శ్రీ నగజా తనయం సహృదయం
వాగ్దానం (1961) సినిమా కోసం శ్రీరంగం శ్రీనివాసరావు రచించిన హరికథా కాలక్షేపం.
శ్రీ నగజా తనయం సహృదయం || శ్రీ ||
చింతయామి సదయం త్రిజగన్మహోదయం || శ్రీ ||
శ్రీరామ భక్తులారా ! ఇది సీతా కళ్యాణ సత్కథ 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను అంచేత, కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతం ఏర్పడినట్లు తోస్తుంది.
నాయనా... కాస్త పాలు మిరియాలు ఏవైనా...
చిత్తం ! సిద్ధం
భక్తులారా ! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో అందరిని ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందర మూర్తి. ఆహ్హా ! అతడెవరయ్యా అంటే
రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
రమణీయ వినీల ఘనశ్యాముడు
వాడు నెలఱేడు సరిజోడు మొనగాడు
వాని కనులు మగమీల నేలురా, వాని నగవు రతనాలు జాలురా || వాని కనులు ||
వాని జూచి మగవారలైన మైమరచి
మరుల్ కొనెడు మరోమరుడు మనోహరుడు
రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
సనిదని, సగరిగరిగరిరి, సగరిరిగరి, సగగరిసనిదని,
సగగగరిసనిదని, రిసనిద, రిసనిద, నిదపమగరి రఘురాముడు
ఔను ఔను
సనిసా సనిస సగరిరిగరి సరిసనిసా పదనిసా
సనిగరి సనిస, సనిరిసనిదని, నిదసనిదపమ గా-మా-దా
నినినినినినిని
పస పస పస పస
సపా సపా సపా తద్ధిమ్ తరికిటతక
శభాష్, శభాష్
ఆ ప్రకారంబున విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో
ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే
మనసింతలోనె దోచినాడే ఎంత సొగసుగాడే
మోము కలువఱేడే... ఏ... మోము కలువఱేడే
నా నాము ఫలము వీడే ! శ్యామలాభిరాముని చూడగ
నామది వివశమాయె నేడే
ఎంత సొగసు గాడే
ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై యుండగా అక్కడ స్వయంవర సభామంటపంలో జనక మహీపతి సభాసదులను జూచి
అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగుపుత్రి సీత !
వినయాధిక సద్గుణవ్రాత ముఖవిజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ దాలిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెల మాలవైచి పెండ్లాడు ఊ... ఊ ఊ
అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరు ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా "హా ! ఇది నా ఆరాధ్యదైవమగు పరమేశ్వరుని చాపము దీనిని స్పృశించుటయే మహాపాపము" అని అనుకొనిన వాడై వెనుదిరిగి పోయాడట. తదనంతరంబున...
ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజగమనము తోడ స్వయంవర వేదిన చెంత
మదన విరోధి శరాసనమును తన కరమున బూనినయంత
ఫెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనే
గుభిల్లుమనె గుండె నృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము...
ఒక నిమేషమ్ము నందే
నయము జయమును భయము విస్మయము గదురా
ఆ... శ్రీ మద్రమారమణ గోవిందో హరి...
భక్తులందరు చాలా నిద్రావస్థలో ఉన్నట్లుగా వుంది
మరొక్కసారి
జై! శ్రీ మద్రమారమణ గోవిందో హరి...
భక్తులారా ! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు అంతట
భూతలనాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె
పృధుగుణమణి సంఘాతన్ భాగ్యోసేతన్ సీతన్ || భూతల ||
శ్రీ మద్రమారమణ గోవిందో హరి