Jump to content

శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/17వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

17వ అధ్యాయము.

శ్రద్ధ.

347. ఒకనిని చంపవలయుననిన కత్తులు, కఠారులు కావలసియుండును. తనను తాను చంపుకొనుటకు సూదియే చాలును. అదేతీరున యితరులకు బోధించవలయుననిన చాల గ్రంధములు శాస్త్రములు చదువుటవసరమగును; స్వస్వరూప సాక్షాత్కారమును పడయుటకు ఒక్కమంత్రమునందు శ్రద్ధయున్నచాలును.

348. చక్కెఱను కణకణలాడు నిప్పుపైన కాచుము. దానిలో మకిలియున్నంతవఱకును ఆపాకమునుండి పొగయు, కళపెళధ్వనులును వచ్చును. కాని మకిలిమాలిన్యము తొలగించిన పిమ్మట పొగయుండదు. చప్పుడుయుండదు. స్వచ్ఛమగు పానకము పొంగులుపెట్టుచుండును. అది గడ్డగట్టినను లేక పానకముగా నున్ననుగూడ దేవతలకుగాని, మానవులకుగాని పరమానందదాయినిగ నుండును. శ్రద్ధగలవానినడతయు అటులనేయుండును.

349. హిందువులలో అనేకతెగలున్నవిగదా! ఏ తెగను యేధర్మమును మనము అనుసరించుట? - పార్వతియొకసారి "నాథా! నిత్యమై, సత్యమై, సర్వవ్యాప్తమై పఱగుఆనందమునకు మూలమెందున్నది?" అని మహాదేవుని ప్రశ్నించినది. "దానిమూలము శ్రద్ధ (చలింపనివిశ్వాసము) లోయున్నది" అని ఆదేవదేవుడు ప్రత్యుత్తరమిడినాడు. కావున తెగలు సాంప్రదాయములు భిన్నములుగనున్నను బాధలేదు. ప్రతివాడును తనభక్తిసాధనలను తన సాంప్రదాయకధర్మములను శ్రద్ధతో నిర్వహించిన చాలును.

350. ఎవడు నిర్మలవిశ్వాసముతోడను, నిష్కపటభక్తితోడను సర్వేశ్వరుని యిచ్ఛకుస్వార్పణము కావించుకొనునో అతడువేగమే బ్రహ్మసాక్షాత్కారమును పొందును.

351. ఒకశిష్యుడు తనగురువుయొక్క అనంతమహిమయందు నిశ్చలవిశ్వాసముగలవాడై, కేవలము గురునామస్మరణ మాత్రాన ఏటిపైనడచిపోవుచుండెను. దీనిని కనిపెట్టిన గురువు "ఆహా! నానామమాత్రమునందేఎంతమహిమగలదో! కావున నేనుఎంతఘనుడను; ఎంతమహిమాఢ్యుడ నయియుండవలయును!" అని తలంచెను. మరునాడాగురువు "నేను, నేను నేను" అనుచు ఆనదిపైని నడచిపోవయత్నించెను. ఆతడు నీళ్లలో కాలుపెట్టెనో లేదో, తక్షణము మునిగి లోతునపడి పోయెను. పాపము అతనికిఈతరాదయ్యె. విశ్వాసము అద్భుతకార్యములచేయ సామర్ధ్యముకలది. అహంకారము నరునికి ప్రాణహానిగూర్చును.

352. ఒకడు నదినిదాటి పోవలసివచ్చెను. ఒకసిద్ధుడు వానికొకతాయెత్తునిచ్చి "ఇదినిన్నునదిని దాటించును." అనిచెప్పెను. ఆమనుష్యుడాతాయెత్తును చేతికికట్టుకొని నదిమీదుగానడచిపోవు చుండెను. ఆతడు ఏటినడుమపోవునప్పటికి, తనకింత విచిత్రశక్తినొసగిన తాయెత్తులోపల యేమున్నదో చూడవలయు నను కోరికపుట్టినది. వెంటనే దానిని తెఱచి చూచినాడు. దానిలో "రామ" అని పరమేశ్వరునిపవిత్ర నామము ఒక్కటి మాత్రమే వ్రాయబడియుండుట వానికి తెలియవచ్చినది. "ఓసి! దీనిలోని రహస్యము యిదేనా?" అనితృణీకారముతో పలికినాడు. ఇట్లతడు అనుకొనువెనువెంటనే నదీజలములో మునిగిపోయినాడు. భగవన్నామము నందలి విశ్వాసము యద్భుతకార్యముల చేయగలదు. అట్టివిశ్వాసము ప్రాణమనవచ్చును. సంశయము మరణమే.

