శ్రీరస్తు
శ్రీవేంకటాచలమాహాత్మ్యము
ప్రథమాశ్వాసము
|
శ్రీకాంతాత్మసరోజచండకిరణం
శీతాంశుబింబాననం
శ్రీకంఠాబ్జజసన్నుతాంఘ్రికమలం
చిన్మాత్ర మప్రాకృతం
లోకాతీతమనేకగోపయువతీ
లోలం పరం సర్వగం
స్వాకారం తఱికుండశేషకుధరా
ద్యక్షం భజేహం సదా.
| 1
|
ఉ. |
క్షీరసముద్రమందు సువిశేషమతిన్ జనియించి కూర్మితో
వారిజనాభుదివ్యతరవక్షమునందు వసించి పూర్ణశృం
గారవిలాసలీలల సుఖస్థితి నొప్పుచు భక్తకోటికిన్
గౌరవ మొప్పఁగా నెపుడు గల్ములనిచ్చుసిరిన్భజించెదన్.
| 2
|
శా. |
శ్రీవిఘ్నేశుని క్షేత్రపాలకు నజున్ శ్రీశంకరున్ దుర్గనున్
దేవేంద్రాదుల నాశ్రయింపుదును జిత్తే సత్తగా నాత్మలో
|
|
|
భావింపన్ గుఱిఁ జూపినట్టిగురు సుబ్రహ్మణ్యుపాదాబ్జముల్
సేవింతు బరవస్తుతత్త్వము మదిం జింతింతు నశ్రాంతమున్.
| 3
|
శా. |
అక్షీణాక్షరపంక్తిరీతి మును మధ్యాహ్నంబునన్ నాకుఁ బ్ర
త్యక్షంబై గురు నాదిపూరుషుని బ్రత్యక్షంబు గావించి చి
త్సాక్షేబ్రహ్మమటంచుఁ జూపుచుఁ దదర్థంబుం గృపం జెప్పినన్
రక్షింపం బనిఁబూను భారతిని గీర్వాణిన్ సదా నెంచెదన్.
| 4
|
చ. |
అలఘునభంబునుండి విమలాక్షరపంక్తులరీతి వచ్చి నే
నలసత నొందియున్నతఱి నాననమందు వసించి జ్ఞానముం
గలుగఁగఁజేసి మానసవికారములం దొలఁగించి జిహ్వపై
నిలిచి నటించుశారదను నిత్యము సన్నుతిఁ జేయుచుండెదన్.
| 5
|
శా. |
పంకేజాసనుఁ డాలకింప నొగి సత్ప్రావీణ్యముం దెల్పుచున్
శంకాతంకము లేక తాళగతులన్ సద్వీణ వాయించి యే
ణాంకున్ హాస్యము సేయ నోపు ముఖమం దాహ్లాదముం జూపుది
వ్యోంకారాకృతి యైనభారతిని నాయుల్లంబునం గొల్చెదన్.
| 6
|
సీ. |
విప్రమాతృకలకు వెలిపట్ట్లు తెల్లక
ల్వలు గంధమౌక్తికంబుల నొసంగి
రాజమాతృకలకు రహిని గాపులుమృగ
మదసుమశోణాగ్రమణు లొసంగి
వైశ్యమాతృకలకుఁ బచ్చపట్టులు చంద్ర
మరకతంబులు బొండుమల్లె లొసఁగి
శూద్రమాతృకల కచ్చుగ నల్లవల్వలు
నగరుమొల్లలు నయంబార నొసఁగి
|
|
తే. |
యానవాల్నేయితేనెయు [1]నాససమును
బొసఁగ నర్పించి కృతులు సెప్పుదురు కవులు
నేర నొక్కటి దఱికుండనృహరికృపను
భక్తి మ్రొక్కెద మాతృకాశక్తులకును.
| 7
|
క. |
అలకాశినుండి వెలువడి
వలనుగ మాకొఱకు నందవరపురమునఁ దా
నెలకొని కులదేవతయై
యలరుచు మమ్మేలు చౌడమాంబను గొలుతున్.
| 8
|
శా. |
నే విజ్ఞానము మోసవోవుతఱిఁ దానే వచ్చి సత్ప్రేమమై
ధావళ్యాకృతిఁ జూపి మించినయవిద్యాచ్ఛేదముం జేసి మ
ద్భావంబున్వసియించి యిచ్చు నొగి శబ్దశ్రేణి నెమ్మిన్ హయ
గ్రీవున్ సత్కరుణాపయోధిని సదా కీర్తింతు సద్భక్తితోన్.
| 9
|
శా. |
ఆంతర్యంబున నుంచి సంతత మనంతాఖ్యుం బ్రశంసించెదన్
స్వాంతంబు న్వినతాసుతుం బ్రవిమలస్వాంతుం దలంతున్సదా
సంతోషం బలరంగ భక్తి తగ విష్వక్సేను సేవించెదన్
భ్రాంతుల్దీరఁగఁ బూర్వదేశికుల సంభాషింతునిష్టాప్తికై.
| 10
|
శా. |
ధాటిన్ దుష్టనిశాటులం దునిమి సద్ధర్మంబు రక్షించి శౌ
ర్యాటోపం బుపశాంతి చేసి ఫణిపర్యంకంబునన్ నిద్రితుం
డై టెక్కప్పఁగఁ బవ్వళించియును సర్వాధారుఁడౌ గావునం
గూటస్థుం డితఁ డంచు నెన్నుదు మదిన్ గోవిందరాజాహ్వయున్.
| 11
|
మ. |
అలఘుత్వంబున రావణాద్యఖిలదైత్యాళి న్విదారించి స
ల్లలితన్ సీతను గూడి యాత్మపుర ముల్లాసంబుతోఁ జేరి యు
|
|
|
జ్వలపట్టంబున కర్హుఁడై నిలచి విశ్వస్వామియై యొప్పుటం
గొలుతున్ సంతత మిష్టదైనమనుచుం గోదండదీక్షాగురున్.
| 12
|
శా. |
శృంగారాకృతితోడ వచ్చి పదముల్ శృంగారసారంబుతో
డం గూఢంబుగఁ జెప్పు నీవనఁగ నట్లేఁ జెప్పలే నన్న నన్
ముంగోపంబునఁ జూచి లేచి యట నే మ్రొక్కంగ మన్నించి త
చ్ఛృంగారోక్తులు తానె పల్కికొనునాశ్రీకృష్ణు సేవించెదన్.
| 13
|
ఉ. |
కోరినశ్రీనివాసుసకుఁ గొంకక నైజనివాసమిచ్చి యా
వీరుఁ డొసంగినంత పదివేలని తృప్తిగ నారగించుచుం
గ్రూరతలేక యోగివలె గుప్తతనుండు వరాహదేవునిన్
సారపరాత్మతత్వమని సన్నుతి సేయుచునుందు భృత్యనై.
| 14
|
మ. |
తిరమై శ్రీయలుమేలుమంగయురమందేనిల్చి దీపింపఁగాఁ
బరమైశ్వర్యధురంధరుండగుచు నాపాలం గృపన్ నిల్చి సుం
దరదివ్యాకృతి నప్పటప్పటికి మోదం బొప్పఁగాఁ జూపి మ
ద్వరదుండైతగు వేంకటాచలపతి న్వర్ణింతు నశ్రాంతమున్.
| 15
|
ఉ. |
శ్రీరమణీహృదీశ్వరుని చిన్మయమూర్తిని విశ్వతోముఖున్
క్షీరసముద్రశాయిని వశీకృతమాయుని దివ్యకాయునిన్
సారతరార్థము ల్దెలిపి సత్కృపతో ననునేలు దేవునిం
గూరిమిమై భజింతుఁ దఱికుండనృసింహుని దూరితాంహునిన్.
| 16
|
క. |
అలసూర్యాదినవగ్రహ
ములను బ్రజాపతుల యోగిముఖ్యులఁ ద్రిమతం
బుల నుద్ధరించుధన్యులఁ
దలఁతున్ మోక్షాభిలాషఁ దద్దయు వేడ్కన్.
| 17
|
సీ. |
ఆదికవీశ్వరుం డైన వాల్మీకికి
వ్యాసమౌనికిఁ గాళిదాసకవికి
|
|
|
నరయంగ వరలబ్ధ మన్నమాచార్యున
కాంధ్రభాషాకవిత్వాఢ్యు లగుచుఁ
దనరునన్నయను దిక్కనసోమయాజికిఁ
బోతరాజునకును నీతులయిన
కవులకుఁ బండితాగ్రణులకుఁ బౌరాణి
కులకు భక్తిని మ్రొక్కికొనుచు నేను
|
|
తే. |
వేంకటాచలమహాత్మ్యవిభవములను
బద్యరీతిని రచియించి భక్తి మెఱయ
శ్రీనివాసునిపాదరాజీవములకు
బొసఁగ నర్పింతు మోక్షంబుఁ బొందుకొఱకు.
| 18
|
సీ. |
పండితాగ్రణులార ప్రజలార యిపుడు నా
బాలభాష కసూయపడక వినుఁడు
తల్లిదండ్రులు చిన్నపిల్లలపల్కుల
కానంద మొందెడునట్ల యిందు
మీరు నాతప్పొప్పు లేరీతిగానైన
గేలిసేయక చిత్తగింపవలయు
నాంధ్రగీర్వాణమహాకృతు లుండఁగా
నిప్పు డీకృతి విననేల యనక
|
|
తే. |
భక్ష్యములు మెక్కి యావలఁ బచ్చడియును
నంజుకొనినవిధంబున నాప్రబంధ
మాలకింతురటంచు బేరాసచేత
నేను రచియింతు దీని మన్నించి గనుఁడు.
| 19
|
శా. |
నారీతిం దగ విన్నవింతును గృపన్నాతండ్రులారా వినుం
డారాజీవదళాక్షుసత్కరుణ నాయందుండు నైనన్మదిన్
|
|
|
సారార్థంబుల నేర్పఱించికొని భాస్వద్భక్తియోగక్రమ
శ్రీరమ్యంబుగ నాంధ్రరీతిని ప్రకాశింపం గృతిం జేసెదన్.
| 20
|
సీ. |
నాచిన్ననాఁట నోనామాలునైన నా
చార్యులచెంత నేఁ జదువలేదు
పరఁగుఛందస్సులోఁ బదిపద్యములనైన
నిక్కంబుగా నేను నేరలేదు
లలికావ్యనాటకాకాలంకారశాస్త్రము
ల్వీనులనైనను వినఁగలేదు
పూర్వేతిహాసస్ఫురితాంధ్రసత్కృతు
ల్శోధించి వరుసఁగఁ జూడలేదు
|
|
తే. |
చేరి తఱికుండపురినారసింహదేవుఁ
డానతిచ్చినరీతిగ నే నిమిత్త
మాత్రమునఁబల్కుదును స్వసామర్థ్య మిప్పు
డరయ నించుకయేని నాయందు లేదు.
| 21
|
సీ. |
దారునిర్మితవీణ నారూఢిఁ బల్కించు
గాయకపుర్షునికరణిగాను
పురుషోత్తముఁడు దయాపూర్ణుఁడై నాజిహ్వ
యందుఁ దా వసియించి యరుదుగాను
బలికించుఁ గావున భాగవతపురాణ
మమర నేద్విపదకావ్యంబుగాను
ద్వాదశస్కంధము ల్తగఁ జెప్పి హరికి స
మర్పించి శ్రీవేంకటాద్రిమహిమ
|
|
తే. |
మతనిపై రమ్యపద్యకావ్యం బొనర్చి
శ్రీనివాసునికే సమర్పింపనుంటి
|
|
|
నీఁగ తోయధిఁ దాఁటఁబోయినవిధమున
నాస్వతంత్రత కిల బుధు ల్నవ్విపోరె.
| 22
|
తే. |
నవ్వినను సమ్మతంబని నన్ను బ్రోచు
చున్న శ్రీవేంకటేశ్వరుఁ డున్నతముగ
నిరవుకొని యున్న వేంకటగిరిపురంబు
నిపుడు వర్ణింతు నించుక యెట్టులనిన.
| 23
|
సీ. |
ఘనగోపురములు ప్రాకారమంటపములు
తేరులు సత్పుణ్యతీర్థములును
కమలాప్తకిరణసంకలితంబులై ప్రకా
శించుచుండెడు హేమశిఖరములును
పావనపరివారదేవాలయంబులు
మహిమ నొప్పువిరక్తమఠనరములు
రంగత్తురంగమాతంగతురంగము
ల్గొమరారుబహుసాధుగోగణములు
|
|
తే. |
ముద్దుగాఁ బల్కుశుకపికములును నీల
కంఠములును మరాళసంఘములు మఱియు
ఫలవనంబులు తులసికాదళసుమములు
క్రిక్కిఱిసి యుండు వెంకటగిరిని యెపుడు.
| 24
|
సీ. |
వేదశాస్త్రపురాణవిద్యాప్రసంగవి
వేకభాస్వరు లైనవిప్రవరులు
మహనీయసత్యధర్మపరాక్రమములచే
భుజబలోన్నతు లగుభూమిపతులు
రమణీయకృషియు గోరక్ష వాణిజ్యము
|
|
|
వరసంపదలు గల్గువైశ్యజనులు
బ్రాహ్మణసేవాప్రభావజ్ఞులై సుదా
సులుగాను మెలఁగెడుశూద్రజనులు
|
|
తే. |
తేరువీధులు నమితశృంగారవనము
లమర మందిరములు పంకజాకరములు
గల్గి మెలఁగఁగ మర్త్యలోకంబునందుఁ
గీర్తిచే నొప్పు వేకటగిరిపురంబు.
| 25
|
సీ. |
ఘనభూవరాహదేవునకుఁ దూర్పున శ్రీని
వాసున కీశాన్యభాగమందు
స్ఫటికసుకాంతిసోపానమధ్యమునందు
మరకతఛాయల మలకలొప్పఁ
బూర్జమౌ శ్రీస్వామిపుష్కరణి జనాఘ
ముల హరింపఁగ మహాముఖ్యులయిన
తీర్థవాసులు సర్వదేశాగతులకు స
త్సంకల్పములు చెప్పి సకలదాన
|
|
తే. |
ధర్మశాస్త్రవివేకవితానములును
జెప్పి విత్తము నపు డుపార్జించి హరికి
నర్పణము సేయ నాతీర్థ మావరించి
యనిమిషులమాడ్కి వర్తింతు రాఢ్యులగుచు.
| 26
|
క. |
ఆపుష్కరిణికిఁ బడమర
భూపతి యగుకిటికిదూరుపున వేదికిపై
వ్యాపకజపతపములచే
దీపింతురు గొంద ఱచట ద్విజు లతిభక్తిన్.
| 27
|
సీ. |
మాళవ నేపాళ మళయాళ బంగాళ
చోళ టెంకణ సింధు శూరసేన
సౌవీర కుంతల శక కళింగ కిరాత
కోసల కేకయ కుకుర సాళ్వ
ద్రవిడ పుళింద విదర్భ మహారాష్ట్ర
బర్బరాభీరాంధ్ర పాండ్య మగధ
కాంభోజ కొంకణ కాశ్మీరముఖ్యదే
శస్థులు వేంకటాచలము చేరి
|
|
తే. |
పుష్కరిణిలో మునింగి శ్రీ భూవరాహ
దేవు నీక్షించి వేంకటదేవుఁ గాంచి
సకలవస్తువు లర్పించి సంతసించి
యాడుచుం బాడుచుండుదు రనయమందు.
| 28
|
క. |
జలరుహసుమఫలపరిమళ
ములు మృగమదసౌరభంబు మొగి ధూపస్వా
దులు పునుగు తైలగంధము
లలరుచు వాసించు వేంకటాఖ్యపురమునన్.
| 29
|
ఉ. |
అప్పురియందు దివ్యతరహాటకకుంభవిరాజమానమై
యొప్పువిమానమధ్యమున నుత్తమపూరుషుఁడై మహాత్ముఁడై
యొప్పులకుప్పయై ధర మహోన్నతుఁడై వెలుఁగొందుచుండుమా
యప్పడు వేంకటేశ్వరుఁ డహర్నిశముం గమలాసమేతుఁడై.
| 30
|
తే. |
అమ్మహాత్మునిచరితంబు లాదిమునులు
సంస్కృతంబునఁ జెప్పి రాసరణి నృహరి
తెలియఁజేసినయంత నేఁ దెనుఁగుగాను
బద్యకావ్యంబు రచియింతు భక్తి మెఱయ.
