Jump to content

శ్రీవేంకటేశ్వరవచనములు/స్తవం

వికీసోర్స్ నుండి

శ్రీ వేంకటేశ్వర ప్రభాతస్తవము

శ్రీగురుం డర్థితో శేషాద్రియందు
యోగనిద్రాకేళి నున్నయత్తఱిని

వనజాసనాదిదేవత లేఁగుదెంచి
వినుతించి రప్పు డవ్విధ మెట్టిదనిన
 
శ్రీకర! వేంకటక్షితిధరావాస!
నాకేంద్రనుత రమానాధ మేల్కనుము

వసుదేవదేవకీ వరగర్భజాత
కిసలయాధర రామ కృష్ణ మేల్కనుము

తపము పెంపున యశోదానందులకును
గృపతోడ శిశువైన కృష్ణ మేల్కనుము

పూతనాకై తవ స్ఫురితదుర్వార
చైతన్యహరణ ప్రశస్త మెల్కనుము

అఱిముఱి శకటాసురాంగంబు లీల
విఱుఁగఁదన్నిన యదువీర మేల్కనుము

సుడిగాలిరాకాసి స్రుక్కడంగించి
గెడపినకెదుబాలకృష్ణ మేల్కనుము

మద్దులఁ గూల్చి యున్మద వృత్తి మెఱయు
ముద్దుల గోపాలమూర్తి మేల్కనుము

అద్రిరూపంబైన యఘదైత్యుఁ జంపి
రౌద్రంబు నెఱయు భూరమణ మేల్కనుము

'

ఆననంబునఁ దల్లి కఖిలలోకములు
పూని చూపిన యాదపురుష మేల్కనుము

ఖర ధేనుకాసురక్రకచ ! మేల్కనుము
వరగర్వఘనబక వైరి ! మేల్కనుము

చతురాసనుఁడు వత్స సమితి నొంచినను
బ్రతియొనర్చిన పరబ్రహ్మ ! మేల్కనుము

కాళియ ఫణిఫణాంగణ నృత్యరంగ
లాలితచరణవిలాస ! మేల్కనుము

అతులకుబ్ధామనోహరుఁడ ! మేల్కనుము
చతురమాలా కారశరణ ! మేల్కనుము

వనజాక్ష ! యక్రూరవరద ! మేల్కనుము
వినయ వాక్యోద్ధవనినుత ! మేల్కనుము

భుజ విక్రమక్రమ స్ఫూర్తిమై భోజ
గజముఁ జంపిన బాహుగర్వ ! మేల్కనుము

జెట్టిపోరను గిట్టి చీరి చాణూరు
చట్టలువాపిన శౌరి ! మేల్కనుము

కురుసైన్యవిదళనాకుంఠితోత్సాహ
భరితపాండవపక్షపాత ! మేల్కనుము

చండ భారతరణ చాతుర్య ధుర్య
గాండీవి 'సారథ్య కరణ ! మేల్కమము

బల భేది భేదించి పారజాతంబు
నిలకుఁ దెచ్చివ జగదీశ ! మేజ్కు నుము

బాణబాణాస నోద్భట భీమ బాణ
పాణిఖండన ! చక్రపాణీ ! మేల్కనుము

రాజసూయమున శూరతం జైద్యుం దునిమి
పూజలందిన జగత్పూజ్య ! మేల్కనుము

మురనరకాసురముఖ్య దానవులఁ
బొరిగొన్న యదురాజ పుత్ర ! మేల్కనుము

వీర కౌరవ సభ విశ్వరూపంబు
ధీరతఁజూపిన దేవ ! మేల్కనుము

ఇంపునఁ బృథుకంబు లిడినకుచేలు
సంపన్నుఁ జేసిన చతుర ! మేల్కనుము

దారుణ భూభార తరణావతార
భూరిప్రతాప విస్ఫురణ ! మేల్కనుము

సదమలానంద ! నిశ్చయముల కంద!
విదురుని వింద ! గోవింద ! మేల్కనుము

భోజకన్యా ముఖాంభోజ ద్వి రేఫ
రాజీవనయనాభిరామ ! మేల్కనుము

వరరూపవతి జాంబవతితో డిరతుల
నిరతి మైనోలాడు నిపుణ ! మేల్కనుము

మంజుల సత్యభామా మనస్సంగ
రంజితగాత్ర సంరంభ ! మేల్కనుము

లలిత కాళిందీ విలాస కల్లోల
కలిత కేళీలోల ఘనుఁడ మేల్కనుము .

