Jump to content

శ్రీ రామాయణము - నాలుగవసంపుటము/యుద్ధకాండము

వికీసోర్స్ నుండి

కట్టా వరదరాజకృతమగు

శ్రీ రామాయణము

యుద్ధకాండము

__________:o:____________

శ్రీరాజిత శుభాంగ!- చిరగుణిసంగ
హారికృపాపాంగ! - యలమేలుమంగ!
భావుక! శతకోటి - భానుసంకాశ!
సేవకాత్మనివేశ - శ్రీవేంకటేశ!
అవధారు !కుశలవు - లారామచంద్రుఁ
డవధరింపంగ రా - మాయణం బిట్లు
వినిపించు తత్కథా - వృత్తాంతమెల్లఁ
గనుపించు నవ్వలి - కథ యెట్టులనిన

-: శ్రీరాముఁడు సీతావృత్తాంతముఁ దెల్పినందులకు హనుమంతునభినందించుట :-

శ్రీరామచంద్రుఁడా - సీతవృత్తాంత
మా రమణీమణి - యనిన మాటలను
హనుమంతుచేవిని - యతులితానంద
మునఁదేలి మానసం - బున వెఱఁగంది

     
తన తమ్ముఁడును వాలి - తమ్ముడంగదుఁడు
ననిలజాదులు విన - నప్పుడిట్లనియె.
"ఈవాయునందనుఁ - డేరీతి దాఁట
నావారిరాశి మ - హాజవశక్తి
నెంతటివాఁడోపు - నెక్కటిఁబోయి
యింతటి బలుగార్య - మీడేర్చి మఱల!
అమరగంధర్వవి - ద్యాధరాదులకు
నమరు నే నీరీతి - నాలంకఁ జొరఁగ ?20
చొచ్చిన మఱలిరా - సులభమే? కడచి
వచ్చె నింతియకాక - వాయునందనుఁడు!
తనకొక్క యితని యం - తటివాఁడుగలుగ
నినసూను గార్యంబు - లెల్ల నీడేఱె!
తన్ను నేలినవాఁడు - దలఁపఁగార్యంబు
లన్నియు నీడేర్చు - నతఁడె యుత్తముఁడు
చెప్పిన మాత్రంబు - చేసెద ననుచుఁ
దప్పించుకొన్న య - తఁడు మధ్యముండు
వలనని చేనయ్యు - స్వామికార్యములు
తలఁచక చెఱచు న - తండధముండు30
వాయుజుఁడిందులో - వాఁడుగా దొరులు
సేయఁగూడని యాయ - జేయ పౌరుషము
సేసి యేలికమాటఁ - జెల్లించి మాట
వాసిఁగైకొని తమ - వారమైనట్టి
మా మనస్తాపముల్ - మాని చెఁగానఁ
దామించె నుత్తమో - త్తముఁడననితఁడు!

              
నాకును లక్ష్మణు - నకు భరతాది
కాకుత్థ్సవంశశే - ఖరులకు నెల్ల
సీతను జూచి వ - చ్చినమహాకార్య
హేతువు చే నావ - హిల్లె సౌఖ్యములు. 40
తప్పనిధర్శంబు - తనకుఁదోడయ్యె
నిప్పుడింతటి పుణ్యు - డిలఁబుట్టుకతన.
చనవిచ్చి మాకింత - సంతోషవార్త
వినఁబల్కి లోకైక - విఖ్యాతిఁ గన్న
యీసమీరకుమారు - నింత గా మెచ్చి
యేసొమ్ము లీనే ర్తు - నిపుడున్న యునికి?
నా చేతనైన మ - న్నన వేఱె లేదు
"లేచి నేఁ జేతు నా - లింగనం" బనుచు
నతిశయ బహుమాన - మదిగాన రాముఁ
డతనిఁ గౌఁగిటను నిం -డారంగఁ జేర్చి 50
"అనిలకుమార! యీ - యంబుధి దాఁటి
జనకజఁ గాంచి యి - చ్చటికి వచ్చితివి
నీరధి నీకొక్క - నికె చెల్లెఁగాక
తేఱి చూచెదమన్నఁ - దీఱదన్యులకు!
కపివీరు లేడ? లం - కాద్వీపమేడ?
యపరిహార్యంబు నా - యాబోధనంబు
నది యేఁదలంచి పా - యని చింత తోడ
మదిఁ గలఁగెద నొక్క - మారు నాతోడ
నిది మార్గమను” మన్న - నీక్షించిరాముఁ
గదిసి సుగ్రీవుఁడు - త్కంఠ నిట్లనియె. 60

-: సుగ్రీవుఁడు తనబలము నెఱిఁగించి శ్రీరాముని కర్తవ్యమునకుఁ బురిగొలుపుట :-

"దేవ? మీరిపుడు చిం - తిల వేళ గాదు
రావణుఁదునుము? - ర్యంబది యెంత?
వసుమతీ పాలుఁ డ - వ్యయసాయుఁడైన
నసమడింపకయుందు - రహితభూవరులు
పగవాని యునికి యే - ర్పడియును వాని
తెగఁ జూడవలెగాక - దిట దప్పఁదగునె?
ఈయున్నవానరు - లిందఱు దనుజ
మాయావిదూరు లే - మఱపును మఱపు
చేతప్పు వాతప్పు - చెదరును బెదరు
నేతరి నొకరైన - నెఱుఁగ రెన్నడును 70
దాఁప నేమిటికి? యిం - దఱు నీదుకొఱకు
దాఁపరు ప్రాణముల్ - దావాగ్ని యైనఁ
జొచ్చెద మనుచు నెం - చుకయున్నవారు
మెచ్చులందఁగ మెఱ - మెచ్చులుగావు.
దాఁటిపోవఁగ సము - ద్రము వీర లెల్ల
నీటి కాలువగ నె - న్నినవారుగారు.
ఉంకింతు కుప్పింతు - రొక దాఁటు చేత
నింకింపవలసిన - నింకఁ జేయుదురు!
గట్టిగా సేతువు - గట్టి పోవుదురు.
గుట్టలు చట్టలు - గుప్పలు వైచి! 80
మీకీ విచార మే - మిటికి? నీకార్య
మీ కపులకే భార - మీడేర్చుటకును
నారావణునిఁ జంపి - యవనిజంబుచ్చి

           
                 యోరామ ! వీరె మీ - కొప్పగింపుదురు
                 ననువంటి యాప్తుఁడుం - డఁగ నిట్టి వీర
                 వనచరబలము కై - వశముగానుండ
                 నిది ఘన మిదికొంచ - మిది నాకు సాధ్య
                 మిది యసాధ్యము చేత - నిదియగు చేత
                 యిదిగాదు నాకను - నెన్నిక యేల !
                 ఇది చూడు మొకసెల - విచ్చి యిందఱును 90
                 రణకోవిదుఁడ వీవు - రఘువీర ! నీకుఁ
                 దృణమాత్రుఁడైన దై - తేయ నాయకుఁడు
                 నెదిరింప "నేర్చునే ? - యింద్రాదులైన
                 కదనంబులోనిల్వఁ - గలరె నీయెదుర ?
                 అట్టి నీప్రాపున - నగచరులెల్లఁ
                 జుట్టవేసుక లంక - సుడిసిన యపుడె
                 రావణుఁ బొరిఁగొని - రఘురామ ! నీదు
                 దేవి నీఁగలరు సం - దేహమేమిటికి !
                 పార్థివు లుత్సాహ - పరులుగాకున్న
                 వ్యర్థంబులగు వారి - యత్నంబు లెల్ల 100
                 ధరణీశులేయూరు - తాల్మియేయూరు ?
                 మఱువు మీచింత దీ - మసముఁగైకొనుము.”
                 అని విని యగుగాక - యని హనుమంతుఁ
                 గనుఁగొని జూనకీ - కాంతుఁడిట్లనియె.

-: శ్రీరాముఁడు లంకనుగూర్చి రావణుని సేనావిశేషంబుల గూర్చి హనుమంతు నడుగుట :-

                "తపముచేనైన కో - దండపాండిత్య
                 నిపుణత చేత నే - నియుఁ గట్టకట్టి

                
              యందు పైనైన నీ – యంబుధిదాఁటి
              కదలిపోవుదము లం - కాగిరిదుర్గ
              మది యెట్టులుండు ? సా - లావరు లెన్ని ?
              ఎన్ని వాకిళులందు ? - నెంతంతమూఁక
              యున్న దీపుర మెట్టు - లుండు ? రావణుని
              కై జీతమెంత ? య - గడ్తలెట్టుండు ?
              వాజివారణరథా - వళి యెంత కలదు ?
              ఆకోట సవరణ - యదియెట్లు ? నగరి
              వాకిట నడచు ప్ర - వర్తకం బేది ?
              వివరింపు" మనరఘు - వీరునిఁ జూచి
              పవమానతనయుఁడు - బలికె కేల్మోగిచి.

       -: ఆ విశేషములను హనుమంతుఁడు రామున కెఱింగించుట :-

             "దేవ ! లంక సా - ధించెద మనుచు
              దేవాసురలకైన - ద్రిష్టింప రాదు !
              చతురంగబలముల - సంఖ్యముల్ వాటి
              మిత మింతయనఁగ నే - మిటి కెవ్వఁ డెఱుఁగు ?
              నవరత్నఖచితమై - న సువర్ణ సాల
              మవఘళించు విమాన - మార్గములకును !
              ఆరసాతలమైన - యాకోటపరిఘ
              నీరు నక్రగ్రాహ - నిబిడ మైయుండు !
              ఆకోట దగుత్రికూ - టాచలాగ్రమున
              నాకొండ కగడిత - యై వార్థియమరు

           వనదుర్గమచట ను - ర్వర మఱికాన
           మనఁజెల్లు గిరిదుర్గ - మదిగాక లేదు 130
           జలదుర్గములయందు - సొటి యెక్కడిది?
           జలరాశి నడుమఁ బ్ర - శస్తమై యునికి,
           ఆకోట నలుదిక్కు - లందుల నాల్గు
           వాకిళ్లు కడు బల - వంతంబులెపుడు.
           లంక వారలకు ను - ల్లాసమైనట్టి
           వంకదారులను సా - వళ్లును గలిగి
           కాంచన స్తంభ సం - గతములై నట్టి
           దంచనంబులను గొ - త్తడములచేత
           నాళవరుల చేత - నటళ్ల చేత
           రాలబల్ గుండ్లు ఫి - రంగులచేత 140
           జబరు జంగుల బాణ - జాలంబుచేత
           నిబిడ మైన యాకోట - నిండారియుండు.
           అమరాద్రిపై స్వర్గ - మనఁగ నాలంక
           యమరుఁ ద్రికూటాద్రి - యగ్రభాగమున
           బారులు దీర్పించి - పదియనైదింట
           నారావణుండు లం - కావరణంబు
           ద్వారభాగముల సౌ - ధములపై నిలిచి
           వారు వారల భటా - వళిఁజూచిపోవు
           తమకంబుమీఁదట - తాఁ గొలువుండి
           యమరారి విభుఁడు మా - సాంతికంబులను 150
           దనదుకైజీతమం - తయుఁ జూచి భటుల
           మనువులీడేర్చు క్ష - మాశాలియగుచు.
           దుర్గమంబులుగ నం - దున కృత్రిమంపు

             దుర్గముల్ దేవతా - దురతిసాధ్యములు ?
             అందుఁ జట్టునుఁబాఱు - నాపగాశతము
             లందునెచ్చట నోల - లాడ వెన్నడును
             పడమటివాకిట - బలుసుక యసుర
             దడములు నియుతంబుఁ - దరలక యుండు
             దక్షిణాశామహా - ద్వారంబునందు
             రాక్షస ప్రయుతమే - రాళమై కాచు 160
             తూరుపు గవనియం - దుల ఘారదనుజ
             వీరార్బుదంబెల్ల - వేళవసించు
             నర్బుద సంఖ్యకు - నసమాన శౌర్య
             కర్బురస్తోమంబు - కాచునెల్లపుడు.
             ఉత్తర గోపురం - బుక్కళంబులను
             మత్తనిశాట ప - ద్మములు వసించు
             నాలంక నడుచక్కి - నగణితంబుచు
             వ్రాలునట్లు గుమార - వర్గమంతయును
             జుట్టల పైకమా - చుట్టు నప్పురికిఁ
             బెట్టని కోటయైన - పెరుగు శౌర్యములు 170
             రథగజతురగప - రార్థంబులొప్పు
             పృథుగతి నన్నగ - రీ వీథులందు
             దొరలును హితులు మం - త్రులు గల్మిబలిమి
             యొరిమల జతగూడి - యుందు రందఱును
             రావణైశ్వర్యమై - రావణప్రభువు
             జేవలఁ గొనఁజాలు - శ్రీ రామచంద్ర !
             స్వామిముద్రవహించు - సత్తువ చేత
             దోమలుగాఁగ దై- త్యుల నెల్ల ద్రుంచి

          లంకఁగాలిచి కొత్త - ళమ్ములు ద్రొబ్బి
          కొంకక బలుఫిరం - గులు పడఁగ్రోచి 180
          పూజించుఁ దోమరం - బులు నుగ్గుసేసి
          రాజ గేహమును స - ర్వము రూపు చెఱచి
          యమ్మవారినిఁ జూచి - యంబుధిదాఁటి
          మిమ్ము సేవించితి - మిగిలినవేల !
          గ్రక్కున బయనమై - కదలి యేరీతి
          చక్కగా నటుల యీ - జలరాశి దాఁటి
          కపులును మీరు లం - కకుఁ జేరవలయు
          నపుడెరావణుమాట - హరువయ్యెననుఁడు !
          ఈతారపట్టియు - నీజాంబవంతుఁ
          డీతారుఁడును మైందుఁ - డీద్వివేదుండు 190
          ఈనలుఁడీగజుఁ - డీ సుషేణుండు
          జానకీరమణ! దాఁ - చగనేల మీకు
          కోటలతో సౌధ - కూటాలితోడ
          ఘోటక రథగజ - కోటులతోడ
          రావణాసురునితో - రాక్షసశ్రేణి
          తో వారి వెలఁదుల - తో లంకతోడ
          నలత్రికూటాద్రి మీ - రానతిచ్చినను
          జులకఁగాఁ బెల్ల గిం - చుక చేతనుంచి
          యిపుడే తేనోపుదు ! -రినసూనుఁ గొలుచు
          కపుల సామాన్యులఁ - గా నెన్న వలదు ! 200
          పాళెంబులకు నెల్ల - పయనముల్ చెప్పి
          వేళంబె లంక పై - విడుతురు గాక !

                 
                  ఆలస్య మేల ”న్న - హనుమంతుమాట
                  చాల మెచ్చుచు రామ - చంద్రుఁడిట్లనియె.

 
 -: సుగ్రీవుని శ్రీరాముఁడు లంక పై వెడలుటకు సైన్యమాయత్తము సేయుమని చెప్పుట :-

                  "వినుము సుగ్రీవ ! యీ - వేళనే కదలి
                   చనుదము లంక భ - స్మము సేయువాఁడ !
                   సమరమైన సరాక్ష - సముగా సబాంధ
                   వముగ ససోదరా - వళిగ సపుత్ర
                   పౌత్రంబుగా నాదు - బాణజాలములఁ
                   జిత్రంబుగాఁగఁద్రుం -చెద దశాననుని 210
                   విసువుతో విషము ద్రా - విన వాని నమృత
                   రసము ప్రాణము నిల్పి - రక్షించినట్లు
                   అభిజిన్ముహూర్త మా - హవభూమిఁ దనకు
                   శుభము చేకూర్చు తే - జోలాభ మొదవు
                   ఉత్తరానక్షత్ర - మొప్పు మా పేర
                   హత్తియుండదు రేపు - హస్త పైనంబు
                   నీపగల్ గదలిన - నేపగల్ గెలుతు
                   నాపగాధిపు దాఁటి - యాపదల్ గడతు.
                   నీముహూర్తంబున - నేఁగిన మనకు
                   భూమిజ చేకూడుఁ - బోదము నేఁడు 220
                   చూడుము ! కనుపట్టె - శుభశకునములు
                   వేడుక మదిసంభ - వించె నాకిపుడు
                   వలకన్ను చలియించె - వలమూపు గదలె
                   వలనయ్యె వనఖగ - వ్రతంబు మనకు ! ”

                   
                  అనునట్టి మాటకు - ననుజుఁడు భాను
                  తనయుఁడు కడు సమ్మ - దము నొందఁజూచి
                  నగచరులకుఁ బయ - నములు చెప్పించి
                  యగణితమతి రాముఁ - డప్పుడిట్లనియె.

     -: శ్రీ రాముఁడు నీలుని వానర సైన్యములకధిపతిగాఁ జేసి యితర వానర
                  వీరులనుప సేనాపతులుగా జేయుట :-


                  అనలసంభవ ! నీల ! యని మొనల్ దీర్పు
                  వనచరులకుఁ జన - వాయివి నీవు 230
                  దళములకును మార్గ - దర్శివై నీవు
                  ఫలమూలములు గల్గు - పథమున మొదట
                  జనము దుర్మతులు రా - క్షసులు మార్గములు
                  చనరాకయుండ మో - సములు సేయుదురు.
                  చదలంబును దళంబు - సవరణతోడఁ
                  బదిలంబు గాచుచు - పట్టులేమఱక
                  పాళెముల్ దిగుచోట - పయనమై కదలు
                  వేళ నెచ్చరికతో - వేలంబుఁగాని
                  పర్వతవన నదీ - భాగంబులందు
                  సర్వసైన్యంబుల - జతనంబుతోడ 240
                  దింపుము రేలు ని - ద్రింపకఁ జుట్టు
                  కంపకోట ఘటించి - కావు మందఱను
                  గజుని గవాక్షుని - గవయుఁని బిలిచి
                  ప్రజలకు మున్ను గాఁ - బంపుము మొనల
                  వలవంక రిషభుఁడు - వచ్చు డావంక
                  నలగంధమాదను - లరుగు సేనలకు

       
        హనుమంతు పై నేను - నంగదు మీఁదఁ
        దన సోదరుఁడు నెక్కి - ధరణీధరారి
        చోదంతి మీఁదను - సార్వభౌమంబు
        మీఁదఁ గుబేరుఁడు - మించిన యట్లు 250
        సేనల నడుమ వ - చ్చెదము వానరుల
        నానంద మగ్నుల - మై కనుఁగొనుచు.
        ఈ వేగదర్శి యు - నీ జాంబవంతుఁ
        డీవలావల రాఁగ - నీ సుషేణుండు
        ముందఱగాఁగ నీ - మువ్వురుఁ గాచి
        యందందుఁ జను వేళ - నండ రాఁగలరు.
        వెనుక గా మైందద్వి - విద నల తార
        పన సాది వానర - ప్రభువులు గొలువ
        రానిమ్ము సుగ్రీవు - రణభేరి మొరయఁ
        గానిమ్ము పయనమై - కదలు” మీ వనిన 260
        విని భానుతనయుండు - వేడుక నటులఁ
        జనుఁడంచుఁ గపుల నా - జ్ఞాపించుటయును

--: శ్రీరామాదులును నంగదాదులును లంక పైకి వానర సైన్యములతోఁ గదలుట - వానర
                        సైన్య ప్రయాణ వర్ణనము :-

        అంగదాదులు రాము - నానతి మతులఁ
        బొంగుచు ఫాల్గుణ - పూర్వపక్షమున
        దక్షిణముఖముగా - దండెత్తి కదలి
        రక్షీణశౌర్య బా - హాదర్పములను
        వానరులెల్ల న - ల్వంకల బలిసి
        తేనియ లానుచు - తియ్యని పండ్లు

         
         నమలుచుఁ దానె జా - నకిఁ దోడి తెత్తు
         సమయింతుఁ బట్టి ద - శగ్రీవు నొకఁడ 270
         పోరిలో ననుచు ను - బ్బుచుఁ గేకలిడుచు
         పేరెముల్ వారి కు - ప్పించి దాఁటుచును
         జనుచోట నీల రి - షభ కుముదాది
         వనచరాధిపులు త్రో - వలు గనుపించి
         నడవ రాఘవులును - నలినాప్త సుతుఁడు
         నడుచక్కిఁ గెలన వా - నరకోటి గొలువ
         వచ్చు నప్పుడు శత - వలి పదికోట్ల
         చిచ్చుల పిడుగులై - చెలఁగు వానరుల
         జతఁ గూర్చుకొని తానె - చాలి యాదళముఁ
         బ్రతిరక్షఁ గావింపఁ - బాల్పడి నడచె. 280
         ఆరూఢి గజపన - సార్క కేసరులు
         నూరుకోటుల కపీం - ద్రులు తమ్ముఁ గొలువ
         బారుఁదీరుక యొక - పార్శ్వంబునందు
         నేరుపాటుగ వచ్చి - రిలయెల్లనిండి
         వారి వెంబడి జాంబ - వత్సుషేణాది
         వీరులు తమమూఁక - వెంబడిఁ గొలువ
         సుగ్రీవు వెనుక పౌఁ - జులు దీర్చి కదలి
         రుగ్రాంశుపదధూళి - యుక్కోలు కొనఁగఁ
         గనుఁగల్గి సేనాని - గాన నీలుండు
         చనుచోఁ బ్రజంఘుండు - జంభర భనులు 290
         దధిముఖుఁ డాదిగాఁ - దనసైన్యపతులఁ
         దరి చూచి వెనుక ముం - దఱఁ జదలంబు
         కాచుక రాఁ బంపఁ - గనుఁగల్గి వార

    
      లేచాయఁ బురముల - కెడ దూరములుగ
      బలముల నడపించి - పల్లెలు నూళ్లు
      చెలరేఁగి చిల్లర - సేయంగ నీక
      కిముకనకుండు సు - గ్రీవాజ్ఞ యందు
      సమకట్ట సహ్యాద్రి - చాయఁగాఁ గదలి
      పోవ వాయుజ వాయు - పుత్రులమీద
      రావణుఁ బొలియింప - రామలక్ష్మణులు 300
      చనుచోట వలనైన - శకునముల్ చూచి
      తనయన్నతో సుమి - త్రా పుత్రుఁడనియె.

             -: దారిలో లక్ష్మణుఁడు శుభశకునములను గాంచుట :--

      "దేవ ! ప్రకాశించి - దినకరబింబ
       మీ వేళఁ దెల్లని - యెండలుగాసె !
       జనకజాధిప! బృహ - స్పతిశుక్రు లిప్పు
       డనుకూలులై నవా - రతిశుభ దృష్టి !
       డాసి సప్తర్షి మం - డలమా ధ్రువునకుఁ
       జేసె నిప్పుడు ప్రద - క్షిణ మాక సమున !
       మనువంశ నృప ! నభో - మణి త్రిశంకుండు
       తన పురోహితుఁడు నుఁ - దానుఁ జూపట్టె ! 310
       నిరపద్రవద్యుతి - నీ వంశతార
       పరగె విశాఖ శో - భన హేతువగుచు
       నసురుల నక్షత్ర - మైన యా మూల
       పసయెల్లఁ జెడి ధూమ - పాళితోఁ దగిలి
       తారకాసురుని యు - దంబున దివిజ
       వార మెంతయుఁ జెలు - వముఁ గాంచినట్ల

       
           వనచరు లు త్సాహ - వంతులై నారు !
           మన గెల్పు రావణు - మరణంబె నిజము !
           అవనిజతో నయో - ధ్యాపురిఁ జేరి
           యవిరళ సౌఖ్యంబు . లందఁ జాలుదువు ” 320


                   -: శ్రీరాముడు సముద్రము దరిఁ జేరుట :-

           అని యన్న నూరార్చి - యరుగుచోఁ ద్రోవ
           వనజాకరములఁ బా - వన వనంబులను
           చరులను గందర - సానుభాగముల
           సురసిద్దచారణ - సుందరీమణుల
           శ్రవణమంగళ గాన - సంచరద్భ్రమర
           నివహంబులను మృగ - నికరంబు చేత
           యమరు సహ్యాద్రిఁ బా - యని మలయాద్రి
           క్రమియించి యవ్వలఁ - గనుపట్టుచున్న
           హేమధాతువుల మ - హేంద్రాచలంబు
           రామసౌమిత్రులు - రవికుమారకుఁడు
           కపులునుఁ జేరి యా - గట్టు పై నెక్కి
           యపుడు గన్గొనిరి మ - హాసాగరంబు !
           ఆజలనిధిఁ గాంచి - యవనిజప్రియుఁడు
           రాజీవహిత కుమా - రకుఁ జూచి పలికె 330

--: శ్రీరాముఁడు వానరులతో సముద్రపుటొడ్డున నిమ్మైనచోట పాళెమువిడియుట :-

           రేవగల్గాఁగఁ జే - రితిమి వారాశి
           (కేవకుఁ బైనేరి - కినిఁబోవరాదు.

           ఏలీలఁ జనవచ్చు - నీవార్ధి మీఁద ?
           ఆలోచనంబు సే - యఁగఁజెల్లుమనము !
           సేనల విడియింపు - సింధుతీరమున
           నీ నగాటవులలో - నిమ్మైనయెడల ” ౩40
           ననునంత రఘువీరు - నానతివలన
           నినతనూజుఁడు నీలుఁ – డెల్ల వానరుల
           మూఁడు దిక్కులపాళె - ములువిడియించి
           కూడి తామును రఘు - కుంజరుల్ నడుమ
           నెలకొని తగిన వ - నేచర శ్రేణి
           బళనళంబుల నుండఁ - బనిచి యాచుట్లు
           నుక్కళంబులఁ గపి - వ్యూహంబు నునిచి
           యిక్కువల్ గాయంగ - నేర్పాటు సేసి
           యున్నచో నారేయి - యుదధి యుప్పొంగి
           మిన్నును దిశలాక్ర - మించి తూరుపున 350
           నుదయాచలంబుపై - నుదయించు చంద్రు
           సదమల చంద్రికా - సంపూర్తి చేత
           నుల్లోలభయదమ - హోర్మిమాలికలు
           "పెల్లుబ్బి జలధర - బృందంబుఁ జెనక
           మకరకర్కటమీన - మాలికల్ మింట
           మకరకర్కటమీన - మండలిఁ బొదవ
           రంగులీనుచు నున్న - రత్నంబు లెగసి
           యంగారకాది గ్ర - హాళితో నెనయ
           జలశీకరంబులు - చద లెల్ల నిండి
           కలఁగె నీతళుకు చు - క్కల నల్లుకొనఁగ 360

           
            నిది పయోనిధి నభం - బిదియని యొరుల
            యెదలకుఁ దోఁచక - యేకీభవించి
            యొప్పు నంబుధికి పె - న్నుద్దియై మొరసె
            నప్పుడు వీరమ - హాకపి జలధి
            వేలంబు మైందద్వి - విదులు రేయెల్ల
            నాలుగు జాములు - నాల్గుదిక్కులును
            నెచ్చరికలఁగాచు - నిడ రఘువరుఁడు
            ముచ్చటఁదీఱఁ ద - మ్మునిఁజూచి పలికె.

               -: శ్రీరాముఁడు సీతనుగూర్చి విరహమునొందుట :-


          "సీతను జోడువా - సిన తనకింక
           నేతీరున భరింప - నెన్నిక గలదు? 370
           సౌమిత్రి ! యేనొక్క - క్షణమైన నోర్వ
           నేమి సేయుదు ? ఱెక్క - లేటికి రావు
           జానకి నెడఁబాయ - సం తాపభరము
           పై నతిశయమయ్యె - భావంబులోన !
           ఎటులున్నదియొ సీత - యెల జవ్వనంబు ?
           కటకటా ! వీఱిఁడి - గడతేఱునేమొ ?
           నను నేడఁ బాసి మి - న్నక పది నెలలు
           చనియెఁగాలంబు మో - సము చేసెఁ దన్ను
           యేమి సేయుదు ? ”నని - యెడనంత విసరు
           సోమరి వలిగాలిఁ - జూచి రాఘవుఁడు 380
           " ఓయి ! సమీర ! మా - యుర్విజమీఁద
           హా ! యన మలసి య - య్యతి నెమ్మేని
           సంపంగితావి వీ - సరవోవనీక

   
             ముంపుము నా మేన - ముంచితి వేని
             యందుచేఁ గలుగు నం - గాంగసంస్పర్శ
             నందిత నిరుపమా - నందమందెదను !
             శీతాంశుఁడా ! నీవు - చేర రావయ్య !
             సీత నెమ్మోముఁ జూ - చిన నిన్నుఁ జూచి
             కన్నులు చల్లనై - కల్యాణి మోముఁ
             గన్నకైవడి మేని - కాఁక మానుదును ! 390
             విషపాన మొనరించు - విధమునఁ జాల
             విషమసాయకుని క్రొ - వ్విరులకు లొంగి
             'హా రామ ! హారామ ! ? - యనిపలవించు
             నారామ వెతలెన్నఁ - డారునో యింక
             ఈ వియోగముపేరి - యింధనావళుల
             నావిచారంబను - నాల్కలేఁజాఁచు
             మదనానలంబు నా - మదిఁబాదుకొనియె
             నది యార్పనొక యుపా - యముఁ గానమిపుడు
             జలధిఁ జొచ్చినఁ గొంత - చల్లారునేమొ !
             తొలఁగ దన్యమునఁ జే - తోజాతవహ్ని ! 400
             నీ సేమ మీయాంజ - నేయుని చేత
             నోసీత ! విని కొంత - యూరడిల్లితిని.
             సజల కేదారంబు - సంగడిఁ దనదు
             రజముఁ గోల్వోకఁ బై - రు చెలంగుకరణి
             యిరువురము శయించు - నీవసుంధరయె
             పరిణామ మిచ్చు నే - పట్టున మనకు.
             ఏ వేళ జానకి - యెలనవ్వు మొగము
             తావి యానుదుఁ దేఁటి - తామరఁబోలి ?

          బడలువానికిఁదావి - పానకంబబ్బు
          వడువుగదా సీత - వాతెఱ తనకు ! 410
          మాలూర ఫలముల - మఱపించు సీత
          పాలిండ్లు కెంగేలఁ - బట్టుదు నొక్కొ?
          తనవంటి పతి గల్గి - ధరణిజ యిటుల
          దనుజాంగనలు చుట్టుఁ - దను గాచియుండ
          ననదయై యుండునె ! - యాయింతి తండ్రి
          జనకుఁడు మామ కౌ - సల్యావరుండు
          శారదసమయ ని - శాచంద్రరేఖ
          వారిదంబుల నెడ - వాసిన రీతి
          దనుజంగనా నిరో - ధము లొనరించి
          ననుజేరఁ రాఁగ నె - న్నడు జూడఁగలనొ ? 420
          జవరాలు కడుపలు - చని మేనిదెపుడు
          నవనిజ యిపుడు పే - రాఁకట నలఁగి
          యెంత కృశించెనో ? - యెదురుగావచ్చి
          యింతి కౌఁగిటఁ జేర్చు - టెన్నఁడోయింక ?
          మైలచేల వదల్చి - మణుఁగు ధరించు
          పోలిక మదిఁ గొని - పొరలు ఖేదంబు
          చాలించి జానకి - సంగరసాబ్ధి
          నోలలాడుచు నుందు - నొకొయొక్కనాఁడు"
          అనుచు సంధ్యాదిక్రి - యాకలాపంబు
          లనుజునితోఁ గూడి - యా రేయిఁ దీర్చి 430
          సముచిత గతులచే - సాగర తీర
          రమణీయ మహి రఘు - 'రాముఁ డున్నంత

--: లంక లో రావణాసురుఁడు హనుమంతుఁడు చేసినపనినిఁ గూర్చి ప్రస్తాపించుట :-

             అపుడు లంకాపురి - నాదశాసనుఁడు
             కుపితాత్ముఁడై తన - కొలువులో నున్న
             యతిశౌర్య నిధుల ప్ర - హస్తాదులైన
             హితమంత్రులను జూచి - యిట్లని పలికె
             "హనుమంతుఁ డొక్కఁడీ - యంబుధి దాఁటి
             యనిమిషేంద్రుఁడు చూడ - నలవి కానట్టి
             తనదు లంకారాజ - ధానిలోఁ జొచ్చి
             జనకజతోడ ము - చ్చట మాటలాడి 440
             యూరకే చనక నా - యుద్యాన కనక
             భూరుహావళి సర్వ - మును నేలఁ గూల్చి
             వలదని వారింప - వనపాలకులను
             బొలియించి ప్రాసాద - ము దుమారు చేసి
             మంత్రిసూనులఁ బట్టి - మహిఁ బడఁ గొట్టి
             మంత్రుల నేవురి - మర్దించి మించి
             యక్షకుమారకు - నాలంబులో ని
             రీక్షించి దానవ - శ్రేణి నడంచి
             తోఁకఁ గాలిచి వెళ్లఁ - ద్రోలుఁడటన్న
             కాఁక మై కొనక లం - కాపురం బెల్ల 450
             గాలిచిపోయె రా - ఘవు దూతననియు
             నేలిక సుగ్రీవుఁ - డిటు పంపెననియుఁ
             జేరి చిల్విషమును - జేయుచుఁగోఁతి
             యూ రెల్ల గాలిచి - యూర కే చనియె
             నాలోచనంబు సే - యక కాదు బుద్ది

        
         శాలులు మీరు వి - చారంబు చేసి
         యిందుకు తగు కార్య - మిదియని పలుకుఁ
         డందరు నొక నిశ్చ - యార్థ మేర్పఱచి

-: హనుమంతుఁడు చేసినపనికి ప్రతీకార మొనర్చుటకు
   నాప్తులతో రావణుఁడు సంప్రతించుట :-

         మహిపతు లుత్తమ - మధ్యమాధములు
         మహియందుఁ గలరట్టి - మతమేరుపఱతు 460
         హితుల నాప్తులఁ బురో - హితుల మంత్రులను
         జతఁగూర్చి వారి యో - జన లెల్లఁ గాంచి
         యందుమీఁదట దైవ - యత్న పూర్వముగ
         నందు క్రియా - ఫలం బతఁడె యుత్తముఁడు.
         ఒరులఁ గూర్పక తన - యోజన చేత
         గరువించి ధర్మార్థ - కార్యముల్ నడుపు
         బుధ్యు పాయంబు చేఁ - బొలుచు భూవరుని
         మధ్యముఁడని నీతి - మంతులెన్నుదురు
         దైవంబు నెన్నక - తనగుణదోష
         భావముల్ దలఁపక - పదరి కార్యములు 470
         నగ్గలికలఁ జేయ - నధముఁ డటంచు
         నెగ్గింపుదురు ధాత్రి - యేలు భూపతిని
         యవనీపతుల యట్ల - యాలోచనముల
         త్రివిధంబులగు వానిఁ – దెలియంగ వలయు
         నందఱితోఁ జేయు - నాలోచనములు
         చిందుసేయక వారు - చెప్పినయట్లు
         నీతిమార్గములచే - నెఱవేర్చు నదియె

       
        యాతతంబగు నుత్త - మాలోచనంబు
        మంత్రులతోడుత - మాటాడి వారి
        మంత్రముల్ విడిచి తా - మనసుకు వచ్చి 480
        నది నడిపించు మం - త్రాలోచనంబు
        మది నెన్న నయవిదుల్ - మధ్యమంబండ్రు
        తనకు దోఁచినయట్టి - దారిచే నడతు
        నని యెన్నుకొని సేయ - నది యధమంబు
        కావున మీరవు - గాములు మతులు
        భావించి యిది సేయఁ - బరగు నటన్న
        నది యేనొనర్పుదు - నవనిజ కొఱకు
        నుదధి వానరచమూ - వ్యూహంబుఁగూర్చి
        యింకించియైనఁ దా - నేరీతి నైన
        లంక పై విడిసి యా - లము సేయఁదలఁచి 490
        వచ్చు నీవెంట న - వశ్యంబు రాము
        డిచ్చలోఁ దలఁచి మీ - రిందుకుఁ దగిన
        కార్య మేకమతంబు - గాఁ బల్కుఁ ” డనిన
        మర్యాద లేని దు - ర్మదమత్తమతులు

      --: రాక్షసవీరులు రావణునికి రామునిపై దండెత్తి శిక్షించుటయే మంచిదని
          దుర్నీతి బోధించుట :--

        దానవ వీరులా - దశ ముఖుఁ జూచి
        నానావిధాలోచ - నముల నిట్లనిరి.
        "అసురేంద్ర ! దివ్యశ - స్త్రాస్త్రముల్ గలిగి
        యసమాన ధైర్య శో - ర్యంబుల మీఱి
        నీయంత వాఁడు చిం - తించునే యిట్లు?
        దాయలభయము చి - త్తమునఁ గీల్కొలిపి 500

              
               భోగవతీపురం - బున కేఁగి యచట
               నాగలోకమున ను - న్న భుజంగ విభుల
               వాసుకి ముఖ్యుల - వ్యాళుల గెలిచి
               యీసుతో నచటి దై - త్యేంద్రుల నోర్చి
               మాయావియైనట్టి - మయునంత వాని
               చేయిగాయక జయిం - చి తదీయ సుతను
               మండోదరి వరించి - మహనీయ శౌర్య
               చండిమంబున దేవ - సంఘంబుఁ దునిమి
               కైలాసమున కేఁగి - కలనఁ గుబేరుఁ
               దూలించి యక్షులఁ - దొంపరలాడి 510
               చలముతో నతని వు - ష్పకము హరించి
               యలవోక గాఁగ సం - యమినీపురంబుఁ
               జూఱ వట్టించి తే - జోరూఢి మించి
               సూరాత్మజునిఁ బోరఁ - జులకగాఁ దరిమి
               మృత్యువునకు నీకు - మృత్యువవగుచు
               దైత్యుల కెల్ల నా - ధార మై నిలిచి
               యధికుండవైన నీ – యంత రాజునకు
               నధమ మానవుల భ - యంబేల కలిగె?
               వృక్షంబు లుర్వి పై - వెలసిన యట్ల
               యక్షయ బాహాబ - లైశ్వర్యములను 520
               నెందఱెందఱునిందు - నెందెందు నుండ
               రందు నేవురిఁబోలు - నవనిజప్రియుఁడు?
               ఇతని మాత్రమునకు - నీవేల నీదు
               సుతుఁడున్న వాఁడు ని - ష్ఠుర శౌర్యధనుఁడు
               ఇంద్రజిత్తుండు తా - నీశ్వరుఁ గూర్చి

       
        యాయత నిష్ఠతో - యజ్ఞంబు సేసి
        వరము లందినవాఁడు - వాని కట్టెదుర
        నరులెంతవారు వా - నరు లెంత వారు ?
        మన మెల్ల నెఱుఁగమే - మఱచితిరేమొ ?
        అనుపమ వివిధశ - స్త్రాస్త్ర మీనంబు 530
        గజకచ్ఛపము రథ - గ్రామంబు తురగ
        భుజగంబు ఖచర బు - ద్బుదమును యక్ష
        మకరంబు సిద్దస - మాజ మండూక
        మకలంక పణవ మ - హావిరావంబు
        చామర డిండీర - చయము కేతూర్మి
        రామణీయకమును - రక్తనీరంబుఁ
        గలిగిన దివిజ సం - గ్రామ వారాశి
        గలఁచి గాలించి తాఁ - గవ్వపుఁ గొండ
        గతినుండి యమృతంబుఁ - గైకొన్నయట్లు
        శతముఖుఁ బట్టి దు - ర్జయ శౌర్యుఁడగుచు 540
        నీలంక లోపల - నిందఱుఁ జూడ
        జాలినొందఁగఁ జెఱ - సాలలోవైన
        దిక్కెవ్వరును లేక - దిగులుచే నుండ
        నక్కమలజుఁడు మి - మ్మడిగి ప్రార్థించి
        విడిపించుకొనిపోయె! - విల్లంది నీదు
        కొడుకు నిల్చినమేరు - కోదండుఁడైన
        నెదిరింపఁ జాలునేఁ ? - యిది యేటిమాట?
        ఎదురేలవచ్చె నీ – కెంత వానికిని !”
        అనునంతలో నాద - శానను జూచి
        యనుచితోక్తులచేఁ బ్ర - హస్తుఁ డిట్లనియె. 550

                 
               -: ప్రహస్తుని పలుకులు :-

         "సెలవిండు నాకెంత - సేపు ? సుగ్రీవు
          తలఁ దెచ్చి నీదుముం - దఱ నిప్పుడునుతు!
          భూమి యవానరం - బుగఁ జేసికాని
          నీముందఱికి వచ్చు - నే ప్రహస్తుండు ?
          ఊరెల్లఁ గాలిచి - యొక క్రోఁతి వోవ
          నూరికే యేమఱి - యుంటి మప్పటికి
          ఇంతటిలోన నీ - కేమి కొఱంత ?
          ఎంత కొంచెముగాఁగ - నెంచితి మమ్ము!
          మనుజులు నాకెంత - మర్కటు లెంత ?
          దనుజేంద్ర ! మీకు నిం - తవిచార మేల ? 560
          ననుఁజూడు ” మన దశా - ననుఁ దేఱి చూచి
          మొనగాఁడు లేచి దు - ర్ముఖుఁడిట్లు వలికె

                -: దుర్ముఖుని దురుక్తులు :-

          "ఈ దేవర చిత్తంబుఁ – దెలియక పదరి
           యావేళ నేమియు – ననలేక యుంట!
           నను నెదురింప నీ - నరులు వానరులు
           మనసునఁ దలఁప స - మర్థులు గారు.
           ఏనుదాఁజూచి వా - రెందు వాఱినను
           పోనీను గందరం - బులు దూరిరేని
           పాతాళ బిలములో - పలఁ జొచ్చిరేని
           చేతుల తీఁటవో - చెండి వేయదును! 570
           త్రాటను సుగ్రీవుఁ - దాఁగట్టి తెత్తు
           మాటమాత్రముగాదు - మాటమాత్రమున !

             
             అనుమతియే ?” యన్న - నౌడులు గఱచి
             దనుజేంద్రుతో వజ్ర - దంష్ట్రుఁడు వలికె

                 -: వజ్రదంష్ట్రుని వాక్యములు :-

             గదచూడు మిదియే రా - ఘవులకువైరి
             యిదిగదా కపులకు - నెల్లను మిత్తి!
             నాకుఁ గోపముపుట్టె - నా తాళఁజాల
             వాకొమ్ము పొమ్మని - వారి మీఁదికిని
             యీపరిఘంబుపై - యేఁ దెంపు సేయ
             నేపరకుందురే - యింద్రాదులైన 580
             గడియలోపల లంకఁ - గెలిచి తోఁక
             మెడమీఁద వేసుక - మింటికి నెెగసి
             యాకోఁతి పరువెత్తె - నని యింతలోన
             నీకేవిచారమే - మిటికేను గలుగ ?
             నొక్కపెట్టున వారి - నుర్విపాల్ జేసి
             యుక్కుతో మరలి రా - నోపుదు నిపుడు !
             లంకాధినాథ! యే - ల ప్రయత్నమింత ?
             ఇంక నొక్కయుపాయ - మిచ్చ నెంచితిని
             మనుజమూర్తులతోడ - మాయలు నేర్చు
             దనుజులఁ గొందఱ - దశరథాత్మజులఁ 590
             జేరఁ బంపినవారు - చేతులు మొగిచి
             'యోరామ ! భరతుఁడ - యోధ్యాపురంబు
             వెడలి సేనలతోడ - విచ్చేసి మిమ్ముఁ
             బొడఁగని పోవ ము - నుపుగ మేముగదలి
             వచ్చితి” మని కొన్ని - వార్తలాడించి

        
        మచ్చుఁ గప్పింపుచో - మబ్బులనుండి
        వానరావళినెల్ల - వధియింతు నంత
        దీనులై యెవ్వడు - దిక్కు లేకున్న
        నాచేత దశరథ - నందనుల్ దగుల
        రాచబీరముల నూ - రక యెదుర్పుదురు! 600
        ఆ వేళ వారినే - నదటడంగించి
        దేవ ! నీఖేదంబుఁ - దీర్చెద” ననినఁ
        గుంభకర్ణుని పెద్ద - కొడుకాగ్రహమునఁ
        గుంభుఁడన్ వాడు ర - క్షోనాథుఁ బలికె

                  --: కుంభుని కువాళకములు :-

        మీ రేలఁ గోతుల - మీఁదను నలుగ
        నీరావణునిఁగాచి - లంకలోన
        వసియింపుఁడేఁ బోయి - వనచరావళిని
        దెసచెడ నుగ్గాడి - తిత్తులొల్పించి
        భానుజాంగదనల - పవనసమీర
        సూనుల దశరథ - సుతులను జంపి 610
        గెలిచి వచ్చేద”నన్న - గీటుచుఁ బండ్లు
        సెలవులు నాకుచు - సెలవునాకనుచు
        నాగ్రహాంబున యజ్ఞ - హనువనువాఁ డు
        దగ్రుఁడై తాలేచి - దశకంఠుఁ బలికె.

             -: యజ్ఞహనుని యసందర్భపు మాటలు :-

       "ఆలోచనలు మమ్ము - నడిగినచోట
        కాలోచితంబై న - కార్య మూహించి

      
      పల్క గావలెఁగాక - పనిమాలినట్టి
      పల్కు లేఁటికి మిమ్ముఁ - బనుచునే యితఁడు?
      ఏఁబోయి కపుల నా - నృపకుమారకులఁ
      దాఁబేటి పిల్లలఁ - దార్క్ష్యునిరీతిఁ 620
      పాఱిపోవఁగనీక - పట్టుక మ్రింగి
      యూరకవచ్చెద - నొక నిమేషమున!
      కైదువ దాల్తునే - కపులపైనిపుడు!
      పోదునే చేతులూ - పుచు వారికడకు
      పనివిందు” నన నకం - పనుఁడు కోపించి
      దనుజనాయకుతోఁ - దానిట్టులనియె.

          -: అకంపనుని యనుచితోనిక్తులు :-

      "మధుపానముల్ చేసి - మాంసముల్ మేసి
       మధురాధరలఁగూడి - మసకంబులాడి
       మీరుండవలెఁగాక - మీకేమి చింత?
       పోరాడవచ్చిరే - పురుహూతముఖులు? 630
       నరులఁట ! తోడువా - నరులఁట ! వారు
       శరధి దాఁటుదురఁట ! - చాలదే బవిసి
       ఇందుకు బుద్ధిని - యేమని మీర
       లిందఱి నడుగఁగ - యింతేసి వారు
       తాము వోవుదమన్న - తలవంపుగాదె
       భూమిపై రక్కెస - పుట్టుల కెల్ల?
       తనకునుత్తరువిండు - తన దళవాయిఁ
       బనిచి వారల నెల్ల - బట్టి తెప్పింతు!

           
            కావలసిన మస్త - కములు గొట్టించి
            కావళ్లఁబట్టించి - కపుల రాఘవుల 640
            పేరుడ మాపుదు ”నన్న - పెట పెటపండ్లు

           -: పై వారి మాటలు విని రాక్షసులు చెల రేఁగుట : -

            కోఱలు మెఱయంగఁ - గొఱకుచు లేచి
            మీసముల్ వడివెట్టి - మిడిగ్రుడ్ల వెంట
            రాసులై నిప్పులు - రాల రోజుచును
            కుంతముల్ చిమ్ముచు - గుమిగాఁగలేచి
            పంతంబులాడుచుఁ - బదరి యొండొరుల
            మొనసి నికుంభ దు -ర్ముఖులగ్ని కేతుఁ
            డును గుంభుఁడుఁ బ్రహస్తుఁ - డును నింద్రజిత్తు
            యజ్ఞకోపుఁడును మ - హాపార్శ్వధూమ్రు
            లజ్ఞానులగు విరూ - పాక్షకంపనులు 650
            రుధిరాక్షుడు మహోద -రుఁడు రశ్ని కేతుఁ
            డధిక శౌర్యుండు ధూ - మ్రాక్షుఁడు సూర్య
            శత్రు సుప్తఘ్న దు - ర్జయ వజ్రదంష్టు
            లుత్రిలోచనరుద్రు - లును నాగ్రహించి
            పరిఘపట్టిస ధను - ర్బాణాసిముసల
            కరలౌచు నతిభయం - కరులౌచు మండి
            శూలంబు లార్పుచుఁ - జూచి రావణుఁడు
            చాల మెచ్చఁగ నొక - సరణి నిట్లనిరి.

              -: రావణుఁడు సూక్ష్మముగా వారిమాటలను వినుట :-

           "సూక్మవిచారద - క్షులు సభ లేరు
            లక్ష్మణసుగ్రీవు - లను రామవిభుని 660

         కపులను దెచ్చి లె - క్కగ నెంచి మమ్ము
         చపచపఁ జేసి యో - జనలు సేసెదరు !
         వా రేల ? మీ రేల ? - వలవదిందొక్క
         డేరుపాయగఁబోయి - యెల్లలోకముల
         వానరుఁడనియెడు - వాఁడు లేకుండ
         జానకీపతిఁ గూడఁ - జంపి వచ్చెదము?
         పనిఁగొమ్ము మమ్మ”ని - పదరిపోఁజూచి
         దనుజులు తమలోనె - తారుమల్లాడ
         నందఱ పదరకుం - డన వారివారి
         నందందుఁ గూర్చుండ - నభినయింపుచును 670
         గరములఁగన్నుల - క్రందువారించి
         సరమాధిపతి విభీ - షణుఁడిట్టు వలికె.

                 -: విభీషణుడు రావణునికి బుద్ధి చెప్పుట :-

         "మాను మాగ్రహము సా - మంబు భేదంబు
          దానంబు దండంబు - ధరయేలువారు
          తగునెడ నడిపింపఁ - దగుఁగాక మొదటఁ
          దగునయ్య ! యగ్నివై - ద్యముఁ జేసినటుల
          కడపట పూనించు - కార్యంబు మొదట
          నడిపింపఁ జెల్లదు - నయమార్గనిధివి !
          దైవోపహతుఁడు మ - త్తస్వాంతుఁ డధమ
          జీవనుఁడనువానిఁ - జెనక దండింపఁ 680
          దగుఁగాక యప్రమ - త్తస్వాంతుఁడగుచుఁ
          బగర గెల్చును దైవ - బలమును గలుగు
          శ్రీ రామచంద్రునిఁ - జెనకి రాఁగలరె?

    
     యీ రాక్షసులు? విన - మేవారి కథలు!
     జలనిధి దాఁటి ని - కావేళలంకఁ
     గలయఁ గన్గొని సీతఁ - గని మాటలాడి
     యీపురంబుదహించి - యేఁగినాఁ డొకరుఁ
     డాపవనతనూజుఁ - డన్నట్టిచోట !
     అట్టి వానరకోటు - లాసయై వచ్చి
     నట్టి రాఘవు గెల్వ - నగునె యెవ్వరికి ?” 690
     అని కొల్వులో వారి - నందఱిఁఁ జూచి
     "వినుఁడేలు యీ యవి - వేకంబు మీకు?
     ఖరదూషణాదుల - క్రమ మెఱింగియును
     దురమేల రాముని - తోడ నొక్కనికి ?
     అది వినియుండి ప్రా - ణాశలు లేక
     మదిఁగ్రొవ్వి మేనులు - మఱచి పల్కెదరు!
     రాఘవుఁ డేమి నే - రము సేయఁ దెచ్చె
     లాఘవవృత్తి ని - లాపుత్రి నితఁడు ?
     పరకామినులఁ గోరు - పాపకర్మలకు
     దొరకునే కీర్తులు - దురములోఁ జయము? 700
     ఇట్టివానికి ధర్మ - మేడది? చాల
     పట్టగుఁ గాక పా - పంబుల కెల్ల !
     సీతను మఱల ని - చ్చిన మనకెల్ల
     ఖ్యాతియు జయము సౌ - ఖ్యములును గలుగు.
     అటులైన బ్రదుకుదు - మాపదలేక
     యెటులున్నదియొ కర్మ - మీయన్నచేత ?
     రామలక్ష్మణుల నా - రాచదావాగ్ని
     భీమమై లంకలోఁ - బెరిగి వీడెల్ల

      
      దహియింపకటమున్న - ధరణిజ నిచ్చి
      బహుకాల ముర్విపై - బ్రదుకుట మేలు 710
      వానర సైన్యముల్ - వచ్చి యీపురము
      దానవావళి నెందుఁ - దలచూపనీక
      ముత్తికవేయక - మునుపు నాసీత
      చిత్తంబు చల్లగాఁ - జేయుట మేలు.
      ఎందుచేఁ జెడకున్న - యితని యైశ్వర్య
      మిందఱితోఁ గూడ - నీ సీతకొఱకు
      చెడ నేల?”యని బుద్ది - చెప్పి 'దూరెల్ల
      నొడలోముకొని మని - యుండుటేమేలు
      దొరలకు చెడుబుద్ది - తోచినఁ దమరు
      మఱలించి హితమైన - మార్గంబుఁ దెలిపి 720
      మన బ్రదుకులకై న - మందాది సీత
      నినకులోత్తమునకు - నిప్పింప మేలు !
      ఇచ్చకమ్ములు గాఁగ - నిందఱుఁ బలుక
      నిచ్చోట గాదని - యేనన్న మాట
      ద్రోయక వినెనేని - దోషంబులెల్ల
      మాయు నిందఱఁ గూడి - మనుటయే మేలు.”
      అని వారి నదలించి - యాదశముఖునిఁ
      గని విభీషణుఁడు తాఁ - గ్రమ్మఱఁ బలికె.
      ఏలన్న ! చలము నీ - కిఁకమిఁదనైన
      చాలించి క్రమ్మర - జానకీదేవి 730
      రామునకిచ్చి ధ - ర్మమును కీర్తియును
      సేమంబు సిరులు గాం - చి యెసంగు మీవు
      కాదన్న మిథిలేంద్ర - కన్యకారమణ

      కోదండ నిర్ముక్త - ఘోరదివ్యాస్త్ర
      పటలంబు శారద - పద్మాప్త కిరణ
      చటులంబులై క్రొత్త - సానలఁ దేఱి
      యపరంజి గరలతో - నశని జాలంబు
      విపులాధరంబు పై - వెసఁ బడినట్లు
      నీమేన నాఁటి శో - ణితధార లొలుక
      భూమిఁద్రెళ్లింప న - ప్పుడు చూడలేని 740
      ఖేదంబుతో నిన్నుఁ - గినిసి యిట్లాడు
      నాదు వాక్యములు మ - న్నన వింటివేని
      నిన్ను నమ్మినవారు - నీపుత్రపౌత్రు
      లన్నదమ్ములు గొల్చి - నట్టివారలును
      జావక నోవక - సకల సౌఖ్యముల
      నీవెంటఁ గొఱలేక - యీలంకతోడ
      మనవచ్చు నీసీత - మనకేల ? రాఘ
      వున కిమ్ము కుల మీలు - వునుఁ గాచికొమ్ము!
      చలము మాను" మటన్నఁ - జయ్యన లేచి
      కొలువుదీఱి మనంబు - కొందలంబంద 750
      నగరిలోపలికేఁగి - న విభీషణాదు
      లగువారు జనిరి ని - జావాసములకు

-: రావణుఁడు కొలువువిడిచి వెడలుట - విభీషణుఁడు రావణునగిరికి బయలు దేయుట :--

      ఆమఱునాఁడు ప్రా - హ్ణంబున లేచి
      రామహిత ప్రచా - రత విభీషణుఁడు
      కొలువు సింగారమై - కొలకొల యనుచు

    
       బలసి నానాదైత్య - బలము సేవింపఁ
       దన యిల్లు వెడలి బృం - దారక పురము
       ననువైన రావణు - నగరి మోసలను
       పల్లకి డిగి తూర్య - పణవాది రవము
       లుల్ల సిల్లంగ మ - దోత్కటభద్ర 760
       సామజారట్టజ - స్యందనసుభట
       ధామమౌ మొదటి యం - తర ముత్తరించి
       మధులాజతిలదర్భ - మాషాజ్యకుంభ
       దధిపాత్ర కుసుమాక్ష - తసుగంధముఖ్య
       హోమపదార్థ ప్ర - యోగ సంపన్న
       సామాదినిగమఘో - ష ప్రాజ్యవహ్ని
       వేదికానికట ధా - వి బ్రహ్మరాక్ష
       సాది హోతలచే ని - రంతరంబైన
       రెండవకక్ష్య మీ - ఱి మణికిరీట
       కుండల కేయూర - కుంకుమపంక 770
       వివిధాంబరాపార - విభవసమేత
       దివిజాహితకుమార - దీర్ఘ బాహాగ్ర
       ధగధగాయిత హిమ - తరవారినిచయ
       యుగపద్విభాపట – లోపేతమైన
       యాయంతరము మీఱి - యావలికేఁగి
       గాయకవందిమా - గధనుతుల్ చెలఁగ
       భద్రాసనాగ్రంబు - పై జగత్రితయ
       విద్రావణుని దై త్య - విభుని రావణుని
       సురలతోఁ గొలువున్న - సుత్రాముఁడనఁగ
       నిరుగడఁ దనవార - లెల్ల భజింప 780

నోలగంబున నుండ - నోరగావచ్చి
కేలు మొగిడ్చి తాఁ - గెలనికిఁ జేర
దనుజవ రేణ్యుఁడు - తమ్మునిఁ జూచి
తన చెంతనొక్క కుం - దనపు గద్దియను
వసియింపుమనిన రా - వణుని యానతిని
దెస లెల్ల భూషణ - దీప్తులు వెలుఁగ
కెలని వారలు లేచి - కేల్మోడఁ దాన
నెలకొని కొలువులో - నినిశాట వరులఁ
దొలఁగిపోఁ బనిచి మం - త్రులుహితుల్ గాని
యలఁతివారలు లేని - యట్టిచోఁ గదిసి 790
యేకాంతమున దాన - వేంద్రునితోడ
నీకడాకడవార - లెల్లను వినఁగ
నయవినయములు స - న్మానంబు హితము
ప్రియమునుఁ దోప వి - భీషణుండనియె

–: విభీషణుడు రావణునితో హితోక్తులు పలుకుట :--

సీతను బట్టి తె - చ్చి నయది మొదలు
నీతిదోషంబుల - నేకముల్ వొడమె !
హోతలు వేల్చుచో - హోమాగ్ను లందు
హేతులు గనరాక - యెంతయుమానె!
యాగశాలలను దే - వాలయంబులను
భోగులెల్లడ నిండి - బుసఁగొట్టఁ దొడఁగె! 800
హవిరన్నములఁ జీమ - లంటెను ! వస్తు
నివహంబులందుల - నిండెఁ గీటములు !

తరిగె నావులపాఁడి ! - ధరణీరుహములఁ
బరిపక్వఫలములు - పరిపాటియయ్యె
జలములు గరుల లో - చనములఁ గురిసె!
తలలతో మేపు లె - త్తవు తురంగములు !
కాకఘాక శ్యేన - కంకాది ఖగము
లేకడఁ గూయుచు - నింటింటఁ దిరిగె !
పులుఁగు లేచ్చోట ని- ప్పులు గ్రక్కఁదొడఁగె
నెలిగించె నక్క లే - యెడఁ బట్టపగలు 810
ఖరములుష్ట్రములును - గలసి వాపోయె
వరడు లేడ్చెను కోట - వాకిళులందు !
ఇన్ని యుత్పాతంబు - లీలంకలోన
నెన్నఁడు లేనివి - యిప్పుడు గలిగె!
అన్న యిందులకు ప్రా - యశ్చిత్త మొకటి
యున్నది మన కేల - యుర్వీతనూజ
క్రమ్మఱ నిమ్ము రా - ఘవునకు నీకు
నిమ్మాట చెవిగామి - యెఱుఁగుదునైన
సైరింప లేనుపే - క్షా దోషమునకు
నేరముగాఁగ నె- న్నిన మేలు నీవు 820
నీకు నొక్కని కేల - నీవారికెల్ల
వాకొన్నయట్టి నా - వాక్యంబుగాదు !
చూడుమీ యీమాట – సూచించి నపుడె
యూడనిఁబాడిది - యొకరితోనొకరు
నీకొల్వులో దొర - లెవ్వరేమైన
నాకుఁబోరామి వి - న్న పము చేసితిని

తరువాత నామాట - తలదాఁకినపుడు
పరితాపమునకుఁ బా - ల్పడక నాబుద్ధి
నాలకించితి వేని - యశముఁ గల్గియును
మేలును మదిని న - మ్మి సుఖంపఁ గలము 830
తనమాట విను ” మన్న - తమ్ముని మాట
విని మది కోపంబు - వెలువడనీక
కామాంధకారంబు - గరవంబు చలము
నాము కొనంగ ద - శాననుఁ డనియె.

-: రావణుఁ డాతనిమాటలను పెడ చెవినిఁ బెట్టి యింటికిఁ బొమ్మనుట ; విభీషణుఁడు వెడలిపోవుట :-

ఎఱిఁగి యెఱింగియు - నెన్నఁడు లేని
వెఱవు చెప్పెదవు వి - వేకంబు తెఱఁగె ?
భయ మెక్కడిది నాకు ? - పట్టియేఁదెచ్చి
చెయిచేతఁ గ్రమ్మఱ - సీతనీఁజాల!
రాముఁడొక్కఁడె యేల - రణభూమిలోన
నామఖవాది దే - వానీక మెల్ల 840
నతని కార్యములఁ దో - డై వచ్చి రేని
క్షితిఁ గూల్తు నిదియేమి - చెప్పెదవీవు ?
చాలు నీబుద్ధులు - చనుమింటి ” కనుచుఁ
దేలిపోఁ బలికిన - దిగ్గున లేచి
చనియె వెల్వడి విభీ - షణుఁడందు నిల్వ
మనసు గొల్వక యుగ్ర - మదనాగ్నిచేత
సైరింపలేక ద - శ గ్రీవుఁడా ప్త

-: రావణుఁడు కొలువుకూటమునకు వచ్చుట :-

చారులచే మంత్రి - జనుల రావించి
కనకరథం బెక్కి - కంచుకశ్రేణి
తనమ్రోల హేమవే - త్రములంది మొరయ 850
మణిమయ మేఖలా - మంజీర కటక
రణముల గణికాప - రంపరల్ గొలువ
నరదంబులును గరుల్ - హయములనెక్కి
దొరలు బాంధవులు క్రం - దుక మున్నునడువ
ధవళముక్తాత ప - త్రము చామరములు
సవిధభాగముల రా - క్షసులందిరాఁగ
మయనిర్మితంబు స - మస్తపిశాచ
జయజయధ్వాన వి - స్తరమును నగుచు
వెలసి లంకారాజ - వీథిలో మేరు
తులితమౌ సభకు మం - త్రులతోడవచ్చి 860
నవరత్న సింహాస - నమునఁ గూర్చుండి
యవలనీవల నుచి - తాసనంబులను
తగినవారల నుంచు - తరి విభీషణుఁడు
నిగనిగలీను మ - ణిస్యందనమున
వచ్చి యన్నకు పేరు - వాకొని మ్రొక్కి
యిచ్చిన మణిపీఠి - నిరవు కొన్నంత
శుకుఁడు వెంబడిఁ బ్రహ - స్తుఁడువచ్చి వారు
నొకచక్కి వసియించ - నొడ్దోలగమున
వసువులలో సుప - ర్వస్వామిరీతి
నసమవిభూతిఁ గొ - ల్వై యున్నయపుడు 870

రావణు వదనంబు - రాక్షస ప్రభులు
భావింపుచును తత్స - భాసదులందు
నొకరైన మాటాడ - కూరకయుండ
నొకమాట రావణుఁ - డూహించి పలికె.

--: రావణుఁడు ప్రహస్తునకు కోటరక్షణకు వలయు సాధన సామగ్రి సమకూర్చమని
    యాజ్ఞాపించుట :--

"రమ్ము ! ప్రహస్త ! పు - రంబును కోట
కొమ్మలు నట్టిళ్లు - కొత్తడంబులును
బదిలంబు సేయించి - బలములనుంచి
మొదటను రసవర్గ - ములు విచారించి
యేమఱియుండక - యిప్పుడే సకల
సామగ్రులును వేగ - జతఁగూర్పు” మనిన 880
నతఁడును నగరికా - ర్యములను గోట
జతనంబు నగరర - క్షణవిధానములు
నొకటను గొదలేక - యుండ నమర్చి
ముకుళిత హస్తుఁడై - ముందఱ నిలిచి


--: ప్రహస్తుఁ డాయాజ్ఞప్రకారము నిర్వహించుట :-

"అయ్య ! నాతోడ మీ - రానతి యిచ్చు
నయ్యర్థమంతయు - నమరికగాఁగ
నడిపించితి” నటన్న - నరులు వానరులు
జడధి యేక్రియ దాఁట - జాలుదురనుచు
లేని బీరంబుఁ గ - ల్పించుక పలికి
దానవాధిపుఁడు ప్ర - ధానుల కనియె 890

"ధర్మార్థకామ త - త్పరులు దుఃఖమును
శర్మంబు నందక - చనదొక్క యెడల
ఖేదంబు మోదంబుఁ - గీడును మేలు
నాదు లాభాలాభ - నానా విధములు
సరిగాఁగ ననుభవిం - చఁగఁ దగులైన
దొరలు గావునఁ దీఱ - దు తొలంగియుండ
ఇన్నాళ్లు మీతోడ - నెఱిఁగించి సేయ
నన్నికార్యములు మే - లైవచ్చె తనకు
దండకాటవిని సీ - తను బట్టి తెచ్చి
కండకావరమున - గాసి నొందెదను 900
మయుఁడు నిర్మించిన - మాయయువోలి
చేయిఁ జేసుకున్నది - సీతనామీఁద !
వచ్చు నేఁడాదిన - వశ్యంబు రాముఁ
డిచ్చటికని మది - నెంచి లోఁగాదు
అది యేనెఱింగి యీ - యాస దీఱంగ
కదిమి రెన్నెల్లకు - గడువు పెట్టితిని !
"తానింక జనక నం - దనఁ గూడకున్న
మేనఁ బ్రాణములుండ - మేకొన వింక !
అందు కెయ్యది యుపా - యము బుద్ధిమంతు
లందఱు సరిపోయి - నట్లు వాకొనుఁడు 910
మదిలోన నెఱుఁగఁడు - మన కుంభకర్ణుఁ
డిది యతఁడెఱుఁగక - యిఁక నెట్లుదీఱు ?
నిదురింప నేఁడాఱు - నెలలు మేల్కాంచి
యుదయంబుననె కూరు - చున్నాఁడటంచు

వింటిమి పిలిపించి - వినిపింత మింత
కంటి తోఁచదు వేఱె - కార్యంబు తనకు. ”

-: రావణుఁడు కుంభకర్ణునితో ముందుచేయఁగల కార్యమునుఁగూర్చి సంప్రతించుట :-

అనునంత పణవతూ - ర్యాదులు మొరయ
ఘనసత్త్వనిధి కుంభ - కర్ణుఁడు వచ్చి
యంజలిఁ జేసిన - యజ్జనే రత్న
మంజుల శోభాస - మగ్రమైనట్టి 920
గద్దియ పై నుండ - గా నియమించి
సద్దుమానిన మహా - స్థానంబులోన
నందఱు వినుచుండ - నగ్రసోదరుని
యందు నాదర ముంచి - యసురేంద్రుఁడనియె.
"ఎఱుఁగక చేసితి - నే నొక్కకార్య
మెఱుక సేయక తీఱ - దిప్పుడు నీకు.
రామునిదేవి ధ - రాతనూజాతఁ
గామించి యేదండ - కాటవికేఁగి
వంచించి తెచ్చితి - వనితల కేమి
పంచాస్త్రమాయాప్ర - పంచమారమణి 930
త్రిభువనంబులుఁ జూచి - తిని సీతవంటి
యిభయానఁ గనివిని - యెఱుగ మెన్నడును !
ఆసీత మనసీక - యసమాస్త్రు బారిఁ
ద్రోసె నే బలిమి నె - త్తుకవచ్చి యునిచి
మఱల నీనేర్తునే ? - మదిలోనఁ దనకు
పరుల చే భయము స్వ - ప్నమునందుఁ గలదె ?


ఒక వానరుఁడు వచ్చి - యుర్వీతనూజ
నొకకొంత యూరార్చి - యూరెల్లఁ గాల్చి
మఱలి యాసీత సే - మము వినిపింప
తరణిజాదులఁ గీశ - తతిఁ గూడపెట్టి
కోంతి కూటువమూఁక - గొలుపంగ వట్టి
కాంతారమున జన - కసుతావరుండు
వనధితీరమునకు - వచ్చియున్నాడు !
తనపోటునమ్మి సీ - తానిమి త్తముగ
నిటువంటి వార లే - యీవార్థి దాఁటి
కటకట ! మనతోడఁ - గలహించువారు ?
పులితోడ నెదురింపఁ - బోయెడి గొఱియ
పొలుపున రాముఁడి - ప్పుడు వచ్చినాఁడు !
తనకేల యిత్తు సీ - తను నన్నుఁబోర
వనచరాశ్రితుఁడెట్లు - వచ్చు లంకకును ? 950
అమరేంద్రయమవరు - ణాదులనైన
సమయింతు నరుల పీఁ - చమడంచుటెంత ?
అందుపై నీ సహా - యము నాకుఁ గలిగి
యింద యంచును సీత - నిత్తునే తనకు ?
కోఁతి చేసిన దుడు - కులు నాదు మదినిఁ
బ్రాఁతగిల్లవుగాన - పై కార్యమునకు
నాలోచనంబు సే - యక తీఱదయ్య !
కాలోచితంబేది ? - కని పల్కు" మనిన
కన్నులఁ జెంగావి - గ్రమ్మఁగోపించి
కన్న యర్థము కుంభ - కర్ణుఁ డిట్లనియె. 960

--: కుంభకర్ణుఁడు రావణునికి హితోపదేశపూర్వకముగనుత్తరమిచ్చుట :-

"అన్నవు నీవు ని - న్ననరాదు పలుక
కున్నఁ దీఱదు మంచి - యోజనేఁ గంటి
నిను నుండి హెచ్చిన - యీ రాజ్యలక్ష్మి
వెనుక నన్యులచేత - వీడుకోల్గాక
నీకతంబునఁ గుల - నిర్మూలనంబుఁ
గాక యెందును తేఱు - గడగానియట్టి
పనిసేసితివి ! రాము - భార్య నేమిటికిఁ
గొని తెచ్చితివి దైత్య - కుల మెల్ల నణఁప?
నీవును నీదు మం - త్రిగణంబు మొదట
నీవిధంబని నిశ్చ - యించి కార్యంబు 970
నడిపింప నాలోచ - నంబెట్లు సమసె ?
నుడువు మత్తెఱఁగు ము - న్నుగ నాలకించి
చెప్పెద నాకుఁ దో - చిన యర్థమింత
తప్పు నీయంత యు - త్తముఁడెట్లు చేసె ?
చేసిన కార్యంబుఁ - జేసితి వెంత
మోసంబు దప్ప రా - మునిచేత నీకు
యే యెన్నికకు సీత - నెత్తుకవచ్చి
తాయెన్నికనె నిల్పు - మచలుఁడవగుచు !
మమువంటి వారితో - మదినున్నయట్టి
క్రమమెల్ల మునుమున్ను - గా వినుపించి 980
యేమి చేసిననది - యీడేరుఁగాక
యీమేర దుడుకుగా - యేఁ గ ర్తననుచుఁ
బదరి యిచ్చకువచ్చు - పని సేయు రాజు

తుదముట్ట నేరఁడెం - దును హానిఁజెందు !
పొందును బహుదుఃఖ - ములు పాత్రభూతు
లందుఁ బెట్టని హవి - రన్నంబులట్ల.
అతని కార్యములు ని - రర్థకంబగుచు
ప్రతిసన్నకామిత - ఫలము నీలేవు !
మును సేయు నర్థముల్ - మును సేయవలయు
వెనుకటి కార్యముల్ - వెనుకఁ గావింపఁ | 990
దగుఁగాక క్రమములు - దప్పి కావింప
జగతీశులకు నాత్మ - సౌఖ్యముల్ గలవె ?
ఎదిరి వారల బలం - బెఱిఁగి చేయించు
యదను చూచుకొని రం -ధ్రాన్వేషణములు
గావింతు రంచలు - క్రౌంచరంధ్రములు
భావింపుచును జొరఁ - బాఱు చందమున
నీ విచారము లేక - యెంత కార్యంబుఁ
గావరంబునఁ జేసి - కడచి వచ్చితివి !
విన్నవింపక కాదు - విషమిశ్రమైన
యన్నంబు జీర్ణించి - నట్టి చందమున 1000
రాముఁడు చంపక - రానిచ్చె నిన్ను
నా మేర నెంతభా - గ్యంబుఁ జేసితివి !
తలవట్టి చూచుక - తప్పి వచ్చితివి
తలఁకకు మింకమీఁ - దటి కార్యమెంత !
ఏఁగల్గ నీ కేల - యింత విచార
మాఁ గెద నింద్రాదు - లై న మార్కొనిన
ఫరిఘంబుఁ జేఁబూని - బవరంబులోన
మెఱుఁగు కోఱలతోడ - మెఱుపులతోడ

జలదంబు పఱతెంచు - చాడ్పునఁ జంప
నలిగి యేఁ దెగి వచ్చి - నపుడెదుర్కొనఁగ 1010
మఖవాదులును వేలు - మడుపుమా సమర
ముఖమున నాకు రా - మునిఁ గెల్చు టెంత !
దొడిగిన తూపుచే - దునుమునో తెలియఁ
బడదు రాఘవుని కో - పము సంగరమున !
అవనిజప్రియుఁడు రెం - డవ తూపుఁ దొడుగ
నవకాశమిచ్చుగ - దా యంతలోనఁ
బ్రతినతో నేరక్త - పానంబు సేతు
నతని తమ్మునిఁ బట్టి -- యనుమానమేల
మొనలోన రాఘవా - మోఘాస్త్ర మేను
కనుచాటు చేసి యే - గతినైనఁ దొలఁగి 1020
చంపి వచ్చెద నంత - జనకజ మదిని
ముంపుకొన్నట్టి రా - ముని యాసఁ దీఱి
నినుఁ జేరునప్పుడు - నిరుపమానంద
మునఁ జెందు మేలు రా - మునియెడ భయము ?”
అనుచునుండగ నీల్గు - లావలింతలును
తను నెచ్చరింప ని - ద్రారతుఁడగుచు
గ్రక్కున నాకుంభ - కర్ణుండులేచి
చక్కగా నింటికిఁ - జనిన యవ్వెనుక
సీత యొప్పక యింత - సేయునే యనుచుఁ
జేతోభవానల - శిఖల వెలుఁగుచును 1030
దాలిమి చాలని - దనుజేంద్రుతోడ
బాళివుట్టగ మహా - పార్శ్వుఁ డిట్లనియె.

-: రావణునితో మహాపార్శ్వుఁడు మాటలాడుచు సీతను పొందుమని చెప్పుట :-

"దైతేయనాథ ! సం - తాపమేమిటికి ?
సీత యొప్పదటంచుఁ - జెప్పెద వేల
చేతిలోఁ జిక్కిన - చెలి బల్మిఁబట్ట
ప్రీతి రమింపక - బేలు పోవుదురె ?
ఇంతులకును సత్య - మేడది తమకు
చెంతలొంగిన మన - సీ యుండుదురు
ప్రియము చెప్పిన చాల - బిగియుదురెందు
దయవాని నెఱిగి చి - త్తంబు దాఁపుదురు 1040
వెతలఁ బెట్టుదురిది - వెలఁదులజాడ
రతికేళి బెనఁగు మూ - రక యుండ నేల ?
అడవిలో పెరతేనె - యబ్బినఁ జూచి
విడుచునె గ్రోలక - వీఱిఁడియైన !
అనుభవించెదనని - యాయాసమొంది
పనివడి తెచ్చి నీ - పడకింటిలోన
నునిచి రమింపక - యూరకే తెచ్చి
వనములోఁ బడవై చి - వలచితి ననుచు
గాసిల్లనేల ? యా - కడ నెవ్వరైన
యీసీతకై వహి - యించుక వచ్చి 1050
తొడికిన నింద్రజి - త్తును గుంభకర్ణు
లెడమిత్తురే ? వారు - నేనునుగూడి
దండింతు మెదిరించి - దశరథాత్మజుని !
ఖండింతు మామీఁద - కపినాయకులను !
ఎల్లలోకంబులు - నేలెడు నిన్ను

'నొల్ల నేనని' యుండ - నోపునే యొకతె!
మనసీదుగాని యా- మగువ నీమీద
యనురాగముంచక - యదియేల మాను ?
తడయక పగవాని - తలఁదొక్కినటులఁ
బుడమిపట్టినిఁ బట్టి - భోగింపుమీవు.1060
కోరికల్ తీరంగ - కుక్కుటవృత్తి
చే రమించిన నీకుఁ - జెల్లకున్నదియె ?
కూడి రమింపుఁ డా - కోమలి" ననుచు
వేడుక పుట్టింప - విని చాల మెచ్చి
బహుమాన మొనరించి - పంక్తి కంధరుఁడు
విహితోక్తులను వాని - వీక్షించి పలికె.

--: రావణుఁడు పరస్త్రీని బలిమిచేపొందిన తనకు హానికలుగు శాపవృత్తాంతము చెప్పుట :-

" ఓయి ! మహా పార్శ్వ ! - యుచితంబ పలికి
తీ యర్థమిది చాల - హితమయ్యెఁ దనకు
నటులయ్యు నేలయీ - యడ్డి మీకనిన
నిటువిను మామాట - యెఱిఁగింతు నీకు 1070
వెనుకటి కొక నాఁడు - విశ్వేశుఁడైన
వనజగర్భునిఁ గొలు - వఁ దలంచి యేను
సత్యలోకమునకుఁ - జను చోట త్రోవ
నత్యంత శృంగార - హారిణియైన
జవరాలు పుంజిక - స్థలి దేవరమణి
పువుదేరుపై మింటఁ - బోవుచున్నెడను
నే నరికట్టి మో - హితుఁడనై దానిఁ

బోనీక నిలిపినఁ - బువుఁబోణి వెఱచి
" వలదు రావణ ! యేను – వారిజగర్భు
కొలువున కేఁగుదుఁ - గొఱగాదు నన్ను 1080
బలిమి నిరోధించి - పై వ్రాల ” ననిన
వలరాజు గాసికో - ర్వక తమకమున
దానితోఁ గ్రీడింపఁ - దరువాత పద్మ
సూనునికడకేఁగఁ - జూచి యయ్యజుఁడు
నలిగిన పువ్వులు - నవరతిక్రీడ
నలసిన నెమ్మేన - నందంబుఁ దఱిగి
వసివాడు నగుమోము - వలపులు జల్లు
కసిగాటు కెమ్మోవి - కళలంటి పెనఁగఁ
జెదరిన మైపూత - చెలువొందు నడుము
బ్రిదిలిన చేలయు - బిగువు సన్నులను 1090
పెనఁగొన్న హారముల్ - బిట్టు నిట్టూర్పు
లును జూచి యాత్మనా - లోచన చేసి
"ఈపుంజికస్థల - యే తేరఁ దీనిఁ
బైపాటుగావీడు - పట్టునేయనుచు
నను గనుఁగొని "రావ - ణ ! భయంబులేక
తన కొల్వునకు వచ్చు - దాని రానీక
బలిమిఁ బట్టితివి పా - పమువచ్చుననక
పలువిత్త తనకు కో - పమువచ్చుననక !
ఇది మొదలెవ్వతె - నేని మనోజ
మదవికారమునను - మానంబు లేక 1100
యొడఁబాటు పరువక - యొప్పక నీవు
తొడిఁబడఁ గలసిన - తోడనే నీదు

తలనూఱు వ్రయ్యలై - ధరఁగూలుగాక !
తులువ ! "పో రా యని - త్రోపించెఁ గాన
నాఁడాదిగాఁగ యే - నలినాక్షి నైనఁ
గూడఁగ వెఱతు మే - కొనియున్నఁగాని
పరకామినుల బల్మిఁ - బట్టు సౌఖ్యంబు
మఱచియుందునె కాక - మఱి యొక్కఁడైన
కావున నీసీతఁ - గలయంగ రాక
రేవగల్ గాఁగ కా - రియ నొందవలసె ! 1110
ధాతకట్టడచే వృ - థాయుంటి గాక
సీతనుబట్టి పూ - జింపఁ దెచ్చితినె ?
మఱలఁ జేరుదు తన - మగనితోననుచు
ధరణిజ యెఱుఁగక - తానున్న దిపుడు
వననిధి సలిలప్ర - వాహ వేగంబు
కనదుగ్రలయ పావ - క ప్రతాపంబు
పవనసంచార వై - భవము నాయందు
నవిరళంబుగ నున్న - వని మానసమున
శ్రీ రామచంద్రుఁ డెం - చిన వాఁడుఁగాఁడు !
తీఱునే తనచేత - ద్రిష్టింపఁ దన్ను ? 1120
నిదురించు సింహంబు - నిద్రమేల్కొలుప
దుదిఁబోయి కాలమృ - త్యువుఁ జెనకంగ
నెంచినగతి రాముఁ - డెదిరించి జలధి
యంచున విడి సె నే - మగువాఁడొయింక
మహితవజ్రప్రతి - మంబులై జాగ్ర
దహిసన్నిభంబులౌ - నాత్మీయ విశిఖ
జాలము కొఱవుల - చాడ్పునఁ జూపి

యాలంబులో దంతి - నదలించి తరుము
వేఁటకాఁడునుబోలి - వేఁటాడి రాము
గీఁటడగింతు సు - గ్రీవాదు లలిగి 1130
వచ్చిన రానిమ్ము - వననిధి దాఁటి
యిచ్చోటి కామీఁద - సేఱిఁగెడుఁగాక !
ధనదు పుష్పకము నా - తని చేతి లంక
నని గెల్చి సాధించి - యమరేంద్రుఁ ద్రోలి
యమవరుణాదుల - నాహవకేళిఁ
దెమలంగఁ దరిమి య - తిప్రతాపమున
రాజిల్లు నాతోడ - రాముఁడు వచ్చి
యాజిసేయునటన్న - హాస్యంబుగాదె?”
అని బీరములు వల్కు - నసురనాయకునిఁ
గనుఁగొని మునుకుంభ - కర్ణుండు వలుకు 1140
మాటలు విని తన - మది నోర్వలేక
చాటువుగా విభీ - షణుఁ డిట్టులనియె..

    -: విభీషణుఁడు రావణునితోఁ బలికిన హితోక్తులు :-

" హేమాభ గాత్రం బ - హీన భోగంబు
కోమలతరకరాం - గుళులైదు తలలు
మదిలోని క్రోధసా - మగ్రివిషంబు
కొదలేని చిఱునవ్వు - కోఱలుగాఁగఁ
పఱుఁగు జానకిపేరి - పాము నేరీతి
వెఱపు నెమ్మదినిఁ బో - విడిచి పట్టితివి !
కపులచే మనదు లం - కాపురిలోన
విపరీత కార్యముల్ - వెలయక మునుపె 1150

సీత నిచ్చిన మేలు - చేకూడు నీదు
చేతఁ జిక్కునే రఘు - శ్రేష్ఠుఁడాలమున ?
రాముఁడు వజ్రసా - రశిలీముఖముల
నీమేన రక్తమా - నింపక మునుపె
యిమ్ము జానకిని దే - వేంద్రాదులైన
కిమ్మన నేర్తు రే - కినియు రాఘవుని ?
ఈ కుంభకర్ణుఁడు - నీయింద్రజిత్తు
నీకుంభుఁడు ప్రహస్తుఁ - డీమహోదరుఁడు
నీమహాపార్వఁడు - నితర రాక్షసులు
రాముని నెదురువా - రా సంగరమున 1160
సురసుర చిచ్చులోఁ - జొచ్చిన మిడుత
పరివోలె రాఘవ - బాణాగ్నిలోన
నందఱు గమలిపో - కటమున్ను జనక
నందన నిమ్ము ప్రా- ణముఁ గాచికొమ్ము !
పాతాళ బిలములో - పలఁ జొచ్చి తేని
సీత నియ్యక నీకు - జీవింపరాదు
నామాట విను ” మన్న - నగి ప్రహస్తుండు
సామాన్యమతి విభీ - షణుఁ జూచి పలికె.
“ఏల విభీషణ ! - యింద్రాది సురలు
నాలంబులోన మ - మ్మరికట్టఁ గలరె ? 1170
వెఱవు చెప్పెదు మాకు - విడువుమీమాట
మఱచిపొమ్మిది బుద్ధి - మార్గంబుగాదు
తెచ్చిన జానకిఁ - దిరుగఁ గోల్పోయి
యిచ్చునంతటి కార్య - మేఁటికి వచ్చె ?
సరిపోదు నీదుయో - జన చాలు ” నన్న

మఱియుఁ బ్రహస్తుని - మాటలచేత
పెరుగ కోపంబు వి - భీషణుఁ డపుడు
దొర లెల్ల వినఁగ చే - తులు చాచి పలికె.

-: విభీషణుఁడు ప్రహస్తునితోఁ జెప్పిన మాటలు :-

తగునె ప్రహస్త ! ప్ర - ధానినై యుండి
మొగమోడి యిచ్చకం - బులు పల్క నీకు ? 1180
తెప్ప లేక పయోధిఁ - దేలి దాటంగ
నొప్పునే ? రాఘవు - నొకఁడు మార్కోనునె ?
మనవంటి నీచుల - మా ? రఘువీరుఁ
జెనకువారము బుద్ది - చెడెనేమొ నీకు ?
ఆమహారథుని ది - వ్యాస్త్ర సన్నాహ
మేమి యెఱుంగ లే - కిటులఁ బ్రేలెదవు !
దేవాంతకేంద్రజి - త్త్రిశిరోతికాయు
లీవు దక్కినవారు - నీరావణుండు
సుడిసినంతటిలోనె - చూర్ణంబుఁ గాక
వెడలి వత్తురె రాము - విశిఖాగ్నిఁ దగిలి ! 1190
క్షితి మేలుఁగీడును - జింతింపలేని
హితశత్రులను మిమ్ము - నీరావణుండు
నమ్మి ప్రాణంబు ల - న్యాయంబుగాఁగ
వమ్ముగా వినుచున్న - వాఁడు మీబుద్ధిఁ
జూచి కాలాహిద - ష్టుని మంత్రవాది
కాచినగతి మహా - గ్రహము సోఁకినను
విడిపించు మాంత్రికు - విధమున రాజు
చెడుబుద్ధి చే నడ - చిన మిమ్మువంటి

యాప్తులు మఱలింప - నగుగాక యిదియు
నాప్తధర్మమే ద్రోహు - లైతిరి మీరు 1200
రామసాగరమగ్ను - రావణు నకట !
యేమిటి కిటులాడి - యిందందుఁ గూడి
మూటకట్టులుకట్టి - ముందరఁ ద్రోచి
దాఁటఁ జూచెదరు పా - తకులార ! మీరు ?
ఇతనికి లంకకు - నెల్ల దైత్యులకు
హితముగా జానకి - నిమ్మంటి మఱల
తన బలంబేది స - త్త్వముఁ గీడు మేలు
మనికియు నునికియు - మది విచారించి
స్వామి హితంబు యో - జనఁ జేసి పలుకు
నామంత్రియే మంత్రి - యగుఁగాక యిట్లు 1210
యాడినట్లనె యాడి - యటు చెడుమనఁగ
జాడయే ! మీకు తోఁ - చకయె పల్కెదరొ?"
అని యిట్లు చులకఁగా - నాడినయట్టి
పినతండ్రిఁ జూచి కో - పించి తాలేచి
యెట్టులోర్తునటంచు - నింద్రజిత్తపుడు
వట్టి గీరుబున రా - వణుఁ జూచి పలికె.

--: విభీషణుని మాటలకు నింద్రజిత్తు కోపించి పలుకుట :-

"సరకు సేయక విభీ - షణుఁడు మమ్మెల్ల
పిరికివారల వెఱ - పించిన రీతి
నాడ నీకును హితం - బైన నౌఁగాక
చూడ మాకవి కర్ణ - శూలముల్ గావె ! 1220

తేజంబుఁ గలుగు జా - తికిఁ జెప్ప నేల ?
ఏజాతివాఁడాడు - నిటువంటిమాట ?
తనబుద్ధినీ వెఱ్ఱి - తనము మాపిరికి
తనము రాముని బంటు - తనము నీయెదుర
పదర నీమాటలు - వలదు పొమ్మనక
మదినోర్చి వినఁగ ధ - ర్నమె మాకు నేఁడు
దనుజేంద్రునకు నీకుఁ - దమ్ముఁడై పుట్టి
మనజాతిలో లేని - మాటలీరీతి
నాడ నితని కేమి - యయ్యె శౌర్యమున
నీడెవ్వ రితనికి - నిట్టులైయుండి 1230
పందతనం బేల - ప్రాపించె నొకని
యందు నీవీటిలో!”- నని మించఁ బలికి
యా విభీషణు మొగం - బటుచూచి తండ్రి
కై వహించుచు దా ను - దగ్రుడై పలికె.
"మనలోన నొక కొఱ - మాలినయట్టి
దనుజునకై న సు - త్రామాది సురలు
గజగజ వడకంగఁ - గానవే సురలు ?
భుజము పై గదయేల - పూని యున్నావు ?
మోపుచేటుగ యది - మూలనువైచి
పోపొమ్ము నిలువఁ జం - పును రఘూద్వహుఁడు! 1240
ఎన్నాళ్లు బ్రదికెద - విటువంటి బ్రదుకు ?
నిన్నుఁగ న్నట్టి తం - డ్రిదె కీర్తి !” యనిన
"ఎఱుఁగవె చెఱసాల - నింద్రునిఁ దెచ్చి
మొరవెట్టుచుండఁగ - మూలవైచుటలు !
చూడవే సురదంతిఁ - జులకగాఁ గదిసి

యీడిచి దాని కొ - మ్మేఁ బెకలించి
యందు చేతన మదం - బడచితి దాని
నిందలు నెఱుఁగ నీ - వెందు వోయితివి ?
గాలిఁ గీలినిఁ గొట్టి - కడలిఁ గలంచి
కాలునిందరిమి లో - కత్రితయమున 1250
నీడెవ్వరును లేక - యేనుండ నన్నుఁ
జూడక మాతండ్రిఁ - జులకగా నాడి
చెల్లించుకొంటివి - సీత కై యింత
పొల్లువోవునె మాకు - భుజవిక్రమములు ?
తాళితి నేనిట్టి - తప్పు నీవింకఁ
జాలింపు మితర ప్ర - సంగంబు" లనిన
ఆమాటలకు కుపి - తాత్ముఁడై ధైర్య
సామగ్రితో విభీ - షణుఁ డిట్టులనియె.

--: విభీషణుఁ డింద్రజిత్తు మాటలకుఁ బ్రత్యుత్తరమిచ్చుట :-

"రాక్షసాధమ ! విన - "రా ! యింద్రజిత్త !
దక్షుని రీతి నిం - దఱు వినుచుండ 1260
గుట్టులో నుండక - కుంభంబుమీఁద
పొట్టేటికై వడి - పొట్టక్రొవ్వునను
మిట్టి మీనై పడి -మీతండ్రి నిన్ను
గట్టివాఁడని మెచ్చ - గాఁ ద్రుళ్ళ నేల ?
పడుచువాఁడవు రాము - బాణాగ్నిలోనఁ
బడుచున్న వాఁడవు - పదర నేమిటికి ?
ఈ మాటలకు ఫలం - బిప్పుడే యిట్టి
బాములు ననుభవిం - పఁగ వేళ వచ్చె

యిట్టి యాలోచన - యిట నిన్నుఁ గూర్చి
నట్టి యా రావణు - నను దింతెకాని 1270
నిన్ను నెన్నఁగ నేల ? - నీవంటి తనయుఁ
డున్న రావణుఁ డేల - యోడు రామునకు ?
యమదండమట్లు కా - లాగ్నియుఁ బోలి
యమరేంద్రు వజ్రాయు - ధాకృతి నీకుఁ
దప్పించు కొనరాదు - దశరథరాము
కుప్పెకోలను రొమ్ము - గోరాడు గాని !
సీతను బట్టి తె - చ్చిన యట్ల మఱల
చేతికిచ్చిన నేల - చేకొను నతఁడు ?
పల్లకి నుంచి వెం - బడి దశాననుని
పల్లవాధరలెల్లఁ - బాటించి కొలువ 1280
సకలాంగ దివ్యభూ - షణవతిఁ జేసి
యొకఁడు నీరావణుఁ - డొదుగుచు వోయి
రాముని చరణ సా - రసముల వ్రాలి
'స్వామి ! నాద్రోహంబు - సై రింపు'మనుచు
విన్నవించిన యట్టి - వెనుక నీసీతఁ
గన్నులఁ జూచినఁ - గరుణించు మనల
నింతియె కాని యొం - డే యుపాయములు
చింతించి యితని ర - క్షింప దుర్లభము !
మనమెల్లఁ గలిగియు - మదిమది నుండి
చెనఁటియై చెడ నుపే - క్షింప ధర్మంబె ? 1290
కొడుకవే ! నీచేతఁ - గులమెల్ల నిపుడె
చెడనున్నదీతనిఁ - జెప్ప నేమిటికి ?

హితముఁ బల్కితి ”నన్న - యెడ విభీషణుని
నతిమాత్రకోపుఁడై - యనియె రావణుఁడు.
 

         -:రావణుఁడు విభీషణుని మాటలకుఁ గోపించి తనకొలువువెడలి పొమ్మనుట :-

"పగవానితోనైన - పాముతోనైన
తగఁ జెల్మి చేసినఁ - దరియింపవచ్చు !
అనుకూల శత్రుఁడై - నట్టి నీవంటి
యనుజునితోడి స - ఖ్యము సేయరాదు
వేఱె చిచ్చేటికి - వెదకంగ ? జ్ఞాతి
చేరి యుండినఁ జాలు - చెఱచు నానాఁట 1300
దాయలచే నోర్వఁ - దగుగాని యందు
దాయాది గెలువ నెం - తటివాఁడు నేర్చు ?
నడకఁ గల్గినవాని - నయమార్గ రతుని
వడిగలవాని స - ర్వజ్ఞుడౌ నతని
కలిమి మించిన వానిఁ - గని యోర్వలేరు
తలమౌనె జ్ఞాతి చెం - తలఁ జేర్చుకొనఁగ
మేలున కోర్వరు - మెఱమెచ్చు వగలఁ
జాల నమ్మించి మో - సములు సేయుదురు
తానె సాక్షినిగానె? - తనయన్నయైన
యానరవాహుఁ గీ - టణఁచి త్రోలితిని ! 1310
అన్నదమ్ములు శత్రు - లన రెండుతెఱఁగు
లున్నవే ! క్రియలందు - నొకటింతెకాక !
హస్తిగీతలివి సు - మా యుర్విమీఁద
శస్తమైనది విభీ - షణ ! దాఁచ నేల ?

అనలంబు పాశంబు – నస్త్రముల్ భీతి
వెనుపవు మాకు నీ - భీక రాటవులఁ
గరులు మాచెంతకుఁ - గదసి యన్యులకు
దొరకఁ జేయుట జాతి - తోఁబొత్తుగాదు !
ఏనుఁగుల భయంబె - యెప్పుడు మాకు
మానదంచును బల్కె - మదవతుల్ వనుల 1320
తెలిసిరేనియు సజ - తీయభయంబె
బలవంతమగునట్టి - భయమండ్రు బుధులు !
ఎన్న నాప్తులు గల్గు - నెడలఁ గల్మియును
నన్నదమ్ములుగల్గు - నందుకు భయము
నీరజాక్షులకెల్ల - నిలుకడలేమి
పారులక్రిందియ - పరిపాటి జయము
ఫలములుగాఁగ జె - ప్పఁగమున్ను వినమె.
తెలివిడియయ్యె నీ - తెఱఁగిట్టి యెడల
ముల్లోకముల గెల్చి - ముగురువేలుపులు
బల్లిదుండని నన్నుఁ - బాటించి పొగడఁ 1330
జూడఁజాలక యిట్టి - చోఁ జెడఁజూడ
వేడుకయై యింత - విఱుగనాడితివి.
అంటియు తామర - పాకు జలమ్ము
లంటనిగతి యెంత - యాప్తీకరించి
నడిపిన మదిలోన - నాదీదు చెలిమి !
అడుగ నేమిటికి దా - యాది పుట్టునకు ?
తన యిచ్చవచ్చు నం - తయు తేనెలాని
వెనుక తుమ్మెద పూవు - విడచినయట్లు

కలకాల మఖిల సౌ - ఖ్యంబులఁ దేలి
తొలఁగఁ జూచితివి బు - ద్దులు చెప్పి యిపుడు ! 1340
నీమాట గాదన్న - నెపముగా ద్రోహ
మే మెఱుఁగఁగనీక - యిన్నాళ్లు నుండి
యజ్జ చూచుకపోవ - నందఱు నెన్ని
రజ్జులాడెదవు దు - ర్మార్గుఁడవగుచు !
ఇమ్మన్న సీత నే - నిత్తునో ? పరుల
కొమ్ములు చివ్విన - గొంక నేరుతునొ !
మైనపు శూలంబు - మై నాఁట గలదె ?
ఆనరుల్ వానరు - లా నాకు నీడు ?
కరి నీట మునిఁగి యా - కడికేఁగి దుమ్ము
కరముతో నెత్తి ఫూ - త్కారంబుతోడఁ 1350
దను ముంచుకొనురీతి - తలఁపుదుర్జనుఁడు
కొనసాగనీఁ డియ్య - కొనిన నెయ్యంబు
శరదంబుదములు ఘో - షము లింతెకాని
శరములు వర్షింపఁ - జాలని యట్లు
నీరసాత్మునితోడి - నెయ్యంబు కార్య
కారి గానేరదు............డీ రాదు !
ఇట్టి వేళలయందు - నీసుతో నిట్టి
వెట్టిమాటలు వల్కి - వెడలిపోవుటకు
నినువంటి కపటాత్ము - నికిఁ జెల్లెఁగాక !
విని యోర్వనేర్తునే - వేఱొక్కఁడైన 1360
నిందనీయుఁ డదేల - నీ శరీరంబు
పందవై వంశ నా - పకుఁడవైనావు
చెనఁటివి నిన్నుఁజూ - చిన గాదు తొలఁగు”

మనుమాట లాడియు - నాడకమున్నె
తనచేతిగద భుజాం - తరమునఁ బూని
వినువీధి కెగసిన - వెంబడిగాఁగ
నలువురు మంత్రులు - నాల్గుదిక్కులను
బలిసిరా పోక యం - బరమున నిలిచి
కనికరంబున దశ - కంధరఁ జూచి
వినయ గౌరవములు - వెలయ నిట్లనియె. 1370

-: విభీషణుఁడట్లే వెడలిపోయెదనని చెప్పివెడలుట :-

"దేవ ! యిట్లాడినఁ - దీఱునే మీకు ?
నీవాక్యములు మాన - నీయముల్ మాకు
పూజనీయుఁడ వేను - పుత్రునిమాఱు
రాజవు మీఁద న - గ్రజుఁడవు తనకు
గురుఁడ వేయెడ రక్ష - కుఁడ వటుగాన
నఱచేసి పెంపు సే - యఁగరాదు నాకు
పోయెద కదలి యి- ప్పుడ మిమ్ముఁ బాసి
యీయెడ వసియింప - నిఁకనేల తనకు ?
తలఁచిన నీయెడ - ధర్మంబు లేదు
చులకని మాటలి - చ్చో నన్నుఁ బలికి 1380
హితమును నహితంబు - నెఱుఁగక పాప
మతిఁ గానలేవైతి - మనుమార్గ మిపుడు.
ఉరక యోరిచి యిందు - నుండెద ననుచుఁ
బరికింప మనగఁ గొ - ల్వరు క్షణంబైన
తన మేలునీళ్లకు - తగులైనవాఁడు
కనిన యర్థము మేలు - గామించి పలుక

నవివేకి విననొల్లఁ - డటుగాన నీవు
చెవిఁ జేర్పవైతివే - చెప్పినమాట
కాలమెవ్వరి కతి - క్రమణ సేయంగఁ
బోలునే ? నీవునా - బుద్ధు లెన్నుదువె ? 1390
ఇచ్చకమ్ములుగాఁగ - నిప్పుడు మనసు
వచ్చునట్లాడెడు - వారిందు గలరు
కాలోచిత ప్రీతి - గాకున్న మీఁదఁ
జాల హితంబై న - చందంబు వలుకు
వారలందును వేఱు - వారు గల్గినను
వారిబుద్ధులు విను - వారలు లేరు
లేకున్న నీదు మే - లిమి మదిదలఁచి
నాకుఁ దీఱమిని వి - న్నపముఁ జేసితిని
విననొప్పు నామాట - వినవేని మమ్ముఁ
గినిసి పల్మారు ప - ల్కిన నాకు నొప్పు 1400
కాలునివలెఁ ద్రాఁటి - కల్లుకుఁ జిక్కి
యీల వై చెడుచో ను - పేక్షింప లేక
యీచిచ్చుఁ జల్లార్ప - నెంచి నీచేత
నీచోక్తు లిపుడు విం - టిని చెవుల్ నాఁట
నేరంబుఁ జూడక - నీవిట్లు వలుకఁ
దీఱెను నీసొమ్ము - దీన ఋణంబు
బలమెంత కల్గిన - బాహువిక్రమముఁ
గలిగిన కాలాను - గతి చేత వాఁడు
నేటిలోపల నున్న - యిసుక తిన్నియకు
పోటియై రూపేది - పొలియక పోఁడు ! 1410

రాఘవామోఘనా - రాచ సంధాన
లాఘవతిని నే - లను వ్రాలియున్న
నినుఁ జూడ లేక యీ - నిర్వేదవేగ
చలిత విషాదంబు - సైరింపలేక
యిట్టిమాటలు కోర్చి - యేను నీతోడ
బుట్టిన పాపంబుఁ - బొందిన కతన
నీమాట గాదన్న - నిల్చి పల్కెదను
స్వామి ! యిప్పుడు మీకు - సరిపోక యున్న
తరువాత నైననుఁ - దలఁచి నాబుద్ది
సరిఁజూచుకొనుము మో - సము వచ్చెననుచుఁ 1420
దలఁపులో నామీఁది - దయ మఱువకుము
వలయుచోటికిఁ బోయి - వచ్చెద నేను
అన్న ! యింకిటమీఁద - నైన చిత్తంబు
తిన్నగాఁ జేసి శాం - తి వహింపుమీవు !
ఏలయ్య ! జానకి - నిమ్ము రామునకు
మేలందు మెట్లైన - మేలింకమీఁద
నిను గాచికొనుము మ - న్నింపు మీలంక
దనుజులకును బ్రాణ - దానముల్ చేసి
మోదంబుతో సుఖ - మ్మున నుండు ” మనుచు
నాదానవేంద్రున - కంజలి చేసి 1430
తన యింటికని వచ్చు - దారి ముహూర్త
మునకు విన్వీథి రా - మునిచెంత కరికి

–: విభీషణుఁడు శ్రీరామునివద్దకుఁ బోవుట :-

నిలిచిన సౌదామి - నీలతా కలిత
జలదమోయనఁగ భూ - షణరుచుల్ వెలుఁగ

నల్లని మేనితో - నడుమింట తమ్ము
నల్లనఁ గనుఁగొంచు - నటునిటు బోక
నచ్చిన మంత్రులు - నలువురు గొలువ
వచ్చి నిల్చినవాని - వాలిసోదరుఁడు
కనుఁగొని కొల్చిన - కపినాయకులను
దన చెంగటికిఁ బిల్చి - తడయక వల్కె 1440
"కంటిరే! యొకఁడు రా - క్షసులతోఁగూడి
మింటి త్రోవను మన - మీఁద దండెత్తి
రావణుఁడనుప ని - ర్భయవృత్తి నుండ
నీవిధంబని మిమ్ము - నెచ్చరింపంగఁ
బిలిచితి ” నన వారు - పెల్లుబ్బి గిరులు
శిలలును దరువులు - చేతులనంది
"దేవ! పోనీక మ - ర్ధింతుము వాని
నీవేళ సెలవు మా - కిండు పోయెదము!”
అని చిమ్మిరేఁగి మ - ల్లాడుచు నింగిఁ
గనుచు వాలములార్చి - గర్జింపఁ జూచి 1450
యదరక బెదరక - యంజలితోడ
జదలు మ్రోయఁగ విభీ - షణుఁ డిట్టులనియె

 -: తన్నుఁ బట్టవచ్చిన కపులతో విభీషణుఁడు తన వృత్తాంతము నెఱింగించుట :-

"కపులార ! యేల యా - గ్రహము నామీఁద
కృపఁజూడుఁడే మిమ్ముఁ - గినియ రాలేదు
వారింపఁ దగను రా - వణుని తమ్ముఁడను
పేరు నన్నెపుడు వి - భీషణుఁడండ్రు

ఆజి నొక్కట బోలి - యవనిజ కొఱకు
నాజటాయువుఁ జంపి - యసుర నాయకుఁడు
వచ్చిన 'మొదలుగా - వైదేహి నేల
తెచ్చితి 'వలదీ ప - తివ్రతామణిని 1460
మఱల రాముని కిమ్ము - మనుజాడఁ గనుము
కొఱగాదు నీబుద్ది - కొనసాగ దనుచు
చాటి చెప్పుచు నుందు - చలమిచ్చి కాని
మాటల నన్నవ - మానంబు చేసి
బంటు నాడిన యట్లు - పదువురు వినఁగ
కంటువుట్టఁగఁ బలు - కఁగ నోర్వలేక
తలవాఁచి కొనుచు నా - తని పొత్తురోసి
కలఁగుచు సర్వలో - కశరణ్యుఁడైన
శరణాగతత్రాణ - సద్ధర్మపరునిఁ
గరుణాపయోధి రా - ఘవవంశ తిలకు 1470
శ్రీరాము చరణరా - జీవముల్ నమ్మి
చేరితి నను మీరు - చేపట్టి కాచి
పొడగనిపించు డి - ప్పుడు నన్ను మీకుఁ
గడప రాదని భా - స్కర కుమారుండు
గ్రక్కునఁ జేరి ల - క్ష్మణుఁడు వినంగ
మ్రొక్కి యిత్తెఱగు రా - మునకు నిట్లనియె

   -: సుగ్రీవుఁడు విభీషణుని రాకనుఁగూర్చి శంకించుచుఁ శ్రీరామునితోఁ బ్రసంగించుట :-

"ఆలోచనములందు - నందందు మనము
పాళెముల్ డిగియెడు -పట్టులమీఁద

చనియెడుచోట మో - సములు సేయుదురు
దనుజులు మాయావి - ధానకోవిదులు 1480
గాన వీరల నమ్మఁ - గారాదు నేఁడు
దానవుఁడామీఁద - దశకంధరునకు
సోదరుఁడట రాక్ష - సుల నమ్మరాదు !
కాదని యన్నతోఁ - గలహించి యిపుడు
వచ్చినవాఁడట - వానికి హృదయ
మిచ్చి రా నవకాశ - మిచ్చితి మేని
మన మర్మములు వీఁడు - మదిలోన నెఱిఁగి
యనువు చూచుక వైరి - కవకాశ మిచ్చి
కొదవ సేయును దన - కును జేతనైనఁ
గదిసి చంపును ద్రోహ - కార్యముల్ సేయ 1490
నజ్జ చూచుకయుండు - నది యేల వీని
రజ్జులు నమ్మంగ - రాదు రాక్షసుల
గపటాత్మకులు చేరఁ - గాదు విద్వేష
మెపుడు నున్నది మన - కీ రాక్షసులకు
నిజముగా విశ్వస - నీయుఁడు గాఁడు
వృజినాత్మకుఁడు చూడ - వీని రావణుఁడు
వంచనఁ గొలిచిన - వాఁడౌట వేగు
పంచగానోపు చం - పఁగఁ జెల్లదితని
రాఁబోలు భేదకా - ర్యమునకు వీఁడు
తాఁబట్టి చేత గ - దాదండ మితఁడు 1500
దండనోపాయంబు - తలఁచెనో తెఱచి
యుండదు వీఁడితో - నొరిమె గారాదు
తరమింత మిప్పుడి - తఁడు 'చంకదుడ్డు

శరణార్థి' యనునన్న - చందంబు వాఁడు
తనవారిఁ జేపట్టఁ - దగుఁగానివైరు
లనుగూడు వానిఁ జె - ల్లదు చేర్చికొనఁగ
సరిపోవ దీతని - చందంబు నాకు
శరణు వేడుదురె రా - క్షసులు మానవులఁ
దలఁచిన పగవాని - తమ్ముని నెట్టుఁ
దలఁచిన చేపట్ట - ధర్మంబుగాదు 1510
అవకాశ మిచ్చిన - నహితుల సమయ
మవుదాఁక నెట్లైనన -- నడఁగి తారొండె
పట్టి కాకముల గూ - బలు జంపినట్లు
కొట్టి పోవుదు రివి - కొఱగాదు మనకు"
అనుమాటలకు రాముఁ - డంగద పవన
తనయాది వానరో - త్తముల నీక్షించి
వారు వారల మనో - వార్తల నెల్ల
నారయఁ దలఁచి యి - ట్లని యానతిచ్చె

-: శ్రీరాముడు విభీషణునిగూర్చి తమతమ యభిప్రాయములను దెలుపుమని చెప్పుట :--

తగిన యాప్తులతోడ - తనవారితోడ
తగవై న కార్య మెం - తయు విచారించి 1520
నడవఁ జెల్లు విభీష - ణ ప్రసంగముగ
నుడివె మాతోడ భా - ను కుమారకుండు
చెప్పిన మీకుఁ దో - చినయట్టి తెఱఁగు
లొప్పైన చందము - లూహించి ” యనిన
నామాటలకు వార - లందఱుఁ గెలనఁ

జేమోడ్చి వినతులై - శ్రీరాముఁజూచి
" దేవ ! ప్రాజ్ఞుఁడవు బు - ద్ధివిశారదుఁడవు
భావజ్ఞుఁడవు కృపా - పారంగతుఁడవు
సర్వజ్ఞుడవు శౌర్య - శాలివి సకల
నిర్వాహకుఁడవు వ - ర్ణిత చరిత్రుఁడవు 1530
వాసిగాఁ గొలిచిన - వారిగౌరవము
చేసి యిట్లానతి - చ్చితిరింతె కాని
యేమెల్ల మీచిత్త - మెఱిఁగి యుత్తరము
రామ ! యొసంగు వా - రమె ? నేర్తుమనుచు
వేఁడిన నెఱిగిన - విధమునఁ దెలుపు
వాఁడింతె కాక దే - వర సమ్ముఖమున !"
అనుచు నందఱు నన్ని - యాలోచనములు
వినుపింతు మనియుండ - విభుఁడౌటఁ జేసి
కమనీయ కాంచనాం - గదుఁ డంగదుండు
సమయోచితక్రియా - సరణి నిట్లనియె 1540

              -: అంగదుఁడు తన యభిప్రాయముఁ జెప్పుట :-

"ఈ శత్రుపక్షమువాని - సకలయత్నముల
మిత్రునిగాఁగ నే - మించుట గాదు
కార్యాంతరంబులు - గని వానిహృదయ
పర్యాయ మపుడు చే - పట్టుట నీతి
గుణదోషములఁ గనుఁ - గొని దోషరహిత
గుణము గల్గినఁగాని - కూర్చుకోఁ దగదు
పరిహరణీయ మీ - పని ” యన్న యపుడు

-: శరభుఁడు తన యభిప్రాయముఁ దెలుపుట :-

శరభుఁడు విని యను - సారిగాఁ బలికె
నీవిభీషణుఁడున్న - యెడకును దగిన
వేవుల వానిని - వెంబడి పనిచి 1550
యతని చందమెఱింగి - యా తరువాత
హితమైన కార్యమూ - హించుట తగవు !
అందక యీతని - నంగీకరించి
సందీయ రాద”న్న - జాంబవంతుండు
మతిమంతుఁడును బుద్ది - మంతుఁడుగాన
హితమతి రాముని - కిట్లని పలికె

-: జాంబవంతుండు తన యభిప్రాయముఁ దెలుపుట :-

" అయ్య ! నాకును దోఁచు - నాలోచనమున
కియ్యెడ వీని రా - నీయంగఁ దగదు
దనుజుఁడు పగవాని - దండనేయుండి
చనుదెంచినాఁడు వం - చకుఁడుగానోపు 1560
నందుచే చేర నీ - యఁగరాదు క్రియల
ముందు వీనిచే - మోసముల్ వచ్చు !
ఎక్కడివాఁడు ? వీఁ - డెందుకు వచ్చె ?
ఇక్కడి కేతేర - యెడరైన చోట ?
మానుఁడీతని” యన్న - మైందుఁడామాట
తానిచ్చగించి సీ - తాకాంతుఁ బలికె

-: మైందుఁడు తన యభిప్రాయముఁ దెలుపుట :-

"ఒకని నెఱుంగక - యుండంగ వీరె
యొకనినా మీఁదట - యొకనిగాఁ బనిచి

యతని యాగతి మన - మడిగింప నొక్క
వితమున నుండునో - వేఱువేఱగునొ ? 1570
చెప్పిన చారుల - చేఁ గని కాని
యిప్పుడే వీని రా - నీయ రాదిటకుఁ
గన్న కార్యము సము - ఖంబున నేను
విన్నవించితి” నన్న - వినికేలుమొగిచి

-: ఆంజనేయుఁడు శ్రీరామచంద్రునికి సరియగు తన యభిప్రాయము
   నెఱింగించి విభీషణునిచేకొనుమని చెప్పుట :-

యాలోచనపరుఁడు - నతిశయ బుద్ది
శాలియు సకలార్థ - సాధకుండైన
యంజనాసుతుఁడు కా - ర్యాకార్యవేది
యంజకుఁజేరి తా - నప్పుడిట్లనియె
"దేవ ! యందఱిమాట - ధిక్కృతి చేసి
యేవిన్నపము సేయ - నెంచుట గాదు 1580
మావారిలో బుద్ధి - మంతుండ ననుచు
నేవారి మాటల - కేదురాడ లేదు
పక్షాంతరంబుగాఁ - బరుల కార్యంబు
పక్షీకరించి యేఁ - బలుకుట గాదు
అన్యులవలన కా - ర్యాపేక్షఁ జేసి
యన్యాపదేశంబు - లాడంగ లేదు
ఉరకుండ రాదని - యొకమాటవంతు
కొఱకు నాడఁగ నెన్ను - కొని పల్క లేదు

నామాట నడిపింప - నాకిందువలన
నీమైఁ బ్రతిష్ఠరా - నెంచంగ లేదు. 1590
ఎఱిఁగి యుండిన యర్థ - మే విన్నవింపఁ
బరఁగుట మదినెంచి - పలికెద నిపుడు
తొలుత నొక్కరి గుణ - దోషముల్ దెలియ
వలయునంచును బల్కె - వాలినందనుఁడు
అది సరిపోదు నా - కన్యులఁ దెచ్చి
యిదిపనిగా నుంచు - నెడగానివాని
గుణదోషములు నెఱుఁ - గుట యెట్లు తెలిసి ?
గుణము గల్గినగాక - కొఱగాని వాని
నొకట నియోగించి - యుంచుట యెట్లు?
తెకదేరగాని చిం - తింప నీమతము 1600
కాదట్టులుండి నం - గదుమాట శరభుఁ
డాదెసకై చారు - నంపించి యతని
మననుఁ గన్గొని కాని - మదినమ్మఁ జెల్ల
దనియే గదా ? మన - మడిగించి నపుడె
వంచింప వచ్చిన - వాఁడనై కాక
మంచివాఁడైన తా - మననేల నిచ్చు !
తనదు కార్యమునకుఁ - దగినట్టి మాట
లని వారిఁ బొమ్మను - నదియునుం గాక
కారుణ్యనిధి సమ్ము - ఖంబున రాయ
భారముల్ గలవెయీ - పక్షంబు చేత ? 1610
తగదట్టి శరభమ - తంబు తాఁబెద్ద
యగు జాంబవంతుడా - యన మాటగాఁగ
నెక్కడనుండి వీఁ - డెక్కడవచ్చె

నిక్కటి కీవేళ - యెడరైన చోట
నసురేంద్రు తమ్ముఁడీ - యనగాన మనకు
పొసఁగదంచును బల్కె - పొసఁగు నిదెట్లు?
అన్నతోఁ గలహించు - నదియే కాలంబు
నిన్నుఁ జేరినవాని - నీని దేశంబు
పగవాని వానిఁ జే - పట్టుట నీతి
యగుమర్మకర్మంబు - లరయుట కొఱకు 1620
దానిచే నతని మ - తంబును గాదు
దీనుఁడై శరణుఁ బొం - దినవాని మనసు
వేగులవారిచే - విని నడిపింప
బాగని మైందుఁడు - పలికె నెట్లయిన
నమ్మి వచ్చినవాని - నానావిధముల
నెమ్మది శోధింప - నియమించినారు
వీరని తనమది - వేఱుగానెంచు
నారాక్షసుని నెయ్య - మాతరువాత
జేసియు నెనరు మ - చ్చిక గల్గియుండ
నాసించి వచ్చి నాఁ - డట్టి పక్షమున 1630
మదిఁజూడ మైందుని - మతమనిగాదు
తుదిని సిద్ధాంత మిం - దుకు విన్నవింతు
నితనిఁ జూచిన దోఁచ - దింతయుఁ గపట
మతఁడెంత దాఁచిన - నాకృతి చేత
కనుపించు మర్మంబు - గావున వీఁడు
దనుజుఁడౌ నేని యా - తని రాక మనకు
నరసిన దేశకా - లాను గుణంబు
పరికించినాఁడు మీ - పౌరుష క్రియలు

తమ యన్న నేరంబుఁ - దలఁచుక యితఁడు
సమయంబుఁ జూచి రా - జ్యము మిఁది కాంక్ష 1640
వానితో నెడబాసి - వారినిఁ జంపి
వానరసామ్రాజ్య - వైభవంబెల్ల
నినకుమారునకు మీ - రిచ్చుటఁజేసి
కనుగల్గి ముందటి - గా వచ్చినాఁడు
నాకుఁ జూడగ వీని - నమ్మి చేపట్ట
మీకార్యములకు స్వా - మి ! కొఱంత రాదు
హితమని సరిపోవ - నెఱుఁగరె మీరు
మతి బృహస్పతికి స - మానులౌవారు ?
మీచిత్తమునకెట్లు - మేలయ్యె నదియె
చూచుకొం డితరులఁ - జూపంగ నేల ?" 1650
అనిన సమ్మతినొంది - యవనిజాప్రియుఁడు
తనచెంత వానరో - త్తముల కిట్లనియె

--: శ్రీరాముఁడు విభీషణుని తోడితెమ్మని వానరుల కాజ్ఞాపించుట :-

"ఎఱుఁగక యడిగితి - నే మిమ్ము ? మీరు
పరమాప్తులును నీతి - పరులును గాన
తలఁచి మీరెల్ల హి - తంబె నాకెఱుఁగఁ
బలికితి రదిమీకు - పరమధర్మంబు !
శరణంచు వచ్చిన - శాత్రవునైనఁ
గరుణించి ప్రోతురు - గాక వారెందు
మొదలింటి గుణదోష - ముల మదిఁ జూడ
రిది ధర్మ మిలయేలు - నెల్లరాజులకు ! 1660

కాచితి వీని వే - గమె తోడితెండి
నా చెంత ” కన భాను - నందనుఁ డనియె

-: సుగ్రీవుఁడు శ్రీరాముని నివారించుట :-

"అపద వుట్టుచో - నన్నఁ బోవిడిచి
పాపాత్ముఁడై వాని - పగవారమైన
మనలఁ జేరఁగ వచ్చె - మనకెట్టివాఁడు
తనమనసిచ్చి మీఁ - దట నాప్తుఁడగునె ?
మీకేల ? వీఁడు స్వా - మి ద్రోహి నిట్లు
జేకొన వచ్చు దా - క్షిణ్యమే ” లనిన
నగుమోముతోడ నం - దరు వినుచుండ
మగుడ రాఘవుఁడు ల - క్ష్మణున కిట్లనియె. 1670

--: శ్రీరాముఁడు తనయభిప్రాయము తిరిగి స్పష్టపఱచుట :--

"వినవన్న సౌమిత్రి ! - వేద శాస్త్రార్థ
ఖనియగు నీతిమా - ర్గప్రవర్తకుఁడు
నతిబుద్ధి శాలియు - నైన సుగ్రీవుఁ
డితనిఁ జేరంగ రా - నీయ రాదనియె
ఆపన్నుఁడును జ్ఞాతి - యగువాఁడు తనకు
నేపాట నజ్జ యూ - హించుక యట్టి
వేళలఁదమవారి - విడిచి యచ్చోటు
మేలొందు నచటనే - మించి చేరుదురు
తగినవాడై నట్టి - దాయాదియెంత
తగవుగా నడచిన - ధరయేలువాఁడు 1680

చూచి యోర్వఁగ లేక - చులకఁగాఁ జూడ
నాచోట చేతనౌ - నతఁడేల యుండు
శత్రుపక్షమువాఁడు - జాడ 'యేదీని
మైత్రియన్నను వారు - మనమున నొక్క
జాతివారము గాదు - శాత్రవుఁ దునిమి
యాతని సామ్రాజ్య - మనుభవించుటకు
మనచేతఁ దీఱదా - మతమునఁ జేసి
తనకును గట్టు నా - తని పట్టుమనుచు
నాసించి వచ్చినాఁ - డందుచే నితని
దోసంబు లెన్ననెం - దుకు ? తోడి తెండు 1690
రావణుఁ డీతనిఁ జే - రఁగనీక తొలఁగి
పోవనాడిన నెందుఁ - బోవక యితఁడు
గెలుతురు వీరని - కృతనిశ్చయతను
జలముతో రాజ్య కాం - క్షకుఁ జేరుకతన
నుపకారియగుఁగాక - యుపమయె వీని
నపకారి యగుచుఁ బొ - మ్మని విడనాడ ?"

