శ్రీవేంకటేశ్వరవచనములు/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

1. వచనరచన

అంధ్ర వాఙ్మయమునఁ బ్రాచీన కాలమున వచనకావ్య రచనమంతగాఁ గానరాదు. భారతాదికృతులలోఁ బద్యరచనముల నడుమ నెడనెడఁ గానవచ్చు వచనరచనలేకాని వచనైకరచనలు చాలఁ దక్కువ. పద్యైకరచన లంతకింకను జాలఁ దక్కువ. తిక్కన నిర్వచనోత్తరరామాయణమొక్కటే యట్టిది పేర్కొనఁదగినది. సంస్కృతమునఁ బద్యైక రచనలే యెక్కువ. చంపూరచన లంతకుఁ దక్కువ. గద్యైకరచనలును దక్కువే. దక్షిణదేశభాషలలోఁ గర్ణాటకమున నొకతీరు గద్యరచనలు చాలఁగలవు. అవి ప్రాయికముగా వీరశైవులు భగవత్ప్రార్థనాతత్త్వార్థ నిరూపణపరములుగా రచించినవి. అట్టి రచనలఁ బెక్కింటినిజేర్చి గర్ణాటకులు ' వచన శాస్త్రము ' అనుపేరఁ బేర్కొనిరి. కొన్ని సంపుటములుగా నిటీవల వానినిఁ బ్రకటించిరి. కన్నడమున నాయారచనము లించుమించుగాఁ బండ్రెండవశతాబ్ది నుండి యారంభమయిన వనవచ్చును. ద్రవిడమునఁ బ్రాచీనకాలమున వచనైకరచనలు లేనేలేవట! వ్యాఖ్యాన రూపవచనరచనము లుండుఁగాక యవి వచనకావ్యరచన లనఁదగనివి.

సంస్కృతమున వచనరచన ముత్తెఱఁగులని వామనుఁడు కావ్యాలంకార సూత్రమున నిట్లు చెప్పినాఁడు.

"కావ్యం గద్యం పద్యంచ. గద్యం వృత్తగన్ధి చూర్ణముత్కలికా ప్రాయంచ; పద్యభాగవద్వృత్తగన్ధి. అనావిద్ధలలితపదం చూర్ణమ్. విపరీతముత్కలికాప్రాయమ్.” అని

పద్యపాద భాగములకలయికతో వృతములవాసనఁ దోపించు చుండు వచనరచనము వృత్తగన్ధి. దీర్ఘసమాసముల గడబిడలులేక తేలిక పలుకులతోనుండు పొడిపొడి వచనరచనము చూర్ణము. దీర్ఘసమాసముల గడబిడలు గలిగి, యుద్ధతోక్తులతో నుండు రచన ముత్కలికా ప్రాయము. ననీ;
వామనునికిఁ దర్వాతివాఁడగు విశ్వనాధకవిరాజు వచనము నాల్గుదెఱఁగుల విభాగించెను. వృత్తలేశ విహీనమయిన గద్యము ముక్తకము వృత్తగంధి ఉత్కలికాప్రాయము చూర్ణకమునని నాలుగు విధములు. తొలిది సమాసరహితము. రెండవది వృత్తభాగములతోఁ గూడుకొన్నట్టిది. మూడవది దీర్ఘసమాసాఢ్యము; నాలవది అల్పసమాసకము.

పయి రచనాప్రభేధములలో రెండింటికి మాత్రము తెలుఁగున భారతాది కృతులలోని వచన భాగములనుండి లక్ష్యము లెత్తి చూపవచ్చును. ప్రాయికముగాఁ గవిత్రయమువారి రచనలలోని వచన రచనములు చూర్ణకము లనఁదగినవి. నాచనసోమన, పోతన ప్రభృతుల రచనలు గొన్ని యుత్కలికా ప్రాయము లనవచ్చును. వృత్తగంధిరచనలు తెలుఁగునఁ బ్రాచీనకాలమున నంతగా లేవు. ప్రబంధరాజ వెంకటేశ్వరవిలాసమున వృత్తగంధి వచనరచనలున్నవి. నేఁటికాలమున శ్రీగిడుగు రామమూర్తిపంతులుగారు రచించిన 'ప్రాఁదెనుఁగుఁగమ్మ'1 వృత్తగంధియే. మచ్చుతునుక :____

సిరిఁదాల్చుఱేఁడోగిఁ జిన్ని చూడ్కులఁజూచు తెనుఁగుఁ. జదువులరచ్చ తీర్పరులార ! గ్రిందనుగై వ్రాలుసేసిననేనయా ! యణకువమెఱయుచు, నాయోపుకొలఁది. దెనుఁగుఁజదువులగుఱిచి, జానుమివులంగఁ దొలితెనుఁగునుడులన తేటతెల్లగను, విన్నపమొక్కండు వినిపింతుమిమ్ము మోడ్చియునిరుచేయి, మ్రోఁకరిలఁబడియు, నెఱఁగియుఁ గైవారమొనరంగఁచేసి, తద్దయువేఁడుదు నాలింపుఁడయ్య మీరపోలెను నేనుఁ బ్రాఁబొత్తములు సాలఁజదువులేన.

కర్ణాటకమునఁగూడ వృత్తగంధి రచనములున్నవి. రామాశ్వమేధాదులందు లక్ష్యములు చూడనగును.

సంస్కృతమున వామనుఁడుపేర్కొన్న ముత్తెఱఁగుల రచనములునున్నవి. కాదంబరీ, దశకుమారచరిత్ర, యశస్తిలాకాచంపూప్రభృ


1చూ . ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక సంపుటము ౨ సంచిక ౩ తులుదును, శ్రీభగవ ద్రామానుజా చార్యులవారి గద్యత్రయమునందును, పాల్కురికిసోమనాథుని గద్య గ్రంథములందును వీనికి లక్ష్యములున్నవి. శ్రీభగవద్రామానుజాచార్యులవారి గద్యత్రయమున నుండి ముత్తెఱఁగుల రచనలకు మచ్చుతునుకలఁ జూపుచున్నాఁడను చూర్ణమునకు.

అపారకరుణామ్బుధే, అనాలోచిత విశేషావిశేషలోకశరణ్య, ప్రణతార్తిహర, ఆశ్రితవాత్సల్యైకమహోదధే, అనవరతవిదితనిఖిల భూతజాతయాథాత్మ్య, సత్యకామ, సత్యసఙ్కల్ప, ఆపత్సఖ, కాకుత్ స్థ, శ్రీమన్నారాయణ, పురుషోత్తమ, శ్రీరఙ్గనాథ, మమనాథ నమోఽస్తుతే.

