొసఁగవు వ్యర్ధమై - పోవునంతయును"
అనిసత్యధర్మప - రాక్రమశాలి
జనకజాభర్త యో - జన సేయుచుండఁ
జూచి కబంధుఁ "డి - చ్చోనాకుఁ దగిలి
యిచాయ గుజగుజ - లేల పోయెదరు?
-:రామలక్ష్మణులు కబుంధుని హస్తములను ఖండించుట:-
విధిపడ నీ పని - విధమునఁ దనకు
నదనుకు దొరికితి - రాహార మగుచు6000
రండు కూర్చుండుఁ డూ - రక తామసింప
నుండలేఁడు కబంధుఁ - డోర్చి యాఁకటను”
అనఁ దెల్విఁ దెచ్చుక - యన్న నెమ్మొగముఁ
గనుఁగొని యలిగి ల - క్ష్మణుఁ డిట్టులనియె.
“చేతులే వీనియా - స్తి మరేమి లేదు
హేతిచేఁ దెగవ్రేత - మిరువుర మెదిరి
వీరి వారినిగెల్చు - విధమున మనల
నూరక దిగమ్రింగ - నూహించె వీడు
యూపంబు చెంగట - నూరకయుండు
నాపశువులఁ బోలి - యల్పులరీతిఁ6010
జచ్చుట నిజమయ్యుఁ - జంకలకత్తు
లెచ్చట నేపని -కింక డాఁచెదము?
చేతనైనట్లు చూ - చినఁ గాక తీర
దీతఱినని హేతి - నెడమభుజంబు
ధరఁగూలఁ దా నేయ - దక్షిణభుజము
నరకె సీతాప్రాణ - నాథుఁడు దునియ
నెప్పుడు తనచేతు - లిలమీదఁ ద్రెళ్లె
నప్పుడే బలుకొండ - యనకబంధుండు
కూఁతలచేత ది -క్కులు పెల్లగిల్ల
రోఁత పుట్టఁగ నెత్తు - రులు మేననిండ 6020
గదలక మెదలక - కడు దైన్యవృత్తి
సదయాత్ముఁడగు రామ - చంద్రున కనియె
-:కబంధుని పూర్వవృత్తాంతము:-
"ఓరాజసుతులార! - యుగ్రహసాహసులు
మీ రెవ్వరయ్య! యే- మిటికి వచ్చితిరి?
వినవలతును చేరి - వినిపింపుఁ" డనిన
దనుజునిఁ గని సుమి-త్రాపుత్రుఁ డనియె
"ఏము దాశరథుల మితఁడు రాఘవుఁడు
సౌమిత్రి నేను మ - జ్జనకుని యాజ్ఞ
వనులనుఁ గ్రీడింప - వచ్చితి మిచట
జనకజ నీరామ - చంద్రుని దేవి 6030
వంచించి నేడు రా - వణుఁ డనువాఁడు
పొంచి యెత్తుక పోవఁ - బోనీక మేము
వెనుకొని సీతను - వెదకుచు వచ్చి
నినుగంటి మెయ్యది - నీదు చందంబు
పరమొండెమునుఁ బోలి - పదములు లేక
శిర మురంబునఁ జాల - చేతులుఁ జాఁచి
యీకతంబున నుండ-నెవ్వఁడ వనిన”
కాకుస్వరమున రా - ఘవుల కిట్లనియె
“మీకు నిప్పుడు సేమ - మే? యన్నలార!
