Jump to content

శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/29వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

29వ అధ్యాయము.

జ్ఞానియొక్క సమదృష్టి.

575. గాలి శ్రీగంధపుసువాసనను, ముఱుగుడు పీనుగు వెలిగ్రక్కు చెడుకంపునుకూడ మోసికొని పోవును. కాని ఆగాలి వీనితో కలియదు. అదేవిధముగా ముక్తాత్ముడు ప్రపంచములో నివసించుచుండును, కాని ఆప్రపంచములో కలిసిపోడు.

576. సాధువొకడు జనముతో నిండియున్నవీధిలోపోవుచు, ఒకదుష్టుని కాలివ్రేలును పొఱబాటున త్రొక్కుట తటస్థించెను. ఆదుష్టుడు కోపావేశుడై, ఆసాధువుని స్మృతితప్పిపడిపోవునటుల నిర్దయుడై మోదెను. ఆసాధుని శిష్యులు చాలశ్రమచేసి, అనేక ఉపచారముల సలిపి వానికి స్మృతితేర్చిరి. వానికి కొంచెము స్ఫృహరాగా "స్వామీ! మీకీ ఉపచారములు చేయునదెవరో గుర్తుతెలియునా?" అని అడిగిరి. "ఆహా? నన్ను కొట్టినయతడే సందేహ మేమి?" అని ఆసాధు సత్తముడు జవాబుచెప్పెను. నిజమగుసాధువునకు శత్రుమిత్రులను భేదభావము తోచదు.

577. సద్వంశీకురాండ్రగు పుణ్యస్త్రీలను చూచునప్పుడు, పతివ్రతా వేషముదాల్చి నిరాడంబరముగ నాజగజ్జననియే వారియందు నాకు కానవచ్చును. మఱియు అత్యాడంబరముతో సిగ్గునువిడిచి శృంగారించుకొని వీధిపంచలందు కూర్చుండు నగరవ్యభిచారిణీస్త్రీలను చూచినప్పుడును, నాకు ఆదివ్యమాతయే వేఱొకరీతిని లీలసలుపుచున్నటుల నాకు గోచరించును.

578. క్షమయే సన్యాసికి ప్రధానలక్షణము.

579. నీటముంచిన కడవలోపల నిండుగ నీరుండును; మఱియు దానిచుట్టుకూడ నీరుండును; అటులనే భగవంతుని యందు నిమగ్నమైన జీవునియందు పరమాత్మ సర్వవ్యాపియై, బాహ్యమునగూడ ఎల్లెడల నావరించియుండును.

580. శాంతి ధర్మములతో జీవనముగడపుచు ప్రజల నిందా స్తోత్రములు సరకుగొనక వర్తించుము.

581. మనుజుడు మైదానముపైనున్న సమయమున అల్పమగు గడ్డిని మహోన్నతములగు మఱ్ఱిచెట్లనుచూచి "ఆహా! ఈవృక్షము ఎంతఉన్నతమైనది! ఈగడ్డి ఎంతకొద్దిది!" అనుచుండును. ఆతడేపెద్దపర్వతమునెక్కి ఎత్తగుదానిశిఖరమునుండి చూచునప్పుడు గడ్డియు వృక్షమును వేఱుపఱచుటకు వీలుగాని పచ్చని తృణజాలముగ గోచరించుట తెలియును. అటులనే లౌకికపురుషుల దృష్టిలో సంపత్తు, ఉద్యోగము, మున్నగుభేదములు తోచును. ఒకడు రాజ్యముపాలించురాజు, మఱొకడు చెప్పులుకుట్టు మాదిగ, ఒకడుతండ్రి వేఱొకడు కొడుకు, ఇట్లెన్నియోభేదములు కాని దివ్యదృష్టి ప్రాప్తించినవానికి సర్వమును సమమైతోచును; ధర్మాధర్మములు, ఉత్తమాధమములు అను తారతమ్యములు రూపుమాసిపోవును.