(శ్రీరఙ్గగద్యమ్)

ఉత్కలికాప్రాయమునకు.

స్వచ్ఛన్దానువర్తి స్వరూపస్థితిప్రవర్తిభేదా శేష శేషతైకరతిరూప నిత్య నిరవద్య నిరతిశయజ్ఞానక్రియైశ్వర్యాద్యనన్త క ల్యా ణ గు ణ గ ణ శేషాసన గరుడప్రముఖ నానావిధానన్తపరిజన పరిచారికా పరిచితచరణ యుగల పరమయోగి వాఙ్మన సాపరిచ్ఛేద్యస్వరూపస్వభావ స్వాభిమత వివిధవిచిత్రానన్త భోగ్యభోగోపకరణ భోగస్థానసమృద్ధానన్తాశ్చర్యానన్త మహావిభవానన్త పరిమాణనిత్యనిరతిశయ శ్రీవైకుణ్ఠనాథ-

(శరణాగతి గద్యమ్)


వృత్తగన్దికి.

ప్రత్య గ్రోన్మీలిత సరసిజ సదృశ నయన యుగలం, స్వచ్ఛ నీలజీమూత సఙ్కాశమ్ అత్యుజ్జ్వల పీతవాససం-స్వయంప్రభయా అతి నిర్మలయా అతిశీతలయా స్వచ్ఛయా మాణిక్యాభయాకృత్స్నం జగద్భాసయన్తమ్ అచిన్త్యదివ్యాద్భుత నిత్యయౌవనస్వభావ లావణ్యమయామృత-సాగరమ్, అతి సౌకుమార్యాదీషత్ప్ర స్విన్నవదాలక్ష్య మాణలలాటఫలకదివ్యాలకావలీవిరాజితం - ప్ర బు ద్ధ ము గ్ధా ం బు జ చారులోచనం. సనిభ్రమభ్రూలతమ్. ఉజ్జ్వలాధరమ్ శుచిస్మితం కోమల గణ్డమ్ ఉన్న సమ్ ఉదగ్రపీనాంస విలమ్బికుణ్డలాలకావలీ బన్ధురకమ్బు

కన్ధరం ప్రియావతం సోత్పలకర్ణభూషణశ్లథాలకా-నిమర్దశంసిభి-శ్చతుర్భి రాజానునిలమ్బభి గ్భుజై -ర్విరాజితం అతికోమలదివ్య రేఖాలఙ్కృతాతామ్రకరతలం, దివ్యాఙ్గులీయక విరాజితమ్, అతికోమలనభావలీ విరాజితం, అనురక్తాఙ్గులీభిరలంకృతంమ్, తత్క్షణోన్మీలిత పుణ్డరీకసదృశచరణయుగళమ్, [1](శ్రీవైకుణ్ఠగద్యమ్.)

తెలుఁగున లక్షణగ్రంథకర్తలు వచనరచనల నిట్లు పేర్కొనిరి.

క॥ కనుఁగొనఁ బాదరహితమై
పనుపడి హరిగద్దెవోలె బహుముఖరచనం
బునమెఱయు గద్య మదీద్దాఁ
దెనుఁగుకృతుల వచనమనఁగ దీపించుఁగడుౝ

గద్యము-స్వస్తిసమస్తభువనరక్షాదక్ష శ్రీపుండరీకాక్ష భుజగపతి సింహాసనారూఢ సురనికరమకుటతటఘటితసురుచీర మణిగణప్రభావిభాసితపాదపీఠ వేదనినాదానుకార గౌరవలలిత సూపురాలంకృతచరణ సరసిజయుగళ నవ్యపదాంగుష్ఠనఖమయూఖరేఖాయిత సురసరిత్ప్రవాహ పీతాంబరధర నూత్న మేఖలాకలిత కటితటప్రదేశ చతురాననజనకి నాళీక శోభితనాభి సరోవర యఖండబ్రహ్మాండకలాపగోపననిపుణోదర క్షీర సాగరతనయామనోజ్ఞగేహీకృతవిపులవక్షస్ స్థల కనత్కనకకటక కేయూర ప్రముఖ భూషణభూషితచతుర్భుజ శంఖపంకజ సుదర్శన గధాధర కిరీట కుండలాభిరామయనవరతప్రసన్నవదన కౌండిన్యవరద శ్రీయనంత పద్మనాభ నమస్తే నమస్తేనమః” (అనంతుని ఛందము)

"ఇఁక సందు గద్యలక్షణం-మఱియు నందు గద్యయు నైదుభేదంబుల విహరించు-నయ్యవి యేవంటేను-గద్యయు, బిరుదుగద్యయు, చూర్ణికయు, వచనంబును, విన్నపంబులునన గద్యభేదంబు లైదును ప్రమోదంబున వివిధమ్ములై వినోదించు నందు గద్యక్రమంబెటువలెనంటేని ౧ గద్య-అనుకరణశబ్దయక్తంబైయొప్పు నందు ౨ బిరుదగద్య సంబోధనాంత పదబంధురంబునైవర్తిల్లు నందు ౩ చూర్ణిక ద్వివచన


బహువచనసందర్భములగు విభ క్త్యనుశాసన సమాసాది సమాసాదిత కల్పనానల్ప జల్పితంబై వెలయునందు ౪ వచనంబులు బహుప్రకార రచనా నిచయప్రాచుర్యమ్ములై సంచరించు నందు ౫ విన్నపంబులెన్న విన్ననై ఋజుమార్గమ్ముల ననుగమించి మించు నీపంచ విధమ్ములు మితివిరహితమ్ములై స్వేచ్ఛాకల్పనా గౌరవమ్ముల కొలందుల విలసిల్లు.
(లక్షణశిరోమణి)