నాకు మున్నింద్రుఁ డా - నతి యిచ్చుమాట 6040
కరివచ్చె రామల - క్ష్మణు లౌదు రిపుడు
తఱివచ్చె దనకుఁ నిం - తయు నిక్కువంబు
పుడమిపై వెదకుచుఁ - బోయెడి తీవె
యడుగులఁ దగులుకొ - న్నట్టి చందమునఁ
దన పుణ్యమున కర - ద్వయము మీరిట్లు
తునిమి వైచితిరి క - త్తుల చేత నరికి
తన కిట్టి వికృత గా - త్రంబు ప్రాపించు
ఘనమైన హేతువు - గల దెట్టు లనిన
నాదికాలంబున - నాదిత్యులందు
నాదిత్య చంద్రాన - లాభ తేజమున 6050
మీఱుచు దారిలో - మేటినై సత్య
సారంబుచేఁ గ్రొవ్వి - చాలగర్వమున
నిట్టి వాళకముతో - నెల్లర వెతలఁ
బెట్టుచు వెఱపించి - బెదరింపుచుండ
చెంతకు నొకస్థూల - శిరుఁడనుమౌని
యంత నింతటవచ్చి - యతిఘోరమైన
వేషంబు తోడి నన్ - వీక్షించి వెఱచి
కాషాయవస్త్రంబుఁ - గటిసీమ జాఱ
గందమూలఫలాది - కంబులు భీతి
నందుఁ బాఱగవైచి -యార్తిచేఁ బరువఁ 6060
గని యేను నవ్వినఁ - గాంచి" యమ్మౌని
ననుఁగా నెఱింగి మా- నసములో నలిగి
యిట్టిభూమికతోడ - నిందుండు మనుచు
దిట్టి శపించినఁ - దీఱని వగల
నడలుచు నమ్మౌని - యడుగుల వ్రాలి
కడు వేఁడుకొన్నచోఁ - గరుణించి యతఁడు
రామలక్ష్మణులీ య - రణ్యంబులోన
నీమీఁద నలిగిన - నీదు కేల్దోయి
తునిమి మేను దహింపఁ - దోడనే ముక్తి
గనియెదవని" భావి - కార్య మూహించి 6070
నను వీడుకొని పోయి - న యనంతరంబ
దనువను వానికి దనయుఁడ నగుచుఁ
దమ్మిచూలినిఁ గూర్చి - తప మాచరించి
కొమ్మని యతఁడు నా - కు వరంబు లొసఁగ
నావరగర్వమ -హానుభావమునఁ
గావరంబున బల - గర్వంబు దొట్టి
పాకశాసనుతోడ - బవరంబు సేయ
చేకొద్ది వజ్రంబు - చేతన శిరము
నరికిన తలద్రెవ్వి - నరములతోడ
నురముపై వ్రేలాడు - చున్న నే వెఱచి 6080
శరణన్న నింద్రుఁడు - జలజసంభవుని
వరము తాఁ బాలించి -వధియింపఁడయ్యె
యెన్నినా ళ్లిటులుందు - నే నంచు నడుగ
తన్నుఁ గన్గొని యిట్లు - తలయుండఁ జేసి
కడుపులో నోరిచ్చి - కరయుగళంబు
నిడుపుగాఁ బాలించి - నీదు చేతులకు
దొరకినయట్టి జం - తువుల మ్రింగుచును
చరియింపు మని పల్కి- సౌమిత్రితోడ
శ్రీరాఘవుఁడు వచ్చి - చేతుల హేతి
ధారచే ఖండించి - దహియించునప్పుడు6090
గాంతువు ము క్తి ని - క్కడ ననిపోవ
నింతగాలంబు నే - నీగహనమునఁ
జేతికి లోనైన - సింహాదిజంతు
జాతంబు నిన్నాళ్లు - చలపట్టి మ్రింగి
వచ్చితి రేను మీ - వదనముల్ గంటి
నిచ్చోట నా కోర్కి - లీడేరె నిపుడు
నమరేంద్రుఁడును కల్ల - లాడెఁగా యనుచు
మిముఁ గన్నదనుక న - మ్మిక చాలదయ్యె
రామలక్ష్మణులు మీ - రలె నిక్కవముగ
సామాన్యుఁడ క వై - శ్వానరుఁ దెచ్చి 6100
తనమేను మీరలు - దహియింపు డందు
ననుపమవాక్ సహా - యంబు చేసెదను
నామాట మీనెమ్మ - నములకు హితము
సేమంబునియ్య నే - ర్చినది గావునను
కావింపుఁడట్ల” నఁ - గని రఘువరుఁడు
భావించి ప్రీతిఁ గ - బంధున కనియె
"ఏము లేనట్టిచో - నింటిలోనున్న
భూమిజఁ జెఱఁగొని - పోయె రావణుఁడు
యింతమాత్రంబె మే - మెఱుఁగుదు మతని
నింతటివాఁడని -నిది నెలవనియు 6110
నెఱుఁగ మేరీతి వాఁ - డెచ్చటనుండు
పరిజనం బెంత యే - పట్టణం బునికి
మాసీత యేమయ్యె - మఱి నీవె కాని
యీసుద్ధి దెలుపువా - రెవ్వరు లేరు
"యే మనాథలము ది - క్కెఱుఁగక వెతలు
నీ మాడ్కి నడవుల - నెటుబోదు మనుచు
చేబారలిడు చోటఁ - జేసిన పుణ్య
మీ బాంధవునిఁ దెచ్చి - యిచ్చెను మాకు
నోయయ్య! తెలుపవే - యొకమాట యనిన
వాయెత్తి యిట్లని - వచియింప లేక 6120
సింధురగమనుఁ డా - శ్రీరాము ప్రాణ
బంధుఁడై నట్టిక - బంధుఁ డిట్లనియె
"సీత కార్యము మీకుఁ - జెప్పెద దహన
హేతిలో వైచి ద - హింపుము నన్ను
అంటిది దహియించి - నప్పుడుగాని
యంటదు నాకు ది - వ్యజ్ఞానశక్తి
యిట్టి పాపంబుల - కిరవైన మేన
నెట్టు దెల్చుదు మీర - లెంచిన తలఁపు
రావణు నెఱుఁగ కా - రణ మేమి నాకు
దేవత్వమునఁగాని - తెలివిడిగాదు. 6130
కపటాత్ముఁగా నన్నుఁ - గననేల మీకు?
