శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/30వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

30వ అధ్యాయము.

ఆత్మజ్ఞానము - సంఘాచారములు

586. చెట్టునపండి తనంతటతాను రాలినపండు చాలమధురముగనుండును; కాని కోసిపండవేసినకాయ అంతతియ్యగా నుండదు. మఱియు వాడి ముడుతలుపడును. అదేతీరున సిద్ధత్వమునుపొంది సమస్తభూతములతోడను పరమైక్యభావమును బడసిన పురుషునినుండి కులాచారములు తమంతతామె రాలిపోవును. అట్టిపరమోత్కృష్ణానుభవముకలుగునంతకాలమును ఇతరులందు ఎచ్చుతగ్గులుపాటించుగుణము తొలగిపోదు. వారంతవఱకును కులభేదములను అనుసరించవలసినవారే అగుదురు. అజ్ఞానస్థితిలోనె కులభేదములను విడిచివేసి విచ్చలవిడిగ వర్తించుచు సిద్ధత్వమును పొందినటుల నటించెనేని కృత్రిమముగా పండవేసిన పచ్చిపిందెవలె చెడకతప్పదు.

587. తుపానుగాలి వీచుసమయమున రావిచెట్టుయేదో, మఱ్ఱిచెట్టుయేదో భేదముచేయుటకష్టము. అదేతీరున బ్రహ్మజ్ఞానానిలము వీచునప్పుడు కులభేదములు పాటింప వీలుండదు.

588. భగవద్భక్తిని పూర్తిగ గ్రోలినభక్తుడు నిజముగా సారాత్రాగినవాడే! అట్టిదశలో ఆతడు ఉచితానుచితములను గమనించలేడు.

589. ప్రశ్న:- బ్రహ్మజ్ఞానమును ప్రాపించిన యతడింకను జంద్యమునుంచుకొనుట మంచిదా? జవాబు:- ఆత్మజ్ఞానమును పొందగనే సకలబంధములును వాటంతటవియే రాలిపోవును. ఆపిమ్మట వీడు శూద్రుడనియు, వీడుబ్రాహ్మణుడనియు, వీడుత్తమజాతివాడనియు, వీడు అధమజాతివా డనియు తారతమ్యములుండజాలవు. కావున కులాధిక్యతకు చిహ్నమగు జంద్యమును దానంతట అదియే రాలిపోవును. కాని ఒకనికిభేదములు ఎచ్చుతగ్గులు స్ఫురించునంత వఱకును వానిని ఆతడు బలాత్కారముగా త్రోసిపుచ్చరాదు.

590. తప్పత్రాగినవాడుచొక్కాను ఒక్కొకప్పుడు తలకుచుట్టుకొనుచు, ఒక్కొకప్పుడు కాళ్లకుతొడుగుకొనుచు నుండుతీరున బ్రహ్మావేశితపురుషుడు బాహ్యప్రపంచజ్ఞానముం గోల్పోయి వర్తించును.

591. పుండు మానిపోయిన అనంతరము పొక్కు దానంత నది రాలిపోవును. అంతదాక ఆగక యాపొక్కును బలాత్కారముగ లాగివేసితిమా, నెత్తురుకారనారంభించును. అటులనే బ్రహ్మజ్ఞానతేజము కలుగగానే కులభేదము వానంతట అవియే వీడిపోవును; కాని పామరులుగ నుండియు, అట్టిబేదములను తిరస్కరించుటతప్పు. అందువలన అనేకములగు అనర్ధములు పొసగును.

592. ఈకాలపునరులు ప్రతిదాని సారాంశమును తెలియగోరుదురు. వారికి మతమునందును సారమే కావలయునే కాని అప్రధానాంశములు వారికక్కఱలేదు. (క్రతువులు, కర్మలు, నీమములు, నోములు, ఏవియు పాటింపరు) 593. మంచిముత్యమును గర్భమునందు తాల్చు ముత్తెపు చిప్పకు అంతగా విలువలేదు; కాని ఆముత్యము పరిపక్వమగుటకుగాను ఆచిప్ప చాల ప్రధానమైనదే! ముత్యమును దీసికొనిన నరునకు ఆచిప్ప వ్యర్ధమే కావచ్చును. అట్లే కర్మలు క్రతువులు బ్రహ్మపదవిని సాధించినవానికి అవసరములుకాక పోవచ్చును.

594. భగవన్నామోచ్చారణ చేయువారు పవిత్రులగుదురు. (దక్షిణేశ్వరమునకు దాపునగల) ఆర్యాధగ్రామమున కృష్ణకిశోరుడను జ్ఞానికలడు. ఆయన ఒకసారి బృందావనమునకు తీర్ధయాత్ర వెడలెను. ఒకనాడాయన యిటునటు తిరుగుచుండగా, నూతిదాపున నిలుచుండియున్న ఒకమనుష్యుని గాంచి తనకు కొంచెము నీళ్ళుతోడిపెట్టుమని అడిగెను. ఆ మనుష్యుడు తానొక మాలవాడననియు బ్రాహ్మణునకు నీరు తోడియిచ్చుటకు తగననియు చెప్పెను. "ఒకసారి భగవన్నామోచ్చారణ చేసి పావనుడవు కమ్ము" అని కృష్ణకిశోరు పలికెను. ఆమనుష్యుడటుల భగవన్నామమును ఉచ్చరించి, ఆయనకొఱకు నీరుతోడిపెట్టెను. ఆయన బహునిష్ఠాగరిష్ఠుడగు బ్రాహ్మణుడయ్యును ఆనీరు త్రాగినాడు! ఆయన విశ్వాసమెంత గొప్పదో!

595. ఒకపర్యాయము కృష్ణకిశోరు "నీవు ఎందులకు జందెము తీసివేసితివి? అని అడిగెను నాకీ (బ్రహ్మభావన) ప్రాప్తించినప్పుడు, అశ్వినీ జంఝామారుతము వీచినప్పటివలె (1864 సంవత్సరపు ఉప్పెనవలె) అన్నియు కొట్టుకొని పోయినవి. నాకు బాహ్యప్రపంచ స్ఫృహయే లేదయ్యె. అప్పుడు నాజందెమునుగాని కట్టుకొనిన బట్టనుగాని జాగ్రత్తచూచువారెవరు? తీవ్రమగు బ్రహ్మభావనయందు మునిగిపోయి, ప్రతిదినము చాలసేపు కట్టుబట్టకూడ లేక దిస మొలతో నుంటిననియు నాకు తెలియలేదు. కృష్ణకిశోరు జందెము తీసివేసితినని నన్నాక్షేపించినప్పుడు "భగవంతుని గూర్చిన పారవశ్యత నిన్ను ఆవేశించినప్పుడు నీకివిషయము స్పష్టపడును లెమ్ము' అంటిని.