మీఁది లక్షణగ్రంథకర్తలలో ననంతుఁడు పదునైదవ శతాబ్ది వాఁడు. ఆతఁడు చెప్పిన గద్యలక్షణమున కనుగుణముగానే కర్ణాటాంధ్ర భాషలలోనిప్రాచీనవచనైకరచనలున్నవి. లక్షణశిరోమణికారుఁడు పొత్తపి వెంకటరమణకవి పదునేడవశతాబ్దివాఁడు గాఁబోలును! ఆతఁడు వచన రచనలనైదువిధముల విభజించినాఁడు. అతఁడు పేర్కొన్న 'విన్నపములే' యనంతామాత్యుఁడు చెప్పినగద్యములగును. ఇట్టి రచనములొకటి రెండు నిమిషములకు మించనికాలమునఁ జదువఁదగినవై స్తుత్య దేవతా సంబోధక పదాంతములైయుండును. వీనినే తాళ్లపాకవారు వచనగీతములని తాళగంధిచూర్ణకములనికూడఁ బేర్కొనిరి. ఈ విషయ మిఁక ముందు వివరింతును. అనంతామాత్యుని నాఁటికిఁదెలుఁగున భారత భాగవతాది గ్రంథముల వచనైకరచనలు లేవు గాఁబోలును ! అట్టివాని నాతఁడు పేర్కొనలేదు. పదునాఱవ శతాబ్దినుండియే భారతభాగవతాదుల వచనైకరచనలు తెలుఁగున వెలసినట్లున్నవి. లక్షణశిరోమణికారుఁడట్టివానిని దాను విభజించిన పంచవిధ విభాగములలో నాలుగవభేదమగు 'వచనము'గా నిర్వచించినాఁడు. ఈతని నాఁటికిఁ జూర్ణిక 'పొడిపొడి పలుకుల ప్రసన్నరచనగాక' సంస్కృత పుటుత్కలికాప్రాయరచనగామాఱినది. ప్రబంధరాజవిజయ వేంకటేశ్వర విలాసాదులందింకను సర్వలఘువచనములు, అంత్యాను ప్రాసచతుర్దళచూర్ణికలు మొదలగు వచనచిత్రరచనా ప్రభేదములు చూడఁదగును. మఱియు సంధ్రమున నన్నయాదికవుల కృతులలోని యాశ్వాసాంత వచనరచనలను 'ఆశ్వాసాంత గద్యము'లని పేర్కొనుటకలదు. అని లక్షణశిరోమణికారుఁడు చెప్పిన 'బిరుద గద్యము'లగు ననుకొనవచ్చును. అట్టి బీరుదగద్యములు సంబోధనాంతములుగా నుండవలెనని యాతఁడు చెప్పీనాఁడు. అట్లేప్రాచీన రాజుల బిరుదగద్యములునున్న విగాని యాగద్యములకెల్ల సంబోధనాంతత నియతముగా నుండునన్న నిర్ణయము నిలువదేమో! ఆశ్వాసాంత బిరుదగద్యములు సంబోధనాంతములుగా నుండవుగదా !

అనంతామాత్యుఁడు (వచన)గద్యమనియు, లక్షణశిరోమణికారుఁడు విన్నప మనియుఁ బేర్కొన్నతీరు రచనము లవి సంస్కృతమున శ్రీభగవద్రామానుజాచార్యులవారు రచించిన గద్యత్రయమును బాల్కురికి సోమనాథుఁడు రచించిన పంచప్రకారగద్యాదులను బురస్కరించుకొని, కర్ణాటాంధ్రములలో వైష్ణవ శైవభక్తులు సాగించిన రచనములయి యుండునని నేననుమానించుచున్నాఁడను. తెలుఁగున నాకుఁగానవచ్చిన యిట్టి రచనలలోఁ బ్రాచీనమనఁదగినవి ' సింహగిరి వచనములు '.వీనికిఁ గృష్ణమాచార్య సంకీర్తనములని నామాంతరము.[2]

మచ్చునకాతనివచనమొకటి.

దేవా ! పదికోట్ల యజ్ఞాదిక్రతువులు నడపంగానేమి, తొమ్మిది కోట్ల తులాభారంబులు తూఁగంగానేమి, యెనిమిది కోట్ల సువర్ణదానంబులు, నేడుకోట్ల గోదానంబులు, నాఱుకోట్ల భూదానంబులు, నయిదు కోట్ల కన్యాదానంబులు, నాలుగుకోట్ల వస్త్రదానంబులు సేయంగానేమి, మూఁడుకోట్ల సత్యాదివ్రతంబులు నలుపంగానేమి. రెండుకోట్ల యన్నదానంబులు గావింపగానేమి, కోటి స్నానంబులు సేయంగానేమి, మీ నామోచ్చారణంబు సేయక! పదివేల యజ్ఞాది క్రతువులు నడపిన దేవేంద్రుండునిలువల్ల యోనులయ్యెను. తొమ్మిదికోట్లతులాభారంబులు తూగిన దుర్యోధనుండు యమపురికేఁగెను. ఎనిమిది కోట్ల సువర్ణదానంబులు సేసిన కరుండు పసిండికొండమీఁది యన్నంబుల కపేక్షించెను. ఏడుకోట్ల గోదానంబులు చేసిన కార్తవీర్యార్జునుండు గోహత్యా బ్రహ్మహత్యా పాతకంబులఁ బొందెను. ఆఱుకోట్ల భూదానంబులు


చేసిన బలి విష్ణుపాదంబునఁ బాతాళంబునకేఁగెను. అయిదు కోట్ల కన్యాదానంబుచేసిన ధ్రువుండు కాశీక్షేత్రంబుగఁ బండ్రెండువేల యేండ్లు భిక్షంబెత్తెను. నాలుగుకోట్ల వస్త్రదానంబులు చేసిన మార్కండేయుండు మతిహీనుండాయెను. రెండుకోట్లన్నదానంబులు చేసిన ధర్మజుండు యమపురి తొంగిచూచెను. కోటిస్నానంబులు చేసిన కుమారస్వామి కోరిక సిద్ధించదాయెను. దేవా ! మీ నామోచ్చారణంబు చేసి ప్రహ్లాద నారదపుండరీక వ్యాసశుక శౌనక భీష్మదాల్భ్య రుక్మాం గదార్జున బలివిభీషణ భృగుగాంగేయాక్రూర విదురాదులకు పరమ భాగవతోత్తములు కృతార్థులైరి. కావున యతిరామానుజ మునిపరందాతారు (?) అనాథపతియైన స్వామీ సింహగిరి నరహరీ నమోనమో దయానిధీ.” (సింహగిరి నరహరి వచనములు) కృష్ణమాచార్యసంకీర్తనములు


సీ.

కటకేంద్రుకూఁతురి కౌఁగిటిలోఁదక్కెఁ జెళ్లపిళ్లస్వామి చేతఁగాదు,
కృష్ణమాచార్య సంకీర్తనంబులఁజొక్కె సింహాద్రియప్పని చేతఁగాదు,
కవ్వంపుఁగొండ సంఘర్షణోద్ధతిఁజిక్కె శ్రీకూర్మనాథుని చేతఁగాదు,
శాక్యతొండనిఱాల జడికెంతయునుస్రుక్కెఁజెన్నమల్లేశునిచేతఁగాదు, పననజవననిరాఘాటయవనఘోట ! హరణజయధాటి మీచేతనౌనెమేటి వౌదువోకసన్నఁజూడుమేలాపరాకు | శత్రుసంహార! వేంకటాచలవిహార!