నిపు డొక్కయుపకార-మేను చేసెదను
సేయుఁ డొక్కనితోడఁ - జెలిమి వాఁ డెఱుఁగు
నీ యఖిలావనీ - వృత్తమంతయును
లోకంబులెల్ల నా-లోకించినాఁడు
మీకుఁ గావలయు న - మేయసాహసుఁడు
అతనివర్తనము మీ - కాద్యంతములుగ
హితమతితోఁ దెల్ప - నివు డేఱుపడదు
కరణతో నగ్నిసం - స్కారంబు చేసి
పరిశుద్ధుఁ జేయుఁ డీ - పట్టున" ననిన 6140
బిలములోఁ బడద్రొబ్బి - పేర్చి యామీఁద
బలువైనకట్టులు - పఱచి కాల్చుటయు
నేతిముద్దయుఁ బోలి - నిర్జరవైరి
వీతిహోత్రములోన - వెలుఁగుచు దీప్తి
యుతుఁడైన యట్టి యా - హుతవహునందు
నతిశయహ్వాలాస - మన్వితంబగుచు
నొక్కతేజమువోయి - యుడువీథినుండి
చక్కని యచ్చర- సఖియలుఁ గొలువ
నవరత్నమయవిమా-నం బెక్కి దాన
దివిజుఁడై భూషణ - దీప్తులు వెలుఁగ6150
నిలిచి రాఘవుఁ జూచి - నీరదనినద
విలసనధ్వనితోడ - విభుఁ డిట్టు లనియె.
-: కబంధుఁడు నిజరూపమునుఁ బొంది తగిన మిత్రుని రామునకుఁ జెప్పుట:-
"రామ! షడ్గుణములు - రాజుల కెల్ల
భూమిఁ బ్రశస్తమై - పొలుచు నందులను,
అమరదు సంధి ము - న్నగు నైదునీకు
నమరు నిప్పటికి స-మాశ్రయంబొకటి
బలవంతుతోడ తా - బగవూను హీన
బలుఁడు వేఱొక్కని - బలవంతుతోడ
చెలిమి సేయుట యొప్పు - చెలిమికి నతఁడు
బలియుతోఁ బగదీలు - పడియున్న వాని6160
పొసగదు కొంచియం - బున వానికైన
దొసఁగుఁ దీఱిచి వాని - తోడ్పాటువలనఁ
దన ఘనకార్య మం -తయుఁ దీర్చికొనఁగ
ననువగుఁగాన మీ - కతఁడు గావలయు
నాయన సహవాస - మబ్బకయున్న
నేయర్థములు మీకు - నేల చేకూరు?
వాఁ డెవ్వఁడన్న ది - వాకరసుతుఁడు
వాడిమిఁగలవాఁ డ - వార్యదోర్బలుఁడు
అగ్రణి బహువాన - రానీకమునకు
సుగ్రీవుఁ డందు రె -చ్చో వానిపేరు6170
వాలిచే నిల్లాలి - వసుమతి నతఁడు
కోలుపోయినవాఁ డొ - కండు నున్నాఁడు
పంపాసరోవర - ప్రాంతంబునందు
ముంపుభీతిని ఋష్య - మూకశైలమున
నలువురు మంత్రులం - డనుఁ గొల్వనచట
తొలఁగకయున్నాడు - దుర్జయుఁ డతఁడు
సత్యసంధుఁడు ప్రతి - జ్ఞాపాలకుండు
దైత్యపన్నగ దేవ -తాగణ సిద్ధ
చారణాదులకు న- సాధ్యుఁ డనేక
వీరవానరులు సే - వింతు రాఘవుని6180
రావణుఁ డెంత శ్రీ - రామ! మీ రేమి
గావింపఁదలఁచినఁ - గడతేర్చు నతఁడు
తానెట్టివాఁడొ యా- తలి వాఁడునట్ల
కానిచో వారికెక్కడివి - నెయ్యములు!
