Jump to content

శ్రీరంగమాహాత్మ్యము/నవమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీరంగమాహాత్మ్యము

నవమాశ్వాసము

      శ్రీసదనాయతనయన సు
      ధాసాగరమధ్యభోగితల్పశయన దే
      వాసురచారణసిద్ధ మ
      హాసంయమిగేయ వేంకటాచలరాయా.
వ. అవధరింపు మిట్లు నాగదంతమహామునికి వ్యాసు లానతిచ్చిన తెఱంగు సూతుండు
      శౌనకాదుల నుద్దేశించి.
సీ. పురి కేగి జయరథభూపాలకుఁడు మున్ను తనవర్తనముఁ జూచి కినిసి రోసి
      విడిచిపోయిన మహీవిబుధులఁ బ్రార్థించి శ్రీకరలీల బహూకరించి
      యగ్రహారము లిచ్చి యాశ్రితకోటిగా మనుపుచు ధర్మవర్తనముచేత
      దనపురోహితుఁడు బల్కినజాడ మెలఁగుచు దొలుతటిలెక్క పుత్రకులఁ గాంచి
      పౌత్రులను జెంది పాడియఁ బంట కలిగి, జనులు సుఖమున రామరాజ్యము ననంగ
      పుణ్యములప్రోకయై తలంపున దలంచి, రంగపతిఁ గొల్వవచ్చె శ్రీరంగమునకు,
గీ. వచ్చి తాఁజూచినటుల బిల్వంబుచేత, రంగనాయకపూజాపరాయణులను
      మానసధ్యాననిరతులు నైన యతుల, లోన విలసిల్లు వాల్మీకిమౌనిఁ గాంచి.
క. అతనికి సాష్టాంగముగా, నతియొనరిచి తన్నుఁ బ్రోచిన భరద్వాజున్
      మతిఁ బూజించి పురోహితు, ననుమతి ననుపె భూప తెసగం బెసఁగన్.
ఉ. ఉంగరముల్ దుకూలములు నొల్లెలు జీరలు మార్లు జాళువా
      పొంగళు లెచ్చు చౌకటులపోగులు కుండలముల్ మురుంగులున్

      బంగరువ్రాతపట్టికల చాటిల రా మొలకట్లు దాయితుల్
      సంగడివిప్రకోటులకు సన్మునివాటుల కిచ్చె నచ్చటన్.
గీ. ఇచ్చఁ దనుఁ బ్రీతుగాఁ జేయు నృపుని గాంచి, సేమమే రాజ మరలివచ్చితి వదేమి
      యనిన నీకృప నోస్వామి యందఱమును, వసుధఁ బరిణామమున నున్నవార మిపుడు.
క. నినుఁ బూజ చేసి రంగము, గనుఁగొని శ్రీరంగనాయకస్వామిని నే
      మనసార గొలిచి రావలె, నని వచ్చితి ననిన మునియు నౌ గా కనుచున్.
గీ. చంద్రపుష్కరిణీసరస్నాతుఁ డైన, రాజు వెంబడి వచ్చి శ్రీరంగధామ
      మందిరము జొచ్చి గరుడునిమంటపంబు, మీరి యొయ్య విమానంబుఁ జేరె నపుడు.
క. భూమీశుఁ డపుడు కణ్వమ, హామునిఁ గనుఁకొనుచు వినతుఁడై మ్రొక్కిన యా
      భూమీపతి కాశీర్వా, దామలమంత్రాక్షతంబు లత డొసఁగుటయున్.
సీ. ఆరాజు మది ముదం బలరంగ నలరంగ మందిరమణిమయాళిందకనక
      పంజర శారికా పారావత మరాళ కేకినీ శుక ముఖోద్గీయమాన
      రంగరంగాతిసంరావకేళీతాండవములు జూచుచు ననవసరమగుట
      సేవింపదరిగాక శ్రీవిమానద్వారపాలకోపాంతభూభాగమునను
      రత్నకుట్టిమముల మౌనిరాజులెల్ల, కెలన వసియింప దానొక్కవలన నుండి
      కణ్వముని జూచి యుబుసుపోకలకు రాజు, పలికె వాల్మీకిమౌని చెంతల వినంగ.
క. ఈలోకు లెల్లవారున్, గాలమునకు వశ్యు లట్టి కాలము దానిన్
      గాలవశంబున బొందెడు, నేలా నీమర్మ మానతిమ్మని పలుకన్.
మ. గరిమన్ గణ్వమునీంద్రుఁ డిట్లను కళాకాష్ఠాముహూర్తంబులన్
      దిరుగన్ గాలము స్థావరంబుల సురల్ తిర్యఙ్మనుష్యావళుల్
      గెడయో కాలములోనివారలె త్రిలోకీభర్త శ్రీరంగభా
      గ్వరశయ్యాశయుఁ డీతఁ డొక్కఁడును కాలాధికుం డెన్నఁగన్.
క. ఈలీలన్ రంగేశుఁడు, కాలమునను గడచినతఁడు కాలాత్ముఁడు నౌ
      నాలింపు మనుఁడు నాలో, వేళాయెన్ సేవ కనుచు నెర నేకాంగుల్.
శా. తోమాలెల్ గొనిఁరాగ వెంబడి మునిస్తోమంబు రా రంగమా
      భూమీశోత్తముఁ డొయ్యఁజేరి యెదుటన్ భోగీంద్రతల్పున్ హరి
      శ్యామాంభోధరదేహు రంగనిభు శ్రీజానిన్ విలోకించి ధా
      త్రీమందార యనాథరక్షక జితంతే పుండరీకేక్షణా.
చ. తొణుకుకరళ్ళలో జలధి దోడొకరేనియు లేవనీ నకా
      రణముగ ముద్దుపాదము కరంబున గూర్చి ముఖంబు జేర్చి యా

