శ్రీనివాసవిలాససేవధి/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీనివాసవిలాససేవధి

షష్ఠాశ్వాసము


శ్రీనివాసగిరీంద్ర శిఖరాళిసాంద్ర
మానితమణిరూప మహితప్రదీప
క్షీరాంబుధితరంగశీకరార్ద్రాంగ
సారలీలాదక్ష సదయకటాక్ష
మధుకైటభనిరాస మంజుళహాస
మధురేశబలశౌర్యమథనచాతుర్య
రక్షితాఖిలలోక రాజితశ్లోక
కుక్షిలక్ష్యాంభోజ గోవిందరాజ
అవధారు సూతుఁడి ట్లమ్మునీంద్రులకు
భువనపుణ్యచరిత్రమును దెల్పి మఱియు.10

భవిష్యత్కథలు

ఇల భవిష్యత్కథ లింపుగాఁ దెల్పఁ
దలఁచి యద్భుతరీతిఁ దనర నిట్లనియె
వినుఁడు సంయములార వేంకటేశ్వరుఁడు
వనజాలయప్రాణవల్లభుం డగుచు
విహరింపుచును భక్తవితతిఁ బ్రోచుచును
బహుమహాయుగము లిబ్భంగి నుండంగ

కలియుగారంభమునఁ గలివిజృంభణము

నిజపురానంకల్ప నిర్నీతసరణి
భజియించి కలియుగప్రారంభమునను
కలిపురుషుఁడు మహోగ్రత మీఱవచ్చి
బలియుఁడై గదకేలఁ బట్టి ధర్మ మను 20


వృషభంబును ద్రిపాదవికలంబు చేసి
రుష నొక్కపాదమున్ రూపరునట్లు
వెదకి సత్యముఁ ద్రుంచి వినయంబు నొంచి
మొదల వర్ణాశ్రమములసార మడఁచి
శ్రౌతసంస్కృతుల నుత్సవరీతిఁ దుడిచి
భ్రాంతిజన్నముల డంభమున మ్రగ్గించి
యాదివర్ణోచితం బంత మొందించి
వేదజాతంబు నిర్వీర్యం బొనర్చి
జపతపోనిష్ఠల సవరుబోఁ జవరి
విపులాశ విప్రధీవిభవంబు చిదిమి 30
గురురూపధారియై కొందఱి జెఱిచి
గురుల నహంకార కుహనాప్తి నలిచి
దేవతానిజశక్తిఁ దెగటార్చి క్షుద్ర
దైవతశక్తి నెంతయు నిరూపించి
దానాదికములెల్ల తామసంబులుగఁ
బూనించి యన్నియుఁ బొల్లుఁగావించి
యాయువు మతి బలం బటు కొంచపరచి
పాయని మోహంబు ప్రబలించి యిటుల
బహువైపరీత్యంబుఁ బాటిల్లఁ జేసి
మహిమ నత్యుద్ధతి మదమునఁ దనరు 40
నంతట శ్రీవేంకటాచలరమణుఁ
డంతరంగంబున నంతయుఁ దెలిసి
తా నొసంగినయట్టి తదధికారంబు
మానుపరామి ని మ్మహి జీవకోటి
నల కలి హింసంచునది తాళరామి


వెంకటరమణుఁ డర్చావతారము, శేషాచలము ప్రాకృతగిరి యగుట

తలఁచి తా నర్చావతారమై నిల్చి
మాయచే దివ్యవిమానంబు మరుగు
సేయుచుఁ దా నుండు శేషాచలంబు
శ్రీకరాకృతి మాటుసేసి లోకులకు
ప్రాకృతగిరియట్ల భాసిల్లఁజేయు. 50
అచ్చటి దివ్యరత్నావళు లెల్ల
నిచ్చలు మానుషనిచయంబులకును
పనికిరానట్టి యీ పలుగురా ళ్లనగ
కనుపట్టుచుండు న క్కాంచనచ్ఛటలు
మృత్సావిశేషసమ్మితముగాఁ దోచు
వాత్సల్యనిధియైన వనజాక్షుఁ డప్పుడు
కలిదోషదగ్ధులు కడతేరునట్ల

భక్తిఁ గలిగించుటకై మహిమలను జూపుట

తలఁచి యా జనులకుఁ దనయందు భక్తి
కలిగించు నొకకొంత గనుపించు మహిమ
కలలఁ బత్యక్షమై కనుపట్టుచుండు. 60
ఆవేశముల కొంత అల్పజ్ఞులకును
భావికార్యము దెల్పు భక్తి బుట్టంగ
కొందఱికిని మది కోరినర్థములు
పొందుగా నొసఁగు నద్భుత ముద్భవిల్ల
తనకుఁ గానుక యింత తగనిండు మీకుఁ
దనయు లారోగ్యంబు ధనము గల్గింతు
ననుచు బేరములాడు నట్ల గావించు
జనులకు నిటు నిదర్శనములు చూపు


పలికి తప్పినవారిఁ బట్టి దండించు
నిలుకడ భయమును నెమ్మఁ బుట్టించు. 70
తను భజించు మటంచు తన కొండఁ జేర
తన లీలచేఁ బిల్చి ధన్యులఁ జేయు
మిక్కిలి యాపదల్ మేకొల్పి తనకు
మ్రొక్కిన నది దీర్చు ముదము రంజిల్ల
దేవమునీంద్రులు దెలియరానట్టి
దేవాదిదేవుండు దీనవత్సలత
ఖలుల కజ్ఞానాంధకారమగ్నులకు
కలుషయుక్తులకు సంకరజాతులకును
నాస్తికులకును జ్ఞానంబు సద్భక్తి
యాస్తిక్యమును కల్గునట్లుగాఁ దానె 80
వివిధయత్నములు గావించి రక్షించు
భువనపావనలీలఁ బురుషోత్తముండు
అపు డట్టి శ్రీవేంకటాచలేశ్వరుని
విపరీతకలియుగవేళలయందు
జ్ఞానహీనులె యైన సకలజంతువులు
దీనులు రుగ్గులున్ దృప్తులు జడులు
విప్రులు రాజన్యవిట్ఛూద్రజనులు
నప్రబుద్ధకిరాతయవనబర్బరులు
శకపుళిందాభీర శబరనిషాద
నికరముల్ మొదలుగా నిఖిలలోకులును 90
సేవించి కోరికల్ చేకొని లోక
పావనులై పుణ్యపదవిఁ జెందుదురు
కృతయుగాదులయందుఁ గేవలనిష్ఠ


క్రతువులు తపము యోగంబులు సల్సి
బహుజన్మములయందుఁ బ్రాపింపరాని
మహిత పుణ్యఫలంబు మనుజు లందఱును
కలియుగంబునను వేంకటనగాధ్యక్షుఁ
గొలిచి శీఘ్రంబుగాఁ గోరికల్ జెంది
యమరులు యోగీంద్రు లందలేనట్టి
విమలపదం బొంది వెలయఁ జాలుదురు. 100
జగతిఁ గావున కలి సాధు వనంగ
పొగడొందెఁ గలియుగంబు ముకుందుకరుణ
నావేంకటేశ్వరుఁ డర్చావతార
భావితమూర్తిప్రభావంబు మెఱయ
సాక్షాద్భవించి యా స్వామిపుష్కరిణి
దక్షిణతటభూమిఁ దనరెడి నొక్క
ఘనవనస్పతిక్రిందఁ గమనీయకుంజ
మున రమాదేవితో మురియుచు నుండు

వసుండను నిషాదునికధ
అప్పు డందొక వసుండను నిషాదుండు
చొప్పడు తన పూర్వసుకృతంబుకతన 110
స్థిరభక్తి నద్దేవుఁ జేరి సేవించి
నిరతంబు చిత్రయ న్నెలతతోఁ గూడ
చేరికె నొక కొఱ్ఱచేను గావించి
ధీరుఁడై మృగములు దిననీక కాచి
ముదిరిన యెన్నులు మును దీసితీసి
యది పిండి యొనరించి యలరుతేనియలు
బోసి మర్దించి యా బోనంబు శ్రీని


వాసుల కర్పించి వనితయుఁ దాను
నదె భుజింపుచు నితరాహార మేమి
మదిఁ గోర కీ నియమంబునఁ గొన్ని 120
దినము లుండంగ నద్దేవునికరుణ
ననుపమహరిభక్తుఁడగు తనయుండు
కలిగిన న చ్చెంచు కలికి యా బాలు
నెలమిఁ బ్రోచుచునుండునెడ నొక్కనాడు
ఆ నిషాదుఁడు తన యారేండ్లచిఱుతఁ
జేనికావలియుంచి చెలువయుఁ దాను
తేనె పొలము బోయి తిరిగి యందందు
పూని యొక్కె డ చేరఁబోరానియట్టి
చరిపణఁకున గొప్ప జలదంబుపగిది
తరచు తేనియబొట్లు ధరఁ జిల్గ్కు తెట్టెఁ 130
కనుఁగొని చింతించి కాంక్ష రెట్టింప
మనమున ని య్యాస మానంగ లేక
కలకంఠి కంటె యెక్కడ నెక్కరాని
బలుచరి నీ తేనె పదినూరు తాట్ల(ళ్ళ)
పొడవున నున్న దిప్పుడు దీనిఁ దీసి
వడిచి యా నల్లదేవర కారగింపు
చేసిన భాగ్యంబు చేకురుగాదె
వాసిగా నది తీయ వశము గా దేమి
సేయుదు నేలాగు చేకొందు దీని
పాయక చేరు నుపాయ మే మనిన. 140
చెలి తన నాథుని చిత్తం బెఱింగి
బలుచింత యేమింత ప్రాణేశ నన్ను


తీగెయుట్టిని బెట్టి దించిన నేనె
వేగిరం బా తేనె వితపోక తీసి
తెచ్చెద ననుఁ డట్టి తెరవ పల్కులకు
మెచ్చి కౌఁగిటఁ జేర్చి మీఁదికి నెక్కి
గట్టితీగలు దీసి కడు వడి నుట్టి
గట్టి బల్ నిడివిపగ్గముఁ బూన్చి యందుఁ
గలకంఠి నుంచి చుల్కని సిద్దె మొలను
బలునార సంధించి పౌజు కట్టియలు 150
మొనరాతఁ బొడిచి సొంపున దహజ్వాల
ననువుగాఁ దవిలించి యవి చేతి కిచ్చి
సరఘలవాక ట్టెసగుమందు జమిరి
సరగ నేర్పుననె దించగ నించుబోణి
యా తేనెపెర చెంత నళుకక నిల్చి
చేతి పౌజున నింత సెగఁ జూపినంత
జుమ్మని మక్షికల్ సుడివడి రేగి
కొమ్మ నంటగలేక కొమ్మల మీఁది
మర్కటంబుల నంటి మరిమరి మీట
మర్కటంబులు నటు మాటికి దాటి 160
కిచకిచమని పం డ్లిగిల్చి కోపమున
నచటి భల్లుకముల నదరంట గరవ
నదరిపాటున భల్లుకావళి రేగి
పొదదూరి యలుక బెబ్బులుల మొత్తంగ
పులులు బల్ నిదుర మబ్బున చెలరేగి
పులిపులిగాగఁ గార్పోతులఁ జదుపఁ
గార్పోతు లదరి బాకరమంచు మిగుల


నార్పుచు కొమ్ముల నడవియేనుగుల
గొట్టంగ నవి బెట్టుఘూర్ణిల్లి కేల
బట్టు ఖడ్గాళిని బరిమార్చ నవియు 170
శరభంబులను జీల్చి చక్కాడ బెదరి
శరభంబుట్టలును సింహసంతతిఁ బొడువ
సింగంబులు కలంగి చిడుముడి కినుక
బొంగఁగ వనమృగంబులు దెబ్బటించ
మొనసి కోలాహలంబుగ సత్వములకు
ఘనమైన మధుబిందు కలహంబు గలుగ
చాన యల్లనఁ జేరి చక్కని చూర
తేనెతెట్టియ చీరి ధృతి నేర్పుమీరి
బలుసిద్దెలనునించి పగ్గంబు సైఁగ
చెలఁగ పై కదలించ చెంచు భావించి 180
చెలి చేఁదుకొనుతఱి చేర్చి యుల్లాస
మలర కావడిఁగట్టి యతివ కిట్లనును
పొద్దుపోయెను కొమ్మ పొదమె దేవరకు
నెద్దియు నైవేద్య మిడు వేళ దప్పె
నేమి యయ్యెనొ చేను నెఱుఁగని బాలుఁ
డేమరియుండునో యిపుడు పోవలయు
నని హుటాహుటి రాగ నాలోన బాలుఁ
డనువుగా ముదిరిన య య్యెన్నులెల్ల
తిగిచి యగ్గినిఁ గాచి దివుటనఁ బిసికి
తగుభక్తి వేంకటాధ్యక్షు భావించి 190


యా తండులము లుపహారం బొనర్ప
ప్రీతి మీరగ నందు శ్రీనివాసుండు
నట్టి నైవేద్యంబు నారగించుటయు
దిట్టయై బాలుఁ డాదేవుని కెఱఁగి
హరినివేదితశేష మటఁ దా భుజించి
హరిని కీర్తింపుచు నాడుచుండంగ
నంత నా చెంచువాఁ డరుదెంచి యెన్ను
లెంతయుఁ దిలకించి యా బాలుఁ జూచి
యోరి దురాచార యుబికి యీ యెన్ను
లారూఢి దేవుని కర్పించు మున్నె 200
తింటివి యిపుడె నిన్ దెగటార్తు ననుచు
నంటి ఖడ్గము దుస్సి యటె వేయఁబూను
నతని చే ఖడ్గంబు హరి యాచి పట్టి
క్షితిరుహంబుననిల్వఁజెంచు బెట్టులికె
మరలి చూడఁగ నీడ మలయు వృక్షమున
నరుదుగా వెడలి పీతాంబర ద్యుతులు
కరమొప్ప శంఖచక్రములు రాణింప
వరద కటీహస్త వైఖరి మెఱయ
నలమేలుమంగమ్మ యలరు రొమ్మునను
లలితకౌస్తుభహారలతలు చెన్నొంద 210
మకరకుండలరత్నమండనప్రభలు
మకుటకాంతులు దిశామండలి నిండ
నిలుచుండు హరిఁ గాంచి నెరి వెరగంది
యులికి ఖడ్గమువైచి యుర్వీతలమునఁ
గడిమి జాగిలమ్రొక్కి కరములు మోడ్చి