అరకమిగొన్నవాఁ - డాకటివాఁడు
దొరయైనవాఁడు నెం - దున బీదవాఁడు
నెవ్వఁడు వాఁడు చిం - తనుఁ బొందువాఁడు
చివ్వెకాఁడును చెల్మి - చింతించువాఁడు
జతగూడ నేర్తురే - జగతి నట్లగుట
నతనికి నీకు స - ఖ్యము సేయు టొప్పు 6190
నట్టి భానుతనూజు - నంతటివాఁడు
చుట్టమైననుఁ జాలు - చూపినపనులు
సమకూర్చు నీకు ద - శగ్రీవువంటి
విమతు లెందఱినైన - వేఁటాడగలవు
రామ! యాతఁడు రిక్ష - రాజునిసుతుఁడు
భూమిపై నౌరస - పుత్రుఁడు రవికి
నినుఁడెంత పర్యంత - మెఱుఁగునో జగతి
నినసూనుఁడు నెఱుంగు - నిలయెల్లఁ జూచి
సీత నీ కతఁడు దె - చ్చి యొసంగఁగలడు
నీతోడు సుగ్రీవు - నికి కార్యకారి 6200
వెదకించు గపులచే - విశ్వమంతయును
వెదకుమాత్రమె కాదు - వెదకి సాధించు
నీసులు లేకుండ - యిరువురుఁ గూడి
బాసచేసికొనుఁడు - పావకుముట్టి
యాయుధంబులు గొట్టుఁ - డరలేకయుండ
పాయ కన్యోన్యంబు - పనులుఁ దీర్చుటకు
ధరణిపై సప్తపా - తాళంబులందు
సరసిజగర్భుని - సదనంబులోన
సీతను డాఁచి యం - చినఁ జూడ నేర్తు
రాతనిఁ గొలిచిన - యగచరోత్తములు 6210
యెచటనున్నాఁడని - యెంచితిరేని
యిచటికిఁ బడమర -నిదె చక్కఁజాయ
పొన్నతో పున్నది - పొండు మీ రచట
నున్న విశేషంబు- లూహించి కనుఁడు
-:కబంధుఁడు రామునకుఁ ద్రోవఁజూపి పోవుట:-
నచ్చోటఁ గలవు మీ - కమృతఫలంబు
లిచ్చవచ్చినయవి - యెల్ల గైకొనుఁడు
ఆరమ్యవనములో - నలఁత లన్నియునుఁ
దీఱి యుత్తరకురు - దేశంబు లనఁగ
వాసవు నందన - వనమన వీరుల
వాసించు నొక పుష్ప - వనమున్న దవల6220
భూరుహంబులు దానఁ - బుట్టిన వెల్ల
వారికిఁ గోరిన - వన్యంబులిచ్చు
ఫలములందుల నుండి - పడి తోనెయవిసి
యిలఁ దేనెకాలువ - లీనుచునుండు
ఋతువు లన్నియునందు - నెప్పుడు యాత్మ
రతినిచ్చునది చైత్ర - రథముచందమునఁ
బాదపంబులు ఫల - భారంబుచేత
మేదినిఁ జీఱుచు - మెచ్చులఁ దెల్పు
నొకకొన్ని యచలంబు - లున్నట్లు మెఱయు
నొకకొన్ని జలదంబు - లోయనఁదోచు6230
నోరామ! యిచ్చోట - నున్న వృక్షములు
మీఱిచూచిన మఱి - మీరిపోలేదు
ఇట్టివనంబు ల - నేకంబు లచటి
చుట్టునుఁ గలవవిఁ -జూచుచుపోయి
ఒకకొన్నిశైలంబు - లొకకొన్నినదులు
నొకకొన్నివనములు - నొకకొన్నిచరులు
కనుగొని యవ్వలి - కడ కేఁగి యిర్వు
రునుఁ బొండు పంపాస - రోవరంబునకు
నచ్చోట మొరపరా - లడును పల్లములు
రొచ్చులు ముండ్లు జి - రుకులును లేవు6240
యే రేవుచూచిన - నినుమును తేట
నీరునుఁ గలిగి కం - టికి విందుసేయు
మునులు నిచ్చలు స్నాన - ములు చేసిపోవ
ననయంబుఁ గ్రీడించు - నలవాటు కతన
గనకుఁ బారవు మిమ్ముఁ - గని నీడజములు
కడు నమ్మి చేరి చెం - గట నుండుగాని
వెన్నముద్దలరీతి - వింత యెఱుంగ
కున్న పక్షులఁబట్టి - యొక్కటి రెండు
కమలించి ముక్కునుఁ - గాళ్లుఁ బోవైచి