582. ఒకసారి భక్త్యావేశముతో పరవశుడైయున్న సాధు వొకడు శ్రీరామకృష్ణపరమహంసులవారుండు రాసమణీదేవి గారి కాళీదేవళమునకువచ్చెను. ఒకనాడు ఆయనకు భోజనము దొఱకలేదు; అకలిగానున్నను ఆయన ఎవరిని యాచించలేదు. భోజనానంతరము ఎంగిళ్లుపాఱవేయుగొందిలో ఆకులనాకుచున్న కుక్కకడకుపోయి ఆయన "అన్నా! నాకుపాలీయ కుండ ఒంటరిగ నీవేతినుచున్నావా?" అనెను. అట్లనుచు కుక్కతోకూడ కలిసితినసాగెను. అట్టివింత సహవాసగానితో భోజనముచేసిముగించి, కాళీమాతయాలయమునకు తిరిగివచ్చి దేవళములోనివారికెల్ల గగుర్పాటొదవునటుల మహా భక్త్యావేశముతో ఆయన దేవీస్తోత్రము చేయగడంగెను. కొంతవడికి ప్రార్ధననుముగించి ఆయన వెడలిపోవుచుండగాంచి, తనబంధుడగు హృదయముఖర్జీగారిని ఆయనవెంటబోయి ఆయన యేమనునో తిరిగివచ్చి చెప్పుమని పరమహంసులవారు పంపిరి. హృదయుడు వానివెంట కొంతదూరము పోయెను. ఆసాధు సత్తముడు వెనుకకుతిరిగి "నీవు నావెంటవచ్చుచుంటివి, ఏల" అని అడుగగా స్వామీ! నాకేమేని బోధచేయుము! "అని హృదయుడు పలికెను. అంతట ఆమహానీయుడిట్లుపదేశించెను. "ఈముఱికి గోతిలోని నీరును, ఆపాసనగంగాజలమును నీకెప్పుడు సమమైతోచునో, వేణుగానమును అల్లరిమూకల గోలయు నీచెవికి ఎన్నడు సమానముగతోచునో, అప్పుడు నీవు పరమజ్ఞానావస్థను పొందినట్లగును."

హృదయుడు మరలివచ్చి యీమాటలను పరమహంసులవారికి వినిపించగా వారిట్లనిరి. "ఆపురుషుడు సమాధిస్థితిని జ్ఞానసిద్ధిని పొందినవాడు. సిద్ధత్వమును పడసినయతడు బాలునివలెను, పిశాచమువలెను, పిచ్చివానిపోలికను, ఇంకను చాలమారువేసములతోడను తిరుగులాడుచుండును."

583. బలిపీఠము, బలియగు జంతువు, బలికై దానిని నఱుకు నరుడు, మువ్వురును ఒకే తత్వమని తెలిసికొంటిని.

584. ప్రతినరాకృతియందును భగవంతుడు చరించుచు పుణ్యులందును, పాపులందును శిష్టులందును, దుష్టులందును ఆయన ప్రత్యక్షమగుటను అపరోక్షముగ గ్రహించుదశకు నేనిప్పుడు వచ్చితిని. కావున నేను వేర్వేఱు జనులను కలియునప్పుడు యిట్లనుకొందును:- "సాధురూపమున భగవంతుడు దుష్టరూపమున భగవంతుడు, యోగ్యునిరూపమున భగవంతుడు, అయోగ్యునిరూపమున భగవంతుడు (అన్ని రూపములందును భగవంతుడే!")

585. భగవంతునియందు విద్య, అవిద్యరెండును కలవు. విద్యామాయ నరుని భగవంతునిదిక్కు నడపును. అవిద్యా మాయ వానిని పెడత్రోవకులాగి భగవంతునికి దూరముచేయును. జ్ఞానము, భక్తి, వైరాగ్యము, కరుణ, యివన్నియు విద్యామాయయొక్క సూచనలు; వీనిసాయమున భగవంతుని చేరవచ్చును.

కాని యింకొకమెట్టు పైకిపోతివా బ్రహ్మజ్ఞానములభించును. భగవంతుని పొందినట్లే ఈదశయందు భగవంతుడేసర్వమును అయ్యెనని నేనుగ్రహింతును. ఇంతేల ప్రత్యక్షముగ చూడగలను. అంగీకరించుటకుగాని, త్యజించుటకుగానిఏమియు లేదు. ఎవరిమీదనైనను నేనుకోపముపూనుట సాధ్యపడదు.

` ఒకసారి నేను బండిలోనెక్కిపోవుచుండగా ఒకమిద్దెపై నిలుచుండిన యిరువురువ్యభిచారిణులు గాంచనయ్యెను. కాని వారిలో నాదివ్యజననియే ప్రత్యక్షమగుటచేత ప్రణామము చేసితిని.

ఈ చిత్త వైఖరి నాకు లభించినప్పుడు (దక్షిణేశ్వరాలయమునందలి) కాళీమాతను పూజించుటకును, అర్పణలు చేయుటకును, సాధ్యముకాకపోయినది. నాస్థితిచూచి దేవాలయపు యజమాని నన్ను మందలింపసాగెను. అప్పుడు నాకెంతమాత్రము రోషమువచ్చెడిది కాదు; వానిమందలింపులు విని నవ్వెడివాడను.