వడఁకుచుఁ దెలివొంది వనరుహనాభ!
దేవదేవో త్తమ! దీనమందార!
దేవరలీలలు తెలియువా రెవరు
మాయెడ నింతటి మాయ లేమిటికి
చేయఁ బూనితివయ్య శేషాచలేశ! 220
అనవుడు శ్రీకాంతుఁ డన్నిషాదునకు
కనుపట్టి యోరి నీకన్న నీసుతుఁడు
పరమభక్తుఁడు వాని బాధించఁదగునె
తరుమూలమున నేనె తదుపహారంబు
చేకొంటి మద్భుక్తశేషంబు వీఁడు
గైకొని భుజియించెఁ గడు నందఱికిని
స్వామిసరస్తీరజగతి నుండుదును
నీ ముద్దుకొడు కెందునిలుచు నందెల్ల
నేను నుండుదు నంచు నెమ్మిఁ బల్కుచును
గానరాకనె మాయఁగప్పి యేగుటయు 230
వసుఁడు విస్మయమొంది వలఁగొని తరువు
వెసవెస సేవించి వినుతించి సుతునిఁ
గ్రుచ్చి కౌగిఁటఁ జేర్చుకొని యదిమొదలు
హెచ్చు కొఱ్ఱలపంట నిడి రక్షణంబు
సలుపుచు తేనియల్ సంగ్రహింపుచును
నిలకడ తగుభక్తి నీరజాక్షునకు
వేళవేళలకు నైవేద్యంబు లిడుచు
చాలమోదంబునఁ జరియింపుచుండు
నయ్యెడ పాండ్యదేశాంతరాయాతుఁ
డై యొక ద్వాదశహాయనబాల 240


రంగదాసు పూలతోటఁ గావించి స్వామిని సేవించుట

శూద్రుండు రంగదాసుం డనువాఁడు
హృద్రంజనము లైన యెల్ల దేశములు
ధీరతఁ గనుఁగొంచుఁ దిరుగుచు నల్ల
నారాయణపురంబునన్ వచ్చి యందు
నారూఢిఁ బెద్దల నాశ్రయింపుచును
గూరిమి వసియించి కొన్నాళ్ళ వెనుక
శ్రీశుకాశ్రమమును జేరి యాపుణ్య
రాశి యౌ పద్మసరంబునన్ గ్రుంకి
పావనులగు బలభద్రకృష్ణులను
సేవించి తత్కృపచే ధన్యుఁ డగుచు 250
హరిభక్తి మది బుట్టి యలరుచుండఁగ
గరిమ మీరంగ వైఖానసమునులు
దినము శ్రీవేంకటాధీశు నర్చించు
కొనుచు నిత్యము నందు గ్రుమ్మరునపుడు
వారలఁ బొడగాంచి వాఁడు మదించి
సారెకు శుశ్రూష సలుప నమ్మునులు
కరుణించి యాశూద్రుఁ గడతేరునట్లు
పరమకైంకర్యలాభము సేయఁదలఁచి
వాని దోడ్కొని శ్రీనివాసాద్రి కరిగి
శ్రీనివాసులఁ జూపి చెలిమి నిట్లండ్రు 260
విను రంగదాస శ్రీవేంకటేశ్వరుల
కనుదినార్చనముల కగునట్ల పూల
తోటగావింపు .......................
............... నుండు ప్రతిదినంబిచట


హరినివేదితశేష మాహారముగను
...... ....... ....... ....... ........ ......
భుజియించు మిటు పనిఁబూని యుంటేని
నిజముగా ముక్తిఁ జెందెద వంచుఁ బలుక
నా రంగదాసుఁ డిట్లతి భక్తి మీర
నారామమొనరింప నాత్మఁ దలంచి 270
స్వామిసరస్తీరసంకులారణ్య
భీమకంటకలతాభి వ్యాప్తగుల్మ
భూరితరక్రూరభూరుహవార
దారణం బొనరించి దంతురానంత
యంతయు కుద్దాలహలకుఠారాది
సంతతహతిఁ జెక్కి సమభూమి చేసి
శ్రీనివాసాస్థాన చించాగమంబు
మానుగా రాణించ మహనీయవేది
సవరించి మెప్పైన చప్పరం బొప్ప
హవణించి యాచుట్టు నావరణంబు 280
గావించి కరవీర కాంచనవకుళ
దేవద్రుమందార తిలకపున్నాగ
నాగకేసరముఖ్య నగవిశేషములు
బాగైన మల్లెలు పారిజాతములు
జాదులు విరజాజి సన్నజాజులును
గేదంగి మొల్లలు గిరిమల్లికలును
శావంతెలును పచ్చశామంతెగుములు
లావైన కురువేరు లామజ్జకములు
దవనముల్ మరువముల్ తగిన కల్హార


కువలయవాటికల్ కొమరొప్ప సల్పి 290
విరిదోట గావించి వేంకటేశులకు
నిరతంబు మాలికానిచయముల్ గట్టి
నిలుకడయగు భక్తి నెమ్మనంబునను
నలువొప్పగ సమర్పణము సేయుచుండె
ఆరీతి నాతఁడా హరిరాజగిరిని
వైరాగ్యము వహించి వదలనిభ క్తి
స్వామిపుష్కరిణిని స్నానం బొనర్చి
స్వామిపదాబ్జాభి సంధాననియతి
విరు లెత్తి యొక్కెడ విమలస్థలమున
సరులు గట్టుచు నుండు సమయంబునందు 300
దైవయోగమున నత్తఱి నొక్కనాడు
వేవేగ గంధర్వవిభుఁ డొక్కరుండు
నవరత్నమయవిమానంబుపై నెక్కి
భువనమోహనరూపమున మించుచెలులు
గొలువగాఁ గొందఱు కొమిరెగుబ్బెతలు
కలనాదము లొసంగు గానంబుసేయ
సరసంబు లాడుచు జవరాండ్రు కొంద
ఱిరుదండల విలాసహేలలు మెఱయ

గంధర్వవిభుఁ డాతోటయొద్ద డిగి కాసారమున జలక్రీడగావించుట

నరుదైన వైభవం బలరంగ నింగి
నరుదెంచి యత్తోట యవనిపై డిగ్గి 310
విహరింపుచు మనోజవిభ్రమం బెసఁగ
బహువిధంబుల యాటపాటలఁ జెలఁగి


జలకేళివర్ణనము

యలరుచు కాసార మటుగాంచి యందు
జలకేళి సలుపంగ సన్నద్ధుఁ డైన
నయ్యెడఁ బ్రాయంపుటంగనామణులు
చయ్యన వస్త్రముల్ సడలించి యుంచి
యూరుమూలద్యుతు లొరపొందు మెఱపు
తీరున మెరయంగ దీప్తనితంబ
మా రతిరాజవిహారాద్రి కరణి
మీరంగ రంగొందు మెయి నిగ్గుజగ్గు 320
కులుకు శిబ్బెపుగబ్బి గుబ్బపాలిండ్లు
కులుకు కన్గవల బెళ్కులు తళ్కొసంగ
సంజడాల్ దొరగిన శశిరేఖలనఁగ
రంజిల్లు మొయిలు బర్వని మించు లనఁగ
కంతుని పరుఁజంచు కైదువు లనఁగ
కాంతువెంబడిని సింగార ముప్పొంగఁ
గాసారమునఁ జొచ్చి కమలకల్హార
భాసురవాసనాభరితతరంగ
జాలడోలాలోల శైవాలనీల
నీలకుంతలపాళి నెరి గమ్ముకొనఁగఁ 330
దమ నెమ్మొగమ్ములందంపుకెందమ్మి
గముల విందుగ నంది కందువ నలరఁ
గలికివగలు గుల్కు కన్నులబెళ్కు
వొలయు బేడిసలసొంపున నింపు నింప
కుముదకుట్మలముల కొమరున హార
విమలమౌక్తికములువింత నీటంద


వెలికలఁబడియీఁదు విరిబోణిమోవి
తలిరు చిమ్మనగ్రోవి దనవిభుమోముఁ
దగల నీరము జిమ్మఁ దమకించి యతఁడు
తొగలయండెలఁ బూని తోయముల్ చల్లఁ 340
గెలన నొక్కతె బోరగిల యీదిఁ వేణిఁ
జిలువయంచును జూసి చెలి నళికింప
నది యొక్క కే లంటి యలివేణి పిరుదు
నిది తెప్పయని యెక్క నెలమి నుంకించ
నొకతె యట మునింగి యూర్పక నడఁగ
నొకతె వెంబడి దాని నొగి వేగ వెతక
స్తనతటద్వయసమౌజలమునఁ జెలువఁ
గినిసి కాంతుఁడు స్థితక్రీడ సల్పగను
కనుఁగొని వనిత యొక్క తె రతి కలరి
పెనఁగి సిగ్గు దొలంగి ప్రియునిఁ బైకొనఁగ. 350
నిటుల మోహనకేళి నింపొందునట్టి

రంగదాసుని మతిభ్రమ వైఖానసులుదూరుట

కుటిలాలకలను గన్గొని మరు లొంది
యల రంగదాసుఁ డం దలరి మైమఱచి
నలరులసరుల నొయ్యన జారవిడిచి
[1]తనువి స్ఖలనఁగా నతనుపరవశతఁ
దనరుచునుండ గంధర్వుండు కేళి
చాలించి చెలులతోఁ జయ్యన వెడలి
మేలొప్పఁ దటభూమి మెఱయు వస్త్రములు


క్రమమున ధరియించి కనకవిమాన
మమరికె నెక్కిఁ నిజాలయంబునకుఁ 360
దరలిన నా రంగదాసుండు తెలివి
వరల సిగ్గున మోము వంచుక లేచి
విరులదండలు బారవేసి యా స్వామి
నరసి తీర్ధంబున స్నానంబు చేసి
సమయంబు దప్పుట జడిసి క్రొవ్విరులు
విమలత గ్రహియించి వెస సరుల్ గట్టి
కడిమి వైఖానసాగ్రణిచేతి కొసఁగఁ
గడకతో వాని నా ఘనుఁ డిట్టులనును
తడవయ్యె నో రంగదాసి యిందాక
కడు నిద్రఁజెందితో కాక మరచితొ 370
విరులు దేవై తివి వేళ దప్పుటను
హరిపూజలను చాల నపచార మయ్యె
నిదివర కొకనాఁడు నిటు లుంటలేదు
మదము దొట్టెను నీకు మాట లేమిటికి
యను మౌనిపలుకుల కాత్మఁ గలంగి
తన నేర మెంచి యుత్తర మియ్యలేక
తలకొన్న సిగ్గునఁ దనలోనె క్రుంగి

రంగదాసుని శ్రీనివాసులూరడించుట

తలవంచుకొని పరితప్తుడై నిలువ
శ్రీనివాసుండు మచ్చిక నానతిచ్చు 380
బాలక ! నీ కేల బలుచింత యింత
పోలని సిగ్గుచేఁ బొగల నేమిటికి
సుదృఢవైరాగ్యంబు శోధించవలసి


మదిమది నేనె యిమ్మాయఁ బన్నితిని
నా మాయఁ దెలియంగ నలువయుఁ జాలఁ
డిల మనుజు లెఱుంగ నెంతటివారు
నాలీలచొప్పున నరులెల్ల నెపుడు
కీలుబొమ్మలమాడ్కి కెరలి యుండుదురు
గాఢబోధవిరాగకలితులుదక్క
మూఢులిమ్మాయచే మోసపోవుదురు 390
కావున వగ పేల కడతేర్తు నిన్ను
భావంబునన్ దృఢభక్తిఁ జెందుదువు.
చెలగుగంధర్వుని చెలువంబు చూచి
యలరి మోహించుట నవ్విధంబునను
నీ వొక్క జన్మంబు నృపతివై పుట్టి
భూవర కన్నెలన్ బొసఁగ వేవురిని
కడు స్వయంవరములఁ గైకొనికోర్కె
లడరంగ మరు కేళి నమితభోగంబు
లనుభవింపుచు నన్ను నతిభక్తిఁ గొలిచి
కనకవిమానాదికము మా కొనర్చి 400
బహువత్సరంబులు భాగ్యసంపదల
రహిచక్రవర్తివై రాజ్యంబు నేలి
తుదను మోక్షమును జెందుదు వంత నీవు
వదలక యారామ వరముఁగావించి
యలరులసరులు మా కర్పించుకొనుచు
నలరుచునిట యావదాయుష ముండు
మనుచు నాజ్ఞాపించి యందు ముకుందుఁ
డొనరు నర్చాకృతి నూరక యుండ