చమరుగారఁగ భుక్తి - సలుపుఁడు మీరు6250
వంపుముక్కులఁ జేర – వచ్చు వాలుగుల
నంపకోలను గ్రుచ్చి - యనుజుఁడు దెచ్చి
కౌఁచుబోమాడిచి- గనియలు చేసి
నీ చెంతనిడఁ దృప్తి - నీవందు మచట
సౌమిత్రి! యచటిగా - సారంబులందు
తామరపాకులఁ - దలఁకకయుండ
తేటలై చల్లనై - తియ్యనై వలచు
నీటికి దోయిలి - నీవొగ్గి త్రావి
విహరింపు మాసరో - విమలజలంబు
మహిఁ గ్రోలువారికి - మానురోగములు6260
పందు లాకెలఁకుల - బలుపెక్కి నేతి
బిందెల వలెఁ దరుల్ - పెల్లగింపుచును
విచ్చలవిడిఁ బోవ -వేఁటాడి తూపు
లుచ్చిపోవైచి బి - ట్టురువడిఁ గూల్చి
హత్తి కారగ్గుల - యందుఁ బొరల్చి
కత్తిరాలనుఁ జివ్వి - కమరించి కడిగి
వాలిచి కరకుట్లు - వాచవిపుట్టఁ
గాలిచి నీకు ల - క్ష్మణుఁ డియ్యఁగలఁడు
పువ్వులు చుట్టిన - పురుషులఁబోలు
నవ్వనంబునఁ బుష్పి - తావనీజములఁ6270
జల్లనినీడలఁ - జందనానిలము
మెల్లనే రా మేన - మించినయట్టి
శ్రమ మెల్లఁదీర న - చ్చట శయనించి
క్రమియింపుఁ డెండల- కాఁకల పగలు
శ్రీరామ యొరులు వెం - చినవిగా నచటి
భూరుహంబులు గొడ్డు - వోవందు నొకటి
"యెండవు ఫలము లే - యేవేళఁ గలిగి
యెుండు నందులనిండి - యుండుదు రెపుడు"
"మునిచంద్రులు మతంగ - మునిశిష్యకోటి
దినము వా రాచార్యు - దేవపూజకును6280
పువ్వులు ఫలము లె - ప్పుడుఁ గొనితెచ్చు
నవ్వేళ యతుల శ్ర - మాంబుబిందువులు
చినుకొక్కటిగ మొల - చిన యవిగాన
ననుపమానముల మ- హావృక్షకోటి
చేరి యచ్చట వారి - సేవించి యవల
మీఱుచో నచటి స - మీపమ్మునందు
శ్రమణి తపస్విని - శబరి కిరాత
రమణి యొక్కతె మీదు - రాకఁ గామించి
యున్నది యాయింతి - నూరార్చి యాపై
విన్నవించిన మాట - విని చిత్తగించి6290
పంపాసరోవర - పశ్చిమదిశను
చంపక పనసర- సాలహింతాల
నారికేళాశోక - నారంగవకుళ
పారిజాతతమాల - పాటలప్రముఖ
ధరణీరుహములచే - తను దివ్యమగుచు
ధరణిఁ జెన్నమరు మ - తంగవనంబు
నావనికిని మతం - గాచలకరులు
రావెఱచును మౌని - రాజుశాపమున
దాని తూర్చున మెచ్చఁ - దగు ఋశ్యమూక
మానగం బొకని శ - క్యముగాదు పొగడ 6300
నెక్కరా దొరులకు - నేనుఁగగున్న
లక్కడ భయము లే క - భివృద్ధి నొందు
నజునినిర్మిత మది - యచ్చటఁగన్న
నిజమౌను కలలెల్ల - నిర్దోషులకును
నానగం బెక్కిన - నగుఁగాక నీచ
మానవుల్ చేరిన - మాతంగశక్తి
చంపిపోవుదురు రా - క్షసులందునుండి
గుంపులై యెలుగించు - కొదమ యేనుఁగలు
మదమేనుగులకునై - మౌని పుంగవులు
కొదమ యేనుగులఁ గై - కొని తోలి దెచ్చి6310
పోకపాళెల నీరు -వోసిపోనీక
యాఁకలిచేసి సా-యక ప్రోతురచట
పోషిత వనమృగం - బులు బహుశీత
పాషాణముల విజృం - భణ వృత్తి మెలఁగు
బలురాయి తనవాతఁ - బడియుండ నొక్క
బిలమన్న నగము న - భేద్యమైయుండు
దానికి బ్రాగ్దిశా - ద్వారంబునందు
నూనుచల్లని నీట - నొకదోన గలదు.