 -:శ్రీరాముఁడు సుగ్రీవునితో తిరిగి విభీషణునితోడి తెమ్మనుట :-

అని " పోయి సుగ్రీవ ! - యవని యందైన
తనవంటి తనయులు - తండ్రికిఁ గలరు
వలసిన చోట నీ - వంటి చుట్టములు
గలరెందు భరతుని - గతిఁ బుట్టినట్టి 1700
తమ్ముఁడు వెదకిన - ధరలేఁడు గాక
తమ్ముల కేమి యెం - దఱు లేరు చూడ

దనుజేంద్రునకు వీఁడు - తమ్ముఁడే తప్ప
దనుమాన మేల మ - మ్మని వచ్చినాఁడు
తోడితెమ్మ’న వీని - తొలుతటియట్ల
కీడాడఁ దలఁచి సు - గ్రీవుఁ డిట్లనియె.

-: సుగ్రీవుఁడు మఱియొకమాఱు ప్రత్యుత్తరము చెప్పుట :-

"అయ్య ! యేమిటికిట్టు - లానతిచ్చెదరు
కయ్యంబునకె వచ్చెఁ - గానోపు వీఁడు
పగ్గెలు వల్కి తాఁ - బరుఁడన వచ్చి
వెగ్గలంబగు మన - వేలంబుఁజూచి 1710
చేరరా వెఱచి యా - చెంగట వీఁడు
కూరిమి కొసరుచుఁ - గొలిచెద ననుచు
మచ్చగట్టెడు వీఁడు - మాయావిచేత
నిచ్చిన మనలోన - నెవ్వనినైనఁ
దలమానిసినిఁ జంపి - దాఁటి పోవంగఁ
దలఁచినవాఁడు దై - త్యవరుఁడు పనుప
మదిమదినుండి యీ - మానవాశనునిఁ
గదియ రమ్మననేల - గలభిరానేల ?
పోవఁ ద్రోలుదమన్న - పూర్ణకారుణ్య
సేవధియైనట్టి - శ్రీరాముఁ డనియె, 1720

--: శ్రీరాముఁడు సుగ్రీవునితో మాఱుమాటాడకుండ విభీషణునితోడి తెమ్మని చెప్పుట -
                   శరణాగతుని రక్షించెదనని చెప్పుట :--

పిలుచుక రమ్ము వి - భీషణుఁ డేమి
దలఁచిన మనమీఁదఁ - దలఁపగానిమ్ము

తగినవాఁడైనను - దగనివాఁడైన
మిగులఁగలెస్స యే - మిటికాతలంపు ?
యక్షదానవపిశా - చాసురదేవ
రాక్షసావళితో ధ - రాచక్రమెల్ల
వేళంబుఁ జిటికెన - వ్రేలనఁ గెలువఁ
జాలు నాతో నీ - ప్రసంగముల్ గలవె ?
ఆదిగ నీతివా - క్యము వినలేదె ?
ఈదువేళల నొక్క - యెఱుకు కారడవి 1730
దీమంబు చెంగపో - తునిఁ బట్టి సందే
జామున నుభయ ప - క్షంబులు విఱిచి
చిక్కంబులోనవై - చి కడింది చలిని
పక్కలు వంచుక - పండ్లురాయంగ
గజగజ వడఁకుచోఁ - గని కపోతంబు
నిజకాంతఁ బురికొన - నేరంబుఁ గాచి
కరుణచే కొఱవి యొ - క్కటి ముక్కు గొనలఁ
గఱకుచు వచ్చి య - క్కడనుంచి చెంతఁ
జిదుగులుఁ గఱ్ఱలుఁ - జేరంగవైచి
యెదురు కట్టున మంట - యిడఁ గిరాతుండు 1740
ఒడలుగాచుక కపో - తోత్తమ ! నేఁడు
కడు డస్సినాఁడు నా - కలిఁ దీర్పుమనినఁ
జిరకీర్తి యాసించి - చిచ్చులో దుమికి
యెఱుకవాఁడు మెసఁగ - నిచ్చె దేహంబు !
గువ్వపుట్టుక బుట్టి - గురుకీర్తిఁ గాంచె
నవ్వరే పిశునులె - నరపాలకులను !
అనృతంబు వెఱుపును – నాస్తివాదంబు

దనరునె రాజనం - దనుల కెందైన ?
కానిమ్ము విమలధీ - కణ్వతనూజుఁ
డైన కండునిగీత - ల ప్రసిద్దంబె ? 1750
పగవానినైనఁ జే - పట్టుదుఁ గేలు
మొగిడించి వచ్చితా - ముందఱనున్న
యప్పుడె తనకోర్కు - లడిగినఁ దీర్తు.
యిప్పుటికైన మే - లిమ్మను దృప్తు
శరణంబు వచ్చిన - స్వశరీరమైనఁ V
గరుణించి యిత్తురే - కడ మహామహులు
వెఱపుతోనైన వి - విధమని ధర్మ
మెఱుగక యైనదా - నెవ్వారలైన
మఱుఁగుఁ జొచ్చినవారి - మహిఁగావరేని
దురితంబులెందుఁ బొం - దుదు రెల్లనాఁడు. 1760
అభయదానము సేయ - నతఁడాచరించు
శుభకర్మములు చాటు - చొచ్చినవాఁడు !
అన్నియుఁ గొనిపోయి - యమరలోకమున
నున్నతపదవుల - నొంది సుఖంబు
కాచెదనన లేని - కపటాత్ముఁ డెంచి
చూచినఁ బుణ్య య - శోహానిఁ జెందు
ఏనెట్లు శరణన్న - యెడఁ ద్రోవ నేర్తు ?
కానక పలికితి - కాకయీమాట
తప్పదీ యఖిల భూ - తములకు వలయు
చొప్పున నభయమి - చ్చుట నావ్రతంబు ! 1770
ఈ విభీషణుఁడు కా - నిమ్ము సుగ్రీవ !
రావణాసురుఁడె తా - రానిమ్ము వేఁడ

నిచ్చితి నభయమే - నిప్పుడే తోడి
తెచ్చి యిందునుపు సం - దియ మేల నీకు ?”
అనవిని సుగ్రీవుఁ - డాప్తుఁడై యునికి
చనవుతో శ్రీరామ - చంద్రున కనియె

-: సుగ్రీవుఁడు విభీషణుని తీసికొనివచ్చుటకు బయలు దేరుట :--

"సత్య మెంతయు ధైర్య - శౌర్యాదిగుణములు
లత్యంతమున మీకు - నాభరణములు
స్వామి చిత్తమెఱుంగఁ - జాలక యేను
సామాన్యబుద్ది నీ - జాడఁ బల్కితిని 1780
అది యేమి యరుదు మీ - యంత కారుణ్య
సదనున కీవిభీ - షణుఁ గాచు టెంత
చేరి నీమఱుఁగుఁ జొ - చ్చినవాఁడు బ్రతుక
నేరఁడె ? యందుక - నేకదా సాక్షి
తనకును గపట మిం - తయుఁ దోఁచ లేదు
జననుతుఁడగు విభీ - షణుఁని జూచినను
మంచివాఁడాతఁడు - మామిఁదఁ గరుణ
యుంచిన గతి వీని - నూరార్పఁ దగవు
తమయట్ల మీపద - ద్వయములు గొలిచి
సమబుద్ధిఁ గూడి యి - చ్చటనుండుఁ గాక 1790
తోడి తెచ్చెదనని - తోడనే యెగసి
నీడజోత్తముఁ దెచ్చి - నిర్జర ప్రభుని
చెలిమి సేయించిన - చెలువున దైత్య
కులపతి తమ్మునిఁ - గూర్చక వచ్చి

 
విభీషణుఁడు శ్రీరాముని సందర్శించుట :-

సంధింపఁ జేయ వి- శ్వాసవిధాను
సరిధానమున రామ - చంద్రుని చరణ
నాళీకములపై ప్ర - ణామంబుఁ జేసి
లేలెమ్మనుచును వా - లిసుతుండు వలుక
తన ప్రధానులతోడఁ - దా లేచి ఫాల
మునఁ గరాంబుజములు - ముకుళించి పలికె 1800

-: విభీషణుఁడు తనవృత్తాంతమునంతయు శ్రీరామునికి
నివేదించి శరణాగతుఁడగుట :-

"దేవ ! లంకాపురా - ధీశుఁడైనట్టి
రావణుతమ్ముఁడ - రాక్షసాన్వయుఁడ
పేరుకొందురు నన్ వి - భీషణుఁడనుచు
శ్రీరామ ! నమ్మి వ - చ్చితి నిన్ను నిటకు
మాయన్నచే తన - మనసు రాకున్న
దాయవు పొమ్మని - తనకొల్వులోన
నాడరానట్టివి - యాడి నీమోము
చూడరాదనిన నేఁ - జూడరాదనుచు
నాతని నెడవాసి - యాశ్రితపారి
జాతంబు మాదృశ - జనతాశరణ్యు 1810
జననుతు గారుణ్య - శరథిదాశరథి
నిను నమ్మి వచ్చితి - నీవాఁడ ననుచుఁ
గలిగిన సకలభో - గములు లంకయును
కలవారి నింతులఁ - గన్న బిడ్డలును

యెడవాసి మంత్రులు - నేనును వచ్చి
పొడగంటి మిమ్ము నె - ప్పుడును మీసొమ్ము
నాసొమ్ము మేను ప్రా - ణములును మీకు
దాసుండ నభయ హ - స్తంబు పాలించి
లాలింపుఁడనిన చ - ల్లని చూపు చూచి
చాల వేడుక రామ - చంద్రుఁ డిట్లనియె 1820
పిలిపించినపుడె వి - భీషణ ! యింక
కలఁగ నేమిటికి ల - క్ష్మణు నట్ల నీవు
నింక నీకు విచార - మేఁటికి నీక
ళంక భేదంబు లె - ల్లను దీర్చి కొనుము
రావణాసురుని శౌర్యంబును బలము
నేవిధంబిది మాకు - నెఱుఁగంగ వలయు
పేరుకొమ్మనిన వి - భీషణుండపుడు
శ్రీరామచంద్రు నీ - క్షించి యిట్లనియె

-: శ్రీరామచంద్రుఁడు విభీషణుని కభయమియఁగా నాతఁడు శ్రీరాముని కోరికపై రావణుని
   బలములను దెలుపుట :-

అయ్య ! రావణుఁడు బ్ర - హ్మవరంబు చేత
కయ్యానమూఁడు లో - కములు జయించి 1830
యెదురెవ్వరును లేక - యింద్రుండు యముఁడు
మొదలైన దొరలు పం - పుడు పనుల్ సేయ
గర్వాంధుఁ డగుచు లం - కాపురంబేలు
సర్వంకషైశ్వర్య - సామగ్రిచేత
మొనగాడు పెద్ద త - మ్ముఁడు కుంభకర్ణుఁ

డనువాఁడు సమదగ - జాయుత బలుఁడు.
అతనితో నెదురించి - యనిలోనఁ బోర
గతకాలమునను నె - క్కడ నేనెఱుంగ
నారావణుని మంత్రి - యగు ప్రహస్తుండు
శూరుఁడు కార్యద - క్షుడు జయశాలి 1840
బవరంబులో మాని - భద్రుని నోర్చి
దివిజులకును గుండె - దిగులైనవాఁడు
అగణితబద్ధ గో - ధాంగుళిత్రాణుఁ
డగుచు పావకదత్త - మగు రథంబెక్కి
మాయావియై మేఘ - మాలికాచ్ఛన్న
కాయుఁడై చేత సిం - గాణి ధరించి
పిడుగులవంటి కు - ప్పెల యంపవాన
జడిగాఁగ గురియుచు - సమరరంగముల
వైరుల మిత్తి రా - వణ సుతుఁడొప్పు
శ్రీరామ ! వాఁ డింద్ర - జి త్తనుపేర 1850
భండనంబుల నకం - పనుఁడు మహాద
రుండు సారణుఁడు ధూ - మ్రుడు నరాంతకుఁడు
శుకమహాపార్శ్వులు - శూరతచేత
నొకరినైన గణింప - రొక్కరొక్కరుఁడు
ప్రళయాగ్నిసములు ది - క్పాలకనిభులు
కలవారు వారు రా - క్షసనాయకునకు
నాలంకలో దాన - వావళితోడ
నాలంబులోన నిం - ద్రాదుల గెలిచి

యంజఁడెవ్వరికి ద - శాననుఁడహిత
భంజనుఁ ”డన రామ - భద్రుఁడిట్లనియె 1860

--: శ్రీరాముఁడు రావణునిఁ జంపి విభీషణునికి లంకారాజ్య
                              పట్టాభిషేకముఁ జేయుదునని ప్రతిజ్ఞ చేయుట :-

“నీవు వల్కినమాట - నిజమట్టి వాఁడె
రావణుఁడతని శౌ - ర్యంబు నట్టిదియె
యగుఁగాక పుత్రమి - త్రాదులతోడ
జగడంబులో వానిఁ - జంపి యీలంక
నీ చేత నేలింతు - నిజముగా ఱేపె
చూచెద బలికిన - చోఁ దప్పురాదు
పలుకు లేఁటికి ! నిన్ను - పట్టంబుగట్టి
చలము సాధించక - సాకేతమునకు
నేలపోయెదను పో - యిన రౌరవాది
మూలమౌ ముగురు త - మ్ములఁ జంపినట్టి 1870
పాపంబునకు నొడఁ - బడువాఁడ బ్రహ్మ
తాపు చేరినను పా - తాళ మేఁగినను
శరణని రాకున్నఁ - జాలును వానిఁ
బొరిగొందు సత్యమె - ప్పుడు నాప్రతిజ్ఞ
తప్పదిందుకు నీవు - తనవాఁడవైతి
వెప్పటికిని” బార - నేతెమ్మటనుచు
దిగ్గన పిలిచి య - తిస్నేహ పరత
బిగ్గి గౌఁగిటలోనఁ - బెనిచి చెంగటను
నుచితస్థలంబున - నునిచిన రాము
సుచరిత్రమునకు మే - చ్చులును దేలుచును 1880

-: హనుమత్సుగ్రీవులతో విభీషణుఁడు వారాశి దాఁటుటకు నుపాయము సముద్రుని ప్రార్థించుటయేయని చెప్పుట :-

నంగద సుగ్రీవ - హనుమంతు లతని
చెంగట గూర్చుండి - చెవిచెంతఁ జేరి
"యేకాంతమున వార్ధి - యెట్లు దాఁటుదుము
నీకెట్లు దోఁచే దా - నివచింపు ” మనిన
వారలతో దాన - వ ప్రభు తమ్ముఁ
డూరట వుట్టంగ - నొకమాట వలికె.
"జలధినాయకుని ప్ర - సన్నతలేక
తలఁపరా దొరులకు - దాఁటిపోవుటకు
సగరులచేనైన - సాగరుఁడగుట
సగరాన్వయజ్ఞాతి - సంబంధమునను 1890
రాముఁడు చేరి ప్రా - ర్ధన చేసెనేని
యామీఁదట ప్రసన్ను - డగు వార్ధిరాజు
యిదిమార్గమ ” న విని - హితముగా నెంచి
కదిసి సుగ్రీవుఁ డం - గదుఁడు వాయుజుఁడు
రామునితో నీతె - ఱఁగు విన్నవింప
నామాటలకు లక్ష్మ - ణాగ్రజుం డనియె
"ఏకమతంబుగా - నిందఱుఁగూడి
మీకిట్లు దోఁచె సౌ - మిత్రితో మొదట
నాలోచనము చేసి - నట్టి కార్యంబు
వాలాయముగఁ జేయు - వాఁడ ” నేననినఁ 1900
గ్రమ్మఱ వారు ల - క్ష్మణుఁడును గూడి
"సమ్మతంబిది విభీ - షణుఁ డన్న మాట

కడలిపై సేతువు - గట్టినఁగాక
కడచి పోవఁగరాదు - కపులతో మనకు
నందుపై మీచిత్త - మనిన శ్రీరాముఁ

-: రాముఁడు లక్ష్మణునితోడను హనుమత్సుగ్రీవాది సమస్త వానర సైన్యము తోడను సముద్రతీరముఁ జేరి సముద్రుని స్మరించుట :-

డందఱితోఁ గూడి - యావారిరాశి
తీరంబునకుఁ జేరి - తిన్నని నేలఁ
దీఱిపించినయట్టి - తిన్నె మీదటను
పఱచిన దర్భల - పైఁ బవ్వళించి
శరనిధి నాత్మలో - స్మరణంబు చేసి 1910
కరములు మొగిడించి - కదలక యుండె.


-: రావణుఁడు శ్రీరాముని సైన్యవివరము కనుగొనుటకు శార్దూలు నంపుట :-

తరువాత లంకలో - దశకంధరుండు
పరమాప్తుఁడైనట్టి - బంధు శార్దూల
• • • • • • • • • • • • •
రావించి "నీవేఁగి - రాముని పాళె
మేవిధంబున నుండు - నెంత బలంబు
చూచి రమ్మ” న వాఁడు - సుగ్రీవ బలస
మీచీన కిలకిల - మేదురారవము

విని గుండె ఝల్లన - వేలంబు చూచి
దనుజనాయకుని ముం - దఱ కేలు మొగిచి

--: శార్దూలుఁడు రామసైన్య మపారమని వేగుల వారినిఁ బంపి యథార్థము తెలిసికొమ్మని విన్నవించుట :-

"అయ్య ! రెండవ వార్డి - యనఁగ మ్రోయుచును 1920
కయ్యంబులకు మీరి - కాలుదువ్వేరు
కొండలవంటి యా - కోతులఁ జూచి
గుండె తల్లడము నా - కును దీఱదిపుడు
వారలకొలఁది యె - వ్వఁడెఱుంగు నిపుడె
యూరిచి త్రావుదు - రుప్పొంగు జలధి
రామలక్ష్మణులు ఘో - రశరాసబాణ
భీములై లయకాల - భీములో యనఁగ
నున్నారు వారిలో - నొకఁడైనఁ జాలు
నన్నిలోకము లొక్క - యమ్మున గెలువ
నీసీతకొఱకు వా - రేమి సేయుదురొ 1930
మోసంబు వచ్చు రా - ముని చేత మీకు
చదరంబు నూఱు యో - జనముల మేర
బదిలంబుగా వారు - పాళెంబు దిరిగి
దబ్బర వచ్చె ముం - దఱ రాక మీరు
గొబ్బున తగినవే - గులవారిఁ బనిచి
మొదట దండోపాయ - ముననైనఁ దెగువ
యది యేల వేర యు - పాయమునైనఁ
గానంగ వలసిన - కార్యంబుఁ జూడఁ
గానగు" నన్న లం - కానాయకుండు

--: రావణుఁడు శుకుఁడను రాక్షసుని సుగ్రీవునియొద్దకు దూతగాఁ బంపుట :-

శుకుఁడను నొక రాక్ష - సునిఁ జేరఁ బిలిచి 1940
" ఒకఁడవు సుగ్రీవుఁ - డున్నెడ కరిగి
నిన్న వచ్చిన రాము - నికిఁ దోడువచ్చి
యన్నదమ్ములమైన - యట్టి మామీఁద
దండెత్తి వత్తురే - తన యాలికొఱకు
కొండంత పగతాను - కొనుకొన్నవాఁడు.
ఈ రాముఁ డతఁడు నీ - కేనాటి చుట్ట
మీరీతి నతని వ - హించుక నీవు
కదలి రానగునే య - కారణ ద్వేష
మదియేల ? మీకు మే - మన్యోన్యమైన
నడిపించు కొందమా - నరులతోఁ గూడి 1950
కడతేఱనట్టి యీ - కలహ మేమిటికి
నీవొక్కఁడవె కడ - నిలిచిన రాముఁ
డేవగ మాతోడ - నెదిరింపవచ్చు ”
నని యిట్లు భేద కా - ర్యము నడిపించి
యినసూనుతోడ నీ - కేరీతి దోఁచె
నాకైవడిని మాట - లాడి రామునకుఁ
గాకుండ సుగ్రీవు - కడకుఁ దీసినను
యేమి వేఁడిన నీకు - నిచ్చెద ” నన్న
నామాటలకు వాఁడు - నౌఁగాక యనుచుఁ
జిలుక వేషము వూని - సింధువు మీద 1960
చులుకఁగా నెగిరియా - సుగ్రీవుఁడున్న
చాయగా నంతరి - క్షంబున నిలిచి

 --: శుకుఁడు సుగ్రీవునితో రావణుఁడు చెప్పిన మాటలు చెప్పుట - సుగ్రీవుఁ డాతని చంపుట కాజ్ఞ యిచ్చుట :-

"దాయాది మీకు మా - దశకంధరుండు
వినుము రిక్షరజుఁడు - విశ్రవసుండు
మునుపటికన్న ద - మ్ముల మేర వారు
కావున మీయన్న - గావలె నిపుడు
రావణాసురుఁడు పో - రాని చుట్టంబు
నతఁడు నీతోమాట - లాడి రమ్మనుచు
నతిశయప్రీతి న - న్ననిచె నీప్రొద్దు”
అని దశాననుఁడాడు - మన్నట్లు పలుక 1970
విని భానుజుఁడు కపి - వీరులఁ బిలిచి
"పోనీక వీనిఁ జం - ఫుడు పట్టి” యనిన
వానరు లెగరి దు - ర్వారులై కదిసి
మోకాళ్లు మోఁ జేతి - ముడుపులఁ బొలిచి
యీకెలు రాలగ - యెఱకలు విఱుగఁ
గొట్టి దుమ్ములు రేపఁ - గూఁతలు వెట్టి
బిట్టు వాపోవుచు - పేరెలుంగునను

-: శుకుఁడు శ్రీరాముని శరణు వేఁడుట - సుగ్రీవునిఁ బ్రత్యుత్తరము కోరుట :-

కారుణ్యశరధి ! రా - ఘవ వంశతిలక !
శ్రీరామచంద్ర ! ర - క్షింపవే తండ్రి
దూతమానసుల నెం - దును బట్టి చంప 1980
భూతలాధిపులకుఁ - బోలునే యిటుల
ననుమన్న మాట లే - ననుటింతె కాక

తన యిచ్చ నాడిన - దండింపఁ దగవు
రక్షింపవే యన్న - రఘువీరుఁ "డేల
పక్షిమాత్రుని నింత - బాధింప మీకు
విడిచి తోలుఁ " డటన్న - విడిచిన వాఁడు
జడిసి పాఱక మింటి - చక్కటి నిలిచి
"ఏమంటి సుగ్రీవ ! - యేను రావణుని
"కేమందు నీచిత్త - మెఱిఁగింపు ” మనిన


-: సుగ్రీవుఁడు రావణునికిఁ జెప్పుమన్న మాటలు :--

"తానేడ చుట్టము - తనకును మాకు 1900
నేనాఁటి సంబంధ - మెవ్వఁడు తాను
రామచంద్రునకు శా - త్రవుఁడైన యపుడె
స్వామిహితార్థినై - చంపకమాన.
తప్పదు మేమన్న - దమ్ముల మగుట
నొప్పితి వాలితో - నుద్ది చేసితిని
యతని జంపించిన - యట్లన రాము
శితసాయకములచే - క్షితి గూలఁ జేతు
నినమండలమునకు - నేఁగిన నాక
మునకుఁ బోయిన దిశా - ముఖములఁ జనిన
బాతాళమునఁ జొరఁ - బాఱిన పంక 2000
జాతకపర్దుల - చాటు చొచ్చినను
జలధిలో డాఁగిన - చననీక పట్టి
చలము మానక రాక్ష - సశ్రేణితోడఁ
దన లంకతోనె పు - త్రకళత్రముగను
దునిమింతు పోవని - త్తు నె” యంచు ననుము

రాము క్రీఁగంట నె - ఱ్ఱదనంబు వొడమ
నా మేర తనకొక్కఁ - డడ్డంబు వచ్చు
వాఁడొక్కఁడును లేఁడు - వై దేహికొఱకు
నేఁడె వానికి నూఱు - నిండె ” బొమ్మనుచు
ననునంతలోపల - నంగదుం డలిగి 2010

 -: అంగదుఁడు కోపించి శుకునిఁ జంపుమన వానరు లాతనిపైఁ బడుట :-

తనుగొల్చు వానరో - త్తములను బిల్చి
వీఁడు చోరుఁడుగాని - వేగులవాఁడు
గాఁడు పోనీయక - కట్టి తెండిటకుఁ
బొడువుఁడు చంపుఁడు - పోనీకుఁ ” డనిన
విడివడి యగచర - వీరులుద్దతిని
బాధింప కపులచే - బాధకుఁ గాక
సాధురక్షకు రామ - చంద్రునిఁజూచి

  -: శుకుఁడు శ్రీరాముని శరణుజొచ్చి లంకకు వెడలి పోవుట :-

"అయ్య ! కోఁతుల చేతి - కప్పగించి నను
దయ్యాలవలె వీరు - తరుముక వచ్చి
పాఱిపోవఁగనీక - పట్టి చంపెదరు 2020
మీరాన తీయఁగ - మీఱినారాజ్ఞ
తనునాజ్ఞ చేసిన - తప్పదు సుమ్ము
జనని గర్భంబునఁ - జనియించి వెనుక
నేఁటి పర్యంతంబు - నేఁ జేసినట్టి

మేటి పాపంబులు - మిముఁ జుట్టు కొనక
యెల్ల ధర్మంబుల - నెఱిఁగిన మీరు
చెల్లరె యిది మఱ - చితి రేల యిపుడు
నను విడిపింపు మ - నాథ శరణ్య !
యనవిని కొట్టకుం - డరికట్ట నేల
పోవనిండను రఘు - పుంగవు నాజ్ఞ 2030
నావానరులు విని - యట్ల సేయుటయుఁ
ద్రాణ యెల్లను జెడి - తనపెట్లుమేనఁ
బ్రాణముల్ డాఁచుక - బడినేఁగు దేర

-: శ్రీరాముఁడు సముద్రతీరమున దర్బాస్తరణమున ప్రాయోపవేశము సేయుట :-

నారామవిభుఁడు ద - ర్భాస్తరణమున
వారధి తా దాఁట - వలసి శయించి
నవరత్న కటక మం - డన మండితంబు
వివిధోర్మికామణి - విసృమరాభంబు
నుర్వీతనూజా మృ - దూపధానంబు
గర్విమోహిత భిదా - కాల దండంబు
ఘోరప్రతాప కుం - కుమ చర్చితంబు 2040
సారంగ మద లేప - సంవాసితంబు
నిరత మహాదాన - నిపుణతారకము
ధరణీభరధురీణ - తాసమంచితము
నైన దక్షిణహస్త - మల్లన మలఁచి
తాను తలాడగాఁ - దగ నొత్తగిల్లి
ప్రాయోపవేశన - పరుఁడౌచు నిట్లు

రేయి బగళ్లుగాఁ - ద్రిదినంబు లుండి
మూనాళ్లకును దన - ముందఱవచ్చి
తానిలఁడయ్యె నీ - తటినీవరుండు
ననుచు నాలోచించి - యండనేయున్న 2050
తన సహోదర సుమి - తాపుత్రుఁ బలికె


-: సముద్రుఁడు ప్రత్యక్షము కానందులకుఁ గోపించి శ్రీరాముఁ డాతనిపై బ్రహ్మాస్త్రమును
                     బ్రయోగింపఁ బూనుట :-

"కంటి వే లక్ష్మణ ! - కడిమి గర్వంబు
వెంటనేకాని యే - వెంటలోఁ బడదు
తగినవారలయందుఁ - దగుగాక తాల్మి
తగునె దుర్జనుల ముం - దఱ బ్రకటింప
శాంతిచే నుండిన - జడులైన యల్పు
లింతయు చేతగా - దితనికి ననుచుఁ
దలఁతురు క్రోధియై - దండించువాని
కలుకు మఱిది సుమీ - యల్పులజాతి
నోరుపుతో నెవ్వ - డుండినఁ గీర్తి 2060
చేరదు జయమును - జేకూడిరాదు
మెత్తదనంబుచే - మేలెంచి యిట్టి
మత్తులు చాల దు - ర్మానంబుచేత
సడ్డసేయరు గాన - జలరాశియెల్ల
గొడ్డు పుచ్చెదనాదు - ఘోరబాణములఁ
జూడుము నీర మిం - చుకలేక పెద్ద
బీడయి పోఁ జేతు - పెల్లు లెత్తంగ

సర్వంబు గ్రోలక - జలధి దోగింప
యౌర్వానలంబె నా - యస్త్రానలంబు.
ఇమ్ము బాణాసన - మిటు లిమ్ము శరము 2070
లెమ్మెలు చేయగా - కితఁడు నాయెదుటఁ
బొగలేని మంట లం - బువు లెల్లఁ గ్రోల
నగచరులకుఁ గాలి - నడసేఁత జలధి.”
అని పల్కి కాలాన - లార్చులు కన్నుఁ
గొనలు తీగెలు సాగ - గొబ్బున నలిగి
తమ్ముని చేతి కో - దండంబు దాడి
యమ్ములు నంది రౌ - ద్రాకృతి నిలిచి

-:శ్రీరాముని కోపమునకు దేవమనుష్య లోకములు తల్లడిల్లుట :-

శరము సంధించిన - జలజల చుక్క
లురులె ధరాచక్ర - ముఱ్ఱూతలూఁగె
గడగడ కులగిరుల్ - కదలె నల్ దిశలు 2080
తటబాటు వడియె వే - ధకు జాలివుట్టె
పదునాల్గు లోకముల్ - పాతరలాడెఁ
జదికిలఁ బడి దిగ్గ - జములు వాపోయె
నినమండలము మాసె - నింద్రాదులకును
మనికి సందియమయ్యె - 'మామా' యటంచు
నఱచె భూతము లమో - ఘాస్త్రంబు దొడిగి
శరనిధిపై రామ - చంద్రుఁ జేయుటయు
నసలుబ్బి కళకళ - నంబువుల్ దురలి

యెసరయ్యె తుకతుక - నెంతయు నుడికి
మీనముల్ దేలాడె - మిడుకుచు మునివి 2090
తానంబు జలదేవ - తలు నార్తులైరి
"స్వామి ! యీకోపంబు - సై రింపు"మనుచు
సౌమిత్రిచే మోడ్చి - సభయుఁడై పలికె.
కను చాటుగా నిల్చి - ఖచరులు మింట
"జనకజారమణ ! రో - షము మాను”మనిరి.
అందులఁ దనియక - యరుణారుణార
విందనేత్రుఁడు రఘు - వీరుండు గినిసి
"ఓరి ! సముద్ర ! యిం - కొక తూపుచేత
నీరెల్లఁ గ్రోలించి - నిను బయల్ సేసి
పెనుబాటగాఁగ గ - పిశ్రేణినెల్ల 2100
దనుజేంద్రు వీటిపై - దాడి వెట్టింతు
పాములుగాములు - భయదగ్రహముల
నీ మీనముల నిన్ను - నిగ్రహింపుదునె
శైలంబులవశిష్ట - శల్యంబు లనఁగ
నీలోననున్న వ - న్నియు బయల్ పఱతు
నది చూడు మనుచు బ్ర – హ్మాస్త్రంబు నారి
గదియించి చెవిసోఁక - గా దివియుటయు
భుగభుగ పొగలెచ్చె - పొగలక మునుపె
దిగదిగ మంటల - దిశలెల్లఁ బొదివె
మంటలకును మున్నె - మహినిండఁ గురిసె 2110
మింటనుండి కడింది - మిణుగురు జళ్లు
జడుల వెంబడి దమి - స్రము ముంచ దాని
బడినె జంఝానిలా - ర్భటి నివ్వటిల్లె

వాయువు వెంబడి - వచ్చి మేఘములు
మ్రోయుచుఁ బిడుగుల - మొత్తముల్ రాల్చెఁ
బిడుగుల వెంటనే - పెదపెద ఱాలు
వడియె నందులఁ గూలఁ - బడియె వృక్షముల
గ్రహతారకావళి - గతిఁ దప్పె దావ
దహనంబు విశ్వమం - తయు ముంచుకొనియె
భూతహాహాకార - ములునిండె బ్రాణ 2120
జాతంబు చైతన్య - సంగతిమానె
సీతానిమిత్తమై - సృష్టి చీకట్లు
చేతురే యని సుర - శ్రేణి వాపోయె
భయమంది శేషుఁడు - పడగలు వంచె
జయజయధ్వనులాక - సంబెల్ల నిండె
పరికించి యంతయు - పరమ కారుణ్య
వరుణాలయుఁడు రఘు - వంశవర్ధనుఁడు
తొడిగి బ్రహ్మాస్త్రంబు - తోడనే పట్టు
విడువక చేకాచి - వీక్షించుచుండ

-: సముద్రుఁడు శ్రీరామునకుఁ బ్రత్యక్షమై వానరసేనకు దారియిచ్చెదనని చెప్పుట :-

భోరున కలఁగి యం - బుధి మిన్నుముట్టి 2130
మీరి యోజనము భూ - మి యతిక్రమించి
యెదురుగాఁ బఱతెంచె - నిరుగడనెల్ల
నదులర్ఘ్య పాద్యాస - నములతో రాఁగ
కుండల కేయూర - కోటీర దివ్య
మండలసదలస - మాన వైడూర్య

శోభావికాసల - క్ష్ములు మేన నిగుడ
నాభిముఖ్యముగ బ - ద్ధాంజలి యగుచుఁ
దన నీటిలోఁ దోఁచి - ధరణిని వెడలి
వననిధిరాజు ది - వాకరు మాడ్కిఁ
దేజరిల్లుచు జగ - తీసుతారమణుఁ 2140
బూజించి సన్ను తిం - పుచు నిట్టులనియె.
"పంచభూతములు శ - బ్దముఖత్రిగుణ ప్ర
పంచంబు నెప్పుడు - పాయనిరీతి
కలగుణంబనుచు రా - ఘవవంశ తిలక !
తలఁపుమెల్లన యగా - ధత్వంబు దనకు
లోతుపాతెఱుఁగఁ జె - ల్లునె నన్నుమీరు
కోఁతుల నడిపింపఁ - గోరుటఁ జేసి
అలిగితి విపుడు నా - యందు నెన్నడును
జలములొక్కెడ నైన - స్తంభింపఁ జేయ
మీనిమి త్తముగ నా - మీఁదటఁ దెచ్చి 2150
వానర లద్రులు - వైచిరేనియును
ముంచక పయిపయి - మోచి యప్పుడు ధ
రించు వాఁడను సేతు - రీతిఁ గట్టినను
ఆకట్ట నేదాల్పు - నంతియెకాదు
మీకు నై నాలోన - మీనాదికములు
కపులకు చిల్లరఁ - గావింపకుండ
నిపుణత నడిపింప - నెగులొందకనీక
తెప్పకైవడి నీఁటఁ - దేలి యాడంగ
నెప్పటి కా సేతు- వేధరింపుదును.
అదియేల యీ సచ - రాచరం బెల్ల 2160

కుదురు దప్పింపగ - గ్గోలుగాఁ బడిన
యానికగా నిల్చి - యానుకయుందు
నేనొకనికి రక్ష - ణీయుఁడగాను
సడ్డసేయను నీకె - శరణంటిగాక
యడ్డమెయ్యది నాయ- హం కారమునకుఁ
బాటింప నాగుట్టు - బయలుసేయంగ
నేఁటికి బ్రహ్మాస్త్ర - మేల పూనితివి
కట్టింపు సేతువు - కపులతో నేఁగి
కట్టింపు మివుడె లం - కను తోరణంబు
పాలింపు ” మనిన న - పారకృపావి 2170
శాలుఁడైనట్టి కౌ - సల్యాసుతుండు
దాక్షిణ్యవసతి సీ - తాసహాయుండు
దక్షిణాంబుధి చూచి - "తానిట్టులనియె.

-: సముద్రుని కోరికపైని రాముఁడు తానుతొడిగిన యమ్మును నుత్తరదిశ పైఁ బ్రయోగించి
   యందలిబోయలను దునుముట :--

"కాచితి నిను నమో - ఘము నాశరంబుఁ
జేచాఁచి తొడిగితి - శింజినిఁ గూర్చి
యూరక పోవునె - యొకటి నీయందు
నేరుపాటుగఁ జూపు - మేసెద" ననిన
అయ్య ! నాలో నుత్త - రాశనేప్రొద్దు
పయ్యాడి బోయలు - బలిసియున్నారు.
ద్రుమకుల్య మనుచోటఁ - దోయంబులోనె 2180

సమయింపు చున్నారు - జలజంతువులను
వారి నేయుమటన్న - వనధి జూడంగ
శ్రీరామ విభుఁడు వై - చెను మహాస్త్రంబు
నేఁడును నాఁడు నీ - నిశితా స్త్రవరము
గాడిన ధర మరు - కాంతారమయ్యె.
ఆరసాతలముగా - నమ్ము ధరిత్రి
గోరాడుచో వ్రణ - కూపమనంగ
నొక నీటిబుగ్గ పై - కుబికి వేసవుల
నకలుషాంబుప్రవా - హమున జాలెత్తె.
ఆనీరు గ్రోలిన - యావులపాఁడి 2190
హేరాళముగనందు - నెనసియున్నట్టి
వనములంచితఫల - వ్రాతంబుతోడఁ
దనరఁ గావించె సీ - తామనోహరుఁడు.
ఆవేళ వారిధి - యంజలిఁ జేసి
భావి కార్యవిచార - పరతనిట్లనియె.

–: సముద్రునికోర్కెపై శ్రీ రాముఁడు నలుని సేతువుగట్ట నాజ్ఞాపించుట :-

"అనఘ స్రష్టకుమారుఁ - డైన యీనలుఁడు
తన తండ్రివరము లెం - తయుఁ గన్నవాఁడు
వారిలోఁ దరుగిరి - వ్రాతంబువైచి
శ్రీరామ! యితరుల - చేఁ గట్టగాఁదు
ఆయన తనతండ్రి - యంతటివాఁడు 2200
సేయు మిట్లని పల్కె - సింధువల్లభుఁడు
తోడ నదృశ్యుఁడై - తొలఁగినభక్తి

తోడ నన్నలుఁడు చే - తులు మోడ్చి పలికె.
"దేవ ! కట్టెద నంబు - ధి యనఁగ నెంత
లావరు లైనట్టి -ప్లవగపుంగవులఁ
బనిచి తెప్పింపుఁడు - పర్వతంబులను
వనములు బెకలించి - వడిమీఱ ” ననిన

-: నలుఁడు సేతువుకట్టుటకుఁ బ్రారంభించుట :-

దశరథాత్మజు నాజ్ఞ - తలమోచినట్ల
దశదిశాంతరముల - తరులును గిరులు
తలల మోచుక కపీం - ద్ర వ్రాతమెల్ల 2210
నలుఁడందుకొని వైచి - నఁ బయోధిలోన
మున్నుగా భూరుహం - బులువైచి మీఁదఁ
బన్నిన కైవడి - పర్వతావళులు
పఱచి యందును మిఱ్ఱు - పల్లంబులేక
యఱచేతివలె నుండ - నచ్చెరు పఱచి
మదమేనుఁగులఁ బోలు - మర్కటోత్తములు
పెదపెద కొండలు - పెకలించి తెచ్చి
గుభులు గుభుల్లనఁ - గుప్పించి వ్రేయు
రభసంబుచేత నీ - రములు పెల్లుబ్బి
తుంపరుల్ గగనవీ - ధుల నాక్రమింప 2220
గుంపులుగట్టి పే - ర్కొని రాముఁ దలఁచి
కప్పుత్రాటను చక్కఁ - గా నూత్రవెట్టి
యొప్పు మీఱఁగ శత - యోజనంబులకుఁ
జాపును పరవు యో - జనదశకంబు
నేపు మీరఁగ బట్ట - నేర్పాటు చేసి

కోలలచేతను - కొలిచి యందఱును
కోలాహలము సేయు - ఘోషంబు వలన
శరనిధి మ్రోఁతచే - సంవర్తసమయ
శరద గర్జార్భటి - స్మరణంబు వొడమె.

--: సేతునిర్మాణము పూర్తియగుట :-

వానరుల్ గట్టిరి - వారిధి నాఁటి 2230
లోననె పదియు నా - లుగు యోజనములు
మఱునాఁడు గట్టిరి - మనము లుప్పొంగఁ
బరవసంబొప్ప ని - ర్వదియోజనములు
నురుశక్తి నిరవది - యొక్కయోజనము
శరధి గట్టెను కీశ - చయము మూనాళ్లు.
ఏజాడ తామెయై - యిరువదిరెండు
యోజనంబులు గట్టి - రుదధి నానాళ్ళ
క్రమముతోఁగడలి య - ర్వదిమూఁడు యోజ
నము నైదవ దివంబు - నకుఁ గట్టిరిట్లు
శతయోజనమును వా - నరపంచకమున 2240
జతనంబుగాఁ గపుల్ - శరధిబంధించి
నలుడు సేతువు గట్టి - న తెఱఁగు భాను
కులపావనునకుఁ బే - ర్కొని కపుల్ దెలుప
జలధి సేతువు దోఁచె - చాల నాకాశ
తలమున స్వాతీప - థంబు చందమున
నట్టి యద్భుతకర్మ - మమరులాత్మలను
బుట్టిన వెఱఁగుతోఁ - బొగడిరి చూచి
కపులకు నానంద - కరమయ్యె సేతు

వపుడు విభీషణుం - డనుచరుల్ దాను
సేతువు దక్షిణ - సితమ వసించెఁ 2250
బ్రీతితో గద భుజ - పీఠి నమర్చి
తారాంగదానిల - తనయులు వినఁగ
శ్రీరాముఁ జూచి సు - గ్రీవుఁ డిట్లనియె.

-: సుగ్రీవుఁడు శ్రీరామునితో లంకాద్వీపమునకుఁ దరలుటకు సమయమని చెప్పుట :--

"కదలిపోవలయు లం - కా ద్వీపమునకు
నిది వేళ హనుమంతు - నెక్కుఁడు మీరు
నీయంగదుని మీఁద - నెక్కి లక్ష్మణుఁడు
పాయక మీఁదు వెం - బడి వచ్చు గాక"
అనుమాట విని రాముఁ - డట్ల కాకనుచు
మునుపటి వాహనం - బుల మీఁదఁ గదలి
ముందఱగా స్తోమ - మును దాను నడచి 2260
కొందఱు వెనక ది - క్కున మహాకపులు
బలుసుక రా నిట్లు - పయనమై సైన్య
కిలకిలార్భటులు ది - గ్వీథుల నిండ
నారవంబున నుచ్చి - యంబుధి మొరసి
పూరించు మ్రోఁత నం - బుజ భవాండంబు
నీరీతి దండెత్తి - యెల్ల వానరులు
భోరునఁ గదల న - ప్పుడు పెచ్చు పెరిగి
"ఇంతమాత్రమునకై - యీ సేతువేల
యంతరిక్షమున - "మేమరు దెంతు ” మనుచు
గరుడ వేగమున ఱె- క్కలు వచ్చినట్లు 2270

శరనిధిపై జాడ - జనియెడు వారు
ఘోరనక్రగ్రాహ - కోటులు బెదరి
పాఱగఁ దమర చే - బారలు వెట్టి
యొకరికి మెచ్చంగ - నొగరేఁగఁ దలఁచి
యొకమొత్తముగ నీఁదు - చున్న వారలను
కడలిలోఁ దమదు మో- కాళ్లు గన్పట్ట
నడచి వచ్చెదమంచు - నడుచు వారలును
తెప్పలపై నెక్కి - తెడ్లచే జలము
చప్పుడుగాఁ ద్రోసి - చనెడు వారలును
నగుచుండఁ జనుచు సా - యం సమయమున 2280

-: శ్రీరాముఁడు వానరులతో మూఁడుయోజనములు దాఁటి యచ్చట నొక వనములో
                      బస సేయుట :-

నగచరావళి యోజ - నత్రితయమున
నిలిచిన దేవతా - నిర్మితి నచట
ఫలమూల కుసుమ సం - పదలను బొదలు
వనమును గన్గొని - వనజాప్త కులుఁడు
వనచరావళిఁ గూడి - వసియించు నంత
దేవతా ఋషులును - దివిజులు మునులు
నావేళ రఘువీరు - నర్చలు చేసి
దీవించి జయము సి - ద్దించుఁగాకనుచుఁ
బోవుచోట నిమిత్త - ములు జాలఁజూచి
తనమదిలోన నెం - తయు నూహచేసి 2290
జనకజాప్రియుఁడు ల -క్ష్మణున కిట్లనియె.

-: శ్రీరాముఁడు దారిలో శకునములఁజూచి ఘోరయుద్ద మగునని చెప్పుట :-

"సౌమిత్రి ! కంటె ప్ర - చండవాయువులు
భీమమై దశదిశా - బృందంబు వొదివె
గడగడ నూరకే - కంపించె ధరణి
పడియె మహీరుహ - ప్రకంబు పెకలి
కావిరుల్ దిక్కులఁ - గప్పెను సంధ్య
జేవురు చాయఁ గెం - జిగి పాదుకొనియె
ఱెక్కలు విఱిగి ధ - రిత్రిపైఁబడియె
నక్కడక్కడ వివి - ధాంగజకులము
నినమండలంబులో - నెసఁగి క్రొన్నలుపు 2300
వనజారి చంద్రికా - వైభవంబుడిగి
యసితశోణములై న - యంచులు చుట్టు
నెసఁగె పరీవేష - మెఱ్ఱనైయుండె
వాపోవుచున్నవి - వరుదుగ వికృత
రూపంబులును నెత్తు - రుంగ్రక్కుకొనుచు
మృగములు కన్నీట - మెలుపులు మాని
మొగములపై నెత్తి - మొరవెట్టఁ దొడఁగె
దనుజుల రీతి కా - దంబినుల్ కండ
లును నెత్తురులును జ - ల్లుగఁ గురియించె
చుక్కలన్నియు రాఁజు - చుఁ బొగల్ గప్పి
యొక్కటఁ దామర - ద్యుతులతోఁ దోఁచె
విలయవేళల నెట్టి - విపరీతకర్మ
ములు పుట్టునాచంద - మున నున్నదిపుడు
రక్కసులకుఁ గపీం - ద్రశ్రేణికెంత

కక్కసంబగు నట్టి - కయ్యమందెడునొ
సురవైరులాయుధ - స్తోమంబు చేతఁ
దరుచరావళి నెంత - తరమి నొంపుదురొ
మనవారు గిరులను - మ్రాఁకులచేత
దనుజులఁ బోనీక - దండింపఁ గలరొ
మెదడు నెత్తురు చేత - మేదిని యెల్ల 2320
బొదవగాఁబడకున్న - భూరియుద్ధమున
నేల తామస మిప్పు - డే కదలుదము
పాళెంబు దరలించి - పైనంబు గమ్ము"
అనుచు వేడుక లేచి - యావలఁ గదలి
చనుచున్నయెడ విభీ - షణుఁడును దాను
వనచర ప్రభుఁడెల్ల - వానరుల్ గొలువ
దనుజనాయకురాజ - ధానిపై నడచె


-: శ్రీరాముఁడు సుగ్రీవ విభీషణాదులతో లంకా రాజధానిఁ జేరుట :-

సాంద్ర తేజమున రి - క్షములలోఁ బూర్ణ
చంద్రుఁడోయన రామ - చంద్రుఁడుప్పొంగె
కపిసైన్యమెల్ల లం - కాపురిఁ జేరి 2330
విపులకాహళశంఖ - వీణమృదంగ
భేరీపటహదుందు - భిధ్వనుల్ పురిని
భోరుకలంగ న - ప్పుడు వినఁబడిన
నగచరావళి సింహ - నాదముల్ దిక్కు
లగలఁగ దింపుచో - హనుమంతుమీఁద
నున్న రాఘవుఁడప్పు - రోత్తరద్వార

సన్నుత సాలకాం - చన శిఖరములఁ
దళతళ మెఱయు కే - తనములు చూచి
తలఁపులో నపుడు సీ - తను సంస్మరించి
కాఁదలఁచినయట్టి - కార్యమంగదుని 2240
మీఁద వసించు సౌ - మిత్రి కిట్లనియె.

-: శ్రీరాముఁడు లంకముట్టడించుటకు నీలాంగదాది వానరుల నాయాచోటుల నిలుపుట :-


"చూచితె చంచల - స్తోమ నవీన
రోచులతోడి కా - ఱు మొగుళ్లచేత
నొప్పిన యాకాశ - మోయన చుట్టుఁ
గప్పిన తోఁపుల - గదలు టెక్కెములఁ
దనరు నీలంక వీ - తభయాకళంక
మనమిందు డిగియెల్ల - మర్కటాధిపుల
ముట్టడిగా పాళె - ములు దింత"మనుచు
నట్టిచోఁ దమరు వా - హనములు డిగ్గి
పాళెంబునకు మొన - పట్టున దెచ్చి 2250
నీలాంగదుల నుండ - నియమించి వెనుక
వలపలి డాపలి - వంకను వృషభు
నలగంధమాధను - నమరిక చేసి
తాను సౌమిత్రియుఁ - దలఁగడనుండి
భానునందనులను - పడమరనుంచి
వాసి గల్గిన జాంబ - వంతు గవాక్షు
నాసుషేణుని నుంచి - రాసేన నడుమ

సుగ్రీవుఁడాలంక - చుట్టును వాన
రాగ్రణులును తక్కు- నందఱడించి
సెలవిచ్చుటయుఁ గపి - సేన వృక్షములు 2360
శిలలు గైకొని కోట - చెంతకుఁ జేర
రాముని యనుమతి - రవికుమారకుఁడు
తాము వచ్చిన రాక - దశకంధరునకు
వినుపించుమని శుకు - విడిపించి బ్రదికి
చనుమని పెడతల - చఱచిత్రోయుటయు

--: సుగ్రీవుఁడు తామువచ్చిన వృత్తాంతముఁ దెలియఁ జెప్పుమని శుకుని విడిపింప వాఁడు
    రావణునివద్దకువచ్చి చెప్పిన మాటలు :-

వాఁడును వచ్చి రా - వణుని కట్టెదురఁ
బోఁడిమి చెడి నిల్చు - పోలికఁ జూచి
"ఏమిరా ! శుక ! ఱెక్క- లేఁటికి విఱిగె ?
నామర్కటులు నిన్ను - నరికట్టికొనిరొ
కొట్టిరో పిడికిట - గ్రుద్దిరో విఱిచి 2370
కట్టిరో నలఁగి రాఁ - గారణం బేమి ?
వినుపింపు"మనిన వి - వేకవిహీను
దనుజేంద్రుఁగని శుక - దైత్యుఁడిట్లనియె.
"మారీచు నీమాట - మదినమ్మి పోయి
యారాఘవుని యొక్క - యమ్ముపాలయ్యె
నది యెఱిఁగియు పోయి - నపుడె నామీఁది
కొదవఁగా కేల మీ - కును విన్నవింప

వలసినట్లైతి రా - వణ! సీతనిచ్చి
కులమెల్ల రక్షించు - కొను మింకనైనఁ
గపిసేన కోటల - గ్గల కెక్కి పెక్కు 2380
విపరీతములు సేయు - వెనుకఁ గారాదు
కాకున్న నిప్పుడె - కదలికయ్యమున
నీకుఁ దోఁచినబుద్ధి - నెఱవేర్చికొనుము
బాణబాణాసన - పాణులై బద్ధ
తూణీరులై శౌర్య - దుర్వారులైన
యారామలక్ష్మణు - లదె వచ్చినారు
వారికిఁ దోడుగా - వచ్చె భానుజుఁడు
నీమాట లతనిక - న్నియుఁ దెల్పునట్టి
బాములువచ్చె పా - పము సేయుకతన
నేమందు నీతోడ - నినసూనుఁడనుపఁ 2390
దామెనత్రాళ్ల చే - తను నంటఁగట్టి
ద్రోహి వీఁడనుచుఁ గోఁ - తులు చంపనలుగ
దేహంబు గుల్లల - తిత్తియై నొగిలి
శరణంటి శ్రీరాము - చరణంబులకును
కరుణించి యందుచేఁ - గాచెఁబ్రాణములు
విడిపించె నిప్పుడీ - విడిదల నన్ను
నుడువు మింతయు రావ - ణుని కంచుఁబలికి.
వచ్చితి మీయిచ్చ - వారిచ్చ తనకుఁ
జచ్చిన చావయ్యె - సరివారిలోనఁ
జాలు జన్మంబున ” - సద్దగాఁ గొనక 2400
హాలామదమున ద - శాననుఁ డనియె,

-: శుకుని మాటలకు రావణుఁడిచ్చిన ప్రత్యుత్తరము :-

"సంధి కార్యము సేయ - శక్రుఁడో లేక
గంధర్వవిభుఁడొ రా - ఘవుఁడన నెంత
ఎఱుఁగవే వెఱతు నే - యెవ్వారికైన ?
నరులట! వారు వా - నరులట! తోడు
సమరరంగంబున - జ్యాలతారావ
రమణీయఘోరనా - రాచ మార్తాండ
కిరణంబులను జాన - కీనాథు రక్త
శరములు గ్రోలింతు - శౌర్యసంపదను
కొఱవులఁ జూడిన - కుంజరేంద్రంబు 2410
పఱచిన గతి నాదు - బాణాగ్నిఁ దగిలి
నిలువక పాఱఁగ - నీవె చూచెదవు
కలనిలోఁ గోసల - కన్యకాసుతుని.
ఎవ్వఁడురా నాకు - నెదిరించు వాఁడు ?
చివ్వకుఁ దొడరి వ - చ్చిన జగత్రయిని

–:రావణుఁడు శుకసారణుల నిరువురను శ్రీరామునియొద్దకు దూతకృత్యమునకుఁ బంపుట :-

చూడుమంతయునని - శుకసారణులను
జోడుగాఁ జనుఁ” డని - జూచి యిట్లనియె.
"మీరలు మనలంక - మీఁదికి రాముఁ
డేరీతి వచ్చెనో - యీవార్ధి దాఁటి
యిది నాకు సరిపోవ - దిప్పుడే పోయి 2420

కదిసి రాఘవుల యా - కార వైఖరులు
వారి యాయుధములు - వారలవెంటఁ
జేరిన సుగ్రీవు - సేనలు మితము
తమలోన తమరు మం - తనములు బల్కు
క్రమమును గపులయా - కారవైఖరులు
పాళెంబులను మాట - వలుకులవారు
వేలంబు రక్షించు - విధమున మఱల
నేమందురో యట్టి - యెన్నిక యుద్ధ
సామగ్రి మీరెలె - స్సగ విచారించి
రండు పొండ ” నిన వా - రలు లంకమిఁద 2430

-: శుకసారణులు వానర వేషములతో శ్రీరాముని సైన్య విశేషములు గనుచుండుట :-

దండు వచ్చినయట్టి - దశరథ సుతుని
వేలంబులో కపి - వేషముల్ దాల్చి
సాలంబులను వన - స్థలముల యందు
నదులందు చరులందు - నగములయందుఁ
బొదలందు దొనలందు - భువియెల్లనిండి
యున్నవారలఁ జేరు - చున్నవారలను
మున్నీటిపై నభం - బున వచ్చువారె
రానున్నవారి స - ర్వముఁ జూచిలెక్క
గానక కడయేని - గానక వారు
వెఱగంది యటునిటు - వీక్షింపవారి 2440

 -: విభీషణుఁడు వారి నెఱిఁగి, పట్టితెప్పించి శ్రీరాముని ముందఱఁ బెట్టుట :-

నెఱిఁగి విభీషణుఁ - డెంతయు నలిగి
బలిమిఁ జేపట్టుగాఁ - బట్టుక తెచ్చి
నిలిపి సన్నిధి రాము - నికి నిట్టులనియె
"దానవవిభుని దూ - తలు వీరు మనల
సేనలఁ జూడ వ - చ్చినవారి వీరి
నేమి సేయుద ” మన్న - నెంతయు వెఱచి
రామునిఁ జూచి సా - రణుఁ డిట్టులనియె


-: సారణుఁడు తామువచ్చిన వృత్తాంతము శ్రీరామునికి నివేదించుట :-

"అయ్య ! రావణుఁ డంపి - నట్టివారలము
కయ్యంబునకు మీరు - కదలి వచ్చుటను
పాళెంబు దిగిన మీ- బలమెల్లఁ జూచి 2450
వేళంబె రమ్మని - వీడుకోల్పుటయు
వచ్చితి మేము దే - వర చిత్త ” మనిన
సచ్చరిత్రుఁడు రామ - చంద్రుఁ డాలించి
రమ్ము విభీషణ ! - రాక్షసేశ్వరుఁడు
పొమ్మని పనుప ని - ప్పుడు వచ్చినారు
మనవారి నెల్ల క్ర - మంబునఁ జూపి
పనుపు మేఁటికి వీరిఁ - బట్టి తెచ్చితివి ?
చూచిపోవుదు ” రటం - చును బల్కివారిఁ
జూచి శ్రీరాముఁడ - చ్చో నిట్టులనియె

శ్రీరాముఁడు రావణునితో యుద్ధమునకురమ్మనియు నట్లుకానిచో లంకను దగ్ధము చేయుట నిశ్చయమనియుఁ గబురంపుట :-

"మా వేల మున్నట్టి - మర్యాద యెల్ల 2460
రావణుతోడ స - ర్వము తేటపఱచి
యేపూనికను సీత - నెత్తుక వచ్చి
తాపూనికనె నిల్పు - మాజికి రమ్ము
రావేని తెల్ల వా - ఱకము న్నె లంక
మావానరుల చేత - మారు సేయించి
ప్రళయ కాలానల - పటుశిఖాజాల
తులిత మదస్త్ర సం - పటు శిఖాజ్వాల
దండించువాఁడఁ బు - త్ర కళత్రయుతము
భండనంబున నిన్ను - బ్రహ్మ యాఁగినను
నని మేము వల్కితి - మనుఁడు పొండ ” నిన 2470
వినయంబుతో రఘు - వీరునిఁ బొగడి
వారలీవార్త స - ర్వంబును మఱలి

-: శుకసారణులు రావణునివద్దకువచ్చి రాముఁడు చెప్పిన మాటలు చెప్పి వానర సైన్య మపారమనియు శ్రీరామునికి సీతను సమర్పించుమనియు హితోపదేశము సేయుట :-

యారావణునిఁ జూచి - హస్తముల్ మొగిచి
"దనుజేంద్ర ! నీవంప - దశరథ సుతునిఁ
గని తోడువచ్చిన - కపి సమూహంబుఁ
గాంచునప్పుడు మమ్ముఁ - గని విభీషణుఁడు

వంచకులని పట్టి - వై దేహిమగని
సన్నిధి నుంచిన - జడియక మేము
నిన్నుఁ బేర్కొని రాము - నికిఁ బ్రీతిగాఁగ
"ఈవిభీషణుఁడు మీ - కేమిటి కితఁడు 2480
రావణద్రోహి ధ - ర్మముఁ దప్పినాఁడు.
అన్నదమ్ముల కెడ - రైన విరోధి
నిన్నుఁ జేరినవాఁడు - నీదు హితుండె
వాలినిఁ జంపి యా - వాలిరాజ్యంబు
పాలించ సుగ్రీవుఁ - బట్టంబు గట్టి
చేపట్టి నాఁడని - చేరెను మిమ్ము
కాపట్యమున హిత - కారియే మీకు ?
అన్నకుఁ గానివాఁ - డన్యుల కగునె ?
విన్నవింపక కాదు - వీర లిర్వురును
పలికించిన స్వకార్య - పరులింతె కాక 2490
పరమార్థమగు మీకు - పనులకు రారు”
అనివారిఁ జెదరంగ - నాడితి మేము
దనుజేంద్ర! యేల వృ - థామచ్చరంబు ?
ఊరకే జానకి - నొప్పగించినను
నీరాజ్యమునకును - నీకు మేలొదవుఁ
గాదన్న రామల - లక్ష్మణ విభీషణులు
నీదు హానికిఁ గరు - ణింప రుల్లముల
నామువ్వురును నేల - యందొక్కరైన
నీమాట యనిన తృ - ణీకరింపుదురు
రామలక్ష్మణుల నో - ర్వఁగ సంగరమున 2500

నీమాత్ర మననేల - నినువంటి వారు
పదివేలు గూడిన - బవరంబులోన
బ్రదుక లేరు తదీయ - బాణాగ్ని శిఖలఁ
గపులను మేము లె - క్క యెఱుఁగ మెందు
నపరిమితంబుర్వి - యంతయు వారె
యొక్కఁడొక్కఁడు కొండ - లున్నట్లు చూడ
నక్కజంబయ్యె ల - యాంత కాకృతులు
వారిలో దొరలు రా - వణ ! యొక్కొఁడొకఁడె
యేరుపాటుగ వచ్చి - యీలంకఁ జేరి
నిను గెల్వనోపు సం - దియమేల భాను 2510
తనయుఁ డందఱికొక్క - తలయైన వాఁడు
కన్న కార్యము హిత - కారుల మగుట
విన్నవించితి ” నన్న - విని రావణుండు
మనసులో భయమును - మాటలపొందుఁ

-: రావణుఁడు శుకసారణులతో నుత్తర గోపురద్వారమున కేఁగుట :--

దనర నవ్వుచును దూ - తలఁ జూచి పలికె
"చాలు మీబుద్దులు - జానకీ విభుని
పాళెముఁ జూచి రాఁ - బనిచితిఁగాక
ననుగొంచ పఱుప మా - నవుని నగ్గింప
వనచరావళిని కై - వారముల్ సేయ
మీకుఁ బనేమి నా - మీఁదట నెదుర 2520
నాకేశుఁడును నెచ్చు - నా కీశులెంత
రామలక్ష్మణు లెంత - రండ" నివారు

దామును గూడి యు - త్తర గోపురమునఁ
జేరి యాకసము మో - చిన మీఁదకక్ష్య
ద్వారంబు చెంగటఁ - దాఁగూరుచుండి
క్షితియెల్ల నిండిన - శ్రీరామసేన
మితమెఱుఁగక చూచి - "మీరిందులోన
సుగ్రీవుఁడెవ్వఁడె - చ్చోనున్నవాఁడు ?
నిగ్రహానుగ్రహ - నిపుణుఁడై యతని
దళవాయి యెవ్వఁడా - తని పేరదేమి 2530
పలుకుఁడు వానర - ప్రభులెవ్వరిందు?"
అనిన రావణుఁజూచి - హస్తంబుఁజాచి
చనవు గల్పించుక - సారణుఁడని యె.

       -: సారణుఁడు రావణునికి వానర నాయకుల నెఱుకపఱచుట :-

"అల్ల వాఁ డినసూనుఁ - డావాలితమ్ముఁ
డెల్ల వానరులకు - నేలిక యతఁడు.
అతనికి సేనాని యై - నట్టి నీలుఁ
డతిబలుఁడున్న వాఁ - డల్లదే కనుము.

-: అంగదుఁడు :--

ఆచెంగటను వాల - మార్పుచు నన్నుఁ
జూచినప్పుడే చంపఁ - జూచు కోపమున
నంగదగ్రైవేయ - హారాభిరాముఁ 2540
డంగదుఁడున్న వాఁ - డతని వీక్షింపు,

-: హనుమంతుఁడు :-

వాసవుఁ జేరిన - వరుణునిఁ బోలి
యాసమీరకుమారఁ - డవనిజాప్రియునిఁ
బాయక యాతని - పనిఁబూని వచ్చి
నీయూరుఁ గాలిచి - నిలువక పోయి
యిందఱిఁదోడుక - యిచటికిఁ దెచ్చి
యందున్న వాఁడల్ల - హనుమంతుఁజూడు.

-: నీలుఁడు :-

పదికోట్ల వానరుల్ -పజ్జలఁ గొల్వ
నెదురుగా లంకపై - దృష్టులు నిలిపి
తానె వారధిఁ గట్టి - దర్పించియున్న 2550
యానీలుఁ జూడు మా - యతభుజబలుని.

-: శ్వేతుఁడు :--

వెండి కొండయుఁ బోలి - శ్వేతుఁడనంగ
నుండు వానరుఁజూడు - మురుశౌర్యనిధిని
నిలిచి యాసుగ్రీవు - నికిఁ గేలు మొగిచి
తిలకింపుగోమతీ - తీరమీయనది

-: కుముదుఁడు :-

యటుచూడు సంకోచ - కాహ్వయ శైల
కటకనివాసునిఁ - గామసంచారుఁ

గుముదు నితని పది - కోట్లవానరుల
సమసత్త్వులను గూడి - చనుదెంచినాఁడు.

-: రంభుఁడు :-

పదికోట్లమీఁద ము - పదిలక్షలకును 2560
చదలంబుగా నాప్త - సైన్యంబు గొలువ
రంభుఁడు కలహసం - రంభుఁడై సమద
కుంభీంద్రమటుగనుఁ - గొను మున్న వాఁడు

-: శరభుఁడు :-

మలయసహ్యాచల - మధ్యమగహన
వలయుండు సబలులో - వనచరోత్తములు
నలుబది గోటులం - డను గొల్వనున్న
బలవంతు శరభునిఁ - బరికించి కనుము.

-: పనసుఁడు :--

భావింప నూటయేఁ - బదికోట్ల కపులు
సేవించి మారట – సింధువురీతి
మనపేరు నుడివిన - మది లెక్కఁగొనక 2570
పనసుఁడు వాఁడె కో - పమున నున్నాఁడు.

-: వినతుఁడు :-

అరువది కోటులు - హరులు భజింపఁ
దరుపర్ణములు ఝరో - దకములఁ గ్రోలి

వినతుండు భుజశౌర్య - వినతుండు వాఁడె
కనుఁగొమ్ము లంకనె - క్కటి గెల్వఁదలఁచెఁ
బ్రథనంబుకు నిన్నుఁ - బలిమి చేఱుచును

-: గ్రథనుఁడు :-

గ్రథనుఁడు వేనవేల్ - కపులుభజింప
సెలవిమ్మనుచుఁ దాను - శ్రీరాముతోడఁ
బలికె నేవినఁగ నీ - పయిఁ గలహింప
బలిమితోఁగపులు డె - బ్బది కోట్లుగొలువఁ 2580

--: గవయుఁడు :-

గలహంబుఁ గోరుచు - గవయుఁడన్ వాఁడు
చూడుము తనదు పౌఁ - జులు దీర్చిచూచు
వేఁడుక నున్నాడు - విబుధారినాథ !

-: హరుఁడు :-

శతకోటివానర - స్వామియైనట్టి
యతిసత్త్వ నిధివాఁడు - హరుఁడనువాఁడు

--: ధూమ్రుఁడు :-

తిరమైన నర్మదా - తీరంబునందుఁ
బరఁగి యానము ఋక్ష - పర్వతంబేలు
నిల వేడుకోటుల - యెలుఁగులు గొలువ
నలరెఁ జూడుము ధూమ్రు - డాఋక్షవిభుఁడు.

--: జాంబవంతుఁడు :-

అతని సోదరుఁడు దే - వాసుర సమర 2590
శతముల దానవ - చయము నడంచి
గెలిపించి యింద్రుని - కినిఁ గీర్తిఁ దెచ్చి
వలసి కోరినయట్టి - వరములు గాంచి
యెనుబదికోటుల - యేలుఁగులతోడ
వనధి దాఁటిన జాంబ - వంతు నీక్షింపు.

 —: శృతసన్నాదుఁడు :-

సాహసాఢ్యుడు శృత - సన్నాదుఁడనఁగ
బాహుశక్తిని దైత్య - పతుల వధించి
దేవాసురులకు సా - ధింపరానట్టి
లావుగల్గిన వాని - లం కేశ ! కనుము

-: ప్రహర్షుఁడు :-

దహనుని యందు గం - ధర్వ కామినికి 2600
మహనీయతేజుఁడీ - మర్కటోత్తముఁడు
జనియించినాఁడు యో - జన గాత్రుఁడగుచు
దనుజునాథ ! ప్రహర్షు - దలయెత్తి చూడు.

- ప్రమాది :-

వేయికోటులు కపి – వీరులు గొలువఁ
గాయంబు నడగొండ - గతిఁ దేజరిల్ల

సింహనాదముతోను - శీతాచలమున
సింహంబురీతి గ - ర్జింపుచు నున్న
యతఁడు సుమ్ము ప్రమాది - యనువాఁడు లంక
యితని చేమీఁదట - యేమి కాఁగలదొ ?

-: గవాక్షుఁడు :-

చూడు మల్లదె గవా - క్షుని రఘువీరు 2610
సూడు దీర్పఁగ లంకఁ - జూచుచున్నాఁడు.

-: కేసరి :-

చుట్టును గొండము - చ్చులు నూఱుకోట్లు
పట్టైన తనయాప్త - బలముతోఁగూడి
పదధూళి భానుబిం - బముఁ గబళింప
నదె వచ్చె దనుజ నా - యక ! వాని వెనుక
సకలనిర్జరమునీ - శ్వరసేవితంబు
నకలంకరత్నమ - యాత్మకూటంబు
పాణీరితమణి వి - పంచికారాగ
రాణాన్వితసుపర్వ - రమణీగణంబు
నంతరాంతరనిజో - ర్ధ్వాధరభాగ 2620
కాంతసమస్తలో - క ప్రపంచంబు
నణిమాదిమాష్టమ - హైశ్వర్యసిద్ధ
మణిమయ కనకవి - మానమానితము
నగునట్టి మేరుమ - హ శైలమేలు
జగదేకబలుని కే - సరిఁగనుఁ గొనుము.

-: శతవలి :-
వానరోత్తము లరు - వది వేల కోట్లు
తాను చేచాఁచిన - దారి మెలంగఁ
బ్రతిబలయోధుల - భంగించువాని
శతవలిఁ గనుము రా - క్షస కులాధీశ !

--: తక్కిన వానర వీరులు :-

గజగవయగవాక్ష - గంధమాదనులు 2630
భుజశౌర్యనిధులు చూ - పుల కంపుతేర
నొక్కొక్కనికిఁ గపి - యోధులు కోట్ల
లెక్కకు పదివేల - లెక్కగాఁ గూర్చి
రామకార్యార్థమై - ప్రాణంబులైనఁ
దామొల్ల మనుచు నం - దఱు నున్నవారు.
వారిఁ జూడుము నీకు - వారితో రణము
కారాదు మనునాసఁ - గల్గియుండినను.”
అను సారణుని మాట - లాలించి శుకుఁడు
దనుజనాయకునిఁ జెం - తకుఁ జేరి పలికె.

–: శుకుని వానర సైన్య వర్ణనము :-

"రావణ ! యింకఁ దీ - ఱదు నీకుఁజలము 2640
కావరంబున నెట్లు - కడతేఱఁ గలవు ?
కపివీర లున్మత్త - గజములమాడ్కి
విపులగంగాతీర - విటపంబులట్లు
పృథుహైమవత సాల - వృక్షంబులనఁగ

వ్యధితారులై చాల - వ్రాలియున్నారు!
దేవదానవులైనఁ - దృణమాత్రులనుచు
భావింపఁ దగువారి - బలవర్గమునకుఁ
గిష్కీంధలోన సు - గ్రీవునిఁ గొలిచి
దుష్కరవిహృతు లెం - దులనైన లేక
దేవతాంశముల ధా - త్రిని జనియించి 2650
లావుల కెందుఁ గొ - లందు లేర్పడక
యుండుదు రిరువది - యొక వేలుకోట్లు
వెండియు నందు వే - వేయు శంఖములు
నూఱుబృందములు మం - త్రులు భానుజునకు
వారలలో బల - వంతులన్నిటను
వీరులు నాసత్య - విమలాంశభవులు
వీరలు మైందద్వి - విదులనువారు !
అజునివరంబుచే - నమృతంబుఁ గ్రోలి
యజరామరణవృత్తి - నసమానులగుచు
వీరె లంకకు వేరు - విత్తులై వచ్చి 2660
శ్రీరామునకుఁ బ్రీతి - సేయనున్నారు !
సుముఖిని విముఖునిఁ - జూడుమాచెంత
నమరంగనా మంద - రాకారులగుచు
మృత్యువునకుఁ బుట్టి - మించినయట్టి
యత్యంత బలులు – యాకాంక్షులగుచు
బలములు తమ కిరు - వదివేలుకోట్లు
కొలఁదిలో నిన్ను మా - ర్కొన నున్నవారు !

-: ఆంజనేయుని వర్ణనము :-

చూడుము వారిని - చ్చోఁ గేలుసాఁచి
యాడుచున్నారు వీ - రానులాపములు
కేసరిసుతుఁడు సు - గ్రీవుని హితుఁడు 2670
దాసుఁడు మిగుల సీ - తానాయకునకుఁ
బవనుజుఁ డంజనా - భామినీమణికి
నవతార మందిన - యప్పుడే యెగసి
వినువీధిఁ దామూఁడు - వేల యోజనము
లినుని ఫలంబని - యెంచి పట్టుటకుఁ
జేరిన కులిశంబు - చే నింద్రుఁడలిగి
దారిఁ దప్పకయుండ - దవడ పై నఱుక
నందుచే నాతఁడు - హనుమంతుఁడనఁగ
నెందుఁ బ్రసిద్ధికి - నెక్కినవాఁడు !
సీతను జూడవ - చ్చి యశోకవనము 2680
చేతులు తీఁటవోఁ - జీకాకు చేసి
యక్షునిఁ బొరిఁగొని - యనిలోననెదురు
రాక్షసులను గాల - రాచి నీలంక
చిచ్చువెట్టెను మఱ – చితివె ? వాఁడొకఁడె
వచ్చిన నిదురించు -వారమే మనము ?
వాల మల్లార్పుచు - వాఁడె యున్నాడు
కాలునిరీతిఁ జక్కఁ - గ జూడు మతని !
అటు చూడుమయ్య ని - శాటాధినాథ !

-: శ్రీ రాముని వర్ణనము :-

చటులప్రతాప వై - శ్వానరాభీల
సంగరరంగ భీ - షణదైత్యవీర 2690

పుంగవ నిజభుజా - భుజగభుజంగ
భుజగీ భవన్నాక - పురవధూవార
భజనీయకీర్తి ప్ర - భావానుభావ
మందారమంజరీ - మకరందబిందు
తుందిలేందిందిర - స్తోమసంగీత
కలనాద మేదురా - కాశావకాశ
వలయిత వసుమతీ - వలయమైనట్టి
బ్రహ్మాస్త్రముఖదివ్య - బాణాభిరాము
జిహ్మగోత్తమవిల - సితభుజస్థేముఁ
బరమకల్యాణవై - భవగుణారాము 2700
శరణాగతత్రాణ - సద్ధర్మ కాము
దూరీకృతసమస్త - దుర్దోషనాము
నూరీకృతదయాగు - ణోరులలాముఁ
గోమలతరనీల - కువలయశ్యాము
సామాది నృపనీతి - సముదయోద్దాము
సీతాదృగుత్పల - శ్రీకరసోము
దాతృత్వనిస్సీము - దశరథరాముఁ
గనుఁగొంటిరే యిట్టి - కల్యాణ చరితు
వనితఁ దేనగునె నీ - వంటి యల్పునకు?
కోపించి తలఁదెగఁ - గొట్టినఁ గొట్టు 2710
మీపాదములు చూడ - కేఁగుట మేలు.

-: లక్ష్మణవర్ణనము :-

ఆరాముఁడావంక - నఖిలభారకుని
వైరిదోర్గర్వస - ర్వస్వహారకుని

ననుదినస్వజన క - ల్యాణ కారకునిఁ
దనుతరేతరకీర్తి - తారహారకుని
నసురమారణసమ - తాభిచారకుని
నసమానవిక్రమ - హరకిశోరకునిఁ
దరళవజ్రాంకుర - దంతకోరకునిఁ
దరళతారక సుమి - త్రాకుమారకునిఁ
దేఱిచూడుము మన - దెసఁ జూపులునిచి 2720
వీరుఁడై విల్లెక్కు - వెట్టి యున్నాడు.

–: విభీషణవర్ణనము :-

ఆరాము వలచాయ - నలఘుభాషణుఁడు
హారిసమస్తగు - ణాత్మభూషణుఁడు
పరవివేకవిశేష - వారితేషణుడు
పరశౌర్యవాహినీ - పటలశోషణుఁడు
దారుణకరగదా - దండభీషణుఁడు
చేరికగాఁగ వ - చ్చెను విభీషణుడు
కనుఁగొమ్ము వీరిరు - గడఁగాచియుండ
మనమను నీతిస - మర్థురాఘవుని
తరమి పోరఁగ కబం - ధవిరాధవాలి 2730
ఖరదూషణాదులఁ - గడతేర్చుటెఱిగి
పోరఁ జూచిన నీదు - బుద్ధి కేమందు ?
నారాము వెన్నాస - యై యున్నవాఁడు

-:సుగ్రీవవర్ణనము:-

సకలపర్వతకుల - స్వామియై జగము
లకు నెల్ల తానే మూ - ల స్తంభమైన

యమరాచలమురీతి - నగచరు లెల్ల
సమబుద్ధిఁ దనుఁగొల్వ - శతమన్యుఁడొసఁగు
వాలి దాల్చిన దివ్య - వాసన కనక
మాలికాతారారు - మాకపిరాజ్య
పదవులు రామకృ - పావైభవమున 2740
నొదవ రాఘవుని ప్ర - యోజనం బెల్లఁ
దలమోచి వచ్చిన - తరణి నందనుని
బలవంతు సుగ్రీవుఁ - బరికింఫుమీవు.
ఓటమెఱ౦గక - యొకనూఱువేల
కోటులు శంఖ శం - ఖులు నూఱువేలు
నొక మహా శంఖులు - నుండు బృందంబు
నకు మహబృందంబు - నకు నొక పద్మ
మునకు మహాపద్మ - మునకు ఖర్వ
మునకు మహాఖర్వ - మునకు సముద్ర
మునకు నట్టి సముద్ర - మునకు నయ్యోఘ 2750
మునకు నట్టి మహౌఘ - మునకుఁ దద్బలము
తనపంపు సేయ నిం - దఱితోడ నీకు
మొనసేయవచ్చె రా - మునిఁ జూపఁడతఁడు !
మాకుఁ జూచిన నీకు – మరణంబు నిజము
లేకున్న చోఁబొగి - లెద మజ్ఞుడనుచుఁ
జావనేఁటికి రాముఁ - జానకిఁ గూర్చి
నీవారి ప్రాణముల్ - నిలుపుట మేలు."
అనఁ గపివీరుల - నారఘువీరు
లను జూచి యోర్వఁజా - లక దశాననుడు

 -: రావణుఁడు శుకసారఁణుల మాటలకుఁ గోపించి వారలఁ దొలఁగి పొమ్మనుట :-

చలము మానక శుక - సారణ వచన 2760
ములు విని వారిమో - ములు చూచి పలికె.
"వేదముల్ చదివి యా - వెంట నంగములు
శోధించి దిశల రా - జులను సాధించి
మహిఁగల్గు సకల ధ - ర్మములు నెఱింగి
బహుకాల మీలంక - పాలించి నేను
కొఱమాలినట్టి మీ - కును గల్గు బుద్ధి
యెఱుగనే పగవారి - నెచ్చుగా నెంచి
చులకని మాటయి - చ్చో నన్నునాడి
తలక్రొవ్వినందుకుఁ - దలఁద్రెవ్వనేతుఁ
గాచితి మిమ్ము ని - క్కడ నిల్వ నేల 2770
త్రోచుట చంపినం - దుకు సరిగానఁ
దొలఁగి పొండని మిమ్ముఁ - ద్రోచితి నిచట
నిలిచినఁ దాఁక - నిగ్రహింపుదును
పొండన్న" వారలు - పోయిన వెనుక

-: రావణుఁడు మహోదరుని బిలిచి తగిన వేగులవారినిఁ బంపి రామసుగ్రీవులయుదంతముఁ గనుఁగొనుమనుట :-

వెండియు వేఱొక్క - వేగులవారిఁ
బిలువ మహోదరుఁ - బిలిచి పంపుటయుఁ
దలఁచినంతనె వాఁడు - తగినవేగరులఁ

జెంతకుఁ దెచ్చినఁ - జేరిన వారి
మంతనంబున నొక - మాట నిట్లనియె.
"రామలక్ష్మణుల మే - రలు విభీషణుని 2780
నేమంబు సుగ్రీవు - ని విచారములును
గపుల యాలోచన - క్రమము నిద్రించు
నపుడెచ్చరికల ను - న్నట్టివైఖరులు
పాళెంబులో మాట - పలుకులు ప్రజల
యేలినవారల - యెడ నోరుములును
నుక్కళమ్ములు గాచి – యున్న వానరుల
యిక్కువలును జూచి - యిపుడెరండ” నుచుఁ

-: ఆ వేగులవారు సుగ్రీవ సైన్యమునుఁ జూచి భయమంది, వానరులచేఁ గొట్టువడి లంకకువచ్చుట :--

బనిచిన వారలం - బరమున కెగసి
చని కననీక ప్ర - చ్చన్నులై నిలిచి
కపుల మేలిమి చూసి - గజగజవణఁకి 2790
యపరిమితంబౌ భ - యంబుచే నొదిగి
కనుచుండ వారలఁ - గని విభీషణుఁడు
వనచరులకు వారు - వచ్చినజాడ
వినిపింప కపులెల్ల - వెంటాడ వెఱచి
వినువీథి నందఱు - విచ్చి పాఱుటయు
నందులో శార్దూలుఁ - డనువాఁడు దగుల
ముందల పట్టుక - ముగియఁ దన్నుచును
పీడింపఁ గూ తలు - వెట్టి “ నాపాటుఁ

జూడవే నిత్యయ - శోనిధిరామ !
విడిపింపవే !» యన - విని "చాలుఁజాలు 2800
విడుఁ" డంచు జానకీ - విభుఁడానతీయఁ
దనతల్లి కడుపులోఁ - దా మఱలంగ
జనియించి నటులెంచి - చని దశాననుని

--:వేగులవారు తాముచూచిన సంగతి రావణునకు విన్నవించుట :--

సముఖంబుఁ జేరి "మో - సమువచ్చె నిపుడు
తము నంపుదురె కోతి - దండుపై మీరు
లెస్స నమ్మితిమి వా - లినిఁ జంపినట్టి
దుస్సహతేజుని - తోడి వైరంబు
నీకేల యిటమీఁద - నినుఁగొల్చి చెడఁగ
మాకేల చాలు నీ - మనవిఁకమిద
నెటులైనఁ బొమ్మన్న" నే మేమి !” యనుచుఁ 2810
దటతటఁ దనగుండె - తల్లడమందఁ
గర్దమంబునఁ జిక్కు - గజము చందమున
శార్దూలుఁ జూచి రా - క్షసనాథుఁ డనియె.
" ఓరి ! శార్దూల ! మో - మోటమి దొరఁగి
యీరీతి నాడుదు - రే నన్నెఱింగి
చెనఁటివై తన్ను ముం - చినదె సముద్ర
మనునట్ల కపులచే - నలజడి నొంది
వచ్చితివటుగాన - వాకొంటి వింటి
హెచ్చు గొందులు నీకు - నేమాయె నిపుడు
తెలుపరా కరిగిన - తెఱఁగన్న” నతడు 2820

చలపాదియైన ద -శగ్రీవుఁ బలికె
"పోయితి మేము నీ - పొమ్మన్నయట్లు
మాయ వన్నుక నభో - మార్గంబునందు
వారి యెచ్చరికలు - వారి పాళెములు
వారలు నీఁబల్కు - వార్తలుఁ గనుచు
వినుచు నుండఁగఁ దమ్ము - విను వీథిఁజూచి
తన కేల యనక నీ - తమ్ముఁడా వేళ
చెప్పి చూపిన కపుల్ - చెవివట్టి యీడ్చి
గుప్పి తన్నుచునుండఁ - గూఁతలు వెట్టి
కావవే యన్న నా - కరుణాసముద్రుఁ 2830
డావార్త లాలించి - యవనిజాప్రియుఁడు
విడుఁడేల బాధింప - వీని నటన్న
విడిచి రాజ్ఞకువారు - వెఱచి పొమ్మనుచు
నందుచే రాఁగల్గె - బ్రాణాశ వెనుక
ముందరల్ చూచిన - మోస మొందుదును
కపులు బారులు దీర్చి - గారుడవ్యూహ
మిపుడకూర్చుక వచ్చె - నిదె రాఘవుండు
సేతువు గట్టించె - సింధువు మీద
సీతను మఱల ని - చ్చిన బ్రదుకుదువు
కాకున్న నిప్పుడే - కలనికి నేఁగు 2840
నాకడ కార్యమీ - వనుభవించెదవు.
ఊరకుండిన కోతు - లుండఁగ నీవు
పురమెల్ల లగ్గలీ - ప్రొద్దె వట్టెడును
చుట్టుక యీలంక - చుట్టును జాల
ముట్టడిగా దిగి - మొఱయుచున్నారు.

గడియ తాళ" రటన్న - గలఁగుచు గుట్టు
సడలక మఱల రా - క్షసనాథుఁడనియె


-:రావణుఁడు శార్దూలుని వానరుల వృత్తాంత మడుగుట :-

"కపులెవ్వరింద - ఱెక్కడనుండివచ్చి
రపరిమితంబౌ మ - హాజవశక్తి
వారి కెక్కడఁ గల్గె ? - వారల తండ్రు 2850
లారయ నెట్టివా - రది దెల్పు మనిన
రావణుతోఁ గ్రమ్మ - ఱంగ శార్దూలుఁ
డావార్తలకు విన - యమున నిట్లనియె.
"రవికుమారుఁడు రిక్ష - రజుని తనూజుఁ
డవని నిల్పను గూల్ప - నతనికిఁ జెల్లు
ఘనబాహుబలుఁడు గ - ద్గదతనూజాతుఁ
డనఘుఁడు జాంబవ - దభిదానుఁడతఁడు
వంతుకుఁ దగు జాంబ - వంతునిఁ దమ్ము
డంతకన్నను ధూమ్రుఁ - డంతకనిభుఁడు
వారికి ధర్మ దే - వతకుఁ గుమారుఁ 2860
డాశరణుఁడు కడు - నాసించువాఁడు
కేసరికినిఁ గపి - కేసరి తనయుఁ
డాసమీరాత్మజు - డతిసత్త్వశాలి
సోమునికొడుకు పూ - జ్యుఁడు దధిముఖుఁడు
తాము దుర్భర వేగ - దర్శి సుముఖులు
మృత్యువుకొడుకులు - మిగులంగ వీర
కృత్యముల్ వారల - కే తగునెందు

దళవాయి నీలుఁడు - దహనతనూజుఁ
డలయింద్రు మనుమఁడౌ - యనఘుఁడంగదుఁడు
ద్వివిదమైందులు బలా - ధికులాశ్వినేయ 2870
భవులు వైవస్వత - భవులల్ల వారు
గజగవయగవాక్ష - గంధమాధనులు
రజనీచరేంద్ర ! వా - రల నెన్నఁదరమె ?
అందఱు వీరమ - రాంశ సంభపులు
క్రందుగా కలనికిఁ - గాలుద్రువ్వుదురు
వారితో పదికోట్ల - వనచరోత్తములు
సౌరనాయకుల వం - శములకై వారు
రామునికిని జగ - త్రయి నెవ్వరైన
తామని మార్కొని - తలఁగిపోఁ గలరె?
దశరథరాజనం - దనులు రాఘవులు 2880
దశకంఠ ! నీకుప - ద్రవము సేయుదురు
మత్తేభసముఁడు ల - క్ష్మణుఁడు కో ల్తలను
చిత్తజారాతినిఁ - జీరికిఁ గొనఁడు
జ్యోతిర్ముఖుఁడు సూర్య - సుతుఁడట్టివాఁడె
శ్వేతుఁడు తరుణుని - జ్యేష్ఠపుత్రుండు
హేమకూటుఁడు నలుఁ - డీవార్ధిగట్టి
గ్రామణి యావిశ్వ - కర్మనందనుఁడు
వసుపుత్రుఁ డతఁడల్ల - కాఁడు దుర్ధరుఁడు
మసలినఁ బోనీఁడు - మనవారి నెదుర
జయశీలుఁ డతఁడు రా - క్షసనాథ ! నీదు 2890
సయిదోడు మనవిభీ - షణుఁడు తాఁబోయి
తొడిబడ లంకకుఁ - దోరణఁగట్టి

యడియాస రఘువీరు - నడుగులు చేరె
లంకామహారాజ్య - లక్ష్మి జేకొన్న
పొంకంబుతోడ ని- ప్పుడెయున్నవాఁడు.
కైకొమ్ము మీఁదటి - కార్యప్రచింత
మాకుఁ దోఁచినయట్టి - మాటఁ దెల్పితిమి.”
అనిన శార్దూలుని - యాస్యంబుఁజూచి
దనుజనాయకుఁడు మి - ధ్యాబుద్ధిఁ బలికె.
"ఏ నింద్రుఁడంత వాఁ - డెదిరించెనేని 2900
నీనేర జానకి - నీమాటలేల ?
మీరిండ్ల కరుగుఁడీ - మీఁదటికార్య
మేరూపములనైన - నేనె సాధింతు.”

-: రావణుఁడు విద్యుజ్జిహ్వునితో శ్రీ రాముని శిరము సీతవద్దకుఁ దెమ్మని చెప్పుట :-

అనుచు మంత్రులఁ బంచి - యాత్మీయభవన
మునకేఁగి మానసం - బుగఁ జింత సేసి
తాను విద్యుజ్జిహ్వుఁ - దడయక పిల్చి
దానవాధిపుఁ డేక - తమున నిట్లనియె.
"సీతను మనము వం - చించినఁ గాని
చేతికి నేపనల్ - చేకూడిరావు.
అందుకుఁ దగునుపా - యంబుఁ దలఁచితి 2910
డెందంబులో నిప్పు - డే నీవుపోయి
రాముని మాయాశి - రంబు కోదండ
మా మహీతనయా స - మక్షంబునందు
నేమాట లాడుచో - నిడి కడకేఁగు

మామీఁదఁ గనుగొంద - మవనిజ తెఱఁగు.”
అనివాని నియమించి - యప్పుడే తాను
జనకజ చెంతకుఁ - జనియున్న యంత

-: విద్యుజిహ్వుఁడట్లనే రామశిరము నచటనుంచి వెడలుట :-

వాఁడు నట్లనె రఘు - వర్యుని శిరము
పోఁడిమి చెడకుండ - పొదువుగఁ దెచ్చి
బంటుతనంబున - పరువునవచ్చి 2920
వింటితో నటువెట్టి - వెనుకకుఁ జనినఁ
దలవాంచి యున్న సీ - తనుఁ జూచి దైత్య
కులపతి యపుడె పే -ర్కొని యిట్టులనియె.

-: రాముఁడు యుద్దములోఁ జనిపోయెననియుఁ దన్నేలుకొమ్మనియు రావణుఁడు సీతతోఁ జెప్పుట :-

" జనక నందన ! రామ - చంద్రునిమీద
మనసుంచి వడిగల - మగఁడని నమ్మి
యిన్నాళ్లు నడియాస - నెంతయు వేఁడు
కొన్నను మనసీక - గుట్టు వెట్టితివి
రాముఁడిప్పుడు సమ - రంబులో నీల్గె
నీమీఁదట విచార - మిఁకనేల నీకు
పడఁతు లెచ్చటనైన - భాగ్యహీనతను 2930
గొడుకుల విధిగతిఁూ - గోల్పోయి నటుల
రాముని నిర్భాగ్యు - రాలవై నీవు
భీమసంగరములో - బేలుపోయితివి.

యింకఁ జెక్కిటను చె - య్యిడి పొక్కనేల
లంకామహారాజ్య - లక్ష్మివైనీవు
చలముఁ జాలించి ము - చ్చటదీఱఁ దనకు
వలచి పట్టపురాణి - వాసమవైన
నేల వింతని చాల - నెల్ల లోకములు !
చాలింపు మింక వి - చార మేమిటికి ?
చచ్చిన రాముఁడు - చలపట్టి మగుడ 2940
వచ్చి మాతో పోరు - వాఁడె నీకొఱకు ?
వినవేమొ జగడంబు - వృత్తాంతమెల్ల
వనవీధి బంధించి - వచ్చి రాఘవుఁడు
కపి సేనతోడ లం - కాపురి చుట్టు
నిపుడె పాళెము డిగ్గి - యెంతయు నలసి
యేమఱి నిదురించు - నెడ నస్మదీయ
భీమరాక్షసయోధ - బృందంబు వెడలి
యజ్జ చూచుక ప్రహ - స్తాదులు వాని
పజ్జకుఁజని కోఁతి - పాళెంబులోన
నొడలెఱుఁగక నిద్ర - నొందు నీమగని 2950
మెడఁగోసి తెచ్చితి - మింటి కేనెగిరి
తప్పించుకొని పాఱె - దమవిభీషణుఁడు
చుప్పనాతిని ముక్కు - సురియ చేఁ గోసి
నాపాపమునఁ బాఱె - నపుడు నీ మఱది
వాపోవుచును జాంబ - వంతుఁడు పఱచెఁ
జివ్వఁజాలించి వ - చ్చిన త్రోవ ప్రజలు
నవ్వఁగఁ బరవెత్తె - నలినాప్తసుతుఁడు.
ఊరక యంగదుం - డూడని బాడె

దారిఁ దప్పినఁ బోయెఁ - దారుఁడు దీసి
పోక నిల్చి సమీర - పుత్రుండు వడియె. 2960
మోకాళ్లు విఱిగి రా - మునిఁబాయ లేక
కుముదుఁడు తలఁదెగఁ - గొట్టినఁ బడియె.
సమసె మైందుఁడు వీఁగి - చనియె నలుండు
నీలుఁడు శరభుఁడు - నిలిచి పోరాడి
వ్రాలిరి మేనులు - వ్రయ్యలై భువిని
పనసుఁ డెఱింగి ద - బ్బర వచ్చెననుచుఁ
బనస చెట్టునుబోలి - భ్రమసి తానిలిచె
నాలంబులోన గ - వాక్షుండు గూలె
చాల కయ్యము సేసి - శతవలి మడిసె.
నెత్తురు గ్రుక్కుచు - నెగ్గె సుషేణుఁ 2970
డుత్తరంబున ధూమ్రుఁ - డుదధిలోఁబడియె.
చేయెత్తి మ్రొక్కఁ గూ - ల్చిరి దధిముఖుని
మాయ చేఁ గేసరి - మై డాచిపోయె
సేతువు చూడవ - చ్చిన కపులెల్ల
భీతిచే నిల్లాండ్ర - బిడ్డలఁ దలఁచి
ముగిసె కార్యంబని - మొదలి టెంకులకుఁ
దగదొట్టి పాఱిన - దైత్యులు తఱుమఁ
జెట్లుకొండలు వట్టి - శ్రీరాముసేన
పొట్లెంబు చెడి విచ్చి - పోయిరటంచు

-:రావణుఁడు సీతను నమ్మించుటకొఱకు శ్రీరాముని శిరమును నామె ముందఱ బెట్టించుట:-

పలికి విద్యుజ్జిహ్వ - పాతితంబైన 2980

తలఁ దెచ్చి సీతముం - దఱ నిలుపుటకు
రావణుఁడుడిగింపు - రమణితోఁ బలుక
నావిధంబున నది - యవనిజకడకుఁ
దలయు విల్లును దెచ్చి - ధరణిపైనుంచి
తొలఁగిపోయిన జగ -ద్ద్రోహి రావణుఁడు
ఇది రాము మస్తకం - బిపుడె కెంధూళిఁ
బొదివి యున్నది శరం - బులు విల్లుఁగనుము
గుఱుతుగాఁ దలయెత్తి - కొసలెల్లఁదీఱ
బరికించిచూచి చే - పట్టుము నన్ను
గాఁక దీఱటన్న - కల్పితరామ 2990
రాకేందువదన మా - రామునిభామ

-: సీత యాశిరస్సును కనుఁగొని దుఃఖముచే మూర్ఛిల్లి రామునికొఱకై శోకించుట :-

కనుఁగొని తలవెంట్రు - కల సోయగంబు
తన తండ్రి యొసఁగు నౌ - దల మానికంబు
పలుచని చెక్కులు - పాటలాధరము
నెలవంక బొమలును - నిడుదకన్గవయు
విల్లునమ్ములుచూచి - విభుఁడెకాఁదలఁచి
త్రెళ్ళి ధరిత్రి మూ - ర్ఛిల్లి వేతెలిసి
"హా ! రామ ! హా ! నాథ'- యని పొగులుచును
వారిజానన సీత - వగల నిట్లనియె.
"కైకేయి ! నీదు సం - కల్పంబు నీకు 3000
చేకూడె నీవు కొ - ల్చినదె దైవంబు
నోములన్న ను నీవు - నోచిన యవియె

నోములు కడతేఱె - ను తపంబు నీకు
నడవుల కేఁటికి - నంపితివమ్మ ?
చెడుఁడుపొండని మేము - చేసిన దేమి ?
కడలేని శోకసా - గరములో నిట్లు
పడి యీఁదవల సె తె - ప్పయొకండులేక
ముచ్చట మున్నీట - మునుఁగుటఁగాక
వచ్చెను తనకిట్టి - వైధవ్యవృత్తి
పతులకై సతులెందు - ప్రాణముల్ విడుతు 3010
రతివకై పతులిట్టు - లగువారు గలరె ?
వానరులే సహ - వాసమౌ బలగ
మేనె మృత్యువనైతి - నిప్పుడు నీకు
కోదండదీక్షాది - గురుఁడవు శస్త్ర
వేదివి జగదేక - వీరవర్యుఁడవు !
ఏర్చవే గడియలో - నెండినయడవిఁ
గార్చిచ్చువలె నీవు - ఖరదూషణులను !
తునిమివేయవె విరా - ధుని యంతవాని !
ఘనువాలి నొకకోలఁ - గడతేర్పలేదె !
అట్టి నీవెక్కడ - యధమరాక్షసులు 4020
చుట్టుక శిరము త్రుం - చుక తెచ్చుటేడ ?
నిద్దుర నీదు కం - టికి రాదటంచు
బద్దిపోయెసు మున్ను - పవమానసుతుఁడు
నిదురయె నీదుహా - నికి హేతువయ్యె
నదియె కారణముగా - ననదనేనైతి
నాయురున్నతుఁడ వీ - వనుఁడు భూసురుల
మాయమాటలు చాల - మది నమ్మియుంటి

కటకటా ! మాయత్త - కౌసల్య యింక
నెటులీద నేర్చునో - యీ శోక జలధి ?
ప్రాణనాయక ! ధను - ర్బాణంబు లుభయ 3030
తూణీరములును నీ - దుకరంబులందు
నతిశయిల్లఁగఁ బూజ - లందిన నిప్పు
డితరుల పాలయ్యె - నే కాలగతుల !
పదునాలుగేండులు - ప్రతినచెల్లించి
తుది నయోధ్యకుఁ బోవు - దు నటంచు నీవు
జనకుని కెఱిఁగించి - స్వారాజ్యమునకుఁ
జనుదురే తోడుక - చనక నన్నునిచి
సత్యసంధుఁడ వగ్ని - సాక్షిగా నన్ను
సత్యంబు సహధర్మ - చారిణివనుచు
నాది వసిష్ఠాదు - లందఱు వినఁగ 3040
నో దేవ ! పలికి యి - ట్లొంటిఁ బోవుదురె ?
నీచట్ట వట్టి యీ - నీచ రాక్షసుల
నాచుట్టు నుండ నుం - డఁగఁ దగునయ్య ?
యాగాది సకల క్రి - యలు దీర్చిరాజ
యోగివై నాతోవి - యోగంబు చేత
మొదట నిద్రాహార - ములకుఁ దొలంగి
పదినెల లిట్లున్న - పరమపుణ్యునకు
దోయజభవుఁడిట్లు - దుర్మరణంబు
సేయునే ! యేనేమి - సేయుదు నింక.
ఎవ్వరు వలదన్న - నింతయు వినక 3050
మువ్వురితో వనం - బుల నుండవలసి
వచ్చినదో దేవ ! - వశమునఁ దన్ను

మ్రుచ్చిలి తెచ్చె నీ - ములుచ దానవుఁడు.
అమరావతికి నిన్ను - ననిచి సుమిత్ర
తమతల్లి యలర మా - తల్లి శోకింపఁ
బ్రాణముల్ దాఁచుక - పఱచె లక్ష్మణుఁడు
ప్రాణేశ ! యూర్మిళ - భాగ్య సంపదను !
హనుమంతు ననిచిన - యా ర్తి నంతయును
విని మహావనచర - వీరులఁ గూడి
కడలి బంధించి లం - కాపురిమీఁద 3060
విడిసి కంటికి నిద్ర - వేగించలేక
మోసపోయితిని త - మ్ముని నమ్మి వచ్చి
యాసించి ప్రాణంబు - లతఁడేమి సేయు?
ఒరులు దానముసేయ - నోరువలేక
పరిహరించిన యట్టి - పాపంబుచేత
నిను నెడవాసి వీ - నికిఁ జిక్కి యందు
వెనుక నీతఱగని - వెతల పాలైతి!”
అని మస్తకము దీసి - యక్కునఁ జేర్చి
తనయూరువుల నుంచి - ధారాళమైన
కన్నీటఁ దోఁపుచు - కరనఖాగ్రములఁ 3070
బెన్నెఱుల్ దువ్వుచుఁ - బ్రియుఁడెకానెంచి
 
--: సీత రావణునితోడ తన్ను శ్రీరామునితో సహగమనము సేయుట కాజ్ఞ యీయమని కోరుట :--

ఓరి ! రావణ ! నీకు - నొక పుణ్యమార్గ
మేఱుపాటుగఁ ద్రచ్చి - యి చ్చెద నేను
తలతోడఁ దలయు గా - త్రముల గాత్రంబు

గలయించి తన్ను రా - ఘవుఁ గూర్చి తేని
ననుగమనము సేయు - నపుడు దీవింతు
నిను చిరంజీవివై - నెగులొందకుండ
అనునంత లోనఁ "బ్ర - హ స్తుఁడు వంపె

-: ఇంతలోనొక దూత రావణుని సత్వరముగా రమ్మనుట :-

నినుఁ దోడి తెమ్మని - నిలువరాదిచటఁ
బురములో నుత్పాత - ములు చాలఁదోఁచె 3080
పెరిగెఁ గార్యము మిమ్ముఁ - బిలువు మటన్న
వచ్చితి” నను దూత - వచన సంగతికి
రిచ్చలువడి వాఁడు - రివ్వలు విఱిగి

-: రావణుఁడు వెడలినతోడనే శ్రీరాముని శిరమునాతనితో వెడలిపోవుట - దానిచే సీతమనస్సు శాంతిఁబొందుట :-

దిగులు చే నేమియుఁ – దెలియక మఱలి
మొగము వాడఁగ మంత్రి - ముఖ్యులున్నట్టి
సావడి చేరి ని - చ్చట తోడమీఁది
రావణు కృత్రిమ - రాము శిరంబు
విలునమ్ములు వాని - వెంటనే పోవ
నుల్లంబులో సీత - యుపతాపముడిగి
యూరటఁ గైకొని - యుండె. రావణుఁడు 3090
శూరు నాప్తునిఁ బ్రహ - స్తుని జేరఁ బిలిచి
“మనము మూకలఁ గూర్చి - మర్కట శ్రేణి
దునిమింత మిపుడు వీ - థులఁ జాటఁ బనిచి
పిలిపింపు” మనరణ - భేరి వేయించి

బలములు రావించి - పంక్తికంఠునకు
నామాట వినిపింప - నచ్చట సీత

-: సీత రామునిఁ గూర్చి దుఃఖింప సరమ యిదిరావణమాయగాని వేఱొండు కాదని చెప్పి
యామెనూరడించుట :-

రాముని చరణ సా - రసములు దలఁచి
కన్నీరు రాల్ప లోఁ - గనుఁగొని సరమ
మన్ననఁ జేరి సా - మమున నిట్లనియె.
"ఓయమ్మ! యీతల - యును విల్లు నితని 3100
మాయ యింతియె కాని - మఱియొండుగాదు
శ్రీరామునకుఁ గీడు - సేయ నొక్కరుఁడు
చేరిచేదావాగ్ని - చెదలంటు నమ్మ
రాముఁ గాచిన సుమి - త్రాకుమారకుని
కేమిటికీ భయం - బిటఁ గల్గ నేర్చు?
కాకుత్థ్స తిలకుల - కరుణ యొప్పనము
చేకొన్న సుగ్రీవుఁ - జెనకునే యొకఁడు
రామకోదండంబు - ప్రాపున నున్న
సామాన్యులే కపుల్ - శతమఖాదులకు
వారు కీడును వేరు -- వారి కీడునకు 3110
నోరామ ! యీచింత - నొంద నేమిటీకి ?