యా రంగదాసుండు నటులనే భక్తి
మీరంగ కైంకర్యమే స్వరూపముగ 410
శ్రీవేంకటేశ్వరుసేవ సల్పుచును
పావనశీలుఁడై బహువత్సరములు
చరియించి దేహావసానంబునందు
సురరాజ్యవైభవ సుఖములు చెంది
ధర చోళభూపాల తనయుఁడై పుట్టి
వరశీలమునఁ జక్రవర్తి నాఁదనరి
శ్రీనివాసులకు విశిష్టవిమాన
మానితమదిరమంటపావరణ
వరభూషణాదుల వరుసఁ గావించి
పరమభక్తిచెలంగ భాగ్యసంపదలు 420
నిరతంబు చేకొని నృపకుమారికల
వరుసమీఱగ స్వయంవరవేళయందుఁ
బెక్కండ్ర నర్మిలి బెండ్లాడి కీర్తి
పిక్కటిల్లఁగ శత్రుభీషణుం డగుచు
హరిచక్రమే తన యాప్తబలముగ
ధరణిచక్రంబు నంతయును బాలించి
సారతరజ్ఞాన సంపత్తి శౌరి
సారూప్యమొప్ప మోక్షంబుఁ జేకొనును.
అనుచు సూతుఁడు భవిష్యత్కథఁ దెలుప
విని యమ్మునీంద్రులు విస్మయమొంది 430
ఖ్యాతపురాణేతిహాససారజ్ఞ
సూత యా రంగదాసుఁడు చోళవిభుని
కెవనికిఁ దనయుడై యిల నుదయించు


భువి నెందు వాఁ డుండు భోగసంపదలఁ
బూని మదాంధుఁడౌ భూవరుం డగుచు
శ్రీనివాసుల నెట్లు సేవింపఁగలుగు
చక్ర మాతని కెట్లు సాధనం బగును
చక్రవర్తిగ ధరాచక్ర మె ట్లేలు
విన వేడుకయ్యె సవిస్తారముగను
వినుపించు మంతయు వేసటపడక 440
యనుచుఁ బ్రార్ధించిన నాతఁ డమ్మునులఁ
గనుగొని మరియు నక్కథఁ దెల్పఁ దొడఁగె

చోళచక్రవర్తియైబుట్టిన రంగదాసుకథ

వినుఁ డట్టి దక్షిణోర్వీభాగమునను
వనరాశి వేంకటవసుధాధరంబు
గొనకొన్న కన్యయు కుటకరాష్ట్రంబు
దనయెల్లలుగ మించు ద్రవిడదేశమున
నల చోళదేశధరాధీశుఁ డొకఁడు
బలశాలి యతిధర్మపరుఁ డుదారుండు
పలికి బొంకనివాఁడు పరదారములను
తిలకించనొల్లని ధీరమాననుఁడు 450
పరరాజబరగర్వ భరతమోహరణ
తరుణార్కకోటి ప్రతాపశోభితుఁడు
రారాజదఖిలదిగ్రమణికుచాగ్ర
హారకర్పూర నీహారపటీర
సారమందార లసత్సరాకార
గౌరగౌరోదారకమనీయకీర్తి


మానినీజనమనోమానలుంటాక
భూనుతసౌందర్య పుష్పబాణుండు
భూరిలసద్గుణాద్భుతసముద్రుండు
వీరచోళుండను విభుఁడు చెలంగు 460

వీరచోళుఁడు వేఁటాడఁబోవుట

అతఁ డొక్కనాఁడు వేటాడంగ వెడలి
యతులమౌ నొక్క జాత్యశ్వంబు నెక్కి
వనగోచరావళి వరసైనికులును
మొనమీరనుధ్ధతి ముందర నడర
నందు కొందఱు గుర్కురాళిఁ జేపట్టి
పందివలల్ బూని బలువిడి నడవ
కుందేటివలలు చేకొని కొంద ఱేగ
కొందఱు నటు జోపుకోల లూని చన
కొందఱు పికిలిపూల్ కొమరారు కుచ్చు
లందమొందెడు డేగ లందుక రాగ 470
వనములెల్లను నిండి వడి నార్భటములు
దనరంగ మృగము లెంతయుఁ దల్లడిల్ల
ధాటిమీఱగ నట్టి ధరణీశ్వరుండు
వేటలాడుచు జని వేంకటాచలము
చెంగట నత్యంత శీతలాంబువులు
చెంగలించంగ రంజిలు స్వర్ణముఖరి
తీరంబునన్ దావి దెలుపంగ నలరు

వేంకటాచలసమీపమున విరిదోటలో నొక నాగకన్యనుగాంచుట

నారంగకనకపున్నాగాదిశోభి


తారామములఁ జేరి యాతపశ్రాంతి
దీరంగ నీడలఁ దిరుగుచుండంగ 480
నవ్విరిఁదోటలో నందచందముల
నివ్వటిల్లుచుఁ గుల్కు నీటువాటిల్లు
మెరుగుచందంబున మేనిగ్గు మెఱయ
మరునిమోహనవిద్యమాట్కి సింగార
మొరపుమీఱంగ మే నొందిన కరణి
మెరుఁగుబోణి యొకర్తు మెల్ల నె విరులు
గోయుచు నఖకాంతి కోరకావలికి
చాయలు దేరుప సరసహాసంబు
విరులకు నొకకొంత వింత రం గిడఁగ
కరకంకణంబుల కలరవంబులు పుల్గు 490
నాదంబుతోడ విన్నాణంబు సూప
పాదపద్మము లంటి బలుకు హంసకము
లడుగడుగునకు నొయ్యన నెచ్చరికలు
నుడువుచుండఁగ మొలనూలు చలింపఁ
బెనుపొందు చనుదోయి బేర్చిన పరపుఁ
గొని యానుటం గౌను కొంత గంపింప
మక్కువ మెరుగుకమ్మల తళ్కు ముద్దు
చెక్కిళ్లపై రంగు చికిలి సేయంగ
నలరుమోమునఁ దమ్మి నళు లంటుకరణి
నలకముల్ జార నఖాళిఁ దీర్పుచును 500
పొదలెడు బంగారు బొమ్మన నలరు
పొదచెంత మెలఁగునాపూఁబోణి నతఁడు


దిలకించి విస్మయోదీర్ణభావమునఁ
బులకించ మైమరుల్ బొడమ డెందమునఁ
దనచూపు మరలింప ధైర్యంబులేమిఁ
గనుఁగొంచు నిలుచు నంగజమాయఁ దగిలి,
ఆ నాగకన్యక యా నృపుఁ జూచి
మానసంబున మరుల్ మమతయు మించ
కువలయాప్తునకు మేల్‌గొను చకోరికల
హవణికఁ దనచూపు లానంద మంద 510
నతని రూపవిలాస మరయుచు భావ
మతులితోల్లాసంబు లందఁగా నందు
సొలయుచు నీతఁ డా సురరాజసుతుఁడొ
నలకూబరుఁడొ యల్ల నలినసాయకుఁడొ
గాకున్న నీసోయగము విలాసములు
చాకచక్యంబు నెసంగు మైరుచులు
గలుగునే యొరునకీ గతి నంచు మిగుల
వల పగ్గళించ నవ్వనమున నడుగు
దరలఁజాలక నిల్చి తనకేలు బొదల
విరుల [2]గుత్తుల నంటివిడువక నదల 520
సొలపుచూపులు రాజు సొగసుల వంటి
కలువలు వెదచల్లఁగా మనోరథము
నెక్కుడు గాఁజెంది యిందీవరాస్త్రుఁ
డెక్కిడువింటితూ పెదనంటి నాట
సొమ్మసిల్లుచుఁ జాల సొక్కి, చిత్తరువు
బొమ్మచందంబునఁ బొలుపొందుచుండ


అపు డంగజాంభోరుహాస్త్రధారలకు
నృపతి తల్లడమంది నెలతుక జోడు
గూడి జీవితరక్ష కొమరొంద సలుపఁ
దా డెందమున నెంచి ధైర్యంబు డించి 530
కలకంఠి చెంగటఁ గదియుచో దాని
బెళ్కుచూపను ముల్కి బెట్టు నాటంగ
మది విభ్రమముఁజెంది మరి మోహమంది
సుదతి నొయ్యనఁ జేరి సొలపింతఁ దేరి
తమకము న్నయ మాప తన నాన చాప
లము మాప నేపున లలన కిట్లనెను
అలివేణి యెవతె వీ వమరభామినివొ
చిలువరాచెలువవొ' చిత్తజుచెలివొ
నీయందచందముల్ నీటందు నీదు
సోయగంబును జూచి సొలసితిఁ జాల 540
యెవ్వరిదాన వదేమి నీ నామ
మివ్వనంబున వచ్చు టేమి నీ వొంటి
నో కొమ్మ దెలుపవే యుల్లాస మెసఁగఁ
జేకొమ్మ నన్ను నీ చెలికాఁడు గాఁగ
నావు డా ననబోణి నరపాలమణిని
భావించి యాతని భావంబు దెలిసి
వానిపల్కులు సుధావర్షంబు కరణి
వీనుల వడ దీర్ప వేడ్క రెట్టింప
తమకంబు సిగ్గును తడవడ నిలిచి
తెమలని వల పూని తిలకించి యతని 550
నరపాల నేను ధనంజయుం డనఁగఁ


బరగు నాగేంద్రుని పట్టి నీతోట
యందు విరుల్ గోయ నరుదెంతు నెపుడు
నందినియనుదాన నాగకన్యకను
నీ వింద్రసుతుఁడవో నీరజాస్త్రుఁడవొ
భూవరోత్తముడవో పొసఁగ నిచ్చోట
నెన్నడు రాఁ గాన మెవ్వఁడ వీవు
తిన్నగా నన్నియుఁ దెలుపుదు వనిన
చోళభూపాలుఁ డా సుదతికి మదిని
బాళిరెట్టింపఁగాఁ బలుకంగఁదొడఁగె. 560
వినుము నందిని భానువిమలవంశజుఁడ
వినుతచోళావనీ విభుఁడను నన్ను
వీరచోళుం డండ్రు వేటాడవలసి
ఘోరకాననములఁ గ్రుమ్మరునెడల
సేనలు నందందు చెదరి యేగంగ
నీ నదీతటమున నే విశ్రమించు
తమి నిందు వచ్చితి దైవయోగమున
రమణీయమూర్తి వై రంజిల్లు నీదు
చక్కదనముఁ జూచి చాల మేలొంది
చక్కెరవిలుకాని శరములఁ గంది 570
నీ దండఁ జేరితి నెమ్మి మీఱంగ
వేదండగమన నన్ వెడవిల్తు కేళి
నలమి వే చెలిమి నీయధరామృతంబు
నెలమిఁ గ్రోలఁగ నీవె యెదతాప మెడల
తమ్మిమొగ్గల నిగ్గుఁ దరమి యెగ్గించు
హొమ్ము చన్దోయి నాఁయురమునఁగ్రుమ్మి


మోహాబ్ధి దాటించి ముదముఁ బాటించి
మోహనకేళి సొంపున నేలుకోవె
అనుటయు నాబాల నంగజలీల
దనరంగ భావించి తనమోము వాంచి 580
చెక్కులు పులకించఁ జెలువునిఁ గాంచి
మక్కువ మదినుంచి మహిపాలచంద్ర
నీతిశాస్త్రంబులు నీ వెఱుంగుదువు
స్వాతంత్య్రమంగనాజనులకుఁ గలదె
ఈతరి కన్యక నే నిట్టిపనుల
మాతండ్రిచే ననుమతి నొందవలదె
తెగువ గుర్వాజ్ఞ నతిక్రమించఁగఁ
దగవుగా దింక మాతండ్రిని నడిగి
తేని సమ్మతి నీకె యిచ్చును నిజము
మానుము దుడు కనుమాన మేమిటికి 590
జలరాశి యుప్పొంగి సంరంభమునను
చెలియలికట్ట మించిన నాగవశమె
నీవె ధర్మంబుల నెఱిని బాలింపఁ
గావలె మర్యాదఁ గడవంగఁదగునె
యని పల్కు నా చెలి నవనిపాలుండు
నెనరునఁ బేర్కొని నీతిగాఁ బల్కు
తరుణిరో రాజు కధర్మంబు గాదు

చోళరాజు నాగకన్యకనుగాంధర్వ విధిని బరిణయంబగుట

పరికింప గాంధర్వపరిణయం బవని
నన్యోన్యసమ్మతి నగు వివాహంబు
ధన్యమై తగును గాంధర్వం బనంగఁ 600


దొలుత శకుంతలాదుష్యంతులకును
కలయిక వినలేదె ఘనులు దెల్పగను
నిమిషమాత్రంబైన నినుఁ గూడకున్న
తమిఁ దాళఁజూలనే తరుణీలలామ
అనుచు సమ్మతి నిల్చు నలివేణి నలమి
ననవిల్తుకేళిని నయముగాఁ గలసి
యానందభరితులై యతివయుఁ దాను
బూనినచెలిమితోఁ బూఁబొదరిండ్లఁ
జెలఁగి విహారంబు సేయుచుండంగ
నల ప్రొద్దుగ్రుంక సంధ్యారాగ మెసఁగ 610
నంతట న య్యింతి యటుసంజయగుట
నెంతయుఁ జింతించి యింటివా రెందు
వెదకుదురో యంచు వేగిరపాటు
గదురంగ విభుఁ బాయగాఁజాల కపుడు
బెదరుచు విభుఁ వేగ బిగువుకౌగిటను
గదియించి యేమి బల్కఁ గలేక మదిని
విరహంబును దలంచి వివశయై సోలి
నెరసిన నిట్టూర్పు నిగుడ నో రమణి
జక్కవకవ లిట్టి సంజల నెంత
సృక్కునో యెడబాసి సొలయుచు నెటుల 620
వేగించునో యిట్టి విరహంబు మనకు
నీగతి విధియించె నీశ్వరుం డకట
యిలుచేరవలె నింక నేమి సేయుదును
కల గన్నటుల నిట్టి కలయిక గల్గె
ననుచుఁ గన్గవ నశ్రు లడరంగ నృపతి