ఆదోనకును దక్షి - ణాశ నానాఫ
లాదులతోఁ దోఁట యందమైయుండు6320
నాతోఁటఁ గ్రోమ్మావు - లందు నీడలను
బ్రీతి వసించు సు- గ్రీవుఁ డెప్పుడును
నట్టిసుగ్రీవుని - యాప్తులౌ మంత్రు
లెట్టిచోఁ దనుఁగాచి - హితవృత్తి మెలఁగ
నొకవేళ బిలములో నొకయెడ వనుల
నొకతరి గిరి మీద - నొకక్రేవఁ దరుల
గ్రీడించు నచటి కేఁ- గిన నానరేంద్రుఁ
జూడఁగాంతురు మీకు - శుభమగుఁగాక
పోయెదనని” దివ్య - భూషణద్యుతులు
తోయదద్వారంబుఁ - దోరణకట్ట 6330
బంధంబుఁ దీఱి క - బంధుండు దీన
బంధుఁడౌ రఘుకుల - ప్రవరుఁ డంపుటయు
-:రామలక్ష్మణులు శబరిం జూడఁబోఫుట:-
గంధర్వుఁడై పుష్ప-కము తోడఁజనిన
బంధుఁడౌ నతఁడు దె - ల్పఁగ విన్నసరణి
పంపకుఁ జక్కని - పడమటిత్రోవ
గుంపులౌ వనులు గ - న్గొనుచు రాఘవుల
తారు సుగ్రీవ సం - దర్శనాపేక్ష ఁ
జారు వైఖరివచ్చి - శబరియాశ్రమము
చేరినఁ గాంచి యా - చిగురాకుఁబోఁడి
శ్రీరాముభక్తి న - ర్చించి పూజించి 6330
కందమూలముల నాఁ - కలిదీర్ప దాని
విందుల వికచార - విందలోచనుఁడు
రాముఁడు మెచ్చి కి - రాతభూమికిని
సేమంబు దెలియ నీ - క్షించి యిట్లనియె
"లెస్స లేనీకు పు - ళిందవధూటి?
దుస్సహశక్తిఁ జే - తువె తపఃక్రియలు?
నియమంబు కొనసాగు - నే నీకు మాకు
జయము సంధిల్లె నీ - సందర్శనమున
నీగురుశుశ్రూష నీ - మనోజయము
సాగుచున్నదియె యొ - చ్చంబును లేక 6340
అనిన తపస్విని - యంజలి చేసి
మునివృత్తి నున్న రా - ముని కిట్టులనియె
"అయ్య నీకరుణచే - నన్నికార్యముల
నెయ్యడలఁ గొఱంత - యేఁటికిఁ గలుగు
నాదుతపంబు మి - న్నక ఫలియించి
యో దేవ! మిముఁ దెచ్చి - యునిచెఁ గట్టెదుర
నేధన్య నైతి నాని - యమంబులెల్ల
సాధువాదముఁ గాంచె - జన్మ మీడేరె
నిపుడు మీచరణంబు - లేఁబూజచేసి
యపవర్గసౌఖ్యంబు - లందఁబాలైతి 6350
చిత్రకూటనగంబు - చేరిన మీ చ
రిత్రంబు సన్ముని - శ్రేణి నాతోడ
దివికి నేగుచుఁ బల్క - తెరువులు చూచి
రవివంశతిలక! - నీరాకఁ గామించి
నున్నెడ ననుబ్రోవ - నోస్వామి! మీర
లన్నఁదమ్ములు వచ్చి - యర్చలందితిరి
మిముఁ గనుఁగొని సంయ - మివ్రాతమెల్ల
నమరలోకమునకు - నరుగుచుఁ దనకు
నింతయుఁ జెప్పి తా - రేఁగినకతన
నింతసంతోషమ - య్యెను నేఁటిదినము 6360
అనఘ! మీ కనుచు వ - న్యంబులు డాఁచి
యునిచిన దానఁ గొం - డుపహారముగను
ననుఁ గటాక్షింపుఁ" డ - న్న కిరాతిమీఁద
కనికరంబునిచి రా - ఘవుఁ డిట్టులనియె
“మాకు హితంబెంచె - మన్ననతోడ
నాకబంధుఁడు దెల్పి - నప్పటనుండి
యెప్పుడు వోవుదు - మెప్పుడు చూతు
మెప్పుడు భాషింతు - మేమని యెంచి
వచ్చినవారమో - వనిత! నీమహిమ
మిచ్చట జూడఁగ - నిచ్చ నెంచెదము 6370
నీసేయు పూజలం - దితిమని పలుక
దాసి నేనట్ల చి - త్తంబు రానడతు
నని వారిఁ దోడ్కొని - యవ్వనసీమ
మునఁగల్గిన విశేష - ములు చూడుఁ డనుచు
నిది మతంగాశ్రమ - మిచట మద్గుఁరుడు
త్రిదశసంప్రీతిగాఁ - దీర్చు హోమంబు
నిది దేవపూజ చో - టిది యాగశాల
యిది జపమొనరించు - నిర వనిచూపి
శ్రీరామ! యిమ్ముని - శ్రేష్ఠుని మహిమ
నీరమ్యదేశంబు - లిపుడుఁ జూచితిరె? 6380
శోభనరమ్యతే - జోవిశేషముల
సౌభాగ్యకరములై - చాలనొప్పెడును