-:సరమ సీతతో యుద్ధభేరి మ్రోఁగుచున్నదనియు శ్రీరాముఁడు రావణునిజయించి యామెను తీసుకొని పోవుననియుఁజెప్పి సంతోష పఱచుట :-

అదే వినవమ్మ భ -యంకరారావ
విదిత భేరీశంఖ - వీరానకములు

బలవత్తరంబయ్యె - భయము రావణుని
తలఁపులో శ్రీరామ - దళములు జూచి
జతనంబుఁ జేసిరి - స్యందన శ్రేణి
యతనంబుఁ జేసిరా - హవ కర్మమునకుఁ
గనగల్గి వ్రేసిరి - కరులకుఁ ద్రాళ్లు
కనుఁగొంటి బల్లన - కట్టిన హరుల
పోటుదారలు పుర - మ్మునఁ జిమ్మి రేఁగి 3120
పాటక నాదంబు - బారులు గలిగె
భటుల కోలాహలా - ర్భటి మిన్నుముట్టె
నటు చూడు మెత్తిరా - హవ కేతనముల
నాయుధసంపత్తి - నమరెఁ గాల్బలము
మాయమ్మ! నీకు సే - మము గల్గు దీన
రామచంద్రుఁడు రేల - రావణు సమర
భూమిలో నసురుల - పుట్టు లేకుండ
నడఁచి నీతో నయో - ధ్యకుఁ జేరగలఁడు
తొడమీఁద రామ చం - ద్రుఁడు గారవింప
ననుభవించెద వీవ - నంత కల్యాణ 3130
మననాతిగానంద - మహిత సౌఖ్యములు.
అప్పుడు మఱువకు - మమ్మ నేనన్న
యిప్పటిమాట నే - నపుడు నీదాన
నిందుండు మఱలి పో - యి ప్రధానవరుల
నందఱ బిలిపించి - యాలోచనమునఁ
గయ్యంబె కాని య - క్కఱ దీఱదనుచు
నియ్యెడఁ జాటించె - నిదె భేరి మొఱసె
అండజగమన! నే - డాదిగా నగర

మండోదరీ ముఖ్య - మదవతీమణుల
రోదనధ్వనులు నీ - శ్రుతులు సోకంగ 3140
ఖేదంబు మాను సు - ఖింతువు నీవు.
అమరనాయకునితో - హరిఁగూడి దైత్య
సముదయ. ... ... .. - చందంబుఁ దోపఁ
దమ్మునిఁ గూడి - దశకంఠుఁ దునుముఁ
జుమ్ము నామాటఁ ద్రి - శుద్ధికి నమ్ము
కంచుకంబూడ్చిన - కాలాహి రమణి
సంచన ఖేదంబు - సడలింపుమీవు
వానలచే సస్య - వతియైన ధరణి
నానాఁట నలరు వి - న్ననువున నీవు
మదిలో విచారంబు - మాని సంతోష 3150
పదవిలోనిపుడు తె - ప్పలు దేలఁగలవు
చుట్టు వేడెంబు వ - చ్చు తురంగ మనఁగ
గట్టుల దొరకు నే - కట ప్రదక్షిణముఁ
గావించు రవిఁ జూచి - కరములు మొగిచి
సేవింపు మిష్టార్థ - సిద్ధి కాఁగలదు
మాయమ్మ ! నీవు నె - మ్మది నుండు మిపుడె
పోయినీ యనుమాన - ములు నివారింపఁ
జూచి వచ్చెదను య - శోధాము రాము
వాచాలతలు చూపు - వనితను గాను
పోయెద నారయం - బునకు ఖగేంద్ర 3160
వాయువుల్ సరిగారు - వత్తు నీక్షణము
చనుదునే ? ” యని విభీ - షణు రాణివాస
మనిన మాటలు విని - యవనిజ వలికె

'రామచంద్రునిఁ జూచి - రాఁ దలంచుటలు
నీమదిలోపల - నిజమయ్యె నేని
నంతమాత్రంబు ద - యాశక్తిఁ గలిగె
నంతియె చాలు మా - యావి రావణుఁడు
కపటాత్ముఁ డేమి పో - కలును బోయెడినె?
యిపుడేఁగి యాతని – హృదయంబుఁ జూచి
నడిపించు సమరస - న్నాహంబుఁ దెలిసి 3170
గడియలో మఱలి యి - క్కడికి రమ్మ” నినఁ
బరమానురాగ సం - భరితయై యొప్పి
సరమ జానకిఁ జూచి - సమ్మతిఁ బలికె

సీతపంపున సరమ లంకలోనికిబోయి యుద్ద సన్నాహముఁ గనుగొనివచ్చి సీతకు నివేదించుట :-

"అమ్మ! నీమది రావ - ణాసురు హృదయ
మిమ్మేరయని కని - యేవచ్చు నదియె
హితమగునేని పో - యెద” నని సరమ
యతిరయంబున నేఁగి - యసురనాయకుఁడు
తనప్రధానులఁ గూడి - తాఁ జేయవలయు
మనుకులు కరతలా - మలకంబుగాఁగఁ
గాంచి క్రమ్మఱ వచ్చి - కమలంబుఁ బాసి 3180
సంచరించు సరోజ - సదనయనంగఁ
దనుఁబాసి మిగుల ఖే - దంబుతో నున్న
జనకనందనఁ జేరఁ - జన రామురాణి
లేచి కౌఁగిటఁ జేర్చి - లేమ వచ్చితివె
యీచెంత వసియింపు - మీవ”ని యనుప

నా దేవితో రావ - ణాసురు మఱఁద
లాదరంబునఁ గన్న - యర్థ మిట్లనియె
"తల్లి ! రావణుఁ గన్న - తల్లి యు నతని
వల్లప్రోవాశించు - వారుమంత్రులును
సీతనిమ్మని బుద్ధి - చెప్పియు రాము 3190
చేత మున్ననిలో న - శించినయట్టి
ఖరదూషణాదుల - కథలు నీమగఁడు
శరధిఁ గట్టుటయు ని - చ్చటికిఁ జేరుటయు
నుతగుణంబులు నమా - నుష చరిత్రములు
నతనిచే రాక్షస - హానియౌ ననియుఁ
జెప్పిన ధనలోభి - సెలవు సేయంగ
నొప్పనిగతి మోహ - యుక్తుఁడై యతఁడు
నిను రాఘవున కీయ - నేరక జగడ
మునకుఁ బోయెదనని - మూర్ఖించినాఁడు
రావణఁడనిఁ జచ్చు - రాముఁడు గెలుచు 3200
దేవి ! నీమగనిఁ బొం - దెదవు సత్యముగ
నేఁటి ఱేపటి వాసి - నీకు విచార
మేఁటికి ? దనుజేంద్రు - డిట్లున్న యపుడు

-: రావణుఁడు శ్రీరాముని పైకి యుద్దమునకు వెడలుదునని యాలోచన సేయుట :-

నగరోత్తమ సింహ - నాదముల్ కపుల
యగణిత వీరాట్ట - హాసార్భటులును
నెలుఁగుల కిలకిలా - యిత విరావంబు
జలజాప్త సుతసైన్య - శంఖారవంబు

భీషణనిస్సాణ - భేరీ మృదంగ
ఘోషణ విని రామ - కోదండజనిత
శింజినీనిక్వాణ - జీమూతనినద 3210
భంజిత దానవ - బలసంకులంబుఁ
గాఁగ యాలంక ల - గ్గలకెక్కఁగపులు
మూఁగునంతట దశ - ముఖుఁడాగ్రహమున
రాముని తెంపును - రణకుతూహలము
సౌమిత్రి కోపంబు - శతపత్ర హితుని
సుతుని ప్రతిజ్ఞలు - శుకునిచే వినిన
కతమునఁ బైవచ్చు - కార్యమూహించి
యేమియుఁ దెలియక - యించుక సేపు
తామౌనముననుండి - తనవారితోడఁ
దొరగ పైనము సేయు - దును రఘువీరుఁ 3220
బొరిగొందుఁ గలనికి - ప్పుడె పోవువాఁడ
ననిన రావణు దుర - హంకారమునకు
వనజాక్షీ! యామాల్య - వంతుడు వలికె

-: మాల్యవంతుఁడు రావణునికి యుద్ధము వలదని శ్రీరామునికి సీతనిమ్మని హితము చెప్పుట :-

నీతిసంపన్నుఁడు - నిజబుద్ధి శాలి
యై తగురాజు రా - జ్యము చాలఁజేయు
సమయంబు చూచుక - శత్రుల గెలుచు
సుమతికిఁ గీర్తివ - చ్చును గెల్పుగలదు
సరివారితోడ దు - ర్జయుతోడ సంధి
పరగును దండింపఁ - బడు హీనసత్తు
కావున రామునిఁ - గలనిలో నోర్వ 3230

నేవిధంబునవచ్చు - నిట్టి చైదములు
మనుజుని యెడగంటి - మావారి నొకఁడు
దునుమునే యొకతూపుఁ - దొడిగి యెందైన
నారాముఁ డట్లుండె - యగచరండొకఁడు
చేరి యీలంకఁ గా - ల్చినఁ గానవైతె
మన విభీషణుఁ డన్న - మాటలు చెవినిఁ
జొనుపకఁ జేటురాఁ - జూచెదవీవు
వలదు సీతను రఘు - వరునకు నిచ్చి
చలము చాలింపు సా - ర్జవ బుద్ధివగుము
దేవతల్ ఋషులు దై - తేయుని తోడ 3240
రావణు దునుము నీ - రఘు వీరుఁడనుచు
జయముఁగో రెద రంబు - జభవుండు తొలుత
నియమింపఁడే ధర్మ - నియతి వేల్పులకు.
పాపంబునకుఁ బాలు - పఱపఁడే మనల
భూపుత్రికై చెడు - బుద్ధిఁ బూనుదురె ?
పాపంబులెందుఁ జూ - పట్టక పుణ్య
మేపట్టునను మీఱఁ - గృతయుగంబయ్యె
కలుషంబులేకాని - కల్యాణకర్మ
ములు లేమియా యుగం - బున కది గుఱుతు
ధర్మముల్ చెఱిచి య - ధర్మంబులైన
కర్మంబు లెప్పుడుఁ - గావించుకతన
నీకు హానియు రాము - నికి గెల్పు ననుచు 3250
వాకొంటి మిదిదేవ - వాక్య సమ్మతము.
అమరులు ధర్మస - హాయులు మనకు
సమకూడ నేరదు - సమరజయంబు

నీచేత బాధలొం - దిన బ్రహ్మఋషులు
చూచితె యాగమ - స్తోమముల్ చదివి
యాగాదు లొనరించు - నందుచే జయము
సాగనీయక దైత్య - జాతిఁ ద్రోలెదరు
దేవదానవులచేఁ - దెగకుండ నజుని
చే వరమీవు గాం - చితిగాక తొలుత
నరులచే భయద వా - నరులచే నీవు 3260
పొరిబోవకుండఁగఁ - బూట యెవ్వారు ?
అట్టివారలె వచ్చి - యదె కోటచుట్టి
ముట్టడి చేసిరి - ముత్తికగాఁగ
బహుళంబులైన యు - త్పాతముల్ లంక
నహరహంబును గల్గె - నది పుల్గుగాదె
కటు గర్జితముల ర - క్తంబులు గురిసె
నిటుచూడ మేఘంబు - లేనుఁగుల్ హరులుఁ
దొరిగించెఁ గన్నీరు - తునిసె టెక్కెములు
తిరిగె గోమాయు లం - తి పురంబులందు
గంతులతో కాశి - కా విగ్రహములు 3270
రంతులు చేసి పు - రప్రఘాణముల
ముట్టె పూజాద్రవ్య - ములు శునకములు
పుట్టు నావులకు ని - ప్పుడు గర్దభములు
నెలుకలు పిల్లులు - నెలుగులు బాము
లలముకున్నవి మాన - వాళి దైత్యులును
జతగూడియున్నారు - శమనుఁడింటింట
నతిభయంకర వివృ - తాననుఁడగుచు
దండంబుతో బోడి - తలతోడమెలఁగు

చుండఁ జూచెదరు దై - త్యులు రాత్రులందు
విపరీత రుతిఁ బక్షి - వితతి వాపోయె 3280
నిపుడిందుచే లంక - యేమి కాఁగలదో ?
లంకేశ ! దనుజ కు - లంబు మాంసములు
కంకగృధ్రాదులు - కబళింపఁ గలవు
హితము చెప్పెద సీత - నిమ్ము రాఘవుఁడు
శతపత్ర నేత్రుండు - సందియం బేల ?
ఇట్టి మచ్చర మేలు ? - యెందై నరుఁడు
గట్టునే సేతువు - గా వార్ధిమీఁద ?
సంధికార్యమె మేలు - జానకినిచ్చి
సంధింపు. మాసత్య - సంధున" టంచు
నూరకయున్న మృ - త్యుప్రేరణమున 3290
నారావణుఁడు దుర్మ - దాంధుఁడై బిట్టు
నట్టహాసము చేసి - యామాల్యవంతుఁ

-: రావణుఁడు మాల్యవంతుని మాటలు పెడచెవినిఁ బెట్టుట :-

దిట్టుచు “ నీకు బు - ద్ధికి నేమివోదు
హితవరివలె నుండి - నీవు శాత్రవుల
మతమవలంబించి - మాటలాడెదవు.
ఒకకోఁతి మఱుఁగున - నొదిగి యిల్లాలి
నొకఁడెత్తికొని పోవ - నుఱకుండలేక
యది నిమిత్తముఁగ బ్రా- ణాశ వోవిడిచి
కదిసి పైఁబడి చావఁ- గా వచ్చినట్టి
రాముని భట్టు మే - రను సన్నుతించి 3300

యేమి లాభంబు నీ - వెందు చెందెదవు ?
ఎల్ల లోకములేలి - యింద్రుని పురము
కొల్లవట్టించి ది - క్కుల ప్రతాపంబు
నిండించి దివిజుల - నిలుకడల్ చెఱిచి
పుండరీక భవాండ - మున నొక్కఁడైన
నెదిరింపలేని న - న్నిటుల దూషింప
నిదియేల పరిధాన - మిచ్చిరోవారు ?
బందుకట్టిరో నిన్ను - పౌరుషాధికుని
యందుఁ జూపోపక - యన్యులిట్లాడ
బోధించిరో నీకు - బుద్ధి చెల్లించి 3310
తాధాత మదిముది - దప్పి పలితివో ?
నేనంచు నెఱుఁగ వో - నీకు నజ్ఞాన
మూనెనొ సీత నీ - కొక్కరిచేతఁ
బ్రియము చెప్పించెనొ ? ~ పిఱికితనంబు
బయసి మాలింప నీ - పగిది నాడెదవొ?
ఎటులైన నేమి నే - నీఁజాల సీత
నిటువంటి మాటల - కే బెదురదునె?
కమలంబు బాసిన - కమల గాకొక్క
రమణియె రాముని - రాణివాసంబు
చంపుదు వానర - సహితు సుగ్రీవుఁ 3320
జంపుదు లక్ష్మణ - సహితు రాఘవునిఁ
జచ్చిన నొకనికి - శరణంబు మఱుఁగుఁ
జొచ్చునె రావణా - సురుఁ డేఁటిమాట
తాతవుగావునఁ - దాళితి జలధి

సేతువు గట్టెను - శ్రీ రాముఁ డనుచు
నింతమాత్రనేభయ - మేఁటికి మాల్య
వంత! నీకనిన రా - వణుని మాటలకు
సేమియు ననక తా - నింటికిఁ బొయె
నామాల్యవంతుఁడ - నంతరంబునను
తనప్రధానులు దాను - దశకంధరుండు 3330

-: రావణుఁడు లంకరక్షణ కై నాలుదిక్కుల రక్షకుల నియోగించుట :-

చెనఁటి యాలోచనల్ - చేసి పురంబు
జతనంబుఁ గావింప - సకలప్రయత్న
చతురుఁడై తత్పురి - సాలంబుఁ జుట్టఁ
దూర్పు వాకిట ప్రహ - స్తుని దక్షిణంపు
తార్పు దిన్నెలమలె - తామహాపార్శ్వు
నేచి యీపడమర - నింద్ర జిద్దనుజుఁ
జూచి యుత్తరమున - శుకసారణులను
కట్టడఁ జేసి యె - క్కడనె తానుండు
నట్టి యేర్పాటుతో - నప్పురి నడుమ
రూఢప్రతాపు వి - రూ పాక్షు నలఘు 3340
గాఢ బలాఢ్యునిఁ - గట్టడఁ జేసి
యేల శంకయటంచు - కృతకృత్యుఁడైనఁ
బోరికిఁ దానంతి - పురమున కేఁగి
కాలచోదితుఁ డౌట- గానడ సౌఖ్య
లోలుఁడై కామిను - లు గొలువ నుండె.

-: శ్రీరాముఁడు లంక నెట్లు సాధించుటయను విషయముఁ గూర్చి యాలోచన సేయుట :-

ఆవేళ రఘువీరుఁ - డర్కనందనుఁడు
పావని పనసజాం - బవదాంగదులును
నలనీలకుముద మైం - ద్వివిదులును
కలవారలెల్ల నే - కముగాఁగఁ గూడి
"వచ్చితి మొకరీతి - వననిధిఁ దాఁటి 3350
యిచ్చటికీ లంక - యింద్రాదులకును
దేఱి చూడఁగరాదు - దీని సాధింప
నేరుపెట్టిదియకొ - నెమకంగవలయు ”
ననుమాట లాలించి - యసురనాయకుని
యనుజన్ముఁడుచిత వా - క్యముల నిట్లనియె.

-: విభీషణుఁడు రావణుఁడు చేసిన ప్రయత్నమును వివరించుట :-

శరభుఁడు ప్రఘసుడు - సంపాతియనలుఁ
డురు శక్తులప్రధాను - లూహింపఁదనకు
నలువురు పక్షులై - నభములకెగసి
చులకఁగా నాలంకఁజొచ్చి - రావణుని
తెఱఁగెల్లఁగని వచ్చి - తెలిపిరిగానఁ 3360
బరికించి వినుఁడేఱు - పడ వివరింతు
పూర్వసాలద్వార - మున ప్రహస్తుండు
దుర్వారబలముల - తోనున్నవాఁడు
దక్షిణంబున మహో - దర మహాపార్శ్వు
లక్షీణబలశాలు - లై యున్నవార

లద్వందుఁ డింద్రజి - త్తనువాఁడు పశ్చి
మద్వారమున ధైర్య - మహిమ నున్నాడు
శతకోట్ల సంఖ్యరా - క్షసులతోదైత్య
పతి యుత్తరద్వార - భవనంబు నందు
నున్నాడు బహుళ సై - న్యోపేతుఁడధికుఁ 3370
డన్నిట నలవిరూ - పాక్షుడన్వాఁడు
సాలమధ్యప్రదే - శమున నున్నాఁడు
చాలు నెంతటి కైన - జనకీరమణ !
రథగజ తురగ వీర - భటాళి చాల
పృథుశక్తి శతకోటి - బృందసంఖ్యలను
జత చేసుకొని తారు - సమరసన్నాహ
చతురులై మిగుల నె - చ్చరికనున్నారు”
అనివింటి వీరిచే - ననుచు మంత్రులను
జనకజప్రాణేశు - సన్నిధినుంచి
దేవ ! కుబేరు సా -ధింపఁగఁ దొల్లి 3380
రావణాసురుఁడు శౌ - ర్య సహితులైన
యరువది లక్షల - యసురులతోడఁ
బరిభవించెఁ గుబేరు - బవరంబులోన
నటుగావున సురాసు - రాసాధ్యుఁడతఁడు
నిటలాక్షుడైన వా - ని జయింపలేఁడు
గెలువరాదనలేదు -- కీర్తింపలేదు
కలతెఱఁగిదియైనఁ - గానిండు మీరు
రావణునితో జగ -త్త్రయిశరం బొకటఁ

గావలసినఁ ద్రుంపఁ - గల కార్య నిధివి
యీలంక సాధించు - టెంతమీ" కనిన 3390
నాలించి రఘువీరుఁ - డతనితోఁ బలికె

-:శ్రీరాముడు రావణుని ప్రయత్నములకు మాఱు ప్రయత్నములు సేసి సేనానాయకులను నియోగించుట :-

"తూరుపు దెస ప్రహ - స్తునిమీఁద నీలుఁ
డాగూఢ బలుఁడుండి - యని సేయఁగలఁడు
తడయక దక్షిణ - ద్వార యోధులను
గడ తేర్చుఁగాక యం - గదకుమారుండు
చివ్వకు నయ్యింద్ర - జిత్తుని కోపు
నవ్వాయుజుఁడు పశ్చి - మాశఁ దానుండి
కమలజ వరదాన - గర్వసమేతు
నమర భయంకరు - నఖిలలోకైక
కంటకు నాదశ - కంఠునిచేతి 3400
వింటఁ బుట్టు నమోఘ - విశిఖానలమున
దహియించువాఁడ నా - తమ్ముఁడు కెలన
సహచరుఁడై యుండ - సమర రంగమున
నీయుత్తరపు దిశ - యేనుండ దనుజ
నాయకు దునుము స - న్నాహంబుతోడ
వనజాప్త సుతజాంబ - వద్విభీషణులు
మొనఁజేరి నడుచక్కి - మూఁకఁ ద్రుంపుదురు
వానర లందఱు - వానరత్వముల
చేనుండి సమరంబు - సేతురుగాక
మనుజ మూర్తులతోడ - మార్కొనవలన 3410

దనిలోన నిదియె నా - యాజ్ఞాపనంబు
నీవు నీమంత్రులు - నేను లక్ష్మణుఁడు
నేవేళ నరులమై - యిత్తమాహవము ”
అనిపల్కి తాను వే - లాచలంబునకు
జనకజా విభుఁడు ల -క్ష్మణ సహితముగ
మొనసేయు లంకాభి - ముఖముగా నడిచి
దనుజనాయకుని సో - దరున కిట్లనియె

-: శ్రీరాముఁడు వానరసేనలతో సువేలాచలముపై విడియుట :-

"నేఁటికి నగము పై - నిలిచి యీలంక
కోటలు వాకిళ్లు - కొత్తళంబులును
వేడుకఁ గనుఁగొంచు - విడిసి యుండుదుము 3420
వీడు బట్టులడించి - వీరవానరుల
రావణుమీఁది యా - గ్రహమెల్లఁ దీర్తు
నీవు మెచ్చఁగ ఱేపె - నిశితాస్త్రములను !"
అనియొక్క సమభూమి - నన్నదమ్ములును
దనుజవానర విభుల్ - తగురీతి నుండ
బెడబొబ్బలిడుచుఁ గు - ప్పించుఁగపులు
విడిసి రెల్లెడల సు - వేలాచలమున
నినుఁడస్తగిరిఁ జేరె - నిరులల్లు కొనియె
వనజారి యుదయించె - వచ్చె వెన్నెలలు
మునిఁగెఁ దామెర కల్వ - మురిపెంబుఁ జూపె! 3430
చనియె జోడెడవాసి - చక్రవాకములు
బాణబాణాసన - పాణియై యుభయ

తూణీర యుగళుఁడై - తోడనే వచ్చి
యన్న చెంగట సుమి - త్రాత్మజుఁడుండె
నన్నెలవున నుండె - యర్కనందనుఁడు
దనుజ వాయుజులు చెం - తనె యుండి రట్టి
మనువంశమణి విన - మర్కటోత్తములు
కిలకిలారావ సం - కీర్ణాట్టహాస
కలకలంబుల లంక - కలగుండు వడియె !
అగచరోత్తములచే - యనుమతుల్ గాంచి 3440
నగములు తరువులు - న్నతభుజాగ్రముల
ధరియించి వానరో - త్తములు లగ్గలకుఁ
బరిగొని లంకపైఁ - బరువులెత్తంగ
నల త్రికూటాద్రి మ - ధ్యప్రదేశమున
నలరొంది శతయోజ - నాయతం బగుచుఁ
బది యోజనంబుల - పఱపుతోఁ జాల
కుదురైన సౌవర్ణ - కూటంబు మీద
విలసిల్లి కోటభా - వించి యన్నడుమ
బలువైన వేయిగం - బములచే నమరు
దానవవిభుని సౌ - ధముఁజూచి దనుజ 3450
సైనిక బిరుదధ్వ - జంబులు గాంచి
పూచికాచి ఫలించి - పొదలి మిన్నంది
యాచుట్టు నున్నవ - నాళి వీక్షించి
పురము సింగార మ -బ్బురపాటు వెనుప
ధరణిజ రమణుఁడు - తలయెత్తిచూచి

-: శ్రీరాముఁడు లంకాపుర సౌధమున రావణునిఁ జూచుట :-

మేడ మీఁదట - నాఱవకక్ష్య
నామటిపొడవౌమ - హా ద్వారమునకు
ముయ్యీడు వేలుపు - ముద్దులగుమ్మ
లొయ్యారములఁ జెంత - నుడిగముల్ సలుపఁ
దలమీఁదఁ బారిజా - తపు విరిదండ 3460
వలపులమేడకు - వాసనఁగట్ట
బూసిన కుంకుమ - పూఁత నీలాచ
లాసక్త సంధ్యారు - ణాభ్రంబు నెనయఁ
బైనున్న బంగరు - పటము క్రొమ్మెఱుఁగు
లానభోమహిభాగ - మల్లుకొనంగ
మణిమయఛ్ఛత్రచా - మర కేతనములు
గణనకెక్కుడుఁగ రా - క్షసభామలందఁ
జంద్రహాసప్రభా - చకచకల్
వదన చంద్రహాస ప్రభా - సమితిలో నెనయ
వీణాదిసంగీత - విద్యలనసుర 3470
గాణెలు మదిమెచ్చఁ - గా వినుపింపఁ
గొలువున్న దానవ - కులపతిఁ జూచి
తలయూచి మెచ్చి సీ - తానాయకుండు
కనుఱెప్ప వేయక - కపులును దాను
గనుచుండ రాఘవా - గ్రణి చిత్తమెఱిగి
ఆగ్రహాదగ్ర చి - త్తాబ్జుఁడై యెగసి

-: సుగ్రీవుఁడు రావణునియొద్ద కేఁగి శ్రీ రాముని దూతగా వచ్చితినని చెప్పి
   రావణుని కిరీటముఁ దన్నుట :-

సుగ్రీవుఁడ సహాయ - శూరత మెఱయ
నాగోపురము మీఁది - కలవోక దాఁటి
రాగాంధుఁడైనట్టి - రావణుఁ జూచి
చులకనఁగాఁగఁ జూ - చుచు వానితోడఁ 3480
గొలువువారలు వినఁ - గోపించి పలికె
సకలలోకములకు - స్వామియౌ రాము
నకుఁ జెలికాఁడ వా - నరలోక పతినిఁ
దపనసూనుఁడను సీ - తానిమిత్తముగ
నిపుడె నిన్నాజ్ఞ సే - యించువాఁడగుచు
నను నంపె నతనికి - నమ్మినబంటఁ
గనుము నిన్నిపుడె- కడతేర్తు ననుచు
డాసి యౌదల కిరీ - టముఁ దీసి నేల
వ్రేసిపట్టఁగ నేర్పు - వెదకుచుఁ బదరు
వానర నాయకు - వదనంబుఁ జూచి 3490
దానవకుల పాక - దమనుఁ డిట్లనియె

                         -: రావణసుగ్రీవుల పోరాటము :-

ఓరోరి ! వనచర ! - యోడక యిలకుఁ
జేరి నా మకుటంబు - క్షితిఁ బడవైచి
పోయిన నేనేల - పోనిత్తు నిన్ను
మాయింతునని కొట్టి - మహిఁ బడఁద్రోయఁ
గుదికిలఁ బడి లేచి - కుపితుఁడై వామ
పదమున దానవ - పతిఁ దన్నుటయును

నల్లగా సింహాస - నముమీఁదనుండి
డొల్లి తాబడ్డపా - టుఁ గనంగలేక
గ్రక్కున లేచి తాఁ - గడకాలు వట్టి 3500
మొక్కళంబున దీసి - మురియవైచుటయుఁ
బుట్టు చెండును బోలి - పుటముబ్బి యెగసి
కొట్టి నెత్తురులు గ్ర - క్కుచు మహిఁ బడగ
నా పాటుఁబడి దాన - వాగ్రణియుగ్ర
కోపుఁడై మార్తాండు - కొడుకుఁ బోనీక
పెడచేత వ్రేటున - పిడమిపై మఱలఁ
బడియు వానికిని లోఁ - బడక పయ్యాడి
లాఁగించి పడవైవ - లంకేశుఁడంత
వేగిరంబున కపి - వీరునిఁ బట్టి
మోచేతఁ బొడిచిన - ములుగుచు లేవఁ 3510
జూచుచో మరల ర - క్షో నాయకుండు
పైఁబడి యదిమిన - భానునందనుఁడు
లోఁబడ కెదనుఝ - ల్లున నెత్తురొలుకఁ
బిడుగుతో సరియైన - పిడికిటఁ గొట్టి
పొడిచిన తాఁ దేలి - పోక రావణుఁడు
చొరవకుఁ జొచ్చి వి - జ్జోడు గానీక
పిఱిఁదికిఁ ద్రోయుచుఁ - బెనఁగ భానుజుఁడు
మెడసందు వేసుక - మిడుగుడు వడఁగ
విడిపించుకొననీక - విక్రమించుటయుఁ
జెయిఁద్రించి వానర - శ్రేష్ఠునిఁ బట్టి 3520
పయికొనుటయు దైత్య - పతియును దాను
గండభేరుండయుగ - మురీతి భయద

శుండాలముల మేర - చుట్టును బెనఁగి
మేపాశఁ బిల్లులు - మిగుల గోరాడు
వైపున ధరణి పై - వ్రాలి లేచుచును
గరములు కరములు - కాళ్లును గాళ్లు
శిరమును శిరము నం - చితలీలఁ బెనచి
సరిగాఁగ వ్రాలుచు - సరిగాఁగ మింట
దిరుగుచు సరిగాఁగ - ద్రెళ్లి లేచుచును
ద్రోచి పోరాక నె - త్తురులు పైనిండ 3530
పూఁచిన కింశుక - భూజంబులనఁగ
నిరువురు సరివోరి - యిలమీద వ్రాలి
యరగడెసేపు మూ - ర్ఛాయత్తులగుచు
నుండి యంతటఁ దెల్వి - నొంది రావణుఁడు
మెండొడ్డి యితని నే - మిటఁ గెల్వరాదు
మాయ కయ్యముఁ జేసి - మాయింతు నని యు
పాయంబుఁ జింతించు - భావంబెఱింగి

-: సుగ్రీవుఁడు, రావణుఁడు మాయోపాయముచే జయించునని యెఱిఁగి రాముని వద్దకు వచ్చుట :-

యెగిరి పైవ్రాలునో - యితఁడంచు భీతి
మొగమెత్తి చూడంగ - మోసంబుఁ జేసి
పోయెఁ బోయె ననంగఁ - బుడమికి డిగ్గి 3540
చేయిదోయి మొగిడ్చి - చెంతకుఁ జేర
శ్రీ రాముఁ డతని మె - చ్చి కవుంగలించె !
వీర వానరకోటి - వినుతించె నపుడు !

చెంతఁ జేరఁగఁ దీసి - శ్రీరాముఁ డధిక
సంతోషమున కపి - స్వామి కిట్లనియె.

-: శ్రీరాముఁడు సుగ్రీవునితో తానొక్కఁడే రావణుని పైకిఁ బోఁగూడదని హితోపదేశము చేయుట :-

ఓయి ! సుగ్రీవ మా - కొకమాట యెఱుక
సేయక నేపని - సేయఁ బోవుదురె ?
కొంచగాఁడవో ? కపి - కోటుల నిట్లు
వంచించు నీవు రా - వణుఁ జెనకుదురె ? 3550
అతఁడు త్రిలోక భ - యంకరుఁ డమర
శతములఁ గెల్చిన - సాహసాధిపుఁడు
మనమందఱముఁ గూడి - మార్కొన్న నతని
నని గెల్తుమని నిశ్చ - యములేనిచోట
పోవచ్చు నే ప్రాణ - ములులేని బొంది
కైవడి నుంటి మొ - క్కని నిన్నుఁబాసి
నీకు నచ్చట నొక్క - నెగులయ్యెనేని
మాకేల యీసీత ? - మఱి యున్న వేల ?
ఎందుకు లక్ష్మణు - డెందుకు భరతుఁ
డెందుకు శత్రుఘ్నుఁ - డెందు కయోధ్య ? 3560
అటులైన నానిశ్చ - యము వినుమాత్మ
దిటముగా నెంచిన - తెఱఁగుఁ బల్కెదను
రావణు పుత్రపౌ - త్రకళత్ర యుతము
గావధియించి లం - కా పట్టణంబు
నీవిభీషణునకు - నిచ్చి జానకిని
మావారితోఁ గూర్చి - మన్ననతోడ

భరతు నయోధ్యకుఁ - బట్టంబుఁ గట్టి
శరచాపములు బొక్క - సములోనవైచి
ప్రాయోపవేశన - పరుఁడనై యచటఁ
గాయంబు విడనాడఁ - గడకట్టినాఁడ ! 3570
చేరితి వేమెల్ల - సేయు ఫుణ్యమునఁ
బోరాడ నీవొంటిఁ - బోఁదగునయ్య ?”
అనుడు గద్గదకంఠుఁ - డగుచు బాష్పములు
జునుక శ్రీరాముఁ జూ - చి కపీంద్రుఁడనియె.
సదయాత్మ! రాణివా - సద్రోహిఁ బంక్తి
వదను నేఁ బాపప్ర - వర్తుని నధము
నెదురెదురునఁ జూచి - యేక్రియ నోర్తుఁ ?
గదిసి చంపఁగ శక్తి - కలిగిన యేను
వానికి లోనగు - వాఁడనే యిట్టు
లానతిత్తురే మిర’ - లని విన్నవించుఁ
గపినాథు మాట లా - కర్ణించి రాముఁ
డపుడు సౌమిత్రిఁ గ - టాక్షించి పలికె. 3580

-: శ్రీరాముఁడు లంకపైకి యుద్ధమునకుఁ బోవుట కుపక్రమించుట :-

"కావించితిమి సేన - గారుడవ్యూహ
మేవేళ లంకపై - నిలయెల్ల నిండి
యాక్రమించితి మీవ - నాంతముల్ మనము
విక్రమించుటకిది - వేళ యెట్లనినఁ
గపులు రాక్షసులు సం - గ్రామరంగమున
నిపుడు గూలుదురన్న - యెన్నిక వొడమె

చదలెల్ల నిండె ప్ర - చండవాయువులు
కదలెడు కొండలు - కంపించె ధరణి 3590
భానుమండల రక్త - పరివేషజనిత
మై నిండె కాలాన - లార్చిర్గణంబు
మృగములెల్లడ విప - రీతస్వరముల
గగనంబుఁ జూచుచు - గడల వాచఱచె
మనుజాశనుల మాడ్కి - మబ్బులు మింటఁ
బెనుధారలుగ రక్త - బృందంబుఁ గురిసె
తారకా తేజముల్ - తఱిగెను సంధ్య
గారాని రుచి దోఁచ - కప్పెఁగావిరులు
కంటివే నేఁడెంత - కయ్యమందెడినొ !
వింటి వేడుకఁ దీర్ప - వేళ చేకూడె 3600
నయినట్టులయ్యె ర - మ్మ”ని సువేలాద్రి

-: వానర సైన్యములు లంకయందు దిగుట - వానర సేనానాయకులు నాలుగు దిక్కులను తమస్థానములలోసెలవుకొనుట :--

పయినుండి వానర - ప్రముఖులతోడ
నవనికి డిగి లంక - కభిముఖుఁ డగుచు
రవివంశమణియైన - రాముఁడు నడువ
సెలవంది వెంటనే - సింహనాదములు
కిలకిలార్భటులు ది - గ్వీధుల నిండ
జలజాప్తసుత వాయు - జ సుషేణతార
నలనీలకుముదమైం - దద్వివిదాది

వనచరుల్ తమతమ - వారలతోడ
దనుజులు వీటిపై - దాడివెట్టినను 3610
వరుణపాలితమైన - వారిధి యనఁగ
సురవైరి విభుని తే - జోవైభవమున
నున్న లంకాపురి - యుత్తరద్వార
మన్నదమ్ములు చేరి - యన్యు లిచ్చోట
నిలిచిరా రావణు - ని యజేయమైన
బలముచే సేకరిం - పఁగ తేరటంచు
నెక్కుపెట్టిన విండ్లు - నేర్చిన గరుడి
ఱెక్కతూపులు నమ - ర్చిన విషంగములు
సవరించి యింతయు - జతనమై కోట
సవరణల్ గనుచు న - చ్చట వసియింపఁ 3620
దూరుపు గవని హ - త్తుకొని నీలుండు
వీరుడై మైందద్వి - విదులతోఁ గూడి
దక్షిణంబున నంగ - దకుమారకుండు
లక్ష కోటుల కోఁతు - లను గూడి యుండ
దర్పించి పశ్చిమ - ద్వారంబునందు
నార్పులచేత బ్ర - హ్మాండంబు వగుల
హనుమంతుఁడు వసింప - నర్క నందనుఁడు
పనసగవాక్షజాం - బవ దాదులైన
దొరలతోడున చక్కి - దుటుము మగాఁ దమదు
పరివారమును దాను - బలుసుక యుండె. 3630
రామానుమతి సుమి - త్రాకుమారకుఁడు
చేమోడ్చి కడల ని - ల్చిన మహాకపులు
వాకిట వాకిట - వసియించు దొరల

జోకగా బహుకపి - స్తోమంబు నేర్చి
పదియు నిర్విదియు నేఁ - బదియొక నూఱు
పదినూఱ్లు లక్షని - ర్వదివేలుగోటి
గజముల సత్తువఁ - గలవారి దిశల
గజముల లావునుఁ - గలవారి నునిచి
నాఱుకోటులు కపీం - ద్రావళి నట్టి
వారల రవిజు క్రే- వలనుండఁ జేసి 3640
యెచ్చరించిన కపు - లెలగోలు జగడ
మిచ్చిన దానవు - లెదిరింపలేక
చీకాకుగా విఱ్గి - చెడిపారి కోట
వాకిళ్లు వేసుక - వడఁకుచు నుండ
నప్పుడు రఘువీరఁ - డవనీశనీతిఁ
దప్ప రాదని వాలి - తనయునిఁ బిలిచి

—: శ్రీరాముఁ డంగదుని రావణునియొద్దకు రాయబారిగాఁ బంపుట :--

రమ్ము తారాకుమా - రక ! నిర్భయమునఁ
బొమ్ము లంకకు నీవు - పోయి రావణుని
యెదురుకట్టున నిల్చి - యేమన్న యట్ల
వదలక యతనితో - వాకొను మచట 3650
వారిజగర్భుని - వరములఁ గ్రొవ్వి
యీరేడు జగముల - నెదురెందు లేక
మునులపై దివిజస - మూహంబు మీఁదఁ
గినిసి ధారుణికెల్లఁ - గీడాచరించి
యందందుఁ గట్టుకొ - న్నటి పాపములు

పొదంగ దరివచ్చె - పొమ్ము నీకనుము
ఏ బలంబున సీత - నెత్తుక వచ్చి
తాబలంబున నిల్చి - యని సేయుమనుము
జనకజకై మేను - సగముగా నవిసి
వనులనాపద నొంది - వచ్చిన యేను 3660
మన నిత్తునే ? నిన్ను - మారటభాను
తనయుని రీతి ను - త్తరపు వాకిటను
నిలిచితి కలనిలో - నినుఁ బుణ్యలోక
ములకు నొక్క-నిమేషమునఁ బంపఁ దలఁచి
యెగసి ఱెక్కలుదాల్చి - యినమండలంబు
తెగి చొరఁ బారిన - తెగటార్తు ననుము.
పుడమి యరాక్షసం - బుగఁ జేయ శరముఁ
దొడుగక మునుపె చే - తులు మొగిడించి
వైదేహిఁ దోకొని - వచ్చితివేని
నీదు ప్రాణంబులు - నిలుచు నప్పటికి 3670
నంతియె కాని లం - కాధిపత్యంబుఁ
జింతఁ జేసిన నిన్నుఁ - జేర దెన్నటికి !
సైదోడు మీ విభీ - వణుఁ డున్నవాఁడు
నీదు రాజ్యంబు వా - నికిఁ జేరెననుము
పాపాత్ముఁడవని యె - ప్పటి కేల యేలు
నీ పుణ్యఫల మెల్ల - నీఁగెఁబొమ్మనుము
పోయి రమ్మ”న రయం - బున మింటికెగసి
చాయగా రావణా - స్థానిలోనిలిచి
జ్వలియించు వహ్నియో - జన మంత్రు లెల్లఁ
గొలువ సింహాసనా - గోమేధికాగ్ర 3680

ఫలకంబుపై నున్న - పంక్తికంధరునిఁ
జులకగాఁగని వాలి - సూనుఁ డిట్లనియె.

                        --: అంగదరాయబారము :--

ఓరోరి ! రావణ ! - యుత్తుంగభంగ
ఘోరనక్రవ్రాత - ఘూర్ణితాంబోధిఁ
గట్టించు కోసల - కన్యకాసుతుని
పట్టంపు బంట నా - పలుకాదరింపు
మంగదుఁడనువాడ - నగచరవంశ
పుంగవుఁడగువాలి - పుత్రుఁడ నిటకుఁ
బనిచె నాస్వామి కో - పము మాని నీవు
జనకజ శ్రీరామ - చంద్రున కిచ్చి 3690
మనుము నాబుద్ధిచే - మారాడితేని
వనజగర్భుఁడొసంగు - వరముల కేమి
యవియెల్ల నడ్డమే - యసమాన విలయ
పవమానసఖశిఖా - పటలప్రతాప
రామదివ్యాస్త్ర ప - రంపరాసార
సామగ్రి కేల మో - సము నొంద నీకుఁ?
జేరవచ్చునె యెది - ర్చి నిమేషమైన ?
పారిపో నిచ్చునో - బవరంబులోన ?
నరికట్టఁ దరమౌనొ - యజహరాదులకు ?
మఱుఁగుఁ జొచ్చెద నన - మఱివేఱె కలదొ 3700
వలవదీయసమాన - వైరంబు కులము
నిలుపుకొమ్మేల మే - నికి నెగ్గుఁ దలఁప ?
నీపట్టణముకు నై - నిలిపి నాస్వామిఁ

జేపట్టి శరణు జొ -చ్చిన విభీషణుని !
నిచ్చెదవే సీత - నీనంటివేని
యిచ్చోట నినుఁజూచి - యేనేల పోదు ?
తగునట్టియాజ్ఞ యిం - దఱితోడ నిన్నుఁ
బగఁదీఱఁ జంపి కో - పముఁ దేర్చిగాక !
అనినఁ గోపించి ద - శాననుఁడాత్మ'

--: అంగదుని శిక్షించుటకు రావణుఁడు నలువురు రాక్షసుల నంపుట :--

గినిసి నల్వుర కాల - కింకరోపముల 3710
రక్కసులను బిల్చి -" గ్రక్కున వీని
నుక్కణఁగింపుఁడు - యూరెల్ల ద్రిప్పి
కట్టి కొట్టుఁడటన్న - గదిసి నల్వురనుఁ

-: అంగదుఁడు వారలను జంపుటయేగాక రావణ ప్రాసాదశిఖరమును భగ్నము సేయుట :-

బట్టఁజేరినవారిఁ - బట్టిరాఁదిగిచి
సంకసందులవైచి -- సడలిపోనీక
యుంకించి యూర్చుచు - నుప్పరంబెగసి
చదలుపై నిలుచుండి - సందిళ్లు వదల
చదిసి రావణు సమ - క్షమున దానవులు
నలువురు బడిరి ప్రా - ణంబులు విడిచి.
బలవంతుఁడా వాలి - పట్టి గోపించి 3720
పదఘాతమున వాని - ప్రాసాదశిఖర
మదలించి కాచిన - నది వజ్రహతిని

హిమశైలకూట మి - ట్లిల గూలునట్లు
తుమురుగా రాలిన - దుర్వారుఁడగుచు
నావాలి సుతుఁడేగ - నదియెల్లఁ జూచి
రావణాసురుఁడు తీ - ఱని చింతతోడఁ
దనచావు దశరథా - త్మజుని జయంబు
మనసులో నిజముగా - మతియింపుచుండె.

-: అంగదుఁడు శ్రీ రామునివద్దకు వచ్చుట – సుషేణుఁడు వానరులను యుద్ధమునకుఁ బురికొల్పుట :--

అంగదుఁడారాము - నడుగుల వ్రాలి
మంగళాశీర్నుతుల్ - మన్ననలంది 3730
కపులచే పొగడికల్ - గని చెలరేఁగు
నపుడు సుషేణుఁడా - హవదోహలమునఁ
గోటచుట్టును చుట్టు - కొని పేర్చు వెరుగు
మేటి వానరుల న - మ్మెయి నెచ్చరించి
యెసవోయి లగ్గల - కెక్కిన దైత్యు
లసముడింపక పట - హములు వ్రేయించి
యెచ్చరిల్లెడు వారు - నెదిరించి యనికి
వచ్చువారును పర - వశులైన వారు
పరువెత్తు వారును - పంతంబులాడి
హరివీరవరులచే - హతులైనవారు 3740
నగుచుండ నీవార్త - లాలించి కినుక
మొగమున వ్రేల రా - ముని వానరులను
పురమెల్ల చుట్టుక – పోరాడు తెఱగుఁ
బరికింపఁ దలఁచి యు - ప్పరిగపై నెక్కి

కపుల పెక్కువయు రా - ఘవుల యగ్గలిక
విపరీతములు తన - వీట గల్గుటయు
దశకంధరుఁడు చూచు - తరి గోటమీఁద
దశరథసూనుండు - దళముపైకొలిపి
"అక్కట ! సీత యే - మయ్యెనో యట్టి
కక్కసంబున వీని - కావలిందగిలి 3750
యెటుల నున్నదియొ మే - మిటు వచ్చుటెఱిఁగి
కిటుకులు వీఁడు మి - క్కిలి నేర్చునొక్కొ !”,
అని తలంపుచు నిట్టి - యాలోచనముల
పనియేమి యైనట్టి - పనిఁ బూనవలయు
నడువుఁ డన్నను కపి - నాయకులెల్లఁ

--: శ్రీరాముఁడు వానర సైన్యమును లంక పైఁ గదనము సేయఁ బురికొల్పుట :--

బుడమి చలింప నా - ర్పులు నింగి ముట్ట
తరలును గిరులును - తాలిచి మిడుత
పరివోలి యగడిత - పరిపాటి బూడ్చి
కోటమీఁదికి నెక్కి - కొత్తళంబులిచి
పాటనం బొనరించి - పరిఘముల్ గూల్చి 3760
వాకిళ్లు హత్తికా - వలి రాక్షసులను
బోకుండ జంపి త – ల్పులుఁ బోడిసేసి
గోపురంబులు గూల్చి - కోటలు దొబ్బి
యేపు చూపిన లంక - యిట్టట్టుగాఁగ

కుముదుండు ప్రఘసుండు - కోటులసంఖ్య
తమవారితోడ ప్రా - గ్ద్వారంబుఁ జేరి
ముత్తిక చేసిన - మున్నాడి పనసుఁ
డొత్తరిగా కపీ - వ్యూహంబుతోడ
శతవలియును దాను - శౌర్యగర్వములు
మితిమీఱఁగా లంక - మీదికి నడిచి 3770
దక్షిణద్వారంబు - తమరాక్రమింప
నక్షీణబలశాలు - లరువదికోట్లు
కపులలో పడమటఁ - గలసి సుషేణుఁ
డపుడాక్రమించిన - యవనిజాప్రియుడు
సౌమిత్రుఁడును విభీ - షణుఁడు సుగ్రీవుఁ
డామున్ను ధూమ్రుఁడా - హవదక్షులగుచుఁ
దమతమవారితోఁ - దమచుట్టుఁగాచి
తమకించి యుత్తర - ద్వారంబు చేరఁ
గదిసియుండిన గజ - గవయగవాక్షు
లదర లేకుండ సై - న్యముఁ బురికొల్పి 3780
యందందు మెలగంగ - నంతయుఁజూచి
కొందలంబున దైత్య - కులవజ్రపాణి

-: రావణుఁడు తనబలములనుకూడ యుద్ధమునకుఁ బురికొల్పఁగా వానర రాక్షసులకు సంకుల
                                   యుద్దమగుట :-

సెలవిచ్చుటయు భీమ - సింహనాదములు
విలసిల్లె భేరులు - వీథుల మొరయ
సాతికొక్కెరలలో - జలదముల్ వచ్చు

రీతి శంఖములు బూ - రించి దానవులు
పురికొల్ప శరధియు - ప్పొంగిన లీల
హరియోధులును రాక్ష - సావళి దాకి
లంకలో మిన్ను నే - లయు నేకమైన
పొంకంబుగా సరి - పోరుచు నాఁగి 3790
యిరువాగె కలెబడు - నెడ నేమి జెప్ప
దుర మింగలపువాన - దొరగినట్లుండె !
కోటకొమ్మలమీఁది - ఘోరనిశాట
సాటోపదివ్య శ - స్త్రాస్త్ర ఘాతములఁ
దనులతో గిరులతో - ధరణి పైద్రెళ్ళి
హరులు మ్రగ్గిన జాడ - యచ్చరువయ్యె
ఇలనుండి వానరు - లేసిన వృక్ష
ములుచేత కేతనం - బులు చామరములుఁ
బొడిపొడిగాసాల - మున నాశువరలఁ
బడదానవులు వడ్డ - పాటు చూచినను 3800
సరియె దేవాసుర - సమరంబు లట్లు
సరిపోరునెడ ఘోర - సమరరంగముల
రక్త మేదోమాంస - రాసుల కపులు
నక్తంచరులు దేలి - నాలుగు దిశలఁ
పోరాడ జతకయ్య - ములు సమకట్ట

-: ఇరవైపుల వానరరాక్షస నాయకులు ద్వంద్వ యుద్ధము చేయుట:-

దారుణగతి నంగ - దకుమారతోడ
నింద్రజిత్తుఁడు జేసె - నెంతయు సమర

మింద్రాదులకు భీతి - యెదలఁ బైకొనఁగ
సంపాతితోడ ప్ర - జంఘుండు శౌర్య
సంపదఁ బోర నం - జనకుమారకుని 3810
హనుమంతు నెదిరించి - యా జంబుమాలి
పెను కయ్యమొనరింప - పృథివి చలింపఁ
దొడరి మిత్రఘ్నుని - తో విభీషణుఁడు
బెడిదంబుగాఁ జేసె - భీమసంగరము
పోరాడె తెగి నీకుం - భునితోడ నీలుఁ
డారూఢబలుఁడా ప్ర - హస్తునితోడ
గినిసి మార్కొనియె సు - గ్రీవుండు దర్ప
మున నగ్నికేతుని - ముందఱనాఁగి
యసమయుద్దము విరూ - పాక్షుండుడు చేసె
నసముడింపక రాఘా - వాగ్రణి నెదిరి 3820
యడరించె దుర్ముఖుం - డమ్ములు నాల్గు
తొడిబడ రశ్మి కే - తుఁడు శక్తివైచె
కదిసి మిత్రఘ్నుండు - గదప్రయోగించె
పొదిలిన యజ్ఞకో - పుఁడు శితాస్త్రముల
దుర్వారుఁడగుచు మైం - దుని వజ్రముష్టి
గర్వించి యెదిరె రా - ఘవుని కట్టెదుర
నరికట్టె ద్వివిదు న - య్యశని ప్రభుండు
విరసించె నలునితో - వీరవ్రతుండు
తొడరె విద్యున్మాలి - తో సుషేణుండు
కడమవారెల్ల నొ- క్కని కొక్కరుండు 3830
దాకొని ద్వంద్వయు - ద్ధము సేయదిశలు
చీకాకుపడ సృష్టి - చీకట్లు గ్రమ్మె

మెదడు రొంపియు శస్త్ర - మీనముల్ పుడమి
గుదికొన కేశంపు - గుంపు బల్నాచు
చామర ఫేనముల్ - జతగూడఁ బాఱె
నామేర భయదర - క్తాంబు వాహినులు
గదఁద్రిప్పివైచి యం - గదుని నొప్పింపఁ
జెదరక యతఁడింద్ర- జిత్తునిమీఁద
యొక్కసాలము వైచి - యుర్వణంగించె
నక్కజంబగు వాని - హయరథాద్యములఁ 3840
గోపంబుతో ప్రజం - ఘుని శరత్రయిని
బాపురే యనఁగ సం - పాతి పై వేయఁ
గదిసి తోడనె యశ్వ - కర్ణభూజమునఁ
జదియించెను ప్రజంఘు - సంపాతి గెలిచె
ఆ జంబుమాలితా - హనుమంతు మీఁదఁ
దేజంబుతోడ నె - త్తిన చక్రహతిని
యురము నొప్పించిన - నొకకేల నతఁడు
చఱచి వాని సరాక్ష - సంబుగా గూల్చె.
తపనుండు నలునిమీఁ - ద నెదుర్ప నతఁడు
కుపితాత్ముఁడై వాని - గ్రుడ్లు పెకల్చె 3850
తొడరి పైకొనీ ప్రహ - స్తుని సప్తవర్ణ
మడరించి సుగ్రీవు - నదరంట నేసె
నలువుర దైత్యుల - నాల్గు దూపులను
తల లుత్తరించె సీ - తానాయకుండు
మొనసె మైందుఁడు వజ్ర - ముష్టిని ముష్టి
కినిసి వేసినఁ దల - క్రిందుగాఁ ద్రెళ్లె
పోరిలోపల నికుం - భుని నీలుఁడాగి

తేరు నాతని సార - థిని నేలఁ గలిషె
పోనీక నశనిప్ర - భుని ద్వివిదుండు
చానేసె సాలవృ - క్షము పెకలించి 3860
కదియు విద్యున్మాలిఁ - గని సుషేణుండు
చదియ వైచెను చేతి - శైలంబు చేత
నసురలం దఱమిన - యమరల మాడ్కి
బిసపోక దనుజుల - పీచంబడంచె.
కపులుత్సహింపంగఁ - గాకుత్థ్స తిలకుఁ
డపు డెచ్చరింప ని - ట్లని సేయువేళ
కాక జంబుక గృధ్ర - కంకాదు లచట
నేకమై తృప్తివ - హించి నేకడలఁ
బుడమిద్రెళ్లు కబంధ - ములు మింటికెగసి
పడక యాడుచు నుండె - పక్షులరీతి 3870
పోవక నిలిచియే - ...కు ప్రొద్దుక్రుంగు
లావు చూపుదు మనియు - లంక రాక్షసులు
నడియాసనుంబోర - నపరాహ్ణమైనఁ
బడమటి దిశ గ్రుంకె - భాను మండలము
కదిసె చీకటులు చీ - కటులు వెంబడిని
కదిమి నల్గడ కోట - గవసులు వెడలి
కపులపైఁ బడికి రా - క్షసు లీశకంఠ
విపులహాలాహల - వీచుల లనంగ
చీకటి జగడంబు - సేయ.........
............దై - తేయుల చేత 3880
చాల నొచ్చియు తెంపు - సడలక తరులు
శైలంబులును బూని - జగడించు నపుడు

పొడువుము పొడువుము - పోకుమ పోకు
మడువుము తలఁద్రుంపు - మరికట్ట నిల్పి
వ్రేయుము మ్రింగుము - వెంటాడు మడువు
మేయుము విదలింపు - మెదిరింపు మనెడు
భయదవిలయకాల - ఫణుతులు దైత్య
చయము మెలంగెడు - చాయ లెఱింగి
యాదారి నెదురెక్కి- - యద్రులు దరులుఁ
జేఁదప్పనీక వ్రే - సిన సంగరమునఁ 3890
బొడియయ్యె రథములు - పొరలె నేనుఁగులు
మడిసె తురంగముల్ - మ్రగ్గె కాల్పలము
వీరిసె ఖేటకములు - విఱిగెటెక్కెములు
దురమయ్యె కవచముల్ - తునిసె చాపములు
నురుమయ్యె నమ్ములు - నుసియయ్యె పొదులుఁ
దఱుచయ్యె మొండెముల్ - తరిగె బీరములు
కలసి నెత్తురునదుల్ - కండలునిండె
చెలరేఁగె భూతముల్ - చెడిపాఱె మూఁక
లావేళ సురవైరు - లార్వురు సమర
కోవిదు లెదురేచి -కోతులం దఱిమి 3900
మేమరువులయందు - మిఱుమిట్లుఁ గొలిపి
హేమరత్నప్రభ - లెసఁగె శైలములు
నోషధిలతలచే - నొప్పెడు రీతి
భీషణాకారులై - పెరిగి పైరాఁగ
నావెలుంగుల చేత - నగచరు లెఱిఁగి
చావులకును దప్పి - జడిసి పాఱుటయు
నాఱమ్ములను రాముఁ - డార్వురి తలలు

ధారణిఁ బడవైచి - తనవారిఁ గాచె
నంతట వానరు - లంత కాకృతులు
పంతంబుతో దైత్య - బలములం దఱుమ 3910
దనుజయోధులెదిర్చి - తలపడిపోరఁ
బెను గయ్యమపుడయ్యె - బెగడె లోకములు
చెట్టులుం గట్టులు - చేతులం బూని
పట్టినట్లనె కపి - ప్రముఖులు మ్రగ్గఁ
గరములం బట్టిన - కరవాల ముసల
పరిఘాదులను దైత్య - బలమెల్ల జదియఁ
బడుగుఁ బేకయునుగా! - బడి యిరువాగు
మడియునప్పుడు మహీ - మండలంబొప్పె
ఆశ్రిత పూజాస - మర్పిత ప్రసవ
మిశ్రయౌవాహిని - మించినమాడ్కి 3920
నత్తరి రామసా - యక పరంపరలు
చిత్తజల్లుగ ముంప - చెదరి రాక్షసులు
తెమలఁ బారినచో నె - దిర్చి దర్పమున
యమశత్రుఁడనఁగ మ - హాపార్శ్వుఁ డనఁగ
సారణవజ్రదం - ష్ట్ర శుక ప్రమాధి
దారుణభుజ మహో - దర మహాకాయ
యూపాక్షులనఁగ న - త్యుద్ధతి రణీత
చాపులై తూపులు - సంధించి మించి
కపులఁ ద్రోలుచును రా - ఘవుఁడేఁడి వెండి
యిపుడే చంపుదమని - యెదిరించి రాఁగ 3930
ఘనదివ్య బాణలా - ఘవుఁడు రాఘవుఁడు
కనుగొన విలుగుణ - క్వణనంబుఁ జేసి

యలుగులు మంటల - నంధకారంబుఁ
దొలఁగించి క్రొవ్వాఁడి - తూపులు దొడిగి
యన్నింట నందఱి - నదరంట నేయ
వెన్నిచ్చి కోఁతులు - వెంటాడి తఱుమఁ
బాఱిరి విఱిగిరి - పరువెత్తి రనుచుఁ
గేలి రాలను రవ్వఁ - గేడించుటయును
కపులచే తమవారు - గాటిలం జూచి

--: సంకుల యుద్దములో రాక్షసు లోడిపోవుటఁజూచి ఇంద్రజిత్తు శ్రీరామునిపైకి యుద్ధమునకు వెడలి
                  నాగాస్త్రముఁ బ్రయోగించుట :--

అపు డింద్రజిత్తు భ - యంకరాకృతిని 3940
నట్టహాసము త్రికూ - టాద్రికందరపు
బట్టుల బట్టీక - బదులు మ్రోయింప
నంగదచే తన - యరదంబు వోవ
నింగికి నెగసి కం - టిని కంటిననుచుఁ
బిడుగుల కెనయైన - భీకరాస్త్రములు
పెడతలనుంగాడి - పిఱుఁదల వెడల
వానర ప్రభుల నొ - వ్వఁగ సేసి మబ్బు
లోన మైడాచి యా - లోచన సేసి
దాను నాగాస్త్ర సం - ధానంబు చేతఁ
గాని రాఘవుల నొ - క్కట గెల్వరాదు 3950
తొడిగెద ననువేళ - తోయదసరణి
నెడగాఁగ వసియించి - యింద్రాది సురలు
నిక్కి గన్గొనుచు వా - ని నెఱుంగ నీక

"యక్కట నేఁడు ద్రో - హపు చింతఁ దలఁచె
నందుచే రఘువీర - అభయులై యార్తి
నొందకుందురుగాక - నొక కీడు లేక
జయ మొందుదురుగాక - సమరోర్వి” ననుచు
జయపూర్వక స్తుతుల్ - సలుపుచు నుండ
బ్రహ్మాదు లదరంగ - బలువింటఁ దొడిగి
జిహ్మగా జిహ్మగ - శ్రేణి నేయుటయు 3960
నవి వచ్చి వేఱ్వేర - యన్నదమ్ములును
జవసత్త్వములు మాయ - సడలంక నీక
సంధుల బిగియించి - చాల నొప్పించి
బంధించి వసుమతిఁ - బడవైచునపుడు
చైతన్యకళమాసి - సమరంబు మఱచి
చేతియమ్ములు విల్లు - క్షితిఁ బడవైచి
యిరవురు బడియుండు - నెడ జాపునకును
సరియైన మూర్ఛచే - జనకజాప్రియుఁడు
గాజువాఱఁగ మేను - కన్నులు మూసి
తేజంబుమాసి యం - తే నూర్పు వెడలి 3970
యున్నెడ సౌమిత్రి - యును వాయుసుతుఁడు
విన్నబాటుల చాల – విలపింపుచుండె.

-:ఇంద్రజిత్తు శ్రీరాముని నాగాస్త్రముచే మూర్ఛితునిఁ జేసి వానరసైన్యము నట్టహాసముతోఁ దాఁకి లంకకుమరలుట :-

పనసనుషేణ సం - పాతి మైందాది
వనచరల్ పదువు ర - వార్య రోషముల
గిరతర సాధనాం - కితకరులగుచు

నురుశక్తి నభమున - కొకయింత నెగిసి
యట్టహాసము జ్వాల - తారావ మెచటఁ
బుట్టె నచ్చటికి గుం - పుగ నెదురెక్క
దానవరాజనంద - నుఁడు నిశాత
నానావిధాస్త్ర స - న్నాహంబుచేత 3980
మొగములు వగుల నె - మ్ములు నొగులంగఁ
బగిలి పాఱగ ధాత్రి - పైఁ బడనేసి
యాయింద్రజిత్తు వీ - రాట్టహాసంబు
సేయుచు నెగ్గించి - శ్రీరాముఁ బలికె
"అని యేల మీకు రా - జాధములార !
నను మార్కొనఁగ లేఁడు - నాకేశుఁడైన
నింద్రునిఁ జెఱసాల - నిడిన యజేయుఁ
డింద్రజిత్తను మాట - నెఱుఁగరే మీరు
దైవంబు పెడఱేప - దశకంఠుఁ జెనకి
యీవానరులు గూడి - యిటకు జేరితిరి. 3990
చేఁజేత ననుభవిం - చితిరి తత్ఫలము
మీ జనకజ యిఁక - మీఁద నెట్లగునె
యేల వచ్చితిరని - యెకసక్కమాడి
వోల వేయుదు శర - వ్యూహంబు చేతఁ
దనువులు జర్ఝరి - తములుగాఁ జేసి
పెనురక్తధారలు - పృథివీధరముల
బిలముల ఝరములు - బ్బిస్రవించులీల
వెలువడి ప్రవహింప - విబుధులు బెదర
నున్నట్టిచోఁ గపి - యోధులు ధరణిఁ
దన్నెఱుంగక వ్రాలు - దశరథాత్మజుని 4000

గనుఁగొని బ్రతకడ - కా నిశ్చయించి
తను వెఱింగిన సుమి - త్రాపుత్రుఁగూడి
వగచునప్పుడు దైత్య - వరు సహోదరుడు
పగవాని తెఱగాత్మ - భావించి చూచి
కటకట ! సకలలో - కములొక్కటైన
నెటువలె నెదురింతు - రిటువంటి వాని
మించె గార్యంబని - మిగిలిన నాలు
గంచుల నున్న మ - హా వానరులను
నంగద జాంబవ - దాదులం గూర్చి
యంగదుతో రాఘ - వాగ్రణి కడకు 4010
మెల్ల మెల్లన వచ్చి - మేదిని మీఁద
విల్లునమ్ములు కడ - వేసినవారి
యినవంశమణుల న - హీన సాహసుల
సనఘుల వీరశ - య్యాశయానులను
బుసకొట్ట పన్నగం - బుల బోలియూర్పు
లెసగెడు వారి స - హిష్ణు మూర్తులను
బరమపుణ్యుల నాగ - పాశ సంవృతుల
శరణాగతత్రాణ - సద్ధర్మపరుల
రామ సౌమిత్రుల - రవికుమారకుఁడు
తామున్నుగాఁబిఱుం - దన వచ్చి చేర 4020
వీరెల్ల వినుచుండ - వివిధారులుబ్బఁ
జేర రండన యింద్ర - జిత్తుఁ డిట్లనియె
"ఈ రాముఁడాజి న - నేక రాక్షసుల
నారాచముల ద్రుంచి - నాఁడను వార్త
నెపముగా నాహార - నిద్రలు మానె

నిపుడు మజ్జనకుఁడ - య్యిన కులోత్తమునిఁ
బడ నేసితిని తండ్రి - పగఁ దీర్చనట్టి
కొడు కేల యని నిరం - కుశ విక్రమమున
నీరాజులనుఁగాంచి - యేనేయునాగ
ఘోర పాశములూడ్వఁ - గుంభినిమీఁద 4030
నజహరాదులకైన - నలవియే సమర
విజయంబు గైకొని - విమత శౌర్యంబు
శరదంబు దంబుల - చాయ వ్యర్థముగఁ
బరిభవించితి తండ్రి - పాలికేఁగెదను.
ఎచ్చరించెద వీరి - నిపుడని వాఁడి
చిచ్చఱమ్ములు గొన్ని - శింజినిఁ గూర్చి
శరభు నేనిట నాఱు - శరముల రిషభు
హరుఁ దొమ్మిదింట గ - వాక్షుని మూఁట
వాలిసూనుని జంబ - వంతు నాఱింట
గాలిపట్టిఁబదింట - గవయు నేడింట 4040
గంధమాదను రెంట - గజుని పదింట
మైందు మూఁటను తారు - మార్గణత్రయిని
రవిసూను నేడింట - రావణానుజుని
గవతూపులను నీలుఁ - గాండాష్టకమున
నలునాఱిటను జిక్కి - న ప్లవంగ వరుల
వలుద తూపుల నేల - వ్రాలంగ నేసి
యురవడించిన దైత్యు - లోహో ! విలాస
భరితులై యసురేంద్రు - పట్టినిఁ బొగడఁ
గ్రమ్మరి తాను లం - కాపురంబునకుఁ
దుమ్ముగా నింద్రజి - త్తుఁడు ప్రవేశించె.4050

భానుసూను రఘుప్ర - వరులనుఁ జూచి
దీనుఁడై యెంతయు - దిగులు చేఁ బొదల
నాలీల గడవారు - నడలంగ చింతం
జాలింపుఁడని విభీ - షణుఁ డిట్టులనియె.

-: విభీషణుఁడు సుగ్రీవునికిఁ గర్తవ్యము బోధించి శ్రీరాముని సేదఁ దేర్పుమని చెప్పుట :-

ఆపదల్ వచ్చిన - యపు డోర్పువలయుఁ
గాపురంబులు సేయఁ - గలవె యాపదలు.
ఈ రాఘవులకెందు - నేమి కొఱంత ?
వీరికై మనకేల - విలపింప నింత ?
ధైర్యశాలుల కసా - ధ్యములెందు లేదు
కార్యవేళల నిట్లు - కను చెదరుదురె ? 4060
అవనిపై ధార్మికు - లగువారి కెందు
నవమాన మపజయం - బది యేల కలుగు?
కీశేశ ! యందఱి - కినిఁ దెల్పితెచ్చి
దాశరథులను సే - దలుఁ దేర్పు మీవు
మరణ ఖేదములకు - మర్యాదగలదె !
సరియవి దేహ నా - శనములో కతన
బ్రదికింపు మీ రఘు - పతిని కార్యంబు
వదలక మిమువంటి - వారిఁ జేపట్టి
కాకుత్థ్సపాలకులఁ - గడతేర్ప నీతి
గాక యేమరుదురె ! - కపిరాజవీవు 4070
చూడుమీశ్రీరాము - సుందరాస్యమున
వీడినయదిగాదు - విమల తేజంబు

చెదరిన మూఁకలఁ - జెదరగాఁ దిగిచి
బెదర దీర్పుము రణ - భేరి వేయించి
వీరలీలోఁ గను - విచ్చి చూచినను
దీఱును మనల యా - ర్తి సుఖంబుఁగల్గు
వంపు దింపులకు నీ - వానరుల్ రాక
గుంపు గుంపుగ గుజ - గుజల బోయెదరు
పొంగెల్లఁ జెడి బేలు - పోయెను మూఁక
చెంగి పాఱిన మఱి- చేకూర్పరాదు. 4080
ఇంతలో నొకకూఁత - లెగసిన నెట్లు
చింతసేసిన మరి - సెలకట్టఁబోదు.
విఱుగు చూపెను మన - వేలంబు దనుజు
లేఱిగిరేనియు నిర్వ - హించుకోనీరు
భారకుండగు నీవు - ప్రజల చేకూర్చి
యీరాముఁ బోషింపు - మెడరైన చోటు
వాడిన పూవులా - వలవైచురీతి
వీడఁ జేయుము కపి - వీరులభయము"
అనుచు సుగ్రీవుతో - నాప్తధర్మంబు
గనిపించి పలుకుచుఁ - గలసియున్నంత 4090

-: రావణునితో నింద్రజిత్తు తన పరాక్రమముచేత శ్రీరాముని మూర్ఛనొందించి వానర సైన్యమును కలఁతపఱచిన విధమును తెలిఁయబఱచుట :-

నాయింద్ర జిత్తుండు - నసురేంద్రుఁ జేరఁ
బోయి సాఁగిలి మ్రొక్కి - భుజములు వొంగ
"దేవ ! రాఘవుఁ జంపి - తిని లక్ష్మణుండు

చావువాఁడయ్యె నా - శరములచేతఁ
గపులెల్ల బడిరి సం -గ్రామంబులోనఁ
దపియింపుచును నీ ప్ర - తాపంబుచేత"
ననిన దిగ్గున లేచి – యాత్మనందనునిఁ
దన మనసార నెం - తయు గౌఁగలించి
"జగడ మెట్లయ్యె రా - జన్యులకెట్లు
తెగటార్చితివి ? తానే - దిక్కయి వచ్చె 4100
సుగ్రీవుఁడేమయ్యె ! - శూరులు వాన
రాగ్రణు లేరీతి- నణఁగి రందఱును ?
తేట తెల్లంబుగాఁ - తెలుపు మింకొక్క
మాటు నాలోని యు - మ్మలికంబుఁ దీఱ”
అన నింద్రజిత్తుం డా - యసురేంద్రుఁ జూచి
వినయపూర్వకముగా - వెండియుఁ బలికె.
"నాశరంబులచేత - నాశంబు నొంది
దాశరథు లని బం - ధనములఁ బొంది
పడియున్న వార నీ - పాదంబులాన
నుడువుదు నేబొంకు - నోరాడి యేను 4110
గెలిచి వచ్చితి నన్న - కీర్తించి కొడుకు
తలమూరుకొని బాష్ప - ధార దోఁపుచును
నోరు నిండార స - న్నుతి చేసి శుభవి
చారుఁడై తను పున - ర్జాతుగాఁ దలఁచి
కొడుకు మై నిమురుచుఁ - గోఁతులపాటు
లడుగుచు రావణుం - డటులున్నయంత.
శ్రీరాము చుట్టు వ - సించి రక్షించు
వీర వానరకోటి - వేలంబులోనఁ

దృణము చలింప దై - తేయులటంచు
గణుతించి ఝల్లనఁ - గలఁగఁ బాఱుచును 4120
బబ్బరింపుచు సేతు - పద్ధతి పట్టి
దొబ్బు దొబ్బలుఁగాఁగఁ - బ్రోచి ప్రోవుచును
దబ్బరయని దొరల్ - తము గానకుండ
నుబ్బు వుట్టిన మళ్లి - జుణిగి చేరుచును
పోటరులై నగం - బులు చేతఁ బట్టి
దాఁటుచుదారు ముం - దఱ మెలంగుచును
నంగదనలనీల - హనుమంతులున్న
సంగడి నందఱు - జతఁ గూడి యుండ
నాసమయంబున - నసురనాయకుఁడు
చేసి మన్నన లింద్ర - జిత్తునిం బనిచి 4130

-: సీతను రావణుఁడు రామలక్ష్మణులు మూర్చనొందిన స్థలమునకుఁ గొనిపొమ్మనుట :-

కామాంధుఁడై యశో - కవనంబుఁ గాచు
భామలం బిలిపించి - "పణఁతుక లార !
ఇన్నాళ్లు తమ 'రాముఁ - డిచటికి వచ్చి
నన్ను జయించి మా - నము గాచుననుచు
నడియాసచే సీత - యటు నిటు గాక
చెడియున్న యదియింద్ర - జిత్తుని చేతఁ
దమవారు పెనుఁబాప - త్రాళ్ళ చేఁ దగిలి
యనిఁ బడి యున్న వా -రది మీరుపోయి
జనకజ కెఱిఁగించి - సరగ పుష్పకముఁ
గొనిపోయి యందుపైఁ - గోమలి నుంచి 4140

యంతయుఁ జూపి రం - డని త్రిజటాది
కాంతలతోఁ బల్కఁ - గ్రక్కున వారు
వైదేహితోడ నీ - వార్త యేర్పఱచి
యాదేవి మణి పుష్ప - కారూఢిఁ జేసి
కలని చాయకు వచ్చి - కనుపట్టుచోట
నిలిచి సీతకు రాము - ని తెఱంగుఁ జూప
నావేళ లంకలో - నందఱు నెఱుఁగు
రావణాసురుఁడు తూ - ర్యములు మ్రోయించి
మొన భేరి యందందు - మొనయించి విజయ
మనుచు లంకాపురి - నన్ని వీధులను 4150
గై సేయఁ బనుప రా - క్షసుల చెల్వంబు
గాసిచే కపులున్న - క్రమమెంచి సీత
 

-: సీత రామలక్ష్మణులను మృత్యులుగా భావించి శోకించుట :-

శరతల్పముల యాత్మ - సాహస క్రియల
మఱచి బాణాసన - మార్గణావళులు
తూణీర కవచముల్ - దొఱగి మేనులను
ప్రాణంబు లునికి యే - ర్పడనీక త్రెళ్ళి
మహినున్న ప్రాణేశు - మఱదినిఁ జూచి
గ్రహము సోఁకినయట్ల - కళవళింపుచును
మృతి నొందినారని - మేదినీ తనయ
యతిశయ ఖేదలో - లాత్మయై పలికె 4160
"ఓయార్య పుత్రు లి -ట్లుందురే తన్ను
దాయలపాల్జేసి - తగవు పోనాడి.

మహిసురల్ దీర్ఘ సు - మంగలి యనుచు
బహువిధంబుల నన్నుఁ - బలుకుదు రెపుడు
వర్ణిత గుణపుత్ర - వతియని చూచి
నిర్ణయింపుదురు గా - ని వచింపరిట్లు
వారెల్లరు నసత్య - వాదులై యెఱుఁగ
నేరక యవి నమ్మి - నిజమని యుందు
నాదు కన్యాలక్ష - ణంబులు చూచి
వైదేహి రమణుఁడ - ధ్వరములు సేయ 4170
దీక్షితురాలౌచు - దీనులఁ బ్రోచు
పక్షంబుతో నను – పలుకు లేమయ్యె ?
భాగ్య రేఖలు చూచి - పట్టాభిషిక్త
యోగ్య యీసీత ప్రి - యుండును దాను
కలిత సామ్రాజ్య సౌ - ఖ్యంబులఁ దేలి
విలసిల్లు ననుమాట - విఫలమై పోయె
వీరపత్నియనంగ - వినియుందుఁ గాని
వీఱిడి యిల్లాల - వినియున్కి లేదు
లక్షణంబులు విఫ - లతను వైధవ్య
లక్షణంబులకు నా - లయములై మించె 4180
జతగూడి సోగలౌ - సన్న వెంట్రుకల
నతినీలమగు వేణి - యందంబుఁ జూచి
ముడివాటు లేక మో - మున రేకవాఱి
యెడమచ్చి కనుబొమ్మ - యిక్కువల్ చూచి
బటువులై నేకమై - పలుచనై రోమ
ఘటితంబు గాని జం - ఘాద్వయిఁ జూచి
చాలంగ మెఱుఁగెక్కి - సన్నమై కదిసి

ధాళధళ్యము లీను - దంతాళిఁ జూచి
కదిసి క్రొమ్మొనలతోఁ - గవకూడి పొదలు
కొదమ చన్నుల మెఱుం - గులు తేరిచూచి 4190
కాసారమును బోలి - గంభీరమగుచు
భాసిల్లు నాభి సౌ - భాగ్యంబుఁ జూచి
గిటగిటనై పిడి - కిటికి లోనగుచు
దిటలేని లేఁగౌనుఁ - దీవియఁ జూచి
తళతళ వెలుఁగు కుం - దనపు ఱేకులను
దలపించు చెక్కుట - ద్దంబులు చూచి
తులిత సీతాసిత - ద్యుతులతో నెనయఁ
గలువ ఱేకులవంటి - కన్నులఁ జూచి
తిలకింపఁ బగడంపు - తీవెను బోలు
పలుచని యధర బిం - బము కెంపుఁ జూచి 4200
లలితమృణాళ వి - లాసంబులగుచు
విలసిల్లు బాహుల - విభవంబుఁ జూచి
చిగురాకులను గేరి - సింగార మగుచుఁ
బొగడొందు కెంగేలి - పొంకంబుఁ జూచి
యిలనంటి కెందమ్మి - యెమ్మెఁ బోఁజిమ్ము
పలుచని కమల - పదములు చూచి
ముద్దియ సార్వభౌ - ముని రాణి యగుచుఁ
బెద్దగాలంబులు - ప్రియుఁడును దాను
చల్లగా మనునన్న - సాముద్రికోక్తి
పొల్లుగా నినుఁ బాసి - పొక్కంగ వలసె! 4210
వారుణ పావక - వాయవ్య రౌద్ర
నారాయణ బ్రహ్మ - నామకాస్త్రములు

నీకేమి లేవయ్యె - నేనాగపాశ
మేకైవడినిఁ గట్టె - నిటువంటి మిమ్ము
మఱచితో ప్రాణేశ ! - మారేయుటకును
మఱపించెనో నిన్ను - మాయరక్కసుఁడు
“మొగులు చాటున నుండి - మోసంబు చేసి
తెగివీఁడు మిమ్ము వ - ధించె నెక్కటిని
దిక్కెవ్వరింక నా - తెఱఁగిట్టి ములుచ
రక్కసుల్ మిగుల నా - ఱడినిఁ బెట్టుదురు 4220
నానిమిత్తముగ వా - నరసేనఁ గూర్చి
యీనీరనిధి మీర - లిపుడు బంధించి
లంకపై విడియుటె - ల్లను వ్యర్థమయ్యెఁ
గొంకక విధిప్రతి - కూలమౌ కతన
నెంతవారైన ని - న్నెదిరించరేని
యంతకు వీటికి - నరుగుటేకాక
నిను గెల్చునట్టి వా - ని జగత్రయమున
నినవంశతిలక ! యూ - హింప రెవ్వరును
కొడుకు లిర్వురు తన - కోడలు నవని
యడవుల పదునాలు - గబ్దముల్ దీర్చి 4230
మఱలి వత్తురటంచు - మనరాక కెదురు
పరికించి చూచుచు - భరతుని క్రింద
నొదిగెడు కౌసల్య - కూరటలేక
తుది నిట్టులైనయం - దుకుఁ గలంగెదను
వెడలుచున్నది నీదు - వెంట బ్రాణంబు
లొడలిలో నిక నేల - యుండు నీక్షణమ
పడియెద మహినన్న - వట్టుక కాచి

విడువ రీరక్కస- వెలఁదులు తన్ను
క్రోధంబుతో లంక - కును జొరి యొరులు
సాధింపరాని రా - క్షస వంశమెల్ల 4240
నొకమాటలో కోప - హుత వహార్చులకు
నొకరునిఁ జిక్కక - యుండ నర్పించి
యాకోపవహ్నిలో - నాత్మ దేహంబు
నీకుఁ బ్రీతిగ నిత్తు - నీయాన నిజము,
ఇంక శోకింప నా - కేల” యటంచుఁ
బంకజానన సీత - పలవింపుచుండ
నామాటలన్ని యు - నాలించి త్రిజట
భూమిజతోఁ బల్కె - బుజ్జగింపుచును

          -: త్రిజట సీత నూరడించుట :-

" తల్లి ! యీరీతి కొం - దలమందనేల
చల్లగా మను నీదు - స్వామి రాఘవుఁడు. 4250
అతని కొక్కకొఱంత - యదియేల కలుగు
హితముగాఁగఁ బ్రమాణ - మేవచించెదను
రాముని కొకటైన - రామ ! యీ కపుల
మోములందు వికాస - ములు గల్గియున్న
దొరవడ్డచోట కోఁ- తులమూఁక యింత
యొరిమలో నుప్పొంగి - యుండ నెక్కడిది ?
అదిగాక నీపతి - ప్రాణంబుతోడ
పొదలడేనియు నిది - పుణ్యపుష్పకము
ధరియించునే నిన్ను ? - తరుణి యిట్లగుట
నెఱిఁగి యుండుదు గాన - యిటుఁబల్కవలసె 4260

సేనాధివతులు నొ - చ్చిన నావికుండు
లేనట్టి యోడ చ - లించు చందమున
దనుజ సైన్యంబులో - దళకర్త లేక
వినుతాంగి ! గనుగొమ్ము - విఱియఁ బాఱెడును
కవులెల్ల నుత్సాహ - కలితులై చూడు
మిపుడున్నవారు మీ - రేల శోకింప
నమ్ముము కల్ల నె - న్నఁడు నేను బలుక
కొమ్ము సత్యముగఁ జే - కొనుము నామాట
రామలక్ష్మణులు సు - రస్వామికైన
నేమనవచ్చు నీ - వెఱుఁగకున్నావె 4270
మృతలక్షణంబు లే - మియు రామునందు
నతివ చూచినఁగాన - మనుమాన మేల ? ”
అనిన రామునిఁ జూచి - యంజలిఁ జేసి
తనతోడ హితము లెం - తయుఁ బల్కు త్రిజట
మాటలు నమ్మి యా - మగువకుఁ బ్రియము
నాఁటుకొనంగ మ - న్నన మాటలాడఁ
గదలి యప్పుడే యశో - క వనంబుఁ జేరి
మొదలింటి రీతి రా - ముని దలంపుచును
దనుఁజుట్టు దనుజ కాం - తలు గాచియుండ
వనజాక్షి యాసీత - వసియించునంత. 4280

-: శ్రీరాముఁడు మూర్ఛ తెలిసి తమ్మునిఁగూర్చి శోకించుట :-

తరణిజ వాయునం - దన వాలితనయ
శరభసుషేణ కే - సరి నలనీల
పనసగవాక్ష జాం - బవదాదులైన

వనచరల్ తనచుట్టు - వగలచేఁ బొగులఁ
జింతలెల్లను దీఱఁ - శ్రీరామవిభుఁడు
కొంతసేపునకుఁ గ - న్గొనలుఁ దెఱచి
తనవారిఁ బడినట్టి - తమ్మునిఁ జూచి
తనపాటు దలఁపక - దశరథాత్మజుఁడు
కెలన నున్నటి సు - గ్రీవముఖ్యులను
దెలియంగఁ జూచి చిం - తిలుచు నిట్లనియె. 4290
"అకట! లక్ష్మణుఁడు నా - గాస్త్ర ఘాతముల
నొకట మేనెఱుఁగక - యున్నట్టివాఁడు
బ్రదుకలేఁడితఁడేల - బ్రతుకింకతనకు
నదియకాదిఁక జన - కాత్మజ యేల
తమ్మునితో నయో - ధ్యకుఁ బోదుననుచు
నమ్మియుండితిని జా - నకిని సాధించి
తనవెంట నలనాఁడు - దండకాటవికి
జనకజతోఁ గూడి - సౌమిత్రి వచ్చి
యిద్దఱితోఁ బాసి - యింక నేనేమి
బుద్ది యెంచుక రణం - బున కియ్యకొందు 4300
యేవంక నేఁగిన - నెట్టిచోనైనఁ
గావలసినవారి - గణియింపవచ్చు
జనకనందనఁబోలు - సతియు లక్ష్మణున
కెనవచ్చు తమ్ముండు - నెచ్చోటలేరు.
ఇమ్మేనితోడ నే - నేఁగియయోధ్య
తమ్ములతోడను - తల్లులతోడ
నేమందు నితనికై - నీయఁ బ్రాణములు
నాముందఱ నితండు - నాగ పాశములఁ

గట్టులు వడియుండఁ - గనియును బ్రాణ
మెట్టు నిల్పుదు మేన - నిఁక క్షణంబైన
ఱేపు మాపులు కుర - రీనివిహంబు
వాపోవుగతి శోక - వశయై సుమిత్ర
పలవింప నదివిని - ప్రాణముల్ దాల్పఁ
గలనె నాకొఱకు ల -క్ష్మణుఁ డిట్టులయ్యె
నీతని వెంటనే - నేఁగుదు నిపుడు
మాతండ్రిగాఁగ ల -క్ష్మణుఁ దలంపుదును.
ఈపాటు చూచియు - నిటులోర్చి యున్న
పాపాత్మునకు నాకుఁ - బరలోక మెద్ది?"
అని "వోయి ! లక్ష్మణ - యలసిన వేళ
నను సేదఁ చేర్చి మ - న్ననఁ బ్రోతు వీవు. 4320
ఇపుడేల పల్కవే - యెంత పిల్చినను
కపటాత్ముఁడని నన్ను - కడకుఁ ద్రోచితివొ ?”
అని "కంటి రే ! తమ్ము - నస్తాద్రి చేరు
వనజ బాంధవు రీతి - వైరులం దునిమి
యలసినగతి నమ - రావని యందు
బలగర్వముల మాసి - పడియున్నవాఁడు
నాదు దురాలోచ - నంబుల చేత
నీదెస వాటిల్లె - నెట్టి వానికిని
యలసత గనుపించఁ - డప్రియ వచన
ములు పల్కఁ డెపుడు చే - మొగిడించి నిలుచు 4330
నేనూరు బలుదూపు - లేక కాలమునఁ
బూను వింటను రయం - బుగ వైరిమీఁదఁ
గరలాఘవంబున - గా ర్తవీర్యునకు

సరిమీఱు వాఁడు ల - క్ష్మణుఁ బాయఁగలనె?
ఏల సంగర మింక - నిటుమీఁద లంక
యేలెడు రావణుఁ - డీ విభీషణుని
పట్టంబుఁ గట్టి చే - పట్టిన మాట
పట్టు దబ్బరయయ్యె - ప్రతినఁ దప్పితిని

-:రాముఁడు సుగ్రీవుని కిష్కింధకుఁ బొమ్మనఁ విభీషణుఁడు వానరులనాపి రామునివద్దకు వచ్చుట :-

ఓయి ! భానుజ ! మమ్ము - నురగ పాశములఁ
జేయాడ కుండంగ - క్షితిఁ బడ వైచి 4340
యీవార్తతోఁ బోయి - యింద్రజిత్తుండు
రావణునకుఁ దెల్ప - రణభూమి కతఁడు
రాకేలయుండు తా - రాకుమారకుఁడు
నీకుఁ దోడుగ నాంజ - నేయునిం గూడి
సేతువు జాడ కి - ష్కింధకుఁ బొమ్ము !
నీతోడఁగూడి య - నేక నాయకులు
వచ్చి మాకొఱకునై - వనరాశిఁ గట్టి
యిచ్చోటఁ జేసిర - నేక కార్యములు
దైవయత్నంబు ముం - దఱ నితరంబు
లేవియుఁ గొనసాఁగ - వేమి సేయుదును? 4350
చేరిపల్కినమాట - చెల్లించుకొంటి
వీరీతి నైన నీ - వేమి సేయుదువు ?”
అనిపల్కి "కపులార ! - యరమరలేక
తనవెంట వచ్చి యం - దఱును మాకొఱకు
మేనులు దాఁపక - మీరు మీ చేత

నైన యంతయు స - హాయతలు జేసితిరి.
ఇటమీఁద మా దుర - దృష్ట మిట్లైనఁ
గటకటంబడి మీఁదు - గాఁగలదేమి ?
పొండు మీమీ దేశ - ములకు నిచ్చోట
నుండు టేమిటి" కని - యుపచరింపుటయుఁ 4360
గన్నీరు రాలంగఁ - గవు లెల్లఁ జాల
విన్నఁ బాటున రఘు - వీరునిఁ గాంచి
వలదన్నఁ దొలఁగిపో - వను గాళ్లురాక
కలఁగుచు నుండఁగ - గదఁగేలఁ బూని
యచ్చటచ్చటి వాన - రావళినెల్ల
నెచ్చరింపుచు చాయ - నే తేఱఁజూచి
యదెవచ్చె నింద్రజిత్త - ని కపులెల్ల
చెదరి మున్ వచ్చిన - సేతువు జాడ
బరువిడ నిలుఁడని - భానుజుండరిగి
మఱలించి రామల - క్ష్మణుల సన్నిధికిఁ 4370
జేరి యంగదుఁ జూచి - "సేన లేమిటికి
బాఱెడు వీరికి - భయ మేల ? ” యనిన
నతఁడు “రాఘవులు నా - గాస్త్ర పాశముల
క్షితిమీఁదఁ బడుట వీ - క్షించుట" యనిన
"అది యేటిమాట ని - శాటుఁ డొక్కరుఁడు
గదవూని మనమీఁదఁ - గదలి రాఁజూచి
విచ్చి పోయెదనన్న - విని యంత చేర
వచ్చి రాత్రించర - వల్లభానుజుఁడు
పలుకరించుటయుఁ ద - ప్పని జాంబవంతుఁ
బిలిచి తెల్విడి జేసి - పేర్వేరఁ జేరి 4380

యందఱు నీవార్త - యాలకించంగ
మందలించి భయంబు - మాన్చి మఱల్చి


-:విభీషణుఁడు నాగపాశబద్ధుఁడగు శ్రీరామునిఁజూచి దుఃఖంచి సుగ్రీవుని సమాశ్వాసించుట :-

శ్రీరాము చెంత ని - ల్చిన విభీషణుఁడు
చేరి శిలీముఖ - శ్రేణిమై నాఁట
గాయంబులందు ర - క్తంబులు దొరగ
నాయత నాగ పా - శా వృతులగుచుఁ
గనుమోడ్చి పడియున్న - కాకుత్థ్సవంశ
వనజ బాంధవుల రా - వణ సహోదరుఁడు
కాంచి కన్నులనీరుఁ - గార శోకించి
యంచల నిల్చి చే - లాంచలంబునను 4390
మేనిండు రక్తముల్ - మెల్లనే యద్ది
చేనీట నేత్రరా - జీవముల్ తుడిచి
"అక్క ట ! యట్టిమ - హానుభావులను
దెక్కలి దాఁకె శో - ధించె దైవంబు
మాయన్న తనయుండు - మాయావి వీరి
నీయవస్థల ముంచె - నేమన వచ్చు?
రాముఁడీ లంకాధి - రాజ్యంబుఁ దనకు
నేమించె ననినమ్మి - నిజమని యుండి
తన యదృష్టంబు చే - తన రాఘవులకు
ననిలోనఁ దీఱని - యాపదవచ్చె 4400
చెల్లించుకొనియె తాఁ - జేసిన ప్రతిన
బల్లిదుండైనట్టి - పంక్తికంధరుఁడు

నతని కోరిక లెల్ల - ననుకూలమయ్యె
ప్రతిపక్ష మణఁగె దా - పాపకర్ముఁడను
తనకేది దిక్కని ” - తపియింపు చుండ
గని వాలితమ్ముఁడుఁ - గౌఁగిటఁ జేర్చి
కన్నీరు దుడిచి గ- ద్గద కంఠుఁడగుచు
విన్నవానరు లెల్ల - వినుతించఁ బలికె
"ఇంతయేఁటికి నీకు - నేమిటఁ గొఱత
చింతిల్ల మనకేల -శ్రీరాముఁ జూచి 4410
జానకీ రమణుఁడు - సహియించె గాక
యీ నాగపాశంబు - లివి యేమి సేయు?
ఇదె సేదఁ దేఱెడు - నినుఁ డుదయింపఁ
గదనంబులో దశ - కంధరుఁ దునిమి
యీలంక నీకిచ్చి - యిల పత్నిఁగూడి
యేల నున్నాఁడు మ - హీచక్ర మెల్ల
మనవంటి వారల - మనసులఁ జూడఁ
గనుమూసి యున్నాడు - గాక రాఘవుఁడు!
దొడిగిన యొకకోలఁ - దునుమఁడే యలిగి
గడియలో మూఁడులో - కములు చూర్ణముగ 4420
రాఘవామోఘ నా - రాచ ధారలకు
"మేఘంబు లడ్డమే - మేఘముల్ మఱుఁగు
చేసి నిల్చిన యింద్ర - జిత్తునిఁ దునుమఁ
గోసలేంద్రునకు నె - క్కుడు ప్రయోజనమె ?
ఏమి చింతించెనో - యిటులున్నవాఁడు
రాముఁ డీమీఁద స - ర్వము నెఱింగెదవు"

అని చెలికాని నూ - రార్చి సుషేణు
గనుఁగొని యా రుమా - కాంతుఁ డిట్లనియె.

-: సుగ్రీవుఁడు సుషేణునితో రాముని కిష్కింధకుఁ గొనిపొమ్మని చెప్పుట :-

"కలనిలోఁ బడిన రా - ఘవుని గాత్రములు
నలఁగఁగానీక యం - దలములో నుంచి 4430
యెత్తించుకొని యేఁగు - మీవు కిష్కింధ
కిత్తరి కపివీరు - లేనునుఁ గూడి
రావణుఁ జంపియా - రాజ్యాధిపత్య
మావిభీషణునకు - నిచ్చి వచ్చెదను.
పంతమాడిన యట్లు - పలుకు చెల్లింతు
నింత వైదేహినే - నిత్తు రామునకు
బోయలఁ బిలిపించు - పొమ్మ”న్న నతఁడు
చేయియోడ్చి వనాట - శేఖరుఁ బలికె

       -: సుషేణుఁడు చంద్రద్రోణనగమునందలి, విశల్యసంజీవకరణులను
             హనుమంతునిచేఁ దెప్పింపుమని సుగ్రీవునిఁబ్రార్థించుట :-

తొల్లి సురాసురో - ద్ధురసమరముల
బల్లిదులగు దైత్య - పతులచే మడియు 4440
సురలను బతికింప - సురలోక గురుఁడు
వరమతియైన ధ - న్వంతరిచేత
విని మున్ను మధియించు - వేళ నాక్షీర
వనరాశి నౌషధ - వ్రాతంబు వొడమ

దాచియున్నట్టి చం - ద్రద్రోణ నగస
మీచీన కటక స - మీపంబులందుఁ
గరమొప్పిన విశల్య - కరణి సంజీవ
కరణులఁ దెప్పించి - కాచె వేల్పులను.
ఆ యౌషధంబు లీ - హనుమంతుఁ బనిచి
యాయనవెంట మ - హావానరులను 4450
పనససంపాతులఁ - బనిఁగొమ్ము క్షీర
వనధి కావన మెల్ల - వా రెఱుంగుదురు
సాధించి యౌషధా - చలమహౌషధులు
శోధించి యంజన - సుతుఁడుఁ దేనోపు
నందుచేతను మన - యాపదల్ దీఱి
కందుము రామల - క్ష్మణుల సేమములు
నితరులచేఁ దీఱ - దీపని యన్న
నతని మాటలు విని - యర్క నందనుఁడు
హనుమంతుఁ బిల్చి యా - యర్థ మేర్పఱచి
చనుము నీవని పల్కు - సమయంబు నందు 4460

-: గరుత్మంతుని యాగమనము - శ్రీరాముని నాగపాశములు విడిపోవుట :-

భోరున సురదుందు - భులతోడఁ గూడి
యారావ మొకటి మి - న్నంతయు నిండె
నామహాధ్వని వెంట - నతుల ప్రచండ
భీమవాయువు మేఘ - బృందంబుఁ దరిమె
నావాయువుల చే మ - హాంభోధి యూర్ము
లీవలావలగాఁగ - నెడమిచ్చి తొలఁగె

నాతొలకులఁ దోచు - నహుల రాక్షసులు
పాతాళబిలములోఁ - బడి మాటు గొనిరి.
అంతట నుదిత నూ - ర్యానలరోచి
మంతుఁడై యాగరు - త్మంతుండు వచ్చి 4470
సాక్షాత్కరించిన - సమయంబునందు
రక్షోధి వరకుమా - రక వినిర్దిష్ట
పన్నగాయత మహా - పాశముల్ చెదరి
కన్నత్రోవలఁ బారెఁ - గనుమాయ మగుచుఁ
గట్లూడి నంత రా - ఘవుల యంగములు
కొట్లుబ్బసము మాని - కొంత దెప్పిరిన
దివ్య తేజోమూర్తి - దీన మందారు
నవ్యయ ఛందోమ - యస్వరూపకుని
వేదాంగు వేదాంత - వేద్యు నక్షరుని
నాదిపురుషు సహ - స్రార్క సంకాశు 4480
వైనతేయుని గాంచి - వనచరలెల్ల
మానసంబున భీతి - మట్టుమీఱంగ
నందఱుఁ బరువిడ - నండజస్వామి
కుందనంబుల నిగ్గుఁ - గురియు ఱెక్కలను
రామలక్ష్మణుల గా -త్రంబులు నిముర
సామున్నె వారి గా - యము లెల్ల మానె
సుఖనిద్రలు దొరంగి - చూచిన యట్ల
సుఖులౌచు దశరథ - సుతులు కన్దెఱచి
మున్నటికన్న మో - ములు వికాసంబు
వన్నె మేనులును దై - వారి యిర్వురును 4490

ద్విగుణిత జవసత్త్వ - తేజ ప్రతాప
జగదభినుత మూర్తి - శాలులై యెసఁగఁ
గరముల చేత రా - ఘవులఁ దానెత్తి
గరుడుండు నిండారఁ - గౌఁగిటఁ జేర్చి
గారవించుటయును - ఖగరాజు మోము
శ్రీరామచంద్రుఁడీ - క్షించి యిట్లనియె.

-:శ్రీరాముఁడు నాగపాశవిముక్తుఁడై గరుత్మంతుని యాకారమును వర్ణించి యాతని యుదంతమరయుట:-
 

"మీరెవ్వరయ్య ? య - మేయ కారుణ్య
నీరాకరులు నేఁడు - నీరాక చూడ
మాతండ్రి దశరథ - మండలాధీశు
మా తాత మనువంశ - మణియైన యజునిఁ 4500
గనుఁగొన్న యంతటి - కన్న సంతోష
మినుమడించెను మమ్ము - నింద్రజిత్తుండు
బంధించు నీనాగ - పాశముల్ ప్రాణ
బంధుఁడవై వచ్చి - పరిహరించితివి
హీరకిరీటంబు - హేమాంబరంబు
గారుత్మతోత్పల - గ్రైవేయకంబు
రత్నకుండలములు - రాజీవరాగ
నూత్నమంజీరమ - నోహరాంఘ్రులును
మౌక్తిక తూలికల్ - మాణిక్య కవచ
సక్తమై మించు వి - శాల వక్షంబు 4510
మరకత కేయూర - మంజుబాహువులు
నరుణపక్షములు చం -ద్రాననాబ్జంబుఁ

గరుణావలోకముల్ - కంబు కంధరము
నరుణపల్లవ కోమ - లాగ్ర హస్తములు
దుందుభిస్వనము ల - త్తుక చాయ మేను
మందర మేరు స - మానగాత్రంబు
లలితోర్ధ్వపుండ్ర ల - లాటపట్టికయు
సెలవులఁ దేఱెడు - చిఱునవ్వు గలిగి
భానుకోటి ప్రభా - భవ్య తేజమున
నానందకరమూర్తి - నవతరించితివి. 4520
యీదివ్యపురుషుఁడ - వెవ్వండ”వనిన
వేదాంగుఁ డారఘు - వీరునకనియె.

-: గరుత్మంతుఁడు తనవృత్తాంతము శ్రీరామున కెఱింగించి,యాతఁడు జయమునొందునని దీవించి
                    యంతర్థానముఁజెందుట :-

" రామ ! యేనీకు పో - రాని యాప్తుఁడను
సేమంబుఁ గోరిన - చెలికాఁడ నెపుడు
వైనతేయుఁడను రా - వణకుమారకుఁడు
హీన బుద్ధిని మిమ్మ - హీన పాశములఁ
గట్టి జయించి లం - కకుఁ బోయినట్టి
పట్టున నివి వచ్చి - పరిహరింపంగ
నజహరీంద్రాదుల - కైన దుర్లభము
భజియించి యేను మీ - బంటనై యునికి 4530
నిదె నా మనంబులో - నెఱిఁగి వచ్చితిని
యుదయాచల ప్రాంత - మునికి నాకెపుడు
రాక్షసుల్ మాయాప - రాయణుల్ సమర

దక్షులు వారు యు - ద్ధములు సేయుచును
వంచనోపాయులై - వర్తింతురెఱుఁగ
రించుకయును మీర - లెద కపటములు.
ఎచ్చరిక మెలంగి - యేరీతి మోస
పుచ్చఁ జూచిన బేలు - పోవక యుండి
జయమందుమని రామ - చంద్రుని మఱల
బ్రియముతోఁ గౌఁగిటఁ - బెనచి లాలించి 4540
పగవానినైనఁ జే - పట్టి రక్షించు
జగదేక కారుణ్య - శాలివి నీవు
శాంతమూర్తివి సత్య - సంధుండ విహితు
లెంతవారైన ని - న్నెదిరింపలేరు.
రావణుఁడెంత శ - రంబొక్కటేర్చి
కావలసిన ద్రుంపఁ - గలవు విశ్వంబు
నాతోడి చెలిమి కొ - న్నాళ్ల కుమాటు
సేతువుగాని నీ - చిత్తంబులోనఁ
బ్రకటంబు సేయక - పనుపుము నన్ను
నొక రెరుంగక యుండ - యుచితం బెఱఁగి 4550
యామీఁద దెలిసెద - వంతయు రాజ
సామాన్యబుద్ధి యి - చ్చట నున్కి హితము
పరమధార్మికుఁడ వీ - పంక్తికంధరని
శిరములు రాక్షస - శ్రేణులతోడ
నఱికి వైచెదవు జా - నకిఁగూడి నీవు
మఱలి యయోధ్య సే - మములు గాంచెదవు
వలసిన యప్పుడే - వచ్చి నీవేమి
దలఁచిన యేనె సా - ధకుఁడఁగాఁగలను

పోయివచ్చెద నను - పుము వార్ధి భయద
సాయక శ్రీరామ - చంద్ర ! నీవాఁడ ” 4560
అని ప్రదక్షిణముగా - నంజలితోడ
నినుమాఱు తిరిగి తా - నిరుగేలుసాఁచి
క్రమ్మర మనసారఁ - గౌఁగిటఁ జేర్చి
నెమ్మోముఁ జూచి మ - న్నించి దీవించి
కపులెల్ల జూడంగ - ఖగరాజు మింటి
కపుడు ఱెక్కలతోడి - యమరాద్రి యనఁగ
రివ్వున నెగరి య - దృశ్యుఁడై చనిన
నవ్వేళ నలుగడ - నగచరో త్తములు
రావణానుజుఁడు చే - రఁగ వచ్చి తమదు
భావంబులో నాగ - పాశబంధములు 4570
వదలి బొడగ పుష్ప - వంతులఁబోలి
సదమల మూర్తులై - సమరయత్నంబు
సేయు రాఘవుల నీ - క్షించి యుప్పొంగి
కాయముల్ కొండల - గతివెచ్చు పెరుగ
వాలంబు లార్చుచు - వారిదధ్వనులఁ
బోలు నార్పులు పెడ - బొబ్బలు నిగుడ
గిరులును తరువు లం - కించి యాలంక
తిరువవారుక తొంటి - తెఱఁగున బలిసి
కాహళపణవ శం - ఖమృదంగ నినద
మాహరిదంతంబు - లల్లికొనంగ 4580
ముత్తిక గాఁ దిగి - ముక్కాక చేసి
హత్తివాకిళు లెల్ల - నాక్రమించుటయు

-: రావణుని యనుమతిని ప్రహస్తుఁడు పంపిన వేగులవారువచ్చి రామలక్ష్మణులు నాగపాశములు
                          వీడినయుదంతము చెప్పుట :-

నాసద్దు విని రావణా - సురఁడులికి
మోసంబు వచ్చె రా - ముని కొక్కటైనఁ
గపుల కీయగ్గలి - కలు రావుగాన
విపరీత మది నీవు - వేగుల చేతఁ
జూపింపుమని ప్రహ - స్తునిఁ జూచి పలుకఁ
జాపల్యమున వేగఁ - జని దైత్యమంత్రి
తగినచారులఁ బిల్చి - దశరథాత్మజులు
తెగి పడ్డ సమరవీ - ధికి మీరు పోయి 4590
వారి చందంబు స- ర్వముఁ జూచి మఱలి
యీ రేయి రండన్న - నేగి వారలును
నచ్చటి వృత్తాంత - మరసి యాక్షణమే
వచ్చి దశానను - వదనంబుఁ జూచి
"దేవ ! బల్ నిగళముల్ -ద్రెంచుక మదము
లో విహరించు సిం - ధురములో యనఁగ
నాగపాత నిబంధ - నమ్ములు దొలఁగి
జాగరూకత రామ - సౌమిత్రులెలమి
నున్నవార" న దిగు - లొంది యామాట
విన్నయప్పుడు మోము - వెల వెలఁ బాఱ 4600
నిఁకనేటి మాట యా - యింద్రుఁడు నేను
నొకనాడు సరిఁబడ - యుద్ధంబుచేసి
యతనిచేఁ దగిలిన - యప్పుడు గాచె
నితనిచే నున్నయ - హీన పాశములు
నాచెఱ విడిపించి - నాఁడింద్రుఁ బట్టి

చేచేతఁ దానింద్ర - జిత్తుండు దెచ్చె
నతనికి వరదత్త - యైన యస్త్రౌఘ
మతులంబు విడిపింప - నజుని చేఁగాదు.
అజుని పౌత్రుని గెల్చి - రని విన్నయపుడె
విజయ మేడదియో వి - వేకించి చూడ 4610
నిదియె ప్రమాణ మే - నెదిరి యోడుటకుఁ
గదనంబులోన రా - ఘవుని గెల్చుటకు?"