| 31
|
క. |
హేమాక్షాంతకునకు సం
గ్రామభయంకరుని కఖిలకారణునకు శ్రీ
భూమివరాహస్వామికిఁ
గామితఫలదాయకునకుఁ గరుణానిధికిన్.
| 32
|
క. |
అక్షీణశౌర్యధైర్యా
ధ్యక్షహిరణ్యాక్షరాక్షసాధిపవక్షో
విక్షోభకనఖరశిఖా
దక్షున కతికోపవిభపతామ్రాక్షునకున్.
| 33
|
క. |
హాకహరహీరదరశర
పారదనారదవిభావిభవగాత్రునకుం
గూరిమిమైఁ బ్రహ్లాదుని
సారకృపన్ బ్రోచినట్టిశాంతాత్మునకున్.
| 34
|
క. |
చండతర శౌర్యగౌరవ
ఖండీభరదరికి భక్తకలుషజలరుహా
ఖండతరకరికి శ్రీతఱి
కుండనృకేసరికి నాదుగుఱికిన్ హరికిన్.
| 35
|
క. |
వేంకటగిరినాయకునకుఁ
బంకజభవజనకునకును బరమాత్మునకున్
శంకరనరమిత్రునకుఁ గ
లంకవిరహితునకు మోక్షలక్ష్మీపతికిన్.
| 36
|
వ. |
అంకితంబుగ నాయొనర్పంబూనిన వేంకటాచలమాహాత్మ్యం
బునకుఁ గథాక్రమం బెట్టిదనిన.
| 37
|
సీ. |
జంబీకమందారసహకారమాలూర
సాలరసాలహింతాలములును
వటబిల్వబదరికాశ్వత్థనందనకుంద
కురువకక్రముకతక్కోలములును
నారికేళార్జుననారంగబంధూక
పారిజాతాశోకపాటలులును
కాదంబకాంచనకరవీరపున్నాగ
కోవిదారమధూకకుటజములును
|
|
తే. |
మొదలుగాఁగల బహువృక్షములును లతలు
పూఁచి కాఁచి ఫలింప సంపూర్ణమగుచు
సర్వకాలంబులందు వసంతకాల
రమ్యమై యున్న నైమిశారణ్యమునను.
| 38
|
క. |
సెలయేఱులు కమలాకర
ములు బహుకాసారబృందములు పూర్ణములై
కలకాలము నొకకవిధముగఁ
బొలుపుగఁ బ్రవహించు నచట బుధసేవ్యంబై.
| 39
|
వ. |
అట్టి నైమిశారణ్యంబునందు శౌనక కపిల గాలవ కౌశిక
పిప్పల గార్గ్య శంఖకుత్స శ్రీవత్స శమీక కణ్వ సుమేధ వాల
ఖిల్యాదిమహామునులు సూతునివలన సకలపురాణంబులు విని
తదనంతరంబున నొక్కశుభదినంబునందు సూతుంజూచి, కథ
నకా భూలోకంబున నూటయెనిమిది తిరుపతులు గల వందు
స్వయంవ్యక్తంబులు, శ్రీరంగంబును, శ్రీముష్ణంబును,
తోతాద్రియుసు, సాలగ్రామంబును, నైమిశంబును, బదరి
|
|
|
కాశ్రమంబును, కాంచియును, వేంకటాచలంబును, నీ యెని
మిది స్వయంవ్యక్తంబు లగుం గావున నిందు విశ్లేషించి సకలే
ష్టార్థసిద్ధిప్రదం బయినస్థలం బెయ్యది దెల్పుమనుచు వెండియు
నిట్లనిరి.
| 40
|
క. |
ఘనముగ నర్చారూపము
లను నారాయణుఁడు భూతలంబున భక్తా
వనుఁడై విఖ్యాతిని బొం
దినసత్కథ మాకు నీవు దెల్పుము సూతా.
| 41
|
మ. |
అనినన్ సూతుడు నవ్వి మేలు భళ మీ రాసక్తితోఁ బ్రశ్న చే
సిన దీలోకహితంబు దీన వరలక్ష్మీకాంతుఁ డుప్పొంగి మి
మును నన్నుం గృపఁ గాచుఁ గావున మహాముఖ్యంబుగాఁ జెప్పెదన్
వినుఁ డోతాపసులార నెమ్మదిగ మీవీను ల్వినోదింపగన్.
| 42
|
క. |
శ్రీవేదవ్యాసులకృప
చే వరుసగఁ దోచినంత చెప్పెద వినుఁ డా
దేవునిచరితములన్నియు
నావశమే చెప్ప మౌనినాయకులారా.
| 43
|
వ. |
అయిన నాకుఁ దోఁచినంతకు వచించెద నెనిమిది స్వయంవ్యక్తం
బులయందు వేంకటాచలం బైహికాముష్మికఫలప్రదం బగుం
గావున నతిశయం బగుచుండు శ్వేతవరాహకల్పంబునందు
శ్రీహరి శేషాద్రియందు బ్రవేశించినవృత్తాంతం బంతయు
సావధానులరై వినుండని సూతుం డిట్లనియె.
| 44
|
సీ. |
నారాయణస్వామినాభిసారసమున
మును చతురాస్యుండు జనన మొందె
|
|
|
సృష్టికాలమునంద శేషభూతప్రపం
చంబు నొప్పఁగ సృజనం బొనర్చె
నున్నతుఁడై చతుర్యుగసహస్రంబును
జాగరూకతను విశ్వంబుఁ గాచె
నప్పు డాదిత్యానలానిలాంబుదపంక్తు
లొప్పఁగా హద్దులు దప్పకుండె
|
|
తే. |
మహిమ మీఱఁ జతుర్ధశమనువులందు
వెలుఁగుచును విష్ణుదేవుండు విశ్వమెల్ల
బాలనము సేయఁగా బ్రహ్మపగలు జరిగెఁ
బద్మజుఁడు రాత్రిరాగఁ దాఁ బవ్వళించె.
| 45
|
సీ. |
ఆబ్రహ్మ నిద్రించినట్టిరాతిరివేళ
భానుఁ డుగ్రకరాళిఁ బ్రబలఁజేసె
గాలానలజ్వాలకణములఁ గ్రక్కఁగా
స్థావరజంగమచయము లడఁగెఁ
బ్రళయవాతూల మంబర మావరించుచు
విసవిస నమితమై విసరసాగె
సంవర్తకాదిదుస్తరమేఘబృందంబు
మిన్ను ఘూర్ణిల నార్చె మెఱుపు లెసఁగె
|
|
తే. |
ద్విరదశుంభనిభంబులై దీర్ఘగతుల
వర్షధారలు గుఱిసె నివ్వసుధ నీటి
బరువు కోపంగలేక లోపలికిఁ గ్రుంకు
నపుడు హైరణ్యలోచనుఁ డార్భటించి.
| 46
|
వ. |
ధరణితలంబును రసాతలంబునకుం గొనిపోయి యందు బహు
కాలంబు క్రీడించుచుండె నంత బ్రహ్మదేవుండు క్రమ్మఱ
|
|
|
మేల్కాంచిన సమయంబున హరి పుసస్సృష్టి సేయింప
నుద్యుక్తుండై శ్వేతవరాహరూపంబు ధరించి మహాజలంబునం
బ్రవేశించి రసాతలంబున కేగి భూమిని పైకెత్తుసమయంబునఁ
గాంచనాక్షుండు కోపోద్రేకుండై యడ్డంబు వచ్చి యుద్ధంబు
సేయ నాదుష్టుని నిజదంష్ట్రాంగంబున శిరంబు ఖండించి
తద్రక్తంబునం గలసిన ప్రళయజలంబు రక్తతోయంబు
కరణిం బొడకట్టినం జూచి జనలోకనివాసులు వెఱఁగంది నిజ
యోగదృష్టిం జూచి హరి క్రోడాకారుండై చేసినకృత్యంబు
తెలిసి తత్ప్రభావంబును వినుతించు చున్నసమయంబున
శ్వేతవరాహస్వామి నిజదంష్ట్రాంగంబున భూమిం గ్రుచ్చి
మీఁదికెత్తి దెచ్చినం జూచి దేవేంద్రాదులు వరాహస్వామికి
బ్రణామంబు లాచరించి భేరీ మృదంగాది వాద్యంబుల
మ్రోయించి సుమసృష్టి గుఱియించి యనేకప్రకారంబులఁ
బ్రస్తుతంచి యి ట్లనిరి.
| 47
|
ఆ. |
హరి వరాహరూపుఁ డై దానవుని జంపి
యవని నిలకుఁ దెచ్చి నట్టిదిట్ట
నీర యవని నమర నిల్పు మీనీటిపై
ననఁగ యజ్ఞఘోణి హర్ష మెసఁగ.
| 48
|
వ. |
నిజఖురంబుల మహాజలంబు నడంచి చదరంబు సేసి యానీటిపై
భూమిం గుదురుగ నిల్పి జనలోకవాసు లైనదేవేంద్రాదుల
నాదరించి యథాప్రకారంబుగ మీస్థానంబుల నుండుఁ డని
నియమించి బ్రహ్మను మేల్కొల్పి పూర్వప్రకారంబుగ
సృష్టిం జేయుమని యాజ్ఞాపించి వీడ్కొని తలంగి సన్ని
హితుండై మ్రొక్కుచున్న పక్షీంద్రుం జూచి యిట్లనియె.
| 49
|
క. |
ధారుణి నీటను మునిఁగిన
కారణముస వాని నెత్తుకార్యంబున కీ
ఘోరాకారము దాల్చితి
నారూపము చూచి లక్ష్మి నగదె ఖగేంద్రా.
| 50
|
క. |
నారూపం బీభూమికి
గౌరవముగఁ దోఁచి నన్ను గామించెను నే
నీరమణిని మోహించితి
నారామామణికి నొప్పునని విహగేంద్రా.
| 51
|
క. |
ఈకఠినశరీరము మఱి
యీకరణిం బెఱుఁగుసటలు నీవికృతాక్షుల్
ప్రాకటదంష్ట్రాయుగ మీ
భీకరతను జూచి లక్ష్మి బెగడు ఖగేంద్రా.
| 52
|
క. |
ఆవైకుంఠపురంబున
కేవిధమున వత్తు లక్ష్మి యెకసక్కెముగా
నీవెవ్వఁ డంచు నడిగిన
శ్రీవిష్ణుం డనఁగ నాకు సిగ్గగు గరుఁడా.
| 53
|
క. |
కావున నచటికి నేలా
నేవిధమున నైన ధాత్రి నెడఁబాయక యిం
దే వసియించెద నన విని
యావిహగేంద్రుండు మ్రొక్కి హరి కిట్లనియెన్.
| 54
|
శా. |
దేవా ధారుణి నుద్ధరించుటకుఁ బోత్రిత్వంబుచే మించి ర
క్షోవీరుం బరిమార్చి యబ్బురముగా క్షోణితలం బెత్తుటం
బ్రావీణ్యం బొగి నాదిదేవత మహాభక్తిం బ్రశంసించునం
దే వేంచేయుడు వేడ్కమీఱ హరి యోదేవోత్తమా
మ్రొక్కెదన్.
| 55
|
క. |
మీ కనపాయినియై తగి
యాకమలాదేవి వక్షమందుండును మీ
సూకకరూపము చూపిన
నాకాంతకు వెఱపుఁ దోఁచదయ్య మహాత్మా.
| 56
|
తే. |
మీరు సర్వజ్ఞమూర్తులు మీకుఁ దెలియ
కున్నదే నాకుఁ దోఁచ కీవిన్నపంబు
చేసినా నింక దేవరచిత్తమునకు
సమ్మతం బైన నది లోకసమ్మతంబ.
| 57
|
వ. |
అని పక్షీంద్రుం డురుతరభక్తిం బ్రణామంబులుం జేసినం
జూచి హరి కరుణించి యిట్లనియె.
| 58
|
సీ. |
అనఘ ఖగేంద్ర నే నచటికి రానిప్డు
ధరణిపై వసియించి దానవులను
బరిమార్చి సుజనులఁ బాలింతు నిఁక నీవు.
పొల్పగువైకుంఠపురము చేరి
వనధికన్యకకు నీవార్త లొప్పఁగఁ జెప్పి
క్రీడాచలముగొని [2]గెలివి మెఱయ
రమ్ము పొమ్మన ఖగరాజచ్యుతునినాజ్ఞ
గొని వేడ్క నరిగె వైకుంఠమునకు
|
|
తే. |
నపుడు కిటి యగువిష్ణు వియ్యవనిఁ దిరిగి
తాను వసియింపఁ దగినట్టితావుఁ గనుచు
వచ్చుచును నిల్వకెందును వనజనేత్రుఁ
డొక్కయెడఁ జూచి యిదియ సర్వోత్తమంబు.
| 59
|
వ. |
అని మనంబున నిర్ణయించె, నయ్యది గౌతమీనదికి దక్షిణం
|
|
|
బుగ నఱువది యోజనంబుల దూరంబును, దూర్పులవ
ణార్ణవంబునకుఁ బశ్చిమంబుగా నైదుయోజనంబులును దక్షి
ణంబుగ సువర్ణముఖరికి నుత్తరంబుగ నుండునంద నిలిచి
గరుడాగమనంబున కెదురుగనుంగొనుచు నుండె నంత.
| 60
|
సీ. |
గరుడుండు వైకుంఠపురిఁ జేరి శ్రీరమా
దేవికి మ్రొక్కి ప్రార్థించి పలికె
నోతల్లి హరి వరాహోగ్రరూపము దాల్చి
హైరణ్యనేత్రుని హతుని జేసి
యల రసాతలమునం దెలమిఁ గ్రుంకి ధరిత్రి
దంష్ట్రాగ్రమున యథాస్థానమునకుఁ
దెచ్చి చక్కఁగ నుంచి యచ్చట నిల్వ సం
కల్పించినాఁ డాప్రకార మటకుఁ
|
|
తే. |
దెమ్మటంచును జెప్పె నీదివ్యసౌఖ్య
దమగు క్రీడాచలంబుకు దనరవారి
యాజ్ఞ వచ్చితి ననవు డయ్యబ్ధికన్య
విస్మయంబంది గరుడుండు వినఁగ ననియె.
| 61
|
గరుత్మంతుఁడు శేషాద్రికి క్రీడాచలంబు దెచ్చుట
చ. |
హరి కిటిరూపవైభవము నద్భుత మొప్పఁగ నేను జూచెదన్
సరగునఁ దోడి తెమ్మనిన సాగిలి మ్రొక్కి ఖగేంద్రుఁ డిట్లనెం
గరుణను రమ్మటంచుఁ బదకంజములం బడి సన్నుతించినన్
హరి ధరవీడి రాననియె నాకయి వచ్చితి శ్రీహరిప్రియా.
| 62
|
ఆ. |
సూకరోగ్రమూర్తి మీకుఁ జూపిన మీరు
వెఱతు రంచుఁ బల్కె విష్ణు వంచు
|
|
|
విహగనాయకుండు విన్నవించిన నవ్వి
లక్ష్మి యిట్టు లనియె లలిత మెసఁగ.
| 63
|
ఆ. |
నేను దనకు నెపుడు నిత్యానపాయిని
నగుచు నుండుటెఱిఁగి యద్భుతముగఁ
గ్రొత్తమాట లన్న గ్రోడవిగ్రహమాయ
వింత దోఁచె మదికి విహగనాథ.
| 64
|
క. |
తా నేరూపము దాల్చిన
నే నారూపము ధరించి నిశ్చలమతినై
పూని యురంబున నుండుదు
నానడవడి క్రొత్త యీదినమున ఖగేంద్రా.
| 65
|
క. |
తా నిచటికి రాకుండిన
నే నచ్చటికైన వచ్చి నిజముగఁ గిటియై
యానందించుమహాత్ముని
మానితవక్షమున నుందు మహి విహగేంద్రా.
| 66
|
సీ. |
పాఠీనమై తాను బ్రళయాబ్ధిపై నీదు
నప్పుడు తనవక్షమందు నుంటిఁ
కూర్మరూపము దాల్చికొని యబ్ధిలో మునిం
గినయప్డు తనయంద దనరుచుంటి
నంగుష్ఠమాత్రుఁడై యాకుపై శయనించి
నప్పుడు నేఁ దనయంద నుంటి
చంద్రచంద్రికల కెచ్చట వేఱులేకుండు
నటుల నేఁ దనయంద నుంటి
|
|
తే. |
నిప్పు డెదఁ బాసి యుందునె యొప్పుకొంచు
నిచటిపరివారములతోడ నచటి కేను
|
|
|
వచ్చి యాక్రోడవిగ్రహువక్షమందు
నిలిచి యుండెద ఖగరాజ తలఁగ కెపుడు.
