శ్రీరంగమాహాత్మ్యము/సప్తమాశ్వాసము
శ్రీరస్తు
శ్రీరంగమాహాత్మ్యము
సప్తమాశ్వాసము
శ్రీరమణీయ వి
హారోచితవికచకుసుమహరిమకరందా
సారోరుపటీర తరూ
ధారవనీవలయ వేంకటాచలనిలయా.
వ. అవధరింపు మిట్లు నాగదంతమహామునికి వ్యాసు లానతిచ్చిన తెఱంగు సూతుండు
శౌనకాదుల నుద్దేశించి.
సీ. అనఘ వాల్మీకిమహామునిచంద్రుఁ డచ్చోటి కరిగె.......
వాకొనుఁడన సత్యవతిపట్టి వైదేహయాగశాలావాసు లైన మౌని
రాజి కిట్లను భరద్వాజులతోఁ గూడి తీర్థరాజము బిల్వతీర్థమునకుఁ
జనియె మైత్రేయ గార్గనియెడి భూసురశ్రీలందు ముక్తికిఁ జేరిరనియు.
కణ్వమునివాలఖిల్యవైఖానసులును, గామితము లొందిరనియును గమలభవుఁడు
సవన మొనరించు యూపసంచయములున్న, ననియుఁ బౌరాణికులు దెల్ప వినినకతన.
ఉ. అంతియ కా దగస్త్యముని యాది బులోమసుతావరుండు చౌ
దంతిపయిన్చం సురాలయపదంబున రాఁ గయికాన్కగాఁగ చా
మంతిసరం బొసంగుటయు వజ్రి యెఱుంగక వ్యోవుకుంభికుం
భాంతరసీమ నిల్ప నది హస్తగృహీతలతాంతదామ మై.
గీ. తీసి పదముల నిలమీఁద వ్రేసి రాసి, మట్టిమల్లాడఁగాఁ గని యుట్టిపడఁగ
మిట్టిపడిదంచవన యోరి మిగులఁ గ్రొవ్వి, నను దృణీకారముగ నెంచినావు నీవు
క. ఏనిచ్చిన సుమమాలిక , యేనుఁగచేతికి నొసంగ నింతటి గర్వం
బేనురకఁ జూచి తాళిన, మౌనుల కిఁక నేటిబ్రదుకు మత్తులచేతన్.
సీ. ఇల్వలవాతాపు లేమైఱి నాచేత చండించి యొక నిముషంబులోన
మేరువుతోఁ బోరి మిన్నెల్ల నిండిన వింధ్యాద్రి యెటఁబోయె యెెఱుఁగరాదె
యాపోశనప్రాయమై వార్ధులన్నియు నరచేతనుంచుట మరచినావె
నీదు పట్టంబుననిలిచిన నహుషుఁడు గర్వించి యేమయ్యెఁ గానవైతి
యొక్కతల బ్రహ్మరుద్రదివ్యులు ధరిత్రి, కొక్కతల యేనునైయున్నయునికివినవె
యట్టికుంభజుఁ డిచ్చిన యలరుదండ, నేలవైచిన సిరు లింక నేల నిలుచు.
క. ఈ నీకలుములు వారధి, లోనన్ బడుఁగాక ననుచు లోపాముద్రా
జాని శపించిన నింద్రుఁడు, మానసమున గలఁగి గురుని మంత్రముచేతన్.
క. జాబిల్లికొలని చెంగటి, యాబిల్వసరోవరము మహాత్మ్యమున నిజ
శ్రీబాలహల్య గైకొని, యాబర్హిర్ముఖవిభుండు యరుగుట వినికిన్.
క. అచ్చటికి వచ్చి యమ్ముని, వచ్చిన ప్రియశిష్యుఁ జూచి నాకొకకథ ము
న్నిచ్చటి మహిమముగా నా, క్రుచ్చన్ నారదుఁడు మదికి గోచరమయ్యెన్.
మ. వినుపింతున్ మునుమున్ను హేమకుఁ డనన్ విశ్వంభరాభారభా
జనబాహాదిమభోగి శాంతితమవిజ్ఞానాత్మయోగాద్యవ
ర్తనుఁ డాచక్రమహీధరాకలిత సప్తద్వీపనానాజయా
జ్జనవాసా పరిణాత సర్వజనరక్షాదక్షుఁడై పెంపునన్.
సీ. పఠియించు నొకవేళ శరదమేయతివృష్టి ధరణికన్యావృష్టి బరిహరింపఁ
గాయు నెండలు భానుకరణి విల్విరివేళ నీదుచేఁ బ్రజ నొప్పి నెనయు నీక
విసరి చల్లనిగాడ్పు లసమాన పవమానశాబమై మండ్రువేసవులయందు
పండించు సస్యసంపద లోషధీశుఁడై తృణలతాదాత్యంతమృతము నించి
చేరనీయఁడు రుజులందుఁ జనక నీచు, మృత్యువును భూమిజనుల ధార్మికుఁడతండు
యోగిబలముల దివిజులు యాగడములు, సాగనీయఁడు యొక్కొక్కసమయములను.
గీ. ఇచ్చినవియెల్ల బాత్రంబు లేమిచేసె, నేవి సుకృతంబులాడిననెల్ల సత్య
మెచ్చినవి యెల్ల ధర్మంబు లెందునున్న, నిధులుగా ధాత్రి యేలె నానృపతిమౌళి.