-: రావణుఁడదివిని ధూమ్రాకుని యుద్దమునకుఁ బొమ్మనుట :-

అని విచారించి ధూ - మ్రాక్షునిఁ బిలిచి
యనికేఁగు మీవు బొ - మ్మని పంచుటయును
జేమోడ్చి మఱి - యిల్లుచేరక సమర
సామగ్రితోడ ని - స్సాణముల్ మొరయ
పటహభేరీశంఖ - పణవాదికములు
భటకోటి కలకలా - ర్బటి నింగి ముట్ట
కాంచనమణిభాండ - కలిత ఖరోష్ట్ర
కాంచిత రథమెక్కి- - యసిగదాముసల 4620
ధనురస్త్రములఁ దాల్చి - దనుజసైన్యంబు
తనవెంటఁ గొలువ ను - త్కట కోప శాత
తామ్రాక్షుడగుచుఁ బ్ర - ధానులు దాను

-: ధూమ్రాక్షుడు వెడలి హనుమంతునితో యుద్ధము చేయుట :-

ధూమ్రాక్షుడాహవ - దుర్వార లీల
పడమటివాకిట - బలములు దాను

వెడలివానరు లెల్ల - విరియఁ బాఱంగ
రామదివ్యాస్త్ర సం - రక్షితులైన
మర్కటులఁ దోలి - హనుమంతుమీఁద
చేరరా నాతని - సిడముపై వ్రాలె
గారు కూఁతలనంత - గ్రద్దలుధ్ధతినిఁ 4630
గొన్ని మబ్బులు పిడు - గుల వానగురిసె
మిన్నున వారిపై - మిణుఁగురుల్ వ్రాలె
నిండగ వర్షించె - నెత్తురు జల్లు
మొండెంబు లాసేన - ముందఱ బడియె
నవి సడ్డసేయక - యలఘువర్గమునఁ
బవననందను మూఁక - పైఁదేరుఁ ద్రోలఁ
గపులు మహీరుహా - గ్రావముల్ దాల్చి
కుపితాత్ములగుచు ను - క్కోలుగాఁ గవిసి
దనుజ వీరుల దాఁకి - తమచేత నున్న
మునుపటి సాధన - మ్ములు సెలవైన 4640
పిడికిళ్ళ గుద్దియుఁ - బెరికి మోకాళ్ళఁ
బొడిచియుఁ గోఱల - బోరల చించి
పడద్రోఁచియును వాల -పాశవల్లరుల
మెడలంట జుట్టి భూ - మినిఁ బడనీడ్చి
బిరబిర ద్రిప్పియా - భీలసత్త్వమున
శరధిలో వైచియుఁ - జరణఘాతముల
గులగులల్ గాఁ దన్ని - కుంభినివైచి
పొలియునప్పుడు కపుల్ - భుజశక్తిఁ జూపఁ
గరవాల ముసల ము - ద్గర భిండివాల
శరకుంత తోమర - శ క్తులచేతఁ 4650

గపుల నొప్పించి సం -గ్రామరంగంబు
నిపుణులకును వర్ణ - నీయమై మించె.
వింటి యల్లెలమ్రోఁత - వీణారవంబు
నంటుగా హుంకర - ణములు తాళముల
సెలవుగా నుప్పొంగు - సింహనాదములు
విలసిల్లు నాలాప - విభవంబు గాఁగ
దట్టించు పలుకులు - తప్పెటల్ గాఁగ
నట్టిచో గీత శా- స్త్రాను కారముగ
విలసిల్లు ధూమ్రాక్షు - విశిఖపాతములు
గలగుండు వడిక పుల్ - కలఁగిపాఱుటయుఁ 4660
దనవారి నొంచు దై - త్యశ్రేణిఁ దఱిమి

-: ధూమ్రాక్షుని హనుమంతుఁడు చంపుట :-

హనుమంతుఁ డొక్కమ - హాశైలమెత్తి
యదలించివ్రేయ ధూ - మ్రాక్షుండు పుడమి
కలఁగ గుప్పించియా - కడకు దాఁటుటయు
సారథితో రథ్య - సమితితో రథము
ధారుణిఁ గలసినఁ - దాపోక నిలిచి
గదవూని మిగులనా - గ్రహముతోఁ దనకు
నెదిరింప గిరిశృంగ - మెత్తి వాయుజుఁడు
వ్రేసిన నది దైత్య - వీరుని మకుట
భాసమానంబైన - భయద మస్తకముఁ 4670
జదియించి మహిగూల - సమసిన వానిఁ
గదనంబులోఁ జూచి - కడమ రాక్షసులు

పవమానతనయు మా - ర్వడ లేక తిరిగి
జవమునఁ బరువిడ - జయశాలి యగుచుఁ
దనవారిఁ బశ్చిమ - ద్వారమానించి
తనివోని సమరయ - త్నమున నున్నంత
హత శేష దానవు - లసురేంద్రుఁ జూచి
హతుఁడయ్యె ధూమ్రాక్షు - డని పల్కుటయును

-: రావణుని యాజ్ఞచే వజ్రదంష్ట్రుఁడు యుద్దమునకు వెడలి యంగదు నెదుర్కొనుట :-

వజ్రముఖామర - వ్రాతదుర్జయుని
వజ్రదంష్ట్రుని నాహ - వజయాభిరతుని 4680
రమ్మని నీవేఁగి - రాముని నతని
తమ్ముని గోతులం - దఱిమి జయించి
మఱికాని లంకకు - మఱలకు మనుచు
నెఱిఁగించి యుడుగర - లిచ్చి పొమ్మనినఁ
గాలకాలుని రీతి - కలహంబులకును
గాలుద్రువ్వుచు నుండుఁ - గాన వాఁడలిగి
తనదు రాక్షసుల నం - దఱ బారుదీర్చి
కనఁగన వెలుఁగు బం - గరు తేరుఁ దేర
వలవచ్చి తానెక్కి - వైడూర్యవర్మ
కలితుఁడై మ్రోల హె - గ్గాళెలు మొఱయ 4690
దర్పించి దక్షిణ - ద్వారంబు వెడలి
యార్పుల చేత బ్ర - హ్మాండమ్ము వగులఁ
దనవారితో నంగ - ద కుమారుమీఁదఁ
గినిసి మార్కొను వేళ - కీడెచ్చరించు

నపశకునములు గో - రంతయు మదినిఁ
దవులనీయక విధి - తను బెడఱేఁపఁ
గనిపించు కొనుటయుఁ - గపు లెదిరించి
దనుజులసేనపై - ధరనగావళులు
వ్రేసిన దానవ - వీరులు గినిసి
ప్రాసతోమరకుంత - బాణ పాతముల 4700
వనచరులను ద్రుంపు - వారివీరికిని
బెను గయ్య మంటిన - పిఱుఁదీక పోరఁ
గపులు శిలాతరు - గ్రావాళితోడ
విపులపైఁ బడ దైత్య - వీరులమీఁద
ధవళాతపత్ర కే - తన ధనురస్త్ర
నివహకోటీరమ - ణీ భూషణముల
రాక్షసుల్ గూలిన - రణభూమి యపుడు
లక్షింప తిలతండు - లన్యాయమగుచు
శారదసమయని - శానభోలక్ష్మి
మేరఁ జూపఱకెల్ల - మెచ్చొదవించె. 4710
కపుల తేజమునకుఁ - గాక రాక్షసులుఁ
దపియించుటయు వజ్ర - దంష్ట్రుండు గినిసి
విల్లు మోపెట్టుచు - వెండి యంగదుఁడు
త్రుళ్ళడగింతు కోఁ - తులఁద్రోలు టెంత
యన విని కపి సేన - నదరకుండనుచుఁ

- : అంగద వజ్రదంష్ట్రుల యుద్ధము : -

గనకమణీ మయాం - గదుఁ డంగదుండు
అద్దిరా ! యితని బా - హా టోపమనుచుఁ

బెద్దకొండయగల్చి - పెకలించివైవ
యది తేలివచ్చి మి - న్నంతయు నిండి
కదియరా దనుజుండు - కాండత్రయమునఁ 4720
బొడి చేసి యావాలి - పుత్రునిమేను
పిడుగులవంటి య - భేద్య బాణముల
నెత్తురు జొత్తిల - నిండ వర్షింపఁ
జిత్తంబులోన మె - చ్చి తదీయమైన
భుజశౌర్య మహిమముల్ - బొగడుచు నుండ
రజనీచరుండు శౌ - ర్యంబ వార్యముగ
నంగదు మొనకు తో - డై వచ్చి యెదుర
సంగర నిపుణుల - సమద వానరుల
మొనసి యిర్వదియొక్క - మొనలవానరులఁ
దునిమి లక్షకునొక్క - దొరయైన కపులు 4730
నెనబండ్రు నిలఁబడ - నేసిన వాలి
తనయుఁడుద్దతి వజ్ర - దంష్ట్రుపై గినిసి
వేఱొక్కకొండ బ - ల్విడి నేయ నతఁడు
తేరుపై నుండక - దిగ్గున దుమికి
తొలఁగిన నరదంబు - తో నది వడిఁన
దలఁగిపోవక గదా - దండంబు త్రిప్పి
యంగదు పేరెద – యదరంట వ్రేయ
చెంగక వానర - సింహశాబకము
దానవాధిపుఁ గర - తలము చేఁ గడల
వానరుల్ వొగడ బ - ల్విడి గొట్టుటయును 4740
నాపెట్టు వడియు మ - హానిశాచరుఁడు
కోపంబుతోఁదార - కొడుకుతో నెదిరి

యిరువురు సరివోరు - నెడ మల్ల చఱచి
పిఱుదీకవడి గండ - భేరుండయుగము
పోరాడుగతి పోరు - భూరిసత్త్వములు
ఘోరసంగరము మి - క్కుటముగాఁ జేయఁ


-: అంగదుఁడు వజ్రదంష్ట్రునిఁజంపుట :--

గదిసి వోరుచు బుధాం - గారకులట్ల
సదమదంబుగను ము -ష్టా ముష్టి పెనఁగి
యన్యోన్య జయకాంక్షు - లై యప్రమాణ
మన్యులై వోరుచు - మహినివ్రాలుచును 4750
లేచుచునుండ వా - లితనూజు నురము
మోచేతఁ బొడిచిన - మోకరింపుచును
పెట్టుబడ్డ మహాహి - పెక్కువతార
పట్టియొక్క నగంబు - పట్టిరాఁజూచి
యరిగెయుఁ గత్తియు - నందుక వాఁడు
దురదురవచ్చి స - త్తువకొద్ది నేయఁ
జెట్టువైచినఁ గత్తి - చేనది దునుమ
నట్టిచో నలిగి మ -హాసత్త్వశాలి
వాలిసూనుఁడు దాన - వకరాగ్ర హేతి
చేలాగుచే తన - చేత నంకించి 4760
దారిగా నలవజ్ర - దంష్ట్రుని శిరము
ఘోరాజిఁ బడ తెగఁ - గొట్టి యార్చుటయు
వానరులా వెంట - వచ్చినయట్టి
దానవావళి నెల్లఁ - దరిమి చంపుటయుఁ

జావుకు దప్పి రా - క్షసుఁ డొక్కరుండు
రావణుఁ జేరి స - ర్వము విన్నవింప


            -: అకంపనుఁడు రావణు నాజ్ఞచే యుద్దమునకు వెడలుట :-

"ఎక్కడివానర - లీపాటి పోటు
రక్కసులను జంపి - రామ కార్యంబుఁ
జేకూర్చుటెక్కడ - చింతించిచూడ ?
ఏకైవడి జయింతు - నెవ్వనిఁ బిలిచి 4770
పంపుదు” నని “యకం - పనుఁ డున్న వాఁడు
చంపింతు రామల - క్ష్మణుల కోఁతులను
తామసించక తమ – దైత్యులఁ గూడి
రాముని పైఁ బంపి - రమ్ము నీవనుచు
దళవాయితోఁ బల్క - దశకంఠునాజ్ఞఁ
దలమోచిపోయి యం - తయు నెఱిగింప
నాయకంపనుఁడు మ - హారథంబెక్కి
యాయత బాణ బా - ణాసనావళులు
ధరియించి సేన ముం - దఱ నెచ్చరించి
పురికొల్పి యాహవం - బునకు నేతేర 4780
నెడమ కన్నదిరె నీ - రెలుగు వాటిల్లెఁ
బడియెఁ గేతన మశు - భమ్ములు దోచె
దుర్నిమిత్తంబులు - దోఁచిన చావు
నిర్ణయించుక వాఁడు - నిశ్శంకవృత్తి
గలనికి నడచిన - కపులు రాక్షసులు
తలపడి ఘోరయు - ద్ధము సేయునపుడు
చిమ్మచీకటి గ్రమ్మె - సేనల రవళి

దుమ్ముపై నెగసి రో - దోవివరంబు
నిండిన నిరువాగు - నిబిడ రజప్ర
కాండంబులో కండ్లుఁ - గానక భ్రమసి 4790
గపులను గపుల రా - క్షసుల రాక్షసులు
నపుడు చంపుచు నట్ట - హాసముల్ సేయ
నదియును విననీక - యపుడు ప్రచండ
పవమానములునా న - భమునాక్రమించె
నితరరేతరము వోక - నిందునందునను
జతగాఁగ నెత్తురుల్ - జగతిపైఁ గురియ
గాలిచేఁ గొంత ర - క్తంబులు గొంత
తేలియు నడఁగియు - తిమిరముల్ విరియఁ
బెంధూళియడఁగిన - పెడబొబ్బలిడుచు
సంధత మాని గ - ర్వాంధులై కినిసి 4800
వానరులును దైత్య - వరులును కపులు
దానవులకు భుజ - దర్పముల్ మెఱసె
చంపునప్పుడు రాక్ష - సస్వామిచేత
బంపుపూనిన యకం - పనుఁడాగ్రహమున
నమ్ములవానచే - నగచరశ్రేణి
ముమ్మరంబంతయు - మొనఁదప్ప నేయ
వ్రీలిన కపులభా - వించి ప్రతాప
శాలులై నలరభ - సకుముదమైంద
కపియూధ వర చతు - ష్కము వానిమీద
విపులాధరంబులు - వృక్షముల్ వైచి 4810
వెంటవచ్చిన దైత్య - వీరుల నెల్ల
పంటించి చంపుచుఁ - బైకొనుటయును

జచ్చినతనవారి - జగడంబుఁ జూచి
రిచ్చపాటున నల్వు - రిని విలోకించి
పటుతరసమిదకం - పనుఁడకంపనుఁడు
కటములు గదల ను - త్కట శౌర్యుఁడగుచుఁ
దనసారథినిఁ జూచి - " తతిమీరి కపులు
దనుజులనెల్ల ర - థంబు వోనిమ్ము
ఆమూఁకపై ” నన్న - నతఁడట్లసేయ
భీమబాణాసనా - భీల నిర్ముక్త 4820
సాయకనిబిడ వ - ర్షంబు చేఁ గపుల

-: అకంపనుఁడు హనుమంతునితో యుద్దమొనర్చుట హనుమంతుఁడఁపనునిఁ జంపుట :-

మాయించుటయు హను - మంతుఁడు జూచి
బలుగొండ యొకటి చేఁ - బట్టి కల్పాంత
జలజాప్తసుతుని యో - జను మిన్నుముట్ట
పైపైనిరా నకం – పనుఁ డర్ధ చంద్ర
రోపంబుచే తస - రూపంబుగాఁగఁ
జేనున్న శైలంబు - చిద్రువలైరాలఁ
గానేయుటయుఁ బ్లవం - గ దివాకరండు
గ్రక్కున నొక్కయశ్వ - కర్ణభూరుహము
రక్కసులకు కాళ - రాత్రియనంగఁ 4830
బెకలించికొని బిర - బిరఁద్రిప్పికొనుచు
నొకనిఁబోనీక దై - త్యుల పీఁచమడఁచి
తనమీఁద రాఁగ నిం - తయు లెక్క గొనక
పెను దూపులను గాడ్పు - బిడ్డలనిమేన

జొత్తు పాపనుబోలఁ - జూపర మెచ్చ
నెత్తురులను ముంప - నివ్వెఱగంది
పట్టిన చెట్టుచే - పరియలువారఁ
గొట్టె వానిశిరంబు - కుంభినిఁగూల
నాయకంపనుని పా - టమరలు చూచి
చేయెత్తి జయజయ - శీర్నుతుల్ సేయ 4840
రామ సౌమిత్రులు - రవికుమారకుఁడు
ప్రేమతోఁ బొగడ వి - భీషణుండెదురు వ
చ్చి గౌఁగిటఁ జేర్ప - వాయునందనుఁడు
హెచ్చైన గెలుపుతో - నిచట నున్నంత.

-: ప్రహస్తుఁడు యుద్ధమునకు వెడలి దుర్నిమిత్తములం గనుట :-

బల్లిదుండగు నకం - పను చావు భీతిఁ
దల్లడిల్లుచుఁ బాఱి - దనుజేంద్రుతోడ
హతశేషు లెఱిఁగింప - నదివిని క్రోధ
మతిశయింపుచును ద - శాననుండలిగి
తగినట్టి పడవాళ్ళఁ – దనకోడ పదిల
మగునట్టి వృత్తాంత - మరయంగఁబనిచి 4850
కొలువు సావడికి న - ల్గురు సతుల్ వెంట
గొలువఁ దావచ్చి సి - గ్గున తెంపు మఱచి
దళవాయి పెద్దప్ర - ధానుఁ డా ప్తుండు
కులవృద్ధుఁడును నీతి - కోవిదుఁడైన
సురకంటకుని ప్రహ - స్తునిఁజూచి కాల
మరికట్టుకొనిన ద - శాననుం డనియె

"బలి వామనునికి లోఁ - బడిన చందమున
బలవంతుఁడగు నకం - పనుఁడు వాయుజుని
కెదిరించి పోరిలో - నీల్గిన యపుడే
కొదవ దైత్యులును మ్ర - గ్గుట నిక్కువంబ 4860
యైన నేఁబూనిన - యట్టి కార్యంబు
మానుదునే యభి - మానంబు మాని ?
ఏనొండె నీవొండె - యింద్రజిత్తుండు
తానొండె నా పెద - తమ్ముఁడొండేని
కలనికిఁ బోవలె - గాక యన్యులకుఁ
దలచూపరాదు సీ – తాకాంతు నెదుర
నానాట హితుఁడవై - నామేలుగీళ్ళ
లోనైన వాఁడవై - లోకంబులందు
నెనలేని మగటిమి - నెసఁగిన నీవె
చనుటొప్పు వానర - సమితిఁ ద్రుంపుటకు 4870
నెవ్వానిఁ బనిచిన - నేఁగుటేకాని
చివ్వకుఁ బోయి వ - చ్చినవాఁడు లేడు.
నీవైనఁ గెలిచి రా - నేర్తువు నిన్ను
దేవతలైన నె - దిర్చి పోలేరు
పోవంటివేని త - ప్పునె విధివిహిత
మైనయర్థంబు నీ - వని కేఁగితేని
యచ్చటి విజయంబు - నపజయంబొకరి
యిచ్చరాదది నిశ్చ - యింపంగ రాదు
చాలంగ మదిని యో - జన చేసి నీవు
నేలీల సరిపోయె - నిదికార్య మనుము 4880

సూచింపుమనఁ బ్రహ - స్తుఁడు దశాననునిఁ
జూచి విచారించి - శుక్రుండు మున్ను
పామరుఁడగు వృష - పర్వునితోడ
సామోక్తులాడిన - జాడ నిట్లనియె
"అయ్య ! నీసొమ్ము క - లంత కాలమును
నెయ్యంబున భుజించి - నేర్చిన మేము
జగడంబునకుఁ బోవఁ - జావకమాన
నగునె యిప్పుడు నిశ్చ - యంబైన యదియె
నెన్నడు జానకి - నియ్య నేననుచుఁ
బిన్న పెద్దన్న వి - భీషణుతోడఁ 4890
బలికితివోనాఁడె - బ్రతుకులమీఁదఁ
గలయాశ గంతయుఁ - గడకుఁ ద్రోచితిమి.
నీకునై పుత్రుల - నెలఁతలఁ బాసి
పోకార్చెదము ప్రాణ - ములు సంగరమునఁ
జెప్పిన యంతయుఁ - జెల్లింతు ననుచు
నప్పుడె తనసేన్య - మంతయు నటకుఁ
బిలిపించి ప్రస్థాన - భేరి వ్రేయించి
సలలిత దివ్యభూ - షణములు దాల్చి
హోమకార్యాదికం - బుర్వీసురాలి
యామున్నె కావించి - యాశీర్వదించి 4900
యక్షతలిడ నంది - యౌదల నుంచి
రాక్షసేంద్రుఁడు వంప - రణకౌతుకమున
ననుకూలమతి కుంభ - హనుమహానాదు
లన సమున్నతుఁడు న - రాంతకుఁడనఁగ
నలుగురు మంత్రులు - నలుగడఁగాచి

కొలువఁ బ్రహ - స్తుండు కోట వెళ్లుటయు
సమభూమి నురక య - శ్వంబులు మ్రొగ్గె
తెమలి చేనున్న హే - తి ధరిత్రిఁ బడియె
సారథి తరుటు మో - సము చేయివదలె
చేరువగాఁగ వ - చ్చెను జంబుకములు 4910
నంజుఁడు మెసవు నం - డజములు దిరిగెఁ
గెంజాయ గవిసె నిం - గి నకారణముగఁ
బుడమి నుల్కాజాల - ములు రాలె మిగుల
చెడునిమి త్తములు ముం - చెను రాక్షసులను
పాటించి చూడక - ప్రాగ్ద్వారరత్న
హాటకమయ కవా - టావళి గడచి
ధనువు మ్రోయించుచుఁ - దనమీద నడచు
దనుజనాయకుని ప్ర - ధాని నీక్షించి
యెవ్వఁడు వీఁడన్న - యెడ విభీషణుఁడు
దవ్వులఁజూచి చెం - తకుఁ జేరి పలికె. 4920
"దేవ! ప్రహస్తుఁడా - దిత్య దుర్జయుఁడు
రావణుమంత్రి ధై - ర్యవివేకశాలి
రావణుబలము స - ర్వము రెండుపాళ్లు
భావింప నీతని - బలమొక్కపాలు
నై యుండు లంక లో - నమరులు వీని
కయ్యంబునకు తలం - కని వారు లేరు
బలవంతుఁ” డనునంత - పర్వతవృక్ష
ములుదాల్చి వనచర - ముఖ్యులందఱును
నెదురుగాఁ బరువెత్తు - నెడ రాక్షసులకుఁ
గదనంబు వారితోఁ - గడు వ్రేకమయ్యె. 4930

-: ప్రహస్తుని యుద్ధ నై పుణ్యము :--

ఇరువాగు జగడించి - యిందు నందులను
సరిబాలుగా నీల్గు - సమయంబు నందుఁ
గోపంబున నరాంత - కుఁడు వనచరుల
నేపు మాయఁగఁ జంపి - యెదిరించి రాఁగ
కొండయొక్కటి కేలఁ - గొని ద్వివిదుండు
దండపూనిక నిల్చి - దర్పించి వేయ
నదిమీఁదఁ బడి యవ - యవము లన్నియును
జదిసి యేర్పడ రాక - సమసిపోఁజూచి
దుర్ముఖుఁడనెడు కోఁ - తులరాజు సమర
దుర్ముఖుని సమున్న - తుని నెదిరించి 4940
యొకచెట్టునే వ్రేయ - నొక్క పెట్టునను
పకపక కోతుల - పైకంబు నవ్వఁ
దలక్రిందుగాఁబడి - దైత్యులుబెదర
విలవిలఁ దన్నుక - విడిచె ప్రాణములు.
వంతులకై జాంబ - వంతుఁడు గినిసి
యంతకు బోలి మ - హానాదు మీఁద
గిరిశృంగ మగలించి - కెరలివ్రేయుటయు
సిరము పైఁ బడి వాఁడు - క్షితిమీఁదద్రెళ్లె.
తారుండు విక్రమో - దారుఁడై దీర్చి
యారూఢబలు కుంభ - హనుబోవనీక 4950
పట్టుక ధరణిపైఁ - బడవైచి మడత
వెట్టి వాని గళంబు - పెళ్లున విఱిచె
నపుడు ప్రహస్తుఁడా - యతదీవ్రహస్తు
డపరిమితాత్మ మా - యా ప్రశస్తుండు

దారుణాత్మీయ కో - దండదండమున
నారి సారించి బా - ణములు పూరించి
కపులపై లయకాల - కాలుఁడో యనఁగఁ
గృప లేక వధియింప - కీశపుంగవులు
పుడమిఁ ద్రెళ్లిలి రక్త - పూరంబు చాల
జడిగొని గురియ రా - క్షసుల నెత్తురులు 4960
నేకమై ప్రవహింప - నిరవాగు మూఁక
చీకాకుగా మడి - సిన జూడనయ్యె
పడియున్న వానరుల్ - పర్వతంబులుగఁ
బడగలు పాముల - పడగలుగాఁగఁ
దెగిన రక్కసులు ధా - త్రీరుహంబులుగఁ
బగులు తేరులు మహా - ప్లవములుగాఁగఁ
దొరగినయట్టి నె - త్తురులు నీరముగఁ
బరిపాటి మేదంబు - బలురొంపిగాఁగఁ
బుండరీకంబులు - పుండరీకముల
కండలు విరియు చెం - గలువలుగాఁగ 4970
జతవెల్లజల్లుల - చాలుఫేనములు
జతగూడు కేశముల్ - శైవాలములుగ
మేటి టెక్కెములు తాం - బేటి గుంపులుగ
గాటపుటమ్ములు - గండుమీల్ గాఁగ
నెత్తురుటేరులు - నీరాకరంబు
పొత్తుగూడిన రణం - బున యోధవరులు
రోఁదుచు మేనుల - రుధిరముల్ నిండ
నీఁదునాడుచుఁ బోరు - నెడ తేఱిచూచి

రావణుమంత్రి శ - రప్రకాండముల
లావులు చెడ కపు - లను మక్కుమార్ప 4980

-:నీలుఁడు ప్రహస్తు నెదుర్కొని యాతనిఁ బొలియించుట:-

వనచరులకు దళ - వాయి నీలుండు
కనుగెంపుఁగదుర నొ - క్కఁడు నెదురెక్కి
జగడింప నస్త్రవ - ర్షంబులు ముంచి
దగదొట్ట శోణిత - ధారలో ముంచి
శూరత్వమున ప్రహ - స్తుఁడు పచారింప
శ్రీరామభటుఁడొక్క - చెట్టు చేఁ బెఱికి
యదలించి వ్రేయ ప్ర - హస్తునితేరు
చిదురుపలై విల్లు - సిడమును విఱిఁగి
సారథి చచ్చి య - శ్వంబులు మడిసి
రారాని దురవస్థ -ప్రాప్తమౌటయును 4990
నిలమీఁదఁబడి లేచి - యెదలోని దిటము
చలము నగ్గలికయు - శౌర్యంబుమీఱ
గదకేలఁ గైకొని - గద్దించి నీలు
నెదురొమ్మును మొగమ్ము - నెమ్ములు విఱుగ
మోదుటయును గాత్ర - మున గదాహతిని
మోదులుగట్ట రా - మునిబంటు గినిసి
వానలో జడియక - వచ్చు నాబోఁతు
పూనిక నీలుఁడ - ప్పుడు చెట్టుచేఁత
గొట్టిన నది లెక్కఁ - గొనక ప్రహస్తుఁ
డట్టహాసము చేసి - యసురనాయకునిఁ 5000

జెనకు వృతాసురు - చెలువున చేతి
పెనుగదచే నొసల్ - బెట్టు గొట్టుటయు
గాలిచే సాలంబు- గదలు చందమునఁ
జాల గంపించి యె - చ్చరిక నేమఱక
చట్టు కేలఁ బెకల్చి - సారించి వ్రేయఁ
గొట్టుచేఁబడి గుట్ట - గొంకు బడ్డట్లు
నలినలియై వాఁడు - నలినాప్తసుతునిఁ
గొలువఁ బోవుటయు ర - క్షో వీరభటుల
నీలుఁడు తెగి చంప - నిలువక జలము
వేలంబు నెగఁబోవు - విధమునఁ జెదరి 5010
పారి రావణున కీపా - ట్లెల్లఁ దెలుప
వారి మాటలకు రా - వణుఁడు చింతించి
పైకార్యమునకు ను - పాయాంతరంబు లేక
తపించి జా - లినిఁ బొందునంత
నానీలు శౌర్యమ - హాంబుధి యిట్లు
జానకీపతి విభీ - షణ రవితనయ
సౌమిత్రి ముఖ్యులు - సంతోషమందఁ
జేమొగిడించి ని - ల్చిన నీలుఁజూచి
కపులెల్ల నుత్సాహ - కలితులై పొగడి
యపరిమితానందులై - యున్నయంత. 5020


--: రావణుఁడు యుద్ధమునకు వెడలుట :--

అచట రావణుఁడు రౌ - ద్రాకృతి చేత
నచలుఁ డై “ యౌర ! ప్ర - హస్తుఁడిన్నాళ్లు

నింద్రాదులను గెల్చు - నిప్పుడు రామ
చంద్రునిచే నప - జయము పాలయ్యె
నటువంటి మంత్రి లే - నట్టి యీ రాజ్య
మెటుఁబోయేనేమి యే - నేడిక మీఁద
వోవుదు రాముఁ జం - పుదుఁ గపులెల్లఁ
జావకుందురె నాదు - శరముల చేత ? ”
అని తలంచుక లేచి - యాప్తులై నట్టి
దనుజనాయకులు ప్ర - ధానులుఁ గొలువ 5030
విజయ భేరీశంఖ - వీరానకముల
గజగజ ధరణి యా - కంపంబు నొంద
మందర శై లోప - మానమైనట్టి
స్యందనం బెక్కి భూ - షణరుచుల్ నిగుడఁ
జతురంగ బలముల - సంఖ్యముల్ గాఁగ
జతగూడి వెంట రా - సారథితోడఁ
బౌరుషంబులు చాలఁ - బలుకుచుఁ బోయి
వారలు నుత్తర - ద్వారంబు వెడలి
దండి బారుల సము - ద్రము వెల్లివిరియు
మెండున దెగి తమ - మీఁద రాఁజూచి 5040
కపులు భీతిఁదలంకఁ - గాకుత్థ్సతిలకుఁ
డపుడా విభీషణు - నండకుఁ బిల్చి
"యెవ్వఁడీ వచ్చు న - హీన బలాడ్యుఁ
డెవ్వార లీదొర - లిందఱుఁగూడి
వచ్చెద"రన రఘు - వర్యునిఁ జూచి
సచ్చరిత్రుఁడు విభీ - షణుఁ డిట్లువలికె

 -: విభీషణుఁడు శ్రీరామునకు రాక్షససైన్యమునందలి మహానాయకులఁగూర్చి, రావణునిఁగూర్చి చెప్పుట:-

1. అకంపనుఁడు

"అయ్య ! యేనుఁగు బారు - లన్నియుఁ దనదు
కయ్యంబునకు నానఁ - గా సమకట్టి
గొప్పయేనుఁగుమీద - కుంభముల్ చేత
నప్పళింపుచు గుంకు - మాలేపనంబు 5050
పైనున్న చెంగావి - పటము కెంజాయ
తో నెనయంగ వ - ర్తుల లోచనములు
నిప్పులు రాలంగ - నిజబిరుదంబు
లుప్పతిలఁగ బట్టు - లుభయ పార్శ్వములఁ
దనవిజయాంక ప - ద్యంబులు చదువ
వినుచు ముందఱ వచ్చు - వీఁడకంపనుఁడు.


2. ఇంద్రజిత్తు

పంచానన ధ్వజపట - పటాత్కార
సంచలద్దశదిశా - చక్రుఁడై వెనుకఁ
గోఱలు మదదంతి - కొమ్ములతోడఁ
బోరామిసేయఁ జూ - పునమంటలెగయఁ 5060
గోటీరకుండల - గురురత్న రుచుల
హాటకగర్బాండ - మలమి కొనంగఁ
దేరిపై దమతండ్రి - దృష్టిమార్గమున
శూరత మనమీఁదఁ - జూపంగ వచ్చె
నింద్రుని చెఱసాల - నిడిన గర్వమున
నింద్రజిత్తనెడి వీఁ - డితని గన్గొనుము.

3. అతికాయుఁడు

విల్లింద్రధనువుతో - వీడు జోడాడ
నల్లె మీటుచు నట్ట - హాసంబుతోడ
నతికాయ విజితాంజ - నాచలుఁడైన
యతికాయుఁ డావచ్చు - నతనిఁ జూచితివె. 5070

4. మహోదరుఁడు

తాను సింగాణి పైఁ - దాల్చిన ఘంట
లేనుఁగు ఘంటలు - నేకమై మొరయ
దారుణతరమహో - దర మహోదరుఁడు
శ్రీరామ ! వాడె వ - చ్చెను విలోకింపు.

5. పిశాచుఁడు

పిడుగుకై వడి మేనఁ - బుట్టినయట్టి
తొడవులు మెఱువుల - తో వియ్యమందఁ
దురికి తురంగంబు - దుమికించుకొనుచు
సురమాయిజల్లు లం - చుల నెగయంగ
గబునితోడఁ గుళాయి - కశయాడనీక
యుబుకుచు కట్టిక - లోహోయనంగ 5080
నతిశయధారావి - హారియైవచ్చె
నతనిఁ జూడు పి - శాచుఁ డనువాఁడు దేవ !

6. త్రిశిరుఁడు

వృషభవాహనురీతి - వినుమోచి వచ్చు
వృషభంబుపై నెక్కి - విలుకేలఁ బూని

యమ్మేర్చి పట్టుక - యదే త్రిశిరుండు
కమ్ముకవచ్చె రా - ఘవ ! చూడు మతని.

7. కుంభుఁడు

కాకోదరధ్వజ - ఘంటికారావ
మూకీకృతసుపర్వ - ముఖ్యుఁడితండు
శూలమార్పుచు వచ్చెఁ - జూడుము జాన
కీలోల ! కుంభు స - కిల్బిషారంభు. 5090

8. నికుంభుఁడు

పరిఘంబు చేబూని - పలలాశులైన
దొరలెల్ల వీనిచేఁ - దోడాస వడఁగ
సింజిని మొరయ వ - చ్చెను నికుంభుండు
కంజాప్తకులదీప! - కనుఁగొమ్ము వీని.

9. నరాంతకుఁడు

శరచాపముద్గర - శక్తిత్రిశూల
కరవాల తూణీర - కవచముల్ గలుగ
రథముపై రణమనో - రథముతో వచ్చె
పృథుశక్తి, దానవ - బృందంబుఁ గొలువ
దశకంఠునకు వీఁడు - దక్షిణభుజము
దశరథరాజనం - దన ! నరాంతకుఁడు. 5100

10. రావణాసురుఁడు

శరభవరాహకే - సరి మహిపోష్ట్ర,
హరిగజవృషభ వృ - కాననులైన
దానవ యోధులు - తనచుట్టుఁ గొలువ

మేనిచాయలు నీల - మేఘముల్ నెఱప
మణిమయకుండల - మకర కేయూర
రణితనూపురవిభా - రాశి మిన్నులను
లాలితసూక్ష్మశ - లాకలతోడఁ
బ్రాలేయకిరణ బిం - బము డంబు మాపు
ధవళాతపత్రంబు - తపనీయదండ
మవు చామరద్విత - యము విరాజిల్ల 5110
దివ్యాస్త్రకోదండ - దీప్తులు వెలయ
దివ్యులు తనుజూచి - దిగులుచే నొదుగ
సంహికేయధ్వజ - స్యందనంబెక్కి
సింహశౌర్యుఁడు వింధ్య - శిఖరిగాత్రుండు
నై వచ్చువాఁడె మా - యన్న యతండె
రావణాసురుడు శ్రీ - రామ ! వీక్షింపు
దనుజేంద్రుతో మోపుఁ - దల కయ్యమబ్బు
మన”కన్న పరమాప్తు - మాటలాలించి
వెఱగులోఁ గను ఱెప్ప - వ్రేయక చూచి
ధరణిజారమణుఁ డా - తనికి నిట్లనియె. 5120
"సురగరుడోరగ - సురసిద్ధసాధ్య
నరులందు విన్నక - న్నమహామహులను
నింతటివాఁడు లేఁ - డేఁ జేయుపుణ్య
మెంతయోకాని నేఁ - డితనిఁ జూచితిని
సీతను వీఁడు తె - చ్చిన నిమిత్తముగ
చేతో విషాదంబుచే - నలంగెదను.
ఆకోప మీరావ - ణాసురు మీఁద
నీకుహితంబుగా - నిశిత బాణములఁ

జూపుదుననుచు న - ర్చులు నిగుడంగ
రోపంబులంది యా - రోపితోద్దండ 5130
కోదండపాణియై - కోసలరమణుఁ
డాదండ తన తమ్ముఁ - డట్లన యుండ

--: రావణుఁడొక్కఁడే తొలుత యుద్ద సన్నద్ధుఁడగుట :--

నెదురింప నీదాన - వేంద్రుఁ డెచ్చరిక
వదలక తానిందు - వచ్చినయపుడె
లంకలో కపులు చి - ల్లరసేతు రనుచుఁ
గొంకి యందఱు గనుఁ - గొని మీరలెల్ల
మనకోటలోన నే - మఱక వాకిళ్ళ
దనుజుల నునిచి సీ - తారక్షఁణమునఁ
గనుగల్గియుండుఁ డీ - కపులరాఘవులఁ
దునిమి వచ్చెదను మీ - తోడేల యనుచు 5140
నందఱ మఱలంగ - ననిచి యొక్కరుఁడు
స్యందనంబురవడి - సారథినడపఁ

-: సుగ్రీవుఁడు రావణునెదుర్కొని మూర్చిల్లుట :-

గలనికి రాఁజూచి - కమలాప్తసుతుఁడు
బలుగొండ యొకటి చేఁ - బట్టి యెదిర్చి
వేయఁ జేరిననొక - విశిఖంబుఁ దొడిగి
యాయద్రి శకలంబు - లై పడనేసి
వేఱె యమ్మొకటి - వింట సంధించి
రావణుఁడు వ్రేయ - నాయమ్ము వచ్చి

నాయమ్ము నాఁటిన • యపుడు కుమార
సాయక నిహతిఁ గ్రౌం - చ నగంబురీతి 5150
హోయని కూయుచు - నురముపై వలుద
గాయమ్ము చేత న - ర్కసుతుఁడు వడిన
శతబలి గజగవా - క్షసుషేణవాలి
సుతతారగవయాది - శూరవానరులు
నగములు నగములం - దఱుఁ బూని యెదిరి
జగడింపఁ జూచి రా - క్షసనాయకుండు
నొక్కొక్క తూపుచే - నొక్కరొక్కరుని
లెక్కగా ధరణిఁ గూ - లించినఁ జూచి
శరచాపహస్తుఁడై - జానకీప్రియుఁడు
దురమున కేఁగఁ జే - దోయి మొగిడ్చి 5160
మఱుగుగా నిలిచి ల - క్ష్మణుఁ డన్నతోడ
చరణాబ్జముల వ్రాలి - సమ్మతిఁ బలికె.

-: శ్రీరాము నాజ్ఞ చే రావణుని పైకి వెడలు లక్ష్మణుని కడ్డుపడి హనుమంతుఁడు రావణునెదుర్కొనుట :-

"దేవ ! మీరేల దై - తేయేంద్రు నెదిరి
కావరంబడఁగించి - కలన జయింతు
సెలవిండు మీయాజ్ఞ - చేఁగాని వాని
తలఁ ద్రెవ్వ నేయక - తాళి వచ్చితిని ”
అన ననుగ్రహబుద్ధి - నవనిజాప్రియుఁడు
మనసులో నటుల స - మ్మతమంది యతని
నాలింగనము జేసి - యలఁతినిఁ బోవఁ
డాలంబులోన – నింద్రాదులకైన 5170

వీఁడజేయుఁడు ధను - ర్వేదపారగుఁడు
వేఁడిమిఁ జూప నీ - వేళఁ బై కొనియెఁ
దగినట్టి దివ్యసా - ధనములచేత
జగడింపు మెఱిగి యె - చ్చరికతోననుచుఁ
బనిచిన వెంటయుఁ - బ్రణమిల్లి లేచి
యని సేయ సన్నద్దుఁ - డై నడచుటయు
నడ్డంబుగావచ్చి - యాసయై గాలి
బిడ్డండు దన మేను - వెంచి కుప్పించి

-: రావణ హనుమంతుల యుద్దము :-

రావణు నెదిరించి - " రాక్షసనాథ !
ఏ వచ్చినాఁడ ని - న్నెదిరించిగెలువ 5180
వెఱచిన వేల్పుల - వెంటాడినట్ల
హరివీరులను గెల్తు - మనుమాట వలదు
నాచేత నీకు ప్రా - ణభయంబె కాని
త్రోచిపోవంగ శ - క్తుండవుగావు.
ఎఱుఁగవే తలఁచుకొ - మ్మీపు ” నన్ననిన
సురవైరి యంజనా - సుతున కిట్లనియె
"ఎఱుఁగుదు రోరి ! నీ - వెంత నన్నెదురఁ
దరమెనీకెంత స - త్వంబున్నఁగాని
యుద్దంబులో నిరా - యుధుఁ జంపరామి
సిద్దంబుగాన నా - చెయి చూడుమిపుడు 519Q
ఒకపెట్టు చేత ని - న్నుర్విపాల్జేసి
వికటించు రాము - నా వెనుకఁ ద్రుంపుదును"
అన "నోరి ! రాత్రించ - రాధమ ! నీదు

తనయు నక్షాసురు - దండించు నపుడు
నిదుర వోతినొకాక - నీవు నాఁడేమి
మదిరామదంబుచే - మఱచితోమేను
నాపెట్టుబడిన వె - న్కకు మెదలంగ
నోపవు నీచేతి - యురవడియెల్లఁ
జూచి యీమీఁదఁ - జూచెదవిపుడు
చాఁచిన నాభుజ - స్తంభ విక్రమము” 5200
అనునంత నరచేత - హనుమంతు వ్రేయ
కను తేలగిలవైచి - కళవళింపుచును
గ్రక్కునఁదెలిసి రా - ఘవకింకరుడు
మొక్కసంబున తన - ముష్టిఘాతమున
నురముపైఁ బొడిచిన - నుర్విగాన్పింపఁ
దెరలి కంపించు ధా - త్రీధరంబనఁగ
గడగడవణఁకి రా - క్షసనాయకుండు
గడియకుఁ దెలిసి యా - గ్రహ ముదగ్రమున
"మేలు వాయుజ ! నిన్ను - మెచ్చితి నింత
చాలదె నీభుజ - శ క్తిఁ జూచితిని 5210
నాయంతవాని వా - నరుఁడవై యుండి
కాయంబు గడగడ - కంపించుపాటి
సత్తువ చూపితి - చనుము పోకున్నఁ
జత్తు వాత్మీయభు - జాప్రహారమున”
అనుమాట విని రావ - ణాసురుఁజూచి
కినుక నిట్లనిపల్కె - గేసరిసుతుండు
"మెఱమెప్పులకు నేల - మెచ్చెదునాదు
శరమెత్తి నీదు వ - క్షముఁ బొడిచియును

మఱల బ్రాణములతో - మాటాడినపుడె
పరిహాస మియ్యని - పలుకు లేమిటికి 5220
నగ్గింప నేల బా - హాశక్తి దనదు
సిగ్గయ్యె నిన్ను మె - చ్చితి నోర్చినపుడె ”
అనవిని యాదాన - వాగ్రణి యలిగి
హనుమంతు హనువుపై - నర చేతవ్రేయ
నాకొట్టుచే భూమి - నవశుఁడై యతఁడు
మోకరించుకవ్రాలి - మూర్ఛిల్లుటయును


--: హనుమంతుఁడు రావణునితోఁబోరి మూర్చీల్లగా నీలుఁ డెదిరించుట :-

నీలుఁడెదిర్చి కం - టినికంటి ననుచు
సాలంబు వ్రేయ రా - క్షసనాయకుండు
శరముచేఁ దునిమిన - శైలంబు నీలుఁ
డురుశక్తిచేఁబూని - యొక్కండు నెదుర 5230
నంతలోఁ దెలివొంది - యాంజనేయుండు
పంతంబు విడువక - పంక్తి కంధరుని
కనుఁగొని "ఓయి ! రా - క్షసనాథ తనకు
ననిసేయ రాదు నీ - వన్యునితోడ
నెదిరించి పోరాడ - నెడనంచుఁ బలుక
నది మది నెంచక - యసుర నాయకుఁడు
నీలుఁడెత్తిన కొండ - నిమిష మాత్రమున
వాలంపుఁ గోలచే - వ్రయ్యలు చేసి
చూచి వానరులెల్ల - సోద్యంబు నందఁ
బూచిన కింశుక - భూరుహంబనఁగ 5240

నెత్తురు లతనిమై - నిండ బాణములు
చిత్తజల్లుగ నేయఁ - జెదరక యతఁడు
మాయాబలంబుచే - మారట కొండ
చాయఁ బెంచిన మేను - సన్నంబు చేసి
కొంచపు రూపుగై - కొని మింటి కెగసి
ప్రాంచలంబున రఘు - ప్రవరులు వొగడ
దనుజేంద్రు రథము కే - తనము పై వ్రాలి
కనుచాటుగా భుజా - గ్రంబుల దుమికి
వింటికోపున కెక్కి - విబుధారి వరుని
కంటికి తన నిలు • కడఁ గాననీక 5250
తలమీఁద చంగున - దాఁటి కిరీట
మిల దొల్లగాఁ దన్ని - యెత్తిన శరముఁ
జేత నందుకొని త్రుం - చిశిరోధి తనదు
శాతనఖాళిి జ -ర్జరితముల్ చేసి
వెనుకపాటుని నిల్చి - వెన్నుపైఁ గఱచి
కనుమ్రోలనుండి మొ - గంబున కెగసి
చీకాకు పఱచి వి - చిత్ర లాఘవము
లాకీశవర్యులౌ - ననిమెచ్చి వొగడఁ
గేడించి మగుడ టె - క్కెమునకుఁ బ్రాకి
వ్రీడ నొందించిన - విసివి రావణుఁడు 5260

        -: నీలుఁడు రావణుచే మూర్ఛితుఁడగుట :-

"చిత్రయుద్ధము వీఁడు - చేసే నౌరౌర
మాత్రాధికము నీలు - మహిమం ” బటంచు
గురుతుగా టెక్కెపు - గొననుండఁ జూచి

శిరమెత్తి పావక - జిహ్మగం బేర్చి
తొడిగి "మాయావి కోఁ - తులలోన వీఁడు
జదియించె నన్ను మో - సము చేసి" యనుచు
సంధించి వ్రేసిన - చనుమఱ నాఁటి
గంధమాదనముఖ్య - కపికోటి యడల
యమరుల కెల్ల హా - హాకార మెసఁగ
భ్రమణంబుతో వచ్చి - పడియె నుర్వరను 5270
ననలుఁడు తనతండ్రి - యగుట నానీలుఁ
డనలాస్త్రనిహతి చేఁ - బ్రాణముల్ వోక
పడియున్న దానవ - పతి వింట శరముఁ
దొడిగి కోఁతుల నెల్లఁ - ద్రోలుచురాఁగ
శరచాప హస్తుఁడై - సౌమిత్రి యెదిరి
గరువంబు మగఁటీమి - గనుపించఁ బలికె

            -:లక్ష్మణుఁడు రావణాసురు నెదుర్కొని యుద్దము సేయుట:-

రావణ! యీ వాన - ర శ్రేణి నేల
చావనేసెద విది - శౌర్యంబు తెఱఁగె?
నామీఁద నెదిరించి - న నెఱుంగవచ్చు
నీమార్గణాసార - నిపుణత్వ” మన్న 5280
మాటయు జ్యాలతా - మహితారవంబు
సూటిగా వీనులఁ - జుఱుకు వుట్టింప
దానవపతి సుమి - త్రాపుత్రుఁ జూచి
లేనవ్వు సెలవిగి - లించి యిట్లనియె
"పూనియేఁ జేసిన - పుణ్యంబు కతనఁ
గానిపించితివి నా - కన్నుల యెదుర

బంటవై నిలువుము - పాఱక నన్ను
వింటివో లేదొ యే - వెంటఁ గీర్తింప
రావణాసురు నుమి - త్రాకుమారకుఁడు
తావచ్చి యెదిరి యు - ద్ధము చేసెననుచుఁ 5290
బొగడికల్ గననీవు - పోటరివోలె
తెగి నిల్చినప్పుడె - తెలిసె నందఱికి
మంచి బంట్రోతు ధ - ర్మమువాఁడ వౌదు
వెంచిరప్పుడె నిన్ను - నెఱిఁగితి నేను
తొడుగు” మమ్మని పల్కు - తోనె సుమిత్ర
కొడుకు రావణునిఁగ - న్గొని యిట్టులనియె
"ఎల్లరుఁ బొగడఁగ - నెఱుఁగమే నిన్ను
చెల్లి రే విల్లు నీ - చేతనుఁ గలిగి
యాయుధపాణినే - నై యెదిరింప
మాయన్న సాక్షియై - మనలఁ గన్గొనఁగ 5300
నిప్పుడు గాక యిం - కెన్నటి కన్న
దెప్పటి నీశౌర్య - మెఱుగ వచ్చితిని
సీతను మ్రుచ్చిలిం - చిన నాఁడె తెలిసె
వాతింట జూపాటు - వార్త లేమిటికి
బంటవౌదువు నిల్చి - బవరంబుఁ జేసి
కంటికి నిద్దురఁ - గనుపింపు మఱల”
అనిన నాగ్రహముతో - నసుర నాయకుఁడుఁ
గనఁగన కాలాగ్ని - కణములు రాల్చు
తూపులైదును రెండు - తొడిగి లక్ష్మణుని
చాపొమ్మనుచు నేయ - శరము లేడింట 5310

నవి నడుమనెత్రుంప - నసురేంద్రుఁ డలిగి
వివిధాస్త్రకోటులు - వెన్నెల్లఁ బొదువ
వ్రేసిన నవి యెల్ల - విశిఖ లాఘవము
రాసి కెక్కఁగ సుమి - (తా కుమారకుఁడు
వారింప శౌర్యదు - ర్వారుఁడై దేవ
తారి ముఖ్యుండు బ్ర - హ్మవరంబు చేతఁ
గన్నట్టి యొక మహా - కాండంబుఁ దొడిగి
మిన్నుల నెఱమంట - మీఱ నేయుటయు
నదివచ్చి వానర - లాహాయనంగ
నుదురు నాఁటుటయుఁ గ - న్నులుమూసి భ్రమసి 5320
తోడనె తెప్పిరి - దుర్వారశక్తి
చూడుమంచు నమోఘ - సునిశితాస్త్రమున
దనుజేంద్రు చేతికో - దండంబు రెండు
తునియలుగా నేసి - తూపులుమూఁటఁ
జనుమఱ నాటించి - శరపరంపరలఁ
దనువెల్ల జర్జరి - తంబు సేయుటయు
విలయకాలాంతకు - విధమున దైత్య
కులపతి శక్తిఁ గై - కొని యాగ్రహించి
సురలెఁల్ల బెగడ నా - సురకోటి వొగడ
హరివీరులకు భీతి - యాత్మల నిగుడ 5330
వ్రేసిన యది చండ - విలయమార్తాండ
భాసురకిరణ ప్ర - భారాశి యగుచు
నెన్నేని దూపుల - నేసినఁ బోక
యన్నింటి మ్రింగుచు - నరికట్టులేక
వచ్చి యాసౌమిత్రి - వామపక్షమునఁ

గ్రుచ్చుక యొక పిడు - గును బోలి పడిన
యందుచే మూర్చిల్లి - యనిఁ ద్రెళ్లుటయుఁ
దుందుడుకునఁ దేరుఁ - ద్రోలుక చేరె
లంకాధినాథుండు - లక్ష్మణు నెత్త
నుంకించరాగాఁక - యూరక పెనఁగి 5340
కైలాస మందరా - గములు వెకల్పఁ
జాలిన తనదు దో - శ్శక్తి యంతయును
సౌమిత్రి వైష్ణవ - శక్తి చేఁ బొలిసి
యేమియుఁ గొఱఁగాని - యెడ నెడదూరి

    —:రావణుఁడు లక్ష్మణుని పైశక్తి ప్రయోగించి మూర్ఛిల్లఁజేసి తీసికొని పోవుటకుఁ బ్రయత్నించుట -
                 హనుమంతుఁడడ్డుపడి లక్ష్మణుని రాముని యొద్దకుఁ జేర్చుట :-

యడ్డంబుగా వచ్చి - హనుమంతుఁ డలుక
రొడ్డపెట్టసు రేంద్రు - రొమ్ము పైఁ బొడువఁ
గుట్టూర్పులిచ్చి మూ - ల్గుచును మూల్గుచునుఁ
జుట్టుకవడి నోట - చొంగలు వడియఁ
జెవులన ముక్కునఁ - జిల్లున రక్త
నివహంబు కాల్వలై - నిండిపాఱంగ 5350
నరదంబుపై వ్రాల - నపుడు లక్ష్మణునిఁ
గరువలిపట్టి డ - గ్గరి జేరి మ్రొక్కి
కేవలాత్మీయ భ - క్తి స్నేహ వినయ
భావముల్ గానుపిం - పఁగ లేవనెత్తి
మూపుపై నునిచి రా - ముని సమీపమున
నాపుణ్యనిధి నుంచు - నాసమయమున

నూడి పేరెదనాఁటి - యున్న యాశక్తి
చూడగ రావణా - సురునిఁ జేరుటయుఁ
దెలివిడి వైష్ణన - తేజంబు కతన
కలిగెను మగుడ ల -క్ష్మణ కుమారునకు. 5360
రావణుఁడపుడు మూ - ర్ఛఁ దొరంగి తేరు
పై విల్లునమ్ములు - బట్టి నిల్చుటయు
భ్రుకుటీ కరాళాస్య - పుష్కరుం డగుచుఁ
జికిలి నిగ్గులు దేరు - చిలుకుటమ్మేర్చి
నారి మ్రోయింపుచు - నడతేరఁ జూచి
శ్రీరాము చెంతకుఁ - జేరి వాయుజుఁడు


                          -: రామ రావణుల ప్రథమ యుద్ధము :-

అరదంబు మీఁద ద - శాస్యుఁడున్నాఁడు
ధరణి పై నిలిచి యు - ద్ధము సేయనేల
దేవ ! నాభుజ - పీఠిఁ దిరముగానుండి
రావణాసురునిఁ బో - రజయింపుఁ డిపుడు. 5370
ఆరోహణము సేయు - మన వైనతేయు
నారాయణుం డెక్కి - న తెఱఁగు మీఱఁ
బవమాన తనయాంస - భాగంబు మీఁద
రవివంశ మణియైన - రాఘవుండెక్కి
బలిమిఁద నడచు శ్రీ - పతివోలి దనుజ
కులనాథుపై నెదు - ర్కొని యిట్లనియె
"రావణ ! నీవు ధ - రాపుత్రిఁ బొంచి
కావరంబున మమ్ముఁ - గానంగనీక

తెచ్చిన నిన్ను వ - ధింపఁగ నిటకు
వచ్చితి మొదట నీ - వారైన యట్టి 5380
దానవులను చతు - ర్దశ సహస్రములఁ
బూని జనస్థాన - మున ముహూర్తమున
ఖరదూషణులతోడ - ఖండించువార్త
యెఱిఁగిన నినుదైవ - మిట వట్టితెచ్చె
పోక నిల్వము కాక - పోయితి వేని
నీకు నడ్డంబుగా - నిల్చి కాచుటకు
హరిహర బ్రహ్మాన - లార్క శంకరుల
తరమె మదీయకో - దండ దివ్యాస్త్ర
నైపుణి నీదుమా - నంబు ప్రాణములు
నాపోశనింపఁగా - నాశించె నిపుడు 5390
ననిలోన పుత్రపౌ - త్రాదులతోడ
నిను ద్రుంతు ననుచుఁ బూ - నితి నేప్రతిజ్ఞ
యెందువోయెదవు పో - యినఁ బోవనీను
కందువుగాక ల - క్ష్మణు నేయుఫలము”
అను మాటలోనె ద - శాస్యుండు ఘోర
వినిశిత బాణముల్ - వింట సంధించి
పవమాన తనయునిపై - నాటఁనేయ
జవసత్త్వ వేగతే - జంబులు మిగుల
నవనికి యినుమడియై - రాముఁ దాల్చి
జతనంబుగా నిల్వ - శరపరంపరలఁ 5400
దేరుచెక్కలు చేసి - తేజీల దునిమి
సారథిఁ జంపి ద - శగ్రీవు నురము
సరిగట్ట దొకదివ్య - శరముచే నేసి

సరకు సేయక నర్ధ - చంద్రబాణమున
దనుజేంద్రు మకుటంబు - ధరణి దొర్లించి
జనకజా రమణుండు - శౌర్యంబుఁ జూపఁ
దలవీడి తనయాయు - ధంబులు మఱచి
యిలఁ బడి లేచి ము - న్నింద్రుండు గినిసి
కులిశంబుచే నేయఁ - గొంచెపు నొవ్విఁ
దెలియక యరుదు దై - తేయ నాయకుఁడు 5410
తన వ్రేటుచే దీప్తిఁ - దఱిగిన దాఁచు
వనజాప్తుడన విష - వ్రయమైన జిక్కు
చక్రికైవడిని తే - జములేని దనుజ
చక్రేశుతో రామ - చంద్రుఁ డిట్లనియె.

--: రావణుఁడు లంకకు మఱలుట :---

"దానవనాథ! నా - తమ్ముని నఖిల
వానర ప్రభుల నీ - వాలు దూపులను
నొప్పించి జగడించి - నొంచితి గానఁ
దప్పనేటికి జావు - తనచేత నీకు
నిలువకు మిచట మ - న్నించితి నిన్ను
తొలఁగి లంకకుఁ బోయి - తోడుగానీకుఁ 5420
గలిగిన బంధువ - ర్గము నెల్లఁ గూర్చి
కలనికి రమ్ము చే - కాచితి నివుడు.
ఱేపు చూచెద వధ - రితశతమన్య
చాప మామకశ రా - సన జాయమాన
కనకపుంఖోజ్వల - కాండప్రకాండ
కనదురుజ్వలన శి - ఖాసమావలన

భస్మీకృతనిశాట - బలమహాటవిని
విస్మయంబున నిల్వ - వేళగాదనిన
సిగ్గును రోషంబు - చేఁగామి కినుక
యగ్గలంబుగఁ గపు - లదరించి తఱుమఁ 5430
దలవాంచికొని లంక - దనుజనాయకుఁడు
వెలవెల నగుచు ప్ర - వేశంబు చేసె.
తగిన యౌషధములఁ - దగురీతి కపుల
నెగులు దీర్పించి మ - న్నించి రాఘవుఁడు
సకలభూతములకు - సంతోషమొదవ
నకలంక తేజుఁడై - యలరుచున్నంత.

–: రావణుఁడు లంకకుమఱలి, తన మంత్రులతోఁ దన పూర్వశాపములను దెలుపుట - కుంభకర్ణుని
   యుద్దమునకుఁ బంపుటకై యాతని నిద్రనుండి లేపుట కాజ్ఞాపించుట :-

ఆలంకలోన ద - శాననుండాత్మ
జాలి నొందుచును కే - సరి వట్టి విడుచు
కరిపోల్కి గరుడుని - గాసిచేఁ గలఁగు
నురగంబుమాడ్కి- భ - యో పేతుఁడగుచు 5440
దాశరథుల బ్రహ్మ - దండ కాండప్ర
కాశనూత్నతటిన్నికాశ - దివ్యాస్త్ర
పాతముల్ దలఁపుచు - పంచాస్యపీఠిఁ
జేత చెక్కిలిఁ జేర్చి - చింతనొందుచును
తన యాప్తులైన మం - త్రరహస్యవిదుల
దనుజనాథులఁ జూచి - తానిట్టలనియె.
"ఆజిలో నింద్రాదు - లై న దేవతల

నేజన్మ మెత్తిన - యిన్ని నాళ్ళకును
జీఱికి సడ్డ సే - సినవాఁడ గాను
శ్రీరాముఁ డొకమాని - సి యనఁగనెంత 5450
నోడడే యితఁడు న - న్ను పరాభవించె
సూడిఁ ద్రిప్పెడు జాడ - శోధించి కాన
నాతపం బెల్ల మి - న్నక వ్యర్థమయ్యె
ధాత జెప్పినమాట - తలఁదాకె నిపుడు
మనుజులచే గల్గు - మరణంబటంచు
ననియే వూర్వమున నేఁ - డది సరివచ్చె
దేవగంధర్వదై - తేయ పన్నగుల
చే వధ లేకుండఁ - జేసితి తపము
జనమాత్రులను గణిం - చని దోషమెల్లఁ
గనిపించె మనువంశ - కర్తయైనట్టి 5460
యనరణ్యుఁడనెడు మ - హారాజు తొల్లి
తనవంశమునఁ బుట్టి - దశరథవిభుని
సుతుఁడు రాముఁడు - పుత్రసోదరబంధు
యుతముగ నినుఁ జంపు - నుర్వి జన్మించి
నన్నట్టినూట య - థార్థమై యిప్పు
డున్నది తన చేత - నుల్లంబు నొచ్చి
ఆది బతివ్రత - యైన లతాంగి
వేదవతీనామ - విఖ్యాత తాను
పుడమి జన్మాంతరం - బున జనియించి
కొడుకులతో బంధు - కోటులతోడఁ 5470
జంపుదు నిన్నని - శపథంబు సేసె
చాంపేయగంధి యా - సాధ్వితావచ్చి

యీసీతయైపుట్టె - నిదిగాక నంది
చేసిన శపథంబు - చేకూడె నిపుడు
వనధికన్యకయైన - వనజాక్షి రంభ
పరిభవంబంది శా - ప మొసంగె తనకు
నట్టిశాపమును శై - లాత్మజ దిట్టు
తిట్టును నేఁడు వొం - దెను దైవగతిని.
ఇపుడైనదేమి యే - యే ప్రయత్నములఁ
గపులు చేరఁగ నవ - కాశంబులీక 5480
పదిలమైయుండుఁ డీ - పట్టున మఱలఁ
గదనంబునకు కుంభ - కర్ణుండుగాని
యితరుని బంపరా - దింట నిద్రాభి
రతుఁడై నిరస్తకా - ర్యభరంబుతోడ
నున్న వాఁడీవేళ - యూరటగాక
యున్ననేపని కింక - నొకనాటి కతఁడు
నెవ్వరెచ్చట బోయి - రేమి యటంచు
నివ్వలవ్వలిమాట - లేమియు వినక
యుండునే వీఁడు తా - నుండియులేక
యుండియు నాపాలి - కొక్కరూపయ్యె. 5490
పనిచెడి బ్రహ్మశా - పంబుచే నెపుడు
తననిద్దురయె కాని - తలఁపఁ డేమియును
పొండు తోతెండు గో - బ్బున మేలు కొలిపి
భండనంబున కేను - బనిచెద నతని
బలిమిని లేపుఁడా - బలవంతుఁడైన
గెలుచు భూమీశులఁ - గీశుల నెదిరి"

-: రాక్షసులు కుంభకర్ణుని నిద్రనుండి లేపుటకు వెడలుట :

అని పంచుటయును దై - త్యశ్రేణివచ్చి
యనుపమ గంధమా - ల్యాంబ రావళులు
నీరు మజ్జిగలు వ - న్నీ రెళ నీళ్లు
సారాయికుండలుఁ - జక్కెరచట్లు 5500
కల్లుబిందెలు పాన - కంబులు చెఱకు
బిల్లలు మీఁగడ - పెరుగు కజ్జములు
నంజుడుల్ నించు బా - నలు లేఁత తాటి
ముంజలు సుడిగొళ్లు - మొదలైనయట్టి
దాహోపశమన స - ద్రవ్యంబు లతని
గేహంబులోన గ్రి - క్కిఱియ నమర్చి
పచ్చి నెత్తురుల దొ - బ్బలుఁ గొబ్బెరలను
దెచ్చి యాతని సమ - దృష్టి నమర్చి
యెటుచూడ యోజనం - బిరవైనయట్టి
పటువజ్ర మయమైన - పడకింటిలోనఁ5510

–: నిద్రాముద్రితుఁడైన కుంభకర్ణుని వర్ణన :--

గన్ను మోడ్చిన కుంభ - కర్ణునిఁజూచి
మున్నాడ దైత్యస - మూహమంతయును
నెగనూర్పు వెంబడి - నిలు చోరఁబాఱి
డిగనూర్పులను వాకి - టికి వెళ్లి వచ్చి
గాలిచే నొగడాకు - గమివోలి శక్తి,
చాలక తమయిచ్చఁ - జన చేతగాక
సుడిగాంచు సందుల - జుణిగియొక్కొక్క


డెడము చేసుక వెన్క - యిరువులనుండె
పాతాళగహ్వరో - పమమైన వర్తు
లాతతవివృత భ - యంకరాననము 5520
గిరిగుహాయుగళంబుఁ - గేరుచు వేడి
కరువలి గల నాసి - కావివరములు
పెద్ద కాటుక కొండ - పెక్కువ నినుప
ముద్దను మీఱు న - మోఘ కాయంబు
వంకరలగుచు ధా - వళ్యంబు మించి
సంకులఁ గేరు ని - శాతదంష్ట్రలను
దొనదొన నీఁగలు - తుట్టెలుగట్టఁ
బెనుగంపు కడనింపు - పెదవులజోడు
నేనుఁగు తుండంబు - లెంత లేదనఁగ
జానుల మీఱంగఁ - జాలు బాహువులు 5530
నంకిలు సేయు పే - రాఁకట గ్రుస్సి
యింకిన చెరువుతో - నెనవచ్చుగడుపు
పరపులై వజ్రని - భంబులై మిగుల
గరవాడి నెసఁగు న - ఖప్రకాండములు
చలపట్టి దీవుల - జరుముక మ్రింగఁ
గలగాంచి కూయిడు - కలవరింపులును
వట్టిక వాడి ద - బ్బనముల రీతిఁ
బొట్ట మీఁదట నిట్ట - పొడుచు రోమములు
కుండల కేయూర - కోటీరరత్న
మండనంబుల నస - మాన తేజంబుఁ 5540
గలిగిన యాకుంభ - కర్ణుని లేపఁ

–: నిద్రనుండి కుంభకర్ణుని లేపుటకుఁ జేసిన ప్రయత్నములు :

దలఁచి పేరునఁ బిల్చి - దానవు లెల్ల
భేరీపణవదుందు - భి మృదంగ శంఖ
భూరి రావముతోడ - బొబ్బలువెట్టి
పిడికిళ్ళ చేగ్రుద్ది - పెద్దరోకళ్ల
బొడిచి గదాశూల - ముల ముద్గరముల
దండించి రొమ్ముమీఁ - దను పెద్దరాళ్లు
గుండులు బడ వైచి - గోళ్ల లోపలను
యినుపకండ్లును గొట్టి - యిటుకలు వేచి
తనువు నిండఁగఁబోసి - దానవులెల్ల 5550
ముకుగోళ్లలో సీస - ములు గాచిపోసి
తెకతెక నంజుళ్లుఁ - దెరలించి వంచి
చెవులగూబలు గఱ- చి వెడందవాతఁ
బొగలేని చింతని - ప్పులు దెచ్చి నించి
గొడ్డండ్లచే గండ - గొడ్డండ్లచేత
గడ్డపారల చేత - గండ్లుగా నఱికి
పడనిపాటుల నెఁ - బడ పదియేను
గడియలకును కుంభ - కర్ణుండు నిల్గి
వాసుకి తక్షక - వ్యాళులమాడ్కి
భాసిల్లు తన మహా - బాహులుఁచాచి 5560
యవనీధరమహా గు - హలనుండి వెడలు
పవనంబు లనఁగ ని - బ్బరముగా నూర్చి
యంతట నొక్కమా - టావలించుటయు
దుంతలఁ దెచ్చి పైఁ- ద్రోలి తొక్కించి
లొటిపిట గుఱ్ఱంబు - లును వేసడముల

నిటునటు దానవు - లెక్కిమట్టించి
పదివేలగజముల - బారుగాఁ దెచ్చి
యెదమీఁద నెక్కించి - యిలియఁ ద్రొక్కించి
కొమ్ము కత్తుల పెద్ద - గుప్పించి వెడలి
రొమ్ముపై వెయ్యి తే - రులు వాఱద్రోలి 5570
మీసంబులను తల - మీఁది వెంట్రుకలు
దూసిరా కోటిదై - త్యులు వట్టి యీడ్వ

-: కుంభకర్ణుఁడు లేచి, తన్ను నిద్రనుండి లేపుటకుఁ గారణమడుగుట :-

నొయ్యన తెలివొంది - యొత్తగిల్లుటయుఁ
జయ్యన భీతి రా - క్షసులెల్లఁ దొలఁగి
బెడబెడ బరు వేత్తి - బెదరి ద్వారంబుఁ
గడచి దాఁగిన కుంభ - కర్ణుండు లేచి
కారుచిచ్చులమంట - కన్నులవెంట
మీఱంగనెరి నవో - న్మేషాంతరమునఁ
బందులు గొఱియ లాఁ - బసరముల్ పెద్ద
బిందెల నల్లలు - పేర్పులఁ గల్లు 5580
కడమవడ్డనము నొ - క్కటిఁ జిక్కనీక
తొడిఁబడ మ్రింగి యం - దున సేదఁదేఱి
యాసీనుఁడగు వేళ - యరసి యొండొరులు
చేసన్న సేయుచుఁ - జేరంగ వెఱచి
తొంగి చూచుచు నుండ - దోషాచరేంద్రుఁ
డింగితం బెఱిఁగి “ మీ - కేల భయంబు
రండ”న వచ్చి వా - రలు కేలుమొగువ

దండకుం బిల్చి “ యిం - దఱు గూడి నన్ను
నిదురలేపఁగ నేల? - నేఁడు రాజునకు
కొదవలు లేక చే - కొన్నాఁడె సుఖము ? 5590
మీకు నెల్లను సేమ - మే? బంధుకోటి
యేకీడుఁ బొరయక - యెససి యున్నదియె ?
యేమైన గలిగిన - నెఱిఁగింపుఁ డిపుడె
నామీఁది భారమం - తయుఁ జక్కఁ జేయఁ
గడమ యాఁకలి దీర్చి - కాని మాయన్న
కడకు రానొల్ల నిక్క - డ నుండె చనుదు
బలిమిని మేల్కొల్పఁ - బనియేమి ? సీత
వలన నిప్పుడు చేటు - వచ్చెనో మీకు ?
లేకున్న నేఁటికి - లేపుదు రదియు
వాకొనుఁ” డనుచు - రావణసోదరుండు 5600

 -: యూపాక్షు మహోదరులు రావణునివద్ద కాతడు వెడలిన కారణము తెలియునని విన్నవించుట.
    కుంభకర్ణుఁడు రావణునిఁ జూచుటకు బయలు దేరుట :-

నన్నమాటలకు యూ - పాక్షుండు చేరి
విన్నవించెదనని - వినతుఁడై పలికె.
" అయ్య ! మి మ్మెఁఱిగిన - యమరులు మమ్ము
చెయ్యెత్తి చూప నొ - చ్చిన నోరఁ బలుక
నేరుతురో ? కంటి - నెరసునుఁబోలి
తీఱదు నరునిచే - దిగులు మాకిపుడు
నొకచేతి చేనైన - యుత్పాతమెల్ల
బ్రకటంబు నేవిన్న - పము సేయవలదు

కొలువులో రాజుమా - కునుఁ దెల్పెగాన
గలిగెను విపరీత - కార్యముల్ దాన 5610
నేమిచెప్పెద”నన్న - యెడ కుంభకర్ణుఁ
డామాటలోనె యూ - పాక్షుతోఁ బలికె.
"పోయినయపుడె పం - పును రాక్షుసేంద్రుఁ
డాయన్న తోడ మా - ఱాడంగ రాదు.
ఎపుడైననేమి నే - నేఁగి రాఘవునిఁ
గపులనుఁ జంపి ర - క్తంబులు గ్రోలి
మఱికాని రానిట్టి - మాటలు వినియు
దొరమోము పోయి చూ - తునె చేతనయ్యు ?
పగదీర్చి మఱికాని - పట్టణంబునకు
మగుడ నొల్ల” నటన్న - మాటలాలించి 5620
కోపమెంతయు దెచ్చు - కొని మహోదరుఁడు
యూపాక్షు దలమని - యోడక పలికె.
"అదియేఁటిమాట ? మీ యన్నడెందంబు
పదను చూచుకకాని - పదరంగఁ దగునె ?
ఇంత కొంచెపు పని - యే నీవువోయి
పంతమాడినయట్ల - పగఁదీర్చి మఱల ?
చెప్పిన కార్యంబుఁ - జేసిన మనకుఁ
దప్పులే దామీఁద - దైవయత్నంబు
పదరకు కాగల - పనులేల తప్పు ?
తుదిగన్న కార్యంబె - తోచెను మీకుఁ 5630
బిలువనంపినఁ బోయి - పిలిపించినట్టి
తలఁపువెంబడిఁ జేయఁ - దగు” నంచుఁ బలుకఁ
జారులఁ బిలిచి " యీ - క్షణమునఁ బోయి

మీరు దశాస్యు స - మీపంబుఁ జేరి
కుంభునితో దెల్పి - కుంభిని చేత
కుంభకర్ణుఁడు మేలు - కొన్నాఁడటంచు
వినిపింపుఁడన వారు - వేగంబెపోయి
దనుజేంద్రునకుఁ దెల్ప - దశకంధరుండు
తోడితెండన వాఁడు - తోడనేవచ్చి
చేడోయి మొగిచి వ - చ్చిన మాటఁదెల్ప 5640
నజ ధేను శశవరా - హ వృషాదికములు
భుజియించి మైరేయ - మున దృప్తినొంది
గఱ్ఱన దిశలు వ్ర - క్కలుగఁ ద్రేఁచుచును
కొఱ్ఱు మ్రింగినయట్టి - కుత్తుకబంటి
నంజుడు దిని పయ - నంబయి చూడ్కి
గంజాయ కెంజాయ - గ్రమ్మ నిల్వెడలి
చూచినచో నెల్ల - సురవిమానములు
బూచిఁ గన్నట్ల త - ప్పుడు త్రోవఁ బఱవఁ
గోటిరకుండల - గురురుచుల్ మింటి
బాటల దివిటిల - బారులై వెలుఁగఁ 5650


-:కుంభకర్ణునిఁజూచి వానర సైన్యము భయభ్రాంతముకాగా, విభీషణుఁడు వారిభయము నివారించుట:-

గోటలోఁ బోవుచో - గోఁతులాబయట
సూటిగాఁ జూచి వ - చ్చుచునున్నచొకట
నడగొండ యిందు ముం - దఱ నిల్చి నేల
నడఁగిపోవఁగ నేల - యని దిగుల్ వుట్టి
చచ్చినవారు మూ - ర్ఛల నొందువారు

విచ్చి పాఱెడువారు - వెతనొందువారు
రాముని మఱుఁగు చే - రఁగ నేఁగువారు
సౌమిత్రి చాటుకుఁ - జనియెడువారు
నగుచుండ రఘువీరుఁ - డమ్ములు విల్లు
తెగువతో సవరించి - దిటవూని నిలిచి 5660
సడ్డచేయని విభీ - షణుఁ జూచి దిగులు
పడ్డవానరులఁ దే - ర్పగ నిట్టులనియె.
"ఇదియేమి మిన్నెల్ల - నేకమై దిశలు
బొదువుక యొక మహా - భూతంబు నడచె ?
ఆదిఁ ద్రివిక్రముఁ - డైన వామనుని
కీదేహ ముద్దియై - యీడు రాఁబోలు
విబుధాచలము బోయె - వింధ్యపర్వతము
సొబగిట్టులుండునో - చూడుము నాఁడు
నీ మహాభూత మూ- హింపఁగ విలయ
భీముఁడో యముఁడో రూ - పింపు"మిట్లనుచు 5670
నని పల్కు- జానకీ - ప్రాణేశుఁ జూచి
దనుజనాయకుని సో - దరుఁడిట్లు వలికె.

-: శ్రీరామునికోర్కె ననుసరించి, విభీషణుఁడు కుంభకర్ణుని పుట్టు పూర్వోత్తరము లెఱింగించుట:-

"అయ్య ! యీతఁడు రావ - ణానుజుఁడెచ్చు
కయ్యముల్ గెలిచి చే - కన్నట్టివాఁడు,
అమరేంద్రు నోడించి - యనలుని గెలిచి
శమనుఁ బోఁదఱిమి రా - క్షసనాథుఁ దోలి
వరుణుఁ గీటడఁగించి - వాయువుఁ దూల్చి

నరవాహనుఁ దెమల్చి - నగధన్వు నోర్చి
ముల్లోకముల కయ్య - ముల నెదిరించు
బల్లిదుఁగానని - బలవంతుఁ డితఁడు 5680
పుట్టిన యప్పుడే - భూతకోటులను
పట్టి మ్రింగుచును ప్ర - పంచమంతయునుఁ
బాడు సేయుటయు సు - పర్వులు మునులుఁ
గూడి జీవుల నెల్ల - కుంభకర్ణుండు
చంపి పోకడ పెట్టు - చందంబు దెలుప
గుంపుగా దిక్పాల - కులను వేల్పులను
కూరుచుకొని వజ్రి - కుంభకర్ణునకు
బారు వెట్టిన దావ - పావకురీతి
నందఱిఁ జుట్టుక - యందరంటఁ గొట్టి
చిందరవందర - చేసిన దిరిగి 5690
సెలకట్ట నేరక - జేజేలువాఱ
వెలిదంతిఁ బురిగొల్పి - విబుధ నాయకుఁడు
సతగొట్టివైచిన - సరకుగాఁ గొనక
నితఁడు చౌదంతి కొ - మ్మెలదూడువోలె
పెఱికి దాననె కొట్టి - పిరితీసి కూసి
విఱుగుడు చూపిన - వేల్పులగజము
నది యజ్జగాఁ బోరె- యమరనాయకుఁడు
నదియాదిగా నెందు - నరికట్టలేక
జీవహింస యితండు - సేయుచునుండ
నావేల్పుదొర వోయి - యజునకు మ్రొక్కి 5700
యింతయు వినిపింప - నెఱిఁగి పద్మజుఁడు
చెంతకు దానవ - శ్రేణి రావింపఁ

గూడినవారిలోఁ - గుంభకర్ణుండు
చూడ ధాతకు జాల - సోద్యమౌటయును
దిగులొంది " యౌరౌర ! - దినకున్నె వీఁడు
జగమెల్ల యెంత మో - సము వచ్చె దనకు
మృత్యువు నై నను - మ్రింగును వీని
యత్యంతబలము లో - కాతీత”మనుచుఁ
గనుఁగొని “ యోరోరి ! - ఘటకర్ణు నిన్ను
దన సృష్టియెల్ల మి - థ్యగ మ్రింగు మనుచుఁ 5710
జూపి యిచ్చెనొ పుల - స్త్యుఁడు నిన్ను గాంచి
బాపు దేవతలకు - బ్రతుకేడదింక
చావక యుండియుఁ - జచ్చినవాని
కైవడి బడుము లో - క హితంబుగాఁగ"
అనుటయు వానికి - నావలింతలును
పెనునీల్గులును బుట్టె - పెద్ద నిద్దురను
నప్పుడే యందుండి - యవని పైఁబడిన
"తప్పు సైరింపవే - తండ్రి నీవ"నుచు నీ
రావణుఁడు వోయి - యేడ్చి తచ్చరణ
నీరజంబుల వ్రాలి - నిలిచె కేల్మోగిచి 5720
“పైరు చేసిన చెట్టు - ఫలమందుచోట
నూరక తెగగొట్ట - నుచితంబె నీకు
నెన్నేని నేరంబు - లేము చేసినను
గన్నళవున తాళఁ - గావలె గాక
మీరాజ్ఞ చేసిన - మిమ్ముఁ గాదనఁగఁ
దీఱునే యొరులచే - దీనమందార !
అలిగిన మీమాట - కన్యథాత్వంబుఁ

గలుగ నేరదు గానఁ - గడతేర్పు వీని
ప్రేమతో సోదర - భిక్ష యొసంగి
నామీఁద గలుగు మ - న్నన తేటపడఁగ 5730
వీనికి నిట్టి దీ - వృత్తం బటంచు
నానతిం”డన్న ద - శాననుఁ జూచి
యాలోచనము చేసి - యపుడు నత్తమ్మి
చూలి రావఁణు మోముఁ - జూచి యిట్లనియె.
"నిదురించు వాఁడాఱు - నెలలంత లేచి
యుదయాస్తమయ రాత్రు - లొక దినంబయ్యె
జాగరూకతను స్వే - చ్ఛావిహారమున
భూగోళ మెల్ల న - ద్భుత వేగుఁడనుచుఁ
జరియించి యడ్డ మె - చ్చట లేక వహ్ని
దరికొన్నరీతి నం - దఱను మ్రింగుచును 5740
మెలఁగెడు బొమ్మన్న" - మేలయ్యె ననుచుఁ
దలఁచి లంకకు వచ్చె - దశకంధరుండు
అట్టివాఁ డీతఁడీ - యనతోడ నెదుర
నెట్టివానికిఁ దీఱ - దే నెఱుంగుదును.
అందుకు దగినట్టు - లయ్యెడు నిపుడు
ముందరగాఁ గపి - ముఖ్యులు చూచి
కలఁగఁబాఱుట నీతి - గాదు గావునను
పిలిపించుఁడ"నుచు వి - భీషణుండనిన
రాముఁడు నీలుని - రమ్మని పిలిచి
"యీమర్కటో త్తము - లేల పాఱెదరు ? 5750
నిలువరింపు”మటన్న - నీలుండు కపులఁ
గలయ గూర్చుక తొంటి - గతిఁ బురికొల్పి

నలనీలకుముదమైం - దద్వివిదాదు
లలఘుసత్త్వులు మ్రాకు - లద్రులుఁ బూని
యదరెల్లఁదీఱి క - య్యమునకుఁ బదర
నెదురు చూచుచునుండు - నెడలంకలోనఁ


- రావణునివద్దకుఁ గుంభకర్ణుఁడువచ్చుట - వారిసంభాషణము :-

దన తనుచ్ఛాయ కా - దంబిను లీనఁ
బెనుగోర చకచకల్ - బెనుపఁ జంద్రికలు
కన్నుల నంగార - కణములు రాల
మిన్నుల తొడవులు - మేన రాణింపఁ 5760
గాదంబినీమాలి - కలలోన దూరు
నాదిత్యుఁడోయన - నరిది తేజమున
శాతమన్యవశిలా - స్థగిత సౌధాంత
రాతతద్వారంబు - లందంద దాఁటి
పరమకళ్యాణ పు - ష్పకముపై సౌఖ్య
కరమైన సింగంపు - గద్దియమీఁద
యాసీనుఁడై యున్న - యన్నకు వినతి
చేసిన దిగ్గున - సింహాసనంబు
డిగ్గి సోదరుని నిం - డిన భక్తితోడ
బిగ్గె కౌఁగిటఁజేర్చి - ప్రీతివుట్టించి 5770
చెంత నమర్చిన - సింహాసనమున
మంతుకెక్కిన తన - మంత్రులు మెచ్చ
వసియింపఁ జేసిన - వనజసంభవుని
దెసఁ గూరుచుండిన - దేవేంద్రు రీతి

నాసీనుఁడై తమ - యన్న చిత్తంబు
గాసి దీఱఁగ కుంభ - కర్ణుఁ డిట్లనియె.
"ఏలయ్య ! నన్ను మీ - రీప్పటి నిద్ర
మేలుకొన్పితిరి? యే - మి గొఱంతవచ్చె ?
ఇంతటి యాపద - యెయ్యది పలుకుఁ
డెంతటి పనికైన - నేనున్న వాఁడఁ 5780
బూను నిద్రాభంగ - ముననైన యట్టె
మానుదే రోషంబు - మార్తురమీఁదఁ
గనిపింతు”నన దశ - కంధరుండలిగి
కనలు వుట్టఁగఁ గుంభ - కర్ణున కనియె.
"తొడిబడ నన్ను ని - ద్దుర లేపిరనుచు
ముడిబొమతో రోష - మున నన్నుఁజూచి
తెగలేక యిట్లాడి - తివి గాక నీవు
తగవును ధర్మంబుఁ - దలఁపవింతయును
వెనకటి కొక కోఁతి - వీడెల్లఁ గాల్చి
చనియె నన్నట్టి ప్ర - సంగంబు నీవు 5790
విన్నావెకాదె ? యీ - వెనుక రాఘవుఁడు
మున్నీరుఁగట్టి త - మ్ముఁడుఁదాను వచ్చి
కపిసేనఁ గూర్చి లం - కావురం బెల్ల
నిపుడు ముత్తిక చేసి - హెచ్చి యున్నారు.
అంతియె కాదు నే - నంపినఁ బోయి
మంత్రులు దొరలును - మడిసిరాలమున
లంకయుఁ జెడి దైత్యు - లకు హానివచ్చె
యింక నేతెఱఁగని - యెన్నికవుట్టి

యాలోచనలు సేయు - నట్టిచో నిన్ను
మేలుకొల్పుట నేర - మె యెంచిచూడ 5800
చెడువేళ నిద్ర చూ - చితి వింతెకాని
కడతేఱు టెట్లని - కనవైతి వీవు.
ఇంతటి యాపద - నేనొందుచోట
నింతటి తమ్ముఁడ - వీవు గల్గియును
నున్నాఁడ నేనని - యూరటఁ జేసి
నన్నుఁ దేర్పక యవ - నయముఁ బల్కితివి
ఎన్నడు నాకిది - యిట్టిది యనుచు
నిన్ను నేఁబనిగొంటి - నే కయ్యములకు
నాచేతఁ దీఱకు - న్నను నీమనంబుఁ
జూచి పై కార్యంబుఁ - జూచెద ననుచుఁ 5810
బిలువ నంపితి నీవు - పెడమొగంబైన
నిలుతురే యెదిరించి - నిర్జర ప్రభులు
నన్ను నీలంకయు - నావారి నిపుడు
మన్నించి కావ స - మర్థుఁడే యొకఁడు ?
నీకెఱిగించు నిం - తియకాని యవల
మాకేల నీకు స - మ్మతమైన యట్లు
నడపించీ నాదుప్రా - ణములు రక్షించి
కడ తేఱుపుము శర - త్కాదంబినులను
విరియించు పవమాన విధమునఁ గపులఁ
బొరిగొని దశరథ - పుత్రులఁ దునిమి 5820
రమ్మని ” పలికిన - రావణుఁజూచి
క్రమ్మఱ నాకుంభ - కర్ణుఁ డిట్లనియె.

 --: కుంభకర్ణుఁడు రావణునికి హిత బోధ సేయుట :--

"దేవ ! యేనాఁడు మం - త్రిశ్రేణితోడ
నీవిధంబగు కార్య - మెఱిఁగించుచోట
నాప్తులై తగువార - లాడినమాట
యాప్తీకరించని - యప్పుడే వచ్చె
నీపాటు నేఁడు నీ - వెఱిఁగితివేమొ
యాపూర్వమున నిశ్చి - తార్థ మింతయును
దగినట్టివారి మం - త్రంబుల రాక
తగని కార్యములు య - త్నముసేయు కతన 5830
ముందఱ గానక - మూర్ఖుండవైన
యందుచే నీఫలం - బనుభవించెదవు.
కాలానుగుణమైన - క్రమములో నడవఁ
బోలు గాకహమికం - బూనిన పనుల
నిట్టి పాటొదవదే - యీరీతి మెలఁగు
నిట్టివాఁడ నయాన - యజ్ఞుఁడుఁ గాఁడు.
ఇది దేశ మిది కాల - మిదిసేఁత యనుచు
మదిఁ దలంపకఁ దాను - మది నెంచినట్లు
సేయు నాతని పనుల్ - చెడు మత్తచిత్తుఁ
డాయతించిన హవి - రన్నంబు నట్ల 5840
నవని నుత్తమమధ్య - మాధమకర్మ
నివహముల్ నేయఁ బూ - నిన యట్టివాఁడు
నారంభమున నుపా - యమునందు మీఁదఁ
బూరుషద్రవ్య వి - స్ఫురణయు దేశ

కాలవిభాగవై - ఖరి కార్యసిద్ధి
తేలని యాపత్ప్రతీ - కారమనగ
నైదును నెఱిఁగి కా - ర్యము సేయు దొరకు
రాదెన్నటికి విచా - రము దానవేంద్ర !
అందుమీఁదటను ధ - ర్మార్థ కామములు
పొందు చిత్తమున ఱే - పును పగల్ మాపు 5850
నేమఱక తదీయ - హితమతి నుండు
భూమీశ్వరుఁడు సౌఖ్య - మున నిలయేలు.
హితుల యాలోచన - లెఱిఁగి సామాది
చతురుపాయక్రియా - చతురుఁడై తనకు
హితుఁడైనగతి డెంద - మీయక మీఁద
నతి దుఃఖ హేతువు - లైన మంత్రములు
బోధించువాని నా - ప్తుండుఁ గాఁడనుచు
శోధించి పరిహరిం - చుట రాజనీతి.
నిలుకడ చాలని - నృపుని రంధ్రములఁ
దెలిసి గెల్తురు విరో - ధిక్షమాపతులు 5860
క్రౌంచరంధ్రము లంచ - గమికి చోటిచ్చు
సంచున తనగుట్టు - శాత్రవులకును
గనుపించ నడచినఁ - గడతేఱలేఁడు
దనుజవంశ వతంస! - ధరయేలు రాజు.
ఎఱుఁగు దన్నియును నీ - వెఱిఁగియు సీతఁ
బరిహరింపక యున్కి - పాపంబుఁగాదె ?
ఇపుడు దప్పినదేమి - యిటమీఁదనైన
చపలత్వ ముడిగి రా - క్షసవంశమెల్ల

రక్షించి మనకును - బ్రదుకుపాయ
మీక్షించు మిదినీకు - హిత"మని పలుకఁ 5870
గన్ను లెఱ్ఱఁగఁ జేసి - ఘటకర్ణుఁ జూచి
మన్ననమాని దు - ర్మాని యిట్లనియె.

-: రావణుఁ డాహితబోధను పెడ చెవినిఁ బెట్టుట :-

"బుద్దులుఁ దెలుప నా - ప్తులు మాకు లేక
నిద్దుర మాన్పించి - నిన్నుఁ బిల్చితిమె ?
బ్రాహ్మణుండవె - చాలు బదివేలు వచ్చె
బ్రహ్మదేవుండు - నీపాలనున్నాఁడు
నిద్రవోవఁగఁబొమ్ము - నీకిటమిఁద
భద్రమయ్యెడు రామ - భద్రునిచేతఁ
దమ్ముఁడున్నాఁడని - తలఁచి నేనిన్ను
నమ్మి యాశించి జా - నకిని దెచ్చితిని 5880
తెచ్చినవెనుక సా - ధించుట యొకటి
చచ్చుటొక్కటిగాక - చనునె యన్యములు ?
పోరుకుఁబొమ్మన్నఁ - బోరుకుఁగాక
పోరామి గల్పించి - బుద్ధిచెప్పెదవు
మును విభీషణుఁడు రా - మునిఁ జేరినట్లఁ
జన జూచితేమొ దో - షంబుఁ గల్పించి
భయముఁగల్గిన మాఱు - వల్కక నీకు
జయమైనయట్టి యో - జనల బొమ్మ ”నిన
యాగ్రహోదగ్రుఁడై - యాకుంభకర్ణుఁ
డగ్రజు జూచి కా - ర్యము మాని పలికె. 5890

-: కుంభకర్ణుడు తాను రామునిపైకి యుద్ధమునకుఁబోవుదునని చెప్పుట :-

దనుజేంద్ర ! నీదు చి - త్త మెఱుంగఁదలఁచి
యనవలసినమాట - లంటినిఁగాక
యీకార్య మెవ్వరి - దిది యెంత లేదు
నాక సాధ్యము గల్గు - నా ? జగత్రయిని
కేల శూలంబు నేఁ - గీలించి యనికి
శైలంబు నడయాడు - జాడ నే తేర
నా కేశుఁ డెదిరించు - నా ? కీశు లెంత ?
వాకొననేల దే - వర చి త్తమెఱుఁగు
బరిచేత కైదువఁ - బట్టుకపోయి
దురములో నెదురు కోఁ - తుల జుట్టచుట్టి 5900
మట్టి మాల్లాడి పై - మార్కొన్నవారిఁ
బట్టుక మ్రింగి కో - పముఁ దీర్చువాఁడ
ముందఱగాఁగ రా - ముని తలఁ ద్రుంచి
నిందించితివి గాన - నీ సముఖమున
నుంచెద సుగ్రీవు - నొక కొండ దెచ్చి
యుంచిన గతి సమ - రోర్విలో గెల్చి
పట్టంబు నాసించి - పగవానిఁ గూడి
నట్టి విభీషణు - నడియాస దీర్చి
కడమవానరుల ల - క్ష్మణుని బోనీక
కడికొక్కఁడుగ మ్రింగి - గఱ్ఱనఁద్రేఁచి 5910
మఱికాని యూరకే - మఱలియేనెట్లు
పురికి రానేర్తు పం - పుము సెలవిచ్చి
కడలేని నిద్ర నాఁ - కలి పెచ్చుపెరుగఁ

బడియుండి యిపుడు లే - పఁగ లేచివచ్చి
కాననొకో నాదు - ఘాతికి నేమి
యైన నంచు విచార - మందెడు తనకుఁ
గపులన నేల లో - కము నెల్ల మ్రింగి
నపుడైనఁ దీఱదీ - యాఁకలిచిచ్చు
నీచేత నైనట్లు - నెమ్మదినుండు 5920
సీతను నీవు లోఁ - జేసుక మధుమ
దాతిశయానంద - మనుభవింపుచును
సుఖియింపు మటుఁ - గాక చూచినకార్య
ముఖము వమ్మైన రా - ముని చేత నీవు
తనతరువాత ఫు - త్రకళత్రసహిత
మనిలోన రాము బా - ణాగ్ని లోపలను
పడిపొమ్ము నీవని" - పలికిన వేఱె
దడమెత్తియా మహో - దరుఁ డిట్టులనియె.

-: మహోదరుఁడు కుంభకర్ణునిఁ బదఱుట :--

"కంటి మిప్పుడు కుంభ - కర్ణుని తలఁపు
వింటిమినీ యవి - వేక వాక్యములు 5930
పడుచువాఁడవు - గాన పలికితి వింత
తడవు నేలికఁజూచి - తాళితి నేను
జవ్వనంబున బుద్ధి - చాలక పొట్ట
క్రొవ్వున నెచ్చు త - క్కువమాటలాడి
దక్కించుకొంటివి - తమ్ముఁడ ననుచు
వెక్కసపడఁడయ్యె - విని దశాననుఁడు
బుద్ధికి నేమి యో - పుదువే మెఱింగి

సుద్దులాడెదవు ర - క్షోనాథు నెదురఁ
గాలముల్ గన్నట్టి - గౌరవబుద్ది
నాలించు దశకంఠుఁ - డల్పుఁడే నీకు ? 5940
పగవారిబల మాత్మ - బల మెఱుంగకయె
తెగుదురె యిటువంటి - ధీవిశారదులు.
ఎవ్వరిబలము నీ - వెఱుఁగుదు విట్లు
నవ్వుబాటుగఁ బల్కి - న సహింపఁగలమె ?
అవివేకికాన ధ - ర్మార్థకామములు
చవి నీవెఱుంగఁ బ్ర - సక్తి యెక్కడిది ?
ఏమియును నెఱుఁగ - వెంత మూఢుడవు
నీమాట చెవిఁ జేర్చు - నే దైత్యవిభుఁడు
పుణ్యకర్మలఁ జేయఁ - బొందు సౌఖ్యంబు
పుణ్యేతరములై నఁ - బొరయు ఖేదంబు 5950
నని పల్కితివిగదా - యది సరిపోదు
మనసునకింక నా - మత మాలకింపు.
తగిన కర్మముల ఖే - దంబు మోదంబు
నగుఁ గాని కర్మంబు - లాచరించినను
మేలు గీడును గల్గు - మితమిది యనుచు
నేలక్ష్యదృష్టి నూ - హించి పల్కితివి ?
అందుచేఁ గర్మంబు - లవ్యవస్థితము
లిందొక్కటను భవ్య - మిహపరంపరల
నట్టి కర్మములు వ్య - యప్రయాసములు
పట్టుగావున నిల్వఁ - బలుకంగ రాదు 5960
కావున నిదియౌను - కాదిది యనుచు
రావణు నెదుర నే - రక పల్కితీవు

జానకీదేవి వం – చనతోడఁ దెచ్చి
నానాసుఖోచితా - నందవైఖరుల
ననుభవించి రమింతు - నని దెచ్చుకొన్న
దనుజనాయకుని య - త్నంబు మీవంటి
సకలబాంధవులకు - సరిపోవు నీకు
నొకనికిఁ గాకున్న - నొచ్చ మెవ్వరిది ?
అది యెట్టులుండె నీ - వన్నట్టిమాట
మదుల నెవ్వరికి స - మ్మతమైన యదియె. 5970
ఒంటిగా ననికేఁగి - యొక సాధనంబు
నంటక సుగ్రీవ - హనుమదాదులను
కపులనందఁఱి జంపి - కాకుత్థ్సవంశ
నృపుల తలల్ దెంచి - నీ సముఖమున
నుంచెద నంటివి - యొకమాట చాలు
మంచివాఁడవు నీదె - మగతనంబైన
రాముఁడు నినువంటి - రాక్షసాధములఁ
జేవిల్లు కై కొన్న - చిటిక మాత్రమున
మఱలి రానిచ్చు నే - మనవంటివారి
దురములో నిందఱఁ - ద్రుంపఁడీవఱకు 5980
నీపాటి పోటజ్ఞ - నేరక నిన్ను
లేపఁబుచ్చెను మమ్ము - లేఖారివరుఁడు.
అంతలో పోటరి - నైతి వింతేసి
పంతంబులాడి ద - బ్బరకాఁడవైతి
కోపించు సింగపుఁ - గొదమయో నిద్ర
లేపిన గెరలు వ్యా – ళివరుండొ కాక
దొడికిన కాలమృ - త్యువొ యనఁజాలు

పుడమి కానుపువల్ల - భుని బాఱిఁబడిన
తిరిగి రామనుమాట - తెల్లమెల్లరకు
నెఱుఁగకంటివో దైవ - మిట్లాడుమనెనొ 5990
లంకేశు నెదిరింపు - లకు భీతినొందఁ
గొంకనీపేరన్న - గొందులకేఁగ
నింద్రానలార్కధ - నేశులీరామ
చంద్రుండుదనుజనా - శనదండధరుఁడు
కావున నీమాటగా - దని” త్రోచి
దానవేంద్రుని మహో - దరుఁ డిట్లువలికె.

       -: రామునిగెల్చితినని చాటించి, సీతనువంచించి చేకొమ్మని మహోదరుఁడు,
         రావణున కుపాయము చెప్పుట :--



"అవనిజమనకు లో - నగు నుపాయంబుఁ
దవిలి యిన్నాళ్లు చిం - తన చేసి చేసి
తెలిసితి నొక్కబు - ద్ధి యదెట్టులన్న
గలను సేయఁగఁ గుంభ - కర్ణుని వెంట 6000
తాను సంహ్రాది వి - తర్ధనుల్ దనుజ
సేనానియైన ద్వి - జిహ్వుండు గూడి
పోయి శక్తి కొలది - పోరాడి రామ
సాయకంబుల చేతఁ - జావుఁదప్పినను
"రామనామాంకితా - స్త్ర ప్రహారముల
నేము నీముందఱ - కేతేరఁజూచి
భేరి మ్రోయించి క - ప్పినకట్లు వర్గ
మీరానిదై న నీ - విచ్చి మమ్మెల్ల

శ్రీరాముఁ గెలిచి వ - చ్చిరి వీరటంచు
వారణస్కంధాధి - వాసులఁ జేసి 6010
కాదని యనక లం - కారాజధాని
వీదుల నేఁగించి - వినఁగ బాటెంచి
యీవార్త వెలయింప - నింతులచేత
పావని సీత యే - ర్పాటుగా వినిన
వెనుక మీరచటికి - విచ్చేసి కొన్ని
యనునయోక్తులు వల్క - నడియాసవిడిచి
తనకెవ్వరైన మీ - దట దిక్కులేమి
జనకజ మనసు దాఁ - చక నిన్నుఁజేర
నీయుపాయము చేసి - తేని కయ్యంబు
సేయకయె జయంబు - చేకూడునీకు 6020
నీనీతి నడచిన - యిలనేలు రాజు
హానిఁ జెందకయె జ - యఖ్యాతులొందు"
అని మహోదరుఁ డాడ - నామాటలెల్ల
విని కుంభకర్ణుఁ డౌ - విబుధారి వలికె.