యనుపఁగా వీడ్కొని యరుగంగ నతఁడు
మోహాంబురాశిలో మునిగి పైఁ దేలి
యూహించి చెలికూర్మి నుసురుసు రనుచు
వెతమీర మరలి తన్వెతకెడుసైన్య
తతిఁ గూడి యరుదెంచెఁ దనపురంబునకు 630
మదిరాక్షి పై మరుల్ మది నిముడ్చుకొని
పదపడి రాజ్యంబు పాలింపుచుండు

ప్రొద్దుగ్రుంకినపిదప నాగకన్యబిలముసొచ్చిరసాతలంబున కరుగుట

అయ్యెడ నాగకన్యామణి బిలము
జయ్యనఁ జొచ్చి రసాతలంబునకు
నరిగి తండ్రి కెఱంగి యట్టి వృత్తాంత
మెరిగింప విని యతం డెద మోదమందె
నా నందినికి గర్భ మపుడె గల్గుటయు
మేనఁ జిన్నెలు కొన్ని మెఱుయంగఁ జెలులు
జననియుఁ గనుఁగొంచు సంతోష మడరఁ
జనవున గర్భోపచారముల్ సల్పఁ 640
గొన్నాళ్ళ కా కన్నెకును ప్రొద్దు లగుట
సన్నుతం బగు శుభసమయంబునందు
హరిభక్తియును గీర్తి యతులసామ్రాజ్య
మురుతరభోగభాగ్యోన్నతుల్ చెందఁ

హరిభక్తుఁడగు కుమారునియదయము

గల మహాపురుషుఁడు కలకంఠి పుణ్య
కలనచేఁ దనయుండుగా నుదయించెఁ
పెరుగుచు శైశవప్రియకరలీల
లొరపొంద నాడుచు నుచితవిద్యలను


జదువుచుండఁగ ధనంజయుఁ డను తాత
ముదమొంది యాదరంబునను లాలింపఁ 650
బ్రకటవివేకంబు ప్రబల నాబాలుఁ
డొకనాఁడు తన తల్లియొడిని గూర్చుండి
ముద్దుల మాటల ముచ్చటాడుచును
తద్దయు మురియుచుఁ దనతండ్రి యెవ్వఁ
డని యడుగుటయు న య్యతివ డెందమున
నెవరును భేదంబు నిగుడ భావించి
సుతుమోము మూర్కొని సొలయుచు నూర్చి
క్షితి చోళవిభుఁ డంచు చెలఁగు భూవరుఁడు
నీ గురుం డని తెల్ప నృపకుమారకుడు

కుమారుఁడు తనతండ్రిచోళవిభునిఁ జూడఁబోవుట

వేగ న వ్విభుఁ జూడ వెడలి యా తాత 660
కెరగి య బ్బిలము నాగేంద్రుండు చూప
పరిజనుల్ కొందరు పరిచరింపంగ
నరుదెంచు తన దైర్య మందఱు మెచ్చ
నరిమురి యా జాడ నవనికి వచ్చి
నారాయణపురంబునం దన తండ్రి
వీరచోళేంద్రుండు విలసిల్లునగరుఁ
జేరి యమాత్యులచేఁ దన రాక
భూరమణునకును బుత్తెంచునంత
వార లద్భుతమంది వసుధేశుకడకుఁ
జేరి చోళనృపాల ! చిన్న వాఁ డొకఁడు 670
ద్వారవేదిక నిల్చి ధైర్య ముప్పొంగ
వారక మముఁ బిల్చి వాక్యచాతురిని


నందినిసుతుఁడను నాగలోకంబు
నందుండివచ్చితి నవనిపాలకునిఁ
గని మాటలాడంగ కార్యంబుగలదు
విన విభునకు విన్నవించుడీ యనుచుఁ
బలికెడి నతని రూపము వైఖరియును
పొలుపును జూడ నీపోలికె గాఁగఁ
గనుపించు నివి యేమొ కారణం బనుడు
విని చోళభూపతి విస్మయంబునను 680
బిలువుఁ డా బాలకుఁ బెలుచ నంతయును
తెలియుద మన వారు తీవరంబుగను
రమ్మని యతని నా రాజశేఖరుని
సమ్ముఖంబునఁ దెచ్చి సరస నుంచంగ
నా నందినీసుతుం డవనిపాలునకుఁ
బూనికఁ గేల్మోడ్చి పొసఁగినభక్తి
వినయముల్ మీరంగ విసువనిధైర్య
మొనరంగ గాంభీర్య ముప్పతిలంగ
నిలుచుండఁగాఁ జోళనృపతి యాబాలుఁ
దిలకించి ముదము సందేహంబు గదుర 690
భావించి యిట్లను బాల యెందుండి
నీవు వచ్చితి విందు నృపకుమారుఁడవొ
దివిజసంభవుఁడవో తెలియ మీతండ్రి
యెవరు వచ్చినవని యేమి నావుడును
విభునికి బాలుండు వెస కేలమోడ్చి
సభికులందరు విన సమ్మదం బొదవ
వినుము దెల్పెదను వివేకనిధాన!


యినవంశతిలకుఁడై యిల యెల్ల నేలు
వీరచోళాహ్వయ విభుఁడు నా తండ్రి
యారయ నందిని యను నాగకన్య 700
ననుఁ గన్న జనని ధనంజయుఁ డనఁగఁ
దనరు నాగేంద్రుండు తాత యీవరకు
నాగలోకమునందునన్ వసియించి
నే గురుశుశ్రూష నియతి సల్పగను
వచ్చి తెంతయును దేవర యెరుంగనిదె
మచ్చిక నిపుడు నా మాటలు వినఁగ
నడిగెద రింతెగా కందఱు తెలియ
నెడపక తెల్పితి నే నెరింగినది
అనిన సభాసదు లందఱు దొరయు
మునుకొని మొక మొకంబులు చూచుకొనుచు 710
విస్తుబోవుచుఁ బల్కు వెరవు జాలకయె
సుస్తిమితాత్ములై చోద్య మందుచును
రంగుచిత్తరువుల రహి నుండునపుడు

ఆకాశవాణి యా కుమారుని మహత్యమును దెలుపుట

సంగతి గగనభాషణ మిట్టు లొడము
ధరణీంద్ర నిజము నీ తనయుఁ డీతండు
పరమాత్మ వెంకటపతికి భక్తుఁడయి
యా చక్రవాళాంత మనదృశాఖండ
భూచక్రమంతయు భుజశక్తి నేలఁ
గలుగును శ్రీరమాకాంతుఁ డీతనికి
నెలమిఁ బ్రత్యక్షమై యిష్టసంపదలు 720
కలిగించి యితనిచేఁ గైంకర్యములను


చెలిమిఁ జేకొనఁగల్గు క్షితిచక్రవర్తి
యగుచు నీవంశంబు నతిధన్యముగను
బొగ డొందగాఁ జేయు పుణ్యుఁ డీతండు
మది సంశయముమాని మన్నించుమనవు
డది విని సభ మంత్రు లభినుతి సేయ
జనపాలుఁ డా బాలు సమ్మదం బొప్ప
నెనరునఁగైకొని నెఱిఁ గౌఁగిలించి
శిరము వే మూర్కొని చెక్కులఁ బుణికి
కరుణ లాలింపుచుఁ గడు మున్ను వేటఁ 730
జనుటయు నం దొక్క జలజలోచనను
గనుఁగొని మోహించి గలయు వృత్తాంత
మంతయుఁ దలఁచి యం దా మంత్రులకును
వింతగా వివరించి వేగ నచ్చెలువ
రావించి మునులచే రాకొమరునకు

తొండమానాఖ్యుఁడగు నందిని కుమారునకు రాజ్యాభిషేకము

భావితసూత్రోక్తపరిపాటి నపుడె
జాతకర్మాదులౌ సత్క్రియల్ సల్పి
ఖ్యాతిగా తొండమా నను నాఖ్యఁ జేసి
చదివించి వేదముల్ సాదనల్ నేర్పి
చదురుగా వేంకటశైలంబుచెంతఁ 740
దనరంగ నొక రాజధాని నిర్మించి
తనయు నప్పురమునఁ దనరాజ్యమునకు
నభిషేకమొనరించి యభిమతసిద్ది
నుభయలోకశుభంబు లొనగూడునట్లు


క్రతువులు సల్పి సంక్రందనాస్థాని
నతిశయవిభంబు లలరంగ నుండు
అంత నా తొండమానను చక్రవర్తి
సంతతవిక్రమ చాతురి నరుల
నిగ్రహింపుచు మిత్రనివహముల్ గడు న
నుగ్రహింపుచు సురల్ నుతియింప ధరణి 750
నాసేతుతలశీతలాచలం బెలమి
భాసురనిజభుజాబలవిక్రమములఁ
బాలింపుచుండంగఁ బాండ్యభూవరుఁడు
శీలవతి యనంగఁ జెలఁగెడు తనదు

తొండమానుడు పాండ్యాది భూవరుల కన్యలబెండ్లాడి సుఖించుట

తనయకు నభినవతారుణ్యలక్ష్మి
మొనసి సౌందర్యవిభూషణంబుగను
తనులతానవవసంతశ్రీయనంగఁ
దనరుచుండంగ న త్తరుణీలలామఁ
గనుఁగొని పతియోగ కల్యాణయోగ్య
త నెరంగి చెలి కింపు తగ స్వయంవరము 760
చాటించఁగా నందుఁ జని చక్రవర్తి
బోటినిఁ బెండ్లాడి భూవరుల్ బొగడ
మామ యరణ మిచ్చు మణిభూషణములు
సామజరథఘోటసంఘంబు నంది
నందినిదేవి కానందం బొసంగ
పొందుగా నరుదెంచి పురి విహరించు
నీ గతి కర్ణాటహైహయభోజ


మాగధకాంభోజమాళవమత్స్య
కేరళాంధ్రకళింగ కేకయలాట
శూరసేనాధికక్షోణీధురీణ 770
కన్యకలను బరిగ్రహలీలఁ జెంది
మాన్యమనోజాగమక్రమాచార
మలర విచిత్రసౌధాంతరంబులను
సలలితకశశికాంతచంద్రశాలలను
నద్దపుఁబడకిండ్ల హరువుమేడలను
నిద్దపు విరులపందిరుల తావులను
వెన్నెలబైళ్ళను వెస రతనంపు
దిన్నెల కాసారతీరభూములను
వన్నె మీరిన పుష్పవాటీతతులను
పొన్నలగున్నలన్ పొదలు పూఁబొదలఁ 780
గేళిడోలికలను గృతకశైలముల
బాళిక్రీడింపుచు భామినీమణుల
తమిరేచి వలపించి దక్షునిలీల
రమియింపుచు సుఖాభిరతి నొకింతయును
తనివి వేసటయు నితరకార్యసక్తి
యును లేక యుండియు నుచితవేళలను
ధరణిఁ బాలింపుచుఁ దగు బలంబులను
కరుణఁ బ్రోచుచునుండఁగా నొకనాడు

కీలారులు పాలకడవలు పగులుచున్న వృత్తాంతము రాజునకు దెలుపుట

అతని గోధనముల నరయు కీలారు
లతిరయంబున వచ్చి యాస్థానమునను 790


పేరోలగంబుగాఁ బెంపొందు నృపతిఁ
జేరి వే పొడగాంచి చేతులు మోడ్చి
వినుము దేవర యొక్క విన్నపం బిపుడు
మన యాగదుపులెల్ల మల యెక్కి యందు
మేతలు దండిగా మేయుచుఁ జాల
నా తోటదొనలయం దమృతమువంటి
నీరు ద్రావుచు మేల్మి నిత్యనిత్యంబు
మీరి చ న్నవిసి పాల్ మిగులఁ బిండంగ
నేము నచ్చోటనే నిలుకడ గాఁగ
గీము సేసుక దొడ్డి క్రేపులు మనఁగఁ 800
గాచుచు నా పాలకడవలన్నియును
దాచక నగరికిఁ దగువేళఁ దెచ్చి
యొప్పగించుచు నుందు మొకనాడు నెట్టి
తప్పిదంబులు లేవు ధరణీతలేంద్ర
అలత్రోవలో నొక్క యడవిలోపలను
కొల నున్న దా చెంత గొప్పయౌ పుట్ట
యొక్కటి యున్న దా యోరగా రాగఁ
నక్కడ కడవ లీ యన్నియుఁ బగిలి
పాలెల్లఁ బుట్టలోఁ బడిపోవఁ జూచి
యేలాగు పదిలమై యేగినా యందె 810
వాలాయముగఁ గడవలు దానె బలిమి
వ్రీలుచున్నవి యెందు వెదకిన నొకని
గానము మరి యొక్క కడ వత్తు మనిన
కాన యల్లుక త్రోవ గనఁబడ దెందు
నెవ్వరిచేఁతయో యేదైవ మచట


నివ్వగ సేయునో యెరుఁగరాదయ్యె
నిది తెలివిడి గాఁగ నిపుడె దేవరవు
కదలి విచారించఁగావలె నొండె
తగు నాప్తులైన పెద్దలఁ బంపి తెలియ
నగునొండె యిదియెంత యని యుండరాదు 820
దినదినం బీ గతి తెఱువున పాలు
కనుకట్టువలె పోవఁగా నగరికిని
పాలురాలేదని ప్రభువులు మమ్ము
చాల దండింపఁగా జనులెల్ల తారు
మదిని శంకింప రే మము దొంగ లనుచు
అదిగానఁ దెల్పితి మంతయు ననిన
విని నరపాలుఁడు విస్మయంబునను
మనమునం జింతించి మంచిదేఁ వెనుక
నన్నియుఁ [3]దెలిసెడునని వారిఁ బంచి
తిన్నఁగా నరిగి యంతిపురంబునందు 830
వసుధేశుఁ డా గొల్లవారి వాక్యములు
వెసవస తలపోసి వెంకటగిరిని
వెన్నుఁ డున్నాడండ్రు విబుధు లాపల్కు
లన్నియు నిక్కమే యాపుట్టయందు
హరి యుండకుండిన నట్టి పాలెల్ల
నిరతంబు నచ్చోటనే చిందనేల
యని యూహసేయుచు నాహ్నికక్రియలు
దనరంగఁ దీర్చి యెంతయు శుద్ధుఁడగుచు
పరమాత్ము మదిలోన ధ్యానించుకొనుచు