క. జన్నములు పెక్కు లొనరిచి, యెన్నఁడు పగయనెడి మాట యెఱుఁగక దీనా
సన్నుల పాలిఁట నిల్చిన, పెన్నిధియై యుండెఁ జింత పెనచెన్ మదిలో.
ఉ. చేసితి యాగముల్ మహియశేషము నేలితి దానవైఖరిన్
భూసురకోటికెల్లను ప్రభుత్వ మొసంగతి సర్వదిగ్జయో
ల్లాసనమాఖ్యఁ గాంచి యుపలాలనఁ చేసితి నెల్లవిశ్వమున్
మోసము లేని మేలునకు ముచ్చట దీరదు నెమ్మనంబునన్.
గీ. ధాత్రి శాస్త్రంబు లెల్ల నపుత్రకునకు, గతులు లేవని వివరించుకతన నెన్ని
గతులు దలఁచినఁ బరలోకగతులు లేవు, గతి తదన్యంబుగలదె యేగతిఁ దరింతు.
క. భోగములు రాగములు నను, చాగము లుద్యోగములుకు సత్కర్మముగా
యాగములు శుభాగములు, బాగులు గాలేవు పరవిభాగంబునకున్.
చ. తడబడతొక్కుఁ బల్కు లమృతంబులు చిందకఁ దప్పుతప్పు చి
ట్టడుగులు నందియ ల్మొరయ నౌదల నిద్దపురావిరేక ము
ట్టిడుకొన నాడుబాలకుల నెత్తు కృతార్థుల పుణ్య మెట్టిదో
కొడుకులు లేని వానిబ్రదుకు బ్రదుకే పరికించి చూచినన్.
చ. జననిమృదూరుపీఠి దిగజారి తనుంగని బారచాపుచున్
దనయుఁడు రాఁగ గ్రక్కున నిధానము వచ్చెను దండ్రివచ్చె జ
క్కని యపరంజి వచ్చె నను గాచిన యయ్యలు వచ్చినారు మో
హనపుమురారి వచ్చెనని యక్కునఁ జేర్పని జన్మ మేటికిన్.
సీ. తరియింపనేర్చునే నిరయకోపానలావరణ వృధాతాపభర పయోధి
కడతేరనేర్చునె నడలిపోనిపితౄణగాఢాయసోమశృంఖలచయంబు
త్రోయఁజాలునె నిరపాయ జన్మావధి క్రమసమార్జిత ఘోరకలుషరాశి
యనుభవించునె విలోకన తపఃఫల నూనంద సౌఖ్యరసానుభవము
కటకటా పుత్రహీనుఁ డేకరణిఁ గాంచు, నుభయలోకసుఖంబు లెందున్న నేమి
వ్యర్థజీవనుఁ డేలెక్కవాడుఁ గాడు, తగునె యనపత్యవదనసందర్శనంబు.
శా. కేలుం దమ్ములు జాలువాసరిపిణుల్ గీలించి బాలామణుల్
డోలాశయ్యఁ గుమారకు న్నిలిపి లాలో లాలి లాలమ్మ లా
లీ లాలీ యని జోలబాటఁ జెవు లాలింపంగ నేపుణ్యముల్
చాలా చేసిరొకో నృపాలకులు సత్సంతాన లాభార్థులై.
సీ. ముద్దులతనయుఁడు ముందట నాడంగ వలువదే గృహములుగల ఫలంబు
జెవులలో జోలలు జిలుకుకుమారుని గనుటెగా కన్నులుగల ఫలంబు
పట్టి నాగారాపుపట్టి యనుచు నెత్తఁ గాంచునె నెమ్మేనుగల ఫలంబు
మాటికి నవ్యక్తమధురోక్తముల సుతుల్ పలుకుట వీనులుగల ఫలంబు
సుతవిహీనుని సామ్రాజ్యసుఖము లేల, కామినీమణు లేల భోగంబు లేల
చింతసేయుట గతజలసేతుబంధ, నంబు చందంబు చరమకాలంబు నందు.
క. నా కిన్నాళ్ళు వయఃపరి, పాకంబున డెబ్బదేండ్లపైఁ బది నడువన్
బైకార్యం బేమరి విష, యాకులమతి సతులమీఁద యాసల నుంటిన్.
గీ. అనుచుఁ జింతాపయోనిధి మునిఁగి రాజు, హితుల నాప్తుల బుధపురోహితులఁ జూచి
కొలువులోపల పరిమితగోష్ఠివలన, నొకప్రసంగంబుఁ దెచ్చి యందుకొని పలికె.
ఉ. మీరలు ధర్మశాస్త్ర నుపమాహితమానసు లెచ్చరిల్లఁగా
నేరకయున్నవారలు కనింగని లౌకిక వైదిక క్రియా
చారము లస్మదన్వయము చాలునఁ బోవక యంతరింపఁగా
నూరక యి ట్లుపేక్షఁ గనుచుండఁగ ధర్మమె యాప్తకర్మమే.
క. మనువారిన్ జనువారిన్, జనియించినవారిఁ గని విచారము గలదే
తన కూర్థ్వలోకసౌఖ్యం, బును మీ కిహలోకసౌఖ్యమును గనవలదే.