      ఫణిసతి యల్లనాటి వటపత్రముగా శయనించు బాలకా
      స్రణివి గదయ్య రంగ ఖగరాజతురంగ భుజంగతల్పకా.
ఉ. తీర కవేరికన్నియ కదే విరజానది వాసుదేవుఁడున్
      వారలు మీరెకా పరమవాసము శ్రీతిరురంగమందిరం
      బౌర మిముం గనంగలిగె నంతియ చాలదె నేకృతార్ధుఁడన్
      నారసనేత్ర రంగ యని సన్నుతిఁ జేసి భజించె సన్నిధిన్.
క. ఆనందాశ్రులు కన్నుల, సోనలుగా నిండఁ బరవశుండై పులకల్
      మేనిఁడ మోడ్పుగరముల, తో నుండి బ్రపత్తిఁబూని దొలఁగని భక్తిన్.
క. తీర్థప్రసాదములు పురు, షార్థము లొనఁగూడ నంది యాశాస్యంబుల్
      ప్రార్థించి వెడలెఁ గోవెలఁ, బ్రార్థితమణిధనము లొసఁగి భాగవతులకున్.
గీ. కణ్వవాల్మీకిముఖ్యులఁ గ్రమముతోడ, నాశ్రమంబుల కనిచి వా రనుమతింప
      తనపురముఁ జేరువాఁడయి చనుచుఁగాంచె, సహ్యకాసైకతాంతరస్థలమునందు.
సీ. పగడంపుచాయ నొప్పగు దీర్ఘతుండంబు శింశుపాంకురరేఖ జెలఁగుగోళ్ళు
      తళతళల్ దులకించు తెలిమించుఱెక్కలు కాంచనప్రభ లీనుకంధరయును
      బర్హిణబర్హసంపద లీనుసోగలు నరుణారుణాంశుచూడాంచలంబు
      వైడూర్యసంకాశవర్తుల నేత్రంబు లున్నతహరీతవర్ణోదరంబు
      గలిగియును రూపనరవిహంగములగములు, గొలువ లేతకరళ్లఁ గలసివచ్చు
      కొదమతెమ్మెరబొడిఱెక్కగుంపుగదల, మలయుచున్నట్టి యొకపెద్దపులుఁగు గనియె.
శ్లో. అనంతానంతశయన పురాణ పురుషోత్తమ
      రంగవాడ జగన్నాథ నాథ తుభ్యం నమో నమః.
గీ. అనుచు జలదగంభీర మైనరావ, మెల్లదిక్కులు మారుఘూర్ణిల్లజేయు
      బలుకు నండజకులసార్వభౌము గాంచి, హితుఁడు నాప్తుఁడు నగుపురోహితున కనియె.
శా. కంటే యొక్కమహావిహంగ మిదిగో కావేరితీరంబునన్
      ఘంటారావమహావిరావమున రంగబ్రహ్మసంకీర్తనల్
      వింటే వీనులు చల్లగాఁగ బులినోర్విన్ లోకపాలావళీ
      లుంటాకత్వ మొనర్పుచున్నయది సుశ్లోకప్రసంగంబునన్.
ఆ. శాంతివనిగ్రహంబు చక్కదనంబుఁ బ్ర, సన్నభావమును సమున్నతముగ
      నున్న దీనిచెలువు కన్నులకును విందు, చేసె మఱియు నొకవిశేష మిపుడు.
క. ప్రతిపదరంగస్మరణం, బ్రతిపాద్యము లగుచుఁ బ్రమదబాష్పాంబువు ను
      ద్గతమగుచున్నది రమ్మని, క్షితిపతి మంత్రియును దాను చెంగటి కరిగెన్.

శా. చేరంగాజని తేరిచూచి విహగశ్రేష్ఠుండ వెవ్వాఁడ వా
      కారం బిట్టిదిగాని నీమధురవాక్యంబుల్ శ్రవోలంకృతుల్
      వీ రెవ్వారలు నిన్నుఁ జేరియును జీవశ్రేణిచందాన ను
      న్నారన్నన్ విని మందహాసమున భూనాథు న్విలోకింపుచున్.
క. ఎవ్వఁడనో యేను వీరలు, యెవ్వారలొ కొంద ఱేను నెఱుఁగననిన యే
      నెవ్వఁడనో వీరలందఱు, యెవ్వరొ యనఁ జెల్లునయ్య యెఱఁగక యడఁగన్.
సీ. అనిన నిక్కంబేని నవనిమాట నృపాల యేను నెఱుంగక యిట్టులంటి
      యేనెవ్వఁడనొ వీరలెవ్వరొ యన నేల వ్యర్థోక్తు లాడంగననిన రాజు
      వ్యర్థోక్తులన నెట్లు వచ్చు విశేషార్థ మరయవేడియకాదె యంటి ననిన
      పక్షి యిట్లను మంచిపలుకులే పలికితి పలుకు నర్థము నాకుఁ దెలియదనిన
      నామజాతులు వేరయ్యు నాకు నొండు, తెలియదనవచ్చునే యను తెలివిడైన
      బలుక నేననితలఁపు నాతలఁపు వేఱు, గాన నిట్లంటిననిన భూకాంతుఁ డనియె.
గీ. అండజాధీశ నీమాట నైన నాదు, జాతిభేదంబు లరయు నిశ్చయ మెఱింగి
      యెఱుఁగననఁ జెల్లదన నిట్టితెరఁగు లోక, సవ్యసాధారణము నాకు సమ్మతంబు.
క. పరమార్థంబే పల్కితి, ధరణీశ్వర యనిన నీదు తలఁపెట్టిది నా
      తెరఁగెట్టిదియో గాదను, వెఱవకు మెవ్వారు మనల విధ మేర్పరుపన్.
సీ. అనిన నీబుద్ధి మే లనఘ వివేకివి యాత్మస్వరూపంబె యడిగె దనిన
      యెందునేని విశేష మెఱుఁగ వేడినవార లడుగంగఁ దగుచోట నడుగవలము
      యన దేహధారుల మగుట నహంకృతి నిట్లంటి ననిన ధాత్రీశ్వరుండు
      దేవ యాచార్యుండ వీవు నీదుస్వరూప మానతిండని మ్రొక్కినంత నలరి
      పక్షి యిట్లను నీస్వరూపంబుఁ దెలుపు, మెవ్వఁడ వనంగఁ గేల్మోడ్చి యిందువంశ
      జాతుఁడ సుకీర్తిరథుఁడు మజ్జనకుఁ డేను, జయరథుండను నితఁ డాత్మసచివవరుఁడు.
ఉ. రంగముఁ జూడవచ్చు సుకరంబగు పుష్కరిణిన్ మునిగి శ్రీ
      రంగనివాసుఁ జిత్త మలరంగ భజించి పురంబుఁ జేరుచో
      ముంగిట పెన్నిధానమయి మ్రోలవసించు నినుం బతంగరా
      ట్పుంగవుఁ జూడఁగల్గె నిటఁ బొందిన మామకపుణ్యవాసనన్.
క. పేరెండకాకఁ బడు నరు, చేరువ నమృతంబుచెలమ చేకురుభంగిన్
      గారుణ్యాంబుధి నిను నీ, మేరం గనుఁగొంటి నెంత మేలొనగూరెన్.
మ. అన నోభూవర నీకు నొక్కటి రహస్యం బౌపురావృత్త మే
      వినుపింతున్ జలమెందు రాజులకు నేవెంటం బ్రశస్తంబుగా