6
-: కుంభకర్ణుఁడు మహోదరుని యిచ్చకములను నిందించి,యుద్ధమునకు సన్నద్ధుఁడగుట :-

"వట్టిమాటలు వల్కు - వాఁడనె నన్ను
నెట్టివట్టున నొక - యించుకయైన
నోరపారలు గట్టి - యోవంచనలకు
నేరుతునో యేల - నిష్టురంబింత ?
శరదంబు శారద - సమయంబులందు
నురముటెగాని య - ల్పోదకంబైనఁ 6030

దనకు లేనట్టి చం - దమునఁ బ్రల్లదము
లనుచుండు చేతగా - నట్టి దుర్మదుఁడు
సేయు నాత్మశ్లాఘ - చెడనాడుచుండు
దాయల నధమ వ - ర్తన మించువాఁడు
హితుఁడ గావున వెన్క - నిట్లన మీకు
హితమైన కార్యంబు - లెఁఱిగించువారు
లేరని యెంచి మే - లిమికిఁ గీడునకుఁ
బోరానియట్టి తోఁ - బుట్టువు గాన
నొకమాట వలికితి - నుల్లంబునందు
నిఁకమిఁద మఱచి బో - మ్మీనంట లేదు 6040
విను మొక్కటి నిశాట - వీరాగ్రగణ్య !
యనికేఁగు శ్రీరాము - నగచరావళినిఁ
జంపి తదీయ మాం - సముల రక్తముల
సంపూర్ణకామత - జఠరాగ్ని యార్తు
నీమదిలోనున్న - నెగులెల్లఁ దీర్తు
సేమ మందుము నన్ను - సెలవిచ్చి పంచి
యనిలోన నడచు వృ - త్తాంత మంతయును
వినకమానరు గదా - వేగుల వలనఁ
జూడు మంతయు"నని - చులకఁగా దలఁచి
యాడు మహోదరు - నదలించి పలికె. 6050
"దొరకు నిచ్చకముగాఁ - దొడిఁబడ నన్ను
నెఱిఁగియు నెఱుఁగక - యిట్టులాడితివి.
మొదటఁ జుట్టమవౌట - ముదిమదిఁదప్పి
యెదురవారలఁ జూడ - కేమి వల్కినను
యెంత లేదనియుంటి - యీరావణునకు

సంతోషమైనదె - చాలు నాకనుచు
నాడినట్లన యాడి - యనుకూలులైన
జాడఁ జూపుదు హిత - శాత్రవులైన
మిమువంటివారి న - మ్మి దశాననుండు
సమసిపోవుట కేల - సందియంబింక 6060
యిచ్చకమ్ములు వల్కి - యేవేళలేని
మచ్చికల్ చేసి ప - ల్మాఱు బోధించి
లంకాపురం బన్యు - లకు కైవసముగఁ
గంకణంబులు చేతఁ - గట్టుక పూని
కడ తేర్చినట్టి మీ- కతన రావణుఁడు
చెడిపోయే నూర్జిత - శ్రీలువోనాడె
నమ్మినవారి మా - నంబు ప్రాణములు
వమ్మయ్యె చెడియె నై - శ్వర్యమంతయును
యినుముతో గూడిన - యింగలంబునకుఁ
బెనుదాకటులవాట్లు - బెడిదమైనట్లు 6070
యీ రావణునిఁ జేరు - నెల్ల రాక్షసులు
తీఱనియార్తి నొం - దిరి మీరుఁ గలుగఁ
జెడినచో గతజల - సేతు బంధనము
పెడమాటలును బది - వేలు నేమిటికి ?
కలని కేఁగెదను రా - ఘవులఁ ద్రుంచెదను
వలసిన గతి మీరు - వర్తింపుఁ”డనుచుఁ
గోపించి పలికినఁ - గుంభకర్ణునకు
నాపన్నుఁడై న ద - శానుండనియె •
నీకు సమానుఁడె - నిర్జరప్రభుఁడు

దాకొన్న నీమహో - దరుఁడన నెంత ! 6080
జగడంబుమాట యె - చ్చటనైన వినిన
మొగమున వినము రా - ముని భీతివలనఁ
దావెఱచినవాఁడు - తనయట్లు తలఁచు
నావలివారల - నతఁడేమి లెక్క
పందమాటలు నీవు - పాటింపకుండ
నందుకు ననుజూచి - యంతయు నోర్చి
కలనికిఁ బొమ్ము రా - ఘవులను గెలిచి
కులము రక్షించి మా – కు హితంబుఁజేసి
మాయన్న పోయిర - మ్మా ! యన్న మాట
కాయన్నకు విభీష - ణాగ్రజుండనియె. 6090
ఒంటిగా నేఁగెద - నొక రాక్షసుండు
వెంట రానేల మీ - వెంట రానిమ్ము
సడ్డసేయుదునె దా - శరథులు నాకు
నడ్డమే వానరు - లన నెంతగలరు ?
అరచేతిలోననె - నందఱంబెట్టి
నురిమి శోణితవాహి - నులు వాఱఁబిడిచి
యామాంసములు దిని - యందలి నెత్తు
రామెతగా ద్రావి - యట్టహాసంబు
నీదు వీనులు సోఁక - నిష్ఠురసింహ
నాదమహాండంబు - నకు మిక్కుటముగఁ 6100
గావింతు”ననుకుంభ - కర్ణుని మాట
రావణుఁ డాలించి - క్రమ్మఱఁబలికె,

 -: రావణుఁడు కుంభకర్ణుని దివ్యాభరణ భూషితునిఁగావించి యుద్దమునకుఁ బంపుట :-

"తమ్ముఁడ ! యొంటియు - ద్దము నీకు నేల ?
చిమ్మె రేఁగకపోదు - శ్రీరాము సేన
వానరుల్ నఖదంత - వాల ఘాతముల
చేనొంతు రెక్కటిఁ - జిక్కితి వేని
తోడుకుఁ బోక యెం - దుకు వీరుఁ దనకుఁ
గూడివత్తురు నిన్నుఁ - గొలిచి రాక్షసులు
కాలుఁడయోమయ - గదవూనినట్లు
శూలంబు చేనమ - ర్చుక నీవు పోయి 6110
గెలిచి రమ్మ”నుచు సాఁ - గిలి మ్రొక్కి లేచి
నిలిచిన తనతమ్ము - నిం గౌఁగలించి
తన మెడనున్నట్టి - తాలియు నఱుత
కనకసూత్రముతోడి - కంఠమాలికయుఁ
గరముల మేరువు - కడియముల్ చెవుల
గురువిభారాసులౌ - కుండలంబులను
కట్టిన వ్రేళ్ళ యుం - గరములు తాను
పెట్టుకిరీటంబుఁ - బీతాంబరంబు
తొడవులన్నియుఁ దీసి - దోపిచ్చినట్ల
తొడిగించె తానె సై - దోడు నెమ్మేన 6120
లలితేంద్రనీలజా - లముల చెక్కడపు
మొలత్రాడు తనదు త - మ్ముని కటిఁబూన్ప
నందు నిర్మధ్యమా - నాంభోధిమధ్య
మందరాచలదృశ్య - మానాసమాన
వాసుకినామక - వ్యాళోపమాన

భాసమానతఁ జూడఁ - బరగె నత్తొడవు
నవరత్నమయమౌక - నత్కనకాత్మ
కవచంబు దానవా - గ్రణిఁ దొడిగింప
జోడెందు లేకయు - జోడువాఁడయ్యె !
జూడ దానవరాజ - సోదరాగ్రజుఁడు. 6130
నడమేరువును బోలి - నవరత్నరుచుల
తొడవుల వీతిహో - త్రుఁడు నిల్చినటుల
గంధపుష్పాదియు - క్తము వైరిరక్త
గంధాన్వితము పావ - కజ్వాలికోగ్ర
శాతోగ్రమలఘు కాం - చన పట్టబంధ
నీత మమూల్యమ - ణీ సరాన్వితము
కాలాయసమయ ప్ర - కాండమరాతి
బాలికామకరికా - పత్రాసహంబు
సంతతామర రాజ - సంగ్రామవిజయ
వంతంబులై న క్రొ - వ్వాఁడి శూలంబుఁ 6140
గేలనందుక యిది - కిష్కింధయేలు
వాలిసోదరునకు - వై రి లక్ష్మణుని
పాలికి మిత్తి య - పార వానరుల
జాలి యంగదు మన - శ్శల్యంబు పవన
తనయు మీఁదికి కాల - దండంబు సీత
పెనిమిటి కురుమని - పిడుగు సంగ్రామ
రంగంబులో కాళ - రాత్రి దైతేయ
పుంగవులకు జయం - బునుఁ గూర్చు లక్ష్మి
చూడుమేఁగెద నను - చును బ్రణమిల్లి
జోడుగా నతని గ్రు - చ్చుక కౌగలించి 6150



పొమ్మని దీవింపఁ - లోక ప్రదక్షి
ణమ్ముగా వచ్చి దా - నవనాథు మొగము
మఱలంగఁ జూచుచు - మఱలి కన్గొనుచు
దొరలు బాంధవులు మం - త్రులు భటుల్ గొలువ
రాజమార్గంబున - ఱామేడలెక్కి
రాజీవగంధులా రా - వణానుజునిఁ
బువ్వులసరులచేఁ - బొదివిన నతఁడు
నవ్వుమోమున వాహ - నము లేక నడచి
శతధనుర్మాన వి - శాలత పొడవు
శతషట్క సాయ కా - సనతమై పెంచి 6160
నానామృగాననుల్ - నానావిధంబు
లైన వాహనముల - నాశలఁ గొలువ
నుత్తరద్వార సా - లోపరిఁ జేరు
నుత్తుంగ భుజుఁ - బుల స్త్యోద్భవాత్మజునిఁ
గాంచి భీ .........
మించుగఁ జెదరి భూ - మి చలింపఁ బఱవ
ధవళముక్తాత ప - త్రము చామరములు
సవిధభాగముల రా - క్షసులంది కొలువఁ
గుంభకర్ణుడు దైత్య - కోటి నీక్షించి
యంభోదగర్జమ - హార్భటిఁ బలికె.6170
"అల్ల దే కపులసే - న్యము గనుపట్టె
నల్లనై పుడమి యం - తయు నేఁడుమీకు
వనచరులో పోరు - వారు నాతోడ
మనవీట నుద్యాస - మార్గంబులందు
వేడుకల్ చెల్లింప - విహరింపఁగాక

నేఁడు తానెదిరింప - నిలువ దీమూఁక
రామలక్ష్మణు లెదు - రా ? కొంచగాండ్లఁ
దాము చంపితిమని - దర్పముప్పొంగ
బాణబాణాసన - పాణులై సితకృ
పాణులై యొక శల - భంబుల రీతి 6180
నాకోప దవదహ - న శిఖాముఖములఁ
జాకుండ యేమి యో - జన సేయ గలరొ
చూతమంతయు ” నను - చు మహాట్టహాస
మాతరి బ్రహ్మాండ - మవియఁ జేయుటయుఁ
గపిసైన్య మంతయు - గజగజ వడఁకి
యపుడు మూర్ఛాక్రాంత - మై పడియున్న
బ్రళయ కాలమునాఁటి - భానుజురీతి
కలని వేడుక కుంభ - కర్ణుండు రాఁగఁ

- యుద్ధోన్ముఖుఁడైన కుంభకర్ణునిఁజూచి వానరులు భయభ్రాంతులై నానాముఖములఁ జెదఱిపోవుట.
  అంగదుఁడు వారి భయము మాన్పి యుద్ధమునకుఁ బ్రోత్సహించుట :-

గపులెల్ల భీతిచేఁ - గన్న గోతిగను
తెపతెప గుండెలు - దిగులుచే నడర 6190
మింటిపై నెగిరి భూ - మిని గుంపుచెదరి
కంటకంబులఁ బడి - కానలకేఁగి
సేతువు బడి బాఱి- సింధువుఁ జొచ్చి
గాతంబులను దూరి - గపులందుఁజేరి
చెట్టుల పై నెక్కి - చేయెత్తి మ్రొక్కి

గుట్టల కెగఁబాఱి - గుహలలో దూరి
తడగాళ్లువడి నిల్చి - దగదొట్టి యలసి
పడినపాటులనుండి - బతిమాలుచుండ
నదిచూచి యంగదుం - డంగదతోడఁ
జెదఱఁ బాఱిన తన - సేనల నిలిపి 6200
గజగవాక్షసుషేణ - గంధమాదన వి
రజనీలరిషభ తా - ర ప్రముఖులను
పేరుపేరను బిల్చి - "పెద్దలుమీరు
పౌరుషాఢ్యులు ధైర్య - పరులు ధీనిధులు
నుత్తమకులజాతు – లురుసత్త్వనిధులు
మత్తమాతంగోప - మానావఘనులు
వేడబంబులు చూపి - విఱిగిపాఱంగ
జాడయే మనల వం - శంబులకెల్ల
నపకీర్తి వచ్చె మా - యావులు వారు
కపటాత్మకులు వీఁడు - కల్ల రాక్షసుఁడు 6210
దారుయుతాత్మ యం - త్ర స్వరూపం బొ
తీరుచు చర్మభ -స్త్రికయొ యీయసుర
వినలేదె వే............ప్రాజ్ఞ. ..
...............సులకు
రాకుండ నరికట్టి - రాలను రువ్వి
చీకాకుగాఁ జేసి - చించి మర్దించి
పాఱవేయుద మొక్క - పరిగ యందఱము
గోరాడుదము మద - కుంభులరీతి
తగునె భానుజునకుఁ - దలవంపుచేసి
మగతనంబునుమాని - మనములనమ్మి 6220



వచ్చిన రాము భా - వముఁ జిన్నఁబుచ్చి
యిచ్చటి దైత్యుల - కెసమిచ్చి పాఱ"
అనునంత నవ్వాన - రాధిపు లెల్ల
వనచరావళిఁ దమ - వారలఁ గూడి
యొక్క మొత్తంబుగా - నుర్వీజములును
పెక్కు కొండలువట్టి - పెడబొబ్బలిడుచుఁ
గలెబడి యాకుంభ - కర్ణునిమీఁదఁ
బలుకొండఁ బూజించు - ప్రసవంబులట్ల
వేసిన నవియెల్ల - విదిలించికొనుచు
వీసమంతయును నొ - ప్పియుఁ గొంకులేక 6230
మరకటంబున మారి - మసలినయట్లు
చరుముక మ్రింగుచుఁ - జప్పరింపుచును
చొరఁబారి నేలవే - సుక కాలరాచి
నురుముచు రెండుక - న్నుల నిప్పులురులఁ
దెఱచిన నోరు నె - త్తిన బాహువులును
చరిమి కోఁతులఁ జంపు - చరణముల్ గలిగి
కొండవొర్లినయట్లఁ - గుంభకర్ణుండు
చెండుచు రాఁ గపి -శ్రేణి భీతిల్లి
"కొయ్యసేత యటంచుఁ - గోతులఁదేల్చి
కొయ్యసేఁతల వాలి - కొడుకు బోధించి 6240
నమ్మించి తెచ్చి యం - దఱఁ జంపె మనల
దొమ్మి కయ్యము కాలి - దుమ్ము వీనికిని
యెఱుఁగక వచ్చితి - మెల్లవానరుల
నురుమాడ కుంభక - ర్ణుండట వీడు

వీని వాతను బడి - వెఱ్ఱిబుద్ధులకుఁ
జానేల ?” యనుచుఁ గీ - శవ్రాతమెల్ల
మొదలింటిగతి నన్ని - ముఖములఁ బఱవఁ
గదిసి పోనీక యం - గదుఁ డిట్టులనియె.
"కపులందు పై పారుఁ- గన్నటివార
లపకీర్తి కోడ రే - మనవచ్చు మిమ్ము ? 6250
ఇండ్లు చేరిన మిమ్ము - వీక్షించి యచట
పెండ్లాలు బిడ్డలు - పెరిమె సేయుదురె?
ఎగ్గుసిగ్గులు-మాని - యింత ప్రాణములు
బిగ్గె బట్టుకవోయి - పెక్కు కాలములు
మననేర్తురే ? పుట్టు - మరణంబు నచట
వనజగర్భుఁడు వ్రాసె - .........
......... .ణములు - పై మోచి యింత
యనుమానములు మాని - యని సేయనోడి
పరువెత్తి యిండ్లలో - పలఁబడి వొలిసి
నరక కూపముల మి - న్నక వడనేల ? 6260
రామచంద్రుని ముంద - ఱను నిల్చి మనకు
స్వామియైనట్టి భా - స్కర కుమారునకు
మాటవాసి గడించి - మనచేతనైన
పా.................. నెదిరి
చచ్చినఁ గల్గును - స్వర్గలోకంబు
రచ్చల కెక్కువా - రల బంటతనము
కడమవారికికూడఁ - గలుగు నేలికను
విడిచి వచ్చినవాఁడు - వీఁడని పలుకఁ

దలవంచుక మెలంగ - తగవె పోనేల ?
నిలుపుఁడు పిఱికివా - ని శరీరమేల ? 6270
పౌరుషంబులు మున్ను - పలికెడువారు
మేరయే పరువిడ - మీరనిలోన ? ”
అన విని వారంద - ఱ౦గదుఁ జూచి
యని కోడిపాఱుచు - నప్పుడిట్లనిరి.
"నిలు నిలు మనిపల్క -నీకేల? మమ్ము
తెలియవే ప్రాణముల్ - తీపౌను కాదొ !
ఎక్కడి రణము మీ - రేఁటికి రాముఁ
డెక్కడ బోయిన - నేమి మా కేల ?
దయ్యమువలె వీఁడు - తరుముక మ్రింగ
వెయ్యైన నెదిరింప - వెఱతుము మేము 6280
మాటవాసి యదెల్ల - మంటిపాలయ్యె
చాటిచెప్పెదమింకఁ - జాలు మీకొలువు
మీతండ్రితోడు న - మ్మించకు పాప
జాతి చావొట్టుగా - సములు వెట్టెదవె ?
ఇపుడు దప్పినఁజాలు - నిటమిఁదఁ దమకు న
నపకీర్తియైన నే - మైన నౌఁగాక
మఱలి రామనుమాట - మాత్రమే వాని
తిరిగి చూచినయంతఁ - దీఱు ప్రాణములు
నీతోడి మొగమాట - నిలువలే" మనుచుఁ
గాతరత్వంబునఁ - గపులెల్లఁ బఱవ 6290
నాసలసల నిల్చి - యంగదుండాడు
రోసపు మాటల - రోషముల్ వెనిచి



 
 -: కుంభకర్ణుఁడు మైందద్వివిదాది వానరులను జయించి వీరవిహారము సేయుట : -

శరభవాయుజనల - శతబలి ఋషభ
హరియూధవులు చెట్టు - లగములుం బూని
యాకుంభకర్ణుపై - ప్రాణాశ మరులు
లేక వేలుపులు 'మే - లే వీర' లనఁగఁ
గదిసినచో కుంభ - కర్ణుండు దనకు
నెదిరించు వారల - నెనిమిదివేలు
నేడునూఱుల వాన - రేంద్రులఁ జంపి
జోడించి కొందఱఁ - జుట్టకవట్టి 6300
పదియు నిర్వది నలు - వదియేఁబదియును
గుదిగుచ్చి యేన్నేని - క్రోఁతుల మ్రింగి
భుజములచేత మూఁ - పులఁ జంకలందు
విజవిజ దన్నుకో - విడవక పట్టి
బలవంతులను నూట - పదియాఱువేలు
కొలఁదుల బట్టి మ్రిం - గుచు మాఱులేక
దొబ్బలు నమలి నె - త్తురు లుమియుచును
గొబ్బులాడుచు కేరి - ఘొల్లున నగుచు
మెలఁగుచో నందంద - మేటివానరులు
చలపట్టి కనుచాటు - జగడముల్ చేసి 6310
తరమినఁ జిక్కక - దాఁటుచు నతఁడు
తిరిగిన వెంటనే - తిరుగుచుఁ బోర
తెగివచ్చి యడ్డమై - ద్వివిదుండు వాని
నగముచే వైచిన - నగుచు నమ్మేటి
కేడించిన ప్రలంబ - గిరి దాఁటి జలధి

గూడిన మేఘంబ - కో యన కొండ
దనుజ బలంబు మీఁ - దను వచ్చి పడిన
ననిలోనఁ జదిసె నా - ద్యంతమాసేన
ద్వివిదుండు మఱియు నె - త్తిన కొండచేత
జవసత్త్వములు మీఱ - జగడంబు సేయ
చావక మిగులు రా - క్షసు లెదిరించి
లావున కపుల నె - ల్లను బొలియింప
హనుమదాదులు కొంద - ఱా కుంభకర్ణు
ననుపమసత్త్వులై - యద్రులం దరుల
నొప్పింప వలుదమే - నున నెత్తురొలుకఁ
జప్పరింపుచును రా - క్షసనాయకుండు
శక్తి చే నాది గ్రౌం - చనగంబుమీఁద
శక్తివైచిన యట్టి - షణ్ముఖురీతి
శూలంబు ద్రిప్పి యా - ర్చుచుఁబవమాన
బాలకు పక్షంబు - భగ్గునఁ బొదువ 6330
నాపోటుచేత రొ - మ్మంతయుఁ బగిలి
వాపోవుచును గూలె - వాయునందనుఁడు.
అది చూచి రాక్షసు - లట్టహాసముల
బెదరు పుట్టించి క - పిశ్రేణిఁ దఱిమి
నీలుఁడు సేనల - నిల్పి తానొక్క
శైలంబు వూని రా - క్షసనాథు నెదిరి
వ్రేసిన నదిరాఁగ - విబుధకంటకుఁడు
జేసె చూర్ణంబు ము - ష్టి ప్రసారమున
గంధమాదననీల - గవయగవాక్షు
లంధకాసురుని దే - వాళియ వోలె 6340

నాఁగి శైలమహీరు - హావళి చేత
పైఁగప్పుటయు వానిఁ - బరిహరింపుచును
పొదిగిటిలో ఋష - భుని పట్టి బిగ్గె
నదిమినఁ దన్నుక - యస్రముల్ గ్రక్కె
పడగొట్టి శరభుని - పటుశక్తి చేతఁ
బిడికిట బొడిచిన - పృథివిపైఁ ద్రెళ్లె.
అరచేతను గవాక్షు - నదరంట మన్నుఁ
గఱచుకో గొట్టెమోఁ - కాటిచే నీలుఁ
బ్రహరించి శౌర్య ద - ర్పముల నుప్పొంగి
విహరింప వనచర - వీరులందఱును 6350
దొరలపాటులు చూచి - దొమ్మిగాపెచ్చు
పెరిగి రాముఁడు చూడ - బీరంబుతోడఁ
బర్వతంబును దోమ - పదువునుఁబోలి
పర్వియందఱు నెదఁ - బ్రాఁకి యార్చుచును
చెవులు ముక్కును గఱ - చియును రక్తములు
ప్రవహింప నఖశిఖా - గ్రములు సించియును

-: వానరులొక్కుమ్మడిగా కుంభకర్ణునిపైఁబడి యాతని ధాటి కోర్వలేక శ్రీరాముని శరణుఁజొచ్చుట :-

దన్నియు గ్రుద్దిఁగఁ - దలవట్టి యీడ్చి
వెన్నుపైఁ జఱచియు - విసరివాలములఁ
గొట్టియు నొప్పించి - కుంభకర్ణుండు
చిట్టాడుచును కను – చెదరి భీతిల్లి 6360
తనమీఁద తరువులు - తరువులమీఁద
వనచరులును గల్గ - వసుమతీధరము

పొలిచిన రీతిని - భుజగుల నెల్లఁ
బొలియించు గరుడుని - పోలిక నలిగి
యందఱ బట్టుక - యందంద మ్రింగి
మందరాచలదరీ - మార్గంబునందు
వెడలి చీమలు వచ్చు - విధమున చెవులు
వెడలువారును వాత - వెడలు వారలును
ముకుచఱమల రంధ్ర - ముల వచ్చువారు
నొకరైన నిలువకి - ట్లురుశ క్తి వెడలి 6370
కన్నద్రోవలు వట్టి - కపులు శ్రీ రాము
వెన్నాస గొని 'కావ - వే! తండ్రి !' యనుచు
నభయులై నిల్చిన - నంత కాలమునఁ
బ్రభవించు నత్యుగ్ర - పావకుండనఁగఁ
బ్రాణికోటులను వెం - పరలాడు శరధి
తూణీరుఁ డనఁగ జం - తుశ్రేణిమీఁదఁ
దెగివచ్చు శమనుని - తీఱున శూల
మెగుర వేయుచుఁ దన - కెదురెందులేక
యెదురుగావచ్చు దై - త్యేంద్రునిఁ జూచి

         -:అంగదుఁడు కుంభకర్ణునితోఁబోరి మూర్చిల్లుట :-

కదిసి పరాక్రమాం - గదుఁడంగదుండు 6380
కొండఁ గైకొని కనుఁ - గొండని కపుల
మండాడి యసురేంద్రు - మౌళిపై వ్రేయ
నావేటు వడియు మ - హాబలశాలి
చావక నోవక - సరకుగాఁగొనక
శూలంబు జేత నా - ర్చుచు మీఁద నేయ

వాలిసూనుఁడు లాఘ - వకళా నిరూఢి
మొనఁదప్ప గేడించి - మొరయుచు దనుజు
చనుమఱ నాఁట హ - స్తంబుచే మోదఁ
బెనుగొండ కైవడి - పృథివిపై రాలి
తనమూర్ఛఁ దెలిసి దై - త్యప్రవరుండు 6390
నంగదు పేరురం - బదరంట తనదు
ముంగలఁ బొడిచిన - మూర్ఛమైమఱచి
యిలఁమీఁద బడుటయు - నెదురెవ్వరైన
నిలుచువారలు లేక - నిర్జరారాతి
తనమీఁదరా భాను - తనయుండు క్రోధ
మున నొక్క భూధరం - బు పెకల్చి పట్టి
వచ్చునప్పుడు దైత్య - వరుఁడు వానరుల
విచ్చలవిడిఁ బట్టి - వివృతాస్యుఁడగుచుఁ
బసిఁబట్టుచును జేర - భానుసూనుండు
దెసలు ఘూర్ణిల్ల దై - తేయేంద్రుఁ బలికె.6400


        -: సుగ్రీవుఁడు కుంభకర్ణునితో యుద్దము చేసి మూర్ఛిల్లుట :-

"ఏల మ్రింగెదవు నేఁ - డీ వానరులను
చాలు నింతట నిది - శౌర్యంబు తెఱఁగె ?
నాచేతనున్న యీ - నగము నీమీద
వైచెదఁ దనుఁగల్గి - వారించుకొనుము
వాతప్పులేనట్టి - వాలిసోదరుఁడ
చేతప్పులేనట్టి శ్రీ - రామ హితుఁడఁ
గనుఁగొమ్ము నీ” వన్న - కమలాప్తసుతునిఁ

గనుఁగొని యా కుంభ - కర్ణు డిట్లనియె,
"ఇంత నేమిటికి నీ - వె త్తినకొండ
యెంత నీవెంత న - న్నెదిరి పల్కుటకు 6410
రానేరవే ఋక్ష - రజునకుఁ బుట్టి
దాననే బంట్రౌతు - ధర్మంబు నిలిచె
వచ్చినవాఁడ వె - వ్వరికినై మోచె
దిచ్చోట బలుగొండ - యేయు మీవనిన
సుగ్రీవుఁడపుడు వై - చుటయు విభీష
ణాగ్రజు నురము పై - నది బలుగొండ
గుప్పున దాఁకి ను - గ్గులుగాఁగ రాలె
నప్పుడు వనచరు - లడలుచు నుండ.
ఔరౌర ! యని మెచ్చి - రమరులు మింటఁ
జేరి రాక్షసులు భూ - షించిరి చూచి 6420
శైలంబు చూర్ణమై - జగతి రాలుటయు,
శూలంబుఁ జేనమ - ర్చుక దైత్యవరుఁడు
వ్రేసిన నది రుమా - విభునిపై రాఁగ
నాసమీరకుమారుఁ - డడ్డంబు దూరి
తాట బాణమురీతిఁ - దనకేలఁబట్టి
గాటంబుగాఁగ మోఁ - కాటిపైఁ జేర్చి
వట్టుక యొకవేయు - భారువులెత్తు
గట్టియుక్కుఁ గరంచి - కావించినట్టి
యాశూల మిరువాగు - లై విఱుగంగ
నాశవైఖరి ద్రుంచి - యంజనాసుతుఁడు 6430
కడుబాఱవైచినఁ - గపులెల్లఁ జూచి
కడుమెచ్చి రతని లా - ఘవసత్త్వములకు.



శూలము వమ్మైన - చోఁ జూచి మలయ
శైల శృంగంబు రా - క్షసనాయకుండు
పెకలించి యది బిర - బిరఁద్రిప్పి వ్రేయ
సకలరాక్షసులు మ - ఝ్ఝాయంచు మెచ్చ
నాశిఖరంబు భ - యంకరం బగుచుఁ
గీశులు వెఱవ సు - గ్రీవుని యురముఁ
దాఁకిన వాఁత ర - క్త ముఁ గ్రక్కికొనుచు
సోఁకోర్వఁ జాలక - సురిగి వ్రాలుటయుఁ 6440
గొండంతగెలుపుతోఁ - గుంభకర్ణుండు
కొండకై వడి నున్న - కోతుల దొరను

-: మూర్ఛమునిఁగియున్న సుగ్రీవుని కుంభకర్లుఁడు లంకకుఁ గొనిపోవుట :-

చేరి భుజాంతర - సీమ నమర్చి
వారిదంబుఁ దెమల్చు - వాయువురీతి
నెత్తుక తాలంక - కేఁగి "తోబుట్టు
చిత్తంబునకుఁ బ్రీతి - సేసెద నితఁడు
తగిలిన యప్పుడే - దశరథాత్మజులు
తెగిరి కోఁతులమాట - తీఱె నమ్మునుపె”
అని యమరులు చింత - నంద మిన్నంది
చన గనుఁగొని ప్రభం - జన కుమారకుఁడు 6450
మోసమువచ్చె రా - ముని కార్యమునకు
నాసఁ దీఱెను జన - కాత్మజ కింక
ప్రాణంబు లేని క - బంధంబు రీతి
త్రాణ వాసెను కపీం - ద్రస్తోమమెల్ల

నావంటి భృత్యుఁడు - న్న ఫలంబు వీనిఁ
బోవనిచ్చి శరీర - మున నుండి యేమి ?
ఏల పోనిత్తు మి - న్నెల్లను నిండఁ
జాల మై వెంచి రా - క్షసుని మర్దించి
యెఱుఁగక మునుపున - న్నేలిన వానిఁ
జెఱ విడిపింతు మూ - ర్ఛిలియున్నయపుడె. 6460
ఎఱిఁగె నేనియు నితం - డింతటి చింతం
బొరలునో తనకిట్టి - బుద్ది యేమిటికి ?
అరికట్ట నేర్చు నే - యమరేంద్రుఁడైన
మరుఁడైనయని మొన - మార్తాండసుతుని
వాలితో సరిపోరు - వానికి యసుర
చాలునే వట్టుక - చనఁగ నెక్కడికి ?
ఏ విడిపించిన - యినకుమారునకుఁ
బోవ దపఖ్యాతి - పుడమి నెన్నటికి
నిపుడె దామేల్కని - యేతేరఁగలఁడు
కపినాయకుఁడు మూర్చ - గాని కాదొకటి 6470
రాక వేఱొకటైన - రావణుతోడ
నీకుంభకర్ణుని - యెల్ల రాక్షసుల
లంకతో గూడ నే - ల నడంగ రాచి
పంకజాప్తకుమారుఁ - బచరించి తెత్తు
పదర రాద”ని మహా - ప్లవగ వల్లభుల
బెదరుఁ దీఱిచి కను - పెట్టుక యుండె.
కుముదారి సుతునితోఁ - గుంభ కర్ణుండు
తమరాజధాని సౌ - ధ శ్రేణి నడుమఁ


గనకశృంగోజ్జ్వల - కల్యాణ శైల
మన వచ్చునెడ నింతు - లారతులెత్తి 6480
పన్నీరు సల్లి దీ - పంబులమర్చి
తిన్నెల ధూమ్రంపుఁ - దిత్తులు గట్టి
పూవుల చప్పరం - బులమర్చి పరిమ
ళాహవగంధవా - హాకిశోరకములు
మలయ వీవనల ము - మ్మరముగావీవ
నలయికఁ దీఱి మూ - ర్ఛావాప్తి దొరఁగి

-: సుగ్రీవుఁడు మూర్చనుండి తేఱికొని కుంభకర్ణుని ముక్కు చెవులు
   కొఱికి తప్పించుకొని శ్రీరామునిఁ జేరుట :-

కనువిచ్చి చూచి లం - కాపురంబగుట
తనరాక వాలిసో - దరుఁడాత్మ నెఱిఁగి
"ఏరీతిఁ బోవుదు ? - నేనిట్లు దవిలి
యూరకే మఱలిపో - నొచ్చంబు గాదె ? 6490
ఒచ్చంబుచేసి దై - త్యుఁడు తనుదానె
చచ్చు గార్యముఁగ నే - చనుదు గాక”నుచుఁ
బట్టిన చేతులఁ - బదిలంబుఁగాఁగఁ
గట్టిన కుంతల - గతినున్న చెవులు
కుండలంబులతోడఁ - గొనగోళ్ళచేత
రెండును ద్రుంచి క -త్రించినయట్ల
దంతాగ్రముల మహా - దానవు ముక్కు
కొంతటికినిఁ దెగఁ - గోసినయట్లు
కబళించి యెగసిన - కడకాలువట్టి
యుబికి పోవఁగనీక - యురుసత్త్వశాలి 6500

కుంభకర్ణుఁ డదల్చి - గుప్పించి తిగిచి
కుంభినిఁ బడవైవ - గుదికాల దాని
మట్టెదనను వేళ - మర్కటస్వామి
మిట్టి యట్టిటువడి - మింటికి నెగసి
యెదురు చూచుచునున్న - యెల్లవానరులు
నదెవచ్చె సుగ్రీవుఁ - డని యార్భటింప
రాముని చరణసా - రసముల వ్రాలి
చేమోడ్చి సౌమిత్రి - చెంత నున్నంత.
కుంభకర్ణుండు సి - గ్గును రోష మొదువఁ
గుంభిని యద్రువఁ గ్ర - క్కునఁ బురి వెడలి 6510
చెవులు ముక్కునుఁ బోయి - జేగురుఁగొండ
హవణికఁ దోప భ - యంకరాకృతిని
రాఁజూచి కపులెల్ల - రామునిఁ జేరఁ
గాఁజూచి సౌమిత్రి - కార్ముకంబంది
యేడుదూపులు నౌఁట - నేసి యవ్వెనుక
మూఁడు బాణము లుర - మ్మునఁ బాదుకొల్ప
నవి సడ్డ సేయక - యమర నాయకుఁడు
చవుకగా నెంచి ల - క్ష్మణున కిట్లనియె.
"ననుఁజూచి నీవు ప్రా - ణములతో నిలిచి
యనిసేయఁ బూనిన - యపుడె మెచ్చితిని 6520
బాలకుండవు వింట - బాణంబు దొడుగఁ
జాలవు నీవేయు - శరములు నన్ను
నాఁటునె దేవదా - నవ యక్షఖచర
కోటి నాయెదుర మా - ర్కొని నిల్వలేదు
నిను జంపఁ జేయాడు - నే నాకుఁ గాన

చనుము రామునిఁ జూపి - సమరంబు మాని
కపుల నావంటి రా - క్షసులు చంపుదురు
కృపలేక యే రాముఁ - గీటడంచెదను.
అంతట నిను నెవ్వ - రైన దైతేయు
లంతకువీటికి - ననుప నున్నారు” 6530
అన విని లక్ష్మణుఁ - డా కుంభకర్ణుఁ
గని "యోరి ! రాముని - కరవేల నీకు
ననుమీఱి పోవచ్చు - నా ? బంటవైన
నిను నీవు పొగడుకో - నీతంబుఁ గాదు
వేల్పులు వెఱచిన - వెఱపని మ్మిట్టి
యల్పుల ఖండించు - నది నా వ్రతంబు
చూడుము నాచేతి - చుఱుకంచు ములుకు
లాడంగ” లక్ష్మణు - డస్త్రంబు లేయ
నవియునుఁ ద్రోచిపో - నమ్ములవాన
భువిదివి నిండ న - ప్పుడు ప్రయోగింపఁ 6540
గపులఁ ద్రోలుచును రా - ఘవుని మార్కొనిన
యపు డధిజ్యశరాసుఁ - డై యెదిరించి

-: శ్రీరాముఁడు కుంభకర్ణునెదుర్కొని యుద్ధము చేయుట :-

రాముఁ డుద్దాముఁడై - రౌద్రాస్త్ర మహిత
భీమంబుగాఁ బూని - పేరెద నాఁట
వ్రేసి కొన్ని యమోఘ - విశిఖముల్ నారు
వోసినగతి నురం - బునఁ గీలు కొలుప
నవియును ద్రోచి వాఁ - గ్రహోదగ్ర
దవపావకుని రీతి - తనమీఁద రాఁగఁ

గాంచనపుంఖ రా - ఘవసాయకముల
మించె రాక్షసుని నె - మ్మేన గుంపులుగ 6550
నీలాచలంబుపై - నీలకంఠములు
వ్రాలి పింఛములార్చు - వైఖరిఁ జూడఁ
గదలుచు నసియాడు - గరులమొత్తంబు
లెదురఁ గన్గొనువారి - కిచ్చె నచ్చెరువు
శ్రీరాఘవుఁడు కర్త - రీముఖ దివ్య
నారాచధారల - నఱికివైచుటయు
మండుచు వాని మై - మఱువు మార్తాండ
మండలద్యుతిని భూ - మండలిఁ బడిన
నాజోడు క్రింద స -హస్రవానర స
మాజమేర్పడ రాక - మంటితోఁ గలసె! 6560
అంతట సురవై రి - యవుడులుఁ గఱచి
యంతకురీతి వీ - రాట్టహాసమునఁ
గపులు గుండియలు వ్ర - క్కలుఁగాఁగ నార్చి
కుపితుఁడై యెదిరి రాఁ - గోదండపాణి
నిర్జరుల్ వెఱగంద - నిశితబాణముల
జర్జరితముగ వ - క్షముమీఁద నేయఁ
జేతఁబట్టిన గద - క్షితిఁ బడవైచి
భూతావహుని రీతి - బొబ్బలు వెట్టి
ముక్కు వెంటను గారు - మొదటి రక్తంబుఁ
గ్రక్కుచు నెత్తురుఁ - గాలుచేఁ జాల 6570
మత్తాయి గొనుచు తా - మ్రవిలోచనములు
జొత్తిల్ల కపుల నె - చ్చోటఁ గన్గొనుచు
సెలవులు నాకుచుఁ - జిమ్మనఁగ్రోళ్లు

వెలువడుగతి శ్రవో - వివరంబులందుఁ
గురియనెత్తురు చెంపఁ - గుంకుమపంక
పరిచితి గనిపింప - బాహువుల్ చాఁచి
వీరు దైతేయులు - వీరు వానరులు
వీరు నావారలు - వీరన్యులనుచు
నెఱుఁగ నేరక పట్టి - యెవ్వారినైనఁ
బొరిఁబొరి మింగుచు - బుసకొట్టుకొనుచు 6580
రొప్పుచు రాముఁ జే - రుటయుఁ గ్రొవ్వాడి
కుప్పె కోలల చేత - గుదిగ్రుచ్చి నిలువఁ
గోమలతరనీల - కువలయ శ్యాము
రాముఁ గన్గొని సుమి - త్రాపుత్రుఁడనియె.
"చెవులు ముక్కును వోయి - సిబ్బితి చేత
బవరంబులో వీఁడు - పడఁ గోరినాఁడు.
ఎఱుఁగఁడు తనవారి - నెదిరివారలను
మఱచెను తనమేను - మత్తుఁడై యితఁడు
పచ్చినెత్తురు ద్రావి - బౌళివట్టుటయు
రిచ్చపాటున సంచ - రింపుచున్నాఁడు. 6590
కపులెల్ల వీని యం - గములపైఁ బ్రాకి
యిపుడు భారంబుగా - నెక్కి త్రొక్కినను
పుడమిపై ద్రెళ్లు ని - ప్పుడె దైత్యుఁ”డనినఁ
గడకంటి సన్న రా - ఘవుఁడు సేయుటయుఁ
బెళపెళవచ్చి క - పిశ్రేణి మూఁగి
బలుగొండ ధాతు సం - పదఁ బొల్చినట్లు
నసురేంద్రు రక్తసి - క్తాంగంబు నెత్తు
రసలు జిర్కులు వాఱ - నాసల నెక్కి

యొడలెల్ల నిండి మ - హోద్ధతి గంతు
లిడుచు తేనియపెర - నీఁగలపోల్కి 6600
ముసురుకొన్నను దశ - ముఖ సహోదరుఁడు
విసరినంతన దంతి - విసద మావుతుల
కరణి నందఱు నలుఁ - గడ నూడిపడిన
సరకుసేయక రామ - చంద్రునిఁ గదియ
దమ్ముఁడు దాను కో - దండముల్ వాటి
యమ్ములు నేర్చి గు - ణారావమొప్పఁ
గదియంగఁ జని కుంభ - కర్ణునిఁ జూచి
చదురు మాటల రామ - చంద్రుఁ డిట్లనియె.

--: శ్రీరామ కుంభకర్ణ సంవాదము :--

రాక్షసాధమ ! విన - రా ! కుంభకర్ణ !
రక్షోవిఘాతినౌ - రాముఁడ నేను. 6610
ఎదిరించితిని నిన్ను - నిఁక నిట్టునట్టు
మెదల నిత్తునె పాఱి - మిన్నువ్రాకినను
పాపాత్ముఁడై నట్టి - పంక్తికంధరుఁడు
మాపయి నిను నంప - మార్కొంటిగాన
నిన్ను జంపుట మాకు - నీతి పోనీయ”
మన్నమాటలకు వాఁ - డట్టహాసమునఁ
బకబక నవ్వినఁ - బగిలి యాదిత్యు
లకు గుండెలెల్ల త - ల్లడమందె నపుడు.
పెద్ద యెలుంగునఁ - బిలిచి రాఘవుని
గద్దించి యీకుంభ - కర్ణుండు వలికె. 6620

"రామ ! ముందటిలోన - రణభూమిలోన
సామాన్య దనుజులఁ - జంపితిననుచుఁ
జేకని యిపుడెది - ర్చిన నిన్ను పోరి
పోకున్న కపులెల్లఁ - బొగులుచునుండ
మునుమున్ను నా చేతి - ముద్గరాహతిని
నినుఁద్రుంచి నీ తమ్ము - ని వధించి మించి
మాయన్నకు హితంబు - మదినెంచి యలరఁ
జేయుదుఁ గను"మన్న - శ్రీరామవిభుఁడు

--: శ్రీరామ కుంభకర్ణుల యుద్దము :--

వింటఁ బూనినయట్టి - విశిఖంబులమర
కంటకు నతివజ్ర - కాయంబు మీద 6630
వ్రేసిన దానవ - వీరుని యురము
దూసి పోవక మేను - దొలుచుకయున్న
సాలభేదనకళా - చతురంబులగుచు
వాలి పేరెద నాఁటి - వ్రయ్యలు చేసె
నేయమ్ము లవి దాన - వేంద్రుపై నేయ
నాయమ్ము లతికఠో - రాంగంబు నాఁటి
యలుగులు గనుపించ - వను నంతెకాని
వెలువడి వీపున - వెడలవేమియును
బరిగట్టియల రఘు - ప్రవరుఁడేయుటయు
సరిగట్టనేరక - శల్యంబులంటె 6640
మఱియు దివ్యాస్త్రముల్ - మనువంశతిలక
మురుశక్తి దృఢముష్టి - నురువడినేయ
డాయవచ్చుటయు ఖం - డాచేత నఱకె

నాయస్త్రములను మ - హాదానవుండు.
అంతట రఘువీరుఁ - డాగ్రహంబొప్ప
పంతమ్ముతో నొక్క - పారావతమ్ము
సంధించి వ్రేయ వీ - సరవోక యా క
బంధునట్లన వాని - బాహార్గళంబు
వాయవ్యమంత్ర ని - వారితంబగుట
వాయువు తరుశాఖ - వ్రాల్చినయట్లు 6650
కరము వేగమున ము - ద్గరముతోఁ గూడ
నఱికిన పెక్కువా - నరులు రాక్షసులు
నాచేతి క్రిందట - నడఁగ వ్రాలుటయుఁ
జూచి రాముని సుర - స్తోమ మగ్గించె.
ఆలోనె దనుజేంద్రుఁ - డలఘు సాలంబు
వేగంబె డాకేల - వ్రేయఁ బూనుటయు
దివ్యమై తగునింద్ర - దేవతకాస్త్ర
మవ్యాజలోకహి - తార్థి సంధించి
వేసిన నది మహా - విటపంబురీతి
కోసివైచినయట్లఁ - గుంభినిఁ ద్రెళ్ళ 6660
ఖండించుటయు వాని - కరముచేఁ జదిసి
కొండలు తరువులుఁ - గుంభినిఁ గూలె.
ఆవేళ నతి వివృతా - ననుండగుచు
రావణాసుర సోద - రప్రవరుండు
మ్రింగుదు నని తన - మీఁదికిఁ గదియ
నంగదసుగ్రీవు - లబ్బురంబంద
జతఁగూర్చి రెండర్ధ - చంద్ర బాణముల
నతని కాళ్లును దుని -యలుగాఁగఁ ద్రుంప

రాజు బట్టఁగఁ జేరు - రాహువురీతి
రాజీవ నేత్రుఁడా - రామునిఁ బట్టి 6670
మ్రింగుదు ననుచు భూ - మిని మొండికాళ్లు
జంగలు చాఁపుచు - జగతి మోపుచును

--: శ్రీరాముఁడు తనపైకివచ్చు కుంభకర్ణుని తలఁద్రుంచి రావణునిముందఱ బడునట్లు చేయుట :--

"చెవులు ముక్కును బోయె - చేతులు దునిసె
నవనిఁ గూలెఁ బదద్వ - యము చిక్కె ననుచు
నెంచకు మిప్పుడే - యిరువురి మ్రింగ
నెంచితి రఘువర! - యెటువోయెదనుచుఁ
బైకొనిరా రఘు - పతి దివ్యశరము
లాకుంభకర్ణుని - యాస్యగర్తమున
దొనలోన నించిన - తూపులమాడ్కి
కనకపుంఖంబులు - గనిపింపుచుండఁ 6680
గుత్తుకలో నింప - గురుపెట్టుకొనుచు
నెత్తురుల్ సెలవుల - నిండారఁ గురియ
నొడలెఱుంగక నిల్వ - నుర్విజారమణుఁ
డడలంగ దనుజు లైం - ద్రాస్త్రంబుఁ దొడిగి
వ్రేసిన నిప్పులు - వెదజల్లికొనుచు
భాసుర యమదండ - భయదమై నిగిడి
రవికిరణప్రభా - రాశియై పవన
జవముచే నవ్యకాం - చనపుంఖ మమర
వజ్రకీలితమైన - వజ్రంబు చేత
వజ్రాయుధముఁ గేరు - వాఁ డిమిఁ గలిగి 6690

శతకోటి వృత్తమ - స్తము ద్రుంచినట్లు
శతకోటి దివ్యాస్త్ర - సమితితోవచ్చి
కోఱలతో కను - గ్రుడ్ల తోడుతను
ఘోరకరాళ భృ - కుటితోడ నొప్పు
కుటిలాత్ము తల కిరు - క్కున ద్రుంచి నపుడ
పుటముబ్బి యది మింటి - పొడవుగా నెగసి
ఘోరమై నీలాద్రి - కూటంబె పోలె
భోరున మొరయుచు - భువనంబు లదర
లంకాసువర్ణ సా - లంబులు గూల్చి
వంకదారలు ద్రొబ్బి - వాకిళ్లఁ ద్రోచి 6700
మేడలు వడఁగొట్టి - మృత్యుకందకము
జాడ రావణుకొల్వు - సావడిఁ బడియె !
ఆదానవుని బొంది – యవనిచలింప
యాదోనిదాన మ - ధ్యంబునఁ బడిన
జలజంతుజాలంబు - సదమదంబగుచు
నలసిపోయెను జీవ - నంబెల్లఁ గలఁగె
నప్పుడు సురసేన – లలరులవాన
గుప్పెలుగా రఘు - కుంజరు ముంచె
జయజయ ధ్వానంబు - చదలెల్ల నిండె
భయమెల్లఁ దీఱెఁ బ్ర - పంచంబునకును 6710
నేదలు దీర్చె ద - క్షిణ గంధవహుఁడు
మేదినీచక్ర మా - మెత నాఁడెఱింగె
ప్రియసహోదరుని వి - భీషణుఁ గపుల
నయనిధి రాముఁడా - నంద మొందించి

పగఁగెల్వఁ బూనిన - పని నాఁటితోడ
సగముఁ దీ ఱెనటంచు - సంతోషమందె.


-: రావణుఁడు కుంభకర్ణుని మృతికై దుఃఖించుట :-

ఆవార్త హతశేషు - లైన రాక్షసుల
చేవిని దానవ - శేఖరుం డడలి
పెను మూర్ఛ ముంచిన - పృథివిపైఁ ద్రెళ్లి
వెనుక చిన్తావార్ధి - వీచులఁ దేలి 6720
"హా! కామసంచార ! - హా ! మహాశూర
హా ! కుంభకర్ణ ! నీ - లాచలవర్ణ !
పోయితివే తన - పొంత గాదనుచు
దాయల చేతి య - స్త్ర ప్రహారముల
వజ్రి వజ్రాయుధ - వ్రణము గైకొనని
వజ్రసారంబు నీ - వరశరీరంబు
రామదివ్యాస్త్ర ప - రంపర చేత
నేమాడ్కి వ్రయ్యలై - యిలమీఁదవ్రాలె
నెదురెవ్వరని యుంటి - యెప్పుడు నీకు
నిదుర లేపితి నేల - నినుదైవ గతిని ? 6730
ఇట్టి సోదరుని నే - నేడ వాసి మేన
నెట్టు దాల్పుదు ప్రాణ - మేల యీలంక
సీత యేమిటికి చ - చ్చిన చావుగాదె
దైతేయవిభుని సో - దరఁ డీల్గె ననిన
నీసూడుఁ దీర్చక - యేనుంటినేని
వీసంబునకు లెక్క - వెట్టరెవ్వరును
నెవ్వరిప్రాపుచే - నేలుదు లంక

యెవ్వనిభుజశక్తి - కింద్రుండు వెఱచు
నావిభీషణుఁడు పు - ణ్యాత్ముండు వానిఁ
బోవ నాడిననాఁడె - పోయె సేమములు 6740
నని కేఁగుచోట ప్ర - హస్తుడు నీవు
వినిపించు బుద్ధులు - విననేరనైతి
తనకీడు లేదని - దలఁచి కావించు
తనకీడు సేఁతలఁ - దరియింప వలసె.
ఎవ్వరిఁ జెఱచితి - నిన్నాళ్లువారు
నవ్వఁ బాలైతి మా - నముఁ గోలుపోయి
నీబుద్ది విని మన - నేరక నిన్ను
నాబుద్ధి చేత మి - న్నక చంపుకొంటి
దిక్కెవ్వరింక నా - తెఱఁ గెద్ది ?” యనుచుఁ
బొక్కుచు నిలమీఁదఁ - బొరలుచు నుండ 6750
దేవనరాంతక - త్రిశిరోతికాయు
లావలఁ బినతండ్రి - కడలుచుఁ బొరలఁ
దారు నేడ్చుచు మహో - దర మహా పార్శ్వు
లారావణుని పద - ప్రాంతంబులందుఁ
దలలూడఁ బొరలి యం - తటఁ ద్రిశిరుండు
తెలివి దెచ్చుకొని దై - త్యేంద్రునిఁ బలి కె

-:రావణుని సమాశ్వాసించి త్రిశిరాతికాయ నరాంతక మహోదరాదులు యుద్ధమునకు బయలు దేలుట :-

"అయ్య ! ప్రాకృతురీతి - నడలంగ నేల
కయ్యంబునకు మారు - కదలి రండిపుడు

పరమేష్టి వరము చేఁ - బరమదివ్యాస్త్ర
శరచాపరథ కవ - చంబు లందితివి 6760
నీవు మార్కొను వేళ - నిల్చి పోరాడ
దేవేంద్రదహనాది - దిక్పాలకులును
మొనసేయ లేరు రా - ముని పని యెంత !
వనచరులే నిల్చు - వారెదిరించి ?
మీరేల ? పాముల - మీఁద ఖగేంద్రుఁ
డేరీతిఁ జొరఁబాఱు - నేనట్లఁ బోయి
నానావనాట సే - నలఁ బాఱఁ ద్రోలి
తాను తమ్ముఁడు నిల్చు - దశరథరాము
తల యుత్తరించి కో - దండ పాండిత్య
కలనచే నీదు దుః - ఖము మాన్చువాఁడ 6770
నమరనాథుఁడు శంబ - రాసురు నరకుఁ
గమలాక్షుఁడును గెల్చు - గతి రఘుపతిని
ననిఁగెల్చెద’’ నటనన్న - నతి కాయుఁడట్టి
యోజనచే దండ్రి - యొద్దకుఁ జేరి
"రాఘవుఁడెంత ఘో - రమదీయ శస్త్ర
లాఘవంబునకు నే - ల విచారమింత ?
తనుఁ బంపుఁ” డనుచు ముం - దఱగ నంపించు
కొనునంత దేవాంత - కుఁడు నరాంతకుఁడు
సెలవిండు మా” క న్న - సెలవుల నవ్వు
దులకింప దాన వేం -ద్రుఁడు తెలివొంది 6780
యందఱు తనయుల - నాలింగనంబు
లందందఁ గావించి - యాదరింపుచును
కట్టువర్గములు భా - గములు నొసంగి

పట్టుఁడంచును నిజా - భరణంబు లిచ్చి
బహుమాన మొనరించి - పనిచిన వారు
దహనుండు నాలుగు - తనువులైనట్లు
నంపించుకొనిన - వెన్నాసగా వేఱె
పంపె వెంబడి మహా - పార్శ్వుని మత్తు
యుద్ధకోవిదుని యు - ధోన్మత్తు వంశ
వృద్దు మహోదరుఁ - బేర్వేరఁ బిలిచి 6790
సెలవిచ్చుటయు వారు - సేనలఁగూడి
యెలగోలు ముందఱ - నిడుకొని నడచి
యస్తాచలము మీఁది - యర్కుఁడనంగ
శస్తమై తగు సుద - ర్శననామ దంతి
తానెక్కి యలమహో - దరుఁడు తద్ఘంటి
కానాదములు దిశల్ - గంపింప నడచె
నాత్రీకూటము దైత్యుఁ - డాయెనోయనఁగ
నాత్రిశిరుఁడు మ స్త - కాగ్ర కిరీట
మాణిక్యనిచిత యు - గ్మాలికల్ గగన
మాణిక్యమునకు ము - మ్మడి చాయలిడఁగ 6800
నరదంబు నెక్కి ధ్వ - జాంచల శాటి
సురవిమానములఁ బోఁ - జోఁపఁ దానడచె.
కనకరథం బతికా - యుఁ డుత్తుంగ
ధనురస్త్ర కవచముల్ - దాల్చి తానెక్కి
తన మేని చాయ కా - దంబినీ చ్ఛాయ
నినుమడింపఁగ దివ్యు - లీక్షింప నడచె.
తెల్లని సామ్రాణి - తేజిపై నెక్కి
వెల్లయైన నిజైక - విభవంబుఁ దెలుపఁ

గోపంబున నరాంత - కుఁడు వచ్చె భయద
చాప మింద్రుని శరా - సనముఁ గీడ్పఱుప 6810
చేత పరిఘంబు - నొక కేల శైల
మొకయంతఁ దాల్చి ది - వ్యులు చూచి బెగడ
క్రూరుఁడై దేవాంత - కుఁడు వచ్చె సమర
శూరుఁడై కాల్నడఁ - జూపఱ మెచ్చ
బటహధ్వనులు మీఱ - బారుల నడుమ
పటుకార్యనిధి మహా - పార్శ్వుండు వచ్చి
దండితాహిత మహో - ద్దండకాలాస్య
దండసన్నిభగదా - దండంబుఁ దాల్చి
యుత్తుంగ భుజులు యు - ధోన్మత్తమత్తు
లుత్తమాశ్వములపై - నుర్వి చలింప 6820
దాఁటుచు విండ్లు న - స్త్రంబులు వూని
పోటుదారలకు నుబ్బుచు - వచ్చి రపుడు.
ఈరీతి రాక్షసు - లెనమండ్రు నొక్క
బారు దీర్చుక కీశ - బలములమీఁద

-: వానరరాక్షసుల దొమ్మియుద్దము :-

నడచిన వీరవా - నరులు బీరంబు
విడువక నగములు - వృక్షంబు లంది
యెదురెక్క నుక్కపై - యిరువాగు మూఁక
కదిసి సముద్రముల్ - కలెగొన్న యట్లు
పోరుచో నార్పులు - బొబ్బలు దిసలు
బూరటిలఁగ శరం - బులుఁ దోమరముల 6830

నసికుంత భిండివా - లాస్త్రనారాచ
ముసలపట్టిస కుంత - ముద్గరాదులను
జగడింప శైలవృ - క్ష నఖాదికములఁ
దెగి వానరులఁ జంపఁ - దేరులు దోలి
కరుల ఢీకొల్పి న - ల్గడతురంగములు
పరిగించి వెంట కా - ల్బల మాసయగుచు
ముమ్మరంబున కయ్య - మున దుమ్ము లెగసి
చిమ్మ చీకటి చాయఁ - జెలఁగి వానరులు
నరదంబుతోఁ బట్టి - యరదంబుఁ గొట్టి
కరితోడఁ గఁరి దురం - గముఁ దురంగంబు 6840
దానవు దానవు ద - ర్పించి కొట్టి
పీనుఁగు పెంటగా - పృథివి నిండింపఁ
దలచెడి పాఱుదై - త్యశ్రేణి నాఁగి
'నిలుఁడు చూడుఁడునను - నీనరాంతకుఁడు
మొగిసి మహామీన - ము పయోధిఁబోలి
నగచరవీర సై - న్యములోనఁ జొచ్చి
గుంపులపైఁ దన గు - ఱ్ఱంబుఁ ద్రోలి
చంపుచు గుదులు - గ్రుచ్చఁగ వానిచేత
నొక యేడునూటికి - నుగ్రవానరులు
వికలాంగులై రణో - ర్విని మ్రగ్గుటయును 6850
చూచి నిల్వక కపి - స్తోమంబు విఱిఁగి
యాచాయ సుగ్రీవు - నాశ్రయించుటయుఁ
గుంభకర్ణుని చేతఁ - గొట్టువడ్డట్టి
కుంభినీరుహచర - కోటి నూరార్చి

-: అంగదుఁడు నరాంతకుని సంహరించుట :

"అంగద ! నీ వీన - రాంతకుతోడ
సంగరంబొనరించి - చంపి రమ్మ"నిన
నాయంగదుండు బా - హాశక్తి నొక్క
దోయంబుఁ జేత నం - దుక రాక యెదిరి
మార్కొని వాఁడు తో - మరమెత్తి వజ్ర
కర్కశంబైన యం - గదుని వక్షంబు 6860
వేసిన నది దాఁకి - విఱిఁగి వమ్మైన
వాసవపౌత్రుండ - వార్యశౌర్యమున
వాని వాజిశరంబు - వామహస్తమునఁ
బూని యేసిన నది - పుడమిఁ ద్రెళ్ళుటయు
నిర్వాహనుండయి - నిజధైర్యశౌర్య
నిర్వాహశక్తి చే - నిలిచి యయ్యసుర
నంగదు ముష్టిప్ర - హారంబు చేత
నంగంబు వొడిచిన - నతడు మూర్ఛిల్లి
తోడనే తెలిసి య - ద్బుత శక్తి “నన్నుఁ
జూడు” మంచును వింట - సురలు కీర్తింప 6870
వానరాంతకుఁడయి - వచ్చిన యట్టి
యానరాంతకుని బా - హాముష్టిచేతఁ
బొడిచిన నశనిచే - భూమీధరంబు
పడినట్లు పడి వాఁడు - ప్రాణముల్ విడిచె.
విచ్చి పాఱిరి దైత్య - వీరులందఱును
వచ్చి చేరిరి కవి - వరులు మేలనుచు.

 -: దేవాంతక త్రిశిరమహోదరుల యుద్దము - దేవాంతకుని మరణము :-

ఆపాటు చూచి - దేవాంతకుం డలిగి
కోపంబు వాలి - కొడుకుపై నడిచి
త్రిశిరుఁడా వెంట న -త్తిమహోదరుండు
నసురసైన్యములతో - నంచులరాఁగ 6880
మార్కొనుటయు నస - మర్థులైనట్టి
మర్కటులను తన - మఱుఁగుననుంచి
యంగదుఁ డెదిరి దే - వాంతకు మీఁదఁ
జెంగటి తరువునఁ - జేరి వ్రేయుటయు
రోసంబుతోఁ ద్రిశి - రుండా కుజంబు
చేసి వ్రయ్యలుగాఁగ - శితశరంబులను
నంగదుఁడొకఁడని - యసురులు మువ్వు
రంగంబు నాఁట సా - యకముల నేయఁ
దారాసుతుఁడు మహో - దరుఁ డెక్కినట్టి
వారణేంద్రము తల - వ్రయ్యఁజేఁ జఱచి 6890
యాకొమ్ము దీసి దే - వాంతకు వ్రేయ
పైకోక యెఱుఁగక - పడి తోనె తెలిసి
దేవాంతకుండు హే - తిని వాలిసుతుని
చావు పొమ్మని వ్రేయ - చావంత మూర్ఛ
మోకరించుక పడి - మూర్ఛఁ దేఱుటయు
సేకరిoచుక లేవ - శితశరమ్ములను
మూట నాత్రిశిరుండు - మురువెల్లఁ జెడఁగ
నాఁటించుటయు: వాలి - నందను కడకు

హనుమంతుఁడును నీలుఁ - డాసగావచ్చి
పెనుగొండ నీలుండు - పెకలించి తెచ్చి 6900
మించి యాత్రిశిరుండు - మీఁదటఁ బోలియు
మంచు నేయుటయు దే - వాంతకుం డెదిరి
యాకొండ పొడిచేసి - హనుమంతు మీఁద
రూక వారఁగఁ ద్రిశి - రునిఁ బొడుచుటయుఁ
గోపించి కేసరి - కొడు కరచేత
నాపలలాశి మ - స్తాగ్రంబు వ్రేయ
నక్కిళ్లు కఱచుక - నలసి యాశిరము
వ్రక్కలై పడ వాఁడు - వదలె ప్రాణములు.

-: మహోదరుని చావుచూచి త్రిశిరుఁడు హనుమంతునితో యుద్ధము చేసి కూలుట :-

దేవాంతకుని చావు - త్రిశిరుండు చూచి
యావేళ నీలు నై - దమ్ముల నొంప 6910
తన వంతునకు మహో - దరుఁడును కొన్ని
సునిశితాస్త్రముల ముం - చుటయు నీలుండు
సాలమొక్కటి వట్టి - సామజేంద్రమును
నేలపాలుగఁ గొట్టి - నీలుండు మఱియు
నామహోదరు వ్రేయ - నందుచే వాఁడు
సామజేంద్రుని వెంట - శమనునిఁ జేరె.
తనకు నచ్చిన పిన - తండ్రి గావునను
కనలుచుఁ ద్రిశిరుండు - కరువలిపట్టి
చెంత నుండఁగ శర -శ్రేణి నొప్పింప
నంతకు కైవడి - హనుమంతుఁ డగలిగి 6920

కరనఖంబులఁ దురం - గముల నాల్గింటిఁ
బరియలు వాఱఁజి - వ్వగఁ ద్రిశిరుండు
శక్తివైచిన కరాం - చలములఁ బట్టి
నక్తంచరుఁడు చూడ - నడిమికి విఱువ
నదిచూచి హేతిచే - నదరలువాఱఁ
గదిసి వ్రేయుటయు రా - ఘవకింకరుండు
నరచేత భుజముపై - నడచిన వాఁడు
ధరఁద్రెళ్ళి మూర్ఛిల్లి - తనుదానె తెలిసి
పవమాన తనయుని - పై పక్షిరాజు
హవణిక నెగసి వాఁ - డరచేత వ్రేయ 6930
నాకొట్టువడి వాన - రాగ్రణి వాని
చేకత్తిఁ గైకొని - శిరములు నఱుకఁ
బురుహూతుఁ డల - త్వష్ట పుత్రుని తలలు
నఱికినఁ బడురీతి - నగచరుల్ మెచ్చ
మణికుండల కిరీట - మహితంబులగుచు
రణభూమి నుల్కలు - రాలినరీతిఁ

-: మహాపార్శ్వుని మరణము :-

బడిన యంతట మహా - పార్శ్వుఁ డత్తెఱఁగు
పడవాళ్ళచే విని - బలుగద వూని
నడచినయంత వా - నరు లుర్వియెల్ల
నెడమీక పరువెత్తు - నెడ ఋషభుండు 6940
కోపంబుతోడ మా - ర్కొనిన నిస్తైల
దీపంబు గతి వాఁడె - దీర్చి మండుచును
గదచేత ఋషభునిఁ - గదిసి కొట్టుటయు



నది దాఁకి యిలవ్రాలి - యంతనే తెలిసి
పిడికిట దానవు - పేరెదమీఁదఁ
బొడిచిన మూర్ఛిల్లి - పుడమి వ్రాలుటయు
వేగనే చెయి మెలి - వెట్టి యాదనుజు
చేగదఁ గైకొని - శిరము వ్రేయుటయు
నలినలియై తల - నరభోజనుండు
బలిముఖులర్వంగఁ - బ్రాణముల్ విడిచె 6950
ఆమహాపార్శ్వుఁడి - ట్లనిలోనఁ బడిన
యామాట హతశేషు - లైన దానవులు
విఱిఁగి వారిధి వెల్లి - విరిసిన మాడ్కి
బరువిడి వచ్చి యే - ర్పడ విన్నవింప

-: అతికాయుఁడు యుద్దమునకు వెడలుట - మత్తుఁడు ధూమ్రుని చే మడియుట :-

అతికాయుఁ డధరీకృ - తాంబుదధ్వాన
నతకార్ముకజ్యాని - నాదుఁడై యడరి
రథము వేపఱప సా - రధి నెచ్చరించ
వ్యధితవానరచమూ - వర్యుఁడై నడవ
మత్తుఁ డప్పుడు మదో - న్మత్తుఁడై క్రూర
చిత్తుఁడై మున్నుగా - సింహనాదమునఁ 6960
గపుల గుండెలువ్రీల - గదఁ గేలఁబూని
కుపితకల్పాంతాంత - కుని బోలికెరలి
దుర్వారుఁడై రాఁగ - ధూమ్రుండుచూచి
పర్వతంబొక టెత్తి- పైవేయ నాత్మ
గదమేది యిట్టులౌఁ - గదయంచు చేతి

గద త్రిదశేంద్రు భం - గద సవరించి
కొట్టిన నాగట్టు - గులగుల లగుచు
నట్టిట్టు చిదురప-- లై మహిం బడిన
మోటువాఱుకొని ధూ - మ్రుఁడు మహావృక్ష
మాటోపగతి వైవ - నదియుఁ బోనడచి 6970
దండపూనిక గదా - దండంబు చేతఁ
జండించి యతని వ - క్షము వ్రేయుటయును
నాధూమ్రుఁ డందు చే - నరగన్నువెట్టి
బోధంబుతోడ న - ద్భుత శౌర్యుఁ డగుచు
గదయు నాతనికేలుఁ - గదలకయుండఁ
బదిలంబుగా వాల - పాశంబుచేతఁ
జుట్టి మింటికి నెత్తి - సురలెల్ల మెచ్చఁ
జుట్టు నురాళించి - సుంకు రాలంగ
నేలతోఁ గొట్టిన - నెత్తురుఁ గ్రక్కి
వ్రీలిపొందల వాఁడు - విడిచెఁ బ్రాణములు. 6980

—: ఉన్మత్తుఁడు దధిముఖుని చే హతుఁడగుట :-

అంత యుద్ధోన్మత్తుఁ - డంతకు రీతి
నంతకు మున్నుగా - నగచరావళిని
మక్కుమారిచి మార - మసలినయట్లు
ప్రక్కలు డొక్కలు - పరియలు వాఱ
వాలమ్ములను రెండ - వకృశానుఁ డనఁగ
నాలమ్ములో ప్రతాపా - గ్ని కీలలును
దరికొల్పుచును జేర - దధిముఖుం డలిగి
గిరిశృంగమెత్తి యుం - కించి వ్రేయుటయు

వాఁడది యమ్ముల - వ్రయ్యలు చేసి
వాఁడిగల్గిన శర - ద్వయ మేరుపఱచి 6990
దధిముఖుపై భుజా - ద్వంద్వంబు నాఁట
రుధిరంబులుబ్బ నా - ర్చుచు నేయుటయును
నావంత సరకు సే - యక వానిశక్తి
యావంతగా నెంచి - యాదధిముఖుఁడు
సాలంబుఁ గైకొని - చదియ వ్రేయుటయు
నాలంబులో దై - త్యుఁ డసువులఁ బాసె.

- :యుద్దమునకు వచ్చుచున్న యతికాయునిఁ గూర్చి శ్రీరాముఁడు విభీషణుని ప్రశ్నించుట :-

ఇరువురిపాటు దా - నీక్షించి కదియ
నరదంబు దోలి యా - హవకౌతుకమునఁ
గపులు భీతిల నతి - కాయుఁ డత్యుగ్ర
తపన తేజమునఁ గో - ల్తలకుఁ జేరుటయు 7000
శింజిని మొరయ గ -ర్జింపుచు గాత్ర
మంజనాచల నిభం - బైమిన్నుమోవఁ
గడచన్న యాకుంభ - కర్ణుండు వేఱె
యొడలి దాలిచి వచ్చె - నోయంచు భీతి
నందఱు రఘువీరు - నాశ్రయించుటయు
నందఱు వెఱవకుం - డని వెఱఁగంది
"ఔర ! వీఁడెవ్వఁడో !’’ - యన విభీషణుని
శ్రీరామచంద్రుఁ డీ - క్షించి యిట్లనియె.
"పర్వతాకారుఁడై - ప్రళయ కాలమున
శర్వుండు భూతసం - చయముతో వచ్చు 7010

కైవడి తనుఁజూచి - కపులెల్లఁ జెదర
నీవచ్చు రాక్షసుఁ - డెవ్వఁ డేర్పఱుపు
కాలపావక జిహ్వి - కలఁ బోరడింపఁ
జాలిన యత్యుగ్ర - శ క్తులు దాల్చి
మెఱువులతో నీల - మేఘంబురీతి
నురుముచు పైవచ్చు - చున్నాఁడు వీఁడు.
అమరాచలముఁ గేరు - నపరంజి తేరు
నమరేంద్రు ధనువు జో - డగు శరాసనము
ప్రాంచలోదగ్ర సా - రధి చతుష్కంబు
నంచితసింహికే - య మహాధ్వజంబు 7020
జవతురంగమ సహ - స్రముఁ బదిజోళ్లు
ప్రవిమలాపాదక - భర్మతూణములు
నిరువది సింగాణు - లెనిమిది మూర్ల
గరమొప్పు పిడిపట్లు - గలిగి యిర్వంక
పదివారలను చాపఁ - బరిపరియలుగు
లుదిగి పరంజులు - నొప్పు దోదుములు
రెండును గలవాఁడు - రెండుభుజంబు
లండల శృంగంబు - లై మహానగము
గనుపించుగతి మస్త - కమునుఁ గిరీట
మినమండలము బోల్ప - నీతని మొగముఁ 7030
జూడఁ జూడ పునర్వ - సూ మధ్యచంద్రు
జాడ వీనుల గొప్ప - చౌకళుల్ మెఱయు
కతన నందము మించు - గా వచ్చువాఁడు
యితని పేరెద్ది ! - నీ వెఱిఁగింపు”మనినఁ



గరములు మొగిచి రా - ఘవు మోముఁ జూచి
సరమాధిపతి విభీ - షణుఁ డిట్టులనియె

-: విభీషణుఁడు శ్రీరాముని కతికాయుని వృత్తాంతము నెఱింగించుట :-

"ఇతఁడు రావణపుత్రుఁ - డితనికి నామ
మతికాయుఁ డండ్రు వీఁ - డసమాన బలుఁడు
మాయన్నకును ధాన్య - మాలిని యందు
నీయన జనియించె - నింద్రాదులకును 7040
వీఁడ జేయుఁడు ధాత - వీనికి నిచ్చె
వేఁడిన వరములు - విండ్లు నమ్ములును
కవచతూణీరముల్ - ఖడ్గముల్ రథము
నవనిజారమణ ! వీఁ - డతులవిక్రముఁడు
వరుణపాశము నింద్రు - వజ్రాయుధంబు
హరునిశూలమునుఁ - గాలాంతకు గదయు
వీనిపైఁ గొఱఁగావు - వీని యస్త్రంబు
లానిలింపులకెల్ల - నాపత్కరములు.
అందఱితోఁ బోరు - నటు గాదు వీని
ముందఱ నెదిరింప - ముక్కాఁక యగును!" 7050

--: అతికాయుని యుద్దము :--

అని విన్నవింపుచో - నతికాయుఁడార్చి
కనఁగన వెలుఁగు ప్ర - కాండ కాండములు
నిగుడించి కపుల మ - న్ని గొనంగఁ జూచి
మొగదప్పి యెవ్వరు - మొనసేయకున్న

ద్వివిదాది వానరుల్ - వృక్షముల్ గిరులు
సవరించి యెదురించి - జగడించునపుడు
వారేయు నవియెల్ల - వమ్ముగా నమ్ము
లాఱు నేడును - నాల్గు నైదును దొడ్గి
తునియలు చేసి కోఁ- తుల నెల్ల భయద
సునిశితాస్త్రముల నే - ర్చుటయు భీతిల్లి 7060
యందఱు బరువెత్త - నసురేంద్రసుతుఁడు
మందహాసంబుతో - మర్కటావళినిఁ
గనుఁగొని కరుణ చేఁ - గాచి కోదండ
ధరుఁడైన యట్టి సీ - తాకాంతుఁ జేరి
భల్లంబుచే నేర్చి - పట్టి యెక్కిడిన
యల్లె మీటుచు నప్పు - డతికాయుఁ డనియె.
"రామ ! దుర్బలుల వీ - రలనుసంగ్రామ
భూమిలో గెల్చి యే - పోటరి ననుచు
నెంచి నన్నటుల జయిం - చెద ననుచు
నుంచకు మాపని - యుల్లంబులోన 7070
ఖరునిదూషణుఁ గుంభ - కర్ణు విరాధుఁ
బొరిగొన్న నీదు తూ - పులు నాదుమీద
నిగిడింపు మటమీఁద - నీవే చూచెదవు
జగడంబులో మద - స్త్రకళా నిరూఢి
ఏసెదవోకాక- యే నేయఁ జూచి
యేసెదవో డెంద - మెఱిఁగింపు"మనిన
నామాట యందుక - యాడితి వనుచు
సౌమిత్రి యసు రేంద్ర - శాబకుఁ బలికె.

-: లక్ష్మణుఁ డతికాయునెదుర్కొని యధిక్షేపించుట - వారి సంభాషణము :-

"ఎచ్చు శౌర్యము వాఁడ - వేనుండ నీకు
వచ్చునే రఘువంశ - వర్ధనుఁజెనక 7080
నీమీద నిట్లుందు - వే రణరంగ
భీముఁడు రాముఁడో - పిన యట్టి కొలఁది
నన్ను మార్కొనుము ప్రా - ణములపై నాస
యున్న నవ్వలికేఁగు - నోర్చితి” ననిన
నతిశయరోష తా - మ్రాక్షుఁడై మఱలి
యతికాయుఁడల సుమి - త్రాత్మజుఁ బలికె
"బాలుఁడ నీవేమి - పలికిన నేమి
కేల చక్కఁగ విల్లుఁ - గీలింప లేవు
నీమీఁదఁ దొడుగుదు - నే నాశరంబు
రామునిపైఁ జెయి - రానిత్తుగాక.7090
అనిలోనఁ దనకు - నింద్రాదులు వెఱతు
రని నీ వెఱుంగక - యాడితి విట్లు
తొడిగిన నాచేతి - తూపున కోర్చి
జడియక యెదురింపఁ - జూలునే యొకఁడు.
అజరభూధరమైన - నలవింధ్యమైన
రజతాద్రియైనఁ బా - ర్వతి తండ్రియైన
నోరుచునో లేదో - యొక్క వ్రేటునకు !
మీ రాము నెఱుఁగమా - మీఁదటగాక
కాచితి నిన్ను నా - కడకేఁగు” మనినఁ
జూచి సౌమిత్రి ర - క్షోవీరుఁ బలికె. 7100

"పలుమార నను నీవు - బాలుఁడ వనుచుఁ
బలికెద వదినీకు - పౌరుషంబవునె
పిడుగెంత ? గిరియెంత - పిన్నగా దోటు
వడుగైన బలి చేరు - వామనమూర్తి
దొడ్డుగొంచెంబు లెం - దుకు చూడుమిపుడు
గడ్డుగా నీదు ర - క్తములు గ్రోలింతు
నీలీల వందుర - నీయమ్ము చేత
లోలాత్మ ! నీదు నా - లుకఁ గత్తరింతు
తరువృంతమునఁ బోవు - తాళఫలంబు
ధరడొల్లి నటుల నీ - తలఁ ద్రెవ్వవైతు 7110
పసిబిడ్డనే నిన్నుఁ - బసివట్టి మెసవి
మసలిన యముఁడని - మదినెన్నుమిపుడు
నాచేత విల్లు బా - ణంబులు గల్గి
నీచ రాక్షస ! యట్ల - నీవును దివ్య
బాణాబాణాసన - పాణినై యుండి
ప్రాణంబుపై యాశ - బలవంత మగుట
వట్టి మాటల గెల్వ - వచ్చితివేమొ
యిట్టని పోనిత్తు - నే నిన్ను ” ననిన


-: లక్ష్మణాతికాయుల యుద్ధము :-

నమరకంటకుడైన - యతికాయుఁ డలిగి
బొమముడితోడ తూ - పులు వింటఁ గూర్చి 7120
వ్రేసిన నదిగోన్ని - విశిఖముల్ దొడిగి
యాసుమిత్రాపుత్రుఁ - డడఁచె ఖండించి
మఱియు నైదమ్ముల - మనుజాశనుండు

సరగ నేసిన నర్ధ - చంద్రబాణముల
నవియును దునిమి సా - యక మొకటేర్చి
యవనీధరంబు పై - నశని చందమున
వేయుటయును ధాత - విలసించి నట్టి
యాయతికాయుఁ భా - గ్యాక్షరావళులు
గట్టించుగతి చాయ - గావచ్చి ఫాల
పట్టి నాఁటిన దైత్య - పతితనూభవుఁడు 7130
కనుమోడ్చి గడగడ - కంపించి తెలిసి
మనసులో మెచ్చి ప - ల్మాఱు లక్ష్మణుని
వంది చందమునఁ గై - వారముల్ చేసి
కందోయిఁగఱకెంపుఁ - గదుర దానవుఁడు
చనుమఱనాఁట ని - శాత సాయకము
కనలుచు సేయ రా - ఘవవరానుజుఁడు
భుగ్నమనస్కుఁడై - పొగిలు మిన్నెగయ
నాగ్నేయమైన ది - వ్యాస్త్ర మేయుటయు
నతికాయుఁ డలిగి సౌ -రాస్త్రంబుఁ దొడిగి
మతినేయనవిరెండు - మల్లడిఁ గొనఁగ 7140
నసురేంద్రసుతుఁ డైషి - శాస్త్ర మేయుటయు
నసముడించక బదు - లైంద్రాస్త్ర మేసి
సౌమిత్రి వారింపఁ - జలపట్టి యామ్య
నామాస్త్ర మసురేశ - నందనుండేసె
పవనాస్త్ర మూర్మిళా - ప్రతి ప్రయోగింప
నవీవోరి యన్యోన్య - మణఁగినఁ జూచి
లక్ష్మణుండతి కర - లాఘవ శౌర్య
లక్ష్ముఁడై బాణ జా - లముఁ బ్రయోగింప

నవి యతికాయమ - హాసుర వజ్ర
కవచంబుపై నగ్ని - కణములు రాల 7150
టంకార రవము నిం - డఁగ నాఁటినాల్గు
వంకల మొనచెడి - వసుధ పైఁ బడిన
నేమిసేయుదు నని - యెంచి వెండియును
సౌమిత్రి వినిశితా - స్త్రంబులు గురియ
దనుజవీరుఁ డమోఘ - తరతనుత్రాణ
మను వజ్రపంజర - మంగరక్షగను
సడ్డసేయక ప్రతి - శరములు వూను
నడ్డియు లేక ని - రాశఁ జేయుటయు
వేసరి యలసి 'యె - వ్వియు వీనిమేను
దూసిపోవవు నాదు - తూపు లెట్లింక 7160
రేకవాఱక యెచ్చ - రింపుచున్నాడు
కైకోక నాదివ్య - కాండముల్ వీఁడు'
అనుచుఁ జింతింపు చో - ననిలుండు వచ్చి
"మనువంశతిలక ! యీ - మనుజాశనునకు
బ్రహ్మయిచ్చిన మూల - రాజోడు గలదు
బ్రహ్మాస్త్ర మే కాని - పనికి రాదొకటి
వ్రేయుము నీవని ” - వినఁ బల్కి పోవ
వాయువు పలుకు కై - వడి లక్ష్మణుండు

-: లడ్మణుఁ డతికాయునిపై బ్రహ్మాస్త్రముఁ బ్రయోగించి యాతనిఁ బరిమార్చుట :-

నరవ భూతములు బ్ర - హ్మాస్త్రంబుఁ దొడిగి
పరగింప దిక్కులు పట - పటఁ బగిలె 7170

గంపించె వసుమతి - కదలె శైలములు
రొంపి దేలంగఁ బో - ర్లుచు మ్రోసె జలధి
సుడివడియె నభంబు - చుక్కలురాలె
వడఁకె దిగ్గజములు - వాపోయె ధాత
కావిరుల్ గప్పి లో - కము లస్తమించె
దేవతల్ జడిసిరి - దినరాజు మాసె
ననలార్క సన్నిభంబై - యమదండ
మన భోరుమనుచు బ్ర - హ్మాస్త్రంబు రాఁగ
జడియక బాణవ -ర్షంబులు దైత్యుఁ
డడరింప నవియెల్లఁ - నడఁచి కాల్పుచును 7180
మీఱిరా వాడందు - మీఁద దివ్యాస్త్ర
వారంబుఁ గురియింప - వమ్ము సేయుచును
ఘోరమైరాఁగ శ - క్తులు ప్రయోగించి
పోరాక ముద్గరం - బులు వేసి చూచి
కదిసిన చేనున్న - గదయెత్తికొట్టి
యవియు మించిన నిశి - తాసి చేనఱికి
చేకత్తిఁ బొడిచి మిం - చిన వంకి దూసి
చేకొద్ది గ్రుద్దిన - చెంగక డాసి
ధృతకుండల కిరీట - ధీధితుల్ మించు
నతికాయు మస్తకం - బవనిపైఁ ద్రెళ్లె. 7190
మెచ్చిరి కపులు సౌ - మిత్రి కొంకుచును
వచ్చి రాఘవ పాద - వనరుహంబులకు
మ్రొక్కిన నలరి త - మ్ముని లేవనెత్తి
యక్కునఁ గూర్చి శీ - తానులాపములు

మనను రంజిల నాడి - మఱియు సంగ్రామ
మునకెల్లవారు స - న్ముఖులైన యంత.

-: అతికాయుని మరణమును విని రావణుఁడు విలపించుట :-

చావులకును దప్పి - చనిన రాక్షసులు
వావిచ్చి యేడ్చి రా - వణుఁ జేరఁ బోయి
యతికాయముఖదైత్యు - లందఱుఁ గాల
గతినొందినట్టి సం - గతి యేర్పరింప 7200
విలపించి యిలవ్రాలి - వేగంబె తెలిసి
పలవరింపుచు 'ముద్దు - పట్టీ' యటంచు
"అతికాయ ! వోయితి - వా ! యంచు నెన్ని
"వెతలపాల్జేసితివే - విధి !”యనుచు
"నాబుద్ది నిట్లాయె - నా !’’ యంచు "నెందు
చేబార విడియేమి - సేయుదు ?” నంచు
“నన్ను నెవ్వరి కొప్ప - నము సేసిపోతి ?
వెన్నడు నెడవాయ - వెట్లోర్తు?”ననుచు
నారటింపుచును హా - హాకార మొదవ
నూరట లేక కే - లుర్వి నార్పుచును 7210
తపియించి “నిన్ను సీ - తానిమిత్తముగ
నిపుడు గోల్పోయితి - నెఱుఁగలేనైతి
నరులయ్యు నింద్రజి - న్నాగపాశములు
పరిహరించుక వారు - బ్రదికిన యపుడె
యారామవిభుఁడు నా - రాయణుండనుచు
వీరు కోఁతులుగారు - వేల్పులటంచు
నెఱుఁగుదు నెఱిఁగియు - నిట్లు నిన్ననిచి

యురక దాయల చేతి - కొప్పగించితిని.
ఎక్కడి బతుకని” - యేడ్చుచు లేచి
యొక్కఁడు జని శయ్య - నొరిగి చింతిలుచుఁ 7220
బడవాళ్ళచే గోట - పదిలంబుసేయఁ
గడు నెచ్చరిక సీతఁ - గాచుకయుండఁ
దగినట్టి దొరలకుఁ - దాఁదెల్పఁ బనిచి
పగఁదీర్ప నెవ్వారిఁ - బనుపుదు ననుచు
నాలోచనము సేయ - నపుడింద్రజిత్తుఁ
డాలోన వచ్చి తా - నతని కిట్లనియె.
"ఏల చింతిల్లెద - వేనున్న వాఁడ
నీ లక్ష్మణుని రాము - నెల్ల వారలను
చంపక రాను నీ - చరణంబులాన !
పంపుఁడిప్పుడే యెంత - పనియిది నాకు ? 7230
హరిహయ శశిభా - స్కరానల పవన
సురగరుడోరగా - సురముఖ్యు లెదుర
బలి యాగశాలలో - పంకజాతాక్షు
గెలుపు విలోకించి - కీర్తించి నటుల
నను మెచ్చఁగలరు దా - నవనాథ ! దైవ
మనిపించినట్టు లే - నాడితిఁ గాని
నాయిచ్చఁ బలుక మ - న్న నఁ బంపు”మనిన
"పోయి రమ్మ'నుచు న - ప్పుడు తండ్రి పలుక

--: ఇంద్రజిత్తు యుద్ధమునకు వెడలుట :--

కలనికి వచ్చి మూ- కల జుట్టు నునిచి
"సలుపగావలె పుర - శ్చరణ మీయెడను 7240

బ్రహ్మాస్త్ర మిప్పుడు - పాడి దప్పినది
బ్రహ్మయానతి సేయఁ - బరగు”నాకనుచు
హోమగుండ మమర్చి - హోమపదార్థ
సామగ్రి యంతయు - సవరించి యచట
నాసీనుఁడగుచు బా - ణాస్తరణంబుఁ
జేసి యయోమయం - చిత సాధనముల
నెఱ్ఱని పువ్వులు - నెఱ్ఱగంధంబు
నెఱ్ఱని వస్త్రంబు - లెలమి ధరించి
తాండికాష్టముల నా - థర్వణోక్తముగ
నేండు నూర్లాహుతు - లిచ్చి తావేల్చి 7250
లంకేశసుతుఁడు న - ల్లని మేకపోతు
నంకించి పట్టి పూ - ర్ణాహుతి యొసఁగ
హవిరన్న భాగంబు - లనలుండు మ్రోల
నవతరించి గ్రహించి - యాస్వదించుటయు
వలమాన శిఖిశిఖా - వర్త్మంబునందు
వెడలు బ్రహ్మాస్త్రంబు - విశిఖాసనంబు
నమ్ములుఁ గైకొని - యనిమొనఁజేరి
యమ్మహామహుఁడు దై - త్య శ్రేణిఁ జూచి
"నడువుఁడు మీరు వా - నరులపై భయము
విడువుఁడు మిముఁగాచి - విశిఖపాతముల 7260
నందఱు బడనేతు” - ననఁగనా భాస్క
రైందుముఖు లనుగ్ర - హాస్పదంబులుగ
నభము చెల్లించె న - న్నర భోజనుండు
రభసంబుతో వాన - ర శ్రేణిఁ దఱిమి
యమ్ములు పరగింప - నందఱుఁ గూడి

దొమ్మిగాఁగీశ యో - ధులు చుట్టుముట్టి
తరులను గిరులను - ద్ధతి జగడింప
శరములచే నవి - చక్కాడి త్రోచి
రథతూణ శస్త్ర సా - రథి కేతుకవచ
పృథులాశ్వ సాధనో - పేతుఁడై యెగసి 7270

-:ఇంద్రజిత్తు రామలక్ష్మణులను మూర్ఛనొందించుట:-

మాయావియై మేఘ - మాలికాచ్ఛన్న
కాయుఁడై యమ్ములఁ - గపుల పైఁ గురియ
రావణ సుతువాన – రశ్రేణి మింటి
త్రోవఁగానక నాల్గు - త్రోవల వెదకి
గిరులు మ్రోఁకులు నంది - కిలకిల ధ్వాన
భరితదిశానభో - భాగులై మూగి.
యదెయల్లె మ్రోఁత య - ల్లదె సింహనాద
మదె యార్పులదె యట్ట - హసారవంబు
నిదె తన్నుఁ బేర్కొని - యె నటంచు నచటి
కెదురెక్కుచునుఁ బోకు - మెటు వోయెదనుచు 7280
రాఁజూచి యసుర నా - రాచముల్ వహ్ని
రాఁజ నేసి మహీధ - రము భూరుహములు
చేత నుండఁగఁ బొడి - చేసి పైనెత్తు
మూతులపై రక్త - ములుఁగార నేసి
కన్నుల నమ్ములు - గాడించి తిరుగ
వెన్నుల నురములు - వెడల నాఁటించి
పదువుర నేవుర - బాణ మొక్కంట
గుదిగ్రుచ్చి యిలమీఁదఁ -గుప్పున వేసి

కొఱ్ఱులు వేయించె - క్రోతులనంగఁ
గఱ్ఱలౌదలలపైఁ - గాడ నమ్మొనలు 7290
కపులతో మహినాఁట - కదలి రాకుండ
నపుడుంచి యర్ధచం - ద్రాస్త్ర పాతముల
పచ్చడి చేసిన – పగిదిరాఁ జెఱకు
పిచ్చల వలె పంచి - పెట్టిన యట్లు
నగచరావళు లవ - యవము లన్నియును
తెగఁగొట్టి యున్కియుఁ – దెలియరాకుండ
వాలినూనుఁ బదింట - వాయుజు రెంట
నీలు మూటను మైందు - ని బదియాఱిటను
హరుని నాల్గింట గ - వాక్షు నేడింట
శరభుఁ బదింటఁ గే - సరిఁ బదేనింట 7300
నలగజ ద్వివిద వా - నర నాయకులను
నలువదింట సుషేణు - నాల్గింట తార
జాంబవద్గవయుల - శతబలి వాఁడి
యంబకంబుల నిర్వ - దంటఁగ నేసి
కుముద సూర్యానన - గోముఖ పనసు
లమిత శౌర్యులు గాన - నరువది ఘోర
సాయకంబుల నేసి - సమరంబులోన
గాయము లందు ర - క్తంబులు గురియఁ
జచ్చి రే యనఁగ మూ - ర్ఛమునుంగ నేసి
యెచ్చట నెదిరింప - నెవ్వాఁడు లేక 7310
జలజగర్భ వరప్ర - సాదన లబ్ధి
నలఘుకాండ ప్రకాం - డముల ముంపుచును
తమమీఁద రాఁజూచి - తమ్మునిఁ జూచి



రమణీయధాముండు - రాముఁ డిట్లనియె
"బ్రహ్మయిచ్చు వరంబు - పై చాటుగాఁగ
బ్రహ్మాస్త్ర కవచ ప్ర - భావంబు వలన
మాయావియై మేను - మనలకు డాఁచి
దాయ వీఁడీ కపీం - ద్రశ్రేణిఁ గూల్చె
నంగీకృతంబుగా - దసురారి మనకు
భంగింప రాదిట్టి - పట్టున వీని 7320
సాయకం బేయ ల - క్ష్యముఁగాన మేమి
సేయువారము వీని - చేతులలోన
సమయునప్పుడు సాహ - సము చూపలేక
సమరంబులో నదృ - ష్టం బిట్టులుండె
నీవేమి సేతువే - నేమి సేయుదును ?
రావణాసురుని శౌ - ర్యమ వార్య మగుట"
అనుచు నాలోచించు - నంతట పిడుగు
లను మీఱు నస్త్రజా - లంబుల చేతఁ
గడెమ వానరులను - ఖండించి యొక్క
బెడిదంపు తూపుచేఁ - బేరెద నాఁట 7320
సౌమిత్రిఁ బడసేసి - జనకజారమణు
భీమసాయకముల - పెనుమూర్ఛ ముంచి
యెదురింప లేరెకా - యించుక కదల
మెదలనైనను లేక - మేదిని మీఁదఁ
బడిన రాజులఁ గీశ - బలములఁ జూచి
గడసేపు చైతన్య - కళపూని యున్న
వారందురో యని - వానర వంశ
వీరుల కలనిలో - వెదకి లేకునికి

మదినమ్మి మఱలి స - మస్త దానవుల
బొదపెట్టికొని తల - వూవాడనీక 7340
యింద్రజిత్తుఁడు జయో - పేతుఁడై దాన
వేంద్రుని కడకుఁ బో - యిన తరువాత

-: విభీషణుఁడు జాంబవంతుని కర్తవ్య మడుగుట :-

నావిభీషణుఁ డొక్కఁ -డని కేగుదెంచి
చావక నోవక - సందడిఁ బడక
కనిపించుకొనక ర - క్కసుఁడందు మీఁదఁ
బినతండ్రి యగుట ద - ప్పించుక యుండి
యాయింద్ర జిత్తుచే - నాపదలేక
పోయె వాఁడని రణ - భూమికి వచ్చి
దాశరథుల నచే - తను లైనయట్టి
కీశయోధులఁ బరి - కింపుచుఁ గదిసి 7350
యందులో హనుమంతు - నతిబుద్దిమంతు
మందరాచల ధీరు - మాయావిదూరుఁ
గనుఁగొని యాతఁడొ - క్కఁడె కాని యితర
వనచరుల్ నొచ్చిన - వారని యెంచి
"నామాట వినుఁడు వా - నర యోధులార !
రామ సౌమిత్రులు - బ్రహ్మాస్త్రమునకుఁ
బ్రతి సేయ కది యొడం - బడి యున్నవారు
క్షితిమీఁద మీరు న - చేతనులగుచు
మీకెట్లు దీఱు నే - మికొఱంత దీన
పైకార్య మున్నది - పదర నేమి టికి ?” 7360

అనిన దిగ్గున లేచి - హనుమంతుఁ డతనిఁ
గనుఁగొని యుచిత వా - క్యముల నిట్లనియె
"పరికింత మెవ్వరు - బ్రతికి యున్నారొ
తరుచరుల్ కలను సో - దన సేయవలయుఁ
గానఁగరాదు చీ - కటి బలవంత
మైనది యైననే - మాయె! రమ్మ” నుచుఁ
గొఱవులు వట్టుక - కోతుల నెల్ల
బరికింపుచును వచ్చి - భల్లముల్ నాఁటి
తొడలు చేతులు గాళ్లు - తోకలుఁ జెవులు
నొడళులు దునిసి ర - ణోర్విలోఁ బడిన 7370
భానుజాంగదనల - పనసతారాది
వానరులను గాంచి - వగలతో వచ్చి
కడువాడి యలుగు లం - గము లెల్ల నాఁటఁ
బుడమిపైఁ బడి మూర్ఛఁ - బొందివో తెలిసి
కనుమోడ్చియున్న రి - క్షకులాధినాథు
వనచరహితు జాంబ - వంతు నీక్షించి
"కటకట! నైదారు - గడియలలోన
నిటువంటివారల - నింద్రజిత్తుండు
శితశరంబుల చెక్కు - చెమరక తాను
క్షితిఁ బడవైచి వ - చ్చిన త్రోవ వట్టె 7380
కంటిమింతయు దైవ - గతి" నని కేల
నంటుచు నిర్వురా - యండఁ గూర్చుండి
యనునయ వాక్యంబు - లతనితోఁ బుణ్య
జనపుణ్యుఁడా విభీ - షణుఁ డిట్లుపలికె
"బుద్ధిమంతుఁడ వార్య - పూజనీయుఁడవు

వృద్ధుండ వఖిలార్థ - వేదివి నీవు
ఇట్టివానికి నీకు - నీదశాననుని
పట్టిచే నీపాటు - బడియుండ వలసె!
బ్రదికి యున్నాడవే - ప్రాణంబుతోడఁ
గదల లేవను శ క్తి - గలిగి యున్నదియె ? 7390
వాకొన నోపుదు - వా ? యట్టులైనఁ
జేకూడు మాకు న - నేక కార్యములు"
అనవిని "బ్రదికితి - మన్న ! వచ్చితివె
జననుతుఁడగు విభీ - షణుఁడవా నీవు ?
సవసవగా నీదు - స్వర విశేషంబు
చెవి సోఁకి యేఁదెలి - సితి నింతెకాని
వినరావు లెస్సగా - వీనులు చూచి
కనరాదు నిన్ను నా - కన్నులు దెఱచి
లెస్సగా మాటాడ - లేను దైతేయ
దుస్సహాస్త్రములచేఁ - దూలి యున్నాఁడ 7400
నను నెంచనేల వా - నర జీవరక్ష
హనుమంతు డున్న వాఁ - డా సుఖంబునను
ఆమాట వినుపింపు - మస్మదాదులను
సేమంబు లడుగ వ - చింప నేమిటికి?
అనిన నచ్చెరువంది - యా విభీషణుఁడు
వినయంబుతో రిక్ష - విభున కిట్లనియె
"రాముఁ డుండఁగ వా - నర ప్రభుఁడుండ
సౌమిత్రి యుండ వా - సవ పౌత్రుఁడుండ
నలనీలకుముద మైం - ద సుషేణ తార
పనసాది వానర - ప్రభులెల్ల నుండ 7410

నెవ్వరి నడుగక - యేమిటి కయ్య
యివ్వేళ హనుమంతు - నీవు వేఁడితివి?
అది దెల్పు "మన రావ - ణానుజుతోడ
మది మెచ్చ భల్లూక - మార్తాండుఁ డనియె
"ఎవ్వరి నడుగఁ బ - నేమి? సేమంబు
లెవ్వారు నుండి వా - రేమిటి వారు?
అందఱు బ్రదుకుదు - మంజనాసుతుఁడు
కందక మన పాలఁ - గలిగి యుండినను!
అతని కొక్కటియైన - నందఱ మతని
బ్రతికింపఁ జాలము - బ్రదుక రెవ్వరను! 7420
కావునఁ బడిన రా - ఘవుల వానరుల
లేవనెత్త నొకండు - లేఁడని యెంచి
యడిగితి” నను నంత - నడుగుల మీఁదఁ
బడియున్న వాఁడ నేఁ - బవన నందనుఁడ
నేమి సేయుదు నాన - తిం” డన్నఁ దన్ను
నామేరఁ బుట్టిన - యట్టుగా నెంచి

-: జాంబవంతుఁడు హనుమంతుని సంజీవకరణినిఁ దెచ్చుటకు నియోగించుట :-

"అన్న! వాయుజ! వచ్చి - తంతియే చాలు
నన్ని నాళ్లుఁ జిరాయు - వగుఁగాక నీకు!
మనవారు రామల - క్ష్మణులును మఱల
మనకుఁ గల్గగ నాదు - మనవి యాలింపు 7430
హిమవన్న గంబున - కేఁగి యాచెంత
నమరులుంచఁగ రిష - భాద్రి మీఁదటను

కరమొప్పు సంజీవ - కరణి విశల్య
కరణియు సౌవర్ణ - కరణి సంధాన
కరణియుఁ గొనుచు వే - గ ముహూర్తమునకు
మఱలి రమ్మటుగాక - మనకొక్కరైన
యిందఱి ప్రాణంబు - లెత్తుకో నితరుఁ
డెందు నున్నాఁడు నీ - వింతయేకాక!”
అనుమాట చెవిసోఁకి - నప్పుడ యెగిరి
హనుమంతుఁ డరువది - యామటి పొడవు 7440
కల మలయాచలా - గ్రంబుపై నిలిచి
యిలయు నింగిఁయు దిక్కు - లెల్ల నీక్షించి
గర్జించిన నకాండ - కాండద భయద
గర్జానుకారి ఘ - ర్ఝర విరావంబు
విని బ్రదుకులయాశ - విడిచి యాలంక
మనుజులందఱును గొం - దల మందిరపుడు
వ్యాళాధిపతిరీతి - వాలంబు మింట
తాలార్బుదాయుతో - త్తాలమై నిగుడ
తరుణపంకేజ బాం - ధవ సఖంబైన
యరుణాస్య మండలం - బతి వివృతముగ 7450
ధరణిజా రాఘవా - ధార దండముల
కరణిమించు భుజయు - గంబు పై నెగయ
వంచిన తనవీపు - వనజ గర్భాండ
ముంచినఁ దెమలక - యునికి యేర్పడక
త్రొక్కిన యడుగులు - దొలిచి ధరిత్రి
నక్కొండ యణఁగించు - నపుడనిపింపఁ
జూపులు నిగుడింపు - చో విమానములు



చూపు దప్పగ నాల్గు - చోటుల కొదుగ
మోకాళ్లు ముడిచి రొ - మ్ము దిటమ్ము చేసి
కాకుత్థ్సవంశ శే - ఖరు నాత్మఁ దలఁచి 7460
రివ్వునఁ దానంత - రిక్షమార్గమున
నవ్వాయుజుఁడు కన - కాద్రిపై నరిగి


-: హనుమంతుఁడు సంజీవపర్వతమును పెకలించి తెచ్చుట
   దానిప్రభావమువలన రామలక్ష్మణులు మూర్ఛఁ దేటుట - వానరులు సుఖులగుట :-

శౌరి వంచు ప్రయోగ - చక్రంబురీతి
మీరి సామీరి యా - మిహిరమండలము
నొరసి యుత్తరపుఁ బ - యోధిఁ గన్గొనుచు
నరిగి జాంబవదుక్తి - యాత్మ నెన్నుచును
హిమవంతమున కేఁగి - ఋష్యాశ్రమములు
కమలకై రవ దీర్ఘి - కలు గనుఁగొనుచు
రజతాలయంబును - బ్రహ్మకోశంబు
నజరేంద్ర నిలయంబు - హరశరముక్తి 7470
బ్రహ్మాననంబు సూ - ర్యనిబంధనంబు
బ్రహ్మ శిరంబు వ - జ్రనికేతనంబు
యమకింకరంబు హ - యాస్యంబు భాల
నయన కార్ముక మిలా - నాభిస్థలంబు
కైలాసమును నల - కయు వృషభాద్రి
ప్రాలేయనగ హేమ - పర్వతంబులును
గాంచి సర్వౌషధి -గ్రావంబు వాని
ప్రాంచలంబులఁ జూచి - పవననందనుఁడు

నానగం బెక్కి మ - హోషధుల్ వెదకఁ
బూని రమ్యస్థలం - బులు మెట్టిచూచి 7480
యలఁత లేక యుపత్య - కాధీత్యకములఁ
గలయఁ గన్గొనుచు నే - కడఁ గాన లేక
విచ్చలవిడి పెక్కు - వేలు యోజనము
లిచ్చ యోజన పుట్ట - నేఁగి శోధింప
నాకొండఁ గల మందు - లన్నియు దాఁగి
యాకపీంద్రునికి దృ - శ్యములు గాకున్న
గనలుచు మందుల - గట్టు నీక్షించి
హనుమంతుఁ డాగ్రహ - వ్యగ్రుఁడై పలికె.
"అచలేంద్ర ! రామ కార్యార్థినై యొంటి
నిచటికి వచ్చితి - నెల్లవానరులు 7490
రావణసుతుని య - స్త్రంబులఁ జాలఁ
జావుల కెనయు మూ - ర్ఛలఁ బడియుండ
నీయందు గల్గు న - నేకౌషధములు
పోయి తెమ్మనిన ని - ప్పుడు వచ్చినాఁడ
సదయుండవగుచుఁ బ్ర - సన్న భావమున
నొదిగింపు మౌషధీ - యుతములౌ లతలు"
అనిన నేమియుఁ బల్క - కచ లేంద్రుఁ డున్నఁ
గనలి "యోరోరి ! నీ – కఠినభావంబు
మానుదువే మంచి - మాటల ? నన్ను
వానరమాత్రుగా - వగచితుల్లమునఁ 7500
బొడిచి కాలను రాచి - పొడిపొడి సేసి
గడియలోఁ దూర్పెత్తఁ - గలను రూపఱఁగ
దుమ్ముగావింప మం - దులు వోవుననుచు

నెమ్మదిగానెంచి - నిన్నుఁ గాచితిని !
ఇదె నిన్నుఁ బెకలించి - యెత్తుకచనుదు
నదిచూడు” మనుచు వా - లాగ్రంబు వెనిచి
యాకొండ చుట్టి చ - య్యనఁ బెకలించి
కైకొని దేవతా - గణముఁ గీర్తింప
హరి సుదర్శనము స - హస్రారములను
దొరయ బల్మంటల - తోఁ దాల్చినట్లు 7510
తనచేత దివ్యౌష - ధ ప్రకాశములఁ
బెనుగట్టు వెలుఁగ నా - భీల వేగమున
సింధువుపై చేయ - సింహనాదంబు
కంధరధ్వనిఁ జేయఁ - గపు లెల్లఁ బొగడ
ధరణీధరంబు యు - ద్ధమహీ స్థలమున
నరుదొందఁగా నిల్పు - నంతటిలోన
నాకొండపైన పూ - ర్వానిలాంకురము
లేకడఁ గలయంగ - నించుక వొలయ
రామలక్ష్మణులు ని - ద్రలు దేలినటుల
నామొదలింటి చ - ర్యలఁ బ్రకాశింప 7520
వానరు లెల్లఁ బూ - ర్వప్రకారమున
మేనుల నొవ్వు లే - మియు లేకలేచి
యాహావోత్సాహ ర - సా వేశశౌర్య
దోహళులై యుండ - దోః శక్తిశాలి
పవమానతనయుఁ - డా పర్వతేంద్రంబు
జవమున నెత్తుక - చని తొంటియటుల
హైమభూధరరాజ - మాదల డించి,
యామున్నువోలి మ - హాహవావనికిఁ

జేరి యాత్మీయుల - సేయు మన్ననల
మీఱుచుఁ దొల్లిటి – మేర నున్నంత. 7530
రావణానుజ్ఞ చే - రాక్షసుల్ వడిన
యావేళ సమరోర్వి - కన్యదానవులు
వచ్చినవారల - వనధిలోపలికిఁ
దెచ్చి వైచుటను దై - తేయులలోన
నొకఁడైన మఱలి - రానోపక పొలిసి
రకలంక సంజీవనౌ - షధక్రియను.

-:ఇంద్రజిత్తు రావణునితో తాను రామలక్ష్మణులను జంపితినని ప్రగల్భములు పలుకుట :-

ఇంద్రజిత్తుఁడు దాన - వేంద్రుని కడకుఁ
జంద్రప్రకాశాస్త్ర - శస్త్రముల్ వెలుఁగఁ
బదములపై వ్రాలి - "పనిచితి వీవు
కదనంబునకుఁ బోయి - కాకుత్సకులుల 7540
సుగ్రీవముఖకపి - స్తోమంబు నెల్ల
నుగ్రాంశుకిరణజా – లోపమాస్త్రములఁ
జంపివచ్చితి నన్న - సంతోషమాత్మఁ
బొంపిరి పోవ తాఁ - బుత్రునిఁ దిగిచి
యాలింగనము చేసి - యనిచి యింటికిని
చాలవేడుక సుఖ - శయనుఁడై యుండె.
తెలపాఱుటయును రా - త్రించరుల్ నేఁడు
కలనికి రానట్టి - కతమేమి యనుచు
వానరుల్ దలఁప రా - వణుఁడు మానసము
లోన రాముఁడు కోఁతు - లును జచ్చిరనుచు 7550

నూరటగైకొని - యుండ నాలోన
సారసబంధుఁ డ - స్తనగంబుఁ జేరె
సాయంత నారంభ - సమయంబునందు
వాయుజుఁ గాంచిది - వాకరాత్మజుఁడు
"కుంభకర్ణాది ర - క్షో వీరులెల్ల
నంభోధిపాలైరి - హతులైనయట్టి
మనవారు బ్రతికిరీ - మాటలాలించి
దనుజనాయకుఁడు యు - ద్ధముసేయ వెఱచె
జగడంబొనర్ప రా - క్షసు లింక రారు
తెగి మీరు లంక ము - త్తిక వేయబోక 7560
లగ్గల కెక్కుడా - లములోన వెఱచి
నెగ్గినవానినే - నిగ్రహింపుచును
గాలిచి రండు లం - కాపురం బెల్ల
వేలంబె పైనమై - వెలివడుఁ”డన్నఁ

--: వానరులు లంకనుగాల్చుట - వానర రాక్షసుల సంకులయుద్ధము :--

గపులెల్లఁ గొఱవులుఁ - గరములఁ బట్టి
యపుడే కొండలు వైచి - యగడితల్ వూడ్చి
చెట్టులు కోటతోఁ - జేరిచి యెక్కి
చుట్టు నాళ్వరుల ర - క్షోరాశిఁ జంపి
వాకిళ్ళ నున్నటి - వారలఁ గూల్చి
యేకడ దామెయై - యిండ్లిండ్లుచేరి 7570
కాలిచి మిద్దెలం - గళులును నేలఁ
గూలిచి పురమెల్లఁ - గొల్లలు వెట్టి

యెఱమంట లెగయింప - నిండ్లలోవెడలి
పరువిడు దైత్యులం - బట్టిచంపుచును
యెదురించు దనుజుల - నిఱియంగఁ బట్టి
వదలక చిచ్చులో - వైచి చంపుచును
కోలాహలము సేయుఁ - గోఁతులకూఁత
లాలకింపుచు భర - తాగ్రజుఁ డపుడ
యొకయమ్ముఁ దొడిగి సా - లోపరి సౌధ
మొక యేటుచే నేల - నురులంగ నేసి 7580
బయలుచేసుక లంక పై - చూపులునిచి
జయమి. ..........
లంకాపురంబు కా - లఁగ జలరాసి
యింకించుపాటి క - ట్టెఱమంట లెగసె
నంబుధిలోమంట - అరుణధీధితులు
బింబించు నప్పుడో - ప్పెను చూడఁ జూడ
దానవ శోణిత - ధారలు వఱచి
యానెత్తురులు నిండె - నన శోణ రుచుల
నంతట రావణుఁ - డంతయుఁ దెలిసి
యంతకాకారుఁడై - యసురనాయకులఁ 7590
బనిచి దానవసేన - బయలుదేఱించి
పెనుభేరి మొరయించి - పిలువనంపించి
కుంభనికుంభుల - ఘోరరాక్షసులఁ
గుంభకర్ణుని కొడు - కులఁ గౌగలించి
కలను సేయఁగఁ బంచి - కంపనునట్ల
బలికి యూపాక్షు వెం- బడిగాఁగ ననిచి

యనునయింపుచు శో - ణితాక్ష ప్రజంఘు
లనువారు గూడి పొ - మ్మని సెలవిడిన

--: శోణితాక్షప్రజంఘ, కుంభనికుంభ, కంపన, యూపాక్షులు యుద్ధమునకు వెడలుట :--

నందఱు దమ చతు - రంగ బలంబు
ముందఱ నడిపించి - మొనలకుఁ జేర 7600
పండువెన్నెల తేట - పర్విన గొంత
మండెడి లంకలో - మంటలోఁ గొంత
దనుజనాయకుల నూ - త్నవిభూషణంబు
లను గొంత తిమిరమె - ల్ల నడంగుటయును
పగఁదీర్తమని పట్ట - పగలింటిరీతి
జగిడింప వానర - సైన్య ముప్పొంగ
దానవుల్ శక్తిగ - దాకుంతముసల
నానాస్త్రశస్త్ర స - న్నాహంబుతోడ
బిరుదుటెక్కెములెత్తి - పెక్కువాద్యములు
మొరయ నార్పులు నింగి – ముట్టంగ నడచి 7610
తారసంబగుటయుఁ - దరువులు గిరులు
భోరున నిలయెల్లఁ - బొదువఁగా నేసి
వానరుల్ తమదంత - వాలనఖాగ్ర
జానుపాదకరాది - సాధనంబులను
నొప్పింప దనుజు లే - నుఁగుల ఢీకొలిపి
గొప్పతేజీల భ -గ్గునఁజొరనిచ్చి
యరదముల్ నడపించి - యాసురబలముఁ

బురికొల్పి యాయుధం - బులు ప్రయోగింప
సరివాలుగా రెండు - సైన్యంబులందు
తెరలెను మూఁకలా - దిత్యునగ్గింప 7620
నందిందు రణశూరు - లగ్గలికలను
సందడి కయ్యంబు - సలుపుచున్నపుడు
పొడువుండు జంపుఁడు - పోనీకుఁడనుచు
బెడిదంబుగా నార్చి - పెడబొబ్బలిడుచుఁ
బోరాడునెడ కీశ - పుంగవుల్ విఱిగి

-: అంగదుఁడ కంపనునితో యుద్ధము చేసి యాతనిఁజంపుట :-

పఱవ నంగదుఁడ కం - పనునిపై నడచి
గిరివ్రేయుటయు వాఁడు - కేల నున్నట్టి
పరిఘంబుచే నది - భగ్నంబు చేసి
గద సవరించి యం - గదకుమారకుని
యెద నొవ్వనేసిన - నిట్టటు దలఁకి 7630
తెప్పిఱి యొక్క య - ద్రి పెకల్చి తెచ్చి
గుప్పున నురవడి - గుప్పిన వాఁడు
తల యవియఁగఁబడి - తన్నుక పుడమి
నలినలి యగుచుఁ బ్రా - ణంబులువిడిచె

--: శోణితాక్షునితోఁ బోరాటము :--

ఆపాటు గని శోణి - తాక్షుండు మిగుల
కోపంబుతో వాలి - కొడుకుపై నెదిరి
నారాచవత్స దం - తాపారశల్య
హారికర్ణిక్షుర - ప్రాది నామములఁ

గలిగిన తూపు లం - గదుని యంగమునఁ
జలపట్టి యేయ న - స్త్ర ప్రవాహములఁ 7640
దోఁగి............శోణితాక్షు
నాఁగి దానవు చేతి - యమ్ములు విల్లు
నొడిసి రాఁదిగిచి య - త్యుద్ధతి మీర
బొడిచేసి యరదంబుఁ - బుడమిపైఁ గూల్చి
దర్పించుటయు వాఁడు - తరవారి వూని
యార్పుచు మింటి చా - యను వేడెమిడఁగ
నంగదుండును వెంట - నాకాశమునకు
రింగున నెగిరి చే - రిన దానవుండు
నఱికిన యావేటు - నకు నణగించి
కరమున నున్న ఖ - డ్గంబు తా నొడిచి 7650
తీసుక వాని జం - దెపు వాటుగాఁగ
వ్రేసిన యసుర యు - ర్వినిఁ బడి లేచి
గదచేత మఱియు నం - గదునిపై కెగసి
కదిమి కొట్టుటయు నా - గ్రహముతో నతఁడు
మనుజాశనుఁడు దాను - మల్లసంగ్రామ
మునకుఁ జేరి సమాన - ముగ నిలవ్రాలి

-: ప్రజంఘయూపాక్షు లంగదుని యడ్డగించుట :-

జగడించునవుడు ప్ర - జంఘయూపాక్షు
లగచరాగ్రణి మీఁద - నమ్ములు గురిసి
దొమ్మి సేయుడు నంగ - దుఁడు వారి నడుమఁ
గ్రమ్మి పోరుచు విశా - ఖా వృతుఁడైన 7660

నిండు చందురు మాడ్కి - నిలిచి మువ్వురను
దండింపఁ దలఁప న - త్తరిఁ దోడుగాఁగ

-: వానరవీరులు మైందద్వివిదు లంగదునకు సహాయ మగుట - ప్రజంఘుఁడు పరలోక గతుఁడగుట :-

తొడరి మైంద ద్వివి - దులు వచ్చి వారి
యెడదూరి బలుగయ్య - మిచ్చిన యంత
వారలేసిన తరు - వ్రజము యూపాక్షు
డాఱమ్ములను ద్రుంచి - యార్చినఁ జూచి
శోణితాక్షుండు నా - ర్చుచు వారిమేన
శోణితధారలు - జోరునఁ గురియ
శరము లేయుటయు ప్ర - జంఘుఁ డంగదుని
కరవాలమున రొమ్ము - గాయమ్ము సేయఁ 7670
దాళి దానవు నొక్క - తరువు చేఁ గొట్టి
వాలిసూనుఁడు కేల - వృక్షంబు వొదువ
గురువజ్రసార జం – ఘుఁడు ప్రజంఘుండు
గరమెత్తి ముష్టి నం - గదు లలాటంబుఁ
బొడిచిన కళవళిం - పుచు వాలియొంటి
కొడుకు ధైర్యముఁ దెచ్చు - కొని పడియున్నఁ
దరవారిఁ గైకొని - తలఁ ద్రెవ్వ నేయఁ
దెరలె ప్రజంఘు బొం - ది ధరాతలమున

--: శోణితాక్షు యూపాక్షులు హతులగుట :--

యూపాక్షుఁడది చూచి - యుల్లంబుఁ గలఁగఁ
గోపించి వాలంబు - కోలలు గురిసి 7680



మువ్వుర వానర - ముఖ్యుల నొంచి
కొవ్వున చేతుల - కొద్ది పోరాడి
యమ్ములన్నియు సెల - వైనచో కేడి
యమ్ము కత్తియుఁ బూని - యరదమ్ము డిగ్గి
ద్వివిదునిఁ గదియ నె - త్తిన కత్తిచేయి
జవశక్తులను బట్టి - జగతిపై వై చి
యొత్తగిల్లఁగఁ ద్రోచి - యూపాక్షు మేన
నెత్తురు జొ త్తిల్ల - నెఱులు వీడంగ
నీడిచి బాధించు - నెడ శోణితాక్షు
డోడక ద్వివిదుని - యుత్తమాంగంబుఁ 7690
బరిఘంబుచేవ్రేయ - బాసట యగుచు
నరమి మైందుఁడు శోణి - తాక్షునిఁ బట్టి
నేలను వైచి త - న్నిగజంబు వోలి
కాలను రాచినఁ - గాలునిఁ జేరె
శోణితాక్షునిఁ జంపి - చొచ్చి యూపాక్షు
ప్రాణంబులొక యంతఁ - బైపయిఁ బోవఁ
గినిసి మైందుండు కౌఁ - గిట బిగియించి
యనిలోనఁ బడవైచి - యార్చె మిన్నగల
నావేళ దానవు లం - దఱు విఱిగి


–: కుంభుని యుద్ధము-ఆతని మరణము :-

పోవఁ దానాఁగి కుం - భుఁడు తేరుఁద్రోలి 7700
యపరంజి గఱుల వా - లమ్ములఁ దనకు
రపమైన గతి వాన - ర శ్రేణిఁ ద్రుంచి
ద్వివిదుఁ గాంచన శర - ద్వితయంబు చేత

నవని పైఁ ద్రెళ్లింప - ననుజుని పాటు
మైందుండు గని చేన - మర్చిన యట్టి
చందనాచల శృంగ - శకలంబు చేత
వ్రేసిన కుంభుండు - విశిఖ పంచకము
వ్రేసి చూర్ణము చేసి - వెంటనే యొక్క
తూపు సంధించి మైం - దునిఁ బడ నేసి
చూపఱమెచ్చి నా - ర్చటయు నంగదుఁడు 7710
మేనమామల పాటు - మిగుల డెందంబు
లోన నాగ్రహము గీ - లు కొనంగఁ జేయఁ
దరు శిలావర్షముల్ - దానవుమీఁదఁ
దొరగింప నమ్ములు - తుమురుగా నేసి
రెండు బాణములు నా - రినిఁగూర్చి యతని
రెండు కన్బొమల దా - రికి నట్టనడుమ
వ్రేసిన నెత్తురుల్ - వెడలి నేత్రములు
మూసుక పఱవ రా - ముని వీరభటుఁడు
కన్నులఁ దానొక్క - కరమునఁ బొదివి
యున్న కేలను చెంత - నున్న భూరుహము 7720
కుంభీంద్రమునుఁ బోలి - కోపించి తిగిచి
కుంభినిపై నేయ - కుంభినిఁ బడఁగ
నేడు బాణంబుల - నేసె వెండియును
మూఁడు బాణంబుల - మొన చేత మేను
నొచ్చిన వాలిసూ - నునిఁ జూచి విఱిగి
వచ్చి రామునిఁ జూచి - వానరులెల్ల
విన్నవించిన రిక్ష - విభుఁ డాదిగాఁగ
నున్న వానర వీర - యోధులఁ జూచి

యంగదు చెంతకు - ననిచిన శైల
శృంగముల్ తరువులుఁ - జేతులఁ బట్టి 7730
యొక్క మొత్తంబుగా - నురవణించుటయు
రక్కసుఁ డుగ్ర నా - రాచధారలను
నందఱి నన్నింట - నదటణఁగించి
చిందర వందఱఁ - జేసి పోఁదఱుమఁ
దనయన్న కొడుకు యు - ద్దము చేసి యలసె
ననియెంచి సుగ్రీవుఁ - డడ్డంబు వచ్చి
చెట్టుల గుట్టల - చే కొద్ది రువ్వ
దిట్టయై కుంభుఁడె - దిర్చి యన్నిటిని
జక్కసేయుచు వన - చర పట్టభద్రు
నొక్క నారసమేర్చి - యురమేయుటయును 7740
నొచ్చియు వాని ధ - నుర్దండ మెగిరి
పుచ్చుక విఱిచి తూ - పులు పొడిచేసి
కేడించి నిలిచి కి - ష్కింధా వరుండు
ప్రోడ మాటలను కుం - భుని తోడఁ బలికె
"రావణ కుంభక - ర్ణ సమానమైన
లావు శౌర్యము కర - లాఘవ క్రియలు
గలిగిన వాఁడ వా - ఖండల వరుణ
బలధనాధిప బలి - ప్రహ్లాద ముఖులఁ
జూడవత్తువు నీవు - చూడుము నేఁటి
వేడుక నాతోడ - వెఱవక నిలిచి 7750
మల్లవోరు” మటన్న - మాటలో గుండె
ఝల్లుమనంగ రా - క్షసనాయకుండు
పిడుగు దూఱినయట్లఁ - బేర్చి యాజ్యమునఁ

గడు మండు నగ్ని వై - ఖరి నాగ్రహించి
చొచ్చి పట్టుకొని రా - జు మొగంబులందు
వెచ్చ నూర్పులు పొగల్ - వెడల నిర్వురునుఁ
బెనఁగుచు సరివోరి - పిడికిటపోట్ల
వెనుతీక జగజెట్ల - విధమునఁ బోరి
కదిసి యిర్వురు దేరు - కాశలు వట్టి
యెదురాని త్రోయుచో - నీడ్చి లాగించి 7760
వెనుకను నెగురంగ - వ్రేయ కుంభుండు
వనరాశిలోని జీ - వశ్రేణిఁ గదియఁ
జెలియలికట్ట మిం - చి జలంబు లుబ్బి
చులకగా నెగసి ర - క్షో వీరవరుఁడు
గరుడ వేగమున భా - స్కరకుమారకుని
యురము పైఁ బిడికిట - నుంకించి పొడువఁ
బొడిచిన నోట ను - ప్పొంగి నెత్తురులు
వడియ నురోవీధి - వ్రయ్యలై పగిలి
యెమ్ములు గనుపింప - నించుక యైన
సొమ్మసిల్లక వాలి - సోదరుం డలిగి 7770
కడియిడి యని పండ్లు - గఱచుక యెగిరి
పిడికిటఁ బొడిచిన - పేరెదఁదాఁకి
పటపట గుండెలు - వగుల భోగీంద్ర
కటకతాడిత దివా - కరుఁడొ యనంగ
దివిజులు మెచ్చ దై - తేయులు మెచ్చ
భువిమీఁద వ్రాలి కుం - భుఁడు మృతినొందె!
అతని పాటున ధాత్రి - యల్లలనాడె
జతకట్టుగతి దిగ్గ - జంబులు మ్రొగ్గె

పడగలొయ్యన వంచె - ఫణిరాజు శిరము
ముడిచె లోపలికి న - మ్మొదటి కచ్ఛపము 7780
సంభూతభీతి రా - క్షసులెల్ల విఱిగి
కుంభుని చావు ని - కుంభునితోడఁ

-: హనుమంత నికుంభుల యుద్దము - నికుంభుఁడీల్గుట :-

దెలిపినఁ దమయన్న - తెగియెగా యనుచుఁ
గలఁగుచు నిప్పులుఁ - గన్నుల రాల
నింట పూజలుగాంచి - యెపుడు వేలుపుల
వెంటాడి యరుల క్రొ - వ్వేడి నెత్తురులఁ
బలుమారు మక్కుడు - నట్టి వజ్రంపు
పలక చెక్కడముల – పది హరువులను
గనగన జాాళువా - కట్లు వెలుంగఁ
దనరి కాలుని గదా - దండంబు మాడ్కి 7790
కనుపట్టు తనపరి - ఘము కేలఁబూని
వనచరుల్ గజగజ - వడఁక తానడచి
కపినాథుఁ జూచి చ - క్రము ద్రిప్పినటుల
నపుడాత్మ సాధనం - బనుర ద్రిప్పుటయుఁ
బరిఘంబులో విట - పావతి నామ
పురమును గంధర్వ - పురములు నింద్రు
పురము సప్తద్వీప - ములతోడనెల్ల
ధరణియు నారసా - తలలోకములును
గ్రహములు సూర్ధ్వలో - కములు దారకలు
గ్రహ రాజుతోఁ గూడ - కమలజాండంబు 7800

కడిమి గులాల చ - క్రన్యాయ మొంది
గడెసేవు దిరుగ న - కాండకాలాగ్ని
దరికొన్నగతి నున్న - దానవ వీరుఁ
బరికించి చిత్తరు - ప్రతిమలున్నట్లు
తరుచరులును వీర - దానవుల్ మేను
లెఱుగక నిలుచున్న - యెడల నిల్చుటయు
మేను డాపక రొమ్ము - మిక్కిలిచాఁచి
తానిల్చి పవమాన - తనయుఁ డెదుర్ప
రూపఱు మనుచుఁ బే - ర్కొని నికుంభుండు
కోపించి యతని వ - క్షోవీథి నేయ 7810
నెద దాఁకి భగ్గున - నెఱమంట లెగయ
నది నూఱు శకలంబు - లై యిలఁ బడియె.
ఆపెట్టుచే నురం - బవిసి వాయుజుఁడు
కోపించి పిడికిటఁ - గొట్టి వ్రేయుటయుఁ
జేయి బల్ డొక్కలోఁ - జిక్కిన గుండె
కాయలు పెకలి రాఁ - గరమీడ్చుకొనిన
నానికుంభుండు దాన - నచలుఁడై వాయు
సూనునిఁ బట్టి యీ - డ్చుచు పెనంగుచును
గద్దించు మ్రోఁత లం - కాపురిలోనఁ
బెద్ద భేరులు మొర - పించి నట్లుండె 7820
నామహాధ్వనిఁ ద్రికూ - టాద్రి కందరము
నామటికిని విను - నట్లుగా మొరసె.
చెయి ద్రెంచి వానర - సింహ మాదనుజుఁ
బయిచేసి పిడికిటఁ - బ్రహారించుటయును
వాఁడును హనుమంతు - వజ్రకాయంబు

పోఁడిమిచెడ ముష్టిఁ - బొడిచి యార్చుటయు
నప్పుడ హనుమంతుఁ - డాదైత్యుమీదఁ
గుప్పించి బలుపిడు - గునుఁ బోలి పడిన
నిలువఁ జాలక వాఁడు - నేలను వ్రాల
బలుగొండ గతి రొమ్ము - పైఁ బడవట్టి 7830
తలవట్టి మెలివెట్ట - దైత్యుండు గొఱియ
వలె బిట్టు గూయిడ - వదనంబు ద్రొక్కి
మల్లాడ నేలని - మార్మెడ వెట్టి
పెళ్లున బొండుగ - పెకలఁ ద్రుంచుటయుఁ
జచ్చినవాని మ - స్తముఁ ద్రొక్కిలేచి
రిచ్చపాటునఁ గపి -శ్రేణి గీర్తింపఁ
జెడి రక్కసులు లంకఁ - జేరఁగఁ బువ్వు
జడులు మిన్నుల సంత - సంబుగాఁగురియ
రాముఁడు మన్నింప - రవిజాదికపులు
సామోక్తులాడ కే - సరిసుతుండలరె. 7840

-: రావణుఁడు రాక్షస వీరులయుదంతము విని, మకరాక్షుని యుద్ధమున కనుచుట :-

ఆలంబులోఁ బాఱు - ననురులు పోయి
యాలంకలోన ద - శాస్యునిఁ జూచి
యింతయు నెఱిఁగింప - నెంతయు రోష
మంతరంగము నిండి - యలుగులుఁబాఱ
భ్రుకుటి చలింప న - ప్పుడు ఖరపుత్రు
మకరాక్షుఁడనువాని - మన్ననఁ బిలిచి

"గరివించినారు రా - ఘవులు వానరులు
దురములో నెదురు దై - త్యులఁ జంపినారు.
ఆపరానట్టి శో - కాపగ దాఁట
తేపవై నాపగఁ - దీర్చి రమ్మ” నిన 7850
మకరాక్షుఁడపుడు భీ - మకరాస్త్రశస్త్ర
నికరాసికోదండ - నిపుణత మెఱయ
నసురేంద్రు వలగొని - యనుమతుండగుచు
దెసలు గంపింప రా - త్రీంచరశ్రేణి
చతురంగ బలముల - జతనమైరాఁగ
మతియించి రధముపై - మార్తాండురీతిఁ
దేజరిల్లుడు సార - థినిజూచి “నేటి
కాజిలో నిను మెచ్చు - నట్లు నేయుదును
రామలక్ష్మణవాన - ర శ్రేణిఁ గూల్చి
ప్రేమ పుట్టింతు మా - పెదతండ్రికేను 7860
చూడుము తేరు వా - జులు నిచ్చ వలయు
జాడ మెలంగఁగ - సమకట్టుమీవు”
అని పల్కి మకరాక్షుఁ - డాహవంబులకు
దనుజులఁ బురికొల్పి - తముకులు మొఱయ
నల్లె మీటుచు రాఁగ - నతని కేతనము
పెళ్లున విఱిగి కుం - భిని మీఁదఁ బడియె.
సారధి మునికోల - జాఱఁ జేవదలె
వారువమ్ములు నేత్ర - వారి వర్షించె
గజములు మదములిం - కఁగఁ గూఁతలిడియె
రజనీచరుల మీఁద -వ్రా లెకంకములు 7870

విషమవాయువు బిట్టు - వీచే దానవులు
విషము మింగిన యట్ల - వివశులై రవుడు
అవశకునంబుల - నా మకరాక్షు
డవమతి సేసి క - య్యమునకుఁ గదలి
చనుచోట సాధన - చాకచక్యములు
దనుజసైన్యంబు ముం - దఱగాఁగ నడచె
కపులు మహీరుహ - గ్రావముల్ వూని
తపనజాంగదనీల - తారవాయుజులు
మున్ను గా నడచి రా - ముని సమక్షమున
నన్నిశాచరులతో - నాలంబుఁ జేసి 7880
మోహరించుటయును - ముక్కాక నేయు
నాహరివీర మ - హా హవంబునకు
వెఱచి దానవులెల్ల - వెన్నిచ్చి తనదు
మఱుఁగుఁ జేరినఁ జూచి - మకరాక్షుడలిగి
తేరు చక్కఁగఁ ద్రోలి - దివ్య బాణముల
నూఱు నాఱుపదారు - ను పదేను లెక్క
నెదిరించు కోఁతుల - నెల్ల నొక్కొకని
గుదులు గ్రుచ్చి ధరిత్రిఁ - గుప్పలు వేసి
మొనగాండ్ల కీశచ - మూనాయకులను
మొన చెడ దివ్యాస్త్ర - ముల నొవ్వనేసి 7890
యురవడించినయంత - నొకరైన నెదిరి
దురము గావింప స - త్తువలేక విఱిగి
మర్కటావళి తన - మఱుఁగుఁ జొచ్చుటయు
నర్కవంశవతంసుఁ - డవనిజాప్రియుఁడు
వెఱవకుఁడని కేల - విల్లు సారించి

శరములుఁ గైకొని - సమరోర్వియందు
బెడిదంవు తూపుల - భీకరాసురులఁ
బడలు వడంగ దె - ప్పరము చూపుటయుఁ
బలచనై తనమూక - బయలైనఁ జూచి
యలఘుశౌర్యుఁడు మక - రాక్షుఁడెదిర్చి 7900
రామునిఁ జేరంగ - రథము పోనిచ్చి
సౌమిత్రిముఖుల నెం - చక యిట్లు పలికె.