ఉ. ఇందఱు మెచ్చఁగా ధరణి నేలితి నుర్విజనాళి యెప్పుడున్
నందనులట్ల బ్రోచి సవనంబులుఁ జేసి ధరాసుపర్వుల
న్నందిన దానవైఖరి మనంబున దృప్తి వహించి నించి పెం
పొందితి నెన్నిచందములఁ బొందఁగనేర పితౄణమోక్షముల్.
క. సంతాన మెట్టివారికి, సంతానం బగునితత్ప్రసంగతిచే నా
చింత దొరఁగింపుఁ డన సా, మంత పురోహిత హితాప్తమండలి బలికెన్.
గీ. అధిప పశు పక్షిమృగతిర్యగాత్ము లెల్ల, సంతతియె గోరి స్వసమాతృసంగమంబు
నిచ్చరింపుచు నిగమంబు లెచ్చరింపఁ, జేయుఁ గర్తవ్యవిజ్ఞానసిద్ధి కతన.
ఉ. చేయఁగరాని కార్యములు సేయుదు రాత్మజువేడి దేవర
న్యాయము గొంద ఱీయఘములైన శ్రుతిస్మృతిమార్గనిష్కృతుల్
చేయఁదొలంగుఁగాని సుతుఁ జెందనివానికి లేవు సద్గతుల్
మాయభిలాష నీతలఁపుమాటయు నొక్కటియయ్యె నియ్యెడన్.
క. మేలు సమస్తధరిత్రీ, పాలక యేనింతఁవాడ బరలోకమునన్
జాలి యొక టున్నదేయను, బాలిశ నాస్తికత లేక పలుకుట లొప్పెన్.
క. యోగాధికుఁడవు విమలో, ద్యోగుఁడ విట తలఁపు నీకు నొదవుట కర్మ
త్యాగఫలమయపుణ్యస, మాగమున జూవె యీశ్వరాధీనమునన్.
గీ. కర్మము లనంతములు జనుపగతుల నట్ల, ప్రకృతిసంబంధదేహి కర్మముల నొంది
తత్ఫలానుభవంబుచే దక్షిణప్ర, వృత్తి మరపున నెఱుఁగడు వెనకజనిన.
క. కారణము లేక కార్యము, నేరదు కలుగంగ దహనునికి గార్యంబుల్
కారించు టవశ్యంబగు, మేరం గలుషములు చేరు మితపుణ్యములన్.
క. కాన ఫలోదయ మేరికిఁ, కానేరదు గాన కానికర్మము లణఁగున్
శ్రీనాథుఁ గూర్చి యిష్టవి, తానముఁ గావింపఁ గామితము లొనగూడున్.
సీ. కొడుకులయూరడిఁ గుంది మాంధాత యనశనవ్రతముచే ననఘుఁ డయ్యె
దుందుమారుఁడును పుత్రులులేక తపముచే నకలుషవృత్తి గృతార్థుఁ డయ్యె
పృథుఁ డనూనత మనోవ్యథ నొంది దేవతారాధనంబున బుణ్యరాశి యయ్యె
ననపత్యుఁడై దిలీపాధీశుఁ డేనముల్ మాన్చి యాగములచే మాన్యుఁ డయ్యె
పుత్రకామేష్ఠి దశరథభూవరుండు, చేసి శ్రీరాముఁ గనియె నూర్జితుఁడు జనకుఁ
డట్ల తనయులఁ గాంచె భాగ్యమున సగరుఁ, డందె నమ్మేర నేవురు నందనులను.
గీ. మాధవప్రీతి భద్రకర్మము లొనర్చి, యంతరాయంబులకు బాయుమనిన యతఁడు
సవనము లొనర్చి దక్షిణ చాల యొసఁగి, యుండుచందంబు వినియె మృకండుసుతుఁడు.
మ. బహుశిష్యావళితోడ హేమకమహీపాలు న్విలోకించ రా
సహవీశప్రతిమానుఁ డవ్విభుఁడు డాయంబోయి పూబోదులన్
బహుమానింప సుఖోపవిష్ఠుఁడయి సంపశ్నంబులం దేల్చి యా
గహవిర్భాగము లాసుయజ్ఞపురుషాకారంబుతో నిట్లనున్.
గీ. సేమమే నీకు భద్రమే సేవకులకు, కుశలమే నీదుబహుళార్థకోశమునకు
నంగములయట్ల యంగంబు లరసిబ్రోతె, సుఖమె రాష్ట్రము మనకెల్ల సుఖములందు.
గీ. బలుసుకూరను ముళ్ళేరుపగిది నీవు, రాష్ట్రకంటకశోధనక్రమమువలన
నెచ్చరిక మానకున్నారె హితులు నహితు, లిట్టివారని క్రియలందు నెఱిఁగినావె.
క. ప్రజ నీమదిభాండారము, ప్రజభాండారంబుగాఁగ బాధింప మనో
రుజచేసినంచు గావున, ప్రజయుం భాండారమునను బతిపోషించున్.
క. కేవల మర్థాతురుఁడై, భూవరుఁ డుచితవ్రయంబు పొత్తెఱుఁగనిచో
నావిత్తమె మృత్యువగున్, గావున నుచితగతి రెండు గైకొనవలయున్.