| 67
|
క. |
వేఁడు కలర భూదేవికిఁ
గ్రోడాకారంబు జూపి కులికెడుహరికిం
గ్రీడాచల మొప్పినచోఁ
గూడుదలయగాదె యటకుఁ గొనిపొ మ్మింకన్.
| 68
|
సీ. |
అని పల్కి పరివారమును దాను నిజకళ
లొనర వైకుంఠమందుంచి యొక్క
కళతోడ గ్రీడానగంబుపై కెక్కి రం
దఱుతోడ సిరి యానదప్ప కపుడు
గరుడుఁ డాక్రీడాద్రి శిరమున నిడికొని
ధాత్రికి దిగి వచ్చుతఱిని వివిధ
పుష్పలతాదులు పొల్పుగ నుయ్యెల
వలె నూఁగ భృంగంబు లొలసి తిరుగ
|
|
తే. |
కనకగిరిమీఁద నీలాద్రి గ్రాలుచుండు
కరణి హేమాంగుఁ డనఁదగు నురగవైరి
శిరమునం గ్రీడనగమును జెలఁగుచుండ
గగనదిగ్భాగములు దివ్యకళల నెసఁగె.
| 69
|
సీ. |
చందన జంబీర చంపక వకుళాది
పాదపంబులతోడఁ బ్రబలుదాని
కనకరత్నాదులకాంతులచే మించి
కనిపించు నమితశృంగములదాని
కలకంఠశుకనీలకంఠమరాళాది
విహగకూజితముల వెలయుదాని
|
|
|
కమలనీలోత్పలప్రముఖపుప్పోజ్వల
రమణీయపద్మాకరములదాని
|
|
తే. |
లలితవిస్తారసిద్ధస్థలములదాని
నమితముక్తికి నాటపట్టైనదాని
సిరిని నీళను భరియించి చెలఁగుదాని
గాంచి యాశ్వేతకటి నవ్వి మించి మదిని.
| 70
|
క. |
అచ్చెరువుగ నాచెంతకు
వచ్చెను సిరి వచ్చె నీళ వచ్చెను గిరియున్
వచ్చిను బరివారము నా
కిచ్చట సంసార మింక హెచ్చె నటంచున్.
| 71
|
వ. |
అని తలచుచుండుసమయంబున విహగేంద్రుండు వచ్చె
నంత నావరాహరూపుఁడు చూపిన దివ్యస్థలంబున నా క్రీడా
చలంబును డించి దండప్రణామంబు లాచరించ నాఖగరాజు
నకు సంతసించి యప్పర్వతం బెక్కి యందుంగల పుష్కరి
ణికిఁ బశ్చిమతటంబున నిలిచి యున్నసమయంబున బ్రహ్మ
రుద్రేంద్రామరదిక్పాలకమునులును గంధర్వాదిసిద్ధులును
విచ్చేసి శ్వేతవరాహస్వామిని వీక్షించి సకలనిగమార్థసం
ప్రశ్నల బహుప్రకారంబుల నానందబాష్పాంచితధారా
కలితనేత్రులై సాష్టాంగదండప్రణామంబు లాచరించి
జయజయశబ్దంబులు మిన్నుముట్టంజేసి ముకుళితకరకమల
ములు గలవా రగుచు నిట్లు నుతించిరి.
| 72
|
దండకము. |
శ్రీమన్మహాశ్వేత సత్క్రోడరూపాయ నిర్లేపబోధ
ప్రదీపా ప్రతాపోజ్వలా శ్రీపభూపా హిరణ్యాక్షకాఠిన్య
దేహాద్రిదంభోళిధారా సురాధార ధాత్రీతలోద్ధార
|
|
|
భర్మాద్రిధీరా జగత్పూర్ణచిత్సారభూతా భవాంభోధిపోతా
సుమోక్షప్రదాతా గుణాతీత వేదార్థనిర్ణేతపూతాత్మధాతా
మహాపంచభూత ప్రపంచాకరా శ్రీకరా సుప్రసన్నాత్మవై
మమ్ము రక్షించు మీశా రమాధీశ నీసత్ప్రభావంబు లెన్నన్
సహస్రాననుండైనఁ దానోపునే మాకు శక్యంబె నీయుగ్ర
దంష్ట్రాకరాళాస్యమున్ నీసటల్ వేడిచూడ్కుల్ మహా
భీకరాకారమున్ జూడ మాకే యసాధ్యంబుగాఁ దోఁచె
లోకంబున న్మానవవ్రాతము ల్చూచి భీతిల్లరే దేవ మమ్ముద్ధ
రింపన్ సదాసౌమ్యరూపంబునుం దాల్చి శ్రీభూమినీళాసమే
తుండవై తండ్రి తిర్యఙ్మనుష్యాఖ్యజీవాళులన్ బ్రోచుచున్
సర్వనిత్యోత్ససంబు ల్మహాభక్తబృందంబు లర్పింపగా దివ్య
లీలాప్రభావంబులం జూపుచు న్మీరు క్రీడాచలంబందు
వేంచేసి యుండుండు శ్రీపూర్ణకామా గుణస్తోమ దేవో
త్తమాదేవతాసార్వభౌమా వరాహావతారా నమస్తే నమస్తే
నమస్తే నమః.
| 73
|
మ. |
అని వారెల్ల బహుప్రకారముల వేదాంతోక్తులం బ్రస్తుతిం
చిన మోదించి వరాహదేవుండు దయాసింధుండు బ్రహ్మాదులన్
గని రుద్రాబ్జజముఖ్యులార వికృతాకారంబు నేఁ దాల్చి దై
త్యునిఖండించితి భూమి నెత్తి మహాతోయంబులం దాఁచితిన్.
| 74
|
క. |
మీమీసుస్థానములం
దామోదము మీరఁ జేరి యందఱు పూర్వం
బేమాడ్కి మెలఁగుచుండుదు
రామేరలు దప్పకుండుఁ డమలాత్మకులై.
| 75
|
శా. |
భూమ్యాదు ల్మదనుజ్ఞ దప్పక సదా పూర్వస్థితిన్నిల్చు నే
సౌమ్యత్వంబున సాగరాత్మజను వక్షఃస్థానమం దుంచెదన్
రమ్యాకారము నొంది భూజనములన్ రక్షించి యెల్లప్పుడున్
గామ్యార్థంబులు నిచ్చి వారిభయదుఃఖంబు ల్నివారించెదన్.
| 76
|
ఆ. |
అనుచు వారి కిట్టు లానతిచ్చి వరాహ
దేవుఁ డపుడు సౌమ్యదేహుఁ డగుచు
వరకృపారసంబు వారిపైఁ జిలికించి
శాంతచిత్తుఁడై ప్రశస్తముగను.
| 77
|
సీ. |
క్రీడాచలంబున శ్రీస్వామిపుష్కరి
ణికిఁ బశ్చిమంబుగఁ బ్రకటితమగు
భవ్యపుష్కరిణికి వాయవ్యదిశసమీ
పంబున జిత్రహర్మ్యంబు లెసఁగి
దివ్యనీలస్తంభ నవ్యహాటకకుంభ
మరకతోన్నతముఖమంటపములు
భానుకోటిప్రభాభాసమానసురత్న
గోపురప్రాకారకుడ్యములును
|
|
తే. |
కలిగి యప్రాకృతాదిత్యకాంతికలిత
మహితమాయానిగూఢవిమానమందు
మెఱయు శ్రీభూమినీళాసమేతుఁ డగుచు
శ్వేతకిటియొప్పె జగములు వినుతిసేయ.
| 78
|
వ. |
అట్లు పరమవైభవంబున నుండువరాహస్వామిని బ్రహ్మరుద్రా
దులు పొడగని యానందసముద్రమగ్నులై యనిమిష
దృష్టులై వీక్షించు చున్నసమయంబున వరాహదేవుండు
విమానంబుతో నంతర్ధానంబు నొందె నప్పుడు బ్రహ్మాదులు
|
|
|
జయజయశబ్దంబులుచేసి వరాహస్వామి తిరోహితుం డైన
దిక్కునకు మ్రొక్కులిడుచుఁ దత్ప్రభావంబులం బొగడుచుం
దమ నివాసంబులకుం జని రంత శ్రీభూనీళాదేవులును బరి
వారంబులును హరికి దండప్రణామంబు లాచరించినం జూచి
సంతసించి హరి సిరితో నిట్లనియె.
| 79
|
క. |
సిరి నీవు నన్నుఁ గన్గొని
వెఱచెద వని రమ్మనుటకు వెఱపించితి నీ
వరయఁగ నీళను దోడ్కొని
పరివారముతోడ రాగ బహుమే లయ్యెన్.
| 80
|
వ. |
అనిన విని సిరి నగుచు హరి కిట్లనియె.
| 81
|
తే. |
స్వామి నినుఁ బాసి నిముస మోర్వంగఁజూల
నని యెఱుంగవె గావును జనినదానఁ
దప్పు సైరించి మము నందఱను బ్రోవు
మనుచు వేఁడఁగ హరి సిరి కనియె నిట్లు.
| 82
|
క. |
భూమీస్థలి వెదకఁగ నా
కీమహితస్థలము దొరకె నిచ్చట నిలువన్
నామది కిష్టం బయ్యెను
గోమలి మన కిప్పు డిది వికుంఠంబ గదా.
| 83
|
సీ. |
ఈఫలద్రుమములు నీప్రసూనలతాళు
లీపుణ్యతీర్థము ల్ప్రాపు నుండు
మున్యాశ్రమంబుల మోక్షస్థలంబుల
ధన్యంబు లయిన భూధరచయములఁ
జూడఁ జూడఁగ నాకు వేడుక పుట్టెను
గాన నిల్చితి నిందుఁ గమలనయన
|
|
|
భూలోకవాసుల బ్రోవంగవలయును
వరము లొసంగి సత్కరుణ మెఱసి
|
|
తే. |
నాకు నిష్టంబు గలరీతి నీకు నిష్ట
మైన నిల్తును లేకున్న నరయ నిందుఁ
నుండ నని వల్క నిందిర యుల్ల మలర
దరహసితవక్త్రయై యనె హరికి నిట్లు.
| 84
|
తే. |
మీరు సర్వజ్ఞులరు ప్రియంబార నేను
మీరు నిల్చినయెడ నాకు మేటి మీకుఁ
జింతయేటికి దేవ మీచిత్త మింక
ననిన లచ్చిని యురమునం దలరఁ జేర్చి.
| 85
|
చ. |
అపుడు వరాహవిగ్రహుఁ డనంతకళాపరిపూర్ణుఁడై మహా
నిపుణత మీఱఁగా సిరిని నీళను దగ్గఱ నాదరించుచున్
విపులపరాక్రమక్రమవివేకవిచక్షుణు లైనపార్షిదుల్
కపటము లేక గొల్వఁగ నఖండసుఖస్థితి నొప్పె నయ్యెడన్.
| 86
|
తే. |
అనిన తాపసు లిట్లని రయ్య సూత
స్వామిపుష్కరిణీప్రభావంబు మాకుఁ
దెలుపవే యన విని నవ్వి దెలిపె దంచుఁ
బలికె నీరీతి మునిపుంగవులను గాంచి.
| 87
|
సీ. |
మునులార వైకుంఠమున నుండు క్రీడాన
గంబుపై స్వామిపుష్కరిణి యుండి
పరఁగ నప్రాకృతపరిమలోదకమై మ
హాపూర్ణమై యుండు నచట సిరిని
భూనీళలనుగూడి పురుషోత్తముఁడు జల
క్రీడ లాడుచు నుండు వేడు కలరఁ
|
|
|
గ్రీడాచలముతోడ నీడకు దిగి వచ్చి
విరజాసమానమై ధరణి వెలసి
|
|
తే. |
హరికి సంతోష మగుచు గంగాదినదుల
కన్నిటకు మాతృదేనత యగుచు జనుల
పాపముల హరియింపుచుఁ దాప మడచి
యిష్టకామ్యార్థములను దా నిచ్చుచుండు.
| 88
|
వ. |
ఇట్టిస్వామిపుష్కరిణితీర్థదర్శనపానంబులచేతనే స్త్రీశూద్రజనం
బులం బావనులం జేయుఁ గావున విశేషించి స్నానసంధ్యాది
నిత్యనైమిత్తక సకలకర్మకలాపంబు లాచరించు బ్రాహ్మణోత్తముల
పుణ్యం బెంతయని చెప్పనగు నిదియునుంగాక పుష్కరిణీ
స్నానంబును బరమంబగు నేకాదశీవ్రతంబును సద్గురుపాద
సేవనంబును గల్గుట దుర్లభంబు మఱియు సకలస్థావరజంగ
మంబులందు మనుజజన్మంబును బుష్కరిణీస్థలస్నానంబును వేంక
టాద్రియందు జీవించుచుండుటయు నత్యంతయతిశయదాయ
కంబు, గావున వేంకటాచలమాహాత్మ్యంబును బుష్కరిణీ
ప్రభావంబును వచింప నాచతుర్ముఖునికైన నశక్యంబు తత్ప్ర
భావంబులు సంక్షేపంబుగఁ జెప్పితి నింక నొక్కయితిహాసంబు
సెప్పెద నాలకింపుఁడని మునులకు సూతుం డిట్లనియె.
| 89
|
సీ. |
మును తారకాసురుం డనువాని సేనాని
యదిమి చంపిన బ్రహ్మహత్యవలనఁ
బీడితుఁడై నిజపితృవాక్య మంగీీక
రించి గ్రక్కున నిర్గమించి మొనసి
యా వేంకటాద్రికి నభిముఖుఁడై వచ్చు
నప్పు డాతనిబ్రహ్మహత్య గాంచి
|
|
|
యాకుమారస్వామియందుండ కతిదూర
మరిగె భయంపడి యంత గుహుఁడు
|
|
తే. |
వేంకటాద్రికి వచ్చి తా వేడ్క స్వామి
పుష్కరిణియందుఁ గ్రుంకి తెప్పున వరాహ
దేవు నీక్షించి భక్తిఁ బ్రార్థించి మ్రొక్కి
యపుడు కృతకృత్యుఁ డయ్యె షడాననుండు.
| 90
|
ఉ. |
కావున వేంకటాచల మఘంబుల కెల్ల భయంకరంబునై
పావనమై సువర్ణమణిభాస్వరమై ధరణీసురాలికిన్
జీవనమై తపోజనవశీకరమై యజరుద్రశక్రసం
సేవితమై సుభక్తులకు శ్రీకరమై నుతిపాత్రమై దగున్.
| 91
|
క. |
హరికల్యాణగుణమ్ముల
వరవేంకటగిరిని వెలయు వారక సత్యా
కరమై యవి వచియించిన
పరమార్థం బొకటె చూడఁ బండితులారా.
| 92
|
క. |
ఘనమై ప్రాకృతజనముల
కనులకుఁ బాషాణములుగఁ గన్పట్టును స
జ్జనములకుం గనకాచల
మునుబోలె వెలుగు నిత్యమును మునులారా.
| 93
|
వ. |
ఆ వేంకటాచలంబుననుండి వరాహస్వామి జనులకు దృశ్యా
దృశ్యుం డగుచు వర్తించు నప్పర్వతంబు భవతారకం బగు
చుండు ననిన శౌనకుండు సూతుం జూచి యిట్లనియె.
| 94
|
ఆ. |
ఆవరాహదేవుఁ డాపర్వతాగ్రాన
నుండి యేమి సేయుచుండె నెవరి
|
|
|
కేమి యొసఁగె వినుట కిష్టంబు గల్గె మా
కావిధంబు దెల్పుమయ్య సూత.
| 95
|
క. |
అన విని సూతుం డిట్లనె
ననఘుండు వరాహదేవుఁ డాగిరిమీఁదన్
ఘనుఁడై నెమ్మి వసించుచుఁ
దన కాంతామణులతోడఁ దగు క్రీడలన్.
| 96
|
సీ. |
వనపుష్పలతలచేతను బ్రకాశించుచు
నిరవయి తగుపొదరిండ్లయందు
నీలకాంతులచేత నెఱి నొప్పుచుండెడు
సదమలసానుదేశంబులందుఁ
బరిమళపుష్పముల్ పై వ్రాలుచుండఁగఁ
జల్లనై తగుపర్ణశాలలందుఁ
గనకమందిరములకైవడి దీపించు
రమణీయగిరిగహ్వరములయందు
|
|
తే. |
మెప్పుగా వ్రాలుపుప్పొడికుప్పలందు
వన్నె కెక్కిన సెలయేటిదిన్నెలందుఁ
గాంతలను గూడి చక్రి యేకాంతముగను
క్రీడసల్పుచు నుండును వేడు కలర.
