శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/33వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

33వ అధ్యాయము.

మానవులలో భిన్న వర్గములు.

621. తమయందలి సత్వరజస్తమోగుణముల ఆధిక్యతను బట్టి మానవులు భిన్నభిన్నగుణములు కలవారుగనుందురు.

622. జీవులన్నియు ఒక్కతరువే; కాని వానివాని దశాంతరములనుబట్టి నాలుగురకములుగ నుండును.

(1) బద్ధజీవులు :- బంధనమున నున్నవి.

(2) ముముక్షులు :- బంధనమును తొలగించుకొనవలయునని తీవ్రప్రయత్నములు చేయునవి.

(3) ముక్త జీవులు :- బంధనమునుండి తప్పించుకొనినవి.

(4) నిత్యముక్తజీవులు :- బంధనమున చిక్కకయే సదా స్వచ్ఛతోనున్నవి.

623. పూర్ణములపై పూత వరిపిండియే; కాని లోపలిపూర్ణము వేఱుగానుండును. పూర్ణముయొక్క మంచిచెడ్డలు లోపలి పదార్థము ననుసరించి యుండును. అటులనే నరులందఱి శరీరములును ఒకేరకము పదార్థములతో నేర్పడినను వారి హృదయముయొక్క పవిత్రతా తారతమ్యమునుబట్టి వేర్వేఱు గుణములుగలవారుగ నుందురు.

624. మానవులు తలగడదిండ్ల గలేబులవంటివారు. ఒక గలేబు ఎఱ్ఱగా నుండవచ్చును. యింకొకటి నీలముగా నుండ వచ్చును. వేఱొకటి నల్లగానుండవచ్చును. కాని అన్నింటిలో నుండునది ఒకేరకపు దూదియే. నరుల స్థితియు యిట్లే యుండును. ఒకడు సుందరరూపి, మఱొకడు నల్లనివాడు; ఇంకొకడు ధర్మాత్ముడు, వేఱొకడు ధూర్తుడు. అయినను వారందఱిలోపలను ఒకే పరమాత్మయే వసించుచుండును.

625. పల్లెకారి యొకడు ఏటిలో వలవేయగా చాలచేపలు పడినవి. కొన్నిచేపలు వలలో నిశ్చలముగ కదలక పడియున్నవి. అవి వలనుండి బయటపడవలయునని యత్నమే చేయవు. కొన్ని గంతులువేసి చాలపెనగులాడినవి; కాని తప్పించుకొనలేవయ్యెను; మఱికొన్ని చేపలుమాత్రము ఏదో తీరున తప్పించుకొని బయటపడినవి. ఈతీరున ప్రాపంచిక జనులు మూడురకములవారు కాన్పించు చున్నారు.

(1) బంధనమున జిక్కియు యెన్నడును విడివడ ప్రయత్నము చేయనివారు.

(2) పెనగులాడువారు - ముముక్షువులు.

(3) ముక్తులు - స్వేచ్ఛను పొందినవారు.

626. మూడుబొమ్మలున్నవి:- ఒకటి ఉప్పుతో చేసినది; రెండవది గుడ్డతో చేసినది, మూడవది రాతిలో చేసినది. ఈ బొమ్మలను నీటిలోముంచినయెడల మొదటిది కఱగిపోయి రూపనాశమునందును; రెండవది చాలనీటిని పీల్చుకొనును; కాని ఆకారమున మారదు; మూడవది నీటిని తనలో చొఱనీయదు. మొదటిబొమ్మ తన జీవాత్మను విశ్వాత్మలో చేర్చి సర్వాత్మత్వమున బడసిన నరుని వంటిది. రెండవది భక్తుని బోలునది; అది దివ్యజ్ఞానానందములను నిండుగ గ్రోలును. మూడవది నలుసంత సత్యజ్ఞానమునై నను హృదయమున చొఱనీయని లౌకికవ్యావృత్తిగలవాని బోలునది.

627. అన్నినీళ్ళును నారాయణ స్వరూపమే; కాని అన్నిరకముల నీళ్ళును త్రాగుటకు పనికిరావు. అటులనే అన్ని ప్రదేశములందును భగవంతుని నిలయము లనుటనిజమే. అయినను అన్నిప్రదేశములును నరుడు దర్శించదగినవిగ నుండవు. ఒకరకమునీరు కాళ్ళుకడిగికొనుటకు మాత్రము ఉపయోగించును; వేఱొకరీతినీరు పుక్కిలించుటకు పనికిరావచ్చును; మఱొకరీతినీరు త్రాగుటకుఅర్హముగనుండును. కొన్నిరకముల నీరు ఎందుకును కొఱగాక తాకుటకుగూడ పనికిరాకుండును. అట్లేవేర్వేఱుస్థలములున్నవి. కొన్నింటిసమీపమునకుమాత్రము పోదగును; కొన్నింటిలోనికి చొఱదగును. మఱికొన్నింటిని దూరమునుండిచూచుటకును దగకుండును.

628. పులిలోసయితము దేవుడుకలడనుట సత్యమే. ఆకారణముచేత మనము సమీపమునకుపోయి ఆజంతువునకు ఎదుఱుగ నిలువరాదు. అతినీచపురుషులందును భగవంతుండుట నిజమే. అంతమాత్రాన మనమందఱితోడను సహవాసము చేయదగదు.

629. ఒకబ్రాహ్మణుని కుమారుడు పుట్టువుచేత బ్రాహ్మణుడగుచున్నాడు. అయినను అటులపుట్టువుచే బ్రాహ్మణులైనవారిలో కొందఱుమాత్రమే పండితులగుచున్నారు; కొందఱు పురోహితులగుచున్నారు; మఱికొందఱు వంటవారగు చున్నారు. ఇంకకొందఱు భోగకాంతవాకిట ధూళిలోపడి కొట్టుకొను వారగుచున్నారు.

630. ఈక్రింద పేర్కొనబడు వారింగూర్చి జాగ్రతతో నుండగావలయును.

(1) (హద్దుపద్దులేకుండ) సతతము వాగుచుండు నోరు గలవాడు.

(2) కపట హృదయము గలవాడు.

(3) చెవులలో తులసియాకులను ధరించి మహాభక్తుని లీల నటించువాడు.

(4) నిండాకు ముసుగువేసికొని నడయాడు స్త్రీ

(5) మిగుల అనారోగ్యకరమగు సాకుడుతో నిండియున్న మురుగుడు గుంటలోని చల్లనినీరు.