క. పాపములు బొత్తుగలియక, యేపట్టున నిలువ మోదనిడ మోపక ప
క్షాపక్షము లెఱుఁగకమును, నా పురుషుల కొసఁగినావె యధికారంబుల్.
క. ప్రభుమంత్రోత్సాహములను, నభిమతశక్తిత్రయంబునందుల పతికిన్
బ్రభుశక్తి ప్రధానంబుగ, విభుమతమన్వాదులందు విరచిత మయ్యెన్.
క. ఇతరాలోచనయును విను, మతమును సరిజూచి యేది మది బరికింపన్
హిత మగునది యపుడే య, ప్రతికూలము లపుడు కార్యభాగము లెల్లన్.
క. తాలేశవిభుఁడు యొక్కని, పాలన్ దిగవిడువ నృపతిపదవి వధూషం
డాలింగనవిధమై తన, వేళకుఁ జేకూడిరాక వికలత నొందున్.
క. ఒకరిని నమ్ముట తమ మె, ప్పొకనికినై వశము చేసి యురకుండుటగా
దొకనికి మరియొక్కఁడు శా, సకుఁడను నడిపింప విబుధపతమగు పతికిన్.
క. సడలల స్వకార్యపరుఁడై, చెడుబుద్ధులు గరపి యినుపసీలకు మిద్దెల్
పడునీడ్చువాని నమ్మిన, వెడమతి పతియనుచు జీరు వీరడిగలడే.
క. వియెడల దీరుపని దన, తోయమువారలనె యుంచి దొరతనవారిన్
ద్రోయకయుండుట లెస్సగు, న్యాయము దొరబ్రతుకుఁ జూచి నడతురె వారిన్.
క. నమ్మినవారల పూర్వజు, నమ్ముల నొగలంగనీక నడపుదె విశ్వా
సమ్మున విశ్వాసమ్మును, నెమ్మది భావింతు పరుల నిలిచిన యెడలన్.
క. కరణంబులు నధికారులు, పరిజను లానగరితీరుపరి యొకఁడైనన్
దొరతనమే డది యిహమో, పరమో రాజత్వమణఁచి పనికొనవలయున్.
క. సరిరాజునందు సామము, పెరగూటువ మూఁగదొరల భేదము బలవ
ద్విరసముల దాన నల్పులఁ, బొరిగొన దండంబునడప భూవర వలయున్.
గీ. సంధివిగ్రహముఖతంత్రసాధనములు, శత్రుఁడగు గడిరాజు సమిత్రుఁ డైన
యవ్వలి నృపాలులోగొన నగునువీరి, గడచిన శ్రీయుదాసీనుఁ దడవనేల.
చ. కొలువు పురాణచర్చ హితగోష్టి రహస్యవిచార మాప్తపుం
జలకము నామ్రతీర్థవిధి చందనదానవిభూషణాంబరా
వలి గయిపేత భోజనము వారిజగంధులపొత్తు నిద్రయున్
దలఁపులు వేరతెల్పి యుచితంబులుగా నడిపింతు నిచ్చలున్.
క. కాయక మానసికములన, బాయని రుజ లౌషధమున బరమాచార్యో
క్తాయతనియమము కలిమిన్, మాయింపదె సమతచేత మనుపదె ప్రబలన్.
క. క్రతువుల నానావాస, స్థితుల మహీసురులనెల్లఁ జిత్తము లలరన్
బ్రతిపాలింపుదె నీపలు, కతిశయమని జనులునమ్మ నలరుదురె నృపా.
క. నేరములు జూచి తాల్మియు, నేరము లేకలుగునదియె నేరము సతికిన్
దా రా జందఱకును దన, కారయగా రాజనీతి యని వెరవ నగున్.
గీ. ఆత్మబుద్ధిస్సుఖఃచైవ యనుట నిజము, గాని పరబుద్ధినెంతయు హానిఁ జెందు
కాదు తరుణులబుద్ధి యీక్రమ మెఱింగి, నడచునృపతికి గొఱఁత యెన్నఁడును లేదు
క. తనుబుద్ధి రాష్ట్రమునకుం, బనిగొనదే నందునిందు బ్రాక్తనులగుచున్
జనువారిం దజ్ఞులు గని, పనిగొనఁగావలయుఁ గార్యపద్ధతు లందున్.
క. ఒరుదల నొరుకార్యం బొరుఁ, డెఱిఁగించిన నది యొనర్పుఁ డెల్లిదమగుదా
నరసియుఁ బడిఁబడిగా మఱి, యిరుగడఁ దగినట్లు చేత నృపయుక్త మగున్.
క. జీవిత మియ్యక నేరము, లే వెదకుచుఁ దగినపనులు లెక్కింపని ధా
త్రీవరు విరక్తి యెఱుఁగన్, సేవకులకుఁ బట్టపగలుఁ జీఁకటిగాదే.
క. వసుమతి వసుమతిగానీ, యసమానాధ్వరములందు నవనిసురకున్
బసధనము లిచ్చిమను నీ, యశమే వినికాదె వచ్చునది నీయెడకున్.
క. అడుగంగవలసి సేమం, బడిగితిగా కిందు సములు నధికులు నీకున్
బుడమి నృపాలురకొక వ్రే, ల్మడచి వచింపుటకుఁ గలదె మము విను మనఘా.