| 97
|
చ. |
పరఁగ నధర్మ వాదు లగుపాటిఁ దృణంబుగ నిగ్రహించుచున్
వరుసగ ధర్మచిత్తులను వారకబ్రోవుచు నుండు నెప్పు డా
హరి కివి నైజసద్గుణము లై తనరారును గాన నెప్పుడున్
ధర నవతారముల్తఱుచు దాల్చుచునుండు కృపాసముద్రుఁడై.
| 98
|
సీ. |
మాటిమాటికిని బ్రహ్మకు రాత్రి యైనప్పు
డతఁడు నిద్రింపఁగా నఖిలగురుఁడు
|
|
|
తా నందు మేల్కని తనకుక్షిలో విశ్వ
మును దాఁచికొనియుండి వనజభవుఁడు
నిద్ర మేల్కొనఁగానె నిఖిలకారణకార్య
యుక్తసృష్టిని వాని కొప్పగించు
రమణమై మీనవరాహాదిరూపంబు
లటువంటికాలంబులందుఁ దాల్చు
|
|
తే. |
దుష్టనిగ్రహ మొనరించి శిష్టజనుల
రక్షణము సేయు నొక్కవరాహకల్ప
మందుఁ జక్రికి మ్రొక్కి పద్మాసనుండు
వినయ ముప్పొంగ నిట్లని విన్నవించె.
| 99
|
ఉ. |
శ్వేతవరాహరూప ననుఁ జేకొని విన్నప మాలకించి యీ
భూతలమందు శేషగిరి పూజితమై తగు నందు మీరు వి
ఖ్యాతిగ నిల్చితేని మిము గాంచి తరింతురు మర్త్యులంద ఱో
తాత యటంచుఁ బల్కఁగ విధాతను జూచి ప్రసన్నచిత్తుఁడై.
| 100
|
తే. |
చక్రి యిట్టులనియె జలజసంభవ నీవు
కోరినట్ల యేను గ్రోడరూప
ధరుఁడ నగుచు శేషధాత్రీధరమునందు
నిలిచియుందు ననియె నెమ్మిమీఱ.
| 101
|
తే. |
అనిన విని మ్రొక్క సనియెఁ బద్మాసనుండు
శ్వేతకిటితన్నిమిత్తంబుచేత శేష
శిఖరియందు నివాసంబు చేసి జనుల
రక్షణము సేయుచుండు నిరంతరంబు.
| 102
|
ఆ. |
ఆవికుంఠమున సదాదిత్యమండల
మందు సర్గమందు హరి వసించు
|
|
|
నంతకంటె ముఖ్యమని వేంకటాద్రిపై
జక్రధరుఁడు నిల్చె సంతసముగ.
| 103
|
సీ. |
అనినఁ దాపసు లిట్టు లనిరి శేషాద్రి క్రీ
డాద్రి వేంకటగిరి యనఁగ మూఁడు
నామధేయంబు లేమేమి కారణమునఁ
గల్గెను వినిపింపు గరుణ ననఁగ
విని సూతుఁ డిట్లనె మునులార మూడభి
ధానంబులే కావు పూని చెప్ప
ధరణి నొక్కొకనిమిత్తమున నొక్కొకపేరు
చెలఁగుచుండును శేషశిఖరి కెపుడు
|
|
తే. |
గాన నాయాయివృత్తాంతగౌరవములఁ
జూచి భావించి నామదిఁ దోఁచినంత
వఱకుఁ జెప్పెద మీరలు వరుస వినుఁడు
ప్రీతి మెఱయంగ ననుచును సూతుఁడనియె.
| 104
|
క. |
చింతించినయర్థము లిపు
డెంతయు లేదనక జనుల కిచ్చచునుండున్
సంతోషంబున గిరిపైఁ
జింతామణి యనఁగఁ బేరు చెలఁగెను జగతిన్.
| 105
|
క. |
జ్ఞానం బించుక గల్గిన
మానవు లయ్యద్రి నుండ మహితజ్ఞానం
బానాట వృద్ధిచెందును
దానన్ జ్ఞానాద్రియంచు ధరపే రొప్పెన్.
| 106
|
క. |
అర్థముఖము లగుగోర్కెలు
సార్థకములు చేసి జనుల సంరక్షింపం
|
|
|
దీర్థాదు లుండ నయ్యది
తీర్థాచల మనగఁ బేరు దీపితమయ్యెన్.
| 107
|
క. |
నిష్కామతపోధనుఁలకుఁ
బుష్కలముగ స్నానపానపూజ లొనర్పం
బుష్కరిణులు గల్గుటచేఁ
బుష్కరశైలం బనంగఁ బొలుపొందు ధరన్.
| 108
|
క. |
మును వృషభాసురుఁ డనియెడి
యనిమిషవైరుండు దానియం దుండి తపం
బొనరించిన కారణమునఁ
దనరారె వృషాద్రి యనఁగ ధరణీస్థలిలోన్.
| 109
|
క. |
అనిమిషులు సమ్ముదంబునఁ
గనునప్పుడు స్వర్ణమయముగా నగ్గిరి యు
ర్విని వెలయ దానికిం దగెఁ
గనకాచల మనఁగ మౌనిఘనులార యొగిన్.
| 110
|
క. |
నారాయణుఁ డనువిప్రుం
డారూఢిగఁ దప మొనర్చి హరి మెప్పించెన్
ధారుణిఁ దత్కారణమున
నారాయణశైల మనఁగ నామం బలరెన్.
| 111
|
క. |
ఆవైకుంఠపురంబునఁ
బావన మైయుండుదాని పక్షీంద్రుఁడు తేఁ
గా వచ్చిన కారణమున
శ్రీవైకుంఠాద్రి యనఁగఁ జెలువారె మహిన్.
| 112
|
క. |
నరసింహుం డాదైత్యుని
నురుకోపముతోడఁ జంపి యొగిఁ బ్రహ్లాదుం
|
|
|
గరుణం జూచినకతమున
నరసింహగిరీంద్ర మనఁగ నామం బలరెన్.
| 113
|
తే. |
అంజనాదేవితపము మున్నచటఁ జేసి
వడసె హనుమంతు డను మేటికొడుకు నెమ్మి
నపుడు దేవతు లెల్ల సహాయు లగుచు
నామ మిడి రుర్వియం దంజనాద్రి యనఁగ.
| 114
|
క. |
మునుపు వరాహసమూహము
లనిశము వర్తింప నందు హరి క్రోడంబై
యసువుగ నిల్చినకతమున
మునులార వరాహశైల ముర్విం దనరెన్.
| 115
|
క. |
మును నీలుం డనుపేరుం
దనరినవానరుఁడు తపము దగఁ జేసెను దా
నినిబట్టి నీలగిరి యని
తనరారెను బేరు జగతిఁ దాపసులారా.
| 116
|
క. |
శ్రీకి నివాసంబై భూ
లోకంబున ననఘ భక్తలోకంబులకుం
బ్రాకటముగ హరి గన్పడ
శ్రీకరముగ నామమొందె శ్రీగిరి యనఁగన్.
| 117
|
క. |
శ్రీసతి హరివైభవ ము
ల్లాసంబుగఁ జూడ నెంచి లలి నుండుటచే
భాసిలె శ్రీసతి గిరి యని
శ్రీసన్మునివర్యులార క్షితి మహిమారన్.
| 118
|
క. |
వేడుకమైఁ గమలాలయ
తోడం జేడియలఁ గూడి తుష్టి యెసంగం
|
|
|
గ్రీడించుటచే దానికిఁ
గ్రీడాచల మనఁగ నొప్పెఁ బృథ్వీస్థలిలోన్.
| 119
|
క. |
సరగున శ్రీవైకుంఠము
ధరణీస్థలి నిడఁగఁ దెచ్చి దైత్యారికిఁ దాఁ
బరమానంద మొనర్పఁగ
గరుడాచల మనఁగ నట్టికతమున నలరెన్.
| 120
|
క. |
శేషాకృతితోఁ జక్రి వి
శేషత్వము నొంది సర్వశేషిని దనపై
భూషణముగ నిడికొనుటను
శేషాచల మనఁగ భూప్రసిద్ధం బయ్యెన్.
| 121
|
ఆ. |
అరయఁగా వకార మమృతబీజము కట
ములును సంపదర్థముల నెసంగు
నట్టిమూఁడు గూడి యమృతసంపద లిచ్చు
నందుచేత వేంకటాద్రి యయ్యె.
| 122
|
వ. |
ఇవ్విధంబున నప్పర్వతంబునకుఁ గల్పభేదంబులవలన ననేక
నామంబులు గలుగుచుండు నప్పర్వతమాహాత్మ్యం బింత యని వచింప నమరగురుచతురాననగుహవాసవాదులకుఁ దరంబు గాదు గావున.
| 123
|
తే. |
వినుఁడు మునులార శ్రీహరి వేడ్క నందు
దేవితోఁ గూడి యుత్తరదిశ వనంబు
నందు విహరించుచుండఁగ నతివిచిత్ర
ముగ మునీంద్రులు గొందఱు మొనసి యచట.
| 124
|
సీ. |
భార్యామణులతోడఁ బరమముదంబున
నయ్యద్రివసతియు నరసి యెలమిఁ
|
|
|
గందమూలఫలాదికంబుల బహుపుష్ప
ములు తీర్థములు చూచి నిలచి సరవి
నాకుటిండ్లను గట్టి యందుండి ప్రీతిమై
నమలమంత్రాదుల నధ్వరంబుఁ
జేయుచుండఁగఁ జూచి సిరిని విలోకించి
హరి యిట్టు లనియె నోయబ్ధికన్య
|
|
తే. |
జనులు గనరానియమ్మహాస్థలికి వచ్చి
యజ్ఞమును జేయుమౌనీంద్రు లలరువిధము
చూడు మిచ్చట నని దయఁ జూపి మఱల
నిట్టు లనియెను సంతోష మినుమడింప.
| 125
|
సీ. |
సతి చూడు మవి యజ్ఞశాల సదశ్శాల
లవిగాక యిటు చూడు మగ్నిశాల
సరవి హవిర్భాగశాల పత్నీశాల
యజమానశాల నీ వదిగొ చూడు
మది మహానసగృహం బవి యజ్ఞపాత్రము
ల్పశుసుయూపస్తంభపంక్తు లవియ
వారె ఋత్విక్కులు వీర లధ్వర్యులు
సోమయా జితఁ డది సోమిదమ్మ
|
|
తే. |
చక్కఁగాఁ జూడు మిమ్మహాశ్రౌతకర్మ
చయములెల్లను నాయంద జనన మొందె
గాన సవనస్వరూపుఁడ నైననాకుఁ
బ్రీతిగా యజ్ఞములు బుధుల్సేయుచుండ్రు.
| 126
|
ఆ. |
వీరికర్మనిష్ఠ వేడుకగాఁ జూడ
వలయు నిపుడు యజ్ఞవాటమునకుఁ
బోయి వారు సేయుపుణ్యవపాయాగ
సరణిఁ జూచుటొప్పు చంద్రవదన.
| 127
|
ఉ. |
కావున వేశ్యచందమును గైకొను మీవు హొయ ల్చెలంగఁగా
నే విటకానికైవడిని నిక్కుచు సొక్కుచు వచ్చి యచ్చటం
బావకకుండమందు వప భక్తిని బ్రాహ్మణు లుంచినప్పు డే
నావప నారగించెద బుధావళి మెచ్చఁగ నీవు చూడఁగన్.
| 128
|
సీ. |
అన విని సిరి మందహాసాస్యయై కామ
రూపిణియై కుల్కుచూపు లెసఁగఁ
బరఁగఁ జందురుకావిపావడపైఁ జల్వ
జిలుగుబంగరుపూలచీర మెఱయ
ముత్యము ల్ముకురము ల్ముద్దుముద్దుగఁ గూర్ప
రంగుమించినపట్టురవికె వెలుఁగఁ
గుచభారమున వడంకుచు నుండుమధ్యంబు
నొగి మేఖలాబంధ మొప్పుచుండఁ
|
|
తే. |
గనులఁ గాటుకగంధలేపనము మేన
నుదుటఁ గస్తూరితిలకంబు కుదురనీల
కుటిలకుంతళములు ముద్దుగొలుపఁ బైఁడి
బొమ్మవలె నొప్పె లక్ష్మి సంపూర్ణకళల.
| 129
|
సీ. |
బటువుముత్యములపాపటబొట్టు రాకడి
జడబిళ్లలును గుచ్చు లడరి వెలుఁగ
|
|
|
బంగరుకడియము ల్పచ్చలచేకట్లు
రత్నాలవంకీ ల్కరముల వెలయ
మగఱాలకమ్మలు పగడాలపేరులు
చెవుల గళంబునఁ జెన్ను మీఱ
వ్రేళ్లనుంగరములు వివిధకాంతులమీఱ
మీఁజేత గొలుసులు మెఱయుచుండ
|
|
తే. |
నాసికాగ్రంబున న్జిగినత్తు వెలుఁగఁ
జిఱుతగజ్జెల మొలనూలు చిందుద్రొక్క
ఘల్లుఘల్లని పదహంసకములు మొరయ
శ్రీవనిత విశ్వమోహినిదేవి యయ్యె.
| 130
|
క. |
క్రొక్కాఱుమెఱుపు లన్నియు
నొక్కెడ గుమిఁగూడి నిల్చి యున్నవిధముగాఁ
గ్రిక్కిఱిసి యద్భుతంబుగ
మిక్కుటమై యుండె లచ్చిమేనిమెఱుంగుల్.
| 131
|
క. |
కరమునఁ గమలము చేకొని
సురుచిరమగు తళుకుబెళుకుఁ జూపులతో నా
హరినొగిఁ జూడఁగ నాహరి
సిరిమోముం జూచి నగుచుఁ జెలఁగుచు నంతన్.
| 132
|
సీ. |
ఆకామినీమణి కనురూపముగఁ జక్రి
చక్కని మనుజవేషంబు దాల్చె
నది యెట్టు లన్న నీలాంబుదవర్ణుండు
నాజానుబాహుఁ డాహ్లాదముఖుఁడు
నీలకుంతలయుక్తబాలేందుఫాలుండు
కంబుకంఠుండు మంగళకరుండు
|
|
|
నీరజాక్షుండు గంభీరవక్షుఁడు సింహ
మధ్యుండు మన్మథమన్మథుండు
|
|
తే. |
లలితసౌందర్యవిలసితోల్లాసకలిత
మందహసితాననుండు నిర్మలప్రవర్త
సములుగలవాఁడు శృంగారనయప్రియోక్తు
లాడువాడుగ విటుఁడయ్యె హరిగనంగ.
| 133
|
సీ. |
కనకపుష్పముల నొప్పిన గుసుంబాపాగ
రాణింపఁ గల్కితురాయి మెఱయ
బొండుమల్లియపూలదండలు భుజముపై
నొఱపుగ మెఱయుచు నూగియాడఁ
జల్వచేసిన పైడిసరిగంచు దోవతి
చుంగు లొప్పుచు మేనిసొగసు చూపఁ
బరిమళగంధలేపనపక్షమున నాణి
ముత్యాలహారము ల్ముచ్చటింప
|
|
తే. |
నవ్యమౌక్తికస్వర్ణరత్నాంచిత మగు
కర్ణభూషణములు దివ్యకాంతు లెసఁగ
పరమకౌశేయమధ్యము బాగుమీఱ
ముద్దు గరములు వ్రేళ్ల మురియుచుండ.
| 134
|
సీ. |
విలసితభ్రూలతావిక్షేపణంబు లా
యనిమిషపతిధనస్సును జయింప
నుదుటిగందపుఁజుక్క కదసి నీలాభ్రము
నొఱయు పూర్ణశశాంకు నెఱి హసింప
దంతాళికాంతి వింతగ వజ్రములపంక్తి
దీధితులను మించి ధిక్కరింపఁ
|
|
|
గర్పూరతాంబూలకలితాధరపుబింబ
ఫలరక్తిమం జూచి పరిహసింప
|
|
తే. |
మఱియు నాసాగ్రముననొప్పు మౌక్తికమున
కిరుకెలంకులకాంతుల నెనసి సొగసుఁ
దనరఁగా మీసఁగట్టునందంబు చూపఁ
జెక్కుటద్దములొఱపు రంజిల్లుచుండ.