అలమౌని తనకేల - యాయాసమనుచుఁ
దలఁచిన యంత స - ప్త సముద్రములును
వచ్చి యమ్మౌనిఁ గా - వలసిన కోర్కు
లిచ్చి క్రమ్మర నవి - యేఁగు నాఘనుఁడు
ఆరఁగట్టిన యట్టి - యానారచీర
లారవార్థంబులై - యవె భూరుహముల
నామౌని పూజించు - నలరు లింతయును
రామ! వాడకయవె - రాసులై యొప్పె 6390
నతఁడు చరించు న - య్యడుగులజాడ
లతిపావనములు క -టాక్షింపు మీవు
యీవనమహిమంబు - లివి మిమ్ముఁ జూచి
పావనినైతి నేఁ - బనివినియెదను
చనియెద నాచార్యు - సన్నిధి కిపుడె
ననుఁజూడుఁడ” నిన నెం - తయు వెఱగంది
“పూజచేసితి మమ్ము - పొలఁతి నీవేమి
యోజించినావొ సే - యుదువు గాకటుల
ననరాము వలఁగొని - యాచెంచువనిత
కనఁగన వెలుఁగు నింగ -లము లోపలను 6400
మేను వేలిచి దివ్య - మృగనేత్ర యగుచు
తా నేఁగె గురుసన్ని - ధానంబుఁ జేర
నివ్వెఱతో తమ్ము - ని మొగంబుచూచి
యవ్వేళ సీతాస - హాయుఁ డిట్లనియె
"చూడు మిచ్చో మృగ - స్తోమంబు లెనసి
కూడియున్నవి - వైరగుణములు లేక
యిచటి వృక్షములు గం - టే! ఫలభార
రుచిరంబు లగుచు జీ - రుచునున్నవవని
నెంతవాఁడు మతంగుఁ - డేడువారాసు
లింత కొంచెపు - పనియే రమ్మనంగ 6410
నవియెల్లఁ దీర్ఘంబు - లై యున్నవిచట
నవిరళవారిపూ - రాంబను లగుచుఁ
దానంబు లొనరించి - తర్పణక్రియలు
పూనితీర్చితి మెంత - పుణ్యవాసరమొ
యీదినంబు కిరాతి - నీక్షించి చాల
మోద మందితి మిది - మొదలుగా మనకు
సకలకల్యాణముల్ - సమకూడునింక
నొకటయు గొదవలే - కుండు గార్యముల
నామది నిండియు - న్న తెఱంగుచూడ
భూమిజ వచ్చుగాఁ - బోలుఁ గ్రమ్మఱను 6420
నదె ఋష్య మూకము - న్నది యందుసీత
వెదకిన నుండునో - వీక్షింతమనుచు”
—: రామలక్ష్మణులు పంపాసరస్సునకుఁ బోవుట :—
ననుమతించిన సుమి - త్రాత్మజుంగూడి
చనిచని కొన్నియా - శ్రమములు గడచి
ముందఱ వనమృగం - బులు పులుగులును
సందడి సేయు న - చ్చట రమ్యమగుచు
నమరు మతంగనా - మాబ్జిని గాంచి
తమరందు మునిఁగి యా - దండనేయున్న
యొక్కరమ్యస్ఫటి - కోపలప్రభల
నక్కజంబగు నీట - నమరిచూపట్టు 6430
పంపాసరోవర - ప్రాంతంబుఁ జేరి
సంపూర్ణజలపక్షి - చయకలస్వనము
పూచిన మల్లెపూఁ - బొదలునుఁ దరుల
నేచిమిన్నందు మ - హీరుహావళుల
పుప్పొడుల్ మ్రుగ్గుల - పోలిక రాలి
విప్పుగాఁ బఱచిరో - విపినమార్గములఁ
బైపయి రత్నకం - బళములనంగ
జూపట్టు నెడలు మె - చ్చుచు నికుంజముల
మాటునం గనరాక - మహిసుతఁబోలి
చాటుననున్న కా - సారంబు చూచి 6440
రాజగేహంబు లా - రాణివాసంబు
నోజఁ దానున్న చో - టొకరి కేర్పడక
యున్న పంపాతటం - బొక్కఁడుఁ జేరి
వెన్ను గాచుక వచ్చు - వీరులక్ష్మణుని
గాంచి సీతావియో - గంబుచేఁ దాల్మి
యుంచ నేరక రాముఁ - డొక మాటవలికె
“యీ పంప గనుఁగొంటి - వే? యనిమేష
కోపనాపుంభావ - కూజికాభ్యసన
చతురపారావతి - శారికాకీర
కృతకలారావ వ - ర్ధిష్ణు మనోజ 6450
సంగరరసలోల - శబరాంగనాను
షంగిలతాగృహ- సంచరన్మలయ
పవమానవిగళిత - ప్రసవోపచార
నివహానిమోదిమౌ - నిగణంబు” దాని
నెంత వేడుకచేసె - నీ సరోవరము
కాంతలతోడ నీ - కాసారసీమ
జలకేళి యొనరించు - జనుల కేమిటికిఁ
దలప నందనవనాం - తరవిహారములు?