-: శ్రీరామ మకరాక్షుల సమరోక్తులు :--

"రామ ! యిన్నాళ్లు నీ - రాక నెమ్మదిని
కామించి యున్నచోఁ - గడతేఱెఁ గోర్కె
వెదకుచు వచ్చు తీ - వియ దైవగతిని
పదములు దవిలిన - పగిదిఁగాంచితిని.
తమ తండ్రి మును జన - స్థానంబునందు
సమయించు పగఁ దీర్పఁ - జాలుగాయనుచు
వెతనొందు తనకు నీ - విధి పట్టి తెచ్చె
సుతకర్మ మగునట్టి - సూడుద్రిప్పెదను. 7910
ఆఁకొన్నయట్టి సిం - హము నల్పమృగము
సోఁకోర్చి పోరాడఁ - జూచిన యట్ల
సాయుధపాణివై - యని నస్మదీయ
సాయకానములో - శలభంబవైతి
నీచేతఁ జచ్చిన - నీచ రాక్షసులఁ
జూచి కూడి మెలంగు - చోటి కంచెదను
అందఱు మనశక్తు - లరయుచు నెచ్చు
గుందు లేర్పఱచి క - న్గొందురుగాక

యేకత్తిసాధన - నెప్పుడు నీవు
చేకని యుందువో - సేయుము దాన 7920
యెత్తిన కైదువు - నే నిన్నునెదిరి
పొత్తంబులకుఁ దగఁ - బొడిచి కూల్చెదను”
అనుమాటలకు మక - రాక్షునిఁ జూచి
జనకజారమణుఁ డెం - చక యిట్లు పలికి.
"రాక్షసాధమ ! మీ ఖ -రప్రముఖోగ్ర
రాక్షసు లెదిరించి - రణభూమిలోనఁ
బడినయట్ల మదీయ - బాణజాలములఁ
బడనేసి నీమేని - పలలజాలంబు
కాకగోమాయు కం - క వృకాదిజంతు
లేకమై భుజియింప - నిపుడె సేయుదును 7930
నాఁటి వాఁడనె యేను - నాఁటి బాణములె
నాఁటుచున్నవి నిన్ను - నాఁడు నేఁడగుచు"

-: శ్రీరామ మకరాక్షుల యుద్దము - శ్రీ రాముఁడాతనిఁ బొలియించుట :-

అను మాట విని మక - రాక్షుఁడత్యుగ్ర
కనకపుంఖశిలీము - ఖముల నేయుటయు
నమ్ములన్నియు తన - యమ్ములచేత
వమ్ముగా జానకీ - వరుఁడు మాఱేసి
జగడింప నురముచు - జలదముల్ రెండు
గగనవీధినిఁ బోరు - కై వడిఁ దోఁప
నీలనీరదకమ - నీయగాత్రుండు
నీలాచలోపమ - నిజశరీరుండు 7940

ధనువులు దాల్చి యు - ద్ధతశరవృష్టి
మునుగఁ జేయంగ రా - ముఁడు వానివిల్లు
దివిజులు జూచి కీ - ర్తింప ఖండించి
మివుల గోపించి యె - న్మిది సాయకముల
సారథి ఘోటక - స్యందనాద్యములు
వేఱువేఱుగఁ ద్రుంప - విరథుఁడై యతఁడు
శూలి యిచ్చిన మహా - శూలంబు కేల
గీలించి లయకాల - కీలియుఁ బోలి
వ్రేసిన నదియొక్క - విశిఖంబుచేత
చేసె రెండుగ సుర - శ్రేణి కీర్తింప 7950
మకరాక్షు డంత భీ - మకరాగ్రమెత్తి
పకపక నవ్వుచుఁ - బాఱకు మనుచుఁ
బొడవఁ జేరిన రఘు - పుంగవుం డతని
యడియాస జెడఁ బావ - కాస్త్రంబు దొడిగి
వ్రేసిన నదివచ్చి - వ్రేల్మిడిలోనఁ
జేసె వేల్మిడి కపుల్ - చెలరేఁగి యార్వ
నామాట విని యమ - రారిశేఖరుఁడు
రామునిదలఁచి కో - ఱలు దీటుకొనుచుఁ
జెంతకు సుతు నింద్ర - జిత్తునిఁ బిలిచి


--: రావణుని ప్రేరణచే నింద్రజిత్తు యుద్ధమునకుఁ గదలుట :--

కొంత భూషించి "నీ - కును రాముఁడెంత! 7960
ఆకోఁతులన నెంత - యని కేఁగు మనిన

నాకు హితంబుగా - నమ్మించి పోయి
నందఱి జంపితి - నని వచ్చి యిచట
మందలించెద వభి - మానంబు మాని
పోయిన వా రెల్లఁ - బొలియుటే కాని
నీయట్లు బొంకువా - ని నెఱుంగ నొకని
చావ బ్రాల్మాలి ని - చ్చట నిల్లు మఱిగి
యీవు వచ్చుటెఱింగి - యెఱుఁగంగలేక
మఱియును నిన్నుఁ బం - పఁగ నెగ్గు సిగ్గు
లెఱుఁగక నీమొగ - మేను జూచెదను 7970
యీమాటు కలనికి - నేఁగి మున్నట్ల
రాము గెల్చితినని - రమ్ము నీకేమి
చేకన్న కార్యంబు - సేయు మేనదియు
మేకొంటి దిక్కులే - మిని తండ్రినగుట”
అని నంత మిట్టిమీ - నై పడి తన్ను
ననుపక మున్నుగా - నౌదలవంచి
పట్టుచుఁ బట్టి యీ - పట్టున నితని
పట్టినై పుట్టిన పా - పంబుచేత
నీ మాటలాలించి - యేఁదాఁచ వలసె
నేమి సేయుదునని - యీసురెట్టింప 7980
సమరంబు సేయ న - చ్చట మున్నుబోలె
శమమూని చుట్టు రా - క్షసులఁ గాఁపునిచి
యాగభూమిని దాన - వాంగనల్ కావి
పాగలతోఁ దన - పరిచర్య సేయ
నరుణ వస్త్రంబులు - నరుణ మాల్యములు

నరుణగంధమును క్రి - యాసక్తిఁ బూని
యినుప సృక్ సృవంబు - నినుప పాత్రములు
తనచెంత నిడి యశి - తచ్ఛాగ మేర్చి
హవనంబు తొల్లిటి - యట్ల కావించి
హవిరన్న భోక్తయే - యనలుం డొసంగు 7990
రథశస్త్ర సాధన - రాజితో నతఁడు
పృథుశక్తి లంకాపు - రి ప్రాంచలమున
నునుచు దైత్యుల సమ - రోర్వికిఁ బనిచి
వినువీథి బ్రహ్మాస్త్ర - విశ్వరూపంబుఁ
దానయై యమరు చం - దమున వైడూర్య
మానితధ్వజము వై - మానికావళినిఁ
దొలఁగు బావయుఁ పోలి - తొలగింపఁ గృతక
జలధరమాలికా - శృంగాంగుఁ డగుచుఁ
జంపుదు రామ ల - క్ష్మణుల గోతులను
వెంపరలాడుదు - విశిఖ జాలముల 8000
రావణు మదికి నూ - రట సేసికాని
పోవ సూరకె పురం - బునకంచుఁదలఁచి.

--: ఇంద్రజిత్తు మింటినుండి తనయస్త్ర విద్యా నైపుణ్యము ప్రదర్శించుట :--

మిన్నులనుండి సౌ - మిత్రి రాఘవులఁ
గొన్ని తూపుల నేయఁ - గోపించి వారు
మింటిపై చూపులు - మెఱయించి దివిజ
కంటకుపై గొన్ని - కాండంబు లేయ
నవి యెల్ల నురక వ - మ్మైన రాఘవుఁడు

దివిఁ జూడ్కులిడి యేయఁ - దెఱఁగేది యుండ
నసురేంద్ర సుతుఁడు బ్ర – హ్మాస్త్ర ప్రభావ
లసమాన తేజో - విలాసియై లాసి 8010
నెరయించు నొకచోట - నీలమేఘములుఁ
గురియించు నొకచోట - ఘోరాస్త్రవృష్టి
మలయించు నొకచోట - మంచు పెందెరలు
పొలయించు నొక చోట - భుగభుగ బొగలు
వినుపించు నొక చోట - విలునారిమ్రోఁత
కనిపించు నొకచోట - కాంచన రథము
చెలఁగించు నొకచోట - సింహనాదములు
నెలకొల్పు నొకచోట - నేమికా ధ్వనులు
నడరించు నొకచోట - హయహేషితములు 8020
జడియించు నొకచోట - శ క్తులువైచి
విసివించు నొకచోట - విలుకేలఁ బూని
నసముంచు నొకచోట - నాకృతిఁ జూచి
యీలీల నెలయించె - యింద్రజిత్తుండు !
గేలి సేయుచుఁ గీలి కీలలఁ బోలు
నారాచధారలు - నాఁటించి రక్త
పూరముల్ మేనులఁ - బొరలి పాఱంగఁ
గన్నుల మూసుక - కాకుత్థ్సతిలకు
లన్నదమ్ములు నిశితాం - బకమ్ములను
నాకాశమున వ్రేయ - నటునిటు దిరుగు
కాకాది పక్షుల - గాడుటే కాని 8030
వానిపై నొకటైన - వచ్చినాఁటినది
కానివారైన రా - ఘవు లాత్మ నలిగి

కనువిచ్చి వాఁడేయు - కాండముల్ నడుమఁ
దునియ దివ్యాస్త్రముల్ - దొడిగి యేయుచును
తప్పించుకొనెడు మా - త్రముగాని వాని
నెప్పు గన్గొని యేయ - నేరలేరైరి
వానల నాను ప - ర్వతములో యనఁగ
మేనుల నమ్ములు - మిక్కిలి నాఁటఁ
బూచిన కింశుకం - బులు వోలిరక్త
రోచులు వారున్న - రూపముల్ చూచి 8040
మబ్బులోపల దాఁచు - మార్తాండుఁ డనఁగ
నబ్బురంబైన మ - హాప్రతాపమున
వానరావళిని స - ర్వము నేలఁగూల్చి
యానరాశనుఁ డట్ట - హాసంబు చేసె
నది చూచి యన్నకు - నంజలి చేసి
మది నాగ్రహించి ల - క్ష్మణుఁడిట్లు వలికె


--: లక్ష్మణుఁ డింద్రజిత్తుపై బ్రహ్మాస్త్రమునుఁ బ్రయోగించుటకు శ్రీరాము ననుజ్ఞ వేఁడుట :--

"అయ్య ! వీఁడన - నెంత ? యప్పటి నుండి
చెయ్యి గాచితి నుపే - క్షింప రాదిపుడు.
అసురులతోడ బ్ర - హ్మాస్త్ర మేనేసి
యసువులఁ బాపెద - నమర కంటకుని 8050
నాపదవేళకు - నడ్డంబు వచ్చి
యాపక యున్ననీ - యస్త్రంబు లేల ?
ఎన్నటికిని దాతు - నిటమీఁద శక్తి
యున్న యప్పుడే కాక - యుత్తర విండు

తొడుగుదునే ? ” యన్న - " తొడగకు” మనుచు
నుడివి రాముఁడు లక్మ - ణున కిట్టులనియె

-: శ్రీ రాముఁడాతని నివారించుట :-

"వీఁడొక్కడే కాక - వేఱె రాక్షసుఁడు
లేఁడు నీకేల తా - లిమి చాలదిపు డు.
ఒక్కనికొఱకు దై - త్యులనెల్లఁ జంప
నక్కట ! యురక బ్ర - హాస్త్ర మేయుదురె? 8060
ఓయన్న ! సకలలో - కోపద్రవంబు
సేయుదురే మన - జీవనంబులకు
శరణన్న వాని నె - చ్చరకున్న వాని
మఱుఁగుఁ జొచ్చినవాని - మత్తుఁడౌవాని
తొలఁగినవాని కై - దువు లేనివాని
నెలఁతఁ గూడిన వాని - నిదురించు వాని
వెఱచిన వాని నొ - ప్పి నలంగు వానిఁ
దరమి చంపుట వీర - ధర్మంబుగాదు.
డాఁగి నీలాభ్రమం - డలములో వెఱచి
యీఁగి యీపోకడ - నితఁడు వోయెడును 8070
యెంత లేదిది గాక - యీదైత్యుఁ జంపు
నంతయుండినను ది - వ్యాస్త్రముల్ దొడిగి
ధరదూరెనేని పా - తాళ బిలంబుఁ
జొరఁ బారినను మింట - జుణిగి పోయినను
పోనీక దివ్యాస్త్ర - ములఁ గట్టి తెచ్చి
వీని మస్తము డొల్ల - వ్రేయుద మిపుడె
చేయుద మటుల”న్న - శ్రీరాముమాటఁ

ద్రోయక తనమీఁదఁ - దొడరు వారనుచు
సాలోచనలఁ బోవు - నది యాత్మ నెఱిఁగి


-: ఇంద్రజిత్తు మాయాసీతను రథముపైనునిచి యామె తలతెగవ్రేయుట :-

"చాలు వీరలిగిన - చావు సిద్దంబు 8080
యింతియె చాలు నా - కీవేళ ” యనుచు
నంతరంగములోని - యజ్జ యేమఱక
మఱలి యాత్మీయ ధా - మముఁ జేరి యచట
నొరు లెఱుంగక యందు - నుండి నాఁడెల్ల
మఱునాఁడు తాఁ బడ - మటి కోట గవని
తెరువున వెడలి దై - తేయులఁ గూడి
యని సేయఁ దలఁచి మా - యా సీతఁ దనదు
కనకమహా రథా - గ్రమునందు నునిచి
చేరిన వానర - శేఖరుల్ శైల
భూరుహమ్ములు కేలఁ - బూనుక నెదిరి 8090
నిలిచినచోఁ బావ - ని మహీధరంబు
వలకేలఁ గైకొని - వాని రథంబుఁ
గూల వ్రేయుదునని - కోపించి చూడ
నాలోనఁ గనకర - థాగ్రంబునందు
మైల చేల ధరించి - మౌనంబుతోడ
నేలఁ గన్గొనుచు క - న్నీరు జాలెత్తి
పెన్నెఱుల్ జడకట్టి - పేరినెమ్మేన
మన్ను హేమ ప్రతి - మకు జాజు వోయు

గైవడి బెరయు నం - గముఁ గృశియింప
భావ నిర్వేదంబు - బయలు పడంగఁ 8100
జేయి చెక్కిలిఁ జేర - చింతచే చంద్ర
దాయాదమగు మోముఁ - దామర వాడ
నడలుచునున్న మి - థ్యామహీతనయ
వడువుఁ గన్గని చింత - వాయునందనుఁడు
"కటకటా! యీ జగ - త్కళ్యాణి నీతఁ
డెటుసేయ నున్నాడో ? - యిటకేల తెచ్చె ?
ఈసాధ్వి పడుపాటు - లెఱుగక చేయి
చేసుకో తగదింద్ర - జిత్తునితోడ
నేమి హేతువో వీని - హృదయంబుఁ జూచి
యామీఁదఁ దోఁచిన - యది సేతు ననుచుఁ 8110
గనుచుండ వాఁడళీ - క మహీజఁ జేరి
పెను జడవట్టి గు - ప్పించి తానీడ్చి
పడదీసి పట్టిన - పట్టుతో మాఱు
మెడ వెట్టుతరి మృషా - మేదినీజాత
హా రామ ! హా రామ ! - హాసుమిత్రాకు
మారక ! హా హను - మంత ! రావయ్య !
నమ్మితి ప్రాణదా - నము చేసి కనిక
రమ్మున విడిపింప - రావె ! ” యటంచు
దీనయై కుయ్యిడఁ - దిట్టుచు కూట
జానకి నన్నిశా - చరవరాత్మజుఁడు 8120
తలఁదెగ వ్రేయ య - త్నము జేసి కత్తి
జళిపించు వాని మా– త్సర్యంబుఁజూచి

కలఁగుచు వలదని - కరసౌజ్ఞ చేసి
నిలునిలు మని యాంజ - నేయుఁ డిట్లనియె.


- :హనుమంతుఁ డింద్రజిత్తు నడ్డగించుట :-

"తగునె రాత్రించరా - ధమ ! చూచిచూచి
తెగుదురె పరమ ప - తివ్రతామణిని
చంపితి వేని నీ - చావు దప్పెడినె
చంపక పోము రా - జ్యము వోవనాడి
ప్రాణనాయకు నెడ - వాసి మీయింట
ప్రాణముల్ పిడికిటఁ - బట్టుక నవయు 8130
నీయమ్మ జంపుదు - రే స్త్రీవధంబు
సేయుదురే దీనఁ - జెడకుండఁ గలవె ?
ధర్మంబె యిట్లనా - థలఁ -బట్టి చంప
దుర్మానమున దీన - దోషంబు రాదె
వలదిట్టి పని బ్రహ్మ - వంశంబువాఁడ
వలుగుము నీచేత - నైన రామునకు
విడిచెదవో కాక - వేగఁ బ్రాణములు
విడిచెదవో యొక్క - విధమియ్యకొనుము”
నావుడు విని రా - వణ కుమారకుండు
చేవదలక కపి - శ్రేష్ఠునకనియె. 8140
"నాదాఁక రానిచ్చు - నా దైత్య సేన ?
నీదు వానరు లెంత - నీ వెంత గలవు
యీతన్వికై కదా - యీ కలహములు
చేతిలోఁ జిక్కిన - సీతను జంపి
పడినట్టి మావారి - పగయెల్లఁ దీర్చి

కడపట ద్రుంపుదుఁ - గపుల రాఘవులఁ
గాక వచ్చిన సీత - క్రమ్మఱ మనకుఁ
జేకూడదని చింతఁ - జేసి నిజేచ్ఛ
నపుడైన వచ్చిన - యన్ని ద్రోవలను
కపులు వోవుదురు రా - ఘవులఁ జేవదలి 8150
మఱి వారలుండిన - మాయందు నొక్క
కొఱమాలు దైత్యులాఁ - కొని మ్రింగిపోపు
నీ యల్పభాగ్యురా - లెందఱిఁ జంపె
మాయయ్యకును వట్టి - మరులు వుట్టించి
దీని నిప్పుడె వట్టి - "తెగవ్రేతు" ననుచు
వానరుల్ వొగుల రా - వణతనూభవుఁడు
రోసంబుతోడన - రువ్వనం దునియ
వ్రేసి మొండెంబు ను - ర్వినిఁ గూలద్రోచి
"పవనజ ! జానకి - పాటు రామునకుఁ
జెవిసోఁక మీరు చూ - చిన కార్యమెల్ల 8160
నీవిధంబని పల్కు - డెఱిఁగి యావెనుక
రావణుతో సమ - రము సేయుగాని”
అని తనపై వచ్చు - నగచరశ్రేణిఁ
గనుఁగొని భీకర - కార్ముకంబెత్తి
యమ్ములు గురిసిన - నందఱు విఱిగి
యమ్మారుతాత్మజు - నండ నిల్చుటయుఁ
బాఱనేమిటికని - పవమానసుతుఁడు
వారల నాఁగి దు - ర్వారుఁడై యెదిరి
కాలి మెట్టులను రా - క్షసులెల్ల నణఁగి
నేలపాలుగఁ గేల - నెలకొన్న నగము 8170

కార్చిచ్చు గతి నల్గి - గద్దించి వ్రేసి
యార్చిన సారథి యా – దైత్యు రథము
నెడఁగల్గఁ దొలఁగించి - యెల్ల దానవులు
మడిసి పోవఁగఁ గొండ - మహిమీఁదఁ బడియె.
కడమవానరుల న - ల్గడల రాక్షసులఁ
బడలు వడంగ దో - ర్బలముఁ జూపుటయు
విఱిగిన తనవారి - వెఱవకుండనుచు
నరదంబు మఱలించి - యమరేంద్రవైరి
గరి గరిఁ గరవంక - గరుడిమై గరుల
గరుల నారాచముల్ - గరుసు మీఱంగ 8180
నేసి బోరలు చించి - యెమ్ములు విఱిచి
దూసిపోవ నిగుడ్చి - తోఁకలు ద్రుంచి
తలలు ఖండించి గా - త్రమ్ములు దునిమి
సెలకట్టనీక నొం - చిన వాయుసుతుఁడు
తనవారిఁ బిలిచి "యా - దానవుచేత
మనకేల యెదురించి - మహిమీఁద వ్రాల ?
కతదీఱె వీఁడు రా - ఘవు దేవిఁ జంపె
నితని గెల్చిన మన - కేమి గల్గెడును
పోరాట మిక నేల - పోయి యిత్తెఱఁగు
శ్రీరామునకుఁ దెల్పి - చెప్పినయట్లు 8190
మఱి చూతమిప్పుడు - మడిసిపోనేల ?
తిరుగుఁ" డంచును తాను - తీసిపోవుటయుఁ
బవనజు కరుణచే - బ్రతికితి మనుచుఁ
దవిలి వెంబడి రాల - దానవు లేయఁ
బరువిడి దాఁటుచుఁ - బ్లవగులందఱును



మఱలిచూచుచు హను - మంతునిఁ జేర
మఖవారి యప్పుడు - మారణహోమ
మఖిల సంగ్రామ జ - యప్రదంబనుచు
వగచి నికుంభిళా - వని కేఁగి యాగ
జగతిపై మంత్ర సం - జనితాగ్ని నునిచి 8200
శమదమస్థితి నాభి - చార మంత్రముల
నమిత మానవశోణి - తాహుతులొసఁగి
పావకు నందుచేఁ - బరితుష్టుఁ జేసి
యావహ్ని ఫలదాత - యగుచున్నయంత
కోతులా రావణు - కొడుకు చేకోర్చి
కూఁతలకును జొచ్చి - కొఱమాలి విఱిగి
తలచెడి వచ్చిరం - దఱు ననుఁజూడ
నెలమి రాముఁడు విని - యెంతయు నలిగి
వరశౌర్య నలజాంబ - వంతునిఁ బిలిచి

-: జాంబవంతుఁడును, హనుమంతుఁడును శ్రీ రామునికి మాయా సీత వృత్తాంతము నెఱింగించుట :-

"అరుగు మిప్పుడె నీవు - హనుమంతుఁ జేరి 8210
మనవార లీపడ - మటికోట గవని
ననిలోన వెనక ముం - దైరఁట నేఁడు
గొబ్బున వారితోఁ - గూడుకొమ్మనిన
నుబ్బుచు రిక్షేశుఁ - డురువడి నేఁగి
యెదురైన హనుమంతుఁ - డెఱిఁగిన యర్థ
మిది యంచుఁ బల్క- వా - రిరువురుఁ గూడి
రాము సన్నిధికి బే - రఁగ నేఁగి తమ్ము

నేమని పలికింప - నిట్లని రపుడు
"అయ్య ! యేమంద మ - య్యసురేంద్రవైరి
కయ్యంబునకు వచ్చి - కాంచనరథము 8220
మీఁద జానకిఁ దెచ్చి - మెడ తెగఁగొట్టి
మేదినిఁ బడఁగ మా - మీఁద వ్రేయుటయుఁ
బోరాడ నిఁక నేమి - పుణ్యంబటంచు
నోరామ ! తిరిగి మే - మురక వచ్చితిమి
ఏమి సేయుద”మన్న - యీమాట వినక
యామున్నుగా ధాత్రి - నవశుఁడై వ్రాలి
కపు లుపచారముల్ - గావింపఁ దెలిసి
యపుడు "హాసీత ! సీ - తా ! యంచు నడలి
పొరలాడ తానన్న - బొదువుక యేడ్చి
పరితపించి సుమిత్ర - పట్టి యిట్లనియె. 8230

~: శ్రీ రాముఁడా వృత్తాంతము నిజమని దుఃఖంప లక్ష్మణుఁడాతని నోదార్చుట :-

"ధర్మమార్గ ప్రవ - ర్తనుఁడవు నీదు
ధర్మంబు నీయాప - ద హరింపదయ్యె !
స్థావరజంగమ - సమితి చందమున
నీవిధంబున ధర్మ - మెవ్వఁడు చూచె
నెఱుఁగరేనియు నిన్ను - నింతటిమూర్తిఁ
బొరలంగ నోర్చి న - ప్పుడె ధర్మమనుచు
నున్నదియే ధాత్రి - నొకటి ? యధర్మ
మన్నమాటయు నస - త్యము నాకుఁ జూడ !

కాదేని యాదశ - కంఠుండు నిరయ
వేదనలకుఁ బొంది - వెతనొందుగాక 8240
యిటులుండ నేర్చునే - యిట్టిసామ్రాజ్య
పటుదురంధరతాను - భవ జయశ్రీల ?
నీకు సుఖంబు వా - నికి దుఃఖమైనఁ
గాక ధర్మాధర్మ - కర్మరూపముల
ఫలములు విపరీత - ఫలము లై వచ్చి
నిలిచిన నెయ్యది - నిశ్చితార్థంబు ?
అంత యేమిటికి ప్ర - త్యక్షవిరుద్ధ
మింత ధార్మికునకు - నిట్టి యాపదలు
పౌరుషంబున ధర్మ - ఫలము చేకూడు
నేరికి నన్నట్టి - యెడ నదియేల 8250
ధర్మ మొక్కటి యని - తలఁప శౌర్యంబె?
శర్మంబు విజయంబు - సమకూర్పఁజాలు
నుడివోదు నొచ్చిన - నోర నొక్కరుని
విడుతువో చేపట్టి - విద్వేషినైన
నాడ నేరుతువొ రెం - డవమాట నీవు
చూడనేర్తువొ పర - సుందరీమణుల
నెదురింప శక్తులో - యింద్రాదులైన
నెదురు మేలునకు స - హింపవో మదిని
నాచరింపవొ తండ్రి - యానతి నీవు
చూచి త్రోయవొ రాజ్య - సుఖవైభవములు 8260
ధర్మమంచని యస - త్యంబని వీర
ధర్మంబుగాని సేఁ - తలకెల్లఁ జొచ్చి
చేటువ కొడఁబడి - సీమకు లేని.

యాటలాడిన నీకు - నాపదల్ రావె
లేని సత్యంబుఁ గ - ల్పించితీ తండ్రి
కేనెఱుంగఁగ నీకు - నీఁడె రాజ్యంబు
వెనుకగదా కైక - వేడబంబులకు
మనసొగ్గి యడవికి - మనలఁ బొమ్మనియె
పుత్రుండవని సిగఁ - బువ్వులు చుట్టి
శత్రుత్వమునఁ బంపు - జనకుని మాట 8270
త్రోయక మేమెంత - త్రోచి చెప్పినను
సేయని ఫల మెల్ల - చేకూడె నీవుడు
రాజైనవాఁడు ధ - ర్మ మధర్మ మనుచు
యోజింప నాత్మప్ర - యోజనంబులను
సమయోచితంబై న - జాడ వర్తిలక
సమకూడునే రాజ్య - సౌఖ్య భోగములు
త్వష్ట పుత్రునిఁ జంపి - ధరణీధరారి
యిష్టిఁ గావించి మా - యించె పాపములు
కలిమిఁ గల్గిన వాఁడు - గావించు పనులు
చులకగాఁ జేకూడి - శుభము లొసంగు 8280
నచలాగ్రమునఁ బుట్టి - యవనికి డిగ్గి
యెచట వెల్లువ చూపు - నేఱుల రీతి
వదలక మహి నర్థ - వంతుని క్రియలు
కొదవలన్నియుఁ దీఱి - కొనసాగుచుండు
తలఁపు వెంబడి నిర -ర్థకుని కార్యములు
తలకూడి రావు నై - దాఘ వేళలను
పంక సంకరములౌ - పరిపాటి కాల్వ
లింకిపోయిన రీతి - నెదిరించుగాని

కలవాఁడె చుట్టముల్ - గలవాఁడు కులము
గలవాఁడు నేరువు - గలవాఁడు బుద్ది 8290
గలవాఁడు చెలువంబుఁ - గలవాఁడు విద్య
గలవాఁడు శౌర్యంబు - గలవాఁడు గాక
మదిమది నుండి సం - పదఁ జూఱలిచ్చి
యధముని రీతిఁ గా - రడవులు వట్టి
పేదలైనపుడె త - ప్పెను నీదు విక్ర
మాది చర్యలు భస్మ - హవ్యంబు లట్ల
నర్థంబు చేత ధ - ర్మాదిమపూరు
షార్థముల్ చేకూడు - నది లేని కతన
నయమెక్కడిది “నిర్ధ - నస్యమృతస్య
చ" యననవ్వచన మ - సత్యంబు గాదు 8300
పరమార్ధము నిహ - పర సమసౌఖ్య
కరముకా ధర్మార్థ - కామ మోక్షములు.
అర్థహీనుఁడవు నీ - వగుట చే నీయ
నర్థ యోజన చేత - నన్నియుఁ జెడియె
జలదాగమమున న - క్షత్ర గ్రహాళి
కలిగియు నేరికిఁ - గనుపించ నటుల
నాబుద్ధి గాదని - నాఁడాచరించు
నీబుద్ధి నయ్యె ని - న్ని యనర్థములును
పాతకి యగు తండ్రి - పలుకాచరించి
సీతా! యటంచు నే - డ్చిన నేమి గలదు ? 8310
ఇల వోయినప్పుడే - యిల్లాలు వోయె
దెలిసి యుండుదు నేఁడు - దెలిసెనే మీకు ?
ఇంక నేల విచార - మేడ్చి తేఁగలమె

పంకజాక్షిని సీతఁ - బ్రాణంబుతోడ
సీతకే మనము వ - చ్చితిమింక మీద
సీతఁ జంపిన యింద్ర - జిత్తు బోనీక
యిప్పుడే నేనేఁగి - యెందెందు డాగి
తప్పించుకొనిన పా - తకిఁ బట్టి తెచ్చి
యమ్మవారల పద - ప్రాంతంబునందు
నమ్ము దీసుక వాని - యౌఁదలఁ దఱిగి 8320
బడిమిగాఁ ద్రిప్పించి - బడిసిపో వైచి
కడమ దైత్యుల మస్త - కంబులు గొట్టి
యాలంక మామకా - స్త్రానలహేతి
మాలికలందు భ - స్మము చేసి కూల్చి
రావణుఁ బుత్ర పౌ - త్రయుతంబుగాఁగఁ
జేవాడి మెఱసి కౌ - శిక మౌనిరాజ
పాలితాస్త్రములకు - బలివెట్టి కాని
తేలి రానిక సమ్మ - తింపుఁడు మీరు
సంగరోద్యోగంబుఁ - జాలింపమీకు
సంగతియే ? శరాస - నముఁ గైకొనుఁడు” 8330
అనుచు నుండఁగ నద్దశా - ననానుజుఁడు
తన మంత్రులును దాను - తగిన వానరుల
నచ్చటచ్చట నుంచి - యచటికిఁ జేర
వచ్చి లక్ష్మణుని పై - వ్రాలి శోకమున
నున్న రామునిఁ జెంత - నున్న వానరులఁ
గన్నులఁ జూచి యం - గము కంపమొంద
నది యేమి యనివేడ - నవనజ చంద
మిదియని సౌమిత్రి - యెఱుఁగఁ బల్కుటయు

నగుమోముతో దశా - నన సోదరుండు
మొగిడించి కేలు రా - మున కిట్టులనియె

--: విభీషణుఁడు శ్రీరామునికి నిజస్థితి నెఱింగించి కర్తవ్యమును బోధించుట :--

దేవ ! మీరింత చిం - తిలుదురె పరమ
పావని సీతఁ జం - పఁగ నెవ్వఁడోపు ?
హనుమంతు మాట య - థార్థంబు గాదు
వనధి యింకె నటన్న - వైఖరిఁ దోఁచె
రావణు చిత్త మె - ఱంగ నే యేను
దేవి నిమ్మని పల్కఁ - దెగఁ జూచె నతఁడు
చంపువాఁ డేఁటికిఁ - జంపు నొక్కకరిఁ
బంపి దైత్యుల నెల్ల - బవరంబులోన
జానకి కొఱకునై - చచ్చువాఁడింతె
కాని యాయమ్మ పైఁ - గలుషింపఁ డతఁడు. 8350
ఆయింద్రజిత్తు మా - యాసీతఁ దెచ్చి
యాయన ముందఱ - నటు సేయ నోపు
నది చూచి నిజమని - యాంజ నేయుండు
పదరి భీతిని విన్న - పము చేసినాఁడు
వాఁడు నికుంభిలా - వనికేఁగి యచట
వేడి వేలుపుఁ గొల్వ - వెండి వంచించె
లక్ష్మణుని నన్ను - నెల్ల వానరుల
నాలంబునకుఁ బంపుఁ - డతని హోమంబుఁ
గడ తేఱనీకవి - ఘ్నము లాచరించి
కడతేర్తు మతని ల - క్ష్మణుని బాణముల !" 8860

అనుచు హితంబుగా - నాడిన మాట
వినియు నమ్మకయున్న - వెండి యుఁ బలికె
అయ్య ! నీతమ్ముని - నంపినఁ గాక

--: ఇంద్రజిత్తుచేయు హోమము పూర్తిగాకమునుపే లక్ష్మణుని నింద్రజిత్తుపై పంపుమని విభీషణుఁడు చెప్పుట :--

కయ్యంబులోఁ గెల్పు - గలుగదు మనకు
నదియు నిప్పుడె కాని - యాహోమమతఁడు
కొదఁ దీర్చుకొనిన మా - ర్కొన నెవ్వఁడోపు ?
వజ్రాయుధము దాన - వశ్రేణి మీద
వజ్రి పంపిడిన కై - వడి వానిఁ దునుమ
సౌమిత్రి దక్కంగఁ - జంప లేఁ డొకఁడు
తామరసాసను - తలనాఁటి వరము 8370
హోమ మీడేరిన - నొరుల జయింప
హోమవిఘ్నము సేయు - నొరుచేతఁ జావు
గలిగియున్నది యట్లు - గావునఁ దడయ
వలదు పంపు ” మటంచు - వాకొనుటయును
నినుమాఱుగాఁ బల్కు - - హితుని వాక్యములు
వినియు నమ్మక రఘు - వీరుఁ డిట్లనియె
"విననైతి లెస్సగా - వేసట లేక
వినుపింపు మార్తిచే - విలపించు కతన
తెలివి చాలక యుంటి - తెలియంగ మఱలఁ
బలుకు ” మీవన వంశ - పావనుండనియె 8380
"అయ్య ! వరంబిచ్చె - నజుఁడింద్రజిత్తు
కయ్యంబులను గెల్వఁ - గామించి యడుగ

కామగస్యందన - కవచ కోదండ
భీమాస్త్రకోటు ల - ర్పించి యా నలువ
బ్రహ్మాస్త్ర మొసఁగి కో - పముగాఁగఁ బిలిచి
బ్రహ్మ వేఱొకమాట - పలికె వానికిని
"నీహోమ మంతయు - నెఱవేఱెనేని
యాహరిహయ ముఖ్యు - లడ్డంబుగారు.
అందున కొకవిఘ్న - మన్యుల చేత
నొందినవారిచే - నొలియుదు వీవు 8390
తలఁచు” కొమ్మని పల్క - తనకది మొదట
తెలివిడి యగుట నొ - త్తిలి దెల్పవలసె
వేలిమి కడతేర - వేలిచి వీఁడు
కేలవిల్లంది వా - కిలి వెళ్లెనేని
యిన్నాళ్లవలెఁ బోవఁ - డిందఱఁజంపి
మున్నీటిలో నూఁచ - ముట్టుగా నీడ్చి
యినుమారు మోసపో - యిన వాఁడు గాన
తనగెల్పు నమ్మి పోఁ - దలఁపఁ డవ్వలికి
కావున నిపుడె ల - క్ష్మణు మముఁ గూర్చి
యీ వేళఁ బనిచిన - మేమెల్లఁ గూడి 8400
సమయించెద మతండు - చచ్చినఁ జాలు
సమసె రావణుఁడు - నీచరణంబులాన
సీతను మఱలంగఁ - జేకూర్చికొనఁగ
నీతలఁపున నున్కి - నిజమయ్యెనేని
యిదియె కార్యంబన - హితుని వాక్యములు
మదిమెచ్చి రవివంశ - మణి యిట్లుపలికె

"సత్యంబు నీమాట - సరిపోయెఁగపట
కృత్యంబువాఁడు లం - కేశ నందనుఁడు
మాయావియగు సీత - మాటకు నదియె
చాయయై యున్నది - చనుఁడు వేగమున” 8410

-: శ్రీరాముఁడు లక్ష్మణు నాశీర్వదించి యింద్రజిత్తుపై యుద్దమునకుఁ బంపుట :-

అనుచుఁ దమ్మునిఁ - జూచి "యంగదముఖ్య
వనచరావళియు రా - వణ సహోదరుఁడు
పిఱుఁదఁ గొల్వఁగ నికుం - భిలకేఁగి దనుజ
వరకుమారు జయించి - వత్తువుగాక !
పొమ్మ"న్న తూణీర - ములుఁ గవచంబు నమ్ములు
విల్లు న - స్త్రాదులు దాల్చి
యన్నకు వలవచ్చి - యగచరుల్ దనకు
వెన్నాసగా హోమ - విపినంబుఁ జేరి
యాచుట్టు నున్న దైత్య - శ్రేణిఁ దేఱి
చూచి హోమ మొనర్చు - చో వానిఁ గాంచి 8420
యంగద జాంబవ - దాంజ నేయాది
సంగర నిపుణుల - జతఁగూర్చియున్న
రామకార్య ధురం - ధర కళానిరూడు
సౌమిత్రిఁ గని విభీ - షణుఁ డిట్లు వలికె
"కావలిఁ గాచు రా - క్షసులను మొదట
చావ నేయుఁడు వీరు - సమసినం గాని
వాఁడు రాఁడని సేయ - వచ్చినఁగాని
నేడు గూలఁడు గెల్పు - నిజము మీ”కనుచుఁ

జేయిచూపిన కపి -శ్రేణి యచ్చటికి
డాయఁగ నేఁగి కొం - డలు భూరుహములు 8430
పెకలించి వైచినఁ - బెరిగి దానవులు
చకచక ప్రభలీను - చంద్రహాసములుఁ
దోమరముసల శ - క్తులు బ్రయోగించి
చేమించి ముంచి వ - చ్చిన లక్ష్మణుండు
నారి సారించి బా - ణ ప్రహారములు
ఘోర రాక్షసకోటిఁ - గుప్పలు వ్రేయ
రావణతనయుఁ డా - గ్రహముతోఁ గట్టు
కావిధోవతులూడ్చి - కడఁ బాఱవైచి
కలని సింగారంబుఁ - గైకొని కై దు
వులు దాల్చి రథము ద - వ్వులనుండి తెచ్చి 8440
సారథిఁ బిలిచి యె - చ్చరికించి యెక్కి
దారుణ తరరణ - ధ్వని మిన్ను ముట్ట
దానవ వీరులఁ - దఱిమి వధించు
వానరముఖ్యుఁ బా - వనిఁ దేఱిచూచి
కొన్ని యమ్ములు మీఁదఁ - గోపించి వైవ
నన్నియు వారించి - హనుమంతుఁ డనియె
"కైదువుల్ మిక్కిలి - గలవు నాకనుచు
జోదవై పోరఁ జూ - చుట నీకుఁ దగదు
నాతోడ నొంటిఁ బె - నంగి నాముష్టి
ఘాతిచేఁ జావకఁ - గడ తేఱితేని 8450
నినుఁ గన్నవాఁడె తం -డ్రి ధరిత్రియందు
నినుఁ గన్నదియే తల్లి - నీకు నోడితిని
రమ్ము చూత" మటన్న - రావణ తనయుఁ

డమ్మాట విని యట్ట - హాసంబు చేసి
కదియఁ జూచు తలంపుఁ - గని విభీషణుఁడు
మది భయమంది ల -క్ష్మణున కిట్లనియె.
"సౌమిత్రి ! పవనుజుఁ - జంపెను జంపె
దీమంబు మనకు నా - ధీరమానసుఁడు
వాఁడె మార్కొనుచున్న - వాఁ డింద్రజిత్తు
వాఁడి తూపులచేత - వారింపు మతని ” 8460
అనిన నెంతయు నాగ్ర - హమున వాయుజునిఁ
జెనకఁ జేరిన యింద్ర - జిత్తు నీక్షించి

-: విభీషణుఁ డింద్రజిత్తునుఁజంపం ప్రోత్సహించుట :-

"చూడుము వీని తే - జోమూర్తి యగుచు
వీఁడు హోమము నిండ - వేలిచె నేని
నిలుతుమే యిచట యి - న్నీచుని మఱల
వని కేఁగ నిచ్చిన - వచ్చు నాపదలు
మనలను గికురించి -- మఱలి హోమంబుఁ
కొనసాగఁ గావింపఁ - గోరియున్నాడు
పోవనీయకు ”మన్న - పోటజ్జగన్న
రావణనుతుని శ్రీ - రామానుజుండు 8470
"వచ్చితి నీకు నా - వలసిన జగడ
మిచ్చెదఁ గనిపించి - యిఁకఁ బోవరాదు
తూపు లేయు మటన్న - దురముపై బుద్ధి
దోఁపక హోమంబు - తుదముట్టదయ్యె
యేమి సేయుదు నని - యింద్రజిత్తుండు
సౌమిత్రి విన విభీ - షణుఁ జూచి పలికె.

 -: ఇంద్రజిత్తు విభీషణుల పరస్పర సంవాదము :-

"పినతండ్రివై యుండి - పెద్దవై యుండి
తన కిదితగు నిది - తగదని యెఱిఁగి
యక్కటా ! పరులకు - నవకాశమిచ్చి
రక్కసకుల మకా - రణము త్రుంచెదవు 8480
తనమీఁద తెగుదురె - తనయుండఁగానె
దనుజేంద్రుఁడును నీవు - తనకొక్కరూప
యేమందఱము గల్గి - యీతఁ డీరీతి
రాముని కడకుఁ జే - రంగ సహించె
మాతండ్రి యను నభి - మానంబు హృదియ
శాతశల్యంబుగాఁ - జాల వ్రేఁగెదను.
అట్టి యేనొక్క కీ - డైన నీయెడల
నెట్టిచోఁ జేసితి - నే నాకు నలుగ
మాకు నొంటక పోయి - మార్తునిఁ గూడి
యాకొల్వు నీకు ము - ప్పానదు గాన 8490
నేరీతిఁ బిలిపింతు - నితని నేననుచు
మారావణునకు వే - మాఱు దెల్పుదును
కడనున్నవాఁడవు - కడనుండ కిట్లు
చెడఁ జూడ నేమి చే - సితి నీకు నేను ?
ఇంటికిగాని వాఁ - డితరుల కీఁతఁ
డొంటునే యనివారు - నొచ్చ మెన్నుదురు
ద్రోహ మెవ్వరు సహిం - తురు దొరల్ కార్య
దాహంబుచే నోర్చి - తారుదు రపుడు
నీకీడు కడపట - నీకనుభవము
మాకేమి"యన్న కు - మారునిఁ జూచి 8500



కలుషించి కటములుఁ - గదల నీక్షించి
పెలుచు మాటలతో వి - భీషణుండనియె.
"ఓరి ! మూఢాత్మ ! నా - యుల్ల మెల్లపుడు
మీ రెఱింగియు నేల - మించ నాడెదవు
దనుజాన్వయంబునఁ - దాజనించియును
మనసులోన నధర్శ - మార్గ మెన్నుదునె ?
పరుల సొమ్ములకును - పరుల కాంతలకుఁ
గొఱమాలి ప్రాల్మాలు - క్రూరాత్మకులను
నెవ్వాఁడు కాలిన - యిండ్లనే హేతి
దవ్వుగాఁ దొలఁగు నా - తఁడు మేలుఁగాంచు 8510
దుర్జనులగు వారి – తో పొత్తుమాని
వర్జింప నీతి మా - వంటి సాధులకు
వట్టిన పామును - పాఱంగ వైచు
నట్టికైవడిని మీ - యాశ మానితిని
పరవధూగమనంబు - పాపవర్తనము
సురవిరోధము ముని - స్తోమ హింసయును
మత్తప్రచార దు - ర్మానముల్ క్రూర
చిత్తంబుఁజూచి వ - ర్జిం చితీఁ గాక
చెప్పిన బుద్ధులు - చెవిఁ జేర్పఁడనుచుఁ
దప్పు మోపుదునె మీ - తండ్రిపై నేను 8520
ఘనములు గిరులపైఁ - గప్పిన యటుల
దనుజవరేణ్యు ను - త్తమగుణావళులు
నీచగుణముల - యిఱుకునం దగిలె
గాన యేనెడవాసి - కడకుఁ జేరితిని
మీతండ్రి గడవనే-- మిటీ కీవు గొఱఁత

మాతండ్రి వలసిన - మాడ్కి దూషింపు
మందు నేమి గొఱంత - యైనట్టులయ్యె
నందఱితో రావ - ణాసురుఁ బట్టి
పొలియింప కేనేల - పోవుదు నేఁటి
కలనిలో విలయాగ్ని - కల్పనీరంధ్ర 8530
రామదివ్యాస్త్రధా - రాపరంపరల
మోమోటమేల నీ - ముందఱఁ దనకు
బెల్లింపులను నికుం - భిళ కీవు మఱల
వెళ్ళ నెంచెద వేమొ - విడువము గాని
మఱలిపోనీదు ల - క్ష్మణుని దివ్యాస్త్ర
పరిధి చుట్టుక నిన్నుఁ - బడనేయు గాని
పోనీయ రీకపి - పుంగవుల్ నిన్ను
దానవులను బట్టి - దండింతురిపుడు
చిక్కితి వెక్కెడ - చే రెదు మింటి
చక్కిపోరాడ భి - చారహోమంబు 8540
సేయనీయఁడు నిన్ను - శ్రీరాము తమ్ముఁ
డాయతభుజశక్తి - నరికట్టుకొకొనియె
పాటి దప్పెను నీకు - బ్రహ్మవరంబు
చాటి చెప్పితి ” నను - సమయంబునందు
అయ్య ! నాభుజపీఠి - యందు వసించి
కయ్యంబు సేయు మీ కలుషాత్ముతోడ
యీనేలపై నిల్వ - నేల ? ” యటన్న
తానుదయాద్రిపై - తరణియపోలి
పావని మృదులాంస - భాగంబునందు
తావసించిన సుమి - త్రాపుత్రుఁబలికె.8550

- :లక్ష్మణ యింద్రజిత్తుల యుద్దము : -

విల్లు కేలధరించి - వీరుఁడవగుచు
భల్లంబు లేరిచి - పట్ట నాయెదుట
నిలిచినంతనె చెల్లె - నీదుపంతంబు
తొలఁగి పొమ్మటుగాక - తొడరెదవేని
కపులతో నిను లయ - కాలప్రచండ
తపనమయూఖ ప్ర - తాపాస్మదీయ
కనక పుంఖశిలీ ము - ఖప్రకాండముల
ననిలోనఁ దెగటార్చి - యమపురి కనుతు
నన్నదమ్ములు మీర - లంగముల్ మఱచి
నిన్న రాతిరి నాదు - నిశితాస్త్రములను 8560
పడిన పాటులు దలం - పక యింతలోన
మడసిపోవఁగఁ గ్రొత్త - మానిసి వైతె ?
తానొక్క కడనుండి - దాయాదివగుట
చేనిన్ను నొప్పగిం - చెను నాకుఁ దెచ్చి
యతని వెంబడివచ్చి - యడవులవెంట
హితమతి గాచుట - కిది ఫలంబయ్యె
దూదిలో నిడు నిప్పు - దునుకయ పోలి
నాదివ్యబాణ సం - తతి రవుల్కొనినఁ
గపులెల్ల నీరస - గహనంబు మాడ్కి
నిపుడె కూలుదు రెప్పు - డెవ్వరదిక్కు 8570
యెఱుఁగవో నీవు వా - రెఱుఁగరో నన్ను
యురక విభీషణుం - డుపదేశ మొసఁగఁ
దతిఁ జూచి ' విధివిహి - తంబుద్ధిరనుస
రతి' యన్నయది యథా - ర్థంబు చేసితివి

నాబాణములకు బ్రా -ణములిచ్చి పడిన
గూబలు గృధ్రముల్ - గోమాయువులును
కండ లీడ్చుక తినఁ - గాఁ జూచి యేడ్చి
భండనంబున రఘు - పతి యీల్గఁగలఁడు
చెడక పొ”మ్మన నింద్ర - జిత్తునిఁ జూచి
కడు నిగ్రహించి ల - క్ష్మణుఁ డిట్లు పలికె 8580
'రావణతనయ' శౌ - ర్యము గలవాని
కీ వట్టి మాటల - నేమి ఫలంబు
జగడించి యంతయు - సరిచూచుకొమ్ము
తెగివచ్చి నీవు యె - దిర్చి పోరాడ
నేరక మైడాచి - నింగికి నెగసి
చోరకర్మమునకుఁ - జొచ్చి మున్నీవు
కావించు నేల ని - కర్మముల్ నీతి
కోవిదులెల్ల నె -గ్గుగఁ దలంపుదురు.
అది యెల్ల నొక్క- సా - హసకృత్యమనుచుఁ
బదర నేఁటికి సిగ్గు - వదల నాయదుర ? 8590
పోనీయ నిపుడే చం - పుదు" నని యెగిరి
యేను నారాచంబు - లేర్చి యేయుటయు
వాఁడు మూఁడమ్ముల - వైదేహి మఱఁది
గాడ సేసిన సరి - కట్ట నొంచుటయుఁ
గరలాఘవంబునఁ - గమనీయదివ్య
శరలాఘవమ్ముల - సరివోరిరపుడు
గండభేరుండముల్ - గగనంబు నందు
రెండుఁ బోరెడుగతి - రెండుగ్రహములు

పోరాడు కైవడిఁ - బుడమి పై దనుజ
వీరుండు సూర్మిళా - విభుఁడు నొండొరుల 8600
వృత్ర దేవేంద్రుల - విధమునఁ గంక
పత్రవర్గంబు ల - భ్రంబుల రీతిఁ
గురియుచో దనుజేంద్రు - కొడుకుపై నలిగి
శరము వూనఁగ శుభ - శకునంబులైన
నవిచూచి దానవేంద్రా - నుజుఁ "డేయు
మవశుగా నతని మే - లయ్యెడు నీకె
తోంచెను వానికి - దుర్నిమి త్తములు
కొంచ బాఱెడు నింక - కొఱగాడు వాఁడు ”
అన నతిఘోర సా - యకముల వాని
తనువు నొప్పింప నెం - తను మూర్ఛమునిఁగి 8610
తోడనే తెలిసి స - త్తువకొద్ది దొడిగి
యేడు బాణంబుల - నేసె లక్ష్మణుని
పది తూపులను నేసె - పవమానసుతుని
నదరక పినతండ్రి - నమ్ములముంచె
నతని వ్రేటులకు రా - మానుజుండాత్మ
ధృతి వదలక వాని - దెసఁ జూచి పలికె.
"నీవు ప్రయోగించు - నిశిత బాణములు
పూవులవలె నాఁటి - పోవుటే కాని
యావంత యావంత - యైన నేనెఱుఁగ
లావింత మాత్రమై - లక్ష్మణుతోడఁ 8620
బోరి ప్రాణములతోఁ - బోయెదననుచుఁ
జేరితివే ! ” యని - చిఱునవ్వుతోడ
వాని మే మరువు చే - వడిఁ బడివైచి

నానాస్త్రముల నేత - నమ్ము ఖండించి
తనువు నొప్పించిన - ధరణీధరంబు
వనరాసి గనుపట్టు - వైఖరినుండి
కోపించి పెల్లార్చి - గుణము మ్రోయించి
తూపుల సౌమిత్రి - దొడిగిన జోడుఁ
బొడిపొడి చేసి ని - ప్పులు గన్నుఁగొనల
జడగొన నిరువుర -స్త్రములఁ గప్పుటయు 8630
సమశక్తిఁ గుశపరి - స్తర ణాగ్నులనఁగ
నమరి పూచినకింశు - కాగంబులట్ల
నన్యోన్యజయకాంక్షు - లై యప్రమాణ
మన్యువులను విక్ర - మంబుల మించి
పోరెడు వేళ నా - ప్తుడు గాన తనదు
వారలు దాను రా - వణసహోదరుఁడు
నెచ్చరింపుచు గొట్టుఁ - డేయుఁ డటంచు
నుచ్చరింపుచుఁ గపి - వ్యూహంబుఁ దేర్చి
తన చేతనైన మా - త్రముతాను గొంత
దనుజసేనలఁ జంపి - "తారాకుమార 8640
జాంబవంతసుషేణ - శతబలిపనన !
వెంబడి రండు పో - విడవకుండితనిఁ
కుంభు ప్రహస్తు ని - కుంభు ధూమ్రాక్షు
కుంభకర్ణు నరాంత - కుని మహోదరుని
నతికాయ యూపాక్షు - నావహభూమిఁ
బ్రతిన యాడినయట్లఁ - బట్టి చంపితిరి
చేయీఁతలను మీరు - సింధుపుఁ దాఁటి
యో యన్నలార ! వీఁ - డొక పిల్ల కాల్వఁ

దరియింపఁ జేసి యిం -దఱు గూడి వీనిఁ
బొరిఁగొనుఁ డెక్కడఁ - బోవు మీయెదుర? 8650
ఒంటిగాఁ జిక్కె వీఁ - డొకఁడు త్రిలోక
కంటకునకు నేఁడు - గడయైన వాఁడు
వాఁడె చచ్చిన దశ - వదనుండు చచ్చి
నాఁడు స్వామిహితంబు - నామదినెంచి
చెప్పెదఁ గాని నా - చేఁ గాక యునికి
దప్పించుకొన లేదు - తనయుండు గానఁ
జంపఁ జేయాడదు - చంపెదననుచుఁ
దెంపు చేసుకవచ్చి - తేరి చూచినను
కన్నీరు దొరిగెడు - కడుపులో మరులు
చున్నది వీఁడు నా - యురము పైఁ బెరిగి 8660
నా పొత్తుమాని యె - న్నఁడు భుజియింపఁ
డీపట్టి పాప - మేమి పల్కుదును ”
అని తలవాంచుక - యవ్వలి కరుగ
వనచరులా జాంబ - వంతునిఁ గూడి
దానవులను గిట్ట - ధరణీధరముల
చేనొచ్చి తరువుల - చేత మర్దించి
యేపు చూపిన వేళ - యింద్రజిత్తుండు
చాపనిర్ముక్త దు - ర్జయ మహాస్త్రముల
సౌమిత్రి నేయ ల - క్ష్మణుఁ డాగ్రహమునఁ
జేమోడ్చుటయు దొనఁ - జేరనిచ్చుటయు 8670
శరమేర్చుటయు వింట – సంధించుటయును
గురి వ్రేయుటయు చేరు - కొని కాన రాక
ఖంగు పెంగువరుంగు - ఘల్లు ఘజిల్లు

రింగుచు తదనుసా - రిధ్వనుల్ నిగుడ
దనుజునిపై నాఁట - దశరథసుతుని
దనుజుఁడు నాఁటింప - ద్వంద్వయుద్ధమున
మిన్నెల్ల నమ్ములై - మెఱయు మేఘముల
నున్నట్టి రవిచంద్రు - లో యన వారు
కాండపరిచ్ఛన్న - గాత్రులై నెత్తు
రొండొరువుల మేన - నోడికల్ గట్ట 8680
జగడింప కావిరి - చదలెల్లగప్పెఁ
బొగలెల్ల దిక్కులఁ - బొదువుక వచ్చె
గతిఁదప్పి గ్రహతార - కా నివహంబు
క్షితి చలియించె ఘో - షించె పయోధి
రావెఱచెను సమీ - ర కిశోరకములు
దేవతలకు గుండె - దిగులు రక్కొనియె
మునులు ధాత్రికి సేమ - ములు గోరిరసుర
వనితల కన్నీరు - వరదలై తొరిఁగె
నంత లక్ష్మణుడు కా - లాంతకు రీతి
సంతన కట్టిన - జవతురంగముల 8690
నల్లన మేనుల - నాల్గింటి నన్ని
భల్లంబులను మ్రొగ్గి- పడిపోవ నేసి
వేఱొక్కటి నిశిత - విశిఖంబు తొడిగి
సారథి మస్తంబు - సమరోర్విఁ గూల్చి
మేలు చేయైన సౌ - మిత్రీనిఁ జూచి
శూలియో యన రథి - సూత కృత్యములు
తానె యేమఱక యు - ద్దము చేసి యలసి
లోనైన చందమా - లోకించి కపులు

మండుచు శరభ ప్ర - మాదులఁ గూడి
దండనె గంధమా - దన శరభులను 8700
నడచిపై దుమికిన - నాల్గుచోటులను
మడిసిపోయిన తన - మరణం బెఱింగి
యరదంబు డిగ్గి శ - రాసార వృష్టిఁ
బరగించి సౌమిత్రి - ప్రల్లదం బణఁచి
ముక్కాక చేసి పై - మొనసిన కవుల
యుక్కణగించి దై - త్యుల నెల్లఁ బిలిచి
"అరదంబు లేదయ్యె - నరుల జయింప
తరిగాదు తనకు నం - దఱు మీరు గూడి
యడ్డంబు నిలిచి క - య్యము చేసి వారి
కొడ్డుగా నాఁగి నా - కూరట యిండు 8710
ఈసంజచీకటి - నెఱుఁగరాకుండ
మీసందడిని నాదు - మెయిడాఁచి పోయి
లంకలో రధమెక్కి- - లఘుగతి వత్తు
నంకంబునకు ” నంచు - నప్పుడ పోయి

-: లక్ష్మణుఁ డింద్రజిత్తుని పరలోకగతునిఁ గావించుట :-

వేఱొక్క తేరెక్కి - విజయాధికాంక్ష
నారావణ కుమార - కాగ్రణి వచ్చె.
అచ్చెరువునఁ గపు - లందఱుజూచి
రిచ్చలు వడి వీఁడు - రెండవతేరు
నెక్కుక తావచ్చె - నెక్కెడఁ గలిగె
నిక్కడ నని ధైర్య - మేది సౌమిత్రి 8720

పొంతవారల వెడ - పుంఖాను పుంఖ
దంతన్యమాన కో - దండ నిర్ముక్త
వరదత్త వివిధది - వ్య శరప్రపంచ
పరివేషగతచండ - భానుఁడై నిలిచె
వానరావళి నొంప - వనజజు మఱుఁగు
దీనులై చొచ్చిన - దివిజు లోయనఁగఁ
దన వెనుకకుఁ జేర – దశరథాత్మజుఁడు
కనుగల్గి కనక పుం - ఖ శిలీముఖముల
విలు ద్రుంచుటయు వాఁడు - వేఱొక్కధనువు
చలమునఁ బూనిన - సాయకత్రయిని 8730
ఖండించి శరపంచ - కమున దానవుని
కొండవంటి యురంబు - గ్రుచ్చి పాఱంగ
వ్రేసిన యెదనాఁటి - పంపున వెడలి
దూసి యావల ధాత్రి - దొలుచుక పడిన
వేఱొక్క విల్లంది - విశిఖముల్ గురియ
శ్రీరాము తమ్ముఁడు - చేకొని యునికి
మరియు సారథినొక్క - మార్గణంబేసి
శిరముఁ ద్రుంచిన యింద్ర- జిత్తుఁడేమఱక
సారధి తానయై - చక్రంబు రీతి
తేరు వోనిచ్చి కోఁ - తి బలంబు మీద 8740
సౌమిత్రి మీఁద న - స్త్రంబులు గురియ
రాముని సైదోడు - రాక్షసు మీఁద
మఱియు నమ్ములు వ్రేయ - మార్గణ దశక
మురుశక్తి సౌమిత్రి - యురముపై జోడు
వ్రేసిన నడుమనె - విశిఖముల్ బదులు

వేసి ద్రుంచిన దైత్య - వీరుఁడు మఱల
నమ్ములు మూఁట రా - మానుజు నొసలు
గ్రమ్మ రక్తంబులు - గాడ నేయుటయుఁ
బెక్కు దూపులు రొమ్ము - భేదించి విల్లు
చక్కు చేసిన నిశా - చర వరాత్మజుఁడు 8750
"మర్మంబు లెఱిఁగించి - మాపిన తండ్రి
దుర్మార్గుఁడై వీఁడు - దోడుక వచ్చి
యింతేసి పనులు సే - యింపుచున్నాఁడు
పంతగించిన యట్ల - పడనేతు నతని”
అని తనమీఁద రా - నవ్విభీషణుఁడు
పెనుగద సారించి - పెట్టు కొక్కటిఁగ
నాలుగు మారుల - నాల్గు తేజులను
కూలఁగొట్టిన నన్న - కొడుకు కోపించి
పటు బాహుశక్తిచేఁ - బట్టిన శక్తిఁ
గిటకిటమన పండ్లు - గీటుచు వ్రేయ 8760
నదిరాఁగ లక్ష్మణుఁ - డైదు తూపులను
పది తునియలు చేసి - పడనేయుటయును
నశనికల్పములైన - యయిదు తూపులను
దశవదనుని సహో - దరుఁడు సంధించి
ధూమ్యులు నిగుడంగఁ - దొణిఁగి నొప్పించి
యామ్యాస్త్ర మతనిపై - నతఁడు సంధించి
పేర్చి వ్రేయుటయు కౌ - బేరాస్త్రమప్పు
డేర్చి లక్ష్మణుఁడు పై - నేయ నారెండు
క్రౌంచముల్ పోరాడు - గతి మొరయుచును
మించనేరక యవి - మేదినిం బడిన 8770

నాయింద్రజిత్తు రౌ - ద్రాస్త్ర మేయుటయుఁ
జాయగా వారణా - స్త్రముఁ బ్రయోగింప
సౌమిత్రి గనుచుండ - సరివోరె రెండు
భీమావహంబులోఁ - బేనుక వడియె
నసురేంద్రసుతుఁ డన - లాస్త్ర మేయుటయు
నసముతో మగధక - న్యా కుమారకుఁడు
సౌరాస్త్ర మేసినఁ - జదలున రెండు
పోరాడి జంటగాఁ - బొలిసినఁ జూచి
యాసురాస్త్రంబు మ - హాసురుండేయ
నాసన్న దివ్య శ - స్త్రాస్త్రమై రాఁగ 8780
యూర్మిళావిభుఁడు వా - యు మహాస్త్ర మేసి
నిర్మూలితము చేసి - నిలువక మీఱి
యేచి పైరాఁగ మ - హేశ్వరాస్త్రంబు
వైచిన నదివచ్చి - వారించి దాని
దివ్యాస్త్రముల వారె - దిర్చి పోరాడ
దివ్యులు మౌనులు - దేవర్షివరులు
చేరి సౌమిత్రి నా - శీర్వదింపుచును
"వీరాగ్రగణ్య ! యీ - విమతు నీ వేళ
నడఁగింపు మొక యమో - ఘాస్త్రంబుఁ దొడిగి
విడువకుమీ యని - వినఁ బల్కుచుండ 8790
మఖవ నిర్మితము స - మస్తాస్త్ర రాజ
మఖిల లోకారాధ్య - మరిదురాసదము
అప్రతిహతము ని - రస్త నిశాట
మప్రమేయమునై న - యైంద్రాస్త్ర మేర్చి

"మాయన్న సత్య సం - పన్నుఁడై ధర్మ
మేయెడఁ బాటించు - నేని యప్రతిమ
పౌరుష నిధియేని - పంచిన యపుడ
యీ రాక్షసుని తల - యిలఁ గూల్చుఁ గాత!”
అని ప్రయోగింప మి - న్నంది యయ్యస్త్ర
మనలార్క శతసహ - స్రాభమై వచ్చి 8800
కుండల కోటీర - గురురత్న దీప్తి
మండితం బై నట్టి - మఘవాసి శిరము
తెగఁగొట్టి యిలమీఁదఁ - ద్రెళ్లించి యపుడె
మగుడి లక్ష్మణు తూణ - మధ్యంబుఁ జేరె!

--: లక్ష్మణ విజయమునకు లోకము హర్షమునొందుట :--

కురిసెను పై నుండి - కుసుమవర్షంబు
మొఱసె వైయచ్చర - మురవ దుందుభులు
అడిరి రంభాదు - లైన యచ్చరలు
పాడిరి నారద - ప్రముఖ గాయనులు 8810
పొగడిరి మౌనులు - బ్బుచుఁ జేర వచ్చి
మగిడిరి భీతి స - మస్త దానవులు
చల్లగా వీచెను - చందనానిలము
తల్లడంబులు మానె - ధరణీసురులకుఁ
గపులెల్ల నానంద - కలితులై రపుడు
జపహోమ యోగముల్ - జగతిపై మొలచె
జాంబవంతుఁడు విభీ - షణుఁడు నాలింగ

నంబులు చేసి మ - న్న న గాంచిరపుడు.
క్రొత్తగాయంబులఁ - గురియు రక్తముల
జొత్తిల్లి యలయిక - సోలుచు మఱలి 8820
వచ్చునప్పుడు జాంబ - వద్విభీషణులు
గ్రుచ్చి పట్టుకరాఁగ - గురుబాహు యుగళి
వారి మూఁపులవై చి - వసివాడు మొగము
భూరేణు పటలంబు - వొదువుక యుండ
ధృతిపూని కన్నులు - దేలవైచుచును
హితవానరానీక - మేడమీక కొలువ
గెలిచెదమని రాని - గెలుపుతో దైవ
బలమెల్ల దనపాలఁ - బంచుకొన్నట్టి
తమ్మునిఁ జూచి సీ - తా ప్రాణవిభుఁడు
 నెమ్మది పేదపె - న్ని ధిఁ గన్న కరణి 8830
గ్రక్కున లేవ రా - ఘవుని పాదముల
చక్క సౌమిత్రి యం - జలిఁ గూర్చి వ్రాల
నెత్తుక తొడలపై - నిడుకొని మేన
హత్తించి యౌదల - యాస్వదింపుచును
కన్నుఁగొనల నశ్రు - కణములు రాల
నెన్నఁడు నెట్టిచో - నెఱుఁగని యట్టి
సంతోషమునఁ గృపా - జల రాశిఁ దేలి
చెంతలఁ గూడివ - చ్చిన వార లెల్ల
"యింద్రజిత్తుని గెల్చె - నిపుడు నీతమ్ముఁ
డింద్రాదులును వాని - నెదిరింప లేరు 8840
వానితోడిదె లంక - వాఁడు రావణుఁడు
మేనులోఁ బ్రాణమై - మించినవాఁడు

నీతమ్ముఁ డిందుచే - నీకృపా పాత్ర
భూతుఁడయ్యె ” నటన్నఁ - బోయిన సీత
యప్పుడే కూడిన - ట్లతి సంతసమున
ముప్పిరి గొనఁగ రా - ముఁడు 'వారిఁ బలికె
"గెలుపు గైకొంటిని - కీశ పుంగవులు
తలఁచిన కార్య మం - తయుఁ గడతేఱె
దశకంఠునకు వీఁడు - దక్షిణ భుజము
శిశువు లక్ష్ముణుఁడింద్ర - జిత్తుతో నెదిరి 8850
జయమందునే విభీ - షణుఁ డంతవాఁడు
భయము దీర్పుచుఁగాచి - పనిఁగొనె గాక
సుతుని రావణా - సురుఁడును జచ్చె
నతఁ డెంతవాఁడ సా - ధ్యం బెద్ది మనకు ?”
ననుచుఁ దమ్ముని పున - రాలింగనంబు
మనసుఁ దీఱఁగఁ జేసి – “మాయన్న ! నీవు
మూన్నాళ్ల బలుగయ్య - మున నింద్రజిత్తుఁ
బూని చంపితి వెంత - పుణ్యుఁడవైతి
సౌమిత్రి ! యిపుడు ని - శ్శాత్రవంబయ్యె
నీమీఁద నాదు పూ - నిక యెల్లనుంచి 8870
యాపదమాన్ప ది - క్కైతివి నిన్నుఁ
జూపెను నా పూర్వ - సుకృత వాసనలు
రావణాసురుఁ డేల - రాకుండు ? వచ్చి
చావక పోఁడు నా - శరముల చేత !
సీతఁ గైకొంటి కాం - చితి నేనయోధ్య
మాతండ్రి ! యిఁక నను - మాన మేమిటికి ?”

అని సుషేణుని బిల్చి - యౌషధక్రియల
మును వానరుల గాయ - ములు నొప్పి మాన్పి
"సౌమిత్రి యంగంబు - చాల నొచ్చినది.
తామసింపక చికి - త్స యొనర్పు మీవు 8870
విచికిత్స మానుమీ - వేళ" యనంగ
నుచితజ్ఞత సుషేణుఁ - డొకయాకుదెచ్చి
సౌమిత్రికిని విభీ - షణ వానరులకు
నామందు పిడిచి న - స్యముఁ జేయుటయును
నందఱు మునుపటి - కన్న నెమ్మేను
లందుఁ జెల్వంది గా - యమ్ములు మాని
కాయముల్ వజ్రని - కాయముల్ గాఁగ
శ్రేయోధి కారులై - శ్రీ రాము చెంత
నెప్పుడు రావణుఁ - డెదిరించు ననుచు
ఱెప్ప వేయక చెల - రేఁగి యున్నంత. 8880

-: ఇంద్రజిత్తు మరణమువిని రావణుఁడు దుఃఖించుట :-

చెడి విఱిగిన హత - శేషులు వఱచి
చిడుముడితో నింద్ర - జిత్తుని పాటు
నావిభీషణుఁడు తో - డై వచ్చి మర్మ
మావల నెఱిఁగించి - యదటణంచుటయు
వినుపింప విబుధారి - విభుఁడొక్కజాము
తన మేనెఱుంగక - తడవు మూర్ఛిల్లి
మిత్రులు బోధింప - మెల్లనే తెలిసి
పుత్రశోకంబునఁ - బొరలుచుఁ బలికె

"ఇంద్రుని చెఱసాల - నిడువాని రామ
చంద్రుని తమ్ముఁడే - జగడించి గెలిచె 8880
యమునకు వెఱవ నేఁ - డాదిగా నతని
బొమముడికై వీఁగి - పోవంగ వలసె
నీపాటు తనకొక్క - నికె యార్తి గాని
ఈపద్మ గర్భాండ - మెల్లది లంక
మూఁడులోకములు నే - మోకాని తనకుఁ
బాడయిపోయిన - భావంబు దోఁచె
మునులు దేవతలు నా - ముందఱ నేమి
యనిన నూరక తాళి - యనద గావలసె
యవ్వరాజ్యము మమ్ము - నఖిల బాంధవుల
జవ్వనులనుఁ బాసి - చననీకుఁ దగునె ? 8890
పగవారు నవ్వ నా - పయిఁ దెగ లేక
తెగితివి దూషించి - తిని నిన్నెఱింగి
తన తండ్రిమాట యౌఁ - దలఁ దాల్చి వచ్చి
యనుపమ జయకీర్తు - లందె రాఘవుఁడు
నీవు నీతండ్రి పూ - నికఁ దీర్తననుచుఁ
జావఁ బాలైతివి - సలుపు పాపమున
హాకుమారక ! హా ! మ - హాశూరవర్య !
హాకామసంచార ! - హా యింద్రజిత్త !”
అనిచాలఁ బలవించి - "యక్కట వీఁడు
జనకజకై కదా - చచ్చే నీచావు 8900
తాను మాయాసీతఁ - దలఁ దెగవ్రేసె
నే నిజంబుగ సీత - నిపుడు ద్రుంచెదను !”

 --: రావణుఁడు సీతను వధింపఁ బోవుట :--

అని బొమల్ ముడివడ - నంగముల్ గదలఁ
గనుదోయి విస్పులిం - గంబులు వ్రాల
తిరుగు గానుగ మ్రోఁత - తీరునఁ బండ్లు
గొఱుకుచోఁ గిటగిట - హోషంబు నిగుడ
తన మంత్రులను జూచి - " తన తపంబునకు
మును ధాత యిచ్చు న - మోఘ కార్ముకము
నరదంబు పంచమ - హావాద్య ఘోష
కరటి సైంధవభట - కలితంబుగాఁగ 8910
తెండు రాఘవుని వ - ధింపఁగా వలయుఁ
బొండని" పనిచి య - ప్పుడ పుత్రశోక
పీడితుండగుచు నా - బిగువుతో వేల్పు
వ్రీడావతులు తన - వెంబడి రాఁగ
కాంతారమున నశో - క వనంబుఁ జేరి
సీతఁ జంపుదునని - చేపెద్దకత్తి
యొరదీసి కడవైచి - హుంకారములను
కరవేడి పొగల చేఁ - గమర మీసములు
వలదంచు యెవ్వరు - వారింప వినక
తొలఁగఁ ద్రోయుచు వచ్చు - దోషాచరేంద్రుఁ 8920
గన్నుల గనుఁగొని - కల్యాణి సీత
విన్నఁ బోవుచు నాత్మ - వివశయై తలఁచి
"చెడుగు వీఁడేల వ - చ్చెనో యాగ్రహించి ?
యడిదంబు వట్టి మ - ల్లాడుచు నిటకు
దిక్కు లేదని తన్నుఁ -దెగ వ్రేయఁ దలఁచె
నొక్కొ లేదేని ర - ణోర్విలోఁ దనదు

కొడుకు చచ్చిన విని - కోపించి పురము
వెడలి రాఘవులతో - విరసింపలేక
నాకోపమునఁ జంప - నలిగెనో తన్ను
కాక యేఁదనకు లోఁ - గాననియెంచి 8930
కామాతురతఁ దాళఁ - గా లేక యీతఁ
డేమి దలంచి తా - నిటకుఁ జేరెడినొ
కాక వీఁడసమసం - గరములో నేఁడు
కాకుత్థ్సతిలకుని - ఖండించి వైచి
వానరులను జంపి - వచ్చి నాఁడొక్కొ
దీనికి హేతువు - దెలియలేనైతి
హనుమంతుఁ డలనాఁ డె - యమ్మ ! నా వెంటఁ
జను దెమ్ము మూఁపుపై - సవరించి నిన్నుఁ
గొనిపోయి నీ నాయ - కుని చెంత నిపుడె
యునిచెద నని వల్కె - నొప్పకపోతి 8940
పోయిన నే సుఖం - బునఁ బ్రాణవిభునిఁ
బాయక సా కేత - పట్టణంబునను
నుందుగా యటులేల - యుండంగనిచ్చు
మందరఁ గూడిన - మాకర్మఫలము
కైకేయి చెలరేఁగ - కౌసల్య పుత్ర
శోకంబుచే రాము - శుభగుణావలులు
దలఁపుచు నేరీతిఁ - దాల్చుఁ బ్రాణములు ?
కలనైన నూరటఁ - గానదో యమ్మ ?
ఎన్ని పాటులఁ బడె - నిక్ష్వాకుతిలకుఁ
డన్నియు విఫలంబు - లై పోయె నిపుడు !” 8950

అని యేడ్చునపుడు ద - శానను జూచి
కినుక సుపార్శ్వుఁ డం - కించి యిట్లనియె.

-: సుపార్శ్వుఁడు రావణుని నివారించుట :-

ఆజుని పౌత్రుడవు దై - త్యాన్వయాగ్రణివి
భుజశౌర్యనిధివి సం - పూర్ణ కాముఁడవు
ధనదసోదరుఁడవు - ధర్మశాస్త్రముల
వినియున్నవాఁడవు - వేదవేదాంగ
పారగుండవు రామ - భార్యఁ జంపుదురె ?
ఈరామపయి నేర - మేమి గాంచితివి ?
ఒప్పక యున్నది - యొచ్చమె యేమి
తప్పు ? పతివ్ర తా - ధర్మము వినమె ? 8960
 నాయకుఁ డున్నట్టి - నాళ్ళకు చిత్త
మీయమ్మ నీకియ్య - దిపుడైనదేమి ?
చూడుము లోకైక - సుందరి చెల్వ
మీడెవ్వ రిటువంటి - యెలనాఁగఁ జూచి
చేయాడి చంపఁ జూ - చితి విట్టి కినుక
దాయల పై జూపి - తాను మున్నైన
కలబాంధవులఁ గూడి - కలనికిఁ బోయి
గెలువుము రఘువీరఁ - గెలిచితివేని
యాకడ నీవుగా - కన్యులు గలరె
యీ కోమలికి మన - సిచ్చు నమ్మీదఁ 8970
 స్త్రీవధ మీవు చే - సిన నపకీర్తి
పోవదు పరలోక - మును దూరమగును
పరులపైఁ దెగలేక - పడతులఁ జంపు

దురె ? కృష్ణపక్ష చ - తుర్దశి నేఁడు
రేపె యమావాస్య - శ్రీరాముఁ జంప
నోపమే ! బుద్ధి - యొప్పునే నీకు ?
కాదు రమ్మని పల్కి - కరముల వ్రాలి
కైదువ దీసుక కడకుఁ - ద్రోచుటయు
యేదియు ననక తా - నింద్ర జిత్తునకు
వేమారు నేడ్చుచు - విసువుతో మఱలి 8980
యామున్నువోలె ని - జాస్థానిఁ జేరి
హైమవిచిత్ర సిం - హాసనాగ్రమున
నాసీనుఁడగుచుఁ దా - నంజలి చేసి
యాసభాసదులతో - నసురేంద్రుఁ డనియె.

-: రావణుని యాప్త పరివారముతో వానరులు యుద్ధము చేయుట :-

మీరెల్ల నాప్తులు - మీరుండ లాఁతి
వారలు వచ్చి ని - వారింపఁ గలరె ?
తనదైన యీ యాప - ద యనాథుఁడైన
తనమీద మీరెల్ల - దయసేయవలదె ?
యీవేళ మీయంత - లేసి చుట్టములు
నావద్ద నుండియు - నరులు వానరులు 8990
మన యింద్రజిత్తుని - మడియించిరనఁగ
వినియు నూరకయున్న - విబుధులు నగరె !
పొండు మీ చతురంగ - ముల తోడరిపుల
ఖండించి విజయంబుఁ - గైకొని రండు
శరదముల్ వొదివిన - చాడ్పున దివ్య

శరములు వర్షించి - సమరంబుఁ జేసి
మీచేత నైనట్లు - మిహిరోదయమున
లేచి పొండ”నిన వ - ల్లేయని వారు
నరుణోదయంబైన - నరదముల్ కరులు
హరలు కై జీతంబు - నవని గ్రక్కదలఁ 9000
బెక్కు సాధనముల - భేరులు మొరయ
నుక్కుతో వనచర - వ్యూహంబు మీద
నడచినఁ గపులు కొం - డలు తరువులును
జడిగొన వర్షించి - సమరంబుఁ జేసి
చేతులు ముక్కులు - చెవులును మెడలు
శాతదంతన ఖాది - సాధనంబులను
కఱచియు గిల్లియు - కట్టియు పొడిచి
నరభోజనులకు ము - న్నరక చేసినను
తేరులు దోలి హ - త్తీల ఢీకొలిపి
వారువమ్ములఁ జొర - వైచి శక్తులను 9010
పరిఘ ముద్గరకుంత - పట్టిసప్రాస
శరశూలముసలాస్త్ర - శస్త్ర కృపాణ
పరశుతోమరకుంత - భల్ల నారాచ
కరవాల గదలచే - కాళ్లు చేతులును
ముక్కులుఁ జెవులును - మొగము లెమ్ములును
పక్కలు వీఁపులు - ఫాలముల్ తొడలు
నజ్జునజ్జులు గాఁగ - నరములు దునియ
విజ్జువిజ్జున కాలు - విడిదన్నుకొనఁగ
వాలముల్ దునియ రా - వణుని సమస్త
మూలబలంబు రా - ముని బలంబులును 9020

చెక్కలు సేయుచుఁ - జెరమి వ్రేయుచును
మక్కుమారుగ మారి - మసరిన యట్లు
రక్తనదీసహ - స్రములు పాఱించు
నక్తంచరులమీఁద - నగచరులెల్ల
నొకరొక్కరుని పై - నురువడిఁ బ్రాఁకి
యెక్కుచు ఫలితమ - హీరహంబులకుఁ
బక్షులు చేరిన - పగిదిఁ గ్రీడింప
రాక్షసు లలిగి దూ - రమున విదర్చి
తరచి చంపుటయు నం - దఱు నిల్వలేక
శరణు జొచ్చినఁ జూచి - జానకీ ప్రియుఁడు 9030
చొరఁబారి రావణా - సురుని కై జీత
మురుముచు మేఘంబు - లుగ్రాంశుఁ బొదవు
కైవడిఁ దనమిఁదఁ -గ్రమ్ముక రాఁగ
చేవిల్లు సజ్యంబు - చేసి మ్రోగించి
వారవేసిన యట్టి - వాలంపగములు
నారాచధారల - నఱికిపోవైచి
కోపంబుతోఁ గన్నుఁ - గొనలఁ గెంజాయ
చూపట్ట దనశక్తి - చూఫువాఁడగుచుఁ
దేరులు చెక్కాడి - దీకొన్న కరులఁ
బోరు గొండలమాడ్కిఁ - బుడమిఁ ద్రెళ్లించి 9040


-: శ్రీరాముడు రావణుని పరివారముతో యుద్దము చేయుట :-

హరుల పీచమడంచి - యాశరకోటి
పరియలుపడ దివ్య - బాణంబు లేసి

యెందఱెందఱు దైత్యు - లెదిరించి పోరి
రందఱి కన్నుల - కందఱై తోఁచి
తానాగ్రహంబుచే - తనమేను మఱచి
మానుషంబున నతి - మానుషక్రియను
లక్ష్మణాదుల చూడ్కు - లకు భీతి వొడమ
సూక్ష్మదృష్టినిఁగాని - చూడంగ రాని
పరమాత్మ మఖిల ప్ర - పంచంబులోనఁ
బరిపాటి నైజరూ - పమున నున్నట్లు 9050
పంక్తికంధర మూల - బలములోఁ జొచ్చి
పంక్తిరథాత్మజ - ప్రవరుఁ డత్యుగ్ర
కనక పుంఖాను పుం - ఖశరప్రకాండ
జనిత ఘోరానల - జ్వాలలు నిగుడ
మండలీకృత్యస - మానకోదండ
దండుఁడై లయదండ - ధరుఁడును బోలి
యెదిరించు రఘువీరు - నెదిరించి పోరఁ
గదనంబులోన నె - క్కడఁ గానలేక
తమమూఁకలోఁ జొచ్చి - తము జంపుచునికి
తమరు గానఁగ లేక - తమలోనె తారు 9060
నొక్కరుఁ డొక్కని - యుద్ధతిఁ జంపి
యెక్కడెక్కడ రాముఁ - డిదె వచ్చెననుచు
వేయు నమ్ములు దైత్య - వీరులఁ దాఁకి
మాయింప మేనులు - మఱచి పోరుచును

-: శ్రీరాముఁడు తన మహాస్త్రప్రయోగముఁ జూపి యసంఖ్యాకములగు రావణుని బలములను సంహరించుట :-

నవ్యయ రఘుపుంగ - వాహవామోఘ
దివ్యగంధర్వాస్త్ర - తిమిరపుంజంబు
కన్నుల దొట్టిన - ఖరఖరకిరణ
సన్నిభంబగు తద -స్త్రప్రపంచమునఁ
జీకురై నగరి కై - జీతంపు దొరలు
పేకయు పడుగులై - పెనుచుకపడిరి ! 9070
విమతునా శ్రీరామ - విశ్వరూపమున
తమరెల్ల దవిలి ముం - దఱ నిలుచున్న
కోదండ దీక్షాది - గురు రఘువీరు
నాదండ నొక్కని - నసురులు చూచి
"కంటి మొంటిగ జిక్కె - కలెఁగొనుఁడొక్క
వింటివానికి నేల - వెఱవ ” నటంచు
తిరిగి వాఱినచో న - దృశ్యుఁడై విల్లు
కొఱవి ద్రిప్పినయట్లు - గోచరించుటయు
విలుకానిఁ గానము - వింటిదివ్యాస్త్ర
ములు వచ్చుచున్నవి - మూఁకలమీద 9080
ననుచుఁ జూడంగ మ - హత్తర నాభి
తనువుగా సత్త్వంబు - తన జ్వాలగాఁగ
కమ్మి విల్లుగ శర - కాండ మంచులుగ
కమ్ము ఘోషము రణ - క్వణనంబుగాఁగ
కాంతి బుద్ధి గుణాధి - కంబు నిసర్గ
కాంతిగ మొనలస్త్ర - గణములుగాఁగ
చక్రసన్నిభరామ - చక్రంబు కాల

చక్రంబుగతి దైత్య - చక్రంబుమీద
దిరుగుచున్నపుడు దై - తేయులు ప్రజల
తెరఁగునఁ బొలియుచుఁ – దెలియ కేమియును 9090
నదెవచ్చె రఘువీరుఁ - డదె త్రుంచెఁ గరుల
నిదె చంపె వాజుల - నెదిరించె మనలఁ
బొడిచేసెఁ దేరులఁ - బొడువుండటంచు
నొడివినవాని క - న్నుల కొక్కఁడగుచుఁ
బదువురు నూఱై య - పారములగుచు
మదుల భీతిల మహీ - మండలంబెల్ల
రామ మయంబయి - రాక్షసకోటి
కేమరు దానయై - యిషుపరంపరల
నరదంబు లేడుగో - ట్లామీద దొమ్మి
దిరువది లక్షలు - నిలఁ జూర్ణమయ్యె. 9100
పదమూఁడు గోటులు - పండ్రెండు లక్ష
లదిగాక ద్విదశస - హస్ర సంఖ్యకును
మదము నేనుంగులు - మడిసె నశ్వములు
పదిగోట్లపై నిరు - వది లక్షలవల
నరువదివేలకు - హతమొందె నెదురు
పరులందు నూటన - ల్వదియైదు నైన
కోటులశీతి ర - క్షో లక్షయొక్క
మాటుగా నర్ధయా - మంబున మడిసె.
రావణ కుంభక - ర్ణసమాను లెచ్చు
లావులవారు మూ - లబలంబు దొరలు 9110
నందఱుఁ జాలిన - హతశేషులొక్క
కొందఱు చెడి లంక - కును బాఱిరపుడు.