సీ.

తాళ్లపాకచినన్నదఁడెమీటులుగావు గోమాంసభుగ్ధనుర్గుణరవంబు బంటొసంగినబంకమంటిపువ్వులుగావుయవనాధములచిలుకంపగములు సాముడిగ్గియనీటిచల్లులాటలుగావు పాశ్చాత్త్యభటుల తుపాకిగుండ్లు
సంపెంగబాకులు జరగించుటలుగావు రిపులపాళెములు దర్లించుపగలు బంటుపంతముతగదంచుబంటకాపుఁదనముగైకొంటివిదిమంచిగుణమెదినము
జనముదెచ్చిన ధనములప్పనములిచ్చి |శత్రుసంహారవేంకటాచలవిహార !


సీ.

పొట్టేళ్లగతిఁబట్టిబోడిసన్న్యాసుల ఢీయనితాఁకులాడించునొకఁడు
సోమయాజులబ్రహ్మసూత్రముల్ ద్రెంచిసింగాణివిండ్లకునల్లెగట్టు నొకఁడు ఖూబుఘోడాయంచు గుడికీలు గుఱ్రము నెక్కిధేయని తరటెత్తునొకఁడు
పై కాలుగొమ్మని బల్మిఁగోమటివారి చెలువపైఁబడిబూతుసేయునొకఁడు

ఇంకను నిట్టివి శంకర వచనములని, శఠకోప విన్నపములని, కాలజ్ఞాన వచనములని, కాశికావచనములని, భవానీమనోహరవచనములని, శివరాజయోగవచనములని, లక్ష్మీవల్లభవచనములని, శేషగిరినాథ వచనములని మఱియుఁ గొన్ని పేళ్లతో వచనరచనలు ప్రాచీనములుగాన వచ్చుచున్నవి. అవి యెల్ల నించుమించుగాఁ బదునాలుగవశతాబ్దికిఁ అవి దరువాతివే కాఁదగు ననుకొందును. ఇప్పటికి నాయెఱుకకందినంతలోఁ గాల నిర్ణయముఁ జెప్పదగిన ప్రాచీనవచన రచనలలోఁ గృష్ణమాచార్య సంకీర్తనముల తర్వాత నీ ' వేంకటేశ్వరవచనములే' పేర్కొనఁదగినవి. ఈరెంటిలోఁ దొలిది పదుమూఁడవశతాబ్ది తొలిది. రెండవది పదునైదవ శతాబ్దితుదిది. ఇక్కడఁబ్రసక్తములు శ్రీవేంకటేశ్వరవచనములు

2. తాళగ్రంధి చూర్ణకములు.

ఇవి తిరుపతి క్షేత్రమున శ్రీవేంకటేశ్వరస్వామివారి దివ్యాస్థానమున సంకీర్తనాచార్యులుగ సుప్రఖ్యాతులయిన తాళ్లపాకవారు రచించిన వానిలోనివి. ఏతత్కర్త తాళ్లపాక పెదతిరుమలాచార్యుఁడు పదునైదవ శతాబ్ది చతుర్థపాదమున జనించి బదునాఱవ శతాబ్ది పూర్వార్ధమున వర్తిలినవాఁడు. [3]ఈ పెద తిరుమలాచార్యులవారికిఁ గుమారుఁడయిన చినతిరుమలాచార్యుఁడు, తన తండ్రి పెదతిరుమలాచార్యులు వ్యాఖ్యానించిన తీరుననుసరించి, తనతాత తాళ్లపాక యన్నమా


చార్యుఁడు సంస్కృతమున రచించిన 'సంకీర్తనలక్షణమును' దెలుఁగునకుఁ బరివర్తనము చేసెను. అందీ నచనరచనల నిర్వచనమిట్లున్నది.

“ మఱియుఁజూర్ణాఖ్యపదం బెట్టిదంటేనీ

క॥ ధరఁగృష్ణాచార్యాదిక పరికల్పితపదము తాళబంధచ్ఛందో విరహితమై చూర్ణాఖ్యం బరగు, నదినిరుక్తనామభాసితమగుచుౝ

మఱియుం దచ్చూర్ణ విధంబెట్టిదనిన ;

క॥ ఛందోగణముల నియతిం బొందక తాళప్రమాణమునఁ గడుఁజెలువై కొందఱిచేఁ దచ్చూర్ణం బందముగాఁ దాళగంధి యనఁ బోగడొందున్ "

పూర్వోదాహృతమైన సంకీర్తనలక్షణ గ్రంథనిర్వచనముచొప్పునఁ దాళగంధి చూర్ణము లనఁదగిన యీ వచనములను రచించి శ్రీస్వామి వారి సన్నిధిని శ్రీ తాళ్లపాక పెదతిరుమలాచార్యుఁడు రాగ తాళములతో నాలాపించువాఁడు కాఁబోలును! రాగిరేకులనుండి యెత్తి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానమువారింతకు ముందు ముద్రింపించిన వచనములు నలువదేడింటికి రాగ తాళములు నిర్ణీతములయియున్నవి.[4] మఱియు నం దీవచనములు ‘వైరాగ్యవచనమాలికా గీతము’లను పేరఁబేర్కొనఁబడినవి. అనఁగా నివి వచనములేయయినను గీతములుగాఁ బాడఁదగినవన్న మాట ! అందుచేతనే యిని సంకీర్తనలక్షణమున ‘తాళగంధిచూర్ణకపదము’లని పేర్కొనఁబడినవి. సంస్కృతమున వామనుఁడు వృత్తగంధి, ఉత్కలికాప్రాయము, చూర్ణము ననిముత్తెఱఁగుగల వచనరచనచెప్పఁగా నితఁడా చూర్ణమను వచనవిభాగముననే తాళగంధియని పదరచనా విభాగముగాఁ గల్పించినాఁడు. ఈ తెఱఁగు వచన రచనలకుఁ జూర్ణమను పేరు పొడిపలుకులతోనుండుటచే నేర్పడినదగుట నీతఁడు సూచించినాఁడు. మన యీ వేంకటేశ్వర వచనములు పొడి పొడి పలుకుల కూర్పే కాని, యిందుద్ధతోక్తులు ప్రౌఢసమాసములు లేవు. ఇట్టి పద రచనములకుఁ గృష్ణాచార్యాదులు, పరికల్పకులని యా


సంకీర్తన లక్షణ పద్యమున నున్నది. ఇంతకముందు నేనుదాహరించిన కృష్ణమాచార్యసంకీర్తనములకర్త కృష్ణాచార్యుడే సంకీర్తనలక్షణకారుఁడు పేర్కొన్న కృష్ణాచార్యుఁడు కాఁగలడు. ఇట్టి రచనములకుఁ గృష్ణమాచార్య సంకీర్తనములనఁబడు సింహగిరినరహరి వచనములే ప్రప్రధము రచనము లని యీ సంకీర్తన లక్షణ గ్రంథోక్తిని బట్టి గుర్తింప నగును. దీనిని లక్ష్యీకరించుకొనియే యనంతామాత్యుఁడు గద్యనిర్వచనము నట్లు చేసియుండును. తర్వాతి కాలమున నిట్టివచనములు ‘విన్నపము’ లనియుఁ బేర్కొనఁబడినవి.