| 135
|
సీ. |
మేఘంబుపై వెల్గు మెఱుపుఁదీఁగలువలెఁ
దగిన బంగరుజన్నిదములు మెఱయ
నుంగరంబులకాంతు లొప్పెడు కుడిచేత
నొకలీలగాఁ గత్తియొఱపు నెగడ
శరణాగతత్రాణబిరుదంబు లనఁదగు
నందియ ల్పాదంబులందు మొరయ
వామహస్తంబున వరరత్నమయచాప
మొగిఁ దళుకొత్తంగ నుల్ల మలర
|
|
తే. |
విటునివలె హరి సొగసుగ వేసమెసఁగఁ
దాల్చి విటకత్తెవలెనుండు తరుణిఁ గూడి
పాదుకల మెట్టికొంచు నాప్రథిత యజ్ఞ
వాటిఁ జేరంగఁ జూచుచు వచ్చుచుండె.
| 136
|
సీ. |
ఆచక్రి నీక్షించి యాగాఢ్యులపు డితఁ
డెవ్వఁడో యని గని యిట్టు లనిరి
వనితామణిం గూడి వచ్చుచుండెడివాఁడు
మహిమ నొప్పు వసంతమాధవుండొ
నలుఁడొ జయంతుడో నలకూబరుండొ సు
రేంద్రుడొ చంద్రుడొ యీశ్వరుండొ
|
|
|
యీమహాటవి కిప్పు డేల విచ్చేసిరో
వీరిదేహసుశాంతు లారయంగ
|
|
తే. |
దిక్కులెల్లను వ్యాపించెఁ దెలియఁ జూడ
విప్రుఁ డగుటకు యజ్ఞోపవీతచిహ్న
మమరియున్నది క్షత్రియుం డగుట కెడమ
చేత విల్లున్న దటుగాక చెల్వు చూడ.
| 137
|
వ. |
విటునికైవడి వేశ్యాంగనామణితోడం గూడి యున్నవాఁ
డనుకొను చుండుసమయంబున.
| 138
|
ఆ. |
వేడ్క మీఱఁగాను విప్రులు చూడంగ
వచ్చి చక్రి యజ్ఞవాటిలోనఁ
జేరి ద్విజుల నడుం సిరితోడఁ గూర్చుండి
విడెము సేయుచుండె వేడబమున.
| 139
|
క. |
అప్పుడు వారల నొడలం
దొప్పెడు కస్తూరిగంధ ముర్వీసురులం
గప్పుకొనంగ నొగి న్వా
రప్పద్మదళాక్షుఁ జూచి యని రీరీతిన్.
| 140
|
సీ. |
ఓమహారాజ నీయూ రేది పేరేమి
యెవరు నీతలిదండ్రు లిచటి కేల
వచ్చితి విప్పు డీవనమున సవనము
ల్సేయుచుండెదము నీచిత్తమునను
మామీఁద దయ యుంచి మామఖంబులకు స
హాయుఁడ వైయుండి యసురవేధ
చోరబాధయు మృగస్తోమంబుచే వేధ
దప్పించు మావంటిదాపసులకు
|
|
తే. |
వసుమతీశ్వరు లెప్డు కావలియు ననెడు
ధర్మపద్ధతి దప్ప కధ్వరము లిచట
నీవు సేయించు మాచేత నిర్మలాత్మ
యనినఁ జిఱునవ్వు నవ్వి యిట్లనియెఁ జూచి.
| 141
|
సీ. |
రాజును గాను ధరామరుండను గాను
కడకు వైశ్యుఁడను శూద్రుఁడను గాను
తల్లితండ్రులు లేరు ధరణీ నాకొక్కని
వాసంబు లేదు సర్వస్థలముల
సర్వస్వరూపుల చరియించు చుండుదు
నగుణుండ నామవర్ణాశ్రమములు
లేవని పల్కఁగా నావిప్రు లిట్లని
రయ్య మీవాక్కుల కర్థ మిపుడు
|
|
తే. |
మాకుఁ దోఁపదు నీచెంత మచ్చికలర
నిపుడు కూర్చున్న లలితాంగి యెవతె యనిన
మందహసితాస్యుఁడగుచు నమ్మాధవుండు
పల్కె నిట్లని వారితోఁ బ్రౌఢి మెఱయ.
| 142
|
ఆ. |
నాకు నేన కాని నా కెవ్వరును లేరు
చూడ నొంటివాఁడఁ జూచి నన్ను
వనమునంచుఁ బుట్టి వచ్చె మోహినివలెఁ
బట్టె నిది ప్రియంబు వఱల మునులు.
| 143
|
క. |
మచ్చికతో నిరువురు కడు
ముచ్చటగాఁ గలసియుండి మును లగుమీ రిం
దచ్చుగ నుండుటఁ గనుఁగొని
వచ్చితి మిటు మిమ్ముఁ జూడ వరమునులారా.
| 144
|
సీ. |
ఇచ్చోట మీఱంద ఱేమేమొ చేసి సం
గీతము ల్ఫాడెడురీతు లేమి
యౌదుంబరశాఖ లమరంగఁ జేఁబట్టి
వేఱ్వేర విప్రులఁ బిల్చు టేమి
యీయగ్నికుండ మే మీదారుపాత్రలే
మీపశుహింస యే మిన్ని మీరు
మాకుఁ జెప్పుఁ డటన్న నాకర్మనిష్ఠు లి
ట్లనిరి వపాయాగ మాచరింప
|
|
తే. |
సమయ మిదిగాన వేదోక్తశాస్త్రవిహిత
మగువపాయాగ మొనరించి యవల మీరు
మమ్ము నడిగినదెల్ల సమ్మదము లీలఁ
జెప్పెదము వీను లాలింప నిప్పు డుండు.
| 145
|
తే. |
అనుచు వచియించి యాగాఢ్యులందు హరిని
నాత్మ నెంచుచు నావపాయాగ మెలమిఁ
జేయుసమయాన శంఖచక్రాయుధములు
దాల్చి యందఱు చూడంగ దనుజహరుఁడు.
| 146
|
వ. |
సముల్లాసంబుగ నవ్వపనుగ్రహించి తనచిహ్నము లెఱింగించి.
| 147
|
చ. |
హరి పరమాత్ముఁ డచ్యుతుఁ డనంతుఁడు నిర్జరులెల్లఁ జూడఁగాఁ
గరముల నంది యావపను గ్రక్కున మెక్కఁగ సంయమీశ్వరుల్
వరుసఁగ నందుఁ జిత్తరువు వ్రాసినబొమ్మలరీతి భక్తిచే
బరవశులై రమేశుఁ డగుపద్మదళాక్షుని జూచుచుండఁగన్.
| 148
|
వ. |
నారాయణుండు శ్రీవత్సలాంఛనాంచిత విశాలవక్షుండును
సదమలరత్నాభరణభూషితుండును కౌశేయపరిధానుం
|
|
|
డును సహస్రమార్తాండప్రభాభాసితుండును వపాపరిమళ
మిళితాధరుండును గరుణాకటాక్షవీక్షితుండును నగు హరి
మునీంద్రులం జూచి మీసేయుజన్నంబున నత్యంతతృప్తి
నొందితి నని పల్కి, మోహినీరూపిణి యగునిందిరాదేవిం
గూడి తిరోధానంబునొందె. ననంతర మమ్మునిపుంగవులు
పరమానందవిస్మితాంతరంగు లై హరివేడబంబునకుఁ గొం
డొకతడవు హరిం బ్రార్థించి కృతార్థుల మైతి మనుచు
జన్నంబు పరిపూర్తిచేసి యపభృతస్నానం బొనర్చి రని
సూతుండు వెండియు మునుల కిట్లనియె.
| 149
|
మ. |
మును జాబాలిమునీంద్రుఁ డీకథను సమ్మోదంబుతో నాకుఁ జె
ప్పెను నే నట్లుగ మీకుఁ జెప్పితిని సంప్రీతిన్ రమేశుండు చే
సిన దింకొక్కటి చెప్పెదం గథ మహాచిత్రంబుగా మీరు ము
న్వినినట్లే యని శౌనకాదులు విన న్వేడ్కం దగం దత్కథన్.
| 150
|
వ. |
వినిపింపఁ దొడంగె, నంత శ్రీహరి తద్గిరి కుత్తరభాగమం
దార వట వకుళ చందన పిచుమంద జంబు జంబీరాద్యనేక
తరుబృందశోభితారణ్యాంతకంబున విహరించు చుండుసమ
యంబున నొక్కదినంబున.
| 151
|
సీ. |
దేశాంతరాగతద్విజుఁడు వృద్ధవయస్కుఁ
డత్యంత బలహీనుఁ డతనిసుతుఁడు
కౌండిన్యుఁ డనువానిఁ గానక యందందుఁ
దడవుచు వచ్చి దా దారి దప్పి
|
|
|
ఘనవేంకటాద్రిమార్గంబును జని మహా
రణ్యంబునం గుమారా యటంచు
పిలుచుచు నేడ్చు చాకలి దప్పి మించుటం
జేసి నేలం బడి చెవులు మూసి
|
|
తే. |
కొనియు నప్పుడు గూడ నోకొడుక యెందుఁ
బోతివి యటంచుఁ బలువిడంబులుగ దుఃఖ
పడుచుఁ బేర్కొనుచుండఁగ భవ్యమూర్తి
యిందిరేశుండు చని దయాహృదయుఁ డగుచు.
| 152
|
తే. |
వృద్ధవిప్రుఁడ యియ్యుగ్రవిపినభూమి
కేల వచ్చితి జగమున నింకఁ గొన్ని
డినము లుండెదవో లేక దేహ మిచట
విడిచెదవో దెల్పు మేడ్వకు జడియ వలదు.
| 153
|
క. |
అన విని విప్రుం డిట్లనె
ననఘ శరీరంబుమీఁద నాసక్తియు లే
దనిమిషుల ఋణము దీర్పక
చనుటె ట్లనుసందియంబు జనియించె ననెన్.
| 154
|
క. |
ఆవార్తలు విని మాధవు
డావిప్రునికరముఁ వట్టి యచ్చట గల యా
పావనతీర్థమునందును
గావించెను స్నానమపుడు కరుణాత్ముండై.
| 155
|
వ. |
అట్లు స్నానం బొనరించుటం జేసి యావృద్ధవిప్రుండు పదియా
ఱేండ్లబాలకుమారుండై, పోడశకళాపరిపూర్ణుండై మ్రోల
నిలిచియుండు శ్రీహరిం జూచి వందనంబు లాచరించుటం జేసి
యద్దేవుండు సహస్రాక్షుండును, సహస్రపాదుండును,
|
|
|
సహస్రశీర్షుండును, సహస్రబాహుండును నై, నిజస్వరూపం
బక్కుమారవిప్రునకుం జూపుటం జేసి గగనంబుననుండి దేవేంద్రాదులు దేవదుందుభులు మొరయించిరి శీర్షంబునఁ బుష్పవృష్టి గురియించిరి పలువిధంబుల నుతించి రప్పు డవ్విశ్వరూపుం డగుచక్రి యవ్విప్రుం జూచి యో భూసురకుమారా! యిజ్జగంబున ధనధాన్యసమృద్ధితో నిఁక దేవఋణంబు దీర్చుటకు నాశ్రమంబునకుం జని యాగంబుసేయు మని యానతిచ్చి యతనికుమారుం డగు కౌండిన్యునియున్కి నెఱింగించి యంతర్ధానంబు నొందె నంత నవ్విప్రపుంగవుం డత్యంతానందసుధాంబుధి నోలలాడుచు హరిం గొనియాడుచుఁ దనయెడకుం జనియెఁ దత్కారణంబుననందుండు ధారాతీర్థంబుసకు గుమారధారాతీర్థం బనంబరగె. మఱియు నాకుమారధారాతీర్థంబునఁ ద్రికాలస్నానం బాచరించిన వారికినరోగదృఢకాయంబును, నవృద్ధత్వంబును, సకలసౌభాగ్యపుత్రావాప్తియు నగు నని యమరులు నిర్ణయించి నిజస్థానంబుల కేగిరంచు జాబాలి నాకిక్కథ వక్కాణించుటం జేసి చెప్పితినని వెండియు నిట్లనియె.
| 156
|
సీసమాలిక. |
వాల్మీకి నాకుఁ బూర్వచరిత్ర మొక్కండు
చెప్పె దానిని వినుఁ డొప్పుగాను
చంద్రవంశజుఁ డైన శంఖణుఁ డసురాజు
కాలవశంబున బేల యగుచుఁ
దనశత్రువుల కొగిఁ దనరాజ్యమును గోలు
పోయి రామేశ్వరంబునకుఁ జేరి
|
|
|
యట రామసేతువునందుఁ గ్రుంకి మఱందు
ముదమునఁ గొన్నాళ్లు వదలకుండి
వచ్పుచు మార్గాన వరశంఖమునిగిరి
పై నుండి వచ్చెడు బావన మగు
శ్రీసువర్ణముఖరిఁ జెలఁగి స్నానము జేసి
దాని కుత్తరముగఁ దరలి వచ్చి
దానవాంతకగిరి దరినుండు జంబుజం
బీరగాలనచిరిబిల్వవకుళ
పాదపచయముచేఁ బరిశోభితం బగు
భూమియం దొక్కెడఁ బొదలుచుండు
|
|
తే. |
కమలకల్హారపుండరీకాదిపుష్ప
శోభితం బగుసరసిలో సుఖముగాను
స్నానమును జేసి యాతీరసాలమూల
మునఁ దగంజేరి యివ్విధంబునఁ దలంచె.
| 157
|
చ. |
కటకట శాత్రపు ల్గినిసి కయ్య మొనర్చి మదీయమండలం
బటువలె నాక్రమించి రిపుడన్నము వస్త్రము గల్గుటెట్లు నే
నెటువలె నోర్తు కష్టమున కీశ్వరుఁ డీగతి చేసె నింక మీఁ
దటిగతి యేమటంచుఁ బరితాపముతో విపులార్తిఁబొందుచున్.
| 158
|
వ. |
దేవుని మనంబున నెంచుచు దేహంబు పరవశత్వంబు నొందుటం
జేసీ యాసమయంబున నశరీరవాణి యిట్లనియె.
| 159
|
తే. |
నిర్మలాత్ముఁడ మదియందు నీవు ధైర్య
మొందు చింతంప కిచటికి నుత్తరముగఁ
గ్రోశదూరాన వేంకటకుధరమున్న
దటకు నరుగుము భక్తితో నార్తి తొలఁగు.
| 160
|
వ. |
మఱియు నప్పావనపర్వతంబు మహాపన్నులకుఁ గామధేనువు
చందంబున నత్యంత శోకార్తులకుఁ గల్పవృక్షంబు కైవడిఁ
జింతితార్థంబు లిచ్చుచుఁ జింతామణి నామంబునం బ్రకాశించు
నందు నిర్హేతుకజాయమానకటాక్షవీక్షణుం డై సకలజనార్తి
నివారకుండై మనోభీష్టదాయకుండై శ్రీహరి సంపూర్ణకళా
న్వితుం డగుచు నిరంతరానందనిలయనివాసుఁ డై యుండు
నందు శ్రీస్వామిపుష్కరిణి సకలాఘనిచయనివారిణియై
యుండు తత్పశ్చిమతటంబున వాల్మీకిమునిభూధరంబుండు
నందు నిల్చి మూడుకాలంబుల నాపుష్కరిణి శుభోదకంబునం
గ్రుంకులిడి షణ్మాసంబులు విజితేంద్రియుండవై శ్రీమద్వేం
కటనాథుని విధివిహితంబుగ పోడశోపచారపూజలు సమర్పించు
చుండు మనంతర మాస్వామి కరుణార్ద్రహృదయుండై
ప్రసన్నంబయి నీయభీష్టం బొసంగునని పల్కుచుండు నశరీర
వాక్కులు విని సంతోషాయత్తచిత్తుండై యా వేంకటాచలా
రోహణంబు చేయుచు వివిధఫలపుష్పతరులతాశోభితంబును
నానావనచర చమరీ భల్లూక సారంగాది మృగావాసంబును
శుక కలకంఠ మయూరవిహంగాదిమనోహరకూజితకలితంబును
నవరత్నమయతపనీయప్రకాశితంబగు సానుప్రదేశంబులును
నగువేంకటాద్రి నెక్కి తన్మధ్యంబునఁ బావనపరిమళోదక
పూర్ణంబును కమలకల్హారనీలోత్పలకైరవకుసుమోపేతంబును
నిరంతరసంగీతసంకాశభృంగసందోహఝంకారమనోజ్ఞంబును
కమఠమీనగ్రాహప్రముఖసంకులంబును నగు స్వామిపుష్క
రిణి సందర్శనంబుచేసి తత్తీర్థంబున ననుపమభక్తి సంకల్పపూర్వ
కంబుగ స్నానంబొనర్చి యశరీరవాణిపల్కినయట్ల షణ్మాసం
|
|
|
బులు శ్రీమద్వేంకటాచలనివాసుని ధ్యానంబు చేయుచుండె
ననంతరంబు.