మాలిని. సంతతపాదకుంజరసమేతము సంతము శృంగతిరోహిత భా
స్వంతము పుష్పగుళుచ్ఛకసౌరభనాసిత బిల్లివధూదన సీ
మంతము దంతిమదోదక పూగసమాగమ చంద్రకితోసరివే
శంతము నౌ హిమవంతము చెంత రసాదర మొప్పు మదాశ్రమముల్.
మ. కనుఁగొంటి నిను నిష్ట మెద్దియన మార్కండేయు నీక్షించి యి
ట్లనియెన్ హేమకచక్రవర్తి భవదీయం బౌ కటాక్షంబుచే
నెననొక్కింత గొఱంతలేక ప్రజలున్ విశ్వంభరాచక్ర మే
నును సౌఖ్యోన్నతి నున్నవార మొకయందున్ లే వసాధ్యాంశముల్.
క. మీకుశలంబులు మీరలు, వాకొనఁగా వింటి మీదు వాత్సల్యమునం
జేకూడెను బనులన్నియు, లోకోత్తమ యున్నవెలుతులున్ సమకూరున్.
గీ. వెలితి నెఱిఁగింతుఁ బరలోకవిభవమెల్లఁ, బుత్రులయధీనమగుఁగాన పుత్రహీనుఁ
డెట్టిదరిఁజేరు నని యెంచి యేను మిమ్ము, శరణుఁజొచ్చితి నాలింపు కరుణ ననిన.
క. బలభేదితో బృహస్పతి, పలికినచందమున రాజ పరమేశ్వరితో
బలికె మృకండుతనూజుఁడు, జలచరగంభీరనినద సంరంభమునన్.
గీ. ఎంతపనియిది భూపాల యేలనింత, చింతిలఁగ రంగశాయి రక్షింపఁగలఁడు
వెన్న గలుగంగ నెయ్యేలవేడ నొకని, రమ్ము పోదము నేఁడు శ్రీరంగమునకు.
ఉ. పాయు నఘంబులన్నియును భద్రము లొక్కట సంభవించు ర
మ్మీ యవనీశ యంచుఁ దన యోలమునన్ హితమంత్రియుక్తుఁడై
యాయవనీశ్వరుండు వినయప్రియసూక్తుల వెంటరాఁగ రం
గాయతనంబు జేరి శిఖరావళి దర్శన మాచరింపుచున్.
సీ. అనఘ శ్రీరంగ మగుసరోజికి దాన యష్టదళపద్మ మగుచుఁ జంద్ర
పుష్కరిణి యెసంగుఁ బొలుచు రేకులరీతిఁ దీర్థముల్ కేసరితీర్థ మొప్పు
పావనదిశ నుత్తరావని నమరు కదంబతీర్థము మూలఁ దనరు నామ్ర
మనెడితీర్థంబు తూర్పున బిల్వతీర్థ మింపలర జంబూతీర్థ మనలదిశను
మీరు పాలాశతీర్థంబు దక్షిణమున, దెలియు మవనీసురాశనతీర్థ మొప్పు
నాగు పశ్చిమదిశను పున్నాగతీర్థ, మవియె నన తీర్థములు రంగభవనమునకు.
క. ఈమేరఁ తీర్థములలో, శ్రీమత్పుష్కరిణి సర్వశేఖరమగుచున్
దా మనుజుల తాపత్రయ, నామాదివ్యాధు లణఁచు నరవరతిలకా.
క. యోగులు భాగవతులు నిజ, యోగానలదగ్ధకర్ము లుందు రిచటఁ బు
న్నాగం బనుతీర్థము పు, న్నాగరజచ్ఛాయఁ గాంచనప్రభ లీలన్.
సీ. భార్గవమౌని తపంబుచే నుతికెక్కె కీర్తిఁ గైకొనియె సుకీర్తి విభుఁడు
తారకుఁడఁహ్వో నివారకుఁడై పొల్చి మిథిలాపతి మనోవ్యథ లడంచె
రుగ్మదృష్టిశరీరరోగముల్ దొలఁగించె కాశ్యపమౌని విఖ్యాతిఁ గాంచె
నగజాధిపతి బ్రహ్మహత్యబొ కడబెట్టె పూనిషణ్ముఖుఁడు సేనానియయ్యె
పుష్కరిణితక్కఁ దక్కిన బుణ్యతీర్థ, రాజములందు మొదటిపర్యాయములును
వకుళతీర్థంబుతో మునివ్రాతమెల్లఁ, దీర్థములు తొమ్మిదనుచుఁ గీర్తింపుచుండె.
గీ. తీర్థనాధారణముగఁ గీర్తింపనగునె, చంద్రపుష్కరిణి మహాసరసిఁ గాన
వేరె నవతీర్థముల్ నదుల్ వెండిసేయు, నేకవారాప్లవనమయహేతుకంబు.
క. ఇందులను బిల్వతీర్థ మ, మందమహామహిమములును మహనీయంబై
యిందును నందును కోరిక, లొందించు నృపాల దీని, నొకకథ వినుమా.
సీ. అనుచు మార్కండేయుఁ డనియె తొల్లి యవంతిజనపతి జనరథుం డనెడురాజు
కాంపిల్యపురము పాలింపుచు నతని ప్రధానులు పాషండు లైనకతన
నన్యాయముల కోర్చి యాగడంబులు చేసి యన్యదారాదుల నపహరించి
నగరును దిక్కు గానక మహీశుఁడు వారు జెప్పినట్టులు సేయు తప్పుకతన
పోయె వానలు పంట లేదాయె భువిని, హెచ్చె చోరాదిబాధలు విచ్చె పుణ్య
మెదిరె పాపంబు వ్యాధులు ముదిరె ప్రజకు, నుడిగె పాడియు శుభక్రియ లడఁగె నపుడు.
