శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/32వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

32వ అధ్యాయము.

సన్యాసాదర్శము.

616. ఒకమనుష్యుడు, జబ్బుగానుండిన తనబిడ్డను చేతులలో నిడుకొని ఔషథముకొఱకై ఒక సాధువుచెంతకు పోయెను. మరునాడురమ్మని ఆసాధువు వానితో చెప్పెను. మరునా డతడురాగా "ఆబిడ్డకు మిఠాయి పెట్టకు; త్వరలోనె నెమ్మదించును" అని సాధువుపలికెను. అందు కామనుజుడు "అయ్యా! ఈమాట నాకు నిన్ననే చెప్పలేకపోతిరా?" అనగా సాధువు యిట్లనెను. "అవును. చెప్పెడివాడనే; కాని నిన్ననాముందటనే చక్కెరయున్నది అదిచూచి నీబిడ్డడు "ఈసాధువు తాను పంచదారమెక్కుచు యితరులను తినవద్దంటాడు; వట్టిమోసగాడు; అని పలికియుండును.

617. యోగులును సన్యాసులును పాములబోలువారు. పాము తనకై కలుగును త్రవ్వుకొనదు. చుంచు చేసికొనిన కలుగులోదూరి నివసించును. ఒక కలుగు నివాసయోగ్యము కానిచో మఱొక కలుగులో ప్రవేశించును.

అటులనే యోగులును, సన్యాసులును, తమకై యిండ్లను కట్టుకొనరు; ఇతరుల యిండ్లలోకాలము గడుపుకొందురు - ఈదినమున యీయింటిలో, రేపు వేరొకయింటిలో!

618. ప్రశ్న:- సన్యాసాశ్రమ స్వీకారమునకు తగినవాడు ఎటులుండును? ఉ:- ఎవడు రేపు తానేమితినునో, ఏమిధరించునో అనుచింతలేక ప్రాపంచిక విషయములను పూర్ణముగ విడిచి వేయునో అతడు నిజముగ సన్యాసి అగుటకు తగినవాడు. ఎత్తగు చెట్టునెక్కి తనప్రాణమునకును అవయవములకును ఏమి అపాయము కలుగునో అనుచింత యిసుమంతయు లేక, అవసరమగునేని ఆఉన్నత స్థలమునుండి నిర్భయముగా క్రిందికి దుముకు మనుష్యునివలె నుండును.

619. సన్యాసియొక్క శిక్షణా విధానము చాలకఠినమైనది. అయినను ప్రజల కతడు బోధకుడుగనుండు వాడు కావున అట్టి కఠినశిక్షణమును పడవలయును. ప్రజలు వాని జీవనసరణిని ఆదర్శమును గాంచియే జ్ఞానమును పొందవలసియున్నది. అట్టివాడు స్త్రీలున్నచోట ఉండకపోవుటేగాక, వారి రూపపటములనైనను చూడతగదు. ఆశిక్షణము అంతకఠినమైనది!

620. ఒకడు సన్యాసుల కావివస్త్రమును ధరించినప్పుడు, అతడు నిజమగు సన్యాసివలె అనగా సాధువువలె వర్తించవలయును. నాటకములో రాజువేషమువేసినవాడు సరిగా రాజు వలెను, మంత్రివేషమువేసినవాడు సరిగా మంత్రివలెను. నటించుటను మీరు చూడలేదా? ఒకసారి పగటివేసగాడు సన్యాసివేషము వేసికొని గ్రామాధిపతి యింటికి వచ్చెను. ఆగ్రామనాయకుడు వానికొక ధనపుసంచిని బహుమాన మీయబోయినాడు. ఆతడు దానిని పుచ్చుకొనుటకు నిరాకరించి వెడలిపోయెను. కొంతసేపటికి తనవేషమును తీసివేసి, బూడిదను కడిగికొని మరలవచ్చెను. గ్రామాధికారి యియ్య దలచినడబ్బును అప్పుడియ్యుమని వేడుకొనెను. అతడు సన్యాసివేషముతోనుండగా ధనమును తాక నైనను వానికి తగనిపనియైనది! కాని తరువాత పావలాడబ్బు లిచ్చినను బహు వినమ్రుడై పుచ్చుకొనెను.