స్వప్నమున రాజునకు శ్రీనివాసులు తననుగూర్చి తెలుపుకొనుట

వరశయ్య నిద్రింప వనజలోచనుఁడు 840
నరనాథ స్వప్నంబునన్ గనుపట్టి
కర ముపదేశంబు గావింప నతఁడు
కలఁగని ప్రత్యుషఃకాలంబునందు
నలరుచు లేచి యత్యాశ్చర్య మొదవ
తన మంత్రిజనుల నందరిని రావించి
యనుపమానందుఁడై యపు డిట్టు లనును
వినుఁ డూకొనక రేయి వేకువ నేను
కనుఁగొంటి నొక వింత కల యది దలపఁ
బులకాంకురంబులు బూనెడి మేను
జలధరశ్యాముఁడు జలజలోచనుఁడు 850
గను నొక్క దాసరి యరుగుదెంచునట
మిగుల నాతనికి నే మిక్కిలి భక్తి
నెఱఁగి యెక్కడనుండి యే తెంచి తీవు
కరము నే సేయనౌ కార్య మే మనుచు
నడుగుదునట యతండాదరం బొదవఁ
బుడమి శ్రీవేంకటభూధరంబునను
వసియింతు నే శ్రీనివాసుఁడన్ వాఁడ
వసుధాధినాథ నీవద్దికి నేను
వచ్చితి నీ కిష్టవరదుఁ డా దేవు
మచ్చిక గనుపించ మదినెంచి యిపుడు 860
దేవ ని యోగమా తీరె యా గిరికి
నా వెంట ర మ్మటు నలినలోచనుని


దివ్యవిమానంబు దిలకించి హరిని
భవ్యభక్తినిఁ గొల్చి భాగ్య మందు మని
నను దోడుకొనుచు పన్నగరాజగిరికి
జనునట రత్న కాంచనవిమానంబు
నందు నే కనుఁగొందునట యంత నతఁడు
నందమందు విమాన మా క్షణంబుననె
కానరాకయె మాయఁగప్పిన నులికి
మేను గంపింపఁగా మేల్కొంటి నపుడె 870
ఇది యేమి సోద్య మయ్యెడి నంచుఁ బలుక
నది విని మంత్రు ల య్యవనిపాలునకుఁ
గమలేక్షణుఁడు నిన్నుఁ గరుణించి చాలఁ
బ్రమదంబు లొసగంగఁ బనిబూని పిలిచి
రక్షింపఁదలఁచె నా రాజీవనేత్రు
నీక్షించి సేవించి యిష్టసంపదలఁ
జెంది కృతార్థతఁ జెలఁగుదు వనుచుఁ
బొందుగాఁ గల దెలుపుచునుండు నపుడు

వసుఁడను నిషాదపతి శ్వేతవరాహచేష్టలనుగూర్చి రాజునకు విన్నవించుట

శ్రీవేంకటాచలసీమవసించు
పావనుండు నిషాదపతి వసుఁ డమ్ము 880
సెలవిల్లు చిలుకమ్ము చేతులఁ బూని
చెలువుమీరగ కొండసిలచర్మమైన
దట్టిపై పట్టంబు దనరంగఁ గట్టి
మట్టంద కణితిచర్మము పోటుబెట్టి
టోపిపైఁ జిగురాకు జొంపంబు బూన్చి


కైపుగాఁ బులితోలు గట్టి చల్లడము
పయి తేకుటాకులు పసగా బిగించి
మయి నిగ్గు చీకటిన్ మరిమరి గురియ
గ్రుమ్మరు కాటుకకొండయో యనఁగ
నెమ్మిమీరఁగ వచ్చి యెల్లవారలును 890
వెరగంది చూడ న వ్విభుడుండు నగరు
బిరబిరఁ జొచ్చి యా పృథివీశునెదుట
నిలిచి కేల్మోడ్చి వన్నియల చెన్నొందు
చిలుకఁ గానుకయిచ్చి చెలిమి ని ట్లనును
సామి! నే వేంకటాచలమున నెపుడు
గోమైన నొక పెద్దకొలనిచెంగటను
కొంతచేతులపాటి కొఱ్ఱచేన్ జేసి
యెంతయు బతుకుచు నెలమి నుండుదును
దినము నాచేనెల్ల తెల్లని పంది
తిని పోవసాగె నే తిలకించి దాని 900
నేయఁబోయిన నమ్ము లెక్కవు వలలు
వేయంగ నవియెల్ల వేయుదున్కలుగఁ
దగఁ ద్రుంచి యురుకు నోదంబునఁ బడదు
వెగటుమందుల కట్టు వెస సడ్డగొనదు
మంతరించిననైన మట్టుకురాదు
చెంతఁజేరి యదల్పఁ జివ్వున నెగయు
నీలాగు మేయంగ నెదపడి నేను
చాల విచారంబు సంధిల్లఁ గేల
వాలుబూనుక తెంపు వడిసేయ నెంచి
చాలఁగడంగుచో సరగ నం దొక్క 910


పలుకు వినంబడెఁ బై నాకసమున
నలుగ కోరి నిషాద! యా పెనుబంది
ప్రకటించి చూడ నీపాలి దేవుండు
సకలలోకములను సారె రక్షింప
నీ కొండనే యుండు నెప్పుడు దాని
నీ కొలందియె తోల నీవు వేగిరమె
చక్రవర్తినిఁ జేరఁ జని నిన్న రేయి
చక్రధరుఁడు వచ్చి స్వప్నంబునందుఁ
దెలుపుట యానవాల్ దెలివిడి చేసి
కలశాబ్ధికన్యకాకాంతునిఁ గొల్వ 920

రమ్ము చూపెద నంచు రంజిల్లఁ బలికి
య మ్మహిపాలు నిం దరిమురి నొంటి
వెంటఁ దోడ్కొనిరమ్ము వేంకటగిరికి
నంటుమీఱఁగ రమానాథుని యునికి
వివరించితేని యవ్విభునకు నీకు
వివిధవాంఛితములు వేగ సిద్ధించు
నని పల్కినంతనే నంతటఁ జూచి
కనుఁగొన మనుజుఁ డొక్కరుఁడు లేకునికి
దేవుండె యంచుఁ బందిని జూడ నదియు
వేవేగ నొకపుట్ట వెసఁ బ్రవేశించెఁ 930

గావున నది దెల్పఁగా వచ్చి తిపుడు
భూవరోత్తమ లెమ్ము పోదము రమ్ము
దేవరచిత్తంబు దెల్పితి ననుడు
భావించి యా చెంచుఁ బరగఁ బూజించి


యెంతయు మది భక్తి యినుమడించంగ
సంతోషమున మంత్రి జనుల కిట్లనును
అందరు వింటిరే యా దేవుపనుపు
చందము నే నందుఁ జనవలె నిపుడె
పిలిచి గోపాలురం బెలుచ నెందెందుఁ
గల గపిలల పాలు కావడల్ గట్టి 940

పదిలక్షఘటముల పాటి కొచ్చుగనె
పదిలమై తెప్పించి పట్టించుకొనుచు
నచ్చటి కరుదెంచు డని నియోగించి

చెంచువెంట రాజు శ్రీనివాసాద్రికిఁబోయి వరాహమును గాంచుట

విచ్చలవిడి చెంచువెంటనే నృపతి
శ్రీనివాసాద్రికిఁ జేరి యాకొఱ్ఱ
చేను వీక్షించి యా చెంగటఁ దనరు
స్వామిపుష్కరిణి పావనవారి సంజ
నేమంబులను దీర్చి నెమ్మి నుండంగ
యీరేయి వెన్నెల లటు పట్టపగలు
తీరునఁ గాయంగఁ దెల్లని మేను 950

మోరచక్కదనంబు ముద్దుల మెడయు
కోరలయందంబు గొరిసెలబిరుసు
తొడలమందము చాపు దొడ్డతనంబు
నొడికమందినవీపు నుల్లసిల్లంగ
నిలయెల్లనవలీల నెత్తినపంది
బలువిడి నా కొఱ్ఱపంటలోఁ జొచ్చి
మహి నాడు చంద్రబింబంబు చందమున


రహిమించఁ దిరుగు నై రావతం బనఁగఁ
గనుపట్టి ఘురఘుర ఘాత రొప్పుచును
దనరంగ నెన్ను లెంతయు మెసవుచును 960
మొగి నిల గోరాడి ముస్త లెత్తుచును
జగతి నూరులు బర్వ చవురుగొట్టుచును
నీటుమీరగ చెవుల్ నిక్కరింపుచును
నాటల గతి విందునందుఁ జరింపఁ
గాంచి భావించి యక్కజముగా నెంచి
పొంచి వి ల్వంచి తూపులను బూనింప
నతని పూనికెఁ జూచి యా చెంచు డాసి
క్షితిపాల యిది చూడ సీమతరంబు
మెకముగా దిట్టి భూమిని యుద్ధరించి
సకలలోకులఁ బ్రోవఁ జాలినయట్టి 970
యాదిమహావరాహం బని తెలియు
మాదరంబున మ్రొక్కి, యర్చించు మితని
యనవుఁ డాతఁడు నట్ల యవ్వరాహునకు
ననుపమభక్తి సాష్టాంగం బెఱంగి

వరాహము పుట్టఁ జొచ్చుట

పొగడుచుండంగ నప్పుడె యది చెంత
తగు పుట్టఁజొచ్చి నంతనె విస్మయమున
చేరి వల్మీకంబు చెంగట నిలిచి
కూరిమి హరినిఁ గన్గొని పూజసలుపు
కోరిక మీఱఁ గ్రక్కున నంటి పుట్ట
పారల శోధించుపాటి నచ్చటికి 980


క్షీరకుంభంబులం జేకొనివేగ
నారయుచును గొల్ల లా మంత్రివరులు
వచ్చుటయును ధరావరుఁడు సంతోష
మెచ్చంగ వల్మీక మెంతయుఁ గరగ
క్షీరాభిషేకంబు సేయింపుచుండ
మేరుశృంగముఁబోల మెరయుచు రత్న
భూరివిమానంబు పొడచూపుటయును

శౌరి వరాహరూపమున సాక్షాత్కరించి నివాసమంటపముల నిర్మింపుమనుట

శౌరి యచ్చటఁ గృప సాక్షాద్భవించి
యాదిమహావరాహాకృతి యగుచుఁ
బాదంబు భూమిలో బాతుగాఁ గాన 990
రాకుండ జానుమాత్రంబు పైఁ దెలియ
శ్రీకరార్చాకృతి చెలువొంది చెంత
శ్రీమహిరమణులు చెలగంగ నిలిచి
ప్రేమ న న్నరపాలు బేర్కొని పల్కు,
విను భూప! నే నిందు విహరింపుచుందు
జనుల రక్షింపఁగా సత్కృప నెంచి
ఘనవిమానం బిది కలియుగంబునను
గనుపించ దెవరికిన్ గావున నీవు
మా కీయెడ విమానమంటపంబులును
ప్రాకారము లొనర్చి భవ్యప్రతిష్ఠ 1000
యొనరించి వైఖానసోక్తక్రమమున
ననుదినంబు భజించి యమితభాగ్యంబు
లందుము నీతోడ నర్చావతార
మొందియు భాషింపుచుందు నెల్లపుడు


స్వామి మహాసరోవర దక్షిణమున
శ్రీమించ నేనె యా శ్రీనివాసాఖ్య
నుందు నిర్వురి నిట్లు నుద్యద్విమాన
మందిరప్రాకారమండపప్రకర
నిర్మాణపూర్వకనిరతకైంకర్య
ధర్మశీలతఁ గొల్చి దనరుదువేని 1010

భోగమోక్షంబులు పుణ్యకీర్తులును
బాగుగా నీవంశభవులకు నిత్తు
లోకపాలకముఖ్యులును జెందరాని
వైకుంఠపురము కైవశమగు నీకు
నని యుపదేశించి యమ్ముకుందుండు
తన మాయ గప్పి యంతర్ధాన మొందు
అంత నా తొండమా నను భూవరుండు
సంతుష్టుఁడై యట్టి శైలంబు నందె
నిలిచి శిల్పిగణంబు నెమ్మి రప్పించి

తొండమానుడు శ్రీనివాసులకు, వరాహునకు విమానాదులను నిర్మించుట

వలువలు భూషణావళులు నొసంగి 1020

శ్రీనివాసులకును శ్రీవరాహునకు
మానితంబైన విమానమందిరము
ప్రాకారములు మంటపము నిర్మించి
శ్రీకరాభరణముల్ సేయించి మిగుల
వరుసమీరగ శ్రీనివాసప్రతిష్ఠ
కరమొప్ప నందు వైఖానసమునుల
రావించి భక్తి మీరగ శాస్త్రవిధులఁ


గావించి సమయత్రికంబును పూజ
సలుపుచుఁ గొన్ని వత్సరములు రాజ్య
కలనంబు దలఁచక కామభోగములు 1030

వదలి యప్పుడు శ్రీనివాససేవలనె
ముదమందుచుండ నమ్మురవైరి మెచ్చి
విక్రమంబునఁ బరవీరుల నడచ
చక్రంబు నతని భూచక్రరక్షకును
బనిచి యానృపుఁజూచి పరమవత్సలత
ననవద్యసూక్తి ని ట్లని యానతిచ్చు
భూవరోత్తమ నాదు పూజసల్పుచును
నీ విచ్చటనె యుండి నిజరాజ్యలక్ష్మి
భోగంబులున్ మాని భూరివీరక్తి
యోగిచందంబున నుండ నేమిటికి 1040