      వున నీమాట యలంఘ్యనీయమని దేవున్ రంగధామున్ మనం
      బున భావించి నమస్కరించి విహగంబున్ జిత్రవాగ్వైఖరిన్.
సీ. ఆత్మ యానంద మవ్యయమకళంక మవ్యక్తంబు సత్య మనంత మాద్య
      మీప్రకృతి సత్తు హేయమనీయ మనిత్య మప్రాప్యంబు నిందితంబు
      జీవుఁడు బద్ధుఁ డస్థిరుఁ డాత్మ సుఖదుఃఖతుకర్మాదిసమేతుఁ డజ్ఞు
      డొడల నిత్యమశుద్ధిజడమస్తిరోమరక్తత్వగాత్మకము వ్యర్థస్వరూప
      మయ్యు నీమేనితో నాత్మ ప్రకృతి, ప్రకృతి యీశ్వరునంటి యేర్పరుప రాక
      పాలు నీరును గలసినపగిది నుండు, గావున నసత్తు సత్తని గానిపించు.
గీ. రూపు చెడక శుభాశుభరూప మైన, గర్మబీజంబు విశ్వలాంగలము నందు
      మొలుచు సంసారవృక్షము గలశరీరి, నావుబడి లేగయై కర్మమనుసరించు.
ఉ. ఎచ్చట నేమి హేతువుల నేక్రియ నెవ్వరిచేత నెప్పు డౌ
      నచ్చట నట్టి హేతువుల నాక్రియ లందఱిచేత నప్పు డౌ
      వొచ్చము లేదు కర్మఫల మొందక త్రోయగరాదు ధాతకున్
      పచ్చని చేలదాల్పు నిరపాయుఁడు రంగవినోది దక్కఁగన్.
గీ. ఇట్టి లీలావిభూతిచే నెసఁగుచున్న, శేషశాయికి విశ్వసృష్టిప్రణాశ
      నముల సంకల్పరూప మబ్జము జలంబు, నంటియును నంటనటు లుండు ననుచు బలికె.
క. శ్రీమద్రంగేశు మహో, ద్ధామున్ శ్రీరంగశబ్దతవినీలతనో
      స్వామిన్ మాంపాహీ యనన్, తా మఱియుం గన్ను విచ్చి తత్కథ పలుకున్.
గీ. ఎన్నిదుఃఖంబు లెన్నిపే ళ్ళేన్నితనువు, లెన్నివావులు భోగంబులెన్ని యంద
      ఱికిని దా తండ్రికొడు కిందఱికిని దొరయు, బంట నగుటెన్నిమారు లీబంధుతతికి.
క. ఈపాపాత్మతరంగము, తేపగ భవవార్థి దాటి తెఱఁగెఱుఁగనిచో
      భూపాల పాతకాంతర, మేపట్టున గలదె బ్రోవ నితరుఁడు గలడే.
సీ. అజ్ఞానతిమిదాపహరణాంబురుహబంధుఁ డపరిచ్యుతుండు కళ్యాణశీల
      తనుఁడు సర్వాధారమును సనాతనుఁడు పూర్ణుండును నణు వమృతుండు రంగ
      మందిరస్థాయి నేమము నొసఁగు నొక్కట కలుషంబు లణచుఁ బుష్కరిణియొకటి
      స్థలము రంగక్షేత్ర మిల నొక్కటియె తిరుకావేరియే నటుగాక కలదె
      కాన నిచ్చోట తరలిపోఁ గాళ్ళు రాక, యున్నవాఁడను నీవేడుటొకటి యస్మ
      దుత్తరం బొక్కటియునని దత్తరిలక, వినుము తెల్పెద నొకకథ జనవరేణ్య.
గీ. గర్గగోత్రోద్భవుఁడు ప్రభాకరుఁ డనంగ, యోగవిజ్ఞానసంపన్నుఁ డూర్ధ్వతేజుఁ
      డన్నియు నెఱింగి బహువిద్య లభ్యసించి, యాగమములెల్లఁ గావలెనని తలంచె.