రౌద్రమై యాహవ - రంగంబు వొలిసి
రుద్రుని యుద్యాన - రూఢిఁ జూపఱకు
మునులు దేవతలు రా - ముని సన్నుతించి
మనమున నానంద - మగ్నులై రపుడు.
తమ్ముని రావణు - తమ్ముని వాలి
తమ్మునిఁ దారాసు -తప్రముఖులను
జాంబవంతునిఁ జూచి - సంతోషభాష
ణంబుల మిగుల మ - న్నన లాచరించి 9120
"యేనొక్కఁడను లలా - టేక్షణుం డొకఁడు
గాని యీదివ్యాస్త్ర - గరిమంబుచేత
వైరులఁ దునుమ నె - వ్వారి చేనైన
దీఱ దీనీమంబుఁ – దెలియఁ బల్కితిని ”
అన విని వారెల్ల - నభినుతుల్ సేయ
జనకజాప్రియుఁడు ల -క్ష్మణుని చేతికిని
తన దివ్య హేమకో - దండంబొసంగి
యనసమజయ శాలి - యై యున్నయంత

-: లంక లో రాక్షస స్త్రీలు తమ పరిస్థితినిఁ దలంచుకొని రోదనము సేయుట :-

ఆలంకలోని దై - త్యాంగన లెల్ల
"నాలంబులోన రా - మాస్త్రఘాతములఁ 9130
దనయులుఁ గూలిరి - తండ్రులు వడిరి
పెనిమిటుల్ బావలు - పృథివిపాలయిరి
మామలు చచ్చిరి - మఱదులు మడిసి
రేమి సేయుద" మని - యెలుఁగెత్తి యేడ్చి

"యీచుప్పనాతి దా - నింత కురూపి
రాచసింగము రఘు -- రామునివంటి
జగదేక సౌందర్య - శాలినిఁ జూచి
వగలింపుచును తాను - వలచితి ననుచుఁ
బోనేల ? తామోస - పోయి లంకకును
రానేల ? యీచేటు - రానేల దాన ? 9140
అదె వచ్చెఁబో రావ - ణాసురుండైన
మొదట విరాధుండు - మోహించి పట్టి
సీతకునై చెడ్డ - చేటెఱింగియునుఁ
బాతరలాడుచుఁ - బట్టె తానేల?
ఖరదూషణాది రా - క్షసుల మర్ధించి
దురములోపల కబం - ధుని నేలఁగూల్చి
వాలి నొక్కమ్మున - వధియించి యతని
పాలి రాజ్యము రుమా ? - పతికిఁ దానిచ్చి
వారితో రఘుపతి - వచ్చిన యట్టి
వారతల్ విని వెఱ్ఱి - వాని చందమునఁ 9150
గొడుకులఁ దమ్ములఁ - గొల్చిన వారిఁ
బడఁద్రోచె రాఘవు - బాణాగ్నిలోన
మన విభీషణుఁడు ము - మ్మాఱుగాఁ జాటి
తనకుఁ జెప్పిన బుద్ధి - తనవిధివచ్చి
పెడతలఁ గొట్టంగఁ - బెడచెవిఁ బెట్టి
వెడలిపొమ్మనఁ బోయె - వెతఁదీఱి యతఁడు.
అజహరాదులతోడ - నమరులు వోయి
ప్రజనెల్ల బాధించి - పంక్తి కంధరుఁడు

బ్రదుక నీఁడన నొక్క - పడఁతిచే వాఁడు
మొదలుగా లంక ని - ర్మూలమౌ ననిరి 9160
వారు చెప్పిన యట్టి - వనిత యీ సీత
కారణం బెఱిఁగియుఁ - గానకున్నాడు
మనలేఁడు పద్మజు - మఱుఁగుఁ జొచ్చినను
గనలేఁడు కామాంధ - కారంబు చేత
హరుఁడో విరించి యో - యమరనాయకుఁడో
ధరణిజారమణుఁడీ - తరములో నొకఁడు
కావున దిక్కు లే - క చెడంగ నేల ?
కావవే యనుచు రా - ఘవు పదంబులకు
శరణందమా దవ - జ్వాలలఁ దగిలి
కరిణీ సమూహంబుఁ - గలఁగిన యట్లు 9170
సమయ నేల”నుచు రా -క్షసభామలెల్ల
తమలోనఁదాము సం - తాపించుచుండ

-: రావణుఁడారోదన ధ్వని విని మహోదర మహా పార్శ్వులతో యుద్ధమునకు బయలు దేరుట :-

ఆరావమపుడు ద -శానను చెవుల
నారాచధారలై - నాఁటిన నలిగి
తన హితులను మహో - దర మహాపార్శ్వు
లను వారిఁ బిలిచి "మీ - రాహవంబునకు
నడచి రాముని లక్ష్మ - ణ విభీషణులను
హరివరుఁడాదిగా - నగచరావళినిఁ
జంపుఁడే వచ్చెద - సమరంబులోన
ముంపుదు నాశరం - బుల విరోధులను 9180

నింగియు నవని ము - న్నీరు నేఁడసమ
సంగరంబున నస్త్ర - సమితిఁ గ ప్పెదను
రణవార్ధిఁ బుట్టు త - రంగంబు లనఁగ
రణదురజ్వాలతా - రాహినకులోగ్ర
సాయకంబులను గీ - శశ్రేణి ముంచి
మాయింతు రామల - క్ష్మణుల నవ్వెనుక
మూతుల నాఁటు న - మ్ములతోడ నెగురఁ
గోఁతుల తలలెల్లఁ - గొట్టి ధరిత్రిఁ
గమలిని వోనాడ - కలిత పద్మోప
మములుగాఁ జూపఱ . మది మెచ్చఁ జేతు. 9190
ఖరమహోదర కుంభ - కర్ణేంద్ర జిత్తు
లఱిన ఖేదము దీర్తు - ననిలోన నేఁడు
శ్రీరాము ఖండించి - సీత కన్నీరు
ధారాళముగఁ జేసి - దనుజ కామినుల
కన్నీరు తజ్జలౌ - ఘంబులఁ దుడిచి
చన్న వారికిఁ గీర్తి - సవరింతు నేను.
హతశేషులైన దై - త్య శ్రేణిఁ గూర్చి
జతనంబుగా మీరు - చనుదెం"డటంచు

-: రావణుఁడు యుద్ధ ప్రయాణమున నపశకునములను గనుట :-

గంధవాహాత్మ ని - ర్గంధనర్గంధ
సైంధవాష్టక పటు - చక్రనిర్వక్ర 9200
రాహుధ్వజాగ్రసా - రథి చతురాహ
వాహిత జయశీల - మగు రథం బెక్కి

యూపాక్షు డొకచో మ - హోదరుడొక్క
కోపున నొక్క ది - క్కు సుపార్వుఁ డుండ
నొకచో మహాపార్శ్వుఁ - డురుతరహేతి
చకచకల్ నిగుడఁ గాం - చనరథంబులను
భేరీమృదంగాది - భీకరధ్వనులు
బోరు కలంగ న - ప్పురము లోపలను
చావులకును దప్పి - సందుల నీఁగి
లేవను ప్రాలుమా - లిన దానవులను 9210
వెదకి యింటింటను - వెరజి పట్టుకొని
కదనంబునకు సమ - కట్టి యాలంకఁ
జులకఁగా నుత్తర - స్థూల గోపురము
వెలువడి దానవ - విభుఁ డాగ్రహమున
నడచు నవ్వేళ - సైన్యంబులో రాలె
కడగట్టినట్ల యు - ల్కావితానంబు
కేతన కలశమె - క్కెను పంతగ్రద్ద
హేతువు లేకయే - హేతులు విఱిగె.
నింగి జల్లిచ్చెను - నెత్తురువాన
ముంగల బలు మొండె – మును వచ్చి పడియె. 9220
దనుజేంద్రు వామనే - త్రము భుజంబదరెఁ
గనుపట్టె కుత్తుక - కాకుస్వరంబు
మోములెల్ల వివర్ణ - ములు మించె సర్వ
సామాన్య నానావ - శకునంబు లెల్ల
లెక్కసేయక త్రోచి - లేఖారివరుఁడు
చక్కుగా నరదంబు - చననిచ్చి యెదురు
కపుల పుంఖానుపుం - ఖములుగా నస్త్ర

విపరీతవృష్టిఁ బ - ర్వించి నొప్పించి
పొగరుతో జగడింప - భూరి బాణములు
నిగుడించి కోలకు - నేలకుం దెచ్చి 9230
పగఁదీఱ వింశతి - బాహుండు మిగుల
నొగులంగఁ గపులఁ బీ - నుఁగు పెంట సేయ
నెదిరింపఁ దలచూప - నెవ్వండు లేక
పదరుకొన్నట్ల ద - బ్బరవచ్చె ననుచు
వానరావళి నాల్గు - వంకలు విఱిగి
భానుజాదులు మీఱి - పఱచినఁ దఱమి
పచరించి రాముని - పయిఁ దేరు దోలి
యచలుఁడై వచ్చు ద - శాననుఁ జూచి
వానరస్వామి ది - వాకర సుతుఁడు 9240
సేనల నడుమ సు - షేణుని నిల్పి
పురికొల్పి తానొక్క- - భూమీరుహంబు
గురురక్తి బెకలించు - కొని కేలఁ బూని
వనదముల్ విరియించు - వాయువురీతి
దనుజులను మర్దించి - తరిమినఁ జూచి

-: విరూపాక్షుడు సుగ్రీవునిచే హతుఁడగుట :--

రూక్షేక్షణుండు వి - రూపాక్షుడనెడి
రాక్షసుఁడొక్క - వా - రణముపై నెక్కి
సుగ్రీవుమీదటఁ - జొచ్చిన భీమ
విగ్రహుఁడై చేతి - వృక్షంబు చేత
విసిరిన కరిఁదాకి - వింటి పెట్టునకు
బిసదప్పి రివ్వున - పిఱిఁదికి నెగిరి 9250

చదికిలఁ బడుటయుఁ - చంగున నెగసి
యదరు దాఁకక విరూ - పాక్షుఁ డెదిర్చి
కత్తియు కేడెంబుఁ - గైకొని చేర
హత్తి పేరెదవ్రేయ - నర్క నందనుని
వజ్రకీలిత వారి - వర్మంబు వజ్రి
వజ్రంబుచే గిరి - వ్రయ్యలైనట్లు
పరియలై పడుటయు - భానుజుం డలిగి
గిరియెత్తి దైత్యు నం - కించి వేయుటయుఁ
దప్పించుకొని చేతి - తరవారి నెడమ
చప్ప వ్రేయుటయు మూ - ర్ఛ మునింగి లేచి 9260
పిడికిట గ్రుద్దిన - బిమ్మిటి నేలఁ
బడిలేచి సుగ్రీవు - ఫాలభాగంబు
కేలఁగొట్టిన పండ్లు - గిటగిటఁ గొఱికి
వాలితమ్ముఁడు దాన - వకుమారుఁ జేరి
యరచేతఁ గొట్టిన - యౌదల పగిలి
పరియలై యిలవాలి - ప్రాణముల్ విడిచె.
ఆ విరూపాక్షుని -యరచేతఁ బఱచి
చావఁ గొట్టినయట్టి - సత్తువఁ జూచి
కపులెల్ల సుగ్రీవుఁ - గని మెచ్చుచుండు
నపుడు వేలాతీత - మగు వార్ధియుగము 9270
కైవడి రాక్షసుల్ - కవులును సమర
కోవిదులై మెండు - కొని పోరునపుడు
నిందందు పోరాడి - యీల్గిన సేన
లందు నెత్తురునదు - లంబుధిఁ గలయ
మిగిలిన మూక పై - మిగుల వానరులు

జగడింపఁ జూచి రా - క్షస నాయకుండు
నుగ్రాంశు తేజు మ - హోదరు బిలిచి
సుగ్రీవు మూక యం - చుల మించి వచ్చె
వారిపయి నీవు దు - ర్వార శౌర్యమునఁ
బోరి చంపుము వేగఁ - బొమ్మ”ని యనుప 9280

-: సుగ్రీవుఁడు మహోదరునిఁ బరిమార్చుట:-

"స్వామి ఋణంబు దీ _ ర్చఁగఁ గల్గె నన్ను
సామాన్యముగ మీరు - సంతరించితిరె ?
ఇదె యని కేఁగెద - నెల్ల వానరుల
గుదురు గ్రుచ్చెద నాదు - ఘోరాస్త్రములను
చూడుఁడు నామీఁదఁ - జూపులానించి
వేఁడుక చెల్లించు - విమతులఁ దునిమి !”
అని తేరు వోనిచ్చి - యనలంబులోనఁ
బెనుగాళ్ల మిడుత కు - ప్పించి పడ్డటుల
సింగంబు గర్జించు - చెలువున దనశ
తాంగంబు నలుదిక్కు - లందు రానిచ్చి 9290
యట్టహాసము చేసి - యంప వెల్లువల
గుట్టలుగాఁ గూల్చి - గోఁతులఁ దఱుమ
భానునందనుఁ డొక - పర్వతంబె త్తి
తానేయుటయు మహో - దరుఁడు కోపించి
యమ్ములఁ జెక్కాడి - నతఁడొక్కసాల
మమ్మనుజాశను - నదిలించి వ్రేయ
నదియును ద్రుంచిన - నర్క నందనుఁడు
బదులు కైదువ లేని - పరిఘంబుఁ బూని

హరులఁ జెక్కాడిన - నరదంబు విడిచి
ధరణికిడిగి మహో - దరుఁ డాగ్రహమున 9300
గదవ్రేయుటయు పరి - ఘంబుచే వ్రేయ
జిదురుపలై యవి - క్షితిమీఁదఁ బడిన
వేఱొక్క గద దైత్య - వీరుండు వట్టి
చేరిన ముసలంబు - చేభానుసుతుఁడు
వ్రేటు లాడిన నవి - విఱిగి పోవుటయు
మాట మాత్రనే వారు - మల్లలు చఱచి
సరి బిత్తరికిఁ జొచ్చి - సత్తువల్ నెఱయ
బిరబిరఁ ద్రిప్పుచుఁ - బెనఁగి వేయుచును
చండింపుచును భుజా - స్తంభంబు రీతి
దండపూనుక నిల్చి - తరమి గ్రుద్దుచును 9310
క్రిందుమీఁదై పడి - కేడించి నడుము
సందులు వ్రేయుచు - జగడంబు మాని
యలసి యిర్వరు నిల్వ - నమ్మహోదరుఁడు
చలముతో నొకక త్తి - ఝలిపించుకొనుచు
వ్రేసిన రవిజుండు - వేఱొకకత్తి
దీసుక దానవుల్ - దిగులుపడంగ
నఱకిన మకుటకుం - డలములతోడ
ధరమీఁద నమ్మహో - దరు తల వడియె

- మహాపార్శ్వఁ డంగదునితో యుద్ధ మొనర్చి హతుఁడగుట :-

అపుడు రావణుఁడు మ - హాపార్వుఁ బిలిచి
కపులపైఁ బనిచినఁ - గఱకుటమ్ములను 9320

గాలి పండిన చెట్లు - గదలించి రాల్చు
పోలికెఁ దలలెల్లఁ - బుడమిపై డొల్ల
నగచరులను జంప - నంగదుఁ డొక్క
నగముఁ గైకొని వ్రేయ - నడుమనే తునుమ
పరిఘంబుచే మహా - పార్శ్వుఁ డంగదుఁడు
తిరుగఁ గొట్టిన సార - థిని తన్నుదాఁకి
యిద్దరు మూర్ఛిలి - యిల వ్రాలునంత
వద్దనుండిన జాంబ - వంతుండు గినిసి
గిరిని యొండెడఁ బెల్ల - గించి వైచుటయు
నరదంబు దుమ్మయ్యె - హరులతోఁ గూడ
నంతటఁ దెలిసి మ - హా పార్శ్వుఁ డలిగి
వంతు వెంబడి జాంబ - వద్గవాక్షులను
నంగదు క్రొవ్వాడి - యమ్ములచేత
నంగముల్ నొప్పింప - నంగదుఁ డలిగి
పరిఘంబుచే వాని - బాణాసనంబు
పరియలు వాపినఁ - బరశువు దాల్చి
వాలిసూనుని వ్రేయ - వానిపై నలిగి
కేలెత్తి తన పిడి - కిట గ్రుద్దుటయును
తలవ్రస్సి మెదడు శ్రో - త్రమ్ములు వెడల
విలవిలఁ దన్నుక - విడిచెఁ బ్రాణములు. 9340

--: సుపార్శ్వుని మరణము :--

ఆసురారివరేణ్యుఁ - డది చూచి యలిగి
తా సుపార్శ్వునిఁ బిల్చి - తరమి కోఁతులను
జంపి రమ్మనిన రో - సంబున వాఁడు

నంపవానలు వాన - రావళిమిఁద
ముంచి యంగదు మేను - మూఁడు దూపులను
నొంచి యాజాంబవం - తుని నొక్క కొన్ని
యమ్ముల వ్రేసి గ - వాక్షుని మేను
తొమ్మిది తూపులఁ - దొడరి వ్రేయుటయు
నాగవాక్షుని మేను - యరదంబు మీద
వేగంబె దుమికి చే - విల్లు ఘటించి 9350
సారథిఁ జంపి య - శ్వంబులఁ దునిమి
తేరుమీఁదట వాని - దిగువకుఁ ద్రోచి
వెంటనే పై వ్రాలి - వెన్ను దన్నుటయుఁ
గంటు వూనక వాఁడు - కడకాలు వట్టి
పడి నీడిచి గవాక్షు - బైకొని వాఁడు
మడిమకొద్దిని రొమ్ము - మారు దన్నుటయు
నాకాలు వట్టుక - యసురులు వెఱవఁ
గేకలు వ్రేయుచుఁ - గీశులుప్పొంగ
బిరబిర మింటఁ ద్రి - ప్పిన వాతఁ జెవుల
నురురక్త పూరంబు - లుర్విపైఁ గురియ 9360
నసువులు వోయిన - యందాక ద్రిప్పి
విసరి లంకాపురి - వీధిలో వైచె.
చేఁదప్పి పాఱినఁ - జిల్లర దైత్యు
లాదశానను తేరి - యండఁ జేరుటయు
వీరవానరకోటి - విని తల్లడిల్ల
సారథితోడ ద - శగ్రీవుఁ డనియె

 -: రావణుఁడు స్వయముగా యుద్దము సేయుట :-

"సీతాఫలంబు నా - శ్రిత విభీషణము
నాతత ద్విజరాజ - మగచరసైన్య
చంచరీకంబు ల - క్ష్మణ మహామూల
మంచిత జాంబవ - దంగదనీల 9370
పవనజ నలతార - పనసోరుశాఖ
మవిత సుగ్రీవ మ - హా ప్రకాండంబు
నగుచున్న రామనా - మావనీరుహము
నగలింతు నాచంద్ర - హాసంబు చేతఁ
జూడుము చక్కఁగాఁ - జొనుపుము తేరు
సూడు దీర్చెదను ర - క్షోరాజి కెల్ల !”
అని యల్లెతో తామ - సాస్త్రంబుఁ దొడిగి
దనుజవరేణ్యుఁ డు - ద్దతిఁ ప్రయోగింపఁ
బెనుదుమ్ము చీకటి - బెడిదంపు గాడ్పు
లనియెల్లఁ బొడువ న - య్యస్త్రంబు రాఁగ 9380
చీకులై కడు కాంది - శీకులై చలిత
వీకులై వానర - వీరులు వఱవ
భానుచంద్రులకు మా - ర్పడిన స్వర్భానుఁ
డోనాఁగ దనుజేంద్రుఁ - డు దృణీకరించి
రామలక్ష్మణులపై - రా నమోఘాస్త్ర

--: రామలక్ష్మణులు రావణుని నెదిరించి పోరాడుట :--

సామగ్రిచేత ల - క్ష్మణుఁ డెదిరించి
పైనమ్ము వేసినఁ - బవినిభాస్త్రముల
వాని ఖండించి రా - వణుఁ డేపు మిగిలి

యెన్నెన్ని దూపుల - నేసె సౌమిత్రి
యన్నియు నన్ని సా - యకములఁ దునిమి 9390
యతని నమ్ముల ముంచి - యవనిజాప్రియుని
నతిఘోర శరవృష్టి - నాక్రమించుటయు
నవియెల్ల నొక్కి మ - హాస్త్రంబు చేత
నవనిపైఁ బడవేసి - యచలుఁడై నిలిచి
కుడియెడమలఁ బోయి - ఘోరాస్త్రకోటి
కుడియెడముల మార్చు - కొని చేతియలఁత
వారింపుచు నిగుడ్చి - వారిరువురును
పోరాట గరిఁ గరిఁ - బొదువు నమ్ములను
నాకాశమెల్ల గ - వాక్ష రంధ్రములు
జోకసేసినయట్లు - సునిశితాస్త్రముల 9400
నెడమీక చూపట్టు - నినకులోత్తమునిఁ
గడువాఁడి తూపులా - గ్రహముతో మూడు
పరగింప నవివచ్చి - ఫాలభాగమున
గరలు మోవఁగ నాఁటఁ - గలువల పోలె
నారామునకు జల్ల - నై యుండె గాని
యౌర ! కొంత చుఱుక్కు - మన నోపదయ్యె.
అరమి రాఘవుఁడు రౌ - ద్రాదిదివ్యాస్త్ర
శరపరంపరల రా - క్షస నాథు నేయ
నవి యెల్ల నతని మ - హావజ్రకవచ
మవిరళంబుగఁ దాఁకి - యవనిపై బడియె. 9410
నుదుటిసూటిగఁ బట్టి - నూటి కొక్కటిగఁ
బదనైన యమ్ము లే - ర్పఱచి రాఘవుఁడు
తొడిగి వ్రేసిన నైదు - తూపులఁ దునిమె

నడుమింట నతఁడొక్క - నారాచమేసి
యాసురాస్త్రము రావ - ణాసురుఁ డుగ్ర
శాసనుఁ డగుట చే - సంధించి వ్రేయ
నాయస్త్ర మురగ సిం - హ వ్యాఘ్ర శునక
వాయసమార్జాల - వానరతురగ
గోమాయు శశ వృష - గోపుచ్ఛశరభ
గోమహిషాజకు - క్కుట పుండరీక 9420
కంకగృధ్రోలూక - ఖరనజగ్రాహ
సంకురాక్షసపిశా - చముఖాగ్రకోటి
తండోపతండమై - తనవెంట నింగి
నిండుక తనచాయ - నిగిడి రాఁజూచి
శ్రీరాముఁ డాగ్నేయ - సితశరంబేర్చి
నారి సంధించి దా - నవనాథునేయ
శిఖసింహి కేయార్క - జీవేందు భౌమ
ముఖమహాగ్రహ విష - ముఖ ధూమకేతు
హలహల రిక్షచం - ద్రార్ధస్ఫులింగ
జలధరజ్యోతి ప్ర - చారాస్త్రకోటి 9430
నిలయు నింగియు నిండి - యేకమై వెంట
జలజల పిడుగులే - చాయ రాల్చుచును
నార్పుచుఁ దావచ్చి - యాసురాస్త్రంబు
దర్పమంతయు మాన్చి - తాశాంతి నొందె
మయనిర్మితంబైన - మాయాస్త్ర మమర
భయదంబుగా దైత్య - పతిప్రయోగింప
నది కుంతశరతోమ - రాసి త్రిశూల

గదలు మున్నైన భీ - కర సాధనములఁ
దనమీఁదఁ గదియ గాం - ధర్వాస్త్ర మేసి
జనకజాప్రియుఁ డది - చల్లార్చి యణచె. 9440
అసురవల్ల భుఁడు సౌ - రాస్త్రమేయుటయు
దెసలెల్లఁ బొదువుచు - దినకర ప్రభల
నది చక్రశక్తి పా - శాదులతోడఁ
గదిసిన కోసల - కన్యకాసుతుఁడు
నమ్ములు గురిసి సౌ - రాస్త్ర చక్రములు
దుమ్ములుగా చేసి - దుమ్ముతోఁ గూల్చె.
అందుకు నలిగి ని - శాటవర్యుండు
కందువల్ నాఁట భీ - కర సితాస్త్రములఁ
బది నిగుడించినఁ - బంక్తి కంధరుని
యెదనాఁటఁ బది నిశి - తేషులనేసె. 9450
ఆలోన సౌమిత్రి - యతని టెక్కియము
చేలపై మనుజుని - శిరము వ్రాసినది
సప్తసాయకముల - జగతిపైఁ గూల్చె
సప్తాశ్వసుత విభీ - షణులు గీర్తింప.
అరిగి యొక్కమ్మున - నసురసారథినిఁ
దల తాటిపండు చం - దమునఁ ద్రెళ్ళించి
యైదుతూపులచేత - నసురేంద్రుచేతి
కోదండదండ ము - క్కునఁ జక్కు జేసి
యంతనయోమయా - యతగదాహతిని
సంతనకట్టన – స్యందనాశ్వములు 9460

నా విభీషణుండు రౌ - ద్రాకృతిఁ జేరి
చావఁ గొట్టెను రామ - చంద్రు కట్టెదుర


-: రావణుఁడు తన కడ్డునచ్చిన విభీషణునిపై శక్తి బ్రయోగించుట :-

నది చూచి రావణుఁ - డాగ్రహోదగ్ర
హృదయుఁడై " దైవంబు - నే కూడె వీఁడు
పగవారితోఁ గూడె - పగఁదీఱ వీని
తెగఁ జూతు నాత్మ శ - క్తి ప్రయోగమున"
అని యొక్క శక్తి యా - యతబాహుశక్తి
గనలుచు వ్రేసినఁ - గని లక్ష్మణుండు
నడుమనె మూఁడు బా - ణంబుల ద్రుంపఁ
గడల వానరు లెల్లఁ - గడుమెచ్చి రతని. 9470
అంత రావణుఁడు కా - లాంతకు రీతి
దంతముల్ గిటగిట - ధ్వనులీనఁ గొఱికి
మయనిర్మితము నస - మానంబు సమర
జయకారణము కాల - శమన దుర్జయము
నతి లోహితము ఘంట - కాష్టకాన్వితము
శతపత్రసూతి ప్ర - సాదలబ్దంబు
ననితరదుర్లభ - మనివారితంబు
దినకరకిరణ సం - దీప్తంబునైన
నొక శక్తిచేనంది - యుంకించి వ్రేయ
భృకుటి యల్లార్చు తోఁ - బుట్టువుఁ జూచి 9480
యా విభీషణుఁడు ప్రా - ణాశచే భీతి
చావ నోడుటయు ల - క్ష్మణుఁ డంతలోన

-: లక్ష్మణుఁడు విభీషణుని కడ్డపడుట :-

నతని కడ్డమువచ్చి - యసురేంద్రుకేలు
నతని శక్తి యు వాఁడి - యమ్ముల ముంప
లేశమేనియు నవి - లెక్కఁగాఁ గొనక
దాశరథి శ్రేష్ఠు- తమ్మునిఁ బలికె
"ఈ విభీషణు శక్తి - నేసిన నీవు
నావల నుండి మూఁ - డమ్ములఁ దునుమఁ
దప్పెనంచును దన - తమ్ముఁడు భుజము
లప్పళింపఁగఁ గపు - లందఱు మెచ్చ 9490
యెంతవాడ నటంచు - నీవాత్మ నుబ్బ
చెంత మీయన్న వీ - క్షించి దీవింప
నిన్నియుఁ జూచితి - నీ శక్తిచేత
నిన్ను వధింతు దీ - నికిఁ దప్పుకొమ్ము
వెఱచు విభీషణు - వెనుకకుఁ దిగిచి
శరచాపములు పూని - సరివానికరణి
నిలిచినట్టి ఫలంబు - నీకు చేఁజేత

-: రావణుఁడు లక్ష్మణునిపై శక్తి నిఁ బ్రయోగింప నాతఁడు మూర్చిల్లుట :-

గలుగు నంచు శక్తి - గ్రక్కున వ్రేయ
నదిచూచి యప్రతి - హతమని యెంచి
బదులేయునట్టి యు - పాయంబు లేక 9500
చావక దీనిచే - సౌమిత్రి బ్రతుకు
గావుత మదిమదిఁ - గలఁగ దీవించి
శక్తివిహీనమై - సౌమిత్రిఁ దాఁకు

శక్తియపార్థమై - చనుఁగాక యనుచు
జనులు వేఁడఁగ మీ - ద శక్తియు వచ్చి
చనుమఱ నాఁటి వ - క్షమ్ము భేదించి
వీపున వెడలి యు - ర్వీస్థలి నాఁట
వాపోవుచును కపి - వ్రాతంబు చూడ
సౌమిత్రి వడినంత - చాలశోకమున

-: శ్రీరాముఁడు రావణునితో యుద్ధము సేయుట-లక్ష్మణుని యెదలో నాఁటిన శక్తిని పెకలించుటకు
   వానరులుప్రయత్నించి తీయ లేక పోవుట :-

రామచంద్రుఁడు చేరి - రణము సేయుటకు 9510
వేళ యంతియె కాని - విలపించు నట్టి
వేళ గాదని కీశ - విభుని వాయుజునిఁ
గనుఁగొని "సౌమిత్రిఁ - గావుఁడు మీరు
దనుజేంద్రుఁ డొక్కఁడుఁ - దగిలె నాచేత
చంపుదు" ననుచు లో - చనముల తుదలఁ
గెంపు జనింప న - గ్నికణంబులీను
సాయక ఘోర వ - ర్షము దశాననుఁడు
పోయెఁ బొమ్మనిపింప - భోరునఁ గురియ
నావేళ కపులు డా - యఁగవచ్చి కొండ
కోవలోఁ జొరఁబారు - క్రూరాహివోలె 9520
సౌమిత్రి నాఁటిన - శక్తి వారింప
లావు కొలంది నె - ల్ల రుఁ దీసి చూచి
యలసె సుగ్రీవుండు - హనుమంతుఁ డీడ్చి
సొలసె నెసగుపాటి - చూచే నంగదుఁడు

తారుడు దారు మైం – దద్వివిదులును
పోరాడి రొకకొంత - ప్రొద్దు పెనంగి
నలుఁడు సత్తువచూపి - నలఁగె నీలుండు
చలవట్టి మైచెమ - ర్చఁగ నెగ్గులాడె
పనసుండు విసివె జాం - బవదాదులైన
వనచర ప్రభువుల - వారివారికిని 9530
పెకలింతుమని చూచి - పెనఁగినవారి
నొకఁడైనఁ గదలింప - నోపక యున్న
రావణుఁడా వాన - రశ్రేణి మీఁద
వేవేలు తూపులు - వింట సంధించి
వేయునప్పుడు రఘు - వీరుఁ డచ్చటికి

-: శ్రీరాముఁ డాశక్తిని పెకలించి భగ్నము సేయుట :-

డాయ నేతెంచిగా - టంబుగా నురము
నాఁటిన శ క్తియు - నంత దోశ్శక్తి
పాటవంబున కేలఁ - బట్టి రాఁదిగిచి
తమ్మితూఁడీడ్చు గం - ధగజంబు వోలి
రెమ్మి చేతులఁ బట్టి - రెండుగా విఱిచి 9540
కడఁలబాఱఁగ వైచి - కపులెల్ల వినఁగఁ
గడు నాగ్రహమున రా - ఘవుఁడిట్లు వలికె

-: శ్రీ రాముఁడు లక్ష్మణునిపై ప్రయోగించిన శక్తి నినూడఁదీసి రావణుని వధింతునని ప్రతిజ్ఞ సేయుట

"నాదు పున్నెము కార - ణంబుగా నొంటి
నీదశాననుఁడు నేఁ - డెదిరించి నిలిచె

జానకితోడ ల -క్ష్మణునితోఁ గూడ
యేను కారడవుల - నిడుమలఁ బడుచుఁ
దొలుత విరాధునిఁ - దునిమి దూషణునిఁ
బొలియించి త్రిశిరునిఁ - బోకడవెట్టి
ఖరుని మర్దించి మృ - గంబయి వచ్చి
విరసించు మారీచు - వెంటాడి చంపి 9550
పడినపాటుల నెల్లఁ - బడిన ఖేదములు
కడతేర్చుకొందు నీ - కలుషాత్ముఁ దునిమి !
ఈ సీతఁ గోల్పోయి - యినసూనుఁజెలిమి
చేసి యీయనకుఁ గి - ష్కింధ యొసంగ
వాలిఁ గూలఁగ నేసి - వానరకోటి
చాలఁ గూర్చకవచ్చి - జలరాసిఁగట్టి
లంకపై విడిసి యా - లములోన నెదురు
లంకేశు బలము నె - ల్లను సమయించి
కడచి వారిధి పిల్ల - కాలువలోన
ముడిగిన గతి దశ - ముఖుచేత నేఁడు 9560
తమ్మునిఁ గోల్పోతి - తనమదిలోని
యుమ్మలిక యడంగ - నుగ్రాస్త్రములను
రావణుఁ జంపక - రానింక మఱలి
యావల బ్రహ్మాదు - లడ్డగించినను
పారిపోవక నిల్చి - బవరంబులోన
ధీరుఁడై నన్ను నె - దిర్చినఁ జాలు
రామ రావణులందు - రావణుం డొకఁడు
రాముఁడొక్కఁడుగాని - రణభూమిలోన

నిరువుర బ్రతుకు లే - దిందులో నొకని
మరణంబు సిద్ధంబు - మాట లేమిటికి ? 9570
గిరులెక్కి తరులెక్కి '- కేళియపోలె
పరికింపుఁ డాత్మీయ - బాణలాఘవము
మింటి దేవతలు భూ - మిని మీరుఁజూచి
వింట నెచ్చగువాని - వీక్షింపుఁడిపుడు
నను రాముఁడనుచుఁ గి - న్నరయక్షఖచర
మునిసురచారణ - ముఖ్యులందఱును
పూని చతుర్దశ - భువనవాసులను
మానసంబున నెంచ - మర్దింతు వీని
నతని కయ్యెడు తన - కయ్యెడు నొకరి
వెతదీరు నేఁటితో - వీఁడు నాయెదుర 9580
నిలిచి ప్రాణంబులు - నిలుపుకోఁ గలఁడె ? ”
కలనిలో నని గుణ - క్వణనంబు నిగుడఁ
దూపులేసిన కొండ - తో నుద్దియగుచుఁ
జాపంబు పరివేష - చక్రంబుగాఁగ
శరముల కరముల - జాడగాఁ దాఁను
ఖరకరు రీతి రా - ఘవశేఖరుండు
నేయు నమ్ములకు మా - రేయుచుఁ బెక్కు
సాయకంబుల రామ - చంద్రునిఁ బొదువ
నాయమ్ము లగలించి - యాయముల్ నాఁటి
గాయముల్ గా సాయ - కముల నొంచుటయు 9590
నజ్జగానక మారు - తాహతిఁ బఱచు
నజ్జలదము రీతి - ననిసేయ నోడి

వెన్నిచ్చి విఱిగి న - వ్వెడువారి నెఱుఁగ
కన్నిశాచరనాథుఁ - డరిగె దూరమున
ననిలోనఁ బడియున్న - యనుజన్ముఁ జేరి
తన చేతివిల్లు న - స్త్రములుర్వి వైచి

--: లక్ష్మణుఁడు మూర్చనుండి తెప్పిఱిల్లక పోవుట చూచి శ్రీరాముఁడు విలపించుట :-

హా లక్ష్మణా ! యని - యవనిపైఁ బొరలి
చాల నేడ్చుచు రామ - చంద్రుఁడు వలికె.
"చేరి చూచితివె? సు - షేణ ! సౌమిత్రి
యూరుపు లెగదొట్ట - యురగంబె పోలి 9600
యవనిపైఁ బొరలెడు - నక్కటా! యితఁడు
పవిఁ గొట్టువడి యద్రి - వడియున్నయట్లు
వీఁడు ప్రాణంబులు - విడిచినఁ దనకు
నేఁడె ప్రాణంబులు - నిలువ వీమేన
తనవెంట వచ్చె నీ - తఁడు మున్ను నేఁడు
వెనుకొని యీతని - వెంట నేఁగెదను
నగుబాటు లాయెను - నా పౌరుషములు
మగువకై వచ్చి ల - క్ష్మణునిఁ గోల్పోతి
నాసమక్షమున దా - నవనాథు శక్తి
దూసిపాఱెను వీని - తోరంపుటురము. 9610
సౌమిత్రి యీ విభీ - షణుఁ గావఁదలఁచి
తామేనొసంగి యా - తత కీర్తిఁగాంచె
నీ లక్ష్మణుని హాని - యేఁ జూచి చూచి
ప్రాలు మాలితి నాదు - ప్రాణంబులకును

నేనడ్డవడనైతి - నిఁక నేల తనకు
జానకి ! రావణుఁ - జంప నేమిటికి ?
ఎవ్వరు నా కేల ? - యేనేమి పనికి
నివ్వానరులిఁ కేల ? - యింకనా గొడవ ?
నామేనిలోనఁ బ్రా - ణము లున్నవనెడి
యీమాత్రమయ కాని - యేల యీతనువు ? 9620
విల్లు దాల్పఁగఁ జాఱ - విశిఖంబుఁ దీసి
యల్లెతోఁ గూర్ప స -మర్థుండఁ గాను
లేవ నేనియు శక్తి - లేదు కన్నులకుఁ
గావిరి గప్పె నం - గము వడంకెడును
నదరు గుండియ వీని - యౌగాము లెల్లఁ
దుదిఁగనఁగసువులుఁ - దొలఁగ వీమేన
యేమి సేయుదుఁ బిల్వ - నేఁటికిఁ బల్కఁ
డేమందు ! యేమందు - లిడి మఱల్పుదును ?
బ్రతుకునే యతఁడు దాఁ - పక తెల్పు మేల
కొతిగెద వపుడునా - కొదువ దీర్చెదను ” 9630

-: సుషేణుఁడు శ్రీరామునోదార్చి, సంజీవకరణినిం దెమ్మని హనుమంతున కాజ్ఞాపించుట :-

అనిపల్కిన సుషేణుఁ - డా రాముఁ జూచి
యనుకంప వొడమి యి - ట్లని విన్నవించె
"ఓయయ్య ! మీకేల - యుపతాప మింత ?
మీయాన యితనికే - మి గొఱంతగాదు
గాజుపాఱదు మేను - కాళ్లుఁ జేతులును

రాజీవ శోభాభి - రామంబులయ్యె
మోమింత వైవర్ణ్య - మున నుండ దొడలి
రోమంబు లిపుడు ని -ట్రువడ వేమియును
కన్నులు పుండరీ - క విలాసములను
చెన్ను మీఱినవి సం - జీవ నాడికలు 9640
కుదురుపాటున నెసఁ - గుచునున్న వితని
మొదలింటి ప్రకృతి సం - పూ ర్తి గల్గినది
కావున యితనికే - కడమయు లేదు
దేవ ! మీకేల చిం - తింప నీతనికి ?
నిపుడె తెల్పెద నిందు - కే నున్నవాఁడఁ
దపనుజుఁ డోర్వఁ డీ - దైన్యంబుఁ జూచి
యెల్ల వానరులు మీ - రిటులుండ చాలఁ
దల్లడిల్లెద రేడ్వ - దగదు మీకనుచు ”
నూరక నిలుచున్న - యురుసత్వశాలి
మారుతాత్మజు హను - మంతు వీక్షించి 9650
“అన్న ! సౌమిత్రి మూ - ర్ఛాయత్తుఁడయ్యె
నిన్ను గాదనుచు నుం - డిన దిక్కు గలదె ?
అపరాహ్ణమయ్యె న - య్యోషధి శైల
మిపుడే శోధించి నేఁ - డీ ముహూర్తమున
మఱలి రావలయు నే - మఱక సంజీవ
కరణి మున్నగు దివ్య - కల్పితౌషధులు
నాలుగుఁ దెమ్మను - నాలుక మాట
నాలుక మీఁద నుం - డగ వాయుసుతుఁడు
జాంబవంతుఁడు దెల్పు - జాడఁ దానెఱిఁగి
యంబరంబున నేఁగి - యాత్మ వేగమున 9660

తలఁచిన యంత మా-త్రనె వృషభాద్రిఁ
జులకఁగా నిలిచి యా -క్షోణీ ధరమున
దక్షిణ శిఖర కాం - తారంబు లెల్ల
వీక్షించి కానక - వెదక లేననుచు
నాకొండతల నాఁటి - యట్ల పెకల్చి
గైకొని లక్మణా -గ్రస్థలి డింప

-. హనుమంతుఁడు తెచ్చిన యౌషధముచే, సుషేణుఁడు లక్ష్మణునిఁ దెప్పిఱిల్లఁ జేయుట :-

తెచ్చి సుషేణుఁడా - దివ్యౌషధంబు
పచ్చని పసరిలం - బడియున్న యట్టి
సౌమిత్రి నాస న - స్యము సేయ నతఁడు
రాముని యెదుర ని - ద్రఁ దొరంగి నట్లు 9670
దిగ్గన లేచిన - దీనత మాని
డగ్గరి యురము నిం - డఁగఁ గౌగలించి
తామప్పుడు జనించు - తలఁపులో నలరి
సౌమిత్రితో రామ - చంద్రుఁ డిట్లనియె.

-: లక్ష్మణునిఁజూచి శ్రీ రాముఁడానందము నొందుట :-

బ్రతికితి విపుడేను - బ్రతికితి మనల
బ్రతుకఁ జేరినవారు - బ్రతికి రందఱును.
ఇపుడు క్రమ్మఱఁ గల్గె - యినవంశ మెల్ల
కపుల పాటెంతయిఁ - గడతేఱె నేఁడు
జనకజ పుణ్యవా - సన నుతికెక్కె
తనకుఁ గ్రమ్మఱ నయో - ధ్యకుఁ జేరఁగలిగెఁ 9680

గాకున్న నల జన - కజ యేల యెవ్వ
రేకడఁ బోయిన - నేమి నా కేల
రావణాసురునితో - రణమేల యందు
నీవుండ నచ్చోట - నేనున్కి నిజము
యేనిన్నుఁ గనుఁగొంటి - యెంత పుణ్యుఁడనొ
మానని యాపదల్ - మానె నాకిపుడు
సౌమిత్రి ! నేఁడెంత - సంతోషమయ్యె !
నామానుషంబు వ - ర్ణనకెక్కె నిపుడు
ననువంటి యన్న లే - నరులకుఁ గలరు
నినుఁబోలు ననుజన్ను - ని గణింపలేరు 9690
నాభాగ్య మీడేఱె - నాతపంబెల్ల
శోభన ఫలదమై - చూపట్టె నిపుడు”
అనుమాట లాలించి - యడుగుల వ్రాలి
జనకజాప్రియుఁ జూచి - సౌమిత్రి పలికె.
"ఏమెంత నామాట - లెంత నన్నింత
స్వామి! యల్పుఁడు వల్కు- - జాడ నాడుదురె ?
అచ్చట మును దండ - కారణ్య మునుల
కిచ్చిన యభయంబు - నీభాను సుతుఁడు
మున్నైన వానర - ముఖ్యులతోడ
నన్న ప్రతిజ్ఞలు - నావిభీషణుఁడు 9700
నమ్మి మీశరణన్న - నాఁడు మీరిచ్చు
నమ్శికలును మీమ - నంబులో మన్చి
యిటు లాన తిత్తురే - యీదశకంఠు
నెటు బోయినను బోవ - నీయక వట్టి
వాని సంగరములో - వధియింతు ననిన

పూనిక యేమయ్యె - పొసగ దిట్లాడ
రావణుఁ దునిమి ధ - రాపుత్రిఁ గూడి
యీ విభీషణునకు - నిచ్చి యాలంక
సకల వానరులతో - సాకేతమునకు
నకలంకమతిఁ జేరు - నది యొప్పుఁగాక 9710
ననువంటి వారి కెం - దఱి కిట్టులైన
మనసులోఁ దలఁతురే - మనువంశతిలక ?
ఇనుఁ డస్త శిఖరికి - నేఁగకమునుపె
దనుజేంద్రు ననిలోనఁ - దలఁద్రెవ్వనేసి
జయలక్ష్మితోఁ గూడ - జానకిఁ గూడి
నయనంబులకు నింపొ - నర్పుఁ డెల్లరకుఁ
దడవుసేయకుఁడని - తడవ రావణుఁడు

-: రావణుఁడు శ్రీరాముని పైకి యుద్ధమునకు వచ్చుట :-

వెడవెడ నార్చుచుఁ - బిడుగుల వంటి
యమ్ము లేరిచి పట్టి - యలయక దీరి
ముమ్మరంబగు రోష - మునఁ దేరు దోలి 9720
కవచ తూణీరాది - కముల నూత్నముగ
సవరించి రామునిఁ - జంపుట యొకటి
చచ్చుటొక్కటి గాక - సారెకు లంక
చొచ్చునే తనవంటి – శూరుం డటంచు
నందఱి బోకార్చి - నందఱి యాస
నుందు ప్రాణము దాఁచి - యొక్కెడ ననుచుఁ
దెగువఁ దలంచి దై - తేయ నాయకుఁడు

మగుడ రాఘవుఁ జేరి - మార్గణంబులను
ముంచినచో నట - మున్నె రాఘవుఁడు

-: శ్రీరాముఁడు యుద్ధసన్నద్దుఁడు కాఁగా, ఇంద్రుఁడు మాతలితో తనదివ్య రథమును బంపుట :-

కాంచితి మరల నీ - కల్మషాత్మకుని 9730
పోనీయ్య నింక నా - భుజశౌర్య మెల్ల
వీనిపైఁ గనుపించి - విబుధుల కైన
యాపదల్ దీరుతు - నని నిశ్చయించి
చాప మారోపించు - సమయంబునందు
మేరుశైలము చుట్టు - మిహిరుని రథము
ధారుణికిని రాఁ గ - తంబేమి యనుచుఁ
గపులెల్ల వెఱుఁగంద - కాంచనకేతు
నిపుణంబు మణికింకి - ణీ సమన్వితము
కల్పక మాలికా - కలిత మనల్ప
శిల్పి చమత్కార - చిత్ర చక్రంబు 9740
కమలరాగరుచి ప్ర - కాండ దోర్దండ
సముదగ్ర మాతలి - సారథికంబు
సక్త సహస్రార - సంహితామూల్య
మౌక్తిక ఝల్లరీ - మందార జనిత
పట్టాంశు కోజ్జ్వలో - పరిభాగకనక
పట్టికా కలితమ - భ్రంలిహకలశ
ఖచిత మాణిక్య ని - కాశ దినేశ
మచిర నిబద్ద ప - యోబ్ధి సంభూత

దూరిత శ్రమనాశ - తురగ సహస్ర
ధారాహితాభావ - తరణంబునైన 9750
సౌవర్ణగిరినిభ - స్యందనం బపుడు
దేవేంద్రుఁ డనుప ధా - త్రివసించునంత
మాతలి "రఘువీర ! - మాస్వామి యింద్రుఁ
డీతేరిపై మిమ్ము - నెక్కింపు మనియె
నిది విల్లు తూణీర - మిది యివి దూపు
లిది గద యిది శక్తి - యిది కవచంబు
నివి యస్త్రములు హేతి - యిది యజేయంబు
లివియెల్ల సారథి - నేను నాపేరు
మాతలి రావణు - మర్దించి మఱల
సీతఁ జేకొను మని - చెప్పె మాస్వామి 9760
పనిఁ గొండు మీ" రనఁ - బరమ హర్షమున
నినుఁ డుదయాచలం - బెక్కిన కరణి
యారథంబు మనోర - థానురూపమున
శ్రీరఘుపతి ప్రద - క్షిణముగా వచ్చి
యారోహణము చేసి - హరుఁడు పురంబు
లేరుచునపుడున్న - యేపు చూపుచును


-: రామ రావణ మహాసంగ్రామము రావణుఁడు మహా శౌర్యమున విజృంభించుట :-

వివిధాస్త్రములు దైత్య - విభునిపై వ్రేయ
నవి ద్రుంప నతఁడు న - య్యస్త్రంబు లేసి
గాంధర్వ రాక్షస - గారుడాస్త్రములు
సంధించి యిరవురు - జగడించు నపుడు 9770

దానవ విభుఁడు మా-తలి మేను నొవ్వఁ
గానేసి హరుల మా - ర్గణముల ముంచి
యింద్ర ధ్వజంబు మ - హీస్థలి నర్థ
చంద్ర బాణంబు చేఁ - జక్కాడి త్రోచి
రాముని దివ్యనా - రాచకోటులను
చేమెదల్పక యుండఁ - జేసి నిల్పుటయు
నూరకే వేసరి - యున్నట్టులున్న
శ్రీరాముఁ దేరి చూ - చి కపీంద్రులెల్ల
రామచంద్రుఁ నెదిర్చి - రాహువు రీతి
నీమేర దనుజేంద్రుఁ - డేచి పట్టెడును 9780
యిలకెల్ల దాను కీ - డెంచి బుధుండు
పెలుచ రోహిణిఁ బట్టి - పీడింపఁ దొడఁగె
పొగలతో సెగలతో - భుగభుగ పొంగి
నిగిడి మిన్నెల్ల ము - న్నీ రాక్రమించె
తనదీప్తిఁ దఱిగి య - ద్దపు బిల్ల రీతి
నినుఁడు దోఁచెను మింటి - కెగసె మొండెములు
తల లంతరిక్ష ప - థమ్మున నిల్చి
పెళపెళ నార్పుచు - పెడ బొబ్బలిడియె !
దుమ్ము చాయలఁ దోచె - ధూమ కేతువులు
చిమ్మ చీకటులు ముం - చె దిశాముఖముల 9790
నావేళ కోసలేం - ద్రాన్వయ తార
యావిశాఖ పురంద - రానలాత్మకము
నరికట్టుకొని యుండె - నంగారకుండు
ధరణి యంతయును గొం - దల మందె నపుడు,
ఇది వేళ తనకని - యెంచి మైవెంచి

పదితలల్ చేతులి - ర్వదిదాను దాల్ప
మధ్యందినోదగ్ర - మార్తాండ బింబ
బుధ్యు పలక్షిత - భూరికిరీట
దశకంబుతోడ మ -స్తకములు పదియు
దశదిగంతముల నా - తపదీ ప్తి వెనుప 9800
యిరువది చేతుల - హేతి త్రిశూల
శరచాపముసలాస్త్ర - శస్త్రముల్ మెఱయ
నవరత్నమయసము - న్నత శిఖరముల
నవముగా నిలుచు మై - నాకుఁ డోయనఁగఁ
బదివిండ్లు నెక్కిడి - పది కరంబులను
ప్రదరముల్ దొడిగి దె - ప్పరముగాఁ గురిసె
"చిక్కెనాచేత ని - శ్చేష్టితుండయ్యె
దక్కె జానకి గెల్తు - దశరథాత్మజుని"
అని బెడిదమునఁ బ్ర - త్యాలీఢ చరణ
వనరుహుండగుచు రా - వణుఁడు మించుటయు 9810

-: శ్రీరాముఁడు రావణు నెదుర్కొనుట - రావణుఁడు వైచిన శూలము ఖండించుట :-

విన్న బాటున నుండి - విశిఖముల్ నాఁట
క్రొన్నెత్తురులు మేనఁ - గురియ వేలుపులు
గరుడ గంధర్వులు - ఖచరులుఁదన్నుఁ
బరికించి యిఁకనెచ్చెఁ - బనిలేదనంగ
వెఱచిన తనవారి - విజయంబుఁ గోరి
తఱి వేచి నొప్పించు - దశకంఠుఁ జూచి
యరిగి యవేలధై - ర్యసహాయుఁ డగుచు

సెలలఁ గట్టెఱగ్రమ్మ - శ్రీరామ విభుఁడు
కోదండ దండంబు - గుడుసు వడంగఁ
దాదండ వట్టి మా - తలి నెచ్చరించి 9820
గన్నెరాకమ్ములా - కర్ణాంతములుగఁ
గొన్ని ప్రయోగించు - కోప వేగమున
నదరె ధరిత్రి య - ల్లలనాడె గిరులు
చెదరె నక్షత్రముల్ - సింధువుఁగలఁగె
భూతకోటి వడంకెఁ - బురుహూత ముఖుల
చేతోవికాసముల్ - చేరెఁ గ్రమ్మఱను
"గెలువు రాఘవ ! ” యంచుఁ - గీర్తింప సురలు
"గెలుము రావణ ” యంచుఁ - గేర రాక్షసులు
నాసద్దులు నభంబు - నవనియు నిండ
రోసముల్ మిగుల వా - రును బోరుచుండ 9830
రాత్రించరేంద్రుఁ డా - గ్రహముతో మొనలు
గోత్రకూటములతోఁ - గొండాటమాడఁ
గట్టిన ఘంటల - ఘణఘణ త్కార
మట్టహాసమును బ్ర - హ్మాండంబుఁ బొదువఁ
గేలశూల మమర్చి - కినిసి వ్రేయుటయుఁ
కీలి కీలాసము - త్కీర్ణమై నిగుడి
వచ్చు నప్పుడు రఘు - వర్యుండు మీద
చిచ్చఱమ్ములు గురి - సిన మ్రింగి కొనుచు
మించిన తనతేరి - మీఁదట నింద్రుఁ
డుంచిన శక్తి య - త్యుత్సాహ శక్తిఁ 9840
దీసి ప్రయోగింప -దినకర కిరణ
భాసమాన మహా ప్ర - భావంబుతోడ

వచ్చి యాలోనె రా - వణుని శూలంబు
నచ్చెరువుగఁ ద్రుంచి - యవనిఁ ద్రెళ్లించె
దశరథాత్మజుఁడు మా - తలి చూచి మెచ్చ
నశని కల్పములై న - యమ్ములుఁ దొడిగి
హరులను నొప్పించి - యతని పేరురము
పరియలు చేసి ము - ప్పది శరంబులను
డిగ్గ ముల్కులు నుది - టికి మూఁడుకాఁగ
నగ్గలిక చెలగ - నదలించి వ్రేయ 9850
రక్త ధారలఁ దోఁగి - రవణంబు మాసి
నక్తంచరేంద్రుఁ డా - నన వివర్ణతను
మిగుల నాగ్రహముతో - మించి శ్రీరాము
మొగముపైఁ గొన్ని య - మ్ముల నాఁట నేసి
పేరెద చాల నొ - ప్పించిన సమర
ధీరులై వారలె - దీర్చి పోరుచును
శరతిమిరంబుతో - సమరోర్విఁ దమ్ము
నొరులకుఁ గనుపింప - కురుశక్తులమరఁ
జలమునఁ గోపంబు - శౌర్యంబు బలము
తులదూఁగ నెచ్చు గొం - దులు గానఁబడక 9860
సమరంబు సేయు రా - క్షసనాథుఁ జూచి
కమలా ప్తకులుఁడు రా - ఘవుఁ డిట్లు పలికె.


-: రావణుఁడు చూపిన శౌర్యపరాక్రములకు శ్రీరాముఁడుమెచ్చుకొనుట :-

"రావణ ! నీపరా - క్రమమజేయంబు
దేవతావళి నిన్ను - దృష్టింప లేరు

నీవంటివాఁ డతి - నీచ కర్మములు
గావించు ఫలమెల్లఁ - గనుపింతు నిపుడు
నాఁడె యేర్పడదె జా - నకిఁ బట్టితెచ్చు
నాఁడు మే మేఱుఁగకుం - డఁగఁ దప్పెగాక
యిది యొక్క పౌరుష - మే నీదుశ క్తి
సుదతులయెడ గాక - చూపరాదిచట 9870
సీతను మ్రుచ్చిలిం - చిన నాఁడె తీఱె
ధాత యిచ్చిన వర - దర్పంబు నీకు
పుణ్యంబు లన్నియుఁ - బొలివోయె నరవ
రేణ్యుల గోరు కో - రికెలు చేకూడె
పాపానుభవకాల - పక్వంబునందుఁ
జూపట్టితివి యింకఁ - జొరనీను లంక
తలలు ఖండించి ర -క్త ప్రవాహముల
బలియిత్తు భూతాది - పలలాశనులకు
గరుడుండు పాములఁ - గమిచిన యట్లు
కఱచిన ప్రేవులు - కాకఘూకములు 9880
విదరింపఁజేయుదు - విదరించి నీదు
మెదడుచే దనియింతు - మృగ ధూర్తములను ”
అని యల్లెతో నమో - ఘాస్త్రముల్ గూర్చి
తనువెల్ల నతిశోణి - తప్రవాహములు
నుప్పతిల్లఁగ ధాతు - యుక్తాద్రిమాడ్కి
నప్పుడు నిలుచు ద - శాస్యుని యందు
బలశౌర్య ధైర్య ద - ర్పంబు లన్నియును
బొలివోయె విండ్లు మో - పునకు చేటయ్యె

నొక్కయ స్త్రంబు ప్ర - యోగింప నై న
యిక్కువ మదిలో నొ - కింత లేదయ్యె 9890
రాముని ధైర్య శౌ - ర్య జ్ఞానశక్తు
లామొదటికి ద్విగు - ణాతీత మగుచుఁ
బొదిలోని దివ్యాస్త్ర - ములు తాముదామె
మెదలుచు నొండొండ - మించి రాఁదొడఁగె
యుక్త మంత్ర ప్రయో- గోప సంహార
శక్తులన్నియును సా - క్షాత్కారమందె
రాముని తేజంబు - రావణాసురుఁడు

-: రాముని తేజమువలన నొకింత మైమఱచిన రావణుని రథమును సూతుండు మఱల్చుట-రావణుఁడు
   సూతు నదలించుట :-

చేమఱచుటయు నీ - క్షించి సూతుండు
నరదంబు మఱలించి - యగచరులెల్లఁ
దరిమి రాలను రువ్వ - దశరథాత్మజుని 9900
యమ్ములు వెన్నుపై - నాడంగ యొక్క
యమ్ము నేర్చుటయు - దైత్యేంద్రుఁడాలోన
తెలివిడి గని సార - థి మొగంబుఁ జూచి
యలుక జనింప న - హంకృతి పలికె.
"యీ యవివేక మి - ట్టేల చేసితివి
దాయల ముందఱఁ - దలవంపులయ్యె
యెఱుఁగవు నీవునా - హృదయ వర్తనము
మఱలింపుదురె తేరు - మనవంటి వార

లక ట ! నాశక్తి ధై - ర్యము ప్రతాపములు
తెకతెర చెఱిచి యీ - తీఱు చేసితివి 9910
నీవును బగవారి - నే కూడినావు
రావణుఁ డపకీర్తి - రాఁ దాళఁ గలఁ డె ?
లంచ మిచ్చెనో నీకు - లక్ష్మణాగ్రజుఁడు
కొంచుఁ బొమ్మని తేరు - కొదవ సేయుటకు !
నమ్మిన ద్రోహంబు - నకు నొడి గట్టి
క్రమ్మఱింతురె తేరు - కలనిలో విడిచి
అరదంబు మఱలించు - మని యాగ్రహించు
సురవైరి వదనముల్ - చూచి వాఁ డనియె.

-: సూతుని ప్రత్యుత్తరము :'-

అజ్ఞుండ గాను ద్రో - హము సేయ లేదు
ప్రజ్ఞ యేమఱను నీ - పగవాని చేతఁ 9920
బరిధాన మేమియుఁ - బట్ట నన్యులకు
వెఱచి రాలేదు నిన్ - విడిచి పోలేదు
ఆడనేమిటికిన -న్నసదుగాఁ దలఁచి
చూడు మేమరుదునె - సూతకృత్యంబు
పగవాని బలమాత్మ - బలముఁ గాలంబుఁ
దగఁజూచి నిమ్నోన్న - తస్థలంబులను
జతనంబుతోడ య - శ్వంబుల బలిమి
మతియించి రథికు నే - మఱకతోఁ గాచి
రథము దోలుటయె సా - రథులకు నీతి
రథమిట్లు మఱలింతు - రా యననేల ? 9930

అలసె గుఱ్ఱము లెల్ల - నలమట నొందఁ
దెలివిడి చాలక - దిటఁ దప్పి నీవు
గాయంబులను చేత - కార్ముకంబెత్తి
సాయకంబుల వ్రేయ - శక్తి లేకుండ
కనుఁగొని రథమేను - కడకుఁ దెచ్చితిని
దనుజనాయక ! దీన - తప్పేమి తనకు ?
హితుఁడ నింతియకాని - యితరుఁడగాను
ధృతిపూను మఱల పైఁ - దేరుఁ ద్రిప్పెదను
జోపానమయ్యె తే - జులు నీవు పోర
నోపిక నిజముగా - నుండినఁ జాలు 9940
మఱలింతునే ?" యన్న - మదిలోన మెచ్చి

--: సూతుని మాటలకు రావణుఁడు మెచ్చి రాముని పైకి యుద్ధమునకు సన్నద్ధుఁడగుట :--

కరుణించి తనచేతి - కడియం బొసంగి
సారథి నూరార్చి - చక్కఁగా నిపుడు
తేరు వోనిమ్ము వ - ధింతు రాఘవుని
లంకకే నేఁటికి - లజ్జ పోవిడిచి
యింకఁ బోవుదుఁ బగ - యీడేర్చి కాక
రామునితో నేఁడు - రణ మాచరించి
నామీఁద నేదైన - నదిమేలు దనకు
మఱల నూరకయున్న - మాటకు సూతుఁ
డరదంబు రాము చా - యఁగఁ దోలునంత 9950
"వచ్చెను వాఁడె రా - వణుఁ డతఁడేమి
యిచ్చఁ దలంచెనో - యెఱుఁగ వెవ్వరము

విఱిగి పోయినవాఁడు - వీఁడింతలోనే
తిరిగె గావున చాల - తెంపుగావించు
నెందుకు మనమెల్ల - యిప్పుడే పోయి
యందఱు రాము స - మక్షంబునందు
వానితో నెదుర న - వ్వల దైవయత్న
మైనట్టు లయ్యెడు” - నని కపులెల్ల
నాలోచనలు సేయు - నంతలో సప్త
సాలభేదనునిపై - శర పరంపరలు 9960
ముంచిన వాఁడి య - మ్ముల చేత రాముఁ

-: శ్రీరామ రావణులు సరిసమానముగా యుద్ధము చేయుట. శ్రీరాముఁడలసి రావణుని వధించు నుపాయమును
   జింతించుట :-

డంచల నవియొక -టైన రానీక
వారించి కరలాఘ - వము నెరయించి
పోరుచోఁ గపులు గుం - ఫులుగట్టి నిల్చి
కనుచుండి రింతియె - కాని యొక్కరుఁడు
ననికిఁ దోడై నిల్చు - నతఁడు లేఁడయ్యె.
"రామాస్త్రములకును - రావణుఁడొకఁడె
రాముండు రావణా -స్త్రములకుఁ గాని
తలచూప లేరు బృం - దారకులైన
నిలిచి యానడుమ గుం - డెల గూడువట్టి 9970
సరిగాగ వారేయు - శస్త్రాస్త్రములను
శరపంజరంబయ్యె - జలజజాండంబు
దూరఁ గూడదు మారు - తుని కనుటెంత

యూరువు వుచ్చ లే - కొకరైన నచట
రామరావణ సమ - రమునకు నీడు
రామరావణసమ - రంబింతె కాని
యెట్లుండె ననిపల్క - నెట్టివాఁడైన
నెట్లు నేరుచు చూడ - నెవ్వరి తరము
పెట్టిన దండలు - పిరిఁదికి వీక
పట్టిన చాపముల్ - పట్టినట్లుండ 9980
తొడిగిన యమ్ములు - తొడిగినట్లమర
వెడలు దివ్యాస్త్రముల్ - వెన్నెలఁ బొదువ
నితరేతర ము ఱెప్ప - లిడక క్రోధములు
నతిశయరోష తా - మ్రాక్షులై నిలిచి
దినకరతేజులై - ధృతివూని యొక్క
దినమెల్ల రామరా - త్రించరాధిపులు
సరివోరి యిరువురు - సరిగాఁగ నలసి
దురము సాలించి స - త్తువ లెల్లఁ దఱిగి
వదనమండలములు - వసివాడ శ్రమముఁ
గదురంగ దొగదొట్టి - కన్ను మోడ్చుటయు 9990
సారథి రావణ - స్యందనంబొక్క
యోరగాఁ దిగిచి తా - నురకున్న యపుడు
ఏరీతిఁ దునుముదు - నీదాన వేంద్రు ?
నూరట గతినైతి - నోరంత ప్రొద్దు
నేమి సేయుదునని - యిచ్చఁ జింతించి
రామచంద్రుఁడు విచా - రము సేయునంత
తనయాత్మలోన నిం - తయు నాయగస్త్య
మునినాథుఁ డెఱిఁగి రా-ముని చెంత నిలిచి


--: అగస్త్యుఁడు శ్రీరామచంద్రునికి ఆదిత్య హృదయము నుపదేశించుట :--

“ ఏల చింతిల్లెద - వీదాన వేంద్రు
నాలంబులోఁ గూల్చు - టది యెంత నీకు ? - 10000
అతి రహస్యము కామి - తార్థప్రదంబు
హితమునౌ నొక మంత్ర - మిచ్చెద నీకు !
ఆదిత్యహృదయ మే - నది సమర్మముగ
నాదేశ మొనరింతు - నమ్మహామనువు
శ్రీకర మిష్టార్థ - సిద్ధి దమహిత
భీకర మావహో - పేత జయంబు
సకలకల్యాణ మా - శ్రయణీయ సౌఖ్య
మకలంక మలఘు దీ - ర్ఘాయుప్రదంబు
సత్యంబు దుఃఖనా - శనము గోబ్రహ్మ
హత్యాది ఘోరమ - హాపాపహరము10010
సతతరోగ ప్రణా - శనము లోకైక
హితము సౌభాగ్యస - మృద్ధి కారణము
నగుచుండు గావున - నాదిత్యుఁడుదయ
మగువేళ సేవింపు - మర్చాదివిధుల
నాయనఁ బూజింతు - రమరులు లోక
నాయకుఁ డతఁడ య - నంత తేజుండు
నాదిత్యులందఱు - నవయవంబులుగ
నా దేవుఁ డాత్మక - రావళిచేత
భువనంబు లెప్పుడుఁ - బోషించు పద్మ
భవుఁడు బద్మాక్షుండు - భవుఁడు నింద్రుండు 10020

వరుణుండు దాతల - వసువులు వహ్ని
కరవలి యముఁడు య - క్షప్రవరుండు
నాశ్వినేయులు చంద్రుఁ - డమ్మరుత్తులును
విశ్వదేవతలు సా - విత్రిగాయత్రి
ఋతువులు మనువులు - ఋషులు సాధ్యులును
పితృదేవతలు క్రౌంచ - భేది సిద్ధులును
ప్రాణంబులతని రూ - పంబని మొదట
త్రాణగాఁ బలికి మం -త్రముఁ దేటపఱచె.
“ఆదిత్యునకు సహ - స్రాంశున కఖిల
వేదమూర్తికిని స - వితున కర్కునకు 10030
సూర్యదేవునకుఁ బూ - షునకు శంభునకు
నర్యముసకు త్వష్ట - కంశుమంతునకు
భాస్కరునకును త - పనునకు రవిక
హస్కరనకుఁ దిమి - రాపహంతునకు
భానుమూర్తికిని గ - భస్తి మంతునకు
దానవారికి సర్వ - తాపనునకును
నదితిపుత్రునకును - నగ్నిగర్భునకు
 త్రిదశార్చితునకు మ - రీచిమంతునకుఁ
బింగళునకు నాత - పికి- మండలికి ప్ల
వంగమునకును స - ర్వభవోద్భవునకు 10040
శిశిరనాశునకు దృ - ష్టికి నపాంపతికి
శిశిరున కుదయాస్త - శిఖరరూపునకు
దినకరునకును జ్యో - తిర్గణపతికి
దినపతికిని మహా - తేజోధిపతికి
కవి వికిర్పునకు న - క్షత్రాధిపతికి

రవికి రక్తునకు మా - ర్తాండమూర్తికిని
దినమణికిని గ్రహా - ధిపునకుఁ బద్మ
వనజ బంధునకు ది - వాముఖ్యునకును
హైమగర్భనకు ఋ - గ్యజుషపారగున
కామయారికి స - హస్రార్చికి సారి 10050
సప్తాశ్వునకు సర్వ - సాక్షి కీశునకు
సప్తసప్తికి వింధ్య - శైల కేసరికి
ద్వాదశాత్మునకు స - త్యంత తేజునకు
వేదాత్మునికి జయ - వీరనామునకు
జయభద్ర హరిదశ్వ - సారంగ పద్మ
శయనభోనాయక - శంఖనామునకు
నీశభావునకు బ్ర - హేశున కచ్యు
తీశున కుగ్రున - కిద్ధ బోధునకు
భాస్వంతునకు సర్వ - భక్షున కలఘు
భాస్వరునకు రౌద్ర - పటువపుష్కునకు 10060
శత్రుఘ్నునకు దివ్య - చామీకిరాభ
గాత్రునకును మిహి - కానాశకునకు
దేవదేవునకు జ్యో - తిష్పతి కతిశి
ఖావంతునకు విశ్వ - కర్మ నామునకుఁ
గ్రతు మూర్తికిని కృత - ఘ్నవినాశనునకు
ధృతమహారికిని మం - దేహ వైరికిని
మృత్యునకు హిరణ్య - కేతున కఖిల
కృత్య సాక్షికిని నీ - కిదె నమస్కృతులు ”

అను మంత్రమున సూర్యు - నర్థిఁ బ్రార్థింపు
మని యువ దేశించి - యయ్యగస్త్యుండు 10070
దినపతి సృష్టిస్థి - తిలయంబులకు
వెనుక మహాభూత - విలయంబులకును
కర్తయై జాగరూ - కత నుండు భువన
భర్తయై యాత్మీయ - భానుమండలిని
దపియింపఁ జేయుచుఁ - దానె వర్షించు
నెపుడు జగద్రక్ష - కినుఁడు బాల్పడియె
నగ్నులమను చతు - రాగమంబులకు
నగ్నిహోత్రాది క్రి - యా ఫలంబులకుఁ
గ్రతువుల కితర స - త్కర్మ కాండమున
కితఁడే నాయకుఁ - డీతఁడే యిచ్చు ఫలము 10080
వనులందు గిరులందు - వాహినులందు
ననల బాధలయందు - నహితులయందు
రుజలందు వెత లందు - మ్రుచ్చులయందు
భజియించి యీస్తోత్ర - పాఠంబొనర్చి
యినునిఁ దలంచిన - నెల్ల యాపదలుఁ
జెనక నేరవు వానిఁ - జేరు సౌఖ్యములు
జపియించు మీమంత్ర - జపము ముమ్మాఱు
తపనుఁ డిప్పుడె సన్ని - ధాన మందెడును
క్షణములో రావణుఁ - జం పెద వతఁడు
తృణమాత్రుఁ డనుచు నా - దేశ మొసంగి 10090
యాశీర్వదించి తా - నపుడగస్త్యుండు
దాశరథులకు నం - తర్ధాన మందె.

-: శ్రీరాముఁ డగస్త్యుని యా దేశానుసారముగ నాదిత్య మంత్రము జపించుట - సూర్యుండు ప్రత్యక్షమై జయమగునని యాశీర్వదించుట :-

అతని హితా దేశ - మాత్మలో నునిచి
హతశోకుఁడగుచు శు - ద్ధాచమనంబుఁ
జేసి చింతదొఱంగి - శ్రీరాముఁడచట
నాసీనుఁడై భాస్క - రాభిముఖముగ
మంత్ర జపంబు ము - మ్మాఱు మునీంద్రు
తంత్రంబు చేత నెం - తెయును జపించి
సమరంబు సేయు ను - త్సాహంబు చేతఁ
దమకించి జత్తాయ - తముగ నున్నంత 10100
నారవియు బ్రసన్నుఁ - డై "రఘువీర !
యీ రావణుని గెల్వు - మిపుడ” ని పలుక
తళతళ మెఱచు ను - త్తాల ధ్వజంబు
గెలువు మీవనుచు నం - కించి సారధియు
నీల రోచుల కనీ - నికల తేజీలు,
నేల వ్రక్కలుగా నా - నికె వచ్చు రథము
నెలవంక గతి సింజి - ని సెలంగు విల్లు
నలఁతి వెన్నెలఁగాయు - నలుగు టమ్ములను
దివటీల గతి సొర - దికి వెలుంగుచును
నవరత్నమయములై - న కిరీటములును 10110
గలవాని యల్లంతఁ - గని రఘడ్వహుఁడు
తలయూఁచి చూచిమా - తలికి నిట్లనియె,

-: శ్రీరాముఁ డుత్సాహముతో రావణు నెదుర్కొనుట :-

“కంటికి డావంక - గా వచ్చె నమర
కంటకుఁ డిపుడె మ్ర - గ్గఁగ నున్నవాఁడు
కరువలి నీలమే - ఘము బోలి వీని
దురములోపల వధిం - తు నిమేషమునను
కడపుమీ వేళ నా - ఖండల రథము
తడయ కాత్మ మనోర - ధంబు వెంబడిని
నెచ్చరించితి గాని - యేనీకు నేర్ప
వచ్చితినని యెంచ - వలదు భావమున" 10120
అనుటయు మాతలి - యౌఁగాక యనుచు
ననిమిషేశ్వర దత్త - మైన రథంబు
వాని తేరును తాను - వలపలఁ గాఁగ
రావించుటయుఁ జూచి - రావణాసురుఁడు

           -: రామ రావణుల యుద్ధము- దేవదానవులు జయాపజయములను గూర్చి యాతురతతో నుండుట
                - రావణున కశుభ శకునములు గానఁబడుట - వానిని లక్ష్య పెట్ట కాతఁడుయుద్ధము సాగించుట : -

అమ్ముల ముంచిన - నవి నివారింప
నమ్మేర మఱియు ద - శాననుండలిగి
కొన్ని తూపుల నేయ - ఘోర సంగ్రామ
సన్నాహములు వారు - సరివోరునపుడు
గెలుపోటములు గోరి - కీర్తనల్ చేసి
చులకఁగ నాడుచుఁ - జూచి యిర్వరను 10130

గరుడ విద్యాధర - గంధర్వ యక్ష
సురచారణాదు లె - చ్చో గాచి యుండ
శకునంబులను కాని - శకునముల్ రాము
నకు రావణునకు నై - న ముదంబులొంది
కనుచుండ నప్పుడు - కంక గృధ్రములు
దనుజ నాయకుని ర - థంబుపై తిరిగె
నఱచుచు గొరవంక - లతని పైఁ బడియెఁ
గరవలి దుమ్మెత్తి - కన్నుల రాల్చె
చినిఁగె టెక్కియపుపై - చీర గావిరులుఁ
గనుపించె కన్నులఁ - గా రె నశ్రువులు 10140
హయలోచనంబుల - నడరె నంగార
చయము జేవురు మించె - సంజకెంజాయ.
అందుచే లంక చి - చ్చందు కొన్నట్లు
చెందొవచాయ దోఁ - చె నహంబు నందె
నవి సడ్డ సేయక - యసురారి విభుఁడు
రవికులోత్తముని న - స్త్రంబులఁ బొదువ
తనమేలు శకునముల్ - దశకంఠుఁ దునుము
మని యెచ్చరింపఁ గ - య్యము సేయునపుడు
రావణుఁ డారాము - రథ కేతనంబు
చేవాఁడి మెఱయ నే - సియు నాఁటకున్న 10150
రాముఁడా రావణు - రథ కేతనంబు
భూమిపై నొక్కుతూ - పున ద్రెళ్లనేసె
దివ్యాస్త్రములను దై - తేయ నాయకుఁడు
దివ్యవాహముల పై - దృఢశక్తి నేయ
తమ్మితూఁడుల మీఁద - దాఁకిన యట్లు

నెమ్మది శ్రీరాము - ని హయంబులమరె.
అదిచూచి కోపించి - యసుర నాయకుఁడు
గదలును శక్తులు - గండగొడ్డండ్లు
శూలముల్ కత్తులు - సురియలు చెట్లు
రాలును గిరులు ని - ర్వది కరంబులను 10160
రివ్వురివ్వున కపి - శ్రేణిపై నలిగి
రువ్వి రాముని శిత - రోష వర్షముల
ముంచి మిన్నెల్ల న - మ్ములుగాఁగ నురువ
డించిన తాచేవ - డించక నగుచు
శతవర్షముల ముంప - సరికట్టి మింట
గరిగట్టి సాయకా - కారమై నిలిచి
పోరాడి యవియన్ని - పొడిపొడి యగుచు
ధారుణి రాలి యం - తయు బయలైన
నొండొరు హయముల - నురుతరచండ
కాండధారల నొవ్వఁ - గా నేయునపుడు 10170
తన కేతనము మహీ - స్థలి వ్రాలఁ జూచి
దనుజవల్లభుఁడు గ్రో - ధము మట్టుమీఱ
కాలాహి జింహ్వికా - కల్పనారాచ
జాలంబులను మొగ - చాటు వుట్టంగ
వ్రేయుచో దొరలను - వేడుకల్ వుట్ట
నాయిరువురి తేరు - లందు సారథులు
నొక చోట చాయగా - నురక పోనిచ్చి
యొక వేళ నడ్డంబు - లుధ్ధతిఁ ద్రోలి
వలయాకృతుల నొక్క. - వైపునఁ దరమి
మలకలుగా నొక్క - మఱి నడిపించి 10180

మూలలకొక్క యి - మ్ములు గదలించి
నాలుగంచుల ధావ - నముల నిగుడ్చి.
పోయిన వీథినె - బోక మఱల్చి
చేయిచూపిన జాడ - చెంగక యాని
యరదముల్ సూతక్రి - యా చమత్కృతులఁ
బరగించి రథికుల - పను లెచ్చరించి
తానును దాను ర - థంబులు రథము
పై నొగతోనొగ - పాళి పాళియును
తురగంబు తురగంబు - దొరయఁ జేరుచును
తిరుగ దూరముల నె - దిర్చి నిల్చుచును 10190
తమనేరుపులు చూప - దశకంధరుండు
బొమముడి వెంట వం - పుగ శరాసనము
రథమయ్యలాత చ - క్రప్రకారమునఁ
బృథుగతిఁ జుట్టి తాఁ - బిరబిరఁ ద్రోలి
యిది చక్ర మిదిరథ - మిదివాజి కేతు
విది వీఁడుగో సూతు - డితడు రావణుఁడు
నన వేఱుపడక ర - థావరణంబు
వినువీథి నిన బరి - వేషంబురీతి
నమితపావక పుంజ - మనఁగఁ బ్రదక్ష
ణము వచ్చు కరణి మం - డలి విభ్రమమునఁ 10200
జుట్టు పావకశిఖల్ - చుట్టుకొన్నట్లు
మట్టు మీఱఁగ సిత - మార్గణశ్రేణి
యన్ని దిక్కులరాఁగ - నట్లమాతలియు
నున్న చోటనె వాజు - లురువడిఁ దిరుగ
రథము నిలారచ - క్ర న్యాయముగను

-: రావణుఁడు పరాక్రమించుట చూచి శ్రీరాముఁడు లోక మంతయుఁ దల్ల డిల్లునటొక బాణము నాతని పైఁ బ్రయోగించుట -దేవతలు శ్రీరామునికి జయమగుఁగాక యని యాశీర్వదించుట :-

రథిక శేఖరుఁడైన - రఘుపతి మెచ్చ
దిరిగింప నతఁడేయు . దివ్యాస్త్రకోటి
నఱికి వేయుచును దా - నవనాథుమీఁదఁ
గనుబొమల్ ముడిగొన - కల్పాంతరమున
కెనగాఁగ మండలీ - కృత చాపుఁడగుచు 10210
నెనిమిది తూపుల - నెనిమిది హరుల
గినిసి వేసిన నవి - కేడించి పఱచి
యరదమీడ్చుకపోవ - నలిగి రావణుఁడు
పరశుతోమరకుంత - పట్టిసప్రాస
ముసలగదా ప్రాస - ముద్గరాదులను
దెసలు గప్పఁగ వ్రేయఁ - దెగవేయుటయును
మఱికొన్ని తూపుల - మాతలి నేసి
హరులఁ గొన్నిటి నేసి - యస్త్రజాలముల
తనమీద ముంప సీ - తాప్రాణవిభుఁడు
కనఁగన వెలఁగు మా -ర్గణ మొక్కటేర్చి 10220
అల్లెతో సంధించు - నాగ్రహంబునకు
హల్లోహలంబులై - యదరె లోకములు
జలధులన్నియు నొక్క - సంగతిఁ గలఁగె
కులశైలములు గల - గుండుగాఁ బడియె
అవని బిట్టురువడి - నల్లలనాడె
రవి మండలంబు ని - రస్తాభమయ్యె

లోక వాసులకును నా - లోచనల్ గలిగె
చీకాకుగాఁ గల - సెను దిఙ్ముఖములు
నావేళ గంధర్వు - లఖిల సౌఖ్యములు
దేవతలును రాము - దృష్టింప వెఱచి 10230
జయమొందుఁగాక - విశ్వప్రపంచంబు
భయముఁ దీఱెడు గాక - బ్రాహ్మణావళికి
నిలువ నీడలు మాకు - నెలకొనుగాక
చలపాది దాన వే - శ్వరుఁ డీల్గుగాక
సౌమిత్రియన్నకు - జయమబ్బుగాక
భూమిజ తానాత్మ వురిఁ జేరఁగాక"

-:రామ బాణము రావణుని మస్తకముల ఖండింపఁగానే వెంటనే యవి మొలుచుట - రాముఁడు వానిని ఖండించుచు రావణునిఁ జంపు నుపాయ మాలోచించుట :-

అనునంత నయ్యమో - ఘాస్త్రంబు వచ్చి
దనుజనాయకుని మ - స్తకము ఖండించె.
కుండలకోటీర - కోమలప్రభలు
వెండియు నొకతల - వీర రావణుని 10240
భుజముపై మొలవ న - బ్బురముతో రాముఁ
డజరులు మెచ్చఁగ - నదియును ద్రుంచె
పుట్టలో పన్నగం - బులరీతి మఱియుఁ
గొట్టుచో నుర్వి పైఁ - గూలుమస్తకము
కనిపించుటయె కాని - గళము మొండియము
గనుపించ దేమాయఁ - గఱచెనో కాక !
ఔరర ! ధాత మ - హావర శక్తి

శ్రీరాముఁ డీరీతి - శిరములుద్రుంప
నొక్క చందమ్మున - నొకట మారంత
యక్కజంబుగ నుత్త - మాంగంబు మొలిచె! 10250
కొట్టిన తల కిరి - క్కునఁ దెగి తోనె
పుట్టె వ్రేయుట లేదు - బొంకనిపించె !
రావణుఁ డున్న ధై - ర్యము చూచి యాత్మ
భావించి "యెట్లు చం - పఁగవచ్చు వీని
తలఁ ద్రెంచియును చావుఁ - దప్పిన వాని
గెలుచు టెట్లిఁక ? నెట్టి - క్రియ జయింపుదును
క్రౌంచాటవిని దండ - కావనిఁ దొల్లి
త్రుంచితి నాకబం - ధుని నవ్విరాధు
ఖరదూషణాది రా - క్షసుల మారీచుఁ
బొరిఁ గొంటి వారి నే - పునఁ జయించితిని 10260
జలధిఁ గెల్చితిని రా - క్షసులఁ బెక్కండ్రఁ
గలనఁ జంపితి నమో - ఘములు మదీయ
దివ్యాస్త్రములు వీని - దెసఁ బాటిరాక
యవ్యవసాయ కా - ర్యంబులె పోలి
వమ్మయ్యె నేరీతి - వధియింతుఁ గడమ
యమ్ములే వీని యా - యమ్ము నాఁటెడును
ఏమిటఁ గెలుతు నిం - కెయ్యది యస్త్ర
మేమి సేయుదు " నని - యిచ్చఁ జింతింప
"స్వామి ! యేమిటి చింత - చాలింపు " మనుచు
రాముని కింద్రసా - రథి యిట్లు పలికె 10270

-: మాతలి శ్రీరామునితో బ్రహ్మాస్త్రము ప్రయోగింపుమని చెప్పుట :-

"అమరులందఱుఁ గూడి - యాడుకొన్నట్టి
సమయ మేనెఱుఁగుదుఁ - జంపుము వీని
నేఁడె వీనికి నూఱు - నిండిన దినము
వీఁడెంత మీయస్త్ర - విలసనంబులకు
నిప్పుడె బ్రహ్మాస్త్ర - మేయుము వీని
చప్పుడు గాకుండ – జం పెద వేని ”
అననట్లు కాకని - యాదిత్యుఁ దనదు
మనసులోపలను ము - మ్మాఱుగాఁ దలఁచి
మ్రొక్కి యగస్త్యుండు - మును దనకిచ్చు
చక్కని యస్త్రరా - జంబొకటేర్చి 10280

-: బ్రహ్మాస్త్ర వర్ణనము :-

సకలలోకైక ర -క్షాధురీణంబు
నకలంక శతసహ - స్రాంశు సన్నిభము
పాకాసురారి సం - ప్రార్థిత సత్య
లోకేశ దత్త శు - శ్లోకీకృతంబు
ఖగపురందరగరు - త్కలితోగ్రయుగప
దగణిత ఝంపాభ - యదఝాంకృతంబు
కలధౌత ఖచితపుం - ఖము సురవైరి
తులితమాకాశ బం - ధుప్రకాండంబు
తపనానలోద్దిష్టి - తనిశాతశల్య
మపరిమితంబు ప్ర - త్యస్త్రాసహంబు 10290

నగవసుధా భేద - నకళాధురీణ
మగణిత మహిత సై - న్యగ్రసనంబు
సతత భూతప్రేత - సంతోషఫలద
చతురంబు కల్పాంత - శమనోపమంబు
వానర సైన్య రా - వణబల వృద్ధి
హానికరంబు వ - జ్రాయుధోపమము
నైన బ్రహ్మాస్త్ర మం - త్రాధిరాజమునఁ
దానభిమంత్రించి - తద్దివ్యశరము
దశరథ తనయుఁడు - ద్ధతిఁ బ్రయోగింప

-: శ్రీరాముఁడు బ్రహ్మాస్త్రము ప్రయోగింపగనే బ్రహ్మాండ మంతయుఁ దల్ల డిల్లుట - అది రావణుని వక్షముఁ బగులఁ జేయనతఁడు విగత జీవుఁడగుట : -

శశిభాస్కరులు తప్పు - జాడలఁ జనిరి 10300
భూతహాహాకార - ములు మిన్నుముట్టె
ధాతపంకజ పీఠిఁ - దాచలియించె
నతలాదిలోకంబు - లన్నియు నతల
కుతలంబులయ్యె నా - క్రోశించె నభము
తిరిగె దిర్దిర ధరి - త్రి నగంబులెగిరె
నొరిగె మేరువు జగ - దుత్పాతమయ్యె
వేదమంత్రోక్త మ - వ్విశిఖరాజంబు
భూదేవతలు ఋషి - పుంగవుల్ సురలు
జయజయ ధ్యనుల హ - స్తంబులు మొగిచి
భయనివారణ మంత్ర - పఠనముల్ సేయ - 10310

నది రవి సంకాశ - మై యదివిజిత
భిదురమై యది సురా - భీప్సితంబగుచు
నది కాలకాలకూ - టాగ్రమైయది భ
యద మూర్తి యగుచు మి - న్నంతయుఁ బొదివి
యైరావతోగ్రదం - తాగ్రకిణాంక
చారుకుంకుమపంక - చర్చితంబగుచు
నీల భూమిధర - నిభమైన దనుజ
పాలకుని విశాల - భద్రవక్షంబు
భగ్గునఁ బగుల పైఁ - బడి వీపు వెడలి
నెగ్గున భూమిలో - నికి డిగబారి 10320
కొంతదూరము ధాత్రి - గోరాడి యెగసి
చెంతల దానవ - శేషంబుఁ బఱవ
నాఁక యెందును లేక - యారాముఁ జేరి
తోకచుక్కయుఁ బోలి - తూణంబుఁ జొచ్చి
కులిశంబు దారి సోఁ - కున వ్రయ్యలగుచు
నిలమీఁద వ్రాలు మ - హీధరంబనఁగ
నావిశిఖము ముట్ట - బ్రాణముల్ వోవ
రావణుఁ డవని పై - వ్రాలినఁ జూచి

-: రావణుని మరణమునకు లోకము హర్షించుట - వానరసైన్యము నానందముఁ జెందుట :-

ధిమధిమ మొర సెను - దేవదుందుభులు
ఘుమఘుమ జలనిధి - ఘోషించె పొంగి 10330
సేదలు దీర్చె ద - క్షిణ గంధవహుఁడు
పైదట్టముగ నిండెఁ - బ్రసవవర్షములు

తఱచయ్యె సురవధూ - దండ లాస్యములు
భరతుండు మదిఁగాంచె - పరమ హర్షంబు
కీర్తించి రమరవా - గ్గేయకారకులు
వర్తించె జయజయ - ధ్వనులు మిన్నెల్ల
ధారుణి భారమం - తయు నోసరిల్లె
చేరెఁ గల్యాణముల్ - సృష్టి కింతటికి
మునుల మానస రోగ - ములు శాంతినొందె
నినచంద్రులు వెలింగి - రిచ్ఛానుసరణి 10340
వింటి కూరట కల్గి - వెస నెక్కుడించి
నంటువాయని లక్ష్మ - ణ కుమారుఁ బిలిచి
యిచ్చినఁ బదముల - కెఱఁగి చేనంది
ముచ్చటల్ దీర రా - ముని చెంత నుండ.
జలజాప్తసుత విభీ - షణ వాలితనయ
నలనీల కుముదాంజ - నానందనాది
హితులు చెంతల నిల్చి - యెంతయుఁ బొగడి
యతనిచే మన్నన - లందిరి ప్రీతి
నాడినట్టి ప్రతిజ్ఞ - లన్నియుఁ దీర్చి
వేడుక మదిపూని - వృతునిఁ దునుము 10350
నాఁటి దేవేంద్రు నా - నంద మంతయును
నాఁటికి తనదు మ - నంబునఁ జెంది
తనవారి నడుమ బృం - దారకుల్ గొలువ
ననిమిషేంద్రుఁడు కొలు - వైయున్న యట్లు
పదునాలుగేండ్ల కా - పద లెల్లఁ దీఱి
ముదితాత్ముఁడై - రఘుముఖ్యుఁడున్నంత.
తేజోవిహీనుఁడై - దినరాజు వచ్చి

యీజగతినివ్రాలు - నెన్నికఁ దోఁప
రామాభిమంత్రిత - బ్రహ్మాస్త్రరాజ
భీమనిర్ఘాత ని - ర్భిన్న విశాల 10360
వక్షుడై పడిన రా - వణుఁ దేరి చూచి
యక్షీణ శోక వే - గాతురుం డగుచుఁ
జాల నేడ్చుచు విభి - షణుఁ డిలమీఁదఁ
వ్రాలి మున్నటి తన - వైరంబు మఱచి
తాను తోఁబుట్టిన - తమ్ముఁడు గాన
యానరాని విషాద - మంది యిట్లనియె.

-: విభీషణుఁడు రావణుని మరణమునుగూర్చి విలపించుట :-

"తుల లేని మృదుహంస - తూలికాతల్ప
ములఁ బవళించు న - మోఘ గాత్రంబు
వ్రేయు గాలును - కీలువ్రేసినట్లుండ
యీయవస్థలఁ బొంది - యిటు లుండవలసె 10370
తలకిరీటము మహీ - స్థలి డొల్ల కేశ
ములు నేలఁ బొరల దు - మ్ము మొగంబుఁ గప్ప
అన్న ! నీవిటులుండు - టయ్యెనే మొదట
నన్నమాటలు విన - వైతి వేమియును
కామాతురుండవు - గాన బ్రహస్తుఁ
డామీఁద కుంభ - కర్ణాదులు కులముఁ
జెఱపఁ బుట్టిన యింద్ర - జిత్తు నామీఁద
విరసించు నీవాడు - విధముల నాడి
రామాటలకు ఫలం - బందిరి వారు
రాముని ఘోర నా - రాచ ధారలను 10380

నాబుద్ధులే నమ్మి - యాప్తుడ నైన
నాబుద్ధి వినక ప్రా - ణము లొల్లవై తి
సీత నిమ్మని యెంతఁ - జెప్పిన వినక
యీతరిఁ బ్రాణంబు - లిత్తువే యకట !
ధర్మ మర్యాదలుఁ - దప్పిన కతన
నిర్మూలితంబయ్యె - నీ పరాక్రమము
నీపాటు చూడఁ గం - టికిఁ దిమిరమున
నాపంకజారాతి - యణఁగి నట్లయ్యె
కీలలు మాసిన - కీలి చందమున
నేలపై నిటులుండ - నినుఁ జూడఁగలనె 10390
ధైర్యంబు నిగురు మొ - త్తము నసమాన
శౌర్యంబు పేరును - శారీరబలము
ప్రసవ సంపదయుఁ దప - శ్శక్తి పేర
నెసఁగు చేవయుఁ గల్గి - నీవను నట్టి
సంపూర్ణ ఫలమహీ - జము రఘువీర
ఝంపాసమిర మి - చ్చటఁ గూలఁద్రోచె.
క్రోధగాత్రము కాంత - గుణతుండ మహిత
యోధనిర్మథన శౌ - ర్యోరు దంతములు
తపమును దమము మా - త్సరశత్రు నిగళ
కపటాసురలు కొలి - గడలు వారలుగ 10400
తనర నీపేరి గం - ధగజంబుఁ గూలె.
జనకజ రమణ కే - సరి నెదిరించి
క్రోధ నిశ్వాససం - కులధూమ నిర్ని
రోధక మతి శౌర్య - రూప హేమములు
బలమును వేఁడిమిఁ - బరగ నీ పేర

విలసిల్లు దుస్సహ - వీతిహోత్రుండు
చల్లనారెను రామ - జలధర నిశిత
భల్ల దృష్టిని దైవ - బలమ లేకునికి
ఘోర రాక్షసులు క - కుద్వాల శృంగ
వారంబు జపల భా - వ స్వభావంబు 10410
కన్నులు చెవులును - గజకోటిశక్తి
గన్నమాత్రము మహా - కాయంబు గాఁగ
వెలయు నీ పేరిటి - వృషభంబు పెద్ద
పులివోలె రాముఁ డి - ప్పుడు వసివట్టె
అన్న ! నీవా సీత - నాసింప వేని
నిన్ను రాముఁడెదిర్చి - నేర్చునే గెలువ
నాయమ్మ నేల వ్రా - లాచరణంబు
లాయన బాణంబు - లై గూల్చే గాక !”
అని చాల విలపించు - నవ్విభీషణునిఁ
గనుఁగొని లక్ష్మణా - గ్రజుఁ డిట్టులనియె 10420

-: శ్రీ రాముఁడు విభీషణు సూరడించుట :- రావణునికి పరలోక విధులు నెఱవేర్పుమని హెచ్చరించుట :--

"ఏల విభీషణ ! - యింత శోకింప
నాలంబులోన మీ - యన్న పాటునకు ?
చనునె శక్తి త్రయ - సంపన్నుఁ డతుల
ధనురాగమాత్మ ప్ర- తాపవై భవుఁడు
ఇతనికి వగతు రె - యితనిలో నెదుర
నితరుల తరమె యే - నింతియె కాక ?
ఏనైన నెదిరింతు - నే యధర్మంబు

వీనికి లేకున్న - విలుకేల నంది
చంపిన నేమి తాఁ - జచ్చిన నేమి
తెంపున నిటుగడ - తేఱంగ వలదె 10430
ఘనుఁడు క్షత్రాచార - గరిమమంతయును
తనపాల నిడుకొన్న - ధన్యుఁ డితండు
మీయన్న బిరుదంబు - మ్రింగి తోఁ బొలి సె
నీయన సామాన్యుఁ - డే త్రిలోకములఁ
బోరఁ జేతుల కొట్టి - పోరాడి యితఁడు
చూరవట్టెడు స్వర్గ - సుఖములన్నియును
నెన్నాళ్ళు బ్రతికిన - నేమి యన్నిటికి
నున్నవాఁడితఁ డన్యు - లుండియు నేల
పరలోకవిధులు దీ - ర్పక చింతఁ బొరలు
తరిగాదు నీకు క- ర్తవ్యమై యునికి,” 10440
అనుమాటలకు తాల్మి - నంది రాఘవునిఁ
గని విభీషణుఁడు సం - గతముగాఁ బలికె
“అయ్య ! త్రిలోక భ - యంకరఁ డితఁడు
కయ్యంబులందు నా - ఖండలాదులను
పలుమారు దోలి వెం - పరలాడినాఁడు
బలవంతుఁ డతుల దో - ర్బల శౌర్యశాలి
వేదముల్ తా చది - వినవాఁ డధీత
వేదాంగ చతురుండు - వేదార్థవిదుఁడు
సకలయాగక్రియా - చార సంపన్నుఁ
డకలంక పుణ్యుఁ డ - త్యంత ధార్మికుఁడు 10450
నిలుకడ గలవాఁడు - నీతిసంపన్ను
డిల పెక్కు గాలంబు - నేలినవాఁడు

బహుభోగభాగ్య సం - పన్నుండు సర్వ
సహుఁడు ధర్మాదిమ - సకలార్థములును
తనపాటుగా జప - తపములచేత
వనజగర్భుని చేతి - వరములుగాంచి
దానంబులను జగ - త్రయిఁ దనియించి
దానవాన్వయు లెల్ల - తనయంతలేసి
వారుగా నతులితై -శ్వర్యంబులొసఁగు
నీరావణుఁడు పూజ్యుఁ - డెవ్వారలకును 10460
శ్రీరామ ! మీయాజ్ఞ - చే దైత్యపతికి
పారలౌకిక విధుల్ - పాటించి తీర్తు”
అన విని యారావ - ణానుజుఁ జూచి
యినవంశతిలకంబు - నిట్లనె మఱియు
“ఇతఁ డెంతయును పూజ్యుఁ - డెల్లవారలకు
నితఁడన నీకొక్క - నికె యన్న గాదు
మాయన్న యీతండు - మరణపర్యంత
మీయన్నతో వైర - మింతియెకాని
యామీఁద నిఁక నేల - యాగమోక్తముగ
నామాఱుగాఁ గ్రియ - నడిపింపు ” మనిన 10470
నా వేళ రావణు - సంతఃపురమున

-: రావణుని మృతికి రాణివాస స్త్రీలు శోకించుట :-

దేవేరు లదివిని - దీన భావముల
వగలతో నుత్తర - ద్వారంబు వెడలి
మొగము నౌఁదల లుర - మ్ములు మోదుకొనుచు
నెదలపై సన్న బ - య్యెదలదల్ జాఱఁ

గొదమ పాలిండ్ల పై - కుంకుమల్ చెదరఁ
జెంగావి మోవులు - చిపిలి వాడంగఁ
గంగుల రవికల్ వి - కావికల్ గాఁగఁ
దారహారముల ము - త్యమ్ములు '
రాల హీరమంజీరంబు - లెడనెడ జాఱ 10480
నుడివోక నులివేఁడి - యూరుపుల్ నిగుడ
నడచుచో లేఁదీగె - నడుములు వడఁక
నెఱిగొప్పులూడి పె - న్నెరులుర్విఁ జీర
నఱువుచు హానాథ ! - హానాథ ! యనుచుఁ
గలనిలోనను జగ - గ్రావమో యనఁగ
నిలఁ బడియున్న ప్రా - ణేశ్వరుఁ జూచి
పదములఁ గొందఱు - బాహుల గొంద
ఱెదమీఁదఁ గొందఱు - నేడ్చుచు వ్రాలి
మూలముల్ దెగఁగ్రోయ - మునుకొని పడిన
లాలితమల్లి కా - లతికలో యనఁగఁ 10490
జేతుల కన్నులఁ - జేర్చి పాదములు
శీతలవక్షోజ - సీమల నుంచి
మోముపై మోము ద - మ్ములు చేర్చి
యతని భామినులందఱు - పలవరింపుచును
మంచునఁ దడియు తా- మరయకో యనఁగఁ
జంచలాక్షుల నేత్ర - జలముల జడిసి
రావణు వదనమా - రమణులనెల్ల
నావేళ విషమశో - కాంబుధి ముంచె.
వీణెల నాహిరుల్ - విసుపించునట్ల
రాణివాసము లెల్ల - రావణుఁ జూచి 10500

తమ దిక్కు లేమికై - తాలుముల్ మాని
సమశోక పారవ - శ్యముల నిట్లనిరి,
"ప్రాణేశ ! యజుని వ - రంబులచేత
ప్రాణభయంబను - బలుకెందు లేక
ముల్లోకముల దేవ - ముఖ్యులఁ గెలిచి
చెల్లరే ! మనుజుని - చేఁ జావవలసి
మన విభీషణుబుద్ధి - మార్గంబు వినిన
జనక నందనఁ దెచ్చి - చలపట్టి యునిచి
కొలిచిన వారలఁ - గొడుకుల హితులఁ
గులమెల్ల రామాస్త్ర - కోటి ద్రుంచితివి 10510
తపనవాయువులంటఁ - దలఁకెడు తమ్ము
గపులీడ్చుకొని పోవఁ - గావలేవైతి
వొరుల యిల్లాండ్రకు - నొడిసిన నీకుఁ
బరులచే నిట్టి యా - పదలు రాకున్నె?
తము ననాథలఁ జేయఁ - దలఁచి రాఘవుని
వనిత ననాథగా - వగచి తెచ్చితివి
దైవయత్నము నీకుఁ - దప్పింపరామి
చావఁ బాలైతివి - సమరరంగమున "
అని కురరీపక్షు - లరమిన రీతి
వనితలు వలఁగొని - వాపోవు నంత 10520

-: మండోదరీ విలాపము :-

పట్టపురాణి సౌ - భాగ్య సంపదల
కట్టు కంబము మయు - గారాబు పట్టి

దేవి మండోదరి - దిగులుచేఁ బొగిలి
రావణు హాహా వి - రావయై కదిసి
“ప్రాణేశ ! నీదివ్య - బాణాసనంబు
బాణంబులును నేలఁ - బడియున్న విపుడు.
అనిమిషేంద్రాదుల - కైన దుర్జయుఁడ
వని నిన్నుఁ ద్రుంచునె - యకట ! మానవుఁడు
అన్యుల కాంతల - నాసించు తెచ్చు
నన్యాయ పరుల కి - య్యాపదల్ రావె' 10530
తనబుద్ధి వినకున్న - ధార్మికుఁ డగుట
మన విభీషణుఁడు నే - మమున నున్నాఁడు
మాతండ్రియుఁ బ్రహస్తు - మాల్య వంతులను
నీతోడ యాబుద్ధి - నీతి గాదనుచుఁ
జెప్పిన మాటలు - చెవిఁ జేర్పనవుడె
తప్పెను బ్రతుకు లీ - దనుజుల కెల్లఁ
గాదని మనకుంభ - కర్ణుండు నిన్ను
బోధించి వినకున్నఁ - బొలిసె రోషమున
నింద్రుఁడె తావచ్చి - యిలనిట్లు రామ
చంద్రుఁడై జనియించి - సమయింప నోపు 10540
నెక్కడి యమరేంద్రుఁ - డెదురించు నిన్ను
మొక్కపోయిన వాఁడు - మొన సేయఁగలఁడె?
అడవుల వెంబడి - నలమటలెల్లఁ
బడి ముని వృత్తిచేఁ - బడఁతిఁ గోల్పోయి
వచ్చిన రాముని - వాలంపగములఁ
జచ్చె రావణుఁ డన్న - సత్యమే యున్నఁ

గలకంటినో లేక - కళవళించితినొ!
కలనిలో యేనిట్లు - గలఁగ యొక్కంబె
దురములోపల ఖర - దూషణాదులను
నఱకి మారీచదా - నపుల నణంచి 10550
వాలిఁ గూలఁగ నేసి - వనధి బంధింపఁ
జాలునే యివి మాను - షము లైన పనులె !
అతఁడు వంపినయట్టి - హనుమంతుఁ డొకఁడు
క్షితిజనుఁ జూచి కూ - ల్చి యశోక వనము
లంకఁగాలిచి రామ - లక్ష్మణాదులను
కొంకు దీరిచి తోడు - కొని తెచ్చి యిచట
డించినప్పుడె తల్ల - డించితి రాము
నెంచి చూచిన మర్త్యుం - డెట్లనవచ్చు
“సకల భూతహితుండు - సర్వశరణ్యుఁ
డకలంకుఁ డక్షరుఁ - డాది పూరుషుఁడు 10560
దేవదేవుఁడు సర్వ - దేవతామయుఁడు
గోవిందుఁ డజుఁడు వై - కుంఠ మందిరుఁడు
కార్ముక శంఖ చ - క్రగదాసి ధరుఁడు
నిర్మూలితా సురా - నీకుఁ డవ్యయుఁడు
గరుడధ్వజుండు భ - క్త పరాయణుండు
హరి సర్వమయుఁడు పీ - తాంబరధారి
దామోదరుండు స - త్యపరాక్రముండు
శ్రీమంతుఁడైన ల - క్ష్మీమనోహరుఁడు
నారాయణుఁడు ధాత్రి - నరుఁడయి పుట్టి
శ్రీరాముఁ డగుచు వ - చ్చెను కపులెల్ల 10570

దేవత లీధరి - త్రీపుత్రి లక్ష్మి
రావణుఁ దునుమఁ బ్రా - రంభించినారు"
అని విభీషణుఁడు ర - హస్యంబుగాఁగ
వినిపించెఁ గాన యే - విని యెఱుంగుదును
దెలియవైతి వరుంధ - తిరోహిణులకుఁ
దులవచ్చు సాధ్విఁ దె - త్తురె మహీసుతను ?
అందుచే నీకు ప్రా - ణాభిమానములు
చిందరవందరై - చెడిపోయె నిపుడు.
ఆయమ్మ కంటినీ - రక్కటా ! కడిగెఁ
బాయకాత్మకపోల - పత్రభంగములు 10580
పల్లకి కడఁద్రోచి - పడివాగె తేజి
బల్లనకట్ట తేఁ - బని లేదటంచుఁ
జూడ నందఱు మేల్ము - సుంగును మాని
వ్రీడ యించుక లేక - వీధికి వెడలి
దొలఁగించు వారలఁ - దొలఁగించు నిపుడు
కలనిలో నిలిచి రా - ఘవ సమక్షమున
సిగ్గెఱుంగని తన్ను - శిక్షింపవేల ?
పగ్గెలాడుదు వట్టి - పలుకులేమయ్యె ?
ప్రాణవల్లభలు నీ - పై వ్రాలి యడల
ప్రాణేశ ! వారి సం - భావింప వేల ? 10590
సీత రామునిఁ గూడి - చెలరేఁగునింక
నీతోడఁ గూడి మ - ణీ విమానముల
సకలలోకముల నా - శ్రమముల శైల
నికరంబుల మెలంగ - నేనోఁచ నైతి
నీలంక నిజధామ - ఇంద్రాది సురలఁ

దోలిన యింద్రజి - త్తుఁడు కుమారుండు
మయుఁడు నాతండ్రి స - మస్తలోకముల
జయమందు రాక్షస - స్వామి రావణుఁడు
నాప్రాణవిభుఁ డబ్ధి - నడుమ నున్నట్టి
ద్వీప మెవ్వరికి సా - ధింప దుర్లభము 10600
ననియుంటి ప్రతికూల - మై విధి యునికి
తన గర్వమెల్ల వ్య -ర్థంబయి పోయె
దాసీసహస్రంబు - తనుగొల్వనుండి
యా సరమకుదాసి -నై యుండవలసె
తన యిచ్చఁ గాసె నా - తపము భాస్కరుడు
తనువుట్ట వీచె శీ- తల మారుతంబు
నిండంగ పండు వె - న్నెల లల్లుకొనియె
మండదొడంగె సో - మరి పావకుండు
యముఁడు లంకాపురి - నసియాడ దొడఁగె
శమియించె ఖేదంబు - సకలలోకులకు 10610
నింతలో నీయాజ్ఞ - యెక్కడవోయె
వింత దోఁచెను దన - విభవముల్ దనకుఁ
దలయిచ్చ పారుప - త్యములయ్యె నేఁడు
జలజజాండములోన - సకలామరులకు
నిటులేల చేసితి - విందఱికన్న
కటకట ! సీతచ - క్కదనంబు నీకు
కన్నుల కితవయ్యెఁ - గాక నాచెలువ
మెన్నవైతివి నీకు - నిల్లాలనగుట
సత్యసంధుఁడవు భు - జబలాధికుండ
వత్యంత ధైర్యశౌ -ర్యవివేకనిధివి 10620

యాగమ విదుఁడ వ - నాగత కార్య
భాగ్య నిర్ణయ కుల - ప్రౌఢ చిత్తుఁడవు
ననుఁ బాసి యిట్టి మౌ - నంబుతో ధరణి
ననువుతో నాలింగ - నంబు సేయుదురె ?
ఏదియు దనకేల - యిపుడు వైధవ్య
ఖేదంబు తనకు నం - గీకృతంబయ్యెం
బోవు ప్రాణంబు లి - ప్పుడు శిఖా కళికఁ
బూవు దండలు చుట్టి - పూర్ణిమా చంద్రుఁ
దలపించు నీమోముఁ - దామర వాడ
యిల ధూళిమ్రింగ యే - నెట్లోర్చు దాన ! 10630
కస్తూరి కుంకుమా - గరువిలేపప్ర
శస్తమా నీదు వి - శాల వక్షంబు
రామాస్త్రమున విరి - రక్తప్రవాహ
భీమమై కనుపట్ట - బెదరుపుట్టెడును
ఏదుముండ్లును బోలి - యెడమీక నిండి
నీదు మేన నమోఘ - నిశితాస్త్రకోటి
నాఁటియున్నవి గాన - నాకు నొక్కింత
చోటెదపై వ్రాల - శోకించుటకును
నినుఁబాసి తానుండ - నీతియే ? కాన
తను దోడుకొని పొమ్ము - ధర్మంబుఁ దలఁచి 10640
యగ్ని సాక్షిగఁ బెండ్లి - యాడు నిల్లాలి
నగ్నుండవై విడ - నాడి పోఁదగునె? ”
అని తల్లడిల్లి సా - యంతన సమయ
వనదంబు పై వచ్చి - వ్రాలిన యట్లు

 
దొరలుచునున్న మం - దోదరి తోడి
తెఱవలు గ్రుచ్చి యె - త్తి తొలంగఁ దిగిచి

-: సఖులు మందోదరి సూరడించుట :-

" అమ్మ ! తీఱదిట దై - వాజ్ఞ గాదనిన
వమ్మువోవునె విశ్వ -వర్తనం బెల్ల ?
ఎఱుఁగ నేరని దాన - వే ? పుట్టినపుడ
మరణంబు ధ్రువము బ్ర - హ్మముఖామరులకు 10650
నెంత శోకించిన - యిఁక నేమి గలదు ?
శాంతినొందుము విభీ - షణుఁడున్నవాఁడు
మన కెల్ల దిక్కు, రా - మ సమక్షమునను
వనితాలలామ ! ని - ల్వఁగరాదు మనకు ”
అన నూరడిల్లి తో - కాశ్రుపూరములు
చనుఁగవమీఁదట - జాలెత్తుచుండ
సైరించునెడ విభీ - షణుని నెమ్మొగము
శ్రీ రామచంద్రుఁ డీ -క్షించి యిట్లనియె.

- : విభీషణుడు రావణుని కంత్య! క్రియలు చేయనని చెప్పుట, రాముఁడు విభీషణుని కట్టిపని తగదని చెప్పుట : -

తామస మేల యీ - దశకంధరునకు
నేమంబు తోడ వ - హ్నిక్రియావళులు 10660
కావింపు మున్నవి - కార్యముల్ పెక్కు
లావల నీయేడ్చు - నతివలకెల్ల
వారింపు మ"నిన రా -వణ సోదరుండు
శ్రీరాము చెంతకుఁ - జేరి తాఁబలికె.

"ఏ నేడ తమ్ముఁడ - నితఁడేల యన్న
వీనికి నుత్తర - విధు లెంత దవ్వు
పాపాత్ముఁ డగు వీనిఁ - బక్షులు మృగము
లీపాటిఁ గొనిపోవ - నిమ్ము చూచెదను
జ్యేష్ఠుఁడంచును వీనిఁ - జేరి సత్క్రియలు
నిష్ఠతోఁ జేయఁ బూ - నిన పెద్దలెల్ల 10670
దను జూచి చాల నిం - ద యొనర్తు రితర
వనితారతుండు పా - వనుఁ డౌనె వీఁడు ?
ద్రోహి గావున వీని - దొసఁగుట మేలు
స్నేహముంచకుము మీ - చిత్తంబులోన"
అన విభీషణునితో - నవనిజాప్రియుడు
విన నొల్ల కామాట - వెండియు బల్కె
“సామాన్యుఁడే రాక్ష - సవిభుండు చాల
పామరత్వమునఁ బా - పములు చేసినను
కలను పేరింటి గం - గా ప్రవాహమునఁ
దొలఁగిం చే నాత్మ దు - ర్దోష పంకములు 10680
సతనికిఁ చేయు క్రి - యా విశేషమున
నతిశయ సత్కీర్తు - లందుటే కాని
యే కొఱంతయును లే - దేనన్నమాట
నీకుఁ ద్రోయఁగరామి - నిజమయ్యెనేని
యాచరింపు మ”టన్న - నామాట తలను


-: విభీషణుఁడు రావణుని కంత్య క్రియలాచరించుట :-

మోచి యన్నకు నభి - ముఖముగాఁ జేరి
యచ్చోట చందనా - యత కాష్ఠ రాశి

దెచ్చి యమర్చి బల్ - తీరు ఘటించి
మెత్తగా వటి వేరు - మీఁద నమర్చి
మెత్త వైచి తలాడ - మీఁదట నుంచి 10690
బంగరు పటము పైఁ - బఱచి రావణుని
శృంగార విధులఁ గై - సేసి యెత్తించి
క్షితిమీఁద నునిచి ప్రా - చికి దక్షిణమున
హుత వహు వేది పై - నునిచి యెవ్వెనక
పైనిడి వృషదాజ్య - పాత్రలో సృవము
దానవవిభుని పా - దమ్ముల మీఁదఁ
దగురీతి సోమల - తాశకటంబుఁ
దగనుంచి సోమంబు - దంచిన ఱోలు
నూరుమధ్యంబున - నుంచి శేషించి
దారు పాత్రములు ను - త్తరమహారణియు 10700
నరణియు ముసలంబు - నార్షేయవిధులఁ
దరమిడి సముచిత - స్థలములనుంచి
పసుపును శాస్త్రోక్త - పద్ధతి గాఁగ
విసరించి నేతఁ బ - ర్విన పరిస్తరణి
పై వై చి లాజలా - పైపయిఁ జల్లి
గోవ జవ్వాది కుం - కుమముఁ గస్తురియుఁ
గర్పూర మహిసాక్షి - గంధరాజములు
గోర్పడంబుల మీఁదఁ - గుప్పలు వైచి
యావిభీషణుఁ డన్న - కగ్నికృత్యంబుఁ
గావించి బంధువ - ర్గము సమక్షమున 10710
స్నాతుఁడై యార్ద్ర వ - స్త్రంబులు గట్టి
ప్రీతి తిలోదక - క్రియలాచరించి

దనుజేంద్రునకు మ్రొక్కి - తరుణుల నెల్ల
చనుఁడని నిజరాజ - సదనంబుఁ జేర్చి
రాముని చెంతకు - రా నభోవీథి
కామితార్ధము లెల్లఁ - గడతేఱె ననుచు
ఖచర చారణ దేవ - గంధర్వయక్ష
నిచయంబు పుష్పకా - న్వీతమైయుండ
రావణు మరణంబు - రాముజయంబు
నావిభీషణుని స్నే - హప్రసంగములు 10720
సౌమిత్రి నడక కే - సరిపుత్రు బలము
తామరసాప్తనం - దనుని పూనికయు
నంగదు శౌర్యంబు - నగచరవీర
పుంగవుల్ దనుజులఁ - బొదివి చంపుటయుఁ
గతలుగాఁ బలుకుచుఁ - గనువిచ్చి మతుల
వెతఁదీఱి యాత్మని - వేశముల్ చేరె .

- శ్రీరాముఁ డింద్రసారథిని వీడ్కొలుపుట :-

ఆతరి రఘువీరుఁ - డమరేంద్రుఁ డనుచు
మాతలిఁ దనమంచి - మాటల చేత
బహుమాన మొనరించి - పర్వతారాతి
మహనీయరథముతో - మఱలంగ ననిచి 10730

--: సుగ్రీవు నభినందించుట :--

తనకు మ్రొక్కిన సుమి - త్రావుత్రుఁ గాంచి
యనునయింపుచు వాన - రాధిపుఁ జూచి
“చేసిన ప్రతినలు - చెల్లించుకొంటి

వీసత్య మితరుల - కెల్లఁ గల్గెడును
కపు లెల్లఁ గలుగ మా - కార్యంబు లెల్ల
నిపుడింతె కొఱ లేక - యీడేఱె మిగుల "
అనుచు నందఱును హి - తాలాపములను
మనముల నలరించి - మఱలి తామున్న
పాళెంబుఁ జేరి య - పారకృపావి
శాలమానసుఁడు ల - క్ష్మణుఁజూచి పలికె. 10740

-: విభీషణునికి లంకా రాజ్య పట్టముఁ గట్టుట :--

“ సౌమిత్రి ! యీ విభీ - షణుఁ డొక్కడుండఁ
గామి తార్థము లెల్లఁ - గడతేఱె మనకు
నితని దోకొనిపోయి - యిపుడే లంకకును
ప్రతినఁ దప్పక యుండఁ - బట్టంబుఁ గట్టి
రమ్ము ప్రధాన కా - ర్యంబిది నాకు
తమ్ముఁడు మీలో ని - తండొక్కరుండు”
అన లక్ష్మణుఁడు వాన - రావళిచేతఁ
గనక కుంభముల సా - గరనదీ జలముఁ
దెప్పించి పురము సొ - త్తెంచి యానగరి
గొప్ప సింగపు గద్దె - గూర్చుండఁ జేసి 10750
తానొక్క. కలశాంబు - ధారచే మీఁద
తానంబు సేయించి - తగువారిచేత
మంత్రులచే నాగ - మప్రకారమున
మంత్రపూతంబుల - మజ్జనంబార్చి
పట్టంబుఁ గట్టి యా- ప్తనిశాచరులనుఁ
కట్టు వర్గంబుల - కట్టడలిచ్చి

పురముకై సేయించి - భూరివాద్యములు
మొరయించి లంకయా - మున్నటియట్ల
సకలలక్ష్మీనివా -సము చేసి ప్రజల
నకలంక సంతోష - మనువొందఁ జేసి 10760
రామణీయక మైన - రాజ్యసంపదల
చేమించి మంత్రుల - సిరుల నెచ్చించి
యాలక్ష్మణుఁడు దాను - నపుడె రాఘవుని
పాళెంబునకు వచ్చి - భయభక్తులమరఁ
బురిఁ గలవారెల్లఁ - బువ్వు బొట్లములఁ
పరిమళంబులు నవాం - బరములు వివిధ
ఫలములు చతురం - తభద్రేభయాన
కలితాశ్వతతి కాను - కలు జోకచేసి
బహువిధభూషణ - ప్రకరంబుతోడ
బహుమతి శ్రీరాము - పదములచెంత 10770
నునిచి కేలు మొగిడ్చి - యొక యోర నిలువ
జనకజాప్రియుఁడు తా - సంతుష్టి నొంది
యతనిపై కరుణచే - నంగీకరించి
దితిజులు తెచ్చినది - ..............
................. - గనుసన్నఁ బిలిచి
రాకేందునిభుఁడు శ్రీ - రాముఁ డిట్లనియె.

-: శ్రీరాముఁ డాంజ నేయుని సీతాదేవితోఁ దమ జయ వృత్తాంతము నెఱిఁగింపుమని పంపుట :--

“ చనుము నీవిప్పుడె - జానకి కడకు
మునుపు విభీషణు - ముదలఁ గైకొనుము

రావణాసురుఁ జంపి - రామలక్ష్మణుల
సేవించి వానర - శ్రేణులతోడ 10780
........................ర
విగ్రహమ్ములు లేక - వేడుకఁగూడి
యందఱమున్నార - మని మేలువార్త
యందించి సీత యు - న్నట్టి చందంబు
మఱుమాటయును విని - మఱలిరమ్మనినఁ

--: ఆంజనేయుఁడశోకవనముఁ జేరుట :--

గరువలిసుతుఁ డశో - కవనంబుఁ జేరి
యచ్చట చుట్టు దై - త్యాంగనల్ గావ
. . . . . . . . . . . . . . . . . . . . . . . చు
నాయమ్మఁ గని రాముఁ - డానతియిచ్చు
చాయగా మొక్కి యం - జలి చేసి నిలిచి 10790
పలికిన యాత్మలో - పల విచారంబు
తొలగించి మిగుల సం - తోష మొందుటయు
“ పరమకల్యా ణి ! నీ - పతి పంప వచ్చి
మఱచిపోవుచు నెట్టు - మాటలాడితినొ ?

. . . . . . . . . . . . . . . . . . . . . .ల
పటుశక్తి చే వార్ధి - బంధించి వచ్చి
యాలంబులోన ద - శానను బంధు
జాలంబుతోడ న - స్త్రంబులఁ దునిమి
పట్టి విభీషణుఁ - బట్టంబుఁ గట్టి
యెట్టి చోప... - యింతయు లేక 10800
మెఱయుచునున్నారు - మీవారు నీకు

నెఱిగింపు. ..ని లంక - నీలతా గృహము
ముచ్చటల్ దీఱె రా - మునిఁ జేరఁగల్లె
యేనిజమరినౌదు - నేకదా వేఱె.
మానిని ! నిను జయ - మంగళ శ్రీలు
యేమందు నిపుడాన - తి” మ్మన్న సీత
యామాటలకుఁ బర - మానంద మొంది
పరవశయై మారు - పలుకక యున్న
ధరణిజతో మారు - తాత్మజుఁడపుడు 10810
పలుక వేమిటి కన్న - పరమహర్షమునఁ
దెలివి దెచ్చుకొని ధా - త్రీపుత్రి యిట్లనియె.

-: శ్రీరామవిజయముకై సీత యానందము ప్రకటించుచు నాంజనేయుని ప్రశంసించుట :-

పవనజ ! యానంద - పారవశ్యమునఁ
దవిలి యేనీకు ను - త్తర మియ్య లేక
యుంటిని రావణుఁ - డోడిన మాట
వింటిని నాస్వామి - విజయంబు వింటి
సత్యసంధుండ......................
.......................- క్య ప్రమాణములు
అతిలక్షణాఢ్యుండ - వప్రమత్తుఁడవు
మతి శాలి వనిలోప - మాన సత్త్వుఁడవు 10820
ధృతిశాలివి వివేక - ధీచమత్కార
హిత సత్యబోధ ప - రేంగితజ్ఞాన
నిరతుండ వష్టాంగ - నీతి మంతుఁడవు
వర శౌర్యుఁడవు హిమ - ప.........

.................................దూరుఁడవు
దీన బాంధవుఁడవ - తిజ్ఞాన నిధివి
మెచ్చి నే దీనికే - మి సమాన వస్తు
విచ్చెద నిందు కీ - రేడు లోకములు
రత్నభండార పూ - ర్ణములు గావించి
యత్నంబుతో యిచ్చి - నప్పు డిందులకు 10830
సరిగావు దాప్రాణ - సంరక్ష చె........
............................ వు”
అని పల్క- వినియమ్మ - హా పతివ్రతకు
ననిల కుమారుఁ డి - ట్లని విన్నవించె.