బాగుగా నను గొల్చు పావనాత్ములకు
భోగమోక్షము లిచ్చు పూన్కి నా బిరుదు
గాఁగ విశ్రుత మౌను గావున నీవు
రాజవై యోగివై రహి భోగి వగుచు
రాజయోగివికాఁగ రంజిల్లు మెపుడు

స్వామి తొండమాను పూజలకై బలద్వారమును జూపుట

పురికేగి కాంతానుభూతిఁ జెందుచును
నిరతంబు మత్సేవ నెరపుము నీకుఁ
గడిమి రా నొక త్రోవ గలదంచు నందు
వెడదయౌ నొక బిలవివరంబుఁ జూపి
యనుదినం బీవు మధ్యాహ్నవేళలను 1050


చనుదెంచి మత్పదాబ్జంబులు విరుల
కనకపద్మసహస్రకమున నర్చించి
చనుచుండు మనఁగ నా జనపాలమౌళి
కరములు మోడ్చి యో కమలాసహాయ!
వరద! భక్తజనైకవత్సల! నీదు
చరణాంబుజార్చన సతతంబు సల్పు
పరమభాగ్యము గల్గఁ బ్రాకృతసుఖము
గోరునే యమృతంబు గ్రోలఁగల్గియును
నీరు ద్రావగ నెంచునే యెవ్వఁడైన
నై న దేవర విట్టు లానతిచ్చినను 1060
పూని యట్లన సేయఁబోలు నిక్కంబు
నా విన్నపంబు కన్యామాసమునను
భావితోత్సవము నే పని బూని సల్ప
నభిలషించెద నట్ల నంగీకరించు
మభిమతభవదాజ్ఞ నంత యయ్యెడిని
భక్తప్రతిజ్ఞానుపాలనుండ వని
యుక్త మౌగాదన కొగిఁ దెల్పుకొంటి
నని విన్నవించిన నంబుజూక్షుండు
అనవధికరుణ ని ట్లనుమతించుటయు
జనపతి వైఖానసముని రావించి 1070
వినతుఁడై తనకోర్కె వివరించి జగతి
గల విప్రులను రాజగణముల వైశ్య
కులముల శూద్రులన్ గోటి సంఖ్యలను
సకలదేశనివాస జనుల నందరిని
ప్రకటరయంబునన్ బనిబూని పిలువ


దూతలఁ బుత్తెంచి దుర్గమార్గముల
నాతతనగరప్రపాళి నిర్మించి
గోపురంబుల స్వర్ణకుంభంబు లెత్తి
యేపు రంజిల కేతు లెనయఁ బూనించి
ప్రాకారములనెల్ల పట్టు సరాతు 1080

లాకారవై ఖరు లమరఁ గట్టించి
మెరుగుబంగరురంగు మెఱయంగ వరుస
బురుసాకురుంజులు పొసఁగ వేయించి
మండపంబులనెల్ల మణిదర్పణములు
మెండుగాఁ దగటీల మేల్కట్లఁబూన్చి
స్వామిపుష్కరిణికి సరిగ నల్గడల
శ్రీమించు పందిళ్ళు చెలఁగఁ గావించి
చప్పరంబులును పచ్చని తోరణములు
గొప్పతామేరువల్ కూటపాళికెలు

స్వామి తిరునాళ్ళ వర్ణన

వివిధమందిరసౌధవీధికల్ మిగుల 1090

సవరించి తిరునాళ్ల సామగ్రు లెల్ల
నపరిమితంబులై హవణించి నించి
విపులమంత్రస్థితి వినతాతనూజు
నతులధ్వజంబున నావహింపించె
వితతాంకురార్పణ విధిపూర్వకముగ
నాయతకనకధ్వజారోహణంబు
సేయించి బ్రహ్మాద్య శేషదేవతలఁ
బిలిపించి దిగ్బలుల్ పెంపొంద సల్పి


యలదేవతలును దేశాంతరజనులు
కలిసి యందరు వచ్చి కడువడి నడరఁ 1100

జెలువొప్ప నర్చించి శ్రీనివాసులను
శేషాధిరూఢుగాఁ జేసి తిర్వీధి
భూషణద్యుతుల నుప్పొంగ నేగింప
హరి యప్పుడు తన శేషాసనత్వమును
[4]వరభక్తులకు దెల్పు వైఖరి మెరసి
యా మరుసటినాడు హంసనిష్ఠుడయి
తామరచూలికిఁ దత్వబోధనము
సలుపుట రూపించి సారె మర్నాడు
కలితసింహస్థితి గనుపట్టి మున్ను
బలువిడి యుక్కు కంబంబున వెడలి 1110

ఖలు హిరణ్యునిఁద్రుంచు కక్కసితనము
రహి గనుపించి మర్నాడు లోకింప
మహిసుతయును దాను మహితపుష్పకము
పయినెక్కివచ్చు టిబ్భంగి యన్ పగిది
రయమునవిరిచప్పరముమీఁద నలరి
గరుడునిపై నెక్కి గజరాజుఁ బోరు
ఖరనక్రముం ద్రుంచు గతి నిరూపించి
మరునాడు నా హనుమంతుపై నెక్కి
కరకురావణుఁ గూల్చు కడక న్నటించి 1120

యంత శత్రుంజయ మను నేన్గు నెక్కి
యెంతయు శ్రీరాముఁ డే నై యయోధ్య


వెలసితి ని ట్లంచు వివరించి మరియు
నల సప్తమదినంబునందు నందముగ
జలజాప్తమండలసంరూఢుఁడగుచు
.......... .......... ......... ......... .........
నంతరాదిత్య విద్యాధ్యేయుఁడగుట
యంతయుఁ బ్రకటించి యద్భుతలీల
యష్టమదినమునం దరదంబు నెక్కి
దృష్టవిజయసారథిత్వంబుఁ దెలిపి 1130
యల మావు తురగవాహనముపై నెక్కి
కలితుదన్ మ్లేచ్ఛనిగ్రహము సేయంగ
భువి సారినై యిట్ల పొసఁగుదు ననుచు
వివరించు గతి తిరువీథుల నేగి
నవమదినమునందునన్ ముకుందుండు
శ్రీమదాదివరాహు చెంగటం జేరి
స్వామిపుష్కరిణి పావనతీర్థవారి
నవబృథస్నాతుఁడై యాశ్రితదివిష
దవనదీక్షాపూర్తి నటు జూపుటయును 1140
అంత వై ఖానసు లా యుత్సవమున
నంతరాయములఁ బ్రాయశ్చిత్తముగను
శ్రీనివాసులకు విశేషార్చనములు
జానూరుకటినాభిసద్వత్సబాహు
గళముఖమౌళ్యంత కలితక్రమమునఁ
దలఁపఁ బద్మాధికదశవిధార్చనలు
గావించి నల్ దెసక్రమమున నిల్చి
భావించి సూత్రోక్తపరిపాటి సల్పు


పుష్పయాగంబెంతైఁ బొలుపొంద నపుడె
పుష్పవర్షము నభోభూజముల్ గురియ 1150

ధ్వజము డిగ్గిన బ్రహ్మవాసవాదులను
నిజవాసముల కన్చి నీరజేక్షణుఁడు
నమ్మహోత్సవమున నప్సరోమణులు
సమ్మతి నాట్యంబు సల్పుదు రపుడు
కిన్నరుల్ పాడ సంగీతముల్ సురలు
సన్నుతింతురు శేషశైలనాయకుని
సకలదేశపుజనుల్ జంబూనదాంబ
రకరితురంగాది రత్నముల్ కాన్క
గావించి పుత్రాది ఘనవాంఛితములు
దేవుని కృపఁ జెంది తీరుగ నేగుచును 1160

తిలకించి నట్టి యా తిరుణాళ్లసొగసు
తలఁచి తలంచి యెంతయు విస్మయమున
ననుదినంబును స్వామి కా చక్రవర్తి
దనరఁ గావించురత్నపుభూషణములు
నల భక్ష్యభోజ్యాదికాన్న రమ్యతలు
నలఘువై భవములు నయ్యలంక్రియలు
నాతపత్రధ్వజాద్యాభిరూప్యంబు
నాతతకరదీపికావలిచ్ఛటలు
కమనీయతౌర్యత్రికంబులరక్తి
యమరిన బాణవిద్యల విచిత్రతయు 1170

హరి తిరువీథుల నరిగెడి సొబగు
నరుదుగా వేర్వేర నభినుతింపుచును


శ్రీనివాసుల నెద జింతించుకొనుచు

కృష్ణశర్మయను విప్రుని కథ

నానందభరితులై యరుగు నయ్యెడను
భూసురుఁ డొక్కడు పొలతియుఁ దాను
వాసి మీరగ చక్రవర్తి చెంగటికిఁ
జేరి మంత్రోక్తి నాశీర్వదించుటయు
నా రాజు ప్రణతుఁడై యతనిఁ బూజించి
భూసురోత్తమ నీదు పుర మెద్ది యిచట
భాసురాకృతివి యే పనికి వచ్చితివి 1180

యేమి నీపే రిట్టి యెలనాఁగ యెవతె
కామితంబులు నీకుఁ గలిగింతు నిపుడె
అనవుఁడు భూపాలు నతఁడు వీక్షించి
నిను చక్రవర్తి నా వృత్తాంతమెల్ల
ధరణి దక్షిణవార్ధి తటమున చంద్ర
పుర మను నగరంబు పొగడందు నందు
గలఁ డొక్క విప్రుఁ డాగమనిగమాంత
కలనశీలుండు విఖ్యాతయశుండు
కూర్మభట్టారకాఖ్యుడు నిరతంబు
ధార్మికుం డాతని తనయుండు కృష్ణ 1190

శర్మ యందురు నన్ను జనపాల యిది సు
ధర్మిణి యను నాదు తరుణి యందుండి
ధారుణి మోక్షప్రదం బై నయట్టి
వారణాశికిఁ బోవ వచ్చుచోనిదియు
నావెంట జనుదెంచె నవగర్భయగుచు
త్రోవను నీళ్ళాడ తొలుచూలు కాన్పు


తనయుండు జనియించి తగ మూడునెలలు
ధనము వెచ్చంబయ్యె తడయుట వలనఁ
గావున నా యాత్ర కడువిళంబించె
పూవుబోణినిఁ గొని పోరాదు గాన 1200

సకలధర్మార్థరక్షణసేయుకర్త
వకలంకశీలుండ వగు నిన్నుఁ జేర
వచ్చితి నే మళ్ళి వచ్చునందాక
ఇచ్చట నీ బాల నీవు రక్షింప
వలయును రక్షణవ్రతము నీ దగుట
ఇల నీకె యుక్తమౌ నిదె నేను పోయి
వచ్చెద ననిన నవ్వసుధామరేంద్రు
మచ్చిక దయచేసి మహిత ధనంబు
లిచ్చి పంపించి యయ్యింతినిఁ బ్రేమ
హెచ్చుగఁ దనవీటి కెలమిఁ దోడ్కొనుచు 1210

హరియాజ్ఞ చేకొని యరిగి యందొక్క
వరమందిర మొసంగి వరుసగా నారు
నెలలకు గ్రాసంబు నిలిపి యయ్యింట
కలికి బయలు వెళ్లఁగా వద్దటంచు
నేమించి దృఢభక్తి నిష్ఠుఁడై దినము
స్వామికైంకర్యైకసక్తతనుండు
నంతటనావిప్రుఁడరిగియక్కాశి
సంతసంబునఁజేరి జన్వారిఁజూచి
మధురాప్రయాగాది మహితస్థలముల
మధుసూదను భజించి మరలి యాగయను 1220

ఈ పుట వ్రాయబడియున్నది.ఈ పుట వ్రాయబడియున్నది.


కరణీయములు దీర్చి కడువడి వెడలి
పురుషోత్తములఁ గాంచి పొసఁగ సేవించి
యాదికూర్మముఁజేరి యట ధర్మపురిని
సాదరంబుగ నృసింహాకృతి శౌరి
వందించి కృష్ణాదివాహినుల్ గడచి
పొందుగా వేంకటభూధరంబునకు
వచ్చి యచ్చటఁ జక్రవర్తిని గాంచి
విచ్చలవిడి తన విమలయాత్రయును
కడు నందు తనయున్కి క్రమమును దెల్పి
తడవయ్యెఁ బోవలె తరుణి నంపు మన 1230

నరపాలుఁడు గలంగి ననబోఁణి తెరగు
మరచి యిన్నాళ్లు ప్రమత్తుఁడై యుండు
కతనఁజింతించి యొక్క యమాత్యుఁ జూచి
ద్విజకాంత యేమయ్యె దెలిసి యేకతము
నిజము దెల్పు మటంచు నెమ్మిఁ బుత్తెంచ
నా మంత్రివరుఁడు బ్రాహ్మణవధూగృహము
వేమరు బరకించి వెలఁదియు సుతుఁడు
నింటిలో మృతిఁజెంది యొంటి యుండంగఁ
గంటికి వెగటుగాఁ గని యత్తెరంగుఁ
దెలిపిన విని మదిన్ దిగులొంది నృపతి 1240

పలుక నోరాడక బ్రాహ్మణుఁ జూచి
విను విప్ర నీనతి వేంకటేశ్వరులఁ
గని భజించఁగనేగెఁ గావున నీవు
నొక్కనా డిచ్చోట నుండి నీమగువ
మక్కువఁ దోడ్కొని మరి యేగు మనుచు


నాతని నందుంచి యతిరయంబునను
భీతుఁడై యరిగి య బ్బిలమార్గమునను
శ్రీవేంకటేశ్వరుఁ జేరి దైన్యమున
సేవించి యశ్రువుల్ జెంద నిట్లనును
వారిజేక్షణ! శ్రీనివాస! నిర్వ్యాజ 1250

కారుణికాత్మ! సకలలోకనాథ!
నేను మత్తత నుండి నిష్ఠురాఘంబుఁ
బూనితి విప్రుని పొలఁతిని శిశువు
పొలియించు హత్యలు పొందితి మిగుల
బలువైన విశ్వాస పాతకంబునకుఁ
బాలైతి నే నట్లు బ్రాహ్మణుఁ జూచి
యేలాగు నీవుంచు నింతియు సుతుఁడు
పొలిసిరి నీవింక పొమ్మను వాఁడ
నిలుకడ ధర్మంబు నీరుగాఁ బుచ్చి
యీమేను బెట్టుక యెట్టుల నతని 1260

మోమునఁ బల్కుదు మూర్ఖత నేను
నా తప్పుఁ గాచి యో నగధారి యిట్టి
పాతకంబులు మాన్చి బ్రతికించు నన్ను
ఎలనాగ బ్రతికిన నే బ్రతుకుదును
చెలిమిన ద్విజనతి జీవితం బొసఁగు
కాదేని నన్ను నో కమలాక్ష [5]నీదు
పాదపద్మముఁ జేర్చు పాటి గావించు
మని విన్నవించిన నా శ్రీనివాసుఁ
డనుపమకరుణచే నవనీంద్రుఁ జూచి
చిరునగ వాననసీమఁ దళ్కొత్త 1270


హరుషంబు దనర నిట్లని యానతిచ్చె
భూనాథ నీ వేల పొగిలెద వింత
నేను గల్గియు నీకు నిష్ఠురవ్యధలు
రానిత్తునే తత్తరంబిక మాను
పూని యిచ్చోటికిఁ బూర్వభాగమున
శరశతద్వయదూర సమ్మితస్థలిని
సర మొక్క టున్నది శమననిర్హారి
యా తీర్థమున వారి యస్థిచయంబు
పూతంబుగా నింత ప్రోక్షించినంత
నిదురించి మేల్కాంచు నీటు వాటిల్ల 1280

సుదతియు బాలుఁడున్ శోభిల్లఁగలరు
వారి న వ్విప్రుని వశమున నొసఁగి
భూరివైభవములఁ బొగడొందు మవని
ననుచు విష్వక్సేను నటు చూచి నీవు
జనపాలునకు నట్టి సరము గన్పించు
మనుటయు నా నృపాలాగ్రణి హరికి
వినతులు గావించి వినుతించి యపుడె
తనరాణివాసంబు తరుణుల తోడఁ
దనర నద్దేహముల్ దగ పల్లకీల
నుంచుక తెమ్మని యొక మంత్రి వేగ 1290

బంచిన నతఁ డట్ల పనిఁబూని యరిగి
నిమిషమాత్రనె దెచ్చి [6]నేతకుఁ దెల్చ
ప్రమద ముప్పొంగ సంభ్రమము చెలంగ
నతఁడు వేంకటనాథు నాజ్ఞ చొప్పుననె


హితమతి నరిగి సైన్యేశువెంబడిగ
నా తీర్థజలముల నస్థిచయంబు
పూత మౌ నట్లుగాఁ బ్రోక్షించుటయును
ఆ విప్రరమణియు నా బాలకుఁడును
పావనులై లేచి బలు నిద్రచేసి
మేలుకాంచినయట్ల మేలు రంజిల్ల 1300

చాల నా జనముల సందడి చూచి
మది సిగ్గు భయము గ్రమ్మఁగ నిల్చినంత
త్రిదశులు బొగడంగ ధీరుఁడా నృపతి
వారిఁ దోడ్కొని శ్రీనివాసుసన్నిధికిఁ
జేరి యవ్విప్రునిఁ జెలిమి రావించి
యతనిచేతికి నట్టి యంబుజేక్షణను
సుతు నప్పగించి హెచ్చు విభూషణములు
కౌశేయకములును గాంచనరత్న
రాసుల నొసఁగిన రంజిల్లి విభుని
సన్నుతింపుచు కృష్ణశర్మ యా కొమ్మ 1310

యన్నియుఁ దెల్పఁగా నచ్చెరు వంది
పరమాత్మ వెంకటపతి యంచుఁ దెలిసి
పరమభక్తిజ్ఞానపటిమఁ బ్రార్ధింప
నా విప్రవరు వేంకటాచలవిభుఁడు
భావితకరుణ యుప్పొంగ నిట్టులను
విను కృష్ణశర్మ కావేరితీరమున
జనియించి వేందాతసారానుభవము
గలిగి వ్యాఖ్యాతవై గాఢవైరాగ్య


విలసితభక్తిప్రవీణత నన్ను
సతతంబు భజియింపఁ జాలుదు వపుడు 1320

మతి నీవు బ్రార్ధించు మాట్కి మోక్షంబు
నిచ్చెద నందాక నిట్టిజన్మమున
నిచ్చలు మత్కర్మనిరతుండ వగుచు
భోగముల్ దానముల్ పుణ్యవ్రతములు
యాగాదులన్ని మదర్పణబుద్ధి
సలుపుచుండు మటంచు శాసించి పనుప
నలరుచు నద్విజన్మాగ్రణి హరికి
బహుళప్రదక్షిణప్రణతు లొనర్చి
విహితార్చనలు సల్పి వీడ్కొని యరిగి
నిజనివాసంబున నీలశైలేశ 1330

భజనకైంకర్యతత్పరబుద్ధి నుండు
చక్రవర్తియు శేషశైలశేఖరుని
చక్రధరుని భక్తజనపారిజాతు
సేవించి వీడ్కొని సిద్ధార్థుఁ డగుచు
భావంబునన్ దృఢభక్తి యుప్పొంగఁ
దన పురి కరిగి యెంతయు సంతసమున
ననుదినం బచట మధ్యాహ్నవేళలను
చనిచని వేంకటేశ్వరుపాదయుగళిఁ
గనకాంబుజసహస్రకమున నర్చించి
తనతోడ శౌరి యాప్తతను భాషింప 1340

నెనలేనిసంపద నింపొంది మిగుల
సుర లాత్మభాగ్యంబు చూచి నుతింప
ధరరాజ్యపాలన తగ సల్పుచుండ


కుర్వపురి కుమ్మరి కథ

అ య్యవసరమునం దల కుర్వపురిని
యొయ్యన కుమ్మరి యొకఁడు భీముఁడన
నుదయించి దృఢభక్తి యుక్తుఁడై యపుడు
సదయుఁడౌ వేంకటాచలనాథు నెదనె
సంతతధ్యాననిష్ఠత భజింపుచును
వింతగా మృత్సూనవితతి నర్చించి
కయిసేసి నైవేద్యకము వేళ నిడుచు 1350

నియతిఁ దచ్ఛేషమే నిత్యంబు దాను
సుదతియు భుజయింపుచును నన్యచింత
మది నింతయును లేక మరుపు గై కొనక
తనవృత్తి నుండు నాతని భక్తి కలరి
వనజేక్షణుఁడు శ్రీనివాసుఁ డవ్విరులు
నిజముగా నానందనిలయాంతరమునఁ
ద్రిజగన్మనోహర దివ్యపుష్పములు
గాఁగఁజేకొన నవి కదిసి పాదముల
నాగి యాధరణీశుఁ డర్చించు విరులఁ
గప్పుచుఁ దామె పైగాఁ బ్రకాశించి 1360

మెప్పైన తావు లెమ్మెయిఁ గ్రుమ్మరించు
నొకనాఁ డల నృపాలుఁ డుల్లాసమునను
సకలలోకాధ్యక్షు జలజాయతాక్షు
శ్రీనివాసు వృషాద్రి శిఖరైకవాసు
పూనికె బంగారుపూల నర్చింపఁ
బోవుచోఁ దాఁబెట్టు పూవులపైని


దేవతాపుష్పముల్ దివ్యవాసనలు
జల్లుచుండఁగఁ జూచి సందేహ మొంది
ఉల్లంబునను గొంత యూహించు కొనుచు
నతివిస్మయంబున నా శ్రీనివాసు 1370

నుతియించి యో స్వామి నూతనలీల
యేమి చేసితి విట్టి వెవ్వరి వ్విరులు
స్వామి పాదముల నర్చనసేయువారు
నీమాయఁ దెలియంగనేర్తునే నేను
శ్రీమనోహర దయచే నానతీవె
నావు డా వేంకటనాథుఁ డాతనికి
భావితభక్తప్రభావంబు దెలుప
నరపాల! యది విను నాదు భక్తుండు
కురువను భీముఁడన్ కుమ్మరి యొకఁడు
సతతంబు మత్పదాసక్తచిత్తమున 1380

వితతమృణ్మయపుష్పవిసరంబుఁజేసి
యందె నన్ గురియించి యర్చించు వాటి
నంది మందారపుష్పావలి గాఁగఁ
గైకొందు నే నిందుఁ గడుభక్తి గలిగి
నేకడ నెవడై న నిడునట్టి పూజ
కొంచమే యైన నే కొండంతగాఁగ
నెంచుచుఁ జేకొందు నిదియె నాబిరుదు
కావున నీ వందుఁ గడువడి నరిగి
పావనశీలుగా భక్తునిఁ గాంచి
యతికృతార్ధతఁ జెందు మయ్యెడ నిన్ను 1390


నతఁడు వీక్షించి కృతార్థుఁ డౌ ననుచు
నానతిచ్చిన వేంకటాచలేశ్వరున
కా నరపాలుండు సాష్టాంగ మెఱఁగి
ఘనవిస్మయానందకలితుఁడై కురువ
యను పురంబునకు రయంబున నరుగ
నపుడు రథమతంగజాశ్వభటాది
విపులసైన్యంబులు వెంబడి నంటి
కడువడిఁ గదలంగ కళవళపడుచు
గడి దునెదార్ల ముఖాములు కలగి
గుసగుసలను గుంపుగూడి యోజించి 1400

వసుదేశుఁ డీ ధాటి వచ్చు తెరంగు
కాళింగవంగబంగాళనేపాళ
మాళవేంద్రుల నెల్ల మట్టుపెట్టగనొ
యీదిక్కున విదర్భ హేహయమగధ
చేదిఘూర్జరులను చెక్కి చెండఁగనొ
యాకడ లాటమహారాష్ట్రహూణు
లాకులింపగ రాజ్య మాక్రమింపగనొ
యావంక కర్ణాటయవనశకావ
నీవరసంఘమున్ నిగ్రహింపఁగనొ
కోటలులగ్గలన్ గోలుపుచ్చగనొ 1410

మేటిదుర్గములుహామిక గట్టుకొననొ
వేటలాడంగనో విరులతోటలనె,
యాటలాడంగనో యుద్ధతంబై న
నేటిధాటియటంచు నెరిమంతనములు
బాటించి దొలరకుఁ బత్రికల్ బంప


భేరినిస్సాణగంభీరభాంకృతులు
వీరవారణగణోద్వేల ఘీంకృతులు
తురగహేషలు రథోద్ధురచటత్కుృతులు
వరభటక్ష్వే ళాద్యవార్యహుంకృతులు
భూనభోంతర మెల్ల భోరునఁగ్రమ్మ 1420

జానపదప్రజల్ సకలపౌరులును
దొరలు మన్నెకుమాళ్ళు తులలేనికాన్క
లురుభక్తిఁ గొనుచు నం దొండొరుల్ నిండ
నల వారి విభుఁ డింత యాదరించకయె
బలువిడి కుమ్మరపాళెంబుఁ జేరి
యాకులాకులితులై యందరుఁ జూడ
నా కులాలగృహంబు నందు వచ్చుటయు
నమ్మహికాంతుని నచ్చటఁ జూచి
కుమ్మరి తనచేతి కుంభ మటుంచి
నమ్మదంబున లేచి స్వామిభక్తుఁడని 1430

నెమ్మిని వందించి నృపతిఁ బూజించి
అమలాజినం బొక టాసనం బొసఁగి
నిమిషంబు చెంగట నిల్చి కేల్మోడ్చి
దేవర విటవచ్చు తెర గేమి యిపుడు
భావింప నాయిల్లు పావనం బయ్యె
నేను ధన్యుఁడనైతి నిన్నుఁ జూచుటను
భూనాథ యెచటికిఁ బోవుచున్నావొ
యానతీవలయు యథార్థంబుగాఁగ
అనవుఁ డాతనిమాట లా చక్రవర్తి
విని యాదరంబును వినయంబు నరసి 1440


తన యంతరంగ మంతయు తేటగాఁగ
విను భీమ! నినుఁజూడ వే వచ్చినాఁడ
శ్రీనివాసుల నీవు చిత్తంబునందుఁ
బూని నిత్యము నెట్లు పూజసల్పుదువు
జలజేక్షణుండు ప్రసన్నుఁడై యేమి
పలుకు న వ్విధము తప్పక తెల్పు మనిన
నతఁ డవ్విభునిఁ జూచి యళుకుచు నిలిచి
క్షితిపాల యజ్ఞానజీవుండనైన
యే నెందు శ్రీవేంకటేశ్వరు లెందు
పూని నే నాదేవుఁ బూజించు టెందు 1450

తెగడంగ నెవ్వరు తెలిపిరో యనుఁడు
జగతీశుఁ డాతనిఁ జాల నుతించి
వేంకటాచలపతి వివరించె నీదు
కైంకర్యపూజాదిక క్రమ మెల్ల
నిక నేల దాచ న న్నిచటికిఁ బనిచె
నకళంకభక్తుండవగు నిన్నుఁ జూడ
ననుటయు నంతలో నంతరిక్షమున
నినసహస్రప్రభ లింపు దీపింప
నవరత్నమయవిమానంబు డంబుగను
భువనాద్భుతంబుగాఁ బొడచూపినంత 1460

