శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/16వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

16వ అధ్యాయము.

విగ్రహారాథనము.

336. లక్కపండును, లక్కఏనుగును, నిజమగుపండును, ఏనుగును జ్ఞప్తికితెచ్చువిధమున, పూజింపబడు విగ్రహములు నిరాకారుడై నిత్యుడై వెలుంగు బ్రహ్మమును జ్ఞప్తికి తెచ్చును.

337. ఆకాలమున విగ్రహారాధనను ఖండించుచుండెడి కేశవచంద్రసేనునితో భగవాన్ శ్రీరామకృష్ణపరమహంసుల వారిట్లు పలికిరి:- "ఈ విగ్రహములు ఎందువలన నీమనస్సులో మన్ను, రేగడ, రాయి, గడ్డి అనుభావనలను కల్పింపవలె? ఈస్వరూపములందు సయితము అలనిత్యానంద విజ్ఞానమయి యగు జగజ్జననియే నీకేలప్రత్యక్షముకానాదు?"

338. తాను అర్చించు దేవులయొక్కయు, దేవియొక్కయు, విగ్రహములు నిజముగా దివ్యరూపములే అని విశ్వసించు నతడు బ్రహ్మమునేచేరును. కాని వానిని అతడు మన్ను, గడ్డి, రాయి, మాత్రమే అనితలచెనా, వానికీ విగ్రహములను ఆరాధించిన ఫలములేదు.

339. ఒక చిన్నఅక్షరములను వ్రాయుటకు పూర్వము పెద్దపెద్ద సున్నలను వ్రాయుట నేర్చువిధమున, విగ్రహముల మీద మనస్సునుస్థిరముగ నిలుపుటమూలమునచిత్తైకాగ్రతను సాధనచేసి, తదనంతరము నిరాకారబ్రహ్మముపైని సులభముగ చిత్తమును నిలుపుజాలును.

340. పెద్దపెద్ద వస్తువులపై అమ్ములవేయుటచేత విలుకాడు బాణప్రయోగమును నేర్చును. బాణప్రయోగమున వానికి నేర్పరితనము కుదిరినకొలది సూక్ష్మతర లక్ష్యములపై గురిని నిలుపసాగును. అటులనే సాకారములగు విగ్రహములపైని మనస్సును లగ్నముచేయుటసాధనచేసిన పిమ్మట, నిరాకారవస్తువుపైని మనస్సులగ్నముచేయుట సులభముగ చేకూరును.

341. ఆవుపాలు నిజముగా రక్తరూపమున ఆవుశరీరము నందంతటను వ్యాపించియుండును. అయినను ఆఆవు చెవులను కొమ్ములను పిండుటచేపాలురావు. పొదుగునుండియే పాలు పితుకవలెను. అటులనే భగవంతుడు జగమునంతటను నిండియున్నాడు. కానిఎల్లెడలను వానిని ప్రత్యక్షముచేసికొనజాలవు. ప్రాచీనభక్తవరులు పూర్ణభక్తితో సాధనములుచేసి యుండిన పుణ్యదేవళములందు భగవంతుడు సులభముగా ప్రత్యక్షముకాగలడు.

342. పరమహంసులవారు తనశిష్యులలో ఒకనికి యిట్లు చెప్పిరి:- నీవురేగడమట్టితో చేసినవిగ్రహముల గూర్చి వాకొనుచుంటివి. అవియు కావలసియే యున్నవి. ఆత్మపరివర్తనమున ఆయాదశలలోనున్న వారికి అనుకూలించుకొఱకు వేర్వేఱుఅర్చనారూపములు ఏర్పాటుచేయబడియున్నవి. 343. తల్లితనబిడ్డలలో ఎవరికితగిన ఆహారము వారికి లభించుకొఱకు వంటకములను వేర్వేఱురీతులుగా చేయును. ఆమెకు అయిదుగురు బిడ్డలుండి ఒక పెద్దచేపదొఱికినయడల దానిని వేర్వేఱురీతులుగ పచనముచేసి యెవరికి యేదిసరిపడునో వారికదిపెట్టును. ఒకనికిపల్వాచేసి పెట్టును; జీర్ణశక్తికొఱవడిన మఱొకనికి చారుగాచిపెట్టును. తక్కినవారికి కూడ వానివానికడుపునకు సరిపడుతీరున వండిపెట్టును.

344. ఒకశిష్యుడు:- బ్రహ్మము సాకారుడు అని నమ్మనేవచ్చును. కాని అతడు, మనముపూజించు మట్టిబొమ్మమాత్రము కాజాలడు.

గురువు:- దానినిమట్టిబొమ్మఅనెదవు ఏల? ఆదేవతావిగ్రహము ఆత్మమయముగా చేయబడినది.

345. విగ్రహారాధనమున ఏమేని కొఱతయున్నను, అర్చనలు సర్వమును తనకొఱకే ఉద్దేశింపబడినవని భగవంతునికి తెలియదా? అర్చనలు తనకై యే ఉద్దేశింపబడినవని గ్రహించి వానిని భగవంతుడు స్వీకరించును. భగవంతుడు ప్రేమమయుడు. అత్యంత సమీపముగనున్న నీధర్మమును నీవునిర్వహింపుచుండుము.

346. ఒకనికి బ్రహ్మసాక్షాత్కారమైనప్పుడు ప్రతివస్తువును, విగ్రహములు సయితమన్నియు, ఆత్మస్వరూపములేయనితెలిసికొనును. అటువంటివాని దృష్టిలోవిగ్రహము ఆత్మమయరూపమేగాని కేవలము మృణ్మయముకాదు.