| 161
|
శంఖణరాజుకు వేంకటాచలపతి ప్రత్యక్షంబగుట
సీ. |
హారకుండలకిరీటాదిభూషణభర్మ
చేలకాంతులఁ బ్రకాశించువాఁడు
తులసీసుదళపరిమళపుష్పహారవి
రాజితసూక్షోదరంబువాఁడు
తిలకాంతనిటలప్రదేశమందు నటించు
కమనీయకుటిలాలకములవాఁడు
శ్రీవత్సకౌస్తుభచిహ్నము ల్గలవాఁడు
కరుణ నొప్పిన గొప్పకనులవాఁడు
|
|
తే. |
శంఖచక్రగదాబ్జహస్తములవాఁడు
సరవిలక్ష్మినిఁ జెలఁగు వక్షంబువాఁడు
భూమినీళలఁ గెలఁకులఁ బొల్చువాఁడు
దీనజనపాలుఁ డఖిలైకదేవుఁ డపుడు.
| 162
|
వ. |
రవికోటిప్రకాశ సదృశ దివ్యవిమాన మధ్యప్రదేశమునం
దుండి స్వామిపుష్కరిణిమధ్యంబున నిలిచి శంఖణమహా
రాజుకుఁ బ్రత్యక్షంబుగాఁగ నయ్యెడ బ్రహ్మరుద్రేంద్రప్రము
ఖులు వచ్చి భేరిమృదంగాదిమంగళవాద్యంబులు మ్రోయ
పుష్పవృష్టి గురియించి నృత్తగీతంబులు గావించి నిగమాంత
సూక్తంబుల సన్నుతించుచుండి రంత శంఖణమహారాజు
ప్రసన్నుం డైన శ్రీహరికి సాష్టాంగదండప్రణామంబు లాచ
రించి కరంబులు మోడ్చి సద్భక్తి మెఱయ నిట్లనియె.
| 163
|
సీ. |
దేవదేవమహాత్మ దీనరక్షక జగ
న్నాథ సత్కరుణతో నన్నుఁ జూడు
మునుపు మాపూర్వుల కొనర మీ రిచ్చిన
పృథ్వి శాత్రవుల కొప్పించి వచ్చి
యతీదీనదశ నొందినట్టి నా కిప్పుడు
ప్రత్యక్ష మైతివి పరమపురుష
నాశత్రువులఁ ద్రుంచి నారాజ్య మిప్పించు
మనిన శ్రీహరి శంఖణునికి ననియెఁ
|
|
తే. |
జింత విడువుము రాజు నీసీమఁ జేరి
పట్టభద్రుఁడ వైయుండు భార్యతోడ
ననుచు నభయంబొసంగి చక్రాయుధుండు
తగ సురుల్మెచ్చి గనఁ దిరోధానుఁడయ్యె.
| 164
|
తే. |
అప్పు డాబ్రహ్మముఖ్యులు హరి నుతించి
స్వామిపుష్కరిణీస్నానసత్ఫలంబు
పొగడ శక్యంబె యనుచు నాభూరమణుని
భక్తికి న్మెచ్చు చేగిరి భాగ్య మనుచు.
| 165
|
ఆ. |
శంఖణుండు భక్తి స్వామిపుష్కరిణికి
మ్రొక్కి శైలమునకు మ్రొక్కి హరికి
మ్రొక్కి భార్యతోడ ముదమున గిరి డిగ్గి
పోవుచుండ నతని భూమియందు.
| 166
|
క. |
విమలుం డగుశంఖణరిపు
లమితాశనురాజ్య మేల నన్యోన్యవిరో
ధము లెసఁగఁ బోరి మడిసిరి
క్రమముగ నమ్మహికి రాజు గావలె నంచున్.
| 167
|
వ. |
తద్దేశవాసులు రాజును వెదకుచు వచ్చుచుండ దారియందు
శంఖణమహారా జగుపడుటం జేసి యాతనికి దండంబులిడి
శత్రునాశనవృత్తాంతం బంతయు నెఱింగింప సంతసించి శ్రీ వేం
కటాద్రీశ్వరుం గొనియాడుచుఁ, గొంతనడికి నవ్వారలకుఁ దాఁ
జనినపుణ్యక్షేత్రమహిమాతిశయాదులు కర్ణామృతంబుగ
నుడివి వారితో నిజదేశం బగుకాంభోజదేశంబున కరిగి
తొల్లింటివలె రాజ్యపాలనంబు సేయుచుండె నిదియునుంగాక
మఱియొకయితిహాసంబు చెప్పెద నాలకింపుఁ డని మునులకు
సూతుండి ట్లనియె.
| 163
|
ఆత్మారాముఁ డనువిప్రునిచరిత్రము
సీ. |
మధ్యరాష్ట్రమున నాత్మారాముఁ డనెడుస
ద్బ్రాహ్మణుం డనఘుండు వందితుండు
దేవ భూసురపూజ లేవేళఁ జేయుచు
విహితధర్మజ్ఞుఁ డై వెలయుచుండు
నతఁడు పిత్రార్జితార్థాదు లించుకయేని
లేకుండునట్లుగ లేమి గల్గఁ
గా దీనుఁ డై పెక్కుకష్టంబు లొదవుటం
జేసి పల్విధముల చింతపడుచు
|
|
తే. |
నిల్లు విడనాడి శ్రీవేంకటేశుఁ డుండు
పర్వతశ్రేష్ఠమున కధోభాగమునను
దనరుచుండెడు కపిలతీర్థంబుచెంతఁ
జేరి స్నానంబు సేసి తత్తీరమునను.
| 169
|
క. |
కపిలేశుని సన్నిధిఁ దా
నపు డాన్హికనిష్ఠ నుండి యట లేచి మహా
|
|
|
విపినములోపల జొరబడి
చపలత నొకమార్గమందు శైలం బెక్కెన్.
| 170
|
వ. |
తన్మార్గంబునందున్న కపిలతీర్థప్రముఖసప్తదశతీర్థములందు స్నానంబు చేసి
నిర్మలచిత్తుండై పర్వతారోహణంబు చేయుచుండి తన్మార్గసమీపంబున నుండు గుహా
మధ్యంబున ధ్యానయోగగరిష్ఠుండై యున్న సనత్కుమారుసన్నిధానంబు చేరి సాష్టాంగ
దండప్రణామంబు లాచరించి నిలిచి ముకుళితహస్తుండై వినుతించి యిట్లనియె.
| 171
|
క. |
తాపసవర్యమహాత్మక
పాపాత్ముఁడ నైననన్ను బటుకృపతోడం
జేబట్టి బ్రోవవలయును
నీపాదమె దిక్కు నాకు నిర్మలహృదయా.
| 172
|
క. |
దారిద్ర్యముచేతను సం
సారంబును విడిచి వచ్చి సరగున నిన్నే
జేరితి నాకష్టదశన్
వారించి సుఖంబు నీయవలయు మహాత్మా.
| 173
|
మ. |
అనినం దాపసవర్యుఁ డిట్లనియె నీ కాయస మింకేల చే
సినపాపంబు నశించుకాల మిదె వచ్చెన్ బాప మే దంటివా
విను జన్మాంతరమందు మాధవుని సేవింపన్ వివేకంబు లే
కనులోభంబున దానకంటకుఁడవై గర్వంబుతో నిక్కుచున్.
| 174
|
గీ. |
దానమిచ్చువారి దానంబుగొనువారి
ననుసరించి యొకరియం దొకరి
గసరుపుట్టునట్టి కల్లమాటలు నీవు
చెప్పి దాన హాని చేసినావు.
| 175
|
క. |
ఆచారవిహీనుఁడవై
యేచోటనఁ గాని గుడిచి యెచ్చగుజనులం
జూచి హసించుచు నుంటివి
దాఁచితి వర్థంబు కరుణ దాన మొకరికిన్.
| 176
|
ఆ. |
ఈకయుంటం జేసి యెసఁగిన పాపంబు
కపిలతీర్థమునను గడుముదమున
మునిగినపుడ తొలఁగె మొనసి నీకిఁక లక్ష్మి
కరుణ నెవ్విధంబుఁ గల్గు ననఁగ.
| 177
|
క. |
వ్యూహమహాలక్ష్మి సదా
శ్రీహరివక్షస్స్థలమునఁ జిరభూషణ మై
మాహాత్మ్యముతో నెలకొని
బాహుళ్యము నెగడ సిరుల భక్తుల కిచ్చున్.
| 178
|
సీ. |
ఆవ్యూహలక్ష్మివృత్తాంతంబు విను దయా
లోలతరంగాక్షి లోకమాత
పూర్ణచంద్రనిభాస్య పురుషోత్తమునిప్రియ
పద్మనివాసిని పద్మపాణి
వ్యూహభేదములచే నొనరి మహాలక్ష్మి
యనఁ గీర్తి యన జయ యనఁగఁ దనరుఁ
గారుణ్యసాగర కమనీయమంగళ
విగ్రహసజ్జనవినుతపాత్ర
|
|
తే. |
విను మనాయాసముగ భక్తవితతి సేయు
పాపనిచయం బడంచి సంపద లొసంగు
నమ్మహాదేవి మంత్రమే నాప్తముగను
జెప్పెదను నీవు సద్భక్తిచే జపించు.
| 179
|
వ. |
అని వచించి యంగన్యాసాదిపూర్వకంబుగ లక్ష్మీమంత్రం
బుపదేశించి ధ్యానంబు సాంగంబుగఁ జెప్పి శ్రీహరి భవదీయా
భీష్టం బొసంగు వేంకటాచలంబున కరుగు మని యానతిచ్చె,
నంత నాత్మారాముం డానందబాష్పకలితనేత్రుం డై తద్గు
రుధ్యానంబు చేసి లక్ష్మీమంత్రంబు జపంబుసేయుచు నాకాశ
గంగ భూమికి దిగివచ్చు చందంబున విరజానదికైవడిఁ బరమ
పావనంబు లైన తీర్థంబులు శైలాగ్రంబుల నుండి ప్రవహిం
చుచు భూమికి దిగివచ్చుచుండుటఁ జూచి సంతసించుచుఁ
గృతస్నానుం డై పర్వతారోహణంబు చేసి స్వామిపుష్క
రిణియందు నఘచయంబు తలంగ స్నానం బొనర్చి హరిధ్యా
నంబు చేయుచున్న సమయంబున.
| 180
|
సీ. |
ప్రాకారపంక్తులు బహుమంటపంబులు
వివిధోరుకల్యాణవేదికలును
సదమలతప్తకాంచననిర్మితంబు లై
కొమరారుచున్నట్టి గోపురములు
వరనీలమౌక్తికవ్రజచప్పరంబులు
రమణసౌధాట్టాలకములు బాల
భానుకోటిప్రభాభాసమానసురత్న
సహితంబు లగుసభా స్తంభములును
|
|
తే. |
గలిగి గంధర్వనగరసంకాశ మగుచు
విధిశివేంద్రాదిసిద్ధసేవితము నగుచు
గీతనర్తనవాద్యసంకీర్ణ మగుచు
నమరు నొకదివ్యధామమధ్యమున నుండి.
| 181
|
సీ. |
కుండలాంగదరత్నకోటీరకౌస్తుభ
ముఖభూషణము లంగముల వెలుంగ
నురముం దరుదుగా వ్యూహలక్ష్మి యెసంగ
శతకోటిమన్మథసదృశుఁ డగుచు
రమణీయ కనకాంబరముల చెంగులు జారఁ
బరిమళగంధలేపనము మెఱయ
నీలకాంతుల నొప్పు నిటలాలకంబులు
బాలభృంగావళిపగిది వఱల
|
|
తే. |
నపుడు భూ నీళ లిరుగడలందుఁ జెలఁగఁ
బుండరీకాక్షుఁ డందున్న భూసురునకు
దయను బ్రత్యక్షమయ్యె నత్తఱిని విప్రుఁ
డలర సాష్టాంగదండంబు లాచరించి.
| 182
|
వ. |
అనేకవిధంబులం బ్రస్తుతించి యేమియుం దోఁచక గద్గదకంఠుం
డయి యనిమిషదృష్టిం జూచు చున్ననాత్మారామునిం గని
దయార్ద్రహృదయుం డై హరి యిట్లనియె.
| 183
|
తే. |
నీకు భయమేల వ్యూహలక్ష్మీకటాక్ష
మిపుడు నీయందుఁ బొందిన దింకమీఁద
నాయురారోగ్య మైశ్వర్య మమర నీకుఁ
గల్గు సుజ్ఞాననిష్ఠయుం గల్గు విప్ర.
| 184
|
సీ. |
అని పల్కి మాధవుం డా బ్రాహ్మణున కప్పు
డభయం బొసంగె బ్రహ్మాదిసురలు
తగ నుతింపఁగఁ దిరోధానంబు నొందె న
య్యవనీసురుండు భయంబు వాసి
|
|
|
యిపు డానతిచ్చిన యీశ్వరుఁ డిందుండి
యెటువోయె మఱి యాతఁ డీశ్వరుండొ
కాఁడొ నేఁ జూచుట కల్లయో నిక్కమో
గలఁగంటినో యని కలవరమునఁ
|
|
తే. |
గొంతసే పుండి యవల సద్గురునికృపను
హరి వరము లిచ్చినది నిక్కమంచుఁ దలఁచి
నమ్మి గిరి డిగ్గి తనమందిరమ్ము సేరి
సిరుల నొప్పుచు దానము ల్సేయుచుండె.
| 185
|
క. |
ఈకథ పూర్వము శ్రీవా
ల్మీకిమునీంద్రుండు పోడిమిం జెప్పె నొగిన్
శ్రీకర మగు వినుమని నే
నాకైవడి మీకుఁ జెప్పితిని ముద మొప్పన్.
| 186
|
చ. |
అనిన వరాహపర్వతమహత్త్వము చక్కఁగ నీవు దెల్పఁగా
వినుటకు మాకు నెల్లరకు వేఁడుక పుట్టెనుగాన మానసం
బుననొకయింతకోపమును బొందక చెప్పుమటంచుమౌను ల
త్యనఘుని సూతుఁ జూచి యనిరందఱు ప్రీతియెసంగ వెండియున్.
| 187
|
వ. |
అనిరి సూతా! యమ్మహాగిరియందుఁ బదియేడు తీర్థంబు లున్న
వని చెప్పితి వయ్యవి వరుసగ విశదీకరింపవలయు ననిన
నమ్మునులం జూచి సూతుండు హరితేజోవిరాజమానుం డగు
కర్దమమునికి సుతుం డగుకపిలుండు తొల్లి.
| 188
|
శా. |
ఆపాతాళమునందు సౌఖ్యవరయోగాభ్యాసముం జేయుచుం
జాపల్యంబు నడంచి నిర్మలమహోత్సాహంబుతో లింగమున్
శ్రీ పెంపొందఁగ నిల్పి యర్చనము తాఁ జేయంగ నాలింగమున్
|
|
|
వ్యాపించెం ద్రిజగంబులందు సుకృతవ్యామోహ మై శ్రేయమై.
| 189
|
వ. |
ఆలింగంబు నిర్జరప్రకరంబులచేతను సజ్జనంబులచేతం బూజఁ
గొనంబడిన కారణంబునఁ గపిలలింగంబని ప్రసిద్ధంబయ్యె.
| 190
|
ఆ. |
సగరనందనులకు సద్గతి నొసంగి యం
దున్న భోగవతి మహోన్నతముగ
వేగ లింగమూర్తి వెంటనే ధాత్రి భే
దించి వచ్చి కపిలతీర్థ మనఁగ.
| 191
|
క. |
ప్రవహించి సకలజనముల
భవతాప మడంచి లోకపావని యయ్యెన్
భువి నాఁటఁ గోలె భక్తిఁగ
నవగాహముసేయుచుందు రమరులు మనుజుల్.