సారసుదంతా భుజకుముద హార
చారుప్రభాపూర చంద్ర! మేల్కనుము

నేత్రరాగ విశేష నిచితప్రతోష
మిత్రవిందారసోన్మేష ! మేల్కనుము

భద్రానఖాంకుర బాల చంద్రాంక
ముద్రిత భుజతటీమూల ! మేల్కనుము

లక్షణా పరిరంభ లక్ష్మితో దార
వక్షోవిశాల కవాట ! మేల్కనుము

వేడుకఁ బదియాఱు వేలకామినులఁ
గూడిపాయని పెండ్లికొడుక ! మేల్కనుము

కలిత వక్రగ్రాహగంభీర జలధి
వలయిత ద్వారకావాస ! మేల్కనుము

జలదనీల శ్యామ ! జగదభిరామ !
వేలయ మేల్కను మంచు విన్నవించుటయు

వీనులఁ గదిసిన వెలిదమ్మికన్నుఁ
గోనల నమృతంబు గురియ మేల్కాంచి

సరసిజాక్షుఁడు దేవసంఘంబు మీఁద
కరుణాకటాక్ష వీక్షణము నిగుడ్చి

శ్రీవేంకటాచల శిఖర మధ్యమున
సౌవర్ణమణి మయ సౌధంబులోన

పూగచంపక కుంద పున్నాగవకుళ
సాగరంగప్రసూన విరాజమాన

తరులతా పరివేష్టితంబైన యట్టి
నిరుపమ కోనేటి నిర్మలాంబువుల

తిరుమజ్జనం బాడి దివ్యాంబరంబు
ధరియించి దిన్యగంధము మేనఁదాల్చి

నవరత్నమయ భూషణంబులు వెట్టి
వివిధ సౌరభముల విరు లోలి ముడిచి

ధారుణీసురులకు దానంబు లొసంగి
చేరి యక్షతములు శిరసునఁ దాల్చి

వినుతులు గావింప విబుధసన్మునుల
మనవులు విని వారి మన్నించి మించి

యగణీతరత్నసింహాసనారూడు
డగుచు మేరువుమీఁది యభ్రంబువోలె

గరకంకణోజ్ జ్వల క్వణనంబు లెసగ
సరసిజముఖులు వెంజామరల్ వీవ

బంగారు గుదియల పడవాళ్లు వరల
నారదవీణా నినాదంబు లెసగ

చారణ మునిసిద్ధ సంఘంబు గొలువ
నానాప్సరసృతుల్ నాట్యముల్ సేయ

నూనవేశులు మహామహులు సేవింప
ఘనతర నిత్య భోగంబులు వెలయ


జనులకెల్ల మహాప్రసాదంబు లొనరఁ
గోరినవారికిఁ గోర్కు లీడేర,

నీరీతి జగముల నేలుచునుండు
నని భక్తిఁ దాళ్లపా కాస్నమాచార్యు

తనయుండు తిమ్మయ తగఁ బ్రస్తుతించె.

శ్రీ వేంకటేశ్వర వచనముల ముద్రణము సాగుచుండఁగా, రాజ కీయ ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో నీ ప్రభాత స్తవమును గుర్తించి యేక కవి కృతియని, యిందు దీనిని గూడఁ బ్రకటించితిని.

వే. ప్ర.

వచనసంఖ్య రాగతాళములు వచనసంఖ్య రాగతాళములు
1 గుజ్జరి (ఏకతాళి) 38 సాళంగనాట (పల్లవి)
2 శంకరాభరణము (తివడ) 39 గుండక్రియ (తివిడ)
3 శ్రీరాగము (ఏకతాళి) 40 సామంతం (తివడ)
4 రామక్రియ (రూపకము) 41 దేశాక్షి (జంపె)
5 లలిత (జంపె) 42 ముఖారి (రూపకము)
6 భూపాల (తివడ) 43 కాంభోజి (తివడ)
7 మాళవిగౌళ (ఏకతాళి) 44 పాడి (ఏకతాళి)
8 మాళవిగౌళ (తివడ) 45 ఆహిరినాట (రూపకము)
9 నాట (రూపకము) 46 శుద్ధవసంతం (తివడ)
10 నాట (తివడ) 50 హిందోళవసంతం (తివడ)
11 సామంతం (జంపె) 52 దేశాక్షి (తివడ)
12 బౌళి (జంపె) 53 ధన్యాసి (తివడ)
26 మలహరి (తివడ) 85 మాళవి
27 భూపాలము (రూపకము) 86 దేశాక్షి (రూపకము)
28 సాళంగనాట (తివడ) 87 ధన్యాసి (ఏకతాళి)
29 సాళంగనాట (ఏకతాళి) 88 ధన్యాసి (జంపె)
30 వరాళి (తివడ) 89 బౌళి (ఏక తాళి)
31 బౌళి (తివడ) 90 కన్నడ బంగాళం (త్రివడ)
32 ముఖారి (జంపె) 91 లలిత (తివడ)
33 నాదనామక్రియ (జంపె) 92 దేవగాంధారీ (జం 2)
34 నాదనామక్రియ (ఏకతాళి) 93 హిందోళవనంతం (జంపె)
35 శ్రీరాగం (తివడ) 94 మలహరి (ఏక తాళ్ళి
36 శ్రీరాగం (జంపె) 95 భూపాల (జంపె)
37 నారాయణి (త్రివడ)