చెంగటఁ దేఱి చూ - చితివే సమస్త
మంగళప్రదమహా - మహిమముల్ గాంచు 6460
నవలోకమాత్రని - రస్తశోకంబు
దివిజభూమిధరాం - తి ప్రవేకంబు
అపహృతాద్వన్య శ్ర - మాతిరేకంబు
తపనేందుమణిగణ - స్థగితరోకంబు
అమరాపగాకృతా - త్మాభిషేకంబు
యమదూతగదితన - ౽మోనువాకంబు
సారసినీచర - చ్చక్రవాకంబు
తీరవనీసము - త్తీర్ణపైకంబు
కందరాంత విశం - కటవనోకంబు
సందీప్తశృంగాను - షంగినాకంబు. 6470
హేలాచరిష్ణు గం - ధేభపాకంబు
తాలాదితరసము - త్కటవనీకంబు
ఋషికన్యకాకరా - హృత ప్రలాకంబు
విషయలోలాళర - ద్విషదభీకంబు
వాలిసంప్రాప్త భా - వవ్యళీకంబు
కాలాచరితమౌని - గణసరాకంబు
ప్రతిపన్నయతి పుణ్య - ఫల విపాకంబు
శృతఋష్యనీకంబు - ఋష్యమూకంబు
యీకొండ చేరఁగ - నేఁగె సుగ్రీవుఁ
జేకొంద మెందు వ - సించియున్నాఁడొ? 6480
ఆఋక్షకజు కు మా- రాగ్రణితోడ
నూరక యేరీతి - నొనఁగూడుఁ జెలిమి
నీవేఁగు మే సీత- నిమిషంబుఁ జూడ
కేవగం బ్రాణంబు - లిఁక బూనియుందు"
ననుచుఁ బంపాతీర - మల్లనంజేరి
తనసహోదరుఁ గూడి - తగ విశ్రమించి
విలసిల్లెనని వేద - వేద్యునిపేర
నలమేలు మంగాంగ - నాధీశుపేర
నంచితకరుణాక - టాక్షునిపేరఁ
గాంచనమణిమయా - కల్పునిపేర 6490
వేదవేదాంతార్థ - వినుతునిపేర
నాదిత్యకోటిప్ర - భాంగునిపేరఁ
గంకణాంగదరత్న - కటకునిపేర
వెంకటేశునిపేర - విశ్వాత్ముపేర
నంకితంబుగ వేంక - టాధీశచరణ
పంకజసేవాను - భావమానసుఁడు
హరిదాసమణి కట్ట-హరిదాసరాజు
వరదరాజు నితాంత - వరదానశాలి
రచియించు వాల్మీకి - రామాయణంబు
ప్రచురభక్తిని మదిం - బాటించి వినినఁ 6490
జదివిన వ్రాసిన - సభలఁ బేర్కొనిన
మదిఁదలఁచిన నెట్టి - మనుజులకైన
ధారుణిమీద సీ - తారామచంద్ర
పారిజాతదయాప్ర- భావంబువలన
హయమేధరాజసూ- యాదిమయాగ
నియతఫలంబులు - నిరతాన్నదాన
సుకృతంబు నిత్యయ - శోవైభవములు
నకలంకతీర్థయా - త్రాదిపుణ్యములు
సత్యవ్రతపదంబు - సకలసౌఖ్యములు
నిత్యమహాదాన - నిరుపమశ్రీలు 6500
కలికాలసంప్రాప్త - కలుషనాశనము
కలుములు హరిభక్తి - గౌరవోన్నతులు
శత్రుజయంబును - స్వామిహితంబు
పుత్రలాభంబును - భోగభాగ్యములు
ననుకూలదాంపత్య - మంగనాశ్రయము
ధనదాన్యపశువస్తు - దాసీసమృద్ది
మానసహితము ధ -ర్శ ప్రవర్తనము
నానందములు ఖేద - మందకుండుటయు
నలఘువివేకంబు - నతులగౌరవము
వలయుకార్యములు కై - వశములౌటయునుఁ 6510
బావనత్వము దీర్ఘ - పరమాయువులును
కైవల్యసుఖము ని - క్కమ్ముఁగాఁ గలుగు
నెన్నాళ్లు ధారుణి - యెన్నాళ్లు జలధు
లెన్నాళ్లు రవిచంద్రు - లెన్నాళ్లు గిరులు
యెన్నాళ్లు నిగమంబు - లెన్నాళ్లు విశ్వ
మన్నాళ్లు నీకథ - యలరు నార్షంబు
నాదికావ్యంబర - ణ్యాఖ్యకాండంబు
వేదసమానమై - విలసిల్లుఁగాత. 6518
శ్రీ రామార్పణమస్తు