| 192
|
సీ. |
కపిలతీర్థమునఁ జక్కగఁ జక్రతీర్థంబు
ప్రవహించు మును దేవపతి యహల్య
నెంచిన యఘము పీడించుటంజేసి యా
జలమున స్నానంబు సల్పె మఱియుఁ
దదుపరిభాగానఁ దనరు విష్వక్సేన
తీర్థంబు సుకృతవృద్ధియు నెసంగి
ప్రవహించుచుండు పూర్వము వరుణాత్మజుం
డైనవిష్వక్సేనుఁ డచటఁ దపము
|
|
తే. |
సలుపఁగా మెచ్చి హరి వచ్చి శంఖచక్ర
యుగళ మపుడిచ్చి పరివారయూథములకు
గర్తగాఁ జేసినందున క్ష్మాతలమున
నతనిపే రన నాతీర్థ మలరుచుండు.
| 193
|
క. |
పంచాయుధతీర్థములు స
మంచితముగ దానిపైని నలరారును దీ
పించు ఘనానలతీర్థము
మించి తదూర్ధ్వంబునందు మేలిడ నద్రిన్.
| 194
|
ఆ. |
పరఁగ దాని కుపరి బ్రహ్మతీర్థము మహా
పాతకము లడంచి ప్రజల కెల్లఁ
బుణ్యఫల మొసంగు పొసఁగ నద్దానిపై
మునుల తీర్థములును దనరు నేడు.
| 195
|
ఆ. |
ఒండుకంటె నొండు నిం డుత్తమఫలంబు
తీర్థములకు మహిమ తేజరిల్లు
నింత నొప్పుచుండు నెఱిఁగి బ్రహ్మాదులు
చెప్పలేరు నేను జెప్పఁగలనె?
| 196
|
క. |
సరవిగ నింకొకచరితం
బరుదుగఁ జెప్పెదను దొల్లి యవనీసురుఁ డొ
క్కరుఁ డెలమిఁ దీర్థములఁ దా
వరుసఁగ జూడంగ నెంచి వచ్చుచు నుండన్.
| 197
|
సీ. |
మార్గాన నొకతియ్యమావిచె ట్టండకుఁ
జేరి తచ్చాయను దారిశ్రమము
వాయంగ నిద్రింప స్వప్నములో హరి
వచ్చి యిట్లనె విప్రవర్య వినుము
అదె చూడు మీపుష్కరాద్రిసమీపము
నందు దా నభయప్రదాఘచయము
వాసెడు తీర్థాలు పదియేడు గల వందు
స్నానం బొనర్చినచో నిజముగ
|
|
తే. |
సకలపాపహరం బయి సంతతార్థ
ములును బొందెదు మఱి చింత తొలఁగు నీకు
ననఁగ నావిప్రుఁ డాశ్చర్య మంది నిద్ర
మేలుకొని యిట్లు తలపోసె మెచ్చుకొనుచు.
| 198
|
తే. |
తలఁచె నిమ్మెయి శ్రీరమాధవుడు స్వప్న
మున వచించినగతి నిప్డు పుష్కరాద్రి
జేరి తీర్థంబులను గ్రుంకి కోరినట్టి
కోర్కె లెల్లను బొందెదఁ గుతలమునను.
| 199
|
వ. |
అని యెంచి కపిలతీర్థాది సప్తదశతీర్థంబులయందు విధిప్రకా
రంబుల స్నానంబు సేసి సకలాభీష్టంబు లొందె నని వెండియు
సూతుం డిట్లనియె.
| 200
|
తే. |
మునివరేణ్యులు తీర్థాలు మూఁడుకోట్లు
తనరు నీవేంకటాద్రిపై ధరణి వేఱ
చోటలే దెందుఁ గావునఁ జూకు రడఁగు
తాతకైనను వర్ణింపఁ దరము గాదు.
| 201
|
వ. |
మఱియు నివ్వేంకటాద్రి నొకతూరి సద్భక్తిం బ్రదక్షిణంబు
సేసిన వారికి మాతృప్రదక్షిణతుల్యం బగుటం గాక భూ
ప్రదక్షిణంబు వలనం గల్గుఫలంబుకంటె ననంతఫలంబు సిద్ధించు
నిదియునుం గాక యొక విశేషంబు గల దదియెట్లన మున్నొక
సమయాన హలాయుధుండు వేంకటాద్రిశిఖరదర్శనంబు చేసి
సకల తీర్థాదులం దలంచి యనుపమసుకృతంబు గాంచె. నింతి
య గాక ధర్మరాజాదు లరణ్యవాసము చేయుచుండ నొక
నాఁడు శ్రీకృష్ణుండు వచ్చి పాండవుల కిట్లనియె.
| 202
|
సీ. |
పాండవాత్మజులార ప్రబలురయ్యును మీరు
కర్మవశంబునఁ గాన నిట్లు
వసియించుకాలంబు వచ్చె గదా యైన
జయము శీఘ్రమ గల్గు భయము వలదు
శ్రీకరం బైనట్టి శ్రీవేంకటాద్రికి
భక్తితో నేగి గోప్యముగ నుండు
క్షేత్రపాలకునిచేఁ జెలఁగి పాలిత మయిన
పరమపావనతీర్థప్రాపుఁ జేరి
|
|
ఆ. |
స్నానపానజపము లూని సేయుఁడు శత్రు
ప్రకరహాని గల్లి ప్రాభవంబు
తనరునంచుఁ జెప్పఁ దద్దయుఁ బాండవుల్
వేంకటాద్రి కేగి వేడ్క నెగడ.
| 203
|
ఆ. |
క్షేత్రపాలుఁ డుండు సిద్ధస్థలంబున
నిలిచి స్నానపాననిష్ఠ లచట
సలుపుచుండ నొక్కసంవత్సరము చనె
నంత వేంకటేశుఁ డాదరమున.
| 204
|
సీ. |
స్వప్నమునం బాండవాగ్రజుం గని యిట్టు
లనె మహారాజు నీవరుల నెల్ల
సమయించి రాజ్యంబు చక్కఁగ నేలుము
సందియంపడకు పో సదయ ననఁగ
ధర్మజుం డటు లేచి తగ మ్రొక్కి యావల
భీమార్జునాదులం బిలిచి స్వప్న
సంగతిఁ దెల్పంగ సంతసం బందిరి
యంత నందఱతోడ నద్రి డిగ్గి
|
|
తే. |
శత్రువుల గెల్చి గజపురి శస్తముగను
జేరి రాజ్యంబు నేలుచు భూరికీర్తి
నొందె ద్రౌపది యిష్టంబు నొందెఁ గృష్ణు
నిష్ట మీడేరెఁ ద్రిజగంబులెల్లఁ బొగడ.
| 205
|
చ. |
గుఱుతుగఁ బాండునందనులు కొన్నిదునంబులు భక్తియుక్తులై
తఱమిడి నందు నిల్పినకతంబునఁ బాండవతీర్థ మంచు ని
త్తరి నరు లెన్ను చుండుదురు దానిమహత్వము క్షేత్రపాలకుం
డెఱుఁగును గాని యెంచ మఱి యెవ్వ రెఱుంగరు ధారుణీస్థలిన్.
| 206
|
వ. |
మఱియు స్వామి పుష్కరిణి బూర్వభాగంబున జరాహరం
బును, వలిఘ్నంబును రసాయనంబును అనుమూఁడు తీర్థంబు
లును, హరి వసింపఁ దగిన వైకుంఠపర్వతగహ్వరంబును,
అష్టలోహఘాతంబులును గల్గియుండు నింతయు నాపుష్కరి
ణికి ద్వావింశతిశరపాతదూరంబున మాయాతిరోహితశక్తి
యన్నిట నావరించి యుండుం గావునఁ దత్తీర్థాదులు బుధుల
కైన గాంచ నశక్యంబు లగుచుండు నట్టిమహిమ లొప్పు
చున్న వేంకటాచలంబున నంధులు మూకలు బధిరులు
గొడ్రాండ్రు ధనహీనులు శ్రద్ధాభక్తి హరిం గొనియాడుచు
నుండిరేని వారికి నభీష్టాదు లాపూర్తియగు నని యుగ
భేదంబువలన నొక్కవిశేషంబు కల్గుచుండు నయ్యదెఱింగింతు
వినుండని సూతుం డిట్లనియె.
| 207
|
వేంకటాద్రి యుగభేదంబులం బ్రకాశించుట
సీ. |
ఆ వేంకటాద్రి మహాద్భుతంబుగ నొక్క
తఱి హరివిధమునం దనరుచుండు
|
|
|
నొకతఱి కనకాద్రి యొప్పునఁ జూపట్టు
నొకవేళ జ్ఞానసంయుతము నొందు
నొకసమయంబునఁ బ్రకటిత మరకత
మణివోలె దీపించు మహిమమీర
నొకకాలమున మహి నొప్పును గలికాల
పాషాణశైలరూపములుగాను
|
|
తే. |
గాన నావేంకటాచలఘనత నుడువ
నాదిశేషునికైనఁ గా దరయ నింక
నేను జెప్పంగ నేర్తునే నెమ్మి మీకు
పరమమునులార విమలకృపాత్ములార.
| 208
|
క. |
అని యిటు సూతుఁడు వల్కఁగ
విని శౌనక ముఖ్యు లనిరి వేంకటశైలం
బున కెసఁగు మహిమ లెంతయు
వినినం బరితృప్తి లేదు వీనుల కనఘా.
| 209
|
క. |
కావునఁ బెద్దలు దెల్పిన
శ్రీవేంకటగిరి మహావిచిత్రమహిమలన్
భావింపఁగ నీవే ముద
మావిర్భవముగ వచింపు మాకర్ణింపన్.
| 210
|
తే. |
అనిన జైమినిముని చెప్పిన రామ
చరిత మిపు డేను వచియింతు సరవి మీరు
వినుఁ డటంచును మౌనులఁగని ముదమునఁ
జెప్పదొడఁగెను దత్కథఁ జిత్రమలర.
| 211
|
సీ. |
మునులార! దశరథతనయుఁడై జనియించి
గాధేయజన్నము గాచి వేడ్క
|
|
|
శంకరుచాపంబు ఖండించి జానకిఁ
జేఁబట్టి భార్గవుఁ జెలఁగి యతని
బల మాఱ్చి సాకేతపట్టణంబును జేరి
జనకునానఁతి గొని చని యరణ్య
వాసంబు సేయ రావణుఁ డనుదైత్యుండు
లలన సీతను దనలంక కెలమిఁ
|
|
తే. |
బట్టి కొనిపోవ రామభూపాలకుండు
రావణుని ద్రుంచుకొఱకు సుగ్రీవుఁ జేరి
యాంజనేయాదికపులతో నపుడు వేంక
టాద్రి చెంతను లంకకు నరుగుచుండ.
| 212
|
శ్రీరాములు వేంకటాద్రికి వచ్చుట
తే. |
అంజనాదేవి శ్రీవేంకటాద్రిమీఁద
నుండి రాముఁడు కపిపుంగవులను గూడి
వచ్చుటం జూచి యెదురుగ వచ్చి యతని
పాదకమలంబులకు మ్రొక్కి భక్తి మెఱయ.
| 213
|
క. |
ఘనుఁ డగురాముఁడు విష్ణుం
డని మనమున నిశ్చయించి యానందముతో
వినుతులు సేయుచు మఱి యి
ట్లని రాముని కీర్తి యవనియం దలరంగన్.
| 214
|
ఉ. |
రామ సుకీర్తికామ ఘనరాక్షసబృందవిరామ సద్గుణ
స్తోమ దినాధినాథకులతోయధిచంద్రమ శౌర్యధామ నీ
శ్రీమహితప్రభావము ధరిత్రి నుతింపఁగ నాకు శక్యమే
కామఫలప్రదాత ననుఁ గావఁగదే జగదీశ రాఘవా.
| 216
|
సీ. |
ఈ వేంకటాద్రిపై నెలమి వర్తించుదుఁ
గావున నాయందుఁ గరుణనుంచి
వేంకటాద్రికి మీరు విచ్చేయుఁడన విని
శ్రీరాముఁ డిట్లనె వీరకపులు
తోడ శీఘ్రముగాను దూరప్రయాణంబు
కలిగియున్నది కార్యఘటనమైన
వెనుక నీయిష్టము వేంకటాద్రికి వత్తు
మనఁగ దేవరదర్శనార్థ మచటఁ
|
|
తే. |
గాచి యున్నారు మునివరు ల్గాన వారిఁ
జూడ రావలె ననుచు నాచేడె పిలుచు
సమయమున నాంజనేయుఁ డచ్చటికి వచ్చి
వినయమున మ్రొక్కి యీరీతి విన్నవించె.
| 216
|
తే. |
దేవ మాతల్లి యంజనాదేవి మనవి
చేసినట్లుగఁ గరుణించి చిత్త మలర
వేంకటాద్రికి నేగుట వేడ్క మాకు
మఱియుఁ గపులెల్ల నలసిరి మార్గమునకు.
| 217
|
వ. |
ఇదియునుం గాక యాహారంబు గొనవలసియుండుటం జేసి యిప్పుడు.
| 218
|
సీ. |
శ్రీజయనాశ్రమసిద్ధస్థలమునందు
ఫలసుమవృక్షము ల్గలిగి యుండుఁ
గందమూలాదులు ఘనపుణ్యతీర్థంబు
లందుండుఁ గనుక నేఁ డచట నిలిచి.
యావలఁ బోఁ దగు నంజనాద్రికి నొగి
మనప్రయాణమునకు మార్గ మదియ
|
|
|
యటు గాన మాతల్లియందు సత్కృప నుంచి
యటకు రావలె నిపు డనఁగ రామ
|
|
తే. |
చంద్రుఁ డబ్జాప్తసుతుని లక్ష్మణునిఁ గాంచి
మందహసితాస్యుఁడై హసుమంతుఁడనుట
వింటిరే యన్న వారు భూవిభుని జూచి
దేవ మీయిష్ట మని రంతఁ దెఱఁగునెంచి.
| 219
|
క. |
మనమున దశరథతనయుం
డనుమోదము నొంది వత్తునని చయ్యన న
య్యనిలతనూజుని గని యి
ట్లనియె న్గౌరవ మెసంగ నందఱు వినఁగన్.
| 220
|
ఉ. |
మారుతపుత్త్ర నీమనవి మామది కిష్ట మొసంగె నిప్పుడా
చారుతరాంజనాఖ్యవరశైలపథంబున వేడ్కఁ బోద మా
దారిని వానరావళికిఁదప్పక చూపు మటంచుఁ బల్క న
వ్వీరుఁడు సంతసించి కపివీరులఁ బిల్చి ప్రియంబు మీఱఁగన్.
| 221
|
ఆ. |
వేంకటాద్రిమార్గ మంకం బెఱింగించి
హరిసమూహవిభునియనుమతమున
రామలక్ష్మణులను రహి మీఱ భుజములం
దుంచికొని బలంబుఁ బెంచి నడచి.
| 222
|
ఆ. |
నిక్క వేంకటాద్రి కెక్కుమార్గమునందు
వరమునీంద్రు లెదురు వచ్చి నిలిచి
బహువిధముల రామభద్రుని వినుతించి
యిట్టు లనిరి కీర్తి యినుమడింప.
| 223
|
ఉ. |
రామనృపాల ఘోరతరరావణశౌర్యవిఫాల భవ్యసు
త్రామ సురార్యయోగిజనతాపసపాల కృపాలవాల శ్రీ
|
|
|
భూమిసుతాత్మలోల పరిపూర్ణయశోధనధామ వానర
స్తోమముతోడ వచ్చుమిముఁ జూచికృతార్థుల మైతి మెల్లరున్.
| 225
|
సీ. |
చిరకాలమున నుండి శ్రీవేంకటాద్రిపై
దప మొనర్పఁగ నావిధాత వచ్చి
రామసౌమిత్రు లీరమ్యవేంకటశైల
మునకు వచ్చెదరు సమ్మోద మలర
వారు వచ్చెడుదాఁక వదల కిచ్చట నుండి
వచ్చినప్పుడు మీరు వారి నిచట
సంతోష మొదవించి సత్యలోకమునకు
రండు మీరనినకారణముచేత
|
|
తే. |
నెదురుచూచుచు నుండి మేమిచట మిమ్ముఁ
గాంచితిమి మాతపంబు లిక్కడ ఫలించె
నింతయే చాలు సెలవు నిమ్మిపుడు బ్రహ్మ
లోకమున కేగెదము దుష్టలోకనాశ.
| 225
|
మ. |
అనినన్ రామనృపాలకుండు పరమాహ్లాదంబుతో వారలం
గని యోతాపసవర్యులార! మిము నీకాంతారమధ్యంబునం
దొనరం గంటమి సంతసం బొదవె మీరుల్లంబుల న్వేడ్కమై
జనుఁడబ్జోద్భవుఁడున్నచోటి కనుచున్ సంప్రీతితోఁ బల్కఁగన్.