క. ఈ యెన్నిక లధ్యాపకు, లే యే నెలవులు వసింతు రెచ్చటికైనన్
      బోయి చదువుచును ధార్మికుఁ, డాయన యిల యెల్లఁ దిరిగి యలయనిమదితోన్.
క. నియమవ్రతుఁ డభ్యస్తా, ద్యయనుఁడు నై మెలఁగుకతన నాయువు పెరిగెన్
      లయమందక యతఁ డాగమ, చయలాభము నొందలేక చలమున నొకచోన్.
సీ. అవనీశ యతఁడు విద్యాతురాణాన్నసుఖన్ననిద్రాయని కలదుగాన
      యాగమార్థము వార్థి యవగాహన మొనర్చ బాలికుండు దలంచులీల జపము
      దశవర్తనముల్ మరు దశనుఁడై యైదేండ్లు తా నిరాహారియై పూని యెన్ని
      సంవత్సరము లూర్పు సడలక యంగుష్ఠ మిల మోపి రెండుబాహులను జాచి
      అమరవిభుచేత విఘ్నంబు లపనయించి, తపము గావింప బహ్మరంధ్రంబునందు
      పొగలు వెడలెను పొగలపై నెగసె మంట, లభ్రయానంబులో గుడాకట్లు చెదర.
క. యోగీశ్వరతేజం బగు, యోగాసనల మల్లుకొని మహోద్ధతి నభమున్
      భూగోళము దిశలస్థలి, భాగములై తల్లడిల్లె పరితాపమునన్.
మ. అది యింద్రుం డెఱిఁగింప ధాత విని బ్రత్యక్షాకృతిన్ నిల్చి బె
      ట్టిదమైనట్టి భనత్తపోగ్నిఁబడి మాడెన్ విశ్వమే మెచ్చితిన్
      మది నీకోరిక లిత్తు వేడుమన నమ్మునీంద్రుఁ డబ్జాసనున్
      సదయాలోకునిఁ గాంచి కేల్మొగిచి యోసర్వేశ వాగ్వల్లభా.
క. ఆగమము లెల్ల నామది, లో గోరెదమనుచు నిలువ లోకేశ దయా
      సాగర కట్టడసేయుము, వాగేశ్వరుఁ డనియె వేగ నలుమొగములతోన్.
క. వెఱ్ఱివాఁడు తపంబును వేడబంబు, గట్టుకొని జీవరాశికి కడలువెట్టి
      నాదుసృష్టియు దెరచి తనంతమైన, యాగమంబులు సాధింతు వనితలంచి.
క. వేదములు వేదమయుఁడగు, శ్రీదయితుని మహిమ యొకటి చేఁజిక్కునని
      ర్వేదమున నంగలార్చుట, మీఁదటి మిక్కిలి తపింప మేలే నీకున్.
గీ. వరము లేవైన నిచ్చెద వలదు తపము, తనదుమేలున కుర్వి బాధల పొదల్చు
      వానిదియు నొక్కబ్రతుకెనా వనజభవుని, గాంచి భయభక్తితో ప్రభాకరుఁడు బలికె.
క. రావని యంటివి నిగమము, లేవెరవున దపముఁ జేసి యే గైకొందున్
      గావలయు విద్య లన విని, యావనజోద్భవుఁ డదృశ్యుఁడై తొలఁగుటయున్.
శా. సప్తాశ్వప్రతిమానతేజుఁ డతిభాస్వంతాంతరంగుండు సం
      తప్తాంగారకసన్నిభుండు నయి చిత్తం బాత్మవిత్తంబుగా
      సప్తాశ్వుల్ తనచుట్టు సూక్ష్మభయదజ్వాలావళిం గప్ప ను
      త్తప్తుండై తప మాచరించె భువనత్రాసంబుగా వెండియున్.

ఉ. క్రమ్మర వచ్చి ధాత ముని కట్టెదుఱన్ వసియిచి యక్కటా
      యెమ్మెల కాచరించెదవె యీతప ముర్వికి నెల్ల దాయవై
      సమ్మతమౌను మాకు నిది జాలును వేదములెల్ల రావనున్
      నమ్మకు నాదుమాట వినినన్ విన వెన్నడు దెల్పఁగాఁ దగున్.
గీ. ఆయువల్పులు మానవు లందుమీఁద, బుద్ధియును గొంచె మఘములు బుట్టినిల్లు
      కర్మవశ్యులు మీకు నాగమములకును, దలఁప నీ వూర కీరీతి దపము వలదు.
క. లోకంబులెల్ల గెలిచితి, వేకోరిక నెననిత్తు నేనని పలుకన్
      నాకేల కోర్కె లేటికి, లోకంబులు నిగమలాభలోపము లైనన్.
గీ. తపము సేయుటయును యసాధ్యంబు గలదె, తపముచే ముక్తి మొదలు దుస్తరము లెవ్వి
      కోరి నర్థంబు చేకొననేరకున్న, వాని తపమేల వ్యర్థజీవన మతండు.
క. నాతపముల నాతపముల, శీతలమును వాతములకుఁ జెదరక నిగమ
      వ్రాతము నేరుతు ననవిని, ధాతయు మునువచ్చు త్రోవఁ దప్పక జనియెన్.
చ. మరల తపం బొనర్చె రవిమండలచండతపానలప్రభా
      పరిధి నిరర్గళగ్రహితపద్మభవాండకరండజంబుగా
      సరసిజగర్భుఁ డాకసము చాడ్పున నిల్చి వచించె వచ్చినన్
      శరదముచాటున న్నిలిచి శస్త్రము లేచిన నింద్రజిత్తనన్.
శా. ఓరీ విప్రకులైకపాంసన కిరాతోద్యోగివై సృష్టి యి
      ట్లౌరా చీఁకటిగ్రమ్మఁజేసెదు తపం బీపాప మెందారు నీ
      కౌరా మానిసిదిండిహింసలకు లోనైనావు దుర్మార్గ నీ
      ప్రారంభం బొనఁగూడనేర దిది నిర్భాగ్యప్రయాసంబునన్.
గీ. అనిన నాకాశమటు చూచి యమ్మునీంద్రుఁ, డిట్లనియె నీదుచే వర మీయ గాక
      దూషణములకుఁ జొచ్చిన దోష మేమి, నీదులోనొచ్చె మారాడగాదు తనకు.
గీ. తపముచే మోక్ష మందంగ తపముచేత, పాపములు వాయుఁ దపముచే శ్రీపురాణ
      పురుషుఁడగు శౌరిబొడచూపబొరయుటెంత, వేదమును బొమ్ము నీమాట గాదు వినుము.
క. ఏనె సదాచారాత్ముఁడ, నేని శ్రుతుల్ నిజములయ్యెనేని యసత్యం
      బే నాడనేని తపమున, బూనిక నేరవేర్చువాఁడ బొమ్మని పలుకన్.
క. నలుమొగముల నమ్మాటకు, వెలవెలబారంగ ధాత విసువున జనియెన్
      గలకల నగుమొగమున ముని, తిలకము తపమాచరించె దినకరుఁ డలరన్.
శా. సూర్యోపాస్తి యొనర్చి కుండలధరున్ జ్యోతిర్మయున్ భాస్కరున్
      దిర్యగ్ స్థావర మాన వామర సముద్దీప్తున్ గిరీటాభు నం

      తర్యామిన్ నిగమాత్మకావయవుఁ బద్మప్రాణబంధున్ గ్రియా
      పర్యాయంబున జిత్తవీథి నిడి యప్పారుండు ఘోరంబుగన్.
క. తపమాచరించి పద్మిని, కపటపునిద్దురను కన్నుఁగవ మూయ దమిన్
      నిపుణుండై కలజనకిన, యపు డలరఁగఁజేయు దొర రయంబున వచ్చెన్.
గీ. తటదుద్వక్షుజనంబులు పెటలిపడఁగ, చిటిలిపడగాయు కట్టెండశిఖల కతన
      శరనిధులు వేడియనలంట పొరలిపొరలి, నిలకు డిగి సౌమ్యమూర్తియై నిలుచునంత.
క. భానునకు భక్తిని బృహ, ద్భానుం డెదిరికొనునట్ల ప్రణమిల్లి మహా
      మౌనీంద్రుఁ డుత్తమతపో, జ్ఞానాధికుఁ డెదుఱ నిల్చి సన్నుతిఁ జేసెన్.
సీ. సాష్టాంగములు విబుధారాఢ్యునకు నీకు సప్తాశ్వునకు నమస్కారశతము
      లలఘుకుండలకిరీటాధారికి బ్రణామార్చనల్ సకలాగమాత్మునకు
      శరణంబు ధృతశంఖచక్రసాధనునకు నంజలిబంధ మబ్జాప్తునకును
      నభివాదనము జగదవనవిహారికి మందేహవైరికి మంగళంబు
      కర్మసాక్షికి నతులభాస్కరున కర్ఘ్య, పాద్యములు సన్నుతులు లోకబాంధవునకు
      తిమిర తకు దండ మార్యమున కలరు, దోయిళులు దాసుఁడను నీకుఁ దోయజాప్త.
గీ. ననజబాంధవ నీపేరువాఁడ నే ప్ర, భాకరుండను నీవు ప్రభాకరుఁడవు
      తగ దుపేక్షింప నాగమదానమున గృ, తార్థుఁ జేయుమటన్న నయ్యర్కుఁ డనియె.
క. ఓపరమతపోధన కృత, పాపంబులు దీర రంగపతి గరుణించున్
      శ్రీపతికృప నాగమములు, నీపాల వసించు నన మునివరుం డనియెన్.
గీ. అయ్య పాపంబు లెందుల నణఁగుననివ, యజ్ఞదానతపంబుల నణఁగుననియె
      యజ్ఞదానతపంబు లె ట్లంటివేని, మానసము వాక్కు కాయ కర్మంబు లనియె.
క. భూతద్రోహవిపర్జిత, మై తనరున్ ద్రికరణంబు లనఘాత్మక రెం
      డై తోఁచుఁ జరాచరమై, భూతలమున దీర్థములు విభూతి దలిర్పన్.
గీ. జంగమము లైనతీర్థముల్ సత్పురుషులు, స్థావరము లైనతీర్థముల్ జగతి నుండు
      తలఁపు నిరువాగు లైనతీర్థములు గలవు, మంగళప్రద మైన శ్రీరంగమునకు.
గీ. మదిఁ దపస్సిద్ధివలతేని మౌనినాథ, యొక్కట సునేత్రుఁడనుపక్షి యున్నదచట
      దానిచే విద్య లొనఁగూడుగాని నీకు, నెందు నట్లున్న లేదది యెట్టులనిన.
సీ. అమ్మహాండజము విద్యార్థియై రంగేశు గొలిచి గైకొనియె నత్యలఘుమతిని
      బహుదినంబులనుండి పాయఁ డాతిరుపతి యనిన నేరీతిఁ బ్రత్యక్షమయ్యె
      రంగనాయకుఁ డేతెఱంగున పక్షికి నాగమంబు లొసంగె నానతిమ్ము
      నావిని యెందునైన మహాత్ములగువారి తనువులె చూచి యి ట్లనఁగరాదు.

      యోగు లేమేరనుండిన నుండగలరు, వలయుమేనులు దాల్తు నెవ్వరితరంబు
      కాదనఁగ నవ్విహంగంబు కననచింతు, నినుఁడనుచు భానుఁడనియె నమ్మునిగురించి.
మ. క్షితపాఖ్యుండగు మౌనిరా జెపుడు నక్లిష్టప్రచారుండు శి
      క్షితుఁడయ్యున్ దన కూరికే నిగమముల్ చేకూరఁగా గోరి శా
      శ్వతు రంగప్రభు నాత్మలోఁ దలఁచి ప్రాంచత్పుష్కరిణ్యాగ్ర మా
      నితపుణ్యాశ్రమభూమిఁ జేసె తప మెన్నేవర్షముల్ సుస్థితిన్.
గీ. తలకు లే కొకకొన్నివత్సరము లంబు, పర్ణపనసాశనతదూర్థ్వబాహుం డగుచు
      నటనిరాహారుఁడై కొన్నిహాయనంబు, లున్న క్లితపునిపైఁ గృపాయుక్తుఁ డగుచు.
సీ. జలధరశ్యామకోమలగాత్ర మిందిరాతరళకటాక్షవైఖరుల బ్రోవ
      దరహాసవదనచంద్రకళాకలాపంబు పాంచజన్యప్రభాపటలి బ్రోవ
      హారమాణిక్యకోటీరకుంతలరుచుల్ తనకరాంచలసుదర్శనము బ్రోవ
      కాంచనశాటికాచంచత్ప్రకాశంబు మేననున్న లతాంగి మిసిమి బ్రోవ
      నురము మృగనాభిశ్రీవత్సగరిమ బ్రోవ, చరణములు వైనతేయుహస్తములు బ్రోవ
      నధరము దయారసాలాపసుధను బ్రోవ, తాను మునిఁబ్రోవ శౌరి ప్రత్యక్షమయ్యె.
గీ. కాంచి యయ్యోగి రంగేశుమించి భక్తి, నెంచి బులకలు మేనవర్షించె నశ్రు
      లుంచి తత్పదములుమాడ్కి పెంచె ప్రమద, మెంచె తద్ధన్యత దృణీకరించె భవము.
క. దాసోహ మనుచు నంగ, న్యాసనమస్కరణుఁడై కృతాంజలికరుఁడై
      యాసంయమి శ్రీరంగని, వాసుని నుతియించె సజలవారిదధ్వనితోన్.
స్రగ్ధర. కనుఁగొంటిన్ రంగధాముం గలశజలధిరాటన్యకాపూర్ణకామున్
      వనదశ్యామాభిరామున్ వనజహితసతావార్యకళ్యాణధామున్
      బ్రణుతబ్రహ్మాదిధామున్ బహువిధదురితాపాదిదక్షోవిరామున్
      దినమాసద్యత్సహర్యేథితభువనమహాదేవతాసార్వభౌమున్.
సీ. శ్రీరంగధామ శ్రీమదాకారంబు వలయుఁ జూడఁగఁ జూట్కిగల ఫలంబు
      దీనమందార మీదివ్యాంఘ్రియుగ్మంబు పూజింపవలె గరాంభోజఫలము
      కావేరికానాథ మీవినూనమహాత్మ్యములు వినునటయె వీనుల ఫలంబు
      కమలానివాస మీకళ్యాణగుణములు ప్రకటింవపవలయు నాలుక ఫలంబు
      కమలజారాధ్య మీదుకైంకర్యములను, బూని మెలఁగంగవలయు నెమ్మేనిఫలము
      గాక యితరఫలాపేక్ష నాగదంత, వాదములు సాక్షి నేనవివాద మేల.
గీ. కెలన నిక్షేపరాసి తంగేటిజున్ను, ముంగిట సురద్రుమంబు ముంగొంగు పసిఁడి
      యింటిలో కామగవిఁ గనుఁగొంటి ననక, మనక నినుఁ గొల్వఁజనువాఁడు మనుజపశువు.

క. దేవా నిగమంబులు నా, భాసంబున గోచరింపఁ బ్రార్థించెద నా
      కీవే యానతి ననవుఁడు, కావేరీవరదుఁ డనియెఁ గరుణాపరుఁడై.
క. ఆగమములు వేకూడెడ, నాగతి వివరింతు నీకుఁ బ్రార్థింపు మదన్
      వాగంగన వేగం గొన, సాగునా గనవలయు నర్థజాలం బెల్లన్.
క. ఆవిద్యాశక్తియె వా, గ్దేవత భజియింపుమని యదృశ్యత నొందెన్
      దేవీధ్యాన మొనర్చి మ, హావైష్ణవుఁ డాతఁ డీశ్వరాజ్ఞాపరుఁ డై.
శా. దేవీధ్యానపరాయణుం డగుచు ధాత్రీదేవతామౌళి భ
      క్త్యావేశంబున గన్ను మోడ్చి నిముషం బంతర్ముఖాలోలుఁడై
      భావింపన్ జగదేకమాత కరుణాపారీణ వాగ్గేవి తా
      నావిర్భావముఁ బొంద బుష్పమయదివ్యద్దివ్యయానంబునన్.
సీ. తళుకుతళుక్కున సన్నచలువదువ్వలువతో దులకించు పట్టుకంచులికతోడ
      జారుకొప్పున పారిజాతమాలికలతో కమ్రనాసామౌక్తికంబుతోడ
      కర్పూరచందనాగవిలేపనంబుతో మగరాలతాటంకయుగముతోడ
      అంచమావులుదువాళించుపూదెెరవుతో చలువముత్యపుగుబ్బసరులతోడ
      రంగధామాంకగీతానురాగభసిత, వల్లకీయుతకకరపల్లవములతోడ
      కెలన గనికొల్చు తెరగంటి కలువకంటి, చాలుతో హరి యెదుట సాక్షాత్కరించె.
క. వీణాసరోజపుస్తక, పాణీ కమలభవురాణి బంభరగవేణీన్
      పాణీరితశుకవాణిన్, వాణిన్ గనుఁగొనుచు మౌనివరుఁ డిట్లనియెన్.
గీ. అమ్మహాదేవి పరమకళ్యాణి యెల్ల, దానములయందు విద్యాప్రధాన మధిక
      మంది లోభించె నీనాథుఁ డతనిదోష, మోసరింపుము నిగమంబు లొసఁగి నీవు.
క. రమణీమణి భార్యామూ, లమిదం పుణ్య మనువచనలక్షితవై యా
      గమదాన మొనర్పుము నీ, కొమరుఁడ కరుణింపుమనుచు కోరె వరంబున్.
మ. అన వాగ్దేవి మునీంద్ర పక్షు లివినా ల్గాత్మీయముల్ గంటివే
      చని సేవింపుము వెళ్లగాయునవి మాంసంబుల్ వడిన్ గోలు మీ
      వనఘం బైన విహంగరూపమున విప్రాకార మందంబుగా
      దెనయన్ వేదము లెల్ల నిన్నునని పోయెన్ శారదాదేవియున్.
గీ. శారదాంబాప్రసాదానుసారమైన, పక్షిరూపంబుతో క్లితపద్విజుండు
      చేరి నాలుగుపక్షుల శ్వేతనీల, లోహితశ్యామములను సుశ్లోకుఁ డతఁడు.
క. చేరినయంతనవిని యు, ద్గారించెన్ వివిధమాంసఖండము లవి యా
      హారించె విప్రపక్షియు, చేరెన్ సకలాగమములు చింతానుకృతిన్.

గీ. అన ప్రభాకరుఁ డో తిమిరాపహారి, యెవ్వ రాపక్షు లమ్మాంస మెద్ది యెట్లు
      వేదములు వచ్చె నితనికి నాదరమున, బలుకుమనుటయు గమలజబంధుఁ డనియె.
క. నిగమంబులు నాలుగు నా, ఖగములు వేదస్వరూపకము మాంసము నీ
      కగు నధికసిద్ధి యప్పులు, గగణితవేదములు నీకు నావేసించున్.
గీ. అనితిరోహితుఁడైన యయ్యవనిసురుఁడు, చంద్రపుష్కరిణీసరస్సవిధభూమి
      క్లితవుచెంతకు నరిగె పంకేజహితుఁడు, తనకు నానతియిచ్చుచందంబు దెల్పె.
క. క్లితవముని సునేత్రుండను, పతగంబై యున్నకతన బలికె నతనితో
      కృతపుణ్య ప్రభాకర వి, శ్రుతమై నీతలఁపు మదికి చోద్యం బరయన్.
గీ. ఆగదంబును నారంభ మవనిజనుఁడు, సేయఁబూనిన విరివిగాఁ జేయవలయు
      దొడ్డయత్నంబు పూనితి వడ్డు లేక , స్వామి నారాధనము సేయవలయు నీవు.
క. పాపంబులెల్లఁ దొలఁగి మ, హాపుణ్యము లెల్లఁ జేరు నవసర మయ్యెన్
      నీపాలగలఁడు రంగమ, హాపేరిటిభూషణంబు హరి యని పలుకన్.
క. పుష్కరిణి సరసిభావన, పుష్కరముల నీగి హృదయము వికాసముగా
      పుష్పరనిభగాత్రునినిన్, బుష్కరలోచనునిఁ గూర్చి భూసురుఁ డనియెన్.
ఉ. పండినయట్టి డెందమున భక్తివిధేయుని రంగనాయకున్
      పాండురకౌస్తుభాభరణుఁ బాయక నిల్పి తపం బొనర్ప నా
      ఖండలముఖ్యులౌ సురనికాయము మిన్నెడుమీడు కొల్చిరా
      వెండి వియచ్చరీపణవవేణుమృదంగవిరావ మొప్పఁగన్.
సీ. ఒకకన్ను రవిపుట్టువుగ బాల్పడఁగ నొక్కకర శస్త్రమాతపస్ఫురణనింప
      నొకచూపు చందమామకుతల్లిగా నొకకేళిచందము చంద్రికాళి బెనుప
      నొకజపాదము వియన్నదికి బుట్టిల్లుగా నొకదయ జలరాసి నొకటి బెనుప
      నొకయంఘ్రి నిగమశీర్షకలాపమై మించు నొకకృప క్షమజల నూరడింప
      బుష్కరిణిమీఁద ఛాయన భూతపర్వ, విగ్రహుండైన దైతేయనిగ్రహుండు
      రంగపతి పక్షిరాజతురంగుఁ డగుచు, నలప్రభాకరునెదుఱఁ బ్రత్యక్షమయ్యె.
లయగ్రాహి. దండము సమస్తజగదండభరణాధిక పి
                  చండిలశరీరునకు దండము నిశాటో
      ద్దండభుజశౌర్యవనమండలకృశానునకు
                  దండము జగత్పతికి దండము సకృన్మా
      ర్తాండరమణీయతరమండలనివాసునకు
                  దండము దయానిధికి దండము భుజంగా

      ఖండలశయానునకు దండము విమానవర
                  మండనునకున్ హరికి దండ మిదె నీకున్.
క. సేవింపక నిను మదిలో, భావింపక నీదు పాదపద్మము లెందున్
      సేవింతుమనుచు నెంచక, యేవగ నెవ్వాఁడు ముక్తి కేగు ననంతా.
క. నీవే నిగమము లన్నియు, నావేదములెల్ల నెన్ని యభినుతి సేయున్
      దేవా శ్రీవల్లభ దయ, నీవే నీవేదములు నిజేకాంతనిధీ.
గీ. అనిన చిఱునవ్వు నవ్వి శేషాంగశాయి, అటుల నీకొనఁగూడునా నాగమములు
      శక్తి యాయువు బుద్ధి కొంచెంబు నరుల, కఘము లణఁగక రావు నీ కాగమములు.
గీ. నీకు నఘములు వాయు సునేత్రుచేతఁ, గలుగు నిగమంబులెల్ల నాఖగవతంసుఁ
      జేరి నామాట లీవు వచించు మచటి, కేగుమని రంగశాయి యదృశ్యుఁ డయ్యె.
క. పోయె ప్రభాకరుఁ డచటికి, నాయండజయోగి యపుడు నమ్మునివరుచే
      నాయర్థమెల్ల విని రం, గాయతనము నెడలి పుష్కరావలిఁ జేరెన్.
గీ. మొదట సంకల్పములు జెప్పి ముసలిబాతు, బాపనయ్య మునింగి దే పాపమెల్ల
      బాసి తా నుపదేశించె పావనాత్ముఁ, జేసెను ప్రభాకరుని రంగవాసుకరుణ.
క. వేదములన్నియు మదిలో, బాదుకొనన్ దాఁ గృతార్థభావనుఁ డయ్యెన్
      వేదార్థ యనుచు సజ్జను, లాదిం బలుకంగవింటి నవనీనాథా.
సీ. ఆప్రభాకరుఁడును హతశేషకల్మషుఁడై పుష్కరిణీతీర్ధ మాడు కతన
      యాగమంబులు నేర్చి హరియందు సాయుజ్యపదవి నొందె సునేత్రపక్షి యటుల
      కైవల్యమున కేగె నావిహగోత్తమునుత నిర్విశేషశిష్యులమునన సు
      వర్ణబిందుండను వరతామ్రచూడుఁడు ఘనబృహన్మతులు నా గడఁగువారు
      ననను నాపేరు సుదర్శనుఁ డటండ్రు, నలుగురికి నేర్పె నిగమముల్ నాల్గు నతఁడు
      వెలసె శాఖలు మన్నాములనెడినాల్గు, దాచ నిఁక నేల యేతదర్థంబు వినుము.
క. ఆచార్యుఁ డున్నయటులనె, వాచంయమి సుతులమయ్యు వరవిహగాకా
      రాచారరతుల మైతిమి, మాచే నధ్యయనవాంఛ మౌనికుమారుల్.
శా. నానారూపనిహంగమాకృతుల నున్నా రిద్దఱం జూచితే
      భూనాథోత్తమ యోగనిద్రను జగంబుల్ బ్రోచు రంగేశ్వరున్
      ధ్యానారూఢి భజింపుచున్ నిరతమున్ దత్తుణ్యతీర్థస్థలం
      బానందంబున బాయలేక పరలోకాపేక్ష స్వేచ్ఛారతిన్.
క. మఱికలదే యెందే నిహ, పరసౌఖ్యము లాత్మఁ గోరు భాగవతుల కా
      దరు దెందు రంగనాయక, చరణమె శరణంబుగాక జగతీనాథా.

క. ఈతరుగుల్కలతాదులు, నీతీరవనాంతరాళమృగకీటఖగ
      వ్రాతములై సురచారణ, జాతము మోక్షార్థులగుచుఁ జనియింతు రిలన్.
క. నినుఁబోలు పగమధార్మిక, మనుజేంద్రులు ధరణి యేల మాదృశులకు నె
      ల్లను యోగతపోనిష్ఠలు, కొనసాగుచు నున్నయవి యకుంఠితలీలన్.
క. ఓగుణసాగర భగవ, ద్భాగవతాచార్య కృప నపారధరిత్రీ
      భాగము పాలింపుము పున, రాగమ మయ్యెడుమటంచు నన విని యంతన్.
క. విహగోత్తమునకు జాగిలి, మహిపతి నిజపురికి నరిగె మంత్రియు దానున్
      మహనీయరథముపై తను, బహుసైన్యము గొలున నవనిఁ బాలించె ననన్.
క. యాగములు చేసి సముచిత, భోగంబులు నందవలయు పుత్రులఁగని భూ
      భాగంబు లొసఁగి వారికి, యోగంబున విష్ణులోకయోగము గాంచెన్.
గీ. కానఁ బుష్కరిణీనదీస్నానవిధులు, మోక్షలక్ష్మీసమాశయమూలకార
      ణములు తీర్థములను గ్రుంకి కమలనేత్రు, రంగపతిఁ గొల్చి కామితార్థములు గనుము.
క. అని పుత్రకాముకుండగు, మనుజేంద్రున కానతిచ్చి మార్కండేయుం
      డును జనియె నపుడు హేమక, జనపతి శ్రీరంగవిభుని సన్నిధి కరిగెన్.
సీ. అమృతాంశుమూర్తిపై నంకంబు పొంకంబు బెరకు పన్నగశయ్య నొరగువాని
      చాచియుఁ జూపని జరణపద్మంబులు కమలలేదొడలపై నమరువాని
      ముఖచంద్రమండలసఖి చంద్రికయనంగ సెలవుల చిరునవ్వు చిలుకువాని
      తలగడచాచిన దక్షిణహస్తమౌ నభయదానాభినయంబువాని
      వలుదమణులయనర్ఘ్యకుండలకిరీట, తారహారాంగదప్రభాతతులవాని
      దివ్యమంగళవిగ్రహు భవ్యతేజు, రంగనాయకుఁ గోర్కెలూరంగఁ గనియె.
క. పొడగని తనపై మిగిలిన, తొడవులు దోపొసఁగి మ్రొక్కుతోయములగు బ
      ట్మడుపులపరాధకానిక, లెడపక యర్పించి పొగడె హేమకుఁ డంతన్.
ఉ. రావణసోదరాసురకరప్రపాదిత మైన దుర్గమె
      యావరణాంతరప్రణవహవ్యకరుండని గుప్తమైశ్రితా
      శీవిషమౌ నిధానమిది చేకొనఁగంటిమి మంటిమంచు వే
      రావలె నిన్ను కొల్వఁగ ధరాజనులందఱు రంగమందిరా.
ఉ. ఆపదనొందునో జ్వరభరామయపీడలు జేరనేర్చునో
      పాపము లంటునో గతశుభక్రియ లామట నిల్చునో మన
      స్తాపము గల్గునో పరమధార్మికులై భవదంఘ్రియుగ్మముల్
      చూపులనానువారలకు శోభనదాయక రంగనాయకా.

గీ. దేవ పుత్రార్థినై నీదు తిరువడిఘంబు, శరణు జొచ్చితి జన్మంబు సఫలమయ్యె
      కోర్కు లీడేర్పు మన నెంత కొంగుముడిగ, గల్గునన్నట్లు దక్షిణగౌళి బలికె.
క. విని సన్నిధివారలు న, జ్జనపతియును నలరి తత్ప్రసాదము గొని సే
      నలు దాను పురికి నరిగెన్, గలిగిరి తనయులు నృపాలకశ్రేష్ఠునకున్.
గీ. జ్యేష్ఠతనయుని రాజ్యాభిషిక్తుఁ జేసి, పెక్కుబుద్ధులు బల్కి తానొక్కరుండు
      బంధములు వాసి రంగేశు పట్టణంబుఁ, జేరి కొన్నాళ్ళు మోక్షలక్ష్మిని వరించె.
సీ. విను నాగదంత పావనమైనయట్టి యీయితిహాస మేనరు లేని వినిన
      జదివిన వ్రాసిన సకలభోగంబులు గుణవిమోచనము కారణము సుకృత
      తరుణీసుతావాసధనధాన్యపశువస్తువాహనలబ్ధియు వైరిజయము
      దుస్స్వప్నశాంతి బంధుసమాగమము నాయురారోగ్యభాగ్యంబు లచలలక్ష్మి
      నిత్యమంగళములు రామణీయవిభవ, మఖిలసంతోషములు కామితార్థఫలము
      లంది పిమ్మట రంగమందిరాంఘ్రి, సారసరసప్రభావులై మీరగలరు.
క. అని వ్యాసు లానతిచ్చిన, యనువున సూతుండు శౌనకాదిమునులతో
      వినుపించిన నవ్వలికథ, వినవేడుక యయ్యె ననిన వినుడని పలికెన్.
శా. కళ్యాణార్థివినోదిఖండితమహాకాలాగ్రకోదండ కౌ
      సల్యాజాకరమౌక్తికామరమునీశశ్రేణికాజన్మసా
      ఫల్యాకారధురీణ మౌనివరశాపప్రాప్తపాషాణతా
      హల్యానూత్నపునర్భవీకరణపాదాంభోజరేణుప్రజా.
క. శేషాచలనాయక పు, త్రీషణదారీషకనకరేషణదూరా
      న్వేషితపదాబ్ద త్రిభువన, పోషణతత్పర వినమ్రపుణ్యప్రవరా.
సుగంధి. ఆదితేయ పాకశాసనాబ్జభూతి వామదే
      వాది మౌళిరత్న భాసురాంఘ్రివారిజద్వయీ
      నాద బిందుసత్కళాసనాథ యోగయోగిహృ
      త్పాదదుర్లభప్రకర్షవర్ణితాత్మనిగ్రహా.

గద్యము
ఇది శ్రీవేంకటేశ్వరవరప్రసాదాసాదితచాటుధారానిరాఘాటసరసచతుర్విధ
కవిత్వరచనాచమత్కార సకలవిద్వజ్జనాధార కట్టహరిదాసరాజగర్భాబ్ధి
చంద్రవరదరాజేంద్రప్రణీతం బైన గారుడపురాణశతాధ్యాయి
శ్రీరంగమాహాత్మ్యం బను మహాప్రబంధంబునందు
నవమాశ్వాసము