నాచక్రవర్తి యత్యాశ్చర్య మొంది
చూచుచు వెరగందుచు నసందియమున
నాకులాలసబుద్ది నందుండు తరిని
ఆకులాలకులోజ్వలావతంసుండు
పరికించి వేంకటపతి ము న్నొసంగు


వరముఁ దలంచి భూవరున కిట్లనును
విను చక్రవర్తి శ్రీవేంకటేశ్వరులు
ననుఁ జూచి దాస! యేనాఁ డిట్టి పూజ
విని చక్రవర్తి నీ విడిదికి వచ్చి
యనుపమపూజ యెట్లని నిన్ను నడుగు 1470

నానాడు నా వీటి కరుగుదు వనుచు
నానతిచ్చె విమాన మదె వచ్చె చూడు
మని భార్యయును దాను నా శ్రీనివాసు
ననువుగా ధ్యానించి సాష్టాంగముగను
ధరణి జాగిలి వ్రాలి తనువుల ట్లుండ
నరుదైన దివ్యదేహంబు ధరించి
మహిపతి యెదుట విమానంబు నెక్కి
మహితాప్సరోమణుల్ మణిభూషణములు
హేమాంబరంబులు నెనయఁ గై చేసి
శ్రీమించ మేనెల్ల శ్రీగంధ మలఁది 1480

మందారకుసుమదామములు ఘటించి
పొందుగా నూడిగంబులు సేయుచుండ
కొందరు నాట్యముల్ కొమరొప్ప సల్పి
కొందరు పాట రంగుగ వినుపింప
కొందరు చామరల్ కుంచలు వీవ
కొందరు పావడల్ గొని చెంత నిలువ
వందిమాగధజనుల్ వర్ణించి బొగడ
బృందారకగణంబు పేర్మి గొల్పగను
హరిభక్తముఖ్యుడై యాత డందుండి
ధరణీశ్వరునుతించి తదనుజ్ఞఁ జెంది 1490


లోకపాలురకును లోకింపరాని
వైకుంఠపురికి బల్వైఖరి నరుగు
అంత నా మహికాంతుఁ డత్యంతచింత
సంతసంబును మహాశ్చర్యంబు నడర
మగుడి శ్రీవేంకటమహిధరంబునకు
తగ రయంబున వచ్చి దవ్వుననుండి
సన్నుతింపుచు దృఢాంజలి మౌళిఁ బూని
వెన్నునిఁ బొడగాంచి వినుతు లొనర్చి
తా నందు జనుటయుఁ దద్దర్శనంబు
వాని సద్గతియును వరుస సన్నియును 1500

తొండమానునకు స్వామి జీవన్ముక్తి సాయుజ్యము కటాక్షించుట.

విన్నపం బొనరించి వెస మానసమున
నెన్నఁ డీగతి మోక్ష మిచ్చునో తనకు
వెన్నుఁడు కృప నంచు వేడఁగా రామి
నెన్నుచు నిలుచు మహీపతి తలపుఁ
దెలిసి లేనగవుతో దేవాది దేవుఁ
డెలమి నాతనిఁ జూచి యిటు లానతిచ్చు
విను పుత్ర! యెంతటి విమలయోగులకు
ననఘభక్తులకు నే నర్మిలి ముక్తి
సాలోక్యసామీప్యసారూప్యసరణి
మేలిమి నొసఁగుదు మిగులఁ గూరిమిని 1510

నీకు నీవంశజనిర్మలాత్ములకుఁ
జేకొని వేంకటక్షితిధరంబుననె
పాయకవసియించు భక్తినిష్ఠలకు
సాయుజ్య మే యిత్తు శంకింపవలదు


నీవు యావజ్జీవనియతకైంకర్య
సేవలు మా కిట్లు సేయుచు మిగుల
భోగభాగ్యంబులు భుజియించి తుదను
యోగిదుర్లభమోక్ష మొందు మత్కృపను
పరమపదంబునన్ భక్తులు నన్నె
నిరతకైంకర్యేకనియతిఁ గొల్చుటనె 1520

ఆనందమొందుదు రందు నీ విందె
పూని మత్కైంకర్యములు సల్పికొనుచు
గరిమజీవన్ముక్తిఁ గనితి విం దందు
సరినీకు తుద హెచ్చు సాయుజ్యపదము
కావున నిచ్చలు కామినీమణులఁ
బూవిల్తుకేళి నింపుగ రమింపుచును
మఱువక వేళలన్ మము భజింపుచును
మెఱయంగ రాజ్యలక్ష్మి పహించి యుండు
అని నియోగించిన నా చక్రవర్తి
వినతుఁడై మాయావి వీడ్కోని తనదు 1530

పురమున సౌఖ్యానుభూతిఁ జెలంగఁ
బరమభక్తి దలిర్ప ప్రాజ్యరాజ్యంబు
పాలింపుచును మిత్రబంధుభృత్యాది
జాలంబు నరయుచు సౌలభ్యమునను
సామంతమహికాంతసంతానగర్వ
ధూమధ్వజస్తోమదుస్సహోద్దతుల
కరధృతకరవాల కాళికాధార
లరిమురి చల్లార్ప నతిశయించును


తనదు విశ్రాణనోదకపూరపూర్ణ
వనధులఁ గ్రోలుట వారిదపాళి 1540

సలిలముల్ కోర్వెట్టు చాట్పున జగతి
నెల మూడువానలు నిల్కడఁ గురియ
నిజభుజాశ్లేషజనితసస్యపులక
భజన నీరత్నగర్భ సుఖప్రసూతి
ఘనరత్న సంతతిఁ గనియెడి నాఁగ
గనులెల్ల మణిగణకలన నింపొంద
స్వకరార్పితాంభోజజాతంబుఁ బూని
సకలేశ్వరుఁడు శేషశైలనాథుండు
సదయతనంభోజ జాత జాతంబు
నుదయింపఁ జేయుట నుర్విపై నట్టి 1550

యజులు జగత్సృష్టి నలవడి రనఁగ
ప్రజలు ప్రజావృద్ధిఁ బరిఢవిల్లంగఁ
దన దనంతగుణాళి తత కలశాబ్ధి
జనితకీర్తి సుధారసంబు లానుటనొ
యనఁగ నిద్ధర జను లందరు సౌఖ్య
మొనర నారోగ్యంబు నొందుచునుండ
తనదుష్ట నిగ్రహోద్ధతిఁ జూచిచక్ర
ఘనపరాక్రమకళాక్రమము నెరింగి
కలి డాగిపోవుటఁ గడు ధర్మవృషభ
మిల నాల్గుపదముల నెలమి వర్తింప 1560

నిలఁ బ్రోచుచును వేంకటేశ్వరభజన
నలరుచు సాగ్రశతాబ్దంబులుండి


దుస్తరసంసారరతోయధిఁ గడచి
శస్తమౌపరమాత్మసాయుజ్య మొందుఁ
గావున నిట్టి వేంకటశైలమహిమ
వావిరి నా శ్రీనివాసువై భవము
అతని భక్తుల యమ్మహాప్రభావంబు
మతి నెంచగా నవాఙ్మనసగోచరము
విశ్వరూపముఁ బూను వెన్నుండుకవిత
శాశ్వతికోక్తుల సంగ్రహంబుగను 1570

బలుకుచుఁ గరపరంపరల లిఖింపఁ
దలచినన్ కలములై తరులెల్లఁ దగిన
సప్తసాగరములు సరిగాఁగ నయిన
వ్యాప్తాంబరము పత్రికాకారమైన
నా వేంకటాద్రి మాహాత్మ్య మంతయుసు
సావధానతఁ దెల్ప శక్యంబుగాదు
నాలుగువేదముల్ నానాగమములు
చాల నయ్యష్టాదశపురాణములును
కలితేతిహాసముల్ కావ్యజాతములు
వలనొప్ప నా శ్రీనివాసవిలాస 1580

మొకయింత వర్ణింప నోపవు జగతి
సకలంబు వివరింపఁజాలు వా రెవరు
నేను మీ రడుగంగ నేర్చినపాటి
పూనికఁ దెల్పి తద్భుతముగాఁ గొంత
ఈ పుణ్యచరితంబు నెవ్వరు వినిన
నేపునఁ దెల్పిన నిష్టసంపదలు


పుత్రపౌత్రారోగ్యభోగభాగ్యములు
ధాత్రీతలాధిపత్యము నిత్యకీర్తి
యక్షయైశ్వర్యంబు నమితపుణ్యంబు
మోక్షపదానందమును జెందఁగలరు 1590

అమృతసాగరమున నల్పంబు గ్రోలి
యమరులౌగతి ని మ్మహాకథయందు
పద మర్ధమే యైన పద్యమే యైన
ముదమున విని పాపముక్తు లౌదు రిల
మొదటినుండియుఁ దుదిముట్ట నేమమున
మది రంజిలఁగ విన్న మనుజవర్యులకుఁ
గోరిక లెల్లఁ జేకూరు టే మరుదు
శౌరి యాతనిపాల సదయుఁడై నిలుచు

తుదినొక్క రహస్యము.

ఇక నొక్కటి రహస్య మిది బుధుల్ వినుఁడు
సకలవేదాంతార్థసారరూపంబు 1600

శ్రీనివాసులు నట్టి శ్రీవేంకటాద్రి
యానందనిలయంబు నా స్వామి సరసి
జీవకొటులఁ బ్రోవఁ జెలగి యెల్లెపుడు
పావనస్థితి నుండు భావంబుఁ దెలిసి
తద్వైభవంబులు దలఁచి సంతతము
సద్వివేకంబు మించంగఁ గీర్తించి
ద్వీపాంతరంబులన్ దేశాంతరముల
నేపట్ల నుండైన నెట్టి వాఁ డైనఁ
దదభిముఖంబుగా ధర వ్రాలి మ్రొక్కి,
మదిలోనఁ గొల్చిన మాత్రంబునందు 1610


శ్రీనివాసులు వాని చెంగట నిలిచి
తానె యిష్టార్థముల్ దయమీఱ నొసఁగు
వేదశాస్త్రము వంటి విద్య వేరొండు
శ్రీదేవి కెనయైన చెలువ యొకర్తు
భూమికి సరియైన భూత మింకొండు
స్వామిపుష్కరిణికి సాటి తీర్థంబు
వేంకటాద్రికి నుద్ది విష్ణుస్థలంబు
వేంకటేశ్వరుఁబోలు వేరె దైవతము
సత్యంబుగాఁగ నెచ్చట లేదు లేదు
ప్రత్యక్షముగ నుమాపతి సాక్షి యిందు 1620

అని సూతముని నైమిశారణ్యసీమ
అసఘు లౌ మౌనుల కాశ్చర్య మొదవ
వరుసగా వారాహ వామన పద్మ
గరుడపురాణాది కథితమార్గమున
వివరించు నిట్టి శ్రీవేంకటాధీశ
భువనాద్భుతచరిత్రమును సంగ్రహించి
యెల్లవారలు విని యింపొందునట్ల
తెల్లమిగాఁ దేర్చి తెనుఁగున ద్విపద
లొరపొంద రసభావయుక్తి సంగతుల
వరలి యష్టాదశవర్ణనల్ మెరయ 1630

శ్రీనివాసవిలాససేవధి యనఁగఁ
బూని మహాకావ్యపూర్ణలక్షణము
గలుగ నే నొనరించు కబ్బంబు జగతి
లలితసందర్భకళారసజ్ఞులకు


పరమభక్తులకును పండితేంద్రులకు
సరసచిత్తులకు మాత్సర్యదూరులకు
వీనుల నమృతంబు వెల్లి జల్లుచును
మానితానందంబు మది నించుగాత.
అని విచిత్రార్థసమర్థనాకలిత
ఘనసర్గవిశ్రుతకవిముఖ్యు పేర 1640

విపులానుభావభావితసంవిధాన
కపటనాటకజగత్కారణుపేర
భాసురాంగశ్రుతి భారతీభవ్య
లాసికాగీతవిలాసునిపేర
తారకాంతకపితృ ద్వంద్వాన్వధీత
తారకమంత్రాభిధానునిపేర
ప్రత్యా హృతో త్తరాపత్యచైతన్య
సత్యనిత్యబ్రహ్మ చర్యునిపేర
క్షీరపారావార శీకరాసార
పూరితనిజముఖాంభోజునిపేర 1650

పావనభక్తాప్తబంధునిపేర
గోవిందరాజన్ ముకుందునిపేర
శ్రేష్ఠలూర్యన్వయ శ్రేష్ఠశీలుండు
ప్రేష్ఠమహాయశశ్రీధురీణుండు
గోత్రభారద్వాజగోత్రవర్ధనుఁడు
సూత్రఁదాపస్తంబ సూత్రానువర్తి
అష్టభాషాకవిత్వార్జితప్రోద్య
దష్టావధానవిఖ్యాతబైరుదుఁడు


శ్రీకృష్ణయార్య లక్ష్మీగర్భవార్ధి
రాకాసుధానిధి రాజపూజితుఁడు 1660

వివిధవిద్యాశాలి వేంకటార్యుండు
సవరించు శ్రీనివాసవిలాసమునను
హరువొందు నిదియె షష్ఠాశ్వాసమగుచు
ధరఁబొల్చు నాచంద్రతారకంబుగను


శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

శ్రీనివాసవిలాససేవధి

సంపూర్ణము.


__________
  1. తనువిస్ఖలనంగా” వ్రా. ప్ర పాఠము.
  2. "నిరులగొంతుల నంటి ” వ్రా. ప్ర. పాఠము.
  3. "దెలియుదానుని" వ్రా. ప్ర. పాఠము.
  4. "వరదభక్తులకు " వ్రా. ప్ర. పాఠము.
  5. "కమలాక్షనిందు" వ్రా. ప్ర. పాఠము.
  6. " శ్రీపతికిదెల్ప " అని వ్రా. ప్ర. పాఠము.