353. బ్రహ్మహత్య పాపమునకు పాల్పడిన ఒకరాజు ఎట్టిప్రాయశ్చిత్తముచేసికొని తాను పునీతుడుకా గల్గునో విచారించుటకై యొక ఋష్యాశ్రమమునకువెళ్లెను. అందుఋషిలేడు. వాని కుమారుడుమాత్ర ముండెను. ఆఋషిపుత్రుడు రాజు వచ్చిన విషయమును తెలిసికొని "ముమ్మారు రామనామస్మరణ చేయుము; నీపాపపరిహారమగును." అనిచెప్పినాడు. ఋషి తిరిగి వచ్చినప్పుడు తనకుమారుడు విధించిన ప్రాయశ్చిత్తకర్మనుగూర్చివిని, కోపించి, "ఆపరమేశ్వరుని పావననామమును ఒక్కసారి ఉచ్ఛరించినంతమాత్రాన కోటిజన్మలలో చేసిన పాపపుంజములన్నియు హరించునే! ఓరి మూఢుడా! నీవెంతటి విశ్వాస సూన్యుడవు! అట్టిపవిత్రనామమును మూడుసార్లు ఉచ్ఛరించుమని విధించితివా! నీవిశ్వాసహీనతకు శిక్షగా ఛండాలుడవై పుట్టుము." అని శపించినాడు. ఆతడే రామాయణమున పేర్కొనబడిన గుహుడు.

354. నీవు ఈశ్వరదర్శనము చేయగోరితివా వాని నామ మును సుస్థిరవిశ్వాసముతో స్మరించుము. నిత్యానిత్యవిచారము చేయుము.

355. ఎవనికి విశ్వాసము కలదో వానికి అన్నియు ఉన్నట్లే; ఎవనికి విశ్వాసములేదో వానికి అన్నియుకొఱతయే.

356. శ్రీరామచంద్రుడు లంకలో ప్రవేశించుటకుపూర్వము సముద్రముమీద వంతెనను కట్టవలసివచ్చెను. కాని విశ్వాససంపన్నుడగు హనుమంతుడు తనకు రామునిపై విశ్వాసమును సాధనముగా గొని ఒక గంతులో సముద్రమును దాటిపోగలిగెను. కేవలము విశ్వాసమహిమచేత స్వామికన్న సేవకుడు ఘనకార్యమునుచేయగల్గినాడు.

357. భరతదేశమునగల వైద్యులలో కేవలము విశ్వాసమును గొలిపిమాత్రమే రోగముల కుదుర్చువారు కలరు. "రోగమనునదియే లేదు." అని పూర్ణవిశ్వాసముతో మరల మరల స్మరించుడని విధింతురు. రోగగ్రస్తులు అటులస్మరణ చేసి, ఆభావనామహిమచేతనే ఆరోగ్యమును బడయుదురు. కాబట్టి నీవు పాపినని స్మరించితివా త్వరలోనె నీవు పాపివే అయిపోదువు. నీవు మహామహిమాఢ్యుడవని యెఱిగి విశ్వాసమును పూనుము. నీవెంతయో మహిమగలవాడవగుదువు.

358. ఒకశిల అనేకవత్సరములు నీటిలోపడియుండవచ్చును. అయినను ఒకచుక్కనీరైనను దానిలోప్రవేశించ జాలదు. కానిమృత్తిక నీటిస్పర్శతగులగానె మెత్త బడుచున్నది. అటులనే విశ్వాసముదృఢపడిన హృదయముగలవారు, బాధ లెన్నివచ్చినను దుఃఖములెన్నిపైబడినను కృంగిపోరు. దుర్బల విశ్వాసముగలవాడో యిసుమంతకష్టముప్రాప్తించిననే చంచలించిపోవును.

359. చకుముకిరాయి నీటియడుగున కోటిసంవత్సరములు పడియుండుగాక, అది తనయందలి అగ్నినికోల్పోవదు. నీవు దానిని యినుముతో యెప్పుడుకొట్టిననుసరే నిప్పురవ్వలు గ్రక్కును. సత్యమగు స్థిరవిశ్వాసి అటులుండును. ఈలోకములో అతడు ఎటువంటిపాతకజనుల నడుమనున్ననుగూడ తన భక్తివిశ్వాసముల నష్టపడడు. పరమేశ్వరనామముచె వినిపడినంతనే తన్మయతను పొందును.