-: ఆంజ నేయుఁడు సీతను బాధ పెట్టిన రాక్షస కాంతలఁ జంపెద సని చెప్పుట - సీత యాతనిని వారింపుచు శ్రీరామునిఁ జూడఁగోరెదనని చెప్పుట :--

“ ఆమ్మ ! నీ కారుణ్య - మంతియ చాలు
సొమ్ము లేటి కొసఁగఁ - జూచిన యపుడె
త్రిభువన సామ్రాజ్య - దివ్య సౌభాగ్య
మభిముఖమై నిల్పిన - ట్లయ్యఁ దనకు
వీడె విచారంబు - విభుఁడైన రాముఁ
గూడి యండఁగ గనుఁ - గొను నింతెచాలు 10840
నేమి సన్మానంబు - లేఁటికి దనుజ
భామలు రావణు - పనుపుచే నిన్ను
బాధలఁ బెట్టిన - ఫలమెల్ల నిప్పు
డోదేవి ! చేకూర్తు - నుత్తర మిమ్ము
పదనఖకరవాల - పాశదంతములుఁ

జదియించి త్రుంచి పీ - చమణంగఁ గొట్టి
చుట్టి విద ల్చెద - చూడుము వీరిఁ
జుట్టు కొందునె” యని - చూపు నిగుడ్వ
నాయన యభిమతం - బాత్మలో నెఱిఁగి
యాయమ్మ క్రమ్మఱ - హనుమంతుఁ బలికె. 10850
“ఏయువాఁ డుండ న - మ్మేమి తాఁ జేయు ?
ఈ యింతులను జంప - నేమి ఫలంబు ?
రావణాసురుని రా - రాపుల చేత
నీ వెలందులు నన్ను - నేమన్న నేమి ?
హితముగాఁ పులితోడ - నెలుఁగుతోఁ దెలుపు
కత విన లేదె యా - క్రమ మెట్టులనిన
నలయించిరేని ద్రో - హము చేసిరేని
నలగించిరేని ప్రా - ణములకు నొకరు
తెగిరేని సొమ్మెల్ల - తెక్కలి గొట్టి
నొగిలించిరేని యా - నొచ్చిన వారు 10860
ధార్మికులై కీడుఁ - దలఁచిన యట్టి
దుర్మానులను జంపి - దోషపుంజముల
చేతఁ జిక్కిరని వ - చించు భల్లూక
గీతలు వినలేదె - కీడేల మనకు
లంక యంతయును నీ - లావున నలసె
నింక వీరలు నన్ను - నేమనఁ గలరు ?
వలదన్న " జానకి - వచన సంగతికిఁ
దలయూఁచి పవమాన - తనయుఁ డిట్లనియె.
“నీకుఁ జెల్లును చెల్లు - నీపతి కింతె
కాక యప్రతిమావ - కారుణ్య బుద్ధి 10870

యమ్మ ! యన్యుల కేల - యబ్బు మీచిత్త
మిమ్మేర నుండిన - నేనట్లు సేతు
నేమందు నీదు ప్రా - ణేశునిఁజూచి
యీమాటలాడె మ - హీపుత్రియనుచు
నానతిమ్మన ” విని - యవనిజ పవన
సూను నెమ్మోమునుఁ - జూచి యిట్లనియె.
సౌమిత్రి సహితుని - సంపూర్ణ చంద్ర
కోమలానను నీల - కువలయ శ్యామ
కోదండపాణి ర - ఘుశ్రేష్ఠు దశము
ఖాది దై తేయ సం - హారు సుగ్రీవ 10880
వాలిజముఖ కపి - వ్రాత సంసేవ్యుఁ
జాల నామనసు ము - చ్చటలెల్ల దీఱఁ
జూడఁ గోరితి నటం - చు వచింపు" మనిన
వ్రీడావతికిఁ గపి - వీరుఁ డిట్లనియె.
మాయమ్మ ! నీవునె - మ్మది శచీదేవి
యా యింద్రుఁ జేరిన - యట్టి చందమునఁ
గలసి యుండెద వేను - గదలి పోయెదను
పిలువ నంపిన వచ్చి - ప్రియునితోఁ గూర్తు”

-: శ్రీరామునాజ్ఞచే హనుమంతుఁడు సీతను నలంకరించి రాముని యొద్దకుఁ గొనివచ్చుట : --

నని రఘువీరు దా - యఁగ నేగి " స్వామి !
జనకజఁ గాంచి యి - చ్చటికి వచ్చితిని. 10890
ఏయమ్మ దారికై - యింత చేసితివి
యాయమ్మ మిముఁ జూతు - నని కలంగెడును

మొదలింటి యెఱుకచే - మొగమిచ్చి తనకు
నిది నాతలంపని - హృదయంబుఁ దెలిపె
తోడి తెమ్మనవుఁడు - తోడ్తోనె మాట
లాడుచున్నపుడె నే - త్రాంభోరుహముల
జలజలఁ గన్నీరుఁ - జల్లుచు చింతఁ
దల వాంచి రావణు - తమ్మున కనియె.
“దను జేంద్ర సీతను - తల గడిగించి
యనుపమ రత్న భూ - షాంబరావలుల 10900
గైచేసి తగిన వై - ఖరుల దోతెమ్ము
మాచెంత ” కనిన న - మ్మాటలో నతఁడు
నవనిజ కడ కేఁగి - " యమ్మ ! రాఘవుఁడు
నవరత్నమయ భూష - ణప్రముఖములఁ
గాంతల చేత శృం - గారింపఁ జేసి
చెంతకుఁ దెమ్మని - చెప్పిన కతన
వచ్చితి " నసవుఁడు - వైదేహి యందు
కిచ్చగింపక " రాము - వీక్షించి కాని
యేనలంకారంబు - నేమియు నొల్ల
యీనిలుకిడ చేత - నే తెంతు ” ననిన 10910
"అమ్మ ! రామాజ్ఞ యే - మనవచ్చు మనకు
సమ్మతింపుము వధూ - జనముల చేతఁ
దొడవులు దెప్పింతుఁ - దొడుగుము మైల
విడచి చీనాంబర - వితతి ధరింవు
గాదనరా ” దనఁ - గానిమ్మటంచు
నా దేవి సమ్మత - మందిన నతఁడు

తనకుల సతుల నం -దఱఁ బిలిపించి
“వనిత లందఱు నమ్మ - వారినీ వేళ
కై సేయుఁడననట్లు - కాకని వారు
నాసీతకును శిర - సంటి నీరార్చి 10920
తలతడి యొత్తి మం - దారలతాంత ములు
కీలుకొప్పున - ముడిచి మాణిక్య
మయభూషణములందు - మైభోగ తరము
లయినవి సకలావ - యవముల నుంచి
చందురుగావి మేల్ - సరిగంచు చీర
చెదరినపూఁబోళ్లు - చిలుకంగం గట్టి
రంగైన పైఠాణి - రవిక పైఁ బైఁట
కొంగు పన్నీటి కుం - కుమఁ దేలవైచి
సవరన సేసిన - సరమా ప్రియుండు
రవణంబు గలచతు - రంత యానమున 10930
నాదిలక్ష్మికిని రెం - డవ మూర్తియైన
యాదేవి నుని చి తూ - ర్యములు ఘోషింప
దండ నూడిగపు బి - త్తరులు సేవింప
నండ వాకిట పెద్ద - లల్లుకరాగ
తరిమి కంచుకులు సం - దడి విరియింపఁ
బురము వెల్వడి రఘు - పుంగవుఁడున్న
శిబిరంబు చెంతకుఁ - జేరి దైత్యేంద్రు
డబలలతో జన - కాత్మజ వచ్చె
చిత్తగింపు” మటన్న - శ్రీరామచంద్రుఁ
డత్తరి రోష దై - న్యములు సంతసము 10940

పెనగొనఁ "వేగమ - పిలుచుకరమ్ము
జనకజ” నన విభీ - షణుఁడెడ మీక

-- : సీతనుఁ జూచుటకుఁ గపులును రాక్షసులును త్రోసికొనుచు వచ్చుచుండ విభీషణుఁడు వారి నడ్డగించుట -
                                           రీరాముఁ డాతనినివారించుట :-
కప్పుక యున్నట్టి - కపుల రాక్షసులఁ
దప్పించు కొనఁగ బ - ద్దలు పాలు గాఁగ
విసరించు సందడి - విరియింపఁ జూచి
"పొసఁగునె దానవ - పుంగవ ! యిట్లు ?
చూచెద మన - వారిఁ జూడంగనీక
త్రోచి కట్టించి యీ - దుడుకు సేయుదురె ?
ఉత్సవమ్ములు దేవ - తోత్సవమ్ములను
యుద్ధభూముల సవ - నోపాంతములను 10950
వైవాహికస్వయం - వరముల రాచ
దేవేరులను ధరి - త్రీజనంబెల్లఁ
గననొప్పు నదియును - గాక నేచెంత
నునికిచేఁ జూచిన - నొచ్చంబు గాదు.
అదిగాక యిదిమహా - హవభూమి యిచట
గదిసి చూచిన వారిఁ - గడలఁ ద్రోయుదురె ?
అందఱు మనవార - లన్యులు వీర
లందునెవ్వారు లే - రటుగాన నీవు
నాయుత్తరపు లేక - నచ్చిన వారి
వేయింతువో నొవ్వ - వేత్ర దండముల? 10960

రాజసవృత్తిచే - రాణివాసముల
నీజాడ నడిపింతు - రింతియెకాక
యీలువుఁ గల్గిన - నెట్లున్న నేమి ?
యేల యన్యంబు లూ - హింప నెవ్వరికి ?
గోటలు గోడలు - కోణెవాకిళ్లు
చాటులు పెద్దలె - చ్చరికల్ నగళ్లు
కంచుకుల్ గొల్ల లె - గ్గళ్లు నడ్డములె
చంచలాక్షుల మనో - జవనాశ్వములకు ?
బాహిరమ్ముల నేమి - ఫల మివియేల
గేహినులకు ? వివే - కింపరు గాక 10970
కొమ్మకుఁ బెట్టని కోట - యీలువయె
సుమ్ము మానంబె కా - చును సతీమణుల
నావరణములు వ్య - ర్థంబులు సిగ్గు
కేవలమైన యం - కిలి కులాంగనకుఁ
గావున నందఱుఁ - గనుచుండ సీత
నీవు దో తెమ్మ ” న్న - నేమియుననక
పల్లకి డించి యా - పరమ కల్యాణి
నల్లన సముఖంబు - నందుఁ జేర్చుటయు
నావిభీషణు వెంట - నవనిజ రాఁగ
భావించు శ్రీరాము - భావంబుఁ జూచి 10980
యంగదసుగ్రీవ - హనుమన్నలాదు
లింగితజ్ఞులుగాన - నేమియు ననక
సౌమిత్రిఁ జూడ ల - క్ష్మణుఁడాత్మలోన
రాముని హృదయమా - రసి యూరకున్న
నాసీత “యార్యపు - త్రా ! "యంచు మిగుల

గాసిలి పెన్నిధిఁ - గనుఁ గొన్న యట్లు
చంద్రుని మించిన - చక్కని రామ
చంద్రుని నెమ్మోము - సడిసన్నఁ జూచి
జిలుఁగుఁ బయ్యెద సన్న - చెఱఁగు నెమ్మోము
వెలిదమ్మిపై వైచి - వెక్కి యేడ్చుచును 10990
తలవాంచికొనియుండ - దయరాక చాల
చులకఁగాఁ గనుచు నిం - చుకయైన యోర్పు
మొగమాటయును మాని - మొగముపై నలుక
చిగురొత్త సీత కా - శ్రీరాముఁ డనియె.

-: శ్రీరాముఁడు రావణునింట యుండుటచే సీత నేలుకొననని యామె శీలమును శంకించుట :=-

"పౌరుష క్రియఁ బూని - పగఁదీర్పవలసి
వారిధిఁ గట్టించి - వచ్చితి నిటకుఁ
జేసిన ప్రతినలు - చెల్లించుకొంటి
నీసు చూపితి దాన - వేంద్రునిమీఁద
జలరాశి దాఁటి యి - చ్చటి లంక యెల్లఁ
గలయఁ గన్గొని యశో - క వనంబులోన 11000
నినుఁ జూచి కొన్ని పూ - నిక లాడినట్టి
హనుమంతుని ప్రతిజ్ఞ - లతనికిఁ దక్కె
నాతోడ వానర - నాయకుండాడి
యేతీరున వచించె - నే దీర్చె నట్ల
తమ యన్న గాదని - తనుఁ జేరుకోర్కి
సమకూర్చితిని విభీ - షణునిఁ జేపట్టి
కపుల పాటంతయుఁ - గడతేఱె నాకు

నపకీర్తి దలఁగె శౌ - ర్యము నుతికెక్కె
నాలిఁ గొంపోయిన - యతని సాధింపఁ
జాలఁడంచును మహీ - జను లాడునట్టి 11010
యాడికల్ మాని నీ - యపవాదమునకు
నోడి యింతియె కాని - యొకనిచేఁదగులు
నిన్నుఁ గ్రమ్మఱఁ గూడి - నెమ్మిఁ జేపట్టు
నెన్నికతోడ నే - నిటకు రాలేదు.
వగవ నేల ? " యటన్న - వసుమతీ తనయ
మిగుల శోకింప సౌ - మిత్రి మున్నైన
వారెల్ల వినఁగ న - వ్వామాక్షిఁ జాల
నీరసింపుచు రాముఁ - డిట్లని పలికె.
“ఏల యిచ్చటనిల్వ - నెందైన నీకు
మేలైన చోట కా - మిని ! వసియింపు 11020
మిన్ని పాటులు వడి - యేవచ్చు టెల్ల
నిన్నుఁ గైకొనుటకే - నీవేల తనకు
నెఱుఁగవే మనజాతి - నెవ్వారలైనఁ
బరులు పట్టుక పోవు - పడఁతి నేలుదురె ?
తోడితే రావణు - తొడలపై నుండి
కేడింప కతని కౌఁ - గిటిలోనఁ దవిలి
వానింట నిన్నాళ్లు - వసియించు నిన్ను
మానునె రాగాంధ - మతి రావణుండు
కామాతురుని చేతఁ - గాలాము గతిని
వామ! . నీపాటి చె - ల్వము గల్గునింతి 11030
యున్న వాఁడేటికి - సూరక యుండు
నిన్నుఁ జూడఁగరాదు - నిలువకు మిచట

నేత్ర రోగంబు వా - నికి దీపకలిక
ధాత్రి పై మిగుల వే - దన సేయుకరణి
నినుఁ జూచి యేనోర్వ - నిమిష మేనియును
చనుమవ్వలికి కాక - చనకున్న నేమి
యీలక్ష్మణాంగదు - లీ విభీషణుఁడు
వాలితమ్ముఁడు నున్న - వా రిందులోన
వలసిన నొకరి క్రే - వల నుండు మేను
సెలవిచ్చితిని నీకు - చింత యేమిటికి ? 11040
అన విని హస్తిచే - నలమటఁ బడిన
వనిలోని సల్లకీ - వల్లకి రీతి
చెవులు చుఱుక్కని - చిల్లులు వోవ
నవమతిగాఁ బల్కు - ప్రాణేశు మాట
విని శోకముడిగి యా - వెలఁది కన్నీరు
తనచెఱుఁగునఁ ద్రోచి - తమ్ములవంటి
కన్నుల కెంజాయఁ - గడలుకొనంగ
విన్నబాటున క్రోధ - వివశయై పలికె.

—: సీత యామాటలు విని యగ్నిహోత్ర ముఖమున తన పాతివ్రత్యము నెఱుకపఱచెదనని ప్రతిజ్ఞ చేయుట :-

“అయ్య ! ప్రాకృత జను - లనురూపులైనఁ
దొయ్యలులను సిగ్గుఁ - దొఱగి యన్నట్ల 11050
యీమాట లాడుదు - రే నన్ను నిన్ను
నేమఱి నాశీల - మెఱిఁగి యుండియును .
పెక్కు-గాలంబు నీ - ప్రియ నై మెలంగి
యక్కటా! పది నెల - లవ్వల నున్న

నందఱిలో నన్ను - నౌగాము లరయ
కందురే యిదినీకు - నపకీర్తి గాదె!
ఆడినట్టుల జెల్లుఁ - నన్న నీవిట్టు
లాడిన నే నెదు - రాడ నేరుతునె?
వట్టుక పోవుచో - పాపాత్ము మేను
ముట్టక తీరునె - ముందల వట్టి 11060
యీడుచు కొనిపోవ - నేదిక్కు చూచి
యేడుచు నపుడు ది - క్కెవ్వరు లేక
తగిలిన యపుడేను - దలఁచిన యట్ల
తెగిపోక యంగముల్ - తెకతేర యయ్యె.
ఇంత నీమదిఁ గల్గె - నేని నాతోడ
మంతనంబున హను - మంతుని చేత
గోరంత వినిపింపఁ - గొదవ లన్నియునుఁ
దీఱ నీతోడ బొం - దింతు ప్రాణములు.
అప్పుడట్లాడించి _ యందఱిలోన
నిప్పుడిట్లాడ నా - కెవ్వరు దిక్కు 11070
జనక భూపతికి వి - శ్వంభర కేసు
జనియించితినటన్న - శబ్ద సూతకము
పై మోచుటయే కాని - ప్రకృతి దేహమున
స్వామి ! నేనొకరికి - జనియింప లేదు.
ఏ నయోనిజను నీ - హృదయ మేనెఱుఁగ
కీ నీచ దుర్భాష - లిటు వింటిఁ గాని
యే నెఱిఁగిన నీకు - నీ వానరులకు
మాను నాపదలు నె - మ్మది నుందు రచట

నమ్మని వాఁడవై - నను నిన్నునేల
నమ్మి యుండుదును ప్రా - ణంబు లాసించి 11080
యిపుడైన దేమి న - న్నెఱిఁగించి మీకుఁ
గృప వుట్టఁ జేతు మి - క్కిలిని మేలయ్యెఁ
జూడు మీ"వనుచు న - శ్రులు రాలఁ దననుఁ
జూడని సౌమిత్రిఁ - జూచి యిట్లనియె.
"మాయన్న ! లక్ష్మణ ! - మంచి మాటాడె
మీయన్న యిది విన్న - మీకు నమ్మతమె?
అందుల కేమి నా - యపరాధ దోష
మిందఱు చూడంగ - నివుడె త్రోచెదను.
అనలుని వెలిగింపు - మందులోఁ జొచ్చి
వనజాప్తకులము పా - వనము సేయుదును ; 11090
తెచ్చెద మీకుఁ గీ - ర్తి శిఖ ముఖములఁ
జొచ్చెద నే తెంపుఁ - జూతువు గాక !
అగ్ని సాక్షిగఁ బెండ్లి - యాడు రామునకు
నగ్ని సాక్షిగఁ దీర్తు - నపవాద భరము !
తామసించకు ” మని - ధరణిజ వలుక


-: శ్రీరాముఁ డందుల కియ్యకొనఁగా సీత యగ్ని ప్రవేశముఁజేయుట :-

రామానుమతి సుమి - త్రాకుమారుండు
చితి పేర్చి యగ్ని రా - జించి పెన్మంట
లతిశయంబుగఁ జేసి - యది చూపుటయును
సీత రాముని ప్రద - క్షిణముగా వచ్చి
చేతులు మొగిచి యా - శ్రీరాము నెదుర 11100

"ఏను పతివ్రత - నేని శ్రీరాము
గాని యన్యుల మదిఁ - గామింప నేని
దైవముల్ సత్యంబుఁ - దప్పని వేని
పావకు కరుణ నా - పైఁ గల్గు గాక !
వసుమతి దిశలు దే - వబ్రాహ్మణులును
వసువు లాకాశంబు - వారి వాయువులు
సకల భూతములును - సాక్షులై సంధ్య
లొకసాక్షి యై మింట - నున్న సూర్యుండు
ధర్మ దేవతయు నం - దఱుఁ గూడి పుణ్య
కర్మంబులకుఁ దాము - కర్తలు గాన 11110
పాలు నీరునునేరు - పఱచు హంసముల
వోలికె దన దైవ - ముగ రాముఁ దలఁచి
కలకాల మేనిష్ఠఁ - గావించు తపము
ఫలియింపఁ జేయుఁ - డీపట్టున ననుచు
వలవచ్చి యాహవ్య - వహునిలోఁ జొచ్చి
కలఁగుచు నందఱుఁ - గన్నీరు నింపఁ
దనమేని చాయ పు - త్తడి బొమ్మ వోలి
కనుపింప దహనశి - ఖా మాలికలను
పుణ్యమంతయు దివం - బున డించి యపుడ
పుణ్యాంగనా మణి - పుడమి పైఁ బడినఁ 11120
గనిన మౌనుల వోలి - కపులు రాక్షసులు
కనుఁగొని మిగుల శో - కంబులఁ బొగుల
"అక్కటా! సీత నే- నరికట్టనైతి
మొక్క లంబున నేల - మోసపోయితిని
కడ లేని శోకసా - గరము చేయీఁత

కడు వెడలఁగ నీఁది - కడపట యిట్లు
దురభిమానంబుచే - దోషమార్జింప
వెరలక యిన్నాళ్లు - వెతలపాలగుచు
నా నిమి త్తంబుగా - నవయు జానకిని
పోనాడుకొంటి నా - వుణ్యహీనతను 11130
తుదమొదల్ గాఁగ నా - దుర్బుద్ధి చేతఁ
దుదిఁ గాననైతి చే - తో వేదనలకు ! "

-: బ్రహ్మేంద్రాది దేవతలు ప్రత్యక్షమై సీత పాతివ్రత్యము లోకమునకుఁ దెలుపుట :-

అని చింత నొందుచో - నమరు లింద్రుఁడును
మునులు దిక్పతులును - మొదటి వేలుపులు
హరుఁడును నజుఁడు చం - ద్రార్కులు ఖచర
గరుడ గంధర్వ య - క్ష ప్రముఖులును
దేవ యానముల పై - దివినుండి డిగ్గి
రావణ సమర ధ - రాస్థలి నిల్చి
తనకు సాఁగిలి మ్రొక్క - దశరథాత్మజునిఁ
గని లేవ నెత్తి యా - ఖండలుం డనియె. 11140
సామాన్యుఁడవె నీవు ? - సర్వ లోకులకు
స్వామి వీశుఁడవు ర - క్షకుఁడవు మాకు
నిట్టిమహాసాధ్వినీ - జనకజను
నెట్టు ద్రోచితి మండు - నింగలంబునను ?
ఈ మాటలాడ నో - రెట్లాడె నీకు ?

నా మానవతి యోర్చు - నదియె యిందులకు ?
దేవదేవుఁడవు సా - త్త్విక విగ్రహుండ
వీవసువులలోన – ఋతుధాముఁ డనఁగఁ
తనరు వాఁడవు నీవు - ధాతలయందు
వనజగర్భుఁడవు దే - వతల నింద్రుఁడవు
రుద్రుల నెనిమిదో - రూపంబు నీది 11150
భద్రదాతవ సాధ్య - పంచమాత్ముఁడవు
నీకు శ్రోత్రము లాశ్వి - నేయులు శశిది
వాకరల్ నీ నేత్ర - వారిజాతములు
వాయువు లూర్పులు - వనజ జాండములు
నీయందు నెప్పుడు - నిండుక యుండు
నట్టి విరాట్పూరు - షాకృతి వాఁడ
విట్టి ప్రాకృత కర్మ - మేల సేసితివి ?
నిన్ను నీవెఱుగక - నిజమూర్తి మఱచి
విన్నఁ బోవుచు నేల - వెతలఁ బొందెదవు ? ”
అని పల్కి నట్టి యిం - ద్రాదులఁ జూచి 11160
తను నెఱుంగుటకు సీ - తాకాంతుఁ డనియె.
"తాను రాఘవుఁడను - దశరథ సుతుఁడ
నేనని మది నుంచు - టింతియె కాని
యితర మే నెఱుఁగ నే - నెవ్వాఁడ బలుకుఁ
డతి కృపామతి మిమ్ము - నడిగెద ” ననిన
నామాట లాలించి - యబ్జగర్భుండు
రామున కెల్ల వా - రలు వినం బలికె.

-: బ్రహ్మ శ్రీరాముని తత్త్వమును - మహత్మ్యమును నెఱుక పఱచుట :-

“ఆది పూరుషుఁడవు - వ్యక్త రూపకుఁడ
వాది మధ్యాంత క్రి- యా విదూరుఁడవు
క్షరుఁడ వక్షురుఁడవు - సర్వసాక్షివిని 11170
పరుఁడ వవ్యయుఁడవు - పంకజాక్షుఁడవు
కూటస్థుఁడవు జగ - ద్గురుఁడవు హరివి
హాటకాంబరుఁడ వ - ధ్యాత్మరూఫుఁడవు
కాలమూర్తివి జగ - త్కర్తవు భువన
పాలకుండవు చక్ర - పాణి వీశుఁడవు
వేదవేదాంతార్ధ - వీథీవిహారి
వాదిమహావరా - హావ తారుఁడవు
తారకుఁడవు గదా - ధరుఁడవు శార్ఙ్గ
ధారివి భయద నం - దక కరాగ్రుఁడవు
జయశీలుఁడవు పాంచ - జన్యహస్తుఁడవు 11180
భయనివారకుఁడ వా - పద్బాంధవుఁడవు
గరుడధ్వజుండ వా - ఖండలముఖ్య
సురవర మకుట భా - సుర చరణుఁడవు
పద్మామనః పద్మ -- పద్మమిత్రుఁడవు
పద్మనాభుఁడవు కృ- పా వారినిధివి
శ్రీవత్స కౌస్తుభ - శ్రీవిరాజితమ
హావక్షుడవు త్రిగు - ణాత్మకాకృతివి
అచ్యుతానంత నా - రాయణ కృష్ణ
వాచ్యుఁడ వఖిల దే - వ స్వరూపుఁడవు
శతజిహ్వ శతశిర - స్కసహస్ర శృంగ 11190

శతశతపాద హ-స్త వికద్ధనుఁడవు
సవన హూంకార వ - షట్కారములను
హవిరన్న పాత్రంబు - లాహుతుల్ నీవ
నీవె సముద్రముల్ - నీవె యద్రులును
నీవె ద్వీపంబులు - నీవె లోకములు
యోషధులును నీవ - యుర్వియు నీవ
యోషధీశ్వరుఁడు సూ - ర్యుండును నీవ
నీవు గానిది లేదు - నీకు నన్యులను
నీవారు లేరు న - న్నియు నీవె కాని
నీకేను హృదయంబు - నీజిహ్వవాణి 11200
నీకోప మనలుండు - నీతాల్మి విధుఁడు
నీనిమేషోన్మేష - నియమముల్ రాత్రు
లైనిండిన హయంబు - లై విలసిల్లు
నీనిలుకడ భూమి - నీదు రోమంబు
లానిలింపులు తావ - కాజ్ఞ వేదములు
ఆత్రివిక్రమ మూర్తి - నాక్రమించితివి
యీత్రిలోకంబులు - నీసీత లక్ష్మి
నీవె విష్ణుండవ - నీస్థలిఁ బుట్టి
రావణహరణకా - రణ మయినావు
వచ్చిన పనియయ్యె - వైకుంఠమునకు 11210
విచ్చేయు మాత్మ దే - వీ సమేతముగ
నినుఁ గొల్చునట్టి మా - నిత పుణ్యులైన
జనులకు నిహపర - సౌఖ్యముల్ గలుగు
నేనీకుఁ దెల్పిన - యీ స్తవరాజ
మేనరుల్ వ్రాసిర - యేన్వినిరేని

యాగమంబులకు నీ - డది మదుక్తంబు
వేగుజాముల జది - విరె యేని వారు
పుణ్యులై యాదిమ - పూరుషార్థముల
గణ్యులై యతిశయ - కామితార్థములు
చేకూడి మహి చిరం - జీవులై వీత 11220
శోకులై కలుషరా - సులఁ దొలగించి
నిచ్చ కల్యాణముల్ - నిజగృహంబులను
పచ్చతోరణములు - పరగ నుండుదురు
తప్పదు బ్రహ్మగీ - తలు ధాత్రియందు
నొప్పు నాచంద్రార్క - ముర్విజారమణ !”

-: అగ్ని పరిశుద్ధయగు సీతను బ్రహ్మ శ్రీరామున కర్పించుట :-

అన విరించి యనుగ్ర - హంబు చే నఫుడె
యనలుండు తనదు ని - జాకృతిఁ జేరి
పూసిన కుంకుమ - పుత్తడిచేల
వాసనా ప్రసవముల్ - వాడనికొప్పు
సురుచిరాంగము పొగ - చూఱని రవిక 11230
తరళ మౌక్తికరత్న - తారహారములుఁ
గలిగిన త్రిభువన - కల్యాణి సీతఁ
దలిరాకు కేంగేలఁ - దమ్ములచేత
సన్నిధి కెత్తుక - చనుదెంచి మిగుల
మన్నన చెక్కు చె - మర్చక యుండ
మొదలింటి కైవడి - ముందఱ నుంచి
సదయాత్ముఁడై రామ - చంద్రుని కనియె

"ఈసీతయెడ దోష - మేమియు లేదు
రోసంబు వుట్టించి - రోయ నాడితివి
పరమ పతివ్రతా - భరణమీసాధ్వి 11240
సురవైరి తనువట్టు - చో మేను మఱచి
శోకింపుచుండ న - శోకంబు క్రింద
నీకొమ్మ నతఁడుంచి - యింతులఁ జుట్టుఁ
గావలిగా నుండఁ - గట్టడి సేసె
రావణుఁ డొకవేళ - రాగాంధుఁ డగుచుఁ
దావచ్చి బెదరింపఁ - దలఁక కీయమ్మ
భావంబు నీకు న - ర్పణముఁ గావించి
ప్రాణాశ విడిచి దు - ర్భాషలాడుచును
ప్రాణేశ ! మాకు నా - పదవాపు " మనుచు
నుండు నింతి యెకాని - యొండు లేదెఱిగి 11250
యుండుదు నేను ది - వ్యులు నిరీక్షింప
నీయింతిఁ జేపట్టి - హృదయంబుఁ జల్లఁ
జేయుము మిగుల నొ - చ్చిన దిన్నినాళ్లుఁ
దగవుఁ దప్పకుమన్న - దశరథాత్మజుఁడు
నగుమోముతోడ ధ - నంజయుఁ బలికె
"సీత మనోధర్మ - శీల గౌరవము
లీతెఱంగనుచు నే - నెఱుఁగనే యిపుడు
దనుజేంద్రు నింటిలోఁ - దడవుగానున్న
వనితను లోకా ప - వాదంబు కొఱకు
మించ నాడితిని భూ - మిజ యందుచేతఁ 11260
గాంచెను సత్కీర్తి - గౌరవోన్నతులు
శిఖశిఖాకల్ప నీ - సీతను పంక్తి

ముఖుఁడేమి యన నోపు - ముట్టిన యపుడె
పొలియఁడె నా యాజ్ఞ - భూపుత్రి వానిఁ
గలుషించి తిట్టక - కాచుట గాక
మీ యనుగ్రహముచే - మెలఁతఁ గైకొంటి
నేయెడ ప్రభమాని - యినుఁ డెట్టులుండు !
పాయునే సత్కీర్తి - పావన చరిత
నీయంతి నేనెట్టు - లెడ వాసి యుందు ! "

—: శ్రీరాముఁడు సీతను పరిగ్రహించుట ; శివుఁడు శ్రీరాముని పట్టాభిషి క్తుఁడవు గమ్మని చెప్పుట : -

అని వేలుపుల కెల్ల - నంజలి చేసి 11270
జనకజ కరము హ - స్తమునఁ గీలించి
చెంగట నునిచిన - శ్రీరాము సర్వ
మంగళా రమణుఁడు - మది మెచ్చి పలికె.
“అజుని మాటల కేమి - యదిమాళి దాపి
యజరులకును మాకు - నాశాస్యమైన
యట్టికార్యము సేయు - మవనిభారంబు
మట్టు కట్టితి వస - మాన శౌర్యమున
రావణుఁ దునుము కారణముగా మీర
లీవఱకును జాల - యిడుమలఁ గుంది
వైకుంఠముకు నేఁగ - వచ్చునే ? సీతఁ 11280
జేకొని మరల మీ - సీమకుఁ బోయి
యడియాసనున్న మీ- యనుజులఁ దల్లి
యడలు వారించి ప - ట్టాభి షేకంబుఁ
జేకొని రాజ్యంబుఁ - జేసి భోగములు



గైకొని బంధువ - ర్గము నాదరించి
హయమేధ ముఖ్య మ - హాధ్వర క్రియలు
నియమముల్ దప్పక - నెఱవేర్చి దాన
ధరణీసురల నెల్లఁ - దనియించి ధర్మ
పరత నేకాదశా - బ్దసహస్రమవని
బాలించి తరువాత - పద్మజుమాట 11290
నాలింపు మీవు పూ - ర్ణావతారుఁడవు
వాఁడె మీతండ్రి ది - వ్యవిమాన మెక్కి
నేఁడిదే మా వెంట - నినుఁజూడవచ్చె
సీతయు నీవును - సేవింపుఁ" డనినఁ

-: దశరథ సందర్శనము :-

బ్రీతితోఁ దమ్ముఁడు - ప్రియయునుఁ దాను
నావిమానముఁ జేరి - సాష్టాంగ మెఱగి
లేవకున్నెడఁ దానె - లేచి భూవిభుఁడు
కొడుకులఁ గోడలిఁ - గూడంగ నెత్తి
తడవు కౌఁగిటఁ జేర్చి - తన తొడలందు
నాసీనులుగఁ జేసి - యంగముల్ నిమిరి 11300
యాసుతుఁజూచి మ - హారాజు పలికె.

-: దశరథుఁడు, శ్రీరామునితో, సీతతో, లక్ష్మణునితో వేఱ్వేఱుగా మాటలాడి శ్రీరాముని పట్టాభిషేకము
                          చేసికొమ్మని యంతర్హితుండగుట :-

శ్రీరామ ! నిన్ను బా - సి భరింప లేక
యారటింపుచును దే - హముత్యజించితిని.

ఈమునుల్ దివిజులు - నింద్రుండు నిన్ను
ప్రేమతోడ బహూక - రింపుదు రెపుడు
నమరావతీ పురి - నఖల సౌఖ్యములు
నమరికయై యుండ - వాత్మలోఁ దనకు
నిన్ను కన్నులఁ జూచి - నెమ్మదిలోన
నున్నత సౌఖ్యంబు - లొందితి నిపుడు.
ఆకైకమాట చే - నడవులకనిచి 11310
నీకిన్ని యవధులు - నేనె చేసితిని
తనకు నీవంటి నం - దనుఁడు గల్గుటను
జననుత స్వర్గాది - సౌఖ్యముల్ గలిగె
నిందాక నజుఁడాన - తీయఁగఁ జెవుల
విందుగా నీవు గో - విందుఁడ వగుట
వింటి సత్యము మన - వీటికి నరిగి
కంటు లేనట్టి మీ - కౌసల్య జూచి
మాయన్న ! కైకేయి - మాటలు మఱచి
నీయందు ననుర క్తి - నిలిపిన భరతు
రక్షించి సకలసా - మ్రాజ్యంబు నేలి 11320
దక్షత నశ్వమే – ధంబులు చేసి
మఱిపొమ్ము వైకుంఠ - మందిరమ్మునకు
ధర నిల్పు మాచంద్ర - తారక ఖ్యాతి
యనుచుఁ బల్మఱు మంగ - ళాశాసనములు
మనసారఁ జేసి ల - క్ష్ముణుఁజూచి పలికె.
"మాయన్న ! సౌమిత్రి ! - మము నెడవాసి
మీయన్న విపినభూ - మిని జరియింప
గనుఱెప్ప కైవడి - కాచి రేఁబగలు



వనమూలఫలముల - వలనఁ బోషించి
కాచిన ఫల మెల్లఁ - గని యదిమీఁద 11330
నాచంద్రతారార్క - మగు శోభనముల
నినుఁజూచి నామది - నెగులెల్ల దీఱె
గనుఁగొంటిఁ బుణ్యలో - క సుఖంబులెల్ల
నిటమీఁద శ్రీరాము - నెప్పటియట్లఁ
బటుభ క్తి గొలువుము భద్రమయ్యెడును”
అని చాల దీవించి - యవనిజఁ గాంచి
తనమది యుప్పొంగ - దశరథుండనియె,
"పరమకళ్యా ణి ! . పతిసేవ చేసి
యరలేని సౌఖ్యంబు - లందఁ జాలుదువు
నిన్ను మించఁగఁ బల్కి - నీపతి నీకు 11340
వన్నెయు వాసియు - వన్నెయు వెట్టె
నతివ ! నీకొఱకు బ్ర - హ్మాది దేవతలు
జతఁగూడి వచ్చిరి - చాలదే యింత !
పతియ దైవంబని - భావించు నీదు
కతనఁ బావనమయ్యె - కమలాప్తకులము
రామునితో మన - రాజధానికిని
సేమంబుతోఁ జేరి - సిరులొందు మీవు
నీకుఁ దెల్పెడిదేమి - నిను నెంచివేఱె
వాకొన మతి పతి - వ్రతలున్న వారె?
అమ్మ ! నెమ్మది నుండు” - మని రాముఁ బిలిచి 11350
యామానవతిని తా - నపుడొప్పగించి
"శ్రీరామ ! నామాట - చెల్లించి మితముఁ
దీఱుచుకొంటివి - తిరుగ నా మనవి



గైకొని పట్టంబుఁ - గట్టుకొ మ్మిఫుడె
సాకేతనగరికిఁ - జనుఁడు మీర" నుచు
మువ్వురి దీవించి - మున్నట్ల దివికిఁ
బువ్వుల తేరి పైఁ - బోయెనవ్విభుఁడు

-: శ్రీరాముఁ డింద్రుని వరముచే వానరులను బ్రదికించుట :-

ఈరీతి దశరథుం - డేఁగిన మఱల
స్వారాజు శ్రీరామ - చంద్రునిఁ జూచి
“ ఏము సన్నిధి చేసి - యేమైన మీకుఁ 11360
గామితార్థము లీకఁ - గడకుఁ బోరాదు
నడిగిన నిచ్చెద - నడుగుమీ"వనిన
కడుఁ బ్రీతిఁ బొంది రా - ఘవుఁడు తాననియె.
"అయ్య ! నీవరమిచ్చు - నది నిక్క మేని
కయ్యంబులో నన్నుఁ - గాచి నాకొఱకు
నెందఱు ప్రాణంబు - లిచ్చిరి వీరి
నందఱ బ్రదికించి -యలుగులు నాఁటు
గాయముల్ మానిచి - కపులకు మొదటి
చాయల బలపుష్టి - సంపదలొసఁగి
యందటి వారిండ్ల - కనిచి భార్యలను 11370
నందనులను గూడి - నగచరులున్న
నెలవుల వనముల - నిండారఁ గాచి
ఫలియింప వీరున్న - పర్వతంబులను
జలసస్యసామగ్రి - చాలంగఁ గల్గఁ
దలఁచి కట్టడ చేసి - తము బంపు"డనిన

నమరేంద్రుఁ డది మెచ్చి - యడిగిన వరము
నమరాగ సేతుమ - ధ్యావని కెల్లఁ
గలుఁగు గావుతను నా - కట్టడఁ దప్ప
దిల నెన్నటి నని - యిచ్చి పోవుటయు
బ్రహ్మాది దివిజులు - పరమహర్షమున 11380
బ్రహ్మణ్యుఁడగు రఘు - ప్రవరునిఁ జూచి
"రామ! క్రమ్మఱ వాన - రశ్రేణి వారి
సీమల కనుపుము - సీతతోఁ గూడి
వీరులు దొరలును - వెంటరాఁ బురము
చేరుము పట్టాభి - షి క్తుఁడ వగుచుఁ
బోయెద” మని వారు - పోయిన యంత

-: వానరులు సంతోషముతో తమ తమ నెలవుల కేగుట - శ్రీరామాదులు సుఖముగనుండుట :--

నాయగచర వీరు - లమరేంద్రు కరుణ
నిదుర లేచిన రీతి - నిజ శక్తి శౌర్య
పదవులచే సేతు - బంధాది యందు
నెటులుండి రటులనే - హెచ్చి యుప్పొంగి 11390
పుటములు దాఁటుచుఁ - బొలిసిన వెనుక
నడచిన కార్యమె - న్నగ లేక లంక
కడఁ జూడ్కు లిడుచు సం - గ్రామ యత్నముల
నున్న వానరచమూ - యోధుల నెల్ల
మన్నించి నాఁటి కా - మర్కటో త్తములు
పాళెంబు నెప్పటి - పట్టుల డించి
తా లక్ష్మణుండు సీ - తయుఁ జేరి కొలువ



రామచంద్రుఁడు నాఁటి - రాత్రి సంపూర్ణ
సోమునిగతిఁ జాల - సుఖనిద్ర పొందె.

-: శ్రీరాముఁడు విభీషణనితో తా నయోధ్యకు వెడలుటకుఁ బుష్పక విమానముఁ దెచ్చుట కాజ్ఞాపించుట :--

ఆమఱునాఁడు లం - కాధినాయకుఁడు 11400
రామలతోఁ గూడ - రామునికడకు
వచ్చి"యోస్వామి ! ది - వ్య విభూషణములు
పచ్చి కస్తూరి మొదల్ - పరిమళంబులును
వలయు కడాని దు - వ్వలువలుఁ దెచ్చి
చెలువలు మీకొల్వు - సింగారమునకుఁ
గాచియున్నారదె - గైకొని లంకఁ
జూచి వత్తురు గాని - సోదరుఁ గూడి
యవధరింపుఁ డటన్న - నవనిజా ప్రియుఁడు
నవు మోముతోడ దా - నవనాథుఁ బలికె.
"మాకుఁ దెచ్చిన యట్టి - మణి భూషణంబు 11410
లీ కట్టు కోకలు - నితర వస్తువులు
నీ రవితనయున - కిమ్ము సుగ్రీవుఁ
జేర నీవేమి యి - చ్చిన నవి మాకు
నిచ్చినంతటి కన్న - నిను మడిఁ బ్రీతి
హెచ్చి యుండును మాకు - హితుఁడవు గాన ”
అనినఁ దెచ్చిన సొమ్ము - లన్నియు భాను
తనయున కర్పించి - తనుఁ బ్రీతి సేయ
"ఓయి ! విభీషణ ! - యుండరాదిచట

మాయయోధ్యకుఁ బోయి - మారాక కెదురు
చూచు మాభరతునిఁ - జూచినం గాని 11420
మా చింతలన్నియు - మదిఁ బాసిపోవు
నెన్నడు చేరుదు - నిదియె మార్గంబె !
ఎన్ని యామడ గల - దిచటి కయోధ్య
యంపుము పోయెద - మను రఘుపతికి
సంపూర్ణమతి విభీ - షణుఁడు తాఁబలికె.
దేవ ! యిచ్చట మీరు - దేవేరితోడ
యీవేళ వసియించి - యేమెల్లఁ గొలువ
వసియింప మీకు సే - వలు సేయఁ జిత్త
మెస పోయుచున్నది - యే మిమ్ము నమ్మి
కాచిన భక్తుఁడఁ - గాన యిట్లంటి 11430
మీచిత్త మీమాట - మేకొనకున్న
మాయన్న ధనదుని - మణిపుష్పకంబు
మాయింట నున్నది - మాట మాత్రమున
నీదినంబున పగ - లింటిలో మిమ్ము
నో దేవ ! మీకోస - లోర్విఁ జేర్చెదను !
అభిమతంబెయ్యది ? " - యనిన రాఘవుఁడు
సభయాత్ముఁడగు విభీ - షణున కిట్లనియె.
"భరతునిఁ దల్లుల - బంధుల హితుల
దొరలను గుహుని భృ - త్యుల నమాత్యులను
నెప్పు డెప్పుడు చూతు - నేనను తమక 11440
ముప్పతిల్లుచు నున్న - దుల్లంబులోనఁ
గావలసిన యట్టి - కార్యంబులైన
యావల నిచ్చోట - నాలస్య మేల?

చిత్రకూటాద్రిపై - సీతయు నీ సు
మిత్రా తనూజుండు - మేమున్నయపుడు
భరతుఁడువచ్చి సం - భావించి మమ్ము
మఱల రమ్మనుచు స - మ్మతపడఁ జెప్పె
నాయన కిచ్చిన - యట్టి నమ్మికలు
మాయూరు చేరు నే - మమునకు మితియుఁ
ద్రోయరానివి గాని - త్రోచి నీమాట 11450
సేయమైతిమి వూన్కి - చెల్లింపు మీవు
తప్పు సైరింపుము - ధనదువిమాన
మిప్పుడు 'దెప్పింపు - మిదినీకు మనవి ! ”

-; శ్రీరామునాజ్ఞ ప్రకారము విభీషణుఁడు పుష్పక విమానము శ్రీరామునెదుటఁ బెట్టుట :-

అనిన విభీషణుఁ - డాత్మలో నితర
మననముల్ చాలించి - మయనిర్మితంబు
కామగమనమును - కల్పకప్రసవ
రామణీయకమును - రావణ కార్య
నిర్వాహకంబునౌ - నిజవిమానంబు
నుర్విజారమణుని - యొద్ద నుంచుటయు
నాపుష్పకముఁ జూచి - యఖిల వానరులఁ 11460
జూపి విభీషణుఁ - జూచి యిట్లనియె.

-: శ్రీరాముఁడు వానరులకు బహుమతుల నిప్పించి తానయోధ్య కేఁగెదనని చెప్పుట :-

"వీరలందఱు నిందు - విడిచి నా కొఱకు
వారిధిఁ గట్టి రా - వణు సంగరమున

పనులకు వచ్చిన - బలవంతు లంద
ఱును గాన పేరు పే -రును వేఱు వేఱఁ
గట్టువర్గంబులుఁ - గంఠమాలికలు
గట్టురాకడియముల్ - కపురభాగములు
సోడులుముట్టుక - స్తురి కుంకుమముల
తోడ నిప్పింపు - మిందుకు తామసింప !"
కన విభీషణుఁడు రా - మానుజ్ఞ చేత 11470
వనచర ప్రభులకు - వహులేరు పఱచి
నగరి సంప్రతి కర - ణంబుల చేత
వగలు మూఁటికి నఠ్ఠ- వణ చదువంగఁ
గపుల సుగ్రీవుని - కవిల వెంబడిని
తపనాన్వయుని సన్ని - ధానంబు నందు
బహుమానములు సేయఁ - బరికించి వారి
విహితవైఖరి రఘు - వీరశేఖరుడు
సుగ్రీవముఖ కపి - స్తోమంబు దాన
వాగ్రణిఁ బిలిపించి - నప్పుడిట్లనియె.
"మీరలందఱు నాని - మొత్తంబుఁ గాఁగ 11480
నీరాక్షసులతోడ - నిన్నాళ్లు పోరి
మాకార్యమిడేర్చి - మహనీయ కీర్తిఁ
గైకొంటి రిండ్లకుఁ - గదలి పొండిపుడు.
ఏ నయోధ్యకును బో - యెద ”నన్న వారు
దీనులై రాఘవా - ధిపున కిట్లనిరి.

-- : వానరులు శ్రీరామునితో తామును నయోధ్యకు వచ్చెదమని చెప్పుట :-

" స్వామి! మమ్మెల్ల - నిచ్చట నుండి మీర
లేమిటి కనిచెద - రెక్కడ మిమ్ము

డించి యందఱ మేమి - టికిఁబోదు మనుస
రించి యయోధ్యాపు - రీలలామంబుఁ
గనుఁగొని కౌసల్యఁ - గాంచి నీతమ్ము 11490
లను జూచి హితులనె - ల్లను విలోకించి
పట్టాభిషేక వై - భవము వీక్షించి
పట్ట భద్రుండ వై - భద్రపీఠమున
నొప్పు సీతాసహా - యుని నిన్నుఁ జూచి
నప్పటి సంతోష - మాత్మల నుంచి
మఱికాని పోమ ”న్న - మాటలు మదికి

- :శ్రీరాముఁ డందుల కంగీకరించి సీతాలక్ష్మణ వానరసహితుఁడై యయోధ్యాపురి కరుగుట :-

సరిపోవుటయు విభీ - షణు వారివారి
భానుజాంగదనల - ప్రముఖ వానరులఁ
దానియ్యకొని సుమి - త్రా పుత్రుతోడ
జనకజతోడ పు - ష్పక రాజమునకు 11500
నినుమారు వలవచ్చి - యెక్కిన యంత
లంకలో దనుజు లె - ల్లనుఁ దనుఁగొల్వ
లంకేశుఁ డెక్కి యు - ల్లాసియై యుండ
నినసూనుఁ డగచరు - లెల్లను తన్ను
గని కొలువఁగ వుష్ప - కము మీఁద నెక్కె
వానర దానవ - వ్రాతమంటికిఁ
దానుండఁ జోటిచ్చి - తపనీయ దేవ
యానంబు రివ్వున - నాకాశమునకు

భానురోచుల మించి - పాఱంగ నెగసె.
అంచలఁ బూన్చిన - యాపువ్వుఁదేరు 11510
మించె రాఘవుఁడు నే - మించు మార్గమున
నుత్తరాయణ వేళ - నుగ్రాంశు తేరి
పొత్తుగూడుక రయం - బునఁ బోవునపుడు
జానకీముఖ సార - సము విలోకించి
భానుతేజుఁడు రఘు - ప్రవరుఁ డిట్లనియె.


-: శ్రీరాముఁడు సీతకు పూర్వవృత్తాంతముల నెఱింగించుట :-

" అలివేణి ! కంటివే - యల్లదే లంక
యిలప్రోలు సురపురం - బిదియన మించి
యిది కపులను దైత్యు - లెనసి పోరాడు
కదనంబు చోటిది - కనుఁగొమ్ము రమణి !
ఇచ్చోట రావణుం - డీల్గిన తావు 11520
వచ్చి మండోదరి - వాపోయె నతివ !
కూలెఁ నీరణభూమి - గుంభకర్ణుండు
తూలె నిచ్చట ప్రహ - స్తుఁడు చంచలాక్షి !
హనుమంతుచేత ధూ - మ్రాక్షుఁడిచ్చోట
యనిలోనఁ బొలిసె శీ - తాంశు బింబాస్య !
తునిసె విద్యున్మాలి - దురముఁ గావించి
మన సుషేణుని చేత - మానినీతిలక !
దురములో నింద్ర - జిత్తుని వధియించె

శరపరంపరల ల - క్ష్మణుఁ డలి వేణి !
అంగన ! యిచ్చోట - హతుఁడయ్యె వికటుఁ 11530
టంగద భీమబా - హా శక్తి చేత
నిచట నరాంతకుఁ - డిచట నికుంభుఁ
డిచట కుంభుఁడు మత్తుఁ - డిచట కుంభుండు
నిచ్చట నతికాయుఁ - డిచ్చట త్రిశిరుఁ
డిచ్చో మహాపార్శ్వుం - డిట మహోదరుఁడు
అత్రాసుఁడైన యూ - పాక్షుఁడు యజ్ఞ
శత్రు సప్తఘ్నులు - సమసి రిచ్చోట
సూర్య శత్రుండును - శోణి తాక్షుండు
ధైర్యవంతుఁడు వజ్ర - దంష్ట్రుం డిచ్చోట
నడఁగి రిచ్చట విరూ - పాక్షుండు గూలె 11540
మడిసె నిచ్చటఁ బోరి - మకరాక్షు డబల !
జలరాశి దాఁటి యి - చ్చట నేము పాళె
ములు డిగి యున్న యి - మ్ము ధరాతనూజ!
సీత ! వీక్షింపుము - సేతువు కపుల
చేతఁ గట్టించితి - సింధువు మీఁద
నిదియె మైనాకాద్రి - యిదిపయోరాశి
ఇది నాశరాగ్నిచే - నింకిన చోటు
జలధి కట్టకమున్న - సకలవనాట
బలముతో యేనున్న - పాళె మీచోటు
తరుణి ! యీజలధి యు - త్తరపు గట్టునను 11550
స్థిరమతితో మహా - దేవుఁ డైనట్టి
జలరాశి ననువచ్చి - సంధించినట్టి

నెలవిది రావణు - నికిఁ గాక వచ్చి
శరణు జొచ్చెను విభీ - షణుఁ డిందు నన్ను
గిరిచరుల్ మెలఁగు కి - ష్కింధ యీపురము
ఇది వాలిఁ జంపిన - యిరవు సుగ్రీవు
నెదనుఁ బట్టముఁ గట్టి - యిచట నిల్పితిని ”
అను నంత జానకి - ప్రాణేశుఁ జూచి

- : మార్గ మధ్యమున సీతకోరిక పైని సకలవానరుల భార్యలను సుగ్రీవుఁడు తీసికొని వచ్చుట : -

అనఘాత్మ ! మనమయో - ధ్యకుఁ బోవునపుడు
ఒంటియే రా నేల - యుగ్రాంశు తనయు 11560
నింటిలో కుల కాంత - లేనును గూడి
రావలెఁ బిలిపింప - రాదె?" యనంగ
నావార్త విని రాముఁ - డాకాశ వీథి
తన విమానము నిల్పి - తరణి నందనుని
గనుఁగొని జానకీ - కాంతుఁ డిట్లనియె
“నీవు నీవారల - నిజ గేహమునకు
నీ వేళ నరిగి మీ - యింతుల నెల్ల
కైసేసి సకుటుంబ - కములుగా వచ్చి
యీసీత చెంగట - నింతుల నుంచి
మనమయోధ్యకుఁ బోవ - మనలనుఁ జూచు 11570
జనులకు సంతోష - జనకమై యుండు
జనకజ కిదియె ము - చ్చట మీరు వోయి

వనితల తోడి తే - వలయు నటన్న
వారు వారలు నిజా - వాసముల్ చేరి
తారారుమాముఖ్య - తరుణులఁ గూడి
యందఱు నేతేర - హనుమంతుఁ డొక్క
డందులో యిల్లని - యాలని లేక
తన బ్రహ్మచర్య వ్ర - తం బేరు పఱచె.
వనితలతోఁ గూడి - వనచరు లెల్ల
వచ్చి దివ్యవిమాన - వరముపైసీత 11580
యిచ్చిన చోటుల - నింతులు గొల్వఁ
గదిసి వానరులు రా - ఘవు నోలగింపఁ
గదలె నవ్వలఁ బుష్ప - కం బుత్తరముగ
సీత నెమ్మోము వీ - క్షించి రాఘువుఁడు
భూతలంబునను చూ - పులు నిల్పి పలికె

-: శ్రీరాముఁడు తిరిగి వూర్వవృత్తాంతములఁ దెలుపుట :-

అది ఋష్యమూకాద్రి- యచట సుగ్రీవుఁ
జెదరక చేపట్టి - చెలిమి సేసితిని
వాలిఁ జంపెదనని - వనచరేంద్రునకుఁ
జాల నమ్మికను నొ - సంగితి నిచట
అల్లదె పంపా మ - హా సరోవరము 11590
పల్లవాధర ! నిన్నుఁ - బాసి యేనిచట
నిదుర కంటికి లేక - నెగులుతో నిచటి
పొదలు వెంటఁ జరించి - పొక్కెడు చోటు

ఇది శబర్యాశ్రమం - బిచట కబంధుఁ
డెదిరించి పొలిసె దా - నిగురాకు బోణి !
నిది నీకునై దాన - వేంద్రుని తోడ
నెదిరి జటాయువు - మృతినొందుచోటు
నాతోడ ఖరదూష - ణ త్రిశీర్షాది
దైతేయు లెదిరించి - ధరఁగూలు చోటు
మానిని ! యల్లది - మనపర్ణశాల 11600
జానకి ! కనుము పం - చవటీ స్థలంబు
తరుణి ! వీక్షింపు గో - దావరీ తటిని
చెఱవట్టె నిను నింద్ర - జిద్గురుం డిచట
నిది సుతీక్ష్ణాశ్రమం - బిది శరభంగ
సదనంబు ఋషుల యా - శ్రమము లన్నియును
నిది యత్రి యాశ్రమం - బిది యనసూయ
ముదముతో నీకు సొ - మ్ము లొసంగె నాఁడు
యిదె విరాధుఁ డెదుర్చు - నిరవగు సుమ్ము
మదిరాక్షి ! భరతుండు - మఱిలి రమ్మనుచు
మనలఁ బ్రార్థించు ర - మ్య ప్రదేశంబు 11610
కొనలు మించిన చిత్ర - కూటాచలంబు
నిది భరద్వాజ ము - నీశ్వరా రామ
మిది యమరాపగ - యిదిసుమ్ము యమున
మిది సరయూనది - యిది శృంగి బేర
మిది యేటి కిరువంక - యిదె సాలె తోపు
అల్లదె మన యయో - ధ్యాపురం బీవు
పల్లవాధర ! మ్రొక్కి- భావింపు మిపుడు "

-: అయోధ్యావుర సందర్శనము :-

అనిన విభీషణుఁ - డర్క జాదులును
మనముల నానంద - మగ్నులై చూచి
యమరావతీపురం - బలకాపురంబు 11620
నమరునె యీడుజో - డని యెన్ని రేని ? "

--: భరద్వాజు నాశ్రమంబున శ్రీరాముఁడు దిగి యాతనివలన భరతుని వృత్తాంతము నెఱుంగుట :-

అని పొగడుచునుండ - నలభరద్వాజ
మునిచంద్రు నాశ్రమం - బునకు రాఘవుఁడు
తన విమానము డించి - తా నమ్మునీంద్రుఁ
గని భక్తితో నమ - స్కారంబు సేయఁ
గాంచి యమ్మునిరాజ - కంఠీరవుండు
మంచి దీవనలిచ్చి - మన్నించుటయును.
“భరతుండు సాకేత - పట్టణంబునను
పరిణామమున ప్రజ - పాలనక్రియలు
మఱవక యున్నాఁడె ? - మాతల్లి ప్రొద్దు 11630
జరపుచున్నదె కవు - సల్య యానగరి ?
అందరికిని సేమ - మా ! నాప్రతిజ్ఞ
చిందు గానీక వ - చ్చితి నీదినంబు
పంచమి నేఁటితో - పదునాలుగేండ్లు
నెంచిన సరియయ్యె - నేనిల్లు వెడలి
భరతుఁ డీనెల శుక్ల - పక్ష పంచమిని
మఱచిపోవక మీరు - మఱలకయున్న

చెప్పెను దాతెంపు - సేయుదు ననుచు
దప్పక యే నా మి - తంబున కతనఁ
గనుఁగొను వాఁడనై - కమనీయ పుణ్య 11640
ఘనులైన మీపాద - కమలముల్ చూచి
ఖేదముల్ మాని సా - కేతంబు చేర
వచ్చితి ననుమతీ - వలయును పోయి
వచ్చెద"నన భర - ద్వాజ సంయమియుఁ
దన మది రాము స - త్యపరాక్రమాది
వినుత చారిత్రముల్ - వేమాఱుఁ జొగడి
రాముని వదనసా - రసము నీక్షించి
యామునిచంద్రుఁ డి - ట్లని యానతిచ్చె.
భరతుని మఱలఁగఁ - బనిచితిఁ గానఁ 11650
బురములో దానుండఁ - బోవగఁదలఁచు
మీపాదుకలమీఁద - మేదినీభరణ భూప
చిహ్నము లెల్లఁ - బూనించి యుంచి
జడలు దాలిచి చీర - శాటికల్ గట్టి
యెడవక మీరాక - కెదురులు చూచి
తెగువ నున్నాఁడు నం - దిగ్రామమునను
మగుడితి రతని నే - మంబు చెల్లించి
యతనియాజ్ఞను రాజ్య - మతిశయ శ్రీల
జతకట్టు కై వడిఁ - జాల మీఱెడును.

-: భరద్వాజుఁడు దివ్యదృష్టి వలన నెఱిఁగిన వృత్తాంతముఁ దెల్సి శ్రీరామునిఁ బ్రశంసించి వరమడుగుమని కోరుట:-

దండకావని కేఁగు - తరి నవ్విరాధు 11660

ఖండించి శరభంగుఁ - గాంచి సుతీక్ష
మునిఁ జూచి కుంభసం - భూతునిఁ గొలిచి
వనులఁ గ్రుమ్మరి పంచ - వటి నిల్లు గట్టి
ఖరదూషణాదుల - ఖండించి దైత్య
వరుఁడంప మారీచు - వచ్చినఁ దునిమి
భూమిజ మీరు గో - ల్పోయిన దుఃఖ
"మేమని పల్కుదు - నెట్లు వేగితిరొ ?
అన్నదమ్ములు మీరు - నాపదలొంది
మిన్నెల్ల విఱిగి మీ - మీఁదఁ బడ్డట్లు
పడరాని వెతలనుఁ - బడి జటాయువును 11670
పొడఁగని యాసీత - పోఁబడి గాంచి
చపలభావు కబంధుఁ - జంపి యాదనుజు
నుపదేశమున దక్షి -ణోన్ముఖులగుచుఁ
బోయి యాశబరిచేఁ - బూజలు గాంచి
యాయింతి ఋష్యమూ - కాద్రికిఁ బనుప
నచట పంపానది - హనుమంతుఁ గాంచి
యచలిత ప్రీతి మై - నాయన వలన
సవితృకుమారుతో - సఖ్యంబుఁ జేసి
దివిజేంద్రుసుతుని సా - ధించి కిష్కింధ
నినసూతి కర్పించి - యెల్ల వానరులు 11680
జనకజ వెదకి తా - సామీరి వలన
నున్నచో టెఱిఁగి ప - యోధి బంధించి
యన్నిశాచర నాథు - ననిఁ దెగటార్చి
సీతతో మఱలి వ - చ్చిన నీతెఱంగు
చేతో విలోకన - స్థితి నెఱింగితిని.

అన్న ! నీ వెంతటి - కవధికోర్చితివి !
నన్ను నేమఱక మ - నంబులో నుంచి
వచ్చితిగాన దే -వతలెల్ల మెచ్చి
యిచ్చిన వరముల - నేమైన గడవఁ
గలిగిన యేనిత్తుఁ - గైకొను మడిగి 11690
వలసినయవి"యన్న - పరతపోనిధిని
యాభరద్వాజుని - నంజలితోడ
నాభరతాగ్రజుఁ - డప్పుడిట్లనియె.

 -: శ్రీరాముఁడు వానరులకు వనములోఁ గావలసిన ఫలహారముల నొసగుమనుట - తానాశ్రమమున విశ్రమించుట :-

"అయ్య ! యీక పులయో - ధ్యాపురంబునకు
నెయ్యంబుతో వచ్చి - నీవార లెల్ల
చూతు మేమనుచు ని - చ్చోవచ్చినారు
నాతులతోఁ గూడి - నాదువెంబడిని
వారికిఁ దఱగని - వనముల ఫలము
లారోగ్యకరమైన - యంబువుల్ గలుగ
మాయూరి పొలిమేర - మహినెల్లఁ గలుగఁ 11700
జేయుము నీ”వన్న - శ్రీరాముఁజూచి
“నీవన్నయట్ల మా - నెలవున నుండి
కావలసిన ఫలా - గములు తోఁపులను
నాయయోధ్యకును మూఁ - డామడచుట్టు
నాయాయి వేళల - నడిగిన యట్లు
వనచరులకుఁ గల్గ - వర మొసంగితిని
చనుము రేపటికి ని - చ్చట నేఁడు నిలిచి
యేమిచ్చు నర్చాదు - లిచ్చగింపుచును

మామాటఁ ద్రోయక - మన్నింపుమనిన
నందుకు రఘువీరుఁ - డౌఁగాక యనుచుఁ 11710
గందమూల ఫలాది - కమ్ములఁ దమ్ముఁ
దనియించు మౌనిబృం - దారక స్వామి
యనుమతిఁ గైకొని - యనుజుఁడు వినఁగ
రామచంద్రుఁడు సమీ - రకుమారుఁ బిలిచి

        -: శ్రీరాముఁడు హనుమంతునితో తామువచ్చిన వృత్తాంతము గుహభరతుల కెఱింగించి భరతుని
                                 మన సెటులున్నదనియుఁ గనుఁగొనిరమ్మని చెప్పుట :-

“ఏము వచ్చిన రాక - యిప్పుడే పోయి
శృంగి బేరమున వ - సించిన గుహుని
యంగ ముప్పొంగఁ ద - థ్యముగాఁగఁ బలికి
యాయన చూపిన - యట్టి మార్గమున
మా యయోధ్యకుఁ బోయి - మావారిఁ జూచి
తెరువున నున్న నం - దిగ్రామ సీమ 11720
భరతునిఁ గనుఁగొని - పనిచితి మనుచు
మా పేరు నుడివి తా - మమ్ము రమ్మనుట
యాపుణ్యనిధిని పొ - మ్మని యేము వనిచి
చిత్రకూటము విడి - చిన యది మొదలు
ధాత్రిజఁ గోల్పోయి - దశకంఠుఁ దునిమి
మఱలి భారద్వాజ - మౌనీంద్రు చెంత
ధరణిజతో సుమి - త్రా పుత్రుతోడ
నేను వచ్చిన తెఱం - గింతయుఁ జెప్పి
యానన వికృతియు - నతని భావంబు
నింగితంబు నెఱింగి - యిప్పుడే రమ్ము 11730

వెంగలితన మౌను - వినిపింపకున్న
తనతండ్రి యిచ్చిన ధర - యేలువాఁడు
తనకల్మి తెకతేర - దాయల కిచ్చి
యవివేకియైన తా - నన్యుఁడై యుండ
భువి నొడఁబడఁ - డేను పోరాదు పదరి
తల్లిని సకల బాం - ధవులను మనసు
చల్లఁగా జూచి తాఁ - జనుదెంచి నపుడ
యాడిన మాటలా - యనకుఁ జెల్లించి
వేడుక దీఱ మా - వీడెల్లఁ జూచి
యావల నెందేని - యరుగఁ దలంచి 11740
యవకాశమునికి ని - న్నటకుఁ బొమ్మంటి
వేఱె యొక్కనిఁ బంప - విధముగా దీవు
నేరుతు వితరుల - నిలుకడల్ దెలియ .
మారాక సహియించు - మాత్రంబు లేని
దారి యాభరతునిఁ - దలఁపులో నున్న
నెవ్వరు మా కేల ? - ఎప్పుడు నిన్ను
దవ్వుల జూచినం - తనె చేయిచూప
వలసినయెడకు ది - వ్య విమానమెక్కి
తొలగిపోదుము భర - తునికి మేలెంచి
పోయి రమ్మ"నిన య - ప్పుడు శృంగిబేర 11750

-:హనుమంతుఁడు గుహునితో శ్రీరాముని రాక నెఱింగించుట :-

మా యంజనాసూనుఁ - డల్లనఁ జేరి
వానరత్వంబు వో - వదలి యావేళ
మానవుఁడై పవ - మాన బాలకుఁడు

గుహునిఁ గన్గొని “ రఘు - కుల పురందరుఁడు,
మహితనూజాత ల - క్ష్మణుఁడునుఁ దాను
వచ్చి యిప్పుడు భర - ద్వాజాశ్రమమున
విచ్చేసి యున్నారు - వేఱు లేనట్టి
తెలివి నీవని - తమ దీమంబు నన్ను
దెలివిడి సేయఁ బు - త్తించి నార"నిన
నాలింగనము చేసి - యానంద వార్ధిఁ 11760
దేలి పేదకు పెన్ని - ధి యొసంగినట్లు
“అన్న ! రాముని రాక - యానతిచ్చితివి
విన్ననుప్పొంగె నా - వీనులుల్లమును
నెదురుగా నరిగెద - నిప్పుడ యనఁగ
నది విని హనుమంతుఁ - డాకాశమునకు
రయము మీఱగ నేఁగి - రామతీర్థంబు
పయిచార నేఁగుచు - భయదమైనట్టి
సాలవనంబును - జానపదములు
వాలుకి నదియు నా - వల గోమతియును
కని యయోధ్యకు రెండు - గడియల నేల 11770
వనరాశి తనచుట్టు - వర్ణనీయముగ
నెసఁగు నందిగ్రామ - మీక్షించి యొక్క
దెసవ్రాలి పావని - తేఱి చూచుటయు

-: నందిగ్రామమున మునివృత్తిలోనున్న భరతుని హనుమంతుఁడు సందర్శించుట :--

జడలు కృష్ణాజిన - శాటియుఁ దాల్చి
యొడలు శ్రీరాము వి - యోగంబు చేత
మిగులఁ గృశింపఁగ - మేదినిమీఁద

వగలతో "నెప్పుడు వచ్చు - మాయన్న
రాఁడాయె నేఁటికి - రాకుండు నేఁడె
రాఁడేని తనదు వా - ర్త వినంగలండు ! ”
అని కందమూల ప - ర్ణాశనుఁ డగుటఁ 11780
దనువు డయ్యంగ గా - త్రము మైలవాఱ
బ్రహ్మర్షి తేజుఁడై - పాదుకాయుగము
బ్రహ్మాదికృతతపః - ఫల మాగమాంత
వాదరహస్యాది - వాస మాశ్రితుల
చేదోడు యోగుల - చేయూఁతకోల
ధార్మికులకు నెల్ల - దరిదాపు విబుధ
శర్మద మమర పూ - జన నిజాగ్రంబు
మున్నిడుకొని తాను - ముద్ర వర్షించి
యన్ని కార్యములుఁ ద - దర్పణంబులుగ
మెలఁగుచు దనచుట్టు - మెలఁగు నయోధ్య 11790
కులము బంధులుఁ గావి - కోకలు దాల్సి
తనయట్ల దేహ యా - త్రలు నడపింప
జనులు చింతిల వ్యాఘ్ర - చర్మంబు మీఁదఁ
గలధర్మ మెల్ల సా - కారమై వచ్చి
నెలకొన్నగతి నున్న - నిర్దోషు భరతుఁ
గాంచి కేల్మొగిచి డ - గ్గఱ జేరి యాతఁ
డుంచిన యెడనుండి - యొకమాట వలికె

-: హనుమంతుఁడు భరతునితో రామసందేశము నివేదించుట :-

“అనఘ ! యెవ్వఁడు దండ - కాటవి కేఁగ
ముని వేషధారియై - మునులతోఁ గలసి
నీవెంత రమ్మన్న - యెడ రాక నీకు 11800

నీవిచారము చేసి - యేఁగె నవ్వలికి
నట్టి మీయన్న ఘో - రాటవి నిల్లు
గట్టుక యొంటిగా - ఖరుని దూషణునిఁ
ద్రిశిరుని పెక్కు దై - తేయులఁ గినిసి
యశని కల్పములైన - యస్త్ర జాలములఁ
బోరిలో వధియించి - పొంచి రావణుఁడు
చోరకృత్యమున భూ - సుతఁగొని చనిన
మారీచుఁ జంపి ల - క్ష్మణుఁడును దాను
శ్రీరాముఁ డాసీతఁ - జెఱ
వోవు టెఱిఁగి
వగలతో వెదకుచు - వచ్చి సుగ్రీవు 11810
పగదీఱ వాలినిఁ - బడనేసి యతని
పట్టున సుగ్రీవు - పట్టంబు గట్టి
చుట్టును గల కపి - స్తోమంబు గూర్చి
సీత పోఁబడి విని - సింధువు గట్టి
దైతేయ విభుమీఁద - దండెత్తి విడియ
నసురేంద్రుఁ బుత్రమి - త్రాదుల తోడ
నసమాన శౌర్య స - హాయుఁ డై చంపి
యారావణుని తమ్ముఁ - డగు విభీషణుని
శ్రీరాముఁ డాలంకఁ - జేపట్ట నునిచి
దివ్యపుష్పకము పై - దివ్యులు మెచ్చ 11820
నవ్యయ జయశాలియై - సీతఁ గూడి
సౌమిత్రితోడఁ గీ - శ శ్రేణితోడ
రామచంద్రుఁడు జగ - ద్రక్షావినోది
వచ్చి భరద్వాజ - వనములో నిలిచి
యిచ్చటి కావార్త - యెఱిఁగింపు మనుచు

నను బంచె గాన వి - న్నపము చేసితిని
మనముల ఖేదముల్ - మాను మీరెల్లఁ
జూడ విభీషణ - సుగ్రీవ ముఖులఁ
గూడిన శ్రీరాముఁ - గువలయశ్యాము !”

-- : భరతుఁడు శ్రీరాముని వృత్తాంతము వినఁగనే యత్యానంద భరితుఁడై హనుమంతుని ప్రశంసించి, యాతని
                                                 వృత్తాంత మడుగుట :--

అనువార్త వీనుల - నానిన యంత 11830
తన మేను మఱచి యు - త్కట నిజనంద
పరవశతను భూమి - పై వ్రాలి తెలిసి
భరతుఁడు కౌఁగిటఁ - బావనిఁ గూర్చి
కన్నులందు ముదశ్రు - కణములు దొరుగ
సన్నుతింపుచును ప్ర - సన్న భావమునఁ
దమ్మునిఁ జూచి "సీ - తా మనోహరునిఁ
గ్రమ్మఱఁ జూచు భా - గ్యంబు చేసితిమి
నరులెవ్వరైన ప్రా - ణములతో నున్న
బొరయుచుందురు సుఖం - బులు కీడుఁ దొఱఁగి !
ఎంత వుణ్యాత్ముఁడో - యీతఁడీ పాటి 11840
సంతోష వార్త ప్ర- సంగించె?"ననుచు
"ఎవ్వఁడవన్న పే - రెయ్యది నీకు ?
నివ్వార్త దెచ్చితి - వెంత పుణ్యుఁడవు !
దివిజుఁడవో ధర్మ- దేవత వేమొ
అతని ఫుణ్యముల బ్రో - వైన మర్త్యుఁడవో !
పలుకవే సకలశో - భన హేతు కార్య

విలసనంబగు మాట - వింటి నీచేత !
అందులకేమిత్తు? - నావులు లక్ష
యందుపై దురగ స - హస్రంబు నుంచి
నిండు పాయంవు క - న్నెలఁ బదార్వురిని 11850
పండు పంటల నూట - పదిగ్రామములును
తనకు రాముఁడు ప్రమో-దంబుతోఁ జేయు
ఘనమైన యుంబళి - కను సగఁ బాలు
నిచ్చెద నీకు నా - హృదయంబులోని
ముచ్చటఁ దీఱ రా - ముని వార్త దెచ్చి
బ్రదికించితివి నీకుఁ - బ్రత్యుపకార
మది లేదు నీవాఁడ - నై యుండువాఁడ!
కలఁగంటి నొక్కొ? ని - క్కమొ ! యంచు నాదు
తలఁపు ఖేదమునఁ గొం - దలము నం దెడును
నమ్ముదు నే నీయ - నంత కళ్యాణ 11860
సమ్మతామృతవ చో - సంగతు ” లన్న
భరతు నాసన్నశు - భతరునిఁ గాంచి
శరనిధి గర్వభం - జన దాసుఁడనియె

-: హనుమంతుఁడు భరతునితోఁ తనయుదంతముఁ దెలిపి శ్రీరామ సమాగమగునని చెప్పుట :-

"వానరుఁడను జాతి - వాయువు తండ్రి
ఏను సుగ్రీవుని -హితుఁడ నా పేరు
హనుమంతుఁ డందు - రే నంజనా దేవి
తనయుఁడ రామదూ - తను తానెకాదె
వనధి లంఘించి యా - వసుమతీ తనయఁ

గని రామ ముద్దుటుం - గరమంది యిచ్చి
యామానవతి చేత - నౌఁదల నున్న 11870
యేమఱలఁగ నంది - యిలపట్టి మనుచు
నాయశోకారామ - మంతయుఁ బెఱికి
చాయ సేసుకరాక - చలపట్టి నిలిచి
యక్షాదులగు రాక్ష - సావళినెల్ల
శిక్షించి యల యింద్ర - జిత్తుని చాల
తగిలినట్లన పోయి - దశకంఠుఁ జూచి
తెగి పల్కఁ దనమీఁదఁ - దెగి దశాననుఁడు
తోఁకఁ గాలిచి పాఱఁ - గ్రోలుఁడటన్న
సోఁకోర్చి వాలనూ - ర్చుచు లంక యెల్లఁ
గాలిచి మరల సా - గర మేను దాఁటి 11880
యేలిన స్వామితో - నెఱిఁగించుటయును
నప్పుడే బహువాన - రావలితోడ
నప్పంక్తిముఖుని పై - నబ్ధి గట్టించి
దండెత్తి లంక కొం - దల మంద విడిసి
భండనంబున మహా - పార్శ్వు యూపాక్షు
గుంభకర్లు నరాంత - కుని నతి కాయుఁ
గుంభుని దేవాంత - కుని మహోదరుని
దుర్జయు నింద్రజి - త్తుఁ బ్రహస్తుఁ ద్రిశిరు
నిర్జించి బహుదైత్య - నికరంబు గూల్చి
రావణు భువన వి - ద్రావణుఁ గూల్చి 11890
యావిభీషణు లంక - కధిపతిఁ జేసి
వచ్చిరి ఱేపె మీ- వారును మీరు
గ్రుచ్చి కౌగిళులఁ జే - ర్పుచుఁ బ్రమోదమున

నుందురు గురు పుష్య - యోగంబునందు
సందర్శనమునకు - శస్తమైయుండు
నీమాట నిజమన్న - నెంతయు మెచ్చి
రోమహర్షమున శ -త్రుఘ్ను నిఁ జూచి

-: భరతుని యానతిని శత్రుఘ్నుఁ డయోధ్య నలంకరింపఁ జేసి కౌసల్యాది రాజమాతలను దోడ్కొనివచ్చుట :-

"ఇప్పు డయోధ్యకు - నేఁగి వీథులను
చప్పరంబులు ముత్తె - సరులు జల్లులును
మేరువుల్ కురుజులు - మేలుకట్టులును 11900
తోరణంబులు బహు - ధూప ధూమములు
నవరంగవల్లికల్ - నవరత్నముఖ్య
వివిధవస్తుసమగ్ర - విపణి మార్గములు
కదళికాక్రముకేక్షు - కాండప్రకాండ
సదమల స్తంభరా - జన్మంటపములు
మాధవాయత నివి - మాన సౌవర్ణ
సౌధకింకిణికాధ్వ - జచ్ఛత్రములును
నమరింపు మైదువు - లందఱుఁ గూడి
తమకరంబుల నక్ష - తలును బువ్వులును
కలయఁజల్ల నమర్చి - గందేభకోటి 11910
కలధౌతమణిమయా - కల్పయు క్తముగ
నిండు సంజోకవూ - నిన హయబృంద
మండలిరాఁగఁదూ - ర్యములు ఘోషింప
రాజులు గలధౌత - రథసహస్రములు
రాజీవనములను - రాణువదొరలు

హితబంధుజన పురో - హిత వీరభటులు
జతకట్టుగాఁగఁ గౌ - సల్యాదులైన
తల్లులు దాసీ వి - తానంబుఁ గొలువఁ
బల్లకీల నమర్చి - పౌఁజులు దీర్చి
యెదురేఁగవలయు నీ - విటులమరించి 11920
యుదయ వేళకు మన - యూరికిరమ్ము
జగతి నందిగ్రామ - సాకేత మధ్య
మగు మహాపథము చా - యగఁ జక్కఁ జేసి
కలయంగ కస్తూరి - కలయంపి చల్లి,
కొలఁది ముత్తెంపు మ్రు - గ్గులు దీర్పఁ జేసి
యమరింపు "మని పల్క - నతఁడట్ల వోయి
తమ యన్నయజ్ఞ యౌఁ - దలఁ దాల్చియపుడె
కైసేయఁబనిచి - బంగరు పల్లకీల
కౌసల్యను సుమిత్రఁ - గై కేయి నుంచి
నగరెల్ల నమరేంద్రు - నగరంబు రీతి 11930
మిగుల శృంగారింప - మితికట్టి మఱల
నందఱితోఁ గేక - యతనూజు సుతుని
ముందఱ నిల్చిన - ముదమంది యతఁడు
నుదయ వేళను నిజా - భ్యుదయంబుఁ గోరి

-: భరతుఁడు వారందఱితో శ్రీరాముని దర్శింప నేగుట :-

కదిసి వాయుఁజుఁడు చెం - గట రాఁగఁ గదలి
తానుఁ దమ్ముండు శ్వే - తచ్ఛత్రచామ
రానీకములతోడ - నర్చనల్ చేసి
రామపాదుకల శి - రంబు పై నుంచి

సౌమిత్రి వెంటరాఁ - జతురంగబలము
ముందఱ వెనుక రా - మొనగాఁగ నభము 11940
నందుఁ జూపులు నిల్పి - యాసాస వచ్చి
రాముని పుష్పక - రాజంబు దిశల
నేమేరఁ గానక - యిచ్చఁ జింతించి
హనుమంతు మోముఁగ - టాక్షించి పవన
తనయుని మాట త - థ్యంబని యెంచి
నమ్మినేచాల నం - దఱఁ గూర్చి భూజ
నమ్ములచే నెల్ల - నవ్వఁబాలై తి !
“ఏమి చేసిన తీరు - నిఁక నిన్ను క్రోఁతి !
ఈమాటలాడ నే - యిది కల్లయనక
పదరి వచ్చితి నీస్వ - భావంబుఁ దప్ప 11950
దదియేల నేఁ డెంత - యపకీర్తి వచ్చె ”
అని కనరుట్టంగ - నాడిన మాట
విని వాయుజుఁడు రఘు - వీరునకనియె.
'అయ్య ! నన్ను నసత్య - మాడితివనుచు
నెయ్యది చూచి నీ - విట్లు పల్కితివి ?
వాణి యాగమముల - వసియించినాదు
వాణియై తాసత్య - వాణియై మించె
హనుమంతుఁడును కల్ల - లాడు నే? మింట
వినివచ్చె ఘూర్ణిత - విశ్వమై రవము !
ఆమహారవము వ - నాటసమూహ 11960
భీమకోలాహలా - భీలమ్ము సుమ్ము
అలభరద్వాజ మ - హాప్రసాదమున
నిలమీఁద తరువు - లేయెడ నిండఁబండి

యునికిచే వాచవి - నూరటల్ గాఁగ
వనచరుల్ మెసవుచు - వచ్చుటఁ జేసి
యిందాకఁ దడసినా - రిప్పుడీ భాను
నందన రిక్షేశ - నల తారవాలి
నందనగజ సుషే - ణగవాక్షపనస
మైందద్వివిదగంధ - మాదనకుముద
కేసరి రిషభాది - కీశులతోడఁ 11970
జేసెదు చెలిమి ని - శీధినీచార
సార్వభౌముని విభీ - షణుని సంతోష
పూర్వకంబునఁ జూచి - పొంగనున్నావు!”
అని పల్కి చేచాఁచి - " యదె వచ్చెఁగనుము
వనజారినిభము ది - వ్యవిమానవరము
నది చూచి సేవింపు - మజనిర్మితంబు
కదిసి కల్గొనుము రా - ఘవుఁడల్ల వాఁడె !
అది మహీసుత సుమి - త్రాత్మజుఁడతఁడు
నదె వానర స్తోమ” - మనఁ బ్రమోదమున
గనుఁగొని సాష్టాంగ - క ప్రణామంబు 11980
లొనరింప రామని - యోగితంబగుచు
నావిమానము ధాత్రి - కల్ల నవ్రాలఁ
దావచ్చి యన్న పా - దద్వయంబునకుఁ
బ్రణమిల్ల నెడవాసి - బహుదినంబులకు

-: శ్రీరామ భరత సమాగమము - భరతుఁడు శ్రీరాముని రాజ్య భారము వహింపుమని పాదుకలు తొడుగుట :-

గుణవంతుఁడగు కై క - కూరిమిపట్టిఁ
గాంచి యానందాశ్రు - కణముల మేను

ముంచి గారాబు త -మ్మునిఁ గౌగలించి
తొడలపై నిడుకొని - తొగరుఁ గెంజాయ
జడగట్టినట్టి మ - స్తము మూరుకొనుచు
లాలింప భరతుఁ డి - లాసుతఁగాంచి 11990
యాలేమ కెందమ్మి - యడుగుల వ్రాలి
సౌమిత్రిఁ గని " విభీ - షణ! నీవుఁగలుగ
స్వామికి జయకీర్తి - సౌఖ్యముల్ గలిగె !
ఓయి ! సుగ్రీవ ! నె - య్యుఁడవైన నీవు
మాయన్నఁ జేపట్టి - మనుజాశ నేంద్రు
సమయంబు మఱల నీ - జనకజ మాకు
సమకూర్చితివి మాద - శరథ భూపతికి
నేవుర నందను - లేవురమైతి
మీవల సౌభ్రాత్రు - హితచర్యలకును
నైదుగురము మన - మన్న దమ్ములము 12000
లేదరమర యొక్క - లేశ మేనియును ”
అని రామచంద్రుని - యడుగుఁ దామరలఁ
దన చేతి పాదుకా - ద్వయ మొయ్యం దొడిగి
“స్వామి ! దేవర బొక్క. - సమును భండార
మేమరకే కాచి - యిన్నాళ్లు దాఁచి
యభివృద్ధి చేసితి - నంగీకరింపు
మభిమానముంచి స - ప్తాంగరక్షణము
చేసితి ముద్రఁదా - ల్చినవాఁడఁ గానఁ
జేసితి పట్టాభి - షేకంబు నేను
పాదుకాయుగళి కా - బరు వింకఁ దీఱె! 12010

మీదు సొమ్మంతయు - మీకు నిచ్చితిని
యివె బీగె ముద్రలూ - హింపుఁడందఱును
రవివంశతిలక ! మీ - రాకలు గోరి
కాచి యున్నారని - కడకుఁ బోవుటయుఁ

-: శ్రీరాముఁడు వసిష్ఠునికి కౌసల్య మొదలగు రాజ మాతలకు మ్రొక్కి వారి దీవనలు గొనుట :-

జూచి రాముఁడు వ - సిష్ఠుని పాదములకు
సాగి మొక్కుటయుఁ గౌ - సల్యాది జనను
లా గుణసాగరు - నండకేతేర
వారికి మ్రొక్కిన - వారు దీవించి
యోరగా శత్రుఘ్నుఁ - డుల్లంబు వొదుల
రామచంద్రునికి ధ - రాతనూజకును 12020
సౌమిత్రికిని భక్తి - సాగిలి మ్రొక్కి
యుపలాలనములొంద - యుర్వీజనాళి
యపుడు మేరువు మీఁది - యర్కునిరీతి
మానిత దివ్యవి - మానంబులోన
జానకీపతిఁ జూచి - జయజయధ్వనుల
మొగడతమ్ములవంటి - ముకుళితహస్త
యుగముతో నందఱు - నోలగింపంగ
నవరత్నమయ భూష - ణములు మాణిక్య
నివహకిరీటముల్ - నెమ్మేనులందుఁ
గుంకుమలును మెఱుం - గుఁ గడాని వొళ్లు 12030
సుంకులు రాల్చు మం - జులదుకూలములు
చికిలి నఖానుదీ - ర్చిన కెంపుఁ బొడుల

యెకిదుమీలునుమట్టి - నెసఁగు జందెములు
కండెముల్ దిరిగిన - కమనీయ బాహు
దండముల్ నిలువుల - దండపూనికెలు
రొమ్ములు నసురవీ - రులు వైచువాఁడి
యమ్ముల జీఱలై - నట్టి గాయములు
తొడరి వేల్పులనైనఁ - ద్రోలుదమనెడి
పొడిచి గెల్చినయట్టి - పొగరులు గలిగి
రాజసంబులుమీరు - రాజవేషముల 12040
రాజీవహితకుమా - రకుఁ గాచియున్న
యంగదముఖ్య మ - హాకపివీర
పుంగవులనుఁ జూచి - భుజములుప్పొంగ
భరతుండు జానకీ - పతిఁజూచి " స్వామి
పురికి విచ్చేయుఁ డి - ప్పుడు మంచి వేళ

-: భరతుని కోరిక ననుసరించి భరతాశ్రమమునకు శ్రీరాముఁడు వచ్చి పుష్పకవిమానమును కుబేరున కనుచుట :-
పట్టాభిషేక సం - భ్రమము నీవొంది
కట్టిన నుదుటికం - కణమూడ్పు మిపుడు"
అని విభీషణ భాను - జాదులందఱును
మనముల ననురాగ - మగ్నులౌనంత
వెంట వచ్చినవారు - వెనుకొని భరతు 12050
వెంట వచ్చినవారు - వింజమాకిడిన
కైవడి దనపుష్ప - కము మీఁద నుండ
రావణారాతి య - భ్ర పదంబునందు
తొడమీఁది భరతుని - తో మహీసుతకుఁ

బుడమి వింతలు దెలు - పుచు వచ్చివచ్చి
భరతాశ్రమంబులో - పల విమానంబు
ధరవ్రాల నియమించి - తనవారు తాను
నందఱు డిగి యామ - హా పుష్పకంబు
చందన ప్రసవ పూ - జా పూర్వకముగఁ
బొమ్ము కుబేరని - పురమున నతని 12060
యిమ్మున వసియింపు - మేవేళ ననుచు
ననిచి యింద్రుండు బృ - హస్పతితోడ
నెనసిన కైవడి - నినవంశ్యులైన
జనపాలకులకు నా - చార్యుఁడా బ్రహ్మ
తనయు వసిష్ఠుఁ గుం - దనపు గద్దియను
నాసీనుఁడుగఁ జేసి - యందఱితోడ
నాసభఁ గేల్మోడ్చి - యవనిజా ప్రియుఁడు
నిలిచి యున్నెడ రాము - ని మొగంబు చూచి
బలగమంతయు విన - భరతుండు వలికె

-: భరతుఁడు శ్రీరాముని రాజ్య భారము వహింపఁ బ్రార్థించుట :-

ఓ దేవ ! యతినిష్ఠ - నుగ్రతపంబు 12070
లాది నేఁ బెక్కు జ - న్మాంతరంబులను
చేసిన సుకృత వి - శేష మీక్షింప
జేసె క్రమ్మఱను మీ - శ్రీపాద యుగళి
మాతల్లి మిమువేడ - మనవి చెల్లించి
యాతరి నాకు రా - జ్యం బొసంగితిరి !
ఏను గ్రమ్మఱ మీకు - నిచ్చితి వృషభ

మాను భారము వత్స - మానలేనట్టు
లీవువహించు మ - హీభారమేను
భూవరతిలక ! యో - పుదునె ధరింప ?
కట్టువ లంబువే - గంబుచేఁ బగిలి 12080
నట్టికైవడి యెక్కు - వైన కార్యముల
ఛిద్రాస్పదంబైన - క్షితియేల రామ
భద్ర? నీచేఁగాక - పరులకు నగునె?
ఖరము నేర్చునె తురం - గమురీతిఁ బఱవఁ?
గఱిగాకి హంసంబు - గతి మింటఁ జనునె?
కరిమాడ్కి నడచునే - గ్రామ సూకరము ?
హరియౌనె తానెంత - యైన శ్వానంబు
గతి నీవెకాక నీ - గతీ మెలంగుటకు
నితరుఁడర్హుఁడె? తాల్పు - మిలయెల్ల నీవు
చెట్టొక్కఁడుంచి పో - షింప నాతరువుఁ 12090
బట్టుగాఁ జూచియు - ఫలమంద నట్లు
అకట ! నీ వేలని - యట్టి యయోధ్య
తెకతేర పతిఁబాయు - తెఱవయై యున్న
రాజ్యంబుఁ గైకొని - రక్షింపు మమ్ము
పూజ్యుల బహుమతిఁ - బోషింపు మీవు.
అవనిజఁ గూడి సిం - హాసనాగ్రమున
రవివంశతిలక ! మీ - రలు వసియింప
నవనీజనంబు మ - ధ్యందినోదగ్ర
రవితేజు నినుఁజూచి - రంజిల్లుఁ గాక !
వైతాళికులగీత - వాద్య ఘోషముల 12100
చేత నిద్దురలేచి - సీతయు నీవు
గ్రక్కునఁ గొల్వు సిం - గారమై వచ్చు

చక్కదనంబు లో - చన పర్వముగను
చూచెద మభిషేక - శోభనంబంది
యాచంద్రతారార్క - మవని యేలుచును
మహిమండలము శింశు - మార చక్రంబు
రహిమించు దినములు - ర్వర యేలుమీవు!”

                  -: శ్రీరాముఁడు భరతుని ప్రార్థన మంగీకరించి, వసిష్ఠాను మతమునఁ
                            బట్టాభిషేకమునకు నయోధ్యకు నలంకృతుఁడైవెడలుట :--

అనిన నప్పుడె వసి - ష్ఠాను మతమున
ననుపమంబైన సిం - హాసనాగ్రమున
వసియింప మంగళుల్ - వచ్చి నిల్చుటయుఁ 12110
బిసరుహాప్తతనూజుఁ - బ్రియసహోదరుల
నల విభీషణుఁ బిల్చి - యాయుర్విధాన
కలన కర్మము మున్ను - గా నడిపించు
జడ లొయ్యఁగడిగించి - శార్దూల వృత్తి
సడలించి మంగళ - స్నానంబు చేసి
యున్నెడ పెద్దల - నునిచిన హెచ్చు
మిన్నల సొమ్ములు - మేల్మి వస్త్రములు
పరిమళమ్ములతోడి - భరణులఁ దెచ్చి
భరతుఁడప్పుడు రఘు - పతి మ్రోల నిల్వ
లక్ష్మణ సీతాదు - లనుగూడి రాజ 12120
లక్ష్మీ వివాహ వే - ళకుఁ దగినట్టి
శృంగారముల చేత - నెసఁగిన వేళ
సంగడిఁ జేరి కౌ-సల్య పొంగుచును

తారాది వానర - తరుణుల నెల్ల
వేఱువేఱుగఁ బిల్చి - విమలాంబరములు
మణిభూషణములు ప్రే - మముతో నొసంగి
గణికామణుల కెల్లఁ - గట్ట నిప్పించి
ముదమందు వేళ రా - మునకు శత్రుఘ్ను
మొదలు సుమంతుఁడు - ముంగల నిడిన
నరదంబు రఘువీరుఁ - డప్పు డెక్కుటయు 12130
భరతుండు తానొగ - పైఁ గూరుచుండి
సారథ్య మొనరింప - జానకిఁ జూచి
తారాది కాంతలు - తలఁపులఁ జొక్క
నాదిములకు సుమం - త్రాశోక విజయు
లాదిగాఁగల మంత్రు - లందఱుఁ గూడి
శ్రీకరనియమ గ - రిష్ఠు వసిష్ఠు
గాకుత్థ్సవంశ శే - ఖరుల పట్టముల
నడపింపు జాడలు - నడిపింపుఁ డనుచు
నుడివి శ్రీరాముఁ గ - న్నులఁ గనుఁగొనుచు
నరదంబు చెంతఁ బా - యక కొల్వఁ దనదు 12140
కరముల ధవళము - క్తాతచ్ఛత్రవరము
పూని శత్రుఘ్నుఁ డిం - పున భజియింప
మానిత హేమ చా - మర మొక్క కేల
వీవనఁ దాల్చి యా - వెనుక లక్ష్మణుఁడు
నా వేళ తనచెంత - యైకొల్చిరాఁగ
నితర చామరము దై - త్యేంద్రుండు పూని
హితమతి నొకమేర - నేతేర నెదుర
నంగద హనుమంతు - లసమలావణ్య

శృంగారముల కేల - చెంగోలు లమర
సందడి విరియింప - శత్రుంజయాఖ్య 12150
మందర శైలోప - మానమై మించు
పట్టపు టేనుఁగు - పై భానుసుతుఁడు
చుట్టలతోఁ గూడి -సూరెల రాఁగఁ
తొమ్మిది వేలు దం - తులమీఁద దొరత
నమ్ముల సుగ్రీవు - నకు సరియైన
వానర రాజు లి - ర్వంకల తనదు
సేనలతో ధాత్రి - జవ్వాడ నడవఁ
దమ్ముఁడు గడపు ర - థమ్ముపైఁ జనుచు
దొమ్మి చేసిన ఖర - దూషణాదులను
తునిమి వైచుట కబం - ధునిద్రుంచుటయునుఁ 12160
వనచర ప్రభుఁడైన - వాలిఁ గూల్చుటయు
సీతకై జలధిపై - సేతువుఁ గట్టి
దైతేయులను జంపి - దశకంఠుఁ దునిమి
మఱలి వచ్చుటయు స - మస్తంబు దెలియ
ధరణిజారమణుండు - తన ప్రధానులకుఁ
బలుకుచో వారెల్ల - ప్రతిపదాశ్చర్య
కలితులై వినుచు చెం - గటఁ జేరి రాఁగ
హైమాక్షతములు లా - జాదులు దాల్చి
భూమిసురాన్వయ - పుణ్యభామినులు
నాఁగదుపులును మ - హా వృషభములు 12170
లేఁగలు మునుమున్ను - లెక్క కెక్కుడుగ
నడచిరా సాకేత - నగరిలోఁ జొచ్చి
పడఁతులా మేడల - పై నుండి చూచి

పువ్వువానల ముంపఁ - బుడమియు నభము
నవ్వేళ ప్రస వ - ర్షా కీర్ణమయ్యె
నతివలు నంచల - నారతులెత్త
సతీమాత్ర విభవుఁడై - యవనిజా ప్రియుఁడు
నగవైరి నగరంబు - నకుఁ జాలునట్టి
నగరిలోనికి కాంచ- న రథంబు డిగ్గి
సీతతోడం బ్రవే - శించి తల్లులకుఁ 12180
జేతోవికాసంబుఁ - జిగురెత్త మ్రొక్కి
భరతునిఁ బిలిచి య - ప్పటి తన నగరఁ
ధరణిజ నుంచి మో - దమున రమ్మనిన
నతఁడు సుగ్రీవుని - యావిడిదింట
నతిభక్తి నుంచి ప్ర - యత్నంబు మీఱ
నులుపాలు వివిధ రా - జోపచారములు
వలయునట్టు లమర్చి - " వాన రాధీశ !
ఉదయ వేళకుఁ చతు - రుదధి నీరముల
నదుల యంబువులు వా - నరులను బనిచి
తెప్పింపు పసిఁడి బిం - దెలచేత " ననుచుఁ 12190
జెప్పిన వేదద - ర్శిని జాంబవంతు
హనుమంతు ఋషభుని - నట్ల తెప్పింపు
డనిన వారలును ని - జాను జీవులను
నలగవయుల సుషే - ణ రిషభాహ్వయుల
నలువురఁ బిలిచి కుం - దనపు బిందియలు
చేతులకిచ్చి పం - చిన వారినిధుల
నూతనాంబువుల నే - నూఱు వాహినుల
పుణ్యోదకములు న - ప్పుడెతెచ్చి కపివ

రేణ్యుని నగరి న - ర్పించిన నతఁడు
శత్రుఘ్ను నకు తత్ప్ర - సంగంబుఁ దెలుప 12200
శత్రుఘ్నుడును దన - సచివుల చెంత
నావిధం బెఱిఁగింపుఁ - డని పంప వారు
నావసిష్ఠునకు న - య్యర్థంబుఁ దెలుప

-: శ్రీరామ పట్టాభి షేకము :-

నాతపోధనుఁడు సిం - హాసనాగ్రమున
సీతాసమేతుగా - శ్రీరాము నునిచి
అత్రివసిష్ఠకా - త్యాయనకణ్వ
మైత్రేయజాబాలి - మాండవ్యసుతప
గౌతమ మౌద్గల్య - గాలవ కలశ
జాత సుయజ్ఞకా -శ్యప వామ దేవ
కుత్సవిశ్వామిత్ర - గోభిల చ్యవన 12210
వత్స భారద్వాజ - వైఖానసాది
మునులు గంధోదకం - బులు మణిఖచిత
కనక పాత్రికల రా - ఘవవంశతిలకు
నభిషేక మొనరింప - నబ్జజు వసువు
లభిషేక మొనరించి - సట్లుండె నపుడు !
సీతతో ఋత్విజ - శ్రేణితో మంత్ర
పూతోదక స్నాన - మున నున్న రాముఁ
గనుఁగొని దివిజులా - కాశ సద్యమల
కనజాంబుజాత సౌ - గంధిక గంధ
గంధిల కనక క - ర్కరికా ముఖాగ్ర 12220

గంధతోయాభిషే - కము లొనరింప
నాసమయమున మ - న్వాదులైనట్టి
నాసూర్యవంశ మ - హామహీ భుజుల
నభిషేక వేళల - నర్పించు భాను
నిభమౌ నమూల్యమ - ణీ కిరీటంబు
మంత్రపూజాది ర - మ్యము సుమంత్రాది
మంత్రులు శ్రీరాము - మస్తకాగ్రమునఁ
దెచ్చినిల్ప నరుంధ - తీ ప్రాణవిభుఁడు
వచ్చి యాగమ మంత్ర - వైఖరి చేత
శ్రీరాముఁ దానభి - షేకంబు సేయఁ 12230
బోరన సురదుందు - భులు మింట మొర సెఁ
గురిసెఁ బువ్వులవాన - కొదమతెమ్మెరలు
నెరసె రంభోర్వశీ - నృత్తముల్ బెరసె
దొరసె భూజనుల చే - తోవాంఛితములు
మెరసె నయోధ్య నా - మెత లింట నింటఁ
బొరసె రాజస్పతి - పుణ్యచిహ్నములు
విరిసె లేమలు విశ్వ - విశ్వంబునందు!
ధవళముక్తాతప - త్రంబు శత్రుఘ్నుఁ
డవధానమునఁ దాల్ప - నర్కనందనుఁడు
దనుజేంద్రుఁడును చిరం - తనరత్న ఖచిత 12240
కనకచామరములుఁ - గైకొని వీవ
నింద్రుని యనుమతి - నిచ్చెను రామ
చంద్రుని కవ్వేళ - సౌవర్ణకమల
మాలికయును రత్న - మౌక్తికా కలిత
మాలికయును .పవ - మానుండును వచ్చి

గానంబు చేసిరి - గంధర్వు లెదుర
నానందకరమయ్యె - నవని యంతటికి
లసమానమధుర ఫ - లంబుల నమృత
రసములు గురిసె నీ - రసభూరుహములు
వీడుపట్టుల పంట - వెట్టక దుక్కి 12250
కాడుమెట్టకయ ము - క్కారునుఁ బండె
దట్టమై పారిజా - తపుఁ బూవుఁ దావి
గట్టినట్లమరె సు - గంధవనాళి

-: శ్రీరాముఁడు బ్రాహ్మణులకు, సుగ్రీవ విభీషణాది హితులకు నుడుగర లిచ్చుట
                       - సీతామహాదేవికి తారహారమొసఁగుట :-

లక్షవాజులు హేమ - లాంగల వృషభ
లక్షయు నావులు - లక్షయుఁ గోట్ల
ముప్పదికి హిరణ్య - మును దానమిచ్చె
నప్పుడు రఘువీరుఁ - డగ్రజన్ములకు !
భండనంబుల సుర - పతి మెచ్చి యుదయ
చండాంశు దీప్తిపి - చండిలంబైన
మాలిక దశరథ - క్ష్మాపతి కొసఁగ 12260
చాలు వేడుక బొక్క - సములోనడాఁచు
నామణిసరము దె - మ్మని రాముఁ డనిచె
ప్రేమంబుతోడ సు - గ్రీవు కంధరను
నంగదుఁ బిలిచి నా - యకములౌ మణుల
నంగద్వయంబిచ్చె - నవనిజాప్రియుఁడు
చంద్రకోటి ప్రకాశ - చాకచక్యంబు

సాంద్రమౌ ముత్యాల - సరము రాఘవుఁడు
సీతకే తగునని - చిఱునవ్వుతోడ
నాతి పేరెదను మ - న్ననమీఱ నుంచె !
ఘనమైన సొమ్ములు - కట్టువర్గములు 12270
జనకజ వదనాంబు - జమును గన్గొనుచు
హనుమంతున కొసంగ - నాయమ్మ దనకుఁ
బెనిమిటి కరుణ న - ర్పించిన యట్టి

-- : సీత యాతారహారమును హనుమంతుని కొసగుట :--

తారహారముఁ దీసి - తన కేల నంటి
శ్రీరాము వదన మీ - క్షించిన యంత
కపిశేఖరుల నెల్లఁ - గలయంగఁ జూచి
యపుడు జానకిఁ జూచి - " యతివ ! నీయిష్ట
మెవ్వరి కిచ్చిన - నిమ్మని " పలుక
నవ్వారిజేక్షణ - హనుమంతుఁ జూచి
పౌరుషవిశ్రమ - బలబుద్ధి ధైర్య 12280
కారుణ్యసత్యాది - క మహాగుణములు
కలుగు వాఁడగుట ద - గ్గఱఁ బిల్చి యతఁడు
తల వాంచుటయును కం - ధరఁ దవిలింప
నాహారమున శర - దభ్రసంవళన
మౌ హేమనగమో - యని మించె నతఁడు !
కట్టవర్గము లుడు - గర లపరంజి
తట్టల భాగముల్ - తావి కుంకుమయుఁ
గస్తూరి మేరువు - కడియముల్ నాల్గు
దుస్తులు కోకలు - దొడ్డతాళియును
కంటమాలికయు రా - క్షసరాజుఁ బిలిచి 12290

యింటికిఁ బొమ్మని - యిచ్చె రాఘవుఁడు
మరియుఁ గేసరి తార - మైంద సుషేణ
శరభ నీల గవాక్ష - శతబలి పనస
నలజాంబవన్ముఖ్య - నగ చరాధిపులఁ
బిలిచి బొక్కస మింట - పెట్టెలు దెఱచి
తరమైన సొమ్ములం - దఱికిచ్చి వారి
యిరవులకును సెల - విచ్చి పొమ్మనిన
భానుజముఖ్యులౌ-ప్లవగపుంగవుల
నానావనీనది - నగపురాటవులు
తమతమ నెలవులం - దఱు జేరఁబోక 12300
రమణీయమూర్తి యౌ - రామునిఁ జూచి
చాల చింతల విభీ - షణుఁడు పాదముల

-: శ్రీరాముఁడు విభీషణునికి శ్రీరంగశాయి నొసగి, యాతని తనమాఱుగాఁ బూజింపుమని యాజ్ఞయిచ్చుట -
వానరాదులు విభీషణునితో తమతమ నెలవులకు వెడలిపోవుట :-

వ్రాలి "యోదేవ ! నీ - వాఁడనై యిచట
నుందు నింతియెకాని - యొండెడ కేఁగ
నెందుకు ? లంక నా - కేల ! పో "ననిన
నెందుచే నీతనిఁ - దృప్తునిఁ జేతు
నెందుల నను బాయఁ - డితఁడని యెంచి
“తనమారు తనకుల - ధనము పూర్వమున
మనుపుత్రుఁ డిక్ష్వాకు - మనుజేశ్వరుండు
నిలిపిన మాపాలి - నిక్షేపమీవు 12310
గొలువుము లంకకుఁ - గొని పొమ్మటంచు
సజ్జతో శ్రీరంగ - శాయి నొసంగ

 
నజ్జసేసుక యమ్మ - హానుభావుండుఁ
గైకొని లంకకుఁ - గదలి పోవుటయు
నాకరణావరు - ణాలయుండైన
రాముఁడు నీతిమా - ర్గమున భూజనులు
తామర తంపరై - తనియ సంపదల
నవనిఁ బాలింపుచు - ననుజన్ము నొకని

-:భరతునికి యువరాజపట్టము గట్టుట:-

యువరాజపదవికి - నునుపఁదలంచి
రమ్ము లక్మణ ! యౌవ - రాజ్యపట్టంబు 12320
సమ్మతి నీకు నొ - సంగితి నేను
నందఱి మనువుల - నరసి పాలించి
పొందికగాఁ బ్రజఁ - బోషింపుమీవు
నను జూచినట్టు లం - దఱు నినుఁజూతు
రనిన సౌమిత్రిదా - నన్న కిట్లనియె.
“ఇటు లానతిత్తురె- యినవంశ తిలక !
యెటులఁ జూచిన పెద్ద - యీభరతుండు
శిరసుండ మోకాలఁ - జేతురే పూజ ?
భరతుండె యువరాజ్య - పదవి కర్హుండు.
అతఁడుండియును స్వామి - యనధికారులకు 12330
నితరుల కీపూన్కి - యెంతకుఁ దగునె!
దేవ ! నీ చరణముల్ - దిక్కని కొలిచి
సేవ కావృత్తి మీ- చెంతనుండుటయె
నఖిలలోకాధి ప - త్యము నాకుఁగాక
మఖనపట్టంబది - మాని యేనొల్ల
ననిస సంతసమంది - యౌగాక యనుచు -

ననుజన్ము భరతు రా - జ్యమునకు నెల్ల
చేపట్టి తానభి - షేకంబుఁ జేసి
ప్రాపుగాఁజిక రాయ - పట్టంబు గట్టె

-: శ్రీరామరాజ్యమున సకల ప్రజలును సౌఖ్యమునందుట :-

హయమేధ పౌండరీ - కాది యాగములు 11340
నియతితో నూ ఱేసి - నిండంగఁ జేసి
తగిన నానామహా - దానముల్ పెక్కు
లుగ నాచరించి వే - ల్పులఁ దనియించి
యిలనాల్గు చెఱఁగులు - నేలి ధర్మంబుఁ
దలకొని నాల్గుపా - దంబులు మెలఁగ
సీతాసమేతుఁడై - క్షితివారికెల్లఁ
దాతయుఁ దల్లి యుఁ - దండ్రి దైవంబు
నేలిక గురుఁడును - హితుఁడు నెచ్చెలియు
నై లక్ష్మణుని తన - యట్లన బ్రోచి
శత్రుఘ్ను నెడ భక్తిఁ - జాలంగఁగలిగి 12350
మాత్రాధికంబైన - మాతృసంప్రీతిఁ
గలిగి యెయ్యెడఁ మించ - కలుములు ధాత్రి
నెలమిమీఱంగఁ దా - నేలుచున్నపుడు
చోరభయంబు చి - చ్చుల యెచ్చరికలు
జారత్వ వికృతులు - జనవిరోధములు
కలుష ప్రచారముల్ - కల్ల లాడుటలు
నలుకలు వైరముల్ - నాస్తివాదములు
పిసినితనంబునుఁ - బేదఱికంబు
వసుధ నెయ్యెడ లేక - పరధనాపేక్ష
లితర దూషణపరు - లెచ్చోట లేక 12360

నందఱు ధార్మికు - లందఱు ధీరు
లందఱు వితరణు - లందఱు నీతి
పరు లందఱును - పుత్రపౌత్రాభివృద్ధి
నిరతులై వేయేండ్లు - నిండు నాయువులుఁ
దనరఁగ చంద్రశీ - తల భావమంది
జనకజాప్రియుఁడును - జానకీ దేవి

-: కాండాంత గద్యము :-

విలసిల్లె నని వేద - వేద్యుని పేర
నలమేలు మంగాంగ - నాధీశు పేర
నంచిత కరుణాక - టాక్షుని పేరఁ 12370
గాంచనమణిమయా - కల్పుని పేర
వేదవేదాంతార్థ - వినతుని పేర
నాదిత్యకోటి ప్ర - భాంగుని పేరఁ
గంకణాంగద రత్న - కటకాఢ్యుపేర
వెంకటేశుని పేర - విశ్వాత్ము పేర
నంకితంబుగ వెంక - టాధీశ చరణ
పంకజ సేవాను - భావమానసుఁడు
హరిదాసమణి కట్ట - హరిదాసరాజు
వరదరాజు నితాంత - వరదాన శాలి
రచియించు వాల్మీకి - రామాయణంబుఁ

-: ఫలశ్రుతి :-

బ్రచురభక్తిని మదిఁ - బాటించి వినినఁ 12380
జదివిన వ్రాసిన - సభలఁ బేర్కొనిన
మది దలంచిన నెట్టి - మనుజుల కైన

ధారుణిమీఁద సీ - తారామచంద్ర
పారిజాత దయా ప్ర - భావంబు వలన
హయమేధ రాజసూ - యాదిమ యాగ
నియత ఫలంబులు - నిరతాన్నదాన
సుకృతంబు నిత్యయ - శో వైభవములు
నకళంక తీర్థయా - త్రాది పుణ్యములు
సత్యవ్రతపదంబు - సకల సౌఖ్యములు
నిత్యమహాదాన - నిరపమశ్రీలు 12390
కలికాలసంప్రాప్తి - కలుషనాశనము
కలుములు హరిభక్తి - గౌరవోన్నతులు
శత్రుజయంబును - స్వామిహితంబు
పుత్రలాభంబును - భోగభాగ్యములు
ననుకూల దాంపత్య - మంగనా ప్రియము
ధనధాన్యపశువస్తు - దాసీసమృద్ధి
మానసహితము ధ -ర్మప్రవర్తనము
నానందమును ఖేద - మందకుండుటలు
నలఘువివేకంబు - నతుల గౌరవము
వలయు కార్యములు కై - వశము లౌటయును 12400
పావనత్వము దీర్ఘ - పరమాయువులును
కైవల్య సుఖము ని - క్కముగాఁగగలుగు
నెన్నాళ్లు ధారుణి - యెన్నాళ్లు జలధు
లెన్నాళ్లు రవిచంద్రు - లెన్నాళ్లు గిరులు
నెన్నాళ్లు నిగమంబు - లెన్నాళ్లు విశ్వ
మన్నాళ్లు నీకథ - యలరు నార్షంబు

నాదికావ్యంబు స - మ స్తపూజ్యంబు
వేదసమానంబు - విశ్వసన్నుతము
నుపనిషత్సమముగా - యుద్ధకాండంబు
విపులార్థరచనల - విలసిల్లుఁ గాత ! 12410




ఇది
కట్టా వరదరాజకృత మగు
ద్విపద రామాయణమున
యుద్ధకాండము
సమాప్తము

ఓం తత్సత్
శ్రీరామచంద్రాయనమః