వేంకటేశ్వర వచనములు—వానియోగ్యత

ఈ వచనములకు రచనములో నామపూర్వి యేదియుఁగానరాదు. వస్తువిన్యాసమునఁగూడఁ గ్రమపద్ధతీ యేదియుఁదోపదు. కవియప్పుడప్పుడు తనకుఁ దోచినతత్త్వవిషయముల నీశ్వరస్తుతిపరములు గావించి విడివిడిగనే వచనములుగా రచించినాఁడు గాఁబోలును! ఇందు విశిష్టాద్వైత సిద్ధాంత విషయములు సర్వత్ర కరడుగట్టియున్నవి. గ్రంథకర్త స్మార్తనందవరీక బ్రాహ్మణుఁడైనను వైష్ణవమతము స్వీకరించినవాఁడు. జాలిజాలిగాఁ గొసరికొసరి శ్రీవేంకటేశ్వరస్వామిని గవి యేతద్వచన రచనలలోఁ బలుదెఱఁగులఁ బరమార్థలబ్ధికై ప్రార్థించును. విశిష్టాద్వైత సిద్ధాంతపు జీవగఱ్ఱయగు ‘శరణాగతి’ యిందుఁజాలఁజక్కఁగా సవదరింపఁబడినది. కవి యిందు స్వామిని బలుచోట్ల నేకవచనముననే తేలికగా ‘నీ’ వని యెచ్చరించును. తోడ్తోఁ గొన్నిపట్టుల ‘మీ’ రని గొప్పగా బహూకరించును. తండ్రియొడిలో నాటవేడ్కలతోనుండు ముద్దులబిడ్డఁడు తండ్రిని నెయ్యంపుమురువునఁ దొక్కుబల్కులతో. నీవనితుంకరించుట, యంతలోనే పెద్దఱికపుహద్దుతోపగా మరల మీరని బహూకరించుట, యందం దనుభూయమానమే కదా! ఆయనుభూతి నాకీ తీరునకు సమర్థకముగాఁదోచినది. అన్నిచోట్ల నేకవచనమునో, బహువచనమునో యొక్కదానినే యుంపవచ్చునుగాని పయిసమర్థనము ననుసరించి నేనట్లు మార్పుచేయలేదు. ఇందు ౧౪౭ వచనమున నూటయెనిమిది తిరుపతుల పేళ్లు పేర్కొనఁబడినవి నిత్యానుసంధానాదులగునర్వాచీనద్రావిడ వైష్ణససంప్రదాయ గ్రంథములలో నూటయెనిమిది తిరుపతుల (దివ్యస్థలముల) పేళ్లు ముద్రితములయియున్నవి. వాని పరిగణన మాతీరుగా నేనాఁడు జరగెనో గుర్తింపఁజాల నయితిని. ఆ పేళ్లకు నిందున్న వేళ్లకుఁ జాల భేదమున్నది. క్రీ. ౧౪౮౦ ప్రాంతముల నూటయెనిమిది తిరుపతులపేళ్లీ విధముగా నుండెనని దీనిఁబట్టి తెలియనగును. కాని యీపేళ్లుగల వచనపువ్రాఁతప్రతియొక్కటే తప్పులతో నుండుటచే నీ ముద్రణమున వ్రాఁతలోగల యాతీరేయున్నది. ఇందుఁగొన్ని స్థలములపేళ్లుతప్పులుగా నున్నట్టున్నవి. ప్రబంధరాజ వేంకటేశ్వర విలాసమునను, హంస వింశతిలోను నూటయెన్మిది తిరుపతుల పేళ్లు నిందున్న తీరుననుసరించి యున్నవి. ఏతన్ముద్రణాంనంతర మా పేళ్ల నందుఁజూచితిని,

ఇందు వచనరచనారీతిలో ననంతుడు చెప్పిన గద్య(వచన) లక్షణము చక్కఁగా సనిపడినది. లక్షణశిరోమణికారుని ‘విన్నపము’ రచన కీవచనములు మంచిలక్ష్యము లనఁదగును. దూరాన్వయము, పమాసక్లేశము ననుప్రాసవిన్యాస పరిశ్రమము నిందులేవు. సూటిగా మనసున నాటునట్లు భావము లున్నవి. కొన్ని వచనములు టాగోరుగారి గీతాంజలీ రచనములఁ దలపించు నవిగాఁగూడనున్నవి. కృష్ణమాచార్య సంకీర్తనములు సరిగానిట్టివే వీనికిమూలకల్పములే కాని, యందు భాషా ప్రాచీనత యింతకంటె విస్పష్టముగా గోచరించునున్నది. ఈ వచనములను రాగతాళములతోఁ బ్రాచీనకాలమునఁ బలువురు పాడెడివారు గావలయు ; కవియే భావానుగుణముగా వీనికి రాగతాళములఁ గల్పించి నాఁడు.

తాళ్లపాకవారు

ఏతద్ గ్రంథకర్త తాళ్లపాకపెద తిరుమలాచార్యుఁడు నందవరీక స్మార్తబ్రాహ్మణుఁడంటిని, తాళ్లపాక నేటి రాజంపేట తాలూకాలో నున్నది. అది వీరి నివాసగ్రామము. ఈకవి తండ్రి.

అన్నమాచార్యుఁడు.

ఈతఁడు వైష్ణవమతమును స్వీకరించిఁనవాడు గొప్పభక్తుఁడు. కవి. మహిమలుగలవాఁడు. ఈతఁడు తొంబదియాఱేండ్లు జీవించెను. ఇతనికుమారుఁడగు పెద తిరుమలాచార్యుని కోర్కిచొప్పున నీ యన్నమాచార్యుఁడు దినమునకొక్కదానికేనితక్కువకాని చొప్పునగేయములు రచించుచుశ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిని సంకీర్తనము చేయుచుండు వాడట! ఈత కిఁ బదునాఱవయేట స్వామి ప్రత్యక్షమయ్యెనట! తదాది యెనుబది యేండ్లదాక నీతఁడు సంకీర్తనములు రచించుచునే యుండెను.

ఈతనికిఁ సంకీర్తనాచార్యుఁడని ద్రావిడాగమసార్వభౌముఁడని, పంచమాగమచక్రవర్తియనిబిరుదులు. శ్రీవేంకటేశ్వరస్వామికీతఁడు మామ. అలమేలుమంగాంబ కీతఁడు తండ్రి వరుసవాఁడు. ఇతని సంకీర్తనలను వినిన చెవిని మఱొకరి సంకీర్తనముల విననొల్లనని శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిజ్ఞఁగావించెనట ! ఈతఁడు రచించిన గ్రంథములు, ౧ అధ్యాత్మ సంకీర్తనలు ౨ శృంగార సంకీర్తనలు 3 శృంగారమంజరి ౪ సంకీర్తన లక్షణము (సంస్కృతము; ఇది దొరకలేదు) ఈకవికి సంబంధించిన చరిత్రము శాసనాదులందుఁగాన రాదు. [5]కాని, తాళ్లపాక చిన్నన్న ద్విపదకృతిగా నితనిచరిత్రము రచించినాఁడు. ఈతని కుమారుఁడు;

[6]పెద తిరుమలాచార్యుఁడు.

ఈతఁడే ప్రస్తుత గ్రంథమగు శ్రీవేంకటేశ్వర వచనములకుఁగర్త. శ్రీ తిరుపతి దేవస్థానముననున్న రాగి ఱేకులమీఁద నీ వచనములు తిరుమలాచార్యరచితములని గ్రంథారంభమునఁ జెప్పఁబడినది. ఈతఁడు మహైశ్వర్యమహితుఁడుగావెలసెను. శ్రీ వేంకటేశ్వరస్వామి కీతఁడనేక కైంకర్యముల జరపించెను. శ్రీస్వామి యీతనితోఁ దరువాతి మూఁడు తరములదాఁక ప్రత్యక్షమును, నేడుతరములదాఁకఁ బరమపదమునునను


గ్రహించెనట! ఈతని యితర కృతులు ౧ శృంగార సంకీర్తనలు ౨ శృంగారదండకము 3 చక్రవాళమంజరి ౪ శృంగారవృత్తశతకము ౫ శ్రీవేంకటేశోదాహరణము ౬ నీతి సీసశతకము ౭ సుదర్శనరగడ ౮ రేఫఱకారనిర్ణయము ౯ ఆంధ్ర వేదాంతము (ద్విపద) ౧౦. ఆంధ్ర హరివంశము, ౧౧ భగవద్గీత (వచనము) ౧౨ శ్రీవేంకటేశ్వర ప్రభాతస్తవము, ఈతనికి వేదాంత ప్రతిష్ఠాపనాచార్యుఁడని బిరుదు. స్వామి కీతఁడు జరపినకైకర్యముల సారము[7] :—

పెద తిరుమలయ్యంగారు క్రీ. 1517 నుండి, 1552 దాఁక శ్రీవేంకటేశ్వరస్వామివారికిని ఇంకనితరస్థలములలోని దేవరలకును, నైవేద్య ప్రసా దోత్స వాదికైంకర్యములకై పదునాల్గు గ్రామముల నర్పించిరి. ఆ గ్రామములు, అచ్యుతరాయడు, బుక్కయ తిమ్మరాజు మొదలగువారు తనకు దానముచేసినవి. అంతేకాక యెన్నో వేల పణములనుగూడ నాయా పుణ్యకార్యములకై వారర్పించిరి. తిరుమలమీఁదఁ దమ సంకీర్తనములు చెక్కించిన రాగిరేకులు దాచియుంచిన సంకీర్తన భాండారము రక్షించుటకై యర్చించుటకైకూడ గొప్పదానములు చేసిరి. తండ్రిగారును దామును రచించిన సంకీర్తనములను స్వామివారి సన్నిధిని ప్రతిదినము పాడుటకై యిద్దఱు వైష్ణవులు నియోగించిరి, స్వామివారి కోనేటిని గోపురములను మంటపములను, బెక్కింటిని చక్కఁబఱిపించిరి. కోనేటి నడుమ నీరాడు మంటపమును గట్టించిరి. ఇట్లెన్నో పుణ్యకార్యముల జరిపిరి. తండ్రివలె నీతఁడుగూడఁ బూర్ణపురుషాయుష జీవితముగల్గిన ధన్య చరిత్రుఁడయియుండును. ఏలనఁగా నీతనితండ్రి క్రీ.1408 నుండి క్రీ.1503, దాఁకజీవించెను. అన్నమాచార్యునకీతఁ డఱువదవయేఁట జన్మించినాఁడనుకొన్నను, నీతని జన్మకాలము క్రీ. 1468 యగును. అప్పటినుండి 1552 తర్వాతిదాక నీతఁడు జీవించినాఁడనఁగా నెనుబదియేండ్లించుమించుగా జీవించినవాఁడగును. ఈతనికి


సాతాని వైష్ణవు లిద్దఱు శిష్యు లుండెడివారట! వారుకూడ నీతనివలె స్వామికిఁ గొన్ని కైంకర్యములు జరిపిరి. ఈతనికుమాఁడగు చిన్నన్న (చిన తిరువేంగళనాధుఁడు) రచించిన యన్నమాచార్య చరిత్రమున నన్నమాచార్యుఁడు వైఖానస వైష్ణవుఁడయినట్లున్నది.

ఈతనికిఁ గుమార్లు ౧ చిన తిరుమలార్యుఁడు ౨ అన్నయ ౩ పెద తిరువేంగళనాధుఁడు ౪ తిరువేంగళనాథుఁడు (చిన్నన్న) ౫ కోనేటి తిరువేంగళనాథుఁడు.

ఇందు నాల్గవ కుమారుఁడయిన తిరువేంగళనాథుఁడు రచించిన యష్టమహిషీకల్యాణమున వీరి వంశపృక్షమిట్లున్నది.

1 అన్నమాచార్యుఁడు (౧8౦లో 7108)

(తిమ్మాంబ, అక్కా

1 తిమ్మాంబవలన 2

నరసింహ

(నాచ్చారమ్మ

| అనంతమ్మ)

(నాచ్చారమ్మవలన) (అనంతమ్మవలన)

చినతిరుమలార్యుఁడు

పెదతిరుమలాచార్యుఁడు తిరుమలాంట (తిరుమలమ్మ) 1468-1553, (తిరుమలకొండ యార్యుఁడు)

ఇంచుమించుగా

నారాయణ '

అన్నయార్య (అనంతమ్మవలన)

రేవణూరి వేంకటార్యుఁడు)

కోనేటితిరువేంగళ నాథుఁడు

4

5 తివేంగళప్ప

నాథుఁడు

నరసమాంబ (¹)

చిన్నయ్య తిరువేంగళనాథుఁడు

1. మూలపురుషుఁడు. శృంగార సంకీర్తనాది గ్రంథకర్త. 2. వేంక టేశ్వరోదాహరణాది బహుగ్రంథకర్త. ప్రకృత గ్రంథ

క రకూడ.

3. సంకీర్తన లక్షణాదిగ్రంథక ర్త. 4. అష్టమహిషీకల్యాణ పరమయోగివిలాసోషాపరిణ యాన్న మాచార్యచరిత్రగ్రంథకర్త.

5. అంధ్రామరుకామరవ్యాఖ్యా కావ్యప్రకాశవ్యాఖ్యా కర్త.

6. శకుంతలా పరిణయము, శ్రీ పాదరేణుమాహాత్మ్యము. ఇతనికృతులు.

ఈ తాళ్లపాకవారికి రేవణూరివారు జామాతృ వంశమువారు. రేవణూరివేంకటకవి తన శకుంతలాపరిణయమున నిట్లు చెప్పినాఁడు.

శ్రీవత్సాన్వయరేవణూరికులజుౝ శ్రీపాదరేణుప్రభా సౌవర్ణస్ఫుటకావ్యకల్పకకవిౝ సంకీర్తనాచార్యపు
త్త్రీ వంశోత్తము నందవైదిక బుధాతిప్రోక్త వృత్తిస్వయం
భావుం దిర్మలకొండయార్య సుతు శుంభద్వేంకటాభిఖ్యునిౝ.

శ్రీ వేంకటరమణకు ...... సమర్పణంబుగా సమర్పించెద నిహపరపాధనములకు నింక నేమి కొదవ యదియునుంగాక యమ్మహాదేవుండు మదీయమాతా మహవంశశిఖారత్నం బగునన్నయాచార్యునకు జామాతరుం డనిపించుకొని భ వ దీ య సంకీర్తనంబు లాలించినకర్ణంబుల నితర సంకీర్తనంబు లాలించనని ప్రతిజ్ఞఁగావించె తత్తనూజుండగు పెద్ద తిరుమలాచార్య బిడౌజునకుఁ ద్రిపురుషపర్యంతముగాఁ బ్రత్యక్షంబును, సప్తపురుషపర్యంతముగా మోక్షంబు నొసంగెదనని వరమిచ్చె; సచ్చరిత్రులగు దదీయపౌత్రులకుఁ జినతిరుమల దీక్షితాన్నయాచార్య తిరువేంగళనాధ కోనేటి తిరువేంగళనాధ వెంగళార్యులకు విచిత్రముక్తాతపత్రరత్నకిరీట ముద్రికా ప్రచండమణిమండిత మకరకుండలోత్కరాహః కరదీపికా, పాదుకాది బహూకరణంబుల గరుణించె; విశేషించియు నత్తిరువేంగళనాథుండు సంకీర్తనంబుఁ బాడిన నాడం దొడంగే నేతత్ప్రకారంబున నమ్మహామహునకుఁ బాండవ సహాయుండైన శ్రీకృష్ణ దేవునింబలె సహాయుండై.........ధన్యుడనయ్యెదనని విశ్చయించి ;” ఈ గ్రంధమును బట్టిచూడఁగా, నీవేంకటాచార్య కవి సంకీర్తనాచార్యుఁడగు నన్నమాచార్యునికి దౌహిత్రవంశములోనివాఁడని యేర్పడును. రచనమును జాలఁదర్వాతిదిగానే యున్నది. కాని యీతనిదేయగు[8] శ్రీపాదరేణుమాహాత్మ్యముగద్య మాతఁడు సంకీర్తనాచార్యుని మనుమఁడే యనఁదగి నట్లున్నది:— ఇవి సంకీర్తనాచార్య దౌహిత్ర రేవణూరి తిరుమల కొండ యాచార్యపుత్ర వేంకటాచార్య ప్రణీతంబైన శ్రీపాదరేణుప్రభావంబను నిస్సహాయ కావ్యంబునందు రంభాపురందర సంవాదంబనునది తృతీయోల్లాసము. ఇది తప్పయియుండునేమో! ‘సంకీర్తనాచార్యదౌహిత్రవంశ్య’ అని యుండఁదగునేమో!

గ్రంథ ముద్రణము

ఇప్పటి కిరువది యేండ్ల క్రిందట నే నీ వేంకటేశ్వర వచనములను బ్రాచ్యలిఖిత పుస్తక శాలలోని ప్రతులఁబట్టి యుద్ధరించి 'భారతి' పత్రికలోఁ బ్రకటింపఁ బూనితిని. అప్పటికి తాళ్లపాకవారు రచించిన వయియుండునని నే ననుమానించితినేకాని దాని కాధారమేదియు నాకుఁ గానరాలేదు. అప్పుడు ప్రకటించుటలో నే నిట్లు వ్రాసితిని.

“ఇవి తాళ్లపాకవారు రచించినవై యుండవలెను. వీనిలో విష్ణుభక్తి యూటలూరుచున్నది. ప్రాచీనములలో నింత రసవంతము, భక్తిభరితము నగు వచనరచన యసాధారణముగా నున్నది. కృష్ణమాచార్య సంకీర్తనములు శంకర వచనములు మొదలగునవి వ్రేళ్లలెక్కకుఁ జాలినని, యిట్టివి, కొన్నియున్నవి. వీనినెల్లఁ గ్రమముగా వెల్లడింపఁ గోరికపడుచున్నాను. సహృదయు లివి చవిగొందురుగాక!”

