శ్రీకృష్ణుడు చూపిన మార్గము/తొలిపలుకు

వికీసోర్స్ నుండి

తొలిపలుకు


ఒకభాషనుండి మరియొక భాషలోనికి అనువదించుట కష్టమైనపని. తమిళమునకును తెనుగునకును దగ్గరయేయైనను నీరెంటికిని పలుకుబడిలో ఎన్నో భేదములున్నవి. తెనుగునకు సంస్కృతపదముల సాహయ్య మెక్కువగా కావలెను. తమిళమునకంతగా నక్కరలేదు. తమిళములో నొక యభిప్రా యమును చాలమాటలతో కొంచెము దీర్ఘముగా చెప్పవ లెను. తమిళపదములకు సరియైన అచ్చ తెనుగుపదములు సాధారణముగా నుండుచునేయున్నను, వానిలో కొన్ని వ్యవహారభ్రష్టములై సర్వజనసుబోధకములు కాకపోవచ్చును. అప్పుడనువాదకుడు తెనుగు వ్యవహారమునగల వేరుపదము లనే యుపయోగింపవలసియుండును.


ఒక గ్రంథమును స్వతంత్రముగ రచించుట సులభము. మరియొకభాషనుండి యనువదింపవలసివచ్చినప్పు డనువాదకుడు రెండువిధములయిన భయములకు లోనగును. మొదటిది మూల గ్రంథకర్త యభిప్రాయమునకు భంగము కలుగు నేమోయను భయము. రెండవది మూలమునున్న దున్నట్లుగా, ముక్కకుముక్కగా భాషాంతరీకరించినయెడల అనువాదితగ్రంథమంత సుబోధకముకాదేమో యనుభయము. కాంగ్రెసుప్రభుత్వములో ప్రధానమంత్రివర్యుడైన శ్రీమాన్ రాజగోపాలాచార్యులవారు తమిళభాషా పండితులు. తాము వ్రాసిన విషయమును, ఆవిషయమును దెలుపుటకు వలయుభాషను సంపూర్ణముగ గ్రహించి వ్రాయగల యసాధారణశక్తి కలవారు. ఇదిగాక, తాము వ్రాయబోవు విషయమునుగురించి సంపూర్ణానుభవములేక, ఆయభిప్రాయమును తమజీవితము ననుసంధించి యాచరింపక గ్రంథరచన చేయరు. గీతాతత్త్వమును బాగుగా నవగాహన చేసికొని యాచరించు కర్మవీరులు. గీతాసారము సామాన్యజనులకు కూడ బోధపడున ట్లీగ్రంథమును బహు బుద్ధికుశలతతో రచించిరి.


ఇట్టి మహనీయులు వ్రాసిన గ్రంథము తెనుగులో లేకుండుట గొప్ప లోపమని గ్రహించి శ్రీ న్యాపతి సుబ్బారావుపంతులుగారు, డాక్టర్ చిలుకూరి నారాయణరావు ఎమ్. ఏ., పి. హెచ్. డి., గారిని "కణ్ణన్ కాట్టియవట్టి" "కృష్ణుడు చూపిన మార్గము" అను నీగ్రంథమును తెనిగింపవలసినదని కోరగా వారు సంతోషముతో నంగీకరించిరి. వారు శ్రద్ధతోను, భక్తితోను, సర్వజనసుభొధము కావలెన నుద్దేశముతోను అనువాదించినారు. పండిత చిలకమర్తి లక్ష్మీనృసింహ కవిగారు దీనిని సరిచూచినారు. వీరుభయులకును, తమిళ గ్రంథమును తెలుగున ప్రచురించుటకు అనుమతి ఒసంగిన శ్రీమాన్ రాజగోపాలాచారిగారికిని మా కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించుచున్నాము.

ఇందలి అర్ధానుస్వార శకటరేఫలు లాభములేదని యెంచి ప్రకాశకులు వానిని మానివేసినారు. మరియు దృతముమీద గ, జ, డ, ద, బ, లు ఉపయోగించకుండ అసలుపదముల స్వరూపము సాధ్యమైనంతవరకు ఉంచడమైనది.

1 - 5 - 1940,

రాజమహేంద్రవరము.

హిందూసమాజము