| 226
|
క. |
ఆమౌనులు ముద మొందుచు
రామునిచే సెలవునంది రయమున నపుడే
తామరసోద్భవులోకము
రాముని నెంచుచును జనిరి రహి నంద ఱొగిన్.
| 227
|
వ. |
అనంతరము రామచంద్రుండు తత్పర్వతోత్తరమార్గంబున
నొకపర్వతారోహణంబు సేయుచుండి తన్మధ్యంబున యక్ష
|
|
|
శాపమోక్షంబు చేసి వచ్చి కందమూలఫలభరితం బగు నంజ
నాశ్రమమునందు నాకాశగంగసమీపంబునం గపిసమూహ
ముతో నిలిచి తత్తీర్థంబున స్నానసంధ్యాద్యనుష్ఠానంబులు
నిర్వర్తించిరి. అంజనాదేవి పుష్పంబులఁ బూజించి పరమ
రుచ్యఫలంబు లొసంగి ముదమార వేఁడుటం జేసి యారామ
లక్ష్మణులు సంతుష్టు లై యంజనాదేవిని నాదరించి వీడ్కొని
యందుండి సుగ్రీవాంగదకపిముఖపరివృతులై స్వామిపుష్క
రిణికి వచ్చి జయప్రదసంకల్పపూర్వకంబుగ స్నానం బొనర్చి
తత్తీరశృంగారవనంబునం దొక్కింతతడవు సుఖాసీనులై దర్శ
నార్థంబుగ వచ్చినమునుల కనేకఫలదానంబు లిచ్చి పుష్క
రిణికి నిఋతిభాగంబున నొకపర్ణశాలం జేరి యున్నసమ
యంబున నాంజనేయుండు వివిధఫలకందమూలాదులును దేనె
పెఱలును దెచ్చి సమర్పించెఁ బరివారముతోడ రామలక్ష్మణు
లారగించి పరిపూర్ణులై రట్టియెడ.
| 228
|
సీ. |
ఘనుఁ డాంజనేయుండు కపిసమూహముఁ జూచి
పిలిచి యిట్లనియె సంప్రీతి మెఱయ
వానరులార యీవనపర్వతములందుఁ
జూతజంబూఫలవ్రాతములను
బనసపండ్లును ద్రాక్షపండ్లును బదరికా
ఫలము లనంటులు పాలపండ్లు
పరమముదంబున సరవి మెక్కుఁడు వనం
బున విహరింపుఁడు మనసులార
|
|
తే. |
ననిన విని కపిబృందంబు లపుడు చెలఁగి
ఫలమహీరుహములఁ బ్రాకిపండ్లఁ గోసి
|
|
|
కడుపులారంగఁ దిని యార్పు చొడలఁ గీఱు
కొనుచుఁ గొండలపై కెక్కి తేనెలరసి.
| 229
|
వ. |
ఆమధుకోశంబులం జేకొని చించి యందుండు తేనెలతో మఱి
కొన్నిపండ్లును గల్పి పంచుకొని యబ్బురపాటునఁ జప్పరించుచు
నొండొరులు ఱొప్పుచు ముక్కులు చిట్లించుచు నొకరిచెవు
లొకరు గొఱుకుచు పండ్ల గీటించి కన్నులు బిక్కరించి వెక్కి
రించుచుం గొండకొండకు లంఘించుచు నుల్లాసం బొక్కింత
తడవుండి యంద ఱొకచోట గుంపుగూడి యిట్లనుకొనిరి.
| 230
|
క. |
రాములకృపచే నిచ్చటి
కామోదముతోడ వచ్చి యఖిలఫలములం
గామించి భుజించితి మిపు
డేమే లొనరింపవచ్చు నినకులపతికిన్.
| 231
|
సీ. |
శ్రీరామునకు నపకారం బొనర్చిన
రావణుం దెచ్చి శ్రీరామునెదుటఁ
బెట్టి కొట్టియు దయ వెట్టక తోఁకలం
జుట్టి భూమిం బడఁ బట్టు విడక
మఱి లంకఁ గొనివచ్చి మానవేశ్వరుఁడాత్మ
మెచ్చ ముందటఁ బెట్టి మేలుగొనెద
మనువారు కొందఱు ఘనరాక్షసుల నబ్ధిఁ
గలపి రావణశిరంబులను నఱికి
|
|
తే. |
గ్రద్దలకుఁ బెట్టుదము వేడ్కఁ గఱవు దీఱ
ననుచుఁ గొందఱు రావణుం డబ్ధి డాఁగి
నప్పటికి వాని విడువక యందు నరిగి
పట్టుకొని వత్త మధిపునిపట్టు కడకు.
| 232
|
వ. |
అనువారు నంత నందఱు స్వామి పుష్కరిణికి నీశాన్యభాగం
బునం దొక్కగహ్వరంబు నీక్షించి యయ్యంధకారబిలం
బునం జొచ్చి కిచకిచలాడుచుం బోవుచు నందొకదివ్యజ్యోతి
నీక్షించి తత్సమీపంబున కరుగుచున్న సమయంబున.
| 233
|
సీ. |
ఆగుహలోదివ్యహాటకనవరత్న
గోపురప్రాకారకుడ్యతతులు
వజ్రకవాటము ల్వైదూర్యమాణిక్య
మరకతమౌక్తికమండపములు
ప్రాసాదము ల్చిత్రభవనపంక్తులు మేటి
పచ్చతోరణములు బాగు మీఱ
హేమరథంబులు సామజాశ్వంబులు
వివిధవింతలు దగువీథు లొప్ప
|
|
తే. |
విమలగానంబులును నృత్యవివిధవాద్య
ములును ఘోషింప యువతులు మెలఁగుచుండ
వరచతుర్భుజులును గదాధరులు శంఖ
చక్రపాణులు నచ్చట సంచరింప.
| 234
|
తే. |
అమరి యప్రాకృతంబై మహాప్రకాశ
మహిమచే నొప్పు నప్పురమధ్యమందుఁ
గాంచనాద్రినిభంబై ప్రకాశయుతము
భానుసంకాశ మైనవిమానమునను.
| 235
|
సీ. |
నీలాభ్రగాత్రుండు నీరజనేత్రుండు
నాజానుబాహుండు సచ్యుతుండు
కనకాంబరుండు సత్కంబుకంఠుండు స
ల్లలితసద్భూషణాలంకృతుండు
|
|
|
శంఖచక్రగదాబ్జసహితహస్తుండు మ
హాత్ముండు పూర్ణచంద్రాననుండు
సురుచిరసుందరసుకుమారదేహుండు
విమలసత్కారుణ్యవీక్షణుండు
|
|
తే. |
నగుచు ఘనభోగిభోగపర్యంకమునను
వాసి మీఱఁగఁ గూర్చుండి వామపదము
ముడిచికొని కుడిపాదంబు పుడమిమీఁద
నింపుగాఁ జూచుచుండు లక్ష్మీశ్వరుండు.
| 236
|
క. |
కరములు రెం డా ఫణిపై
నిరవుగ నూనుకొని లక్ష్మి యెదపై వెలుఁగన్
ధరణియు నీళయు భక్తిని
నిరుగెడ వసియించి వేడ్క నెసలారంగన్.
| 237
|
వ. |
ఇవ్విధంబున సుఖాసీనుఁ డైయుండు పురుషోత్తమునకుం
గరుడసుందరీమణులు చామరంబులు వీవ మఱికొందఱు
శ్వేతచ్ఛత్రంబులు పట్టఁ గోటిసూర్యప్రభాభాసితుం డై
వెలుంగుశ్రీహరిని సంతోషమగ్నులై చూచుచున్నకపుల
నీక్షించి యం దొకవేత్రహస్తుండు మార్గంబు చూప నక్కపు
లామార్గంబున నీవలకు వచ్చి యాశ్చర్యంబు నొంది తమలోఁ
దా మిట్లు తలంచుకొనిరి.
| 238
|
సీ. |
శ్రీరామచంద్రుని చెలఁగి గెల్వఁగలేక
రావణుండు గుహాంతరాళమునను
జేరి రాక్షసమాయ లీరీతిగాఁ జూపె
నని తోఁచు చున్నది యనెడువారు
|
|
|
నాదశకంఠుమాయలు గావు భావింప
హరిమాయ గావలె ననెడువారు
నీసంశయము దీర నీమాటు గుహలోని
కరిగి క్రమ్మఱఁ జూత మనెడువారు
|
|
తే. |
మనము మాత్రము పోరాదు మర్కటముల
నన్నిటిని గూడి పోవచ్చు ననెడువారు
నపుడు కలగంటి మిది దబ్బ రనెడువారు
ననృత మేలగు నిజ మిది యనెడువారు.
| 239
|
వ. |
ఇవ్విధంబున నందఱు సందేహములు పడుచు మరల నాగు
హను జూడంగఁ బోవ నది కన్పట్టకుండుటం జేసి యందందుం
గలగుహ లన్నియు వెదకి గానక రామచంద్రునికడకు
వచ్చి గుహవృత్తాంతం బంతయు నెఱింగింప నక్కరుణాసము
ద్రుండు చిఱునగవు మోమున మొలకలెత్త నిట్లనియె.
| 240
|
సీ. |
దేవర్షి రాజనదీమూలములు పరీ
క్షించి నిర్ణయముగఁ జెప్పరాదు
మహిమాఢ్యుఁ డైనరమామనోహరుఁ డిందు
నలరు రీతిని కల్ల యనఁగరాదు
హరిగిరిమహిమ లా హరి యెఱుంగును గాని
దేవతలకుఁ గూడఁ దెలియఁబడదు
యీయద్రిమహిమల నెంచ కేరితరంబు
మించి పరీక్షింప మీకుఁ దగదు
|
|
తే. |
మంచి దైనను గొదవేమి మాధవుండు
కరుణతో మీకు దర్శనం బరయ నిచ్చె
|
|
|
ధన్యు లైతిరి పాపము ల్తలఁగె నంచు
నాడి శ్రీరాముఁ డాదినం బచటనుండె.
| 241
|
|
సరవిగ మఱునాఁ డద్రిని
హరిబలములతోడ డిగ్గి యారఘురాముం
డరి గెలువం జని యంబుధి
గిరు లిడి బంధించి మించి కీర్తియెసంగన్.
| 242
|
క.
చ. |
కపులును దమ్ముఁడుం గొలువఁగా నొగి లంకకుఁ బోయియచ్చటన్
విపులబలంబుతో నసురవీరుల నెల్ల వధించి ధీరతం
గుపితుని గుంభకర్లు ధరఁ గూలిచి రావణుతోడఁ బోరి యా
రిపుని వధించె దేవమునిబృందము మెచ్చఁగ రాముఁ డెంతయున్.
| 243
|
సీ. |
సీత నచ్చటఁ బరీక్షించి శ్రీరాముడు
గూడి విభీషణుఁ గూర్మి కలరి
యాలంక కాతని నధిపునిగాఁ జేసి
జానకీలక్ష్మణసహితుఁ డగుచు
వానరచయముతో వరపుష్పకం బెక్కి
సాకేతపురి సంతసమునఁ జేరి
భరతశత్రుఘ్నులు భక్తిమైఁ గొలువంగఁ
బట్టాభిషిక్తుఁడై ప్రజలనెల్లఁ
|
|
తే. |
బ్రథిత దయఁబూని పాలింపఁ బృథివి తఱిని
పండుచుండెను సస్యంబు మెండుగాను
మౌనివర్యుల కీరితిఁ బూని చెప్ప
విని ముదంబంది గుహలోనఁ దనరినట్టి.
| 244
|
వ. |
పరమపురుషుం డెవం డాయద్రిమహిమ ససాకల్యంబుగ
వచింపు మనిన మునులకు సూతుం డిట్లనియె.
| 245
|
శా. |
వైకుంఠం బెడఁబాసి శేషగిరిపై వర్తించునారాయణుం
డాకాలంబున నాగుహాంతరమునం దావానరశ్రేణికిం
జోకం జూప నిజస్వరూపము కపు ల్చోద్యంబుగాఁ జూచి భూ
లోకంబందు వచింపఁగా నెఱిఁగి రీలోకంబులో మర్త్యులున్.
| 246
|
వ. |
ఇవ్విధంబున నాగుహాంతరమున నుండి శ్రీహరి వానరసమూ
హంబునకు వైకుంఠంబు చూపినందున నాగుహకు వైకుంఠ
గుహ యనంబరంగె. నందు నిత్యముక్తులు సేవింప శ్రీభూ
నీళా సమేతుఁడై యుండునాగుహాంతరమును జూచిన వారికి
ముక్తి శ్రీప్రదం బగు ననిన విని శౌనకాదులు ప్రమోద
స్వాంతులై సూతపౌరాణికుం జూచి యిట్లనిరి.
| 247
|
క. |
పంకజలోచన దనుజభ
యంకర సుగుణాభిరామ యవ్యయధామా
శంకరమిత్ర శుభాకర
వేంకటగిరినిలయ మౌనివినుతాంఘ్రియుగా.
| 248
|
మాలిని. |
కలశజలధిబాలాకాంతశృంగారలీలా
సలలితగుణజాలా సామగానాభిలోలా
కలుషనిచయశైలోగ్రాశనీ వేదమూలా
విలసితగుణశీలా వేంకటాఖ్యాద్రిపాలా.
| 249
|
గద్యము. |
ఇది శ్రీతఱికుండ శ్రీలక్ష్మీనృసింహకరుణాకటాక్షకలిత
కవితావిలాస వసిష్ఠగోత్రపవిత్ర కృష్ణయామాత్యతనూభవ
వేంకమాంబాప్రణీతం బగు వేంకటాచలమాహాత్మ్యంబును
|
|
|
వరాహపురాణంబునందు వేంకటగిరిపురవర్ణనంబును, నైమి
శారణ్యవర్ణనంబును, శౌనకాది మహామునుల ప్రశ్నలును,
బ్రహ్మ దినప్రళయ ప్రకారంబుసు, హరి శ్వేతవరాహంబై
హిరణ్యాక్షుని సంహరించి రసాలగతయగుభూమిని యథా
స్థానంబునం దుంచుటయు, వరాహస్వామి యనుమతంబున
శ్రీభూనీళలతోడ వైకుంఠమునం దున్నక్రీడాద్రిని గరుత్మం
తుండు గొనివచ్చి భూలోకమునందు నిల్పుటయు, బ్రహ్మేం
ద్రాదులు వచ్చి స్వామికి మ్రొక్కి వినుతించుటయును,
వరాహస్వామి శేషాద్రియందు విహరించుటయును, పుష్క
రిణీ మాహాత్మ్యంబును, వేంకటాద్రికి నొక్కొక్కనిమిత్తం
బున నొక్కొక్కనామంబు గల్గుటయు, వరాహస్వామి
క్రీడానగంబునకు నుత్తరదిగ్భాగంబున విహరించు చుండి
విటవేషధరుఁడై మౌనుల యజ్ఞశాలయందుఁ బ్రవేశించి
వపాగ్రహణంబు సేయుటయు, దేశాంతరగతుం డైన వృద్ధ
బ్రాహ్మణుని హరి కటాక్షించి కుమారధారాఖ్య తీర్థంబున
స్నానంబు సేయించి బాలకుమారునిగాఁ జేసి పంపుటయు,
శంఖణమహారాజునకుఁ బుష్కరిణియందుఁ బ్రత్యక్షంబయి
రక్షించుటయు, నాత్మారాముఁ డనుబ్రాహ్మణునకు హరి ప్రస
న్నుండై సమస్తైశ్వర్యంబుల నిచ్చుటయు, కపిలలింగ కపిలతీర్థ
సంభవంబులును, దత్కపిల తీర్థాది సప్తదశ తీర్థప్రభావంబు
లును, తీర్థయాత్రపోవు విప్రునకు స్వప్నమునందు హరి
ప్రసన్నుండై పుష్కరాద్రియందుఁ గల తీర్థంబులఁ జూపు
టయు, ధర్మరాజాదు లొక్కసంవత్సరము వేంకటాద్రియం
|
|
|
దొకపుణ్యతీర్థంబు నాశ్రయించి యుండుటయు, యుగభేదం
బులచేత వేంకటాద్రి ప్రకాశించులాంఛనంబులును, రావణ
సంహారార్థంబుగ నరుగునప్పుడు రామచంద్రుం డొకదినము
వేంకటాద్రియందు వసియించి గుహాప్రభావంబు కపులకు
జెప్పుటయు, గుహాంతర రహస్యంబు మునులు సూతుని
నడుగుటయుఁ గల ప్రథమాశ్వాసము.
|
|