(భారతి - క్రోధన వైశాఖము)

‘భారతి’లో నట్లు ప్రకటించుచుండుటఁ జూచిన సహృదయులు గొందఱు నన్నావచనములెల్ల గ్రంథముగా ముద్రింపఁగోరిరి. అట్లే నేను వానిని మదరాసులో ‘నాంధ్రపత్రికా ముద్రణాలయము’ ననే ముద్రింపఁబూనితిని, నూటయిర్వది వచనములు 80 పుటలు ముద్రితములయ్యెను. అప్పుడు తిరుపతి శ్రీవేంకటేశ్వర దేవస్థానోద్యోగులోక రిద్దఱు నామిత్రు లాగ్రంథము తిరుపతి దేవస్థానమువారు ముద్రించుచుండుట నా కెఱింగించిరి. రాగిరేకులపైఁ గవికాలమునఁ జెక్కఁబడియున్న యావచనముల నుద్ధరించి దేవస్థానమువారు ముద్రించునప్పుడవి మిక్కిలి నిర్దుష్టముగా నుండఁగలవని, వారు ముద్రించుచుండఁగానే నాత్రపడి ముద్రించుట వ్యర్థమనివెఱచి యాగ్రంథము బయల్పడిన తర్వాత నా ప్రకటన విషయము యోజించుకొన వచ్చునని యుపేక్షించితిని. అచ్చుపడిన యాఫారము లెల్ల నాంధ్రపత్రికా కార్యాలయముననే యుండెను. ౧౯౩౫ తర్వాతనే తిరుపతి దేవస్థానమువారి ముద్రణము ముగిసెను. అటుతర్వాతఁ గొన్నాళ్లకుఁ జూతునుగదా! అందు నలువదియేడు వచనములే ముద్రితములయి యుండెను. మఱిమూఁడేండ్లకు నేను తిరుపతివచ్చి పరిశీలింపఁగా దర్వాతి వచనములయునికి యెఱుఁగ రాలేదు. అవి యహోబలముననో శ్రీరంగముననో యడఁగి యుండఁ బోలును! ప్రాచ్యలిఖితపుస్తకశాలలోను, దంజావూరి సరస్వతీ భాండాగారములోను నున్నవచనములు సమకూర్చి చూడఁగా ౧౭౫ వచనములున్నవి. ఇంకఁగొన్ని లోపించియు నుండఁబోలును! నేను రెండు లైబ్రరీలలోని వచనములు సమకూర్చికొని యుంటిని. తిరుపతి దేవస్థానముద్రణము తప్పులతో నసమగ్రముగానేయుండెను. ఈ విషయము వివరించి తెలుపఁగా నప్పుడు శ్రీవేంకటేశ్వర ప్రాచ్య విద్యాలయమున డైరెక్టరుగానున్న సరస్వతీ హృదయాలంకారులు శ్రీమాౝ యమ్. కృష్ణమాచార్యులుగారు నా ముద్రణము పూరింపఁగోరిరి. వెదకఁగా మదరాసులోని యచ్చు ఫారములెట్లోయెక్కడో చెల్లిపోయినట్లు తెలిసెను. నాదగ్గఱ మిగిలియున్న యచ్చుమచ్చుఫారములబట్టి ౧౨౦ వచనముల మరలనిపుడుముద్రించుట, కడమయముద్రితములఁబూరించుట,జరపితిని. ఇట్లుదీనిని వెల్లడింపఁజూచునాఁటికి శ్రీకృష్ణమాచార్యులుగారుకీర్తిశేషులయిరి. శ్రీమాౝ పరవస్తు వేంకటరామానుజస్వామి యమ్. ఏ. డైరక్టరుగారు దీని ముద్రణ యత్నము సాగించిరి. ఇట్లు శ్రీస్వామి వారి స్తుతిగ్రంథము శ్రీస్వామివారి యాస్థానకవిరచించినది, యీనాఁటి కిట్లు శ్రీస్వామివారి యాస్థానిలోనే ప్రకటితమగుట సంఘటిల్లినది. ఆనాఁటి తాళ్లపాక వంశమువారు మహనీయులు. వారి రచనము లింకనెన్నో ప్రకటితములు గావలసియున్నవి. వారు శ్రీస్వామివారి కెన్నో కైంకర్యముల జరపిరి. తనభక్తులగు నట్టి యా మహనీయుల సత్‌కృతులను శ్రీస్వామివారు సంరక్షించుకొందురనియే యాశించుచున్నాఁడను.



శ్రీవేంకటేశ్వర ప్రాచవిద్యా
పరిశోధనాలయము,
తిరుపతి
తారణ ఫాల్గునము.

వేటూరి - ప్రభాకరశాస్త్రి.

.



  1. ఇందు ఆళవందార్లస్తోత్రరత్న శ్లోకముల తునుకులున్నవి.
  2. ఆ వచనములు రచియించిన కృష్ణమాచార్యుఁడు కాకతీయప్రతాపరుద్రుని నాఁటివాఁడని, యేక శిలానగర చరిత్రాదులవలనఁ దెలియగును.
  3. ఆతనికాలముననే యీవచనములు రాగిరేకులమీఁదఁజెక్కింపఁబడి తిరుపతి దేవస్థానమున భద్రపఱుపఁబడినవి. ఈ వచనములేకాక తాళ్లపాకవారి పద్యగద్య గేయ రచనములనేకములు రాగి రేకులపైఁ జెక్కబడి భద్రపఱుపఁబడినవి. అందుఁ గొన్ని ఱేకులు అహోబలమునకు శ్రీరంగమునకునుగూడఁ జేర్చఁబడినవట! ఇటీవల నహోబలములోని రాగిరేకులు కొన్ని రాగిపాత్రలకై యమ్మ ఁబడినవనియు, నట్లమ్మఁబడినవి, నాలుగయిదువందల రూపాయలవిలువఁగల రాగిరేకులనియు వింటిని. తిరుపతి ఱేకులమీఁది సంకీర్తనాదులు శ్రీ తిరుపతి దేవస్ధానమువా రిప్పటికిఁగొన్నింటి ముద్రించిరి.
  4. గ్రంథావసానమున ముద్రింపఁబడినది.
  5. ఇది తిరుపతి ఓరియంటల్ యిన్స్టిట్యూట్ లైబ్రరిలోనున్నది.
  6. ఈతఁడు పెరియ తిరుమలా చార్యుఁడని, పెద తిరుమలాచార్యుఁడని, పెద తిరుమలయ్యయని, తిరుమలార్య దేశికుఁడని పలు తెఱఁగుల జేర్కొనఁబడుచున్నాఁడు.
  7. తాళ్లపాక వారి చరిత్రాంశములు శ్రీసాధు సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ప్రకటించిన తిరుపతి దేవస్ధాలము ఎపిగ్రాఫికల్ రిపోర్టు (పేజీలు 382–291) ననుసరించి వ్రాసినవి.
  8. ఇది తిరుపతి పాచ్యపరిశోధనశాల లైబ్రరిలోనున్నది. కృత్యనతరణికలేదు.