క. ఆయెడ ధరణీసురలు ప, లాయితులై పఱచి దోర్బలస్యబలారా
జా యనుట లేమి తమర, న్యాయమనుచు ధరణీసురలు నరచుచుఁ బోవన్.
ఉ. ఆనరనాథు రాజ్యము ననధ్యయనంబులు లేక యాగసం
తానము బీజమాత్రమయి నాకనుపించక ముఖ్యధర్మముల్
దానము ధర్మమున్ వ్రతవితానము నిర్వచనీయమై జనుల్
మైనవదండివెతల సమస్తశుభేతరులై చరింపఁగన్.
గీ. క్షుద్రాభూయిష్టమై యతిక్షుద్రకర్మ, ములను వర్ణాశ్రమంబులు గలిసి వావి
వర్తనలులేక ప్రజలెల్ల వర్తిలంగ, నట్టిపాపంబు భూపాలుఁ జుట్టుకొనియె.
క. ధరణీజన దురితంబుల, ధరణీశుఁడు మునుఁగ నతని తనయులు దినమున్
వరుస నొకఁడొకఁడుగా యమ, పురికిన్ సకుటుంబముగను బోయిరి వరుసన్.
మ. కచబంధంబులు వీడ గుబ్బలుపయిన్ గన్నీరు రాలంగ హా
రచయంబుల్ చెదరన్ గలస్వనగతుల్ రాయంగ నెమ్మేను లెం
తె చెమర్పన్ వదనంబు లెండ తనయార్తింబృంగి హాహారవ
ప్రచురాలాపములం మహిం బొరలి రార్హల్ విష్ణు కాంతామణుల్.
చ. కొడుకులు బోవ వెంబడినె కోడలుకొమ్మలు గూలి రందుకై
పడతులు గేహళీభవనపంక్తుల రోదన మాచరింపఁగా
యడలుచు భీతినొంది తనయాపద కడ్డమువచ్చువారి నే
యెడఁ గనలేక తా ధరణియేలిన మార్గము బుద్ధి నెన్నుచున్.
క. తనయట్టివాని కెక్కడి, తనవ్రాతంబు జనులు తల్లడగుడుపన్
బెనుపాపంబున ధారుణి, బెనుపంగా లేక యార్తిఁ బెనచితి నకటా.
క. అనుచుఁ దరిలేని చింతా, వననిధిలో మునిఁగి మిగుల వందురుచుండన్
జననాథు సుకృతవాసన, యనుభవమున కెదుకు కారుణాతిశయమునన్.
గీ. మును భరద్వాజమౌని భూములు జరించి, వచ్చె వాల్మీకియెడకును వాకొనంగ
విన్నవారిఁక దా యెట్టివేళ నతఁడు, జయరథుని పట్టణోపాంతసరణిఁ జనఁగ.
క. ఆతఱి శిష్యుఁడు తారకుఁ, డీతనికిఁ బురోహితుఁడు సహిష్ణువరేణ్యుం
డాతరి తనగురుచరణా, బ్జాతంబుల వ్రాలి పూజసలిపెన్ భక్తిన్.
క. పూజించి యొయ్యన భర, ద్వాజులతో తమనృపాలు వర్తనము నతం
డీజాడ నున్నతెరఁగున్, వ్యాజము గల్పించి మనుపవలయుట దెలిపెన్.
శా. తా నౌ గాకని యమ్మహీశ్వరుఁడు చెంతన్ శిష్యుఁడున్ రాగ ను
ద్యానశ్రేణులు జూచుచున్ జని భరద్వాజుండు వాల్మీకికిన్
మౌనిశ్రేష్ఠునకున్ జగద్గురునకున్ సాగిల్లి యీభూవరున్
దీనుంబ్రోవు కృపాసముద్ర యని యెంతేఁ బ్రార్థనల్ చేసినన్.
క. కరుణించి యతఁడు మును భూ, వరుపురమున నుండి వెడలి వచ్చినవారిన్
ధరణీశుఁ డలర రండని, పరువడి సభఁగూర్చి వినయభాషణుఁ డగుచున్.
గీ. రాజునకు నెందు నేరంబు రాదు గాని, కెలని వారలగుణదోషములను జేసి
పుణ్యపాపంబు లూరక ప్రోవువేసు, కుందు రింతియకా కాత్మమందు లగుచు.
గీ. భూమి నర్థంబు ధర్మంబు గామ మోక్ష, ములును రాజులచేఁ గాదె గలుగు టెల్ల
వానిపై మీరలలుగఁ నెవ్వారు దిక్కు, నేడు మాకొఱకు నితని మన్నింపవలయు.
క. మాకోపానల మితని పు, రాకృసుకృతములు కాష్టరాశిగ నెంచెన్
లేకునికి మీరు తత్పురి, యాకసము నిరస్తతార మగుగతి దోఁచెన్.
క. కోపంబు తడవు నిల్పిన, పాపం బది ధారుణీసుపర్వుల కెల్లన్
భూపాలుని దీవింపుడు, చేపట్టితి నితని ననిన శేషద్విజులన్.
గీ. మీయనుగ్రహంబె మైకొనునఁట యీతఁ, డెంక పుణ్యుఁ డఘము లెందు నుండు
మాకు ప్రమద మెచ్చు మను గాక సుఖియౌను, మీసుభాషితములు మేరగలవె.
మ. అనుచు న్వారలు వెంటరా నృపతితో నవ్వేళ వాల్మీకి వ
చ్చి నమోఘంబగు బిల్వతీర్థమున కా శ్రీమన్మహాభూరుహం
బునకున్ మ్రొక్కి మునీంద్రులెల్ల నలగా పుండ్రేక్షు కోదండ శిం
జికాఝంకరణంబు వీనుల బ్రఘోషింపన్ బ్రసన్నాత్ముఁడై.
క. వచ్చి యొకచాయ నెలకొన, నచ్చట నొకవింత బుట్టె నను మార్కండే
యోచ్చరీతము విని జయరథుఁ, డచ్చెరువున నెద్ది తెలుపుఁడన యడుగుటయున్.
సీ. విననచ్చె నాకాశవీథి నేధితసౌరవారాంగనా మురజారనములు
జడిబట్టికురిసె నప్పుడు పారిజాతమహామహిజాతలతాంతవృష్టి
తలఁజూపె సురఖి కోమలచారుశీతలచందనామలమరుత్కందరములు
మెచ్చొనరించె నాయచ్చరగాయనవల్లకీఘుమఘుమధ్వానసమితి
యంటివో యిట్టివనియని యట్టిజాడ, గ్రక్కున సనత్కుమారుఁ డాకస్మికముక
వచ్చె నచ్చటనుండి యావామలూరి, తనయుఁ డమ్మౌని గాంచి సంతసము నొందె.
క. తాను నతండును సమవి, జ్ఞానతపోయోగమతివిశారదు లగుటన్
మౌనీశ్వరు లిరువురు ప్రమ, దానూనాలింగనముల నమరుచుఁ బ్రీతిన్.
గీ. సమత బ్రసియనుఋష్యాశ్రమముననుండి, కుశలములదేరి యోగి బేర్కొని నమస్క
రించి యపుడు భరద్వాజుఁ డంచితోప, చారవినయోక్తు లమర బ్రశ్నంబు చేసి.
శా. పూవుం దట్టఁపువాన లేల గురిసెన్ బుణ్యంబు మాఱేనిపైఁ
దావ ల్గల్గెడు లేఁతతెమ్మెరలు శీతాళించనేలయ్య పై
త్రోవ న్మేషముతాటపాటలని యేతోయంబునం గల్గె మీ
రీవృత్తాంత మెఱుంగఁ బల్కుఁడన మౌనీంద్రుండు తా నిట్లనున్.
మ. ఒక గంధర్వుడు చిత్రకేశుఁ డసువాఁ డుర్వీస్థలిన్ బిల్వనా
మక తీర్థం బిది చూడగోర యరుదే మార్గంబునన్ దేవతా
శుకవేణీ సుమవర్ష గీత పననస్తోమానకధ్వానముల్
ప్రకటం బయ్యెననంగ యోగివరుతో బల్కెన్ భరద్వాజుఁడున్.
గీ. అయ్యా యేమిటి కీరాక యనిన నతఁడు, పంచమీవ్రత మీబిల్వ పద్మినీత
టంబునన్ జేయుననిన సేమం బదెట్లు, పంచమీవ్రత మెయ్యది బల్కుఁ డనిన.
సీ. ఆదిపాడ్యమి విదియ తదియ చవితి పంచమి షష్టి సప్త మష్టమి నవమియు
దశమి యేకాశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి యమావాస్య పౌర్ణము లనంగ
తిథులన్నిఁటిని వ్రతతిథు లుల్లసిల్లు నేడు పంచమిగావున ప్రకృతమనుట
గంధర్వుకథ దెల్పఁగానయ్యె శుక్లపక్షశ్రావణంబు పంచమినిగూడు
మార్గశీర్షంబు నోమంగవలయు బంచ, మీతిథి నుత్తరాభాద్రయందు
సోమవారంబునందైన శుక్లపక్ష, మొనరునపుడైన నో ముందు రుపవసించి.
క. ఈరెండుచతుర్థుల నొక, వారము భుజియించి మరుదివసమున నిరా
హారులయి యాలుమగఁడున్, శ్రీరంజిల బిల్వపూజ సేయఁగవలయున్.
క. మొదట నొకవేదియిడి యెని, మిదిదిక్కుల కలశము లెనిమిదియు నునిచి శుభ
ప్రదకాంచనాదికంబుల, నొదవినకలశంబు నడుమ మనుపఁగవలయున్.
గీ. వస్త్రములు కట్టి జలములువట్టి యందుఁ, దూర్యము ల్పద్మకేతకుల్ తులసిదళము
లర్కసుమకుందకుసుమకల్హారములును, వరుస నునుపంగవలము నుత్తరములందు.
క. ఫలములు ప్రత్యేకంబులు, కలశంబులు నిడి లవంగకర్షతితైలా
వళిసర్షపగోధూమం, బులు ముద్గయవాదు లునిచి మొదలింటిగతిన్.
గీ. బుద్ధి శక్తి సరస్వతి శ్రద్ధ లక్ష్మి, తుష్టి ధృతి పుష్టి యనెడు శక్తులు తదీయ
నామముఖవర్ణములకు సన్నలు వొసంగి, బలికి యావాహనము సేయవలయు వరుస.
గీ. అన్ని కుసుమము ల్ఫలావళియును, భాగ్యుగాధాన్యమధ్యకుంభమున నుంచి
యష్టశక్తిసమన్విత యైనయట్టి, పెంపు భావన చేసి శ్రీ బిలువవలయు.
క. శ్రీవనితన్ శ్రీబీజమ, హావరమంత్రమున నావహ మ్మొనరిచి యా
యావరణకలశశక్తులు, నావహమొనరింపఁదగు మహాకుంభమునన్.
క. ప్రత్యగ్రకలశములు తా, ప్రత్యేకము పూజఁదేసి ప్రాక్సుమములచే
ప్రత్యయమున శ్రీసూక్త, స్థిత్యారాధనము లక్ష్మి జేయఁగవలయున్.
క. కలవంటకములు దేరుగ, కలశములకు నడిమి పూర్ణకలశంబునకున్
గలవంటలెల్ల నిడఁగా, వలయున్ నైవేద్యములుధృవప్రార్థనలన్.
గీ. అన్నిమూర్తుల వెలయుమాయమ్మ లక్ష్మి, వ్రతము సువ్రత మొనరించివచ్చి మాకు
వరము లిమ్మని కోరిక ల్వరుసఁబలికి, యనవలయు విష్ణు మావాహయామి యనుచు.
క. హరితోడఁ గూడి మమ్ముం, గరుణింపుమటంచు నుతులు గావించి యలం
కరణములు చేసి ధరణీ, సురదంపతులకును దృప్తి సొంపు వహింపన్.
గీ. భోజనము లిడి నిర్జలంబుగ స్వభార్య, తోడ నుపవాస మొనరించి నాఁడురేయి
జాగరముచేసి యితరభాషణము లలక, మాని నా డెల్ల నోము నోమంగవలయు.
క. శ్రీరామకృష్ణలక్ష్మీ, నారాయణ యనెడునుతు లొనర్పుచు తనదే
వేరియుఁ దానును గురువి, ప్రారాధన మాచరింప నమరున్ షష్ఠిన్.
క. మేధన్ విప్రులకు సమా, రాధన మొనరించి సిదప బ్రాహ్మణతతిచే
సాధుక్రియ కలశాంబుల, చే ధరణీవిభుని స్నాతజేయఁగ వలయున్.
క. సేవించి తమరు పెద్దల, దీవెన లపుడంది యొసఁగు దీపనివాళుల్
భావించి వేదసాధుల, కీవలయు నభీష్టవస్తు వెసగిన కొలఁదిన్.
గీ. దంపతులు బిల్వవృక్షంబుదరిని నీడ, త్రొక్కక ప్రదక్షిణముగ మాలూరపండు
కాయ పిందెలుఁ గోయక గ్రములపత్తి, రింత గైకొని శిరసావహింపవలయు.
క. కలశంబులు నర్పించిన, ఫలములును ప్రసాదములను పత్తిరి బూజన్
కలయగ గైకొని దానం, బులు చేసినవెనుక తమరు భుజియింపఁదగున్.
గీ. వసుధ నీబిల్వపంచమీవ్రతము తమరు, సేయఁ గల్పోక్తములు లక్ష్మి బాయకుండు
కొదవగాఁజేయ రౌరవకూపములకు, నేగుదురు దీన సందేహ మింత వలదు.
క. ఆయుర్విద్యయుఁ దేజము, శ్రీయు మహారోగ్యభాగ్యచిరకల్యాణ
శ్రేయోమహిమంబులుగల, యీయాఖ్యానంబు వినిన నెవ్వరికైనన్.
ఉ. రావణ పాదకాంబుద హిరణ్యనిశాట లతాలవిత్ర సా
ళ్వావనిపాల శైలకులిశాయుధ శూరతదూలగర్వవి
ద్రావణ చైద్యభూవరదరప్రద బాణుభుజాపహార తా
రావర దర్పభంజన ఖరత్రిశరః పటుశౌర్యవారణా.
క. కారణశరీర సురముని, చారణ గంధర్వమానససరోవర సం
చారి మదహంసకంసవి, దారణ సంసారదూర తాపసలోలా.
స్రగ్విణి. బాహులేయాబ్జప్రాంతనానావనీ, వ్యూహకేళీపుళిందోత్తమగ్రామణీ
రాహుమస్తిచ్చిదారంభకారాగ్నిస, న్నాహదివ్యాస్త్రసన్నద్ధబాహాంచలా.
గద్య
ఇది శ్రీవేంకటశ్వర వరప్రసాదాపాదిత చాటుధారానిరాఘాట సరస చతుర్విధ
కవిత్వరచనాచమత్కార సకల విద్వజ్జనాధార కట్ట హరిదాసరాజగర్భాబ్ధి
చంంద్ర వరదరాజేంద్రప్రణీతంబైన గారుడపురాణశతాధ్యాయి
శ్రీరంగమాహాత్మ్యం బను మహాప్రబంధంబునందు